
అభిప్రాయం
ప్రపంచంలో కెల్లా గొప్ప ప్రజాస్వామ్యమని చెప్పుకునే అమెరికాకు పశుబలం తప్ప ఏం మిగిలింది? ప్రజాస్వామ్యం అనే మాటకు అంతర్జాతీయంగా వచ్చే మొదటి అర్థం, అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను, అంతర్జాతీయ వ్యవస్థలను గౌరవించటం. ఇతర దేశాలతో గల సంబంధాలలో ప్రజాస్వామికంగా వ్యవహరించటం. ఆ విధంగా ప్రపంచానికి ప్రజాస్వామిక ఆదర్శంగా నిలవాలి. కానీ అమెరికా వీటన్నిటినీ బాహాటంగా ఉల్లంఘిస్తూ వస్తున్నది. ఈ ధోరణి క్రమంగా పెరుగుతున్నది. అందుకు కారణం తన ఏకధృవ ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతుండటం.
ఈ చర్చను ప్రస్తుతానికి ఇరాన్ అంశంతోనే మొదలుపెట్టి చూద్దాము. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరగటమే కాదు, అసలు యుద్ధమే ముగిసిపోయిందన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ఘనంగా ప్రకటించిన తర్వాత, జూన్ 28న అన్న మాటలను గమనించండి – ‘యుద్ధంలో నాశనమైన ఇరాన్ అధినేత ఖొమైనీ, యుద్ధంలో తామే గెలిచామని మూర్ఖంగా ప్రకటిస్తున్నారు. మూడు అణు కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
యుద్ధ సమయంలో దాక్కున్న ఆయన అమెరికా, ఇజ్రాయెల్ సేనల చేతిలో నీచమైన చావు చావకుండా నేనే కాపాడాను. టెహ్రాన్ దిశగా భారీ సంఖ్యలో వెళుతుండిన ఇజ్రాయిల్ విమానాలను తిప్పించాను. ఆ దాడి జరిగితే అక్కడ వేలాదిమంది చనిపోయేవారు. అయినప్పటికీ ఇరాన్ అధినేత నాకు కృతజ్ఞతలు చెప్పలేదు. పైగా తామే గెలిచామంటున్నారు. ఇరాన్ అణు పరిశోధనలు తిరిగి ప్రారంభిస్తే మళ్ళీ బాంబులు వేయిస్తా. ఇరాన్‌పై ఆంక్షలను సడలించాలనుకున్నాను గాని ఇక ఆ పని చేయను.’
కేవలం ఈ మాటలను విశ్లేషిస్తే చాలు అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను, అంతర్జాతీయ వ్యవస్థలను ఏ విధంగా గౌరవిస్తున్నదో తెలిసేందుకు. ప్రజాస్వామికంగా పెద్దమనిషి తరహాలో వ్యవహరించేందుకు ట్రంప్‌కు ఏమీ లేదు.
బాంబులు తప్ప, పశుబలం తప్ప. విషయాన్ని సూటిగా మరొకమారు చెప్పుకోవాలంటే కళ్లెదుట కనిపిస్తున్నవి కొన్ని ఉన్నాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)లో స్వచ్ఛందంగా భాగస్వామి అయిన ఇరాన్‌కు ఆ సంస్థ నిబంధనల ప్రకారం శాంతియుత ప్రయోజనాల కోసం అణు ఇంధన శుద్ధికి పూర్తి హక్కు ఉంది.
వారు ఆ ప్రకారం కట్టుబడటమే కాక, మారణాయుధాల తయారీ ఇస్లాం బోధనలకు విరుద్ధం కనుక ఆ పని చేయబోమంటూ ఫత్వా సైతం జారీ చేసుకున్నారు. వారు నిబంధనలను ఉల్లంఘించలేదని అణుశక్తి పర్యవేక్షణ సంస్థ (ఐఏఈఏ) స్వయంగా చెప్తున్నది. కాదు, కొద్ది వారాలలోనే బాంబులు తయారు చేయనున్నారు అంటూ ఇజ్రాయిల్ అనే శత్రుదేశం పాతికేళ్లుగా ఆరోపిస్తూ వస్తున్నది. అమెరికా దానికి వత్తాసు పలుకుతోంది.
ఇజ్రాయిల్ కుప్పలుగా తయారు చేసుకున్న అణ్వస్త్రాలను గురించి అమెరికా సహా నాటో కూటమి దేశాలు ఎన్నడూ పొరపాటున అయినా పల్లెత్తు మాట అనడంలేదు. ఒక యూఎన్‌ఓ సభ్య దేశం మరొక యూఎన్‌ఓ సభ్య దేశంపై అసత్యపు ఆరోపణలతో, సైనిక దాడి జరుపుతున్నా వ్యతిరేకించకపోవడం ప్రజాస్వామ్యమా? చివరికి తానే రంగంలోకి దిగి బాంబుదాడులు జరపడం ఏమిటి? కొన్ని యూరోపియన్ ప్రజాస్వామిక రాజ్యాలు అందుకు సహకరించటమేమిటి? ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ కోసం ఇదంతా చేస్తున్నది అంటున్న వారు, ఇరాన్ వల్ల ఏర్పడిన ముప్పు ఏమిటో, ఇరాన్ అణ్వాయుధాల తయారీ స్థాయికి వెళ్లిందన్న ఆరోపణలకు ఆధారాలేమిటో, తామందరూ సభ్యులైన యూఎన్‌ఓ అనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడైనా చర్చించారా?
వారు ఆ పని చేయలేదు, చేయరు కూడా. అమెరికన్ సామ్రాజ్యవాదం ఎల్లప్పుడూ నమ్ముకున్నది అంతిమంగా బల ప్రయోగాన్నే. ప్రస్తుత సందర్భం ఒక ఉదాహరణ మాత్రమే. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇందుకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఏ ప్రజాస్వామిక వ్యవస్థలతోనూ నిమిత్తం లేకుండా, కేవలం అసత్య ఆరోపణలతో ఈ చర్యలకు పాల్పడే అధికారం వారికి ఎక్కడి నుంచి వచ్చిందసలు? కనిపిస్తున్నదే, పశుబలం నుంచి వచ్చింది.
ఆ బలానికి మూలాధారం సామ్రాజ్యవాద ప్రయోజనాలు. ఎటునుంచి, ఎటువంటి ఎదురు లేకుండా, ఏ అంతర్జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలతో నిమిత్తం లేకుండా, మంచైనా, చెడైనా ఏకఛత్రాధిపత్యంగా సాగాలనే దురహంకారం. ప్రస్తుత యుద్ధ సందర్భంలో మొదటి నుంచి చివరి వరకు, పైన పేర్కొన్న ట్రంప్ మాటలతో సహా కనిపించేది అదే.
యుద్ధంతో తక్షణ సంబంధం గల విషయాలు ఇవి కాగా, మౌలిక స్థాయి సంబంధాలు కలవాటిని చూద్దాం. మూలం ఎక్కడుంది? పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా ఇజ్రాయిల్, అమెరికాలు మొదటి నుంచి అడ్డుకుంటుండడంలో ఉంది.
అంతర్జాతీయ ప్రజాస్వామిక సంస్థలకు అమెరికా చేస్తున్న హాని గురించి పలు దృష్టాంతాలు ప్రస్తావనకు వస్తున్నాయి. పారిస్ పర్యావరణ పరిరక్షణ నిర్ణయాల నుంచి, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నుంచి ఉపసంహరించుకోవటాలు, అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్‌పై దాడి, పనామా కాలువను, గ్రీన్‌ల్యాండ్‌ను, కెనడాను ఆక్రమించుకోగలమని బెదిరింపులు, అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్)తో పాటు డాలర్ శక్తిని ఆధారం చేసుకుంటూ తమకు నచ్చని దేశాలపై ఆంక్షలు, వందల కోట్ల డాలర్లను తమ బ్యాంకులలో స్తంభింప చేయటం, తమ నియంత్రణలోకి తీసుకొని మరెవరికో ఇవ్వటం వంటివన్నీ ప్రజాస్వామ్యమా? మొదట చెప్పుకున్నట్లు వీటికి ఆధారం అంతర్జాతీయ ప్రజాస్వామిక సంస్థల నియమ నిబంధనలు కాదు. వారికి మిగిలిన ఆధారం పశుబలం మాత్రమే.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు