breaking news
Guest Column
-
‘అణు వివక్ష’ అంతమయ్యేనా?
భారత అణు కేంద్రాలు ఏపాటి సురక్షితమైనవి? చెర్నోబిల్ అణు కేంద్ర ప్రమాదం (1986) తర్వాత భారత్ అణుశక్తి సంస్థ అధిపతికి ఈ ప్రశ్న ఎదురైంది. ‘‘మన అణు కేంద్రాలు ఎంత సురక్షితమైనవంటే వాటిని ఒక క్షిపణి తాకినా, విమానం వాటిపై కూలినా అవి చెక్కుచెదరవు’’ అని ఆయన జవాబిచ్చారు. అణు విద్యుత్ కేంద్రాన్ని లేదా తత్సంబంధిత సదుపాయాలను నెలకొల్పేటప్పుడు యుద్ధంతో సహా ఎటువంటి విపత్తు సంభవించినా తట్టుకుని నిలబడేటట్లు అణు ఇంజనీర్లు ప్లాన్ చేస్తారు. ఏ అణు సదుపాయాన్ని ఏర్పాటు చేసేటప్పుడైనా దాని భద్రతకు ప్రధానంగా పూచీ వహేంచే అంశం ఏదైనా ఉందీ అంటే అది దానిని ఎక్కడ నెలకొల్పుతున్నారో ఆ భౌగోళిక ప్రాంతమే. భౌగోళిక సుస్థిరతతోపాటు జనావాసాలకు దూరంగా ఉండటం ముఖ్యం. సాధారణంగా అటువంటి సదుపాయాలు వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా అంతర్జాతీయ సరిహద్దులకు దూరంగా ఉంటాయి. అణుదాడులు బాధ్యతారాహిత్యంఇరాన్లోని ఫర్దో, నతాంజ్, ఇస్ఫహాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ ఇటీవల దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఫర్దో యురేనియం శుద్ధి సదుపాయాన్ని ఇరాన్ కేంద్ర ప్రాంతంలో పర్వతాల లోపల లోతున నిర్మించారు. యరేనియం శుద్ధి కేంద్రాలు, ఇంధన కడ్డీల తయారీ యూనిట్లు, విద్యుదుత్పాదన కేంద్రాలు, వ్యర్థాలను భద్రపరచే ప్రదేశాలు వంటి అణు సదుపాయాల భద్రత... అంతర్జాతీయ సమాజానికి ఎప్పుడూ ఆందోళనకర అంశంగానే ఉంటూ వస్తోంది. యాదృచ్ఛికంగానైనా లేదా ఉద్దేశపూర్వకంగానైనా ఎలాంటి ప్రమాదం సంభవించినా అది అణు ధార్మికత విడుదలకు కారణమై అటు మానవాళికి, ఇటు పర్యావరణానికి హానికరంగా పరిణమించవచ్చు. ఇటీవలి ఘర్షణలో ఆ మూడు చోట్ల వైమానిక దాడుల్లో అణు రియాక్టర్లను లక్ష్యంగా చేసుకోలేదని చెబుతున్నారు. ఫలితంగా, వాటి చుట్టూ ఉన్న ఇతర సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధంలో ఈమధ్య ఉక్రెయిన్‌లోని జపొరియిష వంటి అణు సదుపాయాలు దాడులకు లోనుకావచ్చని వాటి భద్రతపై ఆందోళన నెలకొంది. అలాగే, ఉత్తర కొరియా కూడా అణు బూచికి చిరునామాగా మారింది. పైగా, అది అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించడం లేదు. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) ఇలాంటి విషయాల్లో ప్రపంచ పెద్దమనిషిగా వ్యవహరించవలసి ఉంది. అణు విచ్ఛిత్తి పదార్థాల రవాణాతోపాటు, అణు ధార్మికతకు దారితీయగల ప్రమాదాలపై అది ఒక కన్ను వేసి ఉంచుతుంది (తాజాగా ఐఏఈఏకు సహకారాన్ని నిలిపివేయాలని ఇరాన్ నిర్ణయించింది). ఒక రియాక్టర్ పై దాడి జరిగి, అది ధ్వంసమైతే దాని నుంచి విడుదలయ్యే అణు ధార్మికత సుదూర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. చెర్నోబిల్, ఫుకుషిమా దుర్ఘటనల్లో అదే జరిగింది. రెండు దేశాల మధ్య ఘర్షణలు సాగుతున్నప్పుడు ఏ పక్షమైనా సరే రెండవ పక్షానికి చెందిన అణు రియాక్టర్‌పై దాడికి దిగినా, ధ్వంసం చేసినా అది సదరు దేశం పక్షాన పూర్తి బాధ్యతారాహిత్యం అవుతుంది. అసమానతే అంతస్సూత్రమా?రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో సైన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని భావించడం జరిగింది. ఐఏఈఏ 1957లో ఏర్పడడానికి ప్రేరణ ఇచ్చిన అంశాల్లో అది కూడా ఒకటి. ప్రభుత్వాలనన్నింటినీ ఒకచోట చేర్చడం, టెక్నాలజీ అంశాలపై వాటికి దారి చూపడం, అణు శక్తి శాంతియుత ప్రయోజనాలపై సమాచారాన్ని క్రోఢీకరించడం అనే భావనతో అది ఏర్పడింది. ఐఏఈఏ ఏర్పాటుకు దారితీసిన చర్చల్లో భారత్ కూడా పాల్గొంది. అందులో భారత్ వ్యవస్థాపక సభ్యురాలు. కొన్ని దశాబ్దాలుగా, ఆ సంస్థ గవర్నర్ల బోర్డులో సభ్యురాలిగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తోంది. అణు శక్తిని ద్వంద్వ ఉపయోగ టెక్నాలజీగా వినియోగిస్తున్నారు. దాంతో, ఆ కార్యకలాపాలు గోప్యంగా సాగుతూ, సమాచార వినిమయం క్లిష్టంగా మారింది. అణు పదార్థాలను సురక్షితంగా వ్యవహరించేటట్లు చూడటంతోపాటు, అణ్వాయుధాల తయారీకి వాటిని బదలాయించకుండా నివారించడం కూడా ఐఏఈఏ ప్రధాన కర్తవ్యం. కానీ, ఆది నుంచి కూడా ఈ నిఘా సంస్థ విధి నిర్వహణలో ఒక రకమైన అసమానత అంతర్లీనంగా ఉంటూ వస్తోంది. ఐఏఈఏ వైజ్ఞా్ఞనిక సలహా మండలికి మన హోమి జహంగీర్ భాభా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ మండలి, 1960లలో ప్రతిపాదించిన సురక్షితా ప్రమాణాల స్వరూప స్వభావాలపై కఠిన వైఖరిని అవలంబించింది. ఎటువంటి తనిఖీలకు అంగీకరించేది లేదని తెగేసి చెప్పిన కొన్ని దేశాలకు ఒక తరహా నిబంధనలు, ఐరోపా దేశాలకు మరో రకమైన నిబంధనలు విధించడాన్ని ప్రశ్నించింది. మిగిలిన దేశాలను మాత్రం కఠినమైన నిరోధాలు, తనిఖీలకు లోనుచేశారు. అణు శక్తి రంగంలో ఐరోపా దేశాలు ఎంతో ప్రగతిని సాధించినందువల్ల వాటి భద్రతను అవి చూసుకోగలవనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. అయితే, ఈ వ్యవస్థతో ఏకీభవించనివారు దిగ్భంధనాలను ఎదుర్కోవలసి వస్తోంది. అణు విస్ఫోటనాలను సైనికేతర ప్రయోజనాలకు వినియోగించినా వివాదం నెలకొంటోంది. భారీ స్థాయి ఇంజినీరింగ్, గనుల తవ్వకం, ఇతర తవ్వకాలు లేదా భూగర్భ జలాశయాలను నిర్మించడం వంటివి ఆ కోవలోకి వస్తాయి. ప్రాజెక్ట్ రూలిసన్ వంటి శాంతియుత విస్ఫోటనాలను అమెరికా నిర్వహించినప్పుడు, వాటిని వైజ్ఞానిక విజయాలుగా జేజేలు కొట్టారు. మన దేశం 1974లో శాంతియుత విస్ఫోటనాన్ని నిర్వహించినపుడు మనపై ఆంక్షలు విధించారు. ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించగల సామర్థ్యాన్ని సంతరించుకోగల స్థితిలో ఉందనే అభిప్రాయమే ఇరాన్ అణు సదుపాయాలపై ఇటీవల అమెరికా దాడులకు కారణం. అందరికీ ఒకే న్యాయంఅణు శక్తి దాని తొలినాటి శాస్త్రీయ సహకార పరిధిని ఏనాడో అతిక్రమించింది. భారీ పారిశ్రామిక కార్యకలాపాలతో అది ఇపుడు ముడిపడి ఉంది. అణు కార్యకలాపాలు అపారమైన ఆర్థిక పెట్టుబడులు, భౌగోళిక రాజకీయాలతో సన్నిహిత సంబంధం కలిగినవిగా రూపాంతరం చెందాయి. భారత్‌తో సహా, అనేక దేశాలలో అణు శక్తి రంగంలోకి ప్రైవేటు సంస్థలు అడుగిడబోతున్నాయనే మాటలు వినవస్తున్నాయి. ప్రైవేటు అణు విద్యుదుత్పాదన కేంద్రాలు ఐఏఈఏ పర్యవేక్షణలోకి పరోక్షంగా వస్తాయి. అవి దానికి విధేయత చూపేటట్లు చూడవలసిన బాధ్యత ఆ యా ప్రభుత్వాల పైనే ఉంటుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కింద తనకు లభించిన సంప్రదాయ సిద్ధమైన నిఘా పాత్రతోపాటు, అలాంటి సవాళ్లకు కూడా ఐఏఈఏ తనను తాను సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. దేశాలు అణు పదార్థాలను ఆయుధాల తయారీకి తరలించకుండా చూడటం ఆ ఒప్పందం ప్రకారం ఐఏఈఏకి అప్పగించిన ప్రాథమిక కర్తవ్యం. అంతర్జాతీయ సుస్థిరతకు, న్యూక్లియర్ టెర్రరిజం బెడదను తగ్గించడానికి పరిస్థితులను సరిచూసే, తనిఖీ వ్యవస్థ కీలకం. కానీ, దాని పనితీరు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. అణ్వస్త్రాల వ్యాప్తిని నిరోధించడంలో ఐఏఈఏ పాత్రను చాలా దేశాలు బలపరుస్తున్నాయి. కానీ, జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, అణు సాంకేతికతను వినియోగించుకోవడంలో అందరికీ సమాన సౌలభ్యం ఉండాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఈసీ విశ్వసనీయతకు గొడ్డలిపెట్టు
భారతీయ ప్రజాస్వామ్యానికి దేశంలోని మరే ఇతర సంస్థ కన్నా కూడా ఎన్నికల కమిషనే (ఈసీ) ఎక్కువ నష్టం కలిగించింది. తెలిసో తెలియకనో వాటిల్లిన ఆ నష్టం వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాలక పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నికలను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ఇపుడు ప్రజల మనసులలో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి. దీనిలో ఉద్దేశపూర్వకంగా జరిగింది ఎంతో నాకు తెలియదు. దానికి సంబంధించి నా వద్ద ఎలాంటి సమాచారం కూడా లేదు. కానీ, ఒక సంస్థగా దాని వ్యవహార శైలిపై మరింత స్పష్టీకరణ, మరింత నిజాయతీతో కూడిన జవాబులు అవసరం. ‘సీఎస్డీఎస్’ సర్వేలలో ఈసీ విశ్వసనీయత స్థిరంగా తగ్గుతూ రావడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది! తన ప్రతిష్ఠను పునరుద్ధరించుకునేందుకు ఈసీ చేసుకున్నది కూడా ఏమీ లేదు. ఇప్పుడెందుకు సమీక్ష?బిహార్ శాసన సభ ఎన్నికల సందర్భంగా, ఆ రాష్ట్రంలోని ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా నిశితంగా సమీక్షించాలని ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బిహార్ ఎన్నికలను మరో రెండు నెలల లోపలే ప్రకటించనున్నారని అందరికీ తెలిసిన విషయమే. అటువంటి సమయంలో ఎన్నికల జాబితాను విస్తృతంగా సమీక్షించవలసిన అవసరం ఏమొచ్చింది? కడపటి సమీక్షను 2003లో నిర్వహించారు. అది పూర్తయ్యేందుకు దాదాపు రెండేళ్ళు పట్టింది. ఇపుడు ఈసీ ఆ పనిని రెండు నెలల్లో పూర్తి చేయాలని కోరుతోంది. ఇది వర్షాకాలం. బిహార్‌లో చాలా భాగం వరద తాకిడికి గురవడం కూడా సర్వ సాధారణం. దీంతో ఓటర్ల జాబితా సమీక్ష మరింత క్లిష్టంగా మారుతుంది. అసలు అలా ఆదేశించడమే తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రమైన బిహార్‌లో వనరులు అరకొరగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు దేశం మొత్తంమీద నాసిరకమైనవి.ఈ నేపథ్యంలో, ఓటర్ల జాబితాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సవరించడం ఇంచుమించుగా అసాధ్యం. రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్‌లతోపాటు ఇతర పార్టీలు కూడా ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పాలక పార్టీకి సాయపడేందుకే అది ఈ ప్రక్రియను చేపట్టిందని నిందించడంలో వింతేముంది?ఈ పార్టీలు కొన్ని సమంజసమైన ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఓటర్ల జాబితా సంగ్రహ సవరణ జరిగినపుడు, మళ్ళీ ఈ తతంగం దేనికి? తప్పుడు ఓటర్ల జాబితాను ఆధారం చేసుకుని కడపటి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని ఈసీ భావిస్తోందా? కొద్ది నెలల క్రితం నిర్వహించిన సంగ్రహ సవరణ లోపాలతో కూడుకుని ఉందనీ, వాటిని ఇపుడు సరిదిద్దవలసి ఉందనీ భావిస్తోందా? అని అవి ప్రశ్నలను సంధిస్తున్నాయి. అదే నిజమైతే, దేనిని ఆధారం చేసుకుని ఆ రకమైన నిర్ధారణకు వచ్చిందో ఈసీ మొత్తం దేశానికి చెప్పవలసిన అవసరం లేదా? ఏదైనా దర్యాప్తు జరిపారా? నివేదిక దేనినైనా రూపొందించారా? ఈ అంశాలపై ఎవరూ నోరు విప్పడం లేదు. ఆధార్ పనికిరాదా?ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా నిశితంగా సవరిస్తామంటే ఏ పార్టీ అయినా వ్యతిరేకిస్తుందని నేను అనుకోను. క్రితంసారి 2003లో సవరించినపుడు, ఆ ప్రక్రియ సాధికారమైనదిగా ఉండేందుకు తగినంత సమయాన్ని ఇచ్చారు. ఈసారి కనిపిస్తున్నట్లుగా ఆదరాబాదరాగా ఎన్నడూ జాబితాలను సవరించిన దాఖలాలు లేవు. ఓటర్ల జాబితా (2003)కు ఎక్కని ప్రతి పౌరుడు/పౌరురాలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పడమే ప్రతిపక్ష నాయకుల మనసులలో తీవ్ర సందేహాలను రేకెత్తిస్తోంది. అలాగే, 1987 తర్వాత పుట్టినవారు వారి తల్లితండ్రుల బర్త్ సర్టిఫికెట్‌ను సమకూర్చాలని చెబుతున్నారు. అది, అందులోనూ బిహార్ వంటి రాష్ట్రంలో చాలా బృహత్తరమైన కార్యం. బిహార్‌లో అక్షరాస్యత అత్యల్పం. ప్రభుత్వ యంత్రాంగం అంతంత మాత్రంగా ఉన్న చోట, చాలా తక్కువ వ్యవధిలో అటువంటి సర్టిఫికెట్లను పొందడం కుదిరే పని కాదు. పరమ దారిద్య్రంలోనున్న సమాజంలోని బడుగు వర్గాలు ప్రభుత్వ కార్యాలయం గడప తొక్కేందుకే జంకుతాయి. అలాంటిది తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలను వారు సమకూర్చుకోగలరని ఊహించడం కూడా అసంబద్ధమే అవుతుంది. ఈ ప్రక్రియ మరింత సందేహాస్పదంగా మారడానికి మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిణమించింది. ఈ ప్రక్రియకు ఆ కార్డు చెల్లదని చెబుతున్నారు. ‘ఎందుకని’ అనే దానికి వివరణ లేదు. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించడం తేలిక కనుక, అది అధికారికమైన గుర్తింపు పత్రంగా గణనకు రాదని ఊహాగానాలు సాగుతున్నాయి. ఆ లెక్కన, ఇతర డాక్యుమెంట్లు మాత్రం నకిలీవి కావనే గ్యారంటీ ఏమైనా ఉందా? దీనిపై ఈసీ నోరు విప్పుతుందా?తటస్థ అంపైర్ అనుకోవచ్చా?ఈసీ అసాధారణమైన రీతిలో న్యాయబద్ధత తాలూకు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సమాన పోటీ అవకాశాలను కల్పించి, తటస్థ అంపైర్‌గా ఉండవలసిన ఈసీ భారతీయ జనతా పార్టీ ఆడించే బొమ్మగా మారిందనీ, దాని స్వతంత్రత తీవ్ర రాజీకి లోనవుతోందనీ రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఈ అంశాన్ని మరింత జటిలం చేసింది. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానల్లో ప్రధాని, ప్రతిపక్ష నాయకునితోపాటు భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని సుప్రీంకోర్టు తీర్పు చెబితే, సీజేఐ స్థానాన్ని ప్రభుత్వం ఒక క్యాబినెట్ మంత్రితో భర్తీ చేసింది. స్వతంత్రంగా వ్యవహరించే ఈసీ రావడం ప్రభుత్వానికి ఇష్టం లేదేమోననే అభిప్రాయాన్ని అది కల్పించింది.మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరగడం పైన, ఎన్నికల జాబితాలను ఇష్టానుసారం తారుమారు చేసేశారని ప్రశ్నలు రేకెత్తినపుడు, ఈసీ నుంచి విశ్వసనీయమైన వివరణ రాలేదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లుగా పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీని ఇచ్చేందుకు కూడా ఈసీ తిరస్కరించింది. అందుకు అది సాంకేతిక కారణాన్ని సాకుగా చూపింది. వాస్తవానికి, ప్రభుత్వం నిబంధనను మార్పు చేసింది. వీడియో ఫుటేజీని 45 రోజులకు మించి అట్టేపెట్టకూడదని ఈసీ కూడా నిర్ణయించింది. అంతకు ముందు ఆ కాల పరిధి ఏడాదిగా ఉండేది. దేశంలో 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అత్యంత మతపరమైన ఎన్నికలు. ముస్లింలను నేరుగా లక్ష్యంగా చేసుకున్నా, ఎటువంటి చర్యా తీసుకోలేదు. ఈసీ కనుక నిఘా నేత్రంగా వ్యవహరించి ఉంటే, అనేక మంది నాయకులు వారి ఓటింగ్ హక్కును కోల్పోయి ఉండేవారు. మతపరమైన ప్రచారం చేసినందుకు ఓసారి బాలాసాహెబ్ ఠాక్రే అలాగే ఓటు హక్కును కోల్పోయారు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. సంస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని ఈసీ గ్రహించాలి. ఆ సంస్థ విశ్వసనీయతను కోల్పోతే, దేశానికి భవిష్యత్తు అనేదే ఉండదు. మాయోపాయాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఈసీ రాజీపడుతోందని అనుమానం ప్రబలితే, మొత్తం ప్రజాస్వామిక ప్రక్రియే సందేహాస్పదంగా మారుతుంది. చట్టబద్ధమైన ఓటర్లదే విజయమనే ప్రజా నమ్మకం వమ్ము అవుతుంది. ప్రజాస్వామ్యానికి అది మరణ శాసనం అవుతుంది.ఆశుతోష్ వ్యాసకర్త సత్యహిందీ డాట్‌కామ్ సహ–స్థాపకుడు, ‘హిందూ రాష్ట్ర’ పుస్తక రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
పశుబలం తప్ప ఏం మిగిలింది?
ప్రపంచంలో కెల్లా గొప్ప ప్రజాస్వామ్యమని చెప్పుకునే అమెరికాకు పశుబలం తప్ప ఏం మిగిలింది? ప్రజాస్వామ్యం అనే మాటకు అంతర్జాతీయంగా వచ్చే మొదటి అర్థం, అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను, అంతర్జాతీయ వ్యవస్థలను గౌరవించటం. ఇతర దేశాలతో గల సంబంధాలలో ప్రజాస్వామికంగా వ్యవహరించటం. ఆ విధంగా ప్రపంచానికి ప్రజాస్వామిక ఆదర్శంగా నిలవాలి. కానీ అమెరికా వీటన్నిటినీ బాహాటంగా ఉల్లంఘిస్తూ వస్తున్నది. ఈ ధోరణి క్రమంగా పెరుగుతున్నది. అందుకు కారణం తన ఏకధృవ ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతుండటం. ఈ చర్చను ప్రస్తుతానికి ఇరాన్ అంశంతోనే మొదలుపెట్టి చూద్దాము. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరగటమే కాదు, అసలు యుద్ధమే ముగిసిపోయిందన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ఘనంగా ప్రకటించిన తర్వాత, జూన్ 28న అన్న మాటలను గమనించండి – ‘యుద్ధంలో నాశనమైన ఇరాన్ అధినేత ఖొమైనీ, యుద్ధంలో తామే గెలిచామని మూర్ఖంగా ప్రకటిస్తున్నారు. మూడు అణు కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. యుద్ధ సమయంలో దాక్కున్న ఆయన అమెరికా, ఇజ్రాయెల్ సేనల చేతిలో నీచమైన చావు చావకుండా నేనే కాపాడాను. టెహ్రాన్ దిశగా భారీ సంఖ్యలో వెళుతుండిన ఇజ్రాయిల్ విమానాలను తిప్పించాను. ఆ దాడి జరిగితే అక్కడ వేలాదిమంది చనిపోయేవారు. అయినప్పటికీ ఇరాన్ అధినేత నాకు కృతజ్ఞతలు చెప్పలేదు. పైగా తామే గెలిచామంటున్నారు. ఇరాన్ అణు పరిశోధనలు తిరిగి ప్రారంభిస్తే మళ్ళీ బాంబులు వేయిస్తా. ఇరాన్‌పై ఆంక్షలను సడలించాలనుకున్నాను గాని ఇక ఆ పని చేయను.’కేవలం ఈ మాటలను విశ్లేషిస్తే చాలు అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను, అంతర్జాతీయ వ్యవస్థలను ఏ విధంగా గౌరవిస్తున్నదో తెలిసేందుకు. ప్రజాస్వామికంగా పెద్దమనిషి తరహాలో వ్యవహరించేందుకు ట్రంప్‌కు ఏమీ లేదు. బాంబులు తప్ప, పశుబలం తప్ప. విషయాన్ని సూటిగా మరొకమారు చెప్పుకోవాలంటే కళ్లెదుట కనిపిస్తున్నవి కొన్ని ఉన్నాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)లో స్వచ్ఛందంగా భాగస్వామి అయిన ఇరాన్‌కు ఆ సంస్థ నిబంధనల ప్రకారం శాంతియుత ప్రయోజనాల కోసం అణు ఇంధన శుద్ధికి పూర్తి హక్కు ఉంది. వారు ఆ ప్రకారం కట్టుబడటమే కాక, మారణాయుధాల తయారీ ఇస్లాం బోధనలకు విరుద్ధం కనుక ఆ పని చేయబోమంటూ ఫత్వా సైతం జారీ చేసుకున్నారు. వారు నిబంధనలను ఉల్లంఘించలేదని అణుశక్తి పర్యవేక్షణ సంస్థ (ఐఏఈఏ) స్వయంగా చెప్తున్నది. కాదు, కొద్ది వారాలలోనే బాంబులు తయారు చేయనున్నారు అంటూ ఇజ్రాయిల్ అనే శత్రుదేశం పాతికేళ్లుగా ఆరోపిస్తూ వస్తున్నది. అమెరికా దానికి వత్తాసు పలుకుతోంది.ఇజ్రాయిల్ కుప్పలుగా తయారు చేసుకున్న అణ్వస్త్రాలను గురించి అమెరికా సహా నాటో కూటమి దేశాలు ఎన్నడూ పొరపాటున అయినా పల్లెత్తు మాట అనడంలేదు. ఒక యూఎన్ఓ సభ్య దేశం మరొక యూఎన్ఓ సభ్య దేశంపై అసత్యపు ఆరోపణలతో, సైనిక దాడి జరుపుతున్నా వ్యతిరేకించకపోవడం ప్రజాస్వామ్యమా? చివరికి తానే రంగంలోకి దిగి బాంబుదాడులు జరపడం ఏమిటి? కొన్ని యూరోపియన్ ప్రజాస్వామిక రాజ్యాలు అందుకు సహకరించటమేమిటి? ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ కోసం ఇదంతా చేస్తున్నది అంటున్న వారు, ఇరాన్ వల్ల ఏర్పడిన ముప్పు ఏమిటో, ఇరాన్ అణ్వాయుధాల తయారీ స్థాయికి వెళ్లిందన్న ఆరోపణలకు ఆధారాలేమిటో, తామందరూ సభ్యులైన యూఎన్ఓ అనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడైనా చర్చించారా?వారు ఆ పని చేయలేదు, చేయరు కూడా. అమెరికన్ సామ్రాజ్యవాదం ఎల్లప్పుడూ నమ్ముకున్నది అంతిమంగా బల ప్రయోగాన్నే. ప్రస్తుత సందర్భం ఒక ఉదాహరణ మాత్రమే. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇందుకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఏ ప్రజాస్వామిక వ్యవస్థలతోనూ నిమిత్తం లేకుండా, కేవలం అసత్య ఆరోపణలతో ఈ చర్యలకు పాల్పడే అధికారం వారికి ఎక్కడి నుంచి వచ్చిందసలు? కనిపిస్తున్నదే, పశుబలం నుంచి వచ్చింది. ఆ బలానికి మూలాధారం సామ్రాజ్యవాద ప్రయోజనాలు. ఎటునుంచి, ఎటువంటి ఎదురు లేకుండా, ఏ అంతర్జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలతో నిమిత్తం లేకుండా, మంచైనా, చెడైనా ఏకఛత్రాధిపత్యంగా సాగాలనే దురహంకారం. ప్రస్తుత యుద్ధ సందర్భంలో మొదటి నుంచి చివరి వరకు, పైన పేర్కొన్న ట్రంప్ మాటలతో సహా కనిపించేది అదే.యుద్ధంతో తక్షణ సంబంధం గల విషయాలు ఇవి కాగా, మౌలిక స్థాయి సంబంధాలు కలవాటిని చూద్దాం. మూలం ఎక్కడుంది? పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా ఇజ్రాయిల్, అమెరికాలు మొదటి నుంచి అడ్డుకుంటుండడంలో ఉంది. అంతర్జాతీయ ప్రజాస్వామిక సంస్థలకు అమెరికా చేస్తున్న హాని గురించి పలు దృష్టాంతాలు ప్రస్తావనకు వస్తున్నాయి. పారిస్ పర్యావరణ పరిరక్షణ నిర్ణయాల నుంచి, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నుంచి ఉపసంహరించుకోవటాలు, అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్‌పై దాడి, పనామా కాలువను, గ్రీన్‌ల్యాండ్‌ను, కెనడాను ఆక్రమించుకోగలమని బెదిరింపులు, అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్)తో పాటు డాలర్ శక్తిని ఆధారం చేసుకుంటూ తమకు నచ్చని దేశాలపై ఆంక్షలు, వందల కోట్ల డాలర్లను తమ బ్యాంకులలో స్తంభింప చేయటం, తమ నియంత్రణలోకి తీసుకొని మరెవరికో ఇవ్వటం వంటివన్నీ ప్రజాస్వామ్యమా? మొదట చెప్పుకున్నట్లు వీటికి ఆధారం అంతర్జాతీయ ప్రజాస్వామిక సంస్థల నియమ నిబంధనలు కాదు. వారికి మిగిలిన ఆధారం పశుబలం మాత్రమే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
లండన్ ‘వీరాస్వామి’కి చివరి రోజులా?
బ్రిటన్‌లో ఇప్పటికీ నడుస్తున్న అతి పురాతనమైన భారతీయ రెస్టారెంటు ‘వీరాస్వామి’. ఇంత సుదీర్ఘకాలం నుంచీ భోజనప్రియలను అలరిస్తున్న ఇండియన్ రెస్టారెంటు ప్రపంచంలోనే మరొకటి లేదని యాజమాన్యం సగర్వంగా చెబుతుంది. దీన్ని స్థాపించి వచ్చే ఏడాదికి వందేళ్లు. ఆ సంబరాలే మరపురానివిగా మిగిలిపోయే... ‘వీరాస్వామి’ అంతిమ ఘడియలు కూడా కావచ్చు.లండన్ రీజెంట్ స్ట్రీట్‌లో ప్రసిద్ధి గాంచిన చిరునామాల్లో ‘వీరాస్వామి’ ఒకటి. దీనికి ఎడమవైపు ఆస్టిన్ రీడ్, ఎదురుగా ఆక్వాస్కూటమ్ ఉండేవి. ఈ రెండు లెజెండరీ క్లాత్ షాపులూ చరిత్రగర్భంలోకి జారిపోయి ఎంతో కాలం కాలేదు. అదే ‘వీరాస్వామి’ విషయంలోనూ నిజం కాబోతుందేమో!ఈ రెస్టారెంటు మూతపడటం... సాంస్కృతిక విలువలను బేఖాతరు చేస్తూ డబ్బుకు ప్రాముఖ్యం ఇవ్వడానికి నిదర్శనంగా రంజిత్ మత్రానీ, నమిత పంజాబీ అంటున్నారు. వీరు ‘వీరాస్వామి’ ప్రస్తుత యజమానులు. వారి మాటలతో ఏకీభవించని వారుండరు. 1926లో ‘వీరాస్వామి’ ప్రారంభమైంది. జనరల్ విలియం పామర్, మొఘల్ ప్రిన్సెస్ ఫయిసన్ నిస్సా బేగంల ముని మనవడు ఎడ్వర్డ్ పామర్ దీన్ని స్థాపించాడు. వీరాస్వామిలోని ‘వీరా’ ఆయన గ్రాండ్ మదర్ పేరు. తందూర్ ఓవెన్‌ను తీరాలు దాటించిన ఘనత కూడా ఎడ్వర్డ్‌కే దక్కింది. 1937లో ఈ రెస్టారెంటు తందూర్ ఓవెన్ ప్రారంభించింది. 1940లలో లండన్ మీద జర్మనీ బాంబులు కురిపిస్తున్నా, వీరాస్వామి యథాప్రకారం తెరచి ఉందని చెబుతారు.లండన్ పుర ప్రముఖులకు ‘వీరాస్వామి’ అంటే ఎప్పుడూ మొఖం మొత్తలేదు. వేల్స్ యువరాజు (తర్వాతి కాలంలో 8వ కింగ్ ఎడ్వర్డ్ ) తరచూ అక్కడ విందు ఆరగించేవాడు. 1930ల ప్రథమార్ధంలో డెన్మార్క్ క్రౌన్ ప్రిన్స్‌కు ఈ రెస్టారెంటు ఎంతో ఇష్టమైన ప్లేస్. దీన్నిబట్టి దాని ప్రాభవం ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆయన తరచూ ఇక్కడకు వస్తూ ఉండేవాడు. గోవా స్టయిల్ డక్ విన్డాలూ వంటకం ఆయన ఫేవరెట్ డిష్. ఈ ప్రిన్స్ ప్రతి ఏటా క్రిస్మస్ నాడు ‘వీరాస్వామి’కి కృతజ్ఞతా పూర్వకంగా కార్ల్స్‌బర్గ్ బీరు పీపా పంపేవాడు. బీరు, ఇండియన్ వంటకాల మేళవింపుపై బ్రిటిష్ వారి క్రేజ్‌కు ఇక్కడే బీజం పడింది. ఇప్పుడు ఇవి జన జీవన స్రవంతిలో భాగం అయ్యాయి. భారతీయులకు కూడా ‘వీరాస్వామి’ ప్రీతిపాత్రంగా ఉంటూ వచ్చింది. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, కృష్ణమీనన్ ఈ రెస్టారెంటుకు తరచూ వెళ్లేవారు. అలాగే చర్చిల్, స్వీడన్, జోర్డాన్‌ల రాజులు, మార్లన్ బ్రాండో, లారన్స్ ్స ఆలివర్, పీయర్స్ బ్రాజ్నన్, ప్రిన్సెస్ ఏనీ, డేవిడ్ క్యామరన్లు కూడా. 1948లో భారత ఒలింపిక్ టీముకు తన సేవలు అందించింది. 2017లో ఇంగ్లాండులో పర్యటించిన భారత రాష్ట్రపతికి ఎలిజబెత్ రాణి ఇచ్చిన విందుకు వీరాస్వామే కేటరర్. వీరాస్వామిని మూసివేత అంచుల్లోకి నెట్టిన సమస్య ఏమిటో చూద్దాం. ఈ రెస్టారెంటు రీజెంట్ స్ట్రీట్‌లోని క్రౌన్ ఎస్టేట్‌కు చెందిన బిల్డింగులో ఉంది. ఇదే అసలు సమస్య. క్రౌన్ ఎస్టేట్ సంస్థ చార్లెస్ రాజు ఆస్తులను నిర్వహిస్తుంది. ఈ సంస్థ వీరాస్వామి లీజు పొడిగించరాదని నిర్ణయించింది. లీజు వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగుస్తుంది. రెస్టారెంటు గ్రౌండ్ ఫ్లోర్ ముఖద్వారం ఆక్రమించి ఉండే 11 చదరపు మీటర్ల స్పేస్‌ను తీసేసుకుని పైఅంతస్తుల్లోని ఆఫీసుల కోసం రిసెప్షన్‌ను విస్తరించుకోవాలని తలపెట్టింది. అక్కడ రెస్టారెంటు ఉండటం చీకాకుగా ఉంటోందని వారు భావిస్తూ ఉండొచ్చనీ, భవనం అంతా కార్యాలయాలు మాత్రమే ఉండాలనుకున్నారని తాము భావిస్తున్నామనీ మత్రానీ ఇటీవలే ‘ది టైమ్స్’ వార్తా పత్రికకు చెప్పారు.అయితే ‘వీరాస్వామి’ దీనిపై కోర్టుకు వెళ్లింది. కేసు ఇంకా విచారణకు రాలేదు. అలాగే, సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారు. లీజు రద్దుకు వ్యతిరేకంగా పదుల వేలల్లో ప్రజలు పిటిషన్ మీద సంతకాలు చేశారు. దీన్ని రాజుకు సమర్పిస్తారు. ఈ ప్రయత్నాలేవీ ఫలించనట్లయితే, ‘మేం దీన్ని మూసేస్తాం. తర్వాత అనువైన కొత్త సైటును ఎంపిక చేసి అందులో తిరిగి తెరుస్తాం. ఈ ప్రక్రియకు ఎంతకాలం పడుతుందో చెప్పలేం. అందాకా వ్యాపారం నష్టపోతుంది. వృథా వ్యయాలు ఉత్పన్నమవుతాయి’ అని మత్రాని వివరించారు. దీనివల్ల ‘ప్రధానమైన ఒక లండన్ సంస్థ నాశనమవుతుంద’ని ఆయన ఆవేదన చెందారు. అది నిజంగానే ఓ విషాదం. ఇక్కడ విషయం, ‘వీరాస్వామి’కి చరిత్రలో ఉన్న స్థానాన్ని కాపాడటం, సంరక్షించడం మాత్రమే కాదు. ఒక మంచి రెస్టారెంటు కనుమరుగు అవుతుందన్నది కూడా ముఖ్యమైన అంశమే. 2016లో దీనికి గుర్తింపుగా మిషెలన్ స్టార్ రేటింగ్ లభించింది. ఇవ్వాళ్టికీ ఈ రేటింగ్ కొనసాగుతోంది.చార్లెస్ రాజు జోక్యం చేసుకుని ‘వీరాస్వామి’ మూతపడకుండా అడ్డుకుంటారా? ఈ ఒక్క ఆశే మిగిలి ఉంది. ఒకవేళ ఆయన ఆ పని చేయనట్లయితే, ఈ సారి లండన్ వెళ్లినప్పుడు నేను తప్పనిసరిగా ‘వీరాస్వామి’లో డైనింగ్ చేసి వీడ్కోలు చెప్పివస్తాను. మీరు కూడా ఇలా ఎందుకు చెయ్యకూడదు? ఆలోచించండి.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
దూకుడు కన్నా సమన్వయానికే మొగ్గు
‘మంచి ప్రారంభంతో సగం పని అయిపోయినట్టే’ అంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కొత్త అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను తామలానే జరిపించగలిగామని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో ఎన్.రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్‌లో పి.వి.ఎన్. మాధవ్ కొత్త అధ్యక్షులుగా ఎన్నికవడం చూస్తే, సుదీర్ఘ కాలం పార్టీనే అంటిపెట్టుకొని ఉండటం, సైద్ధాంతిక బలం వంటి అంశాలకే ప్రాధాన్యమిచ్చిందని స్పష్టమౌతోంది. తాజా నిర్ణయంపై ఆర్ఎస్ఎస్ ప్రభావమూ విస్పష్టమే! పార్టీని దూకుడుగా తీసుకు వెళ్లటం కన్నా, ‘గ్రూప్’ల బెడద లేకుండా, ఐక్యంగా నడిపించటం పైనే అధిష్ఠానం దృష్టి నిలిపిందనిపిస్తోంది. పార్టీకి లభించే తక్షణ ఊపు కన్నా, ఎన్డీయే కూటమికి దీర్ఘకాలికంగా ఒనగూరే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేశారని ఈ నిర్ణయం తేటతెల్లం చేస్తోంది. బయటి నుంచి వచ్చే నేతలకు లభించే ఇతర అందలాల సంగతెలా ఉన్నా, వారు పార్టీ సంస్థాగత పదవులు, హోదాల్లోకి రావటం అంత తేలికైన అంశం కాదనీ మరోమారు సంకేతాలు ఇచ్చినట్టయింది.జాప్యం జరిగినా తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక విషయంలో బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగానే అడుగులు వేసింది. అభ్యర్థుల ఎంపికలో, దూకుడు స్వభావం కన్నా సంయమనం, సమన్వయం నెరిపే నాయకత్వానికి ప్రాధాన్యమిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోని కూటమి భాగస్వామ్య పక్షమైన బీజేపీ, కూటమి పార్టీల మధ్య సఖ్యతకు విఘాతం రానీయకుండా చూసుకోవడమే కాక... తెలంగాణలో అటువంటి భవిష్యత్ అవకాశానికి దారులు తెరచి ఉంచింది. రేపు అది తెలుగుదేశం–జనసేనతో జట్టు కొనసాగించడమైనా కావచ్చు, కాదు పరిస్థితులు మారితే భారతæ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో జోడీ కట్టడమైనా కావచ్చు. పార్టీ అధినాయకత్వం కనుసన్నల్లో మెదలవటమే కాకుండా, ఢిల్లీ నాయకత్వం నిర్దేశించిన తరహాలో రాష్ట్రాల్లో పార్టీ శ్రేణుల్ని నడపగలిగే అణకువ గలిగిన నాయకత్వానికి పీట వేసింది. మొదట్నుంచీ పార్టీలోనే ఎదిగిన ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్రరావు (తెలంగాణ), పి.వి.ఎన్. మాధవ్ (ఏపీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయేట్టు వ్యూహరచన చేసింది. దూకుడు నాయకత్వం ఉండుంటే, ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు వలసలుంటాయేమోననే భయం ఆ పార్టీకి ఉండేది. ఇప్పుడా భయం పోయింది.వీగిన తెలంగాణ చిక్కుముడితెలంగాణలో పార్టీ రాష్ట్రాధ్యక్ష ఎన్నిక బీజేపీ అధినాయకత్వానికి ఒక దశలో సవాల్‌గానే మారింది. పలువురు నాయకులు ఈ పదవిని ఆశించడమే కాకుండా ముమ్మరంగా తమ వంతు ప్రయత్నాలు చేశారు. తర్జన – భర్జనల తర్వాత త్రాసు రామచంద్రరావు వైపు మొగ్గింది. ఈ పదవిని ఆశించడమే కాకుండా ఢిల్లీ నాయకత్వాన్ని మెప్పించే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు నిరాశే మిగిలింది. ఈటలకు పార్టీలో ‘చేరికల కమిటీ’కి నేతృత్వం ఇచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో చేరికలు జరగకపోవడం, పార్టీలో పాత –కొత్త నాయకుల మధ్య స్పర్థ పెరగటం వంటివి అధినాయకత్వానికి చీకాకు కలిగించాయి. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరగటం, గజ్వేల్‌తో పాటు హుజూరాబాద్‌లోనూ ఆయన ఓడిపోవడం వంటివే కాక బీజేపీ సంస్థాగత ఎన్నికల నిబంధనలు కూడా ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయి. ఈటలకు పార్టీ అధ్యక్ష పీఠం దక్కకపోవడమొక్కటే కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మిగిలిన సంతృప్తి కావచ్చని పార్టీలో గుసగుసలున్నాయి. బయటకు ఆసక్తిని వెల్లడించకపోయినా, ఒక దశలో తాను పోటీదారును కాదని ప్రకటించినా.... మరోమారు అధ్యక్షుడు కావాలని ఆయనకు లోలోపల ఉండినట్టు తెలుస్తోంది. అందుకు కారణం, లోగడ ఆయన బాగా పనిచేస్తున్నప్పుడు, పార్టీకి మంచి ఊపు తెచ్చినపుడు అర్ధంతరంగా ఆయన్ని తప్పించడమే! పార్టీ ఎదుగుదలకు ‘నేనే’ కారణం అనే స్థితిలోకి అధ్యక్షుడు వెళ్లిపోయారనీ, ‘నేను’ను బీజేపీ నాయకత్వం అంగీకరించదనీ పార్టీలో కొందరు అప్పట్లో అన్వయం చెప్పేవారు. ఇక తెలంగాణ అధ్యక్ష స్థానానికి ఎంపీలు అర్వింద్, డీకే అరుణ, రఘునందనరావు, డా.లక్ష్మణ్ పేర్లు ప్రచారంలోకి రావటమన్నది ఆటలో అరటిపండే!సత్తా కన్నా సంకేతాలకే మొగ్గుబీజేపీ అధిష్ఠానం వైఖరి కొన్నిసార్లు విచిత్రంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి నిలిపిన గొప్ప చరిత్ర ఏమీలేదు. ఏదో సమీకరణాల్లో... అయితే రాష్ట్రం రావాలి, కాదంటే వ్యూహం నెరవేరి ఎన్డీయేకు లబ్ధి చేకూరాలి. ఏపీ, తెలంగాణల్లో అధ్యక్షుల ఎన్నికకు అదే వ్యూహాన్ని అనుసరించినట్టు కనిపిస్తోంది. కూటమి పార్టీల మధ్య సఖ్యతకు, సయోధ్యకు మాజీ ఎమ్మెల్సీ (పట్టభద్రుల స్థానం) పి.వి.ఎన్. మాధవ్ అధ్యక్షులైతే అందరికీ ఆమోదయోగ్యంగా, అధిష్ఠానానికి తలలో నాలుకలా ఉంటారనే తాజా నిర్ణయానికి వచ్చినట్టుంది. కూటమి మిత్రులకు ఈ విషయంలో స్పష్టమైన సంకేతాలివ్వడం పార్టీకి ముఖ్యం. మాధవ్ దివంగత నేత పి.వి.చలపతిరావు తనయుడు. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఉండి, ఉమ్మడి ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగానూ పనిచేసిన చలపతిరావుకు మంచి పేరుండేది. కోస్తాంధ్ర ప్రాంతం నుంచి సుదీర్ఘకాలం ఆయనే బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.ఇక తెలంగాణలో రామచంద్రరావు అధ్యక్షుడవడం చాన్నాళ్లుగా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న పాత నాయకులకు సంతృప్తినిచ్చే నిర్ణయం. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) నుంచి, యువమోర్చా నుంచి ఎదిగి వచ్చిన నాయకుడాయన. సంప్రదింపుల్లో దిట్ట అని పేరుంది. ఎమ్మెల్సీగా (పట్టభద్రులకు) ప్రాతినిధ్యం వహిస్తూ మండలిలో పార్టీ నాయకుడిగా ఉన్నారు. ప్రజలు తమకు అవకాశం ఇస్తే, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన పార్టీ అధినాయకత్వం ఇతర అగ్రవర్ణాలను దూరం చేసుకోవద్దన్న వ్యూహమే ఇక్కడ పనిచేసి ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయినపుడు, ఆ పార్టీని బీజేపీతో జతచేయడమో, విలీనమో.... ప్రతిపాదనలొచ్చాయని ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో ....తాజా అధ్యక్ష ఎంపిక/ఎన్నిక కీలకమైంది. రేపు ఏదైనా పరిణామాల్లో బీఆర్ఎస్తో బీజేపీ జట్టు కట్టాల్సివస్తే పార్టీకి సంయమనంతో వ్యవహరించే నాయకత్వం ఉండాలని ఇప్పట్నుంచే ఢిల్లీ నేతలు యోచించినట్టుంది. ఈటల రాజేందర్, బండి సంజయ్... ‘వారిద్దరిలో ఎవరికిచ్చినా వేరొకరు సహకరించక పోదుర’నే బలమైన అభిప్రాయముంది. ఇప్పటికే సిటీ వర్గం, నిజామాబాద్ బ్యాచ్, కరీంనగర్ టీమ్... ఇలా వర్గాలుగా చీలి ఉన్న తెలంగాణ బీజేపీలో మరో కొత్త వర్గాన్ని పుట్టించకుండా అధిష్ఠానం జాగ్రత్తపడిందనే సంతృప్తి కొందరిలోనైనా ఉంది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఒకప్పుడు చెప్పిన మాటలీ సందర్భంలో గుర్తుకొస్తాయి. బీజేపీకి సన్నిహితంగా పనిచేస్తూ, ఒక దశలో బీజేపీలో చేరే ఆలోచన చేసిన టీడీపీ నాయకుడు పర్వతనేని ఉపేంద్రనుద్దేశించి వాజ్‌పేయి ఈ మాటలన్నారు: ‘మీ పనితీరు మాకు అతకదేమో! మీరు ఇక్కడ ఇమడలేరు, మా వాళ్లు ఇమడనివ్వరు కూడా’ అని ఆ పెద్దాయన నర్మగర్భంగా చెప్పారు. అది కరడుగట్టిన సత్యమని తెలంగాణ బీజేపీ రాజకీయాలు నిరూపించాయి.దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ -
చేయాల్సింది చాలా ఉంది!
ఈ దశాబ్ద కాలంలో భారత్ ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగటమే కాదు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో కూడా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ మొదటిసారి వంద లోపు ర్యాంకు సాధించటం ఆహ్వానించ దగిన పరిణామమే. 2030 నాటికి వాతావరణం, జీవుల పరి రక్షణ, పేదరిక నిర్మూలన, గౌరవప్రదమైన ఉపాధి, నాణ్యమైన విద్య, ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ, అసమానతల నిర్మూలన, లింగ సమానత్వం, సురక్షితమైన త్రాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన లాంటి 17 లక్ష్యాలను సాధిం చాలనే సంకల్పంతో 2015లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. అభి వృద్ధి, వనరుల వినియోగం అనేది ప్రస్తుత తరానికే కాదు భవిష్యత్ తరాలకు కూడా అనే విస్తృత అర్థంలో సుస్థిరాభివృద్ధి భావనను ఉపయోగించటం జరుగుతుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధ నలో భారత్ 2017లో 116వ ర్యాంకును, 2022లో 121వ ర్యాంకును, 2024లో 109వ ర్యాంకును సాధించింది. ఐక్యరాజ్యసమితి సుస్థి రాభివృద్ధి సొల్యూషన్స్ నెట్వర్క్ నివేదిక ప్రకారంగా 2025లో భారత్ తన ర్యాంకును మెరు గుపరుచుకుని 167 దేశాలలో 67 స్కోర్‌తో 99వ ర్యాంకును సాధించింది. ఎప్పటిలాగానే 85 నుండి 86 స్కోర్‌తో గత మూడు పర్యాయాలుగా ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు మొదటి మూడు స్థానాలలో కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే మొదటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా 44, చైనా 49, జర్మనీ 4 ర్యాంకులు సాధించాయి. భారత్ సమీప దేశాలైన మాల్దీవులు (53), శ్రీలంక (93), భూటాన్ (74), నేపాల్ (85)లు భారత్ కంటే మెరుగైన ర్యాంకులను సాధిస్తే... బంగ్లాదేశ్ 114, పాకిస్తాన్ 140 ర్యాంకులతో సరిపెట్టుకున్నాయి.గత దశాబ్ద కాలంగా దేశంలో ఆహార భద్రతా చర్య లలో భాగంగా ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’, ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’, ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’, జాతీయ ఆరోగ్య మిషన్’ లాంటి పథకాలను అమలు చేయడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ తన ర్యాంకుని మెరుగుపరచు కోగలిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆర్థిక అభివృద్ధిని కొలిచే ప్రమాణాలలో ఒకటైన మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ)లో భారత్ మెరుగైన ర్యాంకుని సాధించలేక పోతోంది. 2025 సంవత్సరానికి గాను యూఎన్డీపీ ప్రకటించిన హెచ్‌డీఐ ర్యాంకులలో భారత్ తన ర్యాంకును 134 నుండి 130కి మెరుగుపరచుకోగలి గినా, 193 దేశాలలో భారత్ హెచ్డీఐలో 130వ స్థానంలో నిల వటం శోచనీయం.అమెరికా, చైనా, జర్మనీల తరువాత భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించ బోతోంది. కానీ ఆర్థిక అభివృద్ధికి ప్రమాణాలుగా భావిస్తున్న తలసరి ఆదాయంలో 141వ ర్యాంకు, ఆకలి సూచీలో 105వ ర్యాంకు, స్థూల సంతోష సూచిలో 118వ ర్యాంకుతో ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న (23.4 కోట్లు) దేశంగా భారత్ నిలవటం శోచ నీయం. ఈ సూచికలలో భారత్ సామర్థ్యం మెరుగుపడకుండా 2028 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా అభివృద్ధి ఫలాలు కింది వర్గాల ప్రజలకి చేరకపోవచ్చు. – డా‘‘ తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ 98854 65877 -
వాస్తవిక రాజకీయం
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగానైనా విరామం లభించింది. ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులు వేసింది. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై చర్చ చాలాకాలం పాటు కొనసాగుతుంది. బహుశా కోర్టు మెట్లూ ఎక్కవచ్చు. సుమారు 15 కిలోటన్నుల బరువున్న బంకర్ బస్టర్ బాంబులు అణుస్థావరాలను ధ్వంసం చేసే అవకా శాలు తక్కువే. అంటే ఇరాన్ అణు కార్యక్రమం స్తంబించిపోలేదు. పోనీ అమెరికా బాంబులతో ఆ ప్రాంతంలో శాంతి నెలకొందా? ఇరాన్ లో ప్రభుత్వం మారిందా? ఊహూ! కాదనే చెప్పాలి. బాంబు దాడులకు బదులుగా ఇరాన్ పొరుగున ఉన్న ఖతార్‌లోని అమెరికన్ స్థావరాలపై దాడులు చేసింది. అది కూడా అమెరికాకు ముందుగానే చెప్పి! ఇందుకు ట్రంప్ స్వయంగా ఇరాన్‌కు ధన్యవాదాలూ చెప్పారు. ఏదైతేనేమి... ప్రస్తుతానికైతే శాంతి నెలకొన్నట్టు గానే కనిపిస్తోంది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 20 శాతం కంటే ఎక్కువ రవాణా అయ్యే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పార్లమెంట్ బంద్ చేయాలని తీర్మానించినా ప్రస్తుతానికి ఆ నిర్ణయం అమల్లోకైతే రాలేదు. మధ్యప్రాచ్యంలో యుద్ధమంటే సహజంగానే చమురు ధరల్లో పెరుగుదల ఉంటుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరగడం, పెట్టుబడిదారులు సంశయంలో పడిపోవడం, వాణిజ్యంపై దుష్ప్రభావం సహజంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచ చమురు షేక్ అమెరికా! ఐదో వంతు ముడిచమురు అక్కడే ఉత్పత్తి అవుతోంది. సొంత అవసరాలు పోను ఎగుమతి చేస్తోంది కూడా! ఈ కారణంగానే ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తరువాత కూడా చమురు ధర మునుపటిలా బ్యారెల్‌కు 100 – 150 డాలర్ల స్థాయికి చేరలేదు. రెండూ కావాల్సిన దేశాలే!వీటన్నింటి ప్రభావం భారత్‌పై ఎలా ఉండ బోతోంది? భారత్ ఇప్పుడు జాగరూకతతో, ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇరు దేశాలతో సత్సంబంధాలున్న దేశంగా మరింత బ్యాలెన్ ్సడ్గా ఉండాలి. రక్షణ, నిఘా ఉత్పత్తుల విషయంలో ఇజ్రాయెల్ ఇప్పుడు భారత్‌కు కీలకంగా మారిన విషయం తెలిసిందే. హైఫా నౌకాశ్రయంలో భారతీయుల పెట్టు బడులున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ఇరు దేశాలూ పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇజ్రా యెల్‌తో మన వ్యాపారం గణనీయంగా పెరిగి 500 కోట్ల డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఇరాన్ మనకు చమురు సరఫరా చేస్తూండటం గమనార్హం. మన రూపాయిల్లోనే ముడిచమురు కొనుగోలుకు అవకాశం కల్పించిన దేశం కూడా ఇరానే! మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా చాబహార్ నౌకాశ్రయాన్ని ఇండియా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. మన దిగుమతుల్లో 32 శాతం చమురు, 52 శాతం ఎల్ఎన్ జీ హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతోంది. ఇందులో తేడా వస్తే దాని ప్రభావం మన వంటింటి గ్యాస్ సిలిండ ర్లపై పడుతుంది. ఎరువుల ఉత్పత్తిలోనూ తేడా లొస్తాయి. రష్యా నుంచి చమురు తెచ్చుకోవడం సులువు కాదు. ఇలా చేయడం అమెరికాకు ఆగ్రహం తెప్పించేదే. చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని మాత్రమే కాకుండా, విదేశీ మారక ద్రవ్య నిల్వలపై, ద్రవ్య లోటుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువను 87 కంటే దిగువకు చేర్చవచ్చు. ముడి చమురు బ్యారెల్ ధర పది డాలర్లు పెరిగితే భారత స్థూల జాతీయోత్పత్తి 0.3 శాతం వరకూ తగ్గవచ్చుననీ, ద్రవ్యోల్బణం 0.4 శాతం పెరుగుతుందనీ ఒక అంచనా. స్టాక్ మార్కెట్లు కూడా పెరిగే చమురు ధరలకు స్పందించి పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. నైతిక ప్రశ్నలూ ఉన్నాయి...రాజకీయాల్లో నైతికత లేని రోజులివి. అయితే, ఏమాత్రం రెచ్చగొట్టే చర్యలకు దిగకున్నా ఒక సార్వభౌమ దేశంపై జరిగిన దాడిని ఖండించరాదా అన్న ప్రశ్న వస్తోందిక్కడ. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని ‘షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ’ తన ప్రకటనలో ఖండించింది. ఇండియా ఆ ప్రకటనపై సంతకం చేయకుండా దూరం జరిగింది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం: గాజా ప్రాంతంలో వెంటనే బేషరతుగా కాల్పుల విరమణ జరగాలన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లోనూ భారత్ పాల్గొనకపోవడం. ఈ తీర్మానానికి అమెరికా భాగస్వాములైన ఆస్ట్రేలియా, జపాన్ , యూకేలతోపాటు 149 దేశాలు మద్దతిచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు 12 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ ఉద్దేశం ఏమిటి అంటే... ఇజ్రాయెల్, అమెరికాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వాస్తవిక రాజకీయం అనాలి. అయితే ఇది గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహించాలన్న భారత్ కాంక్షను తక్కువ చేసేది కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవిక రాజకీయం చేయడం మన సైద్ధాంతిక మార్గాన్ని తప్పినట్లు అవుతుంది. మన ట్రాక్ రికార్డులో మచ్చగా మిగులుతుంది. ఏ కూటమితోనూ జతకట్ట కూడదన్న అలీనోద్యమ స్ఫూర్తిని దెబ్బతీసినట్లవుతుంది.ప్రస్తుతం భారతదేశం చాలా సంతులనంతో వ్యవహరిస్తోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ మన విధానాన్ని స్పష్టం చేసేందుకు ఇదో మంచి అవకాశం కూడా. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను నడిపించే మూలభూత విలువలను నిర్వచించుకోవాల్సిన తరుణమిది. వ్యూహాత్మక స్వావ లంబన, దేశీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటివి అంతర్జాతీయ స్థాయిలో అసందిగ్ధతకు, పిరికితనానికి కారణం కారాదు. రష్యా–ఉక్రెయిన్ , ఇజ్రాయెల్– పాలస్తీనా– ఇరాన్ ఘర్షణలు భారత ఆర్థిక, దౌత్య, రాజకీయ నైపుణ్యానికి సవాలు విసురుతున్న మాట వాస్తవం. అజిత్ రానాడే వ్యాసకర్త ఆర్థికవేత్త -
నవీన్ పట్నాయక్ (మాజీ సీఎం) రాయని డైరీ
కొన్ని మాటల్ని మళ్లీ తలచుకున్నప్పుడు,సందర్భం మారి – అవి పట్టలేనంత నవ్వును తెప్పిస్తాయి! ‘‘నా ఒంట్లోని ప్రతి ఎముకా సెక్యులర్ ఎముక. ఆ సెక్యులర్ ఎముకల్లో ఒక్కటైనా దెబ్బతిని ఉంటుందని నేను అనుకోను’’ – అని నేను ఎప్పుడూ అంటుండే మాటను... ఇప్పుడీ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి బెడ్డుపై పడుకుని ఉండగా అనుకోటానికి లేకుండా పోయింది. వైద్యులు నా సెక్యులర్ వెన్నెముకకు శస్త్ర చికిత్స చేశారు మరి.‘‘పట్నాయక్ జీ! మీక్కొంచెం హుషారు రాగానే ఇవాళ గానీ, రేపు గానీ మీరు డిశ్చార్జ్ కావచ్చు...’’ అన్నారు డాక్టర్ రమాకాంత పాండా, నేనున్న గదిలోకి వచ్చి. డాక్టర్ పాండా నాకు చికిత్స చేస్తున్న వైద్యుడు కారు. నన్నిక్కడ కనిపెట్టుకుని ఉండ వలసిన వైద్యుల బృందానికి చీఫ్‌గా వచ్చిన వారు. అసలైతే ఆయన అరేబియా సముద్రానికి ఆవలా ఈవలా కూడా కార్డియాలజిస్టు.ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్. సరిగ్గా వారం, నాకు సర్జరీ జరిగి! సర్వికల్ ఆర్థరైటిస్ అన్నారు డాక్టర్లు. మొదట మెడ నొప్పి మొదలైంది. అక్కడి నుంచి భుజాలు, చేతులు, తల. ఆ తలనొప్పి భరించ లేనంతగా ఉంటుండేది. ‘‘చిన్న సర్జరీతో మీకు ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి పట్నాయక్ సర్...’’ అన్నారు డాక్టర్ రాజశేఖరన్. ఆయనే నాకు సర్జరీ చేసిన వైద్యుడు. కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రి నుంచి రప్పించారు. ‘‘మీ సర్జరీకి నాలుగు గంటల సమయం పట్టింది సర్...’’ అని – నేను కళ్లు తెరవగానే ఒక యువ డాక్టర్ వచ్చి చెప్పాడు. ఆ యువకుడు నా కోసం ఏర్పాటైన డాక్టర్ పాండా టీమ్‌లోని సభ్యుడు. ‘‘అవునా?!’’ అన్నాను, నిస్సత్తువ కనిపించ కుండా నవ్వుతూ చూస్తూ.‘‘అవును సర్, ఇంకొక విషయం కూడా ఉంది. లోపల మీకు సర్జరీ జరుగుతున్నంత సేపూ కోకిలాబెన్ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి ముంబైలో ఉన్నట్లు లేదు. భువనేశ్వర్‌లో ఉన్నట్లుంది’’ అన్నాడు నవ్వేస్తూ.ఆసుపత్రి బయటంతా నా కోసం ఒడిశా నుంచి వచ్చిన వారే ఉన్నారని చెప్పటం అది. ఆ మాటతో నా నిస్సత్తువ కాస్త తగ్గింది. వయసులో ఉన్నవారు రుతుపవనాల్లా వచ్చి, పరిసరాల్లోని ‘వృద్ధ’ వాతావరణాన్ని అప్పటికప్పుడు ఉల్లాసంగా మార్చేసి వెళతారు. ఐసీయూ నుంచి నన్ను షిఫ్ట్ చేశాక, మళ్లీ కనిపించాడు ఆ యువ డాక్టర్. ‘‘పట్నాయక్ సర్! ఉదయం నుంచీ నేను, నా... కో–డాక్టర్ మిస్ విభ మీ కోసం చూస్తూ ఉన్నాం...’’ అన్నాడు! ‘ఎందుకు?’ అన్నట్లు చూశాను. ‘‘తను మీతో ఒక సెల్ఫీ కావాలని అడుగుతుంటే, ‘సరే ఇప్పిస్తాలే. నువ్విక్కడే ఉండు’ అని తనను బయటే నిలబెట్టి నేను లోపలికి వచ్చాను...’’ అన్నాడు. హాయిగా నవ్వాన్నేను. పిల్లలు పనిగట్టుకుని మన మనసుకు నచ్చినట్లుగా మాట్లాడాలని చూడరు. అసలు వాళ్లు మాట్లాడటమే మన మనసుకు నచ్చినట్లుగా ఉంటుంది.వాళ్లు అలా మాట్లాడుతూనే ఉన్నారు... ‘‘పట్నాయక్జీకి శ్రీ మోదీ నుంచి ఫోన్...’’ అని చెప్పి డాక్టర్ పాండా ఆ యువ డాక్టర్లిద్దర్నీ నా రూమ్ నుంచి బయటికి పిలిపించుకున్నారు.మోదీజీ లైన్లోకి వచ్చారు. ‘‘నమస్తే మోదీజీ...’’ అన్నాను. ‘‘ఎలా ఉన్నారు నవీన్‌జీ...’’ అని ఫోన్లోనే రెండు నిమిషాల పాటు ఆయన నన్ను తన హృదయానికి గట్టిగా హత్తుకున్నారు. మునుపెన్నడూ ఫోన్లో ఆయన నన్నలా హత్తుకుని మాట్లాడినట్లుగా నాకు అనిపించ లేదు. బహుశా అప్పటివరకు నా గదిలో చల్లటి మాటలను వీచి వెళ్లిన ఆ రెండు యువ పవనాల మహత్యం అనుకుంటాను!! -
అక్షరం మీద ఆగ్రహం
అణచివేత, ఆంక్షలు బ్రిటిష్ ఇండియా కాలం నుంచి భారతీయ పత్రికారంగానికి అనుభవమే. ఎమర్జెన్సీ ప్రకటనపై రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సంతకం మరొకసారి బ్రిటిష్ కాలంనాటి నిర్బంధాలను పున రావృతం చేసింది. 1975 జూన్ 25 అర్ధరాత్రి భారత పత్రికా రంగం చీకటి తెరలోకి వెళ్లింది. 26న సెన్సార్షిప్ పేరుతో అణచివేత అధికారికంగా అమలైంది. ఆ రోజు నుంచి 1976 జనవరి 22 వరకు 272 పత్రికల మీద సెన్సార్ వేటు పడింది. 19 మాసాల తరువాత గాని పత్రికారంగం వెలుగు చూడలేదు. 1975లోనే తూర్పు గోదావరి జిల్లా, ధవళేశ్వరంలోని గోదావరి ఆనకట్ట బీటలు వారింది. ఆ వార్త సైతం సెన్సార్ కత్తెరకు గురైంది. 1976 జనవరి నాటి పార్లమెంట్ శీతకాల సమావేశాల వార్తలను కూడా సెన్సార్ చేసింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ తెచ్చిన సెన్సార్ షిప్ ఎంత గుడ్డిగా, నిరంకుశంగా సాగిందో చెప్పడానికి ఇవి చాలు. ఎన్ని కీలక వార్తలు కత్తెర పాలైనాయో ప్రఖ్యాత జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ ‘ది జడ్జిమెంట్’ పుస్తకానికి ఇచ్చిన అనుబంధంలో చూడవచ్చు. దీనికంతకూ బాధ్యత ఇందిరదే.జూన్ 26 ఉదయం ఇందిర ఆకాశవాణిలో ప్రసంగించారు. ప్రజాస్వామ్య విధానాలతో సాధారణ పౌరులకు మేలు చేయా లని అనుకుంటే ప్రతిపక్షాలు, పత్రికలు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని నేరుగా యుద్ధం ప్రకటించారు. ఆ రోజు నుంచే పత్రికలపై సెన్సార్షిప్ అమలులోకి వచ్చింది. అత్యధికంగా ఆంగ్ల దినపత్రికలు ఢిల్లీలోని బహదూర్ షా జఫర్ మార్గ్‌లోనే కేంద్రీకృతమై ఉండేవి. 25వ తేదీ అర్ధరాత్రి ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కన్నాట్‌ప్లేస్‌లోని ‘ది స్టేట్స్‌మన్ ’, ‘ది హిందుస్తాన్ టైమ్స్’, ‘ది ఎకనామికల్ టైమ్స్’, ‘ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’ పత్రికలు మాత్రం వెలు వడ్డాయి. కన్నాట్ ప్లేస్ ఢిల్లీ కార్పొరేషన్ పరిధిలో కాక ముని సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. మునిసి పాలిటీకి కరెంట్ కట్ చేయలేదు. కరెంట్ కోత నుంచి పొరపాటున బయపడిన మరో ఆంగ్ల దినపత్రిక ‘మదర్లాండ్’. ఈ పత్రిక ఎడిటర్ కెఆర్ మల్కానీని 25 రాత్రే జేపీ, మొరార్జీలతో పాటే అరెస్టు చేశారు. ఒక ఉగ్రవాదిని పట్టుకున్నంత హడావిడి చేశారు. కాని పత్రిక యాజమాన్యం 26న ప్రత్యేక అనుబంధం ప్రచురించింది. అదే ‘మదర్లాండ్’ ఆఖరి సంచిక అయింది. ఎమర్జెన్సీ విధింపు, అర్ధ రాత్రి అరెస్టుల వివరాలతో అనుబంధాన్ని తెచ్చారు. ఉత్కంఠతో ఉన్న ప్రజలు పది పైసల ఆ అనుబంధాన్ని, ఇరవై రూపా యలకు కూడా కొన్నారు. అంతవరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న ఐ.కె. గుజ్రాల్‌కు ఉద్వాసన పలికి, పత్రికలను బుద్ధిగా నడుచు కునేటట్టు చేయగలిగిన సమర్థుడు వీసీ శుక్లాను ఆ పదవిలో నియమించారు ఇందిర. పత్రికలు సెన్సారింగ్‌ను తీవ్రంగా నిర సించాయి. ఇందుకు పరాకాష్ఠ చర్య, సంపాదకీయం ప్రచురించే స్థలాన్ని ఖాళీగా ఉంచడం. వీసీ శుక్లా సమాచార మంత్రిగా ప్రమాణం చేసిన క్షణం నుంచి ఇందిర తొలి శత్రువుగా భావించిన ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ మీద యుద్ధం ప్రారంభించారు. నాటి సంపాదకుడు వీకే నరసింహన్ తన రచన ‘డెమాక్రసీ రిడీమ్డ్’లో అదంతా వివరించారు. మొదటి అడుగు ఎమర్జెన్సీ తొలినాళ్లలో ఎడిటర్‌గా ఉన్న మూల్గాంవ్‌కర్‌కు ఉద్వాసన పలి కించడం. ఆ పత్రికకు విద్యుత్ నిలిపివేశారు. ప్రభుత్వ ప్రకటనలు ఆపారు. ఢిల్లీ కార్యాలయాన్ని కూల్చడానికి ఉత్తర్వులు ఇచ్చారు. గుండె జబ్బుతో బాధపడుతున్న భగవాన్ దాస్ గోయెంకాను అరెస్టు చేస్తామని ఆయన తండ్రి, ఎక్స్‌ప్రెస్ అధిపతి రామ్‌నాథ్‌ను బెదిరించారు. అచ్చుకు వెళ్లే ప్రతి పేజీని సెన్సార్ అధికారులకు చూపాలని డీఐఆర్ 48 (1) నిబంధన విధించి ప్రీ సెన్సార్షిప్ను ప్రయోగించారు.పార్లమెంట్ ప్రసంగాలను ప్రచురించినందుకు ముంబై కేంద్రంగా వెలువడే వారపత్రిక ‘ఒపీనియన్ ’ (ఎ.డి. గొర్వాలే సంపాదకుడు)పై ప్రభుత్వం కక్షకట్టింది. పత్రికను ముద్రించడానికి ప్రెస్ లేకుండా చేశారు పోలీసులు. అయినా సైక్లో స్టయిల్డ్ పత్రికను తెచ్చారు. ఆఖరికి ఈ పత్రిక ప్రచురణనే ప్రభుత్వం నిషేధించింది. ఎమర్జెన్సీని, నాటి విధానాలను సీపీఐ బాహాటంగానే సమర్థించింది. ఈ పార్టీకి మద్దతుపలికే పత్రికగా ఖ్యాతి ఉన్న పత్రిక, ‘మెయిన్ స్ట్రీమ్’. నిఖిల్ చక్రవర్తి సంపాదకుడు. కానీ ఈ పత్రిక నాడు సీపీఐ వైఖరికి దూరంగా ఉంది. సంజయ్‌గాంధీని దృష్టిలో పెట్టుకుని పరోక్షంగా వెలు వరించిన ‘డు వుయ్ నీడ్ నెహ్రూ టుడే’ వంటి వ్యాసాలు సర్కార్‌కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ పత్రికను అచ్చువేసే ప్రెస్‌ను జప్తు చేశారు.ప్రపంచంలోనే ‘పంచ్’ తరువాత ఖ్యాతిగాంచిన కార్టూన్ల పత్రిక ‘శంకర్స్ వీక్లీ’. దేశం గర్వించదగిన కార్టూనిస్ట్ శంకర్‌పిళ్లై ఈ పత్రిక అధిపతి, ఎడిటర్. ఈ వీక్లీ 1975, అక్టోబర్‌లో మూతపడిపోయింది. కారణం – ప్రీ సెన్సార్ నిబంధన. వినోబా భావే ‘మైత్రి’, జయ ప్రకాశ్ నారాయణ్ ‘ఎవ్రీమ్యాన్స్’, ఫెర్నాండెజ్ ‘ప్రతిపక్ష’... ఎన్నో శాశ్వతంగానో, తాత్కాలికంగానో ప్రచురణ నిలిపి వేశాయి. తెలుగులో ‘సృజన’, ‘జాగృతి’, ‘పిలుపు’, ‘ప్రజాసమస్యలు’ ఆగిపో యాయి (తరువాత కొన్ని మళ్లీ ప్రచురణ ప్రారంభించాయి).ఎమర్జెన్సీ విదేశీ విలేకరులను కూడా విడిచి పెట్ట లేదు. అమెరికా వారే ఢిల్లీలో 15 మంది ఉంన్నారు. 25 మంది పశ్చిమ యూరప్‌వారు, 20 మంది తూర్పు యూరప్ దేశాల వారు పనిచేసేవారు. పీటర్ హాజెల్ హ్రస్ట్ (లండన్ టైమ్స్) తరెన్ జెండిన్ ్స (న్యూస్ వీక్) పీటర్ గిల్ (లండన్ డెయిలీ టెలిగ్రాఫ్)లకు 24 గంటలలో దేశం విడిచి వెళ్లమని ఆదేశించారు. విదేశీ పత్రికలు ఏదో మార్గంలో భారతదేశ వార్తలను ప్రచురించాయి.దేశంలో జరుగుతున్నదేమిటో సాక్షాత్తు ప్రధానికి తెలి యకపోవడానికి మూల కారణం సెన్సార్షిప్. సెన్సార్షిప్ను తొలగించమని 1975 జూలై 5న తనను కలిసిన ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్‌కు ఇందిర చెప్పిన సమా ధానం – దేశాన్ని రక్షించడానికి సెన్సార్షిప్ విధించానని (ఆరో తేదీ పత్రికలు ఈ విషయాన్ని వెల్లడించాయి). కానీ జరిగినదేమిటి మారుతి కారు ఉదంతం, స్నేహలతా రెడ్డి విషాదాంతం, పోలీసుల అరాచకాలు, ‘కిస్సా కుర్సీకా’, ‘ఆంధీ’ సినిమాల నిలిపివేతలు, బలవంతపు ఆపరేషన్లు, అరెస్టులు, తుర్క్‌మన్ గేట్, పోలీసు కాల్పులు, కూల్చివేతలు... అన్నీ సెన్సార్ ఇనుప తెర వెనుక ఉండిపోయాయి.డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త ‘జాగృతి’ సంపాదకుడు ‘ 98493 25634 -
అక్రమ యుద్ధాయుధం... క్రిప్టో!
‘‘నేనేం బిట్ కాయిన్‌కు లేదా మరే ఇతర క్రిప్టో కరెన్సీలకు అభిమానిని కాదు. నియంత్రణ లేని క్రిప్టో ఆస్తుల వల్ల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతాయి.’’ 2019లో ఇదీ డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయం. కేంద్ర బ్యాంకులు, ఐఎంఎఫ్ వంటి సంస్థలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక నేరాల నిపు ణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనతో అప్పు డాయన ఏకీభవించారు. క్రిప్టో అనేది సాంకే తికమైన ఒక నూతన ఆవిష్కరణ. ఈ కరెన్సీకి ఎలాంటి వాస్తవిక విలువ, ప్రభుత్వాల గుర్తింపూ లేవు. నల్ల ధన నిరోధక చర్యలను ఇది దెబ్బతీస్తుంది.మారిన ట్రంప్ ధోరణి2025 వచ్చేసరికి పరిస్థితి మారింది. క్రిప్టో కరెన్సీ లాబీ నుంచి ఎన్నికల ప్రచారానికి లభించిన మద్దతు, తన కుటుంబానికి బహుమ తులుగా అందిన పెట్టుబడులు... ట్రంప్ అవగాహనను మార్చేశాయి. ఇటీవలే ఆయన తన నూతన అవగాహనతో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఒకప్పుడు తప్పనిసరి అవసరం అనుకున్న నియంత్ర ణలు ఒక్క కలం పోటుతో తునాతునకలు అయ్యాయి. ఆ తర్వాత, ట్రంప్ కుటుంబం క్రిప్టో వ్యాపారంలోకి ప్రవేశించింది. టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న, తెరచాటు లావాదేవీలతో టెర్రరిస్టులకు నిధులను మళ్లిస్తున్న పాకిస్తాన్... స్వయంగా ఈ కుటుంబానికి ఒక వ్యాపార భాగస్వామిగా ఉంది. మరి అమెరికా నేతలే ప్రైవేటు కరెన్సీలు నడుపుతుంటే ఇండియా దాన్ని ఎలా భావించాలి? మాజీ ఖైదీలకు పునరావాసమా అన్నట్లు వారిని తన అధికారిక క్రిప్టో కౌన్సిళ్లకు వ్యూహాత్మక సలహాదారులుగా నియమించుకున్న దేశం గురించి ఎలాంటి అభిప్రాయానికి రావాలి? చాన్గ్ పెంగ్ ఝావో(చైనాలో పుట్టిన కెనడియన్) ‘బైనాన్స్’ కంపె నీకి మాజీ సీఈవో. మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడినందుకు యూఎస్ అతడిని జైల్లో పెట్టింది. తర్వాత 430 కోట్ల డాలర్లు చెల్లించి సెటిల్మెంటు చేసుకున్నాడు. హమాస్ వంటి గ్రూపులకు నిధులు చేరవేసే అక్రమ లావాదేవీలకు బైనాన్స్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ వీలుకల్పించింది. బైనాన్స్ గూడుపుఠాణీ బట్టబయలుతో ఝావో ఆర్థికంగా అంతమై ఉండాల్సింది. కానీ పాకిస్తాన్ అధికారిక ‘క్రిప్టో టాస్క్ ఫోర్స్’కు సలహాదారు అయ్యాడు. అలాగే జస్టిన్ సన్ (చైనా మూలాలున్న సెయింట్ కిట్స్ పౌరుడు) ట్రంప్ సంబంధిత ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’లో 3 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాడు.ఈ వ్యాపారవేత్త మీద అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఒక సివిల్ ఫ్రాడ్ కేసులో దర్యాప్తు జరిపింది. అలాంటిది రాజకీయ విరాళాల సేకరణ కార్యక్రమాలకు ఇప్పుడతడు ముఖ్య అతిథి. అక్రమ లావాదేవీలకు మార్గంఅమెరికాలో పలుకుబడి సంపాదించుకోవడానికి క్రిప్టో లావా దేవీలు సరికొత్త మార్గంగా మారుతున్నాయి. అర్హత లేని వ్యక్తులకు, ధూర్త దేశాలకు, వాటి పాలకులకు ఇదో గేట్ వేగా మారినట్లు కన బడుతోంది. ఈ దారిలో వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జొరబడు తున్నారు. ఇలాంటి వారి పట్ల ఒకప్పుడు కఠినంగా ఉండే వ్యవస్థాగత నియంత్రణ నేడు బలహీనపడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలపు షాడో ఫైనాన్సింగ్ (నియంత్రణ పరిధిలో ఉండని మధ్యవర్తుల ద్వారాబ్యాంకింగ్ కార్యకలాపాలు) కొత్త రూపంలో మళ్లీ తెర మీదకువచ్చింది. నేరుగా బ్యాంకుల ద్వారా కాకుండా, బ్లాక్ చెయిన్ టెక్నా లజీతో అక్రమ ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. శుద్ధ మైన పాలన అంటూ ప్రపంచ దేశాలకు ఉపన్యాసాలిచ్చే అగ్రరాజ్యా నికి ఇవేవీ పట్టవా? ఆర్థిక పారదర్శకతకు మంగళం పాడుతున్న క్రిప్టో టెక్నాలజీని ఇన్నోవేషన్ అంటూ రీబ్రాండింగ్ చేస్తున్నారు. భౌగోళిక రాజనీతి ఈ ముసుగులో కొత్త రూపం ధరిస్తోంది. విచ్చలవిడిగా ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను ఆమోదించడం వల్ల ప్రభుత్వాల ద్రవ్య సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. దీని వల్ల అక్రమ లావాదేవీలు వ్యాప్తిచెందుతాయనీ, వర్ధమాన దేశాల్లో విదేశీ పెట్టుబడుల రాకపోకలపై నియంత్రణ బలహీనమై కరెన్సీ మార్కెట్లు ఒడుదొడుకులకు గురవు తాయనీ ఆందోళన చెందుతోంది. ఎల్ సాల్వడార్, నైజీరియా, లెబనాన్లలో ఇదే జరిగింది. ఈ దేశాలు క్రిప్టో కరెన్సీతో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాయి. ముఖ్యంగా టెర్రరిస్ట్ గ్రూపులు బ్యాంకుల కళ్లు గప్పేందుకు క్రిప్టో కరెన్సీలను వాడుకుంటున్నాయి. ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పదేపదే ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. అయినా సరే పాకిస్తాన్‌కు ఈ సంస్థ క్లియరెన్స్ లభించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న ఇండియాకు ఇది నిజంగా ముప్పు. క్రిప్టోతో ‘ఇ–హవాలా’ వాడుకలోకి వచ్చింది. సరిహద్దు లతో సంబంధం లేకుండా రియల్ టైమ్‌లో గోప్యంగా నగదు బదిలీ చేయడం, ‘ఇ–హవాలా’ ద్వారా సాధ్యమవుతోంది. ఇండియా కఠినంగా ఉండాలి!సర్వసత్తాక, సార్వభౌమాధికారం గల ఏ దేశమైనా ప్రైవేటు కరెన్సీ చలామణీని ఏ రూపంలోనూ అంగీకరించకూడదు. భారతీయ రిజర్వు బ్యాంకు ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబించడం హర్షణీయం. క్రిప్టో కరెన్సీకి ససేమిరా అనడాన్ని పిరికితనం అనో, టెక్నోఫోబియా అనో భావించడం తగదు. వర్తమాన ప్రపంచంలో పెట్టుబడుల ప్రవాహాలను ఆయుధంగా వాడుకుని ఒక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడం సాధ్యమే. కాబట్టి ఇది జాతీయ భద్రతఅంశం. ఇలాంటి ఆర్థిక అస్త్రాల నుంచి దేశానికి రక్షణ కల్పించడానికే ఆర్బీఐ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే, ఆర్బీఐని లొంగదీయ డానికి తీవ్రంగా ఒత్తిడి వస్తోంది. ఫైనాన్షియల్ టెక్నాలజీలో ఇదో ఇన్నోవేషన్ అని చెబుతూ, దీనిపై ఆంక్షలను సడలించాలని ప్రపంచ క్రిప్టో వేదికలు కోరుతున్నాయి. క్రిప్టో కరెన్సీ లాభాల మీద ప్రస్తుతం ఆర్బీఐ అధిక పన్నులు విధిస్తోంది. దీనివల్ల క్రిప్టో పెట్టుబడులు విదే శాలకు తరలిపోకుండా నిరోధించాలని, ఇందుకోసం క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ తగ్గించాలని దేశీయంగా లాబీ జరుగుతోంది. పాత పద్ధతిలో భద్రతాపరమైన లోపాలు లేవా అంటూ వారు వాదిస్తు న్నారు. ఇందులో హేతుబద్ధత లేదు. ఇది ప్రమాదకరమైన వాదన. మరోవైపు అమెరికా కూడా దౌత్యమార్గాల్లో ఒత్తిడి చేస్తోంది.ఇండియా ఎట్టి పరిస్థితిలోనూ తలొగ్గకూడదు.క్రిప్టో కరెన్సీని అడ్డుకునేందుకు ఇండియా వ్యవస్థాగత నిబంధనలను రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలి. నిఘా, ఫోరెన్సిక్ దర్యాప్తు సామర్థ్యాలు, డిజిటల్ అస్త్రాలు సంసిద్ధం చేసుకోవాలి. క్రిప్టోను అడ్డు పెట్టుకుని ‘ట్రోజన్ హార్స్’ తరహాలోఆర్థిక వ్యవస్థ మీద దాడి జరిగితే, రక్షించుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉండాలి. ఆర్థిక రంగం భవిష్యత్తు అంతా డిజిటల్లోనే ఉండవచ్చు. అయినా ఈ రంగంలో మన ఉజ్జ్వల భవితకు అవసరమైన ప్రణాళికలు మన ప్రభుత్వమే రచించుకోవాలి. విదేశీ మార్కెట్ల పటాటోపం మీద ఆధారపడకూడదు. క్రిప్టో యుగంలో మన సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడమే ప్రధానం. సరిహద్దులు, సము ద్రాలు, గగనతలం, సైబర్ స్పేస్ రక్షణకు ఎలాంటి వ్యూహాత్మక చతురతను అవలంబిస్తామో అలాంటి తీరులోనే ఈ ఆర్థిక రక్షణ వ్యూహాలు ఉండాలి. క్రిప్టో ప్రస్తుతం ఒక భౌగోళిక రాజకీయ ఆయుధం. వ్యూహాత్మకంగా హాని చేయగల శక్తి దానికి ఉంది. దాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా మన ఆర్థిక వ్యవస్థను దుర్భేద్యంగానిర్మించుకోవాలి. - వ్యాసకర్త కార్పొరేట్ అడ్వైజర్, ‘ఫ్యామిలీ అండ్ ధంధా’ రచయిత (‘ద లైవ్‌మింట్’ సౌజన్యంతో)-శ్రీనాథ్ శ్రీధరన్ -
దేశమే జైలు!
స్వతంత్ర భారతావని చరిత్రలో 1975 నుంచి 1977 వరకు కొనసాగిన ఎమర్జెన్సీ పాలనలో అధికార దుర్వినియోగం జరిగింది. ప్రజాస్వామిక హక్కు లను కాలరాచారు. ప్రతిపక్షాల నిరసన గళాన్ని నొక్కేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. నాటి దుశ్చర్యలను పాలక పక్షం వల్లె వేస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ వాటిని తిరస్కరించగలదా? లేదు. అందుకే ‘‘మరి మీ మాటేమిటి? అంతకంటే ఎక్కువగానే మీరు ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిస్తున్నారు కదా’’ అంటూ ఎదురు దాడికి దిగుతోంది. ఈ దూషణల హోరులో ఆ భయానక దుర్ఘటనల నుంచి నేర్వాల్సిన పాఠాలు కొండెక్కే ప్రమాదం ఉంది.జైలు అనుభవాలుఎమర్జెన్సీలో ఆంతరంగిక భద్రతా నిర్వహణ చట్టం కింద 34,988 మంది, భారత రక్షణ చట్టం, నిబంధనల కింద 75,818 మంది అరెస్ట్ అయ్యారు. తమిళ నాడు కేడర్‌లో నేనప్పుడు 30 ఏళ్ల జూని యర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నాను. ఆకస్మి కంగా నన్ను నేనే జైల్లో వేసుకున్నట్లు ఫీల్ అయ్యాను. నా ఆలోచనలు మనసు లోనే బందీ అయ్యాయి. దేశ అత్యున్నత నేత జయప్రకాశ్ నారాయణ్‌ను తెల్లవారక ముందే మూడింటికి నిద్రలేపి జైలుకు తరలించారు. ఆ సమయంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏమిటో తెలుసా? ‘వినాశ కాలే విపరీత బుద్ధి’!మొరార్జీ దేశాయి, వాజ్‌పేయి, అడ్వాణీ, చరణ్ సింగ్, చంద్రశేఖర్ వంటి జాతీయ నాయకులను లోపల వేశారు. అప్పటి సీపీఎం విద్యార్థి నాయకులు ప్రకాశ్ కారత్, సీతారామ్ ఏచూరి, బీజేపీ అరుణ్ జైట్లీలనూ ఊచలు లెక్కపెట్టించారు. ఆ తర్వాత కొద్ది నెలలకు, అజ్ఞాతంలో ఉన్న జార్జి ఫెర్నాండెజ్‌ను పట్టుకున్నారు. ఆయన మద్దతుదారు స్నేహలతారెడ్డిని జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. పెరోలు మీద బయటకు వచ్చిన కొద్ది కాలంలోనే ఆమె చనిపోయారు. జైలు అనేది రాజ్యపు అత్యంత వికృత పార్శ్వం. ఇవన్నీ చూశాక ఈ భావన నాలో మరింత బలపడింది. నేను నా ఐఏఎస్ కెరీర్లో కలెక్టర్‌గా ఎప్పుడూ పనిచేయలేదు. దాంతో కారాగారాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలగలేదు. జైళ్ల స్థితిగతులను స్వయంగా తెలుసుకోవాల్సిందిగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఓసారి రాష్ట్రాల గవర్నర్లను కోరారు. నేరస్థుల దిద్దుబాటు గృహం (జైలు) ఎలా ఉంటుందో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న ఆ సమయంలో తెలుసుకున్నాను.ఒక జైలును చూడ్డానికి వెళ్లినప్పుడు, గడ్డం పెంచుకున్న ఓ యువకుడు నా దగ్గరకు వచ్చి హిందూస్థానీలో మాట్లాడాడు. ‘‘హుజూర్! నేను పాకిస్తాన్ వాడిని. నేను ఒక మొక్కు తీర్చుకోడానికి అజ్మీర్ షరీఫ్‌కు వెళ్లాలనుకున్నాను. నేను చేసిన పొరబాటల్లా ఒంటరిగా బయలు దేరడమే. దాంతో నన్ను టెర్రరిస్టుగా అనుమానించి నిర్బంధంలోకి తీసుకున్నారు. నేను మిమ్మల్ని ఏదీ కోరను, ఏ ఫిర్యాదూ చేయను. మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఈ జైల్లో పెట్టి ఇండియా నాకు మేలు చేసింది. ఇక్కడి లైబ్రరీలో నాకు పవిత్ర ఖురాన్ కనిపించింది. మొదటిసారి నేను ఖురాన్ మొత్తం చదివాను.’’ అతడికి ఏం బదులు చెప్పాలో అర్థం కాలేదు. వ్యంగ్యంగా అంటున్నాడా? నిజంగానే మెచ్చుకోలుగా అంటున్నాడా? ఎలా అయినా అతడు పూర్తి మేధావి.మరో దిద్దుబాటు గృహం సందర్శించాను. అక్కడి నుంచి వెనుదిరుగుతుండగా, కట్నం చావుల కేసులో శిక్ష అనుభవిస్తున్న వృద్ధురాలు కనబడింది. ఆమెను, అక్కడి ‘పాగల్ వార్డు’ను చూసి చలించి పోయాను. ఇంతలో అందులోని ఓ బెంగాలీ యువకుడు నన్ను ఆపి, ‘‘ఇక్కడ మాకు లైబ్రరీ ఉంది. దానికి మంచి పుస్తకాలు పంపించండి’’ అని అడిగాడు. మరోచోట, ‘‘సర్! ఒక్కరోజు ఇక్కడ టీవీ పెట్టించండి, వింబుల్డన్ ఓపెన్ చూస్తాం’’ అంటూ ప్రాధేయపడ్డారు. వారి కోరిక తీరింది. వారిలో హంతకులు, రేపిస్టులు, దొంగలు కూడా ఉంటారు. కానీ ఆ ఒక్కరోజు వాళ్లూ మనలాగే రఫేల్ నాదల్, రోజర్ ఫెదరర్ ఫ్యాన్లుగా మారి ఆనందించారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి!నేడు ఇండియలో ఎమర్జెన్సీ లేదు. కానీ జైలు అనే ‘హారర్ ఆఫ్ ది హారర్స్’ ఉంది. ఇది బాధా కరమైన వాస్తవం కాదా? ఇవ్వాళ మాత్రం ఇండియాలో రాజకీయ నిర్బంధితులు లేరా? మన రాజకీయ ఆర్థిక వ్యవస్థలో జైలు అనే ముప్పు ఇప్పటికీ పొంచి ఉందా లేదా? ఈ సమయంలో మనం రాజ కీయాలు చేయడం కంటే, చరిత్రను గౌరవించడం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీకి ఇదొక సువర్ణావకాశం. నాటి మానవ హక్కుల, రాజకీయ సంప్రదాయాల, న్యాయ విధానాల అతిక్రమణలు అన్నింటికీ ఆ పార్టీ సుస్పష్టంగా క్షమాపణ కోరాలి. ఎమర్జెన్సీ కాలంలో చెరసాల పాలైన వారిలో ఇప్పటికీ జీవించి ఉన్నవారిలో వయసులో పెద్దవాడు అడ్వాణీజీ. కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన్ని కలిసి వ్యక్తిగత క్షమాపణ చెప్పాలని అనుకోవడంలో తప్పేమైనా ఉందా? అలాగే ప్రభుత్వానికీ ఇది సువర్ణావకాశం. ఎమర్జెన్సీ భయానక ఘటనలను వల్లె వేయడం కంటే మించినది ఏదైనా తలపెట్టాలి. ఈ సందర్భంగా ‘రాజకీయ ఖైదీ’లను విడుదల చేయాలి. హింస, ద్వేషాలను రెచ్చగొట్టక పోయినా కేవలం రాజకీయ అభిప్రా యాల కారణంగా ఇక మీదట నిర్బంధించబోమని ప్రకటించాలి. తద్వారా, భారత శిక్షాచరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాలి. అంతకంటే మించిన అంశం: విచారణ కోసం ఎదురు చూస్తూ జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలను వారికి పడే గరిష్ఠ శిక్షలో సగం కాలం పూర్తి చేసుకున్నట్లయితే (మరణ శిక్ష విధించదగిన నేరాభియోగాలు ఉన్న వారిని మినహాయించి), నేర శిక్షాస్మృతి 436ఎ సెక్షన్ (భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని 479 సెక్షన్)ను సవరించి వారిని విడుదల చేయాలి.గోపాలకృష్ణ గాంధీ వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, ఆధునిక భారత చరిత్ర విద్యార్థి(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
క్షమాపణే లేదు... పొరపాటన్న మాటా!
సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ‘ఇందిరా గాంధీ అండ్ ది ఇయర్స్ దట్ ట్రాన్స్‌ఫామ్డ్ ఇండియా’ పేరుతో శ్రీనాథ్ రాఘవన్ ఒక పుస్తకం రాశారు. ఆమె జీవిత చరిత్రకు సంబంధించి దీనిని అత్యంత సాధికారిక మైన, ప్రగాఢమైన పుస్తకంగా చెబుతారు. ఎమర్జెన్సీని ‘స్వతంత్ర భారతదేశపు రాజకీయ చరిత్రలో ఏకైక అత్యంత బాధాకరమైన ఘట్టం’గా రాఘ వన్ అభివర్ణించారు. అది ఎంతటి భయానకమైన అనుభవా లను మిగిల్చిందో నేడు మనకు మనం గుర్తు చేసుకుందాం. ఎమర్జెన్సీకి సంబంధించిన చేదు వాస్తవాలు ఒళ్ళు గగు ర్పొడిచేవిగా ఉంటాయి. ఆంతరంగిక భద్రతా చట్టం (మీసా) కింద 34,988 మందిని నిర్బంధంలోకి తీసు కున్నారు. డిఫెన్స్ ఆఫ్ ఇండియా నిబంధనల కింద 75,818 మందిని అరెస్టు చేశారు. ఇంచుమించుగా మొత్తం ప్రతిపక్షాన్ని అంతటినీ కట కటాల వెనక్కి నెట్టారు. పత్రికలు సెన్సార్‌కు గురయ్యాయి. రాజ్యాంగాన్ని దారుణంగా సవరించారు. జీవించే హక్కును సస్పెండ్ చేశారని న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం పని అయిపోయినట్లేననీ, దానికి ఇంతటితో నీళ్ళు వదిలేసినట్లేననీ ఎమర్జెన్సీ తీవ్ర స్థాయికి చేరిన రోజుల్లో ఎల్కే అడ్వాణీ తన డైరీలో రాసుకున్నారు. ఆనాటి పరిస్థితుల్లో ఆయన అభిప్రాయంతో చాలా మంది ఏకీభవించి ఉంటారు. ఇందిరా గాంధీ తన రాజకీయ జీవితాన్ని కాపాడుకునేందుకే ఎమర్జెన్సీ ప్రకటించారనడంలో ఎవరికీ ఇసుమంత సందేహం లేదు. అప్పట్లో ఇందిరా గాంధీ ఎన్నికను అలహా బాద్ హైకోర్టు రద్దు చేసింది. దానిపై సుప్రీం కోర్టు షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చింది. ప్రభుత్వ పాలన చచ్చుబడేలా చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నించ బట్టి అత్యవసర పరిస్థితిని ప్రకటించవలసి వచ్చిందని ఇందిర చెప్పుకొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించవద్దని సైన్యానికి, పోలీసులకు జయప్రకాశ్ నారాయణ్ పిలుపు ఇవ్వడంతో గత్యంతరం లేక ఎమర్జెన్సీ ప్రకటించవలసి వచ్చిందని ఇందిర చెప్పుకున్నా, అది ఆమె తన చర్యను కప్పిపుచ్చుకునే సాకు గానే కనిపించింది. మొత్తానికి, 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని ‘రాజకీయ తిరుగుబాటు’గా శ్రీనాథ్ రాఘవన్ అభిప్రాయ పడ్డారు. ఎందుకంటే, రాజ్యాంగం ప్రకారం, ఒక సమయంలో ఒకే ఎమర్జెన్సీని ప్రకటించడానికి మాత్రమే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ యుద్ధం (1971) కారణంగా అప్పటికే బాహ్య ఆత్య యిక పరిస్థితి (ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ) అమలులో ఉంది. రెండు – మంత్రి మండలి చేసిన లిఖితపూర్వక సిఫార్సు మేరకు మాత్రమే రాష్ట్రపతి రాజ్యాంగంలోని 352వ అధికరణం కింద ఎమర్జెన్సీ విధించగలుగుతారు. ఆనాటి రాష్ట్రపతి ఫక్రు ద్దీన్ అలీ అహ్మద్ అంతవరకు వేచి చూడలేదు. ప్రధాన మంత్రి వ్యక్తిగత అభ్య ర్థన మేరకే ఆయన ఆ పని చేసేశారు. మూడు – సామూహిక అరెస్టులు చేయడం, జూన్ 25, 26 రాత్రుళ్లు పత్రికా సంస్థలకు విద్యుత్ సర ఫరా నిలిపి వేయడం వంటి పనులకు ‘చట్టపరమైన ప్రాతిపదిక లేదు. ఇదంతా ప్రధానమంత్రి ప్రోద్బలం మేరకే జరిగింది’ అని రాఘవన్ వ్యాఖ్యానించారు.పోనీ ఇందిరా గాంధీ చెప్పినట్లుగానే అప్పట్లో ‘భారత్ భద్రతకు తక్షణ ముప్పు పొంచి ఉందా?’ అని ప్రశ్నించుకుందాం. ఇంటెలిజెన్స్ బ్యూరో అటువంటి నివేదికను ఏమీ సమర్పించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ రకమైన సమా చారాన్ని దేనినీ హోమ్ మంత్రిత్వ శాఖకు తెలియబరచలేదు. అంటే... ఇందిరా గాంధీయే ఈ ఆంతరంగిక ముప్పు ఉన్న ట్లుగా ఒక సాకును సృష్టించుకుని ఉంటారా? ఔననే భావించ వలసి ఉంటుంది. సత్యం ఏమిటంటే... ప్రజాస్వామ్యం గురించి ఇందిరకు ఎన్నడూ ఉన్నతమైన భావన లేదని రాఘవన్ రాసిన పుస్తకం పేర్కొంటోంది. ‘ప్రజాస్వామ్యమే గమ్యం కాదు. అది కేవలం ఒకరు లక్ష్యం వైపు సాగడానికి ఉపయోగపడే వ్యవస్థ మాత్రమే. కనుక ప్రగతి, సమైక్యత లేదా దేశ అస్తిత్వాల కన్నా ప్రజా స్వామ్యం ముఖ్యమైంది ఏమీ కాదు’ అని ఆమె ఒకసారి వాయులీన విద్వాంసుడు యెహుదీ మెనూహిన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అనగానే చాలా మందికి రెండు ప్రచారో ద్యమాలు చప్పును గుర్తుకు వస్తాయి. ఒకటి – కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. రెండు – మురికివాడల నిర్మూలన. ఆ రెండింటికీ ఇందిర చిన్న కుమారుడు సంజయ్ నేతృత్వం వహించారు. తీరా, ఆ రెండూ ఎమర్జెన్సీ విశ్వసనీయతను,ఇందిర వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీశాయి. అయినా, సంజయ్‌పై ఇందిర ఎంతగా ఆధారపడ్డారంటే... వాటిని ఆమె పట్టించుకోలేదు. పైగా, సంజయ్ అన్నయ్య లాంటివాడంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య అధికారికంగా నమోదైంది. ఇందిరకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, సంజయ్‌ను గట్టి, అత్యంత విధేయుడైన మద్దతుదారునిగా ఆమె పరిగణించారు. ఇందిర ముఖ్య కార్యదర్శి పీఎన్ హక్సర్ మాటల్లో ‘ఆ అబ్బాయికి సంబంధించినంత వరకు ఆమె గుడ్డిగా వ్యవహ రించారు.’ ఎన్నికలకు ఇంకా ఒక ఏడాది గడువు ఉన్నప్పటికీ,అందరినీ ఆశ్చర్యపరుస్తూ 1977 జనవరిలో ఇందిరా గాంధీ ఎన్నికలకు పిలుపు నిచ్చారు. అవి ఆమె పాలనకూ, ఎమర్జెన్సీ అంతానికీ దారి తీశాయి. ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాననీ, ఎమర్జెన్సీ విధింపునకు చట్టబద్ధతను చేకూర్చగలననీ గట్టిగా నమ్మబట్టే ఆమె ఎన్నికలకు వెళ్ళి ఉంటారా? లేదా ఎమర్జెన్సీ ఒక తప్పిదమేనని ఆమె ఆ రకంగా అంగీకరించి, చేస్తున్న పులి స్వారీని విరమించి ఉంటారా?వాస్తవం ఏమిటంటే... ఎమర్జెన్సీ విధించినందుకు ఇందిరా గాంధీ ఎన్నడూ క్షమాపణ చెప్పలేదు. అలాగే అది ఒక పొరపాటనీ అంగీకరించనూ లేదు. వివిధ పార్శా్వలలో ఎమర్జెన్సీ తాలూకు ప్రభావం పట్ల మాత్రం ఆమె విచారం వ్యక్త పరిచారు. వాటిని ఆమె అధికార యంత్రాంగ మితిమీరిన చేష్టలుగా భావించారు. ‘ఎమర్జెన్సీ విధింపునకు సంబంధించి మీరు మరో విధంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా?’ అని పాల్ బ్రాస్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా 1978 మార్చి 26న ఆమెను ప్రశ్నించారు. దానికి ఆమె జవాబు ‘లేదు’ అనే పదంతో ప్రారంభమైంది. ఇంక అంతకన్నా సూటిగా చెప్పేది ఏమీ ఉండదనుకుంటా!కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చీకటి రోజులు ఆనాడు, ఈనాడు
మానవ సౌభాగ్యం కోసం ధనమూ, ప్రాణమూ కూడా తృణప్రాయంగా త్యాగం చేసేవారు ఒకరు; స్వార్థం, అధికారం కోసం అక్షరాన్ని, ఆలోచనను, జ్ఞానాన్ని, దేశాన్ని ఖైదు చేసేవారు మరొకరు. ఇద్దరికీ ‘సాక్షి’ ఈ వేదభూమి. అది 1975. దేశం అల్లకల్లోలంగా ఉంది. నిరుద్యోగం, ఆశ్రిత పక్షపాతం, అధిక ధరలు, అవినీతి, బాంబుల పేలుళ్లు... మొత్తం అలజడే. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఆంధ్ర రాష్ట్రాలలో నక్సల్బరీ ఉద్యమం ఊపు మీదుంది. అవినీతి, అన్యాయా లకు వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతంగా ఉంది. మన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఉక్కుపాదంతో అన్ని ఉద్యమాలను అణచి వేస్తున్నారు. ఆలోచనా పరుల మీద కుట్ర కేసులు పెడుతున్నారు.తిరుపతి ఎరుపుమయంతిరుపతిలో 1972లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ స్థాపించ బడింది. అప్పుడు నేను ప్రారంభ సభ్యుడిని. కొంత కాలానికి విద్యార్థి ఉద్యమంలో నేను ప్రముఖ పాత్ర వహించాను. నా మిత్రులు తిలక్, శైలకుమార్, శ్రీధర్, సాకం నాగరాజ, శివారెడ్డి తదితరులతో అనేక ఉద్యమాలు నడిపాం. అధిక ధరలు, అవినీతికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమాలు ఒకెత్తు. అశ్లీల సాహిత్యానికి వ్యతిరేకంగా కేవలం విద్యార్థి నులతో తిరుపతి పురవీధుల్లో జరిపిన ఊరేగింపు మరో ఎత్తు. తిరుపతి గోడల నిండా ఎర్రని అక్షరాలతో నేను, సాకం నాగరాజ విప్లవ నినాదాలు రాసి ఎర్ర తిరుపతిని ఆవిష్కరించాం.చిత్తూరు కుట్ర కేసు బనాయించి, త్రిపురనేని మధుసూదన్ రావు, భూమన్ తదితరులను అరెస్టు చేసినపుడు తిరుపతి కోర్టు ఆవ రణలో నా నాయకత్వంలో జరిగిన విద్యార్థి ఉద్యమం చూసి పోలీ సులే భయపడ్డారంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాదు హైకోర్టు తీర్పు వెలువరించింది. దాని ఫలితంగా 1975 జూన్ 25న ప్రధాని దేశంలో ఎమర్జెన్సీ విధించింది. అంతే... దేశానికి చీకటి రోజులు ప్రారంభం అయ్యాయి. జైళ్ల నోళ్లు తెరుచుకున్నాయి. ప్రశ్నించే వారిని, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేశారు. ఎక్కడ చూసినా నిశ్శబ్దం. భయం. కలాలు, గళాలు మూగబోయాయి.ఎమర్జెన్సీ విధించిన 4 రోజుల తర్వాత ఓ అర్ధరాత్రి పోలీసులు నన్ను, మా అన్న భూమన్‌ను, త్రిపురనేని, శివారెడ్డి, కోటయ్య, లాయర్ కృష్ణస్వామి, మిత్రులు శ్రీధర్, శైలకుమార్, చంద్రను అరెస్టు చేశారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ఉంచారు. ఉద యాన్నే టాయిలెట్‌కు వెళ్లాలని, అక్కడ తొట్టిలోని నీళ్లను చూస్తే కడు పులో దేవింది. నీళ్ళల్లో వందల పురుగులు. అది కడిగి ఎన్నేళ్లయిందో! ముషీరాబాద్ జైలు జీవితంఆ తర్వాత మా అందర్ని ఒక పాత వ్యానులో హైదరాబాదులోని ముషీరాబాద్ జైలుకు తరలించారు. విప్లవ నినాదాలు చేస్తూనే ప్రయా ణించాం, జైలు ఆవరణలోకి ప్రవేశించాం. మా అందర్నీ ఒకే బ్యార క్లో ఉంచారు. మేమందరం డిటెన్యూలము. నా నంబరు 27. ‘మీసా’ (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్టు) కింద అరెస్టు చేశారు. అంటే నేరస్థులం కాము. నేరం చేస్తామేమో అనే భయంతో ప్రభుత్వం ముందుగా అరెస్టు చేసింది. అప్పటికే జైలులో రాజకీయ ఖైదీగా ప్రొద్దుటూరు ఎం.వి. రమణారెడ్డి, కొందరు స్మగ్లర్లు, గూండాలు ఉన్నారు. ఆ తరువాత రోజు నుంచి నాయకుల ప్రవాహం మొదలైంది. వరుసగా ఆర్.ఎస్.ఎస్. నాయకుడు, ఎమ్మెల్సీ సూర్యప్రకాష్ రెడ్డి, అనంత పురం తరిమెల రామదాసురెడ్డి, జూపూడి యజ్ఞనారాయణ వచ్చారు. జైలులో సౌకర్యాల కోసం పోరాటం చేసి సాధించుకున్నాం.సీపీఎం, పౌరహక్కుల సంఘం నాయకులు, ఆర్ఎస్ఎస్, జనసంఘ్, ఆనందమార్గ్, సోషలిస్టు పార్టీ, జమైతే ఇస్లామ్, ముస్లిం లీగ్ – ఇలా అన్ని పార్టీల నాయకులూ అరెస్ట య్యారు. ఎమర్జెన్సీలో అరెస్టయిన రాజకీయ ఖైదీలలో వయసులో అందరికన్నా పెద్దవాడు మొరార్జీ దేశాయ్, అందరికంటే చిన్నవాడిని నేను.నా పక్క బ్యారక్‌లో ఎందరో పెద్దలు, ఉద్యమ నిర్మాతలు ఉండేవారు. తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, సుంకర సత్యనారా యణ, యలమంచిలి శివాజీ, తరువాత ఉప రాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు, గవర్నర్లు అయిన బి. సత్య నారాయణ రెడ్డి,వి. రామారావు, ఎన్. ఇంద్రసేనా రెడ్డి (ప్రస్తుతం త్రిపుర గవర్నర్), తుమ్మల చౌదరి వంటి ప్రముఖులు అందులో ఉన్నారు. ఇక వామపక్ష భావాలకు సంబంధించి ఎందరో! వరవరరావు, చెరబండరాజు, జక్కా వెంకయ్య, మదనపల్లెకు చెందిన మా మామ పలవలి రామకృష్ణారెడ్డి, పార్వతీపురం కుట్ర కేసుకు చెందిన నక్సలైట్ నాయకుడు నాగభూషణం పట్నాయక్, శ్రీకాకుళం నక్సల్బరీ పోరాట ప్రముఖుడు వై.కోటేశ్వర రావు, ‘విరసం’ సభ్యుడు యాదాటి కాశీపతి, తరిమెల నాగిరెడ్డి ప్రియ శిష్యుడు ఇమామ్, చల్లా చిన్నపురెడ్డి (దివంగత ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి తండ్రి), కాట సాని ‘గడ్డం’ నరసింహారెడ్డి (కాటసాని రాంభూపాల్‌రెడ్డి తండ్రి), బిజ్జం సత్యంరెడ్డి, అలాగే సి.వి. సుబ్బారావు, ‘పర్స్పెక్టివ్స్’ ఆర్కే (రామకృష్ణ), విను కొండ నాగరాజు, పిరాట్ల వెంకటేశ్వర్లు వంటి ప్రముఖులు ఎందరో జైల్లో ఉన్నారు. అనంతపురానికి చెందిన కామ్రేడ్ సూరి, పరిటాల రవికి బావ అయిన వడ్లమూడి కృష్ణారావును జైలుకు తెచ్చినపుడు శరీరం నిండా గాయాలు! పోలీసుల చిత్రహింసలకు సాక్ష్యం వారి శరీరాలు! అంతమంది పెద్దలు పరిచయం కావడం, వారి మధ్య ఉండటం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ జైలు ఓ పాఠశాలగా, ఒక విశ్వవిద్యాలయంగా నన్ను తీర్చిదిద్దింది. అది నిర్బంధం కాదు, నా జ్ఞానానికి బంధం అయింది. ఆ రోజు దేశ వ్యాప్తంగా లక్షకుపైగా జనాన్ని అరెస్టు చేశారు. మన రాష్ట్రంలోనే దాదాపు మూడు వేల మందిని నిర్బంధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వామపక్ష మహోద్యమ కెరటం జార్జిరెడ్డిని చంపాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఆర్ఎస్ఎస్ నారా యణదాస్ మాతోనే ఉండేవారు. వారిని చూస్తూ ఓ వైపు కోపం, బలవంతపు సహనం. మేము జైలులో ఉండగానే నక్సలైట్ ఖైదీలైన భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరితీశారు. 1975 డిసెంబరు 31న ఉరి అమలు జరిపారు. ఉరితీతకు వ్యతిరేకంగా రెండు రోజులు నిరాహార దీక్ష చేశాం. ఉరి తీయడానికి రెండు రోజుల ముందు నేను భూమయ్య, కిష్టాగౌడ్‌లను కలసి మాట్లాడాను. అది ఒక ఆనందం. వారి మరణం హృదయానికి శిక్ష.మేము జైలులో ఉండగానే కామ్రేడ్ కరణం నాగరాజు, సుంకన్న, మహదేవన్, నరసింహారెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్, నీలం రామచంద్రయ్య పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. విషాదాన్ని మౌనంగా జైలు గోడలకు, రాత్రి మూగగా వెలిగే దీపాలకు చెప్పుకుని చెమ్మగిల్లేవాళ్ళం. నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కె.జి. సత్యమూర్తి (శివ సాగర్) నా భుజం మీద చేతులు వేసి విప్లవ గీతాలు ఆలపించడం ఈనాటికీ మరువలేను. ఒక సాయంత్రం వాలీబాల్ ఆడుకుంటున్న సమయంలో వంగవీటి రంగా వాళ్లు, పింగళి దశర«థరామ్ను కొట్టడం జరిగింది. అపుడు మా డిటెన్యూలకు ‘మేయర్’ సత్యనారాయణ రెడ్డి. వారి దగ్గర మాట్లాడి, పింగళికి క్షమాపణలు చెప్పించాం. తప్పును అంగీకరించే సహృదయత ఆ రోజుల్లో ఉంది. సిద్ధాంతాలు వేరు కాని, మనుషులుగా ఒక్కటే అన్నది ఆనాటి అనుభవం.కటకటాల్లో కలిసిన బంధంజైలులో నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన వై.ఎస్. రాజారెడ్డి పరిచయం. మేము జైలుకు వెళ్లిన కొద్దిరోజుల తర్వాత రాజారెడ్డి, ఆయన పెద్ద కుమారుడు జార్జిరెడ్డి జైలుకు వచ్చారు. అప్పటికే ఆయన వయస్సు యాభై ఏళ్లు. నాకు సుమారు పదిహేడు ఉంటాయి. ఆయన గంభీరంగా కనిపిస్తాడు కానీ మాట్లాడితే సున్ని తమైన మనస్సు తెలుస్తుంది. మా ఇద్దరినీ చెస్ కలిపింది. ఆటలో ఆయన నిష్ణాతుడు. నాకు కొద్దిగా తెలుసు. అయిదారుసార్లు ఆయన ఓడిపోయారు. కొన్ని ఆటల తర్వాత నాకు అర్థమైంది, నన్ను గెలిపించటానికే ఆయన ఓడుతున్నాడని! జీవితంలో కూడా నన్ను ఎప్పుడూ గెలిపించాలనే ఆయన ఆరాటపడేవాడు. ఎందుకు ఏర్పడిందో ఈ బంధం! కటకటాల మధ్య బంధం, జీవిత అనుబంధమైంది. నేను మట్టిలో కలిసే వరకు ఇది గట్టిగానే ఉంటుంది. తాడిపత్రి దగ్గరి వెన్నపూసపల్లి గ్రామానికి చెందిన కామ్రేడ్ సూరి నాకు మంచి స్నేహితుడు. ఇద్దరం కలసి ఆసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి పోలీసుల కన్నుగప్పి పారిపోవాలని ప్రణాళిక వేశాం. ఆసు పత్రికి వెళ్లాం. కానీ విపరీతమైన బందోబస్తు. కుదరలేదు. ఈ రోజు అనుకుంటే నవ్వు వస్తుంది. జైలులో పశుపతి అనే వైద్యుడు ఖైదీల పట్ల దారుణంగా ప్రవర్తించేవాడు. ఒకరోజు నేను, కడపకు చెందిన మా సీమ రాజగోపాల్ రెడ్డి ఇద్దరం అతని మీద దాడి చేశాం. ఇక, జైలు ప్రధాన ద్వారం దగ్గరున్న చెట్టు కింద వెంకయ్య నాయుడు, వారి భార్య ముచ్చటగా ములాఖత్‌లో మాట్లాడుకోవడం ఇంకా గుర్తు. అప్పట్లో ఆయన చాలా అందంగా ఉండేవారు. జైలు అను భవాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. నేను మహాత్మాగాంధీ జీవిత చరిత్ర చదివింది జైలులోనే! గౌతు లచ్చన్న ఆ పుస్తకం ఇచ్చి చదవమన్నారు. జైలులో మేము ఓ లిఖిత పత్రికను నడిపాం. పత్రిక మొత్తం చేతితో రాసి సహచరులకు పంచేవాళ్ళం. అందులో మొదటిసారిగా నేను ఓ కవిత రాశాను. మొదటిది, ఆఖరిది అదే! అయితే ఆ కవితను అక్కడే ఉన్న కవి– విమర్శకుడు కె.వి. రమణారెడ్డి ఎంతో మెచ్చుకున్నారు.నాలుగు గోడల మధ్య దాదాపు రెండేళ్లు గడపవలసి వచ్చింది. దానివల్ల కొందరు అకస్మాత్తుగా మానసికంగా ఇబ్బందిపడేవారు. ఈ రోజు ప్రముఖులైన కొందరు నాయకులు ఆ రోజు, ‘ఇక ఇందిరా గాంధీ మనలను వదలదేమో, ఇక్కడే ఉండిపోవాలేమో’ అని బాధ పడటం, కుటుంబం కోసం చింతించడం నాకు తెలుసు. జైల్లో మాతో పాటు కదిరికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ అని ఒకరు ఉండేవాడు. తరచుగా ఆసుపత్రికి వెళ్లేవాడు. ఏ అనారోగ్యము లేదు. విషయం తెలిసి ఆశ్చర్యపోయాం. ఆసుపత్రిలోని ఓ వైద్యురాలిని ప్రేమించి, ఆ నిర్భంధంలోనే పెళ్లి చేసుకోవడం జరిగింది.రాజకీయంగా అభిప్రాయ బేధాలున్నా అందరం కలసిమెలసి ఉండేవారం. ఎవరికి వారు రాజకీయ పాఠశాలను నిర్వహించుకొనే వారు. వారి వారి సిద్ధాంతాలను వివరించేవారు. కవులు, రచయితలు, కళాకారులు, సిద్ధాంతకారులు అందరినీ ఒకేచోట కలుసు కోవడం, మాట్లాడటం నాకు ఇచ్చిన విజ్ఞానం ఎంతో గొప్పది. అప్రకటిత ఎమర్జెన్సీఏపీలో కూటమి పాలన వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అరెస్టులు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీ చూస్తుంటే అప్పటి ఎమర్జెన్సీ ఎంతో మేలని అనిపిస్తోంది. అది ప్రకటించిన ఎమర్జెన్సీ. ఇది ప్రకటించని ఎమర్జెన్సీ. ప్రశ్నిస్తే జైలు, మాట్లాడితే కేసు, కాదంటే దాడి, కదిలితే తూటా– ఇదీ నేటి వాస్తవం. అప్పుడు కారణంతో ఖైదు చేస్తే, ఇపుడు అకారణంగా ఖతం చేస్తున్నారు. పాత్రికేయుల కలా లను అధికారంతో శాసిస్తున్నారు. నవ్వితే 40 కేసులు పెట్టడం ఈ ముఖ్యమంత్రికే సాధ్యం. ఎమర్జెన్సీ కాలంలో యూత్ కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు నేర్చుకున్న దమన దహన రాజకీయం ఇదేనేమో! రాష్ట్రం రావణ కాష్ఠంగా ఉంది. 6 కోట్ల మందిని ఆరు బయటే ఖైదు చేసి చంద్రబాబు ఆనందిస్తున్నట్లుగా ఉంది. ఎమర్జెన్సీ తర్వాత ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఏమయిందో గుర్తు చేసు కోవాలని అధికార చంద్రునికి అనునయంగా గుర్తు చేస్తూ...భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
ఆ ‘చీకటి’ కోణానికి మరోవైపు...
1975 జూన్ 25న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. ఈ సంవ త్సరానికి యాభై ఏళ్ళు పూర్తయ్యింది! నిజానికి 1962 నుండి 1968 వరకూ మన దేశంలో ఎమర్జెన్సీ విధించబడిన విషయం మనకెవ్వరికీ తెలీదు. చైనా యుద్ధం వల్ల ఆనాటి ప్రెసిడెంట్ సర్వే పల్లి రాధాకృష్ణన్ దేశంలో ఆత్యయిక పరిస్థితిని విధించారు. అలాగే 1971 నుండి ’77 వరకూ బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో వి.వి. గిరి ఆత్యయిక స్థితి విధించారు. అంటే ఇందిరాగాంధీ మొట్ట మొదటిసారి ప్రమాణస్వీకారం చేసిన 1966లోనూ, రెండవ సారి ప్రధానైన 1971లోనూ మనదేశం అత్యవసర పరిస్థితు ల్లోనే ఉంది. అయితే ప్రజల మీద ఆ పరిస్థితి ప్రభావం లేదు.1975లో మొదటిసారి అంతర్గత ఎమర్జెన్సీ విధించ బడింది. అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఇందిరా గాంధీ మీద ఆ ‘మచ్చ’ ఇప్పటికీ తొలగిపోలేదు. అయితే 1975 నాటి పరిస్థితులు, రాజకీయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని ఈ చిన్న ప్రయత్నం.పాలనకు అవరోధాలు1966 జనవరి 24న ఇందిరాగాంధీ భారత ప్రధాని అయ్యారు. సోషలిస్టు భావాలున్న ఇందిరకు, కేపిటలిస్ట్ భావ జాలాన్ని బలపరిచే మొరార్జీ దేశాయ్ వంటి నాయకుల నుంచి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే వచ్చాయి.1962లో నెహ్రూ నాయకత్వంలో 361 సీట్లు గెలిచిన కాంగ్రెస్, 1967లో ఇందిర నాయకత్వంలో 243 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏదైనా సంపూర్ణ చికిత్స చేస్తే గానీ కాంగ్రెస్ నిలబడే అవకాశాలు కన్పించటం లేదు. ఆ సమయంలో ప్రధాని ఇందిర తన తండ్రి నెహ్రూ సంకల్పించి, అమలు చేయలేకపోయిన ‘ఆవడి’ కాంగ్రెస్ తీర్మానాలను దులిపి బయటకు తీసింది. ఉప ప్రధాని మొరార్జీ చేతుల్లో ఉన్న ఆర్థిక శాఖను తనే తీసేసుకుంది (ఫలితంగా మొరార్జీ ఉప ప్రధాని పదవికి రాజీనామా చేసేశారు).వెంటనే బ్యాంకుల జాతీయీకరణను ప్రకటించింది ఇందిరాగాంధీ. 1969 జూలై 15 నాటికి రూ. 50 కోట్లు మించి డిపాజిట్లున్న 14 బ్యాంకులను ప్రభుత్వపరం చేస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది. ‘దారిద్య్రాన్ని తొలగిద్దాం’ (గరీబీ హఠావో) నినాదంతో సొంత ఎజెండాను అమలుచేయటం ప్రారంభించింది. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఇందిర తెచ్చిన ‘బ్యాంకుల జాతీయీకరణ’ ఆర్డినెన్సును సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజభరణాలు (ప్రివీ పర్సులు) రద్దు చేస్తూ ఇందిర తీసుకున్న నిర్ణయాన్ని లోక్‌సభ ఆమోదించినా... రాజ్య సభలో పాస్ కాలేదు. మరోపక్క దేశాన్ని మిలిటరీ స్వాధీనం చేసుకుంటుందన్న పుకార్లు బలంగా వ్యాపించాయి. ఇక, 1974లో గుజరాత్‌లోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో హాస్టల్ మెస్ ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన విద్యార్థుల ఆందోళన... అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ (కాంగ్రెస్) వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందింది. పైకి ఈ ఉద్యమం చిమన్‌భాయ్ పటేల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు కనిపించినప్పటికీ, వాస్తవంగా ఇది ఇందిరా గాంధీ వ్యతిరేక ఉద్యమమే!సాక్షాత్తూ జయప్రకాశ్ నారాయణ్ రంగంలోకి దిగడంతో, దాని విలువ విపరీతంగా పెరిగింది. ఏనాడూ ఏ పదవీ ఆశించని ఈ గాంధేయ విప్లవకారుడు... గుజరాత్ ఉద్యమంలోకి రావటంతో ఇందిరకు కష్టాలు ప్రారంభమయ్యాయి.సరిగ్గా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవు తున్న 1975 జూన్ 12 నాడే... ఇందిర శిబిరంలో మరో బాంబు పేలింది. రాయబరేలీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ వంటి అగ్ర నాయకులు ఇందిర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో జయ ప్రకాశ్ నారాయణ్ మాట్లాడారు. అర్హత కోల్పోయిన ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వులను పాటించవద్దని మిలిటరీ, పోలీసులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు కాలేజీలకు వెళ్ళడం మానేసి, మరో స్వాతంత్య్ర పోరాటంలోకి దూకాలన్నారు.రాజ్యాంగానికి లోబడే...1975 జూన్ 25 అర్ధరాత్రి, ఆర్టికల్ 352(1) అనుసరించి భారత రాష్ట్రపతి ‘ఫక్రుద్దీన్ అలీ అహ్మద్’ దేశంలో అత్యవసర పరిస్థితి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతికి ఇందిర అత్యవసర స్థితిని సిఫార్సు చేసిన ఉత్తరంలోనే క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండానే ఈ సిఫార్సు చేస్తున్నాననీ, ఆ విధంగా చేయడం కూడా బిజినెస్ రూల్స్ ప్రకారం రూల్–12కి లోబడే చేస్తున్నాననీ ఆమె పేర్కొన్నారు. రేపు తెల్లవారగానే క్యాబినెట్ మీటింగ్ పెడ్తున్నానని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ విధంగా రాజ్యాంగానికి లోబడే అత్యవసర స్థితి ప్రకటించబడింది.ఎమర్జెన్సీ ప్రకటించిన నెల రోజుల్లోపే... అంటే 1975 జూలై 23న లోక్‌సభ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఆమోదించింది.రెండు రోజుల చర్చ తర్వాత 336 మంది అనుకూలంగానూ, 59 మంది వ్యతిరేకంగానూ ఓటు చేశారు.ఇప్పటికీ అదొక చీకటి రాజ్యమనీ, ఆమె ఒక నియంత అనీ, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందనీ, ఆమె వ్యతిరేకులు అంటూనే ఉంటారు. రాజ్యాంగంలోంచే ఆర్టికల్ 352 తీయ బడిందనీ, ఆ అధికరణం ప్రకారం ఎమర్జెన్సీ ప్రకటించటం రాజ్యాంగ విరుద్ధమెలా అవుతుందనీ నాలాంటి వాళ్ళకనిపించినా... కాంగ్రెస్ పార్టీయే ‘సారీ’ చెప్పాక అది తప్పే అయి వుంటుంది అనుకుని... ఇక మాట్లాడలేదు!యశపాల్ కపూర్ అనే ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ తన రాజీనామాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు జనవరి 13న పంపించాడు. 1971 జనవరి 25న ప్రెసిడెంట్ ఆమోద ముద్ర పడింది. ఆ ఉత్తర్వుల్లోనే జనవరి 14 నుంచి అతను ఉద్యోగంలో లేడని స్పష్టంగా ఉంది (విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్). అయినా 25కి ముందే ఆయన ఇందిర తరఫున పార్టీ మీటింగుల్లో పాల్గొన్నాడని ప్రధాని పదవి రద్దయిపోయింది. సుప్రీంకోర్టులో జస్టిస్ కృష్ణయ్యర్ వంటి జడ్జి ‘స్టే’ ఇచ్చినా ‘‘లెక్క చేయం... నువ్వు రాజీనామా చేయాల్సిందే’’ అనటం అంత పెద్ద నాయకుల స్థాయికి తగుతుందా? సరే... ఎమర్జెన్సీ ఎత్తేయటం, ఎన్నికలకు పిలుపు నివ్వటం, ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ పార్టీ ఓడిపోవటం... నిశ్శబ్దంగా అధికార మార్పిడి జరిగిపోవటం... ఈ చర్యలు కూడా ఆవిడ నియంతృత్వంలో భాగమేనా? దేశమంతా చీకటి పాలనకు వ్యతిరేకంగా ఓటువేస్తే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న మన రాష్ట్రంలో ఇందిర 42 సీట్లకు 41 సీట్లు ఎలా గెలిచింది! మనకి చీకటంటే అంత ఇష్టమా? అలాగే తమిళనాడు, కేరళ... దక్షిణ భారతంపై ఆ చీకటి ప్రభావం ఎందుకు చూపలేదు?ఎమర్జెన్సీని దేశప్రజలు అధిక శాతం వ్యతిరేకించారు. కానీ ఎమర్జెన్సీ విధించకుండా 1975 జూన్ 26 తర్వాత... కనీసం ఒక్కరోజైనా ఆమె పరిపాలించగలిగేదా? ఇందిరకు ఉన్న ప్రత్యామ్నాయాలు పరిమితం. ఒకటి: రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకోవడం, రెండు: పార్లమెంటును రద్దుచేసి వెంటనే ఎన్నికలకు పోవడం.ఇప్పటివరకూ ప్రధానమంత్రుల్ని దింపేయటం, ప్రధాన మంత్రులను చేయటం పార్లమెంటులో జరిగింది గానీ... రోడ్ల మీద ధర్నాలు, ఊరేగింపుల వల్ల జరిగితే ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది?1952 నుంచి ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ కూడా 50% ఓట్లు సంపాదించి గెలవలేదు. 1984లో ఇందిర హత్యానంతరం 404 లోక్‌సభ సీట్లు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్‌కు పోలైన ఓట్లు 50% లేవు. అలాంటిది, ఒక ‘స్టే’ చెయ్యబడ్డ, పూర్తిగా టెక్నికల్ అయిన కోర్టు తీర్పును అడ్డు పెట్టుకొని ప్రధాని గద్దె దిగాలంటే... ఎలాంటి దృష్టాంతం (ప్రిసిడెంట్) ఏర్పడుతుంది? స్వతంత్ర, జన్‌సంఘ్ వంటి క్యాపిటలిస్టు పార్టీలు సోషలిస్టు ఇందిరను ఎలాగైనా దింపె య్యాలి అనుకున్నప్పుడు... లొంగిపోవాలా? తిరగబడాలా?ఇందిరా గాంధీ తిరగబడింది. పర్యవసానంగా ఎన్నికల్లో ఓడిపోయింది. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన వారందరూ కలిసి రెండు ఏళ్ళలో ఏం పరిపాలన చేశారో కూడా దేశం చూసింది. ‘ఇందిరా కో బులావో, దేశ్ కో బచావో’ (ఇందిరను పిలవండి, దేశాన్ని కాపాడండి) అంటూ 1980లో మళ్ళీ ఆమెనే పిలిచి ప్రధాన మంత్రిని చేశారు.(ఇప్పటికీ 352 ఆర్టికల్ చిన్న సవరణతో అలాగే ఉంది. అంతర్గత అలజడులు (ఇంటర్నల్ డిస్టర్బెన్స్)కు బదులుగా సాయుధ తిరుగుబాటు (ఆర్మ్›్డ రెబెలియన్) అని సవరించడం గమనార్హం!)ఉండవల్లి అరుణ కుమార్ వ్యాసకర్త లోక్‌సభ మాజీ సభ్యుడు(కాంగ్రెస్) -
మరోసారి ఎమర్జెన్సీ రాకూడదు!
భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ఎమర్జెన్సీ. తన అధికారానికి ముప్పు రావ డంతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించి స్వతంత్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయా నికి తెరతీశారు. ప్రజాస్వామ్య పునరుద్ధర ణకు అనేకమంది ప్రతిపక్ష పార్టీల నాయ కులు, ప్రజాస్వామికవాదులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు గొప్ప పోరాటాన్ని నడిపారు. ఈ పోరాటంలో నేనూ భాగమయ్యాను. ఈ క్రమంలో ఏడాదికి పైగా జైలు జీవితం కూడా గడిపాను. ఎమర్జెన్సీ విధించి నేటికి (జూన్ 25) 50 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నాటి నా అను భవాలు ఈ తరానికి తెలియజేయడం సముచితమని భావిస్తున్నాను.అప్పుడు నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రచారక్. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జోన్లో భాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఎమర్జెన్సీ ప్రకటించిన మరునాడే ఆరెస్సెస్‌ను నిషే ధించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టేందుకు ‘లోక్ సంఘర్ష్ సమితి’ ఏర్పడింది. నేను కూడా అందులో భాగమ య్యాను. అజ్ఞాతంలోకి వెళ్లి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రజలను జాగృతం చేయాలని, ఎమర్జెన్సీ ఎత్తివేతకు ఉద్యమాలు నిర్వహించాలని ‘లోక్ సంఘర్ష్ సమితి’ నుంచి సూచనలు అందాయి. వెంటనే నా వస్త్రధారణ మార్చాను. తెల్లని లాల్చీ, పైజమా వేసుకునే నేనుఅందుకు భిన్నంగా షర్టు, ప్యాంటు, కోటు, టై, బూట్లు ధరించాను. పేరు కూడా ధర్మేంద్రగా మార్చుకున్నాను. జుట్టు కూడా పెంచుకొని మారువేషం కట్టాను. ఎమర్జెన్సీ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం, ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలులో ఉన్న నాయకుల కుటుంబాలకు సహాయం చేయడం మా పని.పత్రికలపై సెన్సార్ విధించడంతో ప్రజలకు ప్రభుత్వ వార్తలు తప్పితే, ఇతర ఏ రకమైన సమాచారం అందేది కాదు. మాకు అందిన రహస్య సమాచారాన్ని బులెటిన్ రూపంలో ప్రచురించి ప్రజలకు, కార్యకర్తలకు పంపిణీ చేసేవాళ్లం. ఒకసారి నిజామాబాద్ జిల్లా కామా రెడ్డి వద్ద రామేశ్వరపల్లి అనే గ్రామంలోని ఒక పెద్ద రామాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఇంజినీర్ వెంకట్ రామ్‌రెడ్డి వివాహం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు, అందరూ వ్రతంలో పాల్గొని ప్రసాదం తీసుకువెళ్లా లన్న సందేశం కార్యకర్తలకు వెళ్లింది. సుమారు 250 మంది కార్య కర్తలు, మద్దతుదారులు అక్కడకు చేరుకున్నారు. ఎలా తెలిసిందో ఏమో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు దీనిని పసిగట్టారు. పైన సమావేశ మందిరంలో మారువేషంలో ఉన్న నన్ను పోలీసు అధికారి గుర్తించి, పైకి వస్తున్న విషయాన్ని గమనించాను. అప్పుడు ప్యాంటు, టీ షర్ట్ ధరించి మెడలో శిలువ వేసుకొని తన పేరు జాన్‌గా మార్చుకొన్న ఏబీవీపీ నాయకుడు ప్రస్తుత త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి కూడా నా వెంట ఉన్నారు. నేను,ఇంద్రసేనా రెడ్డి ఆ ఆలయం వెనుకవైపున ఉన్న ఇరవై అడుగుల ఎత్తు ఉన్న ప్రహరీ గోడ దూకి అక్కడ నుంచి తప్పించుకున్నాం. మేం పారిపోయిన కొద్దిసేపటికే పోలీసులు కొందరు కార్యకర్తలను అరెస్ట్ చేసి ‘దత్తాత్రేయ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని’ ఒత్తిడి చేశారు.కొన్ని రోజుల తరువాత నేను, నాతో పాటు వరంగల్ విభాగ్ ప్రముఖ్ శ్రీధర్ జీ మారువేషంలో బెల్లంపల్లిలో ఒక చిన్న హోటల్లో భోజనం చేస్తున్నాం. సరిగ్గా అప్పుడే పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడం మొదలు పెట్టారు. శ్రీధర్‌జీ తన పేరు శ్రీధర్ అని ఒప్పుకున్నారు. నేను మాత్రం ‘దత్తాత్రేయ ఎవరో నాకు తెలియదు, నేను మాత్రం కాదు’ అని నిక్కచ్చిగా చెప్పాను. శ్రీధర్జీని ‘మీసా’ క్రింద అరెస్ట్ చేసి వరంగల్ జైలుకి తరలించారు. మరుసటిరోజు పోలీసులు డోసు పెంచారు. చిత్రహింసలు పెడ్తామంటూ బెదిరింపులకు దిగారు. ఇంతలో ఒక పరిచయస్థుడైన నిజామాబాద్ సెంట్రల్ ఇంటెలి జెన్స్‌లో పనిచేస్తున్న మురళి అనే హెడ్ కాని స్టేబుల్ అక్కడకు వచ్చాడు. వస్తూనే, ‘నమస్తే సార్.. బాగు న్నారా’ అని పలుకరించాడు. అంతటితో ఆగకుండా ‘దత్తాత్రేయ గారూ’ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. నేను అతడికి ప్రతిస్పందించడం గమనించిన పోలీస్ అధికారులు ‘నీ పేరు దత్తా త్రేయ కదా’ అంటూ మొత్తం మీద నన్ను ఒప్పించారు. మా కార్య కలాపాల గురించి, ఆదాయ మార్గాలు వంటి వాటి గురించి అడిగినా నేను సమాధానం చెప్పక పోవడంతో ‘మీసా’ కింద అరెస్ట్ చేసి హైదరా బాద్‌లోని చంచల్ గూడ జైలుకి తరలించారు.జైలులో ‘జన్‌సంఘ్’ నేతలు బంగారు లక్ష్మణ్, ఆలె నరేంద్ర... వరవరరావు, చెరబండ రాజు, ఎం.టి. ఖాన్, నాయిని నర్సింహారెడ్డి, కార్మిక నాయకులు చైతన్య, శీతల్ సింగ్ లష్కరి; ఇంకా జమాతే ఇస్లామీ, ఆనంద్ మార్గ్ సంస్థల నాయకులు ఉండేవారు. వారిలో అడ్వకేట్ రాజా బోస్ ఒకరు. మా సిద్ధాంతాలు వేరైనా మేమంతా కలిసి మెలిసి ఉండేవారం. ఇందిరా గాంధీ మమ్మల్ని ఎప్పటికీ విడు దల చేయరని, ఆమె శక్తిని సవాలు చేసే దమ్ము ఎవరికీ లేదని తోటి జైలు ఖైదీలు అంటున్న ప్పుడు రాజా బోస్ డ్రమ్స్ వాయిస్తూ... లెజెండరీ సింగర్ మహమ్మద్ రఫీ పాట ‘సవేరే వాలీ గాడీ సే చలే జాయేంగే...’ పాడుతూ మాలో కొత్త ఆశలు రేకెత్తించేవారు. కొన్ని రోజుల తరువాత మా పెద్దన్న మాణిక్ ప్రభు పచ్చ కామెర్లు సోకి మరణించారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి నాకు ఒక ఎస్కార్ట్ ఇచ్చి పంపించారు. మా అమ్మ ఈశ్వరమ్మ ఉస్మాన్ గంజ్‌లో ఉల్లిపాయల వ్యాపారం చేసేవారు. నేను జైలులో ఉన్నప్పుడు మా అమ్మ ములాఖత్‌లో వారానికొకసారి పండ్లు తీసుకొని వచ్చి నా క్షేమ సమాచారాలు తెలుసుకోవడమే కాదు, నాకు ధైర్యవచ నాలు కూడా చెప్పేది. ఒకసారి ములాఖత్‌లో ‘నువ్వు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనను అని అండర్ టేకింగ్ ఇస్తే విడిపి స్తానని మామయ్య హామీ ఇచ్చాడ’ని చెప్పింది. దానికి ‘నువ్వు ఏమ న్నావ’ని అమ్మను అడిగాను. ‘నా కొడుకు ఏమైనా ఎవ్వరి పిల్లనైనా ఎత్తుకుపోయాడా, దొంగతనం చేశాడా? ఏం తప్పు చేశాడని అండర్ టేకింగ్ ఇవ్వాలి?’ అని గట్టిగా ప్రశ్నించానని అమ్మ వివరించింది. ములాఖత్ సమయంలో రికార్డు చేసుకునేందుకు అక్కడ ఉండే స్పెషల్ బ్రాంచ్ అధికారి ఈ మాటలు విని ఎంతో ఆశ్చర్యపోయారు. మా అమ్మకు రెండు చేతులతో దండం పెట్టి మరీ మెచ్చుకున్నారు. నాకు ఎంతో స్ఫూర్తి నిచ్చిన ఈ సంఘటన జీవితాంతం గుర్తుంటుంది.జైలులో ఉన్నప్పుడు జైలర్ రామారావుతో నాకు మంచి సాన్ని హిత్యం ఏర్పడింది. 1977 సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమాచారం వారే మాకు తెలియజేశారు. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మాకు రామారావే ఎప్పటికప్పుడు సమాచారం అందించే వారు. ఇందిర, ఆమె తనయుడు సంజయ్ గాంధీ ఓటమి సమా చారం కూడా వారే మా చెవిన వేశారు. ఈ విషయం తెలి సిన వెంటనే రాజా బోస్ ‘సవేరే వాలీ గాడీ సే చలే జాయేంగే...’ పాట అందుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులు, వారు నియంతృత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.నాటి చీకటి రోజుల్లో తీవ్రమైన నిర్బంధం, ఆంక్షల మధ్య జరిపిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరా టాలను ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం మనపై ఉంది. మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలే తీసుకోవాలి. ఇందుకు ప్రజాస్వామ్యంలో నాలుగు మూల స్తంభాలైన శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియాను బలోపేతం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో మరో ఎమర్జెన్సీకి తావివ్వ కూడదు, మన గొప్ప ప్రజాస్వా మ్యానికి భంగం వాటిల్లనివ్వకూడదు. ఇది మన సమష్టి కర్తవ్యం.బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా గవర్నర్ -
ఎప్పటికీ గుణపాఠమే!
ఎమర్జెన్సీ యాభయ్యేళ్ల పూర్తిని గుర్తు చేసుకోవడా నికి రెండు బలమైన కార ణాలు. మొదటిది–స్వతంత్ర భారత చరిత్రలో ప్రజా స్వామ్యంపై తొలి అతి పెద్ద దాడి జరిగి యాభయ్యేళ్లు కావడం. రెండవది– ఎమర్జన్సీ విధించిన ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత అతి శక్తిమంతుడుగా, అంతకంటే బలిష్ఠుడుగా కీర్తనలందుకునే మోదీ ప్రస్తుత ప్రధానిగా ఉండడం. కాంగ్రెస్ విధానాలు, అంతర్గత వ్యవస్థ 1947–67 మధ్య బలహీనమవుతున్నాయి. ఎన్నిక లలో 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటములు కాంగ్రెస్‌ను ఓడించాయి. పశ్చిమ బెంగాల్లో సీపీఎం వరుసగా ఏకైక పెద్దపార్టీగా రాగలిగింది. ఇంటాబయటా సవా ళ్లను ఎదుర్కొన్న ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీ కరణ, రాజభరణాల రద్దు వంటి ప్రగతిశీల భంగిమలతో పాత నేతలను పక్కనపెట్టడం ప్రారంభించారు. బంగ్లాదేశ్ యుద్ధ విజయం ఆమె ప్రతిష్ఠను తారస్థాయికి చేర్చింది. దీంతో 1971లో ఆమె మధ్యంతర ఎన్నికలకు వెళ్లి బెంగాల్లో తప్ప అంతటా అఖండ విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బెంగాల్‌నూ చేజిక్కించుకోవాలని 1972లో సైన్యం సహాయంతో ప్రత్యక్షంగా ఎన్నికల రిగ్గింగ్‌కు పాల్ప డినప్పుడే ఎమర్జెన్సీకి పునాది పడింది. అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతి పురాణాల వంటి కారణాలతో ప్రజల్లో నిరసనలు రాజుకున్నాయి. 1974 రైల్వే సమ్మె, బీహార్‌లో జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ఉద్యమం కుదిపేశాయి. పాతకాంగ్రెస్, జనసంఘ్, ఆర్ఎస్ఎస్, సోషలిస్టులు కలసి జేపీ నాయకత్వంలో వేదికగా ఏర్పడితే సీపీఎం సమాంతరంగా ఉద్య మాలు చేస్తూ వచ్చింది. సీపీఐ అప్పటికి ఇందిరతోనే ఉంది. ఈ సమయంలోనే అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ సిన్హా రాయ్‌బరేలీ నుంచి ఆమె ఎన్నిక చెల్లదని తీర్పునివ్వడం సంక్షోభాన్ని పరాకాష్ఠకు చేర్చి, 1975 జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీకి దారి తీసింది. అదే రాత్రి∙ప్రతిపక్ష నేతల అరెస్టులూ జరిగిపోయాయి.అప్పుడు కర్నూలు ఉస్మానియా కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. అప్పటికే మిత్రుడూ, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌తో సహా చాలామంది అరెస్టులు జరిగిపోయాయి. ఏదో పర్యటనకు వెళ్లిన నాన్న నర సింహయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రాథమిక హక్కులు సస్పెండ్ అయిపోయాయి. జూలై 21న పార్లమెంట్లో ఎమర్జెన్సీ ఆమోదానికై చట్ట బద్ధ తీర్మానం చర్చకు పెట్టినప్పుడు సీపీఎం నాయకుడు ఏకే గోపాలన్ నిప్పులు చెరిగారు. ఆర్ఎస్ఎస్తో సహా అనేక రకాల ప్రతీప శక్తులనూ అతివాద దుస్సా హసికులనూ అణచివేసేందుకే ఎమర్జెన్సీ అనే అవా స్తవ కథనాలను తిరస్కరించారు. ‘ఇందిరే ఇండియా’ అంటూ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు బారువా చెలరేగి పోతున్నా... ఎమర్జెన్సీ బలహీనతే తప్ప బలం కాదన్నారు గోపాలన్. జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా నేను, మిత్రులు కలిసి విద్యాగోష్ఠి నిర్వహించాము. రాజకీయాలకు అవకాశం లేదు గనక ప్రజానాట్యమండలి పునరు ద్ధరణ కోసం విజయవాడలో జరిగిన సదస్సుకు వెళ్ళాను. ‘అసత్యాల అరణ్యాల్లో/ అతిశ యాల అంధకారంలో/ వాస్త వాల కాంతి కిరణాలు సోకేందుకు/ కళారూ పాలే కాంతి దీపాలని’ కవిత చదివి వినిపించాను. కర్నూలు పోలీసులు ఏవో ఫిర్యాదులు వచ్చాయని సిటీ బస్సుల నుంచి విద్యా ర్థులను దించేసి ఇష్టానుసారం కొట్టేస్తున్నారని నిరసనగా సంతకాలు సేకరించి కలెక్టర్, ఎస్పీలను కలిసి ఆపు చేయించాం. అమ్మ లక్షమ్మ మునిసిపల్ కార్మికుల్లో మహిళా సంఘంలో పని కొనసాగించింది. ఎంఎల్ గ్రూపులు, ఆరెస్సెస్‌లో ఉండే బంధు మిత్రులు ఆ దశలో కలసి వచ్చేవారు (ఆర్ఎస్ఎస్ అధినేత దేవరస్ కూడా ఇందిరాగాంధీకి మద్దతు నిస్తామంటూ లేఖ రాసిన వివరాలు తర్వాత బయ టకు వచ్చాయి). పాలకపక్షం ప్రజాస్వామ్యాన్ని వమ్ము చేస్తున్నప్పుడు దాన్ని కాపాడటం కీలకమనే సూత్రం అప్పుడు ప్రధానంగా పనిచేసింది. ‘ప్రజా శక్తి’ వారపత్రికగా అప్పట్లో నిర్వహించిన రాజకీయ పాత్ర అమోఘమైంది, ప్రభుత్వాన్ని పొగిడేందుకై వచ్చే కథనాలనే వ్యంగ్య శీర్షికలతో ఇచ్చేది. సెన్సా ర్కూ అందేది కాదు. 1977 మొదట్లో హఠాత్తుగా ఎన్నికల సందడి మొదలైంది. జనసంఘ్‌తో సహా చాలా ప్రతి పక్షాలు జనతా పార్టీగా ఏర్పడగా సీపీఎం, ప్రాంతీయ పార్టీలు బలపరిచాయి. నంద్యాలలో పోటీ చేసిన నీలం సంజీవరెడ్డికి మద్దతుగా సుందరయ్య గారి సభ ఏర్పాటైతే పదిహేను రోజులు అక్కడే ఉండి కారులో చుట్టుపక్కల పల్లెలన్నీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేశాను. మొత్తం మీద ఇందిరా,సంజయ్‌లతో సహా కాంగ్రెస్ ఓడి, ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. టెలిఫోన్ ఎక్సేంజిల దగ్గర బోర్డుపై ఫలితాలు ప్రకటిస్తుంటే ప్రజలు కేరింతలు కొట్టడం గుర్తుంది. ఎమర్జెన్సీ చివరలో ఉద్య మావసరాల రీత్యా మా నాన్న ‘ప్రజాశక్తి’కి వెళ్లి ఫలితాల వరకూ పనిచేశారు. అనుకో కుండా 1977 జూలైలో నేను వెళ్లి చేరా.జనతా హయాంలో 42వ రాజ్యాంగ సవరణ ఉపసంహరించ బడింది. సీపీఐ ఆత్మ విమర్శ చేసుకుని వామపక్ష ఐక్యతలో భాగస్వామి అయింది. అప్పటి పరిణామాలు, పార్టీల శక్తుల పాత్ర ఒక్క చోట చర్చించడం కష్టం గానీ నిరంకుశ పోకడలు ఎల్లకాలం సాగ వనేది కీలక పాఠం. ఇప్పుడు విశ్వగురు మోదీ పాలన ‘అప్రకటిత ఎమర్జన్సీ’లా ఉందనే మాట తరచూ వింటుంటాం కానీ అదీ పాక్షిక సత్యమే. ఎమర్జెన్సీ తీవ్రమైన తాత్కాలిక అపశ్రుతి లాటిదైతే... ఇది వ్యవస్థీకృత మైన ఏకపక్ష ధోరణి, హిందూత్వ మత రాజకీయం, కార్పొరేట్ శక్తుల కలయికకు తోడు అంతర్జాతీయంగానూ ద్రవ్యపెట్టుబడి ప్రాబల్యం, మిత వాద జాతి దురభిమాన శక్తుల పెరుగుదల నేపథ్యం. అందుకే ఇప్పుడు మరింత అప్రమత్తత అవసరం, ఎమర్జెన్సీని ఓడించిన విశ్వాసం ఎప్పటికీ స్ఫూర్తి. తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ పత్రికా సంపాదకులు -
ట్రంప్ ఏకధ్రువ ప్రపంచ కలలు
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్ష జోక్యానికి కారణం ఏమై ఉంటుందని విశ్లేషిస్తూ పోతే అంతిమంగా తోస్తున్నది ఒకటే. అది – క్రమంగా బలహీనపడుతున్న ఏకధ్రువ ప్రపంచాన్ని తిరిగి స్థిరపరచుకోవా లన్న అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నం. ఇరాన్ అణ్వస్త్రాల ఉత్పత్తికి సమీపంలో ఉందా దూరంగానా, శాంతి చర్చలకు సిద్ధమా కాదా, అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు అస్తిత్వ ప్రమాదం ఏర్పడిందా లేదా అనేవన్నీ పైకి కనిపించే మిథ్యా సంవాదాలు. ఇంతవరకు దౌత్య చర్చల తెర వెనుక దాగి తన యుద్ధ మంత్రాంగాన్ని సాగించిన ట్రంప్, ఇరాన్‌ను ఇజ్రాయెల్ ఓడించటం తేలిక కాదని అర్థమవుతుండటంతో, నిజ స్వరూపంతో తెర ముందుకు వచ్చారు. తాము, ఇజ్రాయెల్ ‘ఒక టీమ్‌గా పని చేస్తూ వస్తున్నా’మని ఎటువంటి దాపరికం లేకుండా, జూన్ 21 నాటి దాడుల తర్వాత 22న ప్రకటించారు. బిట్వీన్ ద లైన్స్ఎదుటిపక్షంతో చర్చలు జరుగుతుండగానే మధ్యలో వారిపై బాంబు దాడులు జరిపిన ఉదంతాలను ప్రపంచ దౌత్య చరిత్రలోనే ఎపుడైనా విన్నామా? ఇరాన్ అణుశక్తి కార్యక్రమంపై వారికి, అమె రికాకు అయిదు విడతల చర్చలు జరిగి ఆరవది ఈ నెల 15న జరగనుండగా రెండు రోజుల ముందు 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ అమెరికాకు చెప్పి మరీ దాడి చేసింది. ఈసారి నేరుగా అమెరికాయే దాడి జరిపింది. తమ దాడికి సరిగా ఒకరోజు ముందు స్వయంగా ట్రంప్ మాట్లాడుతూ, చర్చల కోసం వచ్చేందుకు ఇరాన్‌కు 15 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. అయినా మరునాడే దాడి చేశారు. ఇదే ఒక ద్వంద్వ నీతి కాదా? ఇంతకూ గత అమెరికన్ ప్రభుత్వాలు సాగించిన యుద్ధాలను తీవ్రంగా ఖండించి, తన హయాంలో ఆ పని జరగబోదని తన ఎన్నికల ప్రచార సమయం నుంచే పదేపదే హామీ ఇస్తూ వచ్చిన ట్రంప్, ఇపుడీ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది అసలు ప్రశ్న. పశ్చిమాసియాలో అమెరికాతో పాటు పాశ్చాత్య సామ్రాజ్య వాదపు ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ అవసరం ఎటువంటిదనే చర్చలు తరచూ జరిగేవే గనుక ఇపుడు తిరిగి చెప్పుకోనక్కర లేదు. కానీ అంతకుమించిన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. అవి స్వయంగా ట్రంప్ మాటలు, చేతల ద్వారా రూపుదిద్దుకుంటున్నవే. తన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదానికి, అమెరికా తన ఏకధ్రువ ప్రపంచాధిపత్య స్థాయిని కోల్పోతుండటానికి, ప్రస్తుతం ఇరాన్‌తో ఘర్షణకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇది కేవలం ఇజ్రాయెల్, ఇరాన్, అణు పరిశోధనలు, పశ్చిమాసియా, చమురు నిల్వలు, ఆ ప్రాంతపు భౌగోళికతలకు పరిమితమైనది కాదు. 21 నాటి తమ సైనిక శక్తి ప్రద ర్శనతో అమెరికా మొత్తం ప్రపంచానికి హెచ్చరికల సందేశం పంప దలచింది. తన ఏకధ్రువ ఆధిపత్యాన్ని సైనిక బలంతో నిలబెట్టుకో గలమని చెప్పటమే ఆ సందేశం.ఈ మాటపై సందేహం గలవారు 21 నాటి దాడుల తర్వాత మొదట ట్రంప్ చేసిన ప్రసంగాన్ని, తర్వాత అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ కురిల్లాతో కలిసి రక్షణమంత్రి పీట్ హెగ్సెట్ మీడియా సమావేశంలో అన్న మాటలను జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లిష్‌లో ‘రీడింగ్ బిట్వీన్ ద లైన్స్’ అనే మాట ఉంది. పైకి చెప్పే మాటల అర్థాన్నే గాక వాటి అంతరార్థాన్ని కూడా చూడటమన్నమాట. వారు ఇరాన్ అణు కేంద్రాల విధ్వంసం, శాంతి చర్చల రూపంలో ఇరాన్ తమకు బేషరతుగా లొంగటం, కాదని దాడులు జరిపితే సర్వనాశనానికి ఇరాన్ సిద్ధపడటం అని చెప్పేందుకే పరిమితం కాలేదు. ఆ తరహా దాడులు ఎంత ఘనమైనవో, తమ వంటి సైనిక శక్తి యావత్ ప్రపంచంలో మరే దేశానికి ఎట్లా లేదో, అటువంటి దాడులు మరెవరు ఎట్లా చేయలేరో ఒకటికి నాలుగుసార్లు కఠిన స్వరంతో, తీక్షణమైన ముఖ కవళికలతో చెప్తూ పోయారు. గత యుద్ధాల చరిత్రను గమనిస్తే సామ్రాజ్యవాదులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోదలచిన ప్రతిసారీ, లేదా అటువంటి ఆధిపత్యానికి సవాళ్లు ఎదురైన ప్రతిసారీ, అంతర్జాతీయ చట్టాలూ రూల్ ఆఫ్ లా అని తామే సృష్టించి జపించేవాటిని బాహాటంగా ఉల్లంఘిస్తూ, కేవలం సైనిక బలంతో ఆధిపత్యం కోసం సరిగా ఇటువంటి మాటలే చెప్తూ వచ్చారు. గత 10–15 సంవత్సరాలుగా తన ఆధిపత్యాన్ని క్రమంగా కోల్పోతూ మథనపడుతున్న అమెరికాకు, ఆ స్థాయిని తిరిగి చతురోపాయాలతో నిలబెట్టుకోవటం అన్నింటికీ మించిన పరమ లక్ష్యంగా మారింది.సామ్రాజ్యవాద డైనమిక్స్ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదాన్ని ప్రపంచం కేవలం ఆర్థిక సంబంధమైనదిగా చూస్తూ వస్తున్నది. తాను యుద్ధాలు ఆపానని, ఇంకా ఆపుతానని, శాంతి దూతనని చెప్పే మాటలను చాలామంది అమాయకంగా విశ్వసించారు. కానీ అర్థం చేసుకోని విషయాలు రెండున్నాయి. ఒకటి–తాము కోల్పోతున్నట్లు ట్రంప్ సరిగానే భావిస్తున్న గొప్పతనం చాలా వరకు సైనిక బలం ఆధారంగా సంపా దించినదే. రెండు – అట్లా కోల్పోవటం చారిత్రక పరిణామాల వల్ల ఏర్పడుతున్న సహజ స్థితి అని గుర్తించి అందుకు అనుగుణంగా సర్దు బాట్లు చేసుకోవటానికి బదులు, పూర్వ వైభవాన్ని సాధించాలనుకుంటే అందుకు చివరి ఆధారం తిరిగి సైనిక శక్తే అవుతుంది. అంతర్జాతీయ చట్టాలకు, నాగరికమైన ప్రజాస్వామ్య వ్యవహరణకు కట్టుబడే డైనమిక్స్ ఒక విధంగా ఉంటే, అన్నింటినీ ఒకవైపు వల్లిస్తూనే యథేచ్చగా ఉల్లంఘించే సామ్రాజ్యవాదపు డైనమిక్స్ ప్రస్తుతం మనం చూస్తున్న విధంగానే ఉంటాయి. అది ‘సామ్రాజ్య వాదం’ అనే వ్యవస్థలోనే అంతర్నిహితమై భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటా దర్శనమిస్తుంది.ప్రపంచంలోకెల్లా అతిగొప్ప ప్రజాస్వామ్యాలని చెప్పుకునే అమెరికా, బ్రిటన్లు, పశ్చిమాసియాలో ఏకైక ప్రజాస్వామ్యమని చాటుకునే ఇజ్రాయెల్‌ల అప్రజాస్వామిక చర్యల చరిత్ర ఒక ఉద్గ్రంథ మవుతుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు తమ సామ్రాజ్య వాద ప్రయోజనాల కోసం ఎన్నెన్నో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సీఐఏ, ఎంఐ–6ల ద్వారా కూలదోసి నియంతలను అధికారానికి తెచ్చాయి. అందుకు ఇరానే ఒక ముఖ్య ఉదాహరణ. అక్కడ ఎన్నికైన ప్రధాని మహమ్మద్ మొసాది చమురు బావులను జాతీయం చేయగా, తనపై 1953లో సైనిక కుట్ర జరిపించి షా పెహ్లవీ నియంతృత్వాన్ని తెచ్చారు. ఇపుడు ‘రెజీమ్ ఛేంజ్’ (ప్రభుత్వ మార్పిడి) పేరిట మరొక పెహ్లవీ వంశ వారసుడిని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.నిజానికి ట్రంప్ ‘మాగా’ నినాదంలోనే, పదవీ బాధ్యతలు స్వీకరించి తొలినాళ్ల నుంచి తీసుకుంటున్న చర్యలలోనే ఇదంతా తార్కికంగా కనిపిస్తుంది. వలసదారుల నిరోధానికి, పంపివేతకు సైన్యాన్ని నియోగించటం వరకు వెళ్లారు. ట్యారిఫ్ల యుద్ధంతో యావత్ ప్రపంచం ఒకేసారి తమకు పాదాక్రాంతం కావాలనుకున్నారు. రష్యా, చైనాల వద్ద అణ్వస్త్రాలతో కూడిన సైనిక బలం లేనట్లయితే గత కాలపు సామ్రాజ్యవాద పద్ధతులలోనే వనరులు, మార్కెట్ల కోసం దాడులు జరిపే వారే! టారిఫ్‌లకు సంబంధించి కాకున్నా, వనరులూ, మార్కెట్ల విషయమై ఆ రెండు దేశాలతో కాకున్నా, ఇతరత్రా సైనిక బలాన్ని ట్రంప్ మార్కు సామ్రాజ్యవాదం వినియోగిస్తూనే ఉంది. ప్రభుత్వాన్ని కూలదోస్తాం, మొత్తం దేశాన్నే రాతియుగపు పరిస్థితికి నిర్ధూమధామం చేస్తాం అనే హెచ్చరికలన్నీ కేవలం అమెరికా సైనిక శక్తిని కేంద్రం చేసుకున్నవి కావా? ఆఫ్రికాలోని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్‌ను కొనసాగిస్తామనటం అక్కడి అపారమైన వనరుల కోసం కాదా? బహుళ ధ్రువ ప్రపంచం కోసం ఆర్థిక ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్న బ్రిక్స్, డీ–డాల రైజేషన్లను బాహాటంగా బెదిరిస్తూ చిన్న దేశాలపై సైనికమైన ఒత్తిడి తేవటంలో కనిపించేది సైనిక శక్తి కాదా? అందువల్ల ట్రంప్ ‘మాగా’ నినాదాన్ని ప్రపంచం కొత్త దృష్టితో చూడటం అవసరం. ఈ జూన్ 21 నాటి బంకర్ బస్టర్ల సైనిక బల సందేశం, క్రమంగా బలపడు తున్న బహుళ ధ్రువ ప్రపంచానికి సామ్రాజ్యవాదపు ‘బిట్వీన్ ద లైన్స్’ సందేశం!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చిత్రసీమలో వీరిద్దరూ ఇద్దరే!
శ్రీశ్రీ అభ్యుదయ కవిగానూ, ఆత్రేయ ప్రముఖ వచన నాటక కర్తగానూ లబ్ధప్రతిష్ఠులయిన తర్వాతనే సినీ రంగ ప్రవేశం చేశారు. 1950లో ‘ఆహుతి’ (మూలం: నీరా ఔర్ నందా) అనే డబ్బింగ్ సినిమాతో శ్రీశ్రీ, 1951లో ‘దీక్ష’ చిత్రంతో ఆత్రేయ ‘సింగిల్ కార్డ్స్’తో చిత్రసీమలో ప్రవేశించారు.శ్రీశ్రీ అభ్యుదయ భావజాలానికి, ఆత్రేయ మనసు పాటలకు ప్రసిద్ధులు కావడం వలన ‘తోడికోడళ్లు’ చిత్రంలో ఆత్రేయ రాసిన ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చాన...’ అనే పాట శ్రీశ్రీ రచనగానూ, ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి శ్రీశ్రీ రాసిన ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము’ అనే పాటను ఆత్రేయదిగానూ భ్రమించి చాలామంది పందేల వరకు వెళ్లారు. శ్రీశ్రీ ‘పాడవోయి భారతీయుడా’ అనే తన సినిమా పాటల సంకలనంలోనూ ఈ భ్రమను ప్రస్తావించారు.‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా...’ అనే పాట మొదటిసారి తెలుగు సినిమా పాటకు జాతీయ బహుమతి గౌరవాన్ని దక్కించింది. అంతటి ప్రతిష్ఠాత్మకమైన పాటలో ‘ప్రతి మనిషి తొడలుగొట్టి... సింహాలై గర్జించాలి’ అనేచోట వ్యాకరణ దోషాన్ని తనే గ్రహించి శ్రీశ్రీ బహువచనాన్ని ఏక వచనంగా మార్చి ‘సింహంలా గర్జించాలి’ అని దిద్దుకున్నారు. ఆత్రేయ కూడా ‘శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యం’(1960) చిత్రంలో ‘ఎవరో?... అతనెవరో?’ అనే పాటలో ‘కరుణజూపి కబురు తెలిపి రమ్మనవా’ అనే పంక్తిలో ‘కబురు’ అనే ఉర్దూ పదాన్ని ప్రయోగించినందుకు కలత చెంది, గురుతుల్యులు మల్లాది రామకృష్ణ శాస్త్రి ‘ఫరవాలేదు, అప్పుడు బీబీ నాంచారి ఉందిగా!’ అని సమర్థించే వరకు ఊరట చెందలేదు. ఈ రెండు సంఘటనలు సినీ గేయ రచనలో కూడా శ్రీశ్రీ– ఆత్రేయల నిర్దుష్టతను, నిబద్ధతను తెలియజేస్తాయి.పద్మనాభం నిర్మించిన ‘దేవత’ చిత్రంలో ‘బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక’ అని పాట పల్లవిని వీటూరి రాశారు. దానిని నిర్మాత కోరిక మీద వీటూరి... శ్రీశ్రీకిస్తే ఆయన ఆ పాటను పూర్తి చేశారు. శ్రీశ్రీ ఈ విషయమై వీటూరికి స్వయంగా కృతజ్ఞతలు చెప్పడమేగాక, ‘పాడవోయి భారతీయుడా’ పుస్తకంలో కూడా వెల్లడించారు. ‘గోరింటాకు’ చిత్రంలో ‘కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి...’ అనే పాట పల్లవి వరకు మాత్రం వేటూరి రాయగా, చరణాలన్నింటినీ రాసిన ఆత్రేయ ‘క్రెడిట్స్’లో వేటూరి పేరును వెయ్యడానికి అంగీకరించడం ఇటువంటి ఉదాహరణమే!సినీ గేయ కవులు పాటలు రాయడానికే ప్రాధాన్యమిస్తారు. కానీ పద్య ప్రేమికులైన శ్రీశ్రీ, ఆత్రేయ సందర్భం దొరికితే సాంఘిక చిత్రాల్లో కూడా పద్యాలను రచించి ఆ ప్రక్రియ పట్ల తమ మక్కువను చాటుకున్నారు. శ్రీశ్రీ ‘కులగోత్రాలు’ ‘పంతులమ్మ’ వంటి చిత్రాల్లో పద్యాలు రాయగా; ఆత్రేయ ‘మనసే మందిరం’, ‘ప్రేమ్ నగర్’, ‘అమర దీపం’, ‘కల్యాణ మంటపం’ ఇత్యాది చిత్రాల్లో పద్యాలను రాశారు.ఆత్రేయ తన సొంత చిత్రం ‘వాగ్దానం’లో శ్రీశ్రీ పట్ల గౌరవంతో రెండు పాటలను రాయించారు. వాటిలో ‘సీతా స్వయంవరం’ హరికథ ఒకటి. ఈ హరికథలో వినాయక స్తోత్రం, పోతన భాగవత పద్యంతో పాటు కరుణశ్రీ ‘ఫెళ్లుమనె విల్లు...’ అనే పద్యం కూడా తనవి కావనీ, ‘కరుణశ్రీ’ పద్యాన్ని ఉపయోగించినందుకు ఆయనకు క్షమాపణలు చెప్పుతున్నాననీ శ్రీశ్రీ ‘పాడవోయి భారతీయుడా’లో వెల్లడించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఆత్రేయ ‘వాగ్దానం’ చిత్రం తీసి చేతులు కాల్చుకున్నట్టే, శ్రీశ్రీ ‘చెవిలో రహస్యం’ అనే డబ్బింగ్ చిత్రం తీసి దారుణంగా నష్టపోయారు.శ్రీశ్రీ, ఆత్రేయ – ఇద్దరూ వామపక్ష భావజాలం గల కవులు. శ్రీశ్రీ భార్య కోరిక మేరకు సత్యనారాయణ వ్రతం చేస్తే విమర్శకులు ఆయనను దుయ్యబట్టారు. ‘వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి వారి సొంతం’ అని శ్రీశ్రీ తన చర్యను సమర్థించుకున్నారు. అలాగే మధ్యంతర ఎన్నికలలో తన నాటకాలతో కమ్యూనిస్టు పార్టీ కోసం ప్రచారం చేసిన ఆత్రేయ ‘శ్రీ షిర్డీ సాయిబాబా మాహాత్మ్యం’ చిత్రానికి ఆణిముత్యాల్లాంటి పాటలను రాసి, అజ్ఞాని అయిన తన చేత ఆ బాబాయే ఆ పాటలను రాయించుకున్నారేమోనని ఆత్మీయుల దగ్గర సందేహాన్ని వ్యక్తం చేసేవారట!శ్రీశ్రీ – ఆత్రేయల మధ్య భావసారూప్యం వారి జన్మాంతర అనుబంధమేమో అనిపిస్తుంది. శ్రీశ్రీని ఆత్రేయ గురుతుల్యునిగానే భావించేవారు. ఒక పరిశోధకుడు శ్రీశ్రీ గురించి వ్యాఖ్యానిస్తూ, ఆయన ‘వయసొచ్చిన పసివాడు’ అన్నారు. ఆ వ్యాఖ్య ఆత్రేయకు కూడా అన్వయిస్తుంది. జనసామాన్యానికి తెలియని గొప్ప వ్యక్తిత్వాలు కలిగిన ఈ కవి ద్వయం తెలుగు సినీ రంగంలో రెండు మహోన్నత శిఖరాలు!డా‘‘ పైడిపాల వ్యాసకర్త సినీ గేయ సాహిత్య పరిశోధకులు ‘ 99891 06162 -
ఇది దుస్సాహసాల యుగం
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగింది. కానీ అదంత తేలిక కాలేదు. ఇప్పటికీ తన లక్ష్యం సాధించలేక పోయింది. చైనాపై ఆధారపడటం అనివార్యమైంది. ఇటీవలి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు దాన్ని మరీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే రష్యా ఏం ఓడలేదు. పైగా, 2022 ఫిబ్రవరి తర్వాత ఎన్నడూ లేనంత బలీయంగా ఇప్పుడు రూపొందింది. అంతర్జాతీయంగా రష్యాను ఏకాకి చేయాలన్న పథకం నీరుగారి పోయింది. ఈ పథక రచనలో ప్రధాన సూత్రధారి అమెరికా భంగపడింది. ఎలాగోలా రష్యాతో ఒప్పందం చేసుకోవాలని ఈ అగ్రరాజ్యం ఇప్పుడు అంగలారుస్తోంది. యూరోపియన్ యూనియన్ భద్రత మీద, ఉక్రెయిన్ సార్వభౌమికత మీద చేస్తున్న వ్యయం తగ్గించుకోవాలని భావిస్తోంది. యుద్ధం ద్వారా కాకుండా దౌత్యంతోనే ఈ ఊబి నుంచి బయటపడాలనుకుంటోంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇందుకు ససేమిరా అన్నా ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. ‘దుస్సాహసం ఫలిస్తుంది’ అన్నది పుతిన్ తన అనుభవాల నుంచి నేర్చుకున్నపాఠం. ఒక దేశం మీద దండెత్తాడు. ఇప్పటిదాకా నెగ్గుకొచ్చాడు. మరింత ఉక్రెయిన్ భూభాగంపై పట్టు సాధించగలనన్న, తద్వారా తన విదేశాంగ విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి రష్యాకు సమకూరుతుందన్న, తూర్పు మధ్య యూరప్ ప్రాంతాల భద్రతకు ఢోకా ఉండదన్న ఆలోచన ఇలాగే కొనసాగవల్సిందిగా పుతిన్‌ను పురిగొల్పి ఉంటుంది. దుస్సాహసం ఫలిస్తుంది!గాజా మీద ఇజ్రాయెల్ దురాక్రమణకు దిగింది. హమాస్ టెర్రరిజం ప్రస్తుత సంక్షోభానికి పురిగొల్పింది అనడంలో సందేహం లేదు. అయితే, అందుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మితిమీరి ప్రతిస్పందించింది. అంతర్జాతీయ విశ్వసనీయతను కోల్పోయింది. ఇజ్రాయెల్ అంటే అదో జాతి నిర్మూలన శక్తి అని ప్రపంచవ్యాప్తంగా ఒక తరం మనస్సులో శాశ్వతంగా ముద్ర పడింది. ఈ దాడి ఆ దేశ వనరులను హరించివేసింది. పొరుగున ఉన్న అరబ్బు దేశాలతో సాధారణ సంబంధాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక భద్రత కూడా ప్రమాదంలో పడినట్లే!అయితే ఇజ్రాయెల్ ఏం ఓడలేదు. ఆ దేశపు దూరదృష్టి లేని వ్యూహకర్తలు కోణం నుంచి చూస్తే, హమాస్ నాయకత్వాన్ని తుదముట్టించడంతో పాటు వారి సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ ఈ పోరులో విజయం సాధించింది. హెజ్బొల్లా నాయకత్వాన్ని, సైనిక సదుపాయాలను నిర్మూలించి, లెబనాన్ పాలనలో మార్పు తెచ్చింది. సిరియా ప్రభుత్వ మార్పుకు పరోక్షంగా దోహదపడింది. నెతన్యాహూ ఇలాగే ముందుకు సాగి ఇరాన్ మీద దాడి చేశాడంటే అందులో ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు తీర్చిదిద్దుతాయి. పుతిన్ అనుకున్నట్లే, నెతన్యాహూకు కూడా అతడి అనుభవం పాఠం నేర్పింది. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలను అన్నింటినీ ఉల్లంఘించాడు. యుద్ధఖైదీ అభియోగం మోపి అరెస్టు చేయాలన్న ఇంటర్నేషనల్ వారెంటును పట్టించుకోలేదు. పాలస్తీనా కలలను చిదిమివేసిన అనుభవమే మరో దేశంపై దండెత్తడానికి, ఆ దేశ అణుశక్తి కార్యక్రమాలను వమ్ము చేయడానికి, అక్కడ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నెతన్యాహూను పురిగొల్పి ఉంటుంది.ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోయినా...వీగర్ల స్వయంప్రతిపత్తి ప్రాంతమైన షిన్జియాంగ్ను చైనా జైలుగా మార్చేసింది. టిబెట్‌లో జనాభా స్వరూప స్వభావాలను మార్చింది. హాంకాంగ్‌ను హస్తగతం చేసుకుని రెండు వ్యవస్థల విధానాన్ని అమలు చేస్తామన్న చట్టబద్ధ హామీని విస్మరించింది. సౌత్ చైనా సముద్రంలోని ద్వీపాలను సైనిక స్థావరాలుగా చేసుకుంది. తన సరిహద్దుల వెలుపల తైవాన్‌తోపాటు, ఇతర తూర్పు ఆసియా దేశాల్లో పరోక్ష అధికారం చలాయిస్తోంది. ఇవేవీ కూడా ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోవచ్చు. కానీ ఇవన్నీ కలిపి చూస్తే, తన ఆధిపత్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోయి చివరకు పూర్తిగా కబళించివేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ చర్యలతో చైనా ప్రతిష్ఠ మసకబారింది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు వీలుగా పలు దేశాలు కూటములుగా జట్టు కట్టేందుకు, చైనా వస్తు సరఫరాలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పరిస్థితికి దారితీసింది. అయినా చైనా ఏం ఓడలేదు. వాస్తవానికి, తన ఆక్రమణలు అన్నిటినీ ‘న్యూ నార్మల్’గా మార్చేయగలిగింది. సాగర జలాల్లో తన అధికార ప్రదర్శనను కొనసాగించగలనని, లేదా తైవాన్ను ఆక్రమించుకోగలనని జిన్‌పింగ్ అనుకుంటే అందులో ఆశ్యర్యపడేదేం లేదు. ఒక మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే జిన్‌పింగ్ కూడా అనుభవాల నుంచి పాఠం నేర్చుకున్నాడు. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను హస్తగతం చేసుకున్నాడు. దేశానికి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ప్రత్యర్థులను అణచివేయడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమాలను ఉపయోగించుకున్నాడు. హిమాలయాల్లో కానీ, సాగరాల్లో కానీ, పసిఫిక్ లేదా యూరేషియాలో కానీ ఇలాగే ముందుకు సాగాలని ఈ అనుభవమే జిన్‌పింగ్‌ను పురిగొల్పి ఉంటుంది. ఉగ్రవాద దుస్సాహసంఏప్రిల్ 22న పాకిస్తాన్ తైనాతీలు మరోసారి ఇండియాపై పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడ్డారు. అలాంటి ఘటన, దాని పర్యవసానాలు... టెర్రరిజం ఎగుమతుల కేంద్రంగా పాకిస్తాన్ పొందిన గుర్తింపును ఇంకా బలపరిచాయి. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక సామర్థ్యాన్ని మరింత కుంగదీశాయి. సైనిక పరంగా పాకిస్తాన్ బలహీనతలను బహిర్గత పరచాయి. దేశ సౌభాగ్యానికి అవసరమైన ప్రాదేశిక సమగ్రతను మరింత దూరం చేశాయి.అయితే తాను ఓడిపోయానని పాకిస్తాన్ అనుకోవడం లేదు. పైగా, రావల్పిండిలోని మిలిటరీ జనరళ్ల దృష్టిలో పాకిస్తాన్ గెలిచింది. తామే తప్పూ చేయడం లేదన్న యుద్ధోన్మాద ధోరణి ఇకమీదటా చెల్లిపోతుందని ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ అనుకుంటే అందులో ఆశ్చర్యపడేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. జిన్‌పింగ్, పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే, తన అనుభవాలు అతడికి పాఠం నేర్పాయి. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. మునీర్ ద్వేషం రగిల్చే ప్రసంగాలు చేశాడు. ఉగ్రవాద తైనాతీలను ప్రోత్సహించాడు. ప్రత్యర్థిని సైనిక ఘర్షణలోకి దించాడు. అంతర్జాతీయ పాత్ర కోసం అభ్యర్థన చేశాడు. కాల్పుల విరమణను విజయంగా ప్రకటించుకున్నాడు. కొన్ని తరాల ప్రజలను శోకంతో తపించేలా చేసినా, పాకిస్తాన్‌కు కావల్సిన ప్రచారాన్ని, ప్రజల్లో చీలికను సాధించిపెట్టిన ఇలాంటి ఉగ్రదాడులతోనే ముందుకుసాగేందుకు మునీర్‌ను అతడి అనుభవం పురిగొల్పవచ్చు. మరో దేశం మీద దండెత్తడం, ప్రజలను ఆకలితో అలమటింపజేయడం దుస్సాహసం (అడ్వెంచరిజమ్) అవుతుంది. టెర్రరిజానికి ఆశ్రయం ఇవ్వడం లేదా మరొకరి భూభాగాన్ని కైవసం చేసుకోవడం దుస్సాహసం అవుతుంది. అన్ని అంతర్జాతీయ నియమాలనూ, చట్టాలనూ ఉల్లంఘించడం, ట్రైబ్యునల్ ఉత్తర్వులను తిరస్కరించడం దుస్సాహసం అవుతుంది. మానవ సమాజాలు ఏర్పడినప్పటి నుంచీ దుస్సాహసం ఉంది. దీన్ని అడ్డుకునేది చట్టం, ఆచారం, స్వీయ నిగ్రహం... ఇవేవీ కావు. విఫలమవుతామన్న భయం, అందుకు చెల్లించాల్సిన మూల్యం మాత్రమే దుస్సాహసాన్ని అడ్డుకోగలవు. విషాదం ఏమిటంటే, ఇప్పుడు ఈ వైఫల్యభీతి అంతరించింది. అడ్వెంచరిజం ఫలించే యుగం ఇది.ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అయతొల్లా ఖమేనీ (ఇరాన్ సుప్రీం) రాయని డైరీ
అహంకారం మంచి విషయం. కానీ, ఎవరు అహంకరిస్తున్నారు అనే దానిని బట్టి అది మంచి విషయం అవునా కాదా అనేది ఉంటుంది! అహంకారం, జాతి రక్షకుడికి దేవుని అనుజ్ఞ. అదే అహంకారం, జాతులను తుడిచి పెట్టేందుకు సైతాను ఆజ్ఞ. ‘‘ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు. అతడిని కాపాడటం కూడా మా చేతుల్లోనే ఉంది...’’ అంటోంది అమెరికా! ఎంత అహంకారం?! ఎవర్ని ఎవరు కాపాడతారన్నది యుద్ధం చేతుల్లో ఉంటుందా? సర్వశక్తి సంపన్నుడైన అల్లాహ్ తలంపులో ఉంటుందా? ఎవరి దారిన వాళ్లుండేవాళ్లను నొప్పించే పనులే జరిగాయి ఈ లోకంలో ఇంతవరకు! ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ముస్లిం ప్రపంచం ప్రతి దేశంలోనూ గాయపడి ఉంది. ముస్లిములను షియాలుగా, సున్నీలుగా; ముస్లింలను అరబ్బులుగా, అరబ్బులు కానివారిగా వేరు చేసి, ఐక్యతను చెడగొట్టి యావత్ ముస్లిం జాతినే తుడిచిపెట్టేందుకు అగ్రరాజ్య సైతాన్, జెరూసలేంలో తిష్ఠవేసుకుని ఉన్న ‘జియోనిస్టు పిల్ల సైతాను’తో కలిసి ముస్లిం దేశాల మీదమీదకు వస్తోంది.పాలస్తీనా, లెబనాన్, యెమెన్, సిరియాలలో ఇరాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందనీ, ఆ ఉగ్రవాదుల నుంచి ప్రపంచాన్ని రక్షించే బాధ్యతను తన మీద వేసుకున్నాననీ అమెరికా చెబుతోంది! అసలు ఎవరి నుండి రక్షించుకోవడానికి ఇరాన్ ఈ ‘ఉగ్రవాద’ కవచాలను ఏర్పరచు కోవలసి వచ్చిందో, ముందు అది చెప్పాలి అమెరికా. అంతకన్నా ముందు, ‘ఉగ్రవాదులు’ అనటం మాని ‘ధర్మయుద్ధ సైనికులు’ అనటం అమెరికా నేర్చుకోవాలి.ఖమేనీ ఆధునిక హిట్లర్ అంటోంది జియోనిస్ట్ పిల్ల సైతాన్ ! తన పెదనాన్న పెద్ద సైతాన్ ను మించిన హిట్లర్ ఎవరున్నారు? గ్వాంటనామో, అబుగ్రై»Œ జైళ్లలో అమెరికా చేసిన నేరాలెన్ని! అక్కడి ఖైదీలకు చూపిన నరకాలెన్ని? స్వతంత్రంగా ఉన్న ఏ దేశాన్ని చూసినా బుసకొట్టకుండా ఉందా ఈ పెద్ద సైతాన్ ?! సిరియా అంతర్యుద్ధం మొదలైందీ, అంతం కాకుండా ఉన్నదీ ఎవరి వల్ల? ఈ రెండు సైతాన్ల వల్లనే కదా!‘‘తగాదా తీర్చటానికి తాను సిద్ధంగా ఉన్నాను’’ అని రష్యా అంటోంది! మిత్రులైన వాళ్లు కూడా సర్దుబాటు చేయటానికే చూస్తారేమిటి?! రష్యా పూర్తిగా ఇరాన్ వైపు ఉండలేదా, బహిరంగంగా. అయినా, దేవుడితో సైతాను తగాదా పడుతున్నప్పుడు అది దేవుడికి, సైతానుకు మధ్య తగాదా ఎలా అవుతుంది? సైతానును కదా రష్యా హెచ్చరించాలి, ‘‘నువ్వు నోరు తెరవకు. దేవుడితో ఘర్షణ పడితే నెత్తిపై ఒక్కటి పడుతుంది...’’ అని!పిల్ల సైతాను తల పైన కర్రతో కొట్టకుండా ఇరాన్ కు నచ్చచెబుతాననీ, ఆత్మరక్షణకు తప్ప మరి దేనికీ కర్రలను దగ్గర పెట్టుకోకుండా ఇరాన్ ను ఒప్పిస్తాననీ రష్యా అనటం మధ్యవర్తిత్వం అవుతుంది కానీ, స్నేహం అవుతుందా? చైనా రహస్యంగా కొన్ని ఆయుధాలు పంపింది. ఒకరికి సహాయం చేస్తే తెలియకూడదని అంటారు. స్నేహం కూడా ఎవరికీ తెలియకుండా చేయాలా? ఏమైనా, ఇరాన్ ఒంటరి పోరాటమే చేయాలి. వికారమైన ఆ పిల్ల సైతాన్ ని ఈ భూమి మీద లేకుండా చేసేంతవరకు అన్ని ఇస్లాం దేశాల తరపున, అల్లాహ్ పేరిట ఇరాన్ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఆఖరి ఆయుధం వరకు, ఆఖరి ఆయుధం తర్వాత కూడా!బంకర్‌కు దగ్గర్లో భూమి బద్దలైనట్లుగా పెద్ద చప్పుడు! అమెరికా తన దుర్మార్గమైన యుద్ధాన్ని మొదలు పెట్టినట్లే ఉంది! సర్వజ్ఞుడైన అల్లాహ్‌కు సత్యమేమిటో తెలుసు. నా ప్రియమైన ఇరాన్‌కు అల్లాహ్ రక్షణ తప్పక ఉంటుంది.ఆయన ఇరాన్ చేయి విడువడు. నా ఆత్మ ఇరాన్ ను వీడదు. -
ఉత్తరాంధ్ర కాదు... కళింగాంధ్ర!
కళింగం ఆకుపచ్చని దుర్గమారణ్యాలు, కొండలూ, కోనలూ, నదులూ కలిగి నీలి చీరంచులా పొడవైన తూర్పు సముద్రంతో గోదావరీ– మహానదుల మధ్యన ఒప్పారిన దేశం. సముద్రం మీద వివిధ దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి, శత్రు దుర్భేద్యమైన ప్రదేశం. కళింగం ఆంధ్ర కంటే ప్రాచీనమైన దేశం. దీనిని వశపరచుకోవడానికి అశోకుడి ముందరా, ఆ తరువాతా ఎందరో రాజులూ, చక్రవర్తులూ ఉత్తరాది నుండి దాడులు చేశారు. ఇంకొక పక్క దక్షిణాది నుండి శాతవాహనులు, మాఠరులు తదితర వంశాల రాజులు దండయాత్రలు చేసి ఆక్రమించడం వలన ఈ నేల ఉత్తర భాగం ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ గాను; దక్షిణ భాగం కళింగాంధ్రగాను విడివడిపోయింది. కళింగాంధ్రనే ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర అని పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో పైపైన ఆంధ్ర సంస్కృతి కనిపిస్తున్నా, సమాజ పొరల్ని విప్పి చూస్తే కళింగ సంస్కృతి అంతర్లీనంగా ద్యోతకమౌతుంది. అశోకుడికి ముందర ఈ ప్రాంతం అంతా ఆదివాసీలు, దళితులతోనే నిండి ఉండేది. అప్పట్లో అవైదికాలయిన జైన, బౌద్ధమతాలు ఇక్కడ వేళ్ళూనుకొని ఉండేవని ప్రాచీన దేవాలయాలు, సాలిహుండం, బొజ్జన్నకొండ వంటి చారిత్రక ప్రదేశాలు తెలియజేస్తుంటాయి. అందుకే ఈ కళింగంలో అడుగుపెట్టి తిరిగి వెళ్ళిన తరువాత వైదికులు అగ్నిష్టోమం, పునస్తోమం అనే ప్రాయశ్చిత్త కర్మలు చేయించుకునేవారు. కళింగాంధ్రకే ప్రత్యేకమైన దేవీశక్తులు: అసిరమ్మ, మొయ్యమ్మ, నీలమ్మ, కంచెమ్మ. వీరు గ్రామ సరిహద్దులో ఉంటూ గ్రామాన్ని కాపాడే దేవతలు. ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురు వంతున వందలాది పేర్లతో అన్ని గ్రామాలలోనూ పూజలందుకుంటున్నారు. వీరు బహుజన దేవతలు. బహుజనులే పూజార్లు. ఏ వైదిక దేవతల ఉత్సవాలకూ రానంతమంది ఈ అమ్మవారి యాత్రలకు వస్తారు. పసుపు కుంకుమ, వేప కొమ్మలతో అలంకరించిన ఘటాన్ని అమ్మవారిగా వీథుల్లో ఊరేగిస్తారు. ఈ ఉత్సవాలకు విజయనగరం ప్రాంతంలో ‘సిరిమాను’ ఊరేగింపు తప్పనిసరి. జంతుబలులు సాధారణం. కొన్ని గ్రామాలలో అమ్మవార్ల పండుగల్లో దున్నను బలిచ్చే ఆచారం కూడా ఉంది.అలాంటివే గావు పండుగలు, గ్రామపండుగలు. సాధారణంగా గ్రామంలోని గొల్లలంతా కలిసి చేస్తుంటారు. ఈ పండుగలో వంశపెద్ద మేకగొంతు కొరికి దేవుడికి సమర్పిస్తాడు. వంశానికి ఒక మేకను ఇలా బలి ఇస్తారు. గొంతు కొరికేటప్పుడు ఆ గావుమేక పెట్టే హృదయవిదారకమైన కేకను ‘గావుకేక’ అంటారు. ఆంధ్రబ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, పట్టుసాలీలు తప్ప కళింగంలోని ఇతర సామాజిక వర్గాలన్నీ మాంసాహారాన్ని తింటాయి. తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం దీపావళి, నాగులచవితి, భోగి, ఉగాది పర్వదినాల్లో కూడా ఇక్కడివారు మత్స్యమాంసాదులు తింటారు. కళింగంలో ఒకే గోడను ఆన్చి ఇటు ఒకటి, అటు ఒకటిగా రెండిళ్ళు కట్టుకుంటారు. ఒకదానిని అనుసరించి మరొకటి వరసగా చాలా ఇళ్ళు కట్టుకుంటారు. ఇలా వాసపూసుకుంటూ నిర్మించుకున్నదానినే ‘వాస’ అంటారు. పూరిళ్ళతోనే ఇలాంటి వాసలు నిర్మించుకొనేవారు. అలాంటి రెండు వాసలు ఎదురెదురుగా ఉన్నదానిని ‘వీథి’ అంటారు. వాస పదప్రయోగం కళింగాంధ్రలోనే ఉంది. వరుసగా, వాసలుగా కట్టుకున్న ఇళ్ళు కళింగానికి అద్దం పడుతుంటాయి. కళింగేతర ప్రాంతాలలో పేద అయినా విడిగా ఇల్లు, దానికి చుట్టూ దడి నిర్మించుకుంటాడు. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చిన్ననాడే స్నేహాన్ని ప్రారంభిస్తారు. ఆడపిల్లలు ఆడపిల్లలతోను, మగపిల్లలు మగ పిల్లలతోను ఈ స్నేహం ఉంటుంది. సంప్రదాయంగా పెద్దలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ‘నేస్తరికం’ అంటారు. ఒకసారి నేస్తరికం కడితే వారి మధ్య అది జీవితాంతం కొనసాగవలసిందే! శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఇవి అధికం. నేస్తరికాలు ఒరిస్సాలోనూ ఉన్నట్టు చాగంటి తులసి రాసిన ‘యాత్ర’ నవలలో చదవవచ్చు. నేస్తరికాలకు విడాకులుండవు. మాది విజయనగరం జిల్లా రాజాం ప్రాంతం. మా వంశంలో జరుగుతున్న కార్యక్రమాలకు ప్రక్కగ్రామానికి చెందిన వేరే సామాజిక వర్గానికి చెందిన ఒక వంశంవారు బియ్యం, కొత్త బట్టలు వగైరా కావిడలో పెట్టి పంపించేవారు. వారి ఇళ్ళలో జరిగిన సంబరాలకు కావిడ పెట్టి పంపించేవాళ్ళం. దీనిని ‘కావిడ పెట్టడం’ అని పిలిచేవారు. ఈ సంప్రదాయం ఇరువంశాలకు చెందింది కాగా... అర్ధశతాబ్ది కిందటివరకూ కొనసాగింది. సామాజిక మార్పుల ప్రభావంతో మా మధ్య ఇది కనుమరుగైంది.ఇక్కడి ఆడవారి చీరకట్టు కూడా ప్రత్యేకమైనది. కుడిపైట, వెనక కుచ్చు గుండారతో ప్రత్యేకంగా కనపడేవారు. ముఖానికి దట్టంగా పసుపు రాసుకొని, రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టు పెట్టుకొనేవారు. జాకెట్టు లేని ఆహార్యం వీరిది. కాళ్ళకు వెండి అందెలు, కడియాలు, బంగారు కొనచెవులు, ముక్కుకు కమ్మి ఇలా వీరి ఆభరణాలు కూడా ఆంధ్ర ఆడవారితో స్పష్టంగా విభేదించేవి. ఆడా, మగా చుట్ట కాల్చేవారు. చుట్ట కాలుతున్న వైపు నోట్లో పెట్టుకొని పీల్చే ‘అడ్డపొగ’ కళింగానికే ప్రత్యేకం. ఇలాంటి ఆహార్యం, అలవాట్లు గల చివరితరం స్త్రీలు కళింగాంధ్రలో అరుదుగాను, ఒరిస్సాలో విరివిగాను నేడు కనిపిస్తారు. ఆధునిక ప్రసార సాధనాల ప్రభావం వలన ఇక్కడి మహిళలు ఆంధ్రా ఆహార్యానికి అలవాటుపడ్డారు. పునాదిలో ఆంధ్రతో ఇలాంటి అనేక వైరుద్ధ్యాలున్న ఈ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా అనడం అన్యాయం. కళింగాంధ్ర అనడమే సబబు. గార రంగనాథం వ్యాసకర్త కవి, రచయిత ‘ 98857 58123 -
అణు ఉపద్రవం
‘‘ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా (అమెరికా) పరిస్థితిని నిరంతరం మదింపు చేస్తోంది. (ఇరాన్) 2003 లో పక్కనపెట్టిన అణ్వాయుధాల నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు సర్వోన్నత నాయకుడు ఖొమేనీ ఆదేశించలేదు’’ అని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ ఈ ఏడాది మార్చి 26న చెప్పారు. అయినా, ఇరాన్ అణ్వాయుధాల నిర్మాణ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ‘ముందస్తు’ చర్యగా పేర్కొంటూ ఇజ్రాయెల్ ఈ జూన్ 13న దాడులు ప్రారంభించింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చర్యను నిర్లక్ష్యపూరిత దుందుడుకు చర్య. ఇరాన్లో ఉన్న ప్రభుత్వం అక్కడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైందని చెప్పలేం. ఇజ్రాయెల్‌లో ఉన్న ప్రభుత్వం కూడా అలాంటిదే. అయినా ఇరాన్‌పై దాడికి దిగే హక్కు దానికి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. అణ్వాయుధాన్ని నిర్మించగలిగిన స్థితికి ఇరాన్ చాలా దగ్గరలో ఉందనే ఇజ్రాయెల్ అభిప్రాయం ట్రంప్ మనసులో నాటుకుంది. దాంతో ఆయన ఇంటెలిజెన్స్ అంచనాను పక్కనపెట్టేశారు. చేయాలనుకుంటే ఆపగలరా?ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం, అక్కడ అధికారం చేతులు మారేటట్లు చూడటం ఇజ్రాయెల్ ఆశయాలు. ఆ రెంటిలో ఏదీ తేలికైనది కాదు. ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించకుండా జాప్యం చేయగలిగిన సత్తా ఇజ్రాయెల్ సొంతం ఏమీ కాదని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ ఈమధ్య అన్నారు. ‘‘బహుశా కొన్ని వారాలు ఆపగలం... ఓ నెల ఆపగలం... అమెరికా కూడా దాన్ని కొద్ది నెలలపాటే అడ్డుకోగలదేమో’’ అన్నారాయన. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థతోపాటు నటాంజ్‌లో ఉన్న ముఖ్యమైన యురేనియం శుద్ధి సదుపాయాన్ని, ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్‌ను ఇజ్రాయెల్ తీవ్రంగా ధ్వంసం చేయగలిగిందని ప్రస్తుత మదింపులు సూచిస్తున్నాయి. కానీ అరాక్ న్యూక్లియర్ కాంప్లెక్స్ చాలా వరకు చెక్కుచెదరకుండానే ఉందని చెబుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఫర్దోలో ఉన్న ఇంధన శుద్ధి భూగర్భ కేంద్రానికి కూడా ఇంతవరకు వాటిల్లిన నష్టం ఏమీ లేదు. ఈ సదుపాయం చాలా కీలకమైంది. ఎందుకంటే, ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి అయిన యురేనియం ఉంది. అణ్వాయుధాన్ని నిర్మించడానికి 90 శాతం శుద్ధి అయిన యురేనియం అవసరం. ఆ పనిని ఫర్దో సదుపాయం వారం రోజుల్లో చేసిపెట్టగలదు. ఇరాన్ వద్ద 2025 మే నాటికి 408.6 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉందని అంచనా. దానిని మరింత శుద్ధి చేస్తే, రానున్న వారాల్లో తొమ్మిది అణ్వాయుధాల తయారీకి సరిపోతుంది. అమెరికా భాగస్వామ్యం ఎంత?భారీ మందుగుండు సామగ్రితో కూడిన ఎయిర్ బ్లాస్ట్ బాంబు (ఎంఓఏబి) మాత్రమే ఫర్దోను ధ్వంసం చేయగలదు. అది ఇజ్రాయెల్ వద్ద లేదు. అమెరికా రంగంలోకి దిగితేనే దాన్ని ధ్వంసం చేయడం సాధ్యం. అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు ఇరాన్ ఇరవై ఏళ్ళ పైనుంచి కృషి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని భూగర్భ సదుపాయాలను కూడా అది నిర్మించుకుంది. గగనతల దాడులొక్కటే ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించలేవు. పదాతి దళాలతో భూతల ఆక్రమణ కూడా అవసరమవుతుంది. అమెరికా పాత్ర ఇక్కడే అవసరం పడుతుంది. ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవడం’ ట్రంప్ డిమాండ్లలో ముఖ్యమైంది. వెనుతిరిగి చూస్తే, ఇరాన్‌పై యుద్ధం అమెరికా–ఇజ్రాయెల్ కలసి చేసిన పనేనేమో అనిపిస్తుంది. బేషరతుగా లొంగిపొమ్మనడం, ప్రభుత్వాన్ని మార్చుకొమ్మని చెప్పడం వల్ల, ఇరాన్ నిజంగానే అణ్వాయుధ నిర్మాణ దిశగా అడుగు వేయవచ్చు. ఇరాన్ అలాంటి ఆయుధాలను నియోగించకుండా నివారించేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు అణ్వాయుధాలను అమ్ములపొదుల నుంచి బయటకు తీయవలసి రావచ్చు. అణ్వాయుధాల ప్రయోగమే జరిగితే అది ప్రపంచాని కంతటికీ వినాశకరం. నిజానికి, ఇజ్రాయెల్‌ను దృష్టిలో పెట్టుకుని ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఇరాక్ కారణంగా ఆ పని చేసింది. ఇరాన్–ఇరాక్‌ల మధ్య 1980–88 వరకు సాగిన యుద్ధం అందుకు ప్రేరణగా నిలిచింది. అమెరికా సాయంతోనే ఇరాన్‌పై దాడికి ఇరాక్ ఉపక్రమించింది. ఇరాన్‌లోని నగరాలపై ఇరాక్ రసాయనిక ఆయుధాలు, క్షిపణులతో దాడులకు దిగినా ప్రపంచ దేశాలు చాలావరకు మిన్నకుండిపోయాయి. దాంతో 1980ల మధ్య నుంచి ఇరాన్ సైనిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే, ఇరాక్‌పై 2003లో అమెరికా దాడి చేసిన తర్వాతనే, అణ్వాయుధాలు లేనిదే తన భద్రతకు పూచీ ఉండదని ఇరాన్ భావించడం మొదలుపెట్టింది. ఇరానియన్లకు చరిత్ర పట్ల చక్కని అవగాహనతోపాటు జాతీయతా భావాలు మెండు. ఇరాక్‌లో మాదిరిగానే ఇరాన్లో కూడా అపార విధ్వంసానికి పాల్పడటంలో, ఆ దేశాన్ని బలహీనపరచడంలో అమెరికా–ఇజ్రాయెల్ విజయం సాధించవచ్చు. ప్రభుత్వాన్ని మార్చడంలోనూ సఫలం కావచ్చు. కానీ, కథ అంతటితో కంచికి పోదు.మనోజ్ జోషీవ్యాసకర్త ఢిల్లీలోని అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్‌లో విశిష్ఠ సభ్యుడు -
ఎయిరిండియా రద్దుల పద్దు!
చూడబోతే ఎయిరిండియాకు కష్టాలన్నీ ఒక్కసారే కట్టగట్టుకుని వచ్చినట్టున్నాయి. ఈ నెల 12న గుజరాత్లో జరిగిన దురదృష్ట ఘటనలో 272 మంది మరణించిన తర్వాత ఎయిరిండియా విమానాలు ఎక్కాలన్నా, ప్రత్యేకించి ప్రమాదం సంభవించిన బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ రకం విమానాల్లో ప్రయాణించాలన్నా చాలామంది భయపడుతున్నారు. అందుకు తగినట్టే ఆ సంస్థ అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో వినియోగించే దాదాపు 90 విమాన సర్వీసుల్ని అంచెలంచెలుగా రద్దుచేస్తూ పోతోంది. శుక్రవారం కూడా ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. నిర్వహణాపరమైన, సాంకేతికమైన సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెబుతోంది. వీటికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇరాన్ గగనతలాన్ని మూసివేయటం వంటివి కూడా విమాన సర్వీసుల రద్దుకు దోహదపడ్డాయి. జూలై రెండో వారం వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు 15 శాతంమేర తగ్గించనున్నామని ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు కూడా ఏమంత భరోసాతో లేరు. అసలు విమానయానమే వద్దనుకున్నవారు కొందరైతే, బోయింగ్ విమానాలు ఎక్కరాదని మరికొందరు నిర్ణయించుకుని ప్రయాణాలు రద్దుచేసుకున్నారు. విమానయాన సంస్థలను నియంత్రించే పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానాల్లో భద్రతకు సంబంధించిన ప్రధాన లోపాలేమీ లేవని, కేవలం నిర్వహణాపరమైన సమస్యలే ఉన్నాయని చెబుతోంది. భిన్న విభాగాల మధ్య సమన్వయం అవసరమవుతుందని సలహా ఇచ్చింది. ఎక్కడ ఏ చిన్న లోపాన్ని గమనించినా దాన్ని నమోదు చేయటం, వెనువెంటనే సరిదిద్దటం వంటివి జరగాలని సూచించింది. ఎయిర్‌లైన్స్ సంస్థలకు రేటింగ్ ఇచ్చే అంతర్జాతీయ స్వతంత్ర ఆన్లైన్ సంస్థ పరిశీలనలో ఇండిగో, ఆకాశ సంస్థలు ఏడు అంశాల్లో ఆరు పాయింట్లు సాధించాయి. స్పైస్ జెట్ ఏడుకు ఏడు పాయింట్లు పొందగా, ఎయిరిండియా కేవలం నాలుగు పాయింట్లే సాధించటం గమనించదగ్గ అంశం. ఇక బోయింగ్ డ్రీమ్‌లైనర్ భద్రతా లోపాలపై ఫిర్యాదు చేసిన ఇంజినీర్ జార్జి బార్నెట్ అనుమానాస్పద స్థితిలో నిరుడు మార్చిలో మరణించిన ఉదంతం కలవరపరుస్తుంది. ఆ సంస్థ క్వాలిటీ కంట్రోల్లో 32 ఏళ్లు పనిచేసిన బార్నెట్ రెండ్రోజులు విచారణకు హాజరై మూడో రోజు ఎందుకు తుపాకీతో కాల్చుకుంటాడన్నది ప్రశ్నార్థకమైంది.టాటా ఎయిర్‌లైన్స్‌గా ఉన్న సంస్థను 1953లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతీయం చేసి, ఎయిరిండియాగా నామకరణం చేశారు. దేశీయ విమాన సర్వీసుల కోసం ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఆవిర్భవించింది. ఈ రెండూ పబ్లిక్ రంగ సంస్థలు కావటంతో పౌర విమానయాన రంగంలో అవి దిగ్గజ సంస్థలుగా వెలిగాయి. కానీ దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై విమానయానంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించటం, తక్కువ ధరకే ప్రయాణికులను చేరేవేసే సంప్రదాయాన్ని ప్రారంభించటంతో అంతక్రితమే నష్టాలతో ఉన్న ఆ సంస్థ మరింతగా కుంగిపోవటం మొదలైంది. అసలు విమానయాన రంగంలో ప్రైవేటును అనుమతించినప్పుడే ఎయిరిండియా నిర్వహణను పూర్తిగా నిపుణులకు వదిలేయాల్సింది. కానీ పగ్గాలు ప్రభుత్వం దగ్గరే ఉండటం, దానికి లోబడి సంస్థ పనిచేయాల్సి రావటంతో ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. టాటా సన్స్ 2022లో ఎయిరిండియాను తీసుకున్నప్పుడు విమానయాన రంగాన్నే సంపూర్ణంగా మారుస్తామని ప్రకటించింది. దశాబ్దాల అసమర్థ ఉద్యోగస్వామ్యాన్ని తొలగించి, గర్వించదగిన గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతామని తెలిపింది. మూడేళ్లు గడిచాయి. కానీ చెప్పుకోదగ్గ మార్పుల జాడలేదు. అలాగని ఎయిరిండియా ఏమీ చేయలేదని కాదు. సిబ్బందికి పునఃశిక్షణనిచ్చింది. వారి యూనిఫాంని మార్చింది. యాప్‌ను సరికొత్తగా తీసుకొచ్చింది. అయితే, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలు జరగలేదన్న మాటేగానీ లోపాల పరంపర గురించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇందులో పారిశుద్ధ్యం మొదలుకొని విరిగిపోయిన సీట్లు, నాసిరకం ఉపకరణాలు వగైరాలున్నాయి. అయినా పెద్దగా ఫలితం లేదు. ఇక అస్వస్థతగా ఉండి సెలవు పెట్టినవారిని సైతం ఒత్తిడి తెచ్చి విధినిర్వహణకు పిలిచిన సందర్భాలున్నాయని పైలెట్ల ఫిర్యాదు. ఇవన్నీ విడివిడి ఘటనలుగా కొట్టిపారేయటం కాక వాటివెనక అల్లుకునివున్న నిర్లక్ష్యాన్నీ, అలసత్వాన్నీ సకాలంలో గమనించుకుంటే పరిస్థితి మెరుగుపడేది. నిరుడు ఢిల్లీ–శాన్ఫ్రాన్సిస్కో సర్వీస్ విమానం ఇంజన్ వైఫల్యం కారణంగా రష్యాలో రోజుల తరబడి నిలిచిపోయింది. మరుగుదొడ్లు పనిచేయక చికాగోకు బయల్దేరిన విమానం కాసేపటికే వెనుదిరిగింది. టాటా బ్రాండ్‌కు మార్కెట్లో మంచి పేరుంది. వాటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో విశ్వాసం ఉంది. ఎయిరిండియా దాన్ని అందుకోలేకపోయింది. నిరుడు మే నెలలో ముంబై–లండన్ సర్వీసు బోయింగ్ 787 విమానంలో తలుపు సరిగా పనిచేయటం లేదంటూ ఫిర్యాదు చేశాక, దాన్ని వెనక్కు తీసుకోవాలని తమపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని, నిరాకరించినందుకు షోకాజ్ నోటీసులు జారీచేసి, 48 గంటలు దాటకుండా ఉద్యోగం నుంచి తొలగించారని సీనియర్ ఫ్లయిట్ అటెండెంట్లు ఇద్దరు ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేయటం గమనించదగ్గది. ప్రవర్తన సరిగా లేకపోవటం, విధి నిర్వహణ సక్రమంగా చేయక పోవటం వంటి కారణాలతోనే వారిని తొలగించామని సంస్థ సంజాయిషీ ఇస్తోంది. అంతా సవ్యంగా గడిచినంతకాలం నిర్వాహకులు తమను తాము అభినందించుకుంటూ కాలం గడుపుతారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేసే నియంత్రణ వ్యవస్థ ఉంటే ఇలాంటివి చోటుచేసుకోవు. ఈ విషాద ఘటన నుంచి అయినా గుణపాఠం నేర్చుకోవాలి. అత్యంత జాగరూకతతో మెలగాలి. -
దక్షిణాదిన ఎమర్జెన్సీ సానుకూల ప్రభావం ఇందిరను గెలిపించింది!
భారత ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కుదిపివేసిన ఎమర్జెన్సీ ప్రకటనకు ఈ నెల 25న 50 ఏళ్లు నిండుతున్నాయి. అప్పుడు ఉత్తరాదితో పోల్చితే తన విలక్షణ స్వభావం ఏమిటో దక్షిణాది ప్రాంతం నిరూపించుకుంది. ఈ సందర్భంగా దానికి కారణాలు ఇక్కడ పరిశీలిద్దాం.అత్యవసర పరిస్థితి అమలు జరిగిన తీరు దక్షిణాది రాష్ట్రాల్లో తర్వాత జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసింది. దేశంలో 1975–77 నాటి ఎమర్జెన్సీ పర్యవసానాలు దక్షిణాది రాష్ట్రాలపై అతి స్వల్పం. ఈ వాస్తవాన్ని ఆత్యయిక స్థితిని తొలగించాక జరిపించిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి. 21 మాసాల అత్యవసర పరిస్థితి నిబంధనలను చాలా వరకు 1977 జనవరిలో తొలగించి మార్చిలో నిర్వహించిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని అధికార కాంగ్రెస్ ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు తుడిచిపెట్టుకుపోయింది.ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఉత్తరాది, పశ్చిమ ప్రాంతంలోని మహారాష్ట్ర, గుజరాత్, ఇంకా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాల్లో ప్రతిపక్షమైన జనతాపార్టీ, దాని మిత్రపక్షాలకు అత్యధిక మెజారిటీ సీట్లు కైవసమయ్యాయి. అయితే, నాటి దక్షిణాదిలోని అత్యధిక లోక్‌సభ స్థానాలను మాత్రం పాలకపక్షమైన కాంగ్రెస్, అన్నాడీఎంకే వంటి మిత్రపక్షాలతో కలిసి గెలుచుకుంది. జనతా, దాని మిత్రపక్షాలకు నామమాత్రంగా ఇక్కడ సీట్లు దక్కాయి. ఉత్తరాదిన జనతాపార్టీ, అకాలీదళ్ వంటి మిత్రపక్షాలు తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్నాయి.దక్షిణాదిలో ఈ ప్రతిపక్షాలు ఎంతగా పోరాడినా కాంగ్రెస్ అప్రతిహత విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. నాలుగు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని పరిస్థితి. తాను అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 42 సీట్లలో కాంగ్రెస్‌కు 41, కర్ణాటకలో మొత్తం 28 సీట్లకుగాను 26 స్థానాలు దక్కాయి. తెలుగునాట ఒక్క నంద్యాల స్థానంలోనే జనతాపార్టీ గెలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకుని అప్పటికి మాజీ ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి ఒక్కరే విజయం సాధించారు. ఇలా నంద్యాల నుంచి గెలిచిన నీలం కొద్ది మాసాల తర్వాత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిత్రపక్షాల సహకారంతో అధికారంలో ఉన్న కేరళలోని మొత్తం 20 సీట్లలోనూ కాంగ్రెస్ కూటమే (యూడీఎఫ్) విజయం సాధించింది. తమిళనాడులో నాటి ప్రతిపక్షమైన అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ కూటమికి మొత్తం 39 సీట్లలో 34 కైవసమయ్యాయి. డీఎంకే నాయకత్వంలోని కూటమికి ఐదు సీట్లే దక్కాయి. బిహార్, గుజరాత్ ప్రజాందోళనలకు తోడు అలహాబాద్ హైకోర్టు తీర్పు1971 ముందస్తు లోక్‌సభ ఎన్నికల్లో మూడింటి రెండింటి మెజారిటీతో కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆ ఏడాది చివర్లో బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో భారత్ గెలుపు ప్రధాని ఇందిరాగాంధీని ప్రతిష్ఠను ‘దుర్గా దేవి’ స్థాయికి తీసుకెళ్లింది. 1972 ఆరంభంలో ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయాలు నమోదు చేసుకుంది. అయితే, రెండు సంవత్సరాలకే దేశ ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి.కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చిమన్‌భాయ్ పటే ల్ (గుజరాత్), అబ్దుల్ గఫూర్ (బిహార్) దుష్పరిపాలనపై ఆ రెండు రాష్ట్రాల్లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మార్గదర్శకత్వంలో విద్యార్థి, యువజన ఉద్యమాలు జోరందుకున్నాయి. దీనికితోడు 1975 జూన్ 12 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రధాని ఇందిరను కోలుకోలేని విధంగా చేసింది. 1971లో యూపీలోని రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఇందిర ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేసి స్టే సంపాదించారు. కాని, తీర్పు ఫలితంగా, యువజన ఉద్యమాల కారణంగా ఎదురైన ప్రజా ప్రతిఘటన, ప్రతిపక్షాల దూకుడును తట్టుకోవడానికి ఆమె 1975 జూన్ 25న దేశంలో అంతర్గత ఎమర్జెన్సీ విధించారు. అత్యవసర పరిస్థితి కారణంగా కేంద్ర సర్కారు ప్రాథమిక హక్కులు సహా, అనేక రకాల రాజ్యాంగ హక్కులను పక్కన పెట్టింది. పత్రికలపై సెన్సార్షిప్ విధించింది. అటల్ బిహారీ వాజపేయి, ఎల్.కె.ఆడ్వాణీ, మొరార్జీదేశాయి, చంద్రశేఖర్ సహా లక్షలాది మంది ప్రతిపక్షనేతలను జైళ్లకు పంపారు. అరెస్టులు, ఆపరేషన్లు, పేదల ఇళ్ల తొలగింపు ఉత్తరాదిన ఎక్కువఎమర్జెన్సీ కాలంలో కుటుంబ నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రభుత్వాల ఆదేశాలను అడ్డగోలుగా అధికారులు అమలు చేశారు. ప్రాంతాల వారిగా సంతాన నిరోధక ఆపరేషన్లకు కోటాలు నిర్ణయించి కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్లికాని యువకులకు సైతం పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేశారు. ఈ ఆపరేషన్లతో వేలాది గ్రామాల ప్రజలు భయోత్పాతానికి గురి అయ్యారు. అలాగే, దేశ రాజధాని న్యూఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో నగరాల సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను నేలమట్టం చేశారు. ఢిల్లీలోని తుర్క్‌మన్‌గేట్ ప్రాంతంలో ఇందిర రెండో కుమారుడు సంజయ్ గాంధీ అనుచరులైన రుక్సానా సుల్తానా వంటి నేతలు మైనారిటీలకు చెందిన వేలాది గృహాలను తొలగించే పనిని అధికారులతో చేయించారు.పిల్లలు పుట్టకుండా చేసే వేసెక్టమీ ఆపరేషన్ల భయంతో ముస్లింలు, ఇతర వర్గాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇలాంటి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అన్నీ ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చేశారు. సామాన్య ప్రజానీకంపై దౌర్జన్యాలు, అత్యాచారాలు కూడా హిందీ రాష్ట్రాల్లోనే ఎక్కువ జరిగాయి. ప్రభుత్వ నిర్బంధంలో రాజకీయ కార్యకర్తలనేగాక సాధారణ ప్రజలను సైతం వేధించారు. ఎమర్జెన్సీలో ఈ రకమైన ప్రభుత్వ జులుం అంతా ఉత్తరాది రాష్ట్రాల్లోనే కనిపించింది. దీంతో హిందీ రాష్ట్రాలు సహా ఉత్తరాది అంతటా పరిస్థితి ఎమర్జెన్సీలో నివురుగప్పిన నిప్పులా ఉండేది. ఇక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా 4 దక్షిణాది రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ నిబంధనల అమలు ప్రభావం తక్కువ. ప్రతిపక్ష నాయకులను అరెస్టు వంటివి తప్ప రాజకీయ పక్షాల కార్యకర్తలు, సామాన్య ప్రజానీకంపై దమనకాండ, అణచివేత చర్యలు అతి స్వల్పం అని చెప్పవచ్చు. నాలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా ప్రభుత్వం ప్రజల హక్కులు హరించి, హింసాయుత మార్గంలో పోరుకు సిద్ధమైన తీవ్రవాద పక్షాల కార్యకర్తలను ఎన్కౌంటర్ల పేరుతో పోలీసులు కాల్చిన సందర్భాలు ఆంధ్రప్రదేశ్ సహా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వందలాది ఎన్కౌంటర్లుహోంశాఖా మంత్రిగా తెలుగునాట నక్సలైట్ ఉద్యమాన్ని చావుదెబ్బదీసిన ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఎమర్జెన్సీ కాలం 21 మాసాల్లో అధికారంలో ఉన్నారు. ఆయన హయాంలో తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో నక్సలైట్లను ఎదురుకాల్పుల పేరుతో ఎడాపెడా కాల్చిచంపారు. తర్వాత ఈ అత్యవసర పరిస్థితి దాష్టీకాలపై విచారణకు జస్టిస్ భార్గవ, విమదలాల్ కమిషన్లు వేశారు. బూటకపు ఎన్కౌంటర్లు నిజమేనని ఈ కమిషన్ల నివేదికలు నిరూపించాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ, పేద ప్రజలకు ఎమర్జెన్సీ వల్ల పెద్దగా కీడు జరగలేదు.అరెస్టులు రాజకీయ నాయకులకే పరిమితమయ్యాయి. అంతేగాక, అనేకచోట్ల భారీ వడ్డీ వసూలు చేసే ఫైనాన్స్ వ్యాపారం, గ్యాబ్లింగ్ క్లబ్బులు లేకుండా చేయడం కాంగ్రెస్ సర్కారుకు సానుకూల పరిణామం. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే కేరళలో అక్కడి కాంగ్రెస్ సర్కారు అణచివేత చర్యలు కాస్త ఎక్కువ. విద్యార్థి నాయకుడు రాజన్‌ను ప్రభుత్వ నిర్బంధంలో చంపడం సంచలనం సృష్టించింది కాని అక్కడ కూడా సామాన్య ప్రజలపై అంతగా దౌర్జన్యాలు జరగలేదు. ఇక కర్ణాటక విషయానికి వస్తే సోషలిస్టు దిగ్గజం జార్జి ఫెర్నాండెజ్‌ను బరోడా డైనమైట్ కేసులో నిర్బంధించి, చిత్రహింసలు పెట్టారు.అంతకు ముందు ఆయన ఆచూకీ చెప్పమని కోరుతూ జార్జి తమ్ముడు మైకేల్ ఫెర్నాండెజ్‌ను నిర్బంధంలోకి తీసుకుని వర్ణింపనలవి కాని రీతిలో శారీరక హింసకు గురి చేశారు. కవి, సినీ దర్శకుడు, ఫెర్నాండెజ్ సన్నిహిత మిత్రుడు, సోషలిస్టు అయిన తిక్కవరపు పఠాభిరామరెడ్డిని, ఆయన భార్య, సినిమా నటి కూడా అయిన స్నేహలతా రెడ్డిని నిర్బంధంలో హింసించారు. జైల్లో పెట్టిన చిత్రహింసల వల్ల స్నేహలత తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి కొన్ని సంఘటనలు మినహా నాయకులు, ప్రముఖులపై కాంగ్రెస్ ప్రభుత్వాల అణచివేత చర్యలు జనంపై దాదాపు లేవనే చెప్పవచ్చు. తమిళనాడులో కూడా ఉత్తరాదిలా మాదిరిగా ఎమర్జెన్సీ అత్యాచారాలు జరగలేదు. మొత్తంమీద ఈ నాలుగు రాష్ట్రాల్లో పేదలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలపై అత్యవసర పరిస్థితి వ్యతిరేక ప్రభావం లేదు.ఈ కారణాల వల్ల 1977 మార్చిలో జరిగిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. లోక్‌సభతోపాటే కేరళ అసెంబ్లీలోని మొత్తం 140 సీట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ 111 సీట్లతో తిరుగులేని ఘన విజయం సాధించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకు ఎమర్జెన్సీ తొలగించిన ఏడాది తర్వాత 1978 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్–ఐ బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించింది. తెలుగునాట మొత్తం 294 సీట్లలో కాంగ్రెస్–ఐ 175, కర్ణాటకలోని మొత్తం 224 సీట్లలో 149 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది.దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ దుష్ప్రభావం లేదని, అక్కడ ప్రభుత్వాల అణచివేత చర్యలు సాగలేదని 1977 పార్లమెంటు, 1978 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సూటిగా తేల్చిచెప్పాయి. ఎమర్జెన్సీ విధించి అప్రతిష్ఠపాలైన ఇందిరాగాంధీకి దక్షిణాది ఇలా కంచుకోటలా నిలిచింది. ‘‘దశాబ్దాలపాటు కేంద్రం నుంచి సవతి తల్లి ప్రేమనే పొందిన దక్షిణాది అత్యవసర పరిస్థితి కాలంలో సానుకూల పర్యవసనాలనే చవిచూసింది. స్వాతంత్య్రం వచ్చాక ఇంతటి శుభ పరిణామాలు దక్షిణాదిన ఎన్నడూ జరగలేదు,’’ అని ఇందిరకు సన్నిహితుడైన మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్ తన ఆత్మకథలో చేసిన వ్యాఖ్య వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించింది.–నాంచారయ్య మెరుగుమాల -
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
ఒక ప్రమాదం, అందులోనూ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, జరగగానే ఒకటి రెండు రోజులు గగ్గోలు పెట్టడం, ఆ ప్రమాద కారణాలను గుర్తించి సవరించే పని ఎంత మాత్రమూ చేయకుండా మరొక ప్రమాదం దాకా మౌనంగా ఉండి పోవడం మన సమాజానికీ, రాజ కీయ నాయకత్వానికీ, ప్రచార సాధ నాలకూ బాగా అలవాటు అయిపోయింది. నిజానికి సమాజం మొత్తంగా ఇందులో చేయగలిగినదేమీ లేదు. ఆ బాధ్యత రాజకీయ నాయకత్వాలదీ, ప్రభుత్వాలదీ, అధికార వ్యవస్థలదీ! ఒక ప్రమాదం జరగగానే కూలంకుషంగా అధ్యయనం చేసి, ప్రమాద కారణాలను అన్వేషించి, మరొకసారి అటువంటి ప్రమాదం జరగడానికి వీలులేని విధంగా ఆ కారణాలన్నిటినీ తొలగించవలసిన బాధ్యత అధికార వ్యవస్థలదే! అహ్మదాబాద్ విమాన ప్రమాదం అత్యంత విషాద కరమైన, ఘోరమైన ప్రమాదం. టేకాఫ్ అయిన కొద్ది సెకన్ల లోనే కూలిపోయి, 241 మంది విమాన ప్రయాణికులు, కనీసం 40 మంది ఇతరులు చనిపోయారు. ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో శాస్త్రీయ విశ్లేషణ జరిపి కారణాలు నిర్ధారించడానికి మూడు నాలుగేళ్లు పడుతుందంటున్నారు. ఈలోగా మన వాట్సప్ కార్ఖానాలూ, వాచాల త్వమే పెట్టుబడిగా నడుస్తున్న ఛానళ్లూ, సంచలనాత్మకమైతే చాలు ఎంత అబద్ధమైనా, ఎంత నిరాధారమైనా మాట్లాడ వచ్చునని అనుకుంటున్న సామాజిక మాధ్యమాలూ చాలా కారణాలను వండి వార్చాయి.ఈ ప్రమాదానికి సాంకేతిక కారణాలు ఎట్లాగూ అధ్యయనంలో బయటపడతాయి కాని ఈలోగా ఆలోచించ వలసిన సామాజిక, రాజకీయార్థిక కోణాల వైపు నుంచి చూస్తే అధికార వ్యవస్థల నిర్లక్ష్యం, లేదా లాభాపేక్షాపరుల అక్రమాలను అధికారులు అవినీతి వల్లనో, సోమరితనం వల్లనో చూసీ చూడనట్టు పోవడం మూల కారణం అని తేలుతుంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించి 2022 జనవరిలో టాటా గ్రూప్‌కు అప్పగించినప్పటి నుంచీ గడచిన మూడేళ్లలో ఆ సంస్థ నిర్వహణలో భద్రతా లోపాల గురించీ, నిర్వహణ లోపాల గురించీ, నిబంధనల ఉల్లంఘనలగురించీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనేక సార్లు మందలించింది, జరిమానాలు వేసింది, హెచ్చ రించింది. విమానాల నిర్వహణలో, కాక్ పిట్ క్రమశిక్షణలో, అంతర్గత జవాబుదారీతనంలో లోపాలను ఎత్తి చూపింది. అర్హత లేని పైలట్లను వాడుతున్నారని 2025 జనవరిలో కూడా ముప్పై లక్షల రూపాయల జరిమానా విధించింది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభ్ భాయి పటేల్ అంత ర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత ప్రమాదకర విమానాశ్రయాలలో ఒకటని గతంలోనే పేరు పొందింది. విమానాలకు పక్షుల తాకిడి అతి ఎక్కువగా ఉండే విమానా శ్రయం అది. ఎందువల్లనంటే దాని రన్ వేలు సరాసరిగా కిక్కిరిసిన జనసమ్మర్దపు కాలనీలకూ, భవనాలకూ అంటు కుని ఉంటాయి. రన్ వేకూ నివాస గృహ, భవన సము దాయాలకూ మధ్య ప్రామాణికంగా ఉండవలసినంత దూరం కాదు గదా, కనీసమైన స్థలం కూడా లేదు. అందు వల్ల టేకాఫ్‌లో విఫలమయ్యే విమానం ఆ నివాస గృహాల మీద కూలిపోక తప్పదు. ఆ నివాస గృహాల భవన సముదాయాల కుప్పలో ఒకటి ఇప్పుడు నలభై మంది వైద్య విద్యార్థులు మరణించిన బీజే మెడికల్ కాలేజ్ విద్యార్థి వసతిగృహం. అయితే ఈ సంగతి ఇప్పుడు, ఇంత ఘోరమైన ప్రమాదం జరిగాక మాత్రమే తెలిసినది కాదు. ఎన్నో భద్రతా అధ్యయనాలు ఈ సంగతి ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉన్నాయి. విమానాశ్రయ రన్ వే అంచుల్లో నివాస గృహాలు ఉన్నాయనీ, ఆ ఇళ్లవాళ్లు తమ చెత్తను ఈ గోడ ఇవతల పారబోస్తున్నారనీ, అక్కడ పురుగులు చేరి, ఆ పురుగుల కోసం పక్షులు వచ్చి, సరిగ్గా విమానం టేకాఫ్ సమయంలో ఫాన్‌లలోకి పక్షులు ఎగిరే అవకాశం ఉందనీ; అక్కడ నేల చదునుగా లేదనీ, మురికి కాల్వల మాన్ హోల్స్ మీద కప్పులు కూడా లేవనీ ఇదివరకు తెలిసిన విషయాలే. అధ్యయనాలలో, నివేదికలలో రాసినవే. పరిష్కరించాలని సిఫారసులు అందినవే. డీజీసీఏ 2019 నివేదికలోనే అహ్మ దాబాద్ విమానాశ్రయం భద్రతా ప్రమాణాలు పాటించడంలో విఫలమయిందని వివరంగా రాసింది. అంతకు ముందే 2018లో ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుజరాత్ ప్రభుత్వానికి సమర్పించిన ఒక విజ్ఞాపనలో రన్ వే భద్రత కోసం, 29.79 ఎకరాల అదనపు స్థలం కావాలని కోరింది. దానికి గుజరాత్ ప్రభుత్వ ఆమోదం కూడా దొరి కింది. కాని అక్కడ ఉన్న 350 కుటుంబాలను తరలించి, స్థలం ఖాళీ చేయించడంలో రాజకీయాలు అడ్డుపడి ఏడు సంవత్సరాలు గడిచినా ఆ పని జరగలేదు.ప్రస్తుత విమానాశ్రయం మీద ఒత్తిడి తగ్గించే పరి ష్కారంగా ధోలేరాలో పదివేల ఎకరాలలో రెండో విమా నాశ్రయాన్ని 2022లో ప్రకటించారు. అది 2025 కల్లా ప్రారంభమవుతుందన్నారు. దాని ప్రచార కార్యక్రమం నడిచినంతగా నిర్మాణ కార్యకలాపాలు సాగలేదు.విజయ్ రూపానీ ఐదు సంవత్సరాల పాటు 2016 నుంచి 2021 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రమా దాల హెచ్చరికలన్నీ ఉన్నాయి. వాటిని నివారించే అవకాశాలూ ఉన్నాయి. కాని నిర్లక్ష్యమే రాజ్యమేలింది. ప్రస్తుత విమాన ప్రమాదంలో రూపానీ విషాదకర మరణానికి ఆ నిర్లక్ష్యమూ కారణమే! ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్ -
యాభై ఏళ్ల చీకటి గాయం
ఏదైనా చారిత్రక పరిణామం మీద సరైన అంచనాకు రావడానికి యాభై ఏళ్ల కాలం విశేషంగా దోహదం చేయగలదు. చరిత్రను పునర్లిలిఖించుకునే బాధ్యత ప్రతి తరం మీద ఉందన్న వాస్తవాన్ని గుర్తిస్తే, 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలాన్నీ, దాని ఫలితాలనూ అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయమే. ఎమర్జెన్సీ విధించిన వారు దేశానికి స్వాతంత్య్రం తెచ్చామని చెప్పే పార్టీ వారు కావచ్చు. అయినా చరిత్ర తీర్పు ముందు అంతా సమానమే. ఎమర్జెన్సీ దేశంలో ‘క్రమశిక్షణ’ తెచ్చిందా? లేక చీకటి యుగంలోకి నెట్టిందా? ప్రేరేపించిన కారణాలేమిటి?1975 జూన్ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర మంత్రిమండలి సిఫారసుతో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 352లోని 1వ నిబంధన ఆ అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చింది. ఆంతరంగిక భద్రతకు తీవ్ర విఘాతం వాటిల్లితే రాష్ట్రపతి ఈ అసాధారణ చర్య తీసుకుంటారు.ఎమర్జెన్సీ విధించిన సమయానికి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అవి రాజ్యాంగం నిర్దేశించినట్టు ఉన్నాయా? 1974 జన వరి నుంచి చూసినా ఆ పరిస్థితులు కానరావు. కొంచెం గట్టిగా కనిపించే పరిణామం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్(జేపీ) సంపూర్ణ విప్లవం మాత్రమే. మెస్‌చార్జీలు తగ్గించాలన్న డిమాండ్‌తో మొదలై, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న స్థాయికి వెళ్లిన గుజరాత్ విద్యార్థి ఆందోళన ఉంది. 1975 జనవరిలో సమస్తిపూర్(బిహార్)లో రైల్వే మంత్రి ఎల్ఎన్ మిశ్రా సభలో బాంబు పేలి, ఆయన చని పోయారు. దీనిని జేపీ ఉద్యమంతో ముడిపెట్టలేక పోయారు.సంపూర్ణ విప్లవానికి మద్దతుగా పార్లమెంటుకు జనతా మార్చ్ నిర్వ హించాలని విపక్షాలన్నీ (సీపీఐ మినహా) నిర్ణయించాయి. ఈ మధ్యలో జరిగిన మరొక అనూహ్య పరిణామం, రాయ్‌బరేలీ ఎన్నిక పిటిషన్‌పై మార్చి 18న అలహాబాద్ హైకోర్టు బోనులో ఇందిర నిలబడటం. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని మొరార్జీ దేశాయ్ ప్రారంభించిన నిరాహార దీక్షను ఏప్రిల్ 13న విరమించారు. ఎన్నికలు జరిపించడానికి ఇందిర సుముఖత వ్యక్తం చేశారు.అయినా స్వతంత్ర భారత చరిత్రను మలుపు తిప్పిన అత్యవసర పరిస్థితి వంటి తీవ్ర నిర్ణయం ఇందిర ఎందుకు తీసుకున్నారు? రెండు తక్షణ కారణాలు. 1971 నాటి సాధారణ ఎన్నికలలో రాయ్‌బరేలీ నియోజక వర్గం నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్‌సిన్హా 1975 జూన్ 12న తీర్పు ఇవ్వడం. ఇందిరపై పోటీ చేసి ఓడిన సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ ఈ కేసు వేశారు. అదే రోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్ని కలలో ప్రజా తీర్పు వచ్చింది. కాంగ్రెస్ ఓడి, జన మోర్చా గెలిచింది. రెండోది: అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద శాశ్వత స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళితే జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ 1975 జూన్ 25న షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చి, ఇందిరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో ఓటు హక్కు లేకుండా చేయడం. న్యాయ వ్యవస్థ చేసిన ఈ రెండు నిర్ణయాలు, గుజరాత్ ప్రజాతీర్పు ఆమెను ఇరకాటంలోకి నెట్టాయి. కాంగ్రెసేతర పక్షాలు ఇందిర పదవిలో కొనసాగడానికి అనర్హులని ప్రకటిస్తూ ఆ సాయంత్రం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సభ నిర్వహించి కొత్త ఉద్యమం కోసం లోక్సంఘర్ష సమితిని ప్రకటించాయి. ఆ అర్ధరాత్రి రాష్ట్ర పతి ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు. మరునాడు ఉదయం ఆరు గంటలకు ఇందిర నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రి మండలి ఎమర్జెన్సీ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి అప్పటి కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి రాష్ట్రపతి సంతకం పడిన తరువాత తెలిసింది.ప్రతిపక్షం అవసరం లేదా?ఇందిర భారత పాలనా వ్యవస్థకు కొత్త రూపం ఇవ్వాలను కున్నారు. దేశాభివృద్ధి అధ్యక్ష తరహా పాలనలోనే సాధ్యమన్న ఒక వాదాన్ని అప్పటికే ప్రచారంలో పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్‌కాంత్ బారువా ‘ఇందిరే ఇండియా, ఇండియా అంటే ఇందిర’ అన్నారు. మరొక నినాదం కూడా ఇచ్చారు. ‘వర్తమాన పరిస్థితులలో భారత దేశానికి అసలు ప్రతిపక్షమే అవసరం లేదు’ అని! నాటి హరి యాణా ముఖ్యమంత్రి ఇందిరను జీవితకాలపు అధ్యక్షురాలిగా (పార్టీకి), తద్వారా యావజ్జీవితం దేశ ప్రధానిగా చూడాలని కోరుకున్నారు.ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యం కూడా ఇందిర చర్యకు ప్రాతిపదిక ఇచ్చాయి. ‘సోవియెట్ నాయకుల సలహాతో దేశంలో అత్యవసర పరి స్థితి విధించినట్లు అర్థమైంది. సోవియెట్‌లో అసంతృప్తి వ్యక్తం చేసిన వారిని సైబీరియాకు పంపిస్తారు. ఇక్కడా ప్రతిపక్షాల వారిని అదే విధంగా జైళ్ల పాలు చేశారు.’ మాజీ గవర్నర్, పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి సుర్జీత్ సింగ్ బర్నాలా రాసిన ‘క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్: స్టోరీ ఆఫ్ ఏన్ ఎస్కేప్’ గ్రంథంలోని వాక్యాలివి. బర్నాలా ఎమర్జెన్సీ బాధితుడే. ‘చిలీ పాలకుడు సాల్వెడార్ అలెండి తరువాత నిన్నే అమెరికా లక్ష్యంగా చేసుకుంది’ అంటూ క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో చేసిన హెచ్చరికతోనే ఇందిరాగాంధీ ఆగమేఘాల మీద అత్యవసర పరిస్థి తిని విధించారన్న వాదన గురించి సంజయ బారు ప్రస్తావించారు. 1975 జూన్ 25 అర్ధరాత్రి రెండు, మూడు గంటల మధ్య జయ ప్రకాశ్ నారాయణ్‌ను, మొరార్జీ దేశాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. మరునాడు ఉదయం జనసంఘ్ నాయకులు వాజ్‌పేయి, అడ్వాణీ, మధు దండావతె, మరికొందరిని బెంగళూరులో అరెస్టు చేశారు.ఆంధ్రలో పెద్దలు గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, జూపూడి యజ్ఞనారాయణ, యలమంచిలి శివాజీ వంటి వారిని అరెస్టు చేశారు. దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ పేరుతో ఆ 21 మాసాలలో దాదాపు లక్ష మందిని అరెస్టు చేశారు. 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.ఎదురు దెబ్బ తప్పదు!ఎమర్జెన్సీ విధించిన వెంటనే తీసుకున్న చర్య సెన్సార్ షిప్. దీనితో దాదాపు భారతీయ పత్రికలన్నీ మూగబోయాయి. ఇది జూన్ 26 నుంచి అమలులోకి వచ్చింది. ఆర్ఎస్ఎస్, ఆనందమార్గ్, జమాతే ఇస్లాం, సీపీఐ (ఎం.ఎల్.)లతో సహా 26 సంస్థలపై నిషేధం విధించారు. న్యాయమూర్తులను బదిలీ చేశారు. క్రమశిక్షణ పేరుతో వందలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆనాడు లోక్‌సభలో ప్రతిపక్షాలన్నింటి బలం అరవై లోపే! కానీ, లోక్ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చరిత్రా త్మక ఉద్యమమే జరిగింది. దాంతో లోక్‌సభకు తాజాగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఇందిర 1977 జనవరి 18న ఆకాశవాణి ప్రసంగంలో వెల్లడించారు. 1977 జనవరి 20న జనతా పార్టీ ఆవిర్భవించింది. ఆ ఎన్నికలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ,సంజయ్‌గాంధీ కూడా ఓడిపోయారు. 1977 మార్చి 21న తాత్కాలిక రాష్ట్రపతి బి.డి. జెట్టి ఎమర్జెన్సీని రద్దు చేశారు.ఎమర్జెన్సీ అంటే కొందరు విపక్షాల నాయకుల అర్ధరాత్రి అరెస్టులు మాత్రమే కాదు. కోటీ పదకొండు లక్షల మందికి జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు; మీసా, డిఫెన్స్ ఇండియా రూల్స్ పేరుతో లక్షా పద మూడు వేల మంది అమాయకుల అక్రమ అరెస్టులు; స్వాతంత్య్ర పోరాటం స్ఫూర్తితో ఏర్పడిన రాజ్యాంగానికి జరిగిన తీరని అవమానం. అన్నింటికి మించి భార తీయ ఆత్మకు అది పెద్ద గాయం. న్యాయ వ్యవస్థ, పత్రికా రంగం భంగపడి ప్రజాస్వామ్యం బలహీనమైంది.ఇక అత్యవసర పరిస్థితి, తదితర పరిణామాల ద్వారా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థిని తానే సిద్ధం చేసుకుంది. బీజేపీ అనే ఒక రాజకీయ పక్షం అలా దేశ రాజకీయ రంగం మీదకు వచ్చింది.డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త ‘జాగృతి’ సంపాదకుడు ‘ 98493 25634 -
డాలర్ వెలవెల... బంగారం ధగధగ
బంగారం ఒక విలువైన లోహం. భారతదేశం వంటి దేశాలలో అది మహిళలకు ఇష్టమైన అలంకారం.లేకుంటే, ధనవంతులకు తమ సంపదను దాచుకునే ఒక మార్గం. కానీ ఇదే బంగారం 1971 ఆగస్టు 15 వరకూ అమెరికా డాలర్‌కు విలువను కల్పించిన సాధనం. నాటి వరకూ, అమెరికా డాలర్ అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలకు అవసరమైన రిజర్వ్ కరెన్సీగా కొనసాగగలిగేటందుకు, ఈ డాలర్ – బంగారం లింక్ ఉపయోగపడింది. అయితే, నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ఈ లింక్‌ను తెగ్గొట్టేశాడు. అంటే, ఇక ముందర తాము ముద్రిస్తోన్న డాలర్లకు ఆ మేరకు, వెనుక తట్టున బంగారాన్ని నిల్వ పెట్టబో మని తేల్చి చెప్పేశాడు. ఈ రకంగా డాలర్ అనేది ఫ్లోటింగ్ కరెన్సీగా మారింది. అంటే, బంగారం లింక్ తెగిపోయిన తర్వాత డాలర్ తాలూకు విలువ, ఇతర దేశాల కరెన్సీ లతో పోలిస్తే, దానికున్న డిమాండ్‌పై ఆధారపడ సాగింది. ఇదే క్రమంలో, ప్రపంచంలోని అనేక కరెన్సీలు మెల్లమెల్లగా ఫ్లోటింగ్ కరెన్సీలుగా మారాయి. ఒక దేశం వివిధ దేశాలతో చేసిన వ్యాపారం తదితర లావాదేవీల ఫలితంగా సమకూరిన అనేక దేశాల కరెన్సీలతో పాటుగా... వాటిలో ఒకటిగా, కొద్దిపా టిగా బంగారం నిల్వలను కూడా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు (మన రిజర్వ్ బ్యాంక్ వంటివి) తమ కిట్టీలో అట్టిపెట్టుకోసాగాయి. కాగా, ఈ కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న వివిధ కరెన్సీల నిల్వలు అన్నింటిలోనూ డాలర్‌దే తిరుగులేని పై చేయిగా ఉంటూ వస్తోంది. కానీ, ఇటీవల మరలా కథ తిరగబడుతోంది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మారకం నిల్వలలో యూరో కరెన్సీని అధిగమించి డాలర్ తరు వాతి స్థానంలోకి బంగారం నిల్వలు చేరుకుంటు న్నాయి. అంటే, డాలర్ యుగం ముగుస్తోందన్న మాట. కానీ దానికి తక్షణ ప్రత్యామ్నాయం కనపడని ఈ సంధి దశలో, బంగారం తిరిగి ప్రాభవంలోకి వస్తోంది. దీనికి తార్కాణమే నేడు కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వల స్థాయి సుమారుగా 36 వేల టన్నులకు చేరుకోవడం. గతంలో ఈ స్థాయిలో అవి ఉన్నది 60 సంవత్సరాల క్రితం మాత్రమే! 1971లోనే బంగారంతో లింక్ తెగిపోయినా... నేటి వరకూ కూడా డాలర్ తన అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ స్థానాన్ని పదిలంగా అట్టిపెట్టుకోగల్గింది. అయితే 1980ల నుంచీ, ఔట్సోర్సింగ్ రూపంలో అమెరికా పరిశ్రమలు చైనా వంటి ఇతర చవక శ్రమ శక్తి దేశాలకు తరలిపోవడం, 1990ల మధ్య నుంచీ, ఇంటర్నెట్ సాంకేతికత వలన అమెరికాలోని సేవా రంగం కూడా పెద్ద ఎత్తున భారతదేశం వంటి దేశాలకు తరలి వెళ్ళిపోవడం; యాంత్రీకరణ వేగం పెరిగి అమెరికాలో ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గి పోవడం... ఫలితంగా వారి కొనుగోలు శక్తి పడిపోయే పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే అమెరికా భారీ ఎత్తున ఇతర దేశాల దగ్గర అప్పులు చేయసాగింది. అంతిమంగా నేడు ఈ అప్పు స్థాయి సుమారుగా 35 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అమెరికా పాలకులు తమ ప్రజల కొనుగోలు శక్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగా 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో, 2020 కోవిడ్ లాక్డౌన్ కాలంలో ఉద్దీపన పథకాల కోసం పెద్ద ఎత్తున లక్షల కోట్ల డాలర్లను ముద్రించారు. అంతకు ముందర అనేక దశాబ్దాలుగా కూడా అమెరికాలో డాలర్ల ముద్రణ శ్రుతి మించి జరిగింది. ఈ క్రమంలోనే డాలర్ కరెన్సీ తన విలువను కోల్పోసాగింది. 2022 అనంతరం, ఆ దేశంలో విజృంభించిన ద్రవ్యోల్బణం లేదా ధరల పెరుగుదల అనేవి దశాబ్దాల పాటు జరి గిన డాలర్ల అపరిమిత ముద్రణ ఫలితమే.ఈ క్రమంలోనే, బలహీనపడుతోన్న డాలర్ రూపంలో తమ తమ విదేశీ మారకద్రవ్య నిల్వలను అట్టిపెట్టుకోవడం కంటే, బంగారం వంటి నికరంగా విలువను నిలబెట్టుకోగల ప్రత్యామ్నాయాన్ని ఆశ్ర యించడం మేలని కేంద్ర బ్యాంకులు నిర్ణయించుకుంటున్నాయి. దీనంతటితో పాటుగా, రష్యా – ఉక్రెయిన్ యుద్ధ క్రమంలో, అమెరికా ప్రభుత్వం రష్యాపై అనేక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలలో భాగంగా అమె రికా డాలర్ కరెన్సీ లావాదేవీల వ్యవస్థ నుంచి, రష్యాను బయటకు నెట్టివేసింది. ఈ బహిష్కరణ అనేది ప్రపంచంలోని చాలా దేశాలకు డాలర్‌పై ఆధారపడడం తాలూకు అభద్రతను బోధపరిచింది. ఫలితంగా, నేడు పలు దేశాలు డాలర్‌పై ఆధారపడ డాన్ని తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అవి బంగారం దిశగా కూడా మళ్ళుతున్నాయి.గత 15 ఏళ్లుగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. 2024లో ఇవి రికార్డు స్థాయిలో 1,180 టన్నుల బంగా రాన్ని కొనుగోలు చేశాయి. కేంద్ర బ్యాంకుల కిట్టీలో బంగారం నిల్వల స్థాయి పెరుగుతూ రావడం అనేది... పాత డాలర్ యుగం ఆధిపత్య స్థానంలో మరో సరికొత్త కరెన్సీ లేదా కరెన్సీల సమూహం వచ్చి చేరే వరకూ నడిచే సంధి యుగం లక్షణమే.డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
భారత్‌లో మధ్యప్రాచ్యపు సెగలు
2025 జూన్ 12, 13 వేకువజాముల్లో ఇజ్రాయెల్ భారీ సైనిక చర్యకు తెరతీసింది. ఇరాన్ అణుశక్తి సదుపాయాల మీద దాడులు చేసింది. రెండు దేశాల నడుమ నెలల తరబడిగా సాగుతున్న ఉద్రిక్తత, ఈ ఘటనతో పెను యుద్ధంగా మారింది.దశాబ్దాల నుంచీ అపరిష్కృతంగా కొన సాగుతున్న భౌగోళిక రాజకీయ వైరాలు ఎంత దారుణంగా పరిణమిస్తాయో అంద రికీ అవగతమైంది. ఈ యుద్ధాలను ప్రజలు ప్రారంభించారా? లేదు! ఎవరెవరి అధికార దాహానికో వారు బలవుతున్నారు. ఇజ్రాయెల్ దాడి ఫలితంగా మధ్యప్రాచ్యంలో యుద్ధం తప్ప దన్న అంచనాలతో బ్రెంట్ క్రూడ్ ధర భగ్గుమని బ్యారెల్ 116 డాలర్లకు చేరింది. కోవిడ్, ఉక్రెయిన్, ఎర్ర సముద్రం సంక్షోభాలతో విచ్ఛిన్నమై ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న ప్రపంచ సరఫరా వ్యవస్థలు మరోసారి ఖంగుతిన్నాయి. ఇరాన్‌లోని హోర్మూజ్ జల సంధి హై–రిస్క్ యుద్ధక్షేత్రంలో ఉండటంతో, అంతర్జాతీయ చమురు సరఫరాలు 20 శాతం నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో నౌకారవాణాపై బీమా చార్జీలు ఒక్కఉదుటున నాలుగు రెట్లు పెరిగాయి. మరోవైపు ఇన్వెస్టర్లు తమ నిధులను సురక్షితమైన బంగారం మార్కెట్లోకి తరలించడంతో, అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు (31.1 గ్రాములు) 2,450 డాలర్ల రికార్డు ధర పలికింది. ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి.ఇండియా తప్పించుకోగలదా?అనేక వర్ధమాన దేశాలతో పాటు ఇండియా సైతం ఈ పరిణా మాల ప్రభావం నుంచి తప్పించుకోలేదు. ఇంధన, ఆహార ధరలు పెరుగుతాయి. ఉపాధి దెబ్బతింటుంది. కోట్ల మంది జీవితాలు మధ్య ప్రాచ్య ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడి ఉన్నాయి. ఇండియా తన అవసరాల్లో రమారమి 85 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ధరల్లో కొద్ది పాటి తేడా వచ్చినా రూపాయి విలువ ఆటుపోట్లకు గురవుతుంది. గల్ఫ్ దేశాల్లో ఇంజి నీర్లు, నర్సులు, కార్మికులు, ప్రొఫెషనల్స్‌గా 90 లక్షల మంది భారతీ యులు పనిచేస్తున్నారు. వారి భద్రత ఇప్పుడు అపాయంలో పడింది. వారు ఏడాదికి 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే నిధులు స్వదే శానికి పంపిస్తున్నారు. ఎన్నో లక్షల కుటుంబాలు ఈ డబ్బుతోనే జీవనం సాగిస్తున్నాయి. ఇక, మధ్య ఆసియాను ఇండియాతో అనుసంధానం చేసే ఇరాన్ చాబహార్ పోర్టు కూడా యుద్ధ ప్రాంతంలోనే ఉంది. ఇండియాకు ఎంతో ముఖ్యమైన ఈ వాణిజ్య పోర్టు ప్రాజెక్టు నుంచి వైదొలగాల్సిందిగా ఇప్పుడు అమెరికా నుంచి ఒత్తిడి వస్తుంది. రెడ్ సీ, హోర్మూజ్‌ల ముట్టడి ముప్పు కూడా పొంచి ఉంది. 60 శాతం పైగా ఇండియా వర్తకం ఈ కారిడార్ల ద్వారానే జరుగుతోంది. దాడి, ప్రతిదాడుల దృష్ట్యా సరుకు రవాణాలో జాప్యం జరుగుతుంది. బీమా వ్యయాలు చకచకా పెరుగుతున్నాయి. దీంతో విదేశీ వాణిజ్యం దెబ్బ తింటుంది. కరెన్సీ మార్కెట్ లోనూ అస్థిరత్వం చోటు చేసుకుంటుంది. డాలరుకు రూపాయి విలువ ఇప్పటికే 86 దాటింది. దీంతో మార్కెట్లో సరఫరా పెంచేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయించాల్సి వస్తుంది. ఫలితంగా ప్రభుత్వ విదేశీ మారక నిల్వలు క్షీణిస్తాయి. ఈ అంకెలకు అందని నష్టం మరొకటి ఉంది. అది లెక్కించడానికి అలవి కానిది. పెరిగే చమురు ధరల వెనుక, నౌకా రవాణాలో జాప్యం వెనుక ఎందరో సామాన్యుల ఇక్కట్లు దాగి ఉంటాయి. పూర్తిస్థాయి యుద్ధం కొనసాగితే అది ఒక ప్రాంతానికి పరి మితం కాదు. ప్రపంచ వ్యాప్త అస్థిరతకు నాంది పలుకుతుంది. మధ్యప్రాచ్యపు అగ్నిజ్వాలలు ఖండాంతర కార్పొరేట్ బోర్డు రూము ల్లోకి, కుటుంబాల డైనింగ్ టేబుల్స్ మీదకు, పాఠశాలల క్లాస్ రూముల్లోకి నాలుకలు జాపుతూ విస్తరిస్తాయి.నష్ట నివారణ చర్యలువాటి బారిన పడకుండా ఇండియా లోగడ రూపొందించుకున్న వ్యూహాలు, యంత్రాంగాలు ఎంతవరకు ఉపకరిస్తాయన్నది కీలకం. వీటిలో ముందుగా ప్రస్తావించాల్సింది ఇంధన కవచం. దేశంలోని 39 మిలియన్ బ్యారెళ్ల వ్యూహాత్మక రిజర్వుల నుంచి అవసరమైనప్పు డల్లా కొంత కొంత చమురును మార్కెట్లోకి విడుదల చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. స్వల్పకాలిక ధరల ఒడుదొడుకులను ఈ విధానంతో అధిగమించవచ్చు. గల్ఫ్ చమురు సరఫరా లోటు భర్తీ చేసేందుకు రష్యా, వెనిజులా, బ్రెజిల్, గయానా దేశాల నుంచి దిగు మతులను పెంచుతోంది. అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమై ఇంధన దిగుమతులకు డాలర్లకు కొరత ఏర్పడేట్లయితే, దాన్ని తట్టుకు నేందుకు వీలుగా ద్వైపాక్షిక చెల్లింపు(రూపాయిల్లో పేమెంటు) ఏర్పాట్లను పునః ప్రారంభిస్తోంది.ప్రవాసుల భద్రత మరో అంశం. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్ దేశాల్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవాసుల కోసం నిరంతరాయంగా పనిచేసే సహాయక కేంద్రాలను ప్రారంభించింది. అత్యవసర పరిస్థితిలో వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రణాళికలు రూపొందించి గల్ఫ్ ప్రభుత్వాల సహకారంతో వాటికి రిహార్సల్స్ చేస్తోంది. స్వదేశాలకు డబ్బు పంపించడానికి ఇబ్బంది లేకుండా యూపీఐ ఆధారిత నగదు చెల్లింపు ఏర్పాట్లు జరిగాయి.దౌత్యపరంగా సున్నితమైన సమతుల్యతను ఇండియా పాటిస్తోంది. ఒమన్, యూఏఈ, సౌదీలతో తెరవెనుక దౌత్యం నెరపుతోంది. తక్షణం వైరాలకు స్వస్తి పలకాలని, ఉద్రిక్తతలను నివారించాలని, బేషరతు చర్చలు జరపాలని యూఎన్ సమావేశంలో పిలుపు నిచ్చింది. మరోవంక, ఇండియన్ నేవీ అరేబియా సముద్రంలో 16 యుద్ధనౌకలను సన్నద్ధం చేసింది. గల్ఫ్ గస్తీలను పెంచింది. ప్రస్తుత ఘర్షణలు ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోకుండా సైబర్ ఇంటెలిజన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ద్రవ్యరంగంలో కరెన్సీ ఆటుపోట్లను నివారించేందుకు ఆర్బీఐ చేతిలో 643 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం జడలు విప్పకుండా కేంద్రం అదనపు ఆహార నిల్వలను విడుదల చేస్తోంది. ఎంఎస్ఎమ్ఈ ఎగుమతిదారు లకు ఇచ్చే ఎగుమతి ప్రోత్సాహకాలు, రుణహామీలు రెడ్ సీ బాధిత సంస్థలకూ వర్తింప చేస్తోంది. మన వ్యూహం ప్రస్తుత సైనిక ఘర్షణల సమయంలో ఇండియా ‘పవర్ ప్లేయర్’గా ఉండాలనుకోవడం లేదు. ఇంధన భద్రత, ప్రవాసుల క్షేమం, వర్తక మార్గాల రక్షణ... ఈ మూడు అంశాలకూ ప్రాధాన్యం ఇస్తూ, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తోంది. దీనికోసం అనివార్యంగా ‘సంరక్షణాత్మక తటస్థత’ అనే సంక్లిష్ట వ్యూహం అనుసరించాల్సి వస్తోంది. జూన్ 2025 ఒక సంక్షుభిత దశాబ్దాన్ని వినాశకరమైన మలుపు తిప్పింది. ఇరాన్ అణు మౌలిక సదుపాయలపై జరిగిన దాడి, ఇరాన్ ప్రతీకార దాడుల ఫలితంగా మధ్యప్రాచ్యం అంతటా దీర్ఘకాలిక అస్థి రత నెలకొంటుంది. ఇండియా విషయానికి వస్తే, ఈ పరిణామాన్ని విదేశాంగ విధానానికి సవాలుగా మాత్రమే పరిగణించలేము. వ్యూహా త్మక పరిపక్వతకు, ఆర్థిక పటుత్వానికి, నైతిక స్థైర్యానికి ఇది ఒక పరీక్ష లాంటిది. మనం అప్రమత్తంగా ఉంటూ, మధ్యప్రాచ్యంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలని, మనకు చేరువలోనే కాలి బూడిదవుతున్న ఈ ప్రాంతంలో తిరిగి వివేకం ఉదయించాలని కోరుకోవాలి.శైలేశ్ హరిభక్తి వ్యాసకర్త పారిశ్రామికవేత్త, పర్యావరణ కార్యకర్త(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
ఉన్నత స్థానాల్లో ఉన్నా ...
భారతదేశంలో మహార్లు వీరోచితమైన చరిత్ర కలిగినవారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఇటు వంటి మహార్లలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఆయన తండ్రి రాంజీ సక్పాల్ భక్తి ఉద్యమానికి సంబంధించిన వారు. అంబేడ్కర్ బౌద్ధమతం స్వీకరించేవరకూ మహార్లు భక్తి ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించిన కబీర్ అనుయాయులుగా ఉన్నారు. ఆ తర్వాత బౌద్ధంలోకి మారారు. 1956 డిసెంబర్ 6న అంబేడ్కర్ ఇచ్చిన బౌద్ధ ధర్మ దీక్ష పొందినవారిలో ఒకరు రామకష్ణ సూర్య భాను గవాయి కుమార్. ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి (బీఆర్ గవాయి) ఆయన కుమారుడే. తండ్రి వారస త్వాన్ని అందిపుచ్చుకుని బౌద్ధ మతస్థులతో కొనసాగు తున్న జస్టిస్ గవాయి బౌద్ధ జీవన వికాసానికీ, ఆత్మ గౌరవ స్వరానికీ, అవమానాన్ని ఎదిరించగలిగిన తత్వానికీ నిదర్శనంగా నిలిచారు.దళితులు ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగినప్ప టికీ ఏదో ఒక రూపంలో భారతీయ నిచ్చెన మెట్ల కుల సమాజంలో అవమానాలు ఎదుర్కొనవలసి రావడం విషాదకరం. దళితుడైన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కేరళ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్ఠించారు. ఆయన తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నట్లు పదవీ విరమణ తరువాత చెప్పారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన కె.ఆర్. నారాయణ్ ఫ్రాన్స్‌లో గెస్ట్‌హౌస్‌లో ఉన్నప్పుడు ఒక విలేకరి ‘ఇండియన్ అన్ టచ్బుల్’ అన్న విషయాన్ని స్వయంగా పేర్కొన్న విషయం గమనార్హం. ఇప్పుడు దళితుడైన జస్టిస్ బీఆర్ గవాయి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అయిన తర్వాత ఆయనకు తొలినాళ్లలోనే దక్కవలసిన ప్రొటోకాల్ మర్యాద దక్కకపోవడం చర్చనీయాంశం అయ్యింది.జస్టిస్ గవాయి సీజేఐ అయిన సందర్భంగా మహారాష్ట్ర–గోవా బార్ కౌన్సిల్ ఆయనకు ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్య క్రమానికి మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్ వంటి ఉన్నతాధికారులు హాజరు కాలేదు. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి సీజేఐ వంటి ఉన్నత పదవికి ఎంపికైన తరువాత రాష్ట్రానికి తొలిసారి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. కానీ వారు హాజరు కాలేదు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘నేను నాకు లభించాల్సిన గౌరవం గురించి మాట్లాడడం లేదు. ఒక రాజ్యాంగ వ్యవస్థకు మరో రాజ్యాంగ వ్యవస్థ ఇవ్వాల్సిన గౌరవం గురించి మాట్లాడుతున్నాను’ అని అన్నారు.జస్టిస్ గవాయి గొప్ప సందేశకుడు, ధైర్యశాలి, నిక్కచ్చిగా మాట్లాడటం ఆయన నైజం. ఆయన ప్రమాణ స్వీకారం తరువాత చేసిన ప్రసంగం ఆలో చనను రేకెత్తించింది. దేశంలో ఏ వ్యవస్థా గొప్పది కాదనీ, భారత రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనదనీ ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాలు అయిన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూడూ సమానమేననీ, అవి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలనీ, పరస్పరం గౌరవించుకోవాలనీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర–గోవా బార్ కౌన్సిల్ సత్కార సభలో ఆయన ఇచ్చిన 50 కీలక తీర్పుల సంకలన గ్రంథ ఆవిష్కారం జరిగింది. ఆ సందర్భంగా బుల్డోజర్ న్యాయానికి వ్యతిరేకంగా తానిచ్చిన తీర్పు గురించి వివరించారు. ‘నివాస హక్కు ప్రాథమిక హక్కు. ఏ వ్యక్తి అయినా ఏదైనా కేసులో నిందితుడైనా, దోషిగా నిర్ధారణ అయినా... అతడి కుటుంబ నివాసం చట్టబద్ధమైనదైతే దానిని తొలగించడానికి, కూల్చడానికి వీల్లేదు. చట్టాన్ని అనుసరించి వ్యవహరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. బుద్ధిస్టు అయిన దళితుడు దేశ అత్యున్నత న్యాయమూర్తి కావడం మంచి పరిణామం.అంబేడ్కర్ భారత రాజ్యాంగకర్తగా ఉండి అనేక అవమానాలు పొందారు. అయితే ఆయన సానుకూల దృక్పథంతో ప్రత్యామ్నాయాలు సృష్టిస్తూ వెళ్ళారు. ఇపుడు భారత రాజ్యాంగ అనుసరణ అనేది ఒక ప్రధాన భూమికగా మారింది. దశాబ్దంలో హిందూ మతోన్మాదశక్తులు, కార్పొరేట్ ఆధిపత్య శక్తులు జమిలిగా మనుస్మృతి భావాజాల ఆధిక్యతను ప్రకటించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ గవాయి ఇచ్చిన ఆత్మ గౌరవ ఫీలింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు’ అని అంబేడ్కర్ చెప్పారు. ఈ సూత్రాన్ని గ్రహించి దేశంలో రాజ్యాంగం పేర్కొంటున్న సమానత్వం నెలకొనడానికి కృషి జరగాలి. రాజ్యాంగాన్ని అమలు చేసే స్థానంలో ఉన్న వారే కుల వ్యవస్థ దారుణాన్ని చవిచూసినవారైతే వారు ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడుమొబైల్: 98497 41695 -
రైతాంగం కష్టాలు కొనసాగాల్సిందేనా!
కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో వరితో సహా 14 పంటలకు అర కొరగా పెంచిన కనీస మద్దతు ధరల ప్రకటన రైతులను ఉస్సూరుమనిపిస్తోంది. కేంద్రం ప్రకటించిన ధరలను పరిశీలిస్తే, క్వింటాలు వరికి రూ. 69, జొన్నలకు రూ. 328, సజ్జలకు రూ. 150, మొక్కజొన్నకు రూ. 150, కంది పప్పుకు రూ. 450, పెసర్లకు రూ. 86, మిను ములకు రూ. 400, వేరుశనగకు రూ. 480, పొద్దుతిరుగుడుకు రూ.441, సోయాబీన్‌కు రూ. 436, పత్తికి రూ. 589, కుసుమలకు రూ. 579, రాగులకు రూ. 596లు మేర మాత్రమే పెంచారు. ఆశ్చర్యం ఏమంటే ఈసారి పెంపుదల 2024 –25లో పెంచిన దానికంటే తక్కువ ఉండటం.అన్నదాతకు అన్యాయం జరగడం కొత్త కానప్పటికీ... దాదాపు 3 ఏళ్ల క్రితం మన కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉరితాళ్ల వంటి 3 వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలపాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు సాగించిన పోరాటం నేపథ్యంలో పంటల కనీస మద్దతు ధరల చట్టబద్ధతపై అవకాశాల పరిశీలన కోసం కమిటీ వేస్తామనీ, కమిటీ సూచనల ప్రకారమే నిర్ణ యాలు తీసుకొంటామనీ ఇచ్చిన రాతపూర్వక హామీకి ఇప్పటివరకు అతీగతీ లేదు. సంస్కరణలు అనివార్యం కనీస మద్దతు ధరలను నిర్ణయించే ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న పంటల ఉత్పత్తి వ్యయాన్ని రాష్ట్రాల వారీగా లెక్కించి, దానిని జాతీయ సగటుగా లెక్కించడం సరియైనది కాదు. సాగు ఖర్చులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఎంతో ఉంది. సగటు లెక్కన ధరలు నిర్ణ యించడం వల్ల ఎక్కువ ఖర్చు ఉన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నది. దేశంలో ప్రధాన పంటల సాగు వ్యయాన్ని లెక్కించేందుకు ఎప్పుడో ఏర్పాటైన వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ – సీఏసీపీ) వరుసగా మూడేళ్ల పంట సాగు వ్యయాన్ని లెక్కించి, దాని ఆధారంగా కనీస మద్దతు ధరల్ని లెక్కించి... ఆ వివరాలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీకి నివేదిస్తుంది. ‘సీఏసీపీ’కి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ... ఆ సంస్థ నివేదించే ధరల్ని కేంద్రం యథాతథంగా ఆమోదించడం లేదు. వాటికి సవరణలు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తమ వద్దనే ఉంచుకుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, మరోవైపు సీఏసీపీ పంటల ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించడానికి భారీ కసరత్తు జరిపి అందిస్తున్న నివేదికల్ని బుట్టదాఖలు చేస్తున్నప్పుడు... అసలు ఆ సుదీర్ఘ కసరత్తు వల్ల ఒనగూడుతున్న ప్రయోజనం ఏమిటి? వాటికయ్యే ఖర్చు, సమయం వృథా అవడం తప్ప?!2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చి ఆరేళ్లు దాటింది. అందుకు అనుగుణంగానే వ్యవసాయ రంగంపై ‘నీతి ఆయోగ్’ ఓ కార్యాచరణ ప్రణాళికా పత్రాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందించింది. కానీ, అది కూడా రైతాంగానికి చేసిన మేలేమీ లేదు. 2006లో డా‘‘ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ అందించిన సిఫార్సుల మేరకు ఉత్పత్తి వ్యయానికి 50 శాతం జోడించి కనీస మద్దతు ధరల్ని ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు నమ్మబలికి, మరో వైపు స్వామినాథన్ చెప్పిన íసీ2+ 50 శాతం ఫార్ములాను అనుసరించి ఎంఎస్పీ ఇస్తే నిత్యావసరాల ధరలు పెరిగి వినియోగదారుడి నడ్డి విరుగుతుందంటూ సుప్రీం కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసి చేతులు దులుపుకొంది. అంతేకాదు... స్వామినాథన్ చెప్పిన సీ2+ 50 శాతం ఫార్ములాకు కొత్త భాష్యం చెప్పే దుస్సాహసం చేసింది కూడా! ఉదాహరణకు ఈ ఏడాది క్వింటాలు వరి ఉత్పత్తికి జాతీయ సగటు ఉత్పత్తి వ్యయం రూ. 3,135 అని రైతు సంఘాలు శాస్త్రీయంగా అంచనా వేశాయి. అయితే, తాజాగా కేంద్రం వరికి ప్రకటించిన ఎంఎస్పీ రూ. 2,369. అదేవిధంగా పత్తికి రూ. 16 వేల ధర ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం సీఏసీపీకి నివేదిస్తే... కేంద్రం పత్తికి ప్రకటించిన ధర రూ. 7,710కు పరిమితం అయింది. ఈ లెక్కలు అన్ని ప్రధాన పంటలకూ వర్తిస్తాయి.వ్యవసాయ రంగాన్ని మెరుగుపర్చే అవకాశాలు గతంలో కంటే ఇపుడు ఎక్కువగానే ఉన్నాయి. రైతాంగానికి సాగు ఖర్చును గణ నీయంగా తగ్గించి ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచే అవకాశాలు అనేకం అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాగుకయ్యే వ్యయాన్ని; చీడ పీడలు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల్ని గణనీయంగా తగ్గించవచ్చు. చాలా దేశాలు వ్యవసాయరంగంలో బయో టెక్నాలజీని సమర్థంగా వినియోగించి మంచి ఫలితాలు రాబడుతున్నాయి. వాతావరణ మార్పుల్ని ముందుగానే అంచనా వేసే సాంకేతిక పరి జ్ఞానాన్ని రైతులకు అందిస్తున్నారు. నీటికొరత, వర్షపు నీటి ముంపు, తెగుళ్లు వంటి వాటిని సమర్థంగా తట్టుకోగల వంగడాలను సృష్టిస్తున్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం, యాంత్రీ కరణ గణనీయంగా పెరిగింది. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్‌ను ఉపయోగించి ఏ నేల ఏ పంటలకు అనుకూలమో తెలుసుకొని అందుకు అనుగుణమైన పంటలు పండిస్తున్నారు.ఇక, ప్రధానంగా గిట్టుబాటు ధరలకు సంబంధించి... దళారీల ప్రమేయం లేకుండా మార్కెట్ యార్డులను సమర్థంగా నిర్వహిస్తు న్నారు. పంటల ఉత్పత్తి ధర కంటే మార్కెట్ యార్డులో ధర ఎక్కు వగా ఉన్నప్పుడే... దానిని అమ్మాలనే నిబంధన కచ్చితంగా అమలు చేస్తున్నారు. అలా జరగడం కోసం పంటకు గిట్టుబాటు ధరను కనీస రిజర్వు ధరగా చట్టపరంగా పరిగణిస్తున్నారు. అయితే, ఈ రిజర్వు ధర అన్నది ఒకేలా ఉండదు. దిగుబడిని బట్టి రిజర్వు ధర ఆధారపడి ఉంటుంది. చైనా, థాయ్‌లాండ్, జపాన్ వంటి దేశాలలో సహకార పద్ధతిలో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. దాని వల్ల మంచి ధరల కోసం వారు గట్టిగా బేరమాడగలుగుతున్నారు. ఆస్ట్రే లియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో రైతుల తరఫున బేరసారాలు సాగించడానికి ప్రత్యేక డైరక్టర్‌ను అన్ని మార్కెట్ యార్డుల్లో నియ మిస్తున్నాయి. ఇటువంటి సదుపాయాలు, వెసులుబాట్ల కారణంగా రైతాంగానికి ఇంతకు ముందు లేని రక్షణ కలుగుతోంది. ఈ విధానా లన్నీ మన దేశంలో కూడా అమలు చేసినట్లయితే... రైతులకు మేలు జరుగుతుంది.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, మాజీ కేంద్రమంత్రి -
తలొగ్గుతారా? తయారు చేస్తారా?
పరిస్థితి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇరాన్ ఎదుట మిగిలిన మార్గాలు రెండే! అమెరికా, ఇజ్రాయెల్‌ల ఒత్తిడికి లొంగిపోయి జీవించటమా? లేక స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవించటం కోసం అణ్వాయుధాలను తయారు చేసుకోవటమా? అణ్వస్త్ర తయారీని ఇరాన్ కోరుకోవటం లేదు. అటువంటి సామూహిక హనన శక్తి గల ఆయుధ ఉత్పత్తి ఇస్లాం బోధనలకు విరుద్ధమనే సైద్ధాంతిక వైఖరి తీసుకున్న ఇరాన్ అధినేత అయతొల్లా ఖొమేనీ ఆ మేరకు ఆదేశాలు ఎన్నడో జారీ చేశారు. అణుశక్తిని శాంతియుత అవసరాల కోసమే ఉపయోగించగలమని పలుసార్లు ప్రకటించారు. కానీ అమెరికా శిబిరానికి మౌలికంగా ఇరాన్ పట్లనే శత్రుత్వం ఉంది. అక్కడ అణు పరిశోధనలన్నవి సాకు మాత్రమే!అమెరికా అండతోనే...ఒకసారి ఇటీవలి పరిణామ క్రమాన్ని చూద్దాం. అణు పరిశోధ నలు, వాటి పరిమితుల విషయమై ఇరాన్, అమెరికాల మధ్య ఖతార్‌లో అయిదు విడతల చర్చలు జరిగాయి. ఆరవ విడత ఈ నెల 15న జరగాల్సి ఉండగా, రెండు రోజుల ముందు 13న ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాయి. దాడుల గురించి తమకు ముందే తెలుసు నని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూన్ 14న స్వయంగా ప్రకటించారు. తాము అమెరికాతో సమన్వయం చేసుకునే దాడులు చేస్తున్నా మని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అంతకుముందు 13 నాడే అన్నారు. తమ ఇంటెలిజెన్స్ సమాచారంతో, తాము సరఫరా చేస్తున్న ఆయుధాలతోనే దాడులు సాగుతున్నాయని ట్రంప్ 14న వెల్లడించారు. దాడులకు రెండు రోజుల ముందే అమెరికా ప్రభుత్వం పశ్చి మాసియా ప్రాంతంలోని తమ పౌరులకు, దౌత్య కార్యాలయాలకు జాగ్రత్తలు చెప్పి, తమ సైనిక స్థావరాలకు తగు హెచ్చరికలు చేసింది. అయినా తమకు దాడులతో నిమిత్తం లేదని వాదిస్తున్నది.దీన్ని బట్టి కొన్ని ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. పాల స్తీనాతో ముడిబడిన చర్యలకు ఇరాన్ మిత్ర సంస్థలు ఇతర భూభాగాల నుంచి దాడులకు పాల్పడుతుండటం, వాటిపై ఇజ్రాయెల్ ప్రతి చర్యలు కొత్తవి కాదు. అవి ఎట్లున్నా, అణు పరిశోధనల విషయమై ఇరాన్ – అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి ఈ 15 నాటి ఆరవ విడతలో ఫలించే అవకాశం ఉందని ట్రంప్ సైతం కొద్ది రోజులుగా అంటూ వస్తున్నారు. ఇదంతా నెతన్యాహూకు తెలిసినదే. అటువంటపుడు చర్చలకు సరిగ్గా రెండు రోజుల ముందు దాడులే మిటి? ఈ ప్రశ్నలపై నిపుణుల నుంచి రెండు అభిప్రాయాలు విన వస్తున్నాయి. ఒకటి, అమెరికా–ఇరాన్ చర్చలను, ఒకవేళ పరిష్కారం కుదిరే అవకాశం ఉంటే దానిని భంగపరచటం కోసమే ఇజ్రాయెల్ ఆ పని చేసిందన్నది. రెండు, ముందస్తు దాడులతో ఇరాన్‌ను భయపెట్టి చర్చలతో దారికి తెచ్చుకోవటం ట్రంప్ ఎత్తుగడ అన్నది. ఈ రెండింటిలో దేనికి అదిగా నిజం కాగల అవకాశాలు ఉన్నాయి కూడా. ఇరాన్‌తో రాజీ ఇజ్రాయెల్‌కు ఎంత మాత్రం ఇష్టం లేనిది. అందుకోసం వారు అమెరికానైనా ధిక్కరించగలరు. ఎందుకంటే, పాలస్తీ నాకు నిజమైన మిత్ర దేశంగా మిగిలింది ఆ ప్రాంతంలో ఇరాన్ ఒక్కటే. వేర్వేరు అరబ్ దేశాలను అమెరికా ద్వారా మిత్రులుగా మార్చుకుంటున్నా, ఎంత మాత్రం రాజీ పడనిది ఇరాన్ మాత్రమే. కనుక దానిని ధ్వంసం చేయాలి. అమెరికాకు సంబంధించి, ఇజ్రా యెల్‌తో వైరాన్ని వదిలి, పాలస్తీనా కోసం పట్టుబట్టనట్లయితే సరి పోతుంది. ఆ విధంగా ఇజ్రాయెల్, అమెరికాల మధ్య కొద్దిపాటి వ్యత్యాసం ఉంది.వైఖరుల్లో తేడా!అణుశక్తి విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇరాన్ అణుశక్తి పరిశో ధనలు ఒక పరిమితికి లోబడి జరగాలని, అణ్వాయుధాల ఉత్పత్తికి అవసరమయ్యే యురేనియం 90 శాతం శుద్ధి జరగరాదని 2016లో ఇరాన్‌కు, అమెరికా తదితర దేశాలకు మధ్య అంగీకారం కుదిరింది. అందుకు బదులు ఇరాన్‌పై ఆంక్షలు సడలించాలన్నారు. కానీ రెండేళ్ల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ కూడబలుక్కోవటంతో ఆ ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకుంది. అప్పుడు కూడా అధ్యక్షుడు ట్రంప్. అప్పటినుంచి ఈ ఏడేళ్లుగా అణు రాజకీయం నడుస్తూనే ఉంది. అణ్వస్త్రాల కోసం యురేనియంను 90 శాతానికి, అంతకన్నా మించి శుద్ధి చేయవలసి ఉంటుంది. శాంతియుత అవసరాలకు అంత కులోపు అయితే సరిపోతుంది. ఇరాన్ కేంద్రాల్లో ప్రస్తుతం శుద్ధి 60 శాతంగా ఉంది. ఆ మాట ఇరాన్ ప్రభుత్వం చెప్పటమే కాదు అణుశక్తి సంస్థ కూడా ధ్రువీకరించింది. అయినప్పటికీ ఇజ్రాయెలీ నిఘా సంస్థలు మాత్రం తొమ్మిది అణ్వస్త్రాలకు కావలసినంత శుద్ధి ఇప్పటికే జరిగిపోయిందనీ, త్వరలో పదిహేనింటికి జరుగుతుందనీ ప్రచారం మొదలు పెట్టాయి. గమనించదగినదేమంటే అమెరికా మాత్రం ఈ మాట నేటికీ అనటం లేదు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయ కూడదనేది ఒక్కటే తమ షరతని ప్రకటిస్తోంది. ఈ విషయమై ఇజ్రాయెల్, అమెరికా వైఖరుల మధ్య తేడా కనిపిస్తుంది. కనీసం శాంతియుత ప్రయోజనాల కోసమైనా సరే ఇరాన్ పరిశోధనలు ససేమిరా చేయరాదని, స్వయంగా శుద్ధి చేయక పోవటమేగాక, పరిమిత శుద్ధి గల ఇంధనాన్ని అయినా ఇతరుల నుంచి దిగుమతి చేసుకునేందుకు వీలు లేదన్నది ఇజ్రాయెల్ వాదన. ట్రంప్ వైఖరిలో ఇతర అంశాలకు సంబంధించి వలెనే ఇందులోనూ చంచలత్వం కనిపిస్తుంది. ఒకవేళ ఖతార్ చర్చలు సాగి ఉంటే అంగీ కారం ఏదైనా కుదిరేదేమో తెలియదు. అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయబోమని మాత్రం ఇరాన్ స్పష్టం చేస్తోంది. తాము జోక్యం చేసుకుని ఏదైనా మధ్యే మార్గానికి ప్రయత్నించగలమని రష్యా కూడా అంటున్నది. ఇపుడు అకస్మాత్తుగా ఇజ్రాయెల్ దాడులు చేయటంతో, అందుకు అమెరికా తోడ్పడినట్లు ట్రంప్ మాటలలోనే కనిపిస్తుండటం వల్ల, తాము చర్చలకు 15న వెళ్లబోవటం లేదని ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో, ఇది శాశ్వత బహిష్కరణ అనక పోవటం గమనించదగ్గది. ఇరాన్ నిజాయతీని, దౌత్య మార్గంలో పరిష్కారానికి కట్టుబడటాన్ని అది చెప్తున్నది.రహస్య అణు కేంద్రాలు?అయితే, ఇరాన్ అణుశుద్ధి అణ్వస్త్ర తయారీ గురించి చెప్పు కోవలసినవి మరికొన్ని ఉన్నాయి. యురేనియం శుద్ధి 90 శాతం మేర ఇప్పటికే జరిగిందనేందుకు ఎటువంటి ఆధారాలూ అమెరికన్ల వద్ద సైతం లేవు. అణు ఇంధన సంస్థ కూడా ఆ మాట అనటం లేదు. కానీ, ఇరాన్ తమకు చూపకుండా దాచి పెడుతున్న విభాగాలు కొన్ని ఉన్నాయని ఆ సంస్థ అంటున్నది. ఆ మాట నిజం కాదని ఇరాన్ కూడా ఖండించటం లేదు. ఇజ్రాయెల్ దాడుల దరిమిలా ఒక కొత్త విషయం వెల్లడించారు. అది, ఎవరికీ తెలియని మరొకచోట కూడా శుద్ధి కేంద్రం నిర్మిస్తున్నామని! ఇవన్నీ నిజమైనా, చివరకు వారు అణ్వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారనుకున్నా, ఇజ్రాయెల్, అమెరికా సహా ఎన్నో దేశాలకు భారీ సంఖ్యలో అణ్వస్త్రాలు ఉన్నపుడు, తన రక్షణ కోసం ఇరాన్ మాత్రం ఎందుకు తయారు చేసుకోరాదన్నది మౌలికమైన ప్రశ్న. ఉత్తర కొరియా ఉదాహరణ ఇపుడు మరోసారి చర్చకు వస్తున్నది. అదే విధంగా ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నట్లయితే దాడికి ఇజ్రాయెల్, అమెరికాలు సాహసించగలవా? అణువ్యాప్త నిరోధక ఒప్పందాలను ఉల్లంఘించి, ఇజ్రాయెల్ అణ్వస్త్ర తయారీకి రహస్యంగా సహకరించింది అమెరికా, యూరప్‌లు కాదా? ప్రస్తుత యుద్ధానికి వస్తే, అమెరికా తోడ్పాటుతో ఇజ్రాయెల్ ఏకపక్ష విధ్వంసాలు సృష్టించగలగటం వట్టి మాట అని ఇరాన్ తన ఎదురు దాడులతో రుజువు చేస్తున్నది. ఇజ్రాయెల్ ఎంతో ఘనంగా చెప్పుకునే ఐరన్ డ్రోమ్ బలహీనతలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక బలం మహాశక్తిమంతమైనదే గానీ, రెండవరోజు నుంచి కూడదీసుకున్న ఇరానియన్ రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చివేయటం మొదలైంది. బహుశా వీటన్నింటి కన్నా ముఖ్యమైన వార్తలు, ఇరాన్ అణు కేంద్రాలకు ఇజ్రాయెల్ దాడులతో వాటిల్లిన నష్టం స్వల్పమైనదేనని, భూగర్భంలో, కొండ లలో చాలా లోతున గల కేంద్రాలు యథాతథంగా ఉన్నాయన్నది. ఇరాన్ చివరకు అణ్వస్త్రాలు ఉత్పత్తి చేయక తప్పదా?టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఆయనా ఓ పులే!
ఆ రోజు నేను ఆశ్యర్య పోయాను. ఆయనో సెలబ్రిటీ అనీ, పులుల గురించి తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనీ నాకు తెలుసు. 40 పుస్తకాలు రాశాడు. ‘ల్యాండ్ ఆఫ్ ద టైగర్’ పేరిట బీబీసీ సిరీస్ చేశాడు. పులుల మీద ప్రపంచస్థాయి ‘అథారిటీ’ అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి? ఆయన చనిపోయినప్పుడు వార్తాపత్రికల్లో విశేషమైన కవరేజి వచ్చింది. ఆయన పట్ల ఉన్న అపారమైన గౌరవాభిమానాలకు అది నిదర్శనం. ఆ స్థాయిలో తనకు గుర్తింపు ఉందని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయనో ఐకాన్. వాల్మీక్ థాపర్ మృతితో ఆయన లెగసీ ఏమిటో వెల్లడైంది. ఆయన మిగిల్చిపోయే వారసత్వం, పేరు ప్రఖ్యాతులు అంతగా ఉంటాయని సొంత కుటుంబం కూడా ఊహించలేదు. ప్రకృతి సంరక్షకుడిగా, పులుల అధ్యయనకర్తగా ఆయన కనబరచిన ప్రభావం అపార మని ఆలస్యంగానైనా గుర్తించగలిగాం. ఈ తరానికిచెందిన మా కుటుంబంలో ఆయనో స్టార్. వాలూ (మేం అలా పిలుస్తాం)కి పులుల మీద వల్ల మాలిన ప్రేమ. తను కూడా ఎన్నో రకాలుగా ఒక పులి లాంటివాడు. శక్తిమంతుడు. కఠినమైనవాడు. మాటలు తక్కువ, హావభావాలు ఎక్కువ. ఆయన వేషభాషలు కొట్టొచ్చినట్లు ఉండేవి. భారీ మనిషి. విలక్షణమైన నవ్వు. పెద్దపెద్ద మెరిసే కళ్లు. వాలూ నవ్వాడంటే క్షణకాలం అంతా కొయ్యబారుతుంది. మరు క్షణం ఆ గదంతా నవ్వులతో పెళ్లుమంటుంది. తెలియడానికి చిన్నప్పటి నుంచీ తెలిసినా తనను నిజంగా తెలుసుకున్నది మాత్రం నా ఇరవైలలోనే. మనకు అన్నీ తెలుసు అనుకునే వయసది. ప్రియ నేస్త మైన క్లెయిర్ వింటర్ ష్లాడెన్తో కలిసి ఇండియాలో సెలవులకు వచ్చాను. ఆ సెలవులను రణతంబూరులో గడపమని వాలూ మాకు సలహా ఇచ్చాడు. ‘జీవితంలో ఒక్కసారన్నా పులిని చూడకపోతే, నువ్వసలు జీవించి నట్లే కాదు’ అంటూ రెచ్చగొట్టాడు. ‘నేను మిమ్మల్ని రణతంబూర్ తీసుకెళ్తా... అక్కడ నిజమైన పులులను చూపిస్తా, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, సరేనా’ అని చెప్పి ఒప్పించాడు.వాలూ చెప్పింది నిజం. మేం రణతంబూరుకు జీపులో బయలుదేరాం. పంజా గుర్తులను అనుసరిస్తూ వాలూ తనే జీపు నడిపాడు. అలా జీపును పోనిచ్చి చాలా పులులను కొద్ది అడుగుల దూరం నుంచే మాకు చూపించాడు. రాత్రి సరస్సు ఒడ్డున నెగడు వేసుకుని ఆయన కథలు చెబుతుంటే వింటూ రమ్ తాగాం. కథల్లోని పులులు కూడా మా కళ్ల ముందు ప్రత్యక్షమై నట్లు అనిపించింది. వాలూ అంతగా నాటకీయ ఫక్కీలో కథలు చెప్తాడు. మేం బాగా ఎంజాయ్ చేశాం. రణతంబూరులో గడిపిన ఆ రోజుల అర్థం ఏంటో నేను అప్పట్లో గుర్తించలేదు. అడవిలో సెలవులు గడపటం అదే మొదటిసారి. ఒక గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్ గడపటం అదే మొదటిసారి. మమ్మల్ని వాచ్ చెయ్యడానికి, నేను హద్దులు దాటకుండా మానిటర్ చేయ్యడానికి పేరెంట్స్ గానీ, గార్డియన్ గానీ అక్కడ లేకపోవడం అదే మొదటిసారి. కానీ వాలూకి తెలుసు. అందుకే మమ్మల్ని రణతంబూరు తీసుకెళ్లాడు. అంత శ్రద్ధ తీసుకున్నాడు. ఒక కజిన్ ఎదుగుదలకు తన వంతు సాయం తను చేశాడు. తర్వాతి సంవత్సరాల్లో నేను జర్నలిస్టుగా మారినప్పుడు, తరచూ నన్ను డిన్నర్ కంటూ ఆహ్వానించి నాకు తెలియని విషయాలు ఎన్నో చెబుతూ ఉండేవాడు. నేను ఫాలో అయ్యే స్టోరీస్ అంతరార్థాలు, నాకు తట్టని గూఢార్థాలు విశదపరిచేవాడు. ఇదేమైనా ఆలోచించావా... అంటూ వాక్యం మొదలెట్టేవాడు. అలా ప్రారంభించాడంటే ఆ విషయం నేను ఆలోచించలేదని ముందే తెలిసిపోయేది. ఎంతో సౌమ్యంగా, ఎంతో వివేకంతో నన్ను గైడ్ చేసేవాడు. అది నాకు మొదట్లో అర్థం అయ్యేది కాదు. కొన్ని కొన్నిసార్లు నా విషయ పరిజ్ఞానం పెంచేందుకు సంభాషణలకు ఇతరులను కూడా పిలుస్తూ ఉండే వాడు. మరికొన్నిసార్లు నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత కాల్ చేసి మాట్లాడేవాడు. ఏదైనా వార్తాకథ నాన్ని నేను గమనించానో లేదోనని నన్ను అలర్ట్ చేసిన సంద ర్భాలూ ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ సలహా అమూల్యంగా ఉండేది. తను రాజకీయ నాయకుడు కానప్పటికీ, ఏది జనం దృష్టిని ఆకర్షిస్తుందో తెలుసు. ఏది అందరికీ ఆసక్తికరంగా ఉంటుందో, ఏది ఢిల్లీ ఉన్నత వర్గాలను మాత్రమే ఆకర్షిస్తుందో అనాలోచితంగానే వాలూకి అర్థమైపోతుంది. వాలూ నా విమర్శకుడు కూడా. అయితే ఆ విమర్శ సున్నితంగా సమంజసంగా ఉంటుంది. వేరేవారు అయితే ఆ వ్యాఖ్యలకు చిరాకు పడేవారేమో. కానీ నా ప్రోగ్రాం నిశితంగా చూసి జాగ్రత్తగా ఆలోచించుకున్న తర్వాతే నాతో దాని గురించి మాట్లాడతాడని నాకు తెలుసు. వాలూ చేసిన ఒక సూచన నేను పూర్తిగా అంగీ కరించాను. కానీ అమలు చేయలేకపోయాను. మాట్లాడే ప్పుడు గొంతు పెంచవద్దన్నది ఆ సూచన. ‘నీ ఉద్వేగ ప్రదర్శన అనవసరం... ఆడియన్స్‌ను ఆకట్టుకోడానికి నీ మాటల్లో ఉండే కంటెంట్ సరిపోతుంది. స్వరాన్ని చివరి వరకూ ఒకే పిచ్‌లో ఉంచుకోవాలి’ అనేవాడు. నేను ఎప్పుడూ పాటించలేక పోయాను. ఇప్పుడు మాత్రం ప్రయత్నం చేస్తున్నాను. నా స్వరతంత్రుల మీద అదుపు కోల్పోతున్నప్పుడల్లా, గొంతు పెరుగు తున్న ప్రతిసారీ జ్ఞానదాయకమైన వాలూ సలహాను గుర్తు చేసుకుంటా. అంటే... ఆయన్ను ఎప్పటికీ మర్చి పోనన్న మాట! -కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నెతన్యాహు (ఇజ్రాయెల్ ప్రధాని) రాయని డైరీ
యుద్ధాన్ని మొదట ప్రారంభించిన వారే శాంతి కోసం మొదట ప్రయత్నం చేసినవారు అవుతారు. అయితే వారికి నోబెల్ శాంతి బహుమతి వస్తుందా రాదా అన్నది నేనెప్పుడూ ఆలోచించని విషయం.వార్స్, ఆపరేషన్స్, బ్యాటిల్స్... ఇన్నిటితో ఎన్నేళ్ల యుద్ధం చేసినా శాంతి సిద్ధిస్తుందని చెప్పలేం. శాంతిని కోరుకునేవారు నిరంతరం యుద్ధయజ్ఞం చేస్తూనే ఉండాలి. శాంతిని కాపాడుకుంటూ ఉండటమే శాంతి స్థాపన.శుక్రవారం, తెల్లారకుండానే 200 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ ఇరాన్‌తో శాంతి ప్రయత్నాలు ప్రారంభించింది. ఏవైనా రెండు దేశాలు టేబుల్ ముందు ఎదురెదురుగా కూర్చొని శాంతి కోసం జరుపుకొనే చర్చల కంటే – ఎవరి దేశంలో వారు, ఎవరి ‘వార్ రూమ్’లో వారు కూర్చొని శతఘ్నులను ఒకరి వైపు ఒకరు విసురుకోవటం వల్లనే ఎప్పటికైనా శాంతిని సాధించగలమని నా నమ్మకం. శాంతి కోసం జరిగే చర్చలు ఎంత వికారంగా ఉంటాయో చూడండి. చర్చలకు కూర్చున్నాక కదా కండిషన్స్ అనేవి! అసలు చర్చలకు కూర్చోటానికే కండిషన్స్ పెట్టేస్తారు! శాంతి కోసమా చర్చలు? లేక, మా నుదుటి మీద మేము పిస్టల్ గురి పెట్టుకుని కాల్చుకోవటం కోసమా?!చర్చలకు ముందు చర్చలు. సంప్రదింపు లకు ముందు సంప్రదింపులు. రాయబారా లకు ముందు రాయబారాలు. రాకపోకలకు ముందు రాకపోకలు. ఈ మధ్యలో శాంతి ఎక్కడో చేజారి జారిపోతుంది. ఇంటర్నల్ కేబినెట్ మీటింగ్స్‌లో నా కొలీగ్స్‌తో నేనిదే చెబుతాను. ‘‘చూడండి, నాకేం కావాలన్న దానిపై నాకు క్లారిటీ ఉంది. నాకు శాంతి ప్రక్రియలు అవసరం లేదు. శాంతి ఫలితాలు కావాలి’’ అని అంటాను.శాంతి కోసం ఐక్యరాజ్య సమితి చేసే ప్రయత్నాలైతే పరమ పావనంగా ఉంటాయి! గడాఫీని తీసుకెళ్లి ‘యూఎన్ హ్యూమన్ రైట్స్’కి చైర్మన్‌గా కూర్చోబెడుతుంది. సద్దాం హుస్సేన్ని పిలిపించుకుని ‘యూఎన్ నిరాయుధీకరణ’కు అధ్యక్షుడిని చేస్తుంది. ఇప్పుడు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ‘‘తప్పు కదా మిత్రమా’’, ‘‘తగదు కదా నా ప్రియ దేశమా!’’ అంటోంది. యూఎన్‌కు నేను ఒకటే చెబుతాను. ‘‘మీరు ‘పీస్ టాక్స్’తో చేయలేని పనిని మేము ‘పీస్ ఎటాక్స్’తో చేస్తున్నాం’’ అని! ఇంకొకటి కూడా చెబుతాను. ఇరాన్ అణ్వాయుధాలను పోగు చేసుకుంటోంది. ఆ పోగు నిన్న ఉన్నట్లుగా నేడు లేదు. వారం క్రితం ఉన్నట్లుగా నిన్న లేదు. నెల క్రితం ఉన్నట్లుగా వారం క్రితం లేదు. ఏడాది క్రితం ఉన్నట్లుగా నెల క్రితం లేదు. పోగు కుప్ప అయింది. కుప్ప గుట్ట అయింది. గుట్ట దిబ్బ అయింది. ఆ దిబ్బ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు థ్రెట్ అయింది. నా ప్రశ్న ఒక్కటే – ఇరాన్‌కు రెడ్ లైన్స్ గీసేందుకు నిరాకరించే వారికి, ఇజ్రాయిల్ ముందు రెడ్ లైట్ పెట్టే నైతిక హక్కు ఉంటుందా? అని. అనేక విషయాల్లో నన్ను తప్పుపట్టే ప్రపంచానికి అనేకానేక విషయాల్లో నేను కరెక్ట్ అనీ తెలుసు. కానీ ఒప్పుకోదంతే! ఏదైనా దేశం ‘రాక్ బాటమ్’కి చేరుకుందంటే ఇక అక్కడేం మిగల్లేదని అర్థం.మంచీ చెడ్డ, నీతీ నియమం, ఆశా శ్వాస...ఏమీ మిగల్లేదని. అలాంటి దేశాన్ని కలుపుకోనన్నా కలుపుకోవాలి. లేదా యుద్ధ ట్యాంకుల్ని పెట్టి కలుపునైనా ఏరి పారేయాలి. హఠాత్తుగా భారీ విస్ఫోటనం! జెరూసలేంలో నేనున్న గది ఒక్కసారిగా దద్దరిల్లింది. కిటికీ అద్దాలు బద్దలయ్యాయి. సమీపంలో – ‘‘కొడుకా... నాయనా...’’ అని ఓ తల్లి ఆక్రందన! ఇరాన్ నుంచి ఖొమైనీ తిరుగుయుద్ధం ప్రారంభించినట్లున్నాడు. ఇజ్రాయెల్ మాత్రం యుద్ధాన్ని ఆపదు. ఒక తల్లి తన పిల్లల్ని ఏ ఉదయమైనా నిర్భయంగా బయటికి పంపగలిగేంతైనా శాంతిని నెలకొల్పేవరకు ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని ముగించదు. -
శ్రీశ్రీ ఒక తీరని దాహం
జలజల పారే గంగా గోదావరీ అనే జీవ నదులూ, మబ్బుల్ని తాకే హిమాలయ పర్వత శ్రేణులూ, పున్నమి వెన్నెల్లో తాజ్ మహల్ సౌందర్యమూ, బిస్మిల్లాఖాన్ షెహనాయి రాగాల లాలిత్యమూ... వీటి గురించి మళ్లీ మళ్లీ మాట్లాడుకున్నా బావుంటుంది. కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ యేల ఏడ్చెదో... బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకున్... మందార మకరంద మాధుర్యమును గ్రోలు... వంటి తియ్యని తెలుగు కవిత్వాన్నీ, సిరులు మించిన పసిడి బంగారు జిలుగు దుప్పటి జారగా... అంటూ కవ్వించే జనార్దనాష్టకం పద్యాల నడకలోని తూగునీ ఎన్నిసార్లు పాడుకున్నా అదే చెక్కుచెదరని అందం. అంతే తన్మయత్వం!మహాభారతం, ‘కన్యాశుల్కం’, ‘అన్నా కరెనినా’, ‘ద బ్రదర్స్ కరమజోవ్’, ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’, చలం ‘ఓ పువ్వు పూసింది’– ఎలాగో ‘మహాప్రస్థానమూ’ అంతే. ఒక సూపర్ క్లాసిక్. మరిచిపోలేని మాస్టర్ పీస్! అది తెలుగు సాహిత్యాన్ని యుద్ధరంగంలోకి నడిపించింది. తెలుగు కవిత్వాన్ని అజేయమైన శక్తిగా నిలిపింది. నీలాకాశంలోకి తెలుగు పతాకాన్ని ఎగరేసింది. విశ్వనాథ సత్యనారాయణ లాంటి పండితుడూ,సంప్రదాయవాదీ విస్తుపోయాడంటే, శ్రీశ్రీ ఎగరేసిన జెండాలా, సంస్కృత సమాసాలకు తల్ల కిందులై కాదు, అందులోని స్వచ్ఛమైన అచ్చమయిన కవిత్వాన్ని చూసి, అలా రాయడం మరొకరి వల్లకాదని తెలిసి! ‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ లెవ్వరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీ లెవ్వరు?’– విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఆ నాలుగు లైన్లూ చదివి, దివాకర్ల వెంకటావధాని, రెండు మూడొందల ఏళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో ఇలా అన్నవాడెవడూ లేడని ఒక ఉద్వేగంతో చెప్పారు. శ్రీశ్రీని పరుసవేది అన్నాడు జ్వాలాముఖి. మోడువారిన చెట్టు చిగురించి మళ్లీ జీవితంలోకి ప్రవేశించడం మనకి నేర్పుతుంది. శ్రీశ్రీ కవిత్వం చదివిన వాళ్ళందరి అనుభవమూ అదే. మనో వాక్కాయకర్మ శుద్ధి పరిపూర్ణంగా గలవాడికి మాత్రమే అలాంటి కవిత్వం సిద్ధిస్తుంది. సరస్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. మహాప్రస్థానానికి 75 ఏళ్లు అంటున్నారు. తొలిసారి 1950లో అచ్చయింది గనక ఇలా అనొచ్చు. హంగ్రీ థర్టీస్‌లోనే 1934–40 మధ్యనే శ్రీశ్రీ ఈ గీతాలు రాశారు. రాసి తొంభై సంవత్సరాలు అయింది. సెలబ్రేట్ చేసుకోడానికి ఒక అకేషన్ అని తప్పితే, జీవ నది లాంటి ఆ కవిత్వం మన సంస్కృతిలో, అనుభూతిలో, మన రక్తంలో ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. మహాప్రస్థానంలో మీకు ఏ కవిత ఇష్టం? కొంపెల్ల జనార్ధనరావు కోసమా? ఎచటికి పోతావీ రాత్రి? దారిపక్క చెట్టుకింద కూర్చున్న ముసిల్దా? సంధ్యా సమస్యలా? శైశవ గీతా? గంటలా? కవితా ఓ కవితా? ఇలా మనం ఎన్ని పొయెమ్స్ అయినా చెప్పగలం. వాటిని అప్పచెప్పగలం కూడా! అయితే, తాను రాసిన వాటిల్లో శ్రీశ్రీకి బాగా నచ్చిన కవిత ఏదో తెలుసా? అది మహాప్రస్థానంలో లేదని కూడా తెలుసా? ‘శరశ్చంద్రిక’ నాకు యిష్టం అని ఒక సందర్భంలో చెప్పారు శ్రీశ్రీ. ఆ దీర్ఘ కవిత ‘ఖడ్గసృష్టి’లో మొట్టమొదటిది! నవీన విశ్వవిద్యా లయాల్లో పురాణ కవిత్వంలాగా శ్రవణ యంత్రశాలల్లో శాస్త్రీయ సంగీతం లాగా ఇలా వచ్చావేం వెన్నెలా? అంటూ వెన్నెలలో మహాకవి సంభాషణ మొదలవుతుంది. సాదాసీదాగా, నిరలంకారంగా, ఊర్నే నువ్వూ నేనూ మాట్లాడుకున్నట్టే ఉంటుంది. శరశ్చంద్రిక చదవడం పూర్తి అయ్యేసరికి మనం ఒక వెన్నెల తుఫాన్లో చిక్కుకుపోతాం. సాక్షాత్తూ వెన్నెల సముద్రం మీద సంతకం చేస్తున్న దృశ్యం ఒక మహత్తరమైన పెయింటింగ్‌లా మనోఫలకం మీద నిలిచిపోతుంది. ప్రలోభాలకూ, పద్మశ్రీలకూ తలవంచని తీరానికి చెందిన వాడు. పురిపండా అప్పలస్వామి ఒరియా సాహిత్య చరిత్ర రాసిన తెలుగువాడు. చేతిరాతతో లండన్ మహాప్రస్థానం ఎందుకూ? అని శ్రీశ్రీ సందేహిస్తున్నపుడు, పురిపండా ఇలా అన్నారు: ‘మహా ప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం. నాకు తెలిసినంత మట్టుకు మరే భారతీయ భాషలోనూ ‘కవితా ఓ కవితా’ అంత గొప్పగీతం రాలేదు’. ఈ మాట ఒక జ్ఞాన్‌పీఠ్ అవార్డు కన్నా తక్కువదేమీ కాదు. మార్క్సిస్ట్ ఈస్థటిక్స్‌కి మహా ప్రస్థానమే ఒక సజీవ ఉదాహరణ. గదిలో ఎవరూ లేరు, గదినిండా నిశ్శబ్దం, సాయంత్రం ఆరున్నర, గదిలోపల చినుకుల వలె చీకట్లు... అని మొదలవుతుంది ‘ఆకాశ దీపం’, వట్టి వచనం. తొంభై సంవత్సరాల క్రితం ఇలా రాయడానికి ఎంత ధైర్యం శ్రీశ్రీకి? ‘దీపం ఆరిపోయింది – తారగా మారిపోయింది’ అని కవిత ముగిసేసరికి గుండె పేలి పోతుంది. అందుకే చలం ‘బుద్ధున్నవాడెవడూ దీన్ని కవిత్వం అనడు’ అన్నారు. ఈ కవి అప్పీల్ బుద్ధినీ, వివేకాన్నీ, కళానిబంధ నల్నీ మించిన ఏ అంతరాళానికో తగుల్తుంది. ఆ అంతరాళం అనేది ఉన్నవాళ్ళకి అని చెప్పారు. నిప్పులు చిమ్ముకుంటూ... అంటూ ఆరు లైన్ల పొట్టి కవిత రాసినా, కవితా ఓ కవితా అని ఆరేడు పేజీల దీర్ఘకవిత్వం రాసినా శ్రీశ్రీలో ఆవేశం, సముద్ర కెరటమై ఎగిసిపడుతుంది. లెనిన్, స్విన్ బర్న్, సాల్వడార్ డాలీ, కొంపెల్ల జనార్ధనరావు... ఇలా ఎవరి గురించి రాసినా పాఠకుణ్ణి నిద్రపోనివ్వని శ్రీశ్రీ ముద్ర మనందరి కలెక్టివ్ ఎక్స్‌పీరియ¯Œ ్స! కనకదుర్గా చండ సింహం జూలు దులిపే ఆవులించింది – అనే శుద్ధవచనాన్ని నరాలు తెగే కవిత్వంగా మార్చే రహస్యం తెలిసినవాడు –అతనొక్కడే! మహాప్రస్థానము, ఖడ్గసృష్టి మాత్రమే రాసి శ్రీశ్రీ చేతులు దులుపుకోలేదు. సిరిసిరిమువ్వలు, ప్రాసక్రీడలు, లిమరిక్కులు, గల్పికలు, అనువాదాలు, నాటికలు, కథలు, వీలునామా, సినిమా పాటలు, ఆత్మకథ ‘అనంతం’ – మరెన్నో రాశాడు. అద్భుతాలు చేశాడు. జీవితాంతమూ రాస్తూనే ఉన్నాడు. ఎంత రాశాడో అంతకు మించి చదువుకున్నాడు. శ్రీశ్రీ జ్ఞాని. రుషితుల్యుడు. కష్టజీవు లందరికీ మిత్రుడు. తెలుగుజాతి వరపుత్రుడు. దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిపించినా, వెలుతురెక్కడ సోనియా అంటూ బైరాగి విలపించినా, చెట్లు కూలుతున్న దృశ్యాన్ని చూసి అజంతా కన్నీళ్లు పెట్టినా; జనంలో నడు, కాలాన్ని వెంటపెట్టుకు నడూ అని మక్దూమ్ మొహియుద్దిన్ పిలుపు ఇచ్చినా, సత్యమూర్తి చిరుగాలి సితారా సంగీతం వినిపించినా;ఎండ్లూరి సుధాకర్, మద్దూరి నగేష్‌బాబు వెలివాడల వేదనని కన్నీటి అక్షరాలుగా పరిచినా అది శ్రీశ్రీ తిరుగుబాటు వేదాంతానికి ఉత్తేజపూర్వకమైన కొనసాగింపు మాత్రమే. గురజాడ వేంకట అప్పారావు పరిచిన వారసత్వపు వెలుతురు దారుల్లో శ్రీశ్రీ, ఎర్రకాంతుల ఇనోదయాన్ని డిస్కవర్ చేసి, నవ్య కవిత్వంతో నిండిన వేల పాలపుంతల్ని ప్రసాదిస్తే ఆ వెలుగు వెన్నెల జోడిలో ఆధునిక తెలుగు కవిత్వం మానవ జీవన మాధుర్య సౌందర్య తీరాలను తాకి పరవశిస్తోంది.తాడి ప్రకాష్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, రచయిత ‘ 97046 41559 -
నడచిన హిమాలయం... ఎగసిన ప్రజాకెరటం!
కళ్లు ఆకారాన్ని చూస్తాయి. మనస్సు ఆంతర్యాన్ని చూస్తుంది. దాని పరిధి చాలా విశాలం. మనసుతో మను షుల్ని, సమాజాన్ని చూడగలిగినవాడు, చదవగలిగినవాడు మహానాయకుడు. ఆ మహానాయకుడే మాజీ ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖర రెడ్డి. నాకు అత్యంత సన్నిహితుడు, హితుడు, గురువు, మార్గదర్శి. అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల అపారమైన ప్రేమ, మనిషి పట్ల మమ కారం, పేదరికాన్ని పారద్రోలాలన్న పట్టుదల, అణగారిన జనానికి అన్నీ సమకూర్చాలన్న కోరిక, సమసమాజ స్థాపన ఆయన లక్షణాలు, లక్ష్యాలు. శత్రువును కూడా క్షమించగలిగే సంస్కారం, పగవాడికైనా మేలు చేసే గుణం ఆయన సొంతం. హిమాలయ సమున్నతుడు కాబట్టే ప్రజలు ప్రేమగా ఆయ నను ‘రాజన్న’ అని పిలుచుకున్నారు. పాదయాత్ర:2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన చేసిన 1,648 కిలోమీటర్ల పాదయాత్ర ఓ చరిత్ర. ఆయన వెంట నేను ఉండటం నా అదృష్టం. ఎంత జీవితాన్ని చూశానో, ఎన్ని నేర్చు కున్నానో అన్నిటికీ ‘సాక్షి’ ఆ పాదయాత్ర. 2003 ఏప్రిల్ 9న చేవెళ్లలో పెద్ద బహిరంగ సభతో ప్రారంభమైంది మహాయాత్ర. ఆ సభా వేదికకు పైన నీడగా షామియానా వేశారు. విపరీతంగా వచ్చిన జనం అందరూ ఎండలోనే ఉన్నారు. అది గమనించిన వైఎస్ ‘జనం ఎండలో ఉంటే నేను నీడలోఉండాలా’ అంటూ షామియానా తీయించారు. మండుటెండలోనే సాగింది ఆయన ప్రసంగం. అనంతరం తొలి అడుగు వేశారు ప్రజా ప్రస్థానానికి! కీపాస్ కట్టిన పంచ, తలపాగాలతో రైతులా కదిలారు. ఆయనను దగ్గరగా చూడా లని, కరచాలనం చేయాలని, కష్టాలు చెప్పుకోవాలని, గ్రామాలకు గ్రామాలు కదలి వచ్చాయి. చేవెళ్ల దాటి కౌకుంట్ల, మన్నెగూడ, శివారెడ్డిపేట... ఇలా అనేక గ్రామాల గుండా సాగుతోంది పాదయాత్ర. దారి పొడుగునా కనిపిస్తున్న ప్రజల ఆవేదనకు ఆయన చలించిపోతున్నారు. రాత్రి బస చేస్తున్న గ్రామాలలో కొందరు పెద్దలు ఆయన వద్దకు వచ్చి అక్కడ ఏసీ సౌకర్యం ఉన్న ఇల్లు ఉందని ఆహ్వానించినా, సున్నితంగా కాదని జనం మధ్య పడుకునేవారు వైఎస్. సదాశివ పేటకు చేరింది యాత్ర. అక్కడ ఎందరో కుండలు చేస్తున్నారు. వారిని చూపించాను ఆయనకు. ‘కరుణా! చూడాల్సింది వారు చేస్తున్న కుండల్ని కాదు, వారిగుండెల్ని’ అంటూ వారి దగ్గరికి వెళ్లారు. అంత దగ్గరగా ఆయనను చూసి చెమ్మగిల్లిన కళ్లతో వారు వారి బాధల్ని చెప్పుకున్నారు. ‘మంచిరోజులు వస్తున్నాయి’ అంటూ వారిని ఓదార్చారు. ప్రజలలో కనిపిస్తున్న పేదరికం, అనారోగ్యం, కరవు చూసి చలించిపోయిన ఆయనలో అప్పుడే ఉచితకరెంటు, ‘ఆరోగ్యశ్రీ’ లాంటి పథకాలు రూపుదిద్దుకున్నాయి. ఎనిమిదవ రోజు సుల్తానాపూర్‌లో యాత్ర సాగుతోంది.ఆ గ్రామంలో నర్సారెడ్డి అనే రైతు కుటుంబాన్ని అప్పు తీర్చ మని బ్యాంకు వారు దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అప్పటికే నర్సారెడ్డి ఆత్మహత్య చేసు కున్నాడు. అయినా ఆ కుటుంబాన్ని బ్యాంకువాళ్లు వేధిస్తు న్నారు. అది విన్న వైఎస్ ముఖంలో బాధ, కోపం! వెంటనే బ్యాంకు వారిని పిలిపించి నిలదీశారు, హెచ్చరించారు.బ్యాంకువారు భయపడి వెనక్కి తగ్గారు, ఆ కుటుంబం రక్షింప బడింది.పొతంశెట్టి పల్లెలో యాత్ర సాగుతోంది. ఓ యువ జంట వైఎస్ ఎదురుగా వచ్చి కాళ్ళమీద పడింది. తాము ప్రేమి కులమని, కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని, చాలా దూరం నుంచి మిమ్మల్ని నమ్మి వచ్చామని వారు చెప్పుకొన్నారు. కొన్ని క్షణాలు ఆలోచించిన ఆయన అక్కడే అప్పుడే ఆ జంటకు వివాహం చేశారు, అక్షింతలు వేశారు. మరో నాయకుడైతే వారిని అక్కడే వదిలేసేవారు. కానీ వైఎస్ ముందుచూపుతో హైదరాబాదులోని ఓ పోలీసు ఉన్నతాధి కారికి ఫోన్ చేసి ఆ జంటకు రక్షణ కల్పించమని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సాగే దారిలో నేను, మరికొందరు మిత్రులం వైఎస్ కన్నా కాస్త ముందుగా ఆ దారిలో వెళ్లేవాళ్ళం. వైఎస్ రాక గురించీ, పాదయాత్ర గురించీ ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకునేందుకు మా ప్రయత్నం. బురుగిద్ద గ్రామం దాటి, గాంధీనగర్ చేరుకున్నాం. అప్పటికి రాత్రి ఏడు గంటలు అయి ఉంటుంది. హఠాత్తుగా వడగళ్ళ వాన, విపరీతమైన చలి! వర్షంలో తడుస్తామని ప్రక్కనే వున్న జీపు ఎక్కి కూర్చున్నా. దాదాపు అరగంట పాటు వర్షం కురిసింది. మా వెనుక దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న వైఎస్ ఆ చలిలో, వర్షంలో అలాగే తడుస్తూ వచ్చారు. అందుకే ధీరుడు, నాయకుడు అయ్యారాయన. నాయకపురం దాటి, లక్ష్మీపురం గ్రామంలో ప్రవేశించాం. అక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకే పార్టీ, ఇద్దరు నాయకులు! ఎవరి ఏర్పాట్లు వాళ్లు చేస్తున్నారు. అది గమనించిన వైఎస్సార్ ఇద్దర్నీ పిలిచి అక్కడే రాజీ చేశారు. పాదయాత్ర గోదావరి జిల్లాలలోకి ప్రవేశించింది. అక్కడ కూడా రైతు బతుకు దీనంగా ఉండటం, గ్రాసం లేక పశువు లను రైతులు సగం ధరకు అమ్ముకోవడం చూసి వైఎస్ చలించి పోయారు. సీతంపేట గ్రామంలో నాగపద్మిని అనే మహిళ వైఎస్ దగ్గరికి వచ్చింది. కుటుంబ నియంత్రణకు ఆపరేషన్ చేయించున్నాననీ, అధికారులు ఆ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారనీ చెప్పింది. వెంటనే అధికారులను పిలిపించి అక్కడే సర్టిఫికెట్ ఇప్పించారు. ఆమె చేతిలో పదిహేను రోజుల పసికందు ఉంది. ఆ బిడ్డకు ‘రాజశేఖర్’ అని పేరు పెడతానంటే, ఆయన కాదని ‘రాజీవ్‘ అని నామకరణం చేశారు. రాజ మండ్రి సమీపం కోవూరుకు చేరుకున్నాం. జన ప్రవాహం మరింత ఎక్కువయింది. ఆయన ప్రసంగం ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు జనం చప్పట్లు ఆగలేదు. ఆ క్షణమే అర్థమ య్యింది రాష్ట్రానికి కాబోయే అధినాయకుడు ఎవరో!2003 మే 18:తెల్లారింది. కానీ నిప్పుల కొలిమిలో నిద్ర లేచినట్లు ఉంది. వైఎస్ నీరసంగా కనిపించారు. అయినా నడక సాగింది. కానీ నీరసం తెలుస్తోంది. ఓ చెట్టు క్రింద మంచం వేసి కాసేపు కూర్చోబెట్టాం. తరువాత మెల్లగా మధురపూడి గ్రామం చేరుకున్నాం. ఆయన పూర్తిగా నీరసించి పోయారు. వైద్యులు విశ్రాంతికి ఆదేశించారు. రాష్ట్రం అంతా కలకలం. ఆయన ఆరోగ్యం కోసం అన్ని మతాల వారి ప్రార్థనలు కొనసాగాయి. ఆరు రోజుల విరామం తరువాత మే 24న తిరిగి నడక ప్రారంభించారు వైఎస్. యాత్ర పత్తిపాడు గ్రామం దగ్గర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.జనప్రవాహం చెక్కు చెదరడం లేదు. జూన్ 11న జర్జంగి గ్రామం చేరుకున్నాం. అక్కడ రాళ్ళ క్వారీలలో వందలాది మంది వడ్డెరలు పని చేస్తున్నారు. వారంతా ఆయణ్ణి చూడటానికి వచ్చారు. తమ తలపాగాలను తీసి రోడ్డుమీద పరిచారు. దానిపై ఆయన్ని నడవమన్నారు. చూస్తున్న అందరి కళ్ళూ చెమరించాయి. శరీరాలు పులకరించాయి. అది కదా అభిమానం, అది కదా గౌరవం... అది కదా నిజమైన సన్మానం! జూన్ 15న ఇచ్ఛాపురం చేరుకున్నాం. ఆ సాయంత్రం బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. పార్టీలోని అతిరథ మహారథులందరూ వేదికపైకి వచ్చారు. లక్షలాది మందిజనం. చప్పట్లకు దిక్కులు దద్దరిల్లాయి. ఆ మహా ప్రజా ప్రస్థానానికి చిహ్నంగా ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. మహా పాదయాత్ర పూర్తి అయింది. ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు! చాలు జీవితానికి ఈ అనుభూతి. గుర్తు చేసుకుంటే శరీరం పులకరిస్తోంది. ఆయన జ్ఞాపకంతో కళ్లు చెమరిస్తు న్నాయి. రైతు బాంధవుడైన ఆ మహానేత అడుగులో అడుగు వేసి నడచిన నా జన్మ ధన్యం. చరిత్ర ఏనాడూ మరచిపోలేని సత్యం ఈ మహాయాత్ర!-వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్-భూమనకరుణాకర రెడ్డి -
గాల్లో ప్రాణాలు
దేశంలో విమానయాన నియంత్రణ సంస్థ అయిన ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (డీజీసీఏ) పాత్రపైనే ఇపుడు అనివార్యంగా ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రయా ణికుల భద్రత పట్ల ఉపేక్ష, జాగ్రత్త, ఆదుర్దా కనబరచక పోవడం డీజీసీఏ స్వభావంగా మారిపోయింది. విమాన భద్రతా ఉల్లంఘనలు 2008 నుంచి వేలాదిగా చోటుచేసు కుంటున్నా అది వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు పయనించగలిగిన బోయింగ్ 777–200, 777–300–ఇ.ఆర్. విమానాలను ఎయిర్ ఇండియా రంగంలోకి దించింది. భారత్ నుంచి అమెరికా వెళ్ళే విమానాలకు 16 గంటల వరకు సమయం పడుతుంది. దాంతో ఎయిర్ ఇండియాకు చెందిన సుదూర శ్రేణి విమానాలకు అప్పటి డీజీసీఏ నసీమ్ జైదీ కఠిన నిబంధనలను నిర్దేశించారు. కానీ, ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ విమానాలతో భారత్ నుంచి ఆస్ట్రేలియాకి సర్వీసులు మొదలు పెట్టిన పుడు ఎగువ నిబంధనలను అప్పటి డీజీసీఏ మార్చే సింది. అది ఆకాశయాన భద్రతా ప్రమాణా లను గాలికొదిలేసింది. ఇది అటు ప్రయాణికు లతో పాటు ఇటు విమాన సిబ్బంది ప్రాణాలకు కూడా చేటు తేవడమే అవుతుంది. డ్రీమ్ లైనర్ను ఆ విధంగా ఉపయోగించడం వల్ల ప్రమాదానికి లోనయ్యే అవకాశం అనుమతించిన సాధారణ పరిమితులకు మించి 25 రెట్లు పెరిగిందని ఎయిర్ ఇండియాకూ తెలుసు. కానీ, ఆ నివేదికను ఎయిర్ ఇండియా, డీజీసీఏ రెండూ మరుగు పరిచేశాయి. ఆ రూటులో సుర క్షిత పయన నిబంధనలు ఉల్లంఘనలకు గుర వుతున్న సంగతి ప్రయాణికులకు తెలియలేదు. డిజైన్ దశలోనే లోపాలుఅలాగే, 787 డ్రీమ్లైనర్లు ఇంకా డిజైన్ దశలో ఉన్నప్పుడే,ఇంకా వాటి గగన సామర్థ్యాలను పరీక్షించకముందే ఎయిర్ ఇండియా వాటి కొనుగోలుకు ఆర్డరు పెట్టేసింది. ఎయిర్ ఇండియా సమకూర్చుకున్న బోయింగ్ 787 డ్రీమ్లైనర్ల ప్రారంభపు ఆకాశయానాల్లోనే వాటి భద్రత, ఇంజినీరింగ్‌కు సంబంధించి అనేక లోపాలు, సమస్యలు బయటపడ్డాయి. విమాన సిబ్బందికి విమాన భద్రతా నిబంధనలను రూపొందించడంలో డీజీసీఏకున్న అధికారాలను సవాల్ చేస్తూ, నేను బొంబాయి హైకోర్టులో 2013–14 రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశాను. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి అప్పట్లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. నేను వేసిన రిట్ పిటి షన్లకు అటు డీజీíసీఏ గానీ, ఇటు ఎయిర్ ఇండియా గానీ 2019 వరకు జవాబులు దాఖలు చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మరో దిగ్భ్రాంతికరమైన సంగతి ఏమిటంటే, విమాన సిబ్బందికి విమాన సురక్షిత నిబంధనలను జారీ చేసే, లేదా రూపొందించే అధికారం డీజీసీఏకు 2016 సెప్టెంబర్‌లో మాత్రమే లభించింది. అదీ 1937 నాటి విమాన నిబంధనలోని 42–ఎ సెక్షనుకు సవరణ తీసుకురావడం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఎయిర్ ఇండియా విమాన సురక్షిత నిబంధనలను తుంగలో తొక్కుతున్నా డీజీసీఏ వాటిని కప్పిపుచ్చుతూ వచ్చిందని దీనిద్వారా స్పష్టమవుతోంది. డీజీíసీఏ, ఎయిర్ ఇండియా అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతూ నేను చాలా క్రిమినల్ కేసులు పెట్టాను. విమాన సురక్షిత ప్రమాణాలు ఉల్లంఘనలకు లోనవుతున్న సంగతిని ట్రయల్ కోర్టు అయినా పట్టించుకుంటుందని ఆశతో ఆ పని చేశాను. ఎందుకంటే, ఆ లోపాలు ప్రయాణికులు, విమాన సిబ్బంది... ఇద్దరి ప్రాణాలకూ ముప్పు తెచ్చేవిగా ఉన్నాయి. కనీసం ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం తర్వాతనైనా, కోర్టు మేల్కొని, విమాన సురక్షిత నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించిన సంబంధిత డీజీసీఏ, ఎయిర్ ఇండియా అధికారులపై కఠిన చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నాను.-వ్యాసకర్త ఎయిర్ ఇండియా మాజీ సీనియర్ అధికారి, కె.వి.జె. రావు- (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)కారణాలు ఏమిటి?అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఏఐ 171 కూలిపోయి కొన్ని గంటలే అవుతోంది. దాదాపు 260 మందికి పైగా బలిగొన్న ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలపై ఊహాగానాలు అప్పుడే జోరందుకున్నాయి. కొన్ని సమాచార సాధనాలు దీన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తు న్నాయి. ఈ విషాదకర ఘటనపై నా అభిప్రాయాలు తెలుపవలసిందని ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ కోరింది. నేను అందుకు అంగీకరించి, ‘‘దీనిపై ఊహాగానాలకు పాల్పడటం తొందరపాటు అవుతుంది’’ అని మాత్రమే చెబుతానన్నాను. ఫలితంగా, వారు నాతో ఆ ఇంటర్వ్యూను జరపనే లేదు. ఊహాగానాలు చేసేందుకు నేను విముఖంగా ఉండటమే బహుశా అందుకు కారణం కావచ్చు.ఈ ఘోర విపత్తుకు కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని అందరిలాగా నాకూ కుతూ హలం ఉంది. కానీ ఇంత త్వరగా బాహాటంగా ఊహాగానాలు చేయడం–అందులోనూ ఆధారాలు స్వల్పంగా ఉన్న సమయంలో–ఎవరికీ ప్రయోజనకారి కాదనిపించింది. అది హానికరం కూడా! పురాతన తవ్వకాల మాదిరిగా... మొదట అగ్ని జ్వాలలను ఆర్పి, బతికున్న వారికోసం అన్వేషణ పూర్తయిన పిదపనే వైమానిక ప్రమాద దర్యాప్తులు ప్రారంభమవుతాయి. అలాంటి దుర్ఘటనలు జరిగినపుడు ప్రాణాలతో ఉన్నవారు, క్షతగాత్రుల గురించి మొదట పట్టించు కోవాలి. తర్వాత, ప్రమాద స్థలికి వెళితే సురక్షితమేనని, ఇబ్బందేమీ ఉండదని ప్రకటించాలి. అనంతరం, చనిపోయిన వారిని గుర్తించడం ఆరంభమవుతుంది. ప్రమాదంపై దర్యాప్తునకు సమాంతరంగా, బాధితులను గుర్తించే పనిని వేరే సంస్థ చూసుకుంటుంది. దర్యాప్తులో పాలుపంచుకునేది కేవలం ప్రభుత్వ అధికారులే కాదు, సదరు విమానాన్ని తయారు చేసిన సంస్థ (ప్రస్తుత సందర్భంలో బోయింగ్) దర్యాప్తునకు సహాయపడేందుకు తన ప్రతినిధులను పంపుతుంది. ప్రయాణికులు ఏయే దేశాలకు చెందినవారో ఆ యా దేశాలు కూడా కొందరిని పంపవచ్చు. ప్రమాదం సంభవించిన దేశంలోని పరిశో ధకులు, వైమానిక దుర్ఘటనలపై దర్యాప్తు చేయడంలో మరింత అనుభవం ఉన్న ఇతర దేశాలకు చెందినవారి సహాయాన్ని కూడా అర్థించవచ్చు. ఇన్వెస్టిగేటర్లు శిథిలాల నుంచి బ్లాక్ బాక్స్ (ఫ్లైట్ డాటా రికార్డర్లు, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్)లను వెతికి పట్టుకోవడాన్ని ప్రాథమిక బాధ్యతగా భావిస్తారు (అహ్మదాబాద్‌లో వైద్య కళాశాల హాస్టల్ మెస్ పైకప్పు మీద బ్లాక్‌బాక్స్‌ను గుర్తించారు). విమానం గురించిన డేటా కూడా వీటిల్లోఉంటుంది. విమానం ఎలా పని చేస్తోందో, పైలెట్లు ఏం చెబుతున్నారో తెలుస్తుంది. బ్లాక్ బాక్స్‌లను వెలికి తీసినంత మాత్రాన విమానం కూలిన ఘట నలో దర్యాప్తు పూర్తయినట్లు కాదు. విమాన ప్రమాద దర్యాప్తు పురావస్తు తవ్వకాల లాంటిదే! ఒక పద్ధతి ప్రకారం, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి చేయాల్సిన పని అది. ఆధారాలను సేకరించి తదుపరి విశ్లేషణకు వాటిని భద్రపరచకపోతే, విలు వైన ఆధారాలను ఎప్పటికీ కోల్పోయినట్లే లెక్క. దర్యాప్తు అధికారులు సాక్షుల వాఙ్మూలాలను, ఆ ఘటనకు సంబంధించి వారు ఏవైనా వీడి యోలు తీసి ఉంటే వాటిని సేకరిస్తారు. వారి విశ్లేష ణను కంపెనీ డాక్యుమెంటేషన్, శిక్షణ, నియంత్రణ సంస్థ పేర్కొన్న నియమ నిబంధనలను పాటించడం గురించిన సమాచారంతో పోల్చి చూసుకుంటారు. విమాన ప్రమాదాలలో దాదాపు 80 శాతానికి ‘మానవ అంశాలే’ కారణం. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పేర్కొంటున్న మానవఅంశాలు: మానవుల సామర్థ్యాలు, గుణగణాలు, పరిమితులు, వారు ఉపయోగించే విధివిధానాలు, పరికరాలు, ఎలాంటి వాతావరణంలో పనిచేస్తు న్నారు లాంటివి! ఈ దుర్ఘటనపై పూర్తి ఫోరెన్సిక్ దర్యాప్తు సమగ్ర రూపంలో చేతికందడానికి కొన్నేళ్ళు పట్టవచ్చు. ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో 2023లో సీ వరల్డ్ హెలికాప్టర్ కూలిన ఘటనపై తుది నివేదిక ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైంది. ఊహాగానాలు–నిందలువిమాన ప్రమాదానికి కారణం కాగల అంశాలపై హానికరమైన ప్రజా ఊహాగానాలకు సంబంధించి సుదీర్ఘ చరిత్రేఉంది. మలేసియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్–370 విమానం 2014 మార్చి 8న గగనతలం నుంచి అదృశ్యమైంది. ఆ ఘటనకు దాని చీఫ్ పైలట్ జహారీ అహ్మద్ షాయే బాధ్యుడంటూ ప్రచారం జరిగింది. షాతోపాటు ఆ ఘటనలో 238 మంది చనిపోయారు. ఆ ప్రచారం తనను చాలా బాధకు గురిచేస్తోందని షా సోదరి సకీనబ్ షా 2016లో సి.ఎన్.ఎన్.కు ఇచ్చినఇంటర్వ్యూలో వాపోయారు. ఆ ప్రమాదానికి తన సోదరుడిని ‘బలిపశువును’ చేస్తున్నారని ఆమె అన్నారు. ఇదమిత్థంగా కారణాలు తెలియకుండానే, ప్రమాదాలకు అలా ఎవరెవరినో బాధ్యులుగా భావించిన దృష్టాంతాలను చాలా చూపవచ్చు. ఒక రకం విమానాలను నడిపేవారికి అదే రకానికి చెందిన కొత్త మోడల్ విమానాలను ఇచ్చి (ఈ కొత్త విమానాలను నడపడంలో పైలట్లకు సిములేటర్‌లో తగినంత శిక్షణ ఇవ్వకుండానే) నడిపేయమనడం కూడా విమానయాన సంస్థలకు కొత్తేమీ కాదు. ఫలితంగా జరగరానిది ఏదైనా జరిగితే వచ్చే అపనిందల వల్ల పైలట్లు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రతిష్ఠ దెబ్బతింటుంది. వారి కుటుంబ సభ్యులు పడే వేదన వర్ణనాతీతం.బహిరంగంగా ఊహాగానాలు చేయడం దర్యాప్తు ప్రక్రియకు ఏ విధంగానూ దోహదపడదు. మృతుల, క్షతగాత్రుల కుటుంబాలకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. సునిశితమైన అంశాలను కనుగొనడానికి వీలుగా బాహ్య ఒత్తిడులు ఏమీ లేకుండా ఇన్వెస్టిగేటర్లను వారి పనిని వారిని చేసుకోనివ్వాలి. ఈ ప్రక్రియను గౌరవించడం, నిజాయతీతో వ్యవహరించనివ్వడం ముఖ్యం. మాటలకందని విషాదాన్ని అనుభవిస్తున్న అనేక మందికి మనం అండగా నిలవాలి. -వ్యాసకర్త యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్ ల్యాండ్ బ్యాచిలర్ ఆఫ్ ఏవియేషన్‌కు ప్రోగ్రామ్ డైరెక్టర్, నటాషా హీప్(‘ది కాన్వర్సేషన్’ సౌజన్యంతో) -
ఇలాంటి ఎన్నికలతో అనిశ్చితి పోతుందా?
వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి పక్షంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ ప్రకటించారు. అసలు ఆయనకు అధికారాన్ని ప్రజా ప్రతినిధులకు అప్పగించే ఉద్దేశం ఉందా అనీ ఆయన విమర్శకులు, ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్న తరుణంలో, ఎన్నికలను ప్రకటించడం ద్వారా వారి నోటికి తాళం వేసే ప్రయత్నం చేశారు.బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని బలవంతంగా గద్దెదింపి పది నెలలు గడుస్తున్నా, తాత్కాలిక ప్రభుత్వం దేశంలో కొద్ది మేరకైనా శాంతి భద్రతలను పునరుద్ధరించలేకపోయింది. యూనస్ నిర్ణయాల పట్ల బంగ్లాదేశ్ సైన్యం బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తపరచింది. ఉదాహరణకు, ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో,బంగ్లాదేశ్ నుంచి మయన్మార్‌లోని రాఖినే రాష్ట్రం వరకు ‘మానవీయ కారిడార్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ విషయమై తమను సంప్రదించనేలేదని సైన్యం ప్రకటించింది. ‘‘అన్ని పార్టీలను కలుపుకొనిపోతూ, వీలైనంత త్వరగా’’ ఎన్నికలు నిర్వహించాలని సైన్యం హితవు పలికింది. తాము లేనిదే దేశానికి వేరే దిక్కు లేదని భావించే నాయకులు ఏనాటి నుంచో అనుసరిస్తూ వస్తున్న ఎత్తుగడనే యూనస్ కూడా ఆశ్రయించారు. రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించడం, ఊహించినట్లుగానే ఆయనను పదవిలో కొనసాగమని కోరడం జరిగిపోయింది.ఈ ఏడాదిలో జరగాల్సిందే!అయితే, దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను కానీ, యూనస్ ఉద్దేశాలపై ఉన్న సందేహాలను కానీ ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహి స్తామన్న ప్రకటన తొలగించలేకపోయింది. అవామీ లీగ్ తర్వాత, దేశంలో రెండవ అతి పెద్ద పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) కూడా ఎన్నికలకు అంత వ్యవధి తీసుకోవడాన్ని వ్యతిరేకించింది. ఈ ఏడాది ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఈ విషయంలో అదీ, సైన్యం ఒకే వైపున నిలిచాయి. పదేళ్ళ పైచిలుకుగా బీఎన్పీ వేధింపులకు, అణచివేతకు గురైంది. హసీనా ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో నిండిన దేశంలోని ప్రస్తుత సంక్షుభిత రాజకీయ వాతావరణంలో, ఎన్నికల్లో అతి పెద్ద విజయాన్ని చేజిక్కించుకోవాలని బీఎన్పీ ఉవ్విళ్ళూరుతోంది. ఎన్నికలను వచ్చే ఏడాది నిర్వహించడానికి యూనస్ ఒక సాకు చూపుతున్నారు. పదవిని చేపట్టినపుడు తాను మూడు వాగ్దానాలు చేశాననీ, జాతీయ ఏకాభిప్రాయ సాధన ప్రక్రియ ద్వారా రాజ్యాంగ, ఎన్నికల, ఇతర సంస్థాపరమైన సంస్కరణలు తీసుకొస్తానని అన్నా ననీ, వాటిని నెరవేర్చవలసి ఉందనీ ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతనే, ఎన్నికలు అన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. బీటలువారిన రాజకీయ, పాలనా, న్యాయ వ్యవస్థలకు కాయ కల్ప చికిత్స చేస్తేనే ఎన్నికలు సత్ఫలితాలు ఇవ్వగలవని యూనస్ వాదన. లేకపోతే గతంలో మాదిరిగానే, ఒకే పార్టీ పాలన కిందకు దేశం వస్తుందనీ, హసీనా మూడు విడతల పాలనలో చూసిన నిరంకుశ పార్శా్వన్నే తిరిగి చూడవలసి ఉంటుందనీ అంటున్నారు. ఈ రకమైన సంస్కరణలను 2008 ఎన్నికలకు ముందే తీసుకొచ్చి ఉంటే, నేటి రక్తపాతాన్ని, రాజకీయ కల్లోల పరిస్థితులను నివారించగలిగి ఉండేవారమనే అభిప్రాయం దేశంలోని కొన్ని వర్గాల్లో ఉంది. అవామీని దూరం చేయకూడదు!ప్రతి పార్శా్వన్నీ అధ్యయనం చేసి మార్పులను సూచించేందుకు యూనస్ ఆరు కమిషన్లను ఏర్పాటు చేశారు. అవి నివేదికలను కూడా సమర్పించాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన ‘జాతీయ ఏకాభిప్రాయ కమిషన్’ సంస్కరణలపై సర్వతోముఖ అంగీకారాన్ని కుదిర్చే పనిలో ఉంది. కానీ, అటువంటి ఏకాభిప్రాయం కనుచూపు మేరలో కనబడకపోవడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. బీఎన్పీకి అధికారం పదేళ్ళుగా అందని మానిపండుగానే ఉన్న ప్పటికీ, దాని నాయకురాలు ఖలీదా జియా ఏళ్ళ తరబడి జైల్లో మగ్గి నప్పటికీ దాని రాజకీయ చతురత ఏమాత్రం మొక్కవోలేదు. సంస్క రణలపై ఏకాభిప్రాయం కొరవడటాన్ని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయకూడదని అది పేర్కొంది. ఎన్నికలను వాయిదా వేస్తూ పోవడం వల్ల దేశంలో అల్లకల్లోలం తీవ్రరూపం దాల్చవచ్చనే భయాలున్నాయి. పరిస్థితులు మరింత దిగజారి ఎన్నికల నిర్వహణే అసాధ్యంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అవామీ లీగ్‌ను నిషేధించి, ఎన్నికల్లో పాల్గొనడానికి లేకుండా చేయడం వల్ల సంస్కరణలు, ఏకాభిప్రాయ సాధనకు సంబంధించిన మాటలంతా శుష్క వాగ్దానాలుగానే కనిపిస్తున్నాయి. హసీనా, ఆమె ఆంతరంగిక పరివారంలోని అనేక మంది నాయకులు ఢిల్లీలో అజ్ఞాత జీవితం గడుపుతూండటంతో ఆమె పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు స్వదేశంలో లక్ష్యంగా మారుతున్నారు. అవామీ లీగ్ బక్క చిక్కిన స్థితిలో ఉన్నప్పటికీ, అది ఎన్నికల్లో పాల్గొనకపోతే, బంగ్లా దేశ్‌కు చెందిన అనేక సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను ముందుకు తెచ్చినా అవి నిష్ప్రయోజనమైనవే అవుతాయి. ఒక రాజ కీయ పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచడం వల్ల రాజకీయ, సామా జిక విభేదాలు మరింత పెరుగుతాయి. హసీనా చేసిన అనేక తప్పిదాలు పునరావృత్తమయ్యేలా ఇది తిరిగి బాటలు పరచడమే అవుతుంది.బలం పెంచుకుంటున్న జమాత్!మరోవైపు, దేశ విముక్తికి ముందు నెలల్లో, పాకిస్తాన్ సైన్యంతో చేతులు కలిపి అత్యాచారాలకు ఒడిగట్టిన జమాత్–ఏ–ఇస్లామీకి జవ జీవాలు నింపే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఒక రాజకీయ పార్టీగా జమాత్‌కున్న రిజిస్ట్రేషన్ గతంలో రద్దయింది. జాతీయ రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు ఆ పార్టీ నియమావళి విరుద్ధంగా ఉందంటూ హసీనా కనుసన్నల్లోని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో జమాత్ పార్టీ 2013లో జరిగిన ఎన్నికల్లో పాల్గొనలేకపోయింది. హసీనా ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు’ జమాత్ నాయకుడు అజహరుల్ ఇస్లామ్‌ను విచారించి, దోషిగా ప్రకటిస్తే, ప్రభుత్వం గత నెలలో ఆయనను విడుదల చేసింది. అప్పట్లో జమాత్ నాయకులు కోర్టు విచారణలను పక్షపాతంతో కూడినవిగా, సందేహాస్పదమైనవిగా ఆక్రోశించారు. వైచిత్రి ఏమిటంటే, బంగ్లాదేశ్‌ను సరైన బాటలో పెట్టాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న యూనస్ ప్రభుత్వం... అవినీతి ఆరోపణలపైన, ‘మాన వాళిపై చేసిన నేరాలకు’గాను హసీనాను విచారించడానికి అదే కోర్టును వినియోగించుకుంటోంది. ఆమె లేకుండానే చేసే ఆ విచారణ ఫలితం ఎలా ఉండబోతోందో ముందే తెలుసు. హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ డిమాండ్‌కు భారత్ అంగీకరించకపోవచ్చు. ఈ అంశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత కుంగదీస్తుంది. అవామీ లీగ్ కూడా ఎన్నికల్లో పాలుపంచుకునేట్లు ప్రభుత్వంపై సైన్యం ఒత్తిడి తేగలదన్నదే ఆ పార్టీకి ఆశాకిరణంలా ఉంది. బీఎన్పీ మాజీ మిత్రపక్షమైన జమాత్ ఈసారి సొంతంగా ఎక్కువ విజయాలు సాధించగలమని ధీమాతో ఉంది. ఎన్నికల నిర్వహణను అది కూడా గాఢంగా కోరుకుంటున్నప్పటికీ, దానికి వ్యవధి తీసుకున్నా ఫరవాలేదని భావిస్తోంది. ఎన్నికలను 2026 మధ్యలో నిర్వహించాలని జమాత్ చేస్తున్న డిమాండ్‌కు యూనస్ నిర్ణయించిన ఏప్రిల్ ముహూర్తం దగ్గరగానే ఉంది. ఈలోగా క్షేత్ర స్థాయిలో తన పార్టీని పటిష్ఠపరచుకోవడానికి ఆ కాలం కలిసొస్తుంది. అవామీ లీగ్ స్థాపకుడు, జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్ ఇంటిని లూటీ చేసి నిప్పుపెట్టి ఉండవచ్చుగాక. కరెన్సీ నోట్ల నుంచి ఆయన ఫోటోను తొలగించి ఉండవచ్చుగాక. కానీ, బంగ్లాదేశ్ 1971 మార్చిలో స్వాతంత్య్ర ప్రకటన చేసుకున్న తర్వాత సాగిన హత్యలు, అత్యాచారాల జ్ఞాపకాలను ప్రజల స్మృతిపథం నుంచి తుడిచేయడం అంత తేలిక కాదు. ‘పార్టీ సభ్యుల గత చర్యలకు’ జమాత్ అధినేత షఫీకుర్ రహమాన్ క్షమాపణ కోరినంతమాత్రాన సరిపోదు. బంగ్లా దేశ్‌తో సంబంధాలను ‘సాధారణీకరించుకోవాలని’ పాకిస్తాన్ పెట్టు కున్న లక్ష్యం కూడా అందుకే నెరవేరకపోవచ్చు.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బాధ్యత నుంచి తప్పించుకోవడానికే...
టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్) కార్యక్రమం కోసం విస్తృత ప్రచారం జరుగుతోంది. ‘పీ4’ ద్వారా ఆర్థికంగా స్థిరంగా ఉన్న వారిని ‘మార్గద ర్శులు’గానూ, వీరు దత్తత తీసుకునే పేద కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’ గానూ పేర్కొన్నారు. ఈ మార్గదర్శులు తమ ఖర్చుతో బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించి నూరు శాతం పేదరిక నిర్మూలన (జీరో పావర్టీ) సాధించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. కానీ దీని వెనక దాగి ఉన్న నిజం వింటే ప్రభుత్వ పెద్దల దుర్బుద్ధి ఇట్టే తేటతెల్లమవుతుంది.ఆంధ్రప్రదేశ్‌లో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. పీ4 ప్రాజెక్టు కింద కేవలం 19.15 లక్షల కుటుంబాలను మాత్రమే ‘పేదలు’గా గుర్తించారు. అంటే 87 శాతం మంది అల్పాదాయ వర్గం (బీపీఎల్) పరిధిలోని కుటుంబాలు ఈ దీని పరిధిలోకి రాలేదన్నమాట. నమోదైన వారిలో సైతం మార్గదర్శకులు దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలు కేవలం 62,970. అంటే మొత్తం పేదల్లో కేవలం ఒక శాతం కన్నా తక్కువే. వీరికి అండగా నిలిచేందుకు గుర్తించిన మార్గదర్శుల సంఖ్య కేవలం 5325 మంది ఉన్నారు. ఈ సంఖ్యలు చూస్తే... ‘పీ4’ ద్వారా పేదల్లో ఎంత శాతం మందికి మేలు చేకూరు తుందో, వారి జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో మెరుగుపడతాయో చెప్పొచ్చు.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా కంపెనీలు, సంస్థలు ఏటా నిర్వహించే దాతృత్వ కార్యకలాపాలను ఇక నుండి పీ4లో మార్గదర్శుల ఖాతాలో చూపించబోతున్నారు. వాస్తవానికి, కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీల స్థాయిని బట్టి తమ లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, పర్యావరణం, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాల్లో పేదల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలి. ఇలా ఏటా వేల కోట్లు కంపెనీలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు అదే పనిని పీ4 కింద చేర్చి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. సాధారణంగా పేదల ఆరోగ్యం, విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి, ఇతర సంక్షేమ అవసరాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ బాధ్యత నుంచి తప్పించు కుంటూ పీ4 పేరిట కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు దీన్ని ప్రభుత్వం అప్పగించాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పేదలకు ఆర్థిక చేయూత నిచ్చే సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడే కుట్రలో భాగమే ఇదని చెప్పొచ్చు. ఈ పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం – పేదలకు ధనవంతులు సహాయం చేయటం! కానీ చంద్రబాబు నాయుడు అమలు చేసిన ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ప్రయోజనం పొందిన పెట్టుబడి దారులను ‘మార్గదర్శులు’ అని పిలవడం సరికాదు. సూపర్–6 వాగ్దా నాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వ పెద్దలు పీ4ను తెరపైకి తెచ్చినట్లుంది. వైఎస్సార్ వంటి మహానేతలు ప్రారంభించిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో పాటు ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్నాలు’ ప్రజల అవసరాలను నేరుగా తీరుస్తూ సంక్షేమాన్ని వారి కళ్ల ముందు నిలిపాయి. కానీ నేటి ప్రభు త్వానికి సంక్షేమ స్పృహ కని పించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఏదైనా పథకాన్ని ప్రభుత్వ భాగ స్వామ్యంతో నడిపితే సత్ఫలితాలుంటాయి. అది జరగనప్పుడు రాష్ట్రాభివృద్ధి తిరోగమిస్తుంది. పీ4 అనేది ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే కార్యక్రమం కానే కాదనేది గమనార్హం. ఇటువంటి కార్యక్రమాల అమలును స్వతంత్ర ట్రస్ట్‌ల ద్వారా, పార దర్శక ఆడిటింగ్‌తో, ప్రభుత్వ భాగస్వామ్యంతో పర్యవేక్షిస్తేనే విశ్వస నీయత పెరుగు తుంది. లేదంటే, ఇది కూడా ఓ ‘సూపర్–6’ నినాదం లాగా మిగిలి పోతుంది. పేదల ఆత్మాభిమానాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టడం దీనిలో కనిపిస్తోంది. తాము సహాయం చేస్తున్నాం కాబట్టి ఎన్నికల సమయంలో తాము చెప్పిన రాజకీయ పక్షాలకే ఓటువేయాలని కార్పొరేట్ సంస్థలు పేదలపై ఒత్తిడి తేవచ్చు. అదే జరిగితే ప్రజా స్వామ్యం మంట గలిసిపోతుంది. కార్పొరేట్లు ఎవరిని తలచుకుంటే వారినే అధికారంలో కూర్చోబెట్టగలుగుతారు. ఎటూ ఈ కార్యక్రమాన్ని తామే ప్రవేశపెట్టాం కనుక పేదప్రజలను తమ ఓటుబ్యాంకుగా కార్పొ రేట్లు మారుస్తారని ప్రస్తుత ప్రభుత్వాధినేత ఆలోచన. ఇదే పీ4 వెనుక ఉన్న అసలు రహస్యం!– తలకోల రాహుల్ రెడ్డి,ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనలిస్ట్ -
ఉత్పాదకత పెరగదు... అనారోగ్యం తప్ప!
కార్పొరేట్ల కోణంలో చూసినప్పుడు మనిషి కూడా ఒక యంత్రమే. ఈ యంత్రాన్ని తమకు నచ్చినంత సమయం వాడుకోవాలని యజమానులు చూస్తారు. ఎటువంటి భావోద్వేగాలనూ ప్రదర్శించకుండా తమ ‘చెప్పుచేతల్లో’ ఉంచుకోవా లని ప్రయత్నిస్తారు. తాము ఇస్తున్న వేతనంతో పోలిస్తే ఉద్యోగి అందించే సేవ తక్కువ అన్న భావం ప్రకటించని యజమానులు అసలు ఉండ రేమో? మరోవైపు ఉద్యోగి తాను చేసే పనినీ, వచ్చే డబ్బునూ నిత్యం బేరీజు వేసుకుంటాడు. ఈ లెక్కల మధ్య ఉద్యోగి–యజమాని సంబంధాల్లో పనిగంటలు అనేవి కీలకం. అసలు ఎన్ని గంటలు పనిచేస్తే యజమానులు సంతృప్తి చెందుతారనేది సమాధానం లేని ప్రశ్న. ఏడాది న్నర క్రితం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయ ణమూర్తి వారానికి 70 గంటలు ఉద్యోగులు పని చేయాలని ప్రతిపాదించి పెద్ద చర్చను లేవదీశారు. ఈ రకమైన ‘వర్క్ ఎథిక్’ దేశ ప్రగతికి చాలా అవసరమనీ, అప్పుడే వేగంగా అభివృద్ధి చెందు తున్న చైనా, జపాన్‌లతో పోటీ పడగలమనీ తన వాదనను సమర్థించుకున్నారు. ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఓ అడుగు ముందుకేసి వారానికి 70 గంటలు కాదు, 90 గంటలు పని చేస్తే ఇంకా మంచిదని సూచించారు. ‘మీ ఆవిడ మొహం చూస్తూ ఎంత సేపు ఇంట్లో కూర్చుంటారు. ఆదివారం కూడా పనిచేసుకోండి’ అని ఉచిత సలహా ఒకటి పారేశారు. ఎన్వీడియా వంటి సంస్థల్లో షేర్లు ఉన్న ఉద్యోగులు ఇప్పటికే వారానికి 90 గంటలు పని చేస్తున్నారు. ఒకవైపు ఎక్కువ పనిగంటల పైన చర్చ జరుగుతుంటే... శాప్ ల్యాబ్స్, వీబా ఫుడ్స్ వంటి సంస్థలు పనిగంటలు తగ్గించాయి. దీని వల్ల ఉత్పాదకత పెంచుకోగలి గామని చెబుతున్నారు. ఇప్పుడు ఇదంతా మాట్లాడుకోవటం ఎందు కంటే... ఏపీ ప్రభుత్వం రోజువారీ పని గంట లను 9 నుంచి 10 గంటలకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రయి వేటు సంస్థలు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, తప్పనిస రిగా ఈ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు లేబర్ కోడ్‌ను సవరించాలని నిర్ణయించింది. రోజుకి 8 గంటల వంతున 5 రోజుల పాటు అంటే మొత్తం 40 గంటలపాటు పని చేయటం అనేది ప్రామాణికంగా ఉంది. ఈ ఎనిమిది గంటలను దశాబ్దం క్రితం 9 గంటలు చేశారు. ప్రస్తుతం పెట్టుబడులను ఆకర్షించటానికి, మరిన్ని పరిశ్రమ లను రప్పించటానికి పని గంటలు పెంచినట్టు ప్రభుత్వం చెబుతోంది. ట్రేడ్ యూనియన్లు ఈ విషయంపైన ఆందోళన చెందుతున్నాయి. ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులు ఇప్పటికే దాదాపు రెండు గంటల సమయం అధికంగా పనిచేస్తున్నా రనీ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల పని భారం 12 గంటలకు పెరుగుతుందనీ చెబు తున్నారు. ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా... ‘ఏపీ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ చట్టం’, ‘ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ చట్టం’, ‘ఏపీ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంటు చట్టా’ల్లో మార్పులు చేస్తోంది. ఓటీ నిబంధనలు, నైట్ షిఫ్ట్ నిబంధనలు మార్చారు. ఇకపై మహిళలను కూడా నైట్ షిఫ్టుల్లో పనిచేయటానికి అనుమతిస్తారు. పనిగంటలు ఎక్కువయితే ఉత్పాదకత పెరు గుతుందా? అలాంటిది ఏమీలేకపోగా, ఓ స్థాయి దాటి పని చేయటం వల్ల ఉత్పత్తి దారుణంగా పడిపోతుందని కూడా వెల్లడయ్యింది. ఉద్యోగుల్లో ఒత్తిడి, బర్నవుట్‌తో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబు తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దారుణంగా దెబ్బతింటుంది. భారత దేశంలో 1948 నాటి ఫ్యాక్టరీల చట్టం కూడా ఉద్యోగి వారానికి 48 గంటలకు మించి పని చేయకూడదని చెబుతోంది. ఆఫీసులో ఎక్కువ సమయం ఉండటం వల్ల ఎక్కువ ఉత్పాదకత సాధించగలమని అనుకోవటం భ్రమ. పని ప్రదే శాల్లో సీసీ కెమెరాలు, సామాజిక మాధ్యమాలపైన నిషేధం ఉంచటం, మొబైళ్లను సైతం అనుమతించకపోవటం వల్ల వచ్చే ఫలితం అల్పం. ‘మిమ్మల్ని మేం నమ్మటం లేదు’ అని యాజమాన్యం పరోక్షంగా ఉద్యోగికి చెప్పటమే ఇది. ఉద్యోగులు మనసు పెట్టి పనిచేయకపోవటానికీ, గౌరవంగా ఉండకపోవటానికీ అది కారణం అవుతుంది. ప్రతి ఉద్యోగీ కంపెనీ ఉత్పాదకతలో భాగస్వామి అన్న భావం ఎక్కువ మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఇప్పుడు ఏఐ రంగ ప్రవేశంతో పని విధానం మారిపోయింది. ఉద్యోగుల పాత్ర క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొన్ని ఉద్యోగాలు మాయ మవుతూ మరికొన్ని కొత్తవి రంగప్రవేశం చేస్తు న్నాయి. ఓ సంధియుగంలో ఉద్యోగులు భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగి–యజమాన్య సంబంధాలు సవ్యంగా, సానుకూలంగా మారటం పోయి వారి మధ్య అగాథం మరింత తీవ్రమవుతోంది. – డా‘‘ పార్థసారథి చిరువోలుసీనియర్ జర్నలిస్ట్ ‘ 99088 92065 -
ప్రపంచం మన మాట వినట్లేదేం?
పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది. ప్రపంచంలో ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశ మైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబుతొ సుబియాంతో పాక్‌తో ముడిపెట్టకుండా, భారత్‌ను విడిగా సందర్శించారు. ఒక దశాబ్దం నుంచి భారత ప్రజానీకానికి ఈ రకమైన చిత్రాన్ని రూపుకట్టిస్తూ వస్తున్నారు. మరి మనం ‘అంతర్జాతీయ సమాజం’గా చెప్పుకొంటున్నది పాక్‌ను నిలదీయకుండా సంశయ స్థితిలో ఉండిపోవడానికి కారణ మేమిటి? పాక్‌ను గూడుగా చేసుకుని పనిచేస్తున్న ఉగ్ర మూకల వల్ల రెండు దేశాలూ ఘర్షణ పడి ఇంకా నెల కూడా కాకుండానే, కౌంటర్ – టెర్రరిజం కమిటీ ఉపాధ్యక్ష పదవిని ఐరాస భద్రతామండలి జూన్ 4న పాక్‌కు కట్టబెట్టింది. గత నెల రోజులుగా పాక్ సాధించిన దౌత్య విజయాలకు ఇది శిఖరాగ్రం. పాక్‌ను ప్రపంచం ఎలా వీక్షిస్తోంది అనే అంశంపైన దృష్టి సారించవలసిన సమయం ఆసన్నమైంది. మద్దతుగా వచ్చిన దేశాలెన్ని?రెండు దేశాల మధ్య ఘర్షణలు మొదలై రెండు రోజులయ్యాయో లేదో మే 9న మనం దౌత్యపరమైన మొదటి దిగ్భ్రాంతిని చవిచూడ వలసి వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 200 కోట్ల డాలర్ల రుణాన్ని పాక్‌కు అందించడానికి అనుకూలంగా ఓటు వేసింది. ఒక్క భారత్ మినహా, జీ–7 దేశాలతో సహా బోర్డులోని మిగిలిన సభ్య దేశాలన్నీ పాక్ ఊపిరిపీల్చుకునేందుకు ఊతమి చ్చాయి. ఐఎంఎఫ్ బాటలో, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా పాక్‌కు అప్పులిచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించి ఓ డజను ప్రకటనలు చేశారు. దాడి, ప్రతిదాడులు చేసుకుంటున్న పొరుగు దేశాలతో కాల్పుల విరమణ ప్రకటింపజేసిన ఘనత తనదే నని ఆయన మొదట చాటుకున్నారు. కాల్పుల విరమణకు, అమె రికాకు ఎలాంటి సంబంధమూ లేదని భారత్ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఆయన ఆ రకమైన మాటలు ఆపలేదు. భారత్ –పాక్‌లను ఒకే గాటన కడుతూ, రెండూ అమెరికాకి మిత్ర దేశాలనీ, ఎందుకంటే, అవి అణ్వాయుధ దేశాలనీ ఆయన అన్నారు. భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తకుండా నివారించేందుకు అవి పరస్పరం వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, అమెరికాతో కూడా వ్యాపారం చేయాలని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మద్దతు ప్రకటించిన దేశాలు చాలా ఉన్నప్పటికీ, కేవలం రెండు –ఇజ్రాయెల్, అఫ్గానిస్తాన్ మాత్రమే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదిగా పాక్‌ను పేరెత్తి ప్రకటించాయి. చైనా కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లతో ఒక త్రైపాక్షిక సమావేశం నిర్వహించి ఆ రెండింటి మధ్య రాజీ కుదిర్ఛింది. దాంతో, ప్రస్తుతం నిస్సహాయులపై జాతిసంహారం సాగిస్తున్నట్లు నిందపడుతున్న ఇజ్రాయెల్ ఒక్కటే, భారత్‌కు అండగా నిలిచి నట్లవుతోంది. రష్యా కూడా రెండు నాల్కల ధోరణితో మాట్లాడింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత, భారత్ ‘భాగ స్వాములను కోరుకుంటోంది కానీ, బోధకులను కాదు’ అని యూరో పియన్ యూనియన్ను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత ఎవరూ నీతులు పలికే యత్నం చేయని మాట నిజమేకానీ, భాగస్వాములవుతామన్న దేశాలు కొద్దిగానే ఉన్నాయి.మనకెందుకు మద్దతు రాలేదు?పాకిస్తాన్ అసలు రూపాన్ని అంగీకరించడంలో, దాన్ని నిల దీయడంలో, ‘అంతర్జాతీయ సమాజం’గా మనం భావిస్తున్నదిఎందుకు వెనకడుగు వేస్తున్నట్లు? పాకిస్తాన్ దుశ్చర్యలను చిత్తశుద్ధితో ఎందుకు ఖండించడం లేదు? కనీసం, భారతదేశానికి మరింత హృదయపూర్వకంగానైనా సంఘీభావం వ్యక్తపరచడం లేదు ఎందుకని? భారత రాయబారులు చేయవలసిన పనిని నిర్వర్తించేందుకు వివిధ పార్టీల పార్లమెంట్ సభ్యులతో ప్రతినిధి బృందాలను ప్రధాని నరేంద్ర మోదీ పంపవలసిన అవసరం ఎందుకొచ్చింది?గతంలో ఇలాంటి స్థితి ఎన్నడూ ఉత్పన్నం కాలేదు. మఫ్టీ దుస్తు లలో వచ్చిన పాక్ సైనికులను కార్గిల్ నుంచి 1999లో తరిమి కొట్టినప్పుడు... అంతర్జాతీయ సమాజం భారత్ సరసన నిలిచింది. నియంత్రణ రేఖనే సరిహద్దుగా అంగీకరిస్తున్న సిమ్లా ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తలూపిన తర్వాత, కశ్మీర్ హోదాపై ప్రపంచ అభిప్రాయంలోనూ మార్పు వచ్చింది. క్లింటన్ అప్పట్లో భారత్‌లో ఐదు రోజులు పర్యటించి పాకిస్తాన్లో ఐదు గంటలు మాత్రమే గడిపారు. భారత్‌ను ప్రశంసించి, పాక్‌ను మందలించారు. ముంబయిపై ఉగ్రదాడి సందర్భంలో, 2008 నవంబర్‌లో కూడా మొత్తం ప్రపంచం భారత్‌కు బాసటగా నిలిచింది. ఆ రెండు ఉదంతాలలోనూ పాక్ పాత్ర తేటతెల్లం కావడంతో అది తలదించు కోవలసి వచ్చింది. భారత్ ప్రకటనలకు ప్రపంచం సముచిత గౌరవం ఇవ్వడం కూడా దానిలో అంతే సమానమైన పాత్ర వహించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల ప్రకట నలను అన్ని ప్రధాన దేశాలూ గౌరవ ప్రపత్తులతో చూశాయి. మన వైఖరి గురించి వివరణ ఇచ్చుకుంటూ, 50 మంది పార్లమెంటేరి యన్లను ప్రపంచం నలుమూలలకు పంపడం ద్వారా ప్రజాధనాన్ని ఇప్పటిలా వృథా చేయవలసిన అవసరం కూడా లేకపోయింది.వృత్తిపరమైన దౌత్యవేత్తలే ఆ బాధ్యతను నిర్వహించారు. పహల్గామ్ దాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదుల జాతీయ తను గుర్తించడంలో, పాక్ అపరాధాన్ని స్పష్టంగా నిరూపించడంలో కేంద్రం విఫలమైంది. అది ఈసారి భారత్ దౌత్య సామర్థ్యాన్ని వికలం చేసింది. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ వాదనను బలహీన పరచడంలో భారత అంతర్గత రాజకీయాలు పాత్ర పోషించలేదు కదా అని ప్రపంచంలోని అనేక దేశాలు విస్తుపోతున్నాయి. భారత్ లౌకిక, ప్రజాస్వామిక దేశంగానూ, వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు బాధ్యతాయుతమైన ప్రభుత్వాలుగానూ పరిగణన పొందాయి. వర్తమానానికొస్తే, భారత్ కేసు బలహీన పడింది. అంత ర్జాతీయ అభిప్రాయంలోనూ సానుభూతి సన్న గిల్లింది. మున్ముందు జరగవలసింది!శత్రుదేశాన్ని ఆచితూచి అంచనా వేయడం జాతీయ భద్రత, విదేశీ విధాన నిర్వహణ కర్తల మొదటి లక్ష్యం కావాలి. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి వీలయ్యే విధంగా వివిధ స్థాయులలో సంబంధాలు కొనసాగేటట్లు చూసుకోవాలి. పాకిస్తాన్‌తో అన్ని దౌత్య పరమైన, వ్యాపార, పౌర సమాజ మార్గాలను మూసివేయడ ద్వారా... పొరుగు దేశం గురించి సమ తూకంతో కూడిన మదింపు చేయడానికున్న మార్గాలను, సరిహద్దుకు ఆవల అభిప్రాయాలను ప్రభావితం చేయడానికున్న అవకాశాన్ని చేజార్చుకున్నట్లయింది. రెండు దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసం పెరిగిందనడంలో సందేహం లేదుగానీ, పాకిస్తాన్‌ను మరీ పనికిరానిదిగా చూడటం కూడా సరికాదు. దానికి చెప్పుకోతగినంత ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక, వ్యావసాయిక పునాదులున్నాయి. దానికి ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలున్నాయి. సమర్థత కలిగిన సైన్యం ఉంది. పాక్ తన భౌతిక శక్తితోపాటు, ఉన్నత వర్గీయుల ‘సాఫ్ట్ పవర్’ను కూడా వినియోగించుకుంటోంది. భూస్వామ్య పెత్తందారీ విధానం, అసమానతలు అధికంగా ఉన్న సమాజంలో, పాశ్చాత్య మధ్యవర్తులతో సమానమైన వర్గంగా, ఆత్మవిశ్వాసంతో మెలిగేలా పాక్ తన ఉన్నత వర్గాన్ని తీర్చిదిద్దుకుంటూ వస్తోంది. భారతదేశపు రాజకీయాలను, దౌత్యాన్ని ప్రభావితం చేస్తున్న మధ్య తరగతి దానికి దీటు కాదు.సంజయ బారు వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ ఫౌండర్–ట్రస్టీ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు -
నెత్తుటియేరుల్లో కత్తుల కోలాటం
మనుషులు రకరకాల నేప థ్యాలతో పుడతారు. రక రకాల వర్గ, కుల, మత, ప్రాంత, భాష, జాతీయతల ఆధారిత అస్తిత్వాలు, రక రకాల వెనక్కి మళ్లే, ఉన్న చోటనే ఉంచే లేదా నెమ్మది గానో ధృత గతిలోనోముందుకు పోయే ఆలోచ నలు, చింతనలు, సిద్ధాంతాలు, మనస్తత్వాలు ఏర్ప రచుకొని రకరకాల వృత్తులు, వ్యాపకాల్లో కొనసాగి ముందో, వెనకో మరణిస్తారు.తెంటు చలం అలియాస్ సుధాకర్ గెరిల్లా జీవి తాన్ని ఎంచుకుని నిరుపేదలు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే సంకల్పంతో అజ్ఞాత జీవితం గడుపుతూ అడవి బాట పట్టి నాలుగు దశాబ్దాలు దాటింది. నిజానికి సాయుధ పోరుతో సమాజాన్ని మార్చే అజ్ఞాత రివల్యూషనరీ సగటు ఆయుష్షు మూడు నుంచి ఐదేళ్లకు మించితే గొప్పే. ఎందుకంటే వాళ్ల బతుకు నిరంతర సంగ్రామం. నిత్యం పొంచి ఉన్న దాడుల, అనారోగ్యాల, పాము కాట్ల, నెత్తు టేరుల్లో పుట్టి మునకల కత్తుల కోలాటం. ఎప్పుడో ఎక్కడో ఆయుర్వేద వైద్యుడిగా గడిపి మరణించాల్సిన ఈ చలం అలియాస్ సుధాకర్ 70 ఏళ్లదాకా ఏటికి ఎదురీది ఉత్తరాంధ్ర, గోదావరిమన్యం, ఏవోబీ, అబూజ్మడ్ దండకారణ్యప్రాంతాల్లో నిరుపేద ఆదివాసీ అణగారిన వర్గాలజనాల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం విత్తులు జల్లి దోపిడీని ప్రశ్నించి, ఎదిరించే చైతన్యం అందించి నిష్క్రమించాడు.సమాజానికి అవసరమైన ఉద్యమం2004లో వైఎస్సార్ సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా హోమ్ మంత్రి జానారెడ్డి తదితరులతో చర్చలు జరిపే మావోయిస్టు పార్టీ ప్రతినిధులుగా అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, తెంటు చలం అలియాస్ సుధాకర్ తదితరులు అడవి వీడి బయటకు వచ్చారు. హైదరాబాద్‌లో వాళ్లను చూసే అవకాశం మాలాంటి జర్నలిస్టులకు దక్కింది. చాలా సరళమైన, వినమ్ర జీవన విధానం వాళ్లది. వీళ్ల ఉద్యమం ఓ మోస్తరు స్థాయిలో కొనసాగడం సమాజానికీ, గిరిజనులకూ అవసరం అని; వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖలు కోట్ల ఖర్చుతో చేయలేని ఆదివాసీ ఉద్ధరణ పని ఈ ఆదర్శవాద యువత చేస్తోందని 1990లలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ డీజీపీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే మాట నేను మళ్లీ రెండు నెలల క్రితం ఒడిశాలో ఓ రైలు ప్రయాణంలో ఓ కోబ్రా కమాండో నోట విన్నాను.బడా ధనవంతుల రక్షణ తమ ఉద్యోగం అనీ, నిరుపేదల రక్షణ కవచం మావోయిస్టులు అనీ, బ్రతుకుతెరువు కోసమే వాళ్లను హతమార్చే ఉద్యోగం చేస్తున్నాననీ 30 దాటిన వయసులోని 10 ఏళ్ల అనుభవం ఉన్న ఆ యువ కమాండో నాతో అన్నాడు. నిజానికి 19వ శతాబ్దపు జర్మన్, బ్రిటిష్ రాజులు తలచుకుంటే మార్క్స్ లాంటి శ్రామికవర్గ శ్రేయోవాదులు గాని, 20వ శతాబ్దంలో రష్యన్ జార్ చక్రవర్తి ఆగ్రహిస్తే లెనిన్, స్టాలిన్ లాంటి బోల్షెవిక్ ఉద్యమకారులు గాని ప్రవాసాలు, జైలు జీవితాల బదులు చిన్న వయసులోనే క్రూర హత్యలకు గురయ్యేవాళ్లు. కానీ అప్పటి ఫ్యూడల్ ప్రభువులు తమను పడగొట్టే యత్నంలో ఉన్న శక్తులపై కొంత ఉదారంగానే ఉండేవారు. కానీ 21వ శతాబ్దపు సూడో ప్రజాస్వామ్యంలో చర్చలకు సిద్ధమని ప్రకటించినా అందుకు ఏమాత్రం సమ్మతించకుండా, ఇజ్రాయెల్ టెక్ నైపుణ్యం అండతో వేలాది ట్రూప్స్‌ను కూంబింగ్‌కు పంపి అడవి జంతువుల్ని వెంటాడి వేటాడినట్టు ప్రభుత్వం దారుణంగా చుట్టు ముట్టి చంపుతోంది.బుద్ధుని బాటలో మధ్యే మార్గంచావు ఎవరికీ తప్పదు. అందులోనూ విప్లవ కారులు చావును ఆమోదించే కదా ఆ బాటలోకి వెళ్లారు! వాళ్లయినా, మన రాజకీయ నేతలైనా, మనమెవరిమైనా చిరకాలం ఇక్కడే ఇలాగే పదిలంగా ఉండిపోము. ఉన్నన్ని రోజులూ మనం ఎవరి మేలు కోసం బతికామో భావి తరాలు బేరీజు వేస్తాయి. బుద్ధ ప్రవచిత ‘బహుజన హితమూ, బహుజన సౌఖ్యమే’ ఎప్పటికైనా అనుసరణీయం. ఎక్కువమంది బతుకులు అతలాకుతలం చేసి కొద్ది మందికి కులికే అవకాశం ఇచ్చే ఏ వ్యవస్థా ఎంతో కాలం మనలేదు. ఇప్పటికైనా సాయుధ అణచివేత బదులు బుద్ధుని బాటలో మధ్యే మార్గంలో వెళ్లి శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తే దేశానికి భవిష్యత్‌లో విధ్వంసక అభివృద్ధి క్రమం వల్ల మరింత తీవ్ర గాయాలు తగిలే బెడద తగ్గుతుంది. అన్ని మూలలకూ ఆర్గానిక్ గ్రోత్‌ను విస్తరించడం సాధ్యపడుతుంది. కానీ పాలకులిప్పుడు కాస్త లోతుగా ఆలోచించే స్థితిలో ఉన్నారా? అత్యున్నత న్యాయస్థానం, బుద్ధిజీవులు ఆ దిశగా ప్రభుత్వం యోచించేలా చేయగలరా? ఆశావాదం అవసరమైన నైరాశ్య భరిత కాలమిది.వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
జీడీపీ వృద్ధి కథనం వెనుక...
హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకే అందమైన సాఫ్ట్వేర్ కార్యాలయాలకి ఎనిమిది కిలోమీ టర్ల ఆవల... అల్పాదాయ వర్గాలు నివసించే ఓ ప్రాంతం. అక్కడ ఓ ఇరుకింట్లో నివసించే 21 ఏళ్ల మానస తెల్లారక ముందే నిద్ర లేచి పనికి బయలుదేరుతుంది. ఓ కార్పొరేట్ కార్యాలయ హౌస్ కీపింగ్ విభాగంలో నెల మొత్తం పని చేస్తే ఆమెకు లభించే వేతనం రూ. 8,500. తల్లి ఐదు ఇళ్లల్లో పనులుచేస్తుంది.తండ్రి తెలంగాణలోని ఓ పల్లెలో సన్నకారు రైతు ఒకప్పుడు. ఇప్పుడు భవన నిర్మాణ కూలీ. ఆ పని కూడా అన్ని రోజుల్లోనూ దొరకని పరిస్థితి. మానస వాళ్ల ఇంటికి కొన్ని వీధుల ఆవల, నగర పెరుగుదలను ప్రతిఫలించే హోర్డింగులు మెరిసిపోతుంటాయి. సేవా రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధిని వెలిగించిన సాఫ్ట్ వేర్ సిటీగా హైదరాబాద్ కొనియాడబడుతుంటుంది. కానీ మానస వాళ్ల ఇంట్లో ఈ ఆర్థిక వృద్ధి తాలూకూ వెలుగు రేఖలెక్కడా కనిపించవు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పరంగా భారత్ మరో మైలు రాయిని చేరుకోవడం, జపాన్ను అధిగమించనుండటం గురించి పత్రికలు పలు కథనాలు ప్రచురిస్తున్నాయి. భారత్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం నిస్సందేహంగా గుర్తించదగిన విజయమే. కానీ, విమర్శనాత్మక దృష్టికోణంలో పరిశీలించినట్టయితే ఇది ప్రశంసించదగిన విజయమని చెప్పలేం. జీడీపీ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని కొలుస్తాయే తప్ప సామాజిక న్యాయం, సమ్మిళితత్వం, మానవాభివృద్ధిని కొలవలేవు. అవి ఆర్థిక వ్యవస్థ చేసే ఉత్పత్తుల గురించి చెబుతాయే తప్ప, వాటి ద్వారా ఎవరు లబ్ధిపొందుతున్నారనే కీలక విషయాన్ని పట్టించుకోవు. రెండు భారత గాథలుపరిమాణంలో ఆర్థిక వ్యవస్థ పెద్దదైనప్పటికీ, 125 దేశాలతో రూపొందించిన ప్రపంచ ఆకలి సూచికలో భారత్ స్థానం దిగువనే, 111వ స్థానంలో ఉంది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే ప్రకారం, ఐదేళ్ల లోపు పిల్లల్లో దాదాపు 35 శాతం మంది ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. 19 కోట్లకు పైగా భారతీయుల్లో పోషకాహార లోపముంది. ఆర్థిక వృద్ధి కూడా చాలామటుకు పట్టణ, సేవారంగ ఆధారితమైంది. 45 శాతం మంది భారతీయులకు వ్యవసాయం ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, జీడీపీలో వ్యవసాయ రంగ వాటా కేవలం 15 శాతమే.ఓవైపు జీడీపీలో పెరుగుదల నమోదవుతుండగా, మరోవైపు ఉద్యోగ రాహిత్యం తాండవిస్తోంది. ఉన్న ఉద్యోగాలకు సైతం భద్రత లేని పరిస్థితి. లేబర్ ఫోర్స్ డేటా ప్రకారం... అసంఘటిత, అభద్రమైన ఉద్యోగాల వైపు మళ్లించబడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దేశంలో 80–90 శాతం మంది అసంఘటిత కార్మికులే/ఉద్యోగులే.ఆదాయ, సంపదల పరంగా ఇప్పుడు ఏర్పడిన అసమానతలు స్వాతంత్య్రానికి ముందరి వలస కాలపు స్థాయితో పోటీ పడు తున్నాయి. వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ ప్రకారం... గత పాతికేళ్లలో ఆదాయ అసమానతలు పెరుగుతూ వచ్చాయి. 40 శాతం దేశసంపద ఒక్క శాతం దేశ కుబేరుల గుప్పిట్లో ఉంది. దిగువ భాగపు50 శాతం ప్రజల వద్ద ఉన్న సంపద కేవలం 3 శాతమే. ఓవైపు స్టాక్ మార్కెట్లు, శత కోటీశ్వరులు పెరుగుతుంటే, మరోవైపు లక్షలాదిమంది పేదరికం వైపు నెట్టివేయబడుతున్నారు. గ్రామీణ పేదలు, అసంఘటిత కార్మికులు, కింది కులాల వాళ్లు ఆర్థిక అస్థిరత తాలూకూ భారం మోస్తున్నారు. వృద్ధి రేటు పెరుగుదలపై వెలువడు తున్న విజయగాథల్లో... ఈ అసమానతల పార్శ్వం అరుదుగానే వినిపిస్తోంది.ఇక విద్యారంగ పరిస్థితికొస్తే... సర్కారీ బడుల్లో చేరికలు పెరిగినప్పటికీ 5వ తరగతిలోపు విద్యార్థుల్లో సగానికి పైగా పిల్లలు 2వ తరగతి పుస్తకం కూడా సరిగా చదవలేకపోతున్నారు. విద్యఅందుబాటులోకి రావడం ఎంత ముఖ్యమో, నాణ్యత కూడా అంతే ముఖ్యమనే విషయం ఇక్కడ గ్రహించాల్సి వుంది. ఉపాధ్యాయులకు అరకొర జీతాలు చెల్లిస్తుండటం, బట్టీ పట్టించే బోధనా పద్ధతులు అవలంబిస్తుండటం వంటి అంశాలు నాణ్యతా రాహిత్యానికి కారణ మవుతున్నాయి. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకునే విషయంలో చోటు చేసుకున్న వ్యత్యాసాలు... కోవిడ్ అనంతర కాలంలో అభ్యసన సంబంధిత అంతరాల్ని మరింత పెంచాయి. కీలక సూచికల పట్ల పట్టింపు ఏదీ?ఇష్టపూర్వకమైన సూచికల ఆవల అంతగా పట్టించుకోని, లోతైన వ్యవస్థాగత ప్రమాదాలు పొంచి వున్నాయి. వాతావరణ సంక్షోభం, ప్రాంతీయ అసమానతలు వంటి కొన్ని కీలక సూచికలను ఏ మాత్రమూ లక్ష్యపెట్టలేదు. ఉదాహరణకు– భూగర్భ జల సంక్షోభ తీవ్రత ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటి. కానీ ఈసంక్షోభం వల్ల తలెత్తగల పర్యావరణ క్షీణతను జీడీపీ వృద్ధి గణకులు పరిగణనలోకి తీసుకోలేదు.మానవాభివృద్ధి పరంగా కేరళ, తమిళనాడు పై ర్యాంకుల్లో వున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ఆరోగ్యం, అక్షరాస్యత అంశాల్లో దశాబ్దాలుగా వెనకబడి పోయాయి. సుమారు 145 కోట్ల జనాభా ఉన్న దేశంలో... తలసరి ఆదాయం 2,880 డాలర్లు మాత్రమే. అసమానతల తీవ్రతను పట్టి చూపే ఇలాంటి ఉదాహరణలు ఎన్నయినా ఇవ్వొచ్చు. పోషకాహారం, విద్య, వస్తు సేవల లభ్యత, వాతావరణ స్థితిస్థాపకత తరహా సూచికల్ని మెరుగు పరచుకునే దిశగా సాగాల్సిన లోతైన సంభాషణకు... జీడీపీ గణాంకాల పట్ల ఉన్న వ్యామోహం అడ్డుపడుతోంది. మనకు కావలసింది వృద్ధిఫలాలు మెరుగైన రీతిలో పునఃపంపిణీ కావడం. ప్రజారోగ్యంపై పెట్టుబడులు, ప్రా«థమిక విద్య, పోషకా హార కార్యక్రమాలు, ఉపాధికి హామీలు వంటి వాటి ద్వారా భారత దేశ దీర్ఘకాల భవిష్యత్తుకు దోహదం చేయడం. మరో విధంగా చెప్పాలంటే... విజయాన్ని పునర్నిర్వచించడం.మానస కుటుంబం తన మౌలిక అవసరాల విషయంలోఎలాంటి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోనప్పుడు... ఆమె గౌరవ ప్రదమైన ఉద్యోగం, న్యాయమైన అవకాశాలు పొందగలిగి నప్పుడు... అది, అదే అసలైన వృద్ధి కథనం. అప్పటివరకు జీడీపీ గురించిన కథనాల్లో ఉండేవి పాక్షిక సత్యాలే.-వ్యాసకర్త ఆర్థిక శాస్త్ర బోధకురాలు,ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ, ఏపీ-డా‘‘ బొడ్డు సృజన -
అదే కాంగ్రెస్ ప్రారబ్ధం!
శశి థరూర్‌ను కాంగ్రెస్ గొప్ప సొత్తుగా భావిస్తుందని అను కున్నా. పార్టీకున్న అత్యంత విలు వైన సభ్యులలో ఒకరిగా,తామెంతో గర్వించదగిన వ్యక్తిగా ఆయన్ను గౌరవిస్తుందని భావించా. కానీ, పార్టీ ఆయనను ఒక ద్రోహిగా పరిగణిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక తిరుగుబాటు దారునిగా, కట్టు బాటు తప్పిన వ్యక్తిగా చూస్తోంది. నాయకత్వం థరూర్ పట్ల ముభావంగా, అంటీ ముట్టనట్లుగా ఉండటమే కాదు, అసలు ఆయన పొడ గిట్టనదిగా వ్యవహ రిస్తున్నట్లు కనిపిస్తోంది. అది అసూయతోనా? అభద్రతా భావంతోనా? లేక శత్రు త్వంతోనా? అనేక మంది కాంగ్రెస్ నాయకులకు అనేక స్థాయిలలో శశి ఎసరుపెట్టగలిగిన వ్యక్తిగా ఉన్నారనడంలో నాకెలాంటి సందేహమూ లేదు. శశిలో కనిపించే అధునా తనత్వం, వాక్పటిమ లేనివారు ఆయన్ని చూసి అసూయ పడవచ్చు. సొంతంగా విజయం సాధించగలగడంపైన కానీ, అర్హతలపైన కానీ నమ్మకం లేనివారు అభద్రతా భావానికి లోనవడం కూడా సహజం. శశికున్నంత ప్రతిభ, ప్రాచుర్యం తమకూ ఉన్నాయని, తాము ఆయనకు ఏమీ తీసిపోమని భావించేవారు ఆయనను ఒక ప్రత్యర్థిగా భావించవచ్చు. ఆ మూడు రకాలవారూ శశిని పార్టీ నుంచి బయటకు గెంటే యలేకపోయినా, ఆయన ప్రాబల్యాన్ని, స్థాయిని తగ్గించా లని బలంగా కోరుకుంటున్నారు. రాజకీయాల్లో ఇదంతా అనివార్యమేనని మీరు అను కోవచ్చు. మనం తరచూ చూస్తున్న తెరచాటు, వంచనా యుత రాజకీయాల్లో ఇది మామూలేనని అనుకోవచ్చు. ఇతర పార్టీలలోని యువ ప్రతిభావంతులను ఆ పార్టీలలోని సహ చరులు సమానంగా చూస్తున్నారు. కనీసం, వారిని కించ పరచే మార్గాలను అనుసరించడం లేదు. సగటు మానవులు, తమను మించి ఎదిగిపోగలరని భావించినవారిని చూసి సహించలేరు. అందులోనూ, రాజకీయ నాయకుల విషయంలో అది మరింత వాస్తవం. నేను దానితో విభేదించడం లేదు. దానిని అర్థం చేసుకోగలను. శశిలోని ఆత్మవిశ్వాసపు చిరునవ్వు, అతిశయం... మిగిలిన నాయకులకు చాలా కాలంగా కంటగింపుగా ఉండవచ్చు. లోలోపల కోపంతో రగిలిపోతూ ఉండవచ్చు. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, ఆయన చాలా మంది శత్రువులను పోగేసుకున్నారు. కానీ, భారత దేశపు వాణిని వినిపించేందుకు శశి విదే శాలలో ఉన్నప్పుడు, అదీ ఆయనకు అప్పగించిన బాధ్యత లను అద్భుతంగా నిర్వహిస్తున్నప్పుడు ఆడిపోసుకోవడమే అర్థం కాకుండా ఉంది. ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం, విలన్‌గా చిత్రించడమే విస్మయం కలిగిస్తోంది. ఇది ఆత్మవినాశనాన్ని కొనితెచ్చుకోవడమే అవు తుంది. అటు కాంగ్రెస్ పార్టీ గానీ, ఇటు ఆ పార్టీలోని కొందరు వ్యక్తులు గానీ దానివల్ల సంతరించుకున్న ప్రతిష్ఠ ఏమీ లేదు. పైగా, వారు సంకుచిత మనస్కులుగా, స్ఫూర్తిని ప్రదర్శించలేని వారుగా, ఇంకా చెప్పాలంటే బుద్ధిలేని వారుగా ముద్రను మూట గట్టుకుంటున్నారు. పాకిస్తానీ తండాలు ఉగ్రదాడులకు పాల్పడినపుడు, ప్రతిగా గతంలోనూ భారత్ నియంత్రణ రేఖను దాటిన దృష్టాంతాలు ఉన్నప్పటికీ, అనుకోకుండానో లేదా ఉద్దేశపూర్వకంగానో శశి వాటిని మరచిపోవడమో లేదా పట్టించుకోకపోవడమో చేసి నప్పటికీ, ఇది ఆయనపై విమర్శలకు దిగడానికి మాత్రం సరైన సమయం కాదు. ఇది శశిని సరిదిద్దవలసిన సందర్భం అంతకంటే కాదు. శశి విదేశాల్లో ఉన్నప్పుడు, ప్రజా బాహుళ్యం మధ్య లేనపుడు చేయవలసిన పని కాదు. శశి మన దేశ ప్రజలకు ప్రశంసలను, అభినందనలను గడించి పెడుతున్న సమయంలో చేయాల్సిన పని అస్సలు కాదు. ఆ మూడింటి దృష్ట్యానూ ఈ సమయంలో ఆయనపై విమర్శ లకు దిగడం ఆత్మహత్యా సదృశమే అవుతుంది. మరొకటి, శశిపై ఇపుడు చేస్తున్న విమర్శలకు దేశ పౌరుల నుంచి వత్తాసు లభించడం లేదు. ఇపుడే కాదు, శశిపై అటువంటి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించకపోవచ్చు. ప్రజలు కూడా స్వాగతిస్తారని, సానుకూలంగా స్పందిస్తారని గట్టిగా భావించినపుడు మాత్రమే చతురత కలిగిన ఏ రాజకీయ పార్టీ అయినా బహిరంగంగా ఆయనను మందలించే ప్రయత్నం చేయవచ్చు. ఈసారి పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ తనను తాను నవ్వులపాలు చేసుకుంది. శశిని కొనియాడేవారు ఇదివరకే కోకొల్లలుగా ఉన్నారు. ఇపుడు అభినందన చందనాలు ఆయనకు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడ్డాయి. ప్రత్యర్థులను సున్నాలో ఉంచి, ఆయన మ్యాచ్ గెలిచే స్థితిలో ఉన్నారు. నిజానికి, కాంగ్రెస్ ప్రతిష్ఠను మూటగట్టుకునేందుకు ఇది బంగారం లాంటి అవకాశాన్ని తెచ్చిపెట్టింది. దాన్ని చేజేతులా పాడుచేసుకుని కాంగ్రెస్ దోషిలా నిలిచే సంకటంలో పడింది. కాంగ్రెస్ శాంతంగా, ఆవేశరహితంగా ఆలోచించుకుని ఉంటే, వ్యూహాత్మకంగా, యుక్తితో వ్యవహ రిస్తూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయగలిగిన, దెప్పిపొడుస్తూ కవ్వించగలిగిన స్థితిలో ఉండగలిగేది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. కొంత మాయోపాయాన్ని ప్రదర్శిస్తూ అయినా గడసరిగా వ్యవహరించి ఉండవలసింది. శశిని ఆడిపోసుకునే బదులు బాహాటంగా ప్రశంసించి ఉండవలసింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పత్రికా సమా వేశాన్ని ఏర్పాటు చేసి, ‘చూడండి! శశి థరూర్ వంటి కాంగ్రెస్ ఎంపీలు దేశ సేవకు నిస్వార్థంగా ఎలా తరలివెళుతున్నారో! కాంగ్రెస్ నాయకుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఇది నిరూపిస్తోంది. వారు లేనిదే, భారతదేశ అవసరాలు తీరేవా?’ అని చెప్పుకొని ఉండాల్సింది. ఆ విధంగా, కాంగ్రెస్ తన భుజాన్ని తానే తట్టుకుని ఉండాల్సింది. దాన్ని ఎవరూ తప్పు పట్టేవారు కాదు. పైగా, చాలా మంది ప్రజలు సంతోషంగా దానికి సమ్మతి తెలిపేవారు. కాంగ్రెస్ మరో అడుగు ముందుకు వేసి, ‘మాతో సరిపోల్చదగినవారు బీజేపీలో ఎవరూ లేరు. భారత్ గొంతు కను వినిపించాలంటే, కాంగ్రెస్ గొంతుకల వల్లనే అవుతుంది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన దేశమైన అమె రికాకి, ఈ కారణంగానే ఒక కాంగ్రెస్ నాయకుని నేతృత్వంలో ప్రతినిధి బృందం వెళ్ళింది’ అని కూడా ఘనంగా చాటుకుని ఉండవచ్చు. నా ఈ మాటల్లో కొంత అతిశయోక్తి ఉండవచ్చు. కానీ, నేను చెప్పదలచుకున్న సంగతికి అదొక్కటే మార్గం. ఇది ఖ్యాతిని దక్కించుకోవలసిన సమయం. అదీ స్నేహపూర్వక మైన మార్గాల్లో ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ పైచేయి సాధించి ఉండవచ్చు. కానీ, శశి మీద వ్యతిరేకతతో అందివచ్చిన అవకాశాన్ని అది కాలరాసుకుంది. దీన్ని అంతకంటే ఎలా భావించగలం? అదే కాంగ్రెస్ ప్రారబ్ధం!కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
దేశానికి వయసు మీద పడనుంది!
యువజనుల సంఖ్య మనకు కలిసి వస్తున్న లాభం. దీన్నే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటున్నారు. అయితే ఇది ఎంతో కాలం నిలవదు. పనిచేసే వయసులో ఉన్న యువ జనం ఎల్లకాలం ఉండరు. చూస్తుండగానే దేశం వృద్ధులతో నిండిపోతుంది. వయసు మళ్లిన జనాభా ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారుతుంది. మన జనాభా 134 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. జనబలం, ధనబలం రెంటిలో ఇండియా ఇప్పుడున్నంత గొప్పగా చరిత్రలో ఏనాడూ లేదు. దీనికి మూలాలు దాదాపు వందేళ్ల నాడు పడ్డాయి. భారత జనాభా చరిత్రలో 1921 అతి ముఖ్యమైన సంవత్సరం. దీన్ని ‘ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్’గా వ్యవహరిస్తారు. ఆ ఏడాది మరణాల సంఖ్య గణనీయంగా పడి పోయింది. దీంతో అప్పటి వరకూ నిలకడగా ఉన్న జనాభా వృద్ధి రేటు ఒక్కసారిగా వేగం పుంజుకుంది. 1901–1921 మధ్యకాలంలో పెరిగిన జనసంఖ్య అతిస్వల్పం. 20 కోట్ల నుంచి కేవలం 22 కోట్లకు పెరిగింది. ఇక అక్కడి నుంచి విస్ఫోటనాన్ని తలపిస్తూ దేశ జనాభా నేడున్న అసాధారణ స్థాయిని అందుకుంది. ఒక శతాబ్ద కాలంలోనే రమారమి ఆరు రెట్లు హెచ్చింది. ఈ శతాబ్దం మధ్యనాటికి ఇప్పటి జనాభాకు మరో 20–30 కోట్ల మంది కొత్తగా వచ్చి చేరతారు. వృద్ధాప్యం – నగరీకరణవయస్సు రీత్యా చూస్తే, మొత్తం జనాభాలో 65 ఏళ్లు దాటిన వారు 2005లో 5 శాతం ఉండేవారు. 2050 నాటికి జనాభాలో వీరి వాటా 14.5 శాతం అవుతుంది. ఇది ఆందోళన కలిగించే పరిణామం. పెరిగే ఈ వయోవృద్ధుల కోసం కొత్త పన్ను విధానాలు, సామాజిక భద్రతా పథకాలు, ఆరోగ్య సంరక్షణ ప్రణాళికలు ఇప్పటి నుంచీ రూపొందించుకోవాలి. వయోవృద్ధులు అధికంగా ఉన్న ధనిక దేశాలను చూసి మనం ముందు నుంచీ జాగ్రత్త పడాలి. వృద్ధాప్యం ఆర్థిక వ్యవస్థకు పెను భారం. జన సాంద్రత చిక్కబడటం మరో ఆందోళనకర అంశం. 2005లో చదరపు కిలోమీటరుకు 345 మంది ఉండగా, 2050 నాటికి ఈ సంఖ్య 504కి పెరుగుతుంది. ఇదే కాలంలో, పట్టణీకరణ అధికమై పలు కొత్త సమస్యలు సృష్టిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు 2000లో 30 కోట్ల మంది (జనాభాలో 28.7 శాతం) కాగా, వీరు 2030 నాటికి 60 కోట్లు (40.7 శాతం) అవుతారు. పట్టణ ప్రాంతాలు, వాటితో పాటు పట్టణ జనాభా ఈ స్థాయిలో పెరుగుతూ పోతే, గృహనిర్మాణం, మంచినీరు, డ్రెయినేజి, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలు, ఆహార పంపిణీ వ్యవస్థలు భారీస్థాయిలో ఉండాలి. పట్టణాభివృద్ధికి ఎంత పెట్టుబడీ చాలదు.2060–70కి జనాభా స్థిరీకరణ?ఇండియాకు ఇప్పుడు ఒనగూరుతున్న డెమోగ్రాఫిక్ డివిడెండ్ 2050 వరకే కొనసాగుతుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం, 2005లో 15–64 ఏళ్ల బ్రాకెట్లో ఉన్న ప్రజల సంఖ్య జనాభాలో 62 శాతం కాగా, 2050 నాటికల్లా ఇది 67.3 శాతానికి పెరుగుతుంది. వీరంతా పనిచేయగల వారు. రానున్న కాలంలో వీరికి కోట్ల సంఖ్యలో కొత్త ఉద్యోగాల కల్పన జరగాలి. అయితే, 2045–50 మధ్య కాలంలో 15–64 ఏజ్ గ్రూప్ శాతంలో ఎలాంటి వృద్ధీ ఉండదు. ఇది జనాభా స్థిరీకరణ దశకు సంకేతం. ఆ తర్వాత నుంచీ శ్రామికుల శాతం శర వేగంతో క్షీణిస్తుంది. వయసు మళ్లిన వారి శాతం పెరుగుతూపోతుంది. చైనా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇదే!జనాభా స్థిరీకరణ అంటే? కొంతకాలం పాటు జనన మరణాల రేట్లు స్థిరంగా ఉండిపోతాయి. అంటే సగటున ఒక్కో మహిళ కనే పిల్లల సంఖ్య 2.1 మందికి పరిమితమవుతుంది. దీన్ని ‘రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ’ అంటారు. ఈ స్థాయికి ఫెర్టిలిటీ రేటు చేరినప్పుడు జనాభా స్థిరీకరణ దశలో ఉంటుంది. అంతకంటే తగ్గితే జనాభా క్షీణదశలోకి జారిపోతుంది. ‘నేషనల్ పాపులేషన్ పాలసీ–2000’ ప్రకారం, 2045 నాటికి ఇండియా స్థిర జనాభా స్థాయిని సాధించాలి. ఒక తరాన్ని మరో తరం భర్తీ చేయడానికి అవసరమైన 2.1 టోటల్ ఫెర్టిలిటీ రేటును 2010 నాటికి చేరుకుంటామన్న అంచనా ఆధారంగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. దీన్ని సాధించలేకపోయినందున, స్థిరీకరణ లక్ష్యాన్ని కూడా వాయిదా వేశారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనాభా స్థిరీకరణకు 2060ని తాజా లక్ష్యంగా పెట్టుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. పాపులేషన్ రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ (2.1) సాధించిన చాలా కాలం తర్వాతే, జనాభా స్థిరీకరణ దశ ఆరంభమవుతుందన్న అంశం మనం ఇక్కడ గుర్తించాలి. జనాభాపై ప్రణాళికా సంఘం 1996లో ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ దీనిపై అధ్యయనం చేసి, ఇండియా ఈ రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేటును 2026 నాటికి చేరుకుంటుందని తేల్చింది. అదే రాష్ట్రాల వారీగా చూస్తే, హిందీ బెల్టులోని బిహార్ 2039కి, రాజస్థాన్ 2048కి, ఇక మధ్యప్రదేశ్ 2060 తర్వాత, ఉత్తర ప్రదేశ్ 2100 తర్వాతగానీ ఈ లెవెల్ సాధించగలవని అంచనా వేసింది. కాబట్టి జాతీయ జనాభా స్థిరీకరణ 2060 లేదా 2070 లోపు సాధ్యపడే అవకాశాల్లేవు. సువర్ణావకాశం కోల్పోతామా?ఈ ప్రాంతీయ అసమానతల ప్రకారం, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో జనాభా ఆందోళనకరంగా విస్ఫోటనం చెందుతుంది. 1991–2050 మధ్యకాలంలో ఇండియా జనాభా 77.3 కోట్లు పెరిగితే, ఉత్తరప్రదేశ్ ఒక్కదాని వాటానే ఈ అదనపు జనాభాలో 19.8 కోట్లు ఉంటుంది. జాతీయ వ్యాప్త జనాభా వృద్ధిలో ఇది నాలుగోవంతు! బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వలసలు పెరిగి మెట్రోపాలిటన్ పారిశ్రామిక నగరాల మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. రానున్న సంవత్సరాల్లో తలసరి జీడీపీ ఎలా ఉండబోతోంది? ఇండియా ఎకనామిక్ సూపర్ పవర్ అవుతుందా అనే అంశం మీద 2005లో వరల్డ్ బ్యాంక్ ఆర్థికవేత్త స్టీఫెన్ హౌస్ వెలువరించిన అధ్యయన పత్రం ప్రకారం, 2050 నాటికి బిహార్, ఒడిశా, యూపీ, ఎంపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తలసరి ఆదాయాలు 1,000 డాలర్ల కంటే తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న తలసరి జీడీపీ కంటే ఇది తక్కువ. 2050లో ఉండబోయే దానికంటే కూడా కచ్చితంగా తక్కువే ఉంటుంది. ఈ రాష్ట్రాల్లోనే జనాభా వెల్లువెత్తుతోంది. రాష్ట్రాల మధ్య నెలకొనే తలసరి ఆదాయ వ్యత్యాసాలు పునఃపంపిణీ విధానాలను (పన్నుల్లో వాటా, సంక్షేమ పథకాల వంటి వాటి అమలును) తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం జరుగుతున్న దాని ప్రకారం చూస్తే, ప్రజలు పొట్ట చేతపట్టుకుని సాపేక్షంగా బీద రాష్ట్రాల నుంచి సాపేక్షంగా ధనిక రాష్ట్రాలకు వలసలు పోతారు. ఇది సామాజిక అశాంతికి దారితీస్తుంది. 2020లో ఇండియాలో 15–24 ఏళ్ళ మధ్యవయసు యువకులు 24.5 కోట్ల మంది ఉన్నారు. 2020లో నమోదైన పొదుపులు, పతాక స్థాయి ఉత్పాదక సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నట్ల యితే, 2050 నాటికి అభివృద్ధి చెందిన సుసంపన్న ఆర్థిక వ్యవస్థగా దేశం ఆవిర్భవించే అవకాశం ఉండి ఉండేది. యువజనుల శాతం పరంగా ఇలాంటి సువర్ణావకాశం మళ్లీ ఎప్పటికీ రాదు. వచ్చే అర్ధ శతాబ్దంలోనైనా మనం బీదరికం ఉచ్చు నుంచి బయటపడాలంటే, మానవ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి మీద భారీ పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఇదే! అయితే, దురదృష్టవశాత్తూ అలాంటి ప్రయత్నాలేం జరుగుతున్న దాఖలాల్లేవు.మోహన్ గురుస్వామి వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com -
వ్లాదిమిర్ పుతిన్ (రష్యా అధ్యక్షుడు) రాయని డైరీ
‘‘... ఆమె ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో నాకు తెలియదు/ నేను చేసిన తప్పేమిటో ఆమె చెప్పదు/ ఇప్పుడు నేను నిన్నటి కోసం ఆరాట పడుతున్నాను...’’బీటిల్స్‌లో నాకిష్టమైన ‘ఎస్టర్డే’ సాంగ్!‘‘... ప్రేమ చాలా సులభంగా తనలో దాచేసుకుంటుంది/ ఇప్పుడు నా ప్రేమను దాచటానికి ఒక స్థలం కావాలి/ నాకు నిన్నటి రోజే బాగుంది...’’ఓహ్... పాల్ మెక్కార్ట్నీ!! ప్రాణం తీస్తున్నాడు. అతడింకా ఎందుకు బతికే ఉన్నట్లు? ఇంత గొప్ప పాటను రాశాక కూడా అతడికి ఇక్కడేం పని, ఈ భూమ్మీద?!‘‘మిస్టర్ ప్రెసిడెంట్... మిస్టర్ ప్రెసిడెంట్... మీ కాల్‌తో కనెక్ట్ అవటం కోసం మిస్టర్ ట్రంప్ వేచి ఉన్నారు...’’ – నికోలాయ్ పాత్రుషేవ్! నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్.‘‘మే బీ, లిటిల్ లేటర్... కనీసం ఈ పాట అయ్యేంతవరకు...’’ అన్నట్లు సైగ చేశాను.‘‘... అకస్మాత్తుగా నేను గతంలో ఉన్న మనిషిలో సగం అయ్యాను/ నా పైన ఒక నీడ వేలాడుతోంది/ నాకు నిన్నటి రోజే బాగుంది.’’ఏం రాశావురా నాయనా మెక్కార్ట్నీ?!మళ్లీ ట్రంప్ ఫోన్ ! కొద్దిసేపైనా ఆగలేరా ఈయన?! ‘ఎస్టర్డే’ని పాజ్‌లో పెట్టి ఫోన్ అందుకున్నాను.‘‘హో హో... ట్రయింగ్ సిన్ ్స ఎస్టర్ డే మిస్టర్ పుతిన్ ’’ అన్నారు ట్రంప్.పెద్దగా నవ్వాను. ‘‘నేను కూడా నిన్నట్నుంచీ ‘ఎస్టర్డే’ లోనే ఉన్నాను మిస్టర్ ట్రంప్’’ అన్నాను.‘‘గాట్ ఇట్. బీటిల్సే కదా? పాల్ మెక్కార్ట్నీ సాంగ్! అంత బుద్ధిహీనునుడిని నేను ఇంత వరకూ చూళ్లేదు. ‘విడిపోయిన తర్వాత ఏమిటి? ఎలా?’ అని పెళ్లికి ముందే కాబోయే భార్యతో అగ్రిమెంట్ రాసుకోవాలన్న కనీస జ్ఞానం కూడా లేదు అతడికి’’ అన్నారు ట్రంప్.‘‘ప్రేమ రాహిత్యపు పరితపనను సృష్టించ టానికి కావలసింది బుద్ధిహీనతే అయితే అలాంటి బుద్ధిహీనతకు నా మనసును పదే పదే పారేసుకుంటాను మిస్టర్ ట్రంప్’’ అన్నాను నవ్వుతూ.‘‘బీటిల్స్ నాకు బోరింగ్. మళ్లీ ‘రోలింగ్ స్టోన్ ్స’ బ్యాండ్ నచ్చుతుంది. వాళ్లదొక సాంగ్ ఉంది. ఏమిటదీ... ఆ – యూ కాంట్ ఆల్వేస్... ‘నువ్వు కోరుకుంటున్న దానిని నువ్వు ఎల్లవేళలా పొందలేవు’...’’ అన్నారు ట్రంప్.‘‘లోతుల నుంచి ‘ఎస్టర్డే’, ‘యూ కాంట్ ఆల్వేస్...’ రెండూ ఒకటే మిస్టర్ ట్రంప్! పోగొట్టుకున్నది తిరిగి పొందలేం, కోరుకున్న ప్రతిసారీ దక్కించుకోలేం...’’ అన్నాన్నేను.హఠాత్తుగా క్రెమ్లిన్ ప్యాలెస్ కదిలిపోయేంత టెరిఫిక్‌గా నవ్వారు ట్రంప్!‘‘ఏమైంది మిస్టర్ ట్రంప్?’’ అని అడిగాను.‘‘ఏం లేదు మిస్టర్ పుతిన్! మీరు ఉక్రెయిన్ను పక్కన పెట్టేసి... బీటిల్స్అంటున్నారు, నేను ఎలాన్ మస్క్‌ను తప్పించు కుని వచ్చి... రోలింగ్ స్టోన్ ్స అంటున్నాను’’ అన్నారు ట్రంప్, నవ్వు ఆపకుండానే!‘‘అవును కదా!!’’ అని నేనూ నవ్వాను.‘‘సరే, ఇది చెప్పండి. ‘నిన్నటి కోసం’మీరెందుకు అంతగా ఆరాటపడుతున్నారు? ఎవరా స్వీట్హార్ట్?’’ అని అడిగారు ట్రంప్!ట్రంప్ అలా అడగటం నాకు నచ్చింది. నిజానికి కూడా, ఎవరైనా అలా తమ పరిధిని దాటి లోపలికి చొరబడినప్పుడే మన మనసుకు దగ్గరగా అనిపిస్తారు.‘‘ఎవరా స్వీట్హార్ట్ మిస్టర్ పుతిన్ ?’’ – మళ్లీ అడిగారు ట్రంప్.‘‘ఎవరూ లేరు. ఆ పాట ఇష్టం. అంతే...’’ అన్నాను నవ్వుతూ.ట్రంప్ ఫోన్ పెట్టేశాక, ‘ఎస్టర్డే’ పాజ్ తీసి, తిరిగి ప్లే చేశాను.మరియా ఇవనోవ్నా నా స్వీట్హార్ట్! నా ఆకలి తీర్చే కొన్ని రొట్టె ముక్కల కోసం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చెమటోడ్చి వీధులు ఊడ్చిన ఇవనోవ్నా! నేను చేసిన తప్పేమిటో చెప్పకుండా చిన్న ముద్దును నాకు శిక్షగా విధించి నన్ను చేతుల్లోకి ఎత్తుకున్న మా అమ్మ ఇవనోవ్నా! -
‘అంద’లం ఎక్కాలన్నా... అదే భాష!
మునుపెన్నడూ జరగని విధంగా ఒక చిన్న, కొత్త రాష్ట్రమైన తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. నాకు గుర్తున్నంతవరకు ఇంతకు ముందు బెంగళూరులో ఇటువంటి పోటీ ప్రయత్నాలు ప్రారంభించగానే రైట్ వింగ్ వ్యతిరేకులు పెద్ద రాద్ధాంతం చేశారు. చివరికి అవి ఆగిపోయాయి. అది 1996 నాటి చరిత్ర. తెలంగాణలో కూడా కమ్యూనిస్టుల మహిళా సంఘాలు వ్యతిరేకత చూపాయి. కానీ కొద్దిపాటి వ్యతిరేకతతో ఆగి పోయాయి. బీజేపీ/ఆరెస్సెస్ మహిళా సంఘాలు గానీ, ముస్లిం స్త్రీలు గానీ బెంగళూరులో చేసిన వ్యతిరేక హడావిడి చెయ్యలేదు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలు అవసరమా, లేదా? అవి స్త్రీ శరీర ఎక్స్పోజర్ తంతులా, లేక వారి శరీర అందాన్నీ, శక్తి యుక్తుల్నీ, తెలివితేటలనూ పెంచేవా అనే అంశంపై నేను ఇక్కడ చర్చించదలచుకోలేదు.ఒక్కటి మాత్రం నిజం. ఈ రెండు స్త్రీల పోటీలలో చాలా దేశాలు పాల్గొంటాయి. కొన్ని పాల్గొనవు. మొత్తం ముస్లిం దేశాలు పాల్గొనవు. తెలంగాణలో ఈ పోటీ జరిగే వరకు నేను ఈ పోటీలను అంతగా పరిశీలించలేదు. ఈ పోటీ ఇంత చిన్న, కొత్త రాష్ట్రంలో జరిగినందువల్ల, ఈ వివిధ దేశాల యువతులు జిల్లా పర్యాటక ప్రాంతాలు, హైదరాబాదులోని వివిధ ప్రాంతాలు తిరిగి చూడటం, రకరకాల తిండి తినడం, కల్లు తాగడం (నీరా), వీళ్ళల్లో మాంసాహార, శాకాహార తిండి విభజన లేకపోవడం, తెలంగాణ మంత్రులు, అధికారులు పక్కా తెలుగు మీడియాను (ముఖ్యంగా ఇంగ్లిష్ వ్యతిరేక ‘ఈనాడు’ గ్రూపు మీడియా ప్రతినిధులను) కూర్చుండబెట్టి ఉపన్యాసాలివ్వడం నాకు నచ్చింది. నాగార్జున సాగర్‌లో నల్లగొండ కలెక్టర్ ఉపన్యాసం నేను విన్నాను.వందకు పైగా దేశాల నుండి యవ్వనంలో ఉన్న అమ్మా యిలూ, వారికి మద్దతుగా వచ్చిన అధికారులూ, జడ్జీలూ, కార్య క్రమ నిర్వాహకులూ ఇంకా ఇంగ్లిష్ వచ్చినవారై ఉండాలనేది ఇందులో స్పష్టంగా కనిపించింది. ఈ పోటీలో అతి చిన్న చిన్న వెనుకబడిన దేశాలకు చెందిన ఆఫ్రికా, ఆసియా, యూరప్ వంటి ఖండాలకు చెందిన అమ్మాయిలు పాల్గొన్నారు. వారందరూ పరస్పరం ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటే తప్ప తమలో తమకు కమ్యూనికేషన్ ఉండదు. ఆయా దేశాల్లో ఈ అమ్మాయిలంతా ఏ ఆర్థిక వర్గానికి చెందినవారై ఉంటారు? ఆయా దేశాల్లోని శ్రమ జీవుల్లోని ఆడపిల్లలంతా వీరి లాగా శరీర పోషణలో ఉంటూ ఇంగ్లిష్‌లో చదువుకోగలిగినవారై ఉంటారా? మన దేశంలో ఇప్పటి వరకు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతలుగా గెలిచి వచ్చిన స్త్రీలను చూస్తే వీరంతా బాగా ధనిక కుటుంబాల్లో పుట్టి మంచి డబ్బుల సంచుల ప్రైవేట్ సూళ్ళలో చదివిన వారే. ఐశ్వర్యారాయ్ కానీ, ప్రియాంకా చోప్రా కానీ, సుస్మితా సేన్ కానీ, ప్రస్తుత పోటీల్లో పాల్గొంటున్న నందినీ గుప్తా కానీ అగ్ర కులాల వాళ్ళు, ధనవంతులు, మంచి ఇంగ్లిష్ మీడియం సూళ్ళలో చదువు కున్నవాళ్ళు. స్త్రీదైనా, పురుషునిదైనా శరీర అందం వర్గం, కులాలపై ఆధారపడి ఉంటుందా? భారతదేశంలోని శూద్ర– బీసీ, దళిత, ఆదివాసీ స్త్రీలు ఈ అందాల పోటీల్లో పాల్గొనగలిగే అందం వారికి లేదా? ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితిలో అందాల పోటీలు ఆహారం, శరీర ఆకృతి, వేసుకునే బట్టల వైనం, ఇంగ్లిష్‌లో ప్రశ్న లకు సమాధానం చెప్పే జ్ఞానంతో ముడివడి ఉన్నాయి. రంగు సమస్య ఒకప్పుడు తీవ్రంగా ఉండేది. ప్రస్తుత ప్రపంచ సుందరి పోటీలో ‘మిస్ వరల్డ్’గా నిలిచిన ఓపల్ సుచాతా చిన్న దేశమైన థాయ్‌లాండ్‌కు చెందిన అమ్మాయి. ఆమె తరువాతి స్థానంలో నిలి చిన హసెత్ డెరెజె అడ్మస్సు ఇథియోపియాకూ, మూడవ స్థానంలో నిలిచిన మాజా క్లాజ్డా పోలాండ్‌కు, నాల్గవ (థర్డ్ రన్నర్ అప్) స్థానంలో నిలిచిన అవురెలీ జోచిమ్ మార్టినిక్కూ చెందిన యువ తులు. ఇథియోపియా నల్లజాతి అమ్మాయి రెండో స్థానంలో ఉందంటే రంగు, అందం నిర్వచనాలు మారుతున్నాయని అర్థం.చివరి దశలో జరిగిన ఇంటెలిజెన్స్ టెస్ట్ ప్రశ్నలను, వాటికి వారు ఇచ్చిన సమాధానాలను నేను జాగ్రత్తగా విన్నాను. ఈ 108 దేశాల అమ్మాయిలు తమలో తాము ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవడమే కాదు, వారి మే«ధా శక్తిని పరీక్షించే ప్రశ్నలన్నీ ఇంగ్లిష్‌లోనే అడుగు తారు. వారు ఇంగ్లిష్‌లోనే సమాధానం చెప్పాలి.థాయ్‌లాండ్, ఇథియోపియా, పోలాండ్ వంటి అమ్మాయిలు తమ తమ భిన్నమైన యాసలలో సమాధానాలు చెప్పారు. భాష స్టైల్కూ, యాక్సెంట్కూ కాక... ఆ సమాధానం కంటెంట్‌కు మార్కులిచ్చినట్లు భావిస్తున్నాను. నలుగురు ఫైనలిస్టుల సమా ధానాలూ నన్ను ఆశ్చర్యపర్చాయి. ఒక అమ్మాయిని తెలంగాణలో తన అనుభవం గురించి అడిగారు. ఒకామెను ప్రపంచంలోని బీదలకు, దిక్కులేని వారికి నీవేమి చేస్తావని అడిగారు. ఇథియో పియా అమ్మాయికి ప్రశ్న ముందు అర్థం కాలేదు. మళ్లీ అడగమని కోరి ఆమె చెప్పిన సమాధానం బ్రిలియంట్. ఆమెది ఆఫ్రికన్ యాస. ఆమె నలుపు, అందం, ఆఫ్రికన్ జాతివి. కానీ ఆమె ఇంగ్లిష్ ప్రశ్నకిచ్చిన రిప్లై యూనివర్సల్. ఆమెలో గొప్ప మే«ధా శక్తి ఉంది. ఆ శక్తి ఆమెను ప్రపంచ రెండో అందగత్తెను చేసింది.భారతదేశంలోని ఆదివాసులు, దళితులు, శూద్ర బీసీలు ఆమెలాగే ఉంటారు. కానీ వీరి ఆడపిల్లలకు ఆమెలాంటి ఇంగ్లిష్ విద్య లేదు. ప్రపంచ స్త్రీలతో పోటీపడే అవకాశం లేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యను పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చాక ఆదివాసీ, దళిత, బీసీ అమ్మాయిలు సైతం మిస్ వరల్డ్ పోటీ గురించి ఆలోచించే అవకాశం వచ్చింది. తెలంగాణలో గురుకులాల్లో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదివే అమ్మాయిలు అటువంటి కల కనొచ్చు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల్లాగా ఐక్యూస్, మానవత్వ విలువలతో కూడిన సమాధానాలు రాబట్టడానికి 108 దేశాల నుండి వచ్చిన అమ్మా యిలను పరీక్షకు పెట్టే మరో వేదిక లేదు. ఇంటర్నేషనల్ గేమ్స్ ఎన్ని ఉన్నా అవి ఐక్యూస్నీ, అందులో పాల్గొనే ఆటగాళ్లందరి జ్ఞానాన్ని పరీక్షించే ఆట లేదు. మిస్ వరల్డ్ లాంటి పోటీ ఇన్ని దేశాల్లో ఇంగ్లిష్ భాష మనుగడలో లేకపోతే సాధ్యం కాదు.వలసవాదానంతర ప్రపంచంలో వచ్చిన ఒక గొప్ప అను కూల మార్పు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇంగ్లిష్ భాష మాట్లాడే ఒక వర్గం ఎదగడం. ఈ భాష ఆడపిల్లలకు అందుబాటులోకి రావడం వల్ల ఈ పోటీలు సాధ్యమయ్యాయి.ఈ పోటీ వ్యతిరేకత ఈ దేశంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చి, క్రమంగా మారాల్సిన స్థితిలోకి నెట్టబడ్డాక హిందూత్వ శక్తులు ఈ పోటీని వ్యతిరేకించడం తగ్గించుకున్నాయి. కమ్యూనిస్టు శక్తులు వలసవాద వ్యతిరేకతలో భాగంగా మిస్‌వరల్డ్ పోటీలను వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణలో కూడా వ్యతిరేకించాయి.అదే ధోరణి ప్రభుత్వ సూళ్ళలో ఇంగ్లిష్ మీడియంపై కూడా వ్యక్తపరుస్తున్నాయి. కానీ ఈ దేశంలోనే అగ్ర కుల ధనికులు తమ ఆడపిల్లల్ని పెద్ద ఖర్చుతో ఇంగ్లిష్ మీడియంలో చదివించి వాళ్ళు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అవుతూ ప్రపంచ దేశాలలో పర్య టిస్తూ, డబ్బు సంపాదిస్తుంటే; సినిమా యాక్టర్లు అయ్యి కోట్లు గడిస్తుంటే ఏమీ చెయ్యలేని స్థితిలో చూస్తూ ఉంటున్నారు. నందినీ గుప్తా లాంటి ఒక ధనవంతమైన అమ్మాయి కాక, ఒక ఆదివాసీ లేదా దళిత లేదా బీసీ అమ్మాయి ఆ స్థానంలో ఉండాలంటే మంచి ఇంగ్లిష్ విద్య కావాల్సిందే కదా! మారుతున్న ప్రపంచంతోపాటు భారతదేశపు బీద ప్రజల జీవితం, ఆశలు మారాలని కోరుకోవాలి గానీ ఇక్కడే ఆగాలని కోరుకోకూడదు.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
కలసి నడిస్తే... కట్టడి చేయొచ్చు!
మానవాళి ఎదుర్కొంటున్న పెను విపత్తు ఉగ్రవాదం. ఇది నాగరిక సమాజపు అత్యు న్నత విలువలకు మాయని మచ్చ. విప్లవం, బలిదానం, హింసను గొప్పగా చేసి చెప్పడం లాంటి తప్పుడు భావనలు ఉగ్రవాదం పెచ్చ రిల్లడానికి ప్రాతిపదికలవుతున్నాయి. ‘ఒక రికి స్వాతంత్య్ర యోధుడైనవాడు మరొకరికి ఉగ్రవాది’ అన్న వాదన అతి ప్రమాదకర మైన అపోహ. భయమూ, రక్తపాతాలపై నిజమైన స్వతంత్రాన్ని ఎన్నటికీ నిర్మించలేం.ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను పెంచుతున్నది భయమే. కానీ, ఆ భయాన్ని వ్యాపింపజేయడంలోనూ ఉగ్రవాదులు విఫలురయ్యారు. 26/11 దాడి, 2001లో భారత పార్లమెంటుపై దాడి, ఇటీవలి పహల్ గామ్ దాడి... ఘటన ఏదయినా, భారత్ దృఢంగా నిలబడింది. ఉగ్రవాదుల దుష్ట పన్నాగంపాకిస్తాన్ నుంచి ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదా నికి దశాబ్దాలుగా మనం బాధితులం. పర్యాటకులను వారి మతమే మిటో అడిగి మరీ చంపేయడాన్ని బట్టి ఉగ్రవాదుల పన్నాగం స్పష్టమవుతోంది. దేశ ఐక్యతకు ముప్పు కలిగించాలన్న దురుద్దేశంతో, వివిధ విశ్వాసాలకు చెందిన పలు ఆధ్యాత్మిక ప్రదేశాలపై పాక్ దాడికి తెగబడటం కూడా ఇలాంటి చర్యే. ఇలాంటి దుర్మార్గపు చర్యలను ఏ మతమూ ఆమోదించదు. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా మతాన్ని దుర్వినియోగం చేస్తూ, తమ ఆటవిక చర్యలకు సమర్థింపుగా దాన్ని వాడుకుంటున్నారు. ఈ మత దుర్వినియోగం ప్రమాదవశాత్తు జరిగినదో, లేదా హఠాత్పరిణా మమో కాదు, ఇది ఉద్దేశపూర్వక పన్నాగం. దురాగతాలకు తప్పుడు సమర్థనలను చెప్పుకునే కుటిల వ్యూహం.ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సహించబోమన్న విధానాన్ని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాద చర్యలూ, చర్చలూ ఒకేసారి సాధ్యం కావు. భవిష్యత్తులో పాకిస్తాన్ తో జరిగే ఏ చర్చలయినా ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పైనే ప్రధానంగా దృష్టి పెడ తాయి. పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదాన్ని తీవ్రమైనదిగా పరిగణిస్తే ఐక్యరాజ్యసమితి గుర్తించిన హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను అప్పగించాలి.పాక్ మూల్యం చెల్లించాలి!మనం చాలాకాలంగా దీర్ఘకాలిక దృక్పథంతో, సమర్థమైన వ్యూహాలను అన్వేషిస్తూనే ఉగ్రవాద చర్యలపై ప్రతిస్పందించాం. మన సాయుధ దళాలకు గతంలో రక్షణాత్మక చర్యలకు మాత్రమే అనుమతి ఉండేది. సర్జికల్ స్ట్రైక్స్ (2016), బాలాకోట్ దాడులు (2019), ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ (2025)లతో పాక్‌లోని ఉగ్ర వాదులు, ఉగ్రవాద సూత్రధారుల పట్ల తన వైఖరిలో భారత్ సమూల మార్పులు చేసింది. నైతిక, రాజకీయ అసమ్మతితోపాటు కేవలం రక్షణాత్మక వైఖరి ఇక సరిపోదని ఇప్పుడు తేటతెల్లమైంది. ఏ ఉగ్ర వాద చర్యనైనా ఇకపై యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. భారత్‌పై ఏ ఉగ్రవాద దాడి జరిగినా... ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికీ ఉగ్రవాదులకూ తేడా లేదనే భావిస్తూ దీటుగా బదులిస్తాం. పాక్ తన గడ్డపై ఉగ్రవాదులను నిలువరించలేకపోతే, ఆ అసమర్థతకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఉగ్రవాదానికి ఆర్థిక చేయూతను నిరోధించడంపై న్యూఢిల్లీలో నిర్వహించిన ‘నో మనీ ఫర్ టెర్రర్’ మూడో మంత్రివర్గ సదస్సులో ప్రధాని మోదీ, ‘‘ఒక్క దాడినీ తేలిగ్గా తీసుకోం, ఒక్క ప్రాణం పోయినా తీవ్రంగా పరిగణిస్తాం. కాబట్టి, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించే వరకు మేము విశ్రమించబోం’’ అని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి మనం కట్టుబడి ఉన్నామని ఆప రేషన్ సిందూర్ ద్వారా భారత ప్రభుత్వం, సాయుధ బలగాలు ప్రపంచానికి చాటాయి. స్పష్టమైన, కచ్చితమైన, తీవ్రతరం కాని ఆపరేషన్ ద్వారా, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ–కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను మనం లక్ష్యంగా చేసుకున్నాం. ఉగ్రవాదులపై సైనిక చర్య ఆవశ్యకమనీ, కానీ అదొక్కటే సరి పోదనీ మనకు తెలుసు. పాక్ ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయో గిస్తుండటంతో... ఆ దేశాన్ని దౌత్యపరంగానూ, ఆర్థికంగానూ ఏకాకిని చేయడంలో భారత్ విజయం సాధించింది. పాక్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతివ్వడాన్ని పూర్తిగా మానేసే వరకూ, ఆ దిశగా విశ్వసనీయతను పొందే వరకూ సింధూ జలాల ఒప్పందాన్ని మనం ‘నిలిపివేశాం’. ఈ నిర్ణయం పాక్‌పై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఆ దేశం తన 1.6 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి 80%, మొత్తం నీటి వినియోగంలో 93% సింధూనది వ్యవస్థపైనే ఆధారపడుతుంది. అలాగే 23.7 కోట్ల మంది దీనిపై ఆధారపడి ఉండగా, పాక్ జీడీపీలో నాలుగో వంతుకు ఇదే దోహదపడుతోంది.ఐదు కీలక చర్యలు!ఉగ్రవాదం కేవలం భారత్ సమస్యే కాదు, ఇది ప్రపంచ సమస్య. అంతర్జాతీయ ఉగ్రవాద సూచీ (జీటీఐ) ప్రకారం– ఉగ్ర వాద సంఘటనలను ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య కొన్నేళ్లుగా పెరిగింది. ఉగ్రవాద వ్యవస్థలను సమర్థంగా నిర్వీర్యం చేయడానికీ, రాబోయే తరాలకు భద్రమైన భవిష్యత్తును అందించడానికీ మనం సమష్టిగా ముందుకు సాగాలి. సూత్రప్రాయమైన, సమగ్రమైన, స్థిరమైన, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ వ్యూహాన్ని మనం అవలంబించాలి. ఈ దిశగా అయిదు కీలక చర్యలు తీసుకోవాలి.మొదటిది: ‘ఉగ్రవాదం’ పదాన్ని నిర్వచించడం. ఉగ్రవాదమంటే ఏమిటన్న దానిపై ఏకాభిప్రాయం లేదు. భారత్ ప్రతిపాదన ఆధారంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన ‘అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమగ్ర ఒడంబడిక’లో ఉగ్రవాద నిర్వచనం విషయంలో అతి సమీపంగా వచ్చాం. అర్థపరమైన అంశాలు ఉగ్రవాదంపై పోరా టాన్ని పరిమితం చేయకూడదు. ఉగ్రవాద చర్యల దర్యాప్తునకు లేదా విచారణకు లేదా విదేశాల నుంచి వారిని అప్పగించేందుకు విస్తృతంగా ఆమోదం పొందిన నిర్వచనం అవసరం.రెండోది: ఉగ్రవాద సంస్థలవే కాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్స హిస్తున్న దేశాల ఆర్థిక వనరులను కూడా స్తంభింపజేయాలి. పాక్‌కు ఇచ్చే నిధులు సైనిక–ఉగ్రవాద చర్యలు రెండింటితో ప్రపంచాన్ని అస్థిరపరచడానికే దారితీస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి, పాకిస్తాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ తిరిగి గ్రే లిస్టులో చేర్చాల్సిన అవసరముంది. మూడోది: పాకిస్తాన్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తులు ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని తెలిసిన విషయమే. ఉగ్రవాదు లకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం, సైనికాధి కారులు యూనిఫామ్‌లో హాజరు కావడం దీన్ని మరింతగా తేట తెల్లం చేస్తోంది. పాకిస్తాన్ లో అణ్వాయుధాలు ప్రభుత్వేతర సంస్థల చేతికి చేరే ప్రమాదం ఎప్పటికైనా ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ తీవ్రమైన ప్రమాదాన్ని గుర్తించి, పాక్ అణ్వాయుధాలను అంతర్జా తీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణలో ఉంచాలి.నాలుగోది: తమ సౌలభ్యం లేదా ప్రయోజనాల ప్రాతిపదికన మాత్రమే ఏ ఉగ్రవాద చర్యలను ఖండించాలో దేశాలు నిర్ణయించుకుంటే– అది సమష్టి బాధ్యతను బలహీనపరుస్తుంది. అటువంటి చర్యలకు అది వ్యూహాత్మకమైన సమర్థింపునూ అందిస్తుంది.అయిదోది: కృత్రిమ మేధ, అటానమస్ సిస్టమ్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ వంటి అధునాతనసాంకేతికతలను కూడా స్వీకరిస్తున్న పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు ప్రపంచమంతటికీ ప్రమాదకరమే. ఈ ముప్పులను అధిగమించడం కోసం అంతర్జాతీయ సహకారం అత్యావశ్యం. 9/11 దాడుల అనంతరం, ‘‘ఉగ్రవాదానికి సంబంధించి ఏ సైద్ధాంతిక, రాజకీయ లేదా మతపరమైన సమర్థననైనా మనందృఢంగా ఖండించాలి’’ అని నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో పేర్కొన్నారు. ఏ రూపంలో ఉన్నా సరే, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న సంకల్పానికి భారత్ స్థిరంగా కట్టుబడి ఉంది. శాంతికాముక దేశాలన్నీ మాతో కలిసి రావాలని కోరుతున్నాం. - వ్యాసకర్త భారత రక్షణ మంత్రి-రాజ్‌నాథ్ సింగ్ -
దాచటం దేశభక్తిని చాటడమా?
దేశభక్తి ఎంత అవసరమో, స్వప్రయోజనాల కోసం ఆ భావనను మితిమీరిన స్థాయికి తీసుకెళ్లి చూడటం అంత అనర్థదాయకం. ‘ఆపరేషన్ సిందూర్’ క్రియాశీలకంగా మే 10న ముగిసిన 20 రోజులకు 31వ తేదీన ఈ విషయం బాగా స్పష్టమైంది. ఆ రోజున భారతదేశపు త్రివిధ దళాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి.డి.ఎస్.) జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్‌లో ‘బ్లూమ్‌బర్గ్’ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, ‘ఆపరేషన్ సిందూర్’లో భారత వైమానిక దళం యుద్ధ విమానాలు కూలిన మాట నిజమేనని ఎట్టకేలకు అంగీకరించారు. దానితో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సుడిగాలిలా చర్చ చెలరేగింది. రఫేల్ కూలిందనగానే కలకలంయుద్ధాలు జరిగినపుడు రెండు వైపులా నష్టాలు ఏదో ఒక మేర వాటిల్లటం సహజం. అమెరికా వంటి అత్యంత శక్తిమంతమైన దేశం సైతం చిన్న చిన్న దేశాల చేతిలో నష్టపోయిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మన యుద్ధ విమానాల నష్టాల వార్తలు ప్రపంచమంతటా వ్యాపించిపోయినా, అలాంటిదేమీ జరగలేదంటూనే వచ్చింది. పైగా, పహల్గామ్ దురంతం, ఆపరేషన్ సిందూర్‌ల దరిమిలా దేశంలో పెల్లుబికిన దేశభక్తి రాజకీయ ప్రయో జనంగా మారుతుండగా, దాన్ని అంతులేని విధంగా పొందేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. యుద్ధ విమానాల నష్టాలను దాచి పెట్టటం వాటిలో ఒకటి. మే 6–7 తేదీల మధ్య ‘ఆపరేషన్’ మొదలై పాకిస్తాన్‌లోని ఉగ్ర వాద స్థావరాలపై భారత వైమానిక దాడులు విజయవంతంగా జరి గాయి. ఆ వెంటనే పాకిస్తాన్ సైన్యం తాము ఆ దాడి సమయంలో భారత్‌కు చెందిన 5 విమానాలను (మర్నాడు ఆరుకు పెంచారు) కూల్చివేశామని ప్రకటించింది. వాటిలో భారత్‌కు ఫ్రాన్స్ సరఫరా చేసిన రఫేల్ విమానాలు మూడు, రష్యా నుంచి వచ్చిన మిగ్‌లు రెండు, మరొకటి ఉన్నాయని పాకిస్తాన్ కనీస వివరాలు కూడా ఇచ్చింది. ఆ వార్త ప్రపంచం అంతటా సంచలనంగా మారింది.అందుకు కారణం మిగ్‌ల కన్నా ఎక్కువగా రఫేల్ విమానాలు కూలి పోవటం! రఫేల్ విమానాలకు ఉన్న పేరు, మనం వాటిని ఖరీదు చేసినప్పుడు వర్ణించిన వాటి శక్తి సామర్థ్యాల గురించి తెలిసిందే.అందువల్ల, మరీ ముఖ్యంగా పాక్ వైమానిక బలం సాధారణమైన దనే అభిప్రాయం మనలో ఉన్నందున, పాకిస్తాన్ ప్రకటన నమ్మ శక్యం కానిదయింది. గమనించవలసిందేమంటే, ఆ ప్రకటనకు భారత సైన్యం అవునని గానీ, కాదని గానీ స్పందించకపోవటం. ‘వ్యూహాత్మక పొరపాటు’గా ఒప్పుకోలుమరొకవైపు ప్రపంచ వార్తా సంస్థలు విచారణలు మొదలుపెట్టి భారత్ విమానాలు కూలిన మాట నిజమని ధ్రువీకరించాయి. మొద టైతే ఒక రఫేల్ విమానం కూలిన మాట వాస్తవమేనని స్వయంగా రఫేల్ ఉత్పత్తిదారైన ఫ్రెంచ్ దస్సాల్ట్ కంపెనీ తెలియజేసింది. ఆ వెంటనే అమెరికన్ ఇంటిలిజెన్స్ ధ్రువీకరించింది. ఇంతకూ రఫేల్‌ను కూల్చగలిగిన పాకిస్తాన్ యుద్ధ విమానాలు, క్షిపణులు ఏవి అనే విచారణను పాశ్చాత్య మీడియా సంస్థలు, నిఘా సంస్థలు జరిపినప్పుడు, అవి చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన జె–35 విమానాలని తేలింది. దానితో అందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే చైనా స్వయంగా గత 40 ఏళ్లుగా ఎవరితోనూ వైమానిక యుద్ధాలు చేయలేదు. వారు ఆ విమానాలను విక్రయించిన మరే దేశమూ యుద్ధం చేయలేదు. కనుక వారి ఆయుధాల శక్తి ప్రపంచానికి డాక్యు మెంట్లలో చదవటం తప్ప ప్రత్యక్షంగా తెలియదు. ఆ శక్తి ఏమిటో ఇపుడు ప్రదర్శితం కావడంతో జె–35ను ఉత్పత్తి చేసిన చెంగ్దూ కంపెనీ స్టాక్స్ 48 గంటలలో 40 శాతం పెరగగా, దస్సాల్ట్ స్టాక్స్ 10 శాతానికి పైగా పడిపోయాయి. జె–35 కొనుగోలుకు వేర్వేరు దేశాల నుంచి ఆసక్తి వ్యక్తం అయింది. అయితే స్వయంగా ఆ కంపెనీ గానీ, చైనా గానీ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ‘ఆపరేషన్ సిందూర్’ మే 10న ఆగే నాటికి ఇదీ పరిస్థితి.వైమానిక నష్టాల గురించి విదేశాలలో ఎన్నెన్ని కథనాలు వెలు వడుతున్నా, ఆ నష్టాలు తాము చేసినట్లు పాకిస్తాన్ పదే పదే ప్రకటి స్తున్నా, భారత ప్రభుత్వం మౌనం వహించింది. మే 11న భారత త్రివిధ దళాధిపతులు మీడియా పమావేశం నిర్వహించారు. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అయిన ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి – ‘‘యుద్ధంలో నష్టాలు సర్వ సాధారణం. యుద్ధం ఇంకా సాగుతున్నందున నేను ఆ వివరాల్లోకి వెళ్లబోను’’ అన్నారు. అదే ప్రశ్నను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీకి వేయగా, ‘‘ఆ విషయాలు నాకు తెలియవు. కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తాము’’ అని జవాబిచ్చారు. ఆ మాటల అంతరార్థం తెలిసిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఆ విషయం మాట్లాడేందుకు నిరాకరిస్తూనే పోయింది. ఆ 11వ తేదీ నుంచి 31 వరకు 20 రోజుల పాటు నష్టాల వివరాలు ప్రపంచానికంతా తెలి శాయి. సింగపూర్‌లో అయినా జనరల్ చౌహాన్, విమానాలు కూలా యన్నారు గాని ఎన్ని కూలాయో పేర్కొనలేదు. ఇక సైన్యాధికారులు 11న గాని, 31న గాని, మనం లక్ష్యాలను ఛేదించామా లేదా, దాడి సమయంలో జరిగిన వ్యూహాత్మక పొరపాటును గ్రహించి దిద్దుబాటు చేసుకున్నామా లేదా అనేవే ప్రధానమని అంటూ దాటవేయ బూనారు. ప్రభుత్వ విధానం అది గనుక వారినేమీ అనలేము. దేశభక్తిని ప్రేరేపించే ప్రయత్నాలు!ఏ యుద్ధంలోనూ ఏ దేశం కూడా సమగ్రమైన వివరాలు వెల్లడించదు. అందులో రక్షణపరమైన అంశాలు కొన్ని ఇమిడి ఉంటాయి గనుక! కానీ, ప్రస్తుత సందర్భంలోæపలు వివరాలు వెల్లడై సంచలనంగా మారుతున్నపుడు, మనం వాస్తవాలను అనవసరంగా దాచి పెడుతున్నామనే అభిప్రాయం ఏర్పడుతూ ప్రతిష్ఠకు భంగం వాటిల్లు తున్నప్పుడు, వాస్తవాలు ఏమిటని ప్రతిపక్షాలు పలుమార్లు ప్రశ్నిస్తున్నప్పుడు, పార్లమెంటరీ కమిటీలో ప్రస్తావించి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నపుడు ఇది సాధారణ పరిస్థితుల వంటిది కాబోదు. కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించి అందుకు తగినట్లు వ్యవహరించటానికి బదులు, వాస్తవాలు ప్రజలకు తెలిస్తే వారిలో దేశభక్తి తగ్గుతుందనీ, అది తగ్గితే రాజకీయ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందనీ అన్నట్లుగా ఉండిపోయింది.ఇది చాలదన్నట్లు సింధూ నదీ జలాల ఒప్పందం, పీఓకేలను మోదీ ప్రభుత్వం బలంగా ముందుకు తెచ్చింది. ఈ లక్ష్యాలు నెరవేరటం ఆచరణలో ఎంత సాధ్యమన్నది అలా ఉంచి, పనిలో పనిగా వాటి పేరిట కూడా దేశభక్తిని స్థాయి పెంచి రాజకీయంగా లబ్ధి పొందాలన్న యోచన మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఉగ్రవాదాన్ని, దాని ప్రోత్సాహకులను దెబ్బతీయాల నటం వరకు నిర్వివాదమైన విషయం. ఇటువంటి సందర్భాలలో ప్రజల దేశభక్తి అత్యంత సహజం. అదేవిధంగా యుద్ధాలు జరిగి నపుడు ఏదో ఒక మేరకు రెండు వైపులా నష్టాలు అనివార్యం. అంతి మంగా చూడ వలసింది పైచేయి సాధించి లక్ష్యాలను ఆ మేరకు నెరవేర్చుకున్నామా లేదా అనేది మాత్రమే. ‘క్రికెట్ మ్యాచ్‌లో పోయిన వికెట్లు ముఖ్యం కాదు, తుది ఫలితం ముఖ్యం’ అంటూ ఆఖరికి జనరల్ చౌహాన్ వెల్లడించిందీ అదే! విషయాన్నంతా రాజ కీయ స్వప్రయోజనాల కోసం వినియోగించదలుచుకొని, రకరకాల పద్ధతులలో వాస్త వాలను దాచేందుకు ప్రభుత్వం మితిమీరి వ్యవహ రించటం సరి కాదు. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే హితవు భారతీయ సంస్కృతిలో ఊరకనే రాలేదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అన్నిటికీ తమిళమే అంటే ఎలా?
‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’ అంటూ కమలహాసన్ చేసిన కామెంట్‌ను కన్నడ హైకోర్ట్ ఖండించింది. ఆ మాటల్ని వెనక్కు తీసుకోమని కూడా సూచించింది. అయితే ఆయన అందుకు నిరాకరించారు. అది ఆయన ఇష్టం. అయితే భాషలపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ‘హిందీ భాష డైపర్లు వేసుకున్న చిన్న పిల్లాడి వంటిది అనీ; హిందీతో పోలిస్తే తమిళ భాషకు చాలా చరిత్ర ఉంద’నీ గతంలో కూడా అన్నారు.రచయిత్రి రంగనాయకమ్మ అన్నట్లు ‘ఫొనెటిక్స్ ప్రకారం గానీ, లింగ్వి స్టిక్స్ ప్రకారం గానీ ఒక భాష గొప్పదనీ, ఇంకో భాష తక్కువదనీ ఏమీ ఉండదు. అన్ని భాషలూ సమానమైనవే. ఒక్కో భాష ఒక్కో ప్రాంత అవసరాన్ని తీరుస్తుంది. దేని ఉప యోగం దానికి ఉంటుంది. బ్రిటీష్ వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు కాబట్టి, ఇంగిలీషు ప్రపంచపు భాష అయ్యింది. అదే జర్మనీ వాళ్ళే పరిపాలించి ఉంటే, అప్పుడు జర్మనీ ప్రపంచపు భాష అయ్యి ఉండేది. అంతకు మించి ఇంగిలీషుకి ఏ ప్రత్యేకతా లేదు’.అలాగే – హిందీ అయినా అంతే! తమిళం అయినా అంతే! తెలుగు అయినా అంతే! కోయవాళ్ళ ‘కోయతూర్’ భాషనే తీసుకుంటే... ఆ భాష మాట్లాడే వాళ్లకు దానికి బదులు తమిళం తెచ్చిపెడితే అప్పుడు కోయ వాళ్ళ ‘భాషావసరం’ తీరుతుందా? తమిళానికి ‘ప్రాచీన చరిత్ర’ ఉంది కాబట్టి, ‘తమిళం చాలా గొప్ప భాష’ అని, ఆ కోయవాళ్ళు తమిళాన్ని మెచ్చుకుంటారా? వాళ్ళు మెచ్చు కోలేదు కాబట్టి, తమిళం తన ‘ప్రత్యేక తను’ కోల్పోతుందా? ఇంత చిన్న విషయాలు కూడా కమల్ హాసన్ లాంటి వాళ్లకు అర్థం కాకో, తెలియకో కాదు. ఇలాంటి వివాదాలు వాళ్లకి అవసరం. ప్రజల్లో ‘ప్రేమ’ ఉన్నట్లుగానే ‘ద్వేషం’ కూడా ఉంటుంది. ద్వేషానికి చాలా కోణాలు ఉంటాయి. ‘భాషా ద్వేషం’ అనేది కూడా ఒక కోణమే. సమాజంలో ‘సంస్కృతి’ అనే దానికి దేని ప్రత్యేకతలు దానికి ఉండవచ్చు. కానీ ‘భాష’కు ఉండవు. ఉండ కూడదు. అయినా ప్రత్యేకతలు అనేవి గుర్తించడానికీ, నేర్చుకోడానికీ మాత్రమే ఉండాలి గానీ, ద్వేషించ డానికి కాదు.తమిళ భాషకూ, తమిళ సాహిత్యానికీ ‘ప్రాచీన చరిత్రే’ ఉండవచ్చు.ఆ మాటను భాషా పరిశోధకులు, చరిత్రకారులు కూడా అన్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అలాగే ఇంకా కొన్ని భాషల్ని కలిపి ‘ద్రావిడ భాషా కుటుంబం’ అని అన్నారు. అంతే తప్ప, ద్రావిడ ప్రాంతా ల్లోని అన్ని భాషలూ ‘తమిళం నుంచి పుట్టాయి’ అని మాత్రం ఎక్కడా ఎవ్వరూ అనలేదు. మిడిమిడి జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడే వారి తమిళ దురభిమానాన్ని కాసేపు పక్కనబెడదాం. 1816లో ‘ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్’ మొదటగా కొన్ని దక్షిణభారత (ద్రవిడ) భాషల మధ్య సంబంధం ఉందని కనుగొన్నారు. ఈయన కూడా ‘తమిళం అన్నిటికీ తల్లి భాష’ అని ఎక్కడా అనలేదు. ఈయనే కాదు దక్షిణ భారత దేశ భాషల మధ్య ‘వ్యాకరణ సంబంధాల్ని’ పరిశోధించి ‘ద్రావిడ’ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన (1856) ‘రాబర్ట్ కాల్డ్వెల్’ అనే ఆయన కూడా మన కమలహాసన్ లాగా ఏమీ చెప్పలేదు. అంతే కాకుండా ‘ద్రావిడ భాషలకీ సంస్కృతానికీ మధ్యన ఎలాంటి జన్యు పరమైన సంబంధం కూడా లేదని’ తేల్చి చెప్పేశాడు. అప్పటికి కొన్ని వందల ఏళ్లగా ‘సంస్కృతం మిగతా అన్ని ద్రావిడ భాషలకూ మూలం’ అంటూ భార తీయ పండితులు అనుకొంటున్న దాన్ని ఈయన కూకటి వేళ్ళతో పెకలించి వేశాడు.ఈయన తన పరిశోధన కోసం స్కాట్లాండ్ను విడిచిపెట్టి వచ్చేశాడు. ముందు ఎల్లిస్ ఏడు ద్రావిడ భాషల్ని గుర్తిస్తే... కాల్డ్వెల్ 12 భాషల్ని గుర్తించాడు. ద్రావిడ భాషల్లోని హల్లుల్ని ‘నాలుక కొసల ద్వారా పలికే విధా నాల్ని’ గుర్తించాడు. వాళ్ళందరూ కూడా తమిళాన్ని ‘పురాతనమైన సాహిత్య భాష’గా మాత్రమే గుర్తించారు. అంతే తప్ప ‘వీటన్నిటికీ మూలం తమిళం’ అని ఎక్కడా చెప్పలేదు. మొదటైతే మను షులుగా పుట్టాం. పోనీ పరిణామం చెందాము. ఆ తరువాత సైగలు, శబ్దాలు. మను షులంతా ఒకేచోట పుట్టనట్లుగానే భాషలు కూడా ఒకేసారి, ఒకేచోట పుట్టవు. మనుషుల్లో ఎదుగుదల ఒకే రకంగా లేనట్లుగానే భాషల్లో కూడా ఎదుగుదల ఒకే రకంగా ఉండదు. ఎగుడు దిగుడులు ఉంటాయి. ముందూ వెనకలు ఉంటాయి. అంత మాత్రాన ఒక భాష గొప్పా, ఒకటి తక్కువా అనుకోకూడదు. తమిళం అవసరాన్ని తెలుగు తీర్చదు. మలయాళం అవసరాన్ని కన్నడం తీర్చదు. పోనీ వీటన్నిటి అవసరాన్ని హిందీ తీర్చదు. అందరి దాహాన్నీ మంచి నీళ్లు తీర్చినట్లుగా అందరి అవసరాల్నీ ఏ ఒక్క భాషా తీర్చదు. ఆ జ్ఞానం అందరికీ ఉండాలి. ముఖ్యంగా కమలహాసన్ వంటి బహుభాషా నటులకు ఎక్కువగా ఉండాలి. అది తెలుసుకొని ఇకనైనా కమలహాసన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పడం మంచిది.– నన్నూరి వేణుగోపాల్ ‘ మానవహక్కుల కార్యకర్త ‘ 98494 49012 -
మహారాష్ట్ర రాజకీయాల మెలోడ్రామా
మహారాష్ట్రలో గత మూడేళ్ల నుండి వాయిదాపడిన 29 మున్సిపల్ కార్పొరేషన్, 257 నగర పురపాలక, ఇతర స్థానిక పంచాయతీ ఎన్నికలను రాబోయే నాలుగు నెలల్లో పూర్తి చేయాల్సిందిగా 2025 మే 6న సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అంతే, ప్రాంతీయ పార్టీలు... ముఖ్యంగా, ఉభయ శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ) పార్టీలు వారి వారి కార్యకర్తలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. మినీ అసెంబ్లీ ఎన్నికలుగా పేర్కొనే ఈ ఎన్నికల జయాపజయాలు జాతీయ విషయాలపై కాకుండా, స్థానిక సమస్యలపైనే ఆధారపడుతుంటాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉద్ధవ్ థాకరే శివసేనకు... పుణె మునిసిపల్ కార్పొరేషన్, దగ్గర్లో ఉన్న పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీలకు భాలే ఖిల్లా(కంచుకోట)గా చెప్పుకుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ పార్టీలు ఇక్కడ పట్టు కోల్పోవటంతో, తిరిగి వారి ఉనికిని క్రియేట్ చేయటానికి సీనియర్ పవార్, ఉద్ధవ్ థాకరే క్షేత్ర స్థాయి ఎన్నికల విజయం కోసం పావులు కదుపుతున్నారు.227 కార్పొరేటర్లు ఉన్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్, దేశంలోనే అతిపెద్ద, అతి పురాతన (1889) ప్రజా ప్రతినిధుల సంస్థ. డెబ్భై నాలుగు వేల కోట్ల రెవెన్యూ బడ్జెట్‌తో, గత ముప్పై సంవత్సరాల నుండి గ్రేటర్ ముంబై కార్పొరేషన్ శివసేన ఆధీనంలో ఉంది. 2017 ఎన్నికల్లో 84 సీట్లు సాధించింది శివసేన. అప్పట్లో జరిగిన పోటా పోటీ ఎన్నికలో బీజేపీ 82 సీట్లు గెలిచి, కేవలం రెండు సీట్లు మాత్రమే శివసేనకు వెనుకంజలో ఉంది. కానీ, 2022లో పార్టీ చీలికతో 42 మంది సేన కార్పొరేటర్లు ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గంలోకెళ్ళిపోయారు. కార్పొరేషన్ ఎన్నికలు సమీపించటంతో మాజీ కార్పొరేటర్లు కూడా కొందరు ఉద్ధవ్ పార్టీకి తిలోదకాలు ఇచ్చారు. అయినా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 20 మంది ఉద్ధవ్ శివసేన ఎమ్మెల్యేలలో ముంబై సిటీకి చెందినవారు 10 మంది! రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు ఇది వారికి ఒక విధంగా ఆశా కిరణమే అనొచ్చు.రాజ్ థాకరే ప్రాతినిధ్యం వహిస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఇప్పటివరకూ, ఉద్ధవ్ శివసేనకు ఓట్ కట్టర్ గానే నష్టం చేకూర్చింది. సందర్భోచితంగా స్థానిక బీజేపీ నేతలు, రాజ్ థాకరే పార్టీని తమకు అనుకూలంగా వాడుకుంటారు. ఉద్ధవ్, రాజ్ కలిసి ఎన్నికల బరిలో దిగితే ఇరు పార్టీలకు కలసి వస్తుంది అని రాజకీయ విశ్లేషకులే కాక, పార్టీ కార్యకర్తలు సైతం తరచుగా చెపుతుంటారు. కానీ, అది ఇంత వరకూ జరగ లేదు. 2024 డిసెంబరులో రాష్ట్ర ముఖ్య మంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగానే, ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్ థాకరే వెళ్ళి ఆయనను కలవటం, మహాయుతి భాగస్వామి షిండే వర్గంలో కలకలం సృష్టించింది; ‘టిట్ ఫర్ టాట్’ అన్నట్టు శివసేన (షిండే) నేత, ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, రాజ్ సాహెబ్ ఇంటికెళ్ళి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇదంతా గమనిస్తే, ప్రస్తుతం ఇక్కడి రాజకీయాల్లో ‘దోస్తీ దుష్మనీ’కి నిర్వచనమే తెలియటం లేదు. ఇక, మొన్న జరిగిన మరాఠీ సినీ కార్యక్రమంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఎం.ఎన్.ఎస్. నేత రాజ్ థాకరే, ‘మహారాష్ట్ర సంక్షేమం కోసం తన పార్టీ ఉద్ధవ్ శివసేనకు మద్దతివ్వటానికి సిద్ధమే’ అని అన్నారు. మరుసటి రోజు ముంబై నగర వీధుల్లో, థాక్రే బ్రదర్స్ ‘మహారాష్ట్ర హిత్’ కోసం ఒక్కటవ్వాలి అని శివసేన పోస్టర్లు వెలిశాయి.ఇక బాబాయి, అబ్బాయిల (ఎన్సీపీ పార్టీల) విషయానికి వస్తే, ‘రాబోయే స్థానిక ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం, మీ పార్టీతో చేతులు కలుపుతుందా?’ అన్న విలేఖరి ప్రశ్నకు శరద్ పవార్, ‘మున్ముందు ఈ రెండు పార్టీలు విలీనం అయినా ఆశ్చర్యం లేదు’ అంటూ తన పార్టీ నేతలను కూడా విస్మయంలో ముంచారు. 2019 నుండి మహారాష్ట్ర రాజకీయాలు చిత్ర విచిత్రంగా మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. భాజపాతో 30 ఏళ్ల సంబంధం తెగతెంపులు చేసుకుని ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ ఎన్సీపీలతో మైత్రి కుదుర్చుకుని ముఖ్యమంత్రి కావటం; తర్వాత, 2022 జూన్‌లో ఏక్నాథ్ షిండే 52 మంది శివసేన ఎమ్మెల్యేలతో ఉద్ధవ్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి భాజపా సహాయంతో సీఎం కావటం; మరో సంవత్సరం గడిచాక (2023 జూలై) అజిత్ దాదా, 43 ఎన్సీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి, భాజపా కనుచలువతో ఉపముఖ్యమంత్రి కావటంతో మహారాష్ట్ర రాజకీయ రంగస్థలంలో మెలోడ్రామా చోటు చేసుకుంది.రాష్ట్ర స్థాయి నేతలకు అతీతంగా, గ్రామ, జిల్లా, నగర స్థాయిలో అధికారం కోసం ఉబలాటపడే నాయకులు మాత్రం ముంబైలోని వారి అగ్ర నాయకుల ఫర్మాన్ పట్టించుకోదలచుకో లేదు. శివసేన, ఎన్సీపీ రెండూ రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఈ పార్టీల నాయకులు, వాలంటీర్లు వారికి తోచిన రీతిలో సమీకరణలు చేసుకుంటున్నారు. అయితే స్థానిక నాయకులను తమ ‘గ్రిప్’లో ఉంచుకోవాలనే ప్రయత్నమే పవార్, థాకరే పార్టీలు చెప్పే మెర్జర్ ధోరణి రహస్యం.జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై ‘ 98190 96949 -
ప్రత్యామ్నాయంగా ఎదగడమే మార్గం
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్నారు. ఒక పక్క సామ్రాజ్యవాద భావనతో అనేక దేశాలపై అధిక సుంకాలు విధిస్తూ మరొక పక్క విద్య, ఆరోగ్య వ్యవస్థలపై విధ్వంసపు దాడి చేస్తున్నారు. ట్రంప్‌లో జాత్యాహంకార భావాలు మిన్నంటుతున్నాయి. నిజానికి అమెరికా ఒకనాడు ప్రసిద్ధి చెందినది హార్వర్డ్, కొలంబియా యూనివర్సిటీల లాంటి వాటి వల్లనే. ఈ యూనివర్సిటీలు సామ్రాజ్యవాదానికి భిన్నంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దే స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు నెలవుగా రూపొందించబడ్డాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక, సామాజిక, పరిపాలన రాజకీయ శాస్త్రాల్లో నిష్ణాతులైన ప్రపంచ జ్ఞానులు ఆవిర్భవించారు. అందులో అంబేడ్కర్ ఒకరు. అంబేడ్కర్ అమెరికాలో తాను స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవించానని స్వయంగా చెప్పారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ అనుభవించిన స్వేచ్ఛను గూర్చి డబ్ల్యూ.ఎన్. కుబేర్ ఇలా విశ్లేషించారు: అంబేడ్కర్ అమెరికా వెళ్ళడంతో ఆయనలో నూత్న వికాసం వచ్చింది. ముఖ్యంగా అందరు కలిసి భోజనం చేయడం అనేది ఆయన ఇండియాలో చూడలేదు. ఇండియాలో కొందరు భోజనం చేస్తుంటే, కొందరు నిలుచుండేవారు. కలిసి భోజనం చేసే సంస్కృతి లేదు. జీవన వ్యవస్థలో కుల వ్యత్యాసాలు, మత వ్యత్యాసాలు విపరీతంగా ఉన్నాయి. మనిషిని మనిషిగా చూడలేని సంస్కృతిని చూసిన ఆయన ఒక్కసారి ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయారు. న్యాప్కిన్ తో చేతులు తుడుచుకోవడం, ముఖ్యంగా సూట్ ధరించి కాలేజీకి వెళ్ళడం, క్లాసులో అందరు సమానంగా కూర్చోవడం, ఉపాధ్యాయుడికి భేదభావాలు లేకపోవడం వంటివన్నీ ఆయనకి కొత్తగా అనిపించాయి. ఒకే విద్యా ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి భావజాలాలు ఉండటం చూసి ఆయన విస్తుపోయారు. ఇలా భారతీయ మేధావులెందరో అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేయటమే గాక ఆ విశ్వవిద్యాలయాల్లో ఉండే స్వేచ్ఛను గురించి అక్కడి అధ్యాపకులైన సెలిగ్మన్, జాన్ డ్యూయీ వంటి వారి విద్యా సంపన్నత గురించి; జాతి, కుల, మత, వివక్ష లేకుండా అక్కడ విద్యార్థుల కుండే స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి ఎంతో కొనియాడారు. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ స్వభావం జాతి వివక్షలో హిట్లర్‌ను మించి ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీకి చేస్తున్న ఆర్థిక వ్యయాన్ని గురించి ట్రంప్ ప్రపంచం మొత్తానికి గగ్గోలుపెట్టి చెప్పుతున్నారు. కానీ ఆ యూనివర్సిటీలో అధ్యయనం చేసిన మేధావులు, సాంకేతిక నిపుణులు, నోబెల్ బహుమతి గ్రహీతలు, పరిపాలనా శాస్త్ర పండితులు అమెరికాకు ఎంత కీర్తి తెచ్చారు? అమెరికాకు ఎంత సాంకేతిక సాంస్కృతిక జ్ఞానాన్ని తీసుకువచ్చారు? ఎంత మానవ హక్కుల పోరాట శక్తిని ప్రపంచానికి అందించారు? ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. ఒక పక్క గాజాపై మారణహోమం జరపడానికి యూదుల దేశమైన ఇజ్రాయెల్‌ని ప్రోత్సహిస్తూ, మరోపక్క హార్వర్డ్ యూనివర్సిటీ యూదా (యూదు) జాతి యువకులు అమెరికా తెల్లజాతి వారిని అణచివేస్తున్నారని మాట్లాడడం ఆయనలో ఉన్న ద్వైదీభావానినికి నిదర్శనాలు. నల్లజాతీయుడైన ప్రెసిడెంట్ ఒబామా తీసుకువచ్చిన అనేక విద్యా, వైద్య సంస్కరణలకు ట్రంప్ చరమగీతం పాడారు. అమెరికాకు చెందిన ‘నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’ వార్షిక బడ్జెట్ సుమారు 48 బిలియన్ డాలర్లు. దీనికి తోడు సుమారు 2,500 విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రుల్లో పనిచేసే పరిశోధకులకు గ్రాంట్లు మంజూరు చేసేవారు. ఒక్క పెన్ను పోటుతో ట్రంప్ వీటన్నింటికీ నిధుల్లో కోత పెట్టారు. ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టే వ్యాక్సిన్ల అభివృద్ధి, సరికొత్త చికిత్సా విధానాల రూపకల్పన, ఔషధాల తయారీ, మానసిక ఆరోగ్య పరిరక్షణ, అరుదైన జబ్బుల నివారణకు ఈ నిధులు ఎంతగానో తోడ్పడేవి. కొలంబియా యూనివర్సిటీకి 400 మిలియన్ డాలర్ల గ్రాంటును కుదించారు. స్రపంచ దేశాలకు అందించే నిధులనూ నిలిపివేశారు. దాంతో లైంగిక వ్యాధులు, హెచ్ఐవీ నివారణ, టీకాల అభివృద్ధి ప్రాజెక్టులు ఒక్కసారిగా మందగమనంలోకి జారిపోయాయి. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా జాతీయ వైద్య సంస్థ ఆధ్వర్యంలోని సుమారు 800 పరిశోధక ప్రాజెక్టులు సాగడానికి, విపత్తుల నివారణకు... నిధుల కటకట ఏర్పడిందని ప్రముఖ సైన్ ్స జర్నల్ ‘నేచర్’ విశ్లేషించింది.ట్రంప్ భారతదేశంతో చెలిమి చేస్తున్నట్టు నటిస్తూ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులను తరిమివేయాలని చూస్తున్నారు. భారతీయుల మేధస్సు మీద గొడ్డలి వేటు వేయాలని చూస్తున్నారు. జాన్ డ్యూయీ రూపొందించిన విద్యా ప్రజాస్వామ్య దృక్పథాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. డ్యూయీ తన ‘ప్రజాస్వామ్యం’ అనే గ్రంథంలో ఈ విధంగా తెలియజేశారు: ‘ప్రజాస్వామ్యం ఒక ప్రత్యేక రాజకీయం కంటే, ఒకే పద్ధతిలో సాగే ప్రభుత్వం కంటే కూడా విస్తృతమైంది. ప్రజాస్వామ్యం మనుష్యులందరూ కలిసి జీవించగలిగే విధానాన్ని రూపొందిస్తుంది. మనిషికి ప్రజాస్వామ్యం పరిణ తి తీసుకొస్తుంది. మనిషికి ప్రజాస్వామ్యం నైతికతను నేర్పుతుంది. ప్రజాస్వామ్యం సామాన్య, సామాజిక సంక్షేమ విలువలకు, మానవ సంపూర్ణ జీవన సంస్కృతీ విస్తరణకు, ఒక వ్యక్తికి మానవ విలువలు ఉండే క్రమాన్ని రూపొందించడానికి నిర్మాణ సూత్రాలు ఇస్తుంది. ప్రజాస్వామ్యం మానవ విలువల శాస్త్రం’. ఆయన చెప్పిన ప్రతి వాక్యం అంబేడ్కర్ మీద పని చేసింది. ట్రంప్ చేస్తున్న పనులు చూస్తుంటే డ్యూయీ వచించిన మాటలకు ఎంత వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. తద్వారా అంతకు ముందు అమెరికాకు అంతర్ శక్తిగా ఉన్న విద్యా సంస్కృతిపై గొడ్డలి వేటు వేస్తున్నారు. ఇది మొత్తం ఆసియా దేశాల్లో విస్తృతమవుతున్న విద్యా సాంకేతిక, జ్ఞాన సంపత్తిపై దాడిగానే మనం భావించాలి. ఈ నేపథ్యంలో భారతదేశ ప్రజలు, పాలకులు మేల్కొని మన విశ్వవిద్యాలయాలను సుసంపన్నం చేసుకొని అతి ప్రాచీన కాలం నుండి భారతదేశం ఇతర దేశాలకు ఎలా విద్యను, సంస్కృతిని, సాంకేతికతను, తత్వశాస్త్రాన్ని, కళలను, మానవ పరిణామ శాస్త్రాన్ని అందించిందో అలా ఇప్పుడు కూడా అందించడానికి సిద్ధపడి అమెరికాకు ప్రత్యామ్నాయంగా దేశాన్ని నిలబెట్టాలి. ఫలితంగా మన విద్యా ఉత్పత్తులు పెరుగుతాయి. తన విద్యా ఉత్పత్తుల ద్వారా అమెరికా ఎంతో సంపదను పోగు చేసుకుంటోంది. దానికి ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే గండి కొడుతున్నారు. ఈ సందర్భాన్ని చైనా ఉపయోగించుకోవాలని చూస్తోంది. భారత్ కూడా తన శక్తిమేర ఉన్నత విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసుకుని అలనాటి నలంద, తక్షశిల వంటి ప్రపంచ స్థాయి విశ్వ విద్యాలయాలను అభివృద్ధి చేయాలి. అప్పుడే దేశం నిజమైన ప్రగతి బాట పడుతుంది.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
నదీ జలాలతో ఆటలాడవచ్చా?
పాల్ సెజాన్ (ఫ్రాన్స్) 1890లో ఓ పెయింటింగ్ వేశారు. దాని పేరు ‘ఎట్ ద వాటర్’స్ ఎడ్జ్.’ నీటిపై కాంతి ప్రతిఫలనాన్ని వినూత్న రీతిలో చూపెడుతూ చేసిన చిత్రమిది. దాన్ని గీసేందుకు రంగులను పొరలు పొరలుగా అద్దారు. అవి కరుగుతున్నట్టుగా ఉంటాయి. దీనికి ఈ టైటిల్ ఇవ్వడం వెనుక చిత్రకారుడి ఉద్దేశం ఏమిటో తెలియదు. కానీ, పహల్గామ్ ఊచకోత ఇండియా, పాకిస్తాన్ దేశాలను సింధూ నది నీటి అంచున నిలబెట్టింది.టిబెట్ పర్వతాల మీద 18,000 అడుగుల ఎత్తున మానస సరోవరం వద్ద పుట్టిన సింధూ నది వేల సంవత్సరాలుగా ఎన్నో నాగరికతలకు ఆలవాలమైంది. ఇటీవలి సంవత్సరాల్లో నదుల గురించి, వాటి చరిత్రల గురించి చాలా రచనలు వెలువడుతున్నాయి. బ్రిటిష్ చరిత్రకారుడు, ‘ద కాంక్వెస్ట్ ఆఫ్ నేచర్’ రచయిత డేవిడ్ బ్లాక్బోర్న్ ఇలా అంటాడు: ‘‘ప్రకృతిపై విజయం సాధించాలన్న మానవుడి తపన వెనుక అనేక ఊహలు ఇమిడి ఉంటాయి. మానవ, సాంకేతిక శక్తులతో ప్రకృతిని జయించాలని మనిషి అనుకుంటాడు. నదుల అస్తిత్వం పట్ల అతడి వైఖరి కూడా దీనికి ఒక కారణమవుతుంది’’.నైలు నదిని మార్చిన ఫలితం?నదులకు వ్యక్తిత్వం ఉందీ అనుకున్నా, అవి ఏం ఆలోచిస్తాయో తెలియదు. అయితే, నదుల గురించి మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారో మనకు తెలుసు. నీటి ప్రవాహాన్ని క్యూసెక్కులలో లెక్కగట్టి వాటి స్వరూపాన్ని నిర్ణయిస్తాం. అంతే కాకుండా, వాటిపై ఆధారపడి ఉండే వృక్ష జంతుజాలం, ఆ నదులను పెనవేసుకుని ఉండే ఆచార వ్యవహారాలు, కల్పిత గాథలు ఆధారంగా వాటి గొప్పతనాన్ని అంచనా వేస్తాం. శత్రుదేశం మీద ప్రయోగించడానికి సింధూ నదిని ఒక అస్త్రంగా మార్చుకోవాలని ఇండియా భావిస్తోంది. నదులతో ఆడుకుంటే వాటి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసిన విషయమే. నైలు నదీ స్వరూపాన్ని మార్చేయాలని 200 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడలేదు. ఆస్వాన్ డామ్ కట్టడంతో నైలు నదీ డెల్టాను వేల సంవత్సరాలుగా సారవంతం చేసిన ఒండ్రుమట్టి ఆ ప్రాంతంలో మేట వేయడం నిలిచిపోయింది. అంతేకాదు, నత్తగుల్లల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి శిస్టోమియాసిస్ ప్రబలడానికీ, మలేరియా వ్యాప్తికీ కారణమైంది.నది మీద డ్యామ్ కడితే అది ఇక నదే కాదు. ‘‘నీటిని అదుపులోకి తెచ్చుకోవడమంటే, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడమే. హైడ్రలాజికల్ ప్రాజెక్టుల వల్ల అక్కడి మానవ ఆవాసాలు అంతరిస్తాయి. ఆ మానవ సమూహాల విలువైన పారంపరిక విజ్ఞానం శాశ్వతంగా కనుమరుగవుతుంది’’ అని కూడా బ్లాక్బోర్న్ రాస్తాడు.భారీ నీటిని నిల్వ చేయగలమా?కశ్మీర్ ‘పాకిస్తాన్ జీవనాడి’ అంటూ, పహల్గామ్ ఊచకోతకు కొద్దిరోజుల ముందు, పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. వాస్తవానికి సిం«ధూ నది ఈ రెండు దేశాలను యుద్ధం వైపు నడిపించే అవకాశం ఉన్నది! సైనిక ప్రతిచర్యలకు అదనంగా, ఇండియా 1960 నాటి సింధు నదీజలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతలు ఇన్నిసార్లు వచ్చినా ఇలా చేయడం ఇదే ప్రథమం. జల యుద్ధాలు సంభవించే ముప్పు ఉందంటూ కొన్ని దశాబ్దాలుగా భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిప్పుడు పరీక్షా సమయం. ఒప్పందం నిలిపివేయడంతోనే సిం«ధూ జలాలు దిగువకు ప్రవహించకుండా ఆగిపోవు. ఒక్క చుక్క నీటిని కూడా వదలం అంటూ జలశక్తి మంత్రి హెచ్చరించడం పాక్‌ను బెదిరించే రాజకీయ ప్రకటన. సిం«ధూ ప్రవాహాన్ని అకస్మాత్తుగా అపేయడం సాధ్యపడేది కాదన్నది మనకు తెలిసిన విషయమే. ‘‘నెత్తురు నీరు కలసి ప్రవహించ జాలవు’’ అని 2016 కశ్మీర్ ఉగ్రదాడి అనంతరం ఇండియా హెచ్చరించింది. అయితే, ఇస్లామాబాద్‌కు మద్దతుగా చైనా రంగంలోకి దిగిత్సాంగ్పో (బ్రహ్మపుత్ర) ఉపనది ప్రవాహాన్ని అడ్డుకుందని వార్తలు వచ్చాయి.ఇండియా ప్రస్తుత జలవిద్యుత్ ప్రాజెక్టులతో భారీ పరిమాణంలో నీటిని నిల్వ చేయలేదు. ఇండస్ వాటర్ ట్రీటీ (1960) అందుకు అంగీకరించదు కూడా. ఒప్పందాన్ని పునః సమీక్షించడం కోసం, స్టోరేజ్ సదుపాయాల ఏర్పాటు కోసం దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చేందుకు రచించిన వ్యూహం ఇది. ఇండియా ప్రస్తుతం 20 శాతం నీటినే వినియోగించుకోగలుగుతోంది. మరీ ఎక్కువగా నీరు నిల్వ చేస్తే వరద ముంపు ప్రమాదం ఎదురవుతుంది.దౌత్యవ్యూహంగా సరే!ఇరు దేశాలూ తమ జల వివాదాలను పరిష్కరించుకోడానికి 2022 నుంచీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. మారుతున్న జనాభా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ఒప్పందంపై పునఃసమీక్ష జరగాలని 2023లో ఇండియా ప్రతిపాదించింది. నదీ ప్రవాహాన్ని మళ్లించడం అంటే వ్యయంతో కూడుకున్న పని. నీటి మళ్లింపు ఆర్థిక రీత్యా సాధ్యం కాకపోవచ్చు. చైనా సైతం త్సాంగ్పో నీటి మళ్లింపు విషయంలో ఈ కారణంతోనే సందిగ్ధంలో పడింది.‘‘సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో ప్రత్యేకించి చీనాబ్ బేసిన్లో జలవాతావరణం భారీ మార్పులకు లోనవుతోంది. ఈ వాతావరణ మార్పుతో ఇప్పటికే మనం సమరం చేస్తున్నాం’’ అని ‘సౌత్ ఏషియా నెట్వర్క్ ఆన్ డామ్స్, రివర్స్ అండ్ పీపుల్’ (ఎస్‌ఏఎన్‌డీఆర్‌పీ) సమన్వయకర్త పరిణీతా దాండేకర్ చెబుతున్నారు.ఇండియాలోని సింధూ పరీవాహక ప్రాంతపు పశ్చిమ నదులపై ఎక్కడా లేనన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు చీనాబ్ బేసిన్లో ఉన్నాయి (హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, పంజాబ్‌లో కొంతభాగం చీనాబ్ పరీవాహక ప్రాంతం కిందకు వస్తాయి). తొందరపడి మరిన్ని రిజర్వాయర్లు, ఆనకట్టలు నిర్మించాలని నిర్ణయిస్తే ఇండియా, పాకిస్తాన్ దేశాలు రెండూ ప్రకృతి విపత్తుల బారిన పడే ప్రమాదం ఉంది. ఎస్‌ఏఎన్‌డీఆర్‌పీ బృందం 2024లో చీనాబ్ నది ఆసాంతం పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించింది. ఇప్పటికే భూకంపాలు, నిరంతర వాతావరణ విపత్తులు ఎదుర్కొంటున్న చీనాబ్ నదీ ప్రాంతం మరిన్ని భారీ ప్రాజెక్టులను తట్టుకోలేదు. అయినా సరే నిర్మిస్తే పెను ఉపద్రవం తప్పదని ఈ నివేదిక హెచ్చరించింది. వీటివల్ల ఉత్పన్నమయ్యే జీవావరణ, భూగర్భ సంబంధిత దుష్పరిణామాలను సరిదిద్దడానికి వీలు కూడా కాదు. నదీజలాల మళ్లింపు వల్ల ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇక్కట్ల పాలవుతారు. లక్షల మంది నిర్వాసితులు అవుతారు. జలప్రవాహాన్ని నిలిపివేయడం తెలివైన దౌత్యవ్యూహమే కావచ్చు. కానీ నదీప్రవాహంతో ఆటలాడితే దీర్ఘకాలంలో ప్రమాదం తప్పదు.కిసలయ భట్టాచార్జీ వ్యాసకర్త జిందాల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ డీన్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పరిధి అతిక్రమించడం కాదా?
మన న్యాయమూర్తులకు బయటి శత్రువు లెవరూ ఉండరు. వారికి వారే శత్రువులు. ఇలా అనడం మీకు విచిత్రం కావచ్చు. కానీ నాకు అలాగే తోచింది. వారు ఒక్కోసారి తమను తాము మర్చిపోయారా అన్నట్లు అసాధారణంగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడేప్పుడు తమ మాటల పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచన వారిలో ఉండదా? వాటి ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందరా? అశోకా యూనివర్సిటీలో ప్రొఫెసరైన అలీ ఖాన్ మహ్ముదాబాద్ వ్యాఖ్యల కేసులో వారు వ్యవహరించిన తీరు ఎలా ఉందో ఈ సందర్భంగా పరిశీలిద్దాం.మొదటగా వారు ఆయన పోస్టును ‘డాగ్–విజిలింగ్’ అని నిందించారు. పదాలను ద్వంద్వార్థాలతో ఉపయోగించారని వ్యాఖ్యానించారు. ‘‘ఇతరులను అవమానించడానికి, కించపరచ డానికి లేదా అసౌకర్యం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా పదాలు ఎంపిక చేసుకున్నారు’’ అని పేర్కొన్నారు. కానీ తాము అనుకుంటున్న ఆ పదాలేమిటో చెప్పారా? చెప్పలేదు. పైగా, ‘‘ఆయన ఈ భావాలను సులభమైన, మర్యాదపూర్వకమైన, ఎంతో తటస్థమైన పదజాలం ఉపయోగిస్తూ, అతి సులభమైన భాషలోనూ వ్యక్తం చేయొచ్చు’’ అంటూ చెప్పుకుపోయారు. ఇక్కడ కూడా తాము అనుకుంటున్న ఆ భావాలేమిటో వారు చెప్పలేకపోయారు. డాగ్–విజిల్ అంటే ఏమిటి? ఆ విజిల్ సాధారణంగా మనిషి చెవులు ఆలకించలేని శబ్దతరంగాల్లో (ఫ్రీక్వెన్సీలో) ఉంటుందని రాజ్యాంగ న్యాయశాస్త్రంలో పండితుడైన గౌతమ్ భాటియా అంటారు. మరి మహ్ముదాబాద్ ఫేస్బుక్ పోస్టుల్లో ఏ భాగాలను డాగ్ విజిల్స్ అని భావించాలి? ఏ ‘కుక్కల’కు ఆయన విజిల్స్ వేశారు? ఆయన ఉద్దేశించని ‘శునకేతరులు’ ఎవరు? అసలు ఆందోళనజడ్జీలు వీటిలో వేటినీ వేలెత్తి చూపించలేదు. ఏం... వారు అలా చేయదగిన పని కాదా అది? అందుకు బదులుగా... ‘‘అతను వాడిన పదజాల సంక్లిష్టతను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి, ఈ రెండు ఆన్లైన్ పోస్టుల్లో ఉపయోగించిన కొన్ని వ్యక్తీకరణల స్వభావాన్ని సరైన రీతిలో గ్రహించడానికి ఒక సిట్ ఏర్పాటు చేయాలని హరియాణా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను మేం ఆదేశిస్తున్నాం’’ అని ఉత్తర్వు జారీ చేశారు. అయితే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)లో పోలీసు అధికారులే ఉంటారు. శామ్యూల్ జాన్సన్, నోవా వెబ్‌స్టర్ వంటి నిఘంటుకారులు (లెక్సికోగ్రాఫర్లు) ఉండబోరు. వాస్తవం చెప్పాలంటే, ఈ ఇద్దరు న్యాయమూర్తులు రేకెత్తించిన ఆందోళనల్లో ఇది చిన్నమెత్తు కూడా ఉండదు. తీవ్రంగా ఆందోళన కలిగించేవి ఇంకా ఉన్నాయి. వారు పేర్కొన్న ఈ వాక్యాలను చూడండి: ‘‘ప్రతి ఒక్కరూ హక్కుల గురించి మాట్లాడతారు. నాకు ఇది చేసే హక్కు ఉందని, అలా చేసే హక్కు ఉందని అంటారు. కాని దేశం పట్ల మీ బాధ్యత ఏమిటో చెప్పరు.’’నిజం ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది? పౌరులుగా మనకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను మాత్రమే అది ప్రత్యేకంగా గుర్తించింది తప్ప, రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సినవి అంటూ ఎలాంటి బాధ్యతలనూ రాజ్యాంగం గుర్తించలేదు. దేశ భక్తుడిగా ఉండాల్సిన బాధ్యత కూడా మనకు లేదు. జెండా చుట్టుకు తిరగమని రాజ్యాంగం చెప్పలేదు. దేన్నయినా సరే సందేహించ డానికి, ప్రశ్నించడానికి మనకు ప్రతి హక్కూ ఉంది. మరి ఏ ప్రాతిపదికన ఈ న్యాయమూర్తులు హక్కులను, బాధ్యతలను ఒకే గాట కట్టారు? ఆ విషయం వారు చెప్పలేదు. ఏమైనప్పటికీ, మహ్ముదాబాద్ ప్రొఫెసర్‌గా ఉన్న అశోకా యూని వర్సిటీ విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి వారు మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి అత్యంత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అవేమిటో చదవండి: ‘‘వారు ఏమైనా సరే చేయగలం అనుకుంటే మేం ఒక ఉత్తర్వు జారీ చేస్తాం... ప్రైవేటు యూనివర్సిటీలు అని చెప్పుకొనే ఇలాంటి కొన్ని సంస్థలను ప్రారంభించడం, వాటిలో నానా రకాల శక్తులూ చేరి చేతులు కలపటం, బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం మాకు సమ్మతం కాదు. ఇలాంటి వారితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు.’’మాటలు న్యాయసమ్మతమేనా?ఈ భూమ్మీద ఏ శక్తి వారిని ఇందుకు పురికొల్పింది? ఎలాంటి వివరణ గానీ, న్యాయ ఔచిత్యం గానీ లేకుండా కలగాపులగంగా మాట్లాడిన అనేక విషయాల్లో అలవోకగా చేసిన ఈ వ్యాఖ్యా చేరుతుంది. తమ ఆలోచనల విపరీత పోకడ వల్లే ఒక అంశం నుంచి మరొక అంశంలోకి, అది తమకు సంబంధం లేనిదైనప్పటికీ, వారు ఇలా ఒక గెంతు గెంతినట్లు అనుకోవాలి.న్యాయమూర్తులు ఇలా మాట్లాడేందుకు వారిని ప్రోత్సహించిందేమిటి? ఎదుటి పక్షం వాదనలను లోతుగా తరచి చూసే ‘డెవిల్స్ అడ్వకేట్’ పాత్ర పోషించేప్పుడు, వారు మాట్లాడాల్సిన విషయాలు కావివి. ఇవి వారి వ్యక్తిగత అభిప్రాయాల్లా ధ్వనిస్తున్నాయి.రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులకు పూచీ వహించడమే వారి బాధ్యత. దానికి వారు విధేయతతో కట్టుబడి ఉండాలి. అయితే ఏం జరిగింది? అలా కాకుండా, కొందరు రాజకీయ ప్రేక్షకుల ముందు వినమ్రతతో శిరస్సు వంచుతున్నారా? ఇలా అని ఎవరైనా అనుకుంటే ఆశ్చర్య పోనవసరం లేదు. వారు ఎక్కువగా మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే, ఆ మాటలు న్యాయసమ్మతం కావు. గౌతమ్ భాటియా ఒక జాతీయ దినపత్రిక ద్వారా లేవనెత్తిన అంశం నన్ను నిజంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. మహ్ముదాబాద్ మీద ప్రకటించిన గ్యాగ్ ఆర్డర్‌ను ప్రస్తావిస్తూ, ‘‘ఒకరి నోరు నొక్కే అధికారం (గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం) న్యాయవ్యవస్థకు లేదన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింటు. ఒకవేళ ప్రభుత్వం ఇలా చేయాలని నిర్ణయిస్తే, అది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా అనేది తేల్చడానికి మాత్రమే దానికి అధికారం ఉంది’’ అని భాటియా పేర్కొన్నారు. అంటే ఈ న్యాయమూర్తులు తమకు లేని అధికారాలను ఉపయోగించారా అని ఆయన్ను ప్రశ్నించాను. దానికి ఆయన ఎంతో వివేకంతో, ఎంతో స్పష్టంగా, ‘‘వారు తమ పరిధులను మించి పోయి’’ వ్యవహరించారని చెప్పారు. ఓహ్! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
దేశమంటే కేంద్రం కాదోయ్!
‘ఇండియన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ చిక్కుల్లో పడింది. న్యాయం, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలు అందరికీ సమానంగాఅందిస్తూ, ఇండియాను ఆధునిక, ప్రజాస్వా మిక, లౌకిక రాజ్యంగా మార్చడమే రాజ్యాంగ అభిమతం. ఇండియా కాషాయ రంగు ఒక్కటే పులుముకున్న దేశంగా ఉండాలన్న భావన ఏనాడూ లేదు. భిన్న జాతులు, సంస్కృతులు, భాషలతో విలసిల్లే వైవిధ్యభరిత దేశమే లక్ష్యంగా రాజ్యాంగ రచన జరిగింది. ఈ వైవిధ్యత నేడు పెను సవాలు ఎదుర్కొంటోంది. ఇండియాలోని ఒక్కో రాష్ట్రం స్వరూప స్వభావాలు ఒక్కోవిధంగా ఉంటాయి. కాబట్టి వాటిమధ్య రాజకీయ, ఆర్థిక బలాబలాల సమతుల్యత సాధించడం ముఖ్యం. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాభాను తగ్గించుకున్న రాష్ట్రాలకు ప్రస్తుత డీలిమిటేషన్ (నియో జకవర్గాల పునర్విభజన) కసరత్తు వల్ల పార్లమెంటులో వెయిటేజ్ తగ్గుతుంది. అలా చేయలేని విఫల రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరిట అధిక పార్లమెంటు స్థానాలిచ్చి సత్కరిస్తున్నారు. పార్లమెంటరీ నియో జక వర్గాల సంఖ్యను ఇప్పుడున్న స్థాయిలోనే శాశ్వతంగా స్తంభింప జేయాలి. డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపేయాలి.విద్య పూర్తిగా రాష్ట్రాలదే!ప్రపంచం ఇప్పుడు సాంకేతిక యుగంలోకి ప్రవేశించింది. విద్యా ప్రమాణాలే సమాజాల ప్రగతిని శాసిస్తాయి. కేంద్ర నిర్వహణలోని ఉన్నత విద్యావిధానం చాలావరకు విఫలమైంది. విద్య యావత్తూ రాష్ట్ర జాబితాలోకి రావాలి. ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల అధికార పరిధి నుంచి రాష్ట్రాలను విముక్తం చేయాలి. వైద్య, న్యాయ, సామాజిక శాస్త్రాల విద్యను మెరుగుపరచడం మాత్రమే నేటి జాతీయ అవసరం. నాణ్యమైన విద్యలో రాష్ట్రాలు పరస్పరం పోటీ పడేవిధంగా విధానాలు ఉండాలి. అంతేతప్ప, సగటు స్థాయి కేంద్రీకృత నిర్వహణ సంస్థలకు తలొగ్గే పరిస్థితి ఉండకూడదు. కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) చెల్లించి పంటలను కొనుగోలు చేయడం అనేది ప్రస్తుతం ఏవో కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకే పరిమిత మైంది. ఇలా సేకరించడం అంటే సబ్సిడీ ఇవ్వడమే. వ్యవసాయ సాగుభూమి ప్రాతిపదికగా, ఈ సేకరణ అన్ని రాష్ట్రాలకూ వర్తింప జేయాలి. ఆహారధాన్యాల్లో తృణధాన్యాలు ఎక్కువ భాగం ఆక్రమి స్తాయి కనుక అన్ని రాష్ట్రాల్లో వాటి సేకరణకు గ్యారెంటీ ఇవ్వాలి. అన్ని రాష్ట్రాల్లో ఇలా సేకరణ చేయడం సాధ్యం కాదనుకున్నప్పుడు, ఆ యా రాష్ట్రాలకు అందుకు బదులుగా గ్రాంట్ల రూపేణా పరిహారం ఇవ్వాలి.గంగా పరివాహకేతర ప్రాంతాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, అల్యూమినియం, రాగి, జింకు, నికెల్ వంటి ఖనిజ వనరులు విరివిగా ఉన్నాయి. ఈ వనరులు ఎవరి భూమి కింద ఉన్నాయో వారికి చెందాలి. అన్ని ఖనిజాల మీద ఆ యా రాష్ట్రాలకే తవ్వకం హక్కులు కట్టబెట్టాలి. వాటి ద్వారా సమకూరే ఆదాయాలు సైతం వాటికే సంక్రమించాలి.పన్నుల్లో వాటా రాష్ట్రాలకు ముందే ఇచ్చేయాలి!రాష్ట్రాలు ఆర్థిక స్వయంప్రతిపత్తి సాధించినప్పుడే నిజమైన సమాఖ్య వ్యవస్థ సాధ్యమవుతుంది. అంటే రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక వనరులుండాలి. ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం, పన్నుల రాబడిలో రాష్ట్రాలకు ప్రస్తుతం 42 శాతం వాటా దక్కాలి. అలా జర గటం లేదు. కేంద్రం వద్ద నిధులు కేంద్రీకృతమవుతున్నాయి. దీనికి తోడు, రాష్ట్రాలకు రావలసిన పన్ను బకాయిలను తొక్కిపట్టే ధోరణి పెరుగుతోంది. రాష్ట్రాలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆదాయాన్ని కేంద్రం తన పథకాల కోసం వాడుకుంటోంది. దీని నివారణకు మార్గాలు ఆలోచించాలి. పన్ను చెల్లింపు మూలం వద్దే రాష్ట్రాలకుచెందాల్సిన వాటా మినహాయించే విధానం అవసరం. దీనివల్ల సకాలంలో రాష్ట్రాలకు నిధులు అంది, అవి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోగలుగుతాయి. నిధుల బదిలీలో జాప్యం జరిగితే ఆర్బీఐ రేట్ల ప్రకారం వడ్డీ చెల్లించే నిబంధన కూడా ఉండాలి.అలాగే, రాష్ట్రాలకు తమ సాంస్కృతిక చారిత్రక వనరులను పరిరక్షించుకునే హక్కు ఉంది. కేంద్రం తన అధీనంలోని ఆర్కియ లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ద్వారా ఈ పరిరక్షణ హక్కును కాపాడటంలో విఫలమైంది. పురాతన కట్టడాలు, కళాఖండాల సంపద నాశనమవుతోంది. ఈ బాధ్యతను నేరుగా రాష్ట్రాలకే అప్పగించాలి. ఏఎస్ఐ వద్ద ఉండే రాష్ట్రాల నిధులను తక్షణం బదిలీ చేయాలి. ఏఎస్ఐ, కేంద్ర సాంస్కృతిక శాఖ సంకుచిత భావజాలంతో కొన్ని ప్రాంతాల మీద అధిక ప్రేమ కనబరచే ధోరణి పెరుగుతోంది.సైన్యంలో ఆ ఒక్క రాష్ట్రమేనా?సైనిక దళాలు, పారామిలిటరీ దళాల నియామకాలు కొన్నిప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. పరిమిత కాల సర్వీసు, జీవితకాల పెన్షన్, ఇతర బెనిఫిట్స్ కారణంగా యుద్ధ జాతులుగా పరిగణనలో ఉన్న వారికి మిలిటరీలో ఎక్కువ అవకాశాలు దక్కి వారే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. ఇది ఎలా జరుగుతోందో ఉదాహరణలతో పరిశీలిద్దాం. మద్రాస్ రెజిమెంట్ భారత సైన్యంలో అత్యంత పురాతనమైన పదాతిదళం. నీలగిరుల్లోని వెల్లింగ్టన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ రెజిమెంటులో 21 బెటాలియన్లు ఉన్నాయి. దక్షిణ భారతం అంతటికీ చెందిన దాదాపు 27 కోట్ల మంది (భారతీయుల్లో 22 శాతం) దీని పరిధిలోకి వస్తారు. అదే సిక్కు రెజిమెంటును తీసుకుంటే, కేవలం 80 లక్షల జనాభా నుంచి దీనికి ఎంపికలు జరుగుతాయి. ఈ ఒక్క రెజిమెంటులోనే 22 పదాతిదళ బెటాలియన్లు ఉన్నాయి. కేవలం 3 కోట్ల జనాభా ఉన్న పంజాబు రాష్ట్రంలోని అన్ని రెజిమెంట్ల కిందా కలిపి 74 బెటాలియన్లు ఉంటాయి. గ్రామీణ యువ తకు అద్భుత ఉపాధి అవకాశాలు కల్పించే ఒక సంస్థలో ఆ యాప్రాంతాల ప్రాతినిధ్యంలో ఇంతటి అసమానత ఉండటం సమంజసం కాదు. ఇతర ప్రాంతాల నుంచి సైనిక దళాల్లోకి నియామకాలు పెంచాల్సి ఉంది.ఇక మీడియా విషయానికి వద్దాం. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడి యాలు రెండూ భారీ పెట్టుబడితో ముడిపడి ఉంటాయి. పైగా, వీటిని కేంద్ర ప్రభుత్వం, బడా వ్యాపార సంస్థలు అదుపు చేస్తున్నాయి. గమ నించవలసిన అంశం ఏమిటంటే, ఈ రెండూ ప్రముఖంగా ఉన్నా, నేటికీ రేడియో వార్తలు దేశంలో అధిక సంఖ్యాకులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అదుపు చేస్తోంది. రేడియో వార్తలను ఎఫ్ఎం బ్యాండ్స్ మీద ప్రసారం చేయడానికి స్థానిక ఔత్సాహికులను అనుమతించాలి. ప్రింటు, టీవీ ప్రసార మాధ్యమాల నిర్వహణను ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలు రెండూ చేపట్టే అనుమతి ఉన్నప్పుడు, అత్యధికులకు అందుబాటులో ఉండే రేడియో ద్వారా సమాచారం అందించడానికి ప్రయివేటు, రాష్ట్ర ప్రభు త్వాలకు ఎందుకు అనుమతి ఇవ్వరో అర్థం కాని విషయం.అన్ని జాతులకూ వర్గాలకూ సమాన గౌరవం దక్కినప్పుడేఇండియా సమైక్యత వికసిస్తుంది. ప్రతి ఒక్కరికీ తమ వాణి వినిపించే అవకాశం కల్పించిన రాజ్యాంగం రాష్ట్రాలను ఒక రాజకీయ సమాహా రంగా కూర్చింది. అందుకు భిన్నంగా దేశాన్ని ఏకవర్ణంగా, ఏకశిలగా మార్చే ఎలాంటి ప్రయత్నం చేసినా అది దుస్సాహసం అవుతుంది. అదే జరిగితే రాజ్యాంగ మౌలిక భావన కుప్పకూలుతుంది. యూని యన్ విచ్ఛిన్నం అవుతుంది.-వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత , మోహన్ గురుస్వామి- mohanguru@gmail.com -
Operation Kagar: అభివృద్ధి అంటే అడవుల నరికివేతా?
ఈ వారం అన్ని ప్రధాన స్రవంతి వార్తా పత్రికలూ, ఛానళ్లూ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఎన్కౌంటర్ వార్తతో, అనుబంధ వార్తలతో, వ్యాఖ్యా, విశ్లేషణా వ్యాసాలతో నిండిపోయాయి. సామాజిక మాధ్యమాలైతే చెప్పనక్కరలేదు. ఒక సుప్రసిద్ధ ప్రధాన స్రవంతి ఇంగ్లిష్ దినపత్రిక ఆ వార్తను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురిస్తూ, ఉద్దేశపూర్వకంగానో, అనుద్దేశపూర్వకంగానో ఆ మూడు కాలమ్‌ల వార్తకు పక్కనే మరొక రెండు కాలమ్‌ల వార్త కూడా వేసి... చాలా పెద్దవయ్యాయి గనుక రెండు వార్తలనూ రెండో పేజీలో కూడా పక్కపక్కనే కొనసాగించింది. ఆ రెండు వార్తల మధ్య కార్య కారణ సంబంధం ఉండడం ఆ పత్రిక చెప్పకుండానే చెప్పిన రహస్యం. ఆదివాసుల, మావోయిస్టుల వ్యతిరేకత వల్ల పద్దెని మిదేళ్లుగా ఆగిపోతున్న ఆ ‘అభివృద్ధి’ పథకాన్ని కొనసాగించడం గురించి వార్తా, మావోయిస్టు ప్రధాన కార్యదర్శిని చంపి వేసిన వార్తా పక్కపక్కనే కలిసి రావడం ఒక తలకిందుల కవితాన్యాయం.మహారాష్ట్ర లోని మావోయిస్టు ప్రభావిత గడ్చిరోలిజిల్లాలో ఇనుప ఖనిజం శుద్ధి కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖమే 12న అనుమతి ఇచ్చిందనేది ఆ వార్త. ఒకవైపు ‘ఆపరేషన్ కగార్’ పేరిట ఎడాపెడా ఎన్కౌంటర్లు జరుపుతూ ఆది వాసులను భయోత్పాతంలో ముంచుతున్న సందర్భంలోనే ఈ అనుమతి వచ్చిందని ప్రత్యేకంగా గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి ముందు మహారాష్ట్ర మంత్రివర్గం గడ్చిరోలీ జిల్లా గనుల తవ్వకపు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసిందని కూడా ఆ వార్తలోనే ఉంది. మావోయిస్టు నిర్మూలన, ఆదివాసుల తరలింపు అనే ప్రణాళిక దండకారణ్యంలోని ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడానికే అనే ఆరోపణను నిజం చేస్తూ, ఈ శుద్ధి కర్మాగారం కోసం భారత ప్రభుత్వం ‘లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్’ అనే బహుళజాతి కార్పొరేట్ సంస్థకు 2,324 ఎకరాల అడవిని ధారాదత్తం చేసింది. ఈ ‘అభివృద్ధి’ కింద ఒక లక్షా ఇరవై మూడు వేల చెట్లను నరికి వేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదీ చదవండి: మెకంజీ షాక్, ప్రియురాలితో రెండో పెళ్లికిముందే జాగ్రత్తపడుతున్న జెఫ్ బెజోస్నిజానికి ఈ కంపెనీకి ఇక్కడ 2007లోనే ఇరవై సంవ త్సరాల లీజు కింద వెయ్యి ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఆ లీజు వ్యవధిని మరొక ముప్పై సంవత్సరాలు పెంచారు. అంటే ఆ కంపెనీ ఇక్కడి ఖనిజ వనరులను 2057 వరకూ తవ్వుకుపోవచ్చు. అయితే ఆ ప్రాంతంలో ఆదివాసులు తమ ‘జల్, జంగల్, జమీన్’లను కార్పొరేట్లకు ఇవ్వడానికి అంగీకరించబోమని, అలా ఇవ్వడం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో, ‘1996 పంచా యత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం’లో, ‘2006 అటవీ హక్కుల చట్టం’లో ఉన్న నిబంధనలకు వ్యతిరేకమని పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటానికి మావోయిస్టులుఅండగా నిలిచారు. ఆ కారణం వల్లనో, మరే కారణం వల్లనో లాయిడ్ స్టీల్ కంపెనీ 2016 దాకా తవ్వకాలు ప్రారంభించలేకపోయింది. 2016లో తవ్వకాలు ప్రారంభించినప్పటికీ, ఆదివాసుల, మావోయిస్టుల వ్యతిరేకత మరింత క్రియాశీలంగా మారి 2016 డిసెంబర్లో సుర్జాఘర్ గనుల దగ్గర లాయిడ్ కంపెనీకి చెందిన ట్రక్కులను, ఎర్త్ మూవర్లను తగులబెట్టడంతో గనుల తవ్వకం ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఆగిపోయిన గనుల తవ్వకానికి, అదనంగా అక్కడే ఒక శుద్ధి కర్మాగారం పెట్టుకోవడానికి అనుమతు లిచ్చా రన్నమాట. ఆ వార్త కూడా సరిగ్గా మావోయిస్టు కార్యదర్శి చని పోయిన రోజు ప్రకటించారన్నమాట. ఇప్పుడు ఇస్తున్న అనుమ తులకు కాగితం మీద కొన్ని షరతులు ఉన్నమాట నిజమే. ఇక్కడ ఒక లక్షా ఇరవై మూడు వేల చెట్లను నరికినందుకు, 2,400 ఎకరాల అడవిని నాశనం చేసినందుకు, అక్కడి నుంచి వెయ్యి కి.మీ. అవతల అరేబియా సముద్ర తీరంలో చిప్లున్, రత్నగిరి ప్రాంతాల్లో సమానమైన విస్తీర్ణంలో మొక్కలు నాటాలని ఒక షరతు ఉంది. ఇటువంటి అడవిని నరికే అనుమతులు పొందిన వారందరికీ అటువంటి షరతులు ఉండడమూ, వాటిని తుంగలో తొక్కి, భయంకరమైన ఉల్లంఘనలను ఆమోదించడమూ దశాబ్దాలుగా యథావిధిగా జరిగిపోతూనే ఉన్నాయి.ఇలా అడవిని పందారం చెయ్యడం ఆదివాసుల హక్కులకు మాత్రమే కాదు... దేశ సంపదకు, ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు, పర్యావరణానికి, భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదకరం. ఈ గడ్చిరోలి అడవి మహారాష్ట్రలోకి విస్తరించిన దండకారణ్యంలో భాగం.చదవండి: అరుదైన ఆపరేషన్.. మెడలోంచి మెదడులోకి 8 సెం.మీ మేకు!దండకారణ్యం దేశానికే ఊపిరితిత్తుల వంటిది. అక్కడ ఆ సువిశా లమైన, దట్టమైన అరణ్యాలు ఉండడం వల్లనే దేశంలో జీవ వైవిధ్యం మిగిలి ఉంది. అక్కడ పుట్టిన అనేక నదులు దేశంలో, కనీసం మధ్య భారతంలో భూగర్భ జలాలను రక్షిస్తున్నాయి. ఆ అడవి సువిశాల ప్రాంతాలకు ప్రాణవాయువును అందిస్తున్నది. పర్యావరణ రీత్యా ఇంత సుసంపన్నమైన ఈ అడవిలో దాదాపు ముప్పై ఖనిజాలు కోట్లాది టన్నులు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ ఖనిజ నిలువలు దేశ సంపద. దాన్ని పొదుపుగా వాడుకుని, భవిష్యత్త రాలకు అందించడం ఈ తరం బాధ్యత. ఐదేళ్ల కోసం అధికారం పొందినవారు యాభై ఏళ్ల భవిష్యత్తును కార్పొరేట్ లాభాపేక్షకు, ఆశ్రితులకు రాసి ఇస్తున్నారు. ఆ సంపద కొల్లగొట్టడానికి అక్కడి నుంచి ఆదివాసులను ఖాళీ చేయించదలచారు. ఆదివాసులకు మద్దతుగా ఉన్న ఉద్యమకారులను నిర్మూలించ దలచారు. ఆదివాసుల మీద ప్రభుత్వాలు, కార్పొరేట్లు, మైదాన ప్రాంతవాసులు దాడి చేసి జాతులకు జాతులనే అంతరింపజేసిన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంది గనుకనే, భారత రాజ్యాంగం ఐదవ, ఆరవ షెడ్యూళ్లలో ఆ ప్రాంతాలకు, ఆ ప్రాంతాలలోని ఆదివాసులకు ప్రత్యేక రక్షణలు కల్పించింది. ‘పేసా చట్టం –1996’లో, ‘ఎఫ్ఆర్ ఏ చట్టం –2006’లో ఆ రక్షణలను విస్తరించింది. ఇప్పుడు జరుగుతున్న ఈ అడవుల పందారం ఆ చట్టాలన్నిటి ఉల్లంఘన. ఇది కేవలం మావోయిస్టుల సమస్యో, ఆదివాసుల సమస్యో కాదు. ఇది ఈ దేశంలో ప్రతి ఒక్కరి సమస్య. ఈ దేశాన్ని ప్రేమించేవారందరి సమస్య. -ఎన్ వేణుగోపాల్ ‘వీక్షణం’ ఎడిటర్ -
ఏఐకి విరుగుడు సహజ మేధ
మీ వంటింట్లోని పళ్లేలు, గిన్నెలు వాడి వాడి మొహం మొత్తాయా? లేదు కదా! అవి మీకు వారసత్వంగా వచ్చాయి. వాటి మీద ఇప్పటికీ మీ పూర్వీకుల పేర్లు ఉండొచ్చు. ఆ పేర్లు చూసినప్పుడల్లా వారిని స్మరించుకుంటాం. ఆ పాత్రల్లో మన ఆహారపు అల వాట్లు ప్రతిఫలిస్తుంటాయి. ఆ పళ్లేలలో కొన్ని తరాల వారు భోజనాలు చేశారు.ఇత్తడి గ్లాసులు, రాగి పాత్రలు, గరి టెలు, మసిబారిన కళాయిలు, పెనాలు, పింగాణీ పాత్రలు, పలురకాల చాకులు, కొబ్బరి కోరే పరికరాలు, కాఫీ గింజల మరలు, మజ్జిగ చిలికే కవ్వాలు... వీటిని మీరు ఆప్యాయంగా చూడండి.అంతేకానీ పాత ఇనుప సామాను కింద తీసేయకండి. ఇవన్నీ ఇప్పుడు అంతరించిపోతున్న జీవజాలం కోవలోకి చేరుతున్నాయి. ఆధునికమైన విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వచ్చాయి. తరతరాల స్మృతులను మన ముందు నిలిపే మన సాంప్రదాయిక వంటిల్లు మీద ఇవి దాడి చేస్తున్నాయి. పాతవైనా పారేసుకోలేనివి!అలాగే, జీర్ణావస్థకు చేరిన పాత కాటన్ చీరలు, పట్టు చీరలు, ధోతీలు, కుర్తాలు, పైజామాలు, చిల్లులు పడిన స్వెట్టర్లు,మఫ్లర్లు, గ్లవ్స్... వీటిని కూడా పారేయకండి. అన్నీ కాకపోయినా కొన్నింటినైనా దాచుకోండి. అవి పాతబడ్డాయే కానీ చచ్చిపోలేదు. వాటిని మళ్లీ బాగు చేసుకోవచ్చు. దర్జీ ఎక్కడైనా దొరుకుతాడేమో వెతకండి. వాచీలు, టైమ్ పీస్‌లు, గోడ గడియారాలను కాలం కాటేసింది. వీటిని మెయిన్‌టెయిన్ చేయడం కష్టం. ఎందుకంటే రిపేరు వస్తే స్పేర్ పార్టులు దొరకవు. కంటికి దుర్భిణి పెట్టుకుని పెద్ద పళ్ల చక్రాల్లోపల ఉండే చిన్న చిన్నపళ్ల చక్రాలకు మరమ్మతులు చేసే ఈ రిపేరువాలాలు కాలానికి చలనం తెప్పిస్తారు. గడియారాల పాలిట వీరు కంటి ఆపరేషన్లు చేసే వైద్యుల్లాంటి వారు. వీరి నైపుణ్యం గొప్పగా ఉంటుంది. పాత వాచీలు రిపేర్ చేసే ఇలాంటి వారూ ఇప్పుడు కనుమరుగవుతున్నారు.పాతకాలపు గడియారాలకు బదులుగా డిజిటల్ ‘హారర్స్’ వచ్చాయి. ఇవి 8 అనే ఒక్క డిజిటల్ అంకెను రకరకాలుగా మార్చి టైమ్‌ను మన మొహాన కొడతాయి. గంటలకు నిమిషాలకు, నిమిషాలకు సెకన్లకు మధ్య ఒక కోలన్ పెట్టి కాలాన్ని ప్రదర్శిస్తాయి. క్షణం క్షణం మారే ఈ అంకెలు ‘మన టైం దగ్గరపడుతోంద’ని చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.ఇక పుస్తకాలు. పాతబడిన కొద్దీ వాటికి విలువ ఎక్కువ.కారణం – అవి గొప్ప రచయితలవి కావడం మాత్రమే కాదు, వాటిలోని అక్షరాలు చదివిన కళ్లు, వాటి పేజీలు తిప్పిన వేళ్లు ఇప్పుడు లేవు. అసంఖ్యాకులైన వాటి పాఠకులు తమ గుండెల్లో ఆనందా నుభూతిని పదిలపరుచుకుని మరో ప్రపంచానికి వెళ్లిపోయారు. ఈ పుస్తకాలు రద్దీవాలాల చేతికి వెళ్తే రీసైకిల్ అవుతాయి. శాశ్వతంగా అదృశ్యమవుతాయి. అదృష్టం బావుంటే, కొన్ని సెకండ్ హ్యాండ్ బుక్ షాపులకు చేరతాయి. అక్కడ మాత్రం మీ లాంటి పుస్తక ప్రేమికులు వాటి విలువ గుర్తిస్తారు. అరుదైన పుస్తకాలతో వారు తమ బుక్ షెల్ఫ్‌లను నింపేస్తారు.సంగీతానిదీ ఇదే పరిస్థితి. స్లో మూవింగ్ రికార్డులు పోయి ఎల్పీలు వచ్చాయి. వాటి స్థానంలో క్యాసెట్లు, క్యాసెట్లు పోయి సీడీలు ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు ఇవేవీ అక్కర్లేదు. ల్యాప్ టాప్, మొబైల్, లేదంటే బ్లూటూత్ సాధనాలు ఉంటే చాలు. అయితే మీరు పాత పాటల షాపులకు వెళ్లి చూడండి. నిజమైన బీథోవెన్, బాక్, నిజమైన ఆమిర్ ఖాన్, రవిశంకర్, బేగమ్ అఖ్తర్, ఎంఎస్ సుబ్బులక్ష్మి పాటలు, సంగీతం మీకక్కడ దొరుకుతాయి. అందుకే ఈ ఓల్డ్ మ్యూజిక్ స్టోర్స్ అమూల్యమైనవి. మార్కెట్లో బీథోవెన్ లాంటి లేదా అంతకంటే చక్కగా వినిపించే మ్యూజిక్ దొరకవచ్చు. కానీ అది ఒరిజినల్ కాదు. అలాగే, ఎంఎస్ సంగీతం లభిస్తుంది. కానీ అది నైటింగేల్ ఆఫ్ ఇండియాది కాదు కదా!అసలైనది వదులుకోవద్దు!ఈ రియల్, ఒరిజినల్, ట్రూ స్టఫ్కు ఇప్పుడు ఇంట్లో చోటెక్కడుందని మీరు అడగొచ్చు. ఒకప్పుడు మనం అనేక గదుల ఇళ్లలో ఉండేవాళ్లం. క్రమంగా చిన్న కుటుంబాలుగా మారుతూ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్‌కు పరిమితం అవుతున్నాం. నిత్యావసరాలకు అవస రమయ్యే సాధారణ ఉపకరణాలు, ఫర్నిచర్‌కే జాగా లేనప్పుడు, లవ్లీగా ఉన్నాయని చెప్పి ఈ పాత వస్తువులను ఎక్కడ దాచుకోవాలి? ఈ ప్రశ్నలో ఔచిత్యం లేకపోలేదు.ఇక్కడ మీకొక విషయం స్పష్టం చేస్తాను. ఏది ‘రియల్’ అనేది చెప్పడానికే ఇవన్నీ ప్రస్తావించి కొంత ఆలంకారికంగా చెప్పాను. దీనికి ఇంకొక పదం ఉంది. రియల్‌కు బదులు ఆర్గానిక్ అనవచ్చు. ఆర్గానిక్ అనగానే రసాయనాలు వాడకుండా పండించే పళ్లు, కూర గాయలు, తృణధాన్యాలు అనుకుంటారు. నేను వాడుతున్నది ఆ అర్థంలో కాదు. ఏఐ (కృత్రిమ మేధ) యుగంలో ఆర్గానిక్ అంటే ఏమిటనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఏదైతే ఒకరి అంత రాత్మకు వాస్తవం అనిపిస్తుందో అదే ఈ సందర్భంలో ఆర్గానిక్ అవుతుంది. ఈ ఏఐ కాలంలో... ఆర్గానిక్, వాస్తవ, యథార్థ అంశాలే మన ఎంపిక కావాలి. ఏఐతో ఔషధ, విద్యా రంగాల్లో అద్భుత ప్రయోజనాలు ఉన్న మాట నిజమే. అయినా ఏఐ కావాలా, ఏఐ వద్దా అనేది మనం ఎంచుకోవలసి ఉంటుంది. అయితే, అతి తొందర్లోనే ఈ చర్చ కేవలం ఒక విద్యావిషయికమైందిగా మిగిలి పోతుంది. బదులుగా, ఈ ఏఐ కావాలా, ఆ ఏఐ కావాలా అనేదే తేల్చుకోవలసి ఉంటుంది. ఏఐని కొత్త దేవుడు అనుకోనవసరం లేదు; అలాగే అపరిమిత జ్ఞానం కోసం దయ్యానికి ఆత్మను అమ్ముకోవాలేమోనన్న భీతి కూడా అనవసరం. ఏఐని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. మనకు ఏం కావాలో నిర్ణయించే అధికారం ఏఐకి అప్పగించకూడదు. ఏఐ విషయంలో మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. ఆర్గానిక్ వెర్సస్ ఆర్టిఫిషియల్ అనే చర్చ అంతా, మనం ఏఐకి బాస్ గానే కానీ బానిసగా ఉండకూడదన్న అంశం మీదే! ఏఐ మనకు ఏం అందిస్తుందనేదే తప్ప మనం ఏఐకి ఏం సమర్పించుకుంటామన్నది ప్రశ్న కారాదు.యుద్ధంలో ఏఐ సునాయాసంగా మూకుమ్మడి విధ్వంసం సృష్టించగలదు. ఈ ప్రళయాన్ని ఎంచుకునే స్వేచ్ఛను మనం ఏఐకి ఇస్తామా? లేదా ఇలాంటి సామూహిక ఆత్మహత్యా సదృశ నిర్ణయం తీసుకోకుండా అడ్డుకునే ఛాయిస్ మన ఆర్గానిక్ మేధకే ఉంటుందా? ఇదే ప్రధానం.ఆర్టిఫిషియల్‌గా ఉండటం మేధ. ఆర్గానిక్‌గా ఉండటం విజ్ఞత. మనం ఆహారం తినాలి గానీ ఆహారం లాంటిది కాదన్న, అసలైన పానీయాన్నే డ్రింక్ చేయాలి గానీ నురగను కాదన్న వివేచన కలిగి ఉండటమే ఆర్గానిక్ ఇంటెలిజన్స్.కృత్రిమ మేధ యుగంలో సహజ మేధతో ఉండటమంటే... మనం చూడని, మనకు తెలియని, మనం ఎంతమాత్రం అదుపు చేయలేని యంత్రం ముందు మోకరిల్లి, అది చెప్పినట్లు ఆడటం కాదు; మనం ఏం చేయాలో ఎంచుకునే అధికారం మనకు ఉండి తీరాలి! గోపాలకృష్ణ గాంధీ వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, ఆధునిక భారత చరిత్ర విద్యార్థి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఇది గ్రహణమే!
కొద్ది దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ పార్టీలకు గ్రహణం పట్టింది. వాటి ప్రాభవం గణనీయంగా తగ్గింది. దేశంలోని అనేక చోట్ల ప్రజానీకానికి కమ్యూనిస్టు పార్టీ అంటే ఏమిటో తెలియని స్థితి నెలకొంది. కమ్యూనిస్టు పార్టీలు ‘కాలం చెల్లిన’ సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతుండటమే దీనికి కారణం అనేవారు మొదలు కొని... అసలు కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, తాము కూడా, తాము నిత్యం విమర్శించే బూర్జువా పార్టీల లాగే తయారవ్వడం వల్లనే, వాటికి ఈ పరిస్థితి దాపురించిందని రకరకాల విమర్శలు ఉన్నాయి. పునాది లేకుండా పోయింది!కమ్యూనిస్టు పార్టీల అస్తిత్వానికీ, మనుగడకూ అనివార్యం అయిన ప్రాథ మిక పునాదులు నేటి సమాజంలో లేకుండా పోయాయన్నది గమనార్హం. కమ్యూనిస్టు పార్టీల అస్తిత్వానికి పునాది – వర్గ పోరాటాలు. కార్మికులు, యజమానులు అనే పరస్పరాభిముఖాలైన రెండు వర్గాలు ఉండటం, వారి మధ్యన పెట్టుబడి, శ్రమల ద్వారా సృష్టించబడిన సంపద తాలూకు పంపిణీలో ఏర్పడే ఘర్షణలు... ఇదీ సూక్ష్మంగా కమ్యూనిజానికీ, కమ్యూనిస్టు పార్టీలకూ ఆస్కారం కల్పించే నేపథ్యం. ఒక పారిశ్రామిక సంస్థలోనో, సేవారంగపు కార్యాలయంలోనో శారీరక లేదా మేధాశ్రమతో సృష్టించబడిన సంపదలోని సింహభాగాన్ని ఆ సంస్థ యజమాని నొల్లుకోవడం, పెట్టుబడిదారీ వ్యవస్థలో సహజంగా జరిగే పరిణామం. అంటే, పరిశ్రమలో ఒక కార్మికుడు 8 గంటల పాటు శ్రమ చేయడం ద్వారా సృష్టించిన సంపదలోని కొంత వాటాను మాత్రమే (ఉదాహరణకు: 4 గంటల శ్రమ ఫలితం మేరన మాత్రమే) కార్మికుడికి వేతనంగా ఇచ్చి, మిగతా శ్రమ ఫలితాన్ని (దీనినే ‘అదనపు విలువ’ అని పిలుస్తారు) యజమాని సొంతం చేసుకోవడమే కమ్యూనిజం చెప్పే శ్రమ దోపిడీ సారాంశం! తన శ్రమ ఫలితాన్ని కొల్లగొడుతూ రోజు రోజుకూ మరింత ధనవంతుడవుతోన్న యజమాని పట్ల కార్మికులకు సహజంగానే ద్వేషభావం ఏర్పడుతుంది. ఈ ద్వేష భావమే వర్గ పోరాటాలకు ప్రేరణ. వర్గ రహిత సమాజ ఆలోచనకు చోదక శక్తి.కొన్ని దశాబ్దాలుగా ఈ పెట్టుబడిదారీ పునాది లోనే మార్పు వచ్చింది. పారిశ్రామిక, సేవా రంగాల ఉత్పాదక శ్రమ... తద్వారా సంపద సృష్టి స్థానంలో ఎటువంటి ఉత్పత్తికీ స్థానం లేని ఫైనాన్స్ పెట్టుబడుల యుగం నేడు ప్రధాన స్రవంతిగా నడుస్తోంది. ఈ ఫైనాన్స్ ఆధారిత రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లలో... ఉత్పత్తి రంగాలలో చూసే శ్రమ దోపిడీ, అదనపు విలువ వంటివి కనపడవు. అంటే, యజమాని–కార్మి కుడి సంబంధాలు... దాని ఫలితంగా ఏర్పడే దోపిడీ భావన... వర్గ పోరాటాలు... ఈ రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల వంటి స్పెక్యులేటివ్ రంగాలలో పాత్ర పోషించవు. సూక్ష్మంగా చెప్పాలంటే ఇక్కడ వర్గ పోరాటానికి చోదక శక్తిగా ఉండే వర్గాల మధ్య ద్వేష భావనకు స్థానం లేకుండా పోయింది. దాని స్థానంలో ఫైనాన్స్ పెట్టుబడుల ఈజీ మనీ యుగం పేదలు, ధనికుల మధ్య పోల్చి చూసుకోవడాన్నీ, ఈర్ష్యనూ తెచ్చి పెట్టింది. అంటే, నేటి ఈ రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ ఆధిపత్య యుగంలో – పేదలు (‘శ్రామి కులు’) ధనికులతో పోల్చి చూసుకుంటున్నారు. ఈ యుగం లక్షణం వర్గ పోరాటం ద్వారా హక్కుల సాధనో, సోషలిజం నిర్మాణమో కాదు. ధనవంతుడిని అనుకరించడం, అతని నమూనాని ఆరాధించడం, ఎలాగైనా తాను కూడా ఆ స్థానాన్ని చేరుకోవడం! ఈ క్రమంలోనే వర్గ పోరాటాలు, సోషలిజం లక్ష్యంగా గల కమ్యూనిస్టు ఉద్యమాలకు గ్రహణం పట్టింది. దీనితో పాటుగా తెలుగు రాష్ట్రాలలో వచ్చిన సాఫ్ట్వేర్ రంగ ‘విప్లవ’ ఫలితంగా మన యువతీ యువకులకు అమెరికా ఒక అంతిమ డెస్టినేషన్ గా మారింది. మన పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాలు అమెరికా డాలర్ల ప్రవాహంలో మునిగి తేలుతున్నాయి. ఫలితంగా, కమ్యూనిస్టు సిద్ధాంతానికి గుండెకాయ వంటి సామ్రాజ్య వాద వ్యతిరేక భావన అంతరించింది. మొత్తంగా మధ్యతరగతి వర్గం, నయా మధ్యతరగతి వర్గాలకు కమ్యూనిజం అనేది ఒక ఉబుసుపోని కబురుగా మిగిలిపోయింది. తమ తల్లిదండ్రులు, తాత ముత్తాతల పాత కాలం వాసనగా తయారయ్యింది. అదీ విషయం! మళ్లీ తెర లేస్తోంది!ఇదే క్రమంలో సోవియట్ పతనం కూడా దీనికి అదనపు జోడింపై, ఉన్న కాస్తపాటి కమ్యూనిస్టు పార్టీలలో కూడా నైతిక శక్తి, సైద్ధాంతిక బలం నిర్జీవం అయిపోయి రంగు, రుచి, వాసనలను కోల్పో యాయి. ఫలితంగా అవి ఏ సైద్ధాంతిక నిబద్ధతా లేని కొద్దిపాటి మంది అవకాశవాద నాయకుల సమూ హంగానో, లేకుంటే మరేం చెయ్యాలో తెలియక ఎర్ర జెండా కప్పించుకొని చనిపోతే చాలు అనుకునే దుర్భల మనఃస్థితిలో జీవిస్తోన్న మానసిక దౌర్బల్యపరులతోనో నిండిపోయాయి. ఇక్కడ గమనించవలసినది 3, 4 దశాబ్దాల గ్రహణ కాలం నేడు అంతిమ దశకు చేరింది. ఫైనాన్స్ పెట్టుబడుల యుగం దాని చరమాంకానికి చేరుతోంది. పెట్టుబడిదారీ దేశాలు మరెంత మాత్రమూ, మరింతగా కరెన్సీలను ముద్రించి వ్యవస్థలను కాపాడుకొనే అవకాశం లేకుండా పోతోంది. నిరంతరంగా ముద్రించబడిన డబ్బుల ప్రవాహం వలన ఏర్పడిన రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ బుడగలు బద్దలైపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగానే రియల్ ఎస్టేట్ రంగం పతనం, షేర్ మార్కెట్లలో సంక్షోభాలు నేటి సర్వసాధారణ లక్షణాలుగా ఉన్నాయి. ఆర్థిక మాంద్య వాతావరణం ప్రపంచాన్ని కమ్ముకుంటోంది. దీనినంతటినీ మించి ఈ 3, 4 దశాబ్దాల ఫైనాన్స్ వికృత క్రీడకు కేంద్రబిందువయిన అమెరికా పెట్టుబడి దారీ వ్యవస్థ నేడు సంక్షోభాలతో సతమతమవుతోంది. కథ కొలిక్కి వస్తోంది.ఫైనాన్స్ యుగం గ్రహణం వీడి, పేద–ధనిక వర్గ పోరాటాల యుగానికి నేడు మరలా వేగంగా తెర లేస్తోంది. డాలర్ డ్రీమ్స్ ముగింపులో మరో కొత్త బంగారు లోకం తాలూకు లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టన్నెల్ మిలమిలా మెరుస్తూ కనబడుతోంది. ఈసారి ఈ గ్రేట్ మార్చ్ ప్రపంచాన్ని సోషలిస్ట్ మహా యుగం దిశగా నడిపించబోతోంది. వింటున్నారా కామ్రేడ్స్! మేం మళ్ళీ వస్తామన్న మాట నిలబెట్టు కోవడం ఇక మీ వంతు. లాల్ సలామ్!డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు ‘ 98661 79615 -
ప్రాథమిక హక్కుల రక్షణ కోర్టు బాధ్యత
‘ఒక వ్యక్తి వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా మందికి నచ్చనప్పటికీ ఆ అభిప్రాయాలు వ్యక్తీకరించే వ్యక్తి హక్కులను గౌరవించాలి. అంతేకాదు రక్షించాలి.’ ‘ఏ ఖూన్ కే ప్యాసే బాత్ సునో’ అన్న జీవిత నేపథ్యం కలిగివున్న ఒక వీడియో క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినందుకుగాను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గఢీపై గుజ రాత్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్.ను గత మార్చి 28వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేస్తూ అన్న మాటలు అవి. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ప్రతాప్ గఢీ దాఖలు చేసిన పిటీషన్‌ను అనుమతిస్తూ... ‘ఆ పోస్ట్ ప్రచురించడం వల్ల ఎలాంటి నేరం జరగలే’దని పేర్కొంది. భావప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తీకరణ స్వేచ్ఛలను రక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద, పోలీసుల మీద ఉందని కోర్టు నొక్కి చెప్పింది.గతంలో భారత రాజ్యాంగ సభలో కమ్యూ నిస్ట్ పార్టీ ప్రతినిధిగా ఉన్న సోమ్‌నాథ్ లహరి ‘ప్రాథమిక హక్కుల అధ్యాయం ఒక పోలీస్ కాని స్టేబుల్ దృక్కోణం నుండి రూపొందించి నట్టు అనిపిస్తుం’దని వ్యాఖ్యానించారు. ఈ హక్కుల వినియోగం చట్టబద్ధమైనదా కాదా అన్నది నిర్ణ యించేది పోలీసులే అని ఆయన అన్నారు. ఈ అభిప్రా యంతో మనం ఏకీభవించకపోవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులను చూస్తే ఆయన వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి.ఇమ్రాన్ ప్రతాప్ గఢీపై 2024 డిసెంబర్లో ఓ క్రిమినల్ కేసును పోలీసులు నమోదు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు 2025 మార్చిలో కొట్టివేసింది. ఒక సామూహిక వివాహ కార్యక్రమం వీడియోను ఇమ్రాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచురించారు. ఆ వీడియో నేపథ్యంలో అతను రాసిన కవిత చది వారు. ఈ కవిత వివిధ వర్గాల ప్రజలను రెచ్చ గొట్టే విధంగా ఉందనీ, వారి మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని రేపేదిగా ఉందనీ ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. అందుకని ఆయనపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 196, 197 (1), 302, 299, 57, 3 (5) కింద కేసును నమోదు చేశారు. అంటే ప్రజా సమూహాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని కలిగించే చర్యలను, జాతీయ సమైక్య తకు భంగం కలిగించే చర్యలనీ; మత విశ్వా సాలను అవమానించడం, గాయపరచడం చేస్తుందనీ ప్రథమ సమాచార నివేదికలో ఆరోపించారు. ఈ ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ హైకోర్టులో దర ఖాస్తుని దాఖలు చేశారు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని హైకోర్టు పేర్కొంటూ దర ఖాస్తును కొట్టివేసింది. గుజరాత్ హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టివేయడాన్ని విమర్శిస్తూ సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది: ‘‘భారత రాజ్యాంగం అభయం ఇచ్చిన ప్రాథమిక హక్కు లను బలపరచడం, అమలు చేయడం కోర్టుల విధి. వాళ్ళు మాట్లాడిన మాటలు, రాసిన రాతలు న్యాయమూర్తులమైన మనకు నచ్చకపోవచ్చు. అయినప్పటికీ ఆర్టికల్ 19 (1) అభయం ఇచ్చిన భావ ప్రకటన, వ్యక్తీకరణ హక్కులను కాపాడా ల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ఆదర్శాలను నిలబెట్టాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీద ఉంది. ప్రాథమిక హక్కులను కాపాడటం కోర్టుల విధి... ఈ హక్కులు ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అతి ముఖ్యమైన హక్కులు.’’ఇక పోలీసుల నిర్వాకాన్నీ కోర్టు గర్హించింది. ‘‘పోలీసు అధికారి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగ ఆదర్శాలను గౌరవించాలి... దేశ పౌరులందరూ భావప్రకటనా స్వేచ్ఛను కలిగి వున్నారు. అది మన రాజ్యాంగ ఆదర్శాలలో ఒకటి. పోలీసులు కూడా దేశ ప్రజలే. వారు కూడా రాజ్యాంగానికి, అందులోని హక్కులకు కట్టుబడి ఉండాలి. ఇమ్రాన్ రాసిన కవిత ఏ మతాన్ని, కులాన్ని, భాషను ప్రస్తావించదు. ఏ మతానికి చెందిన వ్యక్తులను కూడా కవిత ప్రస్తావించదు. ఏ రకంగా చూసినా గ్రూపుల మధ్య శత్రుభావాన్ని ఈ కవిత కలిగించదు. జాతీయ ఐక్యతకి అవి ఎలా హాని కలిగిస్తాయో అర్థం కాదు’’ అని కోర్టు అభిప్రాయపడింది.నేర సమాచారం రాగానే కానిస్టేబుల్ కేసు నమోదు చేయాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెబుతుంది. ప్రాథమిక విచారణను చేయడానికి వెసులుబాటును ‘భారతీయ నాగరిక సురక్షా సంహిత’ కల్పించింది. ఈ కేసులో ప్రాథమిక విచారణ కూడా అవసరం లేదు. గుర్తించదగిన నేరమే జరగనప్పుడు ప్రాథమిక విచారణ అవసరం లేదు. సాహిత్యం, కళలు మన జీవితాలను అర్థవంతం చేస్తాయి. భావప్రకటనా స్వేచ్ఛ గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తుంది. ఇదే ఇమ్రాన్ ప్రతాపగఢీ కేసులో సుప్రీం తీర్పు సారాంశం.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త గతంలో జిల్లా సెషన్స్ జడ్జి -
విరమణే సరా?
గణనీయంగా బలహీనపడటంతో పాటు దారీతెన్నూ లేకుండా సాగుతున్న నక్సలైట్ ఉద్యమం గురించిన చర్చలు ‘ఆపరేషన్ కగార్’ కన్నా కొన్నేళ్ల ముందు నుంచే జరుగుతున్నాయి. అందుకు కారణాలు రెండు. ఒకటి – నక్సలిజం పట్ల గత కాంగ్రెస్ ప్రభుత్వాల కన్నా మౌలికంగానే భిన్నమైన విధానం గల బీజేపీ అధికారానికి వచ్చింది. రెండు – యథాతథంగా ఆ ఉద్యమం బలహీనపడటం 1990ల నాటికి మొదలై, 2010లు వచ్చేసరికి బాగా పెరిగింది. ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటున్నది. నక్సలైట్ ఉద్యమకారుల త్యాగాలు వృథా ప్రయాసగా మారుతున్నాయన్న భావనలు సాధారణ సమాజంతోపాటు, వారిపట్ల ఏదో ఒక మేర సానుభూతిగల వర్గాలలోనూ కొంతకాలం నుంచి ఉండగా, ఇటీవల పెరిగాయి. ఈ అభిప్రాయాలన్నింటి సారాంశం, ఉద్యమం ఇక ముందుకు సాగే అవకాశం లేదు గనుక విరమించుకోవటం మంచిదని!తగ్గిన జనాదరణదేశం దశాబ్దాల తరబడి ఉద్యమించి 1947లో స్వాతంత్య్రాన్ని సాధించుకోగా, 20 ఏళ్లు గడిచేసరికి దేశంలో వేర్వేరు వర్గాల అసంతృప్తి, అశాంతి, అందులో భాగంగా నక్సలైట్ ఉద్యమం ఎందుకు మొదలైనట్లు? అది బలహీనపడినప్పటికీ 55 ఏళ్లు గడిచినా ఎందుకు కొనసాగుతున్నట్లు? అనే చర్చ ఎట్లున్నా, అది మరెంతో కాలం సాగే అవకాశాలు లేవన్నది స్పష్టం. అందుకు కారణాలు అనేకం. స్వీయ లోపాల వల్ల, ప్రభుత్వ అణచివేతల కారణంగా ఉద్యమం బలహీనపడింది. స్వీయ లోపాలు అనేవి సైద్ధాంతికమైనవి, నాయకత్వపరమైనవి, వ్యూహాలూ, ఎత్తుగడలకు సంబంధించినవి, ప్రజాదరణతో నిమిత్తం గలవి. ఈ నాలుగింటిని నక్సలైట్లు సరిదిద్దుకొని తేరుకోగల సూచనలు ఎంతమాత్రం కనిపించటం లేదు. వీటిలో ప్రజాదరణ అన్నింటి కన్న కీలకమైనది. అది ఉన్నట్లయితే తక్కిన మూడింటిలో కొన్ని లోటుపాట్లు ఉన్నా ముందుకు పోగలరు. ఈ సూత్రం ఏ ఉద్యమానికైనా, ఏ సాధారణ రాజకీయ పార్టీకైనా వర్తిస్తుంది.నక్సలైట్లు తొలి దశాబ్దాలలో ఉండిన ప్రజాదర ణను మలి దశాబ్దాలు వస్తుండగా కోల్పోవటం మొద లైంది. అందుకు కారణాలు అనేకం. కొన్ని ప్రభుత్వ అణచివేతలు, దానితోపాటు అభివృద్ధి–సంక్షేమ కార్య క్రమాలలో ఉన్నాయి. మరికొన్ని సమాజం వైపునుంచి. అవి – కొత్త తరాలు ఉనికిలోకి రావటం, వారి ఆలోచనలూ, కోరికలూ, వ్యవహరణా శైలి కొత్తది కావటం, తమ తల్లిదండ్రులు అనుభవించిన స్థాయి పేదరికానికి గురికాక పోవటం, వ్యవసాయ సంక్షోభా లతో నిమిత్తం లేకపోవటం, గ్రామాలతో సంబంధాలు తగ్గి పట్టణీకరణలూ ఆధునికీకరణలలోకి ప్రవేశిస్తుండటం వంటివి కొత్త సామాజిక మార్పులయ్యాయి. పాత తరాలకు కూడా నక్సలిజం పట్ల ఉండిన గురి వివిధ కారణాల వల్ల తగ్గటం మొదలైంది.పోతే, అణచివేతలు, వాటిని తట్టుకోలేక పోవ టాలు, కలిగే నష్టాలను ఒకప్పటి వలె పూడ్చుకోలేక పోవటాలు సరేసరి కాగా, ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ చర్యల ప్రభావాలు కూడా ఉన్నమాట నిజం. విరమిస్తే ఏం చేయొచ్చు?నక్సలైట్ ఉద్యమం మొదలైన తర్వాత ఆ తొలి దశాబ్దాల ఉధృతి, మలి దశాబ్దాల బలహీనతల దశకు చివరన చెప్పుకోవలసింది ఏమంటే, ఒకవైపు ఉద్య మానికి ఆ పరిస్థితులలో ముందుకు పోవటం ఎట్లా గన్న సైద్ధాంతిక స్పష్టత లేకపోయింది. ప్రజలను, వారి భాగస్వామ్యం కేంద్రంగా చేసుకుని ఉద్యమ నిర్మాణానికి బదులు మిలిటరిజానికి పెద్దపీట అయింది. దాని నష్టాలు, సమస్యలు దానివయ్యాయి. ఆ దశకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాలు ద్వంద్వ వ్యూహం అనుసరించి విజయవంతమయ్యాయి. నక్సలిజాన్ని తీవ్రంగా అణచివేస్తూనే, అది కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, అభివృద్ధి సమస్య కూడానని చెప్పటం విధానం అయింది. ఆ రెండు విధాల చర్యలు వ్యూహంగా మారాయి. వాటి ఫలితంగా ఉద్యమం దెబ్బతింటుండగా, ఉద్యమా నికి మైదాన ప్రాంతాల ప్రజలు, బీసీ, ఎస్సీలు దూరం కాసాగారు. ఆర్థిక మార్పులతో కొత్త తరాల దృక్పథం మారి వారు దూరమయ్యారు. పలు ప్రాంతాలలో గిరిజన శ్రేణులు కూడా! బీజేపీ అధికారానికి వచ్చే సరికే సమాజ వర్గాలకు, ఉద్యమానికి సంబంధించి ఈ మార్పులు స్థిరపడుతుండగా, కొత్త అధికార పార్టీ కొత్త విధానాన్ని ముందుకు తేవటం మొదలు పెట్టింది. సామాజిక దృష్టికి కాంగ్రెస్ తరహాలో నటనా పరంగానైనా చోటు లేకపోయింది. ఉద్యమం విషయానికి వస్తే, వర్తమాన స్థితిని, భవిష్యత్ అవకాశాలను లేదా అవకాశ రాహిత్యాన్ని, వీటన్నింటితోపాటు మొదట చెప్పుకున్న విధంగా వ్యక్తమవుతున్న విస్తృతాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు నక్సలైట్ నాయకత్వం ఉద్యమ విరమణను ప్రకటించటమే సరైనదిగా తోస్తుంది. నిర్ణయం తేలిక కాదు. ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడైనా కష్టమైనవే. కానీ పరిస్థితులనుబట్టి తప్పనివి. సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవటం వల్ల ఎదురయ్యే నష్టాలు మరింతగా ఉంటాయి. తమతోపాటు ప్రజలకు కూడా! శాంతి చర్చలని ప్రాథేయపడిన స్థాయిలో ఇంతగా విజ్ఞప్తులు చేయటమే ఉద్యమం ఎన్నడూ లేనంత బలహీనపడినట్లు చెప్తున్నది. చర్చలని పౌరసమాజం నుంచి మాట్లాడు తున్నవారు ఎంత సహేతుక కారణాలు, తర్కాలు చెబుతున్నా ప్రభుత్వం అణుమాత్రం సడలింపు చూపకపోవటం కనిపిస్తున్నదే! ఒకవేళ ఉద్యమ విరమణ జరిగినట్లయితే అనంతరం ఏమి చేయాలన్నది వేరే విషయం. ప్రధాన స్రవంతిలో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి సాధారణ ప్రజా ఉద్యమాలు జరపాలనీ, ఇప్పటికే గల వామపక్షాలతో కలిసి పని చేయాలనీ, ఎన్నికలలో పోటీ చేయాలనీ, ఇవేవీ కావనుకుంటే తమకు తోచిన ప్రజాస్వామిక మార్గాలను అనుసరించవచ్చుననే సూచనలు వస్తున్నాయి. సమాజంలో సమస్యలు కొల్లలుగా ఉన్నాయనీ, ప్రజలలో అసంతృప్తి తక్కువ కాదనీ, వివిధ పార్టీ ప్రభుత్వాలే గాక ప్రతిపక్షాల వైఫల్యాలు అనేకం కనిపిస్తున్నాయనీ, కనుక వాటి ఆధారంగా, ప్రజాస్వామిక వ్యవస్థ కల్పించే అవకాశాలను వినియోగించుకుని కృషి చేయవచ్చుననీ పలువురి నుంచి వినవస్తున్న సలహా. నక్సలైట్ నాయకత్వం తన విజ్ఞతతో ఏ నిర్ణయం తీసుకోగలదో చూడాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నవ రాయ్‌పూర్ దారిలో అమరావతి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మే 22న నిర్వహించిన ప్రెస్ మీట్లో అమరావతి పేరుతో జరుగు తున్న ఆర్థిక దోపిడీని ఆధా రాలతో సహా వివరించారు. ఇప్పటి వరకూ రాజధానిగా ఎటువంటి చట్టబద్ధత లేని అమరావతి పేరుతో చంద్రబాబు సుమారు రూ. ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు. దీని నిర్మాణానికి ఒక్క పైసా కూడా అవసరం లేదనీ, ఇదో సెల్ఫ్ ఫైనాన్స్స ప్రాజెక్టు అంటూ ఒకవైపు ప్రచారం చేస్తూనే మరో వైపు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు, జర్మన్ బ్యాంకు నుంచి రూ. 5 వేల కోట్లు, సీఆర్డీఏ బాండ్ల జారీ ద్వారా 21 వేల కోట్లు అప్పులు చేసి అమరావతికి ఖర్చు చేస్తున్నారు. ఏడాది బడ్జెట్లో అమరావతి కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించారు. దీనికి తోడు అమరావతి కోసం మరో 50 వేల ఎకరాలు సమీకరించబోతు న్నామనీ, దానికి మరో రూ. 77 వేల కోట్లు అవసర మవుతాయనీ ఆర్థిక సంఘానికి తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది, పన్నుల రాబడులు తగ్గాయి. ఏడాది కాలంలోనే లక్షా 50 వేల కోట్ల రూపాయల రుణాలు చేసి దేశంలోనే అప్పుల్లో అగ్రస్థానంలో ఏపీని నిలిపారు బాబు. అమరా వతిలో ఇప్పటికీ భూ సమీకరణ పూర్తి చేయలేక పోయారు. రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారంటూ ఇప్పటికీ తప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఇంకా 20 శాతం మంది రైతులు తమ భూములను సీఆర్డీఏకు అప్పగించి రిటర్నబుల్ ప్లాట్స్ పొందలేదు. రాష్ట్రం ఏమైపోయినా సరే తాము మాత్రం అమరావతిపై లక్షల కోట్లు కుమ్మరిస్తామంటున్నారు.ఒక రాజధాని నగరాన్ని నిర్మించడం ఎంత కష్టమో ‘అటల్ నగర్– నవ రాయ్‌పూర్’ను చూస్తే అర్థమవుతుంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2006 నుంచి 20 వేల ఎకరాల్లో ఈ నగరాన్ని నిర్మించడానికి ఆప సోపాలు పడుతోంది. 41 గ్రామాల నుంచి సేకరించిన ఈ భూమిలో నిర్మాణాలు ప్రారంభించి 19 ఏళ్లయినా ఇప్పటికీ నగర నిర్మాణం పూర్తి కాలేదు. చంద్రబాబు మాత్రం లక్ష ఎకరాల్లో మహా నగరం నిర్మిస్తానంటూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా అటల్ నగర్ నిర్మాణ విషయంలో ఎంతో ఆర్భాటం చేసింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ అనీ, దేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ఆరో నగరమనీ, దేశంలో మొదటి జీరో వాటర్ డిశ్చార్జ్ సిటీ అనీ, 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తామనీ ప్రచారం చేశారు. చిన్న పిల్లలకు ఉచితంగా చికిత్స అందించే దేశంలోని అతిపెద్ద శ్రీసత్యసాయి సంజీవిని ఆస్పత్రి, ప్రపంచంలో నాల్గో అతి పెద్ద క్రికెట్ స్టేడియం, నాలుగు జాతీయ విద్యా సంస్థలు, పది కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్ పోర్ట్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్, జెమ్స్ అండ్ జ్యూయలరీ సెంటర్, జూ, సఫారీ, గోల్ఫ్ విలేజ్, మ్యూజియం, బొటానికల్ గార్డెన్ , ఫిల్మ్ సిటీ, 5 స్టార్ హోటల్స్ ఏర్పాటు చేశారు. ఇన్ని ఏర్పాటు చేశామని చెబు తున్నప్పటికీ ఇది ఒక ఘోస్ట్ సిటీగా మారింది. 5.36 లక్షల జనాభా అవసరాల కోసం నిర్మించిన ఈ నగరంలో ప్రస్తుతం రెండు లక్షల 50 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. నగర జనాభా 5.36 లక్షలకు చేరాలంటే 2031 వరకూ వేచి చూడాల్సిందే అంటున్నారు నయా రాయ్‌పూర్ డెవలప్మెంట్ అధారిటీ అధికారులు.ఎంత ప్రచారం చేసినా, ఎన్ని సదుపాయాలు కల్పించినా, అనేక రాయితీలు ప్రకటించినా నవ రాయ్‌పూర్‌కు పెట్టుబడులు రావడం లేదు, ఉపాధి కల్పన లేదు. ప్రజలు కూడా ఇక్కడ స్థిరపడటానికి ఆసక్తి చూపడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదు. 2022–23 లెక్కల ప్రకారం విజయవాడ, గుంటూరు నగరాల జీడీపీ విలువ రూ. 1,467 కోట్లు కాగా, విశాఖపట్నం జీడీపీ విలువ రూ.1,867 కోట్లు. వేలాది కోట్ల వ్యయంతో నిర్మించిన నవరాయ్‌పూర్ జీడీపీ కేవలం రూ. 270 కోట్లు. పక్కనే ఉన్న రాయ్‌పూర్ జీడీపీ రూ. 750 కోట్లు. నగర నిర్మాణం పేరుతో చేసిన అప్పులు తీర్చడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తంటాలు పడుతోంది.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల 16వ ఫైనాన్స్ కమిషన్ సభ్యులను కలిసి రూ.4,131 కోట్లు ప్రత్యేక గ్రాంట్‌గా ఇవ్వాలని కోరారు. నూతన నగరాలను నిర్మించాలనుకునే వారికి ఇది ఒక హెచ్చరిక. నగర నిర్మాణాల ద్వారా సంపదను సృíష్టించవచ్చని చంద్ర బాబు అంటున్నారు. ఇది నిజం కాదని నవ రాయ్ పూర్ రుజువు చేస్తోంది. అంతే కాదు, చైనాలో కొత్తగా నిర్మించిన అనేక నగరాలు, మలేషియా నిర్మించిన ఫారెస్ట్ సిటీ, పరిపాలనా నగరం ‘పుత్రజయ’ కూడా నిర్మానుష్య నగరాలుగా మారాయి. ఈ నగరాలు సంపద సృష్టించకపోగా అప్పులు, నిరర్థక ఆస్తులు మిగి ల్చాయి. ఇదే పరిస్థితి అమరావతికి ఏర్పడినా ఆశ్చర్య పోనక్కర లేదు!వి.వి.ఆర్. కృష్ణంరాజువ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ప్రెసిడెంట్ ‘ 89859 41411 -
గూగుల్ నిర్ణయంతో పిల్లలకు చేటు?
కృత్రిమ మేధ... ఎటు చూసినా ఇదే హాట్‌టాపిక్. అయితే ఈ అత్యాధునిక టెక్నాలజీని పిల్ల లకూ చేరువ చేసేందుకు గూగుల్ చేస్తున్న ప్రయత్నం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కృత్రిమ మేధ ఛాట్‌బోట్ ‘జెమి నీ’ని 13 ఏళ్ల కంటే తక్కువ వయసు వారికీ అందుబాటు లోకి తెస్తున్నట్లు గూగుల్ ఇటీవలే ప్రకటించింది. మొదట అమెరికా, కెనడాల్లో ప్రవేశపెట్టి ఈ ఏడాది చివరికి ఆస్ట్రేలియాలోనూ లాంచ్ చేయనున్నట్లు సమా చారం. గూగుల్ ఫ్యామిలీ లింక్ అకౌంట్లు ఉన్న వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ పరిణామం ఏమంత మంచిది కాదని అనిపిస్తోంది. సోషల్ మీడియా వాడకంపై పిల్లలకు నిషేధం ఉన్నా వారిని సురక్షితంగా ఉంచేందుకు ఎన్ని పాట్లు పడాలో ఈ నిర్ణయం హైలైట్ చేస్తోంది. బహుశా దీన్ని ముందుగా గూగుల్ లాంటి పెద్ద కంపెనీల్లో వెంటనే అమలు చేసి చూడటమే మేలేమో!పదమూడేళ్ల లోపు పిల్లలకు అందబాటులోకి తెస్తున్న కృత్రిమ మేధ ఛాట్‌బోట్ ‘జెమినీ’ వాడకంపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉంటుందని గూగుల్ చెబు తోంది. ఫ్యామిలీ లింక్ అకౌంట్ల ద్వారా పిల్లలు ఏయే అప్లికేషన్లు వాడవచ్చో నిర్ణయించవచ్చు. పిల్లల పేరుతో అకౌంట్‌ను సృష్టించేందుకు తల్లిదండ్రులు పిల్లాడి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాస్తా వారి వ్యక్తిగత గోప్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకా శాలున్నాయి. అయితే పిల్లల వాడకానికి సంబంధించిన సమాచారాన్ని ఏఐ వ్యవస్థల శిక్షణకు వాడుకోబోమని స్పష్టం చేస్తోంది. ఛాట్‌బోట్ డీఫాల్ట్‌గా అందుబాటులో ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు నియంత్రణ కోసం కొన్ని ఫీచర్లను స్విచ్చాఫ్ చేయాలి. ఈ వ్యవస్థ తప్పులు చేసేందుకు అవకాశముందని అంగీకరిస్తోంది కాబట్టి ఇది అందించే సమాచారం నాణ్యత, విశ్వసనీయత ఎంత అన్నది ప్రశ్నార్థకం. కొన్నిసార్లు ఛాట్ బోట్లు కొన్ని సమాధానాలను ఊహించుకుని చెబుతూంటాయి. టెక్ పరిభాషలో దీన్ని ‘హెలూసినేషన్ ’ అంటూంటారు. పిల్లలు ఒకవేళ తమ హోంవర్క్ కోసం ఈ ఛాట్‌బోట్‌ను వాడుతూంటే.. అందులో వాస్తవాలు ఎన్నో... ఛాట్ బోట్ తాలూకూ భ్రాంతి, భ్రమ ఎంతో తెలియకుండా పోతుంది. గూగుల్, ఇతర సెర్చ్ ఇంజిన్లు తమంతట తాము ఒక స్పందన ఇవ్వకుండా... ఆ యా అంశాలకు సంబంధించిన వేర్వేరు సమాచారాలను మీ ముందు ఉంచు తాయి. వాటిల్లో వార్తలుంటాయి. ఫీచర్ కథనాలుంటాయి. విద్యార్థులు ఎవరైనా వీటిని చదివి అర్థం చేసుకుని తమ హోం వర్క్‌లను చేసుకోవచ్చు. అయితే ఏఐ టూల్స్ ఇలా కాదు. అందుబాటులో ఉన్న సమా చారంలో ఒక ప్యాటర్న్ కోసం వెతుకుతాయి. వాటి ఆధారంగా సమాధానాలను సృష్టిస్తాయి. లేదా చిత్రాన్ని తయారు చేస్తాయి. ఇవన్నీ మనం అందించే ప్రశ్న అంటే ప్రాంప్ట్ ఆధారంగా జరుగుతాయి. ఉదాహరణకు... ఒక కుర్రాడు పిల్లి బొమ్మ గీయమని అడిగాడని అనుకుందాం. అప్పుడు ‘జెమినీ’ ఛాట్‌బోట్ వ్యవస్థ... పిల్లి లక్షణాలు అంటే పొడుచుకొచ్చిన చెవులు, మీసాలు, పొడవైన తోక వంటి వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తుంది. వీటి ఆధారంగా పిల్లి చిత్రాన్ని గీస్తుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్లు, జెమినీ ఛాట్బోట్లు అందించే సమాచారంలోని తేడాలను గుర్తించడం పసిపిల్లలకు సవాలే. ఏఐ టూల్స్ పెద్దవాళ్లను కూడా... అది కూడా న్యాయవాదుల వంటి నిపుణులను కూడా తేలికగా బురిడీ కొట్టించగలవని ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. వయసుకు తగ్గ సమాచారం మాత్రమే పిల్లలకు అందేలా తాము రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని గూగుల్ చెబుతోంది. అయితే ఇలాంటి ఏర్పాట్లు కొత్త సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఉదాహరణకు... లైంగిక సంబంధిత సమాచారం పిల్లలకు అందకుండా చూసేందుకు కొన్ని పదాలను (ఉదాహరణకు రొమ్ము) నిషేధించామనుకోండి... పిల్లలకు అవసరమైన సమా చారం (కౌమార దశలో శరీరంలో చోటు చేసుకునే మార్పులు) కూడా అందకుండా పోతుంది. ఈ–సేఫ్టీ కమిషన్ సూచనలుఏఐ ఛాట్బోట్లతో రాగల సమస్యలను ఈ–సేఫ్టీ కమిషన్ ఇప్పటికే వివరించింది. ఏఐ ఛాట్బోట్లు ‘‘హాని కరమైన సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్ని పంచు కోవచ్చు. అలాగే ప్రమాదకరమైన సలహాలూ ఇవ్వ వచ్చు’’ అని హెచ్చరించింది. పిల్లలకు ఛాట్బోట్లు అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుందో ఈ సూచన స్పష్టం చేస్తోంది. ఛాట్ జీపీటీ, రెప్లికా, టెస్సా వంటి ఛాట్బోట్లను ఇప్పటికే పరిశీలించాము. మనుషులు అలిఖిత నిబంధనల సాయంతో చేసే సామాజిక ప్రవర్త లను ఈ ఛాట్బోట్ల స్పందనలు ప్రతిబింబిస్తున్నాయి. ఈ అలిఖిత నిబంధనలను ‘ఫీలింగ్ రూల్స్’ అంటారు. తలుపు తెరిచారని ‘థ్యాంక్యూ’ చెప్పడం, లేదా పొర బాటున ఎవరినైనా ఢీకొంటే ‘సారీ’ చెప్పడం వంటివి ఈ ఫీలింగ్ రూల్స్ కోవలోకి వస్తాయి. వీటిని అనుకరించడం ద్వారా మన నమ్మకాన్ని చూరగొనేలా ఈ ఛాట్ బోట్లను రూపొందించారు. అయితే ఈ రకమైన మాన వీయ ప్రవర్తన పిల్లల విషయానికి వచ్చేసరికి గందర గోళం సృష్టించవచ్చు. తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నా నమ్మేలా చేస్తుంది. అంతేకాకుండా... ఓ యంత్రంతో కాకుండా... సాటి మనిషితోనే వ్యవహారాలు నడుపుతున్నామని వారు నమ్మడం మొదలవుతుంది. ఆస్ట్రేలియాలో జెమినీ ఛాట్‌బోట్ చాలా కీలక సమ యంలో పిల్లలకు అందబాటులోకి వస్తోంది. ఎందుకంటే... పదహారేళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్లపై ఈ ఏడాది డిసెంబరు నుంచే నిషేధం అమలు కానుంది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూని యన్, యునైటెడ్ కింగ్డమ్లు 2023లో చేసిన ‘డిజిటల్ డ్యూటీ కేర్ చట్టం’ గురించి తెలుసుకోవడం అవసరం. గత ఏడాది నవంబరు నుంచి ఆస్ట్రేలియా ఈ చట్టం అమలును స్తంభింపజేసింది. హానికారక సమాచారం విషయంలో టెక్నాలజీ కంపెనీలనే బాధ్యులను చేస్తుందీ చట్టం!లీసా ఎం. గివెన్ వ్యాసకర్త ఆర్ఎంఐటీ యూనివర్శిటీ అధ్యాపకులు(‘ద కాన్వర్సేషన్ ’ సౌజన్యంతో) -
కశ్మీరీలతో ఇలాగేనా వ్యవహరించేది?
మనలో చాలా మందికి పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, 4 రోజుల ‘యుద్ధం’ గురించి ఎక్కువగానే తెలుసు. తెలుసుకోవడం మనం ఒక పనిగా పెట్టుకున్నాం. కానీ ఈ కాలంలో జరిగిన ఇతర వాస్తవాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఏప్రిల్ 27, మే 8 మధ్య భారతదేశ వ్యాప్తంగా వివిధ రకాలుగా 184 ముస్లిం వ్యతిరేక దాడులు జరిగాయని పౌర హక్కుల రక్షణ సంఘం నివేదించింది. వాటిలో 19 విధ్వంసక చర్యలు, 39 దాడులు, 42 వేధింపుల సంఘటనలు, 84 ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు ఉన్నాయి. వీటిలో 106 దాడులు పహల్గామ్ ద్వారా ‘ప్రేరేపితం’ అని అంచనా. వీటిలో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలలో జరిగాయి.కశ్మీరీలను, ఇతర ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం సర్వసాధారణం కాబట్టి ఈ వాస్తవాలు మనకు తెలియలేదా? అవి మన అసహనం, నిరాశ, కోపానికి బాక్సింగ్ బ్యాగులుగా మారాయా? పత్రికలు వాటిని ఎందుకు నివేదించవు? వాటి గురించి తెలుసు కోవడానికి మనం ఎందుకు ప్రయత్నించడం లేదు?కశ్మీర్లో ఏమి జరిగిందో పరిశీలించండి. కేవలం అనుమానం ఆధారంగా, ఎటువంటి ప్రక్రియా లేకుండా, బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఉల్లంఘించి, ఉగ్రవాదులుగా చెప్పబడుతున్న వారి ఇళ్లను కూల్చివేశారు. చట్ట పాలనను అనుసరించే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం తనను తాను చెప్పు కోవడాన్ని ఇది అపహాస్యం చేయడం లేదా?అంతే కాదు. బహుశా 2,000 మందిని అనుమానంతో అరెస్టు చేశారు. పాశ్చాత్య పత్రికలు వారిలో అనేక మందిని హింసించారని నివేదించాయి. ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ఇది కశ్మీరీలు, ముస్లింలు అనే కారణంగా కశ్మీరీ ముస్లింల పట్ల అనుమానాస్పద దృక్పథంతో వ్యవహరించడమేనని అనిపించడం లేదా?కశ్మీరీలు ఎలా స్పందించారు?ఇప్పుడు, కశ్మీరీలు పహల్గామ్ ఘటన పట్ల ఎలా స్పందించారో పోల్చి చూద్దాం. హోటల్ బుకింగ్‌లు లేని వారికి పడకలు అందించ డానికి మతాధికారులు మసీదులను తెరిచారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల నుండి ఛార్జీలు వసూలు చేయడానికి ట్యాక్సీ డ్రైవర్లు నిరాకరించారు. బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడా నికి దుకాణాలు, హోటళ్ళు, కళాశాలలు, పాఠశాలలు మూసివేయడంతో పూర్తి హర్తాళ్ జరిగింది. అధికారంలో ఉన్నా, లేదా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ ఉగ్రవాదులను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించాయి. దీని గురించి మనకు వివరంగా తెలియాలి కానీ మనకు తెలియలేదు. లేదా దీని గురించి చాలా తక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకు? కచ్చితంగా కశ్మీర్ నుండి మనం వినాలనుకున్న, వినవలసిన సందేశం ఇది కాదా?లోయలోని కశ్మీరీల ప్రవర్తనకు పూర్తి విరుద్ధంగా, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలలో కశ్మీరీలను ఎలా చూశారో పరిశీలిద్దాం. పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో కశ్మీరీ విద్యార్థులను కొట్టారు. వారు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోవలసి వచ్చింది. ముస్సోరీలో, దశాబ్దాలుగా అక్కడ పనిచేస్తున్న‘షాల్ వాలాస్’ బల వంతంగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కనిపించాయి. మళ్ళీ ప్రశ్నిస్తున్నాను... ఎందుకు? వీరు మీలాగే, నాలాగే హక్కులతో కూడిన భారత పౌరులు కాదా?బహుశా, అన్నింటికంటే ఘోరంగా, అధికార స్థానాల్లో ఉన్నవారు కశ్మీరీలనూ, ముస్లింలనూ రక్షించడానికి బదులుగా దాడి చేయడాన్ని ఎంచుకున్నారు. ‘కశ్మీర్లో జరిగిన దాడి హిందువులపై జరిగిన దాడి. మేము కూడా అదే విధంగా స్పందిస్తాం. కశ్మీరీలపై మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతి ముస్లింపైనా’ అని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషీని ‘ఉగ్రవాదుల సోదరి’ అన్నారు. అయినా వీరంతా తప్పించుకున్నారు. వారిని ఏ రకంగానూ హెచ్చరించలేదు. వారిని కచ్చితంగా శిక్షించలేదు.ఇప్పుడు నేను రాసిన దాని గురించి ఆలోచించండి. ముస్లింలపై ప్రధానంగా దాడులు జరిగిన రాష్ట్రాలు ఏవి? అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి? ఏ పార్టీ సభ్యులు లేదా సైద్ధాంతిక మద్దతుదారులు అలా వ్యవహరించారో మీకే తెలుస్తుంది.అదేమీ రహస్యం కాదు. నిజానికి, ఇది కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది.ఇదీ నాగరిక పద్ధతి!దేశ విభజన తర్వాత హత్యలు తారస్థాయికి చేరుకున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ 1947 అక్టోబర్ 15న రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాసిన లేఖ నుండి నన్ను ఉటంకించనివ్వండి: ‘మన దగ్గర ముస్లిం మైనారిటీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు కోరుకున్నా, వేరే చోటికి వెళ్లలేరు. వారు భారతదేశంలోనే నివసించాలి’. తరువాత స్పష్టంగా ఇలా జోడించారు: ‘పాకిస్తాన్ నుండి ఏదైనా రెచ్చగొట్టడం జరిగినా... మనం ఈ మైనారిటీతో నాగరిక పద్ధతిలో వ్యవహరించాలి.’ఆ సలహా 80 సంవత్సరాల క్రితం ఉన్నంత సందర్భోచితంగానే ఇప్పుడు కూడా లేదా? మిస్టర్ మోదీ నుండి మనం వినవలసిన సందేశం ఇది కాదా? పైగా ప్రధానమంత్రి మౌనం వ్యూహాత్మక ప్రతిస్పందన అని చాలామంది విశ్వసిస్తున్నట్లయితే మనం ఎలాంటి దేశంగా మారాం?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రామఫోసా (దక్షిణాఫ్రికా అధ్యక్షుడు) రాయని డైరీ
డోనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం బాగుంది! ఓవల్ ఆఫీస్‌లోకి నేను అడుగు పెట్టగానే, సాదరంగా ఆయన నాకు పలికిన అపూర్వ ఆహ్వానం... ఆ గదిలోని లైట్స్ అన్నీ డిమ్ చేయించటం!!రెస్టారెంట్లలో, ఇలాగే డిమ్ లైట్ల కాంతిలో రాచమర్యాదలు ఉంటాయి. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ నాకోసం ఏర్పాటు చేయించిన డిష్లూ లేవు, చేసిన మర్యాదలూ లేవు. ఆయన ఆతిథ్యం నాకు బాగుండటానికి ఆ ‘లేకపోవటం’ తప్ప, వేరే కారణాల్లేవు.మర్యాద తెలియని మనిషి నుంచి మర్యాదను పొందటం అవమానం. అది నాకు జరగలేదు. తింటున్నప్పుడైనా ఏం మాట్లాడకూడదో తెలియని మనిషితో కలిసి తినటానికి కూర్చోవలసి రావటం మర్యాదను పోగొట్టుకోవటం. అదీ నాకు జరగలేదు. కనుక ట్రంప్ నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చినట్లే!లైట్స్ డిమ్ చేయించాక, స్క్రీన్ మీద ఒక చిన్న క్లిప్ వేయించి, ‘‘చూడండి, మిస్టర్ రామఫోసా... అక్కడ మీ వాళ్లు మా వాళ్లను ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో’’ అన్నారు ట్రంప్. ఆ మాటతోనే మా మీటింగ్ మొదలైంది. ఆ మాటతోనే మా మీటింగ్ మొదలు కాకుండానూ అయింది.స్క్రీన్ మీద ట్రంప్ వేయించిన ఆ క్లిప్ నిజమైనది కాదు. నిజమని ట్రంప్ అనుకుంటున్నా... దాని గురించి మాట్లాడే సందర్భం అది కాదు. ట్రేడ్ డీల్ కోసం పిలిపించుకున్నప్పుడు ట్రేడ్ డీల్ గురించే మాట్లాడాలి.ఓవల్ ఆఫీస్‌ను స్కూల్ హెడ్ మాస్టర్ రూమ్‌గా మార్చేశారు ట్రంప్. రూమ్‌కి పిలిపించి, ‘‘రష్యా అడిగింది ఇచ్చేయ్’’ అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీని గద్దిస్తారు!‘‘గాజా నుండి మీ దేశానికి వచ్చే శరణార్థుల్ని అడ్డుకోవద్దు...’’ అని జోర్డాన్ రాజు అబ్దుల్లా హుస్సేన్ కు చెబుతారు! ‘‘ఉక్రెయిన్ కి సహాయం ఆపేయాలని ఐరోపాకంతటికీ మీరే చెప్పాలి...’’ అని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మెక్రాన్ ను బలవంత పెడతారు!‘‘కెనడాను సైనికంగా రక్షించటానికి అయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని అమెరికానే భరిస్తోంది కనుక, కెనడాను అమెరికాలో ఎందుకు విలీనం చేయకూడదు?’’ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీని ప్రశ్నిస్తారు.‘‘జెలెన్ స్కీకి అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది కాదు కదా...’’ అని ఇటలీ ప్రధాని మిస్ మెలనీతో అంటారు. ఇప్పుడు నన్ను పిలిపించుకుని, ‘‘దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులపై జరుగుతున్న ఊచకోతకు వివరణ ఇవ్వండి’’ అంటున్నారు.జెలెన్ స్కీలా కోపగించుకొని మీటింగ్ మధ్యలోనే లేచి వెళ్లిపోవటం నా వయసుకి బాగుండదు కనుక, మండే అగ్నిగోళం నెల్సన్ మండేలాను మనసులోకి తెచ్చిపెట్టుకుని ప్రశాంతంగా కూర్చున్నాను. అమెరికా గురించి మండేలా గొప్పగా చెబుతుండేవారు. ‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్’ పార్టీకి మండేలా ప్రెసిడెంట్‌గా, నేను పార్టీ సెక్రెటరీ జనరల్‌గా ఉన్నప్పుడు మండేలా తరచూ అమెరికన్ డెమోక్రసీ మీద,అమెరికన్ లీడర్షిప్ మీద ప్రశంసా పూర్వకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండేవారు.27 ఏళ్ల కారాగార వాసం నుండి విడుదలయ్యాక, మండేలా తొలిసారి సందర్శించిన దేశాల్లో అమెరికా కూడా ఉంది. పన్నెండు రోజుల టూర్లో ఆయన ఎనిమిది అమెరికన్ సిటీలలో పర్యటించారు.అనేకమంది నాయకులను కలుసుకున్నారు. ప్రెసిడెంట్ జార్జిబుష్‌తో ఇదే ఓవల్ ఆఫీస్‌లో సమావేశం అయ్యారు. ఇదే ఆఫీస్‌లో నేను,జో బైడెన్ కూడా కలిసి కూర్చున్నాం.ట్రంప్... బైడెన్ లా లేరు. జార్జి బుష్‌లా లేరు. ఏ అమెరికన్ ప్రెసిడెంట్లానూ లేరు. అందరికన్నా భిన్నంగా ఉన్నారు! ఆయన ఎలా ఉన్నా, ఎలా లేకున్నా...మండేలా అన్నట్లు అమెరికా గొప్ప దేశమే! కానీ కొన్నిసార్లు బ్రైట్నెస్ తగ్గి బాగా డిమ్ అయిపోతుంటుంది! -
కార్పొరేట్ల కోసమే ఈ నిర్మూలనా?
‘ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వంద లాది గ్రామాలలో వేలాది రైతుల నుండి వ్యవసాయ శాస్త్రవేత్త డా‘‘ రిఛారియా 22,000 లకు పైగా వరి వంగడాలను, 1,800లకు పైగా ఆకుకూరలను సేకరించి వాటి జర్మ్ ప్లాస్క్‌ను రాయ్‌పూర్‌లోని ‘ఇందిరా గాంధీ జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం’లో 1950, 1960లలో భద్రపరిచారు. ఇందులో తక్కువ నీటితో పండేవి, తక్కువ గడ్డినిచ్చేవి, ఎక్కువ గడ్డినిచ్చేవి, సువాసనలు వెదజల్లేవి, పొడవైన– పొట్టి రకాలు, ఏ కాలంలోనైనా పండే అనేక వంగడాలు ఉన్నాయి. అయితే మన దేశ దళారీ పాలకుల కుమ్మక్కుతో ఈ వరి వంగడాల జర్మ్ ప్లాస్క్‌ను అమెరికా తదితర దేశాల బహుళజాతి కంపెనీలు దొంగిలించుకు పోయాయి. మనీలాలోని ‘ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్’ (ఐఆర్ఆర్ఎ)లలో అభివృద్ధి చేశామని చెప్తూ ఇలా దొంగిలించుకు పోయిన వంగడాలను వివిధ పేర్లతో (ఐఆర్–36, ఐఆర్–72 తదితర) బహుళజాతి కంపెనీలు భారత్ లాంటి అనేక దేశాల్లో అమ్ముకుని భారీగా లాభాలు గడిస్తున్నాయి. విత్తనాల కోసం భారతదేశ రైతులు ప్రతి సంవత్సరం బహుళజాతి కంపెనీలపై ఆధారపడేలా చేస్తు న్నారు...’ ఈ మాటలు విదేశీ జర్నలిస్టు అల్ఫ్ బ్రెనన్ కు 2022లో ఇచ్చిన ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూలో మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి బసవరాజువి. ఈ దేశ ప్రజల పరంపరాగత జ్ఞానం పట్ల, దేశీయత పట్ల, వనరుల పట్ల ఆయన వైఖరిని సూచించే మాటలు ఇవి.దేశభక్తి అనే ఒక్క మాటతో ఈ రోజు అందరినీ శిలువ ఎక్కించి పరీక్షిస్తున్నారు. కానీ నిజంగానే దేశం పట్ల ప్రేమ ఉంటే ఎలా ఆలోచించాలో బసవరాజు చేసిన ఈ సూక్ష్మ పరిశీలన తెలియజేస్తోంది. జాతీయత పేరుతో మావోయిస్టు నిర్మూలనను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న తరుణంలో ఏది దేశభక్తి, ఏది ప్రజల మీది ప్రేమ అనే చర్చ జరగలవసి ఉన్నది.మావోయిస్టుల ఆలోచనలు విదేశీయమని కొందరు చెబుతుంటారు. మావోయిస్టుల వల్ల ఈ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, అభివృద్ధికి వాళ్లు ఆటంకంగా ఉన్నారని అంటున్నారు. కానీ కొద్దిగా ఈ దేశ రాజకీయార్థిక వ్యవహారాలను పరిశీలిస్తే ఎవరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నదీ అర్థమవుతుంది. గతంలో కంటే తీవ్రంగా అభివృద్ధి అనే మాట ఇప్పుడు చలామణీలోకి వచ్చింది. కానీ ఇది ఎవరి అభివృద్ధి అనేది అతి ముఖ్యమైన ప్రశ్న.ఏడాదిన్నరగా మావోయిస్టు నిర్మూలన పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్’ కేవలం సైనిక చర్య కాదు. అభివృద్ధి నమూనా కేంద్రంగా సాగుతున్న రాజకీయార్థిక యుద్ధం. సరిహద్దుల కోసం పక్క దేశ ప్రజలపై యుద్ధం చేసే భారత ప్రభుత్వం అభివృద్ధి నమూనా విషయంలో జరుగుతున్న సంఘర్షణను అంతర్యుద్ధంగా మార్చేసింది. తన దేశ ప్రజల మీదే దండయాత్ర చేస్తోంది. యుద్ధాల్లో ఆయుధాలు, విమానాలు, డ్రోన్ లు చేసే వికృత ధ్వనుల వెనుక రాజకీయార్థిక విధ్వంసాలు ఉంటాయి.కగార్ పేరుతో అదే జరుగుతోంది. అందుకే మావోయిస్టు ప్రభా విత మధ్య భారత రాష్ట్రాల్లో హత్యాకాండ ఆపాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆదివాసుల జీవించే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన రక్షణ చట్టాల చర్చగానే ఇది ముగిసి పోవడం లేదు. ఈ రక్తపాతం వెనుక ఉన్న పాలకుల అభివృద్ధి నమూనా ఉంది. ఈ ఏడాదిలోనే వందలాది మంది ఆదివాసుల హత్య వెనుక ఉన్న అభివృద్ధి–విధ్వంసాల సంఘర్షణకు మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ కేశవరావు హత్య ఒక పరాకాష్ఠ.ఒకప్పుడు మావోయిస్టులు, వాళ్ల అభిమానులు మాత్రమే పాలకుల అభివృద్ధి నమూనాను మౌలికంగా విమర్శించేవాళ్లు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఎట్లా ఉండాలో చెప్పేవాళ్లు. ఈ దేశ ప్రజల అవసరాలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఉండాలని విశ్లేషించేవాళ్లు. ఈ దేశ వనరులు ఇక్కడి ప్రజల కోసమే వినియోగించాలనే వాళ్లు. చిన్న చిన్ని సవరణలు ఎన్ని చేసినా అది ప్రజలకు పనికి రాదని, చాలా మందికంటే భిన్నమైన వైఖరిని ప్రకటించేవాళ్లు. విప్లవం ద్వారా మౌలిక మార్పు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని అనేవాళ్లు.ఇదే విమర్శ ఇప్పుడు దేశంలోనే ఒక ప్రధాన విమర్శగా ఎదిగింది. ఈ దేశం పిడికెడు మంది కార్పొరేట్లది కాదని, అసంఖ్యాక ప్రజలదనే అవగాహన అనేక రకాలుగా ప్రచారంలోకి వచ్చింది. కార్పొరేటీకరణ ఉద్ధృతంగానే సాగుతూ ఉండవచ్చు. కానీ దాని మీద విమర్శ పదునెక్కుతోంది. అనేక రూపాల్లో ప్రజా పోరాటాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తి, జాతీయత అనే భావనలను ఆ పక్క పాలకులు ప్రచారంలో పెట్టే కొద్దీ... ఈ పక్క నుంచి రోజువారీ జీవిత సంక్షోభంలోంచి ప్రజా ప్రయోజనాల చర్చ వేగవంతం అవుతున్నది.మావోయిస్టు ఉద్యమం ఈ విషయాలను చర్చించడంతో సరి పెట్టుకోలేదు. వాళ్లకు బలం ఉన్న ప్రాంతాల్లో మిలిటెంట్ ఉద్యమాలను నిర్మిస్తోంది. మిగతా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న వేర్వేరు ప్రజా పోరాటాలకు మద్దతు ఇస్తున్నది. వాటిలో తనకు వీలైన పద్ధతిలో పాలుపంచుకుంటోంది. ఈ దేశంలో మౌలిక స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి నమూనా చర్చను ప్రజా ఆచరణలోకి మళ్లిస్తున్నది. ఇది ముఖ్యంగా కేంద్ర పాలకులకు ఆగ్రహం తెప్పించింది. పైకి మావో యిస్టు ఉద్యమం గురించి అప్పుడప్పుడు శాంతి భద్రతల సమస్యగా చెప్పినా... ఇది తాను ఎంచుకొన్న అభివృద్ధి నమూనాకు ఆటంకం అని గ్రహించింది. అడవుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే అశేష పీడిత ప్రజానీకానికీ, కార్మికులకూ, నానాటికీ పెరుగుతున్న మధ్య తరగతికీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న అభివృద్ధి నమూనా ప్రమాదకరమనే చైతన్యం పెరగడంలో మావోయిస్టుల పాత్ర ఉన్నది.కాబట్టి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించకపోతే తాను ఎంచుకున్న కార్పొరేట్ అభివృద్ధి నమూనాను అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వానికి స్పష్టమైంది. కొన్ని తేడాలతో గత ప్రభుత్వాలది కూడా ఇదే వరుస. వాళ్లు చూసిన దారిని మరింత నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా నేటి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ మేరకు వివిధ ప్రజా పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. వ్యవస్థ మౌలిక మార్పులో కీలకమైన ఉత్పత్తి సంబంధాల చర్చను, కొత్త దోపిడీ రూపాల సమస్యను మావోయిస్టు ఉద్యమం కేంద్ర స్థానంలోకి తీసుకొని వచ్చింది. కార్పొరేట్ పెట్టుబడి, దాని వనరుల దాహం, శ్రమశక్తిని కొల్లగొడుతున్న పద్ధతుల మీద విమర్శను ప్రజల కామన్ సెన్స్‌లో భాగం చేసింది. కాబట్టి కార్పొరేట్ ఇండియాను సాధించడానికి మావోయిస్టు రహిత భారత్ ఒక షరతుగా మారిపోయింది.వ్యక్తిగా నంబాళ కేశవరావు భౌతిక కాయం అరమోడ్పు కన్నులతో ఈ నేలలో కలిసిపోవచ్చు. కానీ ఆయన చూపు, మేధ,హృదయం, చైతన్యం మాత్రం పాలకుల అభివృద్ధి నమూనాను గురి చూస్తూనే ఉంటాయి. పాణి వ్యాసకర్త ‘విరసం’ కార్యవర్గ సభ్యుడు -
సలహా కోరితే సమాధానమివ్వాలా?
మన రాజ్యాంగం వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాలను సూచిస్తుంది. రాజకీయ వర్గాలకు, ప్రతికూలమైన తీర్పులను ఎత్తి చూపడానికి ఒక సాధనం కావచ్చు. న్యాయ వ్యవస్థకు మాత్రం ఇదొక వేగుచుక్క. చట్టపర మైన ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరడానికి రాష్ట్రపతిని అనుమతించేదే ఆర్టికల్ 143. తాజాగా బిల్లులను పరిష్కరించడంలో గవర్నర్లు, రాష్ట్రపతి అధికారాలకు సంబంధించిన 14 ప్రశ్నలు వేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యాయసలహా కోరి దీన్ని ఉపయోగించారు.సాధారణ సందర్భాల్లో ఇది వివాదాస్పదం అయ్యేది కాదు. కానీ ఈ ప్రశ్నలు తమిళనాడు గవర్నర్ ఉదంతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పిన అంశాలనే తిరిగి పరిశీలించేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఒక క్లిష్టమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. రాష్ట్రపతి కోరుతున్న న్యాయ సలహా అనేది చట్టబద్ధమైన రాజ్యాంగ చర్యా లేదా సుప్రీం తీర్పును దొడ్డిదారిలో సమీక్షించే ప్రయత్నమా?కోర్టు సమాధానం చెప్పనక్కర్లేదు!ఇటీవల తమిళనాడు కేసు విషయంలో– మంత్రి మండలి సహాయం, సలహా ప్రకారమే గవర్నర్ పనిచేయాలనీ, బిల్లులను ఆమోదించే ప్రక్రియలో నిరవధికంగా ఆలస్యం చేయలేరనీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతితో సహా రాజ్యాంగ అధికారులు జవాబుదారీతనం లేకుండా లేదా కాలపరిమితిని దాటి వ్యవహరించలేరని కూడా ఆ తీర్పు పేర్కొంది. ఈ తీర్పు ఫలితంతో కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి చెందింది. ఫలితంగా ఇప్పటికే కోర్టు సమాధానం ఇచ్చిన వాటికి దాదాపు సమానమైన ప్రశ్నలను సంధి స్తున్న రాష్ట్రపతి న్యాయ సలహాకు కేంద్రం మద్దతు ఇచ్చింది.ప్రజా ప్రాముఖ్యం కలిగిన చట్టపరమైన విషయాలపై సుప్రీంకోర్టు న్యాయ సలహాను, అభిప్రాయాన్ని కోరడానికి ఆర్టికల్ 143 రాష్ట్రపతిని అనుమతిస్తుంది. కోర్టుకు మాత్రం అటువంటి న్యాయ సలహాకు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 1964లో ప్రత్యేక సూచన నం.1లోనూ, అయోధ్య వివాదంపై 1993లో ప్రత్యేక సూచన నం.1లోనూ మనం చూసినట్లుగా, న్యాయ సలహాను ఇవ్వకుండా తిరస్కరించే విచక్షణ న్యాయస్థానానికి ఉంది.కావేరీ జల వివాదాల కేసులో (1998లో ప్రత్యేక సూచననం.1), కోర్టు అప్పటికే ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయడానికి లేదారెండవ అభిప్రాయాన్ని కోరడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించ లేరని స్పష్టంగా పేర్కొంది. ‘రాజ్యాంగం ప్రకారం, అలాంటి అప్పీల్ అధికార పరిధి ఈ కోర్టుకు ఉండదు; ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి కూడా దానిపై సమీక్ష కోరలేరు... అటువంటి అధికారం ఆర్టికల్ 143లో ఉందనుకుంటే, అది న్యాయవ్యవస్థ స్వతంత్ర తలోకి తీవ్ర మైన చొరబాటు అవుతుంది’ అని నాడు కోర్టు నొక్కి చెప్పింది.పునఃపరిశీలన కోరుతున్నట్లయితే...రాష్ట్రపతి తాజాగా వేసిన 14 ప్రశ్నలు తమిళనాడు తీర్పులో ఇప్పటికే పరిష్కరించబడిన అనేక ప్రశ్నలను ప్రతిధ్వనిస్తాయి. గవర్నర్ ఒక బిల్లును అనేకసార్లు వెనక్కి ఇవ్వవచ్చా, లేదా ఆమోదం కోసం రాష్ట్రపతి నిర్దిష్ట కాలపరిమితికి కట్టుబడి ఉండాలా అనేవి వీటిలో ఉన్నాయి. వీటిని సుప్రీంకోర్టు అస్పష్టంగా వదిలివేయలేదు. అత్యంత స్పష్టతతో నిర్ణయం చెప్పేసింది. అందుకే రాష్ట్రపతి తాజా న్యాయ సలహా నివేదన నిజంగా స్పష్టతను కోరడం లేదనీ, పునఃపరి శీలన కోరుతోందనీ సూచిస్తుంది. అలా అయితే, ఇది చట్టపరమైన సమస్య కాదు. న్యాయవ్యవస్థ అంతిమం అనే పునాదినే ప్రశ్నిస్తోంది.2012లో 2జీ స్పెక్ట్రమ్‌పై న్యాయసలహా దీనికి ఒక ముఖ్యమైన మినహాయింపు. ఇక్కడ సుప్రీంకోర్టు మునుపటి తీర్పులోని అంశా లను స్పష్టం చేయడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించింది. కోర్టు 122 టెలికామ్ లైసెన్సులను రద్దు చేసిన తర్వాత, సహజ వనరులను కేటాయించడానికి వేలం మాత్రమే అనుమతించదగిన పద్ధతా అనే దానిపై నాటి కేంద్ర ప్రభుత్వం... సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాన్ని కోరింది. వేలం న్యాయమైన పద్ధతి అయినప్పటికీ, అది మాత్రమే రాజ్యాంగబద్ధమైన మార్గం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా, కోర్టు ఇచ్చిన ఈ స్పష్టత ప్రధానమైన తీర్పును భంగపరచలేదు. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. 2జీ విషయంలో, తన తీర్పును వెనక్కు తీసుకోవాలని కోర్టును ప్రభుత్వం అడగలేదు. కేవలం భవి ష్యత్ విధానంపై తనకు మార్గనిర్దేశం చేయాలని కోరింది.దీనికి విరుద్ధంగా, తాజాగా రాష్ట్రపతి కోరిన న్యాయ సలహా అనేది తమిళనాడు కేసు తీర్పులోని ప్రధాన విషయానికి వెళుతుంది. ఇది పరిణామాల వివరణ, లేదా భవిష్యత్ కేసులకు మార్గ దర్శకత్వం కోరదు. బదులుగా, కోర్టు ఇప్పటికే సమాధానం ఇచ్చిన ప్రశ్నలను తిరిగి లేవనెత్తుతుంది. దీన్ని అనుమతించడం అంటే సమీక్షను నియంత్రించే ఆర్టికల్ 137ను కార్యనిర్వాహక వర్గం దాటవేయవచ్చు. ఆర్టికల్ 143 ద్వారా కేసులను తిరిగి వ్యాజ్యం చేయవచ్చు. అది రాజ్యాంగపరంగా అనుమతించరానిది, అలాగే వ్యవస్థాగతంగా ప్రమాదకరమైనది.రాష్ట్రపతి కార్యాలయ గౌరవం నిలుపుతూనే...కోర్టుకు స్పందించాల్సిన బాధ్యత ఉందా? లేదు! ప్రత్యేక కోర్టుల బిల్లు కేసులో, కోర్టు ఒక సూచనకు సమాధానం ఇవ్వ డానికి నిరాకరించవచ్చనీ, కాకపోతే అలా చేయడానికి కారణా లను పేర్కొనాలనీ న్యాయస్థానం మాట. 2జీ కేసులో, న్యాయ సలహాను తిరస్కరించడానికి కోర్టు అనేక కారణాలను పొందు పర్చింది: (1) ప్రశ్నలను ఇప్పటికే పరిష్కరించి ఉంటే; (2) ప్రశ్నలు రాజకీయమైనవి అయితే; (3) అవి రాజ్యాంగ ప్రయోజనానికి ఉపయోగపడకపోతే; (4) అవి చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన సమస్యలను కలిగి ఉండకపోతే!తమిళనాడు తీర్పు స్పష్టంగా పరిష్కరించబడిన రాజ్యాంగ ప్రశ్నా విభాగంలోకి వస్తుంది. దీన్ని తిరిగి తెరవడం వల్ల న్యాయ నిర్ణయాల అంతిమత్వంపై సుప్రీం కోర్టుకు కాకుండా కార్య నిర్వాహక వర్గానికి ప్రాధాన్యతను కట్టబెట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ రాజకీయ నేపథ్యాన్ని విస్మరించలేము. అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోని గవర్నర్లు చట్టాలకు మోకాలడ్డేందుకు కాలయాపన వ్యూహాలను అనుసరించారు.ఇది రాజ్యాంగ ప్రశ్న కంటే ఎక్కువగా – రాజకీయంగా అడ్డుకొనే చర్య. ముఖ్యంగా రాజ్యాంగ సమీక్ష మార్గం ఎల్లప్పుడూ అందు బాటులో ఉన్నప్పుడు... రాష్ట్రపతి న్యాయ సలహాను సుప్రీంకోర్టు అంగీకరిస్తే, అది రాజకీయ ఒత్తిడికి లొంగి పోయినట్టు కనిపించే ప్రమాదం ఉంది. అయితే, కోర్టుకు ఇది క్లిష్టమైనదే. రాష్ట్రపతి కార్యాలయం పట్ల గౌరవాన్నీ, తన నిర్ణయాల సమగ్రతనూ కాపాడు కునే బాధ్యతను సమతుల్యం చేసుకోవాలి.ఈ న్యాయ సలహాను కోరడం నిజంగా తమిళనాడు కేసును తిరగదోడే ప్రయత్నమే అయితే, కోర్టు దానికి సమాధానం ఇవ్వడా నికి నిరాకరించాలి. న్యాయపరమైన తీర్పుల అంతిమత్వాన్ని తప్పించుకోవడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించలేమని స్పష్టంగా పేర్కొ నాలి. అయితే, భవిష్యత్ పాలన కోసం స్పష్టత అవసరమయ్యేఅంశాలు తీర్పులో ఉంటే, కోర్టు సమాధానం ఇవ్వడానికి ఎంచు కోవచ్చు. కానీ అది తన మునుపటి నిర్ణయానికి చెందిన అధికారాన్ని నీరుగార్చకుండా చూసుకోవాలి.ఆర్టికల్ 143 రాజకీయంగా తప్పించుకునే మార్గంగా కాకుండా చట్టపరమైన స్పష్టత కోసం ఒక సాధనంగా ఉద్దేశించబడింది. రాష్ట్రపతి కోరిన ఈ న్యాయ సలహాను పరిశీలన లేకుండా స్వీకరిస్తే, అది కోర్టు అధికారాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది. కోర్టు రాజ్యాంగ వ్యాఖ్యాతగా మాత్రమే కాకుండా, దాని సంరక్షకురాలిగా కూడా వ్యవహరించాలి. సమాధానం ఇవ్వడానికి నిరాకరించడం అనేది రెండింటినీ కాపాడుకోవడానికి స్పష్టమైన మార్గం కావచ్చు.-వ్యాసకర్త సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-సంజయ్ హెగ్డే -
కవిత్వమూ, ఆలోచనా రాజద్రోహాలేనా?
నాగపూర్ పోలీసులు ఒక ఆశ్చర్యకరమైన పని చేశారు. ఒక సభలో పాడిన పాట ఆధారంగా సభా నిర్వాహకుల మీద ‘రాజద్రోహ నేరం’ కేసు పెట్టారు. సుప్రీంకోర్టు మూడు సంవ త్సరాల కింద 2022 మే 11న అప్పటికి ఉండిన భారత శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్)లో సెక్షన్ 124-ఎ ‘రాజద్రోహ నేరం’ ఔచిత్యాన్ని విచారిస్తూ, దాన్ని పునస్సమీక్షించే వరకూ, ఆ ఆరోపణ మీద విచారణలు ఆపేయాలని, కొత్త కేసులు నమోదు చేయగూడదని మధ్యంతర ఆదేశం ఇచ్చింది. తర్వాత ప్రభుత్వం ఐపీసీని రద్దు చేస్తూ తీసుకు వచ్చిన భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో ‘రాజద్రోహం’ అనే మాట వాడలేదు గాని, మిగిలి నదంతా సెక్షన్ 152లో యథాతథంగా ఉంచారు. ఇప్పుడు నాగపూర్ పోలీసులు ఆ బీఎన్ఎస్ సెక్షన్ 152తో పాటు, సెక్షన్ 196 (సమూహాల మధ్య శత్రుత్వం పెంచడం), సెక్షన్ 353 (ప్రజల మనో భావాలను గాయపరిచే ప్రకటనలు చేయడం) అనే నేరారోపణలతో కేసు పెట్టారు. ఇంతకీ ఆ సభ ‘వీరా సాథీదార్ (vira sathidar) స్మృతి సమ న్వయ్ సమితి’ అనే బృందం మే 13న నాగపూర్ లోని ‘విదర్భ సాహిత్య సంఘ్’ హాలులో ఏర్పాటు చేసిన సంస్మరణ సభ. వీరా సాథీదార్ (1958– 2021) సుప్రసిద్ధ మరాఠీ కవి, నటుడు, రచయిత, పత్రికా సంపాదకుడు, దళిత హక్కుల కార్యకర్త. అంబేడ్కర్, మార్క్స్‌ల భావాలతో ప్రభావితుడైన వీరా కులవివక్షకూ, సామాజిక అన్యాయాలకూ వ్యతిరేకంగా అపారమైన కృషి చేశారు. ‘ఇండియన్ పీపుల్స్ థియేటర్’ అసోసియేషన్ కన్వీనర్‌గా ఉన్నారు. మరాఠీ మాసపత్రిక ‘విద్రోహి’ సంపాదకు లుగా ఉన్నారు. ‘కోర్ట్’ అనే 2014 నాటి మరాఠీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. అది ఉత్తమ సిని మాగా జాతీయ అవార్డు అందుకుంది. కోవిడ్ రెండో దశలో 2021 ఏప్రిల్ 13న మరణించారు. నాలుగేళ్లుగా ఆయన సహచరి పుష్పా సాథీదార్, ఇతర మిత్రులు సంస్మరణ సభలు నిర్వ హిస్తున్నారు. ఈ సంవత్సరం సంస్మరణ సభలో సామాజిక కార్యకర్త ఉత్తమ్ జాగీర్దార్ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘ప్రజా భద్రతా బిల్లు’ గురించి ప్రధాన ఉపన్యాసం చేశారు. ముంబయికి చెందిన సమతా కళా మంచ్ గాయ కులు పాటలు పాడారు. ఆ పాటల్లో ఒకటి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘హమ్ దేఖేంగే’ అనే సుప్రసిద్ధ గీతం.‘మన సైనికులు పాక్‌తో వీరోచితంగా పోరాడి ఓడిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ఒక వామపక్ష కళాబృందం పాక్ కవి పాటలు పాడుతున్నది. ఆ పాటలో సింహాసనాలను వణికించాలి అని ఉంది. వాళ్లు ఇది ఫాసిస్టు ప్రభుత్వం అంటున్నారు. ఈ సభ, ఉపన్యాసం, పాట దేశ సమగ్రతకు, భద్రతకు, సార్వభౌమత్వానికి వ్యతిరేకం. కనుక నిర్వాహకు రాలు పుష్పా సాథీదార్ మీద కేసు పెట్టి విచారించండి’ అని నాగపూర్ ‘జనసంఘర్ష సమితి’ అధ్యక్షుడు దత్తాత్రేయ షిర్కే చేసిన ఫిర్యాదు మీద పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో రెండు విచిత్రమైన విషయాలున్నాయి. ఒకటి-ఫైజ్ అహ్మద్ ఫైజ్ (faiz ahmed faiz)ను, ఆ మాటకొస్తే ఏ కవినైనా ఒక దేశానికి పరిమితం చేయడానికి వీలు లేదు. ఫైజ్ 1911లో అవిభక్త భారత్‌లో పంజాబ్‌లో పుట్టిన కవి. 1947 దేశ విభ జన తర్వాత ఇంగ్లిష్ దినపత్రిక ‘పాకిస్తాన్ టైమ్స్’కూ, ఉర్దూ దినపత్రిక ‘ఇమ్రోజ్’కూ ప్రధాన సంపాదకుడిగా పాకిస్తాన్‌కు వెళ్లారు. పాకి స్తాన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుల్లో ఒకరయ్యారు. లియాఖత్ అలీఖాన్ ప్రభుత్వం 1951లోనే ఆయ నను రావల్పిండి కుట్ర కేసు నిందితుడిగా అరెస్టు చేసి నాలుగేళ్లు జైల్లో పెట్టింది. తర్వాత ఆయన మధ్య పాకిస్తాన్ వస్తూపోతూ ఉన్నప్పటికీ జీవితంలో ఎక్కువ భాగం మాస్కోలో, లండన్‌లో, బీరుట్లో గడిచింది. 1984లో మరణించే లోపు, మొత్తం 73 ఏళ్ల జీవితంలో ఆయన పాకిస్తాన్లో గడిపినది పదిహేనేళ్ల లోపే. ఆయనను పాకిస్తాన్ కవి అనడం హాస్యా స్పదం. రెండు-హమ్ దేఖేంగే కవితను ఫైజ్ పాకిస్తాన్లో సైనిక నియంత జియా ఉల్ హక్కు వ్యతిరేకంగా 1979లో రాశారు. ఫైజ్ చనిపోయాక కూడా పాకిస్తాన్లో ఆయన పేరు ఎత్తడానికి వీలు లేదని జియా ఉల్ హక్ ఆదేశించగా, 1986లో లాహోర్‌లో ఒక బహిరంగ వేదిక మీద ఈ పాట పాడి పాకిస్తానీ గాయని ఇక్బాల్ బానో సంచలనం సృష్టించారు. మరొక పాకిస్తాన్ సైనిక నియంత పర్వేజ్ ముషర్రఫ్ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లో కూడా ఇది మార్మోగింది. అలా మౌలికంగా పాకిస్తాన్ నియంతలకు వ్యతిరేక ప్రతీక అయిన పాటను చూసి భారత పాల కులు ఉలిక్కిపడడం ఆశ్చర్యకరం. అయితే ఈ ఉలికిపాటు, అసహనం, అభూత కల్పనల నేరారోపణలు, సుప్రీంకోర్టు కొట్టివేసిన నేరారోపణలు ఒకచోట ఆగిపోవడం లేదు, విస్తరి స్తున్నాయి. అశోకా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి, ప్రపంచ ప్రఖ్యాత కవి, చరిత్ర కారుడు అలీఖాన్ మహమూదాబాద్‌ను మే 18న రాజద్రోహ నేరారోపణలతో అరెస్టు చేశారు. ఆ అరె స్టుకు కారణం ఆయన ఫేస్బుక్ మీద రాసిన ఒక పోస్టు. అలాగే లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ యూనివ ర్సిటీ అధ్యాపకురాలు, సుప్రసిద్ధ సామాజిక శాస్త్ర వేత్త, స్వయంగా కశ్మీరీ పండిట్ నిటాషా కౌల్‌కు ‘భారత వ్యతిరేక రచనలు చేస్తున్నందుకు’ అనే ఆరో పణతో ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు రద్దుచేస్తూ నోటీసు పంపారు. భారత ప్రభుత్వ విధానాల మీద విమర్శనాత్మక రచనలు చేసినందుకే ఈ చర్య. ప్రజాస్వామ్యానికి కన్నతల్లి అంటే అర్థం... భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డు కోవడమేనా? - ఎన్ వేణుగోపాల్ ‘వీక్షణం’ ఎడిటర్ -
పాకిస్తాన్ ఎందుకు భ్రష్టు పట్టింది?
పాకిస్తాన్ వ్యవస్థాపకుడు, ఆ దేశ ప్రథమ గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా బతికున్నంత కాలం పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ ప్రజాస్వామ్యం అయినా ఇతర మతాలు,సంస్కృతులు అక్కడ సహజీవనం చేసేందుకు అవకాశం ఉండేది. జిన్నా మృతి అనంతరం ఈ భావన అంతరించిపోయింది. దేశంలో రాజకీయ–సైనిక సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయి. అస్థిరత్వం వేరూనింది. పాకిస్తాన్ బ్రిటిష్ కాలనీ నుంచి ఒక ఆధునిక దేశంగా రూపొందే పరిణామ క్రమాన్ని ఈ పరిస్థితులు దెబ్బతీశాయి. పాక్ రాజకీయ–సైనిక సంబంధాలను మూడు ప్రధాన ఇతి వృత్తాలతో వివరించవచ్చు. వీటిలో మొదటిది: అక్కడి రాజకీయ నాయకత్వానికి ఏనాడూ సరైన విజ్ఞత లేదు. రాజకీయ పార్టీలు ఆది నుంచీ అవినీతికి మారుపేర్లుగా ఉన్నాయి. ఈ పరిస్థితి సైనిక జోక్యా నికి తావిచ్చింది. ఆ దేశంలో రాజకీయ అస్థిరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఇప్పటి వరకు ఇండియాలో 14 మంది ప్రధాని పదవి అలంకరించగా, పాకిస్తాన్ ప్రజలు ఇదే కాలంలో 24 మంది ప్రధానులను చూశారు.రెండోది: పాకిస్తాన్ సైన్యం రాజకీయ స్థాయికి ఎదిగి హింసా యుత రాజకీయాలపై క్రమంగా పట్టు సాధించడం. 1951లో అప్పటి ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్ హత్య నుంచి 2022 నవంబర్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం వరకు... ఈ ఘటనలు అన్నీ ఏదో రూపంలో పాక్ సైన్యంతో ముడిపడి ఉన్నాయి. రాజకీయ వేదిక మీద ప్రాబల్యం సంపాదించే ప్రక్రియలో పాక్ సైన్యం రెండు పద్ధతులు అనుసరించింది. వీటిలో మొదటిది– సైనిక నియంతృత్వం. ఈ పద్ధతిలో పాక్ సైనిక అధిపతులు నిస్సిగ్గుగా రాజకీయ అధికారం హస్తగతం చేసుకుని తమను తాము దేశాధ్య క్షులుగా ప్రకటించుకున్నారు. రాజకీయ సంక్షోభాలను సృష్టించి, వాటిని సాకుగా చూపిస్తూ తాము దేశానికి రాజకీయ సుస్థిరత అందిస్తామంటూ వారీ దుశ్చర్యకు పాల్పడ్డారు. మిలిటరీ జనరళ్లు అయూబ్ ఖాన్, యాహ్యా ఖాన్, జియా–ఉల్–హక్, పర్వేజ్ ముషా రఫ్ ఈ పద్ధతిలో రాజకీయ అధికారం చేపట్టారు. వీరి హయాంలో ప్రధానులు డమ్మీలుగా ఉండేవారు. ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఉంది. పాకిస్తాన్ ఏర్పాటు నుంచీ ఆ దేశ సైన్యానికి కేవలం 15 మంది ఆధిపత్యం వహించారు. వీరి పదవీ కాలం 2 నుంచి 12 ఏళ్లు. ఇదే సమయంలో ఇండియాకు 31 మంది సైనికాధిపతులుగా వ్యవహ రించారు. ఆర్మీ చీఫ్‌గా వీరి పదవీకాలం రెండేళ్లు/ 62 ఏళ్లకు రిటైర్మెంటు నిబంధనకు లోబడి ఉంటుంది.పాక్ సైన్యం ప్రాబల్యాన్ని జుల్ఫికర్ అలీ భుట్టో, నవాజ్ షరీఫ్, బేనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్ వంటి శక్తిమంతులైన రాజకీయ నాయకులు సవాలు చేశారు. వీరు భారత వ్యతిరేకతనూ, కశ్మీర్ అంశాన్నీ రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి వచ్చారు. పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం కొనసాగించాలంటే ప్రజాస్వామ్య ప్రక్రియలను తిరిగి అమలులోకి తేవాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చినప్పుడు ఆర్మీలోని కొన్ని ఫ్యాక్షన్లు వీరికి మద్దతు ఇచ్చాయి. అయితే, ఈ రాజకీయ నాయకులు తమ రాజకీయ బలం చూసుకుని సైన్యాన్ని ఖాతరు చేయలేదు. అటువంటి సమయంలో, సైనికాధిపతులు వారిని అధికారం నుంచి తప్పించారు. జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరి తీశారు. బేనజీర్ భుట్టోను హత్య చేశారు. నవాజ్ షరీఫ్‌ను దేశం నుంచి తరిమేశారు. ఇమ్రాన్ ఖాన్ జైలు పాలయ్యారు. వీరందరి దుర్గతికీ సైనికాధిపతులే కారకులు. మూడో చివరి ఇతివృత్తం గురించి ఇండియలో అంతగా చెప్పుకోం. పాకిస్తాన్ రాజ్యాంగం నిరంతరం సవరణలకు గురయ్యింది. తద్వారా అక్కడి రాజకీయ–సైనిక సంబంధాలను అవి ప్రభావితం చేశాయి. పాకిస్తాన్ సైన్యం రబ్బర్ స్టాంపు అధ్యక్షుల ద్వారా నేషనల్ అసెంబ్లీని రద్దు చేయించి తాజా ఎన్నికలు జరిపించేది. సర్వసాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సైన్యానికి అను కూల ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేవి. 1987లో అప్పటి అధ్యక్షుడు జియా–ఉల్–హక్ దేశాధ్యక్షుడికి (అంటే తనకు) నేషనల్ అసెంబ్లీని రద్దు చేసే విశేష అధికారాన్ని కట్టబెడుతూ రాజ్యాంగానికి 8వ సవరణ చేశారు. బేనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్‌లు ప్రధానులుగా పదేళ్ల సుదీర్ఘ పౌరపాలన అందించిన కాలంలో రాజ్యాంగానికి 13వ సవరణ తీసుకువచ్చారు. 1997 నాటి ఈ సవరణతో 1987 నాటి 8వ సవరణ రద్దు అయ్యింది. ఇలా అధ్యక్షుడి తోక కత్తిరించారు. తరువాతి దశాబ్దంలో ఆర్మీ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. 2001లో, మూడేళ్లు సైనికాధిపతిగా పనిచేసిన అనంతరం, ముషారఫ్ తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అధికారంలో కొన సాగేందుకు అతడు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. చిట్టచివరకు 2008లో అభిశంసన నుంచి తప్పించుకోవడానికి పదవికి రాజీనామా చేశారు.ముషారఫ్ అనంతరం, 2010లో 18వ రాజ్యాంగ సవరణ వచ్చింది. దేశంలో సమాఖ్య విధానాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఈ సవరణ సైతం సైన్యం అధికారాలను బలహీనం చేయలేక పోయింది. ఇటీవలి సంవత్సరాల్లో జనరల్ కమర్ బాజ్వా వంటి సైనికాధిపతులు పౌర అధికారానికి లోబడి ఉన్నట్లు నటిస్తూ, తెలివిగా అధికారం చలాయించాలని ప్రయత్నించారు. బాజ్వా తర్వాతి వాడు జనరల్ అసీమ్ మునీర్. జనరల్ జియా మూసలో ర్యాడికలైజ్ అయిన మునీర్ పాక్ రాజకీయ–సైనిక సంబంధాలను సరికొత్త స్థాయికి దిగజార్చారు.ఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) అర్జున్ సుబ్రమణియం వ్యాసకర్త మిలిటరీ హిస్టారియన్, రిటైర్డ్ ఫైటర్ పైలట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పెరిగేది... దిగుబడా? సమస్యలా?
మొన్న మే 4న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దేశంలో మొదటి సారిగా జీనోమ్ ఎడిట్ చేసిన రెండు కొత్త వరి రకాలను విడుదల చేశారు: డీఆర్ఆర్ రైస్ 100 (కమల), పూసా డీఎస్టీ రైస్ 1. కమల రకాన్ని సాంబా మహసూరి (బీపీటీ 5204) ఆధారంగా ఐసీఏఆర్–ఐఐఆర్ఆర్ హైదరా బాద్ అభివృద్ధి చేసింది. రెండవ రకం– పూసాను ఎంటీయూ 1010 ఆధారంగా ఐసీఏఆర్–ఐఏఆర్ఐ న్యూఢిల్లీ అభివృద్ధి చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వీటి వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయి: దిగుబడిలో 19 శాతం పెరుగుదల. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో 20 శాతం తగ్గింపు. 7,500 మిలియన్ క్యూబిక్ మీటర్ల సాగునీరు ఆదా. కరువు, లవణీయత, వాతావరణ ఒత్తిళ్లను మెరుగ్గా తట్టుకోగలగడం.ఈ ప్రకటన ప్రకారం, ఈ రకాలు పంట కాలాన్ని 20 రోజులు తగ్గిస్తాయి. తద్వారా కర్బన ఉద్గారాలను, నీటి వినియోగాన్ని తగ్గిస్తాయి. అయితే, మొత్తం సమాచారం బయటపెట్టలేదు. వీటి విడుదల ఆహారానికి, ఆహార భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది కాబట్టి తెలుసుకోవడం, ప్రతిస్పందించడం ప్రజల హక్కు. ఇతర దిగుబడి సమస్యలో?దాదాపు 50 ఏండ్ల క్రితం అధిక దిగుబడి వంగడాల పేరిట హైబ్రిడ్ రకాలను విడుదల చేయడం వల్ల కొనసాగుతున్న అనర్థాలు అనేకం. ఈ రెండు వరి రకాలు వాతావరణ మార్పులను తట్టుకునేవి అనుకుందాం (ఇది ఒక సందేహాస్పద వాదనగానే కనిపిస్తుంది). మరి దిగుబడి ఎట్లా పెరుగుతుంది? వరి దిగుబడిపై ప్రభావం చూపే కారణాలలో విత్తనాలతో సహ అనేకం ఉన్నాయి– సారవంతమైన నేల, సరైన పోషకాలు, నీరు, పొలంలో ఇతర జీవాల పాత్ర, వగైరా. తీవ్ర వాతావరణ మార్పుల వల్ల పంటలకు ఉపయోగపడే ఇతర రకాల జీవులు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. వాటిలో మట్టిలో ఉండే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. తెగుళ్లు కూడా ఉన్నాయి. కేవలం వరి ధాన్యానికి వాతావరణ మార్పు ఒత్తిడిని తట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుందా? దిగుబడిని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఆ విధమైన శక్తిని సంపాదించకుంటే, వరి దిగుబడి స్థిరంగా ఉంటుందా? వరి జన్యువులో ఒకటి మార్చినంత మాత్రాన దిగుబడి పెరగదు. ప్రధానంగా, భారతదేశంలో వరి దిగుబడి సమస్య చాలా కాలంగా అనేక రూపాలలో కనిపిస్తున్నది. నిరంతరం ఒకే పంట వేయడం వల్ల, అధిక నీరు ఇవ్వడం నేల సారం పూర్తిగా పడిపోయింది. కృత్రిమ, రసాయన ఎరువులు వేయనిదే పంట రావడం లేదు. ఈ రకమైన దిగుబడి సమస్య మీద పరిశోధన చేయకుండా ఇంకేదో చేయడం సరి కాదు. వాస్తవానికి, ప్రభుత్వ సమాచారం ప్రకారమే 2025 ఏప్రిల్ 1 నాటికి వరి నిల్వలు రికార్డు స్థాయిలో 63.09 మిలియన్ టన్నులు ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యం కంటే 13.6 మిలియన్ టన్నులు అధికం. మరింత దిగుబడి పెరిగితే రైతుకు గిట్టుబాటు కాదు. ప్రభుత్వం కొనదు! మరి ఈ రెండు కొత్త వరి విత్తన రకాల ద్వారా శాస్త్రవేత్తలు ఏ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు? సరళంగా చెప్పాలంటే, శాస్త్రవేత్తల అవగాహన రైతుల సమస్యలకు భిన్నంగా ఉంటున్నది. రైతులు తక్కువ దిగుబడి గురించి ఫిర్యాదు చేయడం లేదు. అధిక సాగు ఖర్చులు, గిట్టుబాటు లేని ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ తాజా వరి రకాల విడు దలలో భారతీయ రైతులకు ఏమి అవసరమో అది కాకుండా, కంపెనీ లకు ఉపయోగపడే శాస్త్రీయ పరిశోధన పేరుతో కొత్త రకాలను నెత్తిన రుద్దుతున్న వైనం కనబడుతోంది.‘శుద్ధి’ చేయడం సాధ్యమా?ఈ వరి రకాలు ఒక కొత్త సాంకేతిక విప్లవం అని ఢంకా బజాయిస్తున్నారు. గింజలను అధికంగా ఉత్పత్తి చేసే జన్యువు పని సానుకూలం చేశాము అంటున్నారు. పోషకాలు లేదా ఇతర ‘సహాయం’ లేకుండా ఒక జన్యువు అధికంగా గింజలను సాధించగలదా? గాలిలో నుంచి సాధువు భస్మం పుట్టించినట్టు వరి గింజలోని ఒక జన్యువు అధిక దిగుబడి ఇస్తుంది అంటున్నారు. పర్యవసానాలు, దీర్ఘకాలిక పరిణామాల గురించి చెప్పడం లేదు. ఈ ఆహారం తినే మనుష్యుల మీద, జంతువుల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలియదు. విత్తనాల జన్యుక్రమం, సహజ సంపదకు కలిగే దీర్ఘకాలిక పరిణామాల గురించి అసలే తెలియదు. ఈ రకమైన విత్తనాల వల్ల సహజ, మంచి రకం విత్తనాలు కలుషితం అయితే తిరిగి వాటిని ‘శుద్ధి’ చేయడం అసాధ్యం. పరిశోధనలు, పరిశీలనలు, పరీక్షలను కొన్ని ఏళ్ల పాటు ప్రయోగశాలలో జరపాల్సి ఉండగా, కేంద్రం తొందర పడి ఈ రెండు రకాలను విడుదల చేయడంలో సార్వజనీన సంక్షేమ లక్ష్యం కనపడటం లేదు. విదేశీ ప్రైవేట్ కంపెనీల గుప్పిట్లో ఉన్న ఈ టెక్నాలజీకి ప్రభుత్వమే ముందుండి ప్రోత్సాహం ఇవ్వడం ఆశ్చర్యం కలిగి స్తున్నది. పేరుకే కేంద్ర ప్రభుత్వ సంస్థల పేర్లు ముందట పెడుతున్నా దీని వెనుక విదేశీ, లాభాపేక్ష శక్తులు ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. విత్తనాలు, జన్యు సంపదతో ఆడుకోవడానికి శాస్త్రవేత్తలకు క్రిస్పర్ (సీఆర్ఐఎస్పీఆర్) ఒక సాధనంగా మారింది. ఈ టెక్నాలజీ ఉపయోగించి ఇంకా 40 పంటల మీద పరిశోధనలు జరుగుతున్నా యని కేంద్రం ప్రకటించింది. వరి జన్యుక్రమంలో జన్యువులను తమ ఇష్టానుసారంగా తొలగించి, శాస్త్రవేత్తలు కోరుకున్న విధంగా ‘స్పంది స్తుందని’ మనకు విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అధిక దిగుబడి, వాతావరణ ఒత్తిళ్లకు తట్టుకునే శక్తి సామాజిక–ఆర్థిక లక్ష్యాలు. ఇవి ఇప్పుడు ప్రకృతిలో చొప్పించబడ్డాయి. ప్రకృతిపై ఇటువంటి పరిశోధన నిరపాయ కరమైనది కాదు. ఈ పరిశోధన వెనుక ఉన్నతమైన ఆదర్శాలు లేవు. స్వతంత్ర పర్యవేక్షణ లేకుండా ఒక కొత్త ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టి వ్యాపారం పెంచుకోవడానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఆక్షేపించదగినది. భారత ప్రభుత్వం ఈ రకం పరిశోధనలను నియంత్రించాలి, నిషేధించాలి. అంతగా అవసరం అనుకుంటే ప్రయోగశాలలకే పరిమితం చేయాలి. క్రిస్పర్ ఆధారిత జన్యుమార్పిడి పంటల మీద భారత సమాజంలో విస్తృత, బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉంది.దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
International Day for Biological Diversity మనల్ని కాపాడే వైవిధ్యం!
‘ప్రకృతితో సామరస్యం, సుస్థిర అభివృద్ధి’ అనే ఇతివృత్తంతో ఈ యేటి ‘అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం’ (International Day for Biological Diversity) నేడు జరుపుకొంటున్నాం. మానవుని కార్యకలా పాల కారణంగానే ఈ భూమిపై జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. గత దశాబ్దంలో, మనం గణనీయమైన జీవవైవిధ్య నష్టాన్ని చవి చూశాం. 467 జాతులు అంతరించిపోయాయి. ఈ నష్టం అస్థిరమైన వనరుల వినియోగం, కాలుష్యం, అన్యజీవుల ఆవాస ప్రాంతాల దురాక్రమణ వంటి వాటి వల్ల సంభవించిందే. గత దశాబ్దంలో వివిధ కారణాల వల్ల గణ నీయమైన పంట జన్యు వైవిధ్యం కోల్పోయాం. జీవ వైవిధ్య నష్టా నికి వాతావరణ మార్పు ఒక ముఖ్యమైన చోదకంగా లేదా ఉత్ప్రే రకంగా పనిచేస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్ష పాత పరిమాణాలు, అడవి మంటలు వంటి సంఘట నలు జీవ జాతుల ఆవాసాలను నాశనం చేస్తాయి. INTERNATIONAL DAY FOR BIODIVERSITY 2025"Harmony with nature and sustainable development".#BiodiversityDay #BiodiversityDay2025 pic.twitter.com/LLHRlWJ5gn— Ministry of Cities, Local Government, Public Works (@MoCLPmv) May 21, 2025 పొంచి ఉన్న జీవవైవిధ్య సంక్షోభం జన్యు వనరు లకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది, ఇది జాతుల జన్యు వైవిధ్యంలో క్షీణతకు, వాటి విలుప్తానికి కూడా దారితీస్తుంది. ఆహార భద్రతను కాపాడుకోడానికి, కొత్త ఔషధాల అభివృద్ధికి, వాతావరణ మార్పులకు అను గుణంగా జీవజాలంలో ఉన్న మారగలిగిన సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు జన్యు వైవిధ్యం తప్పనిసరి. జీవవైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా జాతీయ, అంత ర్జాతీయ ‘చట్టపరమైన చట్రాలు’ ఉన్నప్పటికీ, ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దేశంలోని జీవ వైవిధ్య చట్టంలో చేసిన కొన్ని సవరణలు, జీవవైవిధ్య పరిరక్షణ స్ఫూర్తికి అనుగుణంగా లేవని చెప్పక తప్పదు. అలాగే చట్టాల బలహీనమైన అమలు, అవినీతి, రాజ కీయ జోక్యం, అవగాహనా రాహిత్యం, ప్రజా మద్దతు కొరవడటం, జీవవైవిధ్యానికి అపార నష్ట హేతువులు.ఇదీ చదవండి: అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకిజీవవైవిధ్యాన్ని కాపాడటానికి ‘ఇన్–సీతూ’ పరి రక్షణ అవసరం ఉంది. ఆ యా జీవ జాలాల సహజ ఆవాసాలలో ఉండే పరిస్థితుల రక్షణ ఒక కీలకమైన వ్యూహం కావాలి. జీవజాలాల ఆవాసాల పునరుద్ధరణ, నిర్వహణలలో ప్రజలకు అవగాహన కల్పించి వారినిఆ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. జాతీయ ఉద్యానాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు వంటి రక్షిత ప్రాంతాలను స్థాపించాలి. కేంద్ర ప్రభుత్వ రెండవ ‘జీన్ బ్యాంక్’ నిర్మాణానికి పూనుకో వడం ఆహ్వానించదగిన పరి ణామం. స్థానిక సమాజాల ‘కమ్యూ నిటీ విత్తన నిధుల’ను అనుసంధాన పరచడం జీవ వైవిధ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన అంశం అవు తుంది. వ్యవసాయం, అడవులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివాటి విషయంలో భూవినియోగ ప్రణా ళికను జీవవైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించాలి. ఈ అన్ని చర్యలూ జీవవైవిధ్యాన్ని కాపాడి భూగోళాన్ని సజీవంగా ఉంచుతాయి. ఇదీ చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీబలిజేపల్లిశరత్ బాబు వ్యాసకర్త జాతీయ జన్యు వనరుల బ్యూరో విశ్రాంత శాస్త్రవేత్త(నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం) -
ఆ వాఙ్మూలం ముమ్మాటికీ చెల్లదు!
ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం కేసులో కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహనిందితుల నేరాంగీకార వాఙ్మూలానికి సంబంధించి హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేవలం సహనిందితుడి నేరాంగీకారం ఆధారంగా ఒక వ్యక్తి బెయిల్‌పై నిర్ణయం తీసుకోరాదని వ్యాఖ్యానించింది. సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఇచ్చిన వాఙ్మూలాన్ని మరొకరికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ‘భారతీయ సాక్ష్యాల చట్టం–1872’ సెక్షన్ 30 కింద తుది విచారణ సందర్భంగా ఏ వాఙ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో పిటిషనర్లకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఎందుకు నిరాకరించింది అనేది ముఖ్య మైన ప్రశ్న. రిజిస్టర్ చేసిన కేసులో ఆరోపణలు తీవ్రమైనవి. ఐపీసీ సెక్షన్ 409, 420, 12బి, రెడ్ విత్ సెక్షన్ 34, 37 కింద ఈ కేసు నమోదయ్యింది. అయితే, ముందస్తు బెయిల్‌ను కొట్టివేసే సమయంలో సహనిందితుని వాఙ్మూలానికి సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 30కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సహనిందితుడి పోలీసు భయం ఆధారంగా నేరాంగీకార ప్రకటన నిలబడదనీ, కనుక అలాంటి అరెస్టు చెల్లదనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చెప్పారా, చెప్పించారా?నేరాలు చేసినప్పుడు సాక్ష్యాలు దొరకవు. పరిశోధనలో, దర్యా ప్తులో కొన్ని సాక్ష్యాలు దొరుకుతాయి. పోలీసులు న్యాయంగా సాక్ష్యాలు సేకరిస్తే, అందులో లంచగొండితనం లేకపోతే నిజాలు రుజువయ్యే అవకాశం ఉంటుంది. కానీ మన లోకంలో, లౌక్యంలో ఏం చెప్పగలం? అందరికీ తెలుసు, పోలీసులు నాలుగు తగిలిస్తే తప్ప నిజాలను కక్కడం సాధ్యం కాదు అంటారు. చాలా వరకు నిజం. కానీ తన్నినప్పుడు చెబుతున్నారా, లేక తంతున్నప్పుడు దెబ్బలు భరించలేక నేరాన్ని ఒప్పుకొంటున్నారా? ఈ రెండిటికీ చాలా తేడా ఉంటుంది. ‘దెబ్బలు నా వల్ల కాదు’ అనుకున్నపుడు, దానికన్నా నేరం ఒప్పుకొంటే కోర్టుకు పోయేదాకా బతికిపోవచ్చు అనుకుంటారు. కనుకనే పోలీసుల హింసలో చెప్పిన అంశాలను కోర్టులో చూపినప్పుడు, ఆ నిందితుడు ఇదంతా హింసించడం వల్ల రాసిందే గానీ నిజం కాదని చెప్పినప్పుడే తగాదా మొదలవుతుంది. అక్కడే లాయర్లు వస్తారు. నేరం రుజువు కాదు. నేరాంగీకారం రుజువు కాదు. సహ నింద భరించే గతి!నేర విచారణలో ఒక నిందితుడు, మరొక వ్యక్తి కూడా ఆ నేరంలో పాలు పంచుకున్నాడని వాఙ్మూలం ఇస్తే, సంబంధిత రెండవ వ్యక్తి సహ నిందితుడు అవుతాడు. పోలీసులు చెప్పించుకున్న నేరాంగీ కారం వాడుకుని మొదటి వాడినీ, తరువాత రెండో వాడినీ కూడా జైలుకు పంపిస్తారు. అప్పుడు బెయిల్ కోసం పోరాటం ప్రారంభ మవుతుంది. అది లాయర్ల భారీ ఫీజు ఆధారంగా, కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టుదాకా న్యాయ పోరాటం సాగుతూ ఉంటుంది. అందుకే తీర్పులు ఆలస్యమవుతాయి. వాయిదాలు వస్తాయి. అప్పీల్సు ఉంటాయి. మధ్యలో తాత్కాలిక ఆర్డర్స్ వస్తాయి. (అంటే అంతిమ నిర్ణయం వంటిది కాకుండా వచ్చే తాత్కాలిక ఉత్తర్వు ఇస్తారు. అక్కడ ఉన్నపుడే, తరువాతి స్థాయి, అంటే సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో అన్యాయంగా జైలుకు పోకుండా బెయిల్ హక్కుల్ని కాపా డుకుని విడుదల అవుతూ ఉంటారు. మన పత్రికా భాషలో ‘నిందితు డికి సుప్రీం నుంచి ఊరట’ అని అంటూ ఉంటాం.)సీఆర్పీసీ సెక్షన్ 161 కింద (ఇది పాత కేసు. పాత నేరం కావడం వల్ల కొత్త ఎన్డీఏ సర్కారు రచించిన భారతీయ న్యాయ చట్టాలను ఈ సందర్భంలో ఉటంకించడం లేదు. కూడదు. లేకపోతే అయోమ యంలో పడిపోతాం) అనుమానితుడి వాఙ్మూలానికి విలువ ఉన్న ప్పటికీ, పోలీసులకు చెప్పిన నేరాంగీకారాన్ని వాడుకుంటూ సహనిందితుడిని అరెస్టు చేయడం న్యాయమా? నేరారోపణ అనే గుడ్డ కాల్చి మొఖాన పారేసినప్పుడు జైల్లో పడేస్తారు. అందులో నిజా నిజాలు తేలకుండానే ఉన్నప్పుడు ఏం చేయాలి? బెయిల్ ఇవ్వాల్సిందే! రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని చెప్పగలిగితే, ఆయా అంశాలను కోర్టు విశ్వసిస్తే, పోలీసులను నమ్మని దశలో బెయిల్ దొరుకుతుంది. అంటే పోలీసులు సాధించిన నేరాంగీకారాల ఆధారంగా నిందితులు, అనుమానితులు అనే పేరుతో అమాయకులను జైలుకు పంపిస్తే, కోర్టే దిక్కు. న్యాయమూర్తులు, జిల్లా స్థాయి న్యాయాధికారులు... మంత్రుల వంటి పెద్దల వీవీఐపీ కేసులని భయపడకుండా ఉత్తర్వులు ఇస్తేనే బెయిల్ దొరుకుతుంది. న్యాయం లభిస్తుంది. ఊరట లభిస్తుంది. ఇది అటువంటి కేసు! వారి ఆరోప ణలు నిజమో కాదో ఇప్పుడే చెప్పలేము. కానీ మొదటి దశలోనే పోలీసుల భయం ఆధారంగా వచ్చిన నేరాంగీకారాలు తీసుకుని అరెస్టు చేయకూడదు.మన ‘కొత్త’ నేర చట్టాలుమన ‘భారతీయ’ సాక్ష్య చట్టం కొత్తది కాదు. ఇది ఆంగ్లేయులు రాసిపెట్టిన సాక్ష్యాల చట్టం... ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 నుంచి... అంటే 153 ఏళ్ల నుంచి అమలులో ఉన్న చట్టం. (మనం అంతా కొత్త చట్టాలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్నాం. పాత సాక్ష్య చట్టపు నియమం కొత్త న్యాయ చట్టంలోనూ ఉంది.) పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకొంటే అనుమానం ఉంటుంది. కనుక ఆ వాఙ్మూలానికి ఆమోద యోగ్యత ఉండదు. ఇది సెక్షన్లు 24, 25, 30 కింద అనుమానితమైన ప్రకటన అని 153 సంవత్సరాల నాటి సూత్రం. దీనిపైన ఎన్నో వందల కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. నేరాంగీకారాన్ని అనుమానిస్తారు. పోలీసుల సమక్షంలో, లాకప్‌లో, లేదా మరెక్కడైనా సరే కొందరు పోలీసులు ఎదురుగా ఉండినప్పుడు ఈ అనుమానం బలవంతం అని అనుకుంటారు. చట్టం తెలియకపోయినా, సాధారణంగా మామూలు మనుషులకు కూడా ఈ విషయం తెలుసు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ), భారతీయ సాక్ష్య చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతదేశ న్యాయ వ్యవస్థలపైన, సమాజం పైన, న్యాయస్థానా ల్లోనూ ఇప్పటికీ నిలబడిన చట్టాలు. 153 సంవత్సరాల నుంచి ఈ సూత్రాలు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి మౌలిక మైన సూత్రాలు. ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా అమలు చేయ వలసిన సూత్రాలు. బ్రిటిష్ వారి సూత్రాలు కాబట్టి పనికిరావని అనుకోవడానికి వీల్లేని నియమాలు ఇవి. ఆ సూత్రాలను కాపాడుకుంటూ కొన్ని మార్పులు చేశారు. అయితే, ఈ చట్టాలు మన న్యాయ వ్యవస్థకు పునాదిగా ఉన్నప్పటికీ, ఆధునిక భారతదేశ సంక్లిష్టతలను పరిష్కరించడానికి ఇబ్బంది పడ్డాయి. అందుకే 2020లో ప్రొఫెసర్ (డాక్టర్) రణ్‌బీర్ సింగ్ అధ్యక్షత వహించిన ‘కమిటీ ఫర్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ లాస్’ (సీఆర్‌సీఎల్) ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రూపొందించిన కొత్త చట్టాల పేర్లు ఇవి: భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత.బెదిరిస్తే, ప్రలోభ పెడితే...నేరారోపణకు గురైన వ్యక్తి చేసిన అంగీకారం ఏదైనా ప్రేరేపణ లేదా బెదిరింపు లేదా లాభం చేస్తామనే వాగ్దానంతో జరిగినట్లు కనిపిస్తే, ఆ వ్యక్తి నేరాంగీకారం అసంబద్ధం. ఇది కీలకమైన సూత్రం. పోలీసు కస్టడీలో నేరాంగీకరణ విషయంలో ఇది కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు. తాజాగా 2022లో కూడా ఇంద్రేశ్ కుమార్ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఇటువంటి నేరాంగీకారాన్ని ఒప్పుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, ‘వికాస్ సిమెంట్స్’ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్‌కై హైకోర్టుకు వెళ్లారు. ఆపై సుప్రీంకు అప్పీలు చేశారు. ‘నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాఙ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రం’ అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడమే కాక, దీనిపై సంపూర్ణ వివరణ ఇచ్చింది. బెయిల్ మంజూరు సమయంలో కోర్టులు ఆ యా అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని నిర్దేశించింది. ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో సహనిందితుల వాఙ్మూలా లను పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
విచారణలో ఉన్నా చర్చించవచ్చు!
ఏదైనా కేసుపై విచారణ జరుగుతున్నా, లేదా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నా ... ఆ కేసును మీడియా ప్రస్తావించడం, చర్చించడం, విమర్శించడం తప్పు కాదని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసు విషయంలో అభిప్రాయపడింది. ఇప్పటివరకూ అలా ప్రసార మాధ్యమాల్లో ప్రస్తావించడం తప్పుగా భావించేవారు. ప్రజాస్వామ్యంలో పటిష్ఠమైన చర్చలు, నిర్మాణాత్మక విమర్శలను స్వాగతించాల్సిన అవసరం ఉందనీ, బలమైన చర్చలతోనే ఆత్మపరిశీలన సాధ్యమవుతుందనీ కూడా కోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్య మూల స్తంభాలనీ, ఇవి రెండూ పరస్పరం అనుబంధంతో కొనసాగాలనీ, అప్పుడే స్వేచ్ఛాయుత ప్రజా స్వామ్యం పరిఢవిల్లు తుందనీ సుప్రీం పేర్కొంది.వికీమీడియా ఫౌండేషన్‌పై ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ) ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్ విచారణలో ఉంది. అయినా ఆ ఫౌండేషన్ తాను నడుపుతున్న ‘వికీపీడియా’ వెబ్సైట్లో ఆ కేసు వివరాలు పోస్ట్ చేసింది. దీంతో ఏఎన్ఐ అభ్యర్థన మేరకు హైకోర్టు ఈ కేసు వివరాలున్న వెబ్ పేజీని తొలగించాలని వికీమీడియాను ఆదేశించింది. వికీమీడియా ఈ విషయంలో సుప్రీం కోర్టు మెట్లెక్కడంతో అత్యు న్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ హైకోర్టు ఆదేశాలను రద్దుచేసింది. న్యాయస్థానాలు ప్రజలకు సంబంధించిన బహిరంగ వ్యవస్థలనీ, అక్కడ జరిగే అంశాలు, ప్రస్తావనలు ప్రజలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారనీ, అందువల్ల వాటిని గోప్యంగా ఉంచా ల్సిన అవసరం లేదనీ సుప్రీం పేర్కొంది. అలాగని మీడియా విచ్చలవిడిగా వ్యవహరిస్తే కోర్టులు సహించవని సున్నితంగా హెచ్చరించింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో న్యాయస్థానాలను అప్రతి ష్ఠపాలు చేసినా, న్యాయ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా వార్తలు రాసినా, చర్చలు జరిపినా తీవ్రంగా పరిగ ణిస్తామని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ మెరుగుపడాలన్నా ఆత్మపరిశీలన అవస రమనీ, అప్పుడే మెరుగైన ఫలితాలు వెలువడే అవకాశాలు ఉంటాయనీ పేర్కొంటూ, ఇందుకు న్యాయ వ్యవస్థ కూడా మినహాయింపు కాదని స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. మీడియాకు మరింత స్వేచ్ఛ సమకూరడం ఆహ్వా నించదగిన పరిణామమే. అయితే భద్రతా కార ణాల రీత్యా ‘రహస్యం’ (ఇన్ కెమెరా)గా నిర్వహించే విచారణకు ఈ తీర్పు ‘పెనుముప్పు’గా మారే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా, ఎటు వంటి నియంత్రణా లేని సామాజిక మాధ్యమాలకు అడ్డూ అదుపు ఉంటాయా? సంచలనాల పేరుతో మరింత చెలరేగి పోయేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే విచ్చలవిడిగా, బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్న ‘కొన్ని’ సోషల్ మీడియా వేదికలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రాణాలకు తెగించి వార్తా ప్రసారాలు చేసే చానళ్లు, వార్తలు ప్రచురించే పత్రికలు ఈ తీర్పును మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించుకుంటాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ‘గోప్యత హక్కు’ (రాజ్యాంగ అధికరణం 21), అధికారిక రహస్యాల చట్టం, కోర్టు ధిక్కార చట్టం (1971) ఇత్యా దిగా గల చట్టాల సంగతి ఏం కాను? సుప్రీం తాజా తీర్పును ‘యథాతథం’ (ట్రూ స్పిరిట్ )గా అర్థం చేసుకుంటే సానుకూల ఫలితాలు చారెడు. విపరీతా ర్థాలు తీసి, ఇష్టానుసారం వక్రీకరిస్తే అనర్థాలు బారెడు. అందుకే సంయమనంతో మీడియా సంస్థలు వ్యవహరించాల్సి ఉంటుంది.ప్రొ‘‘ పీటా బాబీ వర్ధన్ వ్యాసకర్త మీడియా విశ్లేషకులు -
ఇండియా, చైనాల మధ్య ఇంత వ్యత్యాసమా?
నేను బీజింగ్ నుండి తిరిగి వచ్చి పదిహేను సంవత్సరాలు గడిచింది కానీ, నేను ఇంకా దాని గురించి రాయబోతున్నాను. అప్పట్లోనే చైనా రాజధాని నన్ను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పడం దాన్ని తక్కువ చేసినట్లే అవుతుంది. నిజం ఏమిటంటే బీజింగ్‌లో ఆనాడు నేను చూసిన, కనుగొన్న అంశాలు నన్ను ఆశ్చర్యచకితుడిని చేశాయి. ఇప్పుడు అదనంగా, చాలా కాలం క్రితం పరిష్కృతమైందని నేను భావించిన వాస్తవం, పాత చర్చను మళ్ళీ రేకెత్తించింది.నేను బీజింగ్‌లో మూడు రోజులు మాత్రమే ఉన్నాను. రాజధానిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే చూశానని చెప్పాలి. కానీ గ్రేట్ వాల్, మింగ్ సమాధులను దర్శించాను. నగరంలో, గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ గడిపాను. కానీ నేను చూసిన ప్రతిదీ అభివృద్ధి చెందిన మొదటి ప్రపంచాన్ని సూచించింది. రోడ్లు, భవనాలు, దుకాణాలు, ప్రజల వేషధారణ, వారి ప్రవర్తన... మూడవ ప్రపంచ నగరాన్ని కాదు, యూరోపియన్ లేదా ఉత్తర అమెరికా మహానగర సంçస్కృతిని తలపింపజేశాయి. ఏ అర్థంలో చూసినా ఈ అంశాలలో దేనిలోనూ ఢిల్లీ పోటీపడలేదు.బీజింగ్ నమ్మశక్యం కాని విధంగా శుభ్రంగానూ, ఆశ్చర్యకరంగా స్నేహపూర్వకంగానూ ఉంది. చైనీయులు బహిరంగంగా ఉమ్మివేస్తుంటారని నాకు చెప్పారు. నేను చైనాలో గడిపిన మూడు రోజుల్లో అలా ఉమ్మి వేసినవారిని అరడజను మందిని కూడా చూడలేదు. మింగ్ సమాధులు లేదా ఫర్బిడెన్ సిటీ వద్ద వేలాది మంది ఉన్నారు కానీ వారిలోనూ ఈ అలవాటును చూడలేదు. కాలిబాటలపై చెత్త లేదు, గోడలపై పాన్ మరకలు లేవు, దుకాణాల వెలుపల పారవేసిన సిగరెట్ పీకలు, చిరిగిన పాలిథిన్ సంచులు కూడా లేవు.అంతేకాకుండా చైనీయులు స్నేహపూర్వకంగా ఉన్నారు. నేను హోటల్ నుండి తియానన్మెన్ స్క్వేర్‌కు వెళుతున్నప్పుడు అపరి చితులు తరచుగా నడుచుకుంటూ వచ్చి కబుర్లు చెప్పారు. వారు అడుగులో అడుగు వేసి, అది సహజమైన, స్పష్టమైన పని అన్నట్లుగా సంభాషణను ప్రారంభించారు. వారిలో చాలామంది ఇంగ్లిష్ అభ్యసించే విద్యార్థులే అంటే సందేహం లేదు, కానీ మరే ఇతర నగరంలోనూ ఇంత స్వేచ్ఛాయుతమైన ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదు.ఏది మంచి వ్యవస్థ?వాస్తవానికి 1962 నాటికి చైనాతో మనకు ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితిపై, చైనా–ఇండియా పోటీపై స్పష్టమైన భారతీయ దృక్పథంతో నేను బీజింగ్‌కు వెళ్లాను. కానీ, చైనా పట్ల తీవ్రతకు తగ్గని ఆకర్షణ, ఏకపక్షతతో తిరిగి వచ్చాను. కానీ ఇప్పుడు అది పాత భావజాల ఘర్షణను మళ్లీ రగిలించింది.నిరంకుశ రాజ్యమైన చైనా – ఆర్థిక వృద్ధిని, అభివృద్ధిని తన ప్రాథమ్యంగా చెప్పుకొంటుంది. స్వేచ్ఛా వ్యక్తీకరణ, సహకారం, రాజకీయ ఎంపికలకు సంబంధించిన ఉదారవాద హక్కులను విస్మరిస్తుంది. క్రమశిక్షణ అనేది అక్కడ స్వేచ్ఛా వ్యక్తీకరణ కంటే ముఖ్యమైనది. భిన్నాభిప్రాయాన్ని తీవ్రంగా శిక్షిస్తారు. దీనికి విరుద్ధంగా, భారతదేశం స్వేచ్ఛా పత్రికా వ్యవస్థ, బహుళ, పోటీ రాజకీయ పార్టీలు, స్వతంత్ర న్యాయవ్యవస్థతో పాటు సిద్ధాంతపరంగా తాము కోరుకున్నది చేయడానికి స్వేచ్ఛ ఉన్న వ్యక్తులతో కూడిన ప్రజా స్వామ్యం. మనం తరచుగా మన ప్రభుత్వాలను మారుస్తాం. తరచుగా మన రాజకీయ నాయకులను పక్కన పెడుతుంటాం. స్పష్టంగా చెప్పాలంటే, భారత్‌తో పోలిస్తే చైనా తక్కువ ఆహ్వానించదగిన దేశంగా కనిపిస్తుంది.కానీ ఈ విషయాన్ని కాస్త భిన్నంగా చూడండి: చైనా తన ప్రజలకు ఆర్థిక భద్రత, మెరుగైన జీవనశైలి, అధిక తలసరి ఆదాయం ఇచ్చింది. 1947లో (లేదా 1949లో, పీపుల్స్ రిపబ్లిక్ పుట్టినప్పుడు) భారత్, చైనాలు ఒకే ఆర్థిక స్థితిలో ఉన్నాయి. 2010లో, నేను చైనాను సందర్శించినప్పుడు, దాని తలసరి ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువ. వారి పిల్లలలో 7 శాతం మందే పోషకాహార లోపంతో ఉన్నారు; కానీ మన పిల్లలలో 46 శాతం మంది పోషకాహార లోపంతో ఉన్నారు. దేశంలో పరిస్థితులు మారాయనడంలో సందే హం లేదు. కానీ భారతీయులు పేదరికం నుంచి పూర్తిగా బయట పడతారనే భావన సందేహంగానే ఉంటుంది!కాబట్టి రెండు దేశాలకు సంబంధించి ఏది మంచి వ్యవస్థ? అత్యవసర పరిస్థితి సమయంలో గంటల తరబడి దీనిపై తీవ్రమైన చర్చను నిర్వహించిన విషయం నాకు గుర్తుంది. 1977 ఎన్నికలు ఈ విషయాన్ని పరిష్కరించాయని నేను అనుకున్నాను. భారత ప్రజలు స్వేచ్ఛ కోసం ఓటు వేసి, ఇందిరా గాంధీ వేసిన పురోగతి, అభివృద్ధి అనే ఎరను తిరస్కరించారు. కానీ చైనా ఆ ప్రశ్నను తిరిగి మేల్కొలిపింది. ముప్పై సంవత్సరాలుగా చైనా సాధిస్తూ వచ్చిన 10 శాతం వృద్ధి, భారత్ సాధించిన దానికి స్పష్టమైన, ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. పైగా రానురానూ ఈ అంతరం పెరు గుతూ ఉండవచ్చు.నేను నా భావనలను స్థిరం చేసుకునే ముందు చైనా గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి, చూడాలి. కానీ నా విశ్వాసం దెబ్బతింది. తద్వారా వచ్చిన ప్రశ్నలు నన్ను కలవరపెడుతున్నాయి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చైనాతో అమెరికా వైరం ముగిసేదేనా?
అమెరికా, చైనాల ప్రతినిధుల మధ్య ఈనెల 10, 11 తేదీలలో జెనీవాలో జరిగిన చర్చలు వాణిజ్య సుంకాల విషయంలో ఒక రాజీని కుదిర్చాయి గానీ, మరికొన్ని సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి. మౌలికంగా గుర్తించవలసింది ఏమంటే, ఇరువురి మధ్య అసలు సమస్య సుంకాలకు మించినది. అది ఆధి పత్య సమస్య. చైనాకు ఆధిపత్యం లభించకుండా ఉండేందుకు పలు విధాలుగా ప్రయ త్నిస్తూ వస్తున్న అమెరికా, అందుకు సుంకాల యుద్ధాన్ని కూడా ఒక సాధనంగా ఎంచుకుంది. అయితే, ఈ యుద్ధంలో గెలవలేక పోతు న్నట్లు అర్థం కావటంతో జెనీవాలో రాజీకి వచ్చింది. అంతమాత్రాన ఇరువురి మధ్య ఆధిపత్య వైరం ముగిసినట్లు కాదు. అది అనేక రూపాలలో పలు సంవత్సరాలపాటు సాగనున్నది.తొలుత తగ్గింది అమెరికానే!జెనీవాలో రెండు రోజుల చర్చల తర్వాత, చైనాపై సుంకాలను అమెరికా 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించగా, చైనా 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. అంతకు ముందు వారాలలో ఒకరిపై ఒకరు పోటాపోటీగా సుంకాలు పెంచుతూ పోయారు. తక్కిన అన్ని దేశాలపై అమెరికా సుంకాలు 50 శాతానికి లోపే కాగా, చైనాపై ఒక దశలో 245కి పెంచారు. తర్వాత అన్ని దేశాలపై 90 రోజులు వాయిదా వేసి చైనాకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. ఆ విధంగా తమ యుద్ధం ప్రధానంగా చైనాపై అన్నది అందరికీ అర్థ మైంది. కానీ, ట్రంప్ అంచనా వేసినట్లు చైనా లొంగి రాలేదు. వాణిజ్య యుద్ధాలు తగవనీ, స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలకు విరుద్ధమనీ స్పష్టం చేసింది. వాణిజ్య యుద్ధం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయని తెలిసినా, ప్రత్యామ్నాయాలను అన్వేషించటం మొదలు పెట్టింది.తనవైపు నుంచి అమెరికాకు చైనా కన్నా ఎక్కువ నష్టాలు కనిపించ సాగాయి. ఆ పరిస్థితులలో చైనాతో రాజీ చర్చల కోసం ట్రంప్ ప్రయత్నాలు సాగించారు. చర్చలను చైనాయే కోరుకుంటున్నదంటూ మొదట మేకపోతు గాంభీర్యం చూపి, చివరకు తామే చర్చల తేదీలు ప్రకటించారు. సుంకాలు ఆ స్థాయిలో అవాస్తవికమని ట్రంప్‌తో పాటు ఆయన అధికారులు ముందునుంచే వ్యాఖ్యానించారు. సుంకాలను తాము బహుశా 80 శాతానికి తగ్గించవచ్చునని కూడా ట్రంప్ సూచించారు. అటువంటిది జెనీవాలో అనూహ్యంగా 30 శాతానికి వచ్చారు. ఈ విరామం 90 రోజుల కోసం! ఆ తర్వాత కూడా 145 శాతానికి వెళ్లే అవకాశం లేదని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.ఈ 90 రోజులలో ఏమి జరగవచ్చునన్నది ఒక ప్రశ్న. అదట్లుంచి, జెనీవాలో ఉభయులకూ మరికొన్ని ప్రయోజనాలు కలి గాయి. ఉదాహరణకు, అమెరికాకు అరుదైన ఖనిజాలు, లోహాల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని చైనా ఎత్తివేసింది. అవి లేనట్లయితే అమెరికాలో రక్షణ రంగంతో సహా అనేకం తీవ్రంగా దెబ్బతింటాయి. మొత్తం ప్రపంచంలోనే ఈ ఖనిజ నిక్షేపాలు, వాటి శుద్ధి పరిశ్రమలు 70 శాతానికి పైగా చైనా అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నిక్షేపాల కోసం ఉక్రెయిన్, రష్యా, కెనడా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, గ్రీన్లాండ్, ఆఫ్రికా తదితర ప్రాంతాలలో అమెరికా వేగంగా ప్రయత్నాలు ఆరంభించింది గానీ, అవి ఒకవేళ ఫలించినా వినియోగంలోకి రావాలంటే పదేళ్ళు పట్టవచ్చుననే అంచనాలున్నాయి. కనుక చైనా సరఫరాలు తప్పనిసరి. అదేవిధంగా, చైనా రవాణా నౌకలపై ఆంక్షలు, సుంకా లను అమెరికా రద్దు చేయనున్నది. ఆ విధంగా జెనీవాలో ఇతర లాభాలు కూడా ఇరువురికీ కలిగాయి.చైనా సవాలుసుంకాల యుద్ధం ప్రారంభించటంలో ట్రంప్ ఆశించినవి మరొక రెండు ఉన్నాయి. చైనాకు, ఇతర దేశాలకు తరలిపోయిన అమెరికన్ పరిశ్రమలు తిరిగి రావటం, తమ వద్ద అన్ని సుంకాలనూ రద్దు చేయగలమని ప్రకటించినందున ఇతరులు తమ దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం ఒకటైతే, ఆ కారణంగా తమ వద్ద ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగటం రెండవది. అవి సాకారం కావటం తేలిక కాదని అమెరికా సహా పాశ్చాత్య నిపుణులే విశ్లేషిస్తున్నారు. అందుకు ఎదురయ్యే తక్షణ సమస్యలు రెండున్నట్లు చెప్తు న్నారు. ఒకటి–అవసరమైన మౌలిక సదుపాయాలు, సప్లయ్ చెయిన్లు లేకపోవటం; వాటి అభివృద్ధికి తగినంత కాలం అవసరం కావటం. రెండవది–ఇతర దేశాల కార్మికులు చేసే అనేక పనులకు అమెరికన్ కార్మికులు సిద్ధపడక పోవటం, వారికి ఆ శిక్షణలూ లేకపోవటం.అందువల్ల, 90 రోజుల అనంతరపు అనుభవాలు, సమీక్షలు ఆశావ హంగా ఉండే అవకాశాలు కన్పించవు.మరొక ముఖ్య విషయం. ట్యారిఫ్‌లకు చిన్న దేశాలు బెదిరిపోగా, కెనడా, యూరప్, చైనా గట్టిగా ప్రతిఘటించాయి. ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, తైవాన్ ఇచ్చిపుచ్చుకునే విషయం ఆలో చించాయి. చివరకు జెనీవాలో జరిగినది అందరికీ కొంత ధైర్యాన్నిస్తు న్నది. వారు చైనా స్థాయిలో ధిక్కరించటం సాధ్యం కాకపోయినా,ట్రంప్‌తో మరికొంత బేరమాడగలరు. తమకు అమెరికా ఎంత అవస రమో వారికి అమెరికా అవసరం కూడా ఏదో ఒక స్థాయిలో ఉంటుంది. అమెరికా ఎంత శక్తిమంతమైన దేశమైనా అన్నీ తను కోరు కున్నట్లే జరగబోవు. స్వేచ్ఛా వాణిజ్యానికి, డబ్ల్యూటీఓకు సృష్టికర్తలు వారు. పెట్టుబడులు ఎటునుంచి ఎటైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చునని సిద్ధాంతీకరించిందీ వారే! దాని ఫలితాలను దశాబ్దాల పాటు పొందిన తర్వాత ఇపుడు భయపడటం ఎందుకు? కొన్ని విధానాల ఫలితాలు ఒక దశలో ఒక విధంగా ఉన్నప్పటికీ, కాలం గడిచినకొద్దీ కొత్త పరిణా మాలు సంభవిస్తాయి. అపుడు ఆ విధానాలు, ఫలితాలలో వైరు ద్ధ్యాలు తలెత్తుతాయి. అటువంటి కొత్త పరిణామం చైనా అయింది.చరిత్ర మలుపులో...అమెరికా సమస్య కేవలం వాణిజ్య లోటు కాదు. చైనా గత 15–20 ఏళ్ళుగా నాలుగు విధాలుగా వేగంగా అభివృద్ధి చెందుతు న్నది. ఆర్థికం. సైనికం. శాస్త్ర–సాంకేతిక రంగాలు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పలుకుబడి. ఇవి నాలుగూ అమెరికా అగ్రస్థానాన్ని దెబ్బతీ యగలవు. ఒకప్పటి సోవియెట్ యూనియన్ ఏ బలహీనతల వల్ల పతనమైందో చైనా కూడా అదే విధంగా పతనం కాగలదని ఒక దశలో ఆశించారు. కానీ, సోవియెట్ పతనం నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా తన జాగ్రత్తలు తాను తీసుకుంటూ వస్తున్నది. కనుకనే అమెరికా తర్వాత రెండవ ఆర్థిక శక్తిగా, రెండవ సైనిక శక్తిగా, రెండవ శాస్త్ర–సాంకేతిక శక్తిగా మారింది. బ్రిక్స్, బీఆర్ఐ (బెల్ట్ అండ్ రోడ్), డీడాల రైజేషన్, బహుళ ధ్రువ ప్రపంచ బలోపేతం వంటి మార్గాలలో అమె రికా రాజకీయ ఆధిపత్యం కోల్పేయే సూచనలు కనిపిస్తున్నాయి.అమెరికా, చైనాల వైరం ఈ విధంగా మౌలికమైనది, దీర్ఘకాలిక మైనది, వ్యూహాత్మకమైనది. ఇందులో సుంకాల యుద్ధం ఒక చిన్న విషయం. జెనీవా రాజీ వరకు జరిగిన పరిణామాలు ఆ చిన్న ఆరంభ యుద్ధంలో తొలి దశ మాత్రమే! ఇందులో ఏది జరిగినా, వైరం మాత్రం కొనసాగుతుంది. ఈ యుద్ధకాండ సుదీర్ఘమైనది. చరిత్రను ఒక కొత్త మలుపు తిప్పగలది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
War యుద్ధాల్లో ఓడేది శ్రామిక ప్రజలే!
ఇప్పుడు ప్రపంచంలో, ఏ ఖండంలో చూసినా, విన్నా, యుద్ధాలే యుద్ధాలు: దేశాల మధ్యా, ఒకే దేశంలో వేరు వేరు పక్షాల మధ్యా! యాభై ఏళ్ళ కిందట, చెరబండ రాజు రాసిన ఒక కవిత పేరు, ‘విప్లవాల యుగం మనది! విప్ల విస్తే జయం మనది!’ అని. ప్రస్తుత పరి స్థితి వేరే రకంగా వుంది. ‘యుద్ధాల యుగం మనది! ఆప కుంటే చావు మనది!’ అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్యా; రష్యా–ఉక్రె యిన్ల మధ్యా జరుగుతున్నవి భీకర యుద్ధాలు! ఈ యుద్ధాలలాగా పత్రికల్లో, టీవీల్లో, ఎక్కు వగా ప్రచారం కాని యుద్ధాలు ఎన్నో ఆఫ్రికాలో నిరంతరం ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. బుర్కినా ఫాసో, కామెరూన్, కాంగో, ఇథియోపియా, మొజాంబిక్, నైజీరియా, సోమాలియా, సూడాన్-ఇలా ఎన్నో దేశాల్లో దాదాపు 35 సాయుధ ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నట్టు వార్తలున్నాయి. ఈ యుద్ధాల వల్లా, నిరంతరం జరిగే సాయుధ ఘర్ష ణల వల్లా, కలిగే బీభత్సాల గురించి, అనేక అంతర్జాతీయ నివేదికలు వచ్చాయి. ఆ యా దేశాల తరఫున యుద్ధం చేసే సైనికులూ, ఆ దేశాల శ్రామిక జనాలూ, పెద్దసంఖ్యల్లో చనిపోతున్నారు. బతికి ఉన్నవాళ్ళలో అనేకులు తీవ్ర గాయాలపాలై, కళ్ళూ, కాళ్ళూ, చేతులూ, పోగొట్టు కుంటున్నారు. స్త్రీలు అత్యాచారాలకు గురవుతున్నారు. పిల్లలు ఏ దిక్కూ లేని ‘అనాథలవుతున్నారు. లక్షలాది మంది శరణార్థులుగా తరలిపోతున్నారు. పొలాలూ, నదులూ, చెరు వులూ, నివాసాలూ– అన్నీ ధ్వంసం అవు తున్నాయి. గాలి కాలుష్యం వల్లా, నీటి కాలుష్యం వల్లా, జనాలు భరించలేని, నయంకాని, జబ్బుల పాలవు తున్నారు.ఇదీ చదవండి: మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్ఐక్యరాజ్యసమితి నివేదికల్లోనూ, ‘ప్రపంచ శాంతి గురించిన పరిశోధనా సంస్థల నివేదికల్లోనూ, యుద్ధ బీభ త్సాల గురించిన వివరాలెన్నో చూడవచ్చు. ఉదాహర ణకు, గాజా యుద్ధంలో 18 నెలల్లో 50 వేల మంది పాల స్తీనా ప్రజలు చనిపోయారు. లక్షా 13 వేలమంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో దాదాపు 4 వేల 5 వందల మంది పిల్లలకు, ఆ గాయాలు విషంగా మారడం వల్ల, రెండు కాళ్ళూ తీసేశారు. ఆకలి మరణాలు సరేసరి. ఇజ్రాయెల్ దాడిలో, 85 వేల టన్నుల పేలుడు పదార్థాల వల్ల, గాలి కాలుష్యం విపరీతంగా ఉందని తేలింది. అలాగే రష్యా–ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలోనూ సైనికులూ, ప్రజలూ పెద్ద ఎత్తున చనిపోయారు. రష్యాలో ఉన్న బీబీసీ వార్తా సంస్థ యూనిట్... అక్కడి స్థానిక మీడియా సంస్థలు, వలంటీర్ల సహకారంతో జరిపిన సర్వే ప్రకారం: 1 లక్షా 6 వేల 745 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌తో జరిగిన యుద్ధంలో చని పోయారని అంచనా వేసింది. గత మూడు సంవత్స రాలలో ఆఫ్రికా దేశాలలో జరిగిన సాయుధ సంఘర్షణల్లో 3 లక్షల 30 వేలమంది చనిపోయారు.యుద్ధ మరణాలు ఎన్ని లక్షలైనా, కోట్లు అయినా, ఉత్త అంకెలుగానే చూస్తున్నాము తప్ప దుఃఖభారంతో కుంగిపోవడం లేదు. ‘నల్ల స్తూపం’ అనే 1956 నాటి ఒక జర్మన్ నవలలో, ఆ రచయిత ఇలా అంటాడు: ‘ఒక మనిషి చనిపోతే, అది ఒక మరణం మాత్రమే. అదే 20 లక్షలమంది చనిపోతే, అది ఒక అంకె మాత్రమే!’ ఇదే రకం అభిప్రాయాన్ని, అంతకు చాలా సంవత్సరాలముందే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో చలం గారు, ‘మ్యూజింగ్స్’లో ఇలా రాశారు: ‘యుద్ధం ముందు హత్యలు! యుద్ధమంతా హత్యలు! యుద్ధం తర్వాత హత్యలు! పదివేల మందిని హత్య చేశారంటే, అది వినే వారికి ఉత్త అంకెలు. చీమలమల్లే పుట్టుకొచ్చే ఈ ప్రజ లలో పదివేల మంది ఒక సంఖ్య కాదు. మళ్ళీ నిండుకుంటారు అవలీలగా! కానీ, ఒక్క జీవితం, ఒక మనిషిది. ఆలోచించి, మాట్లాడి, ప్రేమించి, కలలు కనే ఒక్కజీవితం! ఇంక ఎన్నడూ తిరిగిరాని జీవితం! అనేకమైన సజీవమైన లత లతో ఇతరుల్ని పెనవేసుకున్న జీవితం! ఎంత విలువ!’ఇదీ చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!ఇంతకీ, ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? పెట్టుబడిదారీ ప్రపంచంలో యుద్ధాలన్నీ స్వదేశంలోనైనా, విదేశాల్లో అయినా ప్రకృతి వనరుల్నీ, శ్రామికుల శ్రమనీ దోచే లక్ష్యంతో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అనేక పరిశోధనలు రుజువు చేశాయి. ముగ్గురు ఆఫ్రికా ఖండ పరిశోధకులు 54 ఆఫ్రికా దేశాలలో జరుగుతున్న యుద్ధాల గురించి, విస్తారంగా సమాచారం సేకరించి, ‘ఆఫ్రికాలో జరుగుతున్న ఘర్షణలపై, ప్రకృతి వనరుల ప్రభావం ఉందా?’ అన్న వ్యాసంలో (రిసోర్సెస్ పాలసీ మాస పత్రిక, డిసెంబర్, 2021) ఇదే సంగతిని నిరూపించారు. ఈ యుద్ధాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ... ఫ్రాన్సూ, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా వంటి పెద్ద దేశాల ప్రోత్సాహం ఉంది. యుద్ధాలు జరిగితే, ఆ దేశాల్లోని ఆయుధ పరిశ్రమల యజమానులకు పండగే పండగ! సరే, ఇంతకీ యుద్ధాల సమస్యకు పరిష్కారం ఏమిటి? యుద్ధ వ్యతిరేక మేధావిగా పేరుపొందిన బ్రిటిష్ తత్వవేత్త, బెట్రండ్ రస్సెల్ ప్రకారం: ‘మనుషులన్నా యుద్ధాల్నిరద్దు చేస్తారు. లేదా యుద్ధాలన్నా మనుషుల్ని రద్దు చేస్తాయి!’ అయితే, ఏ రకం మనుషులు యుద్ధాల్ని రద్దు చేస్తారు? లాభాలే లక్ష్యంగా ఉన్న పెట్టుబడిదారీ మనుషులైతే యుద్ధాల్ని రద్దు చెయ్యరు కదా?శ్రామిక వర్గ మానవులు, శ్రమ దోపిడీ అనే దుర్మా ర్గాన్ని తీసిపారేసినప్పుడే, యుద్ధాలను రద్దు చెయ్య గలరు! అది జరిగేలోగా, తాత్కాలిక ఉపశమనం ఏమిటంటే, శ్రామిక జనాలు, తమ దేశాల ప్రభుత్వాలు దేశ రక్షణ పేరుతో చేసే ఆయుధ వ్యాపారాన్ని మాని ఆ వేల, లక్షల కోట్ల రూపాయల్ని విద్య మీదా, వైద్యం మీదా, ఉద్యోగాల మీదా ఖర్చుపెట్టేలా ఒత్తిడి తేవాలి. అది జరగకుండా, యుద్ధాలే కొనసాగితే, ఆ యుద్ధాల్లో ఏ దేశ ప్రభుత్వాలు గెలిచినా, ఓడిపోయేది మాత్రం అన్ని దేశాల శ్రామిక జనాలే!– బి.ఆర్. బాపూజీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు -
‘అదిగో పులి... ఇదిగో తోక’..ఎంత రెచ్చగొడితే అంత!
గత వారం ఘటనలూ, పరిణామాలూ చూస్తే ‘అదిగో పులి... ఇదిగో తోక’ సామెత గుర్తుకొస్తోంది. విహారయాత్రలకు వెళ్లిన వారిని ఊచకోత కోసిన దుర్మార్గం ఎవరైనా ఖండించవలసినది, కన్నీరు కార్చవలసినది. నేరస్థులను పట్టుకుని, విచారించి, కఠినంగా శిక్షించమని కోరవలసినది. ఆ దుర్మార్గానికి కారకులైన వారిని పొరుగుదేశం ప్రోత్సహిస్తున్నదని, బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం ఆ దేశంలోని ‘టెర్రరిస్టుల స్థావరాలు’ అని అనుమానం ఉన్నచోట్ల దాడి చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం డ్రోన్లతో ఎదురుదాడులు చేసింది. స్వయంగా భారత ప్రభుత్వ అధికారులే అది యుద్ధం కాదని ఎన్నోసార్లు అన్నారు. కాని లేని పులికి తోకలు వెతికి, తాము చూశామని ప్రచారం చేసి అమాయకులను నమ్మించేందుకు అనేకమంది వీరంగం వేశారు. అందులో బాధ్యతాయుతంగా ఉండవలసిన నాలుగో స్తంభమూ ఉంది. వ్యక్తులుగానూ, బృందాలుగానూ... భావజాల ప్రోత్సాహపు ఐటీ సెల్స్ ఉన్నాయి. సున్నిత సందర్భంలో టీవీ ఛానళ్లూ, యూట్యూబ్, వాట్సప్, ఫేస్ బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలూ గత వారంలో కోట్లాది అబద్ధాలను వండి వార్చాయి. టీవీ ఛానళ్లు వార్తా, విశ్లేషణా ప్రసార వేదికలు గనుక అక్కడ చెప్పే చిన్నపాటి అబద్ధమైనా, అర్ధసత్యమైనా బహుగుణీకృతమై ప్రచారంలోకి వస్తుంది. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ అవకాశాన్ని తప్పని సరిగా బాధ్యతాయుతంగా వాడాలి. కాని భారత ప్రధాన స్రవంతి ఛానళ్లన్నీ బాధ్యతా రాహిత్యంలో అవధులు దాటాయి. ‘ఆజ్ తక్’ లాహోర్‌ను స్వాధీనం చేసుకుంది, ‘జీన్యూస్’ కరాచీని పట్టుకుంది. రిపబ్లిక్ టీవీ న్యూయార్క్‌ను స్వాధీనం చేసుకుంది. ఉదయానికల్లా వాళ్లు అన్నీ వెనక్కి ఇచ్చేశారు, మళ్లీ రాత్రి స్వాధీనం చేసు కోవడానికి!’ అని మే 9 రాత్రి సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి మార్కండేయ ఖట్జూ చేసిన వ్యంగ్య ట్వీట్ పరిస్థితి ఎంత చేజారిందో చూపుతుంది. ఆ ట్వీట్లో ఆయన మూడు ఛానళ్ల పేర్లే ప్రస్తావించారు గాని, ఎటువంటి మినహాయింపు లేకుండా దాదాపు అన్ని ఛానళ్ల రిపోర్టర్లూ,యాంకర్లూ పోటీ పడి తామే స్వయంగా యుద్ధ క్షేత్రంలో ఉన్నట్టు, తమ ముందరే బాంబు దాడులు, వైమానిక దాడులు, డ్రోన్ దాడులు జరుగుతున్నట్టు అభినయించారు. తమ పని నిష్పక్షపాతంగా, వస్తుగతంగా, తటస్థంగా ప్రజలకు వార్తలు చెప్పడం మాత్రమే అనేది మరిచిపోయి, తామే ఒక పక్షం తీసుకుని, వార్తలు వండి వార్చారు. కేకలూ పెడబొబ్బలూ పెట్టారు. ప్రాంతీయ భాషా ఛానళ్లు, పత్రికలు కూడా ఆ టీవీ ఛానళ్లనూ సామాజిక మాధ్య మాలలో ఉద్దేశపూర్వకంగా వెలువడిన అబద్ధాలనూ అనుసరించాయి. మొత్తం మీద సత్యం కనబడకుండా పోయింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సత్యం మీద పొగమంచు కమ్మే మాట నిజమే. కాని వార్తామాధ్యమాల పని ఆ పొగమంచును చెదరగొట్టడం! దాన్ని పెంచడం కాదు! కాని సత్యం మీద పొగమంచు కమ్మే పని, నేరుగా అబద్ధాలు ప్రచారం చేసే పని సరిహద్దుకు అవతలా, ఇవతలా... ప్రచార మాధ్యమాలూ, సామాజిక మాధ్య మాలూ శాయశక్తులా చేశాయి. ఆశ్చర్యమేమంటే, ఈ అబద్ధాల కాలపరిమితి కొన్ని గంటలు మాత్రమే. ఎందుకంటే, ఇక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పినా కొన్ని గంటల్లోనే నిజమేమిటో ప్రభుత్వం అధికా రికంగా ప్రకటిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం చెప్పేది కూడా పూర్తి నిజం కాదనుకుంటే అంతర్జాతీయ ప్రచార మాధ్య మాలు చూసే సాంకేతికత అందుబాటులో ఉంది. ఇవాళ్టి సమాచార విస్ఫోటనంలో దేశదేశాల రక్షణ వ్యవహారాల నిపుణులు ఆ యా ఘటనల మీద నిమిషాల్లోనే తమ విశ్లేషణ వినిపిస్తున్నారు. అంటే జర్నలిస్టులమని చెప్పుకునే ఆర్ణబ్ గోస్వామి వంటివారు ఎన్ని అరుపులు అరిచినా కొన్ని గంటల్లో అబద్ధాలని రుజువైపోయే అవకా శాలున్నాయి. నిజాలు చెప్పే, అంతర్జాతీయ తటస్థ వార్తలు పునర్ము ద్రించే వెబ్సైట్ల మీద ఆంక్షలు విధించిన ప్రభుత్వం, ఈ అబద్ధాల దుమారాన్ని మాత్రం యథావిధిగా సాగనిచ్చింది. ఈ అబద్ధాలు, అర్ధసత్యాలు ఒక ఎత్తయితే... కనీస మర్యాద, సభ్యత లేకుండా సంబంధం లేని వారిని లాగడం, తిట్లూ, దుర్భాషలూ కురిపించడం విపరీతంగా జరిగాయి. యుద్ధం వద్దన్నవారి మీద, శాంతి వాక్యాలు చెప్పినవారి మీద ద్వేషం వెదజల్లడం జరిగింది. ఈ పరిణామం ఎంత దూరం పోయిందంటే... రిపబ్లిక్ ఛానల్‌కు సలహాదారుగా ఉన్న మేజర్ (రిటైర్డ్) గౌరవ్ ఆర్య... తన సొంత యూట్యూబ్ ఛానల్లో చేసిన వ్యాఖ్యలతో భారత ప్రభుత్వం దౌత్యస్థాయిలో క్షమాప ణలు చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చిని సువ్వర్ (పంది) అనీ, సువ్వర్ కె ఔలాద్ (పంది సంతానం) అనీ అసభ్య కరమైన మాటలెన్నో అన్నాడు. అక్కడ ఆయన చూపిన కారణం – ఇరాన్ మంత్రి భారత పర్యటనకు ముందు పాకిస్తాన్ పర్యటన చేశారని! ఆ వీడియో ఇరాన్లో కూడా వైరల్ అయి, న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యా లయం ‘అతిథులను గౌరవించడం ఇరానియన్ సంస్కృతిలో చిరకాల సంప్రదాయం. ఇరానియన్లం అతిథులను దైవానికి ప్రియమైనవారిగా భావిస్తాం. మరి మీరో?’ అని ట్వీట్ చేయగా, భారత ప్రభుత్వం అది ‘ఒక ప్రైవేటు భారత పౌరుడి’ అభిప్రాయం అనీ, తమకు దానితోసంబంధం లేదనీ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. మర్నాడే ఆ ఇరాన్ మంత్రి భారత్‌కు కూడా వచ్చి ఎన్నో ద్వైపాక్షిక, వాణిజ్య ఒప్పందాల మీద సంతకాలు చేశారు! అలాగే, ఇరుదేశాల సైనికాధిపతులు కాల్పుల విరమ ణకు అంగీకరించారనే వార్త ప్రకటించినందుకు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద బూతులు కురిపించారు. అటువంటి దాడులకు గురైనవారు మరెందరో ఉన్నారు. యుద్ధంలో మొట్టమొదట మరణించేది సత్యం అంటారు. ప్రస్తుత సత్యానంతర యుగంలో మరణించడాని కైనా, సజీవంగా ఉండడానికైనా సత్యానికి స్థానమే లేదు. భావోద్వేగాలదీ, మనోభావాలదీ మాత్రమే రాజ్యం! ఎంత రెచ్చగొడితే అంత వ్యాపారం, అంత జనాకర్షణ!!-ఎన్ వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్ -
దేశవ్యాప్తంగా న్యాయ ‘కొరత’
ప్రతి వ్యవస్థనూ – అది సాధించాల్సిన ఫలి తాలు సాధించేలా – పరిపూర్ణంగా రూపొందిస్తారు. మరి భారత న్యాయ వ్యవస్థ మాటే మిటి? పనితీరులో వెనుకబాటుతనం, అసమానత్వం, జాప్యం... ఇవేనా దీని నుంచి మనం ఆశించిన ఫలితాలు? ఇటీవలే ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025’ వెలువడింది. 18 పెద్ద రాష్ట్రాలు, 7 చిన్న రాష్ట్రాల్లో ప్రజలకు న్యాయం ఎలా అందు తోందో ఇది అద్దం పడుతోంది. పాత నివేదికల మాదిరిగానే ఇది కూడా పోలీసు, జ్యుడీషియరీ, జైళ్లు, న్యాయ సహాయం గురించి విపులంగా చర్చించింది. ఆ యా రంగాల్లో వ్యవస్థాగత సామర్థ్యాలు తగిన స్థాయిలో లేవనీ, వాటిని పెంచుకోవలసి ఉందనీ ఈ నివేదిక తేల్చింది. అనేక మందికి ఈ వ్యవస్థ అందుబాటులో ఉండటం లేదు. తను చేయగలిగినంతా చేస్తోంది. అయినా అత్యవసర న్యాయ సేవను అవసరమైన స్థాయిలో అందించలేక పోతోంది. సిబ్బంది కొరతతో న్యాయంలో లోటురాష్ట్ర బడ్జెట్ల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. జస్టిస్ సిస్టమ్‌కు తగినన్ని నిధుల కేటాయింపు జరగటం లేదు. కేటాయింపుల్లోసింహభాగం జీతాలకే పోతుంది. మౌలిక సదుపాయాలు, పరిక రాలు, నైపుణ్యాల పెంపునకు మిగిలే నిధులు అంతంత మాత్రమే. రాష్ట్రాల జీడీపీలు పెరిగిన సందర్భాల్లోనూ, ఏవో కొన్ని రాష్ట్రాలు మాత్రమే అదే నిష్పత్తిలో జ్యుడీషియరీకి నిధులు పెంచుతున్నాయి. న్యాయ వ్యవస్థలు మొత్తం మీద 25 శాతం సిబ్బంది కొరత ఎదుర్కొంటున్నాయి. హైకోర్టు జడ్జీలలో 31 శాతం, పోలీసుయంత్రాంగంలో 22 శాతం, జైళ్ల శాఖలో 33 శాతం ఖాళీలు భర్తీ చేయ కుండా పడున్నాయి. పోలీసు స్టేషన్ పర్యవేక్షణలో ఉండే జనాభా, ప్రాంతం చాలా ఎక్కువగా ఉండటం మరో సమస్య. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లు తక్కువగా ఉంటున్నాయి.దీంతో గ్రామీణులకు న్యాయ పరిష్కారాల లభ్యత తగ్గిపోతోంది. సివిల్ పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ, నిరంతరం ఖాళీలు ఉంటూనే ఉన్నాయి. దీంతో ఈ వ్యవస్థా కుంటినడక నడు స్తోంది. జాతీయస్థాయిలో ప్రతి అయిదు పోస్టుల్లో ఒకటి ఖాళీగాఉంటోంది. అంటే 5,00,000 మందిని నియమించాల్సి ఉంది. జనాభా–పోలీసు నిష్పత్తి అతి తక్కువగా ఉండే ప్రపంచ దేశాల్లోఇండియా ఒకటి. మన పోలీసు దళాల్లో 80 శాతం మంది కానిస్టేబుళ్లు ఉంటారు. సూపర్వైజరీ, టెక్నికల్ విభాగాల్లో 35 శాతం ఖాళీలుఉండటంలో పర్యవేక్షణ అధికారులు తక్కువ అవుతున్నారు. నియామక ప్రక్రియ లోపభూయిష్ఠంగా ఉండటం వాస్తవం. ఎప్పుడు ప్రకటన వెలువడుతుందో తెలియదు. చివరకు ప్రకటన వెలువడినా నియామకాలు పూర్తి కావడానికి రెండేళ్లకు పైగా పడుతోంది. దీంతో శిక్షణ సంస్థల మీద భారం పెరిగి శిక్షణ ప్రక్రియ తూతూ మంత్రంగా సాగుతోంది. సిబ్బంది సరైన అవగాహన లేకుండానే విధుల్లోకి వస్తున్నారు. ఇది ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తోంది. శిక్షణ సంస్థలకు నిధుల కొరత కూడా ఉంది. పోలీసు బడ్జెట్లో కేవలం 1 శాతమే వీటికి దక్కుతోంది. సిబ్బంది వైఫల్యాలకు అధికారులు వీటిని సాకులుగా చూపిస్తున్నారు. న్యాయలోపానికి వారు ఇలా కార ణాలు చూపించే వీల్లేదు. ఇది ప్రమాదకరమైన సమస్య. ఇది విధాన పరమైన వైఫల్యాలకూ దోషులు శిక్షలు పడకుండా తప్పించు కోవడానికీ దారితీస్తుంది.పెండింగ్ కేసుల గుట్టఇక జ్యుడీషియల్ వ్యవస్థలో 5 కోట్లకు పైగా పెండింగు కేసులు మూలుగుతున్నాయి. జనాభాలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 15 మంది జడ్జీలు ఉన్నారు. 40 ఏళ్ల క్రితమే 50 మంది ఉండాలని సిఫారసు చేసినా, మంజూరైన 21 పోస్టులు కూడా భర్తీ కావడం లేదు. ప్రతి హైకోర్టు న్యాయమూర్తీ 7,000కి పైగా కేసులు పరిష్కరించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. దిగువ కోర్టుల్లో ఈ సంఖ్య 2,200. ఈ నేపథ్యంలో అపరిష్కృత వ్యాజ్యాల సంఖ్య త్వరలోనే 6 కోట్లకు చేరుకోబోతోంది. పర్యవసానంగా, జైళ్లు కిక్కిరిసి పోతున్నాయి. బెయిలు మంజూ రుపై సుప్రీం మార్గదర్శకాలతో పాటు, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీలు, డిఫెన్సు కౌన్సెల్ స్కీములు, బెయిలుకు ప్రభుత్వ నిధులు, జైలువారీగా లీగల్ క్లినిక్స్, వేల కొద్దీ న్యాయ సహాయ లాయర్లువంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నప్పటికీ... పదేళ్లలో ఖైదీల రద్దీ 18 నుంచి 30 శాతానికి పెరిగింది. 1,330 జైళ్లు ఉండగా, 90 కారాగారాల్లో సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ఖైదీలు కిటకిటలాడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని మురాదాబాద్ వంటి కొన్ని చెరసాలల్లో ఉండ వలసిన వారి కంటే నాలుగు రెట్ల మంది ఉంటున్నారు. సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక నివేదిక ప్రకారం, 40 శాతం మందికి నిద్ర పోవాలంటే కూడా స్థలం కరవే! ఖైదీలలో సుమారు మూడో వంతు మందే దోషులుగా శిక్ష అనుభవిస్తున్నవారు... మిగిలినవారుఅందరూ విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలే! వీరిలో అత్యధికులు అట్టడుగు వర్గాల వారు. పేదరికం ఇక్కడ నిజమైన నేరం. ఆహ్వానించదగిన మార్పులుఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, కొన్ని సానుకూల అంశాలు కూడా లేకపోలేదు. బడ్జెట్లు పెరుగుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్స్‌ను ఆధునికంగా మార్చుతున్నారు. టెక్నాలజీ వినియోగంలోకి వస్తోంది. ఢిల్లీ డిజిటల్ వ్యాజ్య నిర్వహణ విధానం, తెలంగాణ ఇ–ప్రిజన్ సిస్టమ్స్, మహారాష్ట్ర ఏఐ ఆధారిత లీగల్ ఎయిడ్ చాట్ బాట్స్, తమిళనాడు పోలీసు స్టేషన్లలో మెరుగైన సీసీటీవీ కవరేజీ ఇందుకు ఉదాహరణలు. బిహార్ పోలీసు దళాల్లో స్త్రీల వాటా 24 శాతానికి పెరిగింది. సబార్డినేట్ కోర్టు జడ్జీల్లో మహిళలు 38 శాతానికి పెరిగారు. అయితే, హైకోర్టుల్లో ఇది 14 శాతం మాత్రమే! ప్రప్రథమంగా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, జైలు సిబ్బందిలో ట్రా¯Œ ్సజెండర్ల గణన అధికారికంగా చేపట్టారు. కేరళ ప్రభుత్వం కోర్టు రూములు దివ్యాంగులకు అను కూల రీతిలో ఉండేలా చర్యలు చేపట్టింది.ఆ యా కులాల ప్రాతినిధ్యం కూడా పెరుగుతోంది. వాణిజ్య వివాదాల్లో మధ్యవర్తిత్వ విధానాన్ని గుజరాత్ ప్రాచుర్యంలోకితెస్తోంది. కోర్టుల్లో రద్దీ తగ్గించడానికి వీలుగా సైబర్ క్రైమ్ యూనిట్లు, పోక్సో, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వంటి ప్రత్యేక సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి.సంస్థలు బలహీనంగా ఉన్నా వ్యక్తిగత చొరవ సత్ఫలితాలు ఇస్తుంది. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక శ్రద్ధ వహించి జైళ్ల ఆక్యుపెన్సీ రేటును 91 నుంచి 83 శాతానికి తగ్గించి, ఖైదీలకు వసతి సదుపాయం పెంచగలిగారు. అలాగే అధికారుల ఖాళీలను 46 శాతం నుంచి 14 శాతానికి తగ్గించారు. సంకల్పంఉంటే మార్గం ఉంటుంది. న్యాయం అనేది మాటలకే పరిమితమైన ఒక ఉన్నత ఆదర్శం కాదు. అది సాధించగలిగిన లక్ష్యం. దాన్ని అందించే బాధ్యత ప్రభు త్వాల మీద, కోర్టుల మీద ఉంది. మనం చట్టబద్ధ ప్రజాస్వామ్యంలో కొనసాగాలంటే, ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ నిరంతర ప్రాతిపదికన న్యాయం అందాలి. -వ్యాసకర్త ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్’ చీఫ్ ఎడిటర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-మాజాదారూవాలా -
ఎవరి కోసం ఈ ఒప్పందం?
చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ విధానాలతో ముందుకు పోతున్నది. పోర్టులను, మెడికల్ కాలేజీలను, విద్య, వైద్యం వంటివాటిని ప్రైవేట్ పరం చేయనుంది. తాజాగా నిత్యం అవసరంగా ఉన్న కరెంట్‌ను కూడా ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడుతున్నది. అందులో భాగమే ‘యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్’తో విద్యుత్ కొనుగోళ్ల గురించి చేసుకున్న ఒప్పందం. 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించి, వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ 25 సంవత్సరాల పాటు యూనిట్‌కు 4.60 రూపాయల చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. ధర తగ్గించేందుకు వీలు లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్’ షరతు విధించారు.ఇంతకు ముందు కూడా యాక్సిస్ సంస్థ 5 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకునేందుకు 2018లో టీడీపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. అందుకే 400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు 2019 జనవరి 23న విద్యుత్ సంస్థలు అనుమతించాయి. దీన్ని గమనిస్తే యాక్సిస్‌తో చంద్రబాబు అనుబంధం ఏమిటో తెలుస్తుంది. 2014–18 మధ్య టీడీపీ పాలనలోనే ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 464 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు 15 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాని ప్రకారం మొదటి ఏడాది యూనిట్‌కు 5.98 రూపాయల చొప్పున చెల్లించాలి. రెండవ ఏడాది నుంచి ఏటా 3% పెంపుతో పదో సంవత్సరం దాకా కొనుగోలు వ్యయం పెరుగు తుంది. ఫలితంగా పదో ఏడాది నాటికి యూనిట్‌కు 7 రూపాయలకు పైగా చెల్లించాలి. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ యూనిట్ 4.20 రూపాయలకే అందు బాటులో ఉన్నా, 7 రూపాయలకు ప్త్రెవేట్ సంస్థల నుంచి కొనేందుకు టీడీపీ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది?2019 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం లోని పీపీఏల సమీక్షతో పాటు 2019 ఏప్రిల్ 1 ముందు కుదిరిన ఒప్పందాల మేరకు ఇంకా మొదలు కాని పనులను రద్దు చేయాలని ఆదేశించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో యూనిట్ రూ. 2.49 చొప్పున కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని టీడీపీ వ్యతిరేకించింది. కానీ, ‘చౌకగా విద్యుత్ వస్తున్నప్పుడు ఎందుకు కొనుగోలు చేయకూడదు?’ అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. యాక్సిస్ సంస్థ నుంచి తొలుత 400 మెగావాట్లకు, తర్వాత మరో 774.9 మెగావాట్లకు ఒప్పందాలు కుదుర్చుకునేలా దస్త్రాన్ని ఏపీఈఆర్సీ ఆమోదం కోసం అధికారులు పంపారు. ఆ పీపీఏల ద్వారా యూనిట్ ధర 4.28 రూపాయల చొప్పున ఖరారు చేయాలని డెవలపర్ సంస్థ విద్యుత్ నియంత్రణ మండలిని కోరింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో హైబ్రిడ్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ యూనిట్ రూ. 2.90లకు దొరుకుతుంది. అలాంటప్పుడు 4.28 రూపాయలకు ఎందుకు కొనుగోలు చేయాలి? గత ప్రభుత్వంలో 2022 నవంబర్ 11న యాక్సిస్ సంస్థ నుంచి యూనిట్ 3.50 రూపాయల చొప్పున పీపీఏల కొనుగోలు ఆమోదం కోసం ఏపీఈఆర్సీ అనుమతి కోసం డిస్కం పంపింది. ఆ పీపీఏలను ఎలా సమర్థించుకుంటారో వివరణ ఇవ్వాలంటూ డ్రాప్ట్ పీపీఏలను విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంకి తిప్పి పంపింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 ప్రకారం యాక్సిస్ సంస్థతో పీపీఏలను ఆమోదించాలంటూ 2024 సెప్టెంబర్ 24న ఏపీఈఆర్సీకి లేఖ రాసి, దీన్ని తిరస్కరించటానికి వీలు లేదనీ, ఒక వేళ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ముందుకు పోతా మనీ బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది. యాక్సిస్‌తో కచ్చితంగా పీపీఏలు కుదుర్చుకోవాలంటూ విద్యుత్ సంస్థలను అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశించలేదు. కాని ఆ సంస్థతో పీపీఏలు కుదుర్చు కోవటానికి విద్యుత్ సంస్థలు ముందుకు వచ్చాయి. అధికారులు కూడా ఆ సంస్థ నుంచి విద్యుత్ తీసుకోవటం చాలా చౌకనే రీతిలో వివరణ ఇవ్వటం ద్వారా పీపీఏలకు మద్దతు పలికారు. చంద్రబాబు ప్రభుత్వం, విద్యుత్ అధికారుల మద్దతుతో యాక్సిస్ సంస్థకు చెందిన సౌర, పవన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే వాటి ప్రతిపాదనలను ఏపీఈఆర్సీకి చేరాయి. విద్యుత్ యూనిట్ ట్యారిఫ్ ఎంత ఉండాలో కూడా యాక్సిస్ సంస్థే ప్రతిపాదించింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ కో – ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) ఏపీఈఆర్సీ ఆమోదం కోసం పంపింది. దీన్ని గమనిస్తే కూటమి ప్రభుత్వ విద్యుత్ ఒప్పందం ద్వారా యాక్సిస్ సంస్థ ఎంత ప్రయోజనం పొందుతుందో తెలుస్తుంది. బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుమొబైల్: 98859 83526 -
ద్వైపాక్షిక వాణిజ్యాల ‘లోటు’పాట్లు
మూడేళ్ల చర్చల అనంతరం మే 6న ఇండియా, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలతో ఇండియాకు జరిగిన మేలెంతో, లోటెంతో సమీక్షించుకోవడం అవసరం.ఏదైనా రెండు దేశాల మధ్య జరిగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’గా భావిస్తాం. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి కార్యకలాపాలను ప్రోత్సహించడం లక్ష్యంగా వస్తు, సేవల వినిమ యానికి సంబంధించి ఈ ఒప్పందాలు జరుగుతాయి. దిగుమతి సుంకాలు, దిగుమతి కోటాలు, ఎగుమతులపై నియంత్రణ లాంటి వాణిజ్య అడ్డంకుల నిర్మూలనకు ఈ ఒప్పందాలు దోహదపడతాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం, 2024 సెప్టెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 373 వాణిజ్య ఒప్పందాలపై (సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు, సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాలు కలుపుకొని) ఇండియా సంతకం చేసింది.ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువమార్కెట్ అందుబాటు పెంపు, ఎగుమతుల పెంపు ద్వారా అధిక వృద్ధి సాధన లక్ష్యంగా వివిధ దేశాలతో భారత్ ఈ ఒప్పందాలు కుదు ర్చుకుంది. కానీ ఆ లక్ష్య సాధనలో ప్రతికూల, మిశ్రమ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వ్యవసాయం, తయారీ, సేవా రంగాలను పరిశీ లించినప్పుడు ఆ యా రంగాలకు సంబంధించి కొన్ని పరిశ్రమలు ప్రయోజనం పొందగా, మిగిలిన రంగాలు అనేక సవాళ్ళను ఎదు ర్కొంటున్నాయి. వాణిజ్య ఒప్పందాల కారణంగా వాణిజ్య పరిమాణంలో పెరుగుదల ఏర్పడినప్పటికీ, ఎగుమతులతో పోల్చినప్పుడు దిగుమతుల పరిమాణం పెరిగి భారత్‌కు సంబంధించి వాణిజ్య లోటు పెరిగింది. ‘ఏషియాన్’– ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత, ఆ యా దేశాలకు సంబంధించి భారత్ వాణిజ్య లోటు 2011లో 7.5 బిలియన్ డాలర్లు కాగా, 2023లో 44 బిలియన్ డాలర్లకు పెరిగింది. దక్షిణ కొరియాతో ఒప్పందం జరిగే సమయంలో భారత్ వాణిజ్య లోటు 4 బిలియన్ డాలర్లు కాగా, ప్రస్తుతం 9 బిలి యన్ డాలర్లకు పెరిగింది.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా భారత్ స్వదేశీ పరి శ్రమలు – ముఖ్యంగా చిన్న, మధ్యతరహా సంస్థలు, వ్యవసాయం, డైరీ రంగాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఒప్పంద దేశాల నుండి ‘చౌక దిగుమతుల’ కారణంగా భారత్‌లో స్థానిక రైతులు, ఉత్పత్తిదారులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. వాణిజ్య సరళీకరణ వలన ఐటీ, సేవలకు కొంతమేర ప్రయోజనం ఏర్పడి నప్పటికీ, సంప్రదాయ పరిశ్రమలు అధిక దిగుమతుల కారణంగా పోటీ ఎదుర్కొంటున్నాయి.స్థానిక మార్కెట్లో విదేశీ కంపెనీల ప్రవేశం వలన చిన్న, స్థానిక వ్యాపారాలు పోటీని ఎదుర్కోలేక మూసివేతకు గురవుతాయి. అలాగే కొన్ని ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నప్పటికీ, అధిక సామర్థ్యంతో కూడిన సప్లయ్‌దారుల నుండి వాణిజ్య ప్రవాహం భాగస్వామ్య దేశా లకు జరుగుతుంది. 2017 నుండి 2022 మధ్య కాలంలో ఒప్పంద భాగస్వామ్య దేశాలకు సంబంధించి భారత్ ఎగుమతులలో 31 శాతం పెరుగుదల ఏర్పడగా, దిగుమతులలో 82 శాతం పెరుగుదల ఏర్పడింది. దక్షిణ కొరియా, ఏషియాన్ దేశాలు టెక్స్టైల్స్, తోలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్‌ను తక్కువ ధరకు ఉత్పత్తి చేయడం వలన ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది.దిగుమతేతర సుంకాల ఇబ్బందులువాణిజ్య ఒప్పందాలలో భాగంగా దిగుమతి సుంకాలకు సంబంధించి స్పష్టత ఉన్నప్పటికీ, దిగుమతేతర సుంకాలు వస్తు ప్రవాహానికి అవరోధంగా నిలుస్తున్నాయి. దిగుమతి కోటా, దిగుమతి లైసెన్సింగ్, రూల్స్ ఆఫ్ ఆరిజిన్(వస్తు తయారీ మూలానికి సంబంధించిన), శానిటరీ, ఫైటో శానిటరీ(చీడలు, వ్యాధులు లేవని చెప్పాల్సిన) చర్యలు, సాంకేతిక నియంత్రణలు, కస్టమ్స్ కార్యసరళిని దిగుమతే తర సుంకాలుగా భావింపవచ్చు.దక్షిణ కొరియా మార్కెట్ అందుబాటు భారత ఉత్పత్తులకు క్లిష్టంగా మారడానికి శానిటరీ, ఫైటో శానిటరీ చర్యలు, సర్టిఫికేషన్ ఆవశ్యకత లాంటివి కారణాలుగా నిలుస్తున్నాయి. దిగుమతి లైసెన్సింగ్, రూల్స్ ఆఫ్ ఆరిజిన్ క్లిష్టతరంగా ఉండటం, శానిటరీ, ఫైటో శానిటరీ చర్యల వల్ల థాయ్‌లాండ్‌కు భారత ఎగుమతుల వృద్ధి తగ్గింది. మలేషియా అవలంబిస్తున్న వాణిజ్యపరమైన సాంకేతిక అడ్డంకులు, శానిటరీ, ఫైటో శానిటరీ చర్యలు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఆస్ట్రేలియా దిగుమతేతర సుంకాల చర్యలలో భాగంగా ఆరోగ్యం, భద్రతా సర్టిఫికేషన్స్, బయో సెక్యూరిటీ ఆవశ్యకత, ఇతర ప్రమాణాలు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపించాయి. అధిక దిగుమతి ప్రమాణాలను పాటిస్తున్న కారణంగా జపాన్‌కు సంబంధించి భారత్ ఎగుమతులలో ప్రతిష్టంభన ఏర్పడింది. దిగుమతేతర సుంకాలు భారత్ ఎగుమతిదారుల ఎగు మతుల అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. వాణిజ్య వ్యయాల పెరుగుదల, మార్కెట్ అందుబాటు పెరగకపోవడం వాణిజ్య సరళీ కరణ ప్రయోజనాలను భారత్ అందుకోలేకపోవడానికి కారణ మయ్యాయి.ఉదాహరణకు 2019–23 కాలానికి జపాన్‌కు ఇండియా ఎగుమతుల విలువ 5,730 మిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 19,900 మిలియన్ డాలర్లు. ఇదే కాలానికి యూఏఈకి మన ఎగుమతుల విలువ 30 వేల మిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 50,510 మి.డాలర్లు. ఇక ఆస్ట్రేలియాకు మన ఎగుమతులు 8,730 మి.డాలర్లు కాగా, దిగుమతులు 11,300 మి.డాలర్లు. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్తాన్, చిలీ లాంటి చిన్న ఆర్థిక వ్యవస్థలు మినహా పెద్ద వాణిజ్య దేశాలతో భారత్ వాణిజ్య లోటు పెరిగింది. అయితే, 2000–24 మధ్య కాలంలో మారిషస్, సింగపూర్, జపాన్, యూఏఈ నుండి భారత్ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మాత్రం ఆకర్షించగలిగింది. భారత్ మొత్తం వాణిజ్యంలో భాగ స్వామ్య ఒప్పంద దేశాల వాటా సుమారు 20 శాతం.అడ్డంకులు తొలగించుకునేలా...ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలుగా– నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్–నాఫ్టా (అమెరికా, మెక్సికో, కెనడా), ట్రాన్స్ – పసిఫిక్ భాగస్వామ్యం (జపాన్, ఆస్ట్రే లియా, సింగపూర్), సమగ్ర ప్రాంతీయ భాగస్వామ్య ఒప్పందం(ఆర్సీఈపీ), చైనా – ఏషియాన్ ఒప్పందాలను పేర్కొనవచ్చు. భారత్‌కు సంబంధించి వాణిజ్య ఒప్పందాల ముందు కాలంతో పోల్చినప్పుడు ఒప్పందం అమలు కాలంలో భారత్ వాణిజ్య పరి మాణం, విలువలో పెరుగుదల ఏర్పడింది. అయితే, ముఖ్య భాగ స్వామ్య దేశాల నుండి దిగుమతులు పెరిగిన కారణంగా భారత్ వాణిజ్య లోటులో పెరుగుదల ఏర్పడింది. అందుకే వాణిజ్యపరంగా వ్యూహాత్మకమైన దేశాలతో ఒప్పందాల కోసం భారత్ ప్రయత్నించాలి. నియంత్రణలు, దిగుమతేతర సుంకాల అడ్డంకులను భాగస్వామ్య దేశాలు తొలగించే విధంగా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలి. అమెరికాతో సహా వాణిజ్య పరంగా ముందంజలో ఉన్న ఏ దేశాలతోనైనా దిగుమతి సుంకాలు, దిగుమతేతర సుంకాల చర్యలను తగ్గించినట్లయితే భారత్ మార్కెట్ విస్తృతి పెరుగుతుంది.వ్యాసకర్తలు డా‘‘ తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్ అండ్ డీన్; రితికారావు వీరిశెట్టి, పీహెచ్డీ స్కాలర్,ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హైదరాబాద్ -
Operation Sindoor ఎవరిని అడగాలి?
ఇంటి పనులూ బయటి పనులూ చింతలూ చిక్కులూ చికాకులూ రోజూ వుండేవే వాటికి కాస్త విరామమిస్తూ విహారానికని అపుడపుడు ఊరు దాటి బయటికి వెళ్లొస్తాం దూరమైనా ఈ పరి ఈ కాశ్మీరానికి వచ్చాం ముచ్చటపడి –ఏమంద మేమంద మేమందం అంటూ పచ్చగా మురిసిపోతూ మేం ఉల్లాసపడుతున్న వేళ అదాటున కాల్పులు! కళ్లెదుటే మా ఇంటి మనిషి క్షణాల్లో శవమయ్యాడు భూతల స్వర్గపు పచ్చదనం ఉన్నట్టుండి ధడేల్మని ఎరుపెక్కుతుందని తెలిస్తే అసలు ఇటు నిండు కుటుంబంగా వచ్చే వాళ్ళమా! నిండు మనిషిని పోగొట్టుకునే వాళ్ళమా! ఇపుడు మాకు ఏ అందాల సంబరాలొద్దు మా మనిషి మాక్కావాలి, తెచ్చిస్తారా ఊపిరితో –ఈ సరిహద్దు వివాదాలూ లోయలో కల్లోలాలూ తుపాకుల కవాతులూ పేలుళ్ళూ దాడులూ ఇక్కడి చరిత్రా మాకేం తెలుసు! మామూలు మనుషులంతుపాకులు, ఎదురు తుపాకులతోనే తలపడతాయని తలచాం కానీ... యాత్రికుల కన్నులను సైతం తుపాకుల్లా చూస్తాయని గుర్తించి మరీ గురి చూస్తాయని అనుకోలేదు! ఉన్నట్టుండి ఈ కొత్త చోటున మేం ఎవరికి ఇంతలోనే ఇంత బద్ధ శత్రువులమెట్లయ్యామో తెలియట్లేదు ముగ్గురం వచ్చి ఇపుడిద్దరమే ఇంటికెళ్తున్నాం మూడో మనిషేడని ఇల్లు కలవరపడుతూ అడుగుతుంది దాన్ని ఎట్లా ఓదార్చాలి? మా మనిషి లేడు నిట్రాడు లేదు మరింత బరువైపోయిన మా బతుకు! ఇపుడు ఎట్లా నిలబడేది క్షణ క్షణం భయం భయంగా వుంది మా బయటా మా లోపలా – కారణమెవరని ఇపుడు మేం ఎవ్వరినడగాలి?– దర్భశయనం శ్రీనివాసాచార్య ఇదీ చదవండి: కేన్స్‌లో తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో? -
సేంద్రియ సాగులో హిమాచల్ నమూనా
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఒక ట్రెండ్ సెట్టర్. నేను రాజ కీయాల గురించి మాట్లాడటం లేదు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు గీటు రాయి లాంటి ధరల వ్యవస్థను రూపొందించడంలో ఆయన చేపట్టిన మార్గదర్శక పాత్రను ప్రస్తావిస్తున్నాను. రసాయన వ్యవసాయం నుండి స్థిరమైన, ఆరోగ్యకరమైన పర్యావరణ అనుకూల వ్యవసాయ వ్యవస్థల వైవు పరి వర్తన చెందడానికి ఇది కచ్చితమైన మార్గం.2022 డిసెంబర్లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్య తలు స్వీకరించినప్పటి నుండి, పర్వత ప్రాంతంలో సేంద్రియ వ్యవ సాయాన్ని ప్రోత్సహించడానికి సుఖు చేసిన ప్రయత్నాలను నేను ఆసక్తితో అనుసరించాను. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, సేంద్రియ ఆవు, గేదె పాలకు రూ. 45, రూ. 55 చొప్పున సేకరణ ధర పెట్టారు. ఇది మంచి ప్రారంభం. ఇటీవలి బడ్జెట్లో ఆ ధరలను లీటరుకు మరో ఆరు రూపాయలు రెంటికీ పెంచడం హృద్యం గమం. ఆ తర్వాత ఆయన సేంద్రియ మొక్కజొన్న, గోధుమలను సేకరించడానికి కనీస మద్దతు ధరను వరుసగా కిలోకు రూ. 30, కిలోకు రూ. 40 చొప్పున ప్రకటించారు. మళ్లీ వాటిని రూ. 30 నుండి రూ. 40కి, 40 నుండి రూ. 60కి పెంచారు. అదనంగా, గోధుమలను, మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లడానికి కిలోకు రెండు రూపాయల రవాణా రాయితీని ప్రకటించారు.సేంద్రియ సాగుకు ధరే ఊతంపర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అవలంబించే రైతులకు అధిక ధరలు ప్రకటించడం వల్ల పంట రాబడిలో గణనీ యమైన పెరుగుదలకు వీలు కలుగుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, వ్యవసాయాన్ని ఇంటెన్సివ్ వ్యవసాయ పద్ధతుల నుండి పర్యావరణ అనుకూల వ్యవస్థలకు మార్చాలనే ప్రయత్నాలకు ధర ప్రోత్సాహకాలు మరింత ఊతమిస్తాయి. కొన్ని రోజుల క్రితం, సేంద్రియ పసుపు రైతుల కోసం హిమా చల్ ప్రదేశ్ సీఎం ఒక రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను ప్రారంభించారు. సేంద్రియ పసుపునకు కనీస మద్దతు ధర కిలోకు రూ. 90గా నిర్ణయించారు. మార్కెట్ ధర కిలోకు రూ. 25 నుండి రూ. 30 వరకు మాత్రమే ఉంది. ధరలలో గణనీయమైన పెరుగుదల సేంద్రియ పసుపు ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.కోవిడ్–19 మహమ్మారి తర్వాత, ప్రజలు శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంలోని ప్రాముఖ్యతను గ్రహించిన తర్వాత, సేంద్రియ పసుపునకు డిమాండ్ పెరిగింది. ముడి పసుపు ప్రాసెసింగ్‌ను రాష్ట్ర సంస్థలు ‘హిమాచల్ హల్దీ’ పేరుతో విక్రయిస్తాయని సుఖు వెల్లడించారు. గతంలో సేంద్రియ మొక్కజొన్న కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా తుది ఉత్పత్తులను ఐదు కిలోలు, 120 కిలోల సంచులలో విక్రయిస్తారు.2025–26 నాటికి లక్ష మంది రైతులను సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకురావాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దూకు డుగా ముందుకు సాగకపోవడం నాకు సంతోషం కలిగిస్తోంది. హామీ ఇచ్చిన ధరలను అందించడం, ప్రత్యేక ప్రాసెసింగ్‌ను, మార్కెటింగ్‌ను నిర్ధారించడం ద్వారా ప్రభుత్వ మద్దతుతో నెమ్మదిగానే కానీ స్థిరమైన ప్రయత్నం చేయడం అవసరం. కాగితంపై మాత్రమే మిగిలే అసాధ్య మైన లక్ష్యాలను ప్రకటించడం కంటే ఇది చాలా మంచిది.రాజకీయాలకు అతీతంగా, పర్యావరణ అనుకూల వ్యవసాయ వ్యవస్థల వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. సహజ వ్యవసా యంలో నిమగ్నమైన అనేక వ్యవసాయ సమూహాలు ఇప్పటికే సాను కూల ఫలితాలను చూపిస్తున్నప్పటికీ, తక్కువ మార్కెట్ ధరల కార ణంగా ఈ ప్రయత్నం వీగిపోయింది. ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్ పాటించవలసిన ధరల చట్రాన్ని అందించింది. సేంద్రియ సాగుదారులకు అధిక ఆదాయం రావడానికి తక్కువ ఉత్పత్తి ఖర్చుపై ఆధారపడటానికి బదులుగా, తక్షణ అవసరం ఏమిటంటే అధిక హామీ ధరను అందించడం. అంతే తప్ప తక్కువ సాగు ఖర్చు అవస రమనే వాదన పనిచేయదు. నీతి ఆయోగ్ కూడా సహజ వ్యవసాయ విస్తరణను అభినంది స్తోంది. కానీ సాగుదారులకు ఆకర్షణీయమైన ధర అవసరాన్ని అది విస్మరించింది. అందుకే హిమాచల్ ప్రదేశ్ సీఎం ప్రారంభించిన కార్యక్రమంలో కొత్తదైన సానుకూల ధోరణిని నేను చూస్తున్నాను. మార్కెట్లు సామర్థ్యాన్ని, నాణ్యతను ప్రోత్సహిస్తాయనే తప్పుడు నమ్మకం ఉన్నప్పటికీ, సేంద్రియ రైతులకు సరైన, హామీ ఇవ్వబడిన ధరలను నిర్ణయించడానికి ప్రభుత్వ జోక్యం అవసరం.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
నీళ్ల కోసం ఇక పాక్ కాళ్లబేరం!
ఇండియా, పాకిస్తాన్ మే 10న కాల్పులను విరమించాయి. దీనికి అమెరికా చొరవ చూపి నట్టుగా వార్తలొచ్చాయి. ఏప్రిల్ 22 పహల్ గామ్ దాడి నుంచి మే 10 కాల్పుల విరమణ వరకు గడచిన ఈ స్వల్పకాలంలో ఇరు దేశాల సంబంధాలు మౌలికంగా కొత్త రూపు సంతరించుకున్నాయి. ఉగ్రదాడికి ముందు ఇండియా–పాకి స్తాన్ సంబంధాలు ఎలా ఉండేవో ముందుగా తెలుసుకోవాలి. రెండు దేశాల నడుమ పరిష్కారం కాని సమస్యలపై ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, కాల్పుల విరమణ సజావుగా కొనసాగుతోంది. సింధూ నదీ జలాల ఒప్పందానికి (ఇండస్ వాటర్ ట్రీటీ– ఐడబ్ల్యూటీ) ఇండియా కట్టుబడి ఉంది. పరిమిత కాల పర్యటనలకు వీలుగా అటారీ–వాఘా సరిహద్దు తెరిచే ఉంటోంది. రాజధానుల్లో హై కమిషనర్లు మినహా సీనియర్ దౌత్యాధికారులు పనిచేస్తున్నారు. ఏదో ఒకరోజు కశ్మీర్ మీద చర్చలు సాధ్యమేనన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి మరునాడు, అంటే ఏప్రిల్ 23న, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. అటారీ– వాఘా సరిహద్దును మూసేసింది. రక్షణ సహాధి కారుల పోస్టులను రద్దు చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ భగ్నమైంది. పాకిస్తాన్ ఒకడుగు ముందుకేసి 1972 సిమ్లా ఒప్పందం రద్దు చేస్తానని బెదిరించింది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే నీళ్లు!కట్ చేస్తే... మే 11న అకస్మాత్తుగా వైరాలు నిలిచిపోయాయి. మళ్లీ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో మారిన పరిస్థి తులు ఏవి? దీని తర్వాతా మారనివేమిటి? మే 10న రెండు దేశాల డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్)లు టెక్నికల్ అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. దీని ప్రకారం, నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్–ఎల్ఓసీ) పొడవునా కాల్పులు జరగవు. డ్రోనులు, క్షిపణులు ప్రయోగించుకోరు. ఇతర లాంగ్ రేంజ్ ఆయు ధాల ప్రయోగం జరగదు. పరస్పర సైనిక దాడులు నిలిచిపోతాయి. ఇక కాల్పుల విరమణ ఒప్పందం వమ్ము చేయలేనివి ఏమిటో చూద్దాం. ఏప్రిల్ 23న ఇండియా, ఆ తర్వాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలను మే 10 ఒప్పందం రద్దు చేయలేదు. ఇది టెక్నికల్ స్థాయి పత్రం తప్ప రాజకీయ ఒప్పందం కాదు. డీజీఎంఓలకు రాజకీయ ఒప్పందాలు చేసుకునే అధికారం లేదు. వీటిని విదేశీ వ్యవహారాల శాఖలు మాత్రమే కుదుర్చుకోగలవు. మరో విధంగా చెప్పాలంటే, ఏప్రిల్ 22 నాటి పరిస్థితిని ఇరు దేశాలూ పునరుద్ధరించలేదు. అందుకే, ఇండియా, పాకిస్తాన్ నడుమ ఇప్పుడున్నది నయా స్టేటస్ కో! అంటే, ఐడబ్ల్యూటీ ఇక ముందు కూడా నిలుపుదలలోనే ఉంటుంది. సింధు జలాలు ఇండియా ఇష్టానుసారం ప్రవహిస్తాయి. ఈ జలాల గణాంకాలను పాకిస్తాన్‌తో పంచుకోవడానికి ఇండియా సుముఖంగా లేదు. దాయాది దేశ ఆర్థిక వ్యవస్థను, అంతర్గత రాజకీయాలను దీర్ఘ కాలంలో ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఐడబ్ల్యూటీ నిలిపివేత ఇండియా–పాకిస్తాన్ దౌత్య సంబంధాల రూపురేఖలను మౌలికంగా మార్చేసిన తీవ్ర చర్య. పాక్ టెర్రరిజానికి స్వస్తి పలికితే తప్ప సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించబో మని ఇండియా తేల్చిచెప్పింది. ఏకపక్షంగానో, లేదా ద్వైపాక్షిక చర్చల అనంతరమో దీన్ని పునరుద్ధరించడం పూర్తిగా ఇండియా చేతిలో ఉంది. మే 10 కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి ఈ అంశం రాదు.భవిష్యత్ చర్చల్లో పాకిస్తాన్ మెడలు వంచడానికి ఈ ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ గొప్ప అస్త్రం అని చెప్పాలి. పాకిస్తాన్‌కు సింధూ బేసిన్ నీళ్లు కావాలంటే, టెర్రరిజం విషయంలో ఇండియా డిమాండ్లకు అది తలొగ్గాల్సిందే. కశ్మీర్ అనేది భావోద్వేగాలకు సంబంధించిన అంశం. అయితే, పాకిస్తాన్ ప్రజలకు నీరు జీవన్మరణ సమస్య. పాకిస్తాన్ ఇకముందు కూడా కశ్మీర్ పాట పాడుతుంది. కానీ, ఐడబ్ల్యూటీ విషయంలో ఇండియాను సానుకూలం చేసుకోడమే మున్ముందు వారి అసలు లక్ష్యం అవుతుంది. ఉభయ పక్షాల చర్చల్లో కశ్మీర్ అంశం ప్రాముఖ్యం కోల్పోతుంది. దాని స్థానంలో ఐడబ్ల్యూటీ కీలకాంశంగా మారుతుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇండియా తీసు కున్న ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ అనే ఒకే ఒక్క చర్యతో... ఇరు దేశాల సంబంధాల్లో ఇప్పటి వరకు కేంద్రబిందువుగా ఉన్న కశ్మీర్ స్థానాన్ని ఇప్పుడు నీరు ఆక్రమించింది. నిగ్రహం బాధ్యత పాక్ మీదే...1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అనంతరం, 1972లో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసినప్పుడు కూడా ఇండియా ఇలానే వ్యవహరించింది. యుద్ధం ముందు ఉన్న ప్రాదేశిక స్థితిని (1965 యుద్ధానంతరం మాదిరిగా) యథాతథంగా అంగీకరించలేదు. కశ్మీర్ సరిహద్దు పేరును ‘కాల్పుల విరమణ రేఖ’ నుంచి ‘నియంత్రణ రేఖ’ (ఎల్ఓసీ)గా మార్చింది. ఇలా చేయడం ద్వారా కశ్మీర్లో తృతీయ పక్షం జోక్యాన్ని వ్యతిరేకించగలిగింది. అప్పటి నుంచి జమ్ము– కశ్మీర్లో యూఎన్ పరిశీలకుల ఉనికి నామమాత్రమైంది. సారాంశం ఏమిటంటే, పహల్గామ్ ఉగ్రదాడి, దాని పర్యవ సానాలు ఇండియా–పాకిస్తాన్ సంబంధాలను రెండు విధాలుగా ప్రభావితం చేశాయి. మొదటిది: పాకిస్తాన్ కోరుకున్నట్లు కశ్మీర్ అంశం కొంతవరకు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అయితే ద్వైపాక్షిక చర్చల నుంచి కశ్మీర్‌ను తప్పించడంలో ఇండియా విజయం సాధించింది. పాకిస్తాన్ ఇప్పుడు సర్వశక్తులూ ఐడబ్ల్యూటీ మీదే కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్‌కు నీళ్లు కావాలి.ఇండియాకు టెర్రరిజం అంతం కావాలి. ఇప్పటి వరకు, టెర్రరిజం అంతానికి పాకిస్తాన్ అంగీకరించాలంటే ఇండియా కశ్మీర్‌పై చర్చలు జరపాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడది మారింది.రెండవది: ఇరు దేశాల నడుమ సంఘర్షణ తలెత్తినప్పుడు, వైరాన్ని ఉప–సాంప్రదాయిక (సబ్–కన్వెన్షనల్) స్థాయిని దాటనివ్వ లేదని ఇండియా తన చర్యలు, ప్రతిచర్యల ద్వారా చాటిచెప్పింది. భవిష్యత్తులో మాత్రం ఇది కుదరదని, సబ్–కన్వెన్షనల్ దాడులకు సాంప్రదాయిక స్థాయిలోనే ప్రతి చర్యలు ఉంటాయని ప్రకటించింది. అంటే, ఇండియాతో పూర్తిస్థాయి యుద్ధం వద్దనుకుంటే, ఉప–సాంప్రదాయిక స్థాయిలోనూ పోరు ప్రారంభించకుండా నిగ్రహం పాటించాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీదే ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే, టెర్రరిజానికి ఇక సాంప్రదాయిక యుద్ధంతోనే జవాబు చెబుతామని ఇండియా స్పష్టం చేయగలిగింది. ఇందుకోసం భారీ మిలిటరీ సంక్షోభం ఉత్పన్నమై అనేక మంది బలి కావలసి రావడం దురదృష్టకరం. వైరి దేశం ఉగ్ర దాడులకు తెగబడ కుండా నిరోధకత సాధించడానికి, దాన్ని కొనసాగించడానికి ఈ పాటి మూల్యం చెల్లించక తప్పదు.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా ఫారిన్ పాలసీ బోధకులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ముక్కలు చేయడమే మార్గం!
క్రమం తప్పకుండా జరుగుతున్న భారీ ఉగ్ర వాద దాడులు భారత్, పాకిస్తాన్ సంబంధాలను ఘోరంగా దెబ్బతీశాయి. సాధారణంగా, ప్రతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి దాడులు జరుగుతాయి. ఎక్కువకాలం సైనిక నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి, పౌర అధికారంపై మరింతగా నియంత్రణ సాధించాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు లేదా అతని బలగాలు దేశంలో గౌరవాన్ని కోల్పోతున్నప్పుడు ఉగ్రవాద దాడులు చోటు చేసుకుంటాయి. భారతదేశం నుండి సైనిక ముప్పు ఉందన్న ప్రచారం కంటే పాకిస్తాన్ ప్రజలను మరేదీ కలిపి ఉంచదు. పైగా వరదలు, కరవులు, ఉగ్రవాద ఘటనలతో సహా పాకిస్తాన్ లో జరిగే ప్రతిదానికీ భారతదేశంపైనే నిందలు మోపుతూ వస్తారు.భారతదేశం మన పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేయాలని చూస్తోందనీ, దాన్ని రక్షించే ఏౖకైక శక్తి పాక్ సైన్యమే అనీ పాక్ ప్రజలకు తొలి నుంచీ నేర్పించారు. భారత్ సహన పరిమితిని దాటిన ప్రతి ఉగ్రవాద ఘటన తర్వాత, పాకిస్తాన్ సాధారణ వ్యాఖ్యలను పునరావృతం చేస్తుంటుంది. వారి మంత్రులు దీనిని భారతదేశం ప్రారంభించిన ‘తప్పుడు’ ఆపరేషన్ అని, లేదంటే ఇది కశ్మీర్ ‘స్వాతంత్య్ర సమరయోధుల’ పని అని గావుకేకలు పెడతారు. తమ గడ్డపైనే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నామనే ఆరోపణను వారు నిరంతరం తిరస్కరిస్తారు. పైగా ఉగ్రవాదానికి అత్యంత ప్రభావి తమైన దేశం తమదే అని వాపోతుంటారు. అయితే దాదాపు ప్రతి ప్రపంచ స్థాయి ఉగ్రవాద ఘటనకూ పాకిస్తాన్‌తో సంబంధం ఉందనీ, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులలో అత్యధికులు పాక్‌లోనే ఆశ్రయం పొందారనీ ప్రపంచానికి తెలుసు.ఎన్నని సహిస్తాం?కథ పునరావృతమవుతుంది. పైగా విసుగు పుట్టిస్తుంది. బహిరంగ అంతర్జాతీయ దర్యాప్తునకు పాక్ వైపు నుంచి ఎప్పుడూ హామీ ఉంటుంది, కానీ ఈ ప్రతిపాదనను ఎవరూ నమ్మరు. ముంబై ఉగ్ర దాడి సూత్రధారులలో ఒకరైన తహవ్వుర్ రానాను అమెరికా ఇటీవలే భారతదేశానికి అప్పగించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ముంబై ఉగ్రవాద దాడులపై ఇంకా దర్యాప్తు చేయవలసి వస్తోంది. ఉగ్రవాద నాయకులపై పాకిస్తాన్ ఎప్పటికీ చర్య తీసు కోదు. ఎందుకంటే వారే పాక్ ప్రధాన ఆస్తులు. పహల్గామ్ ఉగ్ర దాడిపై దర్యాప్తు కూడా దశాబ్దాలుగా నిగూఢంగా ఉండిపోతుంది. దావూద్ ఇబ్రహీమ్ ఉనికిని అది ఎల్లప్పుడూ ఖండిస్తూ వచ్చింది. అయినప్పటికీ ప్రతి ప్రపంచ సంస్థకూ పాకిస్తాన్ లో అతని బహుళ నివాసాల గురించి తెలుసు. దీనికి విరుద్ధంగా, ప్రతీకారం తీర్చు కుంటామని ఇండియా బెదిరిస్తే, వారు అకస్మాత్తుగా తమ భూ భాగంపై ఉగ్రవాద కార్యకలాపాలలో భారతదేశ ప్రమేయం ఉందని ఇష్టారాజ్యంగా అబద్ధాలాడతారు.ప్రజల మద్దతు పొందాలనే ఆశతో, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంపై భారతదేశాన్ని పాక్ బెదిరించడం ప్రారంభించింది. దాని ఆనకట్టలు భారతీయ రక్తంతో నిండిపోతా యని రెచ్చ గొట్టేంత వరకు వెళ్ళింది. చరిత్ర గమనిస్తే, భారత ప్రభు త్వాలు రావల్పిండిని నియంత్రించడంపై ప్రపంచ మద్దతు కోరుతూ పాకిస్తాన్ ఉగ్రవాద దాడులపై తీవ్ర విమర్శ చేస్తూ వచ్చాయి. కానీ అది ఎప్పుడూ పని చేయలేదు. దీనికి విరుద్ధంగా, తరచుగా విరామాలతో కూడిన ఉగ్రవాద దాడులకు పాక్ తలుపులు తీసింది. 2001 అక్టోబర్‌లో జమ్మూ–కశ్మీర్ శాసనసభపై దాడి, ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో పార్లమెంటుపై దాడి, 2002 సెప్టెంబర్‌లో అక్షరధామ్‌పై దాడి, 2003 ఆగస్టులో ముంబై బాంబు దాడులు, ఆ తర్వాత 2005 అక్టోబర్‌లో ఢిల్లీలో బహుళ బాంబు దాడులు, 2006 జూలైలో ముంబై రైలు దాడులు, 2008 నవంబర్‌లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి కొన్ని ఉదాహరణలు. బాలాకోట్‌పై జరిగిన దాడి తర్వాత మాత్రమే భారత్ సందేశం అంతటా వినిపించింది. కానీ సరిహద్దులు దాటి భారత్ చేసిన బాలాకోట్ సర్జికల్ దాడి కూడా పాకిస్తాన్‌ను నిరోధించడంలో విఫలమైంది. ఎందుకంటే భారత్ దాడిలో సంభవించిన ప్రాణనష్టాన్ని పాక్ దాచగలిగింది. కారణం... హతమార్చబడిన వారు ఉగ్రవాదులు!పెద్ద మార్పు ఉండదు!సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన ప్రభావం ఇస్లామాబాద్‌కు బాగా తెలుసు. వారి నాయకత్వాన్ని అది భయ పెట్టింది. కానీ, ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని చెప్పడం తప్ప వారికి వేరే పరిష్కారం లేదు. భారతదేశం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని వారు ఇక ఒప్పించలేరు. రెండు దేశాల మధ్య సంబంధాలు శాంతియుతంగా ఉండాలనే ముందస్తు షరతు పైనే ఈ ఒప్పందంపై సంతకం చేశారనేది వాస్తవం. మరోవైపున అఫ్గానిస్తాన్‌కు భారతదేశం సన్నిహితం కావడం పాకిస్తాన్లో ఆందోళనలను మరింత పెంచింది. ముఖ్యంగా పాకిస్తాన్ తన బలగాలను భారత సరిహద్దుకు తరలించినప్పుడల్లా బలోచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ ఈ అంతరాన్ని బాగా ఉపయోగించు కుంటాయి. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట పాకి స్తాన్ తన సైన్యాన్ని మోహరించి ఉంచినంత కాలం, వారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే భారత్ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే, అది ఏ సైనిక చర్య తీసుకున్నా, పెద్దగా మార్పు ఉండదు. పాక్‌లో కొత్త ఆర్మీ చీఫ్ వచ్చి తనవంతుగా ఏదైనా చేయాలని భావించే వరకు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి తక్కువ స్థాయిలో మద్దతు ఇస్తూనే ఉంటుంది. తర్వాత, మరొక ఘటన జరుగుతుంది. కథ పునరావృతమవుతూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం నుండి భారతదేశాన్ని రక్షించడానికి ఏకైక పరిష్కారం దాని బాల్కనైజేషన్ మాత్రమే (అంటే ఒక దేశం లేదా ప్రాంతాన్ని బహుళ చిన్న, శత్రు యూనిట్లుగా విభజించే ప్రక్రియ). దీని కోసం, పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమూహాలకు భారతదేశం తన మద్దతును ఇవ్వాలి.హర్ష కక్కడ్ వ్యాసకర్త భారత సైన్యంలో రిటైర్డ్ మేజర్ జనరల్(‘ద స్టేట్స్‌మన్’ సౌజన్యంతో) -
ఇప్పటికైనా బౌద్ధాన్ని అర్థం చేసుకున్నామా?
‘నా దృక్పథం రాజకీయాల నుంచి కాక మత సంస్కృతి నుంచి అలవడింది.’’ – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హేతువుకు ప్రాధాన్య మిచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ముందుకు తీసుకొచ్చిన బౌద్ధం ప్రాచీన భారతదేశంలోనే కాకుండా ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రాసంగికతను కలిగివుంది. గౌతమబుద్ధుడు భారతదేశపు మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు. ఆయన తన కాలం నాటికి అమలులో ఉన్న సాంఘిక దుర్నీతినీ; మతం పేరున జరుగుతున్న హింసాకాండ, అమానవీయతనూ ప్రశ్నించాడు. హేతువు పునాదిగా ప్రజాస్వామిక సంస్కృతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేశాడు. బుద్ధుడు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దికి చెందిన వాడైనప్పటికీ ఆయన బోధించిన సమానత్వ భావన, హేతువాద దృక్పథం, ప్రజాస్వామికతత్త్వం ఈనాటికీ ఎంతో ప్రాసంగికతను సంతరించుకున్నాయి. ఆయన ముందుకు తీసుకువచ్చిన ‘అనాత్మవాదం’, ‘అనిత్యత’, ‘ప్రతీత్య సముత్పాద’ వంటి భావనలు బౌద్ధాన్ని ఇతర మతాల కంటే భిన్నంగా నిలబెట్టాయనవచ్చు. ఈ భావనలు బౌద్ధాన్ని ఒక మతం అనే స్థాయి నుంచి గొప్ప ప్రాపంచిక దృక్పథాన్నిచ్చే తాత్విక స్థాయికి తీసుకెళ్ళాయనవచ్చు. బుద్ధుడి బోధనలలో ముఖ్యమైన ‘అష్టాంగ మార్గం’ మనుషుల వ్యక్తిత్వ వికాసానికి దోహదంజేసే అత్యున్నత మార్గం. సమత, కరుణ, ప్రజ్ఞ, మైత్రి, శీలం అనేవి బుద్ధుని తాత్వికతలోని ప్రధాన అంశాలు. అలాగే బుద్ధుడు వైదిక మతంలో భాగం అని వాదించడం బుద్ధుణ్ణి బ్రాహ్మణ వాదంలో జీర్ణం చేసుకోవాలనే ప్రయత్నం చెయ్యడమే! అటువంటి ఆకాంక్షల ఫలితమే పురాణాల కాలానికి బుద్ధుడిని విష్ణుమూర్తి దశావతారాలలో ఒక అవతారంగా మార్చడమని తెలుస్తోంది. విద్య, విజ్ఞానం, ఆధునిక భావాల పరంగా ఎంతో ముందంజ వేశామని భావిస్తున్న ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మతమౌఢ్యం పెచ్చరిల్లిపోతోంది. బౌద్ధం రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల పరంగా విస్తృతమైన పరిధి కలిగిన తత్త్వం కాబట్టి సమకాలీన సామాజిక, సాంస్కృతిక వైరుద్ధ్యాలకు బౌద్ధంలో పరిష్కారమార్గాలు వెదకవచ్చు.పండిత అయోతీదాస్, ప్రొఫెసర్ లక్ష్మీ నరసు, డాక్టర్ అంబేడ్కర్ బౌద్ధాన్ని సామాజిక విముక్తి సిద్ధాంతంగా ప్రతిపాదించారు. అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడాన్ని హిందూమతంలో అంటరానివారనే దళితుల సామాజిక స్థాయిని తిరస్కరించడంగా భావించాడు. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా లౌకికవాదులు, హేతువాదులు, శాస్త్రవేత్తలు అయిన మేధావులు తాము బౌద్ధాభిమానులమని చెప్పుకోవడానికి గర్విస్తున్నారు. ఎడ్విన్ ఆర్నాల్డ్ అన్నట్లు బుద్ధుడు ‘ఆసియా జ్యోతి’ మాత్రమే కాదు ఆయన బోధనల ప్రాసంగికత పెరిగేకొద్దీ బుద్ధుడు ‘ప్రపంచ జ్యోతి’గా పరిణామం చెందుతున్నాడు. అయితే బుద్ధుడిని సమాజం కేవలం అహింసా మూర్తిగా, చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకున్న సన్యాసిగా, లేకపోతే శాకాహారిగా మాత్రమే అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడు అహింసావాది అన్నమాట నిజమే... కానీ శాంతిని, న్యాయాన్ని స్థాపించడం కోసం యుద్ధం చెయ్యడంలో తప్పు లేదంటాడు. ఆయన కేవలం ధ్యానం మాత్రమే చెయ్యక ప్రాపంచిక విషయాలపై వివిధ వ్యక్తులతో చర్చించి సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. చాలామంది భావించినట్లు బుద్ధుడు శాకాహారి కాడు. అలాగే ఆయన శాకాహారాన్ని కీర్తించలేదు. క్రతువులలో జంతు వధను ఖండించి, పండితుల భాషగా ఉన్న సంస్కృతం స్థానంలో ప్రజల భాష అయిన ‘పాళీ’ని ప్రతిపాదించి వైదిక సంస్కృతికి ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రవేశపెట్టాడు. నిజానికి బౌద్ధం సంధించిన విమర్శల ఫలితంగానే తర్వాత కాలంలో హిందూమతం తనను తాను సంస్కరించుకుని అహింసనూ, శాకాహారాన్నీ ఆదర్శాలుగా స్వీకరించింది. బౌద్ధ భిక్షువులు సామాజిక కార్యకర్తల వలే బహుజన హితం, బహుజన సుఖం కోసం పనిచెయ్యాలని బుద్ధుడు సూచించాడు. బౌద్ధసంఘంలో రాజుల నుంచి, బానిసల వరకు అందరికీ సమాన హోదాను కల్పించాడు. బౌద్ధసంఘంలో ‘ఉపాలి’ అనే మంగలి కులస్థుడు, ‘జీవకుడు’ అనే వేశ్యాపుత్రుడు, ‘ఆమ్రపాలి’ అనే వేశ్య, రాజవంశీకులైన ‘ప్రసేనజిత్’, రాకుమార్తె ‘విశాఖ’; భర్త, బిడ్డల చేత, సమాజం చేత నిర్లక్ష్యానికి గురైన స్త్రీలు... సమానమైన గుర్తింపును పొందారు. భిన్న సామాజిక వర్గాల మధ్య బుద్ధుడు సామరస్యాన్ని కుదిర్చాడు. ‘విధికుడు’ అనే చర్మకారుడు అమరావతి క్షేత్రానికి కానుకగా ఇచ్చిన పూర్ణకుంభం బౌద్ధంలోని సమతకు చిహ్నంగా మిగిలింది. బౌద్ధంలో దేవుడి స్థానాన్ని నైతికత ఆక్రమిస్తుంది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గెయిల్ ఆంవెత్ బౌద్ధం అధికారిక మతంగా ఉన్న ప్రాచీన భారత సంస్కృతిని ‘బుద్ధిస్ట్ సివిలైజేషన్’గా పేర్కొన్నారు. ‘భారతీయ ఆత్మను కలిగి ఉన్న బౌద్ధాన్ని దేశం నుంచి వెళ్లగొట్టి భారతదేశం ఆత్మహత్య చేసుకుంద’ని గురజాడ అనడంలో అతిశయోక్తి లేదు. బౌద్ధం అనే గొడుగు కింద ప్రజల్లో సమైక్య భావన ఏర్పడే అవకాశం ఉంది. - ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బుద్ధిస్ట్ స్టడీస్ శాఖలో సీనియర్ ప్రొఫెసర్ (మే 12న బుద్ధ పూర్ణిమ) -
శాంతితోనే స్థిరమైన అభివృద్ధి
ఇరుదేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు కాల్పుల విరమణ ఒప్పందంతో కొంతలో కొంత చల్లబడినప్పటికీ, దక్షిణాసియా అభివృద్ధికి శాశ్వత శాంతి నెలకొనాల్సి ఉంది. దీనికి కావాల్సిన రాజకీయ నాయకత్వ కొరత ఉందన్నది కాదన లేని నిజం. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుండి ఉత్పన్నమయ్యే సీమాంతర ఉగ్రవాద దాడులపై తాను ఎలా స్పందిస్తాను అనే అంశాన్ని భారతదేశం సరికొత్తగా నిర్వచించింది. సింపుల్‌గా చెప్పాలంటే భారత్ తిరిగి దాడి చేస్తుంది. దీని ప్రకారమే భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని వివిధ లక్ష్యాలను గురి చూసి కొట్టి తన పనిని పూర్తి చేసింది. పహెల్గామ్లో జరిగిన దారుణమైన, విషాదకరమైన, మత తత్వ ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా, భారతదేశం పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే కాకుండా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడి చేసింది. పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడానికి అవసరమైన వరుస చర్యలను చేపట్టడం ద్వారా భారత్ ముందడుగువేసింది. దీనిపై రాజకీయ పరంగా దేశంలో విస్తృత స్థాయిలో ఐక్యత ఏర్పడింది.కొత్త యుగానికి నాంది పలకాలి!అయితే, భారతదేశమైనా, పాకిస్తాన్ అయినా తమను తాము తీవ్రంగా గాయపరచుకోకుండా పూర్తి స్థాయి సైనిక యుద్ధాన్ని చేపట్టలేవని, చేపట్టినా దాన్ని కొనసాగించలేవని అన్ని పక్షాలకూ స్పష్టంగా తెలిసిపోయి ఉండాలి. ఇరుదేశాల మధ్య యుద్ధంలో ఓడిపోయిన వారు వాస్తవానికి– భారత్, పాక్ ప్రజలే! ఒక పక్షాన్ని మరొక పక్షం అనుమానించిన ప్రతిసారీ ఈ రెండు దేశాలూ పరస్పర దాడులకు పాల్పడతాయనే అభిప్రాయం ఇప్పుడు స్థిరపడింది. తన భూభాగంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడిలో 25 మంది మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పహెల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కార ణాన్ని వివరించింది. అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందనలను పరి శీలిస్తే కొన్ని దేశాలు మాత్రమే ఒక పక్షం కథనాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. సంఘటనలపై భారతీయ కథనానికి ఎక్కువ మంది మద్దతుదారులు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ కూడా తనదైన మద్దతుదారులను కూడగట్టింది.రెండు దేశాల ముందు ఉన్న సవాలు, నిజానికి భారత ఉపఖండం అంతటా ఇప్పుడు ఉన్న సవాలు – గత శతాబ్దంలో ఉనికిలోకి వచ్చిన అనేక దేశాలు కూడా ప్రాంతీయ, దేశీయ శాంతికి, అభివృద్ధికి చెందిన కొత్త యుగానికి నాంది పలికే నాయకత్వాన్ని కనుగొనడమే! విచార కరంగా, దక్షిణాసియాలో అలాంటి రాజకీయ నాయకత్వ కొరత ఉంది. వలసవాదం నుండి విముక్తి పొందినప్పటి నుండి ఈ ప్రాంతం స్వీయ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, గత చరిత్రలతో అంతర్గత పోరాటాల కారణంగా వెనుకబడి ఉంది.పొరుగు సంబంధాలు కీలకందక్షిణాసియా విషాదం ఏమిటంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాలలో చాలా మందికి తమ బండిని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చుననీ, పొరుగువారితో సంబంధాలను మెరుగు పర్చుకోకుండానే అభివృద్ధిని కొనసాగించవచ్చుననీ నమ్మకం ఉంది. గత పావు శతాబ్దంలో భారతదేశపు విశ్వసనీయ ఆర్థిక పనితీరు, తన పొరుగువారితో ప్రబలంగా ఉన్న వివాదాలను పరిష్కరించకుండానే ఎదగడాన్ని భారత్ కొనసాగించగలదని చాలా మంది నమ్మేలా చేసింది. కొంతవరకు, అది సాధ్యమైంది. అయితే, భారతదేశం దీర్ఘకా లిక యుద్ధంలోకి లాగబడితే అది కూడా ఆర్థికంగా దెబ్బతింటుంది. చెలరేగిన ఘర్షణ వాతావరణపు దుమ్ము కాస్తా అణిగి, ‘యుద్ధం పొగమంచు’ నుండి బయటపడిన తర్వాత, రెండు దేశాలలోని రాజకీయ నాయకత్వం ప్రాంతీయ భద్రత అంటే ఏమిటో సుదీర్ఘంగా పరిశీలించాలి. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం ప్రాంతీయ వాతావ రణాన్ని తప్పకుండా నిర్వచించాలి. భూభాగం గురించిన నిరంతర వివాదాల ద్వారా ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి? ప్రతి దేశంలోనూ, ప్రాంతం అంతటా మతపరమైన ప్రాంతీయ విభజనల నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?సరిహద్దుకు ఇరువైపులా గొప్ప వ్యూహకర్తల జ్ఞానం ఉన్నప్పటికీ, నేడు ఏ పక్షమూ ప్రాంతీయ శాంతి, భద్రత కోసం కొత్త చట్రాన్ని నిర్వచించలేకపోయింది. ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2000–2007 కాలంలో చివరిసారిగా ఒక ప్రయత్నం జరిగింది. పాకిస్తాన్ అధ్య క్షుడు పర్వేజ్ ముషారఫ్ కొంతకాలం వారి చొరవతో ముందుకు సాగారు. కానీ ఆయన త్వరలోనే పదవీచ్యుతుడయ్యారు. అప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం శాంతి భద్రతలకు సంబంధించి ‘మన్మోహన్ – ముషారఫ్’ ఫార్ములాను తిరస్కరించింది.ఈ రోజు ఆ ఫార్ములా గురించి ప్రస్తావిస్తే ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే... దీనిని తప్పక ప్రస్తావించాలి. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉంది. జపాన్ను అధిగమించింది. స్వదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, భారత వృద్ధి ప్రక్రియలో లోపాలు ఉన్నప్పటికీ, భారతదేశం అభివృద్ధి చెందడం కొనసాగించడానికీ, ప్రపంచాన్ని అనుకూలమైన నిబంధనలతో నిమగ్నం చేయడానికీ తప్పక అవకాశం ఉంది.నియంత్రణ రేఖే సరిహద్దుభారతదేశం తన సొంత పొరుగు ప్రాంతాన్ని సురక్షితం చేసుకోకుండా అలా చేయగలదని భావించడం చాలా మంది సమకాలీన విశ్లేషకులు, వ్యూహకర్తల ఊహ మాత్రమే! భారత్ పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భారతదేశానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, వారు భారత్ నుండి ఎటువంటి ప్రయో జనాలనూ పొందకపోతే ఈ వృద్ధి వ్యయాలు పెరుగుతాయి. మోదీ ప్రభుత్వం పాటించిన గత దశాబ్దపు భారత విధానం ఏమిటంటే, కష్టాల్లో ఉన్న పొరుగువారిపై భారీ ఖర్చులను విధించడమే. ఇది స్వల్పకాలిక ప్రయోజనాలను అందించవచ్చు కానీ దాని పర్యవస నాలు భారత్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.మేము పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని భారత్ ప్రదర్శించే రాజకీయ ధైర్యం, కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడం గురించిన పాకిస్తాన్ వాక్చాతుర్యానికి చెల్లిపోతుంది. కానీ రెండూ ఎప్పటికీ జరగవు! సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్, మన్మో హన్–ముషారఫ్ ఫార్ములా ముఖ్య ఉద్దేశ్యం అదే! అన్ని ప్రధాన శక్తులు – అమెరికా, రష్యా, చైనా – నియంత్రణ రేఖ వాస్తవానికి అంతర్జాతీయ సరిహద్దు అనే ఆలోచనను సమర్థించాయి. నేడు రెండు దేశాలలోని ప్రముఖులు అలాంటి పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవికత నుండి తప్పించుకునే అవకాశం లేదనీ, ఈ వాస్తవికత అందరికీ పెనుభారంగా మారవచ్చనీ ఇరువైపులా ఉన్న వాస్తవికవాదులకు తెలుసు.సంజయ బారు వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ వ్యవస్థాపకుడు,భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు -
విరాట్ కోహ్లీ (స్టార్ క్రికెటర్) రాయని డైరీ
ఆట ఎన్ని పొరపాట్లనైనా క్షమించేస్తుంది. మళ్లీ మళ్లీ ఆడేందుకు అవకాశం ఇస్తూ ఉంటుంది. కానీ పెళ్లయిన వాడి జీవితంలో ఒక్క పొరపాటుకైనా క్షమాపణ ఉండదు. పోన్లే పాపం, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని జీవితం అనుకోదు. జీవితం దయ తలచినా, జీవిత భాగస్వామి క్షమాభిక్ష పెట్టదు!ఎవరో తెలియనైనా తెలియని ఒక అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో పొరపాటున లైక్ కొట్టినందుకు అనుష్క నా వైపు చూడటమే మానేసింది! తెలియని అమ్మాయికి, తెలియకుండా లైక్ కొట్టడంలో ఉండేది పొరపాటే కానీ మరొకటి మరొకటి ఎందుకవుతుంది?! నా నెత్తి మీద ఏ దేవతో ఆ క్షణంలో కూర్చొని ఉండాలి. ఊరికే ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అమ్మాయి కనిపించింది. ప్రింటెడ్ ర్యాప్ స్కర్ట్, గ్రీన్ టాప్. నా అంతట నేనే ఆ అమ్మాయి ఫొటోకి లైక్ కొట్టానా, లేక లైక్ తనంతటదే వెళ్లి ఆ అమ్మాయి ఫొటో కింద పడిందా తెలియటం లేదు. అసలు ఆ అమ్మాయే గుర్తు లేదు.అమ్మాయి వేసుకున్న ర్యాప్ స్కర్ట్, గ్రీన్ టాప్ గుర్తుండీ, అమ్మాయి గుర్తు లేక పోవటం అనేది ఉంటుందా? ఉండొచ్చేమో! నా నెత్తి మీద దేవతకు ఎంత మహిమ ఉందంటే... సరిగ్గా అనుష్క పుట్టిన రోజుకు మర్నాడే ఇలా జరిగింది. తనదొక రేర్ ఫోటోను వెతికి తీసి, ‘యూ ఆర్ మై లవ్’ అని కవిత్వం రాసి, తనకు బర్త్ డే విషెస్ చెప్పిన కొద్ది గంటలకే... ఆ ఎవరో తెలియని అమ్మాయికి నేను లైక్ కొట్టిన స్క్రీన్ షాట్లను క్రికెట్ అభిమానులు గొప్పగా సెలబ్రేట్ చేశారు.ఆ సెలబ్రేషన్ అనుష్క వరకు వచ్చింది. ‘‘ప్రేమించుకుని కదా పెళ్లి చేసుకున్నాం... ఈ తిక్క వేషాలేంటి?’’ అని అనుష్క నన్ను డైరెక్ట్‌గా అడిగినా బాగుండేది. తన ముందు ఆరార్లు ముప్పై ఆరు గుంజీళ్లు తీసేవాడిని.పాపభూయిష్ఠమైన నా పొరపాటుకు నివృత్తి, నిష్కృతి రెండూ లభించేవి. తనకు సిక్సర్లంటే ఇష్టం. అందుకే అన్ని గుంజీళ్లు.సిక్సర్లంటే తనకు ఇష్టమే కానీ, నేనంటే ఉండేంత ఇష్టమేమీ కాదు. మిడ్ ఓవర్స్‌లో స్పిన్ బాల్స్‌ని ఫేస్ చెయ్యలేక ఔట్ అయి బయటికి వచ్చిన ప్రతిసారీ... ‘‘నాకోసం అదే పనిగా సిక్సర్లు కొట్టేయనవసరం లేదు’’ అని నవ్వేసేది. ఇప్పుడు తనే నా మీద బౌన్సర్లు వేస్తోంది... తన మౌనంతో!అనుష్క మాట్లాడటం లేదు. వామిక నిద్రపోతోంది. అకాయ్‌కి మాటలు రావటానికి ఇంకా టైమ్ పడుతుంది. అకాయ్ ఒక్కడే ఇంట్లో ఇప్పుడు నా మేల్ ఫ్రెండ్. వాడు నా చెయ్యి పట్టుకుని నడవటానికి, బ్యాట్ పట్టుకుని నాతో ఆడటానికి, బైక్ మీద కాలేజీకి వెళ్లి రావటానికి, మళ్లీ ఎప్పుడైనా అనుష్క నాతో మాట్లాడటం మానేసినప్పుడు.. ‘‘ఏంటి డాడీ అలా ఉన్నారు?’’ అని నన్ను అడగటానికి వాడికి టైమ్ పడుతుంది.రెస్టారెంట్ నుంచి రాగానే అనుష్క నేరుగా పిల్లల గదిలోకి వెళ్లిపోయింది. రెస్టారెంట్ ముందు కార్లోంచి దిగుతున్నప్పుడు ఎప్పటిలా తనకు చెయ్యందించినా, తను నా చెయ్యందుకోలేదు. కనీసం నాకోసం ఆగనైనా ఆగకుండా నన్ను దాటుకుని, నడుచుకుంటూ రెస్టారెంట్ లోపలికి వెళ్లిపోయింది.ఒక్క లైక్ జీవితాన్ని ఎంత ఛిద్రం చేసింది!బాల్కనీలోకి వెళ్లి నిలుచున్నాను. సిటీ అంతా వెలిగిపోతోంది. నాలో మాత్రం చీకటి. ఎందుకు నేనలా చేశాను?!ఆకాశంలో చుక్కలు మిణుకు మిణుకుమంటున్నాయి. ఒక చుక్క అమితాబ్ బచ్చన్. ఒక చుక్క బిల్ క్లింటన్. ఒక చుక్క బరాక్ ఒబామా. ఒక చుక్క బిల్ గేట్స్.ఆ చుక్కల్లో నేనూ ఒక చుక్కనయ్యానా? అనుష్కకు తీవ్రమైన ఆవేదన మిగిల్చినందుకు! రాత్రి రెండు దాటేసినట్లుంది. మెల్లిగా అడుగులు వేసుకుంటూ పిల్లల గదిలోకి వెళ్లాను. వామిక నిద్రపోతోంది. అకాయ్ నిద్ర పోతున్నాడు. అనుష్క నిద్ర పోతున్నట్లుగా ఉంది. తను పడుకుని ఉన్న వైపు వెళ్లి, తన తల పక్కనే నేల పైన మోకాలి మీద కూర్చున్నాను. -
ఈ ఉద్రిక్తతలు తగ్గే మార్గం
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపైనే కాకుండా, 1971 తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్ పై, అది కూడాపంజాబ్ నడిబొడ్డున ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడులు ప్రారంభించడంతో ఇప్పుడు యుద్ధ ఢంకా గట్టిగా మోగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ ఒక సైనిక విన్యాస క్రమంలో యుద్ధట్యాంక్ పైకి ఎక్కి, తమపై ఏదైనా భారతీయ ‘సైనిక దురదృష్టకర ఘటన’ జరిగితే, ‘తక్షణ స్పందన’తో దాన్ని ఎదుర్కొంటామని ప్రకటించారు. కానీ భారత్ ప్రతిదాడి చేశాక పాక్ ఆర్మీ చీఫ్ ప్రతిష్ఠ దెబ్బతింది.అసీమ్ మునీర్ అన్నట్లుగా, భారత ప్రతి దాడి నిజంగా ‘సైనిక దురదృష్టకర ఘటనా’? ఏ రకంగా చూసినా, అది నిజం కాదు. ఇది చాలా కచ్చితమైన ఉగ్రవాద నిరోధక దాడి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, మన ప్రతిదాడి ఉద్రిక్తతలు పెంచేది కాదనీ, పాక్‌లోని ఏ సైనిక లక్ష్యాన్నీ ‘ఆపరేషన్ సిందూర్’ తాకలేదనీ తెలిపారు. సందేశం స్పష్టంగా ఉంది. పౌరులను, భారత సైన్యాన్ని తాకాలా వద్దా అనే విషయాన్ని పాకిస్తాన్ నిర్ణయించు కోవాల్సి ఉండింది. ఎందుకంటే, భారత్‌లో ఉగ్రవాద శిబిరాలు లేవు. అయినా సరే, పాక్ సైన్యం ఏకంగా భారతీయ నగరాలపై, జనావా సాలపై, విమానాశ్రయంపై నేరుగా దాడికి దిగింది. తర్వాత ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం.జనరల్ మునీర్ దూకుడుపాక్ సైనిక దాడులకు ఒక రోజు ముందే భారత హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ కసరత్తులకు ఆదేశించింది. భారతదేశం పూర్తి యుద్ధానికి సిద్ధమ వుతోందని ఇది సూచిస్తుంది. అయితే, ఇది నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) లేదా నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) వంటి స్వచ్ఛంద సంస్థలను మాత్రమే సమీకరించే రక్షణాత్మక చర్య. జాగ్రత్తగా చేపట్టిన ఈ ప్రయత్నాలన్నింటికీ భిన్నంగా, పాకిస్తాన్ చేపట్టిన సైనిక దాడి ఆ దేశానికి ఏ ప్రయోజనమూ కలిగించలేదు. జనరల్ మునీర్ దూకుడు మీద ఎటువంటి సందేహం లేదు. ఉద్దేశపూర్వకంగా మతతత్వ రంగు పులుముతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడికిముందు ఇస్లామాబాద్‌లో ఏప్రిల్ 18న జరిగిన ఒక కార్యక్రమంలో ‘రెండు దేశాల సిద్ధాంతం’పై ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం భారతదేశాన్ని రెచ్చగొట్టింది. ఉగ్రదాడిపై గట్టి చర్యకు దిగాలనే దృఢ సంకల్పాన్ని భారత్‌కు కలిగించింది.మునీర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు దాదాపు 66 శాతం పెరిగి, తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఎంతోమంది అనుచరు లున్న మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను, ఆ పార్టీ నేతలను పాక్ సైనిక వ్యవస్థ జైలులో పెట్టించింది. మాజీ ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌నూ, తన సొంత ప్రజలపై కాల్పులు జరప డానికి నిరాకరించిన మరో జనరల్‌తో సహా మరి కొందరు సీనియర్ అధికారులనూ జైల్లో పెట్టింది. మునీర్ తన ప్రతిష్ఠను తానే చెరుపుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు, ఐఎస్ఐ డీజీగా ఉన్న తనను అమర్యాదగా బయటకు నెట్టివేయడం తనకు జరిగిన ఘోరావమానంగా మునీర్ భావించారు. దాంతో సరైన అవకాశం కోసం చాలా కాలం వేచి ఉండి చివరకు కొరడాను ఉపయోగించారు.బాలాకోట్ సర్జికల్ దాడులు జరిగినప్పుడు పాక్ స్పందన సంయమనంతో ఉండింది. అప్పుడు పాక్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ బాజ్వా పూర్తి భిన్నమైన మనిషి. ఆయన ఇండియాతో వాణిజ్యసంబంధాలను కోరుకున్నారు. కానీ ఇప్పుడు భారత్– పాక్ ఘర్షణ భిన్న స్థాయికి చేరుకుంది.పట్టించుకునే స్థితిలో లేని ప్రపంచంవిస్తృత ప్రాంతీయ సంఘర్షణను రెచ్చగొట్టవద్దని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ భారతదేశానికి సలహా ఇచ్చారు. అలా రెచ్చగొట్టిన పక్షంలో చైనా జోక్యం చేసుకోవచ్చనే హెచ్చరిక దీంట్లో ఉండవచ్చు లేదా ఈ ప్రకటనకు పెద్దగా అర్థం ఏమీ ఉండకపోవచ్చు. కానీ, అగ్రశ్రేణి దేశాల నాయకత్వంలో ఉన్న గందరగోళం కనివిని ఎరుగనిది. తూర్పున, మాస్కో మరింత దారుణమైన ఇబ్బందుల్లో ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు మద్దతు ఇచ్చిన తర్వాత, తన వైఖరిని కాస్త సవరించి మధ్యవర్తిత్వం అందించడానికి ప్రయత్నించారు. ఇది ఢిల్లీకి ఏమాత్రం నచ్చదని క్రెమ్లిన్ కు తెలుసు. కానీ క్షిపణుల భారీ సమూహాన్ని మనకు రష్యా పంపడం ప్రోత్సాహకరంగా ఉంది. అయితే రష్యన్ సైనిక భుజం ఇప్పుడుఅందుబాటులో లేదు. ఆర్థిక మాంద్యం, తీవ్రమైన అంతర్గతఇబ్బందులతో పోరాడుతున్న యూరోపియన్ యూనియన్ సంయ మనం వహించాలని ప్రకటించింది. ఇజ్రాయెల్, భారతదేశం పట్ల క్రియాశీలంగా, బలంగా సానుభూతి చూపుతున్నప్పటికీ, గాజాలో గందరగోళాన్ని చూస్తే ఇజ్రాయెల్ ఇక్కడ నిర్వహించే పాత్రచాలా తక్కువేనని చెప్పాలి. మొత్తం మీద, ప్రపంచం ఈ యుద్ధాన్ని పట్టించుకునే స్థితిలో లేదు.ఇప్పుడు ఇరు దేశాల సైనిక ఘర్షణను తగ్గించడానికి చైనా ప్రభుత్వం గనక పూనుకుంటే అదొక పరిహాసం అవుతుంది. పాకిస్తాన్లో చైనా ప్రాబల్యం నిస్సందేహంగా ఉందనేది జగమెరిగిన సత్యం. మరోవైపున చైనానే పాకిస్తాన్ యుద్ధానికి నిధులుసమకూర్చే అవకాశం ఉంది. దేశాలు చాలా అరుదుగా హేతుబద్ధంగా వ్యవహరిస్తాయి. అలా సమకూర్చిన నిధులు వేరే విధంగా మళ్లే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరమని ఢిల్లీకి పూర్తిగా తెలుసు. ఇరు దేశాలు ఏం చేయొచ్చు?అయితే, ఇప్పుడు కూడా ఆశ ఉంది. అంగీకరించని నిజం ఏమిటంటే– భారతదేశం, పాకిస్తాన్ తమ సైనిక చర్యల విషయంలో అనేక పాశ్చాత్య దేశాల కంటే గతంలో చాలా పరిణతితో వ్యవహరించాయి. గత మూడు యుద్ధాలలోనూ ఏవీ పౌర లక్ష్యాలపై పెద్ద ఎత్తున బాంబు దాడి చేయలేదు. భారతదేశ క్షిపణి పాకిస్తాన్ ను తాకినప్పుడు, సైన్యం ప్రతిస్పందన సాపేక్షంగా తేలికగా ఉంది. ప్రస్తుతానికి, రెండు వైపులా సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ మాట్లాడుతున్నారు. అది ఒక ఆశాజనకమైన సంకేతం. ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీమ్ మాలిక్‌ను పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా నియ మించడం కూడా అంతే. రెండు దేశాల నిఘా సంస్థల అధిపతులు మాట్లాడుకోవాలని నిర్ణయించుకుంటే, అది పెద్ద విషయమే.ఉపఖండం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి రెండు దేశాలు ఉమ్మడి చొరవను ప్రకటించవచ్చు. పాకిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రవాద ప్రేరేపక దేశం అనే ఆరోపణనుపదే పదే ఎదుర్కొంటున్నందున ఇదేమీ అంత అసాధ్యమైనది కాదు. ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాలు ప్రస్తుత పరిస్థితుల్లో సాగేలా లేవు. కాబట్టి, పాత్రధారులు, సూత్రధారులతో సహా ఉగ్ర వాదానికి సంబంధించిన ప్రతిదానినీ దెబ్బతీయడమే ఏకైక ఎంపిక. ఇది ప్రమాదకరం. మొత్తంగా చివరి పాఠం మాత్రం ఇదీ: మీ సొంత యుద్ధాలను మీరే చేసుకోవాలి. ‘ఆపరేషన్ సిందూర్’ ఇప్పుడే దాన్నే తెలియజెప్పింది.-వ్యాసకర్త డైరెక్టర్ (రిసెర్చ్), సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ ‘ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-తారా కార్థా -
Bhimireddy Narasimha reddy రైతాంగ విప్లవ వీరుడు
ఆయన పేరు వినగానే వీర తెలంగాణ(Telangana) రైతాంగ సాయుధ పోరాట స్మృతులు ఉప్పెనలా ఎగిసి పడతాయి. ఆయనే కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహా రెడ్డి (బీఎన్) (bhimireddy narasimha reddy ) భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం జరిగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయుధం చేబూని ఉద్యమాన్ని నడిపిన నాయకులలో కామ్రేడ్ బీఎన్ ఒకరు. ఆయన 1922లో నేటి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం, కర్విరాల కొత్త గూడెం గ్రామంలో ఓ భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. అయినా రైతాంగ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. హైదరాబాద్ సంస్థానానికి తెలంగాణలో 2,600 మంది జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు ఉండేవారు. వీరి అధీనంలో 10 వేల గ్రామాలు, కోట్లాది ఎకరాల సాగుభూమి ఉండేది. ప్రజల్లో అత్యధికులు పెత్తందారీ భూస్వాముల కింద వెట్టిచాకిరీ చేసి బతకవలసి ఉండేది. ఈ వాతావరణం రైతు కూలీలలో అసంతృప్తిని రగుల్కొల్పి ఉద్యమానికి దారి తీసింది.చదవండి : వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీకమ్యూనిస్టు పార్టీ స్ఫూర్తితో ఎర్రజెండా నీడన గ్రామాలలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. శత్రువు మూకలను ఎదిరించడానికి ‘గుత్పలసంఘాలు’ ఏర్పడ్డాయి. పాత సూర్యాపేట, దేవరుప్పల, ఆలేరు; అలాగే కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అనేక ప్రాంతాలలో బీఎన్ నిజాం రైఫిల్‌లను ఎదిరించి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఆయన ఆధ్వర్యంలో రావుల పెంట, కోటపాడు, చివ్వెంల గ్రామాలలో జరిగిన దాడుల ద్వారా సేకరించిన ఆయు ధాలతో పోరాటం ముందుకు సాగింది. 1947 అధికార మార్పిడి తరువాత ఇటు నిజాం సైన్యాలతో, అటు యూనియన్ సైన్యాలతో తలపడవలసి వచ్చింది. దళాలను మైదాన ప్రాంతాల నుండి అడవి ప్రాంతాలకు మలిపి గోదావరి పరివాహక ప్రాంతంలో నదికి రెండు వైపుల సుమారు 200 గ్రామా లలో ఉద్యమాన్ని విస్తరింప జేశారు బీఎన్. చదవండి: Operation Sindoor సలాం, హస్నాబాద్!1946 నుండి 1951 అక్టోబర్ వరకు విరామం ఎరుగక జరిగిన ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చివరగా ఆయుధం కిందకు దించింది ఆయనే. రెండుసార్లు సూర్యాపేట నుండి రాష్ట్ర శాసనసభకు, మూడు సార్లు మిర్యాలగూడ నుండి భారత పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై ప్రజల హక్కులపై, సమస్యలపై చట్టసభలలో తన గళాన్ని వినిపించారు. ఒకానొక దశలో స్వయంగా సీపీఎం (బీఎన్) పార్టీని స్థాపించి దానిని తరువాత ఎమ్సీపీఐలో కలిపారు.– వనం సుధాకర్ ఎమ్సీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బీఎన్ రెడ్డి వర్ధంతి -
పూర్తిస్థాయి యుద్ధమే వస్తే...
పాకిస్తాన్ దుశ్చర్యల కారణంగా ‘ఆపరేషన్ సిందూర్’ను భారత్ అనివార్యంగా చేపట్టింది. అయితే దీనికి ప్రతి చర్యగా పాకిస్తాన్ ఉత్తర, పశ్చిమ భారత్‌లలోని 15 లక్ష్యా లపై దాడికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను దీటుగా ఎదుర్కొని పాక్ ప్రయోగించిన మిస్సైళ్లను కూల్చివేసింది. అలాగే పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ లక్ష్యంగా చేసుకోవడంతో లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నిర్వీర్యమయ్యింది. భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంచేసుకుని ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. కానీ పాక్... తన పౌరులపై దాడి చేసినట్లు దుష్ప్రచారం మొదలు పెట్టింది. నిజానికి పాకిస్తానే సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరిపి 16 మంది భారత పౌరులను పొట్టన పెట్టుకుందని విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రకటించడం గమనార్హం.పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో సహా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై భారత్ దాడి చేయడంతో ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ విచ్చ లవిడిగా కాల్పులు ప్రారంభించింది. ఈ దాడిలో అమాయకులైన సరిహద్దు గ్రామాల ప్రజలు చని పోతున్నారు, గాయపడుతున్నారు. శ్రీనగర్, జమ్మూల లెఫ్టినెంట్ గవర్నర్లు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి పాకిస్తాన్ దుశ్చర్యలు దానికి మరిన్ని కష్టాలు తీసుకువస్తాయి తప్ప పరిస్థితి సద్దు మణిగే అవకాశం లేదు. ఈ దాడుల్లో జైష్ ఏ మహ మ్మద్‌కు చెందిన మౌలానా మసూద్ అజార్ కుటుంబ సభ్యులు చనిపోవడంతో అతడు ఆగ్రహావేశాలతో రగిలిపోతూ మన ప్రధానికి ఒక హెచ్చరిక లేఖను పంపాడు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ తిరిగి తన పరువును నిలబెట్టుకోవడం కోసం మూడు స్థాయి లలో భారత్‌పై దాడి చేస్తోంది. ఇవి: ఒకటి, భారత సరి హద్దు ప్రాంతాల్లో తీవ్ర చర్యలు చేపట్టడం, రెండు, భారత్‌పై ఆక్రమణ చర్యలకు పూనుకోవడం, మూడు, ప్రతీకారంతో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడం.గతంలో ఈ ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవడానికి మాత్రమే మనం వ్యూహాన్ని రచించేవాళ్ళం. అయితే గత కొన్ని దశాబ్దాలుగా మన వ్యూహం కూడా మారింది. రాజ్యాంగ అధికరణ 370ను రద్దు చేయడంతో కశ్మీర్లో 90 శాతం తీవ్రవాదం తగ్గిపోయింది. అక్కడ సాధారణ జనజీవన స్రవంతి నెలకొంది. దీనిని ఈర్ష్యతో, పగతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. అందుకే కొత్తగా ఉగ్రదాడులకు తెరలేపింది. ఈసారి జరిగిన దాడులకు ఇజ్రాయెల్ తరహాలో భారత్ ప్రతిస్పందించింది. భారత్ తన యుద్ధతంత్రం మార్చి దౌత్యపరంగా, ఆర్థికంగా, సాంకేతికంగా, మానసికంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అంతర్జాతీయ సమాజంలో పాక్‌ను ఒక ఉగ్రవాద దేశంగా నిరూపించడంలో కొంత విజయం సాధించగలిగింది. 53 దేశాలు భారత్‌కి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతు తెలియజేయడం విశేషం. అమెరికా పాత్ర పాకిస్తాన్, భారత్‌ల విషయంలో గోడ మీద పిల్లిలా కనిపిస్తోంది. ఇదే మంచి అవకాశంఈ సమయంలో పాకిస్తాన్ ఏ ఒక్క చిన్న పొర పాటు చేసినా అది పూర్తిస్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఉగ్రవాద స్థావరాలకు నెలవుగా మారిన పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అవుతుంది. అయితే యుద్ధం తలెత్తితే చైనా కచ్చితంగా పాకిస్తాన్‌కు సహాయం చేస్తుంది. కారణం భారత్‌ను చైనా చిరకాల శత్రువుగా భావించడం. అలాగే బంగ్లా దేశ్‌ను మతం పేరుతో పాక్ దగ్గర తీసుకునే అవకాశం లేకపోలేదు. అంటే యుద్ధం వస్తే భారత్ మూడు వైపుల నుంచి ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. కేవలం పంజాబ్, రాజస్థాన్, కశ్మీర్, గుజరాత్ రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు కూడా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారమైన ‘చికెన్ నెక్’ లేదా సిల్గురి కారిడార్‌పై చైనా ఎప్పటి నుంచో కన్ను వేసిన విషయం గుర్తుంచుకోవాలి. భారత్‌పై అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పాక్ పదేపదే హెచ్చరిస్తోంది. ఇదే జరిగితే భారత్‌కు ఎక్కువ నష్టం కలగకపోవచ్చు కానీ పాకిస్తాన్ ‘మరుసటి రోజు సూర్యోదయం చూడదు’ అనే మాట అతిశయోక్తి కాదు. మనం అణ్వాయుధాల విషయంలో ‘మొదట మేం ప్రయోగించం’ అని చెప్పాము గాని ‘ఇతర దేశాలు ప్రయోగించినా మేం ప్రయోగించం’ అని ఎప్పుడూ చెప్పలేదు. ప్రపంచంలో నాలుగవ రక్షణ శక్తిగా ఉన్న భారతదేశం అన్ని రకాలుగానూ పాకి స్తాన్‌ను ఎదుర్కోగలుగుతుంది. పౌరులు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించి, అనుమానాస్పదమైన సంఘటనలను ప్రభుత్వ యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తెలియచేయాలి. అవసరమైతే కదనరంగంలో కాలు పెట్టాలి. అప్పుడే ఉగ్రవాదంపై చేస్తున్న పోరులో విజయం సాధించ గలుగుతాం.మేజర్ (రిటైర్డ్) శ్రీనివాస్ వ్యాసకర్త అంతర్జాతీయ వ్యవహారాలు, రక్షణ రంగ నిపుణులు -
‘కగార్’పై జనాంతిక ఆలోచనలు
కొన్ని విషయాలు సున్నితంగా ఉంటాయి. విషయాలు పూర్తి బహిరంగమైనవే. అందు గురించిన చర్చలు హోరాహోరీగా సాగినవే. కానీ పరిస్థితులు ఒక దశ నుంచి ఒకానొక దశకు మారినపుడు అంతా సున్నితం అవు తుంది. ‘ఆపరేషన్ కగార్’ సందర్భంగా ఆపరేషన్ విషయాలు కాదుగానీ నక్సలైట్ల గురించి, నక్సలిజం గురించిన చర్చ సున్నితంగా మారింది. పక్షం రోజులకు పైగా సాగుతున్న కర్రె గుట్టల ఉదంతం, ఎప్పటినుంచో జరుగుతున్న ఆ చర్చకు ఒక తక్షణ లక్షణాన్ని తీసుకు వచ్చింది. ఇది సున్నితం కావటానికి కారణం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన ‘ఆపరేషన్’ను ఒక భీషణ సమరంగా మార్చటం కాదు. అందుకు నేపథ్య పరిస్థితులు ఇదమిత్థంగా ఫలానా అప్పటి నుంచి మొదలయ్యాయని చెప్పలేముగానీ, సుమారు మూడు దశాబ్దాలుగా కావచ్చు. అవి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక మాత్రం తీవ్రం కావటం మొదలైంది.ప్రస్తుత ప్రభుత్వం తన నక్సలైట్ వ్యతిరేక చర్యలకు ‘ఆపరేషన్ కగార్’ అనే పేరు పెట్టింది. ‘కగార్’ అనే హిందీ మాటకు నిఘంటు అర్థం ‘అంచు’ లేదా ‘చివరి స్థితి’, ‘చివరి దశ’ అని. రాజకీయ అర్థం ‘అంతిమ దాడి’ అని! ఇది ఇతరుల నిర్వచనం కాదు. నక్సలైట్లను, నక్సలిజాన్ని 2026 మార్చ్ చివరి నాటికి అంతం చేసి తీరగలమని హోంమంత్రి అమిత్ షా పదేపదే ప్రకటిస్తున్నారు. అది సాధ్యమా కాదా అన్నది కాదు ఇక్కడ చేస్తున్న ఆలోచన. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని, సుమారు 57 సంవత్సరాలుగా సాగుతున్న నక్సలైట్ ఉద్యమాన్ని పలువురు సమీక్షిస్తుండవచ్చు. అందులో భాగంగా, పైన ప్రస్తావించిన ఇటీవలి మూడు దశాబ్దాల కాలాన్ని కూడా. అంటే నక్సలిజం బలహీనపడుతూ వస్తున్న మూడు దశాబ్దాలను!ఎముకలు మెడలో వేసుకోని కాంగ్రెస్సూటిగా చెప్పుకోవాలంటే, మొదటి సగకాలం బలంగా సాగిన ఉద్యమం, తర్వాత సగకాలం నుంచి బలహీనపడుతూ వస్తున్నది. ఆ బలహీనతలు నాలుగు విధాలు. ఒకటి – సైద్ధాంతికంగా. రెండు – నాయకత్వ పరంగా. మూడు – ఉద్యమ నిర్వహణలో. నాలుగు – జనాదరణ విషయమై! ప్రభుత్వ అణచివేతలు ఎప్పుడూ ఉన్నవే. అణచివేతకు ఆరంభం తెలంగాణ రైతాంగ పోరాట కాలంలోనే జరిగినపుడు నక్స లిజం తర్వాతి కాలంలో అంతకు భిన్నంగా ఉండగల ఆస్కారమే లేదు. పైగా 1948కి 1968కి మధ్యకాలం 20 సంవత్సరాలు మాత్రమే. అప్పటినుంచి మరో 20 ఏండ్లు గడిచేసరికి నక్సలైట్ ఉద్యమ క్షీణతకు అంకురార్పణ జరిగింది. గమనించదగినదేమంటే, ఆ కాలమంతా పాలించింది బీజేపీ కాదు... కాంగ్రెస్. కొన్ని రాష్ట్రాలలో ఇతర పార్టీలు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం రాసుకుని, చట్టాలు చేసుకుని, ప్రణాళికలు రూపొందించుకుని, ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించుకున్నప్పటి నుంచి అన్నీ కపటమైన రీతిలో అరకొరగానే అమలయ్యాయి. అందుకే 1947 నుంచి 20 ఏండ్లయే సరికి నక్సలైట్లు అవతారమెత్తారు. అన్ని మలుపులూ 20–20–20 గానే కనిపిస్తు న్నాయి. అదొక విచిత్రం. ‘ఆపరేషన్ కగార్’ తరహా మాటలను కాంగ్రెస్ ఉపయోగించ లేదు, బీజేపీ ఉపయోగిస్తున్నది. చేతలు అవే, మాటలు వేరు. మాటలు వేరవటానికి మంచి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్‌కు 1885 నుంచి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అందులో సామాజిక సమ్మిళితత్వం, ఉదారవాద మధ్యే మార్గం, కొంత అభ్యుదయ ధోరణి, దేశ వ్యాప్తమైన జాతీయత వంటివి ఉన్నాయి. అవి కాలం గడిచినకొద్దీ బలహీనపడుతూ అనేక అవలక్షణాలు ప్రవేశించినా, కనీసం ఎము కలను మెడలో వేసుకునే ధోరణి ఇంకా రాలేదు. ఆ కారణంగా, నక్సలిజం వెనుక పేదరికం ఉన్నమాట నిజమనీ, అది కేవలం శాంతి భద్రతల సమస్య కాదనీ, పేదల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయ గలమనీ మాటలు, ప్రకటనల రూపంలో చెప్పటం ఎన్నడూ మాన లేదు. అణచివేతలకు సాయుధబలాల ఉపయోగమైతే యథావిధిగా సాగించారు గాని, ‘కగార్’ తరహా ‘అంతిమ దాడి’ అనకుండా జాగ్రత్తపడ్డారు. పౌరహక్కుల సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసినా, వారికి ‘అర్బన్ నక్సల్స్’ అనే ముద్ర వేయలేదు.నాగరిక, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలలో ఉదారవాద, ప్రగతిశీల భావనల సంప్రదాయం గురించి తెలిసిందే. ముఖ్యంగా రినైజాన్స్, ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, బ్రిటన్‌లో రాజ్యాంగ ఆవిర్భావ కాలాల నుంచి ఉన్నత తరగతులపై, మధ్యతరగతిపై ఈ ప్రభావాలు మొదలయ్యాయి. ఈ వర్గాలు ప్రగతిశీలమైనవేగానీ, వ్యవస్థలో సంస్కరణలను కోరటం మినహా వ్యవస్థలను కూలదోయా లనేవి కావు. ఆ పరిమితులను తెలిసినందువల్లనే ఇక్కడ పౌర హక్కుల సంస్థల పాత్రను కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీసం ఒక మేర గౌరవించటం, ఒకోసారి వారిని సంప్రదించటం చేస్తుండేవి. ఆ ధోరణి గత పదేళ్లుగా ఎట్లా మారిందో కనిపిస్తున్నదే. ఇది అంతి మంగా వ్యవస్థకు మేలు చేసేది కాదని ప్రభుత్వం గ్రహించవలసిందే తప్ప ఎవరూ చెప్పగల స్థితి కనిపించటం లేదు.మారిన సమాజ ధోరణులుఉద్యమాలకు ఎగుడు దిగుడులు సహజమేగానీ, నక్సలైట్ ఉద్యమం పైన చెప్పిన నాలుగు బలహీనతలలో దేని నుంచి కూడా నిజమైన అర్థంలో బయటకు రాలేక పోయింది. లేనట్లయితే, వారు కర్రె గుట్టల సందర్భంలో ఈ విధంగా చిక్కుకు పోవటం, చర్చల కోసం పది రోజుల్లో నాలుగుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయటం, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరటం, పౌర హక్కుల సంస్థలను కదలించేందుకు ఇంతగా ప్రయత్నించటం వంటి పరిస్థితులు ఏర్పడేవి కావు. ఇంత జరుగుతున్నా సమాజం నుంచి ఒకప్పటివలె స్పందనలు లేవు. ప్రస్తుత తరాలు వివిధ కారణాల వల్ల మారిపోయాయి. వారి దృష్టి ఇప్పుడు తమ కెరీర్‌పై, ఇతర అంశాలపై ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఒకప్పుడు ఉద్యమానికి పెద్ద బలం. ఇపుడు కొద్ది ప్రాంతాలలోని కొంతమంది ఆదివాసీలు మాత్రం స్థానిక పరి స్థితులనుబట్టి నక్సలైట్లతో కదులుతున్నారు. స్వయంగా ఆదివాసీలైన ప్రజాప్రతినిధులు గతంలో కన్నా ఎక్కువగా స్వప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల వెంట ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, వెనుకటి తరాలకు ఉద్యమం పట్ల గురి తప్పి నిరాశ ఏర్పడగా, కొత్త తరాలకు ఒక అగాథం వచ్చి కొత్త ప్రపంచంలో తమ జీవితాలను వెతుక్కుంటున్నారు. ఒకపుడు మధ్యతరగతిలో గణనీయమైన భాగానికి ఆదర్శవాదాలు ఉండేవి. అది సోవియెట్ యూనియన్‌కు, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు, విప్లవకారులకు, సాహిత్య–కళాకార్యకలాపా లకు పచ్చని కాలం. ఆ తరహా మధ్యతరగతి ఇపుడు పిడికెడుగా మిగిలింది. వామ పక్షాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.నక్సలైట్లకు కొత్త రిక్రూట్మెంట్లు తగ్గటం ఎప్పటినుంచో ఉన్నది. ఎన్కౌంటర్లలో ఒకపుడు ఒకరు చనిపోయినా వార్తలు, ప్రజలలో చర్చలు ఉండేవి. ఇపుడు చాలామంది చనిపోవటం వరుసగా జరిగితే తప్ప వార్తలు, చర్చలు కనిపించటం లేదు. మరొకవైపు సిద్ధాంతాలు, పోరాట పద్ధతులు, సంస్థ నిర్మాణాలు, నాయకత్వాలు ప్రస్తుత ఆధునికమైన, బలమైన ప్రభుత్వ వ్యవస్థలను ఎదుర్కొనగల విధంగా ఉన్నాయనే అభిప్రాయం వారి సానుభూతిపరులలోనైనా ఉందా అన్నది అనుమానమే. పౌరహక్కుల సంఘాల స్పందనలు సైతం స్వీయ సంశయాల మధ్య మందకొడిగానే కనిపిస్తున్నాయి. నక్సలైట్లు, నక్స లిజం భవిష్యత్తు అగమ్యగోచరం కావటానికి వెనుక ఈ పరిస్థితులు, దీర్ఘకాలిక పరిణామాలు అన్నీ ఉన్నాయి.విషయాన్ని జనాంతికంగా చర్చించుకోవటం ఎందుకంటే, ఒక వైపు పేదరికం, పీడన కొనసాగుదల, ధనిక–పేద తారతమ్యాల పెరుగుదల అనే వాస్తవ స్థితి ఎంత కనిపిస్తున్నదో, ఆ పరిస్థితులను మార్చే సంస్కరణల కోసం లేదా కొత్త వ్యవస్థ ఆవిష్కరణ కోసమని చెప్పేవారు విఫలం కావటం కూడా అంత కనిపిస్తున్నది. ఈ విష యాలు ముఖ్యంగా ‘కగార్’ వంటి సందర్భంలో దాపరికం లేకుండా మాట్లాడటం సున్నితమైనదే!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పాక్‌ను ఇంకెలా దెబ్బ కొట్టాలంటే...
అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ తన స్వరాన్ని గట్టిగా వినిపించాలి. పొరుగు దేశానికి భూగోళం, చరిత్ర, అర్థశాస్త్రాలకు సంబంధించిన దిమ్మతిరిగే గుణపాఠాలు చెప్పాలి. పక్క దేశం హింస, నేరం, రక్తపాతాలను తనకు ఎగుమతి చేస్తూ ఉంటే ఏ దేశం కూడా మౌనంగా చూస్తూ ఉండి పోలేదు. మొదటగా పాకిస్తాన్‌ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి. ఆ దెబ్బ దాని ఆర్థిక నవనాడులూ కుంగిపోయేలా ఉండాలి. దేశ ఆర్థిక వ్యవస్థే టెర్రర్ నెట్‌వర్క్‌కు వెన్నెముక లాంటిది. పాకిస్తాన్ పెంచి పోషించే టెర్రరిస్టులకూ ఇది వర్తిస్తుంది. యూరోపియన్ యూనియన్ పాక్‌తో సహా కొన్ని దేశాలకు వాణిజ్య రంగంలో ప్రత్యేక ప్రాధాన్య హోదా కల్పించింది. అలాగే, టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశాలను శిక్షించడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఉంది. అలాంటి దేశాలను గుర్తించి ‘గ్రే లిస్ట్’ అనే జాబితా తయారు చేస్తుంది. ఇందులో చేర్చిన దేశాలకు ఆర్థిక సాయం నిలిపి వేస్తారు. పాక్‌ను గ్రే లిçస్టులో చేర్చేలా ఒత్తిడి చేసి దానికి వాణిజ్య రాయితీలు అందకుండా చేయాలి. అసలైన పీడ మరొకటి ఉంది. దీన్ని వదిలించడా నికి యూఎన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ఆఫీస్ (యూఎన్ఓడీసీ) నివేదికలను ఉపయోగించుకోవాలి. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం, హెరాయిన్ తయారీకి అవసరమైన ముడి సరుకు (ఓపియం)లో 90 శాతం అఫ్గానిస్తాన్ నుంచి సరఫరా అవుతోంది. పాక్ సైనిక గూఢచారి వ్యవస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్ (ఐఎస్ఐ) ఈ ఓపీయంను దిగుమతి చేసుకుని దాన్నుంచి హెరాయిన్ తయారు చేయిస్తోంది. ఈ మాదక ద్రవ్యాన్ని దొంగచాటుగా మత్తుబానిసలకు సరఫరా చేసి సంపాదించి నెత్తుటి సొమ్ము ఆర్జిస్తోంది. దీంతో టెర్రరిస్టు లను పెంచి పోషిస్తోంది. ఇండియా ముందుగా ఈ మాదకద్రవ్య చీకటి సామ్రాజ్యాన్ని సర్వ శక్తులూ ఒడ్డి ఛిన్నాభిన్నం చేయాలి. అప్పుడే ఐఎస్ఐ టెర్రర్ రాకాసి ఊపిరాడక చస్తుంది.పాక్‌ను నలుదిక్కులా చిక్కుల్లో పడేయాలి. ఒక వంక డ్యురాండ్ లైన్ సరిహద్దులో అఫ్గానిస్తాన్‌తో చారిత్రక వైరం నడుస్తోంది. ఒకప్పుడు తనే పెంచిన తాలిబన్ బిడ్డలు ఇప్పుడు దానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇండియా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అఫ్గానిస్తాన్‌తో సంబంధాలు పెంచుకోవాలి. నమ్మకమైన తృతీయ పక్షాల సహకారంతో తాలిబన్ వర్గాలను దువ్వాలి. ఈ సమస్య మీద పాక్‌లో చీలికలు పెంచాలి. ఐఎస్ఐ మద్దతు పొందు తున్న హక్కానీ నెట్‌వర్క్‌ను ఏకాకిని చెయ్యాలి. తద్వారా పాక్ బీజం వేసిన మహావృక్షం దాని మీదే విరిగి పడేట్లు చెయ్యాలి. బలూచిస్తాన్ లోనూ ఇరాన్ సహకారంతో ఇదే విధంగా వ్యవహారం నడపాలి.ప్రపంచ వేదిక మీద పాకిస్తాన్ నిజరూపం బయట పెట్టాలి. తీవ్రవాద మూలాలను తుదముట్టించేందుకు ఐరాస భద్రతా మండలి తీర్మానాల (1267, 1373) కింద పాక్‌ను దోషిగా నిలబెట్టాలి. ఈ దిశగా మనం మరింత గట్టిగా ప్రయత్నించాలి. ఇండియా, పాకిస్తాన్లలో ఉన్న ఐరాస మిలటరీ అబ్జర్వర్ గ్రూపునకు ఇంటి దారి చూపెట్టాలి. స్వదేశంలోనూ పాకిస్తాన్ క్రూరత్వానికి హద్దు ల్లేకుండా పోయాయి. హజారాలు, అహ్మదీయులు వంటి జాతులు, కులాల వారి పరిస్థితి మెడ మీద కత్తిలా ఉంది. ఏకపక్ష నిర్బంధాలతో మగ్గిపోతున్నారు. పహల్గామ్ ఊచ కోతకు ముందు, తర్వాత కూడా వీరంతా ఇండియాతో భుజం భుజం కలిపి పనిచేస్తున్నారు. ఈ వర్గాలకూ అలాగే చైనాలోని ఉయిగర్లకూ మనం నైతికపరంగా, దౌత్యపరంగా ఆపన్నహస్తం అందించాలి.పాకిస్తాన్, టర్కీ, మలేసియాల దుష్టత్రయం అపవిత్ర కూటమిగా ఏర్పడటంతో మనకు ప్రమాదం పెరిగింది. ఈ దేశాలు ఉమ్మా (ముస్లిం ప్రపంచం) రక్షకులుగా చెప్పుకుంటూ ఒకప్పుడు ఆర్మేనియాలో సాగించిన మారణహోమం, గ్రీకులు, అస్సిరియా ప్రజలపై జరిపిన హింసాకాండలు వీటి రక్త చరిత్రకు ఆనవాళ్లు. ఇప్పుడివి కశ్మీరు ప్రజల మీద తెగబడే సాహసం చేస్తున్నాయి.ఇలా ఉండగా, సౌదీ అరేబియా దాని మిత్రదేశాలు ఇండియాకు వ్యూహాత్మక, సాంస్కృతిక భాగస్వాములుగా ఆవిర్భవించాయి. మనం కూడలిలో తటస్థంగా నిలబడితే కుదరదు. చొరవ తీసుకోవాలి. వాషింగ్టన్లో హాలోకాస్ట్ మ్యూజియం, యెరెవన్లో ఆర్మేనియన్ జినోసైడ్ మ్యూజి యంలు నిర్మించినట్లు... ఇండియా ఇప్పటికైనా కళ్లు తెరిచి శ్రీనగర్‌లో టెర్రర్ మ్యూజియం ఏర్పాటు చేయాలి. జిహాద్ పేరిట దశాబ్దాల తరబడిగా పాకిస్తాన్ సాగిస్తున్న ఊచకోత లకు అది సజీవ స్మారకంగా నిలవాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్–బాల్టిస్తాన్లలో నినదించే అసమ్మతి స్వరాలతో ఇండియా గొంతు కలపాలి. పంజాబీ ఆధిపత్య పాక్ సైనికాధికారులు వెంటాడి తరిమికొట్టిన ఇతర ప్రాంతాల వారికి ప్రవాస ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునేందుకు మనం సహాయం చేయాలి. 1950లలో టిబెట్ ప్రవాస ప్రభుత్వం ఏర్పాటుకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పునాది వేయగలిగినప్పుడు, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయన అడుగుజాడల్లో ఎందుకు నడవలేదు? తప్పకుండా నడవగలదు. చివరగా ఇండియా డిజిటల్ యోధులను రంగంలోకి దించి తీరాలి. మనం మానవ మేధలో అగ్రగణ్యులం. అలాగే సాంకేతిక మేధలో అంతకంటే అత్యుత్తమ స్థానంలో ఉంటాం. డిజిటల్ స్ట్రయిక్స్ చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడుంది. బుల్లెట్ పేల్చకుండానే శత్రు దేశ మౌలిక సదు పాయాలను నిర్వీర్వం చేయగలం. మిలిటరీ రహస్యాలు లీక్ చేయగలం. వ్యతిరేక కథనాలను తిప్పికొట్టగలం. డిజిటల్ యుద్ధం నేటి ఆధునిక తంత్రం. టెర్రరిజం సరిహద్దులను దాటినప్పుడు, దాని పర్యవసానాలూ అలాగే ప్రయాణించాలి. మనుగడ, ఆధిపత్యం కోసం జరుగుతున్న దీర్ఘకాలిక చదరంగ క్రీడ ఇది! ఇండియా ఈ ఆటలో మూడు ఎత్తులు ముందుగా ఆలోచించి తీరాలి. మనం డిఫెన్స్ మాత్రమే ఆడితే కుదరదు. నివ్వెరపోయేలా సాహసోపేతమైన మరిన్ని త్రివిధ దళాల దాడులకు రూపకల్పన చేయాలి. ఇన్నాళ్ళూ మన సహనాన్ని నిష్క్రియాపరత్వంగా పాకిస్తాన్ పొరబ డుతూ వచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరమూ మనం బహుముఖ వ్యూహాలతో దూకుడు చూపాలి. మార్పు తరంగాలను అలా చూస్తూ ఉండిపోయే వారిపట్ల చరిత్ర ఎప్పుడూ కనికరం చూపించదు. తుపాను మీద స్వారీ చేస్తూ తీరరేఖను మార్చగలిగే వారికే అది ప్రతిఫలం చేకూర్చుతుంది!– అభిషేక్ మను సింఘ్వీ, పార్లమెంట్ సభ్యులు– ఆకాశ్ కుమార్ సింగ్, జేఎన్‌యూ జాతీయ భద్రతా అధ్యయనాల ప్రత్యేక కేంద్రంలో పీహెచ్డీ స్కాలర్ -
గతానికి భిన్నంగా...
ఏప్రిల్ నెల చివరలో జమ్మూ–కశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది నిరాయుధులను దారుణంగా హత్య చేసినందుకు ప్రతీకారంగా, మే 7 ఉదయం పాకిస్తాన్లో ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న తొమ్మిది ప్రదేశాలపై భారత సైన్యం దాడి చేసింది. పహల్గామ్ ఘాతుక చర్యకు సమాధానం ఇచ్చి తీరుతామని దేశ రాజకీయ నాయకత్వం స్పష్టం చేయడంతో సైనిక దాడి తప్పదని తేలిపోయింది. అయితే, పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు, కానీ సరిహద్దు రేఖలు మారుతున్నాయని సూచించే లక్షణాలు ‘ఆపరేషన్ సిందూర్’లో ఉన్నాయి.సరిహద్దును దాటి...పాకిస్తాన్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చివరి ప్రధాన దాడి 2019 ఫిబ్రవరిలో చోటు చేసు కుంది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌ను అప్పుడు భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ కేంద్ర బిందువైన పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రదేశాలపై భారతీయ సైన్యం దాడికి దిగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన తర్వాత,భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. దక్షిణ పంజాబ్‌లోని బహావల్పూర్లో జైష్–ఎ–మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. పంజాబ్‌లోని మరొక ప్రదేశం మురీద్కే! ఇక్కడ లష్కరే తోయిబా చాలా కాలంగా ఉనికిలో ఉంది. అయితే కశ్మీర్లో వాస్తవ సరిహద్దును గుర్తించే ఎల్ఓసీకీ, పాకిస్తానీ పంజాబ్‌కు మధ్య వ్యత్యాసం ఏమిటంటే, స్థిరపడిన అంతర్జాతీయ సరిహద్దు. సూటిగా చెప్పాలంటే, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులకు చెందిన భౌగోళిక ప్రాంతం ఇప్పుడు విస్తరించింది. ప్రతీకారం తీర్చుకునే విషయంలో పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశం కూడా భారత్ లక్ష్యాలకు దూరంగా లేదని తాజా దాడులు స్పష్టంగా సందేశమిస్తున్నాయి.1971 నాటి యుద్ధంలోని ముఖ్యాంశాలలో ఒకటి, భారత సైన్యంలోని త్రివిధ బలగాలూ పాల్గొనడమే! నాటి యుద్ధంలో పూర్తి విజయం సాధించడానికి త్రివిధ దళాలు కలిసి పనిచేశాయి. ఆపరేషన్ సిందూర్‌లో కూడా మూడు దళాలూ పాల్గొన్నాయని ప్రభుత్వం తెలిపింది. వనరులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడానికి సైన్యం దీర్ఘకాలిక లక్ష్యంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లకు ఇది శుభ సూచకం.నిజానికి భారతదేశం నుండి ప్రతిస్పందన అని వార్యం అయింది. అయినా భారీ స్థాయి దళాల కదలికల ద్వారా భారత్ ప్రతిస్పందన ఉంటుందని చెప్పే సూచన లేవీ లేవు. పాకిస్తాన్ వైపు మాత్రం వారు ప్రతిస్పందన కోసం సిద్ధమవుతున్నప్పుడు గణనీయ స్థాయిలో దళాల కదలిక కనిపించింది. అదే సమయంలో భారత్ సంయమన మార్గాన్ని ఎంచుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన దాడుల్లో ఏవీ పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడిని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకే పరిమితం చేశారు. దాడుల తర్వాత కూడా ప్రభుత్వం తన మీడియా ప్రకటనలో భారతదేశం తీవ్ర స్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టంగా సూచించింది.ప్రతిదాడి చేయడానికి ముందు, భారతదేశం తాను అనుకున్న విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి గణనీయమైన స్థాయిలో అంతర్జాతీయ మద్దతును సాధించింది. చైనా మాత్రమే దీనికి మినహాయింపు. అదే సమయంలో, అంతర్జాతీయ ప్రధాన శక్తులు వాణిజ్య యుద్ధంతో పాటుగా పశ్చిమాసియాలో, ఉక్రెయిన్‌లో దీర్ఘకాలిక సంఘర్షణ సవాలును ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఒక స్థాయికి మించి పెరగకూడదని అవి ఆశిస్తున్నాయి.వికసిత భారత్, రుణ సంక్షోభ పాక్‌భారతదేశం మూడు దశాబ్దాలకు పైగా జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంతో పోరాడు తోంది. ఈ క్రమంలో రెండు దేశాలలోనూ, వేర్వేరు ఆర్థిక పథాల్లో అభివృద్ధి జరుగుతోంది. భారత్ తన ఆర్థిక సరళీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 1991 నాటికి, పాకిస్తాన్ తలసరి జీడీపీ భారత్ కంటే ఎక్కువగా ఉంది. తాజాగా ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, 2023లో పాకిస్తాన్ తలసరి జీడీపీ 1,365 డాలర్లు కాగా, భారత్ జీడీపీ 82 శాతం ఎక్కువగా 2,481 డాలర్ల వద్ద ఉంది. అంటే రెండు దేశాల ఆర్థిక పథాలు వాటి వ్యూహాత్మక ఎంపికలను ప్రభావితం చేశాయి.భారత్ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ‘బ్రెగ్జిట్’ తర్వాత అది బ్రిటన్‌తో చేసుకున్న అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవలే ముగించింది. మరోవైపు, పాకిస్తాన్ ఒక రుణ సంక్షోభం నుండి మరొక రుణ సంక్షోభానికి గురవుతూ, ఐఎమ్ఎఫ్ ఆపన్న హస్తం కోసం విజ్ఞప్తి చేస్తోంది. అది దాదాపు చైనా కాలనీగా మారింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఎంచుకున్న ఎంపికలనూ, పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సార్వభౌమాధికారపు నిరంతర బలహీనతనూ పరిశీలించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ అసీమ్ మునీర్‌కు అది ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు.సంజీవ్ శంకరన్ వ్యాసకర్త ‘మనీ కంట్రోల్’ ఒపీనియన్స్–ఫీచర్స్ ఎడిటర్ -
ఇది ఐక్యతా సమయం
గత వారం ఓ రోజు ఉదయం 6 గంటల తర్వాత నా మొబైల్లో నోటిఫికేషన్ పింగ్ అయింది. నా స్నేహితుడి కొడుకు నుండి ఒక సందేశం వస్తున్నట్లు నేను చూశాను. పహల్గామ్లో జరిగిన సంఘటనల గురించి అతను కలత చెందాడు. సంఘటన తర్వాత వెంటనే ఎటువంటి ప్రతీకార చర్యా తీసుకోనందుకు మన ప్రభుత్వంపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవడానికి తీవ్రస్థాయిలో మీడియా ప్రచారాన్ని నడపటం ద్వారా నా వంతు కృషి నేను చేస్తానని అతను ఆశించాడు. నేను షాక్ అయ్యాను. చిన్నప్పటి నుండి అతడు నాకు తెలుసు. దేశంలోని ఉత్తమ పాఠశాలల్లో అతను చదువుకున్నాడు. ఇంజనీరింగ్ డిగ్రీని సాధించాడు. ఇన్ స్టిట్యూట్ నుండి పట్టభద్రుడయ్యే ముందు, అతనికి ఓ బహుళజాతి సంస్థ ఉద్యోగం ఆఫర్ కూడా ఉండేది. ఉన్నత స్థాయికి ఎదిగాడు. నేడు కార్పొరేట్ వర్గాల ఆకర్షణీయమైన సర్కిల్లో ఉంటున్నాడు. తన తెలివితేటలు, జ్ఞానం వల్ల మంచి గుర్తింపు, గౌరవం పొందాడు. అందుకే తాను ప్రకటించిన విద్వేష భావానికి నేను పెద్దగా కలత చెందలేదు. తనను ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చాను. ప్రభుత్వాన్ని విశ్వసించమని నచ్చ చెప్పాను. సరైన సమయం వచ్చినప్పుడు, ప్రపంచం భారత్ నుండి పూర్తి స్థాయి చర్యను వీక్షిస్తుందని చెప్పాను. 1971లోనూ భారతదేశంలో ఇలాంటి యుద్ధ సన్నద్ధతే పెరుగుతూ వచ్చిందని అతనికి గుర్తు చేశాను. తిరుగులేని వ్యూహకర్త మానెక్ షా!అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ఆర్మీ చీఫ్ జనరల్ శ్యామ్ మానెక్ షాను పిలిపించారు. ‘‘తూర్పు పాకిస్తాన్ పై భారత సైన్యం వెంటనే దాడి చేసి, దాన్ని స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా మార్చడానికి సహాయం చేయగలదా?’’ అని ఆమె అడిగారు. అద్భు తమైన వ్యూహకర్త మానెక్ షా. కొన్ని నెలల్లో రుతుపవనాలు రాను న్నాయని ప్రధానితో చెప్పారు. వర్షాకాలంలో, బంగ్లాదేశ్‌లోని పొలాలు చిత్తడి నేలలుగా మారతాయి. అందువల్ల అలాంటి సమయంలో దాడి చేయడం అంటే అది పెద్ద ఎత్తున సైనికుల మరణానికి దారితీస్తుందని వివరించారు. దాంతో మానెక్ షా తొందరపాటు ఆదేశాలు జారీ చేయబోవడం లేదని నిర్ధారణ అయింది. అనంతరం, తొమ్మిది నెలలపాటు జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళిక, సమన్వయం, కచ్చితమైన వ్యూహం తర్వాత, భారత దళాలు తూర్పు పాకిస్తాన్‌పై దాడి చేసినప్పుడు, శత్రువు ఓడిపోవడమే కాకుండా, 90,000 మందికి పైగా పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. మానవాళి చరిత్రలో, ఇంత పెద్ద సైనిక దళం ఎప్పుడూ ప్రత్యర్థికి లొంగి పోలేదు. 1971 డిసెంబర్ 16న, భారత సైన్యం తన అత్యుత్తమ ఘడియను ఆస్వాదిస్తూ, మన సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యా యాన్ని లిఖిస్తున్న సమయంలో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది.1971ని తలపిస్తున్న మంతనాలుప్రస్తుత ప్రధాని కూడా భారత సాయుధ దళాలకు పాక్‌పై తగిన చర్య తీసుకోవడానికి అధికారం ఇచ్చారు. నెంబర్ 7 – లోక్ కల్యాణ్ మార్గ్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లలో వ్యూహాత్మక సమావేశాలు జరిగాయి. సైనిక చర్యలు ఆర్థిక, దౌత్యపరమైన పర్యవసానాలను కలిగి ఉంటాయి. కనీస ప్రాణనష్టంతో త్వరిత విజయాన్ని సాధించడానికి, శక్తిమంతమైన మిత్రులు మద్దతు ఇవ్వడానికి లేదా నిర్ణాయక సమయంలో కనీసం తటస్థంగా ఉండటానికి కొన్ని నిబద్ధతలు అవసరం. 1991లో మొదటి గల్ఫ్ యుద్ధంలో సంకీర్ణ సైన్యానికి నాయకత్వం వహించిన యు.ఎస్. జనరల్ నార్మన్ స్క్వార్జ్కోఫ్, ‘‘మీరు శాంతిలో ఎంత ఎక్కువ చెమట చిందిస్తే, యుద్ధంలో అంత తక్కువ రక్తస్రావం అవుతుంది...’’ అని అన్నారు.రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా సహా వివిధ దేశాలలో తమ సమ ఉజ్జీలతో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు 1971ని గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు మానెక్ షా, నావికాదళ, వైమానిక దళ అధిపతులు యుద్ధా నికి సిద్ధమవుతుండగా, ఇందిరా గాంధీ కూడా నమ్మకమైన దౌత్య భాగస్వాముల కోసం వెతికే పనిలో పడ్డారు. భారతదేశం అప్పటికి కొంతకాలం క్రితం పాశ్చాత్య జోక్యానికి వ్యతిరేకంగా హామీ కోసం నాటి సోవియట్ యూనియన్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తరువాత, యుద్ధ సమయంలో బంగాళాఖాతంలో అమెరికన్ సిక్స్త్ ఫ్లీట్ కనిపించడం, దాన్ని ఎదుర్కోవడానికి సోవి యట్ జలాంతర్గాములు రావడం వంటి సంఘటనలు భారతదేశపు దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్ (పైఎత్తు)ను ధ్రువీకరించాయి. నేడు రెండూ అణ్వాయుధ శక్తులే!నేటి పరిస్థితి కూడా అంతే ప్రమాదకరమైనది. ట్రంప్ 2.0 యుగంలో ఇది మరింత క్లిష్టంగా మారింది. ఎటువంటి భావజాలం లేకుండా, సోషల్ మీడియా నిరంతర చూపు కింద నడిచే భౌగోళిక రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 1971లో మాది రిగా కాకుండా భారతదేశం, పాకిస్తాన్ రెండూ ఇప్పుడు అణ్వాయుధ శక్తులు. మనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు. ఏదైనా సహాయం అందించే పరిమిత సామర్థ్యంతోనే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ తో పోరాడుతోంది, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వ్యాఖ్యలు బీజింగ్ జాగరూకతా వైఖరిని వెల్లడిస్తున్నాయి: ‘‘సంఘర్షణ అనేది భారత్ లేదా పాకిస్థాన్ ప్రాథమిక ప్రయోజనాలకు నష్టం చేస్తుంది..’’ అని వాంగ్ వ్యాఖ్యానించారు. అయితే చైనా సానుభూతి పాక్ వైపు ఉంది. ప్రపంచంలోని ఏకైక అగ్రరాజ్యమైన అమెరికా, మిశ్రమ సంకేతాలను పంపుతోంది. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రకటనను పరిగణించండి: ‘‘పహల్గామ్ దాడి పట్ల భారత్ విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీయని విధంగా ప్రతిస్పంది స్తుందని మేము ఆశిస్తున్నాము’’ అన్నారాయన. ప్రమాదకరంగా సోషల్ మీడియా!ప్రభుత్వం చేతులు కట్టివేయడం, దాని ఎంపికలను పరిమితం చేయడం వంటి సంక్లిష్టతలను గ్రహించకుండా, లెక్కలేనన్ని స్వరాలు సోషల్ మీడియాలో ఇప్పుడు ఉగ్రదాడి పట్ల, పాక్ పైన నిరంతరం మండిపడుతున్నాయి. సర్జికల్ స్ట్రయిక్స్ అయినా, లేదా బాలాకోట్ వైమానిక దాడి అయినా సరే, తన మాటను నిలబెట్టుకోవడంలో ప్రధాని మోదీకి ఉన్న విశ్వసనీయతను వారు విస్మరిస్తున్నారు.దాంతో మన సోషల్ మీడియా కార్యకలాపాలు శత్రువులకు ఫిరంగి మేతగా మారాయి. ఎవరైనా సరే, ప్రభుత్వ పక్షాన నిశ్శబ్దంగా నిలబ డాల్సిన సమయం ఇది. అనవసరమైన వాగ్వాదాలకు పాల్పడకుండా ఉండాల్సిన సమయం ఇది. మతతత్వపు విష బీజాలు నాటడానికి కొందరు ఈ పరిస్థితిని మలచుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం బృందావన్‌లో ఆలయ సేవలో పాల్గొన్న ముస్లింలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాంకే బిహారీ ఆలయం ముందు ఒక మూక నిరసన తెలిపింది. అయితే ఆలయ ట్రస్ట్... స్పష్టంగా ప్రతిస్పందించింది. ఆ ముస్లింలు శతాబ్దాలుగా శ్రీకృష్ణుని దుస్తులను తయారు చేస్తున్నారని ట్రస్ట్ నిర్వాహకులు నొక్కి చెప్పారు.ఐక్యంగా ముందుకు సాగాలిఉగ్రవాద దాడిని జమ్మూ – కశ్మీర్ అసెంబ్లీ ఏప్రిల్ 29న ఏకగ్రీవంగా ఖండించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు సంఘీభావం తెలిపింది. లోయలో ఉగ్రవాదం అంతం ప్రారంభమైందని శాసన సభ్యులు భావిస్తున్నారు. ద్వేషపూరిత వ్యక్తులు అలాంటి సంఘీభావ ప్రదర్శనను విస్మరించడమే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక మసీదులు మొన్నటి ఉగ్రవాద దాడిని ఖండించడాన్ని సులువుగా మరచి పోతారు. ఇప్పుడు పాకిస్థాన్‌ను బహిరంగంగా ఖండించని ముస్లిం నాయకుడు లేడు. ద్వేషం, విభజన రాజకీయాలతో రెచ్చగొట్టడం కాకుండా, అందరూ ప్రభుత్వంతో కలిసి నిలబడి సామాజిక ఐక్యత కోసం పనిచేయాల్సిన సమయం ఇది!శశి శేఖర్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రోజు నేను అమెరికాలో ఉన్నాను. సాధారణంగా నేను టెలివిజన్ వార్తలు చూడను, కానీ ఈ మారణహోమం మాతృభూమిలో జరుగుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఉండవలసి వచ్చింది. మూడు దశాబ్దాలుగా నా రిపోర్టింగ్ బీట్ కూడా ఇదే. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న 26 మంది కశ్మీర్ పర్యాటకులను ఘోరంగా చంపిన ఘటనపై ఆదుర్దాతో నేను హోటల్లో టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికలు వెతికాను.‘ఘర్షణ’గా మాత్రమే చూపారు!నిజానికి ఈ అనాగరిక దాడి జరిగిన రోజు అమెరికా ఉపాధ్య క్షుడు జె.డి. వాన్ ్స భారతదేశంలోనే ఉన్నారు కాబట్టి దాడిపై అమెరి కన్ మీడియా ఆసక్తి చూపించాల్సి ఉంది. పైగా, ఉగ్రవాదులు తమ ప్రణాళికను వాన్ ్స రాకకు ముందే ముగించారు. వారి ఆ కార్యా చరణను 25 ఏళ్ల నాటి పూర్వఘటన నుండి తీసుకున్నారు. 2000లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఢిల్లీలో అడుగు పెట్టినప్పుడు కశ్మీర్ లోయలోని చిట్టిసింగ్‌పురా గ్రామంలో 36 మంది సిక్కులను ఉగ్రవాదులు ఊచకోత కోశారు. అప్పటిలాగే ఇప్పుడు కూడా, కశ్మీర్ సమస్యపై మరింతగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ఉగ్ర వాదుల లక్ష్యం. కానీ ఆ సమయంలోనే జరిగిన ఒక ప్రముఖ ఘటన కారణంగా భారత్‌లో ఉగ్రదాడిపై అమెరికా దృష్టి దాదాపుగా కను మరుగై పోయింది. ఆశ్చర్యకరంగా, అమెరికా నెట్‌వర్క్‌లలో అందు బాటులో ఉన్నదంతా పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం గురించి గంటల తరబడి కార్యక్రమాలు మాత్రమే. కొన్ని వార్తా పత్రికలలో ఉగ్రదాడిపై నివేదికలు లోపలి పేజీలలో క్లుప్తంగా ఉన్నాయి. ఈ దాడి ఘటనను అమెరికన్ మీడియా దాదాపుగా ఒక సాధారణ భద్రతకు సంబంధించిన ‘ఘర్షణ’గా మాత్రమే చూపింది.పశ్చిమాన లోపించిన ప్రస్తావననేను భారతదేశానికి తిరిగి రావాలని త్వరపడుతున్నాను. జరి గిన దాడి భారత్ నుండి తీవ్రమైన సైనిక ప్రతిస్పందనకు దారి తీయవచ్చని, నేను కలిసిన వారికి వివరించాను. ఇది యుద్ధ చర్య అని నొక్కి చెప్పాను. భారతదేశం తదనుగుణంగానే స్పందించవచ్చునని కూడా అనుకున్నాను. నేను ఇలా చెబుతున్నప్పుడు చాలామంది సహోద్యోగులు, స్నేహితులు నన్ను ప్రశ్నార్థకంగానే చూశారు. వారు చూస్తుండే టీవీ, ప్రింట్ లేదా డిజిటల్ మీడియాలలో పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావన చూడలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ప్రతిదాడి స్వభావం, లక్ష్యం, ప్రతిస్పందన సమయం’పై నిర్ణయం తీసుకోవడానికి సాయుధ దళాలకు ‘పూర్తి స్వేచ్ఛ’ ఇచ్చేశారు. దీంతో, భీతిల్లిపోయిన పాక్, తదుపరి 24–36 గంటల్లోనే భారత్ దాడి జరగవచ్చని ప్రకటించేంతవరకు వెళ్లింది. ఒక పాకిస్థాన్ మంత్రి బహిరంగంగానే బెదిరింపు ప్రకటన చేశారు. ‘‘అణ్వాయుధా లను అలంకరణ కోసం తయారు చేయలేదు’’ అని కఠినంగా అన్నారు. ‘సాయుధ దాడి..’ అని రాశారు! ఇప్పటికైనా ప్రపంచ మీడియా అంతా ఈ దాడికి సంబంధించిన భౌగోళిక రాజకీయ ఫలితం గురించి ఆలోచిస్తుందని మీరు అనుకుంటారు కదా! కానీ అలాంటిదేమీ లేదు. ఉగ్రదాడిపై కవరేజ్ నామ మాత్రంగానే ఉంది. ఇంకా దారుణంగా, ప్రారంభ రోజుల్లో ప్రచురి తమైన కొన్ని వార్తా నివేదికలను చూస్తే, పాశ్చాత్య వార్తాపత్రికల లోపలి పేజీలలో ఈ దాడి ఘటనపై ఉపయోగించిన భాష వారి స్వంత కథను వినిపించింది. అదేమిటంటే – జరిగిన దాడి ఘటనకు ‘ఉగ్రవాదం’ అనే పదాన్ని ఉపయోగించడానికి తీవ్రంగా నిరాకరించడం! దానికి బదులుగా, సాయుధులు, తీవ్రవాదులు వంటి మూస పోత పదాలతో ఎప్పటిలాగే వర్ణించారు.సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు గుంపులోని పురుషులను ఒక్కొక్కరిగా చంపేశారు, కానీ వారు హిందువులా లేదా ముస్లింలా అని అడిగిన తర్వాత మాత్రమే చంపారని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాదులతో పోరాడి వారి తుపాకీని లాక్కోవడా నికి ప్రయత్నించిన స్థానిక కశ్మీరీపై కూడా తూటాలు గుప్పించారు.ఇది ‘ఉగ్రవాదం’ అనిపించలేదా?!లష్కరే తోయిబాకి నీడలాగా ఉన్న ‘ది రెసిస్టెన్ ్స ఫ్రంట్’ ఈ దాడికి తక్షణ బాధ్యత వహించింది. తరువాత, పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరగడంతో వారు సైబర్ హ్యాక్ ద్వారా ఈ ప్రకటన జరిగిందని మాట మార్చారు! లష్కర్ తోయిబా ఇంతకు మునుపే అమెరికా అధికారికంగా విడుదల చేసిన ఉగ్రవాద సంస్థల జాబితాకెక్కింది. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడిలో ఆరుగురు అమెరికన్లు మరణించారు. పాకిస్థాన్‌లో దాక్కున్న ప్రదేశం నుండి ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా బయటకు తీసుకెళ్తే అమెరికన్లు ఎలా భావిస్తారు? దీన్ని కూడా వారు సాయుధుల చర్య గానే వర్ణిస్తారా?చివరికి ఇప్పుడు భారతదేశం ‘చర్యకు ప్రతి చర్య’ సూత్రం ప్రాతిపదికన ప్రతీకార చర్యకు సిద్ధమవుతుండగా, పశ్చిమ దేశాలు స్పందించడం ప్రారంభించాయి. వాషింగ్టన్ నుండి కొన్ని ప్రకటనలు సంఘీభావం ప్రకటించాయి. పహల్గామ్ ఘటనకు కారణమైన ఉగ్ర వాదులను శిక్షించడంలో భారత్‌కు పాకిస్థాన్ సహకరించాలని వాన్ ్స కోరుతూనే, భారతదేశం ‘పెద్ద ప్రాంతీయ సంఘర్షణ’కు దారితీయని విధంగా స్పందిస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.భారతదేశ సైనిక పరమైన చర్యల ఎంపికలకు అమెరికన్లు అడ్డంకులు కల్పించే అవకాశం లేదు. కానీ 2023 అక్టోబర్ 7 తర్వాత ఏ అమెరికన్ రాజకీయ నాయకుడూ ఇజ్రాయెల్‌తో ఇలా (ఉద్రిక్తతలు తలెత్తకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని) చెప్పి ఉండక పోవచ్చు. యెమెన్ లోని హౌతీలపై తాము నిరంతరం బాంబు దాడి చేస్తూ మరొకవైపు భారతదేశం సైనిక సంయమనం పాటించాలని అమెరికా నేతలు కోరటాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పటికీ వారి తీరులో భారీ ద్వంద్వ వైఖరి ఉందనే చెప్పాలి.కశ్మీర్ లోపల... కశ్మీర్ వెలుపలా.!పహల్గామ్ ఉగ్రవాద దాడి స్థానికంగా జరిగిన ‘భద్రతా సంఘ టన‘ కాదనీ; అది భారత్, పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఏదో ఒక రకమైన ‘వివాదానికి’ సంబంధించిన మరొక అభివ్యక్తి కాదని ప్రపంచం ఇంకా అర్థం చేసుకోనే లేదు. కశ్మీర్‌లోనూ, కశ్మీర్ వెలుపల కూడా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటోందని 26/11 ముంబై దాడులు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈసారి మాత్రం ఒక నమూనా మార్పు జరిగింది. భారతదేశం పాకిస్థాన్ యుద్ధం అంచున ఉన్నాయి. కానీ ఈ సంఘర్షణ... అది తలెత్తిన రోజు నుండే పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య ప్రభుత్వాల దృష్టి నుంచి తప్పిపోయింది. ఉగ్రదాడి గురించి వారు తప్పుగా నివేదించారు, తప్పుగా అర్థం చేసుకున్నారు.బర్ఖా దత్‌వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత్రి -
కులగణనపై మోదీ యూ–టర్న్‌తో ఎవరికి లాభం?
దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కొన్నేళ్లుగా కుల గణన( CastCensus) డిమాండ్లు వినిపిస్తున్నా... హిందువులంతా ఒక్కటే అని చెబుతూ వచ్చిన బీజేపీ (BJP), ఎవరూ ఊహించని విధంగా కుల గణన నిర్వహించాలని నిర్ణయించింది. కుల గణన మీదే రాజకీయాలు నడుపుతున్న ప్రతి పక్షాల నోరు మూయించడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి ప్రమాదం తెచ్చిపెట్టనున్నదా అనే చర్చ మొదలైంది. మన దేశంలో మతం కన్నా కులమే బలమైనది. ఏ రాష్ట్రంలో చూసినా కులం చుట్టే రాజకీయాలు నడుస్తుంటాయి. స్వాతంత్య్రం అనంతరం 2011లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కులగణన కోసం సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టింది. కానీ, రాజకీయ ఎత్తుగడల మధ్య ఆ డేటాను విడుదల చేయలేదు. తర్వాత అధికారం కోల్పోయిన కాంగ్రెస్... సామాజిక న్యాయం కోసం కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నా... బీజేపీ పట్టించుకోనట్టే వ్యవహరించింది. బీజేపీ సైద్ధాంతిక గురువైన ఆర్ఎస్ఎస్, ముందు నుంచీ కులగణనను వ్యతిరేకిస్తోంది. కులాలకు అతీతంగా హిందువులను ఒకే గొడుగు కింద ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో ఆర్జేడీ–జేడీ(యూ) కూటమి ప్రభుత్వం బిహార్‌లో కులగణనను చేసినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కులగణన చేసినప్పుడు కూడా కుల ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలను అవి వ్యతిరేకించాయి. ప్రతిపక్ష పార్టీలు కుల విభజనలను రెచ్చగొట్టి ఎన్నికల లబ్ధి పొందుతున్నాయని విమర్శించాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘బటెంగే తో కటెంగే’ (విడిపోతే చంపబడతాం) అనే నినాదంతో కులగణన డిమాండ్‌ను తెరమరుగు చేసే ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఈ ప్రచారంలోనే ‘ఏక్ హై తో సేఫ్ హై’ (ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) అనే నినాదం ఇచ్చారు. ఇప్పుడు తన యూ–టర్న్‌కు ఆయన ఏమని సంజాయిషీ చెప్పుకొంటారు?వ్యూహాత్మక నిర్ణయమా?తెలంగాణ, కర్ణాటకలలో చేపట్టిన కులగణనతో దేశ వ్యాప్తంగా సామాజిక న్యాయం డిమాండ్లు పెరిగాయి. దీనికి తోడు ఈ ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకునేలా బీజేపీపై ఒత్తిడి పెరిగింది. బిహార్‌లో 2015లో నితీశ్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేలో మొత్తం జనాభాలో 65 శాతం ఓబీసీలని తేలింది. ఈ నేపథ్యంలో ఓబీసీ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, ప్రతిపక్ష సామాజిక న్యాయ ఎజెండాను నియంత్రించడానికి బీజేపీ కులగణనకు ఒప్పుకుని ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందన్న అనుమానం ఉంది. ఆర్ఎస్ఎస్ ఈ నిర్ణయంపై సంయమనంతో స్పందిస్తూ, కులగణన రాజకీయ సాధనంగా మారకూడదని, శాస్త్రీయంగా, సామాజిక అసమానతలను తొలగించేందుకు మాత్రమే జరగాలని చెప్పింది. ఈ స్పందన వారి అంతర్గత అసౌకర్యాన్ని సూచిస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు రోజే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి తన యూ–టర్న్ గురించి ఆయనతో చర్చించే ఉంటారు. కాబట్టి, ఈ నిర్ణయం బీజేపీ సైద్ధాంతిక మార్పు కాదనీ, ఎన్నికల ఒత్తిడి వల్ల తీసుకున్న రాజకీయ నిర్ణయం మాత్రమేననీ స్పష్టమవుతోంది.2014 నుండి దేశంలో బీజేపీ తన బలం పెంచుకుంటూవస్తోంది. కానీ, తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వెనుకబడిన వర్గాల మద్దతు చాలా కీలకం. బీజేపీలో అత్యధిక శాతం నాయకులు అగ్రవర్ణాలవారే ఉన్నారు. కాబట్టి, కులగణన వల్ల ఓబీసీలు, ఇతర వెనుకబడిన వర్గాలు అధికారంలో తమ వాటాను డిమాండ్ చేస్తే, పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. ఇండియా కూటమి ఎక్కువ కులాలు, సముదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తుందనే అభిప్రాయం బీజేపీకి ప్రతికూలంగా మారింది. బీజేపీ రోహిణీ కమిషన్, రాఘవేంద్ర కుమార్ ప్యానెల్ వంటి ఓబీసీ ఉప–వర్గీకరణ ప్రయత్నాలు చేసినప్పటికీ, వాటి నివేదికలను విడుదల చేయలేదు. దీనికి విరుద్ధంగా, ప్రతిపక్షం కులగణనకు నిబద్ధత చూపిస్తూ... తాము అధికా రంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన జరిపించి, బీజేపీ శిబిరంలో రాజ కీయ ఒత్తిడిని పెంచింది. చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుఈ నిర్ణయం బీజేపీకి స్వల్పకాలిక రాజకీయ లబ్ధిని ఇవ్వవచ్చు, కానీ దీర్ఘకాలంలో అనేక సవాళ్లను తెచ్చిపెడుతుంది. కులగణన హిందూత్వ సిద్ధాంతానికి విరుద్ధంగా, కుల ఆధారిత రాజకీయాలను మరింత బలపరుస్తుంది. ఇది మండల్ 3.0 ఆవిర్భావానికి దారి తీసే అవకాశం కూడా లేకపోలేదు. కులం మన దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా కొనసాగుతోంది. దానిని మతం పేరు చెప్పి తొలగించలేం. ఈ నిర్ణయం బీజేపీ సైద్ధాంతిక పునాదులను కదిలించి, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలకు నైతిక విజయాన్ని అందించింది. 2021లోనే నిర్వహించాల్సిన జనగణన ఇప్పటికీ జరగలేదు. ఈ నేపథ్యంలో కులగణన నిర్ణయం ఎప్పుడు అమలవు తుందో అనే సందేహాలను కొట్టిపారేయలేం!-జి. శ్రీలక్ష్మి రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ -
మానవీయ మతగురువు
నేను ఒకసారైనా పోప్ ఫ్రాన్సిస్ని కలిసి ఉండాల్సింది. ఆయన విషయంలో తప్ప, ఇతర ప్రముఖుల గురించి ఎప్పుడూ ఇలా అనుకోలేదు. పోప్ ముఖంలో ఎప్పుడూ కరుణ, ఆప్యాయత, ఆనందం ఉట్టిపడుతూ ఉండేవి. ఆయన నవ్వుతూ ఉండేవారు. నవ్విన ప్రతిసారీ ఆ కళ్లు వెలుగులు ప్రసరించేవి. అది పెదవుల మీద చిందే మామూలు మందహాసం కాదు. గుండె లోతుల్లోంచి వచ్చినట్లుంటుంది. సహజమైనది. చిన్నారుల పట్ల ఆయన ఎంతో వాత్సల్యం ప్రదర్శించేవారు. అందులోనూ నిజాయతీ కనిపించేది. పోప్ మరణం తర్వాత నేను ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వాటితోనే నాకాయన ఎంతో ప్రేమాస్పదుడు అయ్యారు.క్యాథలిక్ చరిత్రలో పరమ పూజ్యుడిగా గుర్తింపు పొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పేరును పోప్ తన ‘పాపల్ నేమ్’గా స్వీకరించారు. ఆ ఇటాలియన్ మార్మికుడి మాదిరిగానే పోప్ అతి నిరాడంబరంగా జీవించారు. పోప్ అధికారిక నివాసమైన వ్యాటికన్ ప్యాలెస్‌ను (దీన్నే గ్రాండ్ పాపల్ హోమ్ అంటారు) కాదని అక్కడి అతిథి గృహంలోని ఓ చిన్న రెండు గదుల అపార్టుమెంటులో ఉన్నారు. ఆయన ఎంత సాదాసీదాగా ఉండేవారంటే, తను వేసుకునే బ్రౌన్ కలర్ షూస్ బాగా నలిగిపోయి ఉండేవి. గార్డులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఆయనకు పరిపాటి. కార్మికులు తినే క్యాంటిన్‌లోనే తరచూ భోజనం చేసేవారు. ప్రీస్ట్ కావటానికి ముందు బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా)లో ఫ్రాన్సిస్ ఒక బౌన్సర్ ఉద్యోగం చేశాడంటే నమ్మగలరా? ఇతర ప్రీస్టుల కంటే భిన్నంగా ఉండటా నికి బహుశా అదొక కారణం అయ్యుంటుంది. పేదల పక్షం ఉండటమే ఈ పోప్ తత్వం. వారి కళ్లలో ఆయనకు చర్చి కనబడేది. కాబట్టే ఆయన్ను మురికివాడల బిషప్పు అని పిలుచుకునేవారు.2023 అక్టోబరులో ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలైనప్పటి ఉదంతమిది: గాజాలో హోలీ ఫెయిత్ చర్చి ఉంది. ఆ ఏకైక క్యాథలిక్ చర్చిలోనే క్రైస్తవులు, ముస్లిములు తల దాచుకున్నారు. వారి కోసం ప్రార్థించడానికి, వారికి ఊరడింపుగా ఉండటానికి పోప్ రాత్రి సమయాల్లో వాటికన్ నుంచి ఫోన్ చేసేవారు. ప్రపంచానికి తెలియని ఇలాంటి ఎన్నో అద్భుతమైన పనులు ఆయన చేశారు. వాటిలో ఇదొకటి. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా తాను అనుకున్నది చేయడం సెయింట్ ఫ్రాన్సిస్ స్వభావం. అలా ఉండటానికే పోప్ ఫ్రాన్సిస్ కూడా ఇష్టపడేవారు. ఈ విషయాలు తెలిసిన ఆయన సన్నిహితులు సైతం వాటిని అందరి దృష్టికీ తెచ్చేందుకు ప్రయత్నించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. స్వలింగ సంపర్కం పట్ల క్యాథలిక్ చర్చి వైఖరి కఠినంగా ఉంటుంది. ఈ కాఠిన్యాన్ని సడలించిన మొట్ట మొదటి పోప్... ఫ్రాన్సిస్సే! తన విమర్శకులను ఉద్దేశించి, మంచో చెడో ‘‘తీర్పు చెప్పడానికి నేనెవరిని?’’ అని ప్రశ్నించారు. విడాకులు తీసుకున్నవారు, పునర్వి వాహం చేసుకున్నవారు ‘సాక్రమెంటు’ స్వీకరించడంలో తప్పు లేదని చెప్పిన మొదటి పోప్ కూడా ఆయనే. నలుగురు మితవాద కార్డినల్స్ బాహాటంగా వ్యతిరేకించినప్పటికీ పోప్ తన అభిమతం మార్చుకోలేదు.గర్భనిరోధం, గర్భస్రావం, స్వలింగ వివాహాలు, ట్రాన్స్జెండర్లకు గుర్తింపు వంటి అంశాల్లో ఆయన సంప్రదాయానికి లోబడి వ్యవహరించారు. ఏదేమైనా, ఆనవాయితీలను అధిగమించి నూతన భావనలు ప్రవేశపెట్టడాన్నే ఆయన ఇష్టపడేవారు. ఎంత తిరిగినా మళ్లీ అక్కడకే వస్తాం... పోప్ ఫ్రాన్సిస్ సామాన్య జనం గురించి తపన పడేవాడు. వలసదారులు, శరణార్థుల సమస్యపై ఆయన తీసుకున్న వైఖరి దీన్ని రుజువు చేస్తుంది. పోప్ హోదాలో తన తొలి పర్యటనకు ల్యాంపెడుజా అనే ఇటలీ ద్వీపాన్ని ఎంచుకున్నారు. ఉత్తర అమెరికా అక్రమ వలసదారు లను కలిసి వారి సమస్య పరిష్కరించడమే ఈ పర్యటన ఉద్దేశం. తాను జబ్బు పడటానికి కొన్ని వారాల ముందు కూడా, అక్రమ వలసదారులను నేరస్థులుగా పరిగణిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన విధానాలను పోప్ విమర్శించారు. మరే ఇతర దేశాధిపతీ ఇంతగా తెగించి ఉండడని వ్యాఖ్యానించారు. ఇస్లాంతో అధికారికంగా చర్చ జరిపిన మొట్ట మొదటి పోప్ కూడా ఆయనే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆయన బహిరంగ ‘మాస్’ నిర్వ హించారు. అరబ్ ద్వీపకల్పంలో ఇలా చేయడం ఇదే ప్రథమం. ఈ మతాంతర సౌభ్రాతృత్వ చర్యల మీద మితవాదులు దాడి చేశారు. వారిని ఆయన అసలు పట్టించుకోలేదు. పోప్ జీవితంలో వైఫల్యాలు లేవని చెప్పలేం. ముఖ్యంగా వాటికన్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వ్యవహారంలో సమర్థంగా వ్యవహరించలేక పోయారు. ఈ కేసులో కార్డినల్ ఏంజెలో బెచూ మీద ఆరోపణలు రుజువు అయ్యాయి. 2023లో జైలు శిక్ష కూడా పడింది. అంతిమంగా, పోప్ ఈ సమస్యను విస్తృత స్థాయిలో ఎదుర్కోలేక పోయారనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ముందున్న వారెవరూ ఆయన కంటే సమర్థులు కారు. ఏమైనప్పటికీ, ఫ్రాన్సిస్ తన తర్వాత కూడా క్యాథలిక్ చర్చ్ తన ఆకాంక్షలకు అనుగుణంగా నడిచేలా జాగ్రత్తపడ్డారు. ఆయన వారసుడిని ఎన్నుకునే అర్హత 135 మంది కార్డినల్స్కు ఉంటుంది. వారిలో 108 మందిని తనే నియమించారు. అందులో యూరోపి యన్లు 53 మంది కాగా, 82 మంది ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, ఓసియానియా (ఆస్ట్రేలియా సహా అనేక ఇతర పసిఫిక్ దీవులు) ప్రాంతాల వారే! అంటే, ఆయన వారసుడు మరో యూరపే తరుడు అవుతాడా? అవకాశాలు అలానే ఉన్నాయి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కులగణన... చరిత్రాత్మక నిర్ణయం
జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కులగణన నిర్వహించా లన్న ప్రతిపక్షాల డిమాండ్‌కు కేంద్రం తలొ గ్గిందని కూడా కొందరు సామాజిక రాజకీయ వేత్తలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏమైనా కులగణన ప్రకటన చరిత్రాత్మక రాజకీయ ప్రకటన అని భావించవచ్చు. అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా భారతదేశంలో కుల గణన జరగాలని ఎంతో పోరాడారు. నిజానికి బీసీల కులగణన లేక పోవటం వల్ల బహుజనుల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో న్యాయం జరగలేదు. ఓబీసీల జీవన వ్యవస్థ ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, పాశ్చాత్యీకరణ వలన విధ్వంసం అవుతూ... వారు జీవించే హక్కులు మృగ్యమవుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ముదావహం.మారిన పార్టీల అవగాహనఈ ప్రకటన తర్వాత దేశంలోని రాజకీయ, సామాజిక విశ్లేషకు లకు అనేక ప్రశ్నలు ముందుకొచ్చాయి. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ కులగణన ప్రస్తావన వచ్చినప్పుడల్లా వ్యతిరేకించాయి. ఇప్పుడు వాళ్లు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. బిహార్, బెంగాల్, తమిళనాడుల్లో జరగబోయే ఎన్నికల కోసం ఈ ప్రకటన జరిగిందా అనే మరో ప్రశ్న అందరి ముందుకు వచ్చింది. సాక్షాత్తూ పార్లమెంటులోనే బీజేపీ ఎంపీలు కులగణనను వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశ పాలకవర్గం... బ్రాహ్మణ, బనియా, భూస్వామ్య కూటమిగా ఉందనేది స్పష్టం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అంబేడ్కర్, లోహియా, పెరియార్ రామస్వామి చెబుతూనే వచ్చారు. ‘లండన్ హౌజ్ ఆఫ్ కామన్స్’లో అంబేడ్కర్ శత జయంతి సందర్భంగా... భారత మాజీ ప్రధానమంత్రి వీపీ సింగ్ నాతో మాట్లా డుతూ బీసీల రాజకీయ, సామాజిక సంస్కరణల విషయంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వ్యతిరేకంగా వ్యవహరించార ని అన్నారు. మండల్ కమిషన్ రిపోర్టును ఇందిరాగాంధీ అమలు జరపలేదు. దీనికోసం వీపీ సింగ్ చొరవ చూపారనేది సత్యం. ఈ విషయాలను వీపీ సింగ్, శరద్ యాదవ్, రామ్‌విలాస్ పాశ్వాన్ అనేక సందర్భాల్లో, ముఖ్యంగా చుండూరు పోరాటం సందర్భంలో నాతో చర్చించడం జరిగింది. బీజేపీ అధికారంలోకి రాక ముందున్న తన ప్రవర్తనను కాంగ్రెస్... బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్చుకున్నట్లు అర్థమవుతోంది. నెహ్రూ, ఇందిరాగాంధీ కంటే కూడా సామాజిక, రాజకీయ విషయాల్లోనూ; దళిత బహుజన దృక్పథంలోనూ రాహుల్ గాంధీ అవగాహన భిన్నంగా ఉంది. ఆయనపై సబాల్ట్రన్ స్టడీస్ ప్రభావం కనిపిస్తుంది. తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో ఒక అడుగు ముందుకు వేసి 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు పూనుకున్నప్పుడు, వీపీ సింగ్ ప్రభుత్వ మండల్ నివేదికలను అమలు జరపడానికి పూనుకున్నప్పుడు రిజర్వే షన్లకు వ్యతిరేకంగా పోరాటం నడిపినవారు ఆర్ఎస్ఎస్, బీజేపీ వారేనన్నది స్పష్టమే. కుల నిర్మాణ చట్రంఒక రాజకీయ పథకంపై ఓ తీర్పు ఇవ్వడానికి ముందు దానికి సంబంధించిన ప్రాథమిక ప్రణాళికను పరిశీలించడం తప్పనిసరి. ‘ప్రాథమిక ప్రణాళిక’ అంటే ఏ సమాజానికైతే రాజకీయ పథకాన్ని వర్తింపజేయాలని అనుకుంటున్నారో, ఆ సమాజపు నిర్మాణమే ప్రాథ మిక ప్రణాళిక అని చెప్పవచ్చు. సామాజిక నిర్మాణంపై రాజకీయ నిర్మాణం ఆధారపడి ఉందని చెప్పడానికి ఎటువంటి సమర్థనా అవసరం లేదు. వాస్తవానికి రాజకీయ నిర్మాణంపై సామాజిక నిర్మాణం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ నిర్మాణం పని చేసే తీరును అది మార్చవచ్చు, నిరర్థకం చేయవచ్చు లేదా అపహాస్యం పాలు కూడా చేయవచ్చు. భారతదేశ విషయంలో సామాజిక నిర్మాణం అనేది కుల వ్యవస్థపై నిర్మితమై ఉంది. కుల స్వభావం గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. కానీ కులవ్యవస్థకు ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలను గుర్తించి తీరాలి. కులాలు ఎలా పంపిణీ అయ్యాయి అంటే... ప్రతి ప్రాంతంలోనూ ఒక ప్రధాన కులమూ, కొన్ని చిన్న కులాలూ ఉన్నాయి. జనాభా రీత్యా ప్రధాన కులంతో పోల్చినప్పుడు చిన్నవి కావడం వల్లనూ, గ్రామంలో ఉన్న భూమిలో ఎక్కువ భాగం సొంతం చేసుకున్నటువంటి ప్రధాన కులంపై ఆర్థికంగా ఆధారపడి ఉండటం వల్లనూ... ఈ చిన్న కులాలు ప్రధాన కులానికి లోబడి ఉండేవిగా ఉన్నాయి. కేవలం అసమానతే కులవ్యవస్థ ప్రత్యేకత కాదు. క్రమబద్ధంగా శ్రేణీకరించిన అసమానతతో అది ప్రభావితమై ఉంది. కులాలు ఒకదానిపై మరొకటి ఉంటాయి. అదొక రకమైన ఆరోహణా క్రమపు ద్వేషమూ, అవరోహణా క్రమపు ఏవగింపూ కలిగి ఉన్నాయి. కులమనేది సామాజిక, సాంస్కృతిక, తాత్త్విక జీవన వ్యవస్థల నుండి ఆ యా కాలాలలో పరిణామం చెందుతూ వచ్చి కుల నిర్మూలనా దశకు చేరుకుంటుందని అంబేడ్కర్ భావించారు. అందుకే ఆయన కులనిర్మూలనా ప్రణాళికను రూపొందించారు. కులనిర్మూలనా సంస్కృతి కార్యక్రమ ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో కుల గణనే కాక, కుల ఆర్థిక గణన కూడా చేయగలిగితే... భారతదేశ సామాజిక, ఆర్థికపరమైన నిజ స్వరూపం బయటకు వస్తుంది. అప్పుడే ఏ కులానికి ఎంత సంపద ఉందన్నది బయటకు వస్తుంది. మొత్తం మీద నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన భారతదేశంలో తప్పక గుణాత్మకమైన మార్పు వస్తుందనీ; బీసీలు, దళితులలో... ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం పెరుగుతుందనీ ఆశించాల్సిన చారి త్రక సందర్భం ఇది. సానుకూల దృక్పథమే భారతదేశ భవితవ్యానికీ, దళిత బహుజన రాజకీయ విప్లవానికీ దోహదం చేస్తుందన్నది వాస్తవం.డా‘‘ కత్తి పద్మారావువ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
జైరాం రమేష్ (కాంగ్రెస్) రాయని డైరీ
అక్బర్ రోడ్డులోని పార్టీ ఆఫీసులో ఖర్గేజీ, నేను, ‘ఇంకా కొందరం’ సమావేశమై ఉన్నాం. నిజానికి, ఆ ‘ఇంకా కొందరం’ అనేవాళ్లలో కొందరింకా రానే లేదు. ఆ రానివాళ్ల కోసం చూడటం మానేసి, ఖర్గేజీ మాట్లాడటం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను నేను. ఖర్గేజీ ఎంతకూ మాట్లాడటం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు కాకముందు ఆయన ఎలాగైతే ఉన్నారో, కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఖర్గేజీ వింతగా మెరిసే వజ్రంలా అనిపిస్తారు నాకెందుకో! బహుశా మా ఇద్దరిదీ ఒకే రాష్ట్రం కావటం వల్లనేమో!వజ్రం మాట్లాడదు. ఊరికే మెరుస్తూ ఉంటుంది. మాట్లాడని ‘ఖర్గే’ అనే ఈ కాంగ్రెస్ వజ్రాన్ని చూసి ఏ పార్టీ వాళ్లయినా ఎంతో కొంత నేర్చుకోవలసింది తప్పక ఉంటుందని నాకొక నమ్మకం. ముఖ్యంగా మోదీ... ఖర్గేజీని చూసి మౌనంగా ఎలా ఉండాలో, లేదంటే మితంగా ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి.ప్రధాని ఎంత మితంగా మాట్లాడితే దేశం అంత ప్రశాంతంగా ఉంటుంది. పెద్దాయన చూసుకుంటాడులే అని ప్రజలు ధీమాగా ఉంటారు. పెద్దాయన కూడా మన పొరుగింటి ఆయనలా మాట్లాడేస్తుంటే పాకిస్తాన్‌కు ఏం భయం ఉంటుంది? పాకిస్తాన్‌కు చైనా ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటుంది?దేశానికి మోదీజీ పెద్దాయన అయితే,కాంగ్రెస్‌కు ఖర్గేజీ పెద్దాయన. రాహుల్ బాబు, ఆయన బావగారు రాబర్ట్ వాద్రా ఎప్పుడైనా మితం తప్పి మాట్లాడినా, ఖర్గేజీ తన మౌనంతో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మౌనంతో ఏదైనా బ్యాలెన్స్ అవుతుంది. అతీ బ్యాలెన్స్ అవుతుంది, మితమూ బ్యాలెన్స్ అవుతుంది.‘‘విన్నారా ఖర్గేజీ?’’ అన్నాను, ఆయన్ని నా వైపు తిప్పుకునే ప్రయత్నంగా. ‘‘ఏమిటి వినటం?’’ అన్నట్లు చూశారు. ‘‘డెడ్ లైన్ లు చెప్పకుండా మోదీజీ హెడ్ లైన్లు చెప్పేస్తున్నారు! దెబ్బకు దెబ్బ అంటున్నారు. ఆ దెబ్బ ఎప్పుడో చెప్పటం లేదు. జనాభా లెక్కలతో పాటే కులాల లెక్కలు అంటున్నారు. ఆ జనాభా లెక్కలు ఎప్పుడో చెప్పటం లేదు’’ అన్నాను.‘‘చెప్పవలసినవి ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి’’ అన్నారు రాహుల్ బాబు లోనికి ప్రవేశిస్తూ. ఆ వెనుకే ప్రియాంక. ఖర్గేజీ వారిద్దరి వైపూ చూశారు కానీ మాటలతో ఏమీ స్పందించలేదు. అలాగని మౌనంతోనూ స్పందించలేదు. ప్రియాంక పార్టీ జనరల్ సెక్రెటరీగా ఉండి, మీటింగ్‌కి లేట్‌గా రావటం ఆయనకు నచ్చినట్లు లేదు. ‘‘సారీ ఖర్గేజీ... రేఖాగుప్తా సీఎం అయ్యాక ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. అక్బర్ రోడ్డులో అయితే మరీ ఘోరం. అందుకే మీటింగ్‌కి లేటైంది’’ అన్నారు ప్రియాంక. రాహుల్ సెల్ ఫోన్ చూసుకుంటూ వచ్చి, దొరికిన కుర్చీలో కూర్చొని, ‘‘చెప్పవలసినవి ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి’’ అని మళ్లీ అన్నారు మోదీ గురించి. ‘‘అవును రాహుల్జీ, దేశంలో కులగణన చేయించాలని మనం డిమాండ్ చేస్తున్నందుకు మోదీ మనల్ని అర్బన్ నక్సలైట్లు అన్నారు. ఇన్నాళ్లకు వాళ్లూ మన దారిలోకి వచ్చి కులగణన అంటున్నారు. మరి వాళ్లెప్పటి నుండి అర్బన్ నక్సలైట్ అయ్యారో’’ అన్నాను. అంతా నవ్వారు. ఖర్గేజీ నవ్వలేదు!‘‘ఇప్పుడైనా... అదే పనిగా కాకుండా, పనిలో పనిగా మాత్రమే కులగణనను చేయిస్తామంటున్నారు’’ అన్నారు రాహుల్. ‘‘అది నిజమే కానీ...’’ అని ఆగారు... ఖర్గేజీ హఠాత్తుగా మౌనం వీడి! అందరం ఖర్గేజీ వైపు చూశాం.‘‘... వాళ్లు చేయాలనుకుంటున్నది జనగణనలో భాగంగా కులగణన కాదు. కులగణనలో భాగంగా జనగణన. నేరుగా కులగణన అంటే రాహుల్‌కి క్రెడిట్దక్కుతుందని జనగణనలో భాగంగా కులగణన అంటున్నారంతే’’ అన్నారు ఖర్గేజీ!!వజ్రం లాంటి మాట!ఆ మాటతో మా మీటింగ్ మొదలైంది. -
మరో మహమ్మారిని ఎదుర్కొనేలా...
కోవిడ్ వంటి మహమ్మారిని మరింత సమ ర్థంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నేతృత్వంలో ఏప్రిల్ 16న ఈ మేరకు ‘ద పాండెమిక్ ట్రీటీ’ ఒప్పందం కుదిరింది. డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలో కుదిరిన రెండో అంతర్జాతీయ ప్రజారోగ్య ఒప్పందం ఇది. 2003లో ‘ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్’ చర్చల్లో నేను భారత్‌కు ప్రాతినిధ్యం వహించాను. పొగాకు నియంత్రణకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని అమెరికా, జపాన్ , అర్జెంటీనా వ్యతిరే కించినా, యూరోపియన్ యూనియన్ తటపటాయించినా చివరకు వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని గుర్తించారు. ‘ద పాండెమిక్ ట్రీటీ’ విషయంలోనూ వాణిజ్య ప్రయోజనాలు కొందరి ప్రాధాన్యంగా ఉండింది. ఫలితంగా ఈ ఒప్పందంపై నాలు గేళ్లుగా చర్చలు, వాద ప్రతివాదాలూ నడిచాయి. కోవిడ్ వంటి మహ మ్మారి విషయంలో ఎదురైన వైఫల్యాలను మాత్రం ప్రపంచ దేశా లన్నీ గుర్తించాయి. విపత్కర పరిస్థితుల్లో దేశాల మధ్య మరింత సమ న్వయం, సహకారం అవసరమనీ, వట్టిమాటలు, సంఘీభావాలతో ప్రయోజనం తక్కువేననీ అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఒక ఒప్పందం అవసరాన్ని కూడా గుర్తించాయి. వాస్తవానికి ఈఒప్పందం గత ఏడాదే అమల్లోకి రావాల్సింది. ఒప్పంద ప్రతిలోని భాష విషయంలో కొన్ని దేశాలు విభేదించడంతో ఈ ఏడాదికి పొడిగించాల్చి వచ్చింది. ధనిక దేశాల మొండిపట్టు‘ద పాండెమిక్ ట్రీటీ’ ఏడాది క్రితమే కుదరకపోవడానికి రెండు ప్రధానమైన అంశాలు కారణం. ప్రపంచం మొత్తానికి టీకాలు,మందులు, టెక్నాలజీలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా హామీ పొందడం ఒకటైతే... ప్రమాదకరమైన సూక్ష్మజీవులను మొట్టమొదట గుర్తించిన దేశం దాన్ని ఇతర దేశాలతో పంచుకోవడం (టీకా, మందులపై ప్రయోగాలు, నిర్ధారణ పరీక్షల అభివృద్ధి వంటి వాటికోసం) రెండో విషయం. ధనిక దేశాలు తమ ఫార్మా కంపెనీల ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ విషయాలపై పేటెంట్ హక్కులను రక్షించుకునే ప్రయత్నం చేశాయి. అదే సమయంలో తమకు టీకాలు, మందులు, టెక్నాలజీలు అందుబాటు ధరల్లోఉండేలా చూడాలని పేద, మధ్యస్థాయి దేశాలు పట్టుబట్టాయి. హాని కారక సూక్ష్మజీవులను ఇతర దేశాలతో పంచుకుంటున్నందుకు, క్లినికల్ ట్రయల్స్ ద్వారా తమ జనాభాల్లో టీకా, మందులను ప్రయో గించి చూస్తున్నందుకు తమకు ఈ వెసలుబాటు కల్పించాలని కోరాయి. ఈ వైరుధ్యం కారణంగా చర్చలు దీర్ఘకాలం కొనసాగాయి. ఒప్పందంలోని పదాలను కూడా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో మార్చాల్సి వచ్చింది. చివరకు ఈ 2 వివాదాస్పద అంశాలను కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశాల్లో చర్చలు కొనసాగించాలని నిర్ణ యించారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ట్రీటీని ప్రవేశ పెట్టిన తరువాత ఇది అమల్లోకి వస్తుంది. ఫార్మా కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు ధనిక దేశాలు ఎంత మూర్ఖంగా బేరాలాడాయి అంటే... సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునే విషయంలో ‘పరస్పర అంగీకారం ఆధారంగా’ అన్న వాక్యాన్ని ‘స్వచ్ఛంద పరస్పర అంగీకారం’ అని మార్చేంత వరకూ ఒప్పుకోలేదు. సానుకూలతలుకోవిడ్ సమయంలో ధనిక దేశాలు టీకాలను నిల్వ చేసుకున్న దాఖలాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. టీకాలు అందుబాటులో లేని చోట్ల కోవిడ్ వైరస్ వేగంగా రూపాంతరం చెందిన విషయమూ తెలిసిందే. ఒక్క విషయమైతే స్పష్టం. ద పాండెమిక్ ట్రీటీ విషయంలో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా 193 దేశాలు కొన్ని కీలకఅంశాల విషయంలోనైతే ఏకాభిప్రాయానికి వచ్చాయి. కోవిడ్ వంటి మహమ్మారులు ప్రబలుతున్న సమయంలో సమాచారాన్ని వేగంగా, తగిన సమయంలో పంచుకోవాలన్నది వీటిల్లో ఒకటి. అలాగే టీకాలు, మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల తయారీదారులు తమ ఉత్పత్తిలో కనీసం 20 శాతాన్ని అందుబాటు ధరల్లో డబ్ల్యూహెచ్ఓకు అందించాలన్నది రెండోది. వ్యాధిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం మూడోది. మాస్కులు, పీపీఐ కిట్ల వంటి వాటి సరఫరా, లభ్యతల విషయంలో డబ్ల్యూహెచ్ఓకు పర్యవేక్షణ అధికారం దక్కడం ఒక విశేషం.ఈ ఒప్పందం కోవిడ్ లాంటి మహమ్మారుల నివారణపై కూడా దృష్టి పెడుతోంది. వన్ హెల్త్ పద్ధతిని అనుసరించాలని సూచిస్తోంది. భౌగోళికంగా వేర్వేరు ప్రాంతాల్లో పరిశోధనలు చేపట్టాలనీ, ప్రమాద కర సూక్ష్మజీవులు పరిశోధనలకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, మందులు, ఇతర ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలనీ కూడా ఈ ఒప్పందం ప్రస్తావిస్తోంది. అంతేకాకుండా... అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులను అరోగ్య అత్యవసర పరిస్థితులకు దీటుగా స్పందించేలా సిద్ధం చేయాలని, ఈ కార్యకలా పాలకు అవసరమైన ఆర్థిక వనరుల సమన్వయానికి, ఆరోగ్య వ్యవస్థ లను బలోపేతం చేసేందుకూ, అంతర్జాతీయంగా సప్లై చెయిన్, లాజి స్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.ప్రజారోగ్యం విషయంలో దేశాలకు ఉన్న సార్వభౌమ అధికారా లను గుర్తించే ఈ ఒప్పందం, అందులోని అంశాలు ఏ రకంగానూ డబ్ల్యూహెచ్ఓ ఇస్తున్న ఆదేశాలుగా భావించరాదని స్పష్టం చేస్తోంది. దేశీ విధానాలు, కార్యక్రమాలను మార్చుకోవాల్సిన అవసరమూ లేదని తెలిపింది. అంటే ప్రయాణీకుల నిలిపివేత, టీకాలు తప్పనిసరి చేయడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం వంటివి.నిపుణుల ఆమోదం...ఈ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరడంపై అంతర్జాతీయ నిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్య చట్టాల విషయంలో నిపుణుడైన అమెరికా న్యాయవాది లారెన్స్ గోస్టిన్దృష్టిలో ఈ ఒప్పందం ఒక ఘన విజయం. ఈ ఒప్పందంపై విమర్శకులు కూడా లేకపోలేదు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ఉండగా... రిపబ్లికన్ పార్టీ నేతలు, ఒక వర్గం మీడియా వ్యాఖ్యాతలు అమెరికా ఈ చర్చల్లో పాల్గొనడాన్నే తప్పుపట్టారు. డబ్ల్యూహెచ్ఓ అమెరికా సార్వభౌమత్వంలో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ ముసాయిదా ఒప్పందాన్ని తిరస్కరించారు. వాణిజ్యం, పర్యాటకరంగాలపై దీని ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రభుత్వంగా మారే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత డబ్ల్యూహెచ్ఓ నుంచిట్రంప్ వైదొలగడంతో ఈ ఒప్పందంపై చర్చలు వేగవంత మయ్యాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సాగాయని కూడా చెప్పాలి. ఇక్కడ ఒక కీలకమైన విషయం గురించి చెప్పుకోవాలి. ఒప్పందాన్ని ఆమోదించిన దేశాల జాబితాలో అమెరికా లేకపోవడం హానికారక సూక్ష్మజీవులపై ప్రపంచవ్యాప్త నిఘా అన్న అంశాన్ని బలహీన పరిచేదే. సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి కూడా ఎంతవరకూ సాధ్యమవుతుందన్నది చూడాలి. కాబట్టి ఆ యా దేశాల స్థాయిలో వనరుల నిర్మాణం, ప్రాంతీయ స్థాయిలో సహకారం వంటి ఇతర మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి సవాళ్లకు అంతే స్థాయి స్పందన కూడా అవసరమవుతుంది. పాండె మిక్ ట్రీటీ ఈ దిశగా వెళ్లేందుకు తగిన చోదక శక్తిని ఇస్తోంది!-వ్యాసకర్త ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’,‘ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)- కె. శ్రీనాథ్ రెడ్డి -
ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశం
పహల్గామ్ ఊచకోత పట్ల భారత ప్రభుత్వం ఎంతో పరిపక్వత ప్రదర్శించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్నారు. తక్షణం కశ్మీర్ వెళ్లి పరిస్థితి ఏమిటో స్వయంగా తెలుసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై అప్పటికప్పుడు ఏయే చర్యలు చేపట్టాలో గుర్తించారు. వీసాలు రద్దు చేశారు. అటారీ చెక్ పోస్టు మూసేశారు. పాక్ హైకమిషన్ కీలక అధికారులను దేశం నుంచి బహిష్కరించారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశారు. ఉగ్రదాడి సూత్రధారులకు తగిన గుణపాఠం చెప్పేందుకు వ్యూహ రచనా జరుగుతోంది. ‘‘భారత రిపబ్లిక్‌తోనే ఆటలాడతారా, మీ అంతు చూస్తాం, ఖబడ్దార్!’’ అంటూ ఇండియా పంపిన హెచ్చరిక ఇప్పటికే టెర్రరిస్టులకు అందేవుంటుంది. అత్యంత శక్తిమంతమైన రష్యా, అమెరికాల నుంచి, సౌదీ అరేబియా సహా మనకు విస్పష్టమైన మద్దతు లభించింది. ఇది ఈ సందేశానికి మరింత బలం చేకూర్చింది. సాధారణ పరిస్థితుల్లో ఎన్ని భేదాభిప్రాయాలున్నా, కష్టకాలంలో అన్నీ మరచి ఒక్క తాటి మీద నిలవటం భారత ప్రజల విశిష్టత. ప్రస్తుత బాధకర సమయంలోనూ కోపంతో రగిలిపోతూ అందరం ఒక్కటయ్యాం. ఒక్కుమ్మడిగా మన ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించాం. భౌతికంగానూ బయటికొచ్చాం. మనం భాగ్యవంతులం కాకపోవచ్చు, కాని ఆపదలో అండగా నిలిచే సహజగుణ సంపన్నులం. కేంద్ర ప్రభుత్వం, జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఈ తరుణంలో ఏ చర్యలు తీసుకున్నా ఇండియా యావత్తూ వాటికి వెన్నుదన్నుగా నిలిచి ఉంటుంది. ఇండియా జాతీయ భద్రతకు పౌర సమాజం ఎప్పుడూ చేయూత ఇస్తుంది. ఇది కాలపరీక్షలో నిగ్గుదేలిన వాస్తవం.యుద్ధం వస్తే సిద్ధమే!రెండు దేశాల నడుమ యుద్ధం వస్తుందా? పహల్గామ్లో పాక్ అంతటి దుస్సాహసానికి పాల్పడితే మనం చేతులు ముడుచుకుని కూర్చోలేం. కానీ ఇవి మాత్రమే యుద్ధానికి దారి తీసే కారణాలు కావు. పాకిస్తాన్ మనకు వ్యతిరేకంగా అల్లుతున్న కథనాలు కూడా ఇందుకు పురిగొల్పుతున్నాయి. పహల్గామ్లో ఉగ్రదాడి పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబికిన తర్వాత పాకిస్తాన్ తన ఆత్మరక్షణ కోసం ఎంతటి దుందుడుకు విమర్శలకూ వెనుకాడటం లేదు. ఇండియా సైనికపరంగా ఎలాంటి చర్య తీసుకున్నా, యుద్ధానికి ‘మ్యాచ్’ అయ్యే ప్రతిచర్యలు ఎదురవుతాయి. పరిస్థితి అంతదాకా వస్తే, ‘‘అయితే సరే, అయితే సరే. మేం కూడా ఆ ‘మ్యాచ్’ను ఎదుర్కుంటాం. ఘోర కృత్యాలకు తెగబడుతున్న ఉగ్రవాదాన్ని మా దేశంలో ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించం’’ అని మనం చెప్పి తీరాలి.ఈ సన్నద్ధతలో మనం గుర్తు పెట్టుకోవలసిన అంశం: యుద్ధానికి సిద్ధంగా ఉండటం వేరు, యుద్ధం కోసం ఉవ్విళ్లూరడం వేరు. యుద్ధం తాలూకు నిర్బంధాలు, ఫలితాలు ఎప్పుడూ బాధాకరంగానే ఉంటాయి. అదీ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం అంటే, దాని పరిణామాలు ప్రళయ సమానంగా ఉండగలవు. అణ్వస్త్రాలపై ఇండియా విధానాలు వివేకంతో కూడుకుని ఉంటాయి. అణ్వస్త్ర నిగ్రహం మన విధానం. పాకిస్తాన్ ఇదే బాటలో పయనిస్తోందా? అది అణ్వస్త్రం సమకూర్చుకున్న చరిత్రే దాని ఉద్దేశాలను వెల్లడిస్తుంది.‘ఒక్క దేశం’గా నిలబడదాం!ఇండియా తన సైనిక వ్యూహాలను విజ్ఞతతో బేరీజు వేసుకుని ఏది సరైన మార్గమో నిర్ణయించుకోగలదు. మనం ప్రభుత్వాన్ని సంపూర్ణంగా, బేషరతుగా విశ్వాసంలోకి తీసుకోవాలి. ఇక, దేశంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేవారు కొందరు ఉంటారు. వారికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి మనం సహకరించాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి మనం ఇలా చెప్పాలి: ‘‘ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదించి మీరు వేరే దేశాన్ని సాధించుకున్నారు. మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి మా ‘వన్ నేషన్’ను విభజించాలని చేసే ప్రయత్నాలు మేం సహించేది లేదు. హిందువులు, ముస్లిములు, సిక్కులు... వీరందరికీ మా ‘వన్ నేషన్’ మాతృభూమి. ‘ఇండియా దటీజ్ భారత్’ విలువలకు నిలయం. మీ క్రూరాతి క్రూరమైన వక్రబుద్ధికి ఇవి అర్థం కావు.’’1948 జనవరి 30న ‘తీస్ జనవరి మార్గ్’లో మంచు కప్పిన గడ్డి మీద రక్తం చిందినట్లే, ఈ ఏప్రిల్ 22న పహల్గామ్ అందమైన కొండ లోయల మీద చిందిన రక్తం... మానవత్వం మీద బుల్లెట్ల దౌష్ట్యానికి నిదర్శనం. అయినప్పటికీ మానవత్వం మీద మన విశ్వాసాన్ని అది చాటి చెబుతోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా తీసుకురావాలని చూస్తున్న ‘ఉగ్రవాదపు రెండో దశ’ను నిరోధించి, మన మన మధ్య ఒక్క నెత్తుటి బొట్టు చిందనీయకుండా సాయుధ బలగాలకు పౌరదళాలుగా మన సమైక్య సంఘీభావం ప్రకటించాలి. టెర్రరిస్టులకు, టెర్రరిజానికి పురిటిగడ్డ అయున పాకిస్తాన్‌లోనూ హింసాద్వేషాలను వ్యతిరేకించే విజ్ఞులు ఉన్నారు. పహల్గామ్ ఘటన పట్ల కలత చెందినవారు, మేధావులు అక్కడ కొద్దిమంది కాదు... ఎక్కువగానే ఉంటారు. వారెవరో మనకు తెలియాల్సినంతగా తెలియడం లేదు. అలాంటివారు ఈ సమయంలో మతతత్వ గుంపులను, వ్యక్తులను గట్టిగా వ్యతిరేకిస్తారని ఆశిద్దాం. గొప్ప భారతీయుడైన లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపును గుర్తు చేసుకుంటూ, భారత దేశం ఈ సవాలును విజయవంతంగా తిప్పికొట్టాలని ఆశిద్దాం. ఆయన ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి ‘జై ఇన్సాన్’ (ఇన్సాన్ అంటే మానవ్) కూడా చేర్చుదాం. మన మతం మానవత్వం అనీ, దుష్టత్వం కాదనీ పహల్గామ్ సాయుధ దుండగులకు చెప్పి తీరాలి. ‘‘ఖబడ్దార్, ఇండియాతో, ఇండియా మానవత్వంతో ఆటలొద్దు’’ అని మరోసారి చెబుదాం!గోపాలకృష్ణ గాంధీవ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
కార్మికులంతా ఒక్కటవ్వాలి!
కార్మికుల పండగ దినం ‘మే డే’. ప్రపంచంలోని కార్మికులందరూ తమ హక్కుల సాధన దినోత్సవంగా మే 1వ తేదీని జరుపుకొంటారు. 1886 ముందు కార్మికులు వెట్టి చాకిరితో మగ్గిపోతూ రోజుకు 18 గంటల పాటు పనిచేసేవారు. దీనికి వ్యతిరేకంగా అమెరికాలోని చికాగో నగ రంలో జరిగిన కార్మికుల ప్రదర్శనపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణకాండను ప్రపంచమంతా ఖండించింది. ఆ తర్వాత జరిగిన అనేక ఉద్యమాల ద్వారా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేసే హక్కును కార్మికులు దాదాపు అన్ని దేశాల్లోనూ సాధించు కున్నారు. ఈ విజయానికి సూచిక గానే మే డేని జరుపుకుంటున్నారు కార్మిక సోదరులు. భారతదేశంలో కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాలు జరి పిన పోరాటాల ఫలితంగా వెట్టి చాకిరీ నిర్మూలన జరిగింది. వేతన సవరణకు సంబధించిన ఒప్పందాలకు అంకురార్పణ జరిగింది. సెలవులు, ఇంక్రిమెంట్లతోపాటు కార్మికులకు అవసరమైన కనీస సౌకర్యాలను పని ప్రదేశంలో సాధించడంలో కొంతవరకు కృత కృత్యులమయ్యాము. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంకానీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ మళ్లీ వారిని పాత కాలపు కష్టాల పాలు చేయడానికి ప్రయత్ని స్తున్నాయి. కేంద్రం కార్మిక చట్టాలన్నంటినీ నాలుగు కోడ్ల కిందికి తీసుకురావడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే.కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్ని ఆందో ళనలు చేపట్టినా ప్రభుత్వ పెద్దలఆలోచనా విధానంలో మార్పు రానందున మే 20వ తేదీనాడు పెద్ద ఎత్తున కార్మిక వర్గం రోడ్లమీదికి వచ్చి ఉద్యమం చేయనున్నది. మే డే స్ఫూర్తితో కార్మిక లోకం ఉవ్వెత్తున ఎగసిపడనున్నది. మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారు. అందుకే ఆయన మోదీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఇప్పుడు మాట్లాడడం లేదు.కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా వారికి మేలు చేకూర్చే కార్యక్రమాలు ఎన్నో చేపట్టింది. ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి అనేక ప్రయోజనాలు కలుగ జేసింది. ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్న ఉద్యోగులను పర్మినెంట్ చేశారు నాటి సీఎం జగన్. ఇదే తరుణంలో ఆటో కార్మికులకు రూ. 10,000, దర్జీలు, దోబీలు, నాయి బ్రాహ్మణులు, బెస్త కార్మికులు వంటివారికీ 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేయ టం తెలిసిందే. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకూ కృషిచేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తలంచితే దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు జగన్. అసెంబ్లీలో ప్రైవేటీకర ణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన కార్మికుల పక్షపాతి జగన్. ఎన్డీఏ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను అన్ని వర్గాలూ ఖండించాలి. మే డే స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగవలసిన అవసరం ఉంది.పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుమొబైల్: 98481 05455(నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే) -
హిందీ భాష మూలాలు ఏమిటి?
ఇండియా అనే పేరు వెనుక చాలా చరిత్ర ఉంది. ఈ పదం ఇండస్ నుంచి వచ్చింది. ప్రాచీన పర్షియన్ పదం అయిన హిందుష్ నుంచి ఇండస్ ఆవిర్భవించింది. ఇది సంస్కృత పదం సింధుకు రూపాంతరం. అయితే, ప్రాచీన గ్రీకులు ఇండియన్స్‌ను ఇండోయి అని వ్యవహరించేవారు. ఇండోయి అంటే వారి భాషలో ఇండస్ ప్రజలు అని అర్థం. ఇండస్ రివర్ అంటే స్థానికులు ఎప్పటి నుంచో పిలుచుకునే సింధూ నదే. మన దేశానికి భారత్ అనేది రాజ్యాంగ గుర్తింపు పొందిన అధికారిక నామం. ఈ భౌగోళిక పదం అనేక భారతీయ భాషల్లో కొద్ది మార్పులు చేర్పులతో వ్యవహారంలో ఉంది. హిందూ ధర్మ గ్రంథాలు చెప్పే పౌరాణిక చక్రవర్తి భరతుడి పేరు నుంచి భారత్ వచ్చింది.అధికార భాషగా పర్షియన్హిందుస్థాన్ వాస్తవంగా పర్షియన్ పదం. అంటే ‘హిందువుల భూమి’ అని అర్థం. 1947 వరకూ ఉత్తర భారతం, పాకిస్తాన్ వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని ఈ పేరుతో పిలిచేవారు. ఇండియా మొత్తాన్నీ కలిపి చెప్పేందుకు కూడా అప్పుడప్పుడూ ఈ పదం ఇప్పటికీ వాడతారు.ఢిల్లీ సుల్తానుల, మొఘలుల సామ్రాజ్యాల్లో, వారి వారసత్వపు రాజ్యాల్లో పర్షియన్ అధికారిక భాషగా ఉండేది. కవిత్వం, సాహిత్యం కూడా ఈ భాషలోనే ఉండేవి. చాలా మంది సుల్తానులు, నాటి కులీనులు పర్షియన్ ప్రభావిత తురుష్కులే. మధ్య ఆసియా నుంచి వచ్చిన వీరి మాతృభాషలు తురుష్క భాషలు. మొఘలులు కూడా పర్షియన్ ప్రభావిత మధ్య ఆసియా నుంచే వచ్చారు. కాకుంటే వీరు తొలినాళ్లలో ప్రధానంగా చగతాయి తురుష్క భాష మాట్లాడేవారు. తర్వాత్తర్వాత పర్షియన్‌కు పరివర్తనం చెందారు.నార్త్ ఇండియాలోని ముస్లిం ఉన్నత వర్గాలకు పర్షియన్ ప్రాధాన్య భాష అయ్యింది. మొఘల్, ఇండో–పర్షియన్ చరిత్ర కారుడైన ప్రముఖ పండితుడు ముజఫర్ ఆలమ్ చెప్పే ప్రకారం, ఈ పర్షియన్ భాష అక్బర్ సామ్రాజ్యంలో సామాన్యుల భాషగా మారింది. ఎందుకంటే, అన్ని మతాల వారు దీన్ని మాట్లాడేవారు. భాష సరళంగా ఉండేది. దీంతో, పలు రాజకీయ సామాజిక ప్రయోజనాలు ఆశించి అక్బర్ దీన్ని విశేషంగా అభివృద్ధి చేశాడు. పరాయి భాషల భారతీయ అపభ్రంశాల కలయికతో నాడు ఏర్పడిన ఒక మాండలికమే ఇవ్వాళ్టి ఉర్దూ, హిందీ, హిందుస్థానీ భాషలకు మూలం. బ్రిటిష్ వారి రాకతో...మొఘలుల కాలం నుంచి బ్రిటిష్ పాలన వరకు పర్షియన్ భాష మనుగడలో ఉంది. ‘గొప్ప మొఘలుల’లో చిట్టచివరి వాడుగా చరిత్రకారులు భావించే ఔరంగజేబ్ చక్రవర్తి 1707లో చనిపోయే వరకు కూడా ఈ ప్రాభవం కొనసాగింది. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. 1739లో ఢిల్లీపై నాదిర్ షా దండ యాత్ర చేయడం, దక్షిణ ఆసియాలో క్రమేపీ యూరప్ పట్టు బిగియటం... ఈ పరిణామాల నేపథ్యంలో పర్షియన్ భాష,సంస్కృతి క్షీణదశలోకి ప్రవేశించాయి. ఏమైనప్పటికీ, ఆ తర్వాత కూడా సిక్కు మహారాజా రంజిత్ సింగ్ (పాలనా కాలం 1799– 1837) సహా దక్షిణ ఆసియాలోని అనేక మంది పాలకుల ప్రాంతీయ ‘సామ్రాజ్యాల్లో’ దీనికి రాజాదరణ లభించింది. చిట్టచివరకు, 1839లో ఈ భాషకు మృత్యు ఘంటికలు మోగాయి. బ్రిటిష్ పాలకులు పర్షియన్ భాషను పరిపాలన, విద్యా బోధన వ్యవస్థల నుంచి తొలగించారు. నామమాత్రపు చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్‌ను బ్రిటిష్ వారు అధికారపీఠం నుంచి కూలదోశారు.మూలాలు ఏవైనప్పటికీ ఆర్య ద్రావిడ కలయిక నుంచి పుట్టిన సంస్కృతం స్థానాన్ని అలా పర్షియన్ ఆక్రమించింది. ఇక్కడ విశేష మేమిటంటే, లేత వర్ణ చర్మం (లైట్ స్కిన్) కలిగిన ఒక ఉన్నత వర్గం భాషను మరో ‘లైట్ స్కిన్’ ఉన్నత వర్గం భాష తోసి రాజంది. ఉత్తర భారత దేశంలో ఈ కులీన భాషలు చివరకు ప్రాంతీయ మాండలీ కాలతో కలిసిపోయి హిందావి లేదా ఉర్దూ అనే ఒక సామాజిక భాషగా రూపొందాయి. నిజానికి విభిన్న భాషలేనా?హిందీ, ఉర్దూలు రెండు విభిన్న భాషలు అన్న భావనకు 19వ శతాబ్దపు ప్రథమార్ధంలో ఫోర్ట్ విలియం కాలేజ్ అధ్యయనాల్లో స్పష్టత వచ్చిందని ‘ఇండియాలో భాష గురించిన సత్యం’ (ట్రూత్ అబౌట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా) అనే వ్యాసం (ఈపీడబ్ల్యూ, డిసెంబర్ 14, 2002)లో సంతోష్ కుమార్ ఖారే పేర్కొన్నారు. పర్షియన్/అరబిక్ నుంచి ఉర్దూ... సంస్కృతం నుంచి హిందీ తమ భాషా సాహిత్యాలను అరువు తెచ్చుకున్నాయని హిందీ పుట్టుక గురించి వివరించారు. కొత్తగా పుట్టుకొచ్చిన మధ్యతరగతి పట్టణ హిందూ, ముస్లిం/కాయస్థ వర్గాల సంకుచిత ప్రయోజనాల పోటీని అవి ప్రతిబింబించాయి. అసలైన బాధాకరమైన విషయం వ్యాసం ముగింపులో ఉంటుంది. అదేమిటంటే, ‘‘ఆధునిక హిందీ (లేదా ప్రామాణిక భాష) అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ సృష్టి. ఉర్దూ వ్యాకరణం,శైలిని పరిరక్షిస్తూనే దాన్ని విదేశీ పదాల నుంచి, గ్రామ్యాల నుంచి ప్రక్షాళన చేసి, వాటి స్థానంలో సంస్కృత సమానార్థకాలను చేర్చింది.’’హిందీకి ప్రధాన ప్రచారకర్త పాత్ర పోషిస్తున్న ఆర్ఎస్ఎస్ నేడు ఇండియాలో ఇంగ్లిష్ మాట్లాడేవారిని ‘మెకాలే పిల్లలు’ అంటూ ఎగతాళి చేసి ఆనందం పొందుతోంది. ఇదొక విషాదం!మోహన్ గురుస్వామి వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com -
బైబిల్... షేక్స్పియర్... అగథా క్రిస్టీ!
ఎప్పటికీ గుర్తుండిపోయే నా టీనేజ్ జ్ఞాపకం: నేను అగథా క్రిస్టీ నవలల్ని చదవటం! అంతుచిక్కని క్రిస్టీ హత్యోదంతాలలో గల్లంతవుతూ ఉక్కపోత వేసవి మధ్యాహ్నాలను గడిపేవాడిని. ప్రధానంగా హెర్క్యూల్ పాయ్రోట్, మిస్ మార్పుల్ (క్రిస్టీ నవలల్లోని కల్పిత డిటెక్టివ్ పాత్రలు)ల అపరాధ పరి శోధనలు నన్ను కదలనివ్వకుండా చేసేవి. తక్కిన డిటెక్టివ్ పాత్రలు... టామీ, టపెన్స్ బెరెస్ఫోర్డ్; పార్కర్ పైన్, హార్లీ క్విన్ అనే వాళ్ల గురించి నాకసలు ఏమీ తెలియకపోయినా... క్రిస్టీ 66 డిటెక్టివ్ నవలలు రాశారనీ, అవి 200 కోట్ల కాపీలకు పైగా అమ్ముడయ్యాయనీ; బైబిలు, షేక్స్పియర్ రచనలు మాత్రమే ఆ సంఖ్యను దాటిన ప్రచురణలనీ, క్రిస్టీ నవలలు వందకు పైగా భాషలలోకి తర్జుమా అయ్యాయనీ అస్పష్టంగానైనా తెలుసు. అగథా క్రిస్టీ వ్యక్తిగత విషయాలు మాత్రం నాకు దాదాపుగా ఏమీ తెలియదు. అయితే ఆ లోటును, గత వారం నేను అనుకోకుండా చూసిన రెండేళ్ల నాటి లూసీ వర్స్‌లీ ‘అగథా క్రిస్టీ’ జీవిత చరిత్ర భర్తీ చేసింది. ఆమె ఇంగ్లండ్ రచయిత్రి. ఆమె తండ్రి అమెరికన్. క్రిస్టీ అనే పేరు ఆమెకు మొదటి భర్త నుండి వచ్చింది. వాళ్ల ఏకైక సంతానం కుమార్తె రోసాలిండ్. వారి వైవాహిక జీవితం 1914 నుండి 1928 వరకు కొనసాగింది. భర్తకున్న వివాహేతర సంబంధం చివరికి ఆమె చేత అత్యంత బాధా కరమైన విడాకులకు దారి తీయించింది. ఆ తర్వాత రెండేళ్లకు క్రిస్టీ తనకన్నా పదేళ్లు చిన్నవాడైన ఒక పురావస్తు శాస్త్రవేత్తను పెళ్లి చేసుకున్నారు. మధ్య ప్రాచ్యంలో అతడు జరిపిన తవ్వకాల ద్వారానే క్రిస్టీ ఇరాక్ (మెసపటేమియా), ఈజిప్టుల గురించి తెలుసుకున్నారు. భర్త తవ్వకాల పనికి చాలా వరకు క్రిస్టీనే డబ్బును సమ కూర్చారని పుస్తక రచయిత్రి వర్స్‌లీ రాశారు. ప్రతిఫలంగా ఆమెకు ‘డెత్ ఆన్ ద నైల్’, ‘మర్డర్ ఇన్ మెసపటేమియా’, ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్‌ప్రెస్’ అనే మూడు పుస్త కాలు రాసేందుకు ముడి సరకు లభించింది. ఆమె తరచూ భర్త పాల్గొనే పురావస్తు త్రవ్వకాల దగ్గరకు వెళుతూ ఉండేవారు. బహుశా మీలో చాలామందికి అగథా క్రిస్టీ అనే ఆవిడ ‘థ్రిల్లర్’ల నవలా రచయిత్రి అని తెలిసి ఉండొచ్చు. కానీ ఆమె గురించి తెలుసుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ‘మేరీ వెస్ట్మెకాట్’ పేరుతో ఆమె ఆరు రొమాంటిక్ నవలలు రాశారు. ఆమె నిష్ణాతురాలైన నాటక రచయిత్రి కూడా! వాటిల్లో ప్రసిద్ధి చెందిన రెండు నాటకాలు ‘మౌస్ ట్రాప్’, ‘విట్నెస్ ఫర్ ద ప్రాసిక్యూషన్’. మొదటి నాటకాన్ని లండన్ వెస్ట్ ఎండ్ థియేటర్లో 1952 నుండి 2020 వరకూ ప్రద ర్శించారు. ఇంకా నడిచేదే కానీ, కోవిడ్ రాకతో తాత్కాలి కంగా నిలిపి వేయవలసి వచ్చింది. తిరిగి 2021 నుండి నిరవధికంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. హెర్క్యూల్ పాయ్రోట్ ఆమె అత్యంత ప్రసిద్ధ కాల్ప నిక డిటెక్టివ్ పాత్ర. అయితే ఆ పాత్రను మోయటం ఆ ‘కల్పితుడికి’ తలకు మించిన పనైపోయిందని క్రిస్టీ తల పోశారు. 1975 నాటి ‘కర్టెన్’ నవలలో చివరిసారి అతడు కనిపించాక, ‘న్యూయార్క్ టైమ్స్’ తన మొదటి పేజీలో అతడికి శ్రద్ధాంజలి ఘటించింది. అగథా 86 సంవత్సరాలు జీవించారు. ఆమె తన 80లలో కూడా రాస్తూనే ఉన్నారని వర్స్‌లీ వెల్లడించారు. ‘‘ఆమె చనిపోయాక, ఆమె చివరి రాత పుస్తకాల్లో సైతం, తర్వాత రాయబోయే నవల కోసం తన ఆలోచనల్ని రాసి పెట్టుకున్నారు. అవి పూర్తిగా కొత్త ఆలోచనలు. ఇద్దరు విద్యార్థులు ఒక బాలుడిని ఏ కారణం లేకుండానే ఒక ప్రయోగంలా హత్య చేయటం గురించిన ఐడియాలు అవి...’’ అని రాశారు వర్స్‌లీ. అగథా క్రిస్టీ జీవితాన్ని కూడా రహస్యాలు చుట్టు ముట్టాయంటే ఆశ్చర్యంగా ఏమీ అనిపించదు. మొదటి భర్త క్రిస్టీతో తన వివాహ బంధం ఊగిసలాడుతూ ఉన్న సమ యంలో 1926లో ఆమె పది రోజుల పాటు అదృశ్యమై పోయారు. ఆమె కోసం భారీ ఎత్తున గాలింపు జరిగింది కానీ, ఆమె జాడ తెలియలేదు. ‘‘నమ్మకద్రోహం చేసిన తన భర్తపై ప్రతీకారం తీర్చుకోటానికి ఈ మాయలాడి ఏదో పథకం వేసి ఉంటుంది’’ అని విమర్శకులు కొందరు ఆమె గురించి మాట్లాడినట్లు వర్స్‌లీ రాశారు. మహోజ్వలమైన అగథా రచనా జీవితం... ఆరంభంలోనే తడబాటుకు లోనైంది. ఆమె తొలి పుస్తకం ‘ద మిస్టీరియస్ ఎఫైర్స్ ఎట్ స్టైల్స్’ను ఇద్దరు ప్రచురణకర్తలు తిరస్కరించారు. ఆ తర్వాత ‘ద బాడ్లీ హెడ్’ అనే సంస్థ ప్రచురణకు తీసుకుంది. 36 ఏళ్ల వయసులో అగథా 70 కిలోల బరువు ఉండే వారు. తర్వాత సంవత్సరాలలో ఆ బరువు 82 కిలో లకు చేరుకుంది. ఆమె భారీ మనిషి అనడంలో సందేహం లేదు. అగథాకు నివాస గృహాలంటే ఇష్టం. ఆమెకు ఎనిమిది ఇళ్లు ఉండేవి. ఆమె చాలాసార్లు నిర్లక్ష్యపూరితంగా రచన చేసేవారు. వర్సిలీ చెప్పినదాని ప్రకారం... పాయ్ రోట్ ‘ వైట్హెవెన్ మాన్షన్స్‘లో నివసిస్తాడు, కానీ కొన్నిసార్లు అతను ‘వైట్‌హౌస్ మాన్షన్స్‘లో కూడా ఉన్నట్లు చూపిస్తారు. ‘స్లీపింగ్ మర్డర్‘లో, ఒక క్లర్క్, రిసెప్ష నిస్ట్, రైలు ప్రయాణీకుడు... ముగ్గురికీ యాదృచ్ఛికంగా ఒకే పేరు ‘నార్రాకాట్’ పెట్టారు. ఈ పేరు మరో మూడు వేర్వేరు పుస్తకాల్లో ఒక చాంబర్మేడ్, పడవవాడు, పోలీసు అధికారి పేరుగా కూడా కనిపిస్తుంది. 1974లో గుండెపోటు వచ్చి కోలుకున్నాక, ఒక సందర్భంలో అగథా క్రిస్టీని ‘‘మీరెలా గుర్తుండిపోవాలని కోరు కుంటున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘డిటెక్టివ్ కథలు రాసిన ఒక మంచి రచయిత్రిగా’’ అని ఆమె చెప్పారు. ఆశించినట్టే ఆమె డిటెక్టివ్ కథారచయిత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇంతకూ పరిష్కారం ఏమిటి?
పహల్గామ్లో తీవ్రవాదుల ఘాతుకమైన దాడి ఏప్రిల్ 22న జరిగి వారం రోజులు గడిచాయి. ప్రతిగా భారత ప్రభుత్వం దౌత్య పరమైన చర్యలు కొన్ని తీసుకున్నది గాని, దేశంలో రగులుతున్న ఆగ్రహావేశాలు చల్లారు తున్న సూచనలు లేవు. ‘కశ్మీర్ రెసిస్టెన్స్’ పేరిట దాడి జరిపిన వారిని పట్టుకుని శిక్షించటం ఒకటైతే, ఇటువంటి సంస్థలను మొదటినుంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై తగిన ప్రతీకార చర్య అన్నది అంతకుమించిన అవసరంగా సాధారణ భారతీయుల మనస్సులను దహించి వేస్తున్నది. పాక్‌తో గల సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నామన్న ప్రకటన దాని పర్యవసానాల రీత్యా తీవ్రమైనదేగానీ, అంతకుమించిన తక్షణ చర్య, సూటిగా చెప్పాలంటే సైనిక చర్యను జనం కోరుతున్నారు. తీవ్రవాదుల కోసం కశ్మీర్లో ముమ్మరమైన తనిఖీలు సాగు తున్నాయి. అనుమానితులను ఇప్పటికే పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని కొందరి ఇళ్ళను కూల్చివేస్తున్నారు. సాధారణంగా జరిగేట్లు ఇంతవరకు ఎవరినీ ఎన్కౌంటర్లలో కాల్చివేయలేదు. కశ్మీర్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్య టించి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. వైమానిక బలగాన్ని కూడా. నౌకా బలాలు విన్యాసాలు జరిపాయి. అనగా త్రివిధ బలాలు సన్నద్ధ మవుతున్నాయన్నమాట. యుద్ధంతో మనకూ నష్టమే!కొద్ది రోజులుగా ప్రతి రోజూ రాత్రి సరిహద్దు దళాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అది ‘తేలిక రకం’ ఆయుధాలతోనన్నది సైన్యం స్వయంగా చెప్తున్నమాట. తేలిక రకం అనే మాట కిందకు పలు రకాల ఆయుధాలు వస్తాయి. వాటిలో ప్రజలు వినే పేర్లు ఇన్సాస్ రైఫిళ్లు, లైట్ మెషీన్ గన్స్, సబ్ మెషీన్ గన్స్. వాటి ప్రయోగంతో రెండువైపులా ప్రాణ నష్టాలు ఇప్పటికి జరగలేదు. సరిహద్దులలో తగినంత దూరం పాటిస్తారు, బంకర్లలో ఉంటారు. గనుక ప్రాణ నష్టాలు సాధారణంగా జరగవు. తేలిక రకం ఆయుధాల వినియోగం స్థానిక కమాండర్ల నియంత్రణలో జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీ ఆయుధాల వినియోగం జరిగితేనే ఘర్షణ పైస్థాయికి వెళ్లినట్లు! త్రివిధ బలాలను అప్రమత్తం చేసినందున పూర్తి స్థాయి యుద్ధమా? 2019లో పుల్వామా వద్ద భారత సైనికులపై దాడిలో 40 మంది చనిపోయిన దరిమిలా పాకిస్తాన్‌లోని బాలాకోట్ టెర్రరిస్టు స్థావరాలపై మెరుపు దాడులు జరిపి అంతకు పరిమితం కావడం వంటిదా? కొద్దిగా ఆలోచించినట్లయితే పూర్తి స్థాయి యుద్ధానికి అవకాశం కన్పించదు. ఇండియా కన్నా పాకిస్తాన్ సైనిక శక్తి తక్కువే గానీ మరీ అంత బలహీనమైనది కాదు. యుద్ధం దీర్ఘకాలం సాగితే పాకిస్తాన్ ఓడుతుంది గానీ భారతదేశానికి కూడా తీవ్ర నష్టాలు కలుగుతాయి. యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనపరచుకోవచ్చునని ఎవరైనా భావిస్తే, కొత్త సమ స్యలు కొని తెచ్చుకోవటమవుతుంది. సగం కశ్మీర్‌తోనే ఇన్ని సమస్య లున్నాయి. అణు యుద్ధానికి ఇపుడెవరూ సుముఖంగా లేరు. కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనపరచుకునే స్థితి అంటూ కనిపిస్తే, అణు ప్రయోగానికి పాక్ సైన్యం వెనుకాడబోదు. తూర్పు పాకిస్తాన్ తమది కాకుండా పోయిందనే ఆగ్రహం వారికి ఇప్పటికీ చల్లారలేదు.అందువల్ల, అటు ఇటుగా బాలాకోట్ నమూనా ప్రతిదాడులకే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాన్ని ముదరనివ్వకండంటూ ఇప్పటికే సూచనలు చేస్తున్న అమెరికా జోక్యాలు తెర వెనుక నుంచి ఎట్లుండవచ్చునన్నది మరో ప్రశ్న. అమెరికా మాటను కాదనే శక్తి భారత, పాకిస్తాన్లలో దేనికీ లేదన్నది ఒక చేదు నిజం. కశ్మీర్లో అంతర్గతంగా టెర్రరిజంపై, మిలిటెన్సీపై ఎటువంటి చర్యలైనా భారత భద్రతాదళాలు యథేచ్ఛగా తీసుకోగలవు. ఆ చర్యలు సుమారు 1990 నుంచి 35 సంవత్సరాలుగా తీసుకుంటున్నవే.అందువల్ల కలిగిన ఫలితాలేమిటన్నది వేరే ప్రశ్న.నీటిని ఆపగలమా?ప్రభుత్వం ఇప్పటికి ప్రకటించిన చర్యలలో నిజంగా తీవ్రమైనది సింధూ ఒప్పందాన్ని సస్పెండ్ చేయటం. 1960 నాటి ఆ ఒప్పందం పాకిస్తాన్‌కు కీలకమైనది. ఆ జలాలు ఆగినా, తగ్గినా వారి వ్యవ సాయం అల్లకల్లోలమవుతుంది. కనుకనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అది తమపై ‘యుద్ధ చర్య’ కాగలదంటూ తీవ్రమైన భాషను ఉపయోగించారు. పాకిస్తాన్‌కు ‘ఒక్క చుక్క’ నీరు కూడా పోనివ్వమని భారత ప్రభుత్వ బాధ్యులు ప్రకటించనైతే ప్రకటించారు గానీ,పోకుండా ఆపటం నిజంగా సాధ్యమా? ప్రపంచబ్యాంకు ఆధ్వర్యాన జరిగిన ఈ అంతర్జాతీయ జలాల పంపిణీ ఒప్పందంలో ఐక్యరాజ్య సమితి పాత్ర ఉంది. బ్యాంకు పక్షాన ‘ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్’ (ఐబీఆర్డీ) సంతకం చేసింది. ఏదైనా వివాదం తలెత్తితే మొదట ‘తటస్థ నిపుణుని’ దృష్టికి, తర్వాత ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్’ ముందుకు వెళ్లాలి. తిరిగి ఇందులోనూ రెండు దేశాల సార్వభౌమాధికారానికి ఏది వర్తిస్తుంది, ఏది వర్తించదనే మీమాంస ఉంది. లోగడ రెండుసార్లు వాస్తవంగా యుద్ధాలు జరిగి నపుడు కూడా ఇటువంటి సస్పెన్షన్లు జరగలేదు. ఇదంతా సాంకేతిక పరమైన కోణం కాగా, నీరు అటు పోకుండా ఆపగల జలాశయ నిర్మా ణాలు అసలు ఇండియాకు లేనే లేవనీ, ఆ నిర్మాణాలకు అనేక చిక్కు లున్నాయనే ఆచరణపరమైన విషయాలను నిపుణులు ప్రస్తావిస్తు న్నారు. అనగా, ఈ చర్య ఎంత ప్రభావం చూపగలిగేది అయినా ఇప్పటికిప్పుడు జరిగేది కాదన్నమాట.వాస్తవాధీన రేఖే పరిష్కారమా?మనం విస్మరించేదేమంటే కశ్మీర్ తరహా అనేక భౌగోళిక, సరిహద్దు సమస్యలను బ్రిటిష్ వలస పాలకులు ప్రపంచమంతటా సృష్టించిపోయారు. భారత–చైనా, భారత–బంగ్లాదేశ్, పాలస్తీనా– ఇజ్రాయెల్ వంటివన్నీ అందుకు ఉదాహరణలు. తిరిగి వాటిని సొమ్ము చేసుకుంటూ పాశ్చాత్య దేశాలు ఇరుపక్షాలకూ ఆయుధాలను అమ్ముకుంటున్నాయి.కశ్మీర్‌కు సంబంధించి ఒక వివేకవంతమైన పరిష్కార మార్గాన్ని మొదటిసారిగా కనుగొన్నది 1972లో అప్పటి ప్రధానులు ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత వారు సిమ్లాలో సమావేశమై, కశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ, లేదా లైనా ఆఫ్ కంట్రోల్)ను శాశ్వత సరిహద్దుగా గుర్తించుకున్నట్ల యితే అన్ని సమస్యలూ సమసిపోగలవని సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ, తమ రాజధానులకు తిరిగి వెళ్లి ప్రజాభిప్రాయా నికి జంకి వెనుకకు పోయారు. ఆచరణాత్మకంగా ఆలోచించినట్లయితే, అది మాత్రమే ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం కాగలదా?ఇది భారత–పాకిస్తాన్ సమస్యల పరిష్కారం అయితే, ఇక మిగి లేది కశ్మీర్లో అంతర్గత సమస్యలు. మొదటిది తేలినపుడు రెండవది సగం మేర తేలుతుంది. తక్కినది అభివృద్ధి, ఉపాధి కల్పన, అవి నీతిని అదుపు చేయటం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలతో తప్పకుండా పరిష్కారమవుతుంది. ఈ మాట నేను 3 విడతలుగా 55 రోజుల పాటు కశ్మీర్ అన్ని ప్రాంతాలలో తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మాట్లా డిన మీదట అంటున్నది. 1947 నుంచి ఇంతవరకు గల కశ్మీర్ చరిత్ర నేపథ్యంలో అక్కడి ప్రస్తుత పరిస్థితులను, యుద్ధం ద్వారా ఏదైనా తేలగలదా అనే అవకాశాలను, మిలిటెన్సీ–టెర్రరిజాల హెచ్చు తగ్గుల క్రమాన్ని, ముఖ్యంగా 1987 నుంచి తీవ్రవాదం తలెత్తి సాగుతున్న కారణాలను పరిశీలించినపుడు, ఇటువంటి అభిప్రాయం ఏర్పడుతు న్నది. అందువల్ల రెండు దేశాలూ విజ్ఞతతో ఆలోచించి ఇందిరాగాంధీ–భుట్టోల స్ఫూర్తితో రాజీ మార్గానికి రావటం సమస్యను శాశ్వ తంగా పరిష్కరించి ఇరు దేశాలకు ఎనలేని మేలు చేయగలదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అభినయమే ఆభరణం.. నటీనటులకు నగలతో అనుబంధం
పెళ్లి అయినా పేరంటమైనా అయినా నగలు అలంకరించుకోవాల్సిందే అంటారు ఆభరణాల ప్రియులు.. అభినయమైనా, ఆభరణమైనా నటులు ఉండాల్సిందే అంటున్నారు ప్రచార వ్యూహాల రూపకర్తలు. తారలు ఆభరణాల లేబుల్‌ల మధ్య అనుబంధం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పాలి. కళ్యాణం అనగానే పెళ్లి మాత్రమే కాదు కళ్యాణ్ జ్యుయలర్స్ ప్రకటన కూడా గుర్తొస్తుందంటే కారణం... నాగార్జున అని చెప్పొచ్చు, అమితాబ్ బచ్చన్ అని కూడా చెప్పొచ్చు. దేశంలోని బంగారు ఆభరణాల వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాలు దాదాపు 37% వాటాను కలిగి ఉన్న నేపధ్యంలో ఈ బ్రాండ్ తమిళనాడులో ప్రభు గణేషన్, తెలుగు రాష్ట్రాల కోసం అక్కినేని నాగార్జున, కన్నడిగుల్ని మెప్పించడానికి...శివరాజ్‌కుమార్, మంజు వారియర్... ఇలా నలుగురు ప్రధాన తారలతో ఒప్పందం కుదుర్చుకుంది .నమూనాలు, శైలులు, సున్నితత్వాలు ప్రాధాన్యతలు మన దేశంలో ఉన్న భాషలు మాండలికాలు విభిన్నంగా ఉంటాయి. అందుకే మా బ్రాండ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతీయ బ్రాండ్ అంబాసిడర్‌ని ఎంపిక చేసిందని కళ్యాణ్ జ్యువెలర్స్ మార్కెటింగ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ అంటున్నారు. భారతీయ బంగారు ఆభరణాల మార్కెట్లో పశ్చిమ భారత రాష్ట్రాలు 32% వాటా కలిగి ఉన్నందున ఇదే బ్రాండ్ బాలీవుడ్ నుంచి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కత్రినా కైఫ్‌లను ఎంపిక చేసింది. గతంలో ఈ బ్రాండ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోనమ్ కపూర్ వంటి వారితో కూడా జట్టు కట్టింది.బంగారం వెలిగిపోతోంది.. ఆభరణాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే తారలతో ఆభరణాల బ్రాండ్స్ అనుబంధం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. టాలీవుడ్ హీరో యంగ్‌టైగర్ ఎన్టీయార్ మలబార్ గోల్డ్‌లో మెరిశారు. ఇక రామ్ చరణ్ భీమా జ్యుయలర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు కుమార్తె సితార సైతం ప్రముఖ ఆభరణ బ్రాండ్ పిఎంజె జ్యుయల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. గతంలో గానీ ప్రస్తుతం గానీ... చూసుకుంటే బ్రాండ్ అంబాసిడర్స్‌గా కావచ్చు కలెక్షన్లను ఆవిష్కరించిన సెలబ్రిటీలుగా కావచ్చు... ర్యాంప్ మీద ఆభరణాలను ప్రదర్శించి కావచ్చు..విభిన్న రకాలుగా అనేక మంది నటీనటులు నగధగలకు తమ స్టార్ డమ్ మెరుపులను జత చేశారు.ఒక్కసారి పరిశీలిస్తే...నటి తమన్నా భాటియా వైట్ అండ్ గోల్డ్ బ్రాండ్‌ను స్వయంగా లాంచ్ చేసింది. అంతేకాదు ఆమె హెడ్ డిజైనర్‌గానూ పనిచేస్తోంది. గతంలో ఓ ఆభరణాలను తాకట్టుపెట్టుకునే మరో బ్రాండ్‌కు ఆమె ప్రచారం చేసింది. బాలీవుడ్ నటి దిశా పటానీ రిలయన్స్ జ్యువెల్స్ రూపొందించిన మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబింబించే ’వింధ్య కలెక్షన్’ను ఆవిష్కరించారు. త్రిభువన్ దాస్ భీమ్జీ జువేరీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌ను నియమించుకుంది. భీమా జ్యువెలర్స్‌కు మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్, బాలీవుడ్ నటి పూజా హెగ్డే పనిచేస్తే, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. అంతగా పాప్యులర్ కాని ఓ మోస్తరు నటీమణులను సైతం బ్రాండ్స్ ఎంపిక చేసుకోవడం విశేషం. వెడ్డింగ్ పులావ్, గులాబీ లెన్స్ వంటి సినిమాల్లో పలు వెబ్‌సిరీస్‌లలో నటించిన అనుష్కా రంజన్ వరుణ డి జానీ అనే ఆభరణ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెరిసింది. ఖన్నా జ్యువెలర్స్ నగల ప్రచారంలో నటి చిత్రాంగద సింగ్ పనిచేసింది.కలెక్షన్స్ విడుదల్లోనూ...బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడంతో పాటు కేవలం ఒక కలెక్షన్స్‌ను మాత్రమే ప్రదర్శించడం, విడుదల చేయడం వంటివి కూడా తారలు చేస్తున్నారు.తాప్సీ పన్ను రిలయన్స్ జ్యువెల్స్ ’తంజావూర్ కలెక్షన్’ను లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు. జాన్వీ కపూర్ సైతం అంతకు ముందే ఈ తంజావూర్ కలెక్షన్‌ను పరిచయం చేశారు. బెంగాలీ నటి రితాభారి చక్రబర్తి గత ఏడాది కల్యాణ్ జ్యువెలర్స్ అక్షయ తృతీయ ప్రత్యేక కలెక్షన్స్‌ను ప్రారంభించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి పిసి జ్యువెలర్స్ బంగారు ఆభరణాలు సతీసమేతంగా ప్రదర్శించాడు. బంగారు ఆభరణాలను మాత్రమే కాదు బంగారంతో అనుబంధం ఉన్న ప్రతీ దాంట్లో తారలు తళుక్కుమంటున్నారు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన ప్లస్ గోల్డ్ కు సోనాక్షి సిన్హా ప్లస్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది. అలాగే బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకునే ముత్తూట్ ఫైనాన్స్‌కు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ జట్టు కట్టారు.ప్రతి పండుగ సీజన్లో మాదిరిగానే అక్షయ తృతీయ రోజున ప్రింట్ మీడియా సిటీ హోర్డింగ్‌లలో గోల్డ్ ఫీవర్ కనిపిస్తుంది. విలాసవంతమైన, మెరిసే ఆభరణాలను ధరించిన బాలీవుడ్, దక్షిణ భారత సినిమాలకు చెందిన తారల ప్రకటనలతో నిండిపోతాయిు. అయితే ఒక సెలబ్రిటీ పని బ్రాండ్ తాజా కలెక్షన్స్‌ను ప్రదర్శించేందుకు పోజులివ్వడమే కాదు – ఇది సీజన్ ట్రెండ్లు సమయాలు సందర్భాలను దృష్టిలో ఉంచుకుని వీరు తప్పనిసరిగా సోషల్ మీడియాలో బ్రాండ్ గురించి మాట్లాడాలి బ్రాండ్ ఆభరణాలను ధరించి ఈవెంట్స్‌లో కనిపించాలి. ఒప్పందాల గోప్యత కారణంగా సెలబ్రిటీ ఎండార్స్మెంట్ల కోసం కేటాయించిన ఖర్చుల గురించి చాలా బ్రాండ్లు పెదవి విప్పడం లేదు. అయితే ప్రతి ప్రచారానికి సెలబ్రిటీని బట్టి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 1 కోటి అంతకంటే ఎక్కువ ముట్టచెబుతారని పరిశ్రమలోని సీనియర్లు చెబుతున్నారు. -
ఈ ప్రశ్నకు జవాబు ఉందా?
ఒక సీజనల్ పొలిటీషియన్ ఎంత ‘లోతు’ తక్కువ రాజకీయాలు చేయగలిగితే,అంతలా వేగంగా మాటలు మారుస్తూ, ఎన్నాళ్ళు అయినా ఎలాగోలా అధికా రంలో ఉండగలడు. అయితే ఒక లీడర్‌గా వారి స్థాయి ఏమిటి అనేది రేపు చరిత్ర ఎటూ రికార్డు చేస్తుంది. తమదొక ‘పొలిటికల్ ఫిలాసఫీ’ అని ఇటువంటివారు నమ్మబలికితే, ‘అదే మని’ ఎవరూ ప్రశ్నించరు. అదేమిటో చెప్పలేక పోయినా, అదేమిటో ఎవరికీ తెలియకపోయినా, అప్పటికే దాని నుంచి ఫలాలు కోసుకునే వర్గం వారి వెనుక తమ ‘టర్న్’ కోసం కనిపెట్టుకుని ఉండి గుంపుగా తయారై ఆ నాయకునికి సమర్థన కూడా మొదలవుతుంది. విషయాల లోతులు మనకు అక్కర లేనప్పుడు, ఆ మేరకే మన ఎంపికలు కూడా ఉంటాయి. అక్కడ ఎక్కువ ఆశించడం తప్పు. ఇటువంటి చోట – ‘నువ్వు నన్ను నమ్మనప్పుడు, నిన్ను నేను మాత్రం ఎందుకు నమ్మాలి?’ అనే లాజిక్ నాయకునికి ఎటూ ఉంటుంది. ఇలా పరస్పర విశ్వాసాలు లేకుండానే ఎన్నికయిన నాయకులకు ఈ అధి కారం, తమకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని వారు అను కోరు కనుక ఇప్పటికి ఇదే ప్రస్తుతం.బ్రిటిష్ పాలన తర్వాత కూడా యాభై–అరవై దశకాల్లో భూమి–నీరు–వ్యవసాయం కేంద్రితంగా మన రాష్ట్ర రాజకీయాలు ఉండేవి. కారణం ప్రజలు జీవన సంస్కృతి ఆ రెండింటి చుట్టూనే ఉండేది. అయితే, డెబ్బై దశకంలో వచ్చిన ‘జై ఆంధ్ర’ ఉద్యమ రూపంగా పొడచూపిన 1972 నాటి సాంఘిక సంజ్ఞను సకాలంలో మనం అర్థం చేసుకోలేక పోయాం. అప్పుడే దాన్ని గుర్తించి దాన్ని ‘అడ్రెస్’ చేసి ఉంటే, మన పరిస్థితి మరోలా ఉండేది. అప్పట్లో ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు మొదలైన రైతు కుటుంబాల యువత ఉపాధి వలసల తీవ్రత తగ్గేది. ఆ వలసల ఒత్తిడితో ఆ దశకం చివర 1978లో కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు అవసరం అయింది. రంగా రెడ్డి ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ వద్ద ఆంధ్రుల రద్దీతో విషయం అర్థమయినా అప్పటికే ఇక్కడ కొత్తగా మహిళా కళాశాలలు కూడా మొదలయ్యాయి.ఏమైంది, గుప్పిట్లోని ఇసుకలా కాలం కళ్ళముందు అలా జారిపోయింది. వెనక్కి తిరిగివచ్చి చూసుకుంటే, ఒకప్పటి తయారీ రంగం ఉపాధి అవకాశాల్ని ‘సర్వీస్ సెక్టార్’ ఆక్రమించాక, మూడు దశాబ్దాలుగా ఎక్కడా నిలకడ లేని ఉపాధిరంగం మిగిలింది. ఇప్పుడు ఉన్నది భుజానికి సంచి (షోల్డర్ బ్యాగ్ఎంప్లాయ్మెంట్) ఉపాధి. ఇక్కడ ఉద్యోగే కాదు,కంపెనీ అధిపతిది కూడా అమూర్త (రూపం తెలి యని) స్థితే. ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో అది ఎన్నాళ్ళో తెలియని స్థితి.అయినా ‘లీడర్’ అంటే ప్రజలు–ప్రాంతము పక్షంగా నిలబడి, అక్కడి సామాజిక పర్యావరణానికి తగిన ‘జియో–ప్లానింగ్’తో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన వాతావరణం సృష్టించాలి. మన ప్రయోజనాలు కాపాడుకుంటూనే, మనవి కాని బయట పవనాల వేగాన్ని అతడు ఎదుర్కోవాలి. అది లేకపోగా ముప్పై ఏళ్ళుగా ఏదొచ్చినా అదంతా నా వల్లనే అని ‘క్లెయిం’ చేసుకునే పరిస్థితి. ఇక్కడే అస్సలు ఒక నాయకుడి మూలాలు ప్రశ్న అవుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు (74) కాలం చూస్తే, 1995 నుంచి తొమ్మిదేళ్లు; మధ్యప్రదేశ్ దిగ్విజయ్ సింగ్ (78) 1993 నుంచి పదేళ్ళు, శరద్ పవార్ (84) మహరాష్ట్రలో 1988 నుంచి 1995 వరకూ కనిపిస్తారు. వీరిలో చంద్రబాబుది తప్ప మిగతా ఇద్దరిదీ రాజకీయ కుటుంబ నేపథ్యం. దిగ్విజయ్ సింగ్ తండ్రి 1951లో శాసనసభ్యులు, శరద్ పవార్ తండ్రి 1937–1952 మధ్య మూడుసార్లు జిల్లా బోర్డు సభ్యుడు, ఖాదీ, సహకార చక్కెర రైతు సంఘాల రాష్ట్ర నాయకుడు. అయితే, ఈ కాలంలో స్వయం ప్రతిభతో ఎదిగిన నాయకుడు లాలూప్రసాద్ యాదవ్. పట్నా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా చేస్తూ 1977లో 29 ఏళ్లకే ఎంపీగా పార్లమెంట్‌లోకి వెళ్ళిన అరుదైన చరిత్ర ఆయనది. బిహార్‌పై వీరి బలమైన ప్రభావం 1990–1997 వరకూ ఉంది. ఆయన సతీమణి రబ్రీదేవి ప్రభావం 2000–2005 వరకూ కనిపిస్తుంది. స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం గురించి సమీక్ష అంటే, దాన్ని మండల్ కమీషన్ నివేదిక అమలు, పి.వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ఈ పూర్వరంగంలో విధిగా చూడాలి. అలా ‘లాలూ– బిహార్’ లోతుల్ని కనుక వెతికితే ఏముంది? ఒక ప్పుడు ఆసియా జ్ఞాన కేంద్రాలకు నెలవైన బిహార్‌లో ‘రీ మ్యాపింగ్ ఇండియా’ మొదలై– జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ అనే మరో రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.వీరితో పోల్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డికి సీఎంగా గత అనుభవం లేదు, అయినా ‘జై ఆంధ్ర’ ఉద్యమ 50 ఏళ్ళ చరిత్ర తర్వాత, జరిగిన రాష్ట్ర విభజన వల్ల ‘పరిపాలన–అభివృద్ధి–సంక్షేమం–ఉపాధి’ రాష్ట్రం అంచులకు చేరేలా ‘జియో–ప్లానింగ్’ చేశారు. మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసి, 26 జిల్లాలతో తన వికేంద్రీకరణ పని మొదలు పెట్టారు. ఆ పాలనలోని మంచి–చెడులు గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అది సహజం కానీ, పార్టీలకు రాజకీయా లకు బయట ఉండి రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలో చించేవారు, ఏపీకి కీలకమైన కాలంలో తాము ఎంత బాధ్యత కలిగిన పౌరసమాజంగా ఉన్నాం? అనే ప్రశ్నకు మాత్రం జవాబు వెతుక్కోవలసి ఉంటుంది.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
పాక్‌కు ఏది సరిపోయే శిక్ష?
పహల్గామ్లో 26 మంది పౌరులను కాల్చి చంపిన భయంకర ఉగ్రదాడి తర్వాత భారత్ లో పాకిస్తాన్ పై ఆగ్రహం పెరుగుతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) కటువైన ప్రకటన విడుదల చేసింది. దాడి చేయడంలో ఉగ్రవాదులు ప్రదర్శించిన క్రూరత్వాన్ని చూస్తే ఆ ఆగ్రహం ఆశ్చర్యం కలిగించదు. పాక్ మీడియా వ్యాఖ్యాతలు ఇస్లామాబాద్‌ను ఇరికించడానికి భారతదేశమే ఈ దాడిని నిర్వహించిందని దారుణమైన ఆరోపణ చేస్తున్నారు. స్పష్టంగా, వారు ఘోరమైన పరిణామాన్ని ఆశిస్తున్నారు.భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన కావలసిన అన్ని అంచనాలను తీర్చింది. న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ లోని ఛార్జ్ డి’అఫైర్ సహా 14 మంది సిబ్బంది ఇంకా మిగిలి ఉన్నప్పటికీ, పాక్ సైనిక సలహాదారులు, ఇతర సహాయక సిబ్బందిని భారత్ విడిచి వెళ్ళమని ఆదేశించారు. ఇది పాక్ సైనిక సంస్థపై పూర్తిగా నిందను మోపుతుంది. అటారీ చెక్‌పోస్ట్ మూసివేయడం, మిగిలిన వీసా ప్రోటోకాల్స్‌ని నిలిపివేయడం కూడా ఊహించినదే. పాక్‌పై తీవ్రమైన ప్రభావం కలిగించడానికి భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించలేదు. గత సంవత్సరం చివర్లో, సింధునదీ జలాల ఒప్పందంపై తిరిగి చర్చలు జరిగే వరకు సింధునదీ జలాల కమిషన్ సమావేశాలను నిర్వహించడానికి కూడా భారత్ నిరాకరించింది.కేవలం నిలిపేసింది!భారత్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికి పాకిస్తాన్ అతి స్వల్ప కారణాలను చూపుతూ సింధు జలాల ఒప్పందాన్ని ఉపయోగించుకుంటోంది. ఒప్పందంలో ఇరు దేశాల కమిషనర్లు సహా మూడు అంచెల వివాద యంత్రాంగం ఉంది. అది విఫలమైనప్పుడు, 1960లో ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకు ఒక తటస్థ నిపుణుడిని నియమిస్తుంది. అది కూడా పని చేయకపోతే, మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయవచ్చు. 1970లలో, భారతదేశం సలాల్ (జమ్ము–కశ్మీర్) ఆనకట్ట ఎత్తును తగ్గించి, దాని అవుట్లెట్లను తెరిచి వేయవలసి వచ్చింది. దీనివలన ఆనకట్ట ఉపయోగం తగ్గి భారీగా బురద చేరి, కోతకు గురైంది. మరొక సందర్భంలో, బాగ్లిహార్ ఆనకట్ట (జమ్ము–కశ్మీర్) 14 ఏళ్ల ఆలస్యాన్ని ఎదుర్కొంది. కిషన్‌గంగా ప్రాజెక్టు మరింత ఇబ్బందులకు గురైంది. ప్రపంచ బ్యాంక్ నియమించిన తటస్థ నిపుణుడు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడే పాక్ మధ్యవర్తిత్వ స్థాయికి వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత నీటి కొరత ఉన్న దేశాలలో పాకిస్తాన్ 15వది. భారతదేశం ప్రస్తుతం జలాల ఒప్పందాన్ని కేవలం ‘నిలిపివేసింది’. సరిహద్దుకు అవతలి వైపు ఉన్న బాధ్యతాయుతమైన మనుషులు ఈ స్వల్పభేదాన్ని అర్థం చేసుకోవాలి.అయితే, ఇవేవీ భారతదేశ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేవు. భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన ‘ఇటీవల తహవ్వుర్ రానాను వెనక్కి రప్పించినట్లే, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లేదా వాటిని సాధ్యం చేయడానికి కుట్ర పన్నిన వారిని వెంబడించడంలో భారతదేశం అవిశ్రాంతంగా ఉంటుంది’ అని పేర్కొంది. ఉగ్రదాడి తర్వాత ప్రధాని బిహార్‌లో ఉద్దేశపూర్వకంగానే ఇంగ్లీషులో మాట్లాడుతూ, ‘భారతదేశం ప్రతి ఉగ్రవాదినీ, వారికి మద్దతు ఇచ్చేవారినీ గుర్తించి, వెంబడించి, శిక్షిస్తుంది. మేము వారిని భూమ్మీద ఎక్కడున్నా దొరికించుకుంటాం’ అన్నారు. ఉగ్రవాదాన్ని శిక్షించే చర్యలు దీర్ఘకాలంపాటు కొనసాగుతాయని ఈ ప్రకటన సూచిస్తుంది.ఎలా దాడి చేయొచ్చు?కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఏమి సాధ్యమవుతుంది అంటే కచ్చితంగానే బాలకోట్ తరహా దాడి సాధ్యం కాదు. ఈసారి, పాక్ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. స్పష్టమైన ప్రత్యామ్నాయం ఏమిటంటే, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను గుర్తించే లక్ష్యంతో భారత భూభాగం నుంచే 290 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించడం. అది భారత్ తనదని చెప్పుకొంటున్న ప్రాంతం కాబట్టి ఇది సాంకేతికంగా పాకిస్తాన్‌పై దాడి కాదు. మరింత కావాల్సిన లక్ష్యం లష్కర్–ఎ–తొయిబా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న మురిద్కే. ఇది లాహోర్‌కు దగ్గరగా, భారత సరిహద్దు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంది. సాయుధ డ్రోన్ లను ఉపయోగించి కూడా దీనిపై దాడి చేయవచ్చు. దీని వలన కచ్చితత్వంతోపాటు ఎటువంటి ఆనుషంగిక నష్టం ఉండదు.కానీ ఏదైనా సరే, ఎంత సమర్థనీయమైనా సరే, అది యుద్ధ చర్యే. పాకిస్తాన్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలకోట్ తరువాత, అది జాగ్రత్తగా దాడి చేసింది. పెద్దగా నష్టం కలిగించకుండా ప్రతిస్పందనను నమోదు చేసింది. దానికి ప్రధానంగా అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బాజ్వా కారణం. ఆయన దేశ సొంత ప్రయోజనం కోసం పాక్ అంతటా భారతదేశానికి వాణిజ్యాన్ని ప్రతిపాదించిన వాస్తవికవాది. కానీ, యుద్ధం, దాని అన్ని తీవ్రతరమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుత చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వివేకవంతమైన వ్యూహకర్త కాదు. భారతదేశం ఈ యుద్ధాన్ని భరించగలదు. అయినప్పటికీ ముఖ్యంగా ఆయుధాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పుడు ఇది అత్యంత వ్యర్థమైన ఖర్చు.ముక్కలుగా కత్తిరిస్తే!భారత్ యుద్ధాన్ని కాకుండా, ఆర్థిక వృద్ధిని కోరుకుంటోంది. పాక్ నిజంగా యుద్ధాన్ని భరించలేదు. పైగా అంతర్జాతీయ ద్రవ్య నిధి అటువంటి ఖర్చులను దయతో చూస్తుందా లేదా అనేది విషయం కాదు... వాస్తవం ఏమిటంటే, ఆ దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు సంక్షోభంలో ఉన్నాయి. ఇది జెట్ ఇంధనం విషయంలో తీవ్రమైన కొరతకు దారితీస్తుంది. గత తొమ్మిది నెలల్లో ఆరు ప్రధాన శుద్ధి కర్మాగారాలలో ఏవీ చమురు పంపిణీ చేయలేదు. కనీస జ్ఞానం ఉన్న ఏ దేశమైనా, కీలకమైన ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభించదు. అయినా భారత్‌ను పాక్ యుద్ధంలోకి లాగాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. దానికి పోయేది ఏమీ లేదు. అందుకే తక్కువ ‘ఆడంబర’ ప్రత్యామ్నాయం ఏమిటంటే, ఎల్ఓసి అంతటా ఫిరంగి కాల్పులు జరపడం. కానీ మన వైపు పౌరులకు కూడా నష్టాలు ఉంటాయి. పైగా ఈ మొత్తం విన్యాస ప్రయోజనమే ప్రశ్నార్థకం అవుతుంది. ఏమైనప్పటికీ ఉగ్రవాదులు చొరబడతారు. ఏమైనా పాక్ కోరుకుంటున్న దిశలో ఇండియా కొట్టుకుపోకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా, చాలా నైపుణ్యంతో పాక్‌ని శిక్షించడాన్ని ఎంచుకోవాలి.చాలా కాలంగా, పాకిస్తాన్ రెండు వైపులా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని అందరూ గుర్తించారు. పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేసేవరకు సంబంధిత దేశాలు ఆంక్షలు విధించాలని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఆంక్షలనేవి పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. ఇకపై పాక్ సైన్యాధికారులు సౌకర్యవంతమైన విదేశాల పర్యటనలు చేయకుండా చూడాలి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి వచ్చే అన్ని బాహ్య నిధులకు అడ్డుకట్ట వేయాలి.అవును, చాలా దేశాలు పాక్‌ను శిక్షించే కార్యక్రమంలో చేరవు. ఉగ్రవాదాన్ని ఎంత ఇష్టపడకపోయినా, పాక్‌ని శిక్షించని దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే పాక్ కోరుకోని విధంగా, దీర్ఘకాలంగా అణచివేతకు గురైన బలూచ్‌లు, పష్తూన్లకు బహిరంగ మద్దతు ప్రకటించే సమయం ఇదే కావచ్చు. ఇది పాక్ రహస్య వ్యూహాల అనుకరణ కాకూడదు. ఇది ప్రపంచాన్ని ముందుకు రావాలని పిలుపునిచ్చే బహిరంగ మద్దతుగా ఉండాలి. ఇక జరిగింది చాలు, పాక్‌కు దాని స్థాయేమిటో తెలియజెప్పాలి.తారా కార్థా వ్యాసకర్త డైరెక్టర్ (పరిశోధన), సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
తహవ్వుర్ రానా (26/11 సూత్రధారి) రాయని డైరీ
‘‘రేపటితో నీ రిమాండ్ ముగుస్తుంది...’’ అన్నాడు నా లాయర్. ‘‘తర్వాత ఏం జరుగుతుంది?’’ అని నేను నా లాయర్ని అడగలేదు. నా తరఫున వాదించటానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాయర్ అతడు. ‘ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ’ నుంచి వచ్చాడు. గవర్నమెంట్ డబ్బులిచ్చి నడిపిస్తున్న లీగల్ అథారిటీ నుంచి, గవర్నమెంటే ఏర్పాటు చేస్తే నా కోసం వచ్చిన లాయర్‌ను నేను అడిగేది ఏముంటుంది? అతని పేరేమో పీయూష్ సచ్దేవ!‘ఏమైనా తిన్నావా?’ అంటాడు!‘ఏమైనా అన్నారా?’ అంటాడు! ‘ఆరోగ్యం ఎలా ఉంది?’ అంటాడు. ‘ఇక ఉండేదా మరి?!’ అంటాడు.ఈ నాలుగే... రోజు మార్చి రోజు అతడు నన్ను అడిగే ప్రశ్నలు. ఊరికే వస్తుంటాడు, పోతుంటాడు. ‘ధైర్యంగా ఉండు, న్యాయం గెలుస్తుంది..’ అంటాడు! నేనడిగానా ‘నాక్కాస్త ధైర్యమివ్వు’ అని, నేనడిగానా ‘న్యాయాన్ని గెలిపించు’ అని!!ఒకరోజు వచ్చాడు. ‘‘నువ్వు మందులేమీ వేసుకోవటం లేదనీ, కనుక నువ్వు చెప్పుకుం టున్నట్లుగా నీకు 33 అనారోగ్యాలేమీ లేవనీ, అందుచేత నీ ఇంటరాగేషన్ టైమ్‌ను తగ్గించే అవసరం లేదనీ వాళ్లు వాదించబోతున్నట్లు తెలిసింది...’’ అన్నాడు! ‘‘నువ్వూ, వాళ్లూ నా గురించి ఏదైనా వాదించుకోండి. అది నాకు సంబంధం లేని విషయం. నాకైతే ఒక ఖురాన్, ఒక పెన్ను, కొన్ని తెల్ల కాగితాలు తెప్పించు...’’ అన్నాను. తెప్పించాక, ‘‘ఇవన్నీ ఎందుకు?!’’ అని అడిగాడు.‘‘పవిత్ర ఖురాన్ గ్రంథం నా డాక్టర్. ఆ డాక్టర్ నాకు ప్రిస్క్రిప్షన్ రాయటానికి ఈ పెన్ను, ఈ తెల్ల కాగితాలు. ప్రవక్త సూక్తులే నేను వేసుకునే మందులు...’’ అని చెప్పాను.తర్వాతి విజిట్‌లో ... ‘‘నా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించగలవా?!’’ అని అడిగాను.‘‘కష్టం కావచ్చు’’ అన్నాడు. ‘‘ఎందుకు కష్టం కావచ్చు?!’ అన్నాను. ‘‘మీ ‘కుటుంబ సభ్యులు’ ఒకరు పాకిస్తాన్ లో 78 ఏళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకొకరు లాహోర్, రావల్పిండి వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ వారు జైల్లో ఉన్నారని పాకిస్తాన్ అంటోంది కనుక జైల్లోంచి మాట్లాడటం కుదరదు. మీ మిగతా కుటుంబ సభ్యులు పాకిస్తాన్‌లోని కోట్ లఖ్‌పట్ జైల్లో వెంటిలేటర్ మీద ఒకరు, అమెరికా జైల్లో ఒకరు, ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో ఒకరు ఉన్నారు. కాబట్టి వారందరితో ఫోన్లో మాట్లాడించటం కష్టం’’ అన్నాడు నా లాయర్! నా చేతిలో కనుక ఒక గన్ ఉండి ఉంటే అక్కడికక్కడ... అది ఎన్.ఐ.ఎ జైలు అని, నేను పోలీస్ రిమాండ్‌లో ఉన్నానని కూడా చూడ కుండా రూఫ్ టాప్ మీదకు బులెట్‌ని పేల్చి అతడి భయాన్ని కళ్లజూసేవాడిని!‘‘నేను మాట్లాడతానంటున్నది నా కుటుంబ సభ్యులతో మిలార్డ్...’’ అన్నాను నా లాయర్‌తో, కోపంగా. ‘‘కానీ అవతలి వైపు వాళ్లు ఇలాగే వాదిస్తారు మిస్టర్ తహవ్వూర్. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం...’’ అన్నాడు. రెండు రోజుల తర్వాత వచ్చి – ‘‘మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి జడ్జి గారు ‘నాట్ అలౌడ్’ అనేశారు...’’ అని చెప్పాడు.అతడు అటు వెళ్లగానే, ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ వచ్చి కూర్చున్నాడు. ‘‘నువ్వు 26ని వదిలి పెట్టటం లేదా? లేక 26 నిన్ను వదిలిపెట్టటం లేదా?’’ లేక... నువ్వూ, 26 కలిపి ఈ దేశాన్ని వదిలిపెట్టటం లేదా?’’ అన్నాడు!నాకర్థమైంది! నా రిమాండ్ రేపే ముగిసి, మళ్లీ రేపే మొదలు కాబోతోంది. ‘‘చెప్పు... మొన్న పహల్గామ్లో 26 మందిని చంపిన టెర్రర్ ఎటాక్ వెనుక నీతో పాటు ఎవరెవరు ఉన్నారు?’’ అని ఫ్రెష్‌గా ఇంటరాగేషన్ మొదలుపెట్టాడు ఎన్.ఐ.ఎ. ఆఫీసర్!! -
పార్టీ స్థాపనకు ఏడాది ముందు...
టీఆర్ఎస్ ఆవిర్భవించే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ లక్ష్య శుద్ధితో విజయం సాధించాలని కేసీఆర్ పార్టీని స్థాపించారు. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్ రెండు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాలు. వీరికి ధన బలంతో పాటు ప్రసార మాధ్యమాల తోడు ఉంది. ఒక్క అంశం అనుకూలంగా లేని, చుట్టూ గాఢాంధకారం అలుముకున్న ప్రతికూల పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు సాహసోపేతం. ఈ సాహసం ఒక్క కేసీఆర్‌కే చెల్లు.విస్తృత చర్చలు– సంతృప్తికర వివరణలుతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపనకు ఒక సంవత్సరం ముందు నుండే సన్నాహాలు, చర్చలు ప్రారంభమయ్యాయి. పార్టీ పేరు, జెండా, కండువా 2000 లోనే నిర్ణయమైనాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన నాటి పరిస్థితుల సమీక్ష జరిగింది. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను, తనపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మల్చుకొని కేవలం 9 మాసాల కాలంలోనే ఎన్టీయార్ అధికారం చేపట్టిన విషయం ప్రస్తావనకొచ్చింది.పార్టీ పెట్టాలనుకునే విషయం తెలిసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష దీపాన్ని ఆరిపోకుండా అప్పటివరకు కాపాడుతున్న సంఘాలు... తెలంగాణ జన సభ, తెలంగాణ మహా సభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్, తెలంగాణ లాయర్స్ అసోసియేషన్, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ స్టడీ ఫోరం, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ జన పరిషత్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ జన సంఘటనలకు చెందిన కొందరు వచ్చి చర్చించడం, తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం జరిగింది. మరికొందరిని కేసీఆరే స్వయంగా ఆహ్వానించి చర్చించారు. తెలంగాణలోని ప్రముఖుల వివరాలను సేకరించి, సందర్భానుసారంగా వారితోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. వారిలో దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, వైస్ ఛాన్స్లర్లు నవనీత రావు, ఆర్వీయార్ చంద్రశేఖర్ రావు, జయశంకర్, జస్టిస్ సీతారాం రెడ్డి, గౌరవ నిఖిలేశ్వర్, ‘ప్రెస్ అకాడమీ’ పొత్తూరి వెంకటేశ్వరరావు, జస్టిస్ భాస్కర్ రావు, ప్రొఫెసర్లు మధుసూదన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కోదండరాం రెడ్డి, సింహాద్రి, బియ్యాల జనార్ధన రావు, కంచె ఐలయ్య, కేశవరావు జాదవ్, జల సాధన సమితి దుశర్ల సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రభాకర్, ప్రజ్ఞా మ్యాగజైన్ కెప్టెన్ పాండురంగ రెడ్డి తదితరులున్నారు. వీరిలో చాలామందితో సంప్రదింపులు జరిపి, వారి సూచనలు స్వీకరించారు.తెలంగాణ మేధావులు, విద్యావంతులు, యువకులు, కవులు, కళాకారులతో చర్చలు సాగిస్తూనే, మరొవైపు తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తన వద్దకు వచ్చేవారి సందేహాలన్నిటికీ సవివరమైన, సంతృప్తికరమైన వివరణ ఇచ్చి, అప్పటివరకు అపనమ్మకం ఉన్నవారిలో సంపూర్ణ విశ్వాసం పెంచేవారు. వివిధ పార్టీలలో పనిచేసే నాయకులు ఎవరికి వారుగా కేసీఆర్‌ను కలిసి, చర్చించి, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాత కలిసి పనిచేయడానికి సంసిద్ధత చెప్పేవారు. ఇటువంటి వారిలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, దేశిని చిన్న మల్లయ్య, నాయిని నర్సింహారెడ్డి లాంటి పెద్దలు ఉన్నారు. ఒకానొక సందర్భంలో లక్ష్మీకాంతరావు ‘తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనా? ఎలా సాధ్యమవుతుంది?’ అని సంశయం వ్యక్తం చేయగా, కేసీఆర్ ఇచ్చిన సుదీర్ఘ వివరణ అనంతరం, ‘తెలంగాణ సిద్ధించిందనే భావన మీ జవాబుతో నాకు కలిగింది. ఇక నుండి ఎప్పుడు ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేయను, వివరణ కోరను. తెలంగాణ సాకారం అయ్యేంత వరకు మీతోనే నా పయనం’ అని ఉద్విగ్నుడయ్యారు. స్టేట్ ఫైట్– స్ట్రీట్ ఫైట్ కాదు!వివిధ రాజకీయ పార్టీల నాయకుల, కార్యకర్తల తాకిడి రోజురోజుకు పెరుగుతూ రేయింబవళ్ళు చర్చోపచర్చలు సాగేవి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే చర్చలు మధ్యరాత్రి వరకు జరిగేవి. కొన్ని సందర్భాల్లో తెల్లవారు వరకు ఈ చర్చలు జరిగేవి. ఒకరిద్దరు ఉన్నా, పది మంది ఉన్నా, వందలాది మందిలో ఉన్నా కేసీఆర్ నాలుగైదు గంటలు నిరాఘాటంగా తెలంగాణ ఉద్యమం సాగించే క్రమాన్ని సోదాహరణలతో సహా వివరించేవారు. వారు లేవనెత్తిన సంశయాలకు సంతృప్తికర సమాధానం ఇచ్చి, వచ్చిన వారిలో అత్యధికులను ఉద్యమ కార్యోన్ముఖులను చేసేవారు. ఒకట్రెండు సందర్భాల్లో ఉద్యమం ఆవేశభరితంగా, ఆందోళన పథంలో సాగాలని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయగా... ఇది స్టేట్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ కాదనీ; లక్ష్యం సాధించే వరకు సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావాలనీ; పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి భావవ్యాప్తిని సాగించి, ప్రజలను సమీకరించి, శక్తిగా మలిచి, ఎన్నికల్లో గెలిచి, గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గంలోనే రాష్ట్రం సాధించాలనీ; ఒక ప్రాంతానికి న్యాయం జరగాలని చేసే ఈ ప్రయత్నంలో ఇంకొక ప్రాంతం వారికి ఇబ్బందులు కలిగించడం వాంఛనీయం కాదనీ; తాను శాంతియుత పంథాలో మాత్రమే పయనిస్తాననీ కరాఖండిగా చెప్పేవారు. ఈ విధానం నచ్చని కొందరు మళ్ళీ వచ్చేవారు కాదు. సంకీర్ణాల్లో ఒక్క ఓటైనా విలువే!2000వ సంవత్సరంలో తెరాస పార్టీని స్థాపించవలెననే చర్చలు సాగుతున్న తరుణంలో దేశ రాజకీయ చిత్రపటం అనుకూలంగా ఉందా లేదా అనే సమీక్ష కూడా జరిగింది. కారణం గతంలోని చేదు అనుభవం. అయితే 1969 – 71 నాటి రాజకీయ పరిస్థితులకు పూర్తి భిన్నమైన పరిస్థితులు అప్పుడు నెలకొన్నాయి. ఒకప్పుడు ఇందిరా గాంధీ భారీ మెజారిటీతో ఏక పార్టీ పాలన సాగింది. తదనంతరం కొన్ని దశాబ్దాలు తక్కువ మెజారిటీతో ఏక పార్టీ పాలన, అటుపిమ్మట సంకీర్ణ ప్రభుత్వాల కాలం సాగుతోంది. సంకీర్ణ యుగం రాష్ట్రం సాధించుకోవడానికి అనువైనదిగా తేలింది. 1999వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షను కోల్పోయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభలో ఒక సభ్యుడి ఓటు కూడా అత్యంత కీలకంగా మారిన ఈ పరిణామం ప్రస్తావనకు వచ్చింది. అంటే సంకీర్ణాల యుగంలో మూడు, నాలుగు లోక్‌సభ స్థానాలతో కూడా జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించవచ్చని తేలింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ప్రజా సమితిని 14 స్థానాల్లో పదింట గెలిపించారు. టీఆర్ఎస్ చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉద్యమాన్ని నడిపి ప్రజా విశ్వాసాన్ని పొందగలిగితే, కచ్చితంగా లోక్‌సభకు చెప్పుకోదగిన సంఖ్యకు ప్రతినిధులను తెలంగాణ ప్రజలు తప్పక గెలిపిస్తారనే నమ్మకం కలిగింది. 10 మంది లోక్‌సభ సభ్యులున్నప్పటికీ 1971లో తెలంగాణ రాష్ట్రం సాధించబడక పోవడానికి బలమైన కారణం లోక్‌సభలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని సంఖ్యా బలం ఉండటమే. నాడు అధికార బలంతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజా సమితి సభ్యులను విలీనపర్చుకుంది. కానీ దానికి భిన్నంగా నేడు సంకీర్ణాలే శరణ్యం కాబట్టి పార్లమెంట్లో కనీస ప్రాతినిధ్యంతో ఒత్తిడి ద్వారా రాష్ట్రాన్ని సాధించవచ్చని నమ్మకం కుదిరింది. తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనని సంపూర్ణ విశ్వాసం కలిగిన కేసీఆర్... శాసన సభ్యత్వానికి, డిప్యుటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ప్రజలను ఆలోచింపజేసి, ఆశలు రేకెత్తించి విశ్వాస బీజాలు నాటారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్ 27న పార్టీ జెండా ఎగురవేయబడింది. పదవీ త్యాగంతో పార్టీ స్థాపించారు, ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రం సాధించారు. వ్యాసకర్త బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతసిరికొండ మధుసూదనాచారి (బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా) -
తీవ్రవాదులను ఓడిద్దాం... దేశాన్ని గెలిపిద్దాం!
కేవలం పహల్గామ్లోనే కాదు, కేవలం పాకిస్తాన్‌లోనే కాదు, దేశమంతా ఉన్నారు. అవకాశవాద, అవినీతిలో నిండిన ప్రజా, సివిల్ అధికారుల వల్లనే టెర్రరిస్టులు బతుకుతున్నారు, టెర్రరిజం బతుకుతున్నది. టెర్రరిస్టు డబ్బుతో ఆ దేశం, ఈ దేశం అనికాదు, ప్రతి బిజినెస్‌లో పెద్దలు, నేతలు బతుకుతున్నారు. సిగ్గు సిగ్గు! రాబోయే పదేళ్లదాకా, లేదా వందేళ్లదాకా తీవ్రవాదం ఉంటుంది, ఉంచుతారు. వ్యాపారం కోసం, రాజకీయం కోసం! అధికారం కోసం, ఎన్నికల కోసం!అంతర్జాతీయంగా అన్నీ అమ్ముకోవడాలే గాని, జాతీయతా భావనే లేదు. నాయకులకే కాదు, సగం మంది ప్రజలకు కూడా సిగ్గు పడవలసిన ‘దుర్మార్గం’ ఎక్కువగా ఉంది. గుడికి దర్శనానికి వెళుతున్నాం. ప్రసాదాలను, నిజాలను నమ్ముకోకుండా, ఖనిజాలు అమ్ముకుంటున్నాం. ఆ ఖనిజం కోసం అడవులు నరికేస్తున్నాం. ‘సత్యమేవ జయతే’ అని మన జాతీయ నినాదం. 150 కోట్ల జనాల్లో ఎంతమంది నిజం చెబుతున్నారు? ‘రామ్ నామ్ సత్య్ హై’ అనేది మనదేశంలో చిత్తశుద్ధితో వినేవారున్నారా? రామ్ పేరుతో రాజకీయాలు, మతం పేరుతో అధికారాలతో ఆడు కుంటూ, పై పెదవుల కొస నుంచే ‘జై శ్రీరామ్’ అంటున్నాం. రామరాజ్యం రావడం లేదు. భక్తి లేదు, భయం లేదు. గర్భగుడులలో ఒక్కొక్క స్తంభానికి బంగారపు తాపడాలకు డబ్బిస్తాం కానీ పేదవాడికి తిండిచ్చేవాడు లేదు.చదవండి: ఈ దేశాన్ని ఎన్ని ముక్కలు చేద్దామనీ!అమెరికాలో అద్భుత ఆకాశాలను తాకే రెండు భవనాలను విమానాల్లో కూల్చిన దుర్మార్గం ద్వారా వందలాది జీవనాలు ధ్వంసమయ్యాయి(2001 సెప్టెంబర్ 11). నిన్న పహల్గామ్లో 26 మంది ప్రాణాలు తీసిన నేరం చిన్నదేం కాదు. వెంటాడి వేటాడి ఒక్కొక్కణ్ణి పట్టుకు శిక్ష వేస్తాం అంటున్న ప్రభుత్వానికి వందలాది వందనాలు. అమెరికా చేసిందేమిటి? మాటలు కాదు. తూటాలు కాదు. రాజకీయం కాదు. ఎక్కడున్నా సరే వేటాడి పట్టుకుని అమెరికాను కాపాడుకోవడానికి చూపిన కమిట్మెంట్ మనకు ఆదర్శం కావాలి. కమిట్మెంట్ అంటే కట్టుబాటు, దీక్ష. అకుంఠిత దీక్ష కావాలి. అది ఉందా? ఒక్కో మరణానికి కన్నీటి బిందువునైనా ఇచ్చుకున్నామా? క్రికెట్ మైదానంలో ఓ రెండు క్షణాలు నిలబడితే చాలా? కోట్ల కోట్ల వ్యాపారం కోసం, ప్రచారం కోసం మౌనమే సరిపోతుందా? ఒక్కో ప్రాణానికి, ఒక్కో సైనికుడి జీవనానికి డబ్బు ఇచ్చే దమ్ముందా?రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలితం చేశారు. అంటే జరిగినదానికి రాష్ట్ర బాధ్యత లేదు, కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. టూరిస్టులయిన మామూలు మనుషుల్ని టెర్రరిస్టులకు బలిచేసిన ప్రభుత్వానికి బాధ్యత లేదా? పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు, మరికొన్ని భూభాగాలతో అఖండ భారత్ అనే నినాదాలు చేసే పెద్దలు... పక్కనున్న టెర్రరిస్టులు, మన నేల మీద మన వారిని చంపేస్తుంటే ఏం చేస్తున్నట్టు? పదేళ్ల ముందు దద్దమ్మలని పాత పాలకులను తిట్టి పోశాం. యూపీఏ చెత్త పరిపాలన వల్ల తీవ్రవాదులు జనాన్ని చంపేస్తున్నారన్నారు. మరి ఇప్పుడు 2025 దాకా ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహానాయకుడు అవసరం. ప్రతి సైనికుడిని ఒక శక్తిగా మార్చి, తుపాకీలు ఎక్కుపెట్టినట్టే మహా ధైర్యంగా, రాజకీయ నాయకులను కూడా ప్రశ్నించి, నిజం చెప్పి, వ్యూహం నేర్పి భారత దేశాన్ని గెలిపించిన (1971 ఇండో–పాక్ యుద్ధం) ఫీల్డ్ మార్షల్ మానెక్‌శా వంటి సైన్యాధిపతులు మనకు అవసరం. ఆ విధంగా మన దేశాన్ని గెలిపిద్దాం. తీవ్రవాదులను మట్టి కరిపిద్దాం. చెత్త రాజకీయాలు కాదు, మన కైలాస హిమాలయాలున్న మన కశ్మీర్‌ను గెలిపిద్దాం. మన రాజ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజనీతిని నిలబెడదాం.ప్రొ. మాడభూషి శ్రీధర్ మహీంద్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్ -
ఈ దేశాన్ని ఎన్ని ముక్కలు చేద్దామనీ!
సంవత్సరాల క్రితం, నేను హిందీ నవలా రచయిత కమలేశ్వర్ రాసిన ‘కిత్నే పాకిస్తాన్’ (ఎన్ని పాకిస్తాన్‌లు) – అనే నవల చదివాను. ఆయన భారతీయ సమాజపు విచ్ఛిన్నకరమైన, వివక్ష, అధికార దాహంతో కూడిన ధోరణులను విజయవంతంగా వ్యక్తపరిచారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా నుండి ప్రజలు వలస వెళ్ళిన నేపథ్యంలో.. ‘ధర్మిక విశ్వాసం’ ఆధారంగా ప్రజలను విభజించే మనస్తత్వాన్ని మనం ఎప్పుడు వదిలించుకోగలం అని మరోసారి అడగవలసిన అగత్యం ఏర్పడింది. మెజారిటీ వర్గంవారి మనుగడకు ప్రత్యేక హక్కులు ఉండే మెజారిటీవాదాన్ని... మెజారిటీ పాలన స్థానంలో ఉంచాలనుకుంటున్నారా? మనం ముర్షిదాబాద్‌తో ప్రారంభిద్దాం. భారత ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించిన తర్వాత చెలరేగిన అల్లర్లు, అక్కడి మైనారిటీ హిందువుల జీవితాలను దుర్భరంగా మార్చాయి. పరిస్థితి దారుణంగా ఉంది. బాధితుల కుటుంబం ఎదుర్కొన్న విచారణలను బట్టి దీనిని అర్థం చేసుకోవచ్చు. ఆ జిల్లాలోని జాఫరాబాద్ నగరానికి చెందిన టీ స్టాల్ యజమాని హృదయ్ దాస్, అతని కోడలు సుచరిత సర్కార్ జార్ఖండ్–పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఉండే రాజ్‌మహల్‌లో ఒక జాతీయ పత్రిక విలేకరికి తమ కథను వివరిస్తు న్నప్పుడు కూడా వారు భయంతో వణుకుతున్నారు. కన్నీళ్లు నిండిన వారి కళ్లలో... జరిగిన బీభత్సం ఛాయలు స్పష్టంగా కనిపించాయి. ఏప్రిల్ 12 ఉదయం ఇదంతా ప్రారంభమైందని వారు చెప్పారు. ప్రతి రోజులాగే, 170 దళిత కుటుంబాలు పనికి సిద్ధమవుతుండగా అకస్మాత్తుగా డజన్ల కొద్దీ సాయుధ వ్యక్తులు వారిపై దాడి చేశారు. వారు తాళం వేసిన ఇళ్లపై రాళ్ళు రువ్వారు. దాస్ దుకాణాన్ని ధ్వంసం చేశారు. కానీ అతను తన నివాసంలోనే ఇరుక్కుపోయాడు. తన ఇంటికప్పుపై రాళ్ళ వర్షం కురుస్తూనే ఉందనీ, వీధుల్లో ఉన్న ప్రజలను కొట్టారనీ దాస్ అన్నారు. అతని సోదరుడు హర్గోబింద్, మేనల్లుడు చందన్ దాక్కునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ గుంపు వారిని పట్టుకుంది. రాడ్లు, కర్రలు. కత్తులతో వారిపై దాడి చేసింది. ‘తిరిగి వచ్చే వారిని తుడిచి పెట్టేస్తామనే ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఆ గుంపు హెచ్చరించింది. ‘మిమ్మల్ని రక్షించే ధైర్యం పాలనా యంత్రాంగంలో ఎవరికి ఉందో చూద్దాం’ అనేది దాడి చేసినవారి మరో సవాల్.సుచరిత భయంతో వణుకుతూ, తాను ముర్షిదాబాద్‌కు ఎప్పటికీ తిరిగి రానని చెప్పింది. ముర్షిదాబాద్, 24 పరగణాలు, పరిసర జిల్లాల్లో చాలా మంది ఇలాంటి కథనాలను వివరించారు. బాధితులంతా తమను రక్షించడానికి పాలనా యంత్రాంగం ఎందుకు ముందుకు రాలేదన్న ఒకే ఒక సాధారణ ప్రశ్న అడుగు తున్నారు. ఇది చట్టబద్ధమైన ప్రశ్న. కానీ వారికి భద్రత కల్పించే బాధ్యత అప్పగించబడిన వారు రాజకీయాలలో బిజీగా ఉన్నారు. వాస్తవానికి, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో మతతత్త్వ మహమ్మారి చాలా సంవత్సరాలుగా విజృంభిస్తోంది. ఇప్పుడు, ఈ విభేదాలు బయటపడ్డాయంతే! రాష్ట్ర బీజేపీ నాయకుడు, ఒకప్పుడు మమతా బెనర్జీకి కీలక అనుయాయి అయిన సువేందు అధికారి, బెంగాల్లో ప్రబలంగా ఉన్న చట్టవిరుద్ధతను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోలేకపోతోందని పేర్కొంటూ, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపున ముర్షిదాబాద్ హింసాకాండ కొన్ని రాజకీయ పార్టీలతో కుమ్మక్కై కేంద్ర సంస్థలు చేసిన పని అని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ చిరకాల హింసాకాండలో నేరస్థులు, బాధితుల ముఖాలు మాత్రమే మారాయి. నాయకుల ప్రకటనలు మాత్రం అలాగే ఉన్నాయి.అందరూ బాధితులే!గత 50 సంవత్సరాలలో దేశంలో జరిగిన అన్ని ప్రధాన హింసాత్మక ఘటనలను సమీక్షిస్తే ఇది నిజమే సుమా అనిపిస్తుంది. 1970–80ల మధ్య, అస్సాంలో హిందీ మాట్లాడే ప్రజలపై జరిగిన దౌర్జన్యాలతో ఈ విద్వేషం ప్రారంభమైందనాలి. దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ రాష్ట్రం నుండి పారిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో, ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా చాలా మంది హిందువులు పంజాబ్‌ను విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఇందిరా గాంధీ మరణం తరువాత జరిగిన అల్లర్లు సిక్కు సమాజాన్ని ధ్వంసం చేసి పడేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని మాలియానా, బిహార్‌లోని భాగల్పూర్ ప్రత్యేకించి ముస్లింలకు చాలా కఠిన పరిస్థితులను తెచ్చిపెట్టాయి. అల్లర్ల తర్వాత భాగల్పూర్ నగరాన్ని విడిచిపెట్టిన పట్టు నేత కార్మికులు తిరిగి రాలేదు. 1990లలో కశ్మీరు పండిట్లు కశ్మీర్ లోయను వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఈ దురదృష్టకర జాబితా సుదీర్ఘమెనది.21వ శతాబ్దం మొదటి రెండు దశాబ్దాలలో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. అయితే, గత సంవత్సరం మణిపుర్లో చెలరేగిన హింస మళ్ళీ పాత గాయాలను రేపింది. ఇక్కడ, నిర్వాసితులైన వారిలో ఎక్కువ మంది క్రైస్తవ సమాజానికి చెందినవారు. ఈ హింసాత్మకమైన సంక్లిష్ట సంఘటనలు హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులను ఒకేలా ప్రభావితం చేశాయి. కొన్ని సంఘటనలలో వారు నేరస్థులు, మరికొన్నింటిలో బాధితులు. మతం కంటే మెజారిటీవాదం కారణంగా వలసలు ఎక్కువగా జరిగాయి. అల్లర్లను ప్రేరేపించడానికి మత విశ్వాసం ఒక అనుకూలమైన సాధనం. సోషల్ మీడియా విస్తరణ ఇప్పటికే దిగజారుతున్న పరిస్థితిని క్లిష్టతరం చేస్తోంది. ఇది వేర్పాటువాదులు, పుకార్లు వ్యాప్తి చేసేవారు, దుష్ట శక్తులకు శక్తినిచ్చేదిగా సోషల్ మీడియా పనిచేసింది. మన రాజకీయ నాయకులు కూడా విభజనవాద పరిస్థితులను ఉపయోగించు కోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతారు. మతంతో పాటు, ప్రాంతీయ, భాషా వ్యత్యాసాలను ప్రజల మధ్య విభజనను రేకెత్తించడానికి ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోనే మరెన్ని దేశాలను సృష్టించాలనీ! -శశి శేఖర్ ‘ది హిందుస్థాన్ టైమ్స్’ సంపాదకుడు -
యువ సృష్టికర్తలకు ప్రోత్సాహం
వాణిజ్య సుంకాలు, స్టాక్ మార్కెట్ అస్థిరతలు ప్రపంచాన్ని వేధిస్తున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తూనే ఉంది. విస్తృత జనాభా, సాంకేతిక సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ, సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ప్రపంచ ‘క్రియేటివ్ పవర్ హౌస్’గా తనను తాను నిరూపించుకునే సత్తా భారత్‌కుంది. కథలు చెప్పడంలో మనకున్న సామర్థ్యాన్ని ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్’ విజన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సృష్టికర్తలను (క్రియేటర్స్) లక్ష్యంగా చేసుకుని భారత మీడియా–వినోద (ఎం అండ్ ఇ) రంగం ముందుకు సాగుతోంది.చలనచిత్రం, సంగీతం, కళ, సాంకేతికత వంటి వివిధ రంగాలలో యువ సృష్టికర్తలకు భారత్ నిలయంగా ఉంది. ముఖ్యంగా ‘డ్యూన్–2’ సినిమా ఆస్కార్ గెలుపునకు కారణమైన అద్భుత వీఎఫ్ఎక్స్ను అందించిన విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ స్టూడియోగా నమిత్ మల్హోత్రాకు చెందిన ‘డీఎన్ఈజీ’ని చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచ వినోద పరిశ్రమలో భారత్ ప్రాబల్యాన్ని తెలియచెబుతూ భారత్‌కు 7వ ఆస్కార్‌ను తెచ్చిపెట్టింది. సంప్రదాయ ఫిల్మ్ మేకింగ్ నుంచి డిజిటల్ నిర్మాణానికి మళ్ళుతూ ప్రపంచ స్థాయి కంటెంట్‌ను రూపొందించడంలో భారత్ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.ముంబయి వేదికగా మే నెలలో భారత ప్రభుత్వం ‘ప్రపంచ ఆడియో–విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)– 2025’ను నిర్వహిస్తోంది. యువ సృష్టికర్తలను పరిశ్రమ దిగ్గజాల చెంతకు చేర్చడం, అంకుర సంస్థలను ప్రోత్సహించడం వేవ్స్‌లో భాగమైన వేవ్స్ ఎక్స్లెరేటర్ (వేవెక్స్) లక్ష్యం. యువ సృష్టికర్తలు అనుభవజ్ఞుల సలహాలు పొందేలా చూడటం, నిధుల లభ్యత, అంతర్జాతీయ అవకాశాలను అందించడం ద్వారా మీడియా, వినోద రంగాల్లో భారత అంకుర సంస్థల స్థాయిని పెంచడానికి వేవ్స్ కృషి చేస్తుంది. గేమింగ్, కృత్రిమ మేధ, మెటావర్స్ వంటి వినూత్న రంగాలపై దృష్టి సారిస్తూ... ఈ రంగం 2023లో రూ. 2,422 బిలియన్ల నుంచి 2027 నాటికి రూ.3,067 బిలియన్లకు పెరుగుతుందని అంచనా.కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, బ్రాహ్మణ్ గేమ్ స్టూడియోస్, కీబౌండ్, వాయన్ క్లౌడ్ వంటి అంకుర సంస్థలు ప్రపంచ పెట్టుబడిదారుల ముందు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేవ్స్ ఒక వేదికగా ఉపకరిస్తుంది. వీటిలో మీడియా – వినోద రంగ సామర్థ్యాన్ని చాటే ల్యాప్వింగ్ స్టూడియోస్, వైగర్ మీడియా వంటి మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అడుగు పెట్టడానికి ఒక పోటీతత్వ అంకుర సంస్థల వాతావరణాన్ని వేవ్స్ అందిస్తుంది. పెట్టుబడులు పొందడానికి, అంతర్జాతీయ అరంగేట్రంలో ఇబ్బందులను తప్పించడానికి, మెంటార్షిప్ అడ్డంకులకు ఒక పరిష్కార వేదికగా నిలుస్తుంది. కేవలం రూ.10,000 పెట్టుబడితో ఒక విజన్‌తో ‘బయోకాన్’ను ప్రారంభించిన నాకు ఇటువంటి ప్రోత్సాహక వేదికల ప్రాముఖ్యం ఏమిటో బాగా తెలుసు.క్రియేటివ్ హబ్ కళలంటే ఇష్టపడే నేను మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ ఫొటోగ్రఫీ (మ్యాప్), సై¯Œ ్స గ్యాలరీ బెంగళూరు కార్యక్రమాలకు నా సహకారాన్ని అందిస్తూ ఉంటాను. ఒక దేశ సంస్కృతి దాని కళలు, శాస్త్రాలతో ముడిపడి ఉందని బలంగా నమ్ముతాను. కళలు, విజ్ఞాన శాస్త్రం రెండూ సృజనాత్మకతలో భాగమే. కళాకారులు వేదికపై ప్రదర్శించే విధంగానే శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేస్తారు.కథలు చెప్పడంలో శతాబ్దాలుగా నైపుణ్యం కలిగిన భారత్... ప్రపంచ సృజనాత్మక శక్తిగా ఎదగడానికి గొప్ప అవకాశం ఉంది. శాస్త్రీయ నృత్యం నుంచి సినిమా వరకు; కామిక్స్ నుంచి ఇమ్మర్సివ్ టెక్నాలజీ వరకు, అధునాతన సృజనాత్మకత ఆవిష్కరణలతో ముడిపడి ఉన్న ఉత్తేజకరమైన యుగంలోకి ప్రవేశిస్తున్నాం. ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్’ అనే ఆలోచన ఈ ఆశయాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తుంది.సృజనాత్మక అంకుర సంస్థలకు ఉత్ప్రేరకంసాంకేతికత, కథ చెప్పడంలోని నైపుణ్యానికి వేవ్స్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. యానిమేషన్, ఏఐ, ఏఆర్/వీఆర్, గేమింగ్, మెటావర్స్ వంటి వినూత్న రంగాల్లో అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా వేవెక్స్ తన ప్రాబల్యాన్ని చాటడానికి సిద్ధంగా ఉంది.వేవ్స్ బజార్లో 4,500కు పైగా అమ్మకందారులు, 5,900కి పైగా కొనుగోలుదారులు నమోదు చేసుకున్నారు. ఇది భారతీయ అంకుర సంస్థలను అంతర్జాతీయ సంస్థల చెంతకు చేర్చడం ద్వారా ప్రపంచ మీడియా, వినోద రంగాల్లో భారత్ పురోగమనాన్ని మరింత వేగవంతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సంప్రదాయ మీడియాకు మించిన ఆవిష్కరణలకు కూడా వేవ్స్ పెద్దపీట వేస్తుంది. కృత్రిమ మేధ ఆధారంగా తయారుచేసిన ప్రకటనల్లో ఎరుకానావిస్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు అగ్రగామిగా ఉన్నాయి. అదే సమయంలో యానిమేషన్, వీఆర్ ద్వారా అమేజ్ స్టూడియోస్, ఆఫ్‌లైన్ హ్యూమన్ స్టూడియోలు కథను చెప్పే విధానాన్ని పునర్నిర్వచిస్తున్నాయి. ఇన్స్కేప్ ఎక్స్ఆర్, విజన్ ఇంపాక్ట్ వంటి ఎడ్–టెక్ వెంచర్లు ఇమ్మర్సివ్ మీడియాతో నేర్చుకునే విధానంలో మార్పులు తెస్తున్నాయి.భవిష్యత్ దృక్కోణంమీడియా, వినోద రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి రూపొందించిన వేవ్స్ వంటి కార్యక్రమాలకు మద్దతునిచ్చే విషయంలో భారత ప్రభుత్వం నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం వేవ్స్ ద్వారా కేవలం అంకుర సంస్థల్లో పెట్టుబడి పెట్టడమే కాదు, కథను చెప్పే, స్వీయ–వ్యక్తీకరణ, భవిష్యత్తును నిర్వచించే సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలోనూ పెట్టుబడి పెడుతున్నాం. అది బయోటెక్ ల్యాబ్ కావొచ్చు, డిజిటల్ స్టూడియో కావొచ్చు... సృజనాత్మకత అనేది రేపటి పరిశ్రమలు, గుర్తింపులను రూపొందించే ఒక సాధనం.వేవ్స్–2025 భారతదేశపు మీడియా, వినోద పరిశ్రమలకు సంబంధించిన వేడుకే కాదు... ఇప్పటి వినోదం, విద్య, సంస్కృతుల్లో సమూల మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రపంచంలో తదుపరితరం సృష్టికర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిచయ వేదిక.ఈ ప్రయాణంలో వేవ్స్ సలహా సంఘంలో నేనూ ఒక సభ్యురాలైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. ప్రపంచ సృజనాత్మక విప్లవానికి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధమవుతున్న క్షణమిది. ‘భారత్‌లో సృష్టిద్దాం– ప్రపంచం కోసం సృష్టిద్దాం’ అంటూ అనంత కాల్పనిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేద్దాం.-వ్యాసకర్త బయోకాన్ గ్రూప్ చైర్ పర్సన్-కిరణ్ మజుందార్ షా -
అతి జాప్యంతో అదృశ్యమైన న్యాయం!
ఇటీవల ఒక న్యాయ, చట్ట సంబంధమైన వార్తల వెబ్ సైట్లో ఒక ఆశ్చర్యకరమైన వార్తా కథనం కనబడింది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ల ధర్మాసనం ముందు, తన కక్షిదారు చనిపోయాడనీ, ఆ కేసులో నిందితులుగా ఉన్న ఇరవై ఆరు మందీ చనిపోయారనీ ఒక న్యాయవాది చెప్పారు. అవి ప్రతీకార హత్యలేమీ కావు, సహజ మరణాలు. ఈ దేశంలో సామాజిక వ్యవస్థ గురించీ, న్యాయవ్యవస్థ గురించీ ఎన్నో పాఠాలు చెప్పగల నేరమూ–శిక్షా కథ ఇది.బిహార్ లోని అర్వాల్ జిల్లా లక్ష్మణ్ పూర్ బాతే అనే గ్రామంలో 1997 డిసెంబర్ 1న నరసంహారం జరిగింది. రాజధాని పట్నాకు తొంభై కి.మీ. దూరంలో సోన్ నదీ తీరగ్రామం లక్ష్మణ్ పూర్ బాతే. అప్పుడు ఆ ప్రాంతంలో ఎన్నో అరాచకాలకూ, హత్యాకాండలకూ పాల్పడిన రణ వీర్ సేన అనే అగ్రవర్ణాల సేన ఆ గ్రామంలోని దళితుల ఇళ్ల మీద దాడి చేసి చిన్నారి పిల్లలు, స్త్రీలతో సహా 58 మందిని ఊచకోత కోసింది. హతులలో ఒక ఏడాది పసిపాప, ఒక గర్భిణి కూడా ఉన్నారు. నదికి అవతలి ఒడ్డు నుంచి రాత్రి పదకొండు గంటలకు పడవలలో వచ్చి దళిత వాడలో ఇళ్ల తలుపులు విరగ్గొట్టి, లోపలికి చొరబడి, పడుకున్నవాళ్లను పడుకున్నట్టే కాల్చి చంపారు. మూడు గంటల పాటు జరిగిన మారణకాండలో యువతుల మీద అత్యాచారాలు చేసి చంపేశారు. తర్వాత అక్కడికి వెళ్లిన పోలీసులకు అత్యాచారానికి గురైన ఐదుగురు బాలికల నగ్న మృతదేహాలు కనిపించాయి. ఈ నరసంహారం సాగించి, తిరిగి అదే పడవలలో నది దాటిన హంతకులు సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి తమను నది దాటించిన ఇద్దరు పడవవాళ్ల గొంతులు కోసి చంపేశారు.అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ‘దేశానికి సిగ్గు చేటు’ అని అభివర్ణించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఈ మారణకాండ కారణాలు, పూర్వరంగం ఏమైనప్పటికీ, తర్వాత జరిగిన న్యాయ విచారణా ప్రక్రియ ఆశ్చర్యకరమైన మలుపులు తిరిగింది. జహానాబాద్ జిల్లా సెషన్స్ కోర్టులో జరగవలసిన ఈ విచారణను పట్నా హైకోర్టు ఆదేశాల మేరకు 1999 అక్టో బర్లో పట్నాకు బదిలీ చేశారు. తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత 2008 డిసెంబర్లో 46 మంది రణవీర్ సేన కార్యకర్తల మీద నేరారోపణలు నమోద య్యాయి. రెండు సంవత్సరాల తర్వాత 2010 ఏప్రిల్ 7న పట్నా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి విజయ్ ప్రకాష్ మిశ్రా నిందితులలో 16 మందికి మరణశిక్ష, 10 మందికి యావ జ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ హత్యాకాండ ‘పౌర సమాజం మీద మచ్చ’ అనీ, ‘పాశవికత్వంలో అరుదైన వాటిలోకెల్లా అరుదైనది’ అనీ తీర్పులో రాశారు. శిక్షితులు అప్పీలుకు వెళ్లగా పట్నా హైకోర్టు జస్టిస్ వీఎన్ సిన్హా, జస్టిస్ ఏకే లాల్ ద్విసభ్య ‘ధర్మాసనం’ 2013 అక్టోబర్ 9న ‘సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా’ శిక్షలన్నిటినీ కొట్టివేసింది. ఇంత అన్యాయమైన హైకోర్టు తీర్పు వార్త ప్రధాన స్రవంతి పత్రికలకు పట్టనే లేదు. యాభై ఎనిమిది మందిని హత్య చేసి, కింది కోర్టులో నేరం రుజువై తీవ్రమైన శిక్షలు కూడా పడిన నేరస్థులను, అలా సాక్ష్యాధారాలు లేవంటూ వదిలివేసిన దుర్మార్గమైన వార్త కన్నా ఆ రోజే క్రికెట్ నుంచి విరమించుకుంటున్నానని సచిన్ టెండూల్కర్ చేసిన ప్రకటన పెద్ద వార్త అయింది! హైకోర్టు తీర్పును బిహార్ ప్రభుత్వమూ, బిహార్‌లోని రాజకీయ పార్టీలన్నీ తప్పు పట్టాయి. ఈ తీర్పును ఎంత మాత్రమూ అంగీకరించడానికి వీలు లేదని, తీర్పును సమీక్షించమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని బిహార్ రాజకీయ పార్టీలు కోరాయి.పట్నా హైకోర్టు తీర్పును సమీక్షించి, కొట్టివేయాలని, మారణకాండ దోషులకు కఠిన శిక్షలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2013 డిసెంబర్లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది. 2014 జనవరి 13న సుప్రీంకోర్టు కేసు నమోదు చేసుకుని నోటీసులు పంపింది. నాలుగు సంవత్సరాల తర్వాత 2018, 2019లలో కాస్త విచారణ జరిగి, కేసు మౌలిక దస్తావేజులు, అదనపు పత్రాలు పంపమని కింది కోర్టులను ఆదేశించడంలోనే సమయం గడిచిపోయింది. 2023 ఒక్క సంవత్సరంలోనే ఎటువంటి వాదనలు, విచా రణ జరగకుండా ఆరుసార్లు వాయిదాలు పడ్డాయి. ఈ మధ్యలో కొందరు నిందితులు మరణించారని న్యాయ వాదులు సుప్రీంకోర్టు దృష్టికి తెస్తూనే ఉన్నారు. 2025 జనవరి 1 నాటికి ఇరవై ఆరు మందిలో ఐదుగురు మర ణించారని నమోదయింది. పన్నెండేళ్లుగా వాయిదాలు పడుతూ నత్తనడకలతో సాగుతూ సాగుతూ వచ్చిన ఆ కేసులో 2025 ఏప్రిల్ 3న ఒక నిందితుడి తరఫున వాది స్తున్న న్యాయవాది ‘ఇరవై ఆరు మంది నిందితులూ మరణించారని ధర్మాసనానికి తెలియజేస్తున్నాం’ అన్నారు. వాస్తవ స్థితి ఏమిటో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనం కేసును మళ్లీ వాయిదా వేసింది. ఆలస్యం చేయడమంటే న్యాయాన్ని నిరాకరించినట్టే అనే నానుడిని నిజం చేస్తూ మన న్యాయవ్యవస్థ సాచివేత ద్వారా న్యాయాన్ని నిరాకరిస్తున్న తీరు ఇది! ఇప్పుడు నడుస్తున్న మందకొడి వేగంతోనే నేర విచారణలు సాగుతూ పోతే దేశంలో ఆ నాటికి న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ పూర్తి కావడానికి 324 సంవ త్సరాలు పడుతుందని 2018లో నీతి ఆయోగ్ ఒక వ్యూహ పత్రంలో నిర్ధారించింది. ఆ నాటికి దేశం మొత్తం మీద పెండింగ్‌లో ఉన్న కేసులు రెండు కోట్ల తొంబై లక్షలు కాగా, 2025 జనవరి నాటికి ఆ సంఖ్య ఐదు కోట్ల ఇరవై లక్షలకు చేరింది. నీతి ఆయోగ్ అంచనా ప్రకారమే చూస్తే, ప్రస్తుత పెండింగ్ కేసులు పూర్తి కావడానికి 580 సంవ త్సరాలు పడుతుంది!! అప్పటికి వాదులూ ఉండరు, ప్రతి వాదులూ ఉండరు. అటు, ఇటు వాదించే న్యాయ వాదులూ ఉండరు! న్యాయం ఉంటుందా?ఎన్. వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్ట్ -
నాడు క్షీరధార! నేడు కన్నీటి వరద!
సర్వదేవ మయే దేవీ–సర్వ దేవా రలంకృతా మామాభిలషితం కర్మ–సఫలం కురు నందినీ ఇది హిందువులు చేసే గోప్రార్థన. ‘సర్వ దేవతా స్వరూపిణీ! సర్వదేవతలచే అలంక రింపబడినదానా! ఓ నందినీ! నా కోరికలను సఫలం చేయి’ అని అర్థం. కేవలం గోవును పూజిస్తే సమస్త దేవత లను పూజించిన ఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. ఇది వేదం నుంచి వచ్చిన సంప్ర దాయం, నమ్మకం. హిందువులకు ఆవు ఓ జంతువు కాదు, అభీష్టా లను నెరవేర్చే దైవ స్వరూపం. ఆకలి తీర్చే అన్నపూర్ణ. హిందూ ధర్మానికి వేదం మూలం. వేదం నుంచి యజ్ఞం వచ్చింది. యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది. మానవాళి ఆకలి తీరుతుంది. ఆ యజ్ఞపు అగ్నిహోత్రానికి ఘృతాన్ని (నెయ్యి) సమర్పించాలి. యజ్ఞానికి ఆవు నెయ్యి తప్ప ఇతరాలు సమర్పించరు. గోవు అనే పదానికి సూర్యుడు, యజ్ఞము, భూమి, నీరు, స్వర్గం... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. ‘‘గవా మంగేషు తిష్ఠంతి/ భువవాని చతుర్దశ’’ గోవు శరీర భాగాలలో పదునాలుగు భువనాలు ఉంటాయట. అంటే సమస్త సృష్టికి మూలం గోవు. గోవు అంత పవిత్రమైనది కాబట్టే దాని పేడ, పంచకాలను కూడా ఔషధాలకు ఉపయోగి స్తున్నాం. శాస్త్రం అంగీకరిస్తున్న సత్యం ఇది.పూర్వకాలంలో గోవులేని ఇల్లు వుండేది కాదు. ఎన్ని గోవులుంటే అంత సంపద వున్నట్లు. మహాభారతంలో విరాటరాజు గోవులను దుర్యోధనాదులు అపహరించటానికి పూనుకున్నది ఈ కారణం వల్లే! ఆవు నడయాడిన ప్రాంతంలో క్షేమం తప్ప, క్షామం ఉండదు. నూతన గృహప్రవేశ కాలంలో గోవును తీసుకువెళ్లేది ఇందుకే!శ్రీ మన్మహావిష్ణువు... గోపాలుడు, గోవిందుడు. గోకులంలో ఉండటం, గోవులను కాయడం ఆయనకు ఇష్టం. కాయడం అంటే కేవలం కాపలా కాదు, అన్ని విధాలా రక్షించడం! శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడన్నది మన నమ్మకం. నిజానికి ఆ స్వామికి నిత్య స్థానము గోలోకమట. అది వైకుంఠం కన్నా పైన ఉంటుందట.అందుకే గోవిందా అని పిలిస్తేనే ఆ స్వామికి ఇష్టం. నవనీత చోరుడు కదా! నేటికీ తిరుమలలో శ్రీవారికి నవనీత నివేదన జరుగుతూనే ఉంది. గోహృదయం తెలిసిన వైఎస్ ఆ శ్రీవారి సన్నిధానంలో గోవులకు ఆస్థానం ఉండాలని 1956లో డైరీ ఫారం పేరుతో చిన్న గోశాల ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. 2002లో దాన్ని ట్రస్టు గానూ, 2004లో శ్రీ వేంకటేశ్వర గోరక్షణ శాలగానూ మార్చారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా, నేను తి.తి.దే. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తిరుపతి గోశాలను అభివృద్ధి చేసినంతగా మరెవ్వరూ చేయలేదు అన్నది అతిశయోక్తి కాదు. రైతు హృదయమే కాదు, రైతుకు సంపద అయిన గోçహృదయం కూడా తెలిసినవారు రాజశేఖరరెడ్డి. ఆయన ఆదేశంతో గోసంరక్షణ కోసం తిరుపతిలో మూడు రోజుల పాటు ‘వందే గోమాతరం’ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాం. నోబెల్ బహుమతి గ్రహీతలైన ఇద్దరు ప్రముఖులు, అరవై మందికి పైగా గోసంరక్షణ ఉద్యమకారులు, వివిధ పీఠాధిపతులు ఆ సదస్సులో పాల్గొన్నారు. ఔషధీకరణ రీత్యా గోవిసర్జితాలు ఎంత ముఖ్యమైనవో, వీరు తమ ప్రసంగాల ద్వారా నిరూపించారు. గోసంరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరించారు. వందే గోమాతరం సదస్సును దేశమంతా ప్రశంసించింది. ఎందరో పీఠాధిపతులు ఆశీస్సులు పంపారు. అప్పటి రాష్ట్రపతి రాజశేఖర రెడ్డి గారిని అభినందిస్తూ లేఖ పంపారు.శ్రీవారి సన్నిధానంలో ఉన్న గోశాలను మరింత విస్తృత పరచాలన్న రాజశేఖర రెడ్డి ఆదేశానుసారం పలమనేరులో అతి పెద్ద గోశాలకు అంకురార్పణ చేశాం.తండ్రి వలెనే ప్రత్యేక శ్రద్ధ వై.ఎస్. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి వలెనే గోసంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. గోసంపద మరింత విస్తరించాలని సాహివాల్, గిర్, కాంక్రీజ్ వంటి నాణ్యమైన దేశవాళీ గోవులు సుమారు 550 తెప్పించారు. రిలయన్స్, మై హోమ్, ఇతర పారిశ్రామిక వేత్తల సహాయంతో ఈ గోవులను పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తెప్పించారు. రవాణాలో అవి ఇబ్బందులకు గురి కాకూడదని, అప్పటి రైల్వే మంత్రితో మాట్లాడి ప్రత్యేక కంపార్టుమెంట్ల ద్వారా తెప్పించడం జరిగింది. ఇదీ నాటి ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న శ్రద్ధ.పూర్వకాలపు పద్ధతిలో కవ్వంతో చిలికి వెన్నతీసి, దానిని తిరుమలలో ధూప దీప నైవేద్యాలకు, అన్నప్రసాదాలకు వినియోగించాలని ఏర్పాట్లు చేయడం జరిగింది. కవ్వంతో చిలికి వెన్న తీయడాన్ని బిలోనా పద్ధతి అంటారు. దీనికి 5 కోట్ల నిధిని కేటాయించాం.ఈ 550 గోవుల ద్వారా పునరుత్పత్తి చేసి నాణ్యమైన గోవుల సంఖ్య మరింత పెంచాలని నిర్ణయించాం. దీనికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సహకారం తీసుకున్నాం. దాదాపు 48 కోట్ల రూపాయల ఖర్చుతో ఆవుల కృత్రిమ గర్భధారణకు ప్రయ త్నాలు చేస్తూ, అందులో 90 శాతం ఆడ దూడల జననం కొరకు బృహత్ సంకల్పం చేశాం.నవనీత చోరుడు, నవనీత ప్రియుడు అయిన వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత అనంతరం నవనీత (వెన్న) నివేదన చేస్తారు. ఆ వెన్నను పూర్వం బయట నుంచి కొని తీసుకువచ్చేవారు. స్వామికి వెన్న కొనడం తగదు అని తిరుమలలో గోశాలను ఎనిమిది ఎకరాలకు విస్తరించేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. అందులో 50 సాహివాల్ గోవులను ఉంచి, శ్రీవారి సేవకులైన మహిళల ద్వారా వెన్న చిలికించారు. ఆ వెన్నను ప్రతిదినం గోశాల నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి నవనీత సేవకు అందేలా ఏర్పాటు చేశారు.శ్రీవారికి నివేదించిన వివిధ రకాల పుష్పాలను వృథాగా పారేయక వాటి ద్వారా అగరుబత్తీలు, తదితర పరిమళ ద్రవ్యాలు తయారు చేయడానికి, గోమయంతో సబ్బులు తదితర 14 ఉత్పత్తులు గోశాల ద్వారా రావటానికి ముఖ్య కారకులు జగన్ గారే! ఈ రోజు ఆ ఉత్పత్తుల ద్వారా 40 కోట్ల రూపాయల వ్యాపారం జరుగు తోంది. శ్రీవారికి దాదాపు 10 కోట్ల లాభం వస్తోంది. డబ్బు విషయం పక్కన పెడితే, కొన్ని కోట్ల గృహాలలో శ్రీవారి అగరుబత్తీలు వెలు గుతూ తిరుమలను తలపిస్తున్నాయి.అలిపిరి దగ్గర గోప్రదక్షిణశాలను పూర్తి చేసి భక్తులకు అందు బాటులోకి తెచ్చింది జగన్ గారే. ఆవు అలమటిస్తోంది! కొండంత చేసినా కొంచెంగా ఉండటం మాకు అలవాటు. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిగా చేశాం తప్ప ప్రచారం కోసం కాదు. చేసినవి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ కళ్ళు మూసుకుని కనిపించలేదు అంటే అది తప్పు!ఇరువురు ముఖ్యమంత్రులు ఇంతగా అభివృద్ధి చేసిన గోశాల నేడు దీనంగా ఉంది. ఆవు అలమటిస్తోంది. క్షీరధార బదులు, కన్నీటి ధార విడుస్తోంది. నిజం చెబితే దాన్ని స్వీకరించాలి, సరిదిద్దుకోవాలి. అంతేగానీ విమర్శకు విలవిలలాడిపోయి ఎదురుదాడికి దిగితే,దొంగ కేసులు పెడితే అది వారికే నష్టం. నేను కోరేది ఒక్కటే! అధికారాలు, ప్రభుత్వాలు మారవచ్చు. కానీ పీఠంపై ఎవరున్నా శ్రీవారికి ఇష్టమైన ‘గోపతు’లుగా ఉండాలి తప్ప, ‘గోఘ్నులు’గా ఉండకూడదు అని!భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
బిహార్ ఎన్నికలు... ఎన్నెన్నో ప్రశ్నలు!
బిహార్ రాష్ట్రం 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలనీ; వలసలు నియంత్రించాలనే డిమాండ్స్ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్లో బిహార్ రాష్ట్రానికి పెద్ద పీట వేసి అందరికంటే ముందుగానే బీజేపీ అక్కడ ప్రచారం మొదలుపెట్టింది. గత ఎన్నికల వరకు ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ)దే పైచేయిగా ఉండేది. కానీ, ఐదేళ్లలో రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ అగ్రవర్ణాలపై తన పట్టును కాపాడుకుంటూనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రెండు దశాబ్దాలుగా జేడీ(యూ) ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీలను, దళితులను తన వైపు తిప్పుకుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో, పరిపాలనా సంస్కరణలతో లబ్ధిపొందిన ఈ వర్గాలను ఆకర్షించడం ద్వారా... బీజేపీ తన ‘సామాజిక’ కూటమిని బలోపేతం చేసుకుంది. సామాజిక న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించిన లోక్ జన్ శక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకులు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆ పార్టీ తన బలాన్ని కోల్పోయింది. ఆ పార్టీ తమ గుర్తింపును కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడు తున్న క్రమంలో బీజేపీకి సానుకూలంగా మారింది. వివిధ కుల సమూహాలను తనవైపు తిప్పుకోవడానికి బీజేపీ అంతర్గతంగా ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తోంది. పలు సందర్భాల్లో జేడీ(యూ)తో విభేదాలొ చ్చినా రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉండటం వల్ల బీజేపీ తన హిందూత్వ భావ జాలాన్ని బిహార్ మట్టిలో జాగ్రత్తగా నిక్షిప్తం చేయగలిగింది. హిందూ సంఘటితం చుట్టే రాజకీయాలు నడు పుతూ మొట్టమొదటిసారి ఈ ఎజెండాతోనే ఎన్నికలు నడిచేలా వ్యూహాలను రచిస్తోంది. బడుగు, బలహీన వర్గాల ఐక్యతను కాపాడాలనే సిద్ధాంతంతో పని చేస్తున్న ‘ఇండియా’ కూటమికి ఇది అతిపెద్ద సవాలుగా మారబోతోంది. రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉంది. అలాగే ఆ పార్టీ వ్యూహాత్మ కంగా సృష్టిస్తున్న హిందూ కులాల ఐక్యత ఈసారి బిహార్ ఎన్నికలను రసవత్తరంగా మార్చనున్నది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం, బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమికి 43.17 శాతం ఓట్లు రాగా; ఆర్జేడీ,కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన మహాగఠ్‌బంధన్ (ఎంజీబీ) కూటమికి 38.75 శాతం ఓట్లు వచ్చాయి.ఈ ఓట్ల వ్యత్యాసం ఇకముందు కూడా కొనసాగితే ఎన్డీఏ 2025లోనూ సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి. కానీ 2020 తర్వాత వికాసషీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) మహాVýæఠ్బంధన్లో చేరడం, జేడీ (యూ)లో రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ విలీనం కావడంతో ఈసారి లెక్కలు మారవచ్చు.బిహార్‌లో 18 శాతం ఉన్న ముస్లింలు కీలక పాత్ర పోషిస్తారు. 2020లో ఎంజీబీకి 76 శాతం ముస్లిం ఓట్లు రాగా, ఎన్డీఏకు కేవలం 5 శాతమే వచ్చాయి. యాదవ్– ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే బీజేపీ వైపు ఉన్న బీసీలను, దళితులను తనవైపు తిప్పుకోగలిగితే ఎంజీబీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. అయితే రాష్ట్రంలో పుట్టుకొచ్చిన కొత్త పార్టీలు ఎన్డీఏ–ఎంజీబీ కూటముల గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) జన్ సూరజ్ పార్టీ నుంచి ఎంజీబీకి ముప్పు పొంచి ఉంది. 2024లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఆయన ఇటు ఎంజీబీ, అటు జేడీ(యూ) ఓట్లను గణనీయంగా చీల్చవచ్చు. ఆయన ఆర్జేడీ, జేడీ(యూ) పార్టీలపైనే విమర్శలతో విరుచుకుపడుతుండటంతో బీజేపీకి పరోక్షంగా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల ఆధారిత రాజకీ యాలు కాకుండా అభివృద్ధి తరహా రాజకీయాలు చేస్తా నని పీకే చెప్తున్నారు. లాలూ, నితీష్ల వృద్ధాప్యం, పాశ్వాన్ మరణంతో ఏర్పడిన ఖాళీని తాను భర్తీ చేయా లనుకుంటున్నారు. అయితే 243 నియోజకవర్గాల్లో నిల బెట్టడానికి బలమైన, నమ్మకమైన అభ్యర్థులు ఆయన పార్టీకి లేరు. కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత ఐ.పి. గుప్తా ‘ఇండియన్ ఇంక్విలాబ్ పార్టీ’ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రెండు కులాలపై ఈ పార్టీ ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. ఐపీఎస్ అధికారిగా బిహార్‌లో ప్రత్యేక పనితీరు కనబర్చిన మహా రాష్ట్రకు చెందిన శివ్‌దీప్ లాండె ‘హింద్ సేన’ పార్టీ ఏర్పాటు చేశారు. ఒకప్పుడు నితీష్‌కు సన్నిహి తునిగా ఉన్న ఆర్సీపీ సింగ్ ఆయనతో విభేదించి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ – జేడీ(యూ) మళ్లీ పొత్తు పెట్టుకో వడంతో ఈయన ‘ఆప్ సబ్కీ ఆవాజ్’ పార్టీని నెలకొల్పారు. కుర్మీ సామాజిక నేత అయిన ఆర్పీ సింగ్ ఆ సామాజిక ఓట్లు చీల్చే అవకా శాలున్నాయి. ఈ చిన్న పార్టీలు చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్ అభ్యర్థుల గెలుపోటములను శాసించ నున్నాయి.ఆర్జేడీ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. బీజేపీకి పెరుగుతున్న ఆకర్షణను అడ్డుకోవడానికి ఆర్జేడీ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. ఓబీసీలను ఏకం చేయాలనీ, మైనారిటీ ఓట్లను కాపాడుకుంటూనే ఈబీసీలను, దళితులను ఎన్డీయే శిబిరం నుంచి తమ వైపు తిప్పుకోవాలనీ ఎంజీబీ లక్ష్యాలుగా పెట్టుకుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇది. మరో ఏడు నెలల్లో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సిందే!ఆర్. దిలీప్ రెడ్డి వ్యాసకర్త పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
ఇండియా విధానం సరైనదేనా?
భారత ప్రభుత్వం సుంకాల విషయమై అమెరికాతో చర్చిస్తున్న పద్ధతిని కొందరు సమర్థిస్తుండగా, కొందరు విమర్శిస్తున్నారు. విలువైన అంశాలు రెండింటిలోనూ ఉన్నాయి. కానీ ఈ చర్చలన్నీ తక్షణ అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. అవి అవసరమే. అదే సమయంలో మరికొంత లోతుకు వెళ్లటం, దీర్ఘకాలిక దృష్టి తీసుకోవటం కూడా చేస్తే తప్ప ఇంత ముఖ్యమైన విషయమై సమగ్రమైన అవగాహన ఏర్పడదు. ఇతర దేశాల నుంచి దిగుమతులపై తాము స్వల్పమైన సుంకాలు విధిస్తున్నామనీ, తమ ఎగుమతులపై మాత్రం వారు భారీ సుంకాలు వేస్తున్నారనీ, ఆ విధంగా తాము రెండు విధాలుగానూ నష్టపోతున్నామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నమాట. కేవలం గణాంకాలకు పరిమితమైతే అది నిజమే. కానీ, అందులో అనేక మతలబులున్నాయి. అమెరికాలో ఒకప్పుడు విస్తారంగా ఉండిన ఉత్పత్తుల రంగాన్ని కుదించి, పరిశ్రమలను ఇతర దేశాలకు తరలించింది అక్కడి ప్రభుత్వమే గదా? అసలు వివిధ అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను ఉనికిలోకి తెచ్చి స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిందే అమెరికా. ఒకవేళ 90 రోజుల వాయిదా కాలంలో చర్చల ద్వారా కొన్ని సర్దుబాట్లు జరిగినా కొంత నష్టం మిగిలే ఉంటుంది. ఈ పరిణామాలన్నింటి ప్రభావంతో అమెరికా పట్ల ప్రపంచానికి ఇంత కాలం ఉండిన విశ్వాసం తగ్గుతుందనే సందేహం ఉంది. అది జరిగినపుడు ఇప్పటికే గల బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు మరింత బలపడగలవనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి.నాలుగు ధోరణులుఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 2024–25లో 41.18 బిలి యన్ డాలర్లు. మన దిగుమతులపై అమెరికా సుంకాల రేటు సగటున 2.7 శాతం. అమెరికా నుంచి దిగుమతులపై మన సుంకాల రేటు సగ టున 12 శాతం కాగా, కొన్ని సరుకులపై 48 శాతం వరకు ఉంది. ఈ లెక్కలను బట్టి అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలతో గల వాణిజ్య లోటులో 50 శాతం మేర సుంకాలు పెంచిన ప్రకారం భారత ఎగుమతులపై రేటును 26 శాతంగా ప్రకటించారు. ఏప్రిల్ 2న ఈ కొత్త రేట్లు ప్రకటించటానికి ముందే చేసిన హెచ్చరికలను బట్టి భారత ప్రభుత్వం అమెరికన్ మోటార్ సైకిళ్లు వగైరాపై సుంకాలు తగ్గించటం తెలిసిందే. అయినప్పటికీ కొత్త రేట్లు యథావిధిగా పెరిగాయి.ఈ పరిస్థితుల దృష్ట్యా భారత్ ఏమి చేయాలన్నది ప్రశ్న. ప్రపంచ దేశాలు చేస్తున్నదేమిటని చూడగా నాలుగు ధోరణులు కనిపిస్తు న్నాయి. కొన్ని చిన్న ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా లొంగి పోతున్నాయి. అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలు నూరు శాతం రద్దు చేస్తు న్నాయి. ఇందుకు ఒక ఉదాహరణ జింబాబ్వే. కొన్ని సామరస్య ధోర ణితో ఇచ్చిపుచ్చుకునే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. జపాన్ అందు కొక ఉదాహరణ. కొన్ని ఎదురు సుంకాలతో ప్రతిఘటిస్తూ అమెరికా తగ్గితే తాము తగ్గుతామంటున్నాయి. కెనడా, యూరోపియన్ దేశాలు ఈ కోవలోకి వస్తాయి. చైనా ఒక్కటి భిన్నంగా కనిపిస్తున్నది. పోరాడు తాము తప్ప లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నది.ఈ నాలుగింటిలో ఇండియా ప్రయోజనాలకు ఉపయోగపడ గలది ఏది? చైనా వలె పూర్తిగా ధిక్కరించటమన్నది అభిలషణీయం కాదు, కావాలనుకున్నా సాధ్యమయ్యేదీ కాదు. వారిది రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత దేశం కన్నా అయిదు రెట్లు పెద్దది.క్రమంగా అమెరికాను మించిపోయి అగ్రస్థానానికి చేరాలన్నది చైనా లక్ష్యం. మన స్థితిగతులుగానీ, లక్ష్యాలుగానీ వీలైనంత అభివృద్ధి చెందటమే తప్ప చైనా వంటివి కావు. కనుక ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అటువంటి వైఖరి తీసుకోవటమన్న ఆలోచనే అసందర్భం. ఇదంతా అర్థమయ్యో, కాకనో కొందరు భారత ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నారు. జపాన్ మార్గంఇక మిగిలినవి జపాన్, కెనడా ప్లస్ యూరోపియన్ మార్గాలు. ఈ రెండింటిలో రెండవది కూడా ఇండియాకు అనుకూలించగలది కాదు. అందుకు ఒక కారణం యూరోపియన్ దేశాలన్నీ ఒక బృందం వలె నిలిచి ఉన్నాయి. అది గాక సైనికంగా, భౌగోళిక వ్యూహాల రీత్యా అమెరికా, కెనడా, యూరప్‌ల సాన్నిహిత్యం భిన్నమైనది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నందువల్లనే అమెరికా ట్యారిఫ్లను వారు బలంగా ఎదుర్కొంటూ, ఆ దేశం దిగి రావలసిందేనని స్పష్టం చేస్తు న్నారు. ఇదంతా భారతదేశానికి సాధ్యమయ్యేది కాదు.అందువల్ల స్థూలంగా జపాన్ నమూనా ఒక్కటే మిగులుతున్నది. దక్షిణ కొరియా, మెక్సికో మొదలైన వాటి వైఖరి కూడా ఇంచుమించు ఇదే విధంగా కనిపిస్తున్నది. ఈ పద్ధతి ఇంకా ఇదమిత్థంగా రూపు తీసుకోలేదు. చర్చలు జరిగే కొద్దీ ఇందుకొక రూపం రాగలదని భావించవచ్చు. భారత్ స్థూలంగా జపాన్ తరహా వైఖరిని తీసుకుంటున్నట్లు కని పిస్తున్నది. ఇందులోనూ ఒక ఆకు తక్కువే. అమెరికాతో జపాన్‌కు గల వ్యూహాత్మక భాగస్వామ్యం వేరు. అందుకే ‘స్థూలంగా’ అనే మాటను ఉపయోగించటం. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, భారతదేశం గురించి మాట్లాడుకోవలసిన మౌలికమైన విషయాలు రెండున్నాయి. భారత అభివృద్ధి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? కొత్త అభివృద్ధి లక్ష్యాల సాధనకు అనుసరించవలసిన మార్గం ఏమిటని ప్రభుత్వం భావిస్తున్నది? సుంకాల యుద్ధంపై తీసుకోగల వైఖరికి ఈ ప్రశ్నలతో సంబంధం ఉంటుంది.దేశ ప్రయోజనాలే ముఖ్యం!ఆర్థికాభివృద్ధి రీత్యా ఇండియా ఇంకా వర్ధమాన దేశమే. అభివృద్ధి చెందుతున్నా, ఆ వేగం ఉండవలసినంతగా లేదు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే అంతర్గతంగా జరగవలసింది చాలా ఉండటంతో పాటు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి, ఇంచు మించు తన స్థాయిలో గల వర్ధమాన దేశాల నుంచి, అవసరమైన వనరులు గల దేశాల నుంచి సహకారం అవసరం. అందుకోసం ఈ కూటమి, ఆ కూటమి అనే ఒకప్పటి రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వైపుల నుంచి సహకారం కోసం సమ సంబంధాలు పాటించాలి. దేశ ప్రయోజనాలే దేనికైనా గీటురాయి కావాలి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఉండరు. పరిస్థితులు, ఫిలాసఫీ రెండూ ఇవే. ఇదంతా ఇప్పుడు మనం సుంకాల సమస్యల సందర్భంలో కొత్తగా సూత్రీకరిస్తున్నది కాదు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ‘ది ఇండియా వే, స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టెన్ వరల్డ్’ (2020) పేరిట రాసిన పుస్తకంలో ఈ సూత్రీ కరణలన్నీ కనిపిస్తాయి. శీర్షిక దానికదే ఎంతో అర్థవంతమైనది. ‘మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా జీవించటమే వివేకం’ అనే తిరు వళ్ళువర్ బోధనతో ఆయన తన పుస్తకాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ పాలకులు వచ్చిపడుతుండగా చదరంగంలో మునిగి రాజ్యం పోగొట్టుకున్న బెంగాల్ నవాబుల ఉదంతంతో ‘షతరంజ్ కే ఖిలాడీ’ సినిమా తీసిన సత్యజిత్ రే హెచ్చరిక, అమెరికా బలహీనపడుతుండగా ముందుకు దూసుకుపోతున్న చైనాల గురించి చర్చిస్తూ, ‘ఇప్పుడు భారతదేశం తనను తాను నిర్వచించుకుంటుందా? లేక ఇంకో ప్రపంచమే నిర్వచిస్తుంటుందా?’ అని ప్రశ్నిస్తారు. స్వయంగా అమెరికా, చైనాలలో రాయబారిగా పనిచేసిన జైశంకర్ సూత్రీకర ణలు, రూపొందిస్తున్న విదేశాంగ విధానాలు ప్రస్తుత క్లిష్ట పరిణా మాలకు తగినవే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అబ్దుల్లాకు జరిగిన నమ్మక ద్రోహం
అమర్జీత్ సింగ్ దులత్ పుస్తకం జమ్ము –కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లాను ఎందుకంత తీవ్రంగా బాధించిందో అర్థం కాని విషయం. ఆర్.ఏ. డబ్ల్యూ(రా) మాజీ ఉన్నతాధికారి దులత్ ఆయన మీద రాసిన ‘ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై’ పుస్తకం ఏమీ ఫరూఖ్‌కు తెలియకుండా వెలువడలేదు. ‘‘ఫరూఖ్ అబ్దుల్లా మీద నా అవగాహనతో రాసిన నా కథ’’ అని రచయిత ముందుమాటలో చెప్పుకొన్న ఈ రచనకు ఫరూఖ్ మద్దతు ఉంది. దాని గురించి వారిద్దరూ ‘‘అనేకసార్లు మాట్లాడుకున్నారు.’’ ఆయన ‘‘కరో నా (కానీయ్)’’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే పుస్తకం వెలుగు చూసింది. కానీ పుస్తకం బయటకు వచ్చాక ఫరూఖ్ ఎంతో నొచ్చుకున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఈ పుస్తకం ఒక ప్రశంసా గీతిక అనేది సత్యం. ‘నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అంటే ఫరూఖ్ అబ్దుల్లానే అనీ, ఆయన లేకపోతే ఎన్సీ ఎక్కడ ఉండేదో ఊహించలేమనీ పుస్తకం చెబుతుంది. అంతటి తోనే ఆగదు. ‘‘డాక్టర్ సాహిబ్ కేవలం ముఖ్యమంత్రి కారు, ఆయనే కశ్మీర్’’ అని తేల్చిచెప్తుంది. ఫరూఖ్ తన తండ్రి షేక్ అబ్దుల్లా కంటే గొప్ప వ్యక్తి అనీ, బహుశా ఆయనే నేడు దేశంలో అత్యున్నత నాయ కుడు అనీ దులత్ ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ ప్రశంస అతిశయోక్తి. కానీ, దులత్ దృష్టిలో అక్షర సత్యం.ఫరూఖ్ ఎదుర్కొన్న పలు సంక్షోభాల గురించి ఈ పుస్తకం చెబుతుంది. ఫరూఖ్ ‘‘శ్రీనగర్‌కు ఢిల్లీకి నడుమ వారధిగా ఉండాలని కోరుకున్నారు... ఆయన రాజకీయాల్లో ఉన్నది ఢిల్లీతో కలిసి పని చేయడానికే గానీ, వ్యతిరేకంగా కాదు.’’ కానీ సమస్య ఏమిటంటే, ఢిల్లీ ఆయన ఆలోచనను గ్రహించలేక పోయింది. ‘‘ఫరూఖ్ అబ్దుల్లాను, ఆయన ఆశయాలను ఢిల్లీ ఏనాడూ అర్థం చేసుకోలేదు... దేశ రాజధానికి అంతు చిక్కనిది ఏదో ఆయనలో ఉంది.’’ ఇది ఒక పార్శ్వమైతే, రెండోది – కశ్మీరు ప్రజలతోనూ ఆయన సంబంధాలు. అవి ఏనాడూ సవ్యంగా లేవు. ఢిల్లీ మీద కశ్మీర్ ప్రజలకు విశ్వాసం లేదు. ‘‘ఢిల్లీతో ఏ మాత్రం సంబంధం ఉన్నా సరే ఆ వ్యక్తులను, సంస్థలను వారు అనుమానిస్తారు.’’ ఈ క్రమంలో ‘‘ఇండియా పట్ల విధేయత కారణంగా ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబం కశ్మీరు పౌరుల ఆగ్రహానికి గురైంది.’’ ఫరూఖ్ అబ్దుల్లా అడకత్తెరలో పోకచెక్క అయ్యారు. ఢిల్లీకిచేరువ కావడం కోసం ఆయన ప్రయత్నించారు. కాని అక్కడ ఆయనకు పూర్తి ఆదరణ లభించలేదు. ఇక తాను దేని కోసం తపన పడుతున్నదీ తన సొంత ప్రజలకు అర్థం కాలేదు. వారి నుంచిమద్దతుకు బదులుగా అనుమానం, ఆగ్రహం ఎదుర్కోవలసివచ్చింది.కశ్మీరు రాజకీయాలను మిగతా దేశం నుంచి విడదీసిన క్లిష్ట సమస్య ఏమిటో దులత్ బాగానే అర్థం చేసుకున్నారు. ‘‘కశ్మీరు నాయ కులు కశ్మీరులో ఒక విధంగా మాట్లాడతారు, ఢిల్లీ వెళ్లి అక్కడ వేరేలా మాట్లాడతారు’’ అని ఆయన వివరించారు. ఆయన ఈ రెండు నాలుకల వైఖరిని కపటత్వంలా కాకుండా ‘ఫ్రెంచి భాష’లో పేర్కొనే ఒక రకమైన సభ్యతగా భావిస్తారు. వారున్న పరిస్థితిలో మనుగడ కోసం అలా మాట్లాడక తప్పదు. అది అవకాశ వాదం కాదు.దులత్ కథనం ప్రధానంగా ఫరూఖ్ అబ్దుల్లా ఎదుర్కొన్న మూడు నమ్మక ద్రోహాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన 370వ అధికరణం రద్దు వాటిలో ఒకటి. దులత్ దీన్ని సరిగ్గా చెప్పలేక పోయారు. అది వేరే విషయం. మిగిలిన రెండూ ఫరూఖ్ మెచ్చేలానే రాశారు.మొట్టమెదటి ద్రోహం – 1984లో ఒక అర్ధరాత్రి జరిగింది.ఇందిరా గాంధీ ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి కూలదోశారు. అది ఆయన మనసులో మానని గాయాన్ని మిగిల్చింది. ‘‘... ఆయన దీన్నుంచి కోలుకున్నారని నేననుకోవడం లేదు’’ అని ఇందిరను తీవ్రంగా దుయ్యబడుతూ దులత్ వ్యాఖ్యానించారు. దీంతో ఫరూఖ్ విభేదిస్తారని నేను అనుకోను. రెండోది – 2002 నాటిది. వాజ్‌పేయి, అద్వానీ కలిసి ఫరూఖ్‌కు ఉప రాష్ట్రపతి పదవి వాగ్దానం చేశారు. అయితే, వారు తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేక పోయారు. వారి వాగ్దానానికి ‘‘ఫరూఖ్ఉప్పొంగిపోయారు... ఏదో ఒక రోజు భారత రాష్ట్రపతి కావాలన్నది ఆయన జీవితాశయం. దానికి ఇది తొలి మెట్టు అను కున్నారు.’’ దులత్, ఫరూఖ్ స్నేహబంధం ఇప్పుడు చిక్కులు ఎదుర్కొంటున్నా అది తెగేది కాదు. దులత్ తమను కలిపి ఉంచే ఆ బంధంపై ఇలా అంటారు. ‘‘డాక్టర్ సాహిబ్ నన్ను ఎంత నమ్మారో నేను ఎప్పటికీ తెలుసుకోలేను – ఆయన గురించి నాకు ఎంత తెలుసో ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.’’ఏమైనప్పటికీ, దులత్ అవగాహనలో లోపాలు స్పష్టంగా కనబడతాయి. లేనట్లయితే, తనను విశ్వాసంలోకి తీసుకుని ఉంటే 370వ అధికరణం రద్దు విషయంలో సాయం అందించడానికి ఫరూఖ్ అబ్దుల్లా సుముఖమే అనే ఆరోపణ మీద దురదృష్టకరమైన ఈ వివాదం తలెత్తేదే కాదు. తన పుస్తకం మొదటి అధ్యాయంలోనే దులత్ ఇంతటి కీలకాంశం లేవనెత్తడం హాస్యాస్పదం.‘‘ఫరూఖ్ మూడు దశాబ్దాలుగా నాకు తెలిసి ఉన్నా, నాకు ఆయన నిజంగా తెలుసు అని పూర్తి నమ్మకంగా ఏనాడూ చెప్పలేను. అదీ డాక్టర్ సాహిబ్ అనే ప్రహేళిక. ఆయన్ను తెలుసుకోవడం అంత సులభం కాదు.’’ గత వారం తలెత్తిన వివాదం, దులత్ చెప్పిన అంశాన్నే విషాదకరంగా రుజువుచేసింది.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-కరణ్ థాపర్ -
ప్రభుత్వ ప్రాయోజిత మత పక్షపాతం
కొత్త వక్ఫ్ చట్టాన్ని ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక తప్పుడు సంకే తాన్ని ఇస్తున్నాయి. ముస్లిం ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలను వక్ఫ్అంటారు. 1995 నాటి వక్ఫ్ చట్టం ఇప్పటి వరకు అమలులో వుంది. ఇప్పుడు దీన్ని ‘యునైటెడ్ వక్ఫ్ మేనే జ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్–2025 (యూడబ్ల్యూఎమ్ఈఈడీఏ)గా మార్చారు. వక్ఫ్ సవరణ బిల్లు ఏప్రిల్ 3న లోక్‌సభలో 288 – 232 ఓట్ల తేడాతో గెలిచింది. రాజ్యసభలో ఏప్రిల్ 4న 128 – 95 ఓట్ల తేడాతో గెలిచింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది. ఇక్కడ ఒక విశేషం ఉంది. 543 మంది సభ్యు లున్న లోక్ సభలో ముస్లింలు 24 మంది మాత్రమే. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.అంటే 208 మంది ముస్లిమే తర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. అలాగే 245 మంది సభ్యులున్న రాజ్య సభలో ముస్లింలు 15గురు మాత్రమే. 95 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 80 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. రెండు సభల్లోనూ కలిపి ముస్లింల సంఖ్య 39 మాత్రమే. వాళ్ల పక్షాన నిలిచిన ముస్లిమేతరులు 288 మంది. కొత్త చట్టం రాజ్యాంగ ఆదర్శాలకు, హామీలకు విరుద్ధంగా ఉందనీ, దాన్ని పునఃసమీక్షించాలని కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు సుప్రీంకోర్టులో 70కు పైగా పిటీషన్లు వేశాయి. ఈ విషయంలోనూ ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ముస్లిమేతరుల సంఖ్య చాలా ఎక్కువ. మన దేశంలో వర్ధిల్లుతున్న మతసామరస్యానికి ఇది తాజా ఉదాహరణ. దీనికి విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టానికి మద్దతు ప్రకటించాయి. ఒక బిల్లు ఉభయ సభల్లో మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమోద ముద్రపడి చట్టంగా మారాక కూడ సుప్రీం కోర్టుకు చేరడం విశేషం. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. కొత్త చట్టంలో వివాదాంశాలు అనేకం ఉన్నాయి. ఇందులో నాలుగు అంశాలు మరింత తీవ్రమైనవి. వక్ఫ్ బోర్డులో, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కొత్తగా ముస్లిమేతరులను అనుమతించడం తీవ్రమైన వివాదంగా మారింది. వక్ఫ్ భూముల్లో ‘వక్ఫ్ బై యూజర్’ సౌలభ్యాన్ని తొలగించి అది వక్ఫ్‌గా కొనసాగాలంటే రిజిస్ట్రేషన్ దస్తావేజులు చూపాలనడం ఇంకో వివాదాంశం. వక్ఫ్ ఆస్తి అవునో కాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించడం, కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్ ధార్మిక ఆచరణను కొనసాగిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ దానం చేయడానికి అర్హులు అనడం కూడా వివాదంగా మారింది. వక్ఫ్ భూములకు దస్తావేజులు చూపడం అసాధ్యమైన విషయం. 19వ శతాబ్దం ఆరంభం వరకు మన దేశంలో అసలు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ల సంప్రదాయమే లేదు. లార్డ్ కార్న్ వాలిస్ 1793లో తొలిసారిగా శాశ్వత భూమిపన్ను విధానాన్ని తెచ్చాడు. అది కూడా ఇప్పటి బెంగాల్, బిహార్, ఒడిశాప్రాంతంలో మాత్రమే. ఆ తరువాత థామస్ మన్రో మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో రైత్వారీ విధానాలను తెచ్చాడు. భారత దేశంలో 8వ శతాబ్దం నాటికే ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తరువాత మనకు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ విధానాలు వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం సరిగ్గా ఈ అంశాన్నే పట్టించుకుంది. ‘మనం చరిత్రను తిరగరాయలేం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు గుర్తుచేశారు. వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించడమేగాక, రెండు మత సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని, ముస్లింల గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నదని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ఇలా రెండు మతసమూహాల కలయిక ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగానే నమ్ముతోందా? నమ్మితే హిందూ ధర్మాదాయ కమిటీల్లోనూ హిందూయేతరులకు స్థానం కల్పించాలిగా? సరిగ్గా ఈ ప్రశ్ననే భారత ప్రధాన న్యాయమూర్తి వేశారు. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు వక్ఫ్ భూములు వేటినీ డీ–నోటిఫై చేయరాదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. ఇందులో ఒక కిటుకు ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా మరో మూడు వారాల్లో, మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఎలాగోలా ఈ సమయాన్ని సాగదీస్తే అనుకూ లమైన తీర్పు తెచ్చుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.- వ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776'- డానీ -
Dr B R Ambedkarవీళ్ళే ఇలా రాస్తే ఎలా?!
అంబేడ్కర్ జయంతికి కేంద్ర మంత్రులు అంబేడ్కర్‌పై పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఒకరు దీన్ని కాంగ్రెస్ విమర్శకు వాడుకుంటే, మరొకరు అంబేడ్కర్ నోట అబద్ధాలు కుక్కారు. వీటిని ఆదర్శాల పేరుతో భావితరాలకు బోధిస్తారట. ఆర్య దండ యాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తప్పు పట్టారనీ, సంస్కృతాన్ని అధికార భాషగా ఆమోదించడానికి మద్దతుగా రాజ్యాంగ సభలో సవరణను ప్రవేశపెట్టారనీ. హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి అని ప్రకటించారనీ ఇలా ఎన్నో అవాస్తవాలను రాశారు వారు. ‘‘ఇండో–ఆర్యులు ఇండియాకు వలస వచ్చి స్వదేశీయులను తరిమేశారు. వలస వాద, బ్రాహ్మణవాద కథనాలు కులాధిపత్య సమర్థనలు. ఆర్యులు సాంస్కృతిక భాషా సమూహం, ప్రత్యేక జాతి కాదు. రుగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాల్లోని విభేదాలు సామాజిక అంత ర్గత పోరాటాల ప్రతిబింబాలు. ఆర్య దండయాత్ర సూత్రం ఆర్యేతర శూద్రుల, దళితుల అణచివేత సాధనం.’’ అని రాశారు అంబేడ్కర్. ఆర్య సూత్ర జాతి సంస్కృతుల ఊహలను సవాలు చేశారు. యజుర్, అధర్వణ వేదాల రుషులు శూద్రు లకు తగిన ప్రాధాన్యమిచ్చినట్లు అంబేడ్కర్ అనలేదు. ‘‘శూద్రులు ముందు ఆర్య క్షత్రియుల్లో భాగం. జనశ్రుతి (శూద్రుడు) వైదికజ్ఞాన అభ్యాసం, కవశ ఐలూశ (శూద్రుడు) శ్లోకాల రచన సంగతులు ఈ వేదాల్లో ఉన్నాయి. వేదాలు శూద్రుల జాతి, సామాజిక హీనతను సమర్థించ లేదు. మనుస్మృతి ఆ పని చేసింది. బ్రాహ్మణ, ప్రత్యేకించి ఉపనయన, ఆచారాల విభేదాలతో వారిని నాల్గవ వర్ణానికి దిగజార్చారు. శూద్రుల ఉన్నత స్థాయి తగ్గింపునకు వేదకాలం తర్వాతి బ్రాహ్మణ నీతి ఇది’’ అని అన్నారు. అంబేడ్కర్ శూద్రులతో పోల్చి ఆర్యులను పొగడలేదు. ఆర్య ఉన్నత జాతి సూత్రీ కరణను తిరస్కరించారు. ద్రవిడ, నాగ, దాస తెగలు అనార్యుల్లో భాగమని, వారు ఆర్యు లకు ఏ విధంగానూ తక్కువ కారని అంబేడ్కర్ అభిప్రాయం. అంబేడ్కర్ అధి కార భాషగా సంస్కృతానికి మద్దతివ్వలేదు. సంస్కృతాన్ని ప్రజలు అతి తక్కువగా వాడు తారని, పాలనకు, ప్రజలు ఒకరితోనొకరు మాట్లాడుకోవడానికి సంస్కృతం ఆచరణీయం కాదనేది ఆయన అభిప్రాయం. హిందీని రుద్దడం హిందీయేతర భాషా ప్రాంతాల అణచివేతకుదారి తీయగల అపాయాన్ని జాగ్రత్తగా పరిగణించాలన్నారు. ఆంగ్లంతో పాటు హిందీ భారత ప్రజల లంకె భాషగా ఉండాలని అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో వాదించారు. మరిఅంబేడ్కర్ ఆదర్శాలను సంఘ్ సర్కారు ఆచరిస్తుందా? – సంగిరెడ్డి హనుమంత రెడ్డి,ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
పటేల్‌కూ, నెహ్రూకూ పడదంటారా?
ఇండియా ఈ ఏడాది అక్టోబర్ 31నసర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంత్యుత్సవం జరుపుకోబోతోంది. జనం మర్చి పోయిన పటేల్ గుణగణాలు కొన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తన సహోదరు లను ఆయన ఎంతో జాగ్రత్తగా చూసుకు న్నాడు. వల్లభ్‌కు నలుగురు సోదరులు. వారిలో ముగ్గురు తన కంటే పెద్ద వారు. ఆయన ఏకైక సోదరి దహిబా అందరికంటే చిన్నది. సంతానంలో మధ్యవాడు కాబట్టి వల్లభాయికి చిన్నతనంలో తగినంత మన్నన, ఆప్యాయత లభించలేదు. ఈ అనాదరణే ఆయనను ఒక వాస్తవవాదిగా, యోధుడిగా మార్చింది. తండ్రి ఝవేర్ భాయ్ ఎప్పుడూ ధనికుడు కాదు. పైగా కాలక్రమంలో ఉన్నది కూడా కరిగిపోయింది. వల్లభ్ తెలివైన వాడు, విశాల హృదయుడు. కాబట్టే, తోడబుట్టిన అయిదుగురి బాగోగులు, డబ్బు అవసరాలు తనే చూసుకున్నాడు.వల్లభ్ దయాగుణం నుంచి ఆయన చిన్నన్న విఠల్ భాయ్ అత్యధికంగా ప్రయోజనం పొందాడు. మన స్వాతంత్య్రోద్యమ హీరో కూడా అయిన విఠల్ 1933లో యూరప్‌లో అనారోగ్యంతో చనిపోయాడు. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆయనకు సుశ్రూషలు చేశాడు. విఠల్ భాయ్ 1925–30 కాలంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించాడు. ఈ ఇద్దరు సోదరులూ బొర్సాద్ (గుజరాత్) టౌనులో లాయర్లు. ఆ సమయంలో, వల్లభ్ లండన్ వెళ్లి బారిష్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బు పొదుపు చేసుకుని పాస్ పోర్టు, టికెట్ సంపాదించాడు. అయితే వీజే పటేల్, ప్లీడర్, బొర్సాద్ పేరిట ఆయనకు వచ్చిన కవరును పోస్ట్‌మన్ అదే పేరుతో నమోదై ఉన్న సోదరుడు విఠల్ ఇంటికి బట్వాడా చేస్తాడు. దీంతో విఠల్‌కు తానూ ఇంగ్లాండు వెళ్లి బారిష్టరు కావాలన్న ఆలోచన వచ్చింది. ముందు నువ్వు వెళ్తే నీకంటే పెద్దవాడినైన నేను ఆ తర్వాత వెళ్లలేను. నీ పాస్ పోర్టు, టికెట్‌తో నేను లండన్ వెళ్తాను అని తమ్ముడిని కోరతాడు. వల్లభ్ సరే అనడమే కాకుండా విఠల్ లండన్ చదువుకు డబ్బు కూడా సమకూర్చాడు. ఆయన కుటుంబ భారాన్నీ మోశాడు. నాలుగేళ్ల తర్వాత 1910లో తనూ లండన్ వెళ్లి అద్భుత ప్రతిభ కనబరచి, 1912లో బారిష్టర్ పట్టాతో ఇండియా తిరిగి వస్తాడు. జైల్లో ఉండి కూడా సర్దార్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తన సాటి సమర యోధులను ఎందరినో ఆర్థికంగా ఆదుకునేవాడని, వారి వైద్య ఖర్చులకు సాయం చేసేవాడని... పటేల్ జీవిత చరిత్ర కోసం 1987 ఏప్రిల్‌లో నేను ముంబాయిలో ఇంటర్వ్యూ చేసినప్పుడు మురార్జీ దేశాయ్ చెప్పారు. సాటి సమర యోధుల ఇక్కట్లను చూసి మన ఉక్కుమనిషి హృదయం ఇట్టే కరిగిపోయేది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జీవితంలో ఆయన ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవి నేడు ఎంతమందికి తెలుసు? 1927 జులైలో పెను తుపాను రావడంతో గుజరాత్ విలవిల్లాడి పోయింది. ఆ సమయంలో బాధితులను ఆదుకునేందుకు అహ్మదా బాద్, పరిసర ప్రాంతాల్లోని ఎందరో ఆయన స్ఫూర్తితో ముందు కొచ్చారు. అప్పట్లో పటేల్ గుజరాత్ కాంగ్రెస్ కమిటీ, అహ్మదాబాద్ మునిసిపల్ కౌన్సిల్ రెంటికీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో కనబరచిన దక్షతను గుర్తించి బ్రిటిష్ రాజ్ అధికారులు ఆయనకు తగిన బిరుదు ఇవ్వజూపారు. సమాధానంగా ఆయన బిగ్గరగా ఒక నవ్వు నవ్వారు. ‘సర్ వల్లభ్ భాయ్’ అని పిలిపించుకుంటే చాలామందికి అప్పుడు ఇప్పుడు సంబరంగా ఉండేదేమో. కాని, ఖేదా జిల్లా వాసులైన ఝవేరీభాయ్, లద్భా దంపతుల ఈ బిడ్డ ఎంతో గట్టి మనిషిగా, ఎన్నో కీలక పర్యవసానాలకు కారకుడిగా భారత దేశ భావితరాలకు తన ముద్రను మిగిల్చి వెళ్లేవాడా?దాదాపు ఒక శతాబ్దం క్రితం 1920లలో మునిసిపల్ కౌన్సిల్ సారథిగా పటేల్ అహ్మదాబాద్‌ను ‘నడిపించాడు’. అలాగే జవహర్ లాల్ నెహ్రూ అలహాబాద్ ను ‘నడిపిస్తున్నాడు’. 1920–22 సహాయ నిరాకరణ ఉద్యమానికి 1930–33 శాసనోల్లంఘన ఉద్యమానికి మధ్య కాలమది. దేశం ఇతర ప్రాంతాల్లో, కోల్‌కతా మునిసిపాలిటీకి చిత్తరంజన్ దాస్, పాట్నా టౌన్ కౌన్సిల్‌కు రాజేంద్ర ప్రసాద్, ముంబాయి మునిసిపాలిటీకి విఠల్ భాయ్ పటేల్ సారథులుగా ఉన్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పుడు నేర్చుకున్న పాఠాలు ఎంతగానో ఉపకరించాయి. 1948లో, వల్లభ్ భాయ్ పటేల్ నగర పాలక పాత్రకు ముగింపు పలికి రెండు దశాబ్దాలు ముగిసిన సందర్భంగా, ముంబాయిలో ఆయనకు పుర ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారత ఉప ప్రధాని ఆ సభలో మాట్లాడుతూ, ‘‘ మీరు ఎన్నో విజయాలు ప్రస్తావించారు. వాటిలో కొన్ని నేను సాధించినవి. కొన్ని నేను సాధించనివి. కాని అభ్యంతరం లేకుండా నేను అంగీకరించే ఒక విషయం: అహ్మదాబాద్ మునిసిపాలిటీకి నా శక్తివంచన లేకుండా సేవ చేశాను. స్వచ్ఛమైన ఆనందం పొందాను... నగరంలోని మురికిపై పోరాడితే మీకు రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు మీకు రాత్రి కూడా ప్రశాంతత ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.నగర బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత పటేల్ అసాధారణ నాయకత్వ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 1928లో గుజరాత్‌లోని బార్డోలీ ప్రాంత రైతాంగం మీద బ్రిటిష్ పాలకులు విధించిన పన్నులకు వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆయన విజయవంతంగా నిర్వహించారు. అప్పుడే అక్కడి ప్రజలు పటేల్‌కు ‘సర్దార్’ బిరుదు ఇచ్చారు.1916 నుంచీ వల్లభ్ భాయ్ పటేల్– నెహ్రూలు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఉన్నారు. అయితే, 1937లో ఇద్దరూ కలిసి గుజరాత్లో ఒక వారం రోజులు పర్యటించినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఇద్దరూ జట్టుగా పనిచేశారు. పటేల్‌కు మహాత్మా గాంధీ ఒక లేఖ రాస్తూ, ‘‘ మీరిద్దరూ కలిసినప్పుడు, మీలో ఎవరు గట్టివారో చెప్పడం కష్టం’’ అని వ్యాఖ్యానించారు. తర్వాతి సంవత్సరాల్లో పటేల్– నెహ్రూల నడుమ ఉద్రిక్తతలు, అపోహలు, అప్పుడప్పుడు పరుష భాషణలు తలెత్తాయి. ఏమైనప్పటికీ, స్నేహం, ఒకరి మీద మరొకరికి ప్రశంసా భావన, పరస్పర విధేయత, గాంధీ పట్ల ఉభయుల విధేయత, స్వాతంత్య్ర పోరాటం పెంచిన బంధం... వాటికంటే బలమైనవి.ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. సంబరాలు తెచ్చింది. వాటితో పాటే విభజన విషాదాలు ప్రజలు చవిచూశారు. తాము ఉభయులం ఒకరికొకరుగా ఉండటం ఎంత అదృష్టమో వల్లభ్ భాయ్ పటేల్– నెహ్రూలు గుర్తించారు. 1950 జనవరిలో గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి స్వతంత్ర భారత తొలి దేశాధిపతి పదవీకాలం ముగిసిన అనంతరం దేశానికి తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ వీరిరువురినీ ప్రస్తావిస్తూ, ‘‘ప్రధాన మంత్రి, ఆయన తొలి సహచరుడైన ఉప ప్రధాన మంత్రి కలిసి దేశాన్ని అన్ని విధాలాసుసంపన్నం చేసే గొప్ప ఆస్తి అయ్యారు. మొదటి వారు సార్వజనీన ప్రేమను, రెండో వారు సార్వజనీన విశ్వాసాన్ని చూరగొన్నారు’’ అని చెప్పారు. కాలం మారుతుంది. గడచిన దశాబ్దాలు మర్చిపోతారు. ఎడతెగని తప్పుడు ప్రచారం జరుగుతుంది. అది ఎంత హాని చెయ్యాలో అంత హాని చేస్తుంది. నెహ్రూ అవమానం పాలయ్యాడు. పటేల్ విగ్రహం ఆకాశాన్ని తాకుతోంది... కానీ, ఆయన జీవితానికి, ఆలోచనకు, ఆయన చేసిన కృషికి సంబంధించిన వాస్తవాలు పాతాళంలోకి వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 1940లు, 1950లు ఇంకా గుర్తున్న, పటేల్– నెహ్రూలు ఉభయులనూ కలిసిన, పటేల్ జీవితాన్ని పరిశోధించి ఆయన జీవిత చరిత్ర రాసిన నాలాంటి వాడు తనకు తెలిసిన వాస్తవాలు ఏమిటో చెప్పితీరాలి.కాబట్టి, వారిద్దరి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి కొన్ని వాక్యాలు ఉటంకించి ఈ వ్యాసం ముగిస్తాను. 1948 ఫిబ్రవరి 3న సర్దార్ పటేల్‌కు నెహ్రూ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఒకరికొకరం సన్నిహితంగా ఉంటూ, ఎన్నో తుపానులనూ, ఇక్కట్లనూ కలసి కట్టుగా ఎదుర్కొని పావు శతాబ్దం గడచిపోయింది. ఈ కాలంలో మీ పట్ల నా గౌరవాభిమానాలు పెరిగాయని పూర్తి నిజాయితీతో చెప్పగలను...’’1948 ఫిబ్రవరి 5న నెహ్రూకు సర్దార్ పటేల్ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఇద్దరం ఒక ఉమ్మడి లక్ష్య సాధనలో జీవితకాల మిత్రులు (కామ్రేడ్స్)గా ఉంటున్నాం. దృక్పథాలు స్వభావాలు విభేదించినా, మన దేశ అత్యున్నత ప్రయోజనాలు, మనకు ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమాభిమానాలు వాటిని అధిగమించేలా చేస్తూ మనల్ని కలిపి ఉంచుతున్నాయి.’’-వ్యాసకర్త సంపాదకుడు, ప్రముఖ రచయిత, ‘పటేల్ – ఎ లైఫ్’ గ్రంథకర్త-రాజ్‌మోహన్ గాంధీ -
నేపాల్ పరిణామాలకు బాధ్యులెవరు?
మహారాజు జ్ఞానేంద్రకు మద్దతుగా నేపాల్‌లో ఏదో ఒక ప్రాంతంలోఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఇవి నేపాల్‌లో ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్చ్ 28వ తేదీన ఇవి ఘర్షణ స్థాయికి చేరి ఇద్దరు వ్యక్తులు మరణించగా అనేకమంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. ఇందుకు మహారాజు, ఆయన మద్దతుదారులు బాధ్యులని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు రాజు 8 లక్షల రూపాయల జరి మానా చెల్లించాలని కూడా ఆదేశించింది. దీన్ని ప్యాలెస్ఖండించింది. మరోవైపు ప్రభువు మద్దతుదారులంతా నిధులు సేకరించి సొమ్ము చెల్లించటానికి సిద్ధమవుతున్నారు.ఒకప్పుడు రాచరికాన్ని కాదనుకున్న నేపాలీ సమాజం ఇప్పుడు రాజుకు ఎందుకు మద్దతు పలుకుతోంది? ఇందుకు నేపాల్ పాలకుల తీరే కారణం. 2008లో నేపాల్‌లో రాచరికం రద్దయిన తర్వాత 17 ఏళ్ల కాలంలో 18 ప్రభుత్వాలు నేపాల్‌ను పాలించాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా సజావుగా పాలించిన రికార్డు లేదు. అవసరార్థం సర్దుబాట్లు చేసుకుని సంకీర్ణ ప్రభుత్వాలను నడిపారు. ఇప్పటి కేపీ ఓలి, షేర్ కుమార్ దుబా, ప్రచండ... ఇలా ప్రధానులంతా తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న వారే. రాజకీయ అస్థిరత ఒకవైపు, అవినీతి మరోవైపు నేపాల్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఉపాధి అవకాశాలు తగ్గి పోయాయి. యువత దేశాన్ని వదిలి ఉపాధి కోసం బయట దేశాలకు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజు మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. రాచరికాన్నిరద్దు చేయటం వల్ల నేపాల్ సార్వభౌమాత్వానికి దెబ్బ తగిలిందనీ, తిరిగి రాజు అధికారం చేపడితే ప్రపంచ దేశాల్లో నేపాల్ గుర్తింపు సంపాదిస్తుందని భావిస్తున్న వాళ్లు కొందరు ఉన్నారు. మరొక అంశం ‘హిందూత్వ’. నేపాల్‌ను హిందూ స్టేట్‌గా మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇందుకోసం తెరవెనక ప్రయత్నాలు సాగుతున్నాయి. మహరాజు జ్ఞానేంద్ర ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ కావటం, ఆయన ఫొటోలు నేపాల్ వీధుల్లో దర్శనం ఇవ్వటం వంటి ఇటీవల పరిణామాలు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. అల్లర్ల వెనక భారత్ ఉందని నేపాల్ ప్రభుత్వం ఆరోపించటానికి ఇది కూడా ఒక కారణమని మనం భావించవచ్చు. ఇప్పుడు చెలరేగుతున్న ఆందోళనలు రానున్న రోజుల్లో ఎటు దారితీస్తాయో తెలి యదు. నేపాల్‌లో ఆందో ళనలకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నాయకత్వం వహిస్తున్నా, ఇందులో అసాంఘిక శక్తులతో పాటు చైనా పాత్రను కొట్టేయలేం. చాలా కాలంగా చైనా ఆధ్వ ర్యంలో నేపాల్‌లో భారత్ వ్యతిరేక కార్యక్రమాలు సాగుతున్నాయి. దీనికి కమ్యూనిస్టు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. సరిహద్దులో ఆగడాలను చూసీ చూడకుండా వదిలేస్తోంది. భారత్‌తో సంబంధాలు దెబ్బ తిన్నప్పుడు రాజు జ్ఞానేంద్ర చైనాతో స్నేహంగా మసిలిన మాట నిజమే. అలాగని ఆయనకు ఇప్పుడుచైనా మద్దతుగా ఉంటుందని భావించలేం. నేపాల్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని యూఎస్, యూకే, ఇండి యాలు గుర్తిస్తున్నాయి. ప్రజాపాలన నుంచి రాచరికంలోకి మారినంత మాత్రాన నేపాల్ అభివృద్ధి ఫలాలను అందుకుంటుందని చెప్పలేం. రాజు అధికారంలోకి వస్తే అన్నీ సర్దుకుంటాయన్న భావన తార్కికంగా సమంజసంగా లేదు. మార్పు మంచిదే. అదీ అభివృద్ధికి తోవ చూపించినప్పుడే కదా? డా.పార్థసారథి చిరువోలు సీనియర్ జర్నలిస్ట్ -
పెరుగుతున్న మత సమ్మతి
దేశంలో మతతత్వం పెరిగిపోతోంది. కొన్నే ళ్లుగా ఈ ధోరణి మరీ ఎక్కువైంది. అడు గడుక్కీ గుళ్లు, మసీదులు వెలుస్తున్నాయి. నేనీ మధ్య తెలంగాణ వెళ్లాను. చిన్న పల్లె టూళ్లలో సైతం రెండు మూడు దేవాలయాలు ఉన్నాయి. హిందువులకు దేవుళ్లు చాలామంది, కాబట్టి గుళ్ళు కూడా ఎక్కువ గానే ఉంటాయి అనుకోవడం పొరపాటు. హిందూ సమాజం కులాలు, గోత్రాలు, జాతులు,వంశాలుగా చీలిపోయి ఉంది. గుళ్లు గోపురాలు అసంఖ్యాకంగా పుట్టుకురావడానికి ఈ భిన్నవర్గాల సమాజం ఒక ప్రధాన కారణం.జనంలో పెరుగుతున్న వ్యాపార దృష్టి ఇందుకు మరొక ముఖ్య కారణం అనిపిస్తోంది. పౌర సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తు న్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ ఏజెంట్లకు, బళ్లపై పళ్లు అమ్ముకునే వారికి, అనేకానేక చిల్లర పనులకు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ‘లైసెన్స్’లు ఇచ్చి డబ్బు పోగేసు కోవడం మనకు తెలుసు. గ్రామాల్లో సైతం ఈ తరహా సంస్కృతి విస్తరించింది. గ్రామ కమిటీలు అంటూ తయారయ్యాయి. ఇవీ ఇదే మాదిరిగా కొత్త ఆదాయ మార్గాలు కనిపెట్టాయి. ఇసుక మైనింగు, అక్రమ మద్యం అమ్మకాల వంటి కార్యకలాపాలను ఈ కమిటీలు నియంత్రిస్తున్నాయి. ఆ డబ్బును ప్రజల రోజువారీ జీవితాలను బాగు పరచేందుకు వాడతారా అంటే అదీ లేదు. బహుశా ఇక్కడికంటే పరలోకపు జీవితాలకు గిరాకీ ఎక్కువలా ఉంది. అందుకే, ఇలా ఆర్జించిన డబ్బును గుళ్లు కట్టడానికి వాడుతున్నారు.పెరుగుతున్న భక్తిమతం ఇప్పుడు రాజకీయాల్లో కంటే ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పర్యాటక ఆదాయం వాటా 9.6 శాతం. ఇందులో దేశీయ పర్యాటకం 88శాతం. గతేడాది ఇండియా సందర్శించిన విదేశీ పర్యాటకులు కేవలం 90 లక్షలు కాగా, స్థానిక యాత్రికుల సంఖ్య కళ్లు చెదిరేలా 14 కోట్లను దాటింది. కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ–ఆగ్రా–జైపూర్ ‘స్వర్ణ త్రిభుజం’ మీద అధిక శ్రద్ధ పెడుతుంటాయి. వాస్తవానికి తమిళనాడు సందర్శించేవారు అత్యధికంగా 20 శాతం ఉన్నారు. ఢిల్లీ పర్యాటకులు వారిలో సగం ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు దేశవిదేశాల టూరిస్టులను ఆకర్షించడంలో ముందు వర సలో నిలుస్తాయి. కారణం – మతపరంగా ప్రముఖమైన తిరుపతి, మదురై వంటి ప్రదేశాలు వీటిలో ఎక్కువగా ఉండటమే. తిరుపతి వల్ల ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అతిపెద్ద దేశీయ పర్యాటక ప్రదేశంగా రూపొందింది. రెలిజియస్ టూరిజం ఇప్పుడు అతిపెద్ద వ్యాపారం. గడచిన నాలుగైదు ఏళ్లలో గతంలో కంటే అధికంగా మతం మీద మమకారం పెంచుకున్న భారతీయులు 25 శాతం పైగానే ఉన్నారని ‘ప్యూ’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ యాటిట్యూడ్’ సర్వే తేల్చింది. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. అన్ని మతాల్లోనూ ఈ ధోరణి కనబడింది. మతం ఎంతో ముఖ్యమైందని భావిస్తున్న వారు 2007–15 మధ్య ఏకంగా 80 శాతానికి పెరిగారు. 11 శాతం పెరుగుదల! ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) నివేదిక ప్రకారం, మత ప్రదేశాల సందర్శనలపై చేసిన సగటు వ్యయం ఇదే కాలంలో రెట్టింపు కంటే ఎక్కువైంది. మత వ్యాపారానికి ఆకాశమే హద్దు (ఇందులో శ్లేష లేదు). ఇది ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. సంతోషమే! మరి మత భావన పెరుగుతూ పోవడం వల్ల తలెత్తే ఇతర పరిణామాల మాటేమిటి? సమాజంలో మూఢనమ్మకాలు, అంధభక్తి, మతపిచ్చి పెచ్చరిల్లుతాయి. ఒక ఆధునిక సమాజంగా ఇండియా ఆవిర్భవించకుండా ఇవి అడ్డుపడే ప్రమాదం ఉంది. లాభదాయక వ్యాపారంగుళ్లు లేదా మసీదులు నిర్మించడం లాభదాయక వ్యాపారం.అందుకే, ప్రార్థనా మందిరాల పేరిట నీతి లేని మనుషులు బహిరంగ ప్రదేశాలను కబ్జా చేయడం రివాజుగా మారుతోంది. ఒకసారి దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్ఠిస్తే, ఇక వాటిని ఎవరూ తొలగించలేరు. నగరాల్లో ట్రాఫిక్ చిక్కులకు ఈ నిర్మాణాలే చాలావరకు కారణాలు.సంత్ కబీర్ దాసు ఎంతో సరళంగా చెప్పిన కవితను ఈ సంద ర్భంగా నేను ప్రస్తావిస్తాను: ‘రాతిని పూజించడం వల్ల దేవుడు లభిస్తే, నేను పర్వతాన్ని పూజిస్తాను. కానీ ఈ చక్కీ (తిరగలి రాయి)మంచిది, ఎందుకంటే ఇది ప్రపంచాన్ని పోషిస్తుంది’. చేదు నిజం ఏమిటంటే, రాతి విగ్రహం తిరగలి రాయి కంటే మంచి ప్రతిఫలం ఇస్తోంది. మతభావన, మతపిచ్చి వ్యాపారంగా మారబట్టే, ప్రభు త్వాలు సైతం ‘రెలిజియస్ టూరిజం’కు పెద్దపీట వేస్తున్నాయి.వాస్తవానికి, ‘మీ విగ్రహం కంటే మా విగ్రహం మంచిది’ అనే రీతిలో ఒక కనిపించని పోటీకి దారి తీస్తోంది. తిరుమల ఆలయం ఇండియాలోనే అతి పెద్ద ‘మనీ స్పిన్నర్’. ఈ వైష్ణవ ఆలయాన్ని ఏటా 4 కోట్ల మంది దర్శించుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్టను పెద్ద మత పర్యాటక కేంద్రంగా ప్రమోట్ చేస్తోంది. సీపీఎం కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో కేరళ దేవాలయ బోర్డులు విగ్రహాల ‘మహిమల’ గురించి ప్రచారం చేస్తున్నాయి. దేవుడు మానవుడి ఊహాకల్పన అంటూ మనల్ని హేతుబద్ధంగా ఆలోచింప జేయాల్సిన సిద్ధాంతం ఆ ప్రభుత్వానిది. కానీ మాస్కో రెడ్ స్క్వేర్ , చైనా తియనాన్మెన్లలో మమ్మీలుగా మారిన శవాల నుంచి స్ఫూర్తి పొందే సిద్ధాంతం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?బహిరంగ సమర్థనా?మన తొలి ప్రధాన మంత్రి, నవ భారత వ్యవస్థాపక పితా మహుడు జవహర్లాల్ నెహ్రూ దేశం శాస్త్రీయ దృక్పథంతోముందుకు సాగాలని తలచారు. ఇప్పుడేం జరుగుతోంది? పిడివాదం, అంధవిశ్వాసం మనల్ని నడిపిస్తున్నాయి. మతం, మూఢభక్తి దేశానికి ప్రమాదకరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సమాజంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నెహ్రూ ఎప్పుడూ ప్రార్థనా స్థలాలు సందర్శించలేదు. విశ్వాసి అయినప్పటికీ ఇందిరా గాంధీ సైతం ఆలయాలకు దూరంగానే ఉండే వారు. అయితే ఆమె మనవడు రాహుల్ గాంధీ బొట్టు పెట్టుకుని గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. జంధ్యం కూడా ధరిస్తానని ప్రకటించారు. తాను శివభక్తుడిననీ చెప్పుకొంటారు. అమిత్ షా కూడా అదే చేస్తారు. ఇద్దరికీ కావల్సింది ఓట్లు! రేపిస్టుగా రుజువైన రామ్ రహీం సింగ్‌ను నరేంద్ర మోదీ ప్రశంసించడం అతడి నుంచి రాజకీయ మద్దతు ఆశించే కదా? రాజ్యాంగ పరిరక్షకులు, ప్రముఖ వ్యక్తులు ఆర్భాటంగా మత స్థలాలు సందర్శించడం పెరిగింది. గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల ఆల యంలో ప్రార్థనలు చేయడం మనకు తెలుసు. అంతకు ముందు ఏడాది మోదీ కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలు దర్శించారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ తిరుమల ఆలయంలో బాహాటంగా పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాథాలయంలో ఆయన అవమానం పాలైనట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని కేదార్నాథ్ లేదా అయోధ్య సందర్శించినా, మరొకరు అజ్మీర్ షరీఫ్ వెళ్లినా అది వాటిని ఆమోదించడమే అవుతుంది. అలా వెళ్లడం... షారుఖ్ ఖాన్ కోక్ బ్రాండ్‌కు ప్రచారం చేయడం కంటే భిన్నమైనమీ కాదు.- వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత- mohanguru@gmail.com -
Doon School మార్పు మంచిదే... ఆత్మనే మార్చకూడదు కదా!
‘డూన్’ స్కూల్లో బాలబాలికలు కలిసి చదువుకోవడాన్ని (కో–ఎడ్యుకే షన్) ప్రవేశపెట్టాలా? ఇది కొత్త ప్రశ్నేం కాదు. 2010లో చివరిసారి దీనిపై చర్చ జరిగింది. అప్పటి రాష్ట్ర పతి ప్రతిభా పాటిల్ స్కూల్ 75వ ఫౌండర్స్ డే కార్యక్రమంలో ఈ అంశం ప్రస్తావించారు. ఆమె ప్రతిపా దన విని మగపిల్లలు ముసిముసిగా నవ్వుకున్నారు. ఈ ఆలోచన వారి గుండెల్లో వెచ్చదనం నింపి వుంటుంది. పెద్దవారికి మాత్రం ఇదేం రుచించలేదు. కేవలం మగపిల్లల కోసం నెలకొల్పిన డూన్ స్కూల్ ఇండియాలోనే ప్రతిష్ఠాత్మక ఆశ్రమ పాఠశాల (బోర్డింగ్ స్కూలు) అని యాజమాన్యం భావిస్తుంది. సమాజంలో లింగ సమానత్వం ఉండాలన్న భావనతో ప్రతిభా పాటిల్ ఈ వ్యాఖ్య చేసి ఉంటారని ఆహూతులు భావించారు. ‘వెల్హామ్ గరల్స్’ లేదా ‘మహారాణి గాయత్రీ దేవి’ లేదా ఇండియాలో ఉన్న అనేక ‘లొరాటో కాన్వెంట్స్’ స్కూళ్లు ‘గరల్స్ ఓన్లీ (బాలికల) పాఠశాలలుగానే కొనసాగు తున్నాయి. అందుకు లేని అభ్యంతరం డూన్ స్కూల్ విషయంలో ఎందుకు? తొలుత ఎలా ప్రారంభమయ్యాయో అలాగే కొనసాగే హక్కు స్కూళ్లకు ఉండాలి. ఇది కో–ఎడ్యుకేషన్‌కు వ్యతిరేక వాదన అని పొరబడకండి. స్కూళ్ల హక్కుకు సంబంధించిన సమర్థన మాత్రమే. వాస్తవానికి, మనకు కో–ఎడ్యుకేషన్ విద్యాసంస్థలు ఉండి తీరాల్సిందే. ఇందులో ఎలాంటి సందే హం లేదు. అదే విధంగా, కేవలం బాలురకు, అలాగే కేవలం బాలికలకు మాత్రమే ఉద్దేశించిన పాఠశాలలూ ఉండాలి.15 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రశ్న మీద చర్చ మొదలైంది. 2010లో మాదిరిగా ఏదో యథాలాపంగా కాకుండా, ఈఅంశం మీద ఇప్పుడు పకడ్బందీగా చర్చ జరుగుతోంది. ప్రపంచం మారుతోంది. సమతుల్యం, సమ్మిళితం, వైవిధ్యం... వీటితో కూడిన విద్యాభ్యాస వాతావరణాన్ని కో– ఎడ్యుకేషన్ అందిస్తుంది. బాయ్స్ ఓన్లీ స్కూళ్లలో సాంప్ర దాయిక పురుషత్వ భావనలతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుంది. సహవిద్యే దీనికి విరుగుడు. పరస్పరం ఎలా గౌరవించుకోవాలో, ఒకరి నుంచి మరొకరు ఎలా నేర్చు కోవాలో బాల బాలికలు ఉభయులకూ కో–ఎడ్యుకేషన్ వ్యవస్థ నేర్పిస్తుంది. ఇదీ ప్రస్తుతం డూన్ స్కూల్ సహవిద్యకు అనుకూలంగా సాగుతున్న వాదన. వీరు లేవనెత్తుతున్న ఈ అంశాలతో ఎలాంటి పేచీ లేదు. ఇవి మంచి వాదనలు. అయితే, వీటిని తోసిపుచ్చేందుకూ ఇంతే బలమైన, ముఖ్య మైన ఇతర కారణాలు ఉన్నాయి.డూన్ స్కూల్‌కు ఒక గుర్తింపు ఉంది. అది దాదాపువందేళ్ల పురాతనమైంది. ఎవరెన్ని చెప్పినా, సంప్రదాయం ముఖ్యమైంది. ‘మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి’ అంటూ సంప్రదాయాన్ని గాలికి వదిలేయ కూడదు. సహవిద్యా విధానం అనేది డూన్ స్కూల్ అస్తిత్వాన్నీ, వ్యవస్థాపకుడి ఆశయాన్నీ మౌలికంగా మార్చివేస్తుంది. కాబట్టే, ఇంగ్లండులో అనేక వందల ఏళ్ల సుప్రసిద్ధ చరిత్ర కలిగిన ఈటన్ కాలేజీ, హ్యారో పాఠశాలలు మారలేదు.స్కూల్ సంస్కృతినీ ఈ సందర్భంగా మనం పరిగణన లోకి తీసుకోవాలి. దాదాపు శతాబ్ద కాలం నుంచీ డూన్ కొన్ని విలువల ప్రాతిపదికగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అక్కడ విద్యార్థుల ఆలనాపాలన; గురువులతో, పాత విద్యార్థులతో విద్యార్థుల స్నేహపూర్వక సాన్నిహిత్యం ఎన్నదగినవి. కో-ఎడ్యుకేషన్ అయినా, కాకున్నా కొన్ని ఇతర ప్రముఖ పాఠశా లలకూ ఇలాంటి ఔన్నత్యం ఉంటుంది. కాదనడం లేదు. మరో ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, కో–ఎడ్యుకేషన్ విద్యాసంస్థగా అవతరించడానికీ, అందుకు అవసరమైన వస తులు కల్పించడానికీ, ఇతర మార్పులు చేయడానికీ డూన్ క్యాంపస్ ఎంతమాత్రం సరిపోదు. అయినా సరే బాలికలకు ప్రవేశం కల్పించాలీ అంటే బాలుర సంఖ్యను కుదించాల్సి వస్తుంది. నిజంగా ఇది అవసరమా? మేయో కాలేజీని సహవిద్యాభ్యాస సంస్థగా మార్చక పోవడానికి బహుశా ఇదే కారణమై ఉంటుంది. బదులుగా, ‘మేయో గరల్స్ స్కూల్’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డూన్ స్కూలుకు కూడా ఈ అవకాశం ఉంది. నిజానికి, ఇలా చేయడం మరింత అర్థవంతంగా ఉంటుంది.డూన్ స్కూల్ విషయంలో ఈ చర్చ కంటే ముఖ్యమైంది... స్కూలు పనితీరు విద్యాపరంగా మెరుగుపడాలి. క్రీడా సదుపాయాలు పెరగాలి. అలాగే ఇతర మౌలిక సదు పాయాలు పెంచాలి. ఇవన్నీ సమకూర్చుకోవడమే స్కూలు ప్రథమ ప్రాధాన్యం! కో–ఎడ్యుకేషన్ కాదు!!డాస్కోస్ (డూన్ స్కూల్ బాయ్స్ తమకు తాము పెట్టుకున్న పేరు)కు అమ్మాయిల ప్రపంచం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎవరూ కాదనరు. దగ్గర్లోనే ఉన్న వెల్హామ్ వంటి గరల్స్ స్కూల్స్‌తో డూన్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. వెల్హామ్లో డాస్కోస్ అక్కలు, చెల్లెళ్లు, కజి¯Œ ్స చాలామంది చదువుతుంటారు. ఉభయులూ కలిసి అనేక విద్యా, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి చేపట్టడం సాధ్యమే. కో–ఎడ్యుకేషన్ కంటే ఇది సరైనది. అర్థవంతంగానూ ఉంటుంది. మార్పు అనేది ఇతర సంస్థలకే పరిమితం కాదు. డూన్ స్కూల్ కూడా ఎప్పటికప్పుడు మార్పును అందిపుచ్చు కోవాలి. అంటే దాని మౌలిక స్వరూపమే మారాలని కాదు. మార్పును స్వాగతించడం నిర్మాణాత్మకమైనది. పరిపూర్ణత్వం కోసం పొరపాటు లక్ష్యాన్ని నిర్ణయించి, ఏదో మంచి జరుగు తుందనే నమ్మకంతో అసలు ఆత్మనే మార్చాలనుకోవడం విధ్వంసాత్మకం. అమూల్యమైన, గౌరవనీయమైన ఒక బాయ్స్ స్కూల్‌గా కొనసాగే హక్కును డూన్ స్కూల్ ఇప్పటికే సాధించింది. అలా కొనసాగనిద్దాం.-కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
గనులకై యుద్ధం
మధ్యభారత అరణ్యాలలో ఆదివాసుల మీద, ఆదివాసుల జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ పోరాటానికి మద్దతు ఇస్తున్న మావోయిస్టుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి గట్టడం, ఆ ప్రాంతంలోని అపారమైన, సంపన్నమైన ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే వ్యూహంలో భాగమే అని దాదాపు ఇరవై సంవత్సరాలుగా పరిశీలకులు, విమర్శకులు ఎందరో రాస్తున్నారు. సల్వా జుడుం పేరుతో 2005లో పాలకులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిన ఆదివాసుల మధ్య అంతర్యుద్ధం నుంచి, ఇప్పుడు 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత ఛత్తీస్‌గఢ్ తయారు చేస్తామని ముహూర్తం నిర్ణయించి మరీ సాగిస్తున్న ఆపరేషన్ కగార్ దాకా మధ్య భారత అరణ్యాలలో చాలా నెత్తురు ప్రవహించింది. చివరి యుద్ధం అని చెప్పుకొంటున్న ప్రస్తుత దశ మొదలైన 2024 జనవరి 1 నుంచి గడచిన పద హారు నెలల్లో 400 మందికి పైగా ఆదివాసులను, మావోయిస్టులను భద్రతా బలగాలు చంపివేశాయి.ఖనిజ వనరుల కోసమే!ఈ మారణకాండ అంతా ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేసి, స్వస్థలాల నుంచి వారిని నిర్వాసితులను చేసి, వారి కాళ్లకింది నేలలో నిక్షిప్తమైన సంపన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడానికే అని విమర్శకులు చేస్తున్న అభియోగం నిజమేనని చూపే పరిణామాలు జరుగు తున్నాయి. కార్పొరేట్ సంస్థల రక్షణ కోసం లెక్కలేనన్ని భద్రతా బలగాల క్యాంపులు నిర్మాణమవుతున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర్ సీమా బల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి సరిహద్దులను రక్షించవలసిన బలగాలు ఇప్పుడు మధ్య భారతంలో ఉన్నాయి. ఆ బలగాలను తీసుకుపోవడానికీ, తవ్విన ఖనిజాన్ని బైటికి తీసుకురావడానికీ నాలుగు లైన్ల, ఆరు లైన్ల రహదారుల నిర్మాణం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేగంగా జరిగిపోతున్నది. ఈ ‘అభివృద్ధి’ కార్యక్ర మానికి అడ్డు వస్తారనే అనుమానం ఉన్నవాళ్ల మీదికి డ్రోన్లతో నిఘా, వైమానిక బాంబు దాడులు, వేలాది కాల్బలాలతో జల్లెడ పట్టి, చుట్టుముట్టి, ఎటువంటి ప్రతిఘటన లేకపోయినా కాల్చి చంపి ఎదురుకాల్పుల కథనాలు విడుదల చేయడం జరుగు తున్నది.ఆ వరుసలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అత్యుత్తమ స్థాయి ఇనుప ఖనిజం (హెమటైట్) గనులను వేలం వేయడానికి శరవేగంతో ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖనిజ వనరుల శాఖ 2025 జనవరి 15న సరిగ్గా ఈ హత్యాకాండల వార్తలు వస్తున్న దంతెవాడ, కాంకేర్ జిల్లాలలోని ఇనుప ఖనిజం గనుల బ్లాకులు నాలుగింటిని వేలం వేసే ప్రక్రియ ప్రారంభించింది. వీటిలో బైలదిల్లా గనులుగా ప్రఖ్యాతమైన ఖనిజ వనరుల కొండలు దంతెవాడ జిల్లా కిరండుల్ నుంచి బీజాపూర్ జిల్లా గంగలూరు దాకా వ్యాపించి ఉన్నాయి. బైలదిల్లా డిపాజిట్ 1ఎ, 1బి, 1సి, కాంకేర్ జిల్లాలోని హాహాలొద్ది అనే ఈ నాలుగు బ్లాకుల వేలం ప్రక్రియ ఫిబ్రవరి 28 దాకా సాగి, 58 ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడ్డాయి. చివరికి మూడు గనులను ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా, ఒక గనిని రూంగ్టా స్టీల్ దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా ప్రభుత్వ వేలంపాటలో ప్రతిపాదించిన కనీస ధర కన్నా 154 శాతం, 160 శాతం ఎక్కువకు పాడు కున్నాయంటే, అక్కడ వారికి ఎంత లాభం చేకూరే అవకాశం ఉందో ఊహించవచ్చు. ఈ గనుల లీజు యాభై సంవత్సరాల పాటు ఉంటుంది గనుక ఇది రేపో మాపో వట్టిపోయే ఆవు కూడా కాదు, కామధేనువు! ఇప్పటివరకూ బైలదిల్లా గనుల్లోకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) తప్ప ప్రైవేటు కంపెనీలు ప్రవేశించలేదు. ఇప్పటివరకూ ఆర్సెలార్ మిత్తల్ తనకు అవసరమైన ఖనిజాన్ని ఎన్ఎండీసీ నుంచి తీసుకుని పైప్ లైన్ ద్వారా విశాఖపట్నం పంపుతుండేది. ఇప్పుడీ వేలంతో ఆ కంపెనీకి సొంత గనులు వచ్చాయి. వీటిలో బైలదిల్లా 1ఎ, 1బి ఒక్కొక్కటీ 2,100 ఎకరాలు, 1సి 1,976 ఎకరాలు, హాహాలొద్ది 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ నాలుగు బ్లాకులతోనే దట్టమైన దండకారణ్యంలో దాదాపు ఏడు వేల ఎకరాల అడవి నేలమట్టమైపోయి ‘అభివృద్ధి’ జరగబోతున్నది. ఈ నాలుగు బ్లాకులూ కలిసి దాదాపు ముపై్ఫ కోట్ల టన్నుల ఉత్తమశ్రేణి ఖనిజం తవ్వబోతున్నారు. ఇటువంటి లెక్కలలో తాము కాగితాల మీద పొందినదానికన్న ఎక్కువ విస్తీర్ణపు గనులు తవ్వి, మరింత ఎక్కువ ఖనిజాన్ని దోచుకుపోవడం అందరికీ తెలిసిందే. వేలం ప్రక్రియలో చెప్పిన మేరకే తవ్వుతారని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే ఈ నాలుగు గనుల ఖనిజం విలువ ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు. కాగా, ప్రభుత్వానికి దక్కే ఆదాయం ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే! ఈ రాష్ట్రంలో ఇంతకుముందే ఎన్ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ ఛత్తీస్‌గఢ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సీఎండీసీ)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పరచి, గనులకు పర్యావరణ అనుమతులు సంపాదించి, ఆ గనులను తవ్వకం, ఖనిజాభివృద్ధి కార్యకలాపాలకు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు ఇచ్చింది. ఖనిజ సంపన్నమైన ఈ రాష్ట్రంలో ఇప్పటికే అంబుజా, బిర్లా, ఎస్సార్, జిందాల్, జె కె లక్ష్మి, లఫార్జ్, ఎల్ అండ్ టి, వేదాంత వంటి కార్పొరేట్ దిగ్గజాలన్నీ ఉన్నాయి. ఇది పలు రకాల సమస్యఇది ఆదివాసులకో, మావోయిస్టులకో సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది ముహూర్తాలు నిర్ణయించి మనుషులను చంపవచ్చునా అనే మానవతా సమస్య, నాగరికతా సమస్య. పర్యావరణ సమస్య, దేశ సంపద ఎవరికి చెందాలనే సమస్య, అటవీ హక్కుల చట్టం, పంచాయత్ రాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం వంటి చట్టాల ఉల్లంఘన సమస్య. రాజ్యాంగ ఆదర్శాలు, ప్రజల హక్కులు అమలవుతున్నాయా అనే సమస్య. మనందరి సమస్య!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘శాంతము లేక సౌఖ్యము లేదు...’!
‘శాంతము లేక సౌఖ్యము లేదు...’ అన్న త్యాగరాజ కీర్తన సంగీత కచేరీలలో ఎక్కువగా కనిపించదు. పాత రోజులలో నాగయ్య, భాను మతి వంటివారు సినిమాలలో ఈ పాట పాడటం వల్ల, ఆ పాటకూ, మాటకూ బాగా ప్రాచుర్యం ఉండేది.ఎవరికయినా అకస్మాత్తుగా కోపం బుస్సుమని పొంగివస్తే, చను వున్న సన్నిహితులు, ‘నాయనా! కోపం తగ్గించు. శాంతము లేక సౌఖ్యము లేదు!’ అని త్యాగరాజు గారి పల్లవిని సామెతగా, సుభాషితంగా వాడటం శిష్ట సమాజంలో ఇప్పటికీ అప్పుడప్పుడూ వినిపిస్తుంది.‘తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష!’ అన్న విషయం అందరికీ అనుభవవైక వేద్యమే. కోపాన్ని దూరంగా ఉంచేవాడికి, సుఖ సంతోషాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి, దార, సుతులు, ధన, ధాన్యములుండిన, / సారెకు జప, తప సంపదలుండిన, / ఆగమ, శాస్త్రములన్నియు చదివిన,.../ భాగవతు లనుచు బాగుగ పేరైన, / శాంతము లేక సౌఖ్యము లేదు! అన్న అయ్య వారి మాట వరహాల మూటే. అయితే, ఇక్కడ ‘శాంతం’ అంటే, క్రోధ రాహిత్యమనీ, కోపం లేకుండా వ్యవహరించటమనీ మాత్రమే అర్థం చెప్తే, అదీ మంచి మాటే! కానీ అది కొంచెం పరిమితమైన అర్థం. వాస్తవానికి, చివరి దాకా చూస్తే, త్యాగయ్య గారంటున్నది, ‘... త్యాగ రాజ నుత! సాధురక్షిత! తనకు ‘ఉప/శాంతము’ లేక సౌఖ్యము లేదు!’ అని. ఉపశాంతం అంటే ఉపశమనం, శమింపజేయటం, నియంత్రించటం! కామ క్రోధ లోభాది ఆరు అంతశ్శత్రువులనూ అదుపులో ఉంచటం. క్షణికోద్రేకం కట్టలు తెగకుండా చూడటం. ఇంద్రియ కాంక్షల విజృంభణను నిగ్రహించటం. ఒత్తిళ్ళ వల్ల ఓర్పు కోల్పోకుండా,సంయమనంతో స్పందించటం. అటు లౌకిక విషయాలలో గానీ, ఇటు ఆధ్యాత్మిక సాధనలలో గానీ పురోగతి కోరేవాడికి, ఇది అత్యావశ్యకమైన గుణం అనడంలో సందేహానికి ఆస్కారం లేదు!– మారుతి శాస్త్రి -
Phule movie ‘ఫూలే’ సినిమాపై అభ్యంతరాలా?
మూడు వేల ఏళ్ల కులవ్యవస్థ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మానవతావాది మహాత్మా ఫూలే. ఆయనపై అనంత్ మహాదేవన్ దర్శకత్వంలో ప్రముఖ నటులు ప్రతీక్ గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రలలో... ‘ఫూలే’ సినిమా తయారయింది. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తుందనీ... కులవాదాన్ని ప్రోత్సహిస్తుందనీ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్య క్షుడు ఆనంద్ దవేతో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించడంతో సినిమా విడుదల వాయిదా పడింది. వారి అభ్యంత రాల కారణంగా... సెన్సార్ బోర్డు కూడా కుల సంబంధిత పదా లను తొలగించాలని సూచించింది. అయితే స్వయంగా బ్రాహ్మ ణుడైన ఈ చిత్ర దర్శకుడు అనంత్ మహాదేవన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, సినిమా చారిత్రక వాస్తవాల ఆధారంగా రూపొందిందనీ, ఎటు వంటి అజెండా లేదనీ చెప్పారు. మూడు వేల ఏళ్ల పాటు ఈ దేశంలోని మెజారిటీ వర్గాల ప్రజలకు క్షుద్రులు, శూద్రులు, మ్లేచ్ఛులు, ఛండాలురు అనే పేర్లు తగిలించి... బానిసలుగా చూసిన అమా నుష కులవ్యవస్థ ఈ దేశంలో రాజ్యమేలింది. తమ స్వార్థం కోసం మతాన్ని, సమా జాన్ని భ్రష్టు పట్టించిన ఆ మనువాదుల దౌర్జన్యాలను ఒంటరిగా ఎదిరించిన ధీశాలి ఫూలే. ‘మనుషులందరినీ పుట్టించినవాడు దేవుడే అయినప్పుడు... ఒక తండ్రి తన బిడ్డలలో కొందరు ఎక్కువ కొందరు తక్కువ... కొందరు ద్విజులు, కొందరు పంచ ములు అంటూ ఎలా శాసిస్తాడు? ఇవన్నీ మీరు రాసిన అబద్ధపు రాతలు! ఇక ఈ అకృత్యాలను కట్టిపెట్టండి!’ అంటూ గర్జించి, స్వార్థపర వర్గాల దౌర్జన్యాలపై సమర శంఖం పూరించాడు మహాత్మా ఫూలే.శూద్ర బిడ్డలకూ, స్త్రీలకూ చదువు చెప్పడానికి పుణే వీధుల్లో సావిత్రిబాయి ఫూలే వెళుతుంటే... అగ్రవర్ణాలు రాళ్లు వేసే దృశ్యాన్ని తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఫూలే జీవిత చరిత్రలో ఆయన ఎదుర్కొన్న అవరోధాల ప్రస్తావన ఉండకపోతే... మరేమి ఉంటుంది? జరిగిన చరిత్రను చూపెడితే... మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ బుకాయిస్తే ఎలా?– ఆర్. రాజేశమ్సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ -
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
డిజిటల్ ప్రపంచంలో మరో కొత్త అంశం చక్కర్లు కొడుతోంది. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు కాస్తా ప్రఖ్యాత జపనీస్ యానిమేటర్ హయావో మియజాకీ శైలిలో గీసిన ఫ్యామిలీ, వ్యక్తిగత చిత్రాలతో నిండిపోతున్నాయి. గిబ్లీ ఆర్ట్ పేరు పెట్టుకున్న ఈ చిత్రాల ధోరణి నాలుగు దశాబ్దాల పాటు యానిమేషన్ రంగంలో ఎన్నో ప్రఖ్యాత క్యారెక్టర్లను సృష్టించిన గిబ్లీ స్టూడియో నకలు అన్నది మీకు తెలిసే ఉంటుంది. తేలిక పాటి పేస్టల్ షేడ్స్‌లో క్యారెక్టర్ల చిత్రీకరణ దీని హైలైట్. ప్రస్తుతానికి ఈ గిబ్లీ ఆర్ట్ అన్నది ఏఐ ప్లాట్‌ఫామ్స్ కొన్నింటిలో ఉచితంగా లభి స్తోంది. కొన్ని క్లిక్‌ల సాయంతో ఏ చిత్రాన్నైనా గిబ్లీ ఆర్ట్‌గా మార్చేయ వచ్చు. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఫ్యాషన్ , స్పోర్ట్స్ ఇన్‌ఫ్లుయెన్స ర్లతో పాటు కొన్ని కోట్ల మంది ఇప్పటికే ఈ గిబ్లీ ఆర్ట్‌ను వాడేశారు.సరదాగా కనబడుతున్నా...కంటెంట్‌ను సృష్టించేందుకు ఉపయోగించే జనరేటివ్ ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చి కొంత కాలం అయినప్పటికీ, ‘ఓపెన్ ఏఐ’ అభివృద్ధి చేసిన సరికొత్త ఏఐ టూల్ ఈ గిబ్లీ ఆర్ట్ ట్రెండ్‌కు కారణమైంది. ఛాట్‌జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు మనం అందించే సమాచారం (టెక్ట్స్) ఆధారంగా మనకు కావాల్సిన సమ చారాన్ని వివిధ రూపాల్లో (ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు వంటివి) తయారు చేస్తాయి. అదే గిబ్లీ ఆర్ట్ వంటివి మల్టీమీడియా జనరేటివ్ ఏఐ టూల్స్! టెక్ట్స్‌తో పాటు వీడియోలు, వాయిస్, ఫొటోలు, మ్యూజిక్ వంటి వాటినన్నింటినీ అది తీసుకోగలదు. ‘మిడ్ జర్నీ’, ‘స్టేబుల్ డిఫ్యూషన్ ’, ‘డాల్–ఈ’ వంటివి టెక్ట్స్‌ను తీసుకుని ఇమేజెస్ ఇవ్వగలవన్నది తెలిసిందే. డాల్–ఈతో ఢిల్లీ వీధుల చిత్రాలను ఎం.ఎఫ్.హుస్సేన్ లేదా జామినీ రాయ్ శైలిలో కొన్ని సెకన్ల సమయంలోనే తయారు చేయవచ్చు. ఇక ‘లెన్సా’ వంటివి ఇచ్చిన ఇమేజ్‌కు ప్రత్యామ్నాయాలను సృష్టిస్తాయి. వీటితో పోలిస్తే గిబ్లీ ఆర్ట్‌కు ఎక్కువ ఆదరణ ఎందుకు లభించిందంటే... ఇవి ముద్దుగా, హాస్యస్ఫోరకంగా ఉండటమని చెప్పాలి. చూసేందుకు హాస్యస్ఫోరకంగానే ఉండవచ్చు కానీ, దీని వెనుక ఒక సీరియస్ సమస్య ఉంది. ఏదైనా ఏఐ వ్యవస్థ వాస్తవ ప్రపంచం నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే పనిచేస్తుంది. ఈ సమాచారం ద్వారా ఏఐ వ్యవస్థలకు శిక్షణ అందుతుంది. రకరకాల మార్గాల ద్వారా ఏఐ వ్యవస్థలకు డేటా (టెక్ట్స్, ఇమేజెస్, సంగీతం) అందు తూంటుంది. రస్కిన్ బాండ్ లేదా అమితవ్ ఘోష్ శైలిలో ఒక చిన్న కథ రాయమని మనం ఏదైనా లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను అడిగా మనుకోండి... వీరిద్దరి రచనల తాలూకూ సమాచారం మొత్తాన్ని వెతికేస్తుంది ఏఐ! చివరకు కాపీరైట్ హక్కులున్న సమాచారం కూడా. కానీ ఏఐ కంపెనీలు ఈ కాపీరైట్ హక్కులు పొందకపోవడం గమ నార్హం. గిబ్లీ ఆర్ట్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏ కంపెనీ కూడా గిబ్లీ స్టూడియో తాలూకూ చిత్రా లను వాడుకునే హక్కులు తీసుకోలేదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్నే తాము వాడుకుంటున్నట్లు ఏఐ కంపెనీలు చెబుతున్నా... రచయితలు, కళా కారుల స్పందన వేరుగా ఉంది. కాపీరైట్ చట్టాల్లోని ‘ఫెయిర్ యూజ్’ సిద్ధాంతం గురించి ఏఐ కంపెనీలు చదివితే మేలని వీరు అంటు న్నారు. అప్పుడే అమెరికా, యూరప్‌లలో న్యాయపోరాటాలైతే మొద లయ్యాయి. సృజనకారులకు దక్కేదేమిటి?గిబ్లీ ఆర్ట్ వంటి ఏఐ టూల్స్ అసలు సృజనాత్మకత అన్న అంశంపైనే సవాళ్లను లేవనెత్తుతున్నాయి. ఓ అందమైన పెయింటింగ్, కార్టూన్ క్యారెక్టర్, సంగీతం... ఇవన్నీ మనిషి సృజనకు మచ్చుతున కలు. ఇవన్నీ ఆ యా వ్యక్తుల సొంత అనుభవాలు, సందర్భాల నుంచి పుట్టుకొచ్చినవి. గిబ్లీ ఆర్ట్‌నే ఉదాహరణకు తీసుకుందాం. జపాన్ సమాజం, సంస్కృతులకు అది అద్దం పడుతుంది, అమెరికన్ సంస్కృతికి వాల్ట్ డిస్నీ స్టూడియో అద్దం పట్టినట్లు!ఇలాంటి సృజనాత్మక కళాకృతులను యంత్ర సృష్టిగా మార్చడం లేదా ఒక ఏఐ సిస్టమ్ మానవ సృజనాత్మకత, అభినివేశాలకు విరు ద్ధంగా వెళ్లడం మేలైన ఆలోచనైతే కాదు. ఒక పెయింటింగ్‌ను పూర్తి చేసేందుకు కళాకారుడికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. అలాగే పుస్తకం రాయడానికి ఏళ్లు పడుతుంది. ఒక కార్టూన్ లేదా యానిమేషన్ స్ట్రిప్ తయారు చేసేందుకు ఆర్టిస్టులు వందల గంటలు కష్టపడాల్సి రావచ్చు. వీటన్నింటి ఆధారంగా పనిచేసే ఏఐ సృష్టించే ఆర్ట్‌కు పేరు, డబ్బు... రెండూ అసలు కళాకారులకే దక్కాలి. అందుకే ఏఐ కంపె నీలు డేటా లాండరింగ్‌కు పాల్పడుతున్నాయనీ, కళాకారులకు దక్కా ల్సిన డబ్బు, క్రెడిట్ రెండింటినీ ఎగ్గొడుతున్నాయనీ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని లక్షల మంది కళాకారులపై ఆధారపడి అభివృద్ధి అవుతున్న ప్రతి ఏఐ జనరేటివ్ మోడల్ కంపెనీ విలువ వందల కోట్ల డాలర్లుగా ఉండటం ప్రస్తావనార్హం. ఇవి వినియోగ దారుల నుంచి వేల డాలర్ల రుసుము వసూలు చేస్తూంటాయి. అయితే, అసలు కళాకారులకు ఇందులోంచి ఏమీ దక్కడం లేదు. ఇమేజ్ జనరేటర్లు కళాకారులు కాదు కానీ... కళాకారులకు సవాలు విసురుతున్నాయి. జనరేటివ్ ఏఐ మోడళ్లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సృజనాత్మకత కలిగిన వారి జీవనోపాధిని దెబ్బ తీస్తున్నాయి. యానిమేషన్ రంగంలోని కళాకారులు, ఇల్లస్ట్రేటర్లు, డిజైనర్లపై ప్రభావం ఎక్కువే ఉంది. పైగా మానవ కళాకారులతో పోలిస్తే ఏఐ తయారు చేసే బొమ్మల్లో డెప్త్, భావ ప్రకటన తక్కువ. ఏఐ ఆకృతులు ఓ మోస్తరువి మాత్రమే! ఒప్పందాలు మేలా?ఇప్పుడు డిజిటల్ ప్రపంచం మొత్తం గిబ్లీ వంటి ఉచిత ఏఐ టూల్స్ ఉత్పత్తులతో నిండిపోయింది. సినిమా స్టుడియోలు, నెట్ వర్క్‌లు ఇప్పటికే ఈ ఏఐ టూల్స్‌ను శ్రమ, ఖర్చులు రెండూ తగ్గించేవిగా చూస్తున్నాయి. పదుల కొలదీ యానిమేటర్ల బృందాలను నియమించుకునే బదులు, కొందరు ఏఐ టెక్నికల్ డైరెక్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ధోరణి మనదేశంలో ఆందోళనకు కారణం అవుతోంది. వేల మంది భారతీయ టెకీలు హాలీవుడ్ స్టూడియోలు ఔట్‌సోర్స్ చేసే యానిమేషన్ వర్క్‌పై ఆధారపడి ఉన్నారు. వాళ్లు కంప్యూటర్ గ్రాఫిక్స్, ఇతర టూల్స్‌ను వాడుతున్నారు. కానీ ఏఐ టూల్స్‌తో ఆటోమేషన్ మరో స్థాయికి వెళ్తుంది.ఈ సమస్యకు సులభ పరిష్కారం లేదు. కాపీరైట్ల విషయంలో న్యాయ స్థానాలకు వెళ్లడం ఒక మార్గం. డేటా ప్రొటెక్షన్ చట్టాలు, ఏఐ నియంత్రణలు ఇప్పుడిప్పుడే ఏఐ టూల్స్ తాలూకూ సైడ్ ఎఫెక్ట్స్్పై దృష్టి పెడుతున్నాయి. కొంతమంది పబ్లిషర్లు, పుస్తక, సంగీత కంపె నీలు ఆదాయాన్ని పంచుకునే విషయంలో ఏఐ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తద్వారా తమ పుస్తకాలు, సంగీతం లేదా ఇతర కళలను ఏఐల శిక్షణకు ఉపయోగించుకునే వీలు ఏర్పడుతోంది. డేటా ట్రెయినింగ్ కోసం ఎటూ టెక్ కంపెనీలు తమ కళను వాడుకుంటున్నట్లు వీరు భావిస్తున్నారు. బదులుగా ఒప్పందం కుదుర్చుకో వడం మేలని వీరి ఆలోచన. అనుమతులు తీసుకుని కళలు, సమా చారాన్ని ఏఐ ట్రెయినింగ్ కోసం వాడుకోవడం ఇంకొక మార్గం. సోషల్ మీడియా వేదికలు కూడా ఏఐ ఆధారిత ఇమేజెస్, వీడి యోలు, యానిమేషన్లను అనుమతించే విషయంలో ఆచితూచి వ్యవ హరించాలి. ప్రస్తుత గిబ్లీ ఆర్ట్ ట్రెండ్ ముప్పు లేదని అనిపించవచ్చు. కానీ... వాస్తవానికి ఇది మనకు మేలుకొలుపు లాంటిది!దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వన్ వే రూటు
రుణపత్రాల విపణిలో ఉత్పన్నమైన అనూహ్య పరిణామాలు అమెరికా అధ్యక్షుడికి గుబులు పుట్టించాయి. అమెరికా బాండ్స్‌కు గిరాకీ పెరిగినట్లే పెరిగి వెంటనే తగ్గిపోయింది. డాలర్ ఇండెక్స్ విలువ కూడా క్షీణిస్తోంది. దీంతో కొత్త సుంకాల విధింపు అమలును 90 రోజుల పాటు నిలిపివేశారు. ఇతర ప్రపంచ దేశాల విషయంలో తాత్కాలికంగానే అయినా ఒక మెట్టు దిగిన ట్రంప్ చైనా విషయంలో మాత్రం చాలావరకు బెట్టుగానే ఉన్నారు. ఏమైనా, అమెరికా సృష్టించిన ఈ అల్లకల్లోలం రోడ్డు మ్యాపు లేని వన్ వే రూటు! ట్రంప్ సుంకాల సంక్షోభం మధ్యకాలిక అనిశ్చితిని పెంచుతుంది. ఆర్థిక కార్యకలాపాలు అంచనాల మీద ఆధారపడి ఉంటాయి. అనిశ్చితి అనేది అంచ నాలను మార్చేస్తుంది. వ్యాపార సంస్థలు, కుటుంబాలు నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. ట్రంప్ 90 రోజుల ఊరట నిజానికి ఈ అనిశ్చితి వ్యవధిని పెంచుతుందే తప్ప, అనిశ్చితికి ముగింపు పలకదు. ఆర్థిక కార్యకాలపాల్లో తెగింపు, నిర్ణయ శక్తి కొరవడతాయి. ప్రభుత్వాలు ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ, ప్రపంచ వ్యాప్త ఆర్థిక మందగమనం తప్పదు. సుంకాల వెనుక రెండు లక్ష్యాలువిచ్ఛిన్నకర సుంకాల ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలని ట్రంప్ అనుకుంటున్నారు. అమెరికా వస్తూత్పత్తుల తయారీ వ్యవస్థ ఏనాడో కుప్పకూలింది. దీన్ని పునరుద్ధరించడం మొదటిది. తద్వారా దిగువ స్థాయి ఫ్యాక్టరీ ఉద్యోగాలు విశేషంగా సృష్టి అవుతాయి. ఇక రెండోది, చైనాను శిక్షించడం. ప్రపంచ వాణిజ్య విధానాన్ని అడ్డు పెట్టుకుని అది అనుచిత ప్రయోజనం పొందుతోంది. పాతికేళ్ల క్రితమే అమెరికాలో పాగా వేయ గలిగింది. ఈ రెండో లక్ష్యం కంటే, మొదటిదే ట్రంప్ రాజకీయ మద్దతుదారులకు మరింత ముఖ్య విషయం. దేశీయంగా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కల్పించలేనప్పుడు, ధరలు పెరిగిపోతున్నప్పడు, చైనాను శిక్షించడం వల్ల అమెరికన్లకు ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ ఒక సమస్య ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి మొదటి లక్ష్యాన్ని సాధించడమే... చైనాను దెబ్బ తీయడమనే రెండో లక్ష్యం కంటే కష్టమైన విషయం. చైనా భౌగోళిక ఆర్థిక విస్తరణను అదుపు చేసే వ్యూహాలు ఇప్పటికిప్పుడు రూపొందినవి కాదు. గడచిన రెండు దశాబ్దాలుగా అమెరికాలో వీటి గురించి పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు, పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయో, వీటిని ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధం కావాలో చైనా ప్రభుత్వానికి మంచి అవగాహనే ఉంది. మరి, ట్రేడ్ వార్ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు అమెరికా ఎంతవరకు సన్నద్ధంగా ఉందనేది ప్రశ్న. కర్మాగారాల స్థాపనకు కనీసం రెండేళ్లు పడుతుంది. ట్రంప్ నిరుద్యోగ మద్దతుదారులు అందాకా ఓర్పుతో ఉండగలరా? స్వల్పకాలంలో కష్టాలు, దీర్ఘకాలంలో లాభాలు అనే సూత్రం రాజకీయంగా కుదిరేది కాదు. ట్రంప్ స్వదేశంలోనే మద్దతు కోల్పేతే ఆయన విధానాలకు అంతర్జాతీయంగా స్పందన ఎలా ఉంటుంది?దేశాల స్పందనట్యారిఫ్ సంక్షోభం అనంతర కాలంలో ప్రపంచ దేశాలు అమెరికా మీద విశ్వాసం కోల్పోతాయి. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు తన విధానాలు, (వివాదాస్పద) మాటలు వెనక్కు తీసుకున్నా, ఆయన ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాధిపతులు విశ్వాసంలోకి తీసుకోరు! కెనడా, మెక్సికో, డెన్మార్క్, దక్షిణా ఫ్రికాలను ట్రంప్ బాహాటంగానే టార్గెట్ చేసి మాట్లాడారు. బ్రెజిల్, కొలంబియా, జర్మనీ, ఫ్రాన్స్,సింగపూర్, నమీబియా, ఆస్ట్రేలియా వంటి దేశాల అధినేతలు యూఎస్ అధ్యక్షుడిపై బహిరంగ విమర్శలకు వెనుకాడటం లేదు. యూరోపియన్ యూనియన్ ఈ విషయంలో ఒక్కతాటి మీద లేకున్నా, మెజారిటీ సభ్యదేశాలు అమెరికాను నమ్మే స్థితిలో లేవు. ఈయూ అటు చైనాతోనూ, ఇటు ఇండియా తోనూ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తుంది. బలహీన ప్రధాని నేతృత్వంలోని జపాన్ మాత్రం అమెరికాను ప్రాధేయపడుతున్నట్లు వ్యవహరిస్తోంది. ఏమైనా, అది కూడా చైనాతో వాణిజ్య సంబంధాలు స్థిరీకరించుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇండియా మౌనం వెనుక...ఇక ఇండియా నాయకత్వం అమెరికా ట్రేడ్ పాలసీ పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది. చైనాతో అమీతుమీకి ట్రంప్ సిద్ధపడటం ఇండియాకు ఆనందంగా ఉంది. మరోవంక, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందానికి చర్చలు జరుపుతోంది. అమెరికా నుంచి రక్షణ సామగ్రి, ఇతరత్రా దిగుమతులు పెంచు కునేందుకు సిద్ధపడుతోంది. అయినా కూడా, ట్రంప్ మొదటి విడత పదవీకాలంలో ఆయనతో వ్యవహరించినంత సంతోషంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దఫా ఉన్నారా? ట్రంప్ ఆయనకు చురకలు వేస్తూ మాట్లాడుతున్నారు. అంతగా స్నేహపూర్వకం కాని ధోరణిలో ఇండియా పేరు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎంతో సెల్ఫ్ ఇమేజ్, ఇగో ఉన్న మోదీ ఈ అవమానాలకు లోలోపల కుమిలిపోయే ఉంటారు!ఉభయ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుస్థిరపరచుకోవాలని ఇండియా భావిస్తోంది. అయినా సరే, ఏ భారతీయ నాయకుడూ జపాన్, ఇటలీ మాదిరిగా ట్రంప్ ముందు సాగిలపడేందుకు సిద్ధంగా లేరు. బహుశా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్న నేపథ్యంలో మోదీ మౌనం పాటిస్తూ ఉండొచ్చు. దీంతో, గ్లోబల్ సౌత్ (పేద దేశాలు) తరఫున మాట్లాడేందుకు ఇతరులకు అవకాశం లభించింది. ట్రేడ్ ట్యారిఫ్లను వ్యతిరేకిస్తూ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు చైనా సంఘీభావం ప్రకటిస్తోంది. ఇండియా కూడా కలిసి రావాలని ఆహ్వానిస్తోంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా నాయకులు కూడా ఇతర వర్ధమాన దేశాలకు సంఘీభావం ప్రకటించాయి. ‘గ్లోబల్ సౌత్’ ఇండియా ‘వాయిస్’ కోసం ఎదురు చూస్తోంది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
బాలీవుడ్ నటి, పాప్ గాయని, బిజినెస్ ఉమెన్... మరెన్నో రంగాల్లో ప్రసిద్ధి చెందిన 'కునిక సదానంద్ లాల్' తన వైవిధ్యమైన పాత్రలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ముంబైలో చలనచిత్రరంగానికి మారడానికి ముందుగానే కునిక నటనా జీవితం ఢిల్లీలో ప్రారంభమైంది, ఆమె తొలుత అనేక టీవీ సిరీస్‌లలో కనిపించింది. ప్రముఖ హాస్యనటుడు అస్రానీ భార్య మంజు అస్రానీ టీవీ సిరీస్‌లో ఓ అద్భుతమైన పాత్రతో బ్రేక్ అందుకుని సినిమా తారగా మారారు. దాదాపుగా 125 సినిమాల్లో నటించారు. గుమ్రాహ్, బేటా వంటి సినిమాల్లో విలన్‌గానూ మెప్పించారు. ఆమె సినిమా విజయాలకు మించి, ప్రైవేటు ఆల్బమ్స్ ద్వారా గాయనిగా పేరొందారు. విజయవంతమైన పలు సంస్థల వ్యవస్థాపకురాలు, సామాజిక కార్యకర్త కూడా. ముంబైలోని గోరేగావ్ శివారులో, వైట్ ఇటాలియన్ కేఫ్, జింగ్కేఫ్ మెజెస్టికా ది రాయల్ బాంక్వెట్ హాల్, అలాగే ఎక్స్హేల్ స్పా వంటివి నిర్వహిస్తున్నారు. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ షోలో కనిపించినప్పటి నుంచి కునికా సదానంద్ వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆ షో లొ ఆమె చాలా ఓపెన్ అయ్యారు గాయకుడు కుమార్ సానుతో తన ప్రేమ వ్యవహారం గురించి అంతేకాదు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పలువురు హీరోయిన్లతో నడిపిన వ్యవహారాల గురించి కూడా మాట్లాడడం విశేషం. ఆమె మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ గురించి కూడా ప్రస్తావించారు అంతేకాదు గతంలో హీరోయిన్లను లొంగదీసుకోవాలని లైట్మెన్లతో సహా ఎలా ట్రై చేసేవారో కూడా వెల్లడించారు. దాంతో ఆ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అక్షయ్ కుమార్ ఎఫైర్స్‌పై కామెంట్లుఅక్షయ్ కుమార్‌కి హీరోయిన్లతో ఉన్న ఎఫైర్స్ గురించి ఆమె మాట్లాడుతూ ‘అతను చాలా అందంగా ఉంటాడు అంతేకాదు అతను నా కంటే ఒక సంవత్సరం చిన్నవాడు అయినా కూడా అతను ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు‘ మగవాళ్లలో మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్థాయిలు చురుకుగా ఉన్నప్పుడు, మంచి ఫిట్నెస్ పొందుతారని అది సాధారణమేనని చెప్పారు. అంటే మగతనం ఎక్కువైతే ఫిట్నెస్ దాంతో ఆడవాళ్ళ కు ఆకర్షణ కలగడం.. వల్ల ఇలాంటి ఎఫైర్స్ పుట్టుకొస్తాయన్నట్టుగా అభిప్రాయపడ్డారు. అదే ఇంటర్వ్యూలో తన నటనా జీవితంలో ప్రారంభంలో బాలీవుడ్ టాప్ సింగర్ కుమార్ సానుని కలుసుకున్నానని తొలిచూపులోనే నచ్చడంతో అదొక తక్షణ ఆకర్షణగా భావించానని వెల్లడించారు. తాను ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఊటీలో ఉన్నప్పుడు అదే సమయంలో కుమార్ సాను కూడా తన సోదరి, మేనల్లుడితో విహారయాత్రలో ఉన్నాడని అలా తమ మధ్య బలమైన అనుబంధం ఏర్పడిందన్నారు.పరిశ్రమలో తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న ఆమె... గతంలో గౌరవప్రదమైన కుటుంబాలకు చెందిన మహిళలు అరుదుగా మాత్రమే సినిమాల్లో కెరీర్‌ను ఎంచుకునేవారని అన్నారు. దానికి తగ్గట్టే అప్పటి పరిస్థితులు ఉండేవని చెప్పారు. లైటింగ్ టెక్నీషియన్లు కూడా నటీమణుల పట్ల తరచుగా అనుచితమైన ఆలోచనలతో ఉంటారని, ఆమె వెల్లడించడం విశేషం ‘వారు తమ చేతులపై పెర్ఫ్యూమ్తో వస్తారు, వాటిని హీరోయిన్ వైపు చాచేవారని అంతేకాక హీరోయిన్ల చెవుల్లో అసభ్యకరమైన విధంగా గుసగుసలాడేవారు‘ అని ఆమె అన్నారు. ఈ నేపధ్యంలో అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమన్నారు. తానెలా ఇలాంటి పరిస్థితుల నుంచి తనను తాను కాపాడుకున్నానో కూడా వివరించారు.‘షూటింగ్ సమయం అయిపోయాక ఆకలితో ఉన్న సింహాలు బయటికి వచ్చి, బయట తిరుగుతున్నట్లుగా ఉండేది. కొంతమంది చాలా మర్యాదగా సాయంత్రం కలుద్దామా? అని ఫోన్లు చేస్తే, మరికొందరు మాత్రం మరింత దూకుడుగా ప్రవర్తించేవారు అంటూ వెల్లడించారు. అలాంటి సందర్భాల్లో తన హెయిర్‌డ్రెస్సర్ తరచుగా తన గదిలో రక్షణగా ఉండేవాడని చెప్పారామె తాను అందుబాటులో లేనని లేదా డిన్నర్‌కి బయటకు వెళ్లారని చెబుతూ, ఆమె హెయిర్డ్రెసర్ వారిని తెలివిగా తప్పించేవాడని గుర్తు చేసుకున్నారు. -
అంబేడ్కరుని పాత్రికేయ ప్రమాణాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటే గుర్తొచ్చేవి రాజ్యాంగ రచన, అంటరానితనం, కులనిర్మూలన పోరాటాలు, పోరాడి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కాలన్న భావన, సమాలోచనలు. అయితే అంబేడ్కర్ గొప్ప పాత్రికేయులనీ, పాత్రికేయ ప్రమాణాలు, నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చేవారనీ, వాటిని కాపాడేందుకు స్వయంగా తానే పత్రికలు స్థాపించి అక్షర పోరాటం చేశారనీ చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన ‘మూక్ నాయక్’ (1920), ‘బహిష్కృత భారత్’ (1027), ‘సమత’ (1928), ‘జనత’ (1930) ‘ప్రబుద్ధ భారత్’ (1956) పత్రికలు స్థాపించి పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టారు. ప్రతి అక్షరాన్ని నిటారుగా నిలిపి, పాత్రికేయ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన ఏ పత్రిక ప్రారంభించినా, దానికి ఒక ప్రత్యేక అజెండా ఉండేది. ఆరంభ సంచికలోనే తానెందుకు, ఎవరి కోసం సదరు పత్రిక ప్రారంభించారో తెలియచేసేవారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కులవివక్ష, అంటరానితనం తనని ఎక్కువగా ప్రభావితం చేశాయని ‘బహిష్కృత భారత్’ పత్రిక లక్ష్యాన్ని వివరిస్తూ తొలిసంచికలో ‘సంతకపు సంపాదకీయం’(సైన్డ్ ఎడిటోరియల్) రాశారు. చైతన్య పరచడం ద్వారానే ప్రజల్లో కదలిక తీసుకురావడం సాధ్యమవుతుందనీ, దాన్ని సాధించడం కోసం ‘ప్రబుద్ధ భారత్’ పత్రిక ప్రారంభించాననీ ఆరంభ సంచికలో సంపాదకీయం ద్వారా పత్రిక అజెండాను చెప్పారు.అంబేడ్కర్ స్థాపించిన పత్రికల్లో అగ్రస్థానం ‘మూక్ నాయక్’దే! నూరేళ్ళ చరిత్రకు సాక్ష్యంగా నిలచి, ఈ మధ్యనే అక్షర సంబరాలు జరుపుకొన్న ఈ పత్రిక జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిందనే చెప్పాలి. నిర్భీతిగా, నిజంవైపు నిలబడడం, పాత్రికేయ విలువలు తు.చ. తప్పక పాటించడం, రాతల్లో అపోహలకు, అసత్యాలకు తావివ్వక పోవడం; కుల రాజకీయాలకు, వివక్షకు దూరంగా రచనలు చెయ్యడం వంటి సూత్రాలను కడదాకా పాటించారాయన. చాలా మటుకు భారతీయ పత్రికలు ఏకపక్షంగా రాస్తున్నాయనీ, కేవలం ఒక వర్గం తాలూకు అభీష్టానికి అనుగుణంగానే రాస్తున్నాయనీ, కొన్నిసార్లు ఊహాజనిత వార్తల్ని వండి వార్చుతున్నాయనీ దుయ్యబట్టారు. రాజ్యాంగ రూపశిల్పిగా, కేంద్ర మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరు పొందిన తనపైనే అవాకులు, చవాకులు పేలడం తనను కలచివేసిందని, అందు వల్లనే తానీ పత్రిక ప్రారంభించడానికి సంకల్పించినట్లు తన సంపాదకీయంలో పేర్కొన్నారు. పెద్దలకు అనుకూలంగాను, పేదలు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగానూ పత్రికలు కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పెను ప్రమాదమని హెచ్చ రించారు. వెనుకబాటు తనానికి ఆర్థిక అంశాలు ద్వితీయ స్థానంలో ఉండగా, సామాజికాంశాలే ప్రథమ స్థానంలో ఉన్నా యనేది అంబేడ్కర్ నిశ్చితాభిప్రాయం. తద నుగుణంగానే రాజ్యాంగ రూపకల్పనలో సామాజిక రిజర్వేషన్లకు ప్రాధాన్యమిచ్చినట్లు తన రచనల్లో స్పష్టం చేశారు. పేదరికం, నిస్సహాయత, ఆత్మ న్యూనత, వెనుక బాటుతనం దాడి చేస్తుండడం వల్లనే అణగారిన వర్గాలు అభివృద్ధి ఫలాలను అందుకోలేక పోతున్నాయని, ఈ రుగ్మతల నుంచి మెజారిటీ జనాలను ‘విముక్తుల్ని’ చేయడమే తన ముందున్న లక్ష్య మని తన పత్రికల్లో పదే పదే ప్రస్తావించారు.మిగతా వృత్తుల కంటే జర్నలిజం ‘పవిత్ర’మై నదని, జనజాగృతికి, దిశానిర్దేశం చేయడానికి దీన్ని మించిన ‘వజ్రాయుధం’ మరోటి లేదన్నది అంబే డ్కర్ దృఢమైన అభిప్రాయం. సంచలనాల కోసం, తానెప్పుడూ తప్పుడు రాతలు రాయబోనని ప్రతిన బూనారు. పాత్రికేయునికి నైతికబాధ్యత ఆయుధమై ఉండాలన్నారు. జర్నలిజం వృత్తిని గౌరవించేవారు కనీసం ఆయన ప్రమాణాల్లో కొన్ని పాటించినా ఆ మహనీయునికి ఘననివాళి అర్పించినట్లే!ప్రొ‘‘ పీటా బాబీ వర్ధన్ వ్యాసకర్త మీడియా విశ్లేషకులుమొబైల్: 93931 00566 -
దూరదృష్టి గల సంస్కర్త
భారతదేశపు గొప్ప దార్శనికులలో ఒకరైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి ఈ రోజు. ఆయన వారసత్వాన్ని తక్కువ చేసి చూపించడానికి ఉద్దేశపూర్వకంగా అవాంఛ నీయ ప్రయత్నాలెన్నో జరిగాయి. శతాబ్దం గడచిన తర్వాత కూడా, అంబేడ్కర్ అంటే కేవలం ఒక దళిత నాయకుడిగా పరిగణించడం శోచనీయం. ఆయనను దళితులు, అణ గారిన వర్గాల ప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఆధునిక భారత దేశపు అగ్రశ్రేణి మేధావుల్లో ఒకరిగా పరిగణించాలన్నది అత్యావశ్యం. చదువుకునే రోజుల్లో పిల్లలంతా తాగే సాధారణ కుళాయి నుంచి నీళ్లు తాగడానికి కూడా ఆయనను అనుమతించేవారు కాదు. ఒకసారి మండు వేసవిలో దాహం తట్టుకోలేక దగ్గర్లో ఉన్న కుళాయి నుంచి నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తే... కట్టుబాట్లు ఉల్లంఘించారనే కారణంతో ఆయన మీద దాడికి తెగబడ్డారు. ఆ సంఘటన తరువాత చాలామంది తమ రాత ఇంతే అని సరిపెట్టుకుని ఉండేవారు. మరి కొందరైతే హింసా మార్గాన్ని ఎంచుకుని ఉండేవారు. కానీ, ఆయన అలా చేయలేదు. తనలోని బాధను గుండెల్లోనే అదిమిపెట్టుకుని జీవితాన్ని చదవడం నేర్చుకున్నారు. కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీలతో సహా ఎంఏ, ఎంఎస్సీ, పీహెచ్డీ, డీఎస్సీ, డీలిట్, బార్–ఎట్–లా పూర్తి చేశారు. ఏ పాఠశాలల్లో అయితే తనను చదువుకోవడానికి అనుమతించలేదో... అంతకు మించిన స్థాయిలో విదేశాల్లో విద్యను పూర్తి చేసి తానేమిటో సమాజానికి చూపించారు. అయినా తన మాతృభూమి, కర్మభూమి అయిన భారతదేశానికి తిరిగి వచ్చే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉండేవారు.పేరెన్నికగన్న సంస్థల ఏర్పాటులో అంబేడ్కర్ పాత్ర విస్మరించలేనిది. ఆధునిక భారతదేశంలో ఆర్బీఐ, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి అనేక సంస్థలు బాబాసాహెబ్ దూరదృష్టితో పురుడు పోసు కున్నవే. ఆర్థికశాస్త్రం, ఆర్థిక చరిత్రపై తన ప్రావీణ్యంతో భారత్ ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యలను ఆధారాలతో సహా ‘రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్’కు విశ్లేషణాత్మకంగా వివరించారు. ఫలితంగా ఒక సెంట్రల్ బ్యాంక్‌గా విధులను నిర్వర్తించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు పునాది పడింది.గట్టి ప్రజాస్వామ్యవాదిఅంబేడ్కర్ దృఢమైన ప్రజాస్వామ్యవాది. భారత దేశపు భవి ష్యత్తు, దాని ప్రజాస్వామ్యం, కష్టపడి సంపాదించిన స్వాతంత్య్రం గురించే ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. రాజ్యాంగ సభలో ఆయన చివరి ప్రసంగంలో ఈ భయాందోళనలు సుస్పష్టంగా వ్యక్తమ య్యాయి. ఆయన హెచ్చరికలే భారతదేశాన్ని దాదాపు ఎనిమిది దశా బ్దాలుగా ప్రజాస్వామ్య మార్గంలో నడిపిస్తున్నాయి. అయితే నేడు కులం, మతం, జాతి, భాష మొదలైన సామాజిక విభేదాలతో భారతీ యుల మధ్య సోదరభావాన్ని తగ్గించే ప్రయత్నాలను చూస్తున్నాం.ఆర్య–ద్రావిడ విభజన నుంచి ఎక్కువ ప్రయోజనం పొందగలిగే సమయంలో కూడా ఆర్య దండయాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తప్పు పట్టారు. ‘ఒక తెగ లేదా కుటుంబం జాతిపరంగా ఆర్యులా లేదా ద్రావిడులా అనేది విదేశీ వ్యక్తులొచ్చి విభజన రేఖ గీసేవరకు భారత ప్రజల మదిలో ఇలాంటి ఆలోచనలు తలెత్తలే’దని 1918లో ప్రచురించిన ఒక పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. పైగా యజుర్వేద, అధర్వణ వేదాల్లోని రుషులు శూద్రులకు తగిన ప్రాధాన్యమిచ్చిన అనేక సందర్భాలను ఉదాహరించారు. ఆర్యులు, ద్రవిడుల కంటే అంటరానివారు జాతిపరంగా భిన్నమైనవారనే సిద్ధాంతాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు.తమ సంకుచిత, మతపరమైన ప్రయోజనాల కోసం భాషా సమస్యలను సాకుగా చూపించేవారు దేశ ఐక్యత విషయంలో అంబే డ్కర్ అభిప్రాయాలను తెలుసుకుంటే ఎంతో ప్రయోజనం పొందుతారు.తాను ప్రావీణ్యం సంపాదించిన తొమ్మిది భాషలలో ఒకటైన సంస్కృతాన్ని అధికారిక భాషగా ఆమోదించడానికి మద్దతుగా 1949 సెప్టెంబరు 10న ఆయన రాజ్యాంగ సభలో ఒక సవరణను ప్రవేశ పెట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై తన ఆలోచనలు వెల్లడిస్తూ... ‘హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి’ అని ప్రకటించారు. హిందీ మాట్లాడే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాక పోయినప్పటికీ, దేశ ప్రాధాన్యాలకు ప్రథమ స్థానమిచ్చా రన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఆయన దార్శనికతకు అనుగుణంగా...’ప్రజాస్వామ్యం విజయవంతంగా సాగడానికి అనుసరించా ల్సిన పద్ధతుల’పై 1952 డిసెంబర్ 22న ఒక ప్రసంగమిస్తూ... ప్రజా స్వామ్యం రూపం, ఉద్దేశం కాలక్రమేణా మారుతాయనీ, ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే ఆధునిక ప్రజాస్వామ్యపు లక్ష్యమనీ పేర్కొ న్నారు. ఈ దార్శనికతతోనే మా ప్రభుత్వం గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో విజయం సాధించింది. 16 కోట్ల గృహాలకు కుళాయి నీటిని అందించడానికి కృషి చేశాం. పేద కుటుంబాల కోసం 5 కోట్ల ఇళ్లను నిర్మించాం. 2023లో ‘జన్ మన్ అభియాన్’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ ప్రారంభించారు. బలహీన గిరిజన వర్గాల (పీవీటీజీ) సామాజిక– ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, పీవీటీజీ గృహాలు–ఆవాసా లకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం దీని లక్ష్యం. ప్రధాన మంత్రి 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇది బాబాసాహెబ్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాదు, బాబాసాహెబ్ వారసత్వం, రచనల గురించి భవిష్యత్ తరాలకు మరింతగా తెలియజెప్పడానికి, మా ప్రభుత్వం పంచతీర్థాన్ని అభివృద్ధి చేసింది. అంబేడ్కర్‌తో ముడిపడిన మహూ (మధ్యప్రదేశ్); నాగపూర్ (మహారాష్ట్ర) లోని దీక్షా భూమి; లండన్ లోని డాక్టర్ అంబేడ్కర్ మెమోరియల్ హోమ్; అలీపూర్ రోడ్ (ఢిల్లీ) లోని మహాపరినిర్వాణ భూమి, మరియు ముంబయి (మహారాష్ట్ర) లోని చైత్య భూమిలే ఆ పంచ తీర్థాలు.గత నెలలో ప్రధాని దీక్షాభూమిని సందర్శించినప్పుడు, బాబా సాహెబ్ ఊహించిన భారతదేశాన్ని సాకారం చేయడానికి మరింత కష్టించి పనిచేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అంబేడ్కర్ ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుంటామంటూ ప్రతిజ్ఞ చేసే అవకాశాన్ని ఆయన జయంతి కల్పిస్తోంది. జాతి, మత, ప్రాంత, కులాలకు అతీతంగా మనమంతా ‘భారతీయులు’గా సాగిపోదాం. ఆయన్ని ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడిగా చేసే ప్రయత్నాలను అడ్డు కోవాలి. ఒక సందర్భంలో సైమన్ కమిషన్ ఆధా రాల గురించి అడిగితే... ప్రాంతీయ దురభిమానమూ, సమూహ భావనలకూ లోనయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తూ, ‘మనమె ప్పుడూ భారతీయులమే’ అన్న చైతన్యాన్ని ప్రజల్లో కలిగించడం అత్యవశ్యమని చెప్పారు. బాబాసాహెబ్... భారతదేశానికి దేవుడి చ్చిన వరం. ప్రపంచానికి భారతదేశమిచ్చిన బహుమతి. అప్పటి బ్రిటిష్ ఇండియా గానీ, నవ స్వతంత్ర భారతం గానీ ఇవ్వని గౌరవ పీఠాన్ని మనం ఆయనకిద్దాం.రాజ్‌నాథ్ సింగ్‌వ్యాసకర్త భారత రక్షణ మంత్రి -
మహువా మొయిత్రా (ఎంపీ) రాయని డైరీ
పురుషుడితో గొడవ పడిన స్త్రీ పూర్తిగా అతడిని పట్టించుకోవటం మానేస్తుంది. స్త్రీతో గొడవ పడిన పురుషుడు మరింతగా ఆమెను పట్టించు కోవటం మొదలు పెడతాడు! నిజానికది పట్టించుకోవటం కాదు, ఆమె తనని పట్టించు కోక పోవటాన్ని పట్టించుకోవటం! కానీ ఎంపీలు కూడా ఇలా స్త్రీ, పురుషులుగా గొడవ పడాల్సిందేనా? ఏ నాగరికతా, ఏ పదవీ బాధ్యతా... స్త్రీని స్త్రీగా, పురుషుడిని పురుషుడిగా కాక, పరిణతి చెందిన ఒక మనిషిగా ఉంచలేవా? కల్యాణ్ బెనర్జీ, నేనూ లోక్‌సభ ఎంపీలం. కానీ మా మధ్య ఘర్షణను ఇద్దరు ఎంపీల మధ్య ఘర్షణలా అతడు ఉండనివ్వటం లేదు!లోక్‌సభలో అతడు పార్టీ చీఫ్ విప్. సభలో తృణమూల్ ఎంపీలు ఎవరు మాట్లాడాలన్నది అతడిదే నిర్ణయం. ఎవరు మాట్లాడకూడదన్నదీ అతడి నిర్ణయమే. లోక్‌సభలో మొత్తం 28 మంది తృణమూల్ ఎంపీలం ఉన్నాం. అందర్నీ మాట్లాడనిచ్చేవారు కల్యాణ్ బెనర్జీ. నా దగ్గరికి వచ్చేసరికి ‘నో’ చెప్పేవారు! ‘‘నేను మాట్లాడతాను’’ –‘‘నో’’‘‘నాకు అవకాశం ఇవ్వండి’’ – ‘‘నో’’‘‘రెండే రెండు నిమిషాలు...’’ –‘‘నో’’‘‘నన్ను చెప్పనివ్వండి ప్లీజ్..’’ – ‘‘నో’’కల్యాణ్ బెనర్జీ నాకన్నా 18 ఏళ్లు పెద్దవారు. 16 ఏళ్లుగా ఎంపీగా ఉంటున్నవారు. నిన్న మొన్న, ఆరేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన నాతో ఈయనకు ఏంటి ప్రాబ్లం?! ‘‘ఎందుకు మీరు నన్ను మాట్లాడనీయటం లేదు మిస్టర్ బెనర్జీ?’’ అని లాస్ట్ సెషన్లో మళ్లీ అడిగాను. కళ్లింత చేశారు! ‘‘ఫస్ట్ మీరు మీ చీఫ్ విప్‌తో మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఆ తర్వాత మీకు సభలో మాట్లాడే అవకాశం వస్తుంది. మిస్టర్ బెనర్జీ ఏంటి... మిస్టర్ బెనర్జీ? మన చైర్‌పర్సన్‌ని కూడా ఇలాగే ‘మిస్ బెనర్జీ’ అనేసేలా ఉన్నారు?’’ అన్నారు! మధ్యలోకి దీదీజీని ఎందుకు తెచ్చినట్లు!ఏప్రిల్ 4న తృణమూల్ ఎంపీలం అందరం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్‌కి వెళ్లాం. డూప్లికేట్ ఓటర్ ఐడీ నంబర్లు తొలగించాలని డిమాండ్ లెటర్ తయారు చేసి, అందులోఅందరి సంతకాలూ తీసుకున్నారు కల్యాణ్ బెనర్జీ... ఒక్క నా సంతకం తప్ప!‘‘ఏమిటిది మిస్టర్ బెనర్జీ! ఎందుకిలా చేస్తున్నారు?’’ అని అడిగాను.ఆ మాటకు అక్కడ సమాధానం చెప్పకుండా తృణమూల్ ఎంపీల వాట్సాప్ గ్రూప్‌లో నాపై పోస్టులు పెట్టారు. ‘‘ఇంగ్లిష్‌లో మాట్లాడగలనని అహంకారం... ఆఇంటర్నేషనల్ లేడీకి...’’ అని నా పేరెత్తకుండా అన్నారు! నవ్వొచ్చింది నాకు. సమాధానం లేనప్పుడు... ‘పెద్ద మగాళ్లం’ అనుకునే మగాళ్లు కూడా ఇలాగే చిన్నపిల్లల్లా మాట్లాడతారు! గ్రూప్‌లోంచి బయటికి వచ్చేశాను. వెంటనే నన్ను వెతుక్కుంటూ వచ్చారు సాగరికా ఘోష్! సాగరిక రాజ్యసభ ఎంపీ. ‘‘ఏప్రిల్ 4న జరిగిన దానికి దీదీజీ చాలా కోపంగా ఉన్నారు మొయిత్రా. కల్యాణ్ బెనర్జీతో తగాదా మానేయమంటున్నారు. సోమవారం లోపే ఇదంతా ముగిసిపోవాలని దీదీజీ కోరుకుంటున్నారు...’’ అన్నారు సాగరిక. ఆ విషయాన్ని దీదీజీనే నేరుగా నాతో ఎందుకు చెప్పలేకపోయారు!‘‘అంబేడ్కర్‌ని ఓన్ చేసుకోటానికి రేపు ఏప్రిల్ 14న బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని దీదీజీ అంటున్నారు మొయిత్రా. మహిళలకు రాజకీయాల్లో గౌరవం దక్కాలని అంబేడ్కర్ ఆకాంక్షిస్తే, తృణమూల్ పార్టీలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్న మాటను రానీయకూడదని మీకు చెప్పమన్నారు... ’’ అన్నారు సాగరిక. ‘‘అంటే, కల్యాణ్ బెనర్జీకి నన్ను అపాలజీ చెప్పమని అంటున్నారా?’’ అని అడిగాను. ‘‘లేదు. మిమ్మల్ని వెంటనే ఎంపీల వాట్సాప్ గ్రూప్‌లోకి తిరిగి వచ్చేయమంటున్నారు...’’ అన్నారు సాగరిక!!రెండూ ఒకటే కదా! కాదా?! - మాధవ్ శింగరాజు -
ఇలాగేనా పేదరిక నిర్మూలన?
‘ఉగాది’ రోజున ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడికి ఎవరికీ రాని విచిత్రమైన ఆలోచన వచ్చింది. పేదరికం గురించి తీవ్ర మనోవేదన చెందుతూ, పేదరికాన్ని నిర్మూ లించేందుకు కొత్త విధానాన్ని కనుక్కున్నారు. అదే ‘పీ4’ విధానం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 2047 నాటికి పూర్తిగా పేదరికాన్ని నిర్మూలిస్తాననీ, ఇందుకు దాతృత్వమేఅత్యంత కీలకమనీ పేర్కొన్నారు. పేదలకు సహాయం చేసేలా సంపన్నుల్లో స్ఫూర్తి నింపటం పీ4 లక్ష్యమని అన్నారు. ఇది ఆచరణ సాధ్యమేనా? ప్రపంచంలో ఇటువంటి విధానంతో పేదరిక నిర్మూలన చేసిన ఉదాహరణలు ఏవైనా ఉన్నాయా?‘పబ్లిక్, ప్రైవేట్ – పీపుల్ – పార్టనర్షిప్’ (పీ4) విధానంలో ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు, ప్రజలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అంటున్నారు. 1995లో ప్రపంచ బ్యాంకు అమలు చేసిన సంస్కరణల్లో భాగంగా ‘పీ3’ పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ విధానాన్ని అమలు చేసి అద్భుతాలు సాధించాననీ, ఆ స్పూర్తితోనే íపీ4 రూపొందించాననీ అంటున్నారు. ఆ ‘అద్భుతాలు’ ఏమిటో మాత్రం చెప్పలేదు. ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయటంలో మాత్రం ముందు ఉన్నారు. 1995లోని పీ3లో లేని ప్రజలను అదనంగా పీ4లోఎందుకు చేర్చారో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వలేదు. బడా పారిశ్రామిక వేత్తల పరిశ్రమలకు భూములు కావాలి. భూ సేకరణ చట్టం ప్రకారం భూములకు పరిహారం ఇవ్వటం పరిశ్రమాధిపతులకు ఇష్టంలేదు. పీ4లో పేదలను చేర్చటం ద్వారా వారి భూములను పారిశ్రామిక వేత్తలకు ఇచ్చేలా చేయటం కోసమే వారిని ఇందులో చేర్చారు.తమ పేదరికానికి కారణాలైన వాటికి వ్యతిరేకంగా పేదలు తిరుగుబాటు చేయకుండా బడా సంపన్న వర్గాలను కాపాడటం కోసం గతంలోనూ ఇలాంటి అభిప్రాయాలు ముందుకు వచ్చాయి. ఫ్యాక్టరీ యజమానులు సంపాదించుకున్న సొమ్ము నుండి కార్మికులకు దానధర్మాలు చేయాలని మహాత్మాగాంధీ ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని దెబ్బతీయటానికి 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని పోచంపల్లిలో వినోబా భావే ప్రారంభించిన ‘భూదానో ద్యమం’ భూస్వాముల ప్రయోజనాలు కాపాడటం కోసమే! ఆచరణలో భూస్వాములు భూములు దానం చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే తరహాలో పీ4 విధానాన్ని ప్రకటించారు. దేశంలోని 10% ఉన్న బడా సంపన్న వర్గాలు, అట్టడుగులో ఉన్న 20% పేదలను దత్తత తీసుకుంటే పేదరికం నిర్మూలించబడుతుందని చెప్పటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. పేదరికాన్ని రూపుమాపటం పాలక ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత నుంచి చంద్రబాబు తప్పుకొంటున్నారు. పేదలు, బడా సంపన్న వర్గం, వర్గ సంబంధాల రీత్యా శత్రు వర్గాలే గాని మిత్ర వర్గాలు కాదు. బడా పెట్టుబడిదారులు, భూస్వాములు... కార్మికుల, గ్రామీణ పేదల శ్రమశక్తిని దోపిడీ చేసి సంపదలను కూడబెట్టారే గానీ కష్టపడి ఒక్క రూపాయి కూడాసంపాదించ లేదు. వారు అనుభవిస్తున్న సంపద అంతా వాస్తవంగా కార్మికుల, గ్రామీణ పేదలదే! అందువల్ల బడా సంపన్నులు, భూస్వాములు పేదలను దత్తత తీసుకోమని చెప్పటం ఏమిటి! వారి దాన ధర్మాలపై ఎందుకు ఆధారపడాలి? వారు సృష్టించిన సంపద మొత్తం వారికే చెందాలి. అది వారి హక్కు. ఈ హక్కును పక్కన పెట్టటమే చంద్రబాబు పీ4 విధానం. ఒక సమావేశ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘ఒకప్పుడు నాతో పాటు ఇక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది పేదరికం నుంచి వచ్చిన వారే. మేమందరం గ్రామాల్లోని మామూలు కుటుంబాల నుంచి వచ్చి పేదరికాన్ని జయించి ఈ స్థాయికి వచ్చా’మని చెప్పారు. గ్రామీణ పేద కుటుంబాలు అప్పుడు, ఇప్పుడు నిత్యం కష్టపడుతున్నప్పుడు, ఆ కుటుంబాలు పేదరికాన్ని జయించాలి గదా! ఎందువల్ల జయించలేక పోయాయి?నిత్యం పేదరికంలోనే ఎందుకు ఉంటున్నాయి? పేదరికం నుంచి బయటపడాలంటే, అందుకు అనుగుణమైన సామాజిక మార్పు విప్లవాత్మకంగా జరగాలి. ఆ మార్పును అడ్డుకోవటమే పీ4 విధానం. ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం తగ్గక పోగా పెరుగుతూ ఉంది. చిన్న, సన్న కారు రైతులు భూములు కోల్పోవటం, గ్రామీణ ఉపాధి తరిగిపోవటం కార ణాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి 2022– 2023లో 45 శాతం ఉండగా 2023–24 నాటికి 46.1 శాతానికి పెరిగింది. గ్రామీణ పేదరికానికి, భూమికి విడదీయరాని సంబంధం ఉంది. సేద్యానికి భూమి ప్రధానం. ఆ భూమి పరాన్నభుక్కులైన కొద్ది మంది భూ కామందుల వద్ద బంధించబడి ఉంది. తమ శ్రమశక్తితో వివిధ పంటలు పండించే గ్రామీణ పేదలకు ఆ పంటలపై ఎటువంటి హక్కూ ఉండదు. ఎటువంటి శ్రమ చేయని భూ కామందులు ఆపంటలను తరలించుకుపోయి సంపదలను పెంచుకుంటున్నారు. పేదలు తీవ్రమైన దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామీణ పేదలకు భూమిపై హక్కు లభించినప్పుడే పేదరికం నుంచి బయటపడతారు.పట్టణ ప్రాంతంలోని కార్మికులు, పేదలు ఉపాధికి దూరమవుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరగక పోవటం, ఉత్పత్తులు సృష్టించే కార్మికులకు పరిశ్రమల్లో భాగస్వామ్యం లేక పోవటం, పాలక ప్రభుత్వాల విధానాల వల్ల పరిశ్రమలు మూతపడి కార్మికులు నిరుద్యోగులుగా మారటం, ఫలితంగా పరిశ్రమలపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారు కూడా ఉపాధి కోల్పోవడం వల్ల పట్టణ పేదరికం పెరుగుతూ ఉంది. తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని చంద్రబాబు చెబుతున్నారు కాబట్టి పేదరికానికి కారణాలు ఆయనకు తెలుసు. ఆ కారణాల పరిష్కారం గురించి నేడు ఆలోచించటం లేదు. నేడు చంద్ర బాబు బడా సంపన్న వర్గాల జాబితాలో ఉండటమే కాకుండా, ఆ వర్గాల ప్రతినిధిగా ఉన్నారు. నేటి వ్యవస్థను కాపాడే ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అందుకు భిన్నంగా చంద్రబాబు విధానాలు ఉండవు. పీ4 విధానం అనేది పేదరిక నిర్మూలనకు కాక... నేటి వ్యవస్థనూ, అందులో భాగమైన బడా పెట్టుబడిదారుల, భూస్వా ముల ప్రయోజనాలనూ కాపాడుతుంది. సమాజ పరిణామక్రమంలో దోపిడీ వర్గాలు పేదలు సృష్టించిన సంపదలను దోచు కోవటమే కాకుండా, అణచివేతకు గురి చేశాయి. అంతే తప్ప వారి గురించి ఆలోచించలేదు, ఆలోచించరు కూడా! అది వారి వర్గలక్షణం. పీ4 విధానం పేదలను పేదలుగా ఉంచటం, వారి పేదరికా నికి కారణాలపై పోరాటం చేయకుండా చేయటం, బడా సంపన్న వర్గాల దానధర్మాల కోసం ఎదురు చూసేలా చేయటమే!గ్రామీణ ప్రాంతంలో భూ సంస్కరణల ద్వారా పేదలకు భూముల పంపిణీ జరగాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి, తద్వారా గ్రామీణ ఉపాధిని పెంచాలి. పట్టణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణమైన పరిశ్రమలు నిర్మించి అందులో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. పరిశ్రమల అనుబంధంగా పట్టణ పేదలకు ఉపాధి ఏర్పడినప్పుడే దేశంలో, రాష్ట్రంలో పేదరికం పోతుంది. కానీ చంద్రబాబు పేదలకు భూములపంపిణీకి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యతిరేకం. రాష్ట్ర ప్రజలే పోరాటాల ద్వారా సాధించుకోవాలి. -వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526-బొల్లిముంతసాంబశివరావు -
ప్రాసంగికత కోల్పోతున్న యూరప్?
డోనాల్డ్ ట్రంప్, జె.డి. వాన్స్ కలిసి వైట్ హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఎలా వేధించారో ప్రపంచం అంతా చూసింది. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆయన పట్ల పాశవికంగా ప్రవర్తించి గుడ్ బై సైతం చెప్పకుండా తరిమేశారు. ‘రష్యాను ధిక్కరించండి, మీకు మేము అండగా ఉన్నాం...’ అంటూ ఉక్రెయిన్ అధినేతకు బాసటగా నిలిచి ఎంతగా ప్రోత్సహించాలో అంతగా ప్రోత్సహించిన యూరప్ ఈ ఘట్టాన్ని చేష్టలుడిగి చూసింది. యూరప్ ప్రభావం పలుచబడిపోతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?తగ్గుతున్న జనాభాయూరోపియన్ యూనియన్ (ఈయూ)కు బలమైన నాయ కత్వం లేదు. ఎవరి దౌత్య విధానం వారిదే. ‘యూరప్‌తో మాట్లాడా లనుకుంటే, నేను ఎవరికి ఫోన్ చేయాలి?’ అంటూ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ ఒక సందర్భంలో చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్య ఇందుకు అద్దం పడుతుంది. యూరప్ దేశాలకు కాలం కూడా కలిసిరావడం లేదు. ఆ దేశాల్లో జననాల రేట్లు తగ్గుతున్నాయి.వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా, యువకులు తగ్గిపోతున్నారు. 2050 నాటికి యూరప్ సగటు వయసు 48 ఏళ్లకు పెరుగుతుంది. 60 ఏళ్లు దాటినవారు జనాభాలో 40 శాతం ఉంటారు. వందేళ్ల క్రితం ప్రపంచ జనాభాలో 25 శాతం యూరప్ దేశాల ప్రజలే ఉండేవారు. 2050 నాటికి, వీరి వాటా కేవలం 7 శాతానికి పరిమితం అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.యుద్ధరంగానికి దళాలు సమకూర్చుకోవడం కూడా ఈ దేశాలకు సమస్యగా మారుతోంది. రష్యా ఇప్పటికే ఉత్తర కొరియా దళాలను రెగ్యులర్ ప్రాతిపదికన తన సైన్యంలో నియమించుకోవలసి వచ్చింది. పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నా సరే... యూరప్ కాలం చెల్లిన తన పాత ఇమ్మిగ్రేషన్ విధానాలనే పట్టుకు వేలాడుతోంది. ఇది శ్రమశక్తి సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఉక్రెయిన్ శ్వేతజాతి శరణార్థుల పుణ్యమా అని పనిచేసే వారి సంఖ్య పెరిగినా ఇది తాత్కాలికమే! ఎదుగుదల లేని ఆర్థిక వ్యవస్థపరిపాలన సరిగా ఉండదు, ఆర్థికంగా పురోగమనం లేదు, వయసు మళ్లుతున్న జనం పెరుగుతున్నారు, వృత్తిపరమైన అవకా శాలూ అంతంత మాత్రమే. ఇలాంటి యూరప్ ఇండియాను ఎలా ఆకట్టుకుంటుంది? అమెరికాలో ఒంటి రంగును బట్టి కాకుండా, సత్తాను బట్టి మనుషుల్ని అంచనా వేస్తారు. ఆ మాదిరిగా మార్పు చెందటంలో యూరప్ సమాజం విఫలమైంది. నత్తనడకగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు, పెరుగుతున్న సామాజిక భద్రతా వ్యయాలు, నడ్డి విరుస్తున్న రుణభారం... ఇవన్నీ ఆ ఖండం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. అమెరికా పాత్రికేయుడు ఫరీద్ జకారియా చెప్పినట్లు, యూరప్ దుఃస్థితికి మూల కారణం ఆర్థిక వృద్ధి లోపం. ఉదాహర ణకు ఇటలీ ఆర్థిక వ్యవస్థలో ఏకంగా ఒక దశాబ్దంగా ఎలాంటి పెరుగుదల లేదు.ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాల్లోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు బలం పుంజుకుంటూ దూసుకు వస్తున్నాయి. గ్లోబల్ గవర్నెన్స్‌లో తమకు అధిక పాత్ర ఉండాలని ఈ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, జీ–7, నాటో వంటి ప్రపంచ అధికార సంస్థలు ఇప్పటికీ యూరప్ చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. కానీ ఆర్థిక వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం అయిదు యూరప్ దేశాలు (జర్మనీ, యూకే, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ) ప్రపంచ టాప్–10 ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నాయి. 2050 నాటికి ఈ అయిదింటిలో కేవలం జర్మనీ, యూకే రెండే టాప్–10 జాబితాలో మిగిలి ఉంటాయి. ఆ పదిలో వాటికి దక్కే ర్యాంకులు చిట్టచివరి తొమ్మిది, పది! ఇందుకు భిన్నంగా, వాటి కంటే ముందుండే ఇండియా, బ్రెజిల్, ఇంకా ఇతర వర్ధమాన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో తమకు గణనీయ పాత్ర ఉండాలని ఒత్తిడి చేస్తాయి. ఇప్పటి ప్రపంచ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణను ఎంతో కాలం అడ్డుకోలేరు.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్మాణం ఇప్పటికే కాలం చెల్లిపోయింది. దీన్ని ఎలా పునర్ వ్యవస్థీకరించాలనే అంశంపై పరిశీలన జరుగుతోంది. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు ప్రస్తుత సభ్యత్వాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఒత్తిడి తెస్తున్నాయి.ఇండియా జీడీపీలో మూడోవంతు కంటే తక్కువ, జపాన్ జీడీపీలో దాదాపు సగం ఉండే యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు శాశ్వత సభ్యు లుగా ఉండటం... ఇండియా, జపాన్ వెలుపల ఉండటం ఎలా సమంజసమనీ, వాటి మీద ఈ రెండు యూరప్ దేశాలు ఎలా పెత్తనం చలా యిస్తాయనీ గట్టి వాదన వినబడుతోంది. భద్రతా మండలి, జీ–7 లను సభ్యత్వ పరంగా విస్తరించడం మీద చర్చలు నడుస్తున్నాయి. ప్రపంచ పాలన సంస్థల పునర్ వ్యవస్థీకరణ జరగాలన్నది కాదనలేని అంశం. తిరుగులేని అమెరికా?శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా మున్ముందు కూడా ప్రబలమైన ప్రపంచ శక్తిగా కొనసాగుతుంది. చైనా, ఇండియా వంటి దేశాలు దాన్ని వెన్నంటి ఉంటాయి. ఒకవేళ అధిగమించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఏమైనా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు గడిచే లోపే అప్పటి విజేతల్లో ఒక్క అమెరికా మినహా మిగిలినవన్నీ టాప్–10 జాబితా నుంచి కను మరుగవుతాయి.అమెరికా లోలోపల పలు మార్పులు చెందుతోంది. జనాభా వర్గాల్లో పరివర్తన ఫలితంగా రాజకీయంగానూ మార్పులు సంభవి స్తున్నాయి. నల్ల జాతీయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆఫ్రో–ఇండి యన్ మహిళ ఉపాధ్యక్ష పదవిని చేపట్టగలిగింది. భారతీయ అమెరికన్లు ప్రభుత్వంలో, విద్యా పారిశ్రామిక రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎగబాకారు. గుజ్జూభాయి కశ్యప్ పటేల్ ఎఫ్‌బీఐ పగ్గాలు చేపడతాడని ఎప్పుడైనా అనుకున్నామా? వివిధ దేశాల సంతతులకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ, ఇతర రంగాల్లో ప్రముఖ స్థానాలు పొందడం వల్ల ఆ యా దేశాలు అమెరికాతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాయి. విదేశీయులకు ప్రవేశం కల్పించడం వల్ల అమెరికా ప్రతిభ ఇనుమడించింది. యూరప్ ఈ విషయంలో విఫలమైంది. వర్ధమాన దేశాలు 21వ శతాబ్దపు నూతన వ్యవస్థకు రూపు దిద్దబోతున్నందున... ప్రపంచ వ్యవహారాల్లో యూరప్ పాత్ర క్రమేపీ క్షీణించిపోతుంది. యూరప్ గనుక జనాభా సంబంధిత (డెమో గ్రాఫిక్) నూతన విధానాలు రూపొందించకపోతే, ఆర్థిక పరమైన సంస్కరణలు చేపట్టకపోతే అది ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో గుర్తింపు లేని ఖండంగా మిగిలిపోతుంది.రానున్న రోజుల్లో ఆసియానే ప్రపంచ అధికార కేంద్రంగా ఆవి ర్భవిస్తుంది. 2020లో ఈ ఒక్క ఖండమే ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 60 శాతం వాటా కైవసం చేసుకుంది. ఇదే ట్రెండ్ ఇక మీదటా కొనసాగబోతోంది. చైనా, ఇండియా ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమ పలుకుబడి పెంచుకుంటూ పోయి, ప్రపంచ పాలన (గ్లోబల్ గవర్నెన్స్)లో మార్పుల కోసం పట్టుబడతాయి. అయితే, అమెరికాతో విరోధం కారణంగా చైనా, యురోపియన్ యూనియన్ (ఈయూ)కు చేరువయ్యే అవకాశం ఉంది. ఇక చైనాతో సంబంధాలు బెడిసినందువల్ల ఇండియా, అమెరికాకు బహుశా మరింత దగ్గర అవుతుంది.మోహన్ గురుస్వామి వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com -
వారికి భారతరత్న ఎందుకివ్వాలంటే...
మహారాష్ట్ర అసెంబ్లీ మార్చి 22న ఫూలే దంపతులు: మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు ‘భారతరత్న’ ఇవ్వాలని అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ గౌరవా నికి ఫూలే దంపతులు తప్ప భారతదేశ చరిత్రలో మరో జంట దొరకదు. అసలు ప్రపంచంలోనే రెండు శరీరాలు ఒకే మనస్సుతో జీవితాంతమూ మానవ మార్పునకు కృషి చేసిన జంట మరోటి లేదు. అది ఒక్క ఫూలే జంట మాత్రమే. కేంద్రం వారికి భారతరత్న ఇచ్చి వారిపట్ల తమ గౌరవాన్ని చాటుకోవాలి.మహాత్మా ఫూలే 1827 ఏప్రిల్ 11న పుడితే, 1831 జనవరి 3న సావిత్రి పుట్టింది. వారు జీవించి ఉన్న కాలానికి కాస్త ఇటు అటు ఈ దేశంలో సంఘ సంస్క ర్తలు ఎదిగారు. వారిలో కొంతమంది స్త్రీల జీవితాలను మార్చాలని ప్రయత్నించారు. ఉదాహరణకు మహారాష్ట్ర లోనే గోవింద రణడే, బెంగాల్లో ఈశ్వర చంద్ర విద్యా సాగర్, ఆంధ్రలో కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారిని తీసుకుందాం. వీరంతా బ్రాహ్మణ కులంలో పుట్టారు. బ్రాహ్మణ కుటుంబాల్లోని ఆడపిల్లలకు విద్య నేర్పించాలని, వితంతు వివాహాలు చేయించాలని మాట్లాడారు, రాశారు. కానీ వారి భార్యల స్థితి తమ కుటుంబాల్లోనే ఎలా ఉండేదో మనకు తెలియదు.వారి గొప్పతనం గురించి ఎన్నో రచనలు వచ్చాయి. స్కూలు పాఠాల్లో సంఘ సంస్కర్తగా వారి గురించే పాఠాలు చెప్పేవారు. వారు అంటరానితనం గురించి, శూద్ర దళిత స్త్రీల గురించి మాట్లాడిన దాఖలాలే లేవు. కానీ ఫూలేల గురించి ఏ పాఠ్య పుస్తకాల్లో చెప్పేవారు కాదు. వారి గురించి తెలిసిన అగ్ర కుల ఉపాధ్యాయులు వారి గురించి చెడుగా చెప్పే వారు. బెంగాల్లో కొద్దిపాటిగా ఉన్న భద్రలోక్ స్త్రీల సంస్కరణ కోసం కృషి చేసిన ఈశ్వరచంద్ర గురించి నేను స్కూల్లో ఉండగానే చదివాను. కందుకూరి గురించి సరేసరి. కానీ ఫూలే గురించి నాకు తెలిసింది 1986–87 ప్రాంతంలో! ఆయన గురించి కాస్తా వివరంగా చదవడానికి ఒక్క పుస్తకం కూడా లేదు. వెతగ్గా, వెతగ్గా కోఠి ఫుట్‌పాత్ పాత పుస్తకాల్లో ధనుంజయకర్ ఆయన మీద రాసిన బయోగ్రఫీ దొరికింది. అది చదివాక నా తల తిరిగి పోయింది. అందులో సావిత్రి బాయి గురించి కొద్దిగానే ఉంది. ఇంత గొప్ప సాంఘిక సంస్కరణకు పాటుపడిన జంటను ఈ దేశ మేధావులు ఎందుకు పక్కకు పెట్టారు? కులం వల్ల!ఇప్పుడు ఒక ఆరెస్సెస్/బీజేపీ ప్రభుత్వం, అదీ ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆ జంటకు భారతరత్న ఇవ్వాలని రిజల్యూషన్ ఎందుకు పాస్ చేసింది? ఈ జంట అనుయాయుడైన అంబేడ్కర్ వాళ్ళు ప్రారంభించిన శూద్ర–దళిత విద్యా పోరాటం నుండి ఎదిగి ఒక రాజ్యాంగం రాశారు. దానివల్ల శూద్రులకు, దళితులకు ఓటుహక్కు వచ్చింది కనుక! వారి సంఖ్యా బలం, వారి ఆత్మగౌరవ చైతన్యం ఆరె స్సెస్ ప్రభుత్వాన్ని ఈ స్థితికి నెట్టింది. శూద్రుడైన శివాజీని దేశం ముందు పెట్టింది ఫూలేనే!ఆరెస్సెస్ మాత్రమే కాదు, అగ్రకుల కమ్యూనిస్టు, ముఖ్యంగా బెంగాలీ కమ్యూనిస్టులు, దేశంలోని ఉదార వాదులు ఊహించని పరిణామం ఇది. బెంగాల్ మేధా వులు ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్లను దేశం మొత్తం విద్యా రంగంలోకి చొప్పించారు. కానీ మహాత్మా ఫూలేను, సావిత్రిబాయిని, అంబేడ్కర్‌ను తమ రాష్ట్ర పరిధిలోకి రానివ్వలేదు. మండల్ కమిషన్ పోరాట చరిత్రను కూడా వాళ్ళు గుర్తించలేదు. ఈ సంవత్సరం ఫూలే దంపతులకు భారతరత్న వస్తే శూద్ర–దళిత ఆదివాసీ స్త్రీల చరిత్ర మార్చే చర్చ ఏ రాష్ట్రమూ పక్కకు పెట్టలేనంత ఎదుగుతుంది. ఫూలే జంట కేవలం భారత దేశానికే కాదు మొత్తం భూ ప్రపంచానికే ఏం పాఠం నేర్పారో తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ భూమి మీద పెద్ద పెద్ద మతాలను స్థాపించిన బుద్ధుడు, జీసస్, మహమ్మద్ వంటి వారు నడిచారు. అందులో బుద్ధుడు, మహమ్మద్ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. జీసెస్ శిలువేసి చంపబడ్డారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో జ్యోతి రావు ఫూలే, సావిత్రిబాయిని పెళ్ళి చేసుకొని పెళ్ళి అర్థాన్నే మార్చారు. అందుకు దీటుగా ఆమె భార్య అనే అర్థాన్నే మార్చారు.వాళ్ళు 19వ శతాబ్దంలో ఎటువంటి భార్యా భర్తలుగా ఈ భూమి మీద నడిచారో కొన్ని ఉదా హరణలతో చూద్దాం. సావిత్రీబాయికి 9వ ఏట, ఫూలేకు 13వ ఏట పెండ్లి అయింది. అది బాల్య వివాహమే. అయితే ఫూలే ఏం చేశారు? ఆమెతో పడక గదిలో భర్తగా జీవించలేదు. ఆమెకు టీచరై అక్కడ చదువు చెప్పారు. అంత గొప్ప పనిచేస్తే పూనా పండితులు తిలక్ నేతృత్వంలో ఆయన తండ్రిని బెదిరించి, బట్టలు బయట పడవేయించి ఇంటి నుండి తరిమేయించారు. ఆ యువ దంప తులు దళిత వాడల్లో మకాం పెట్టి అక్కడే ఒక దళిత మిత్రుడి ఇంట్లో ఆడవాళ్ళకు స్కూలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే తన దగ్గర పాఠాలు నేర్చుకున్న సావిత్రిని ఒక టీచర్ని చేశారు ఫూలే.అంతేగాక కుటుంబాల నుండి బయటికి నెట్టబడ్డ వితంతువుల కోసం ఒక నివాస కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు – యశ్వంతరావుని పెంచుకున్నారు. అంతకు ముందు వాళ్ళి ద్దరూ 30 ఏండ్ల వయస్సులో ఉండగా సావిత్రి తండ్రి,ఖండోజీ పాటిల్ వచ్చి ఫూలేతో... ‘నేను సావిత్రిని ఒప్పించాను, మీకు పిల్లలు కావాలి కనుక మరో పెళ్ళి చేసుకో’ అని కోరాడు. దానికి ఫూలే... ‘లోపం సావి త్రిలో లేదు, నాలో ఉంది. ఆమెకు మరో పెండ్లి చేద్దాం. ముగ్గురం కలిసి పిల్లల్ని పెంచుతాం’ అని బదులు చెప్పారు. ఇటువంటి భర్త ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా!ఫూలే 1890లో పక్షవాతంతో చనిపోయారు. ఆయన బంధువులు సాదుకున్న కొడుకు తలగోరు (తలకొరివి) పెట్టడానికి వీలులేదు అని గొడవ చేశారు. ఫూలే బంధువులలో ఒక పురుషుడు తలగోరు పెడ తానని వాదించాడు. సావిత్రి వారిని ధిక్కరించి ‘నేనే నా భర్తకు తలగోరు పెడతాన’ని చెప్పి ఆ కార్యం నిర్వర్తించారు. ఈ పని చేసిన మొదటి భారత స్త్రీ ఆమె. 1898లో బుబానిక్ ప్లేగు వ్యాపించిన సమయంలో సావిత్రీబాయి, డా‘‘ యశ్వంతరావు ప్రజలకు వైద్యం చేస్తూ అదే రోగానికి బలై చనిపోయారు.ఈ జంటను మహారాష్ట్ర అగ్రకుల మేధావులు చాలా కాలం వెలుగులోకి రానివ్వలేదు. ఇప్పుడు ఆరె స్సెస్ ప్రభుత్వం వారికి భారతరత్నను ప్రతిపాదించింది. ఇది కాంగ్రెస్‌కు మరో సవాలు కానుంది. శూద్ర బీసీలను ఆకట్టుకోవడంలో ఇది ఆరెస్సెస్‌కు పెద్ద ఆయుధమౌతుంది. అంబేడ్కర్‌కు భారతరత్న వీపీ సింగ్ ప్రభుత్వం ఇచ్చినా ఆరెస్సెస్–బీజేపీలు దాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. కాంగ్రెస్‌ను కుటుంబ పార్టీ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇప్పుడు ఫూలేలకు భారతరత్నను తమ ప్రభుత్వమే స్వయంగా ఇచ్చిందని పెద్ద ప్రచారం ప్రారంభిస్తాయి. ఈ స్థితిలో తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫూలే లను దీటుగా ఓన్ చేసుకోకపోతే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి చాలా పెద్ద సమస్య అవుతుంది.కనీసం ఈ రెండు ప్రభుత్వాల వాళ్ళు అటువంటి తీర్మానాలే అసెంబ్లీలలో పాస్ చేసి కేంద్రానికి పంపడం, ఫూలేలకు శూద్ర బీసీ జీవితాలను ప్రతిబింబించే మ్యూజియవ్‌ులను కట్టించడం చెయ్యాలి. ఈ రాష్ట్రాల్లో అగ్రకులాలు తమ చదువులకు పునాదులు వేసిన జంటగా ఫూలేలను చూడటం లేదు. వారి నుండి ఒక్క మేధావి కూడా వారి గురించి రాయడం, మాట్లాడటం చెయ్యడం మనకు కనిపించదు. వారిని గుర్తించి గౌరవించడం అన్ని కులాల ఆత్మగౌరవానికీ నిదర్శనం.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు(ఏప్రిల్ 11న మహాత్మా ఫూలే జయంతి) -
వ్యవసాయ సుంకాల కాపట్యం
అధిక సబ్సిడీలతో కూడిన అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు భారతదేశం తన మార్కెట్‌ను తెరవాలని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చాలా ప్రత్యేకంగా కోరిన ట్లుగా నేను ఇటీవల చదివాను. అది చదివిన ప్పుడు, ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త నికోలస్ స్టెర్న్, తన భారతదేశ పర్యటనల సమయంలో క్లుప్తంగా చెప్పింది గుర్తొచ్చింది. ‘అమెరికా రైతులకు అలాంటి సబ్సిడీలను అందించడం తప్పేనని నేను అంగీకరిస్తున్నాను. కానీ అమెరికా ఉత్పత్తులకు భారతదేశం తన తలుపులు తెరవకపోతే అది విపత్తుకు దారితీస్తుంది.’జార్జ్ బుష్ జూనియర్ హయాంలో 2001 నుండి 2005 వరకు పదవిలో ఉన్న యాన్ వెనెమన్ మొదలుకుని, అమెరికా వ్యవసాయ మంత్రులందరూ ఇదే విధమైన కపటత్వాన్ని పదే పదే ప్రదర్శించారు. కొంతకాలం తర్వాత వాషింగ్టన్ డీసీలోని ‘ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (ఐఎఫ్పీఆర్ఐ)లో మాట్లాడుతూ, భారత వ్యవసాయాన్ని బలవంతంగా తెరవాలన్న ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త వాదనను ఆమె ఎంత నిస్సిగ్గుగా సమర్థించిందో నాకు గుర్తుంది.అమెరికాలోని కనీసం 14 వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి గ్రూపులు, భారతదేశ ఉత్పత్తి నిర్దిష్ట కనీస మద్దతు ధరపై పరిమితిని కోరుతూ అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌కు లేఖలు రాశాయి. అప్పుడే ఇండియాకు అమెరికా ఎగుమతులు చేయడానికి వీలుంటుంది మరి.చైనా నిలబడిన తీరుఅందువల్ల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన అవాంఛ నీయ వాణిజ్య యుద్ధం పట్ల నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలను లొంగదీసుకోవడానికి ట్రంప్ చుట్టూ ఉన్న బిలియనీర్లు ఆయనకు తప్పుడు సలహా ఇస్తున్నారు.అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అమెరికా పట్ల ధిక్కార వైఖరితో నిలబడటం ప్రారంభించాయి. కాబట్టి భారతదేశాన్ని కాస్త వంగమని మాత్రమే అడిగినప్పుడు, అది సాష్టాంగపడటానికి సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను.ఇక్కడ మరొక కథ చెబుతాను. కొన్నేళ్ల క్రితం, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ‘చెడ్డ’ మానవ హక్కుల రికార్డు కారణంగా చైనాతో అమెరికా వ్యాపారం చేయదని వ్యాఖ్యానించారు. మరుసటి రోజు, నేను ‘బీబీసీ’ టీవీ ఛానెల్‌ని చూస్తున్నాను. ఒక జర్నలిస్ట్ అప్పటి చైనా అధ్యక్షుడిని అడుగుతున్నారు: ‘చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు చేసిన బెదిరింపునకు మీరు ఎలా స్పందిస్తారు?’ ఆయన సమాధానం కూడా అంతే చిన్నది: ‘యూఎస్‌తో వ్యాపారం చేయడమా? మేము నాలుగు వేల ఏళ్లకు పైగా అమెరికాతో వ్యాపారం చేయలేదు. కాబట్టి అది అంత ముఖ్యమైనదా?’ఈ ప్రకటన తర్వాత, చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేయాలని తమ సొంత అధ్యక్షుడు ఇచ్చిన పిలుపును వ్యతిరేకిస్తూ అమెరికా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు తిరగబడ్డాయి. బిల్ క్లింటన్ చివరికి దేశీయ పరిశ్రమ ముందు తల వంచి, మళ్ళీ ఎప్పుడూ ఆ సమస్యను లేవనెత్తలేదు.సుంకాల వాణిజ్య సూత్రాలుకొత్త సుంకాల యుద్ధానికి తిరిగి వస్తే, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ప్రవేశాన్ని పరిమితం చేసే విషయంలో ట్రంప్ భారత దేశాన్ని ‘సుంకాల రాజు’ అని విమర్శించవచ్చు. ఎందుకంటే, అమె రికా 5 శాతం సుంకాలను విధిస్తుంటే, భారత్ సగటున 39 శాతం సుంకాలను విధిస్తోంది. అయితే, భారత్ విధించే సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. దేశ అభివృద్ధి స్థాయి, వాణిజ్య పుస్తకాలలో పేర్కొన్న ‘ప్రత్యేక, భేదాత్మక వ్యవ హారం’ ఆధారంగా వీటిని విధించారు. భారత్ ఏ దశలోనూ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించలేదని తెలియజేయాలి. భారత్ సాపేక్షంగా విధిస్తున్న అధిక సుంకాలు, అప్పటికే రూపొందించి ఉన్న వాణిజ్య సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. పైగా ఒక వ్యక్తి ఇష్టానిష్టాల ద్వారా వాటిని నియంత్రించడం ఉండదు.మరోవైపు, వ్యవసాయానికి అమెరికా అందించే భారీ సబ్సిడీలే వాస్తవానికి సమస్య. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలు తాము మరిన్ని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ అమెరికా వ్యవసాయ సబ్సిడీలను కాదు’ అని అప్పటి యూరోపియన్ ట్రేడ్ కమిషనర్ పీటర్ మాండెల్సన్ పేర్కొన్న విషయాన్ని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ (2006 జూలై 21) స్పష్టంగా రాసింది. ‘అమెరికా రైతులతో పోటీ పడటానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మేము అమెరికా ఖజానాను ఎదుర్కోలేము’ అని అప్పటి భారత వాణిజ్య మంత్రి కమల్‌నాథ్ చెప్పింది ఆయన ఉటంకించారు.రైతులకు ఎంత ఇస్తున్నారు?గత కొన్ని సంవత్సరాలుగా, అమెరికా తన అధిక సబ్సిడీ వ్యవసాయం చుట్టూ నిర్మించిన రక్షణ కోటను మరింత బలోపేతం చేసుకుంది. అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన ఆర్థిక పరిశోధన సేవ నివేదిక ప్రకారం, రైతులు, పశువుల పెంపకందారులకు ప్రత్యక్ష ప్రభుత్వ వ్యవసాయ కార్యక్రమం కింద చెల్లింపులు 2025 నాటికి 42.4 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని అంచనా. నిజానికి 2024 నాటికి 9.3 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని అంచనా వేశారు.అంటే ఒక్కో రైతుకు అమెరికా ప్రభుత్వం సాలీనా రూ. 26.8 లక్షలను చెల్లిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చలలో వివాదాస్పద అంశంగా మిగిలిపోయిన పత్తిని ఉదాహరణగా తీసుకుందాం. 2021 నాటికి 624.7 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్న కేవలం 8,103 మంది రైతులకు అమెరికా భారీ సబ్సిడీలను అందిస్తోంది (ఇండియాలో 98.01 లక్షల మంది రైతులు పత్తి సాగులో నిమగ్నమై ఉన్నారు). న్యూఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ డబ్ల్యూటీఓ స్టడీస్’ లెక్కల ప్రకారం, 2021లో అమెరికా పత్తి రైతుకు లభించిన వార్షిక మద్దతు 1,17,494 డాలర్లు కాగా, భారత్ విషయంలో అది కేవలం 27 డాలర్లు.2006లో యూరోపియన్ యూనియన్ పత్తికి 139 శాతం సబ్సిడీ మద్దతును అందించింది. 2001లో అభివృద్ధి చెందిన దేశాల పరిమితి కంటే అమెరికా పత్తికి 74 శాతం అధిక మద్దతును అందించింది. వ్యవసాయ దిగుమతులకు తక్కువ సుంకాలు అని అమెరికా అనడం అంటే, తమ వ్యవసాయం బహిరంగ మార్కెట్ అని చూపించడం కోసమే! కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే, దిగుమతులను నియంత్రించడానికి అమెరికా 9,000 కంటే ఎక్కువ పన్నేతర అడ్డంకులు (ఎన్టీబీలు) విధించింది. దీంతో పోలిస్తే ఇండియా విధించిన ఎన్టీబీలు కేవలం 600. సుంకాలతోనే సుంకాలను అమెరికా సమం చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. భారత్ కూడా తన సొంత వ్యవసా యాన్ని కాపాడుకోవడానికి సరిపోలే పన్నేతర అడ్డంకులని ఉపయో గించడానికి తగినంత అవకాశం ఉంది. భారతపై ట్రంప్ వేసిన తాజా అదనపు 27 శాతం ప్రతిచర్య సుంకాలతో మన రొయ్యలు, బాస్మతేతర బియ్యం, గోదుమల ఎగుమతికి దెబ్బే. అమెరికాతో భారత వాణిజ్యంలో అవే దాదాపు 46 శాతం ఉంటాయి. ఏమైనా, భారత్ తన ఇంటిని క్రమబద్ధీకరించు కోవాలని అమెరికా కోరుకునే బదులు, అమెరికాయే వ్యవసాయరంగం ద్వారాలు తెరవాలని భారత్ అడగాల్సిన అవసరం ఉంది. అమెరికా వ్యవసాయం చుట్టూ ఉన్న అధిక సబ్సిడీ కోటను ముందుగా కూల్చి వేయాలని అడిగితేనే ఇది సాధ్యమవుతుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ, ఆహార నిపుణులు -
బెయిల్ నియమం! జైలు మినహాయింపు!!
తీవ్రత లేని కేసుల్లో కూడా బెయిల్‌ని ట్రయల్ కోర్టు తిరస్కరించే ధోరణి పెరుగుతున్నందుకు సుప్రీంకోర్టు ఈమధ్య తీవ్ర ఆందోళన వ్యక్తపరిచింది. ప్రజాస్వామ్య రాజ్యం పోలీసు రాజ్యంగా మార కూడదని న్యాయమూర్తులు అభయ్ ఎస్. ఓకా, ఉజ్జల్ భూయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ దరఖాస్తులను ట్రయల్ కోర్టులు అనవసరంగా తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టు మీద అనవసర భారం పడుతోందని, ట్రయల్ కోర్టు స్థాయిలో పరిష్కరించాల్సిన కేసులకు సంబంధించిన బెయిల్ పిటీషన్లను సుప్రీంకోర్టు పరిష్కరించవలసి రావడం మీద జస్టిస్ ఓకా దిగ్భ్రాంతిని వ్యక్త పరిచారు. దర్యాప్తు పూర్తి అయిపోయి చార్జిషీట్ దాఖలైన కేసుల్లో ముద్దాయి రెండు సంవత్సరాలకు పైగా నిర్బంధంలో ఉన్నప్పటికీ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. అది ఓ చీటింగ్ కేసు. ఆ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 సంవత్స రాల క్రితం ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టులకు కూడా చేరేవి కావనీ, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అలాంటి పిటీషన్లతో నిండి పోతోందనీ అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది.ప్రజాస్వామ్య దేశంలో దర్యాప్తు సంస్థలు అనవసరంగా అరెస్టు చేయడానికి వీల్లేదనీ, పోలీసు రాజ్యంగా మార్చకూడదనీ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర పదజాలంతో తన ఉత్తర్వులలో పేర్కొంది. కస్టడీ అవసరం లేని కేసుల్లో వ్యక్తులను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు 2022లో జారీ చేసిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం గుర్తు చేసింది. ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. అందుకని బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టులు ఉదారంగా ఉండాలి.‘బెయిల్ అనేది నియమం. జైలు అనేది దానికి మినహాయింపు’. ఈ ప్రాథమిక చట్టపరమైన సూత్రాన్ని కోర్టులు పదేపదే విస్మరిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఈ కేసుని పేర్కొనవచ్చు. ఈ కేసులో ముద్దాయి మోసం కేసులో నిందితుడు. రెండు సంవత్సరాలకు పైబడి కస్టడీలో ఉన్నాడు. పోలీసులు తమ దర్యాప్తును పూర్తి చేశారు. చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. అయినప్పటికీ అతని బెయిల్ పిటీషన్‌ను ట్రయల్ కోర్టు – గుజరాత్ హైకోర్టులు తిరస్కరించాయి. చివరికి అతనికి బెయిల్‌ని సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వచ్చింది.బెయిల్ మంజూరు చేయడం గతంలో సరళంగా ఉండేది. ఇప్పుడు సంక్లిష్టంగా మారిపోయింది. జవాబు, రిజాయిండర్ (ప్రతి జవాబు); సర్రిజాయిండర్ లాంటి సంస్కృతి పెరిగిపోతోంది. ఎన్.డి. పి.ఎస్., మనీలాండ రింగ్ లాంటి చట్టాలు నిరూపణా భారాన్ని ముద్దాయిపైనే మోపుతున్నాయి. దీనివల్ల రెగ్యులర్ బెయిల్ దరఖాస్తులు వెనకబడి పోతున్నాయి.క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 437(4) ప్రకారం, అదే విధంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 480(4) ప్రకారం... బెయిల్ మంజూరు చేసినప్పుడు తగు కారణాలను రాయాల్సి ఉంటుంది. బెయిల్ తిరస్కరించినప్పుడు ఎలాంటి కార ణాలూ రాయాలని చట్టం నిర్దేశించలేదు. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం తగు కారణాలు మాత్రమే కాదు, ఎందుకు బెయిల్ మంజూరు చేయాల్సి వస్తుందో కూడా వివరంగా రాయాల్సి ఉంటుంది. ఇది రాయడం కొంత కష్టమైన పని. తగు సమయం అవసర మవుతుంది. ఐ.పి.సి. కేసుల్లో అంత వివరమైన కారణాలు అవసరం లేదు. అయినా కోర్టులు బెయిళ్లను తిరస్కరించ డానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. బెయిల్ అనేది నియమం– జైలు అనేది మినహాయింపు అనే సూత్రాన్నే కోర్టులు పాటించాలి. మనీ లాండరింగ్, ‘ఉపా’ లాంటి కేసుల్లో ఈ సూత్రాన్ని కొన్ని మార్పులతో వర్తింప చేయాల్సి ఉంటుంది.గత సంవత్సరం ప్రతి సుప్రీంకోర్టు బెంచ్ ప్రతిరోజూ కనీసం 15 నుంచి 20 బెయిల్ దరఖాస్తులను విచారిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టు గత నాలుగైదు సంవత్సరాల నుంచి బెయిల్ దర ఖాస్తుల పరిష్కారానికే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. దీనివల్ల రాజ్యాంగపరమైన వివాదాలను పరిష్కరించాల్సిన సమయాన్ని సుప్రీంకోర్టు ఈ కేసుల వివాదాలను పరిష్కరించడానికి వినియోగించాల్సి వస్తోంది. చాలా బెయిల్ దరఖాస్తులను జిల్లా న్యాయ వ్యవస్థ పరిష్కరించవచ్చు. బెయిల్ అనేది ఒక నియమం అన్న విషయం జిల్లా న్యాయవ్యవస్థకు తెలియని విషయం కాదు. కానీ వారు రకరకాల కారణాల వల్ల బెయిల్స్‌ను మంజూరు చేయడానికి వెనకాడుతున్నారు. అందులో ముఖ్యమైనది – బెయిల్ మంజూరు చేస్తే మోటివ్స్ని న్యాయమూర్తులకు అంటగడుతారనీ, అదే విధంగా హైకోర్టు పాలనాపరమైన చర్యలు తీసుకుంటుందన్న భయం కూడా న్యాయమూర్తులను వెంటాడుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా బెయిల్స్ విషయంలో రకరకాలైన అభిప్రాయాలు, ఉత్తర్వులను జారీ చేశాయి. అది కూడా మరో కారణం. అందుచేత ఈ మధ్యన బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు నిలకడగా ఉన్నాయి. ‘బెయిల్ అనేది నియమం. తిరస్కరించడమ నేది మినహాయింపు’ అనే సూత్రానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయి. జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని బెయిల్స్‌ను ఉదారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రేరేపిత కేసుల సంఖ్య పెరుగుతున్న కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టులపై పని భారం పెంచకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా న్యాయ వ్యవస్థపై ఉంది.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు -
ట్రంప్ విధ్వంసం
‘గ్రేట్ డిక్టేటర్’ చిత్రంలో హిట్లర్ పాత్రధారిగా అభినయించిన చార్లీ చాప్లిన్ గ్లోబ్‌తో ఇష్టానుసారం ఆటలాడుకుంటున్న దృశ్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కేవలం రెండేళ్లలో మీరు ప్రపంచానికే చండశాసనుడు కావొచ్చని చెప్పిన సలహాదారును... తనకు కాసేపు ఏకాంతం కావాలని బయటకు పంపి ఆ గ్లోబ్‌తో రకరకాల విన్యాసాలు చేస్తాడు. చివరికది మొహమ్మీదే భళ్లున బద్దలుకావటంతో ఆ ముచ్చట ముగుస్తుంది. జాత్యహంకారం తలకెక్కి ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని కలలుగన్న హిట్లర్‌పై అది తిరుగులేని వ్యంగ్యాస్త్రం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అలాంటి ఆశలేం లేవుగానీ... వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమరికను తలకిందులు చేయాలన్న సంకల్పం... అందువల్ల అమెరికా భారీగా లాభపడుతుందన్న మూఢ విశ్వాసం ఆవరించినట్టుంది. పర్యవసా నంగా గత గురువారం నుంచి అంతర్జాతీయ మార్కెట్లన్నీ అధోగతిలో పయనిస్తున్నాయి. ట్రంప్ విధించిన ప్రతిచర్య సుంకాలతో మాంద్యం ముప్పు తప్పదన్న భయం వెన్నాడుతుండగా ప్రధాన ఈక్విటీల విచ్చలవిడి అమ్మకాలతో మార్కెట్లు పతనమవుతున్నాయి. మన బీఎస్ఈ, నిఫ్టీల్లో ఒక్క రోజులో రూ. 14 లక్షల కోట్ల సంపద ఆవిరైందని చెబుతున్నారు. ఆఖరి క్షణంలో స్వల్పంగా కోలుకో వటం వల్ల ఇక్కడితో ఆగింది గానీ రేపన్నరోజు బాగుంటుందన్న భరోసా చాలామందికి లేదు. దేన్నయినా తట్టుకోగల సామర్థ్యమున్న మన ఆర్థిక వ్యవస్థవల్ల త్వరలోనే సాధారణ స్థితి ఏర్పడగల దని చెబుతున్న నిపుణులూ ఉన్నారు. అంతర్జాతీయంగా అయితే ఎక్కడా ఆశారేఖ కనబడటం లేదు. డాలర్ బలహీనపడటం, చమురు ధరలు పడిపోవటంలాంటి పరిణామాలన్నీ కేవలం మదుపరుల్లో తాత్కాలికంగా అలుముకున్న నిరాశా నిస్పృహల వల్లే అని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చిత్రమేమంటే... ఇంత జరుగుతున్నా ఈ సంక్షోభాన్ని తాత్కాలికమైనదిగానే ట్రంప్ పరిగణిస్తు న్నారు. తానిచ్చిన డోస్ పనిచేయటం మొదలెట్టాక అమెరికా ఆర్థిక వ్యవస్థ శరవేగంతో ఎదుగుతుందని విశ్వసిస్తున్నారు. ఇదంతా చూస్తూ కూడా అధికార రిపబ్లికన్లు నోరెత్తరు. విపక్ష డెమాక్రాట్లూ మౌనంగానే ఉంటారు. సాధారణ ప్రజానీకం ‘హ్యాండ్సాఫ్ ట్రంప్’ అంటూ వేలాదిగా రోడ్లపైకొస్తున్నారు. మొత్తానికి ప్రపంచీకరణ కళ్లముందు కుప్పకూలుతోంది. ఈ ప్రపంచీకరణలో భాగస్వాములు కావటానికి ససేమిరా అన్న వర్ధమాన దేశాల పాలకులను నయానో భయానో దారికి తెచ్చి అక్కడి వనరులన్నిటినీ అమె రికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎడాపెడా వాడుకున్న అమెరికా... ట్రంప్ ఏలుబడి వచ్చాక దానికి విరుద్ధమైన పోకడలకు పోతోంది. ఇన్నేళ్లుగా అమెరికాను అన్ని దేశాలూ దోచుకున్నాయని ఎదురు ఆరోపిస్తోంది. గతవారం ‘అమెరికా విముక్తి దినం’ రోజున మిత్రులు, ప్రత్యర్థులన్న విచక్షణ కూడా లేకుండా సుంకాల మోత మోగించేందుకు ట్రంప్ అధ్యక్షుడికి వుండే ‘ఎమర్జెన్సీ’ అధికారాలను వినియోగించుకున్నారు. కేవలం యుద్ధ సమయాల్లో వాడుకోవాల్సిన ఈ అధికారాలను రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఆయన చేజిక్కించుకున్నా అమెరికన్ కాంగ్రెస్‌గానీ, ఇన్నాళ్లుగా స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిన రిపబ్లికన్లు గానీ, బహుళజాతి కార్పొరేషన్లు గానీ నోరెత్తక పోవటం ఆశ్చర్యకరం. కేవలం కెనడాపై విధించిన అదనపు సుంకాలను రద్దు చేయటం వంటి పరిమిత చర్య మినహా సెనేట్ మౌనంగా ఉండిపోయింది. ఈమాత్రం చర్యను కూడా ట్రంప్ మద్దతుదారులు సహించలేకపోతున్నారు. మాదకద్రవ్య ముఠాలను అదుపు చేయటా నికి విధిస్తున్న సుంకాలను వ్యతిరేకిస్తారా అంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఈ సుంకాల విధింపు గుడ్డెద్దు చేలో పడిన చందాన ఉన్నదని జనాభా పెద్దగాలేని హెర్డ్ అండ్ మెక్‌డోనాల్డ్ ద్వీపాల వంటి అతి చిన్న ప్రాంతాలను సైతం వదలని తీరు గమనిస్తే తెలుస్తుంది. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని కైవసం చేసుకుని, అగ్రగామిగా నిలబడాలని దశాబ్దాలుగా చైనా పథకాలు పన్నుతోంది. ట్రంప్ దాన్ని వేగవంతం చేశారు. సుదీర్ఘకాలం నిర్మించుకున్న అనుబంధం కారణంగా ఇన్నాళ్లూ పాశ్చాత్య ప్రపంచం అమెరికాను సమర్థిస్తూ పోయింది. కెనడా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వంటివన్నీ అమెరికా ఏం చేసినా అది లోకకల్యాణం కోసమే నన్నట్టు వంతపాడాయి. ఇలాంటి అనుకూలతలు లేని కారణంగానే పూర్వపు సోవియెట్ అయినా, ప్రస్తుత రష్యా అయినా, చైనా అయినా దీటుగా నిలబడలేకపోయాయి. కానీ ట్రంప్ దాన్ని కాస్తా మార్చేశారు. కెనడా కొత్త ప్రధాని మార్క్ కేర్నీ మాటల్లో చెప్పాలంటే ‘అమెరికా ఇక విశ్వసించదగ్గ భాగస్వామి కాద’ని తేలిపోయింది. జర్మనీ చాన్సలర్ కాబోతున్న ఫ్రెడరిక్ మెర్జ్ అయితే ఇంకాస్త ముందుకుపోయారు. అమెరికా నుంచి యూరప్ స్వాతంత్య్రాన్ని సాధించాలని పిలుపు నిచ్చారు. ఇదంతా చివరకు ప్రపంచంలో చైనా పలుకుబడి పెరగడానికి దోహదపడుతుందన్న స్పృహ ట్రంప్‌కు లేకుండా పోయింది. నియమాల ఆధారిత ప్రపంచమే ధ్యేయం అంటూ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా క్వాడ్‌ను రూపొందించి అమెరికా మనల్ని అందులో భాగస్వా ముల్ని చేసింది. సందర్భం వేరు కావొచ్చుగానీ ఆర్థికరంగంలో ఇవాళ అన్ని నియమాలనూ ఉల్లంఘిస్తున్న అమెరికాను క్వాడ్ విషయంలో మనం విశ్వసించవచ్చా అన్న సందేహం కలిగితే ఆశ్చర్యమే ముంది? మౌలికంగా మార్కెట్లు కచ్చితమైన అంచనాల ఆధారంగా ముందుకు కదులుతాయి. మదుపుదార్లు స్వేచ్ఛగా, నిర్భయంగా పెట్టుబడులు పెడతారు. సంపద పోగవుతుంది. కానీ ట్రంప్ చర్యలతో అంతా తలకిందులైంది. ఇక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం ఇప్పట్లో సాధ్యమా? -
రెండు ఉపయోగకర పర్యటనలు
ప్రధాని మోదీ ఈ నెల మొదటి వారంలో రెండు ఉపయోగకరమైన విదేశీ పర్యటనలు జరిపారు. మొదటిది – 4వ తేదీన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ‘బిమ్ స్టెక్’ శిఖరాగ్ర సమావేశం కోసం. రెండవది – ఆ మరునాడు శ్రీలంకకు! ఈ రెండూ దేశ ప్రయోజనాలకు అవసరమైనవి కాగా, అద నంగా మరొకటి చెప్పుకోవాలి. బ్యాంకాక్‌లో ఆయన బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహా దారు మహమ్మద్ యూనుస్‌తో విడిగా సమావేశం కావటం.లుక్ ఈస్ట్ – యాక్ట్ ఈస్ట్వివిధ దేశాల మధ్య పరస్పర సహకారాలే కాకుండా ఒక ప్రాంతానికి చెందిన దేశాల మధ్య అందుకోసం ప్రాంతీయ సంస్థలు ఏర్పడటం ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలం తర్వాత నుంచి ఉండగా, ఆ క్రమంలో ఇండియాకు సంబంధించి 1997లో వచ్చిందే ‘బిమ్స్టెక్’. ఇటువంటివి సార్క్, హిందూ మహాసముద్ర తీర దేశాల సంస్థల పేరిట కూడా ఏర్పడ్డాయి గానీ, కారణాలు ఏవైనా అవి సంతృప్తికరంగా పనిచేయలేదు. ఆగ్నేయాసియాకు సంబంధించి 1967 నుంచి గత 57 ఏళ్లుగా విజయవంతంగా పనిచేస్తున్నది ‘ఆసి యాన్’ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్) ఒక్కటే. ‘ఆసియాన్’ దేశాలన్నీ భారత్ కన్నా చాలా చిన్నవి. వాటి ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్నవే. ఆ పరిస్థితితో పోల్చినప్పుడు భారత్ కేంద్రంగా ఒక బలమైన ఆర్థిక సహకార వ్యవస్థ ఎప్పుడో ఏర్పడి బల పడ వలసింది. కానీ, విధానపరమైన లోపాల వల్ల ప్రభుత్వాలు కొంత కాలం అప్పటి సోవియట్ వైపు, తర్వాత పాశ్చాత్య ప్రపంచంవైపు చూశాయి గానీ చుట్టూ గల ఆసియా దేశాలను నిర్లక్ష్యం చేశాయి. ఈ వెనుకటి విధానాలకు భిన్నంగా మొదటిసారిగా ‘లుక్ ఈస్ట్’ పేరిట కొత్త విధానాన్ని ముందుకు తెచ్చింది, 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు. ఆ విధంగా కొత్త దృష్టి అయితే ఏర్పడింది గానీ, ఆయనే అమలుకు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, వాటి అవసరాలను బట్టి అయినా తూర్పు దేశాలతో ఆర్థిక సంబంధాలు తగినంత అభివృద్ధి చెందలేదు. పీవీ ఐదేళ్ల పాలన తర్వాత రాజకీయ అస్థిరతలు ఏర్పడటం అందుకొక ముఖ్య కారణం. అప్పటికీ, విదేశాంగ వ్యవహారాలలో నిపుణుడైన గుజ్రాల్ నేషనల్ ఫ్రంట్, యునై టెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల కాలంలో విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా పని చేసినపుడు 1997లో ‘బిమ్స్టెక్’ కోసం చొరవ తీసుకున్నారు.‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ– సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో ఆపరేషన్’ పేరిట ఏర్పడిన ఆ సంస్థలో మొదట ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్ సభ్య దేశాలు కాగా, తర్వాత నేపాల్, భూటాన్, మయన్మార్ చేరాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత ‘లుక్ ఈస్ట్’ను ‘యాక్ట్ ఈస్ట్’గా మార్చి కొంత చురుకుదనం తెచ్చారు.సుదీర్ఘ అశ్రద్ధఇతర ఆసియా దేశాలతో కన్నా ‘బిమ్స్టెక్’ మధ్య సంబంధాలు మందకొడిగానే ఉన్నాయి. సంస్థ ఆర్థిక, రక్షణ సహకార విషయాలు అధికారుల స్థాయికి పరిమితం కాగా, ఈ నెల నాల్గవ తేదీ నాటి శిఖరాగ్ర సమావేశం ఏడేళ్ల తర్వాత జరగటం గమనించదగ్గది. ఏడు సభ్య దేశాలలో నేపాల్, భూటాన్ చిన్నవి, సముద్ర తీరం లేనివి అను కున్నా, తక్కిన అయిదు కూడా ముఖ్యమైనవి, సముద్ర తీరం గలవి. సముద్ర మార్గ రవాణాలు, రక్షణలకు కీలకమైన ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ రెండు అంశాలను ‘బిమ్స్టెక్’ లక్ష్యాలలో ప్రముఖంగా పేర్కొ న్నారు కూడా! అయినప్పటికీ ఇంతకాలం కనిపించిన అలసత్వ వైఖరులు వాటికవే సరైనవి కాదు. ఈ పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్‌లతో చైనా సన్నిహితమయ్యింది. అనగా, ఇండియాకు భౌగోళికంగా దగ్గరగా ఉండి, బంగాళాఖాత తీర ప్రాంతానివి అయి కూడా భారత్ వాటిని ‘బిమ్ స్టెక్’ ఏర్పాటు తర్వాత సైతం దగ్గర చేసుకోలేక, చైనాతో పోటీపడాల్సి వస్తున్న దన్నమాట. సంస్థలోని తక్కిన దేశాలకన్న భారత ప్రయోజనాలు విస్తృతమైనవి కావటం, బంగాళాఖాతం కీలక ప్రాంతంలో, అందులోనూ హిందూ మహాసముద్రానికి అనుసంధానమై ఉండ టాన్ని బట్టి అటువంటి చొరవలు ఇండియాకే ఎక్కువ అవసరం. అయినా సుదీర్ఘ కాలం అశ్రద్ధలన్నవి ఎంత పొరపాటో చెప్పనక్కర లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తిరిగి శిఖరాగ్ర సమావేశం జరగటం మంచి పని. ట్రంప్ సుంకాల హెచ్చింపు చర్యలు సృష్టిస్తున్న ఒత్తిడుల మధ్య జరగటం మరింత మంచిదవు తున్నది. సమావేశంలో చర్చించిన ఆర్థిక సహకారం, అభివృద్ధి, శాస్త్ర–సాంకేతిక రంగాలు, రక్షణ వంటి అంశాలు షరా మామూలువే అయినా, ‘ప్రపంచంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా పరస్పర అభివృద్ధిపై దృష్టి పెట్టడం’ అన్నది ప్రత్యేకంగా గమనించ వలసిన ప్రకటన. బంగ్లా, లంకలతో సంబంధాలుపోతే, ఇదే సంస్థలోని పొరుగు దేశమైన బంగ్లా నాయకునితో మోదీ సమావేశం, సంబంధాల పునరుద్ధరణకు దారితీసినట్లయితే ఉభయులకూ మేలు చేస్తుంది. ఇండియా జోక్యంతో 1971లో ఏర్ప డిన ఆ దేశంతో సంబంధాలు ఈ 55 ఏళ్ళలో తరచూ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధాని షేక్ హసీనా పతనం నుంచి కొద్ది నెలలుగా తిరిగి అదే పరిస్థితి తలెత్తింది. ఈ నాయకులిద్దరూ బ్యాంకాక్‌లో అసలు విడిగా సమావేశమవుతారా అనే సందేహాలుండేవి. కానీ, భారత ప్రధానికి అందజేసేందుకు బంగ్లా నాయకుడు జ్ఞాపక చిహ్నంగా ఒక పాత చిత్రాన్ని వెంట తీసుకువచ్చారంటేనే సామరస్య వైఖరి కనిపిస్తున్నది. బంగ్లాలో త్వరలో జరుగనున్న ఎన్నికలలో ఎవరు అధికారానికి రాగలదీ తెలియదు. ఇండియా మిత్ర పక్షమ నుకునే షేక్ హసీనా ‘అవామీ లీగ్’కు మాత్రం అవకాశాలు కన్పించటం లేదు. ఇండియాలో అనధికార శరణార్థి రూపంలో ఉన్న ఆమెను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని బ్యాంకాక్‌లో మోదీని బంగ్లా నాయకుడు మరొకమారు కోరారు. ఇరు దేశాల సంబంధాలలో ఇదొక చిక్కు ప్రశ్న. అక్కడ హిందువులపై దాడుల సమస్య అట్లానే ఉంది. వీటన్నింటినీ అధిగమిస్తూ ‘బిమ్స్టెక్’ లక్ష్యాల వైపు కదలటం రెండు దేశాలకూ పెద్ద పరీక్షే. కానీ ఉత్తీర్ణత సాధించక తప్పని పరీక్ష. శ్రీలంక విషయానికి వస్తే, భౌగోళికతలు, ఆర్థిక, రక్షణ అవస రాలు, పరస్పర సహకారాలు, విభేదాలు అన్నింటి విషయాలలోనూ ఇండియా సంబంధాలు బంగ్లాదేశ్‌ను పోలి ఉండటం యాదృచ్ఛికమే కావచ్చు. అక్కడ సరికొత్త శక్తులు పూర్తి మెజారిటీలతో గెలిచి అధికారానికి రావటంతో పరిస్థితులు మారాయి. కొత్త అధ్యక్షుడు దిస్సనాయకే, దేశంలో నెలకొని ఉన్న సమస్యలు, వాటి నుంచి బయటపడి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే పట్టుదల వల్ల, భారతదేశంతో గతంలో ఉండిన విభేదాలను మరచిపోయి పరస్పర సహకారం కోసం ప్రయత్నిస్తున్నారు. చైనాకు ఎంత సన్నిహితమైనా, తమ విధానం సంతులనమని కొత్తలోనే ప్రకటించటం, చైనా కన్న భారత్‌ను మొదట సందర్శించటం దిస్సనాయకే దౌత్యనీతికి రుజువులు. మోదీ సందర్శన సందర్భంగా ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద స్వాగతం చెప్పిన అసాధారణ చర్య, ఆయనకు ‘మిత్ర విభూషణ’ పురస్కారం, తమ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించనివ్వబోమన్న హామీ ఇదే కోవలోకి వస్తాయి. వివిధ ఆర్థిక, రక్షణ ఒప్పందాలు రెండు వైపుల నుంచి సజావుగా అమలైతే, ట్రంప్ ఆవిష్కరిస్తున్న కొత్త ప్రపంచపు సాధక బాధకాలను సమష్టిగా ఎదుర్కొన వీలవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఏఐలో మనం మేటి కావాలంటే...
కొత్త సంవత్సరం మొదలై మూడు నెలలే అయింది కానీ... కృత్రిమ మేధ రంగంలో ఈ స్వల్ప అవధిలోనే పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. జనవరిలో విడుదలైన డీప్‌సీక్ ఆర్–1 ఒకటైతే... ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇంకోటి. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్‌లు సంయుక్తంగా అధ్యక్షత వహించిన ఈ సదస్సులోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐ తీసుకురాగల రాజకీయ, భద్రతాపరమైన సవాళ్లను ప్రపంచం ముందుంచారు. చివరగా మోదీ తాజా అమెరికా పర్యటనలో ఇరు దేశాల మధ్య ఏఐ వంటి కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. ఏఐ రంగం నేతృత్వాన్ని ఆశిస్తున్న భారత్‌పై ఈ పరిణామాల ప్రభావం ఏమిటి?డీప్‌సీక్ ఆర్–1 సంచలనం తరువాత భారత్‌లో నడుస్తున్న చర్చ ఏమిటీ అంటే... మనదైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఒకటి తయారు చేసుకోవాలని. ఇందుకు అవసరమైన ఏఐ చిప్స్ అందు బాటులో ఉండేలా చూసుకోవాలని! మరోవైపు ప్రభుత్వం కూడా సొంత ఎల్ఎల్ఎం అభివృద్ధిపై ప్రకటన చేసింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పింది. నేషనల్ ఏఐ మిషన్ స్టార్టప్‌లు, పరిశోధకుల కోసం పది వేల జీపీయూలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. అంతేకాకుండా... ఎల్‌ఎల్‌ఎంలతోపాటు స్మాల్ లాంగ్వేజ్ మోడళ్లు, ప్రాథమికమైన ఏఐ మోడళ్ల తయారీకి పిలుపునిచ్చింది.ఈ చర్యలన్నీ ఆహ్వానించదగ్గవే అయినప్పటికీ... ఇవి మాత్రమే సరిపోవు. డీప్‌సీక్ విజయవంతమైన నేపథ్యంలో చేపట్టాల్సిన పనుల ప్రాథమ్యాల్లోనూ ఇవి లేవనే చెప్పాలి. అతి తక్కువ ఖర్చు, శిక్షణలతోనే అద్భుతమైన ఎల్ఎల్ఎంను రూపొందించవచ్చునని డీప్‌సీక్ ఇప్పటికే రుజువు చేసింది. చౌక ఆవిష్కరణలకు పేరుపొందిన భారత్‌కు ఇది ఎంతో సంతోషించదగ్గ సమాచారం. అయితే దీనర్థం సొంత ఎల్ఎల్ఎం అభివృద్ధే ఏఐ ఆధిపత్యానికి తొలి అడుగు అని కాదు. అమెరికా, ఇతర దేశాల ఎల్ఎల్ఎంలకు, డీప్‌సీక్‌కు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే... శిక్షణకు సంబంధించి భిన్నవైఖరి తీసుకోవడం! ఈ వైఖరి కారణంగానే దాని శిక్షణకు అయిన ఖర్చు చాలా తక్కువగా ఉంది. భారత్‌లోని టెక్నాలజీ నిపుణులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు స్థూలంగా మూడు. ఏఐలో సృజనను పెంచే అన్ని ప్రాథమిక అంశాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇందుకు ఏఐలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వారు అవసరం. అలాగే మనదైన డేటా సెట్లు, రేపటి తరం రీసెర్చ్ అండ్ డెవలప్మంట్ దృష్టికోణం కావాల్సి వస్తాయి. ప్రస్తుతం భారత్‌లో అత్యున్నత స్థాయి ఏఐ నైపుణ్యం లేదు. భారతీయ మూలాలున్న ఏఐ నిపుణులు దురదృష్టవశాత్తూ సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్నారు. పెర్ప్లెక్సిటీ ఏఐ సృష్టికర్త అరవింద్ శ్రీనివాస్ భారత్‌లో చేపట్టే ఏఐ కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు సిద్ధమని అంటున్నాడే కానీ... ఇక్కడకు వచ్చేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. అమెరికాలో పెర్ప్లెక్సిటీ ఏఐ బాగా పాపులర్ కాబట్టి ఈ నిర్ణయం సరైందే అనిపిస్తుంది. కానీ ఏఐ విషయంలో భారత్ నుంచి మేధా వలసను అరికట్టేందుకు ఏదైనా చేయాల్సిన అవసరాన్ని కూడా చెబుతోంది ఇది. దేశంలోని టెక్నాలజీ రంగాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు తగిన వ్యూహం కూడా కావాలిప్పుడు! యూపీఐ లాంటి వ్యవస్థల ద్వారా భారత్‌కు సంబంధించిన డేటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నా వీటి ఆధారంగా డేటాసెట్లను ఇప్పటివరకూ ఏఐ స్టార్టప్‌లు తయారు చేయలేకపోయాయి. ఇలాంటివే అనేక డేటాసెట్లు వేర్వేరు చోట్ల పడి మూలుగుతున్నాయి. వీటన్నింటినీ ఉపయోగించడం ఎలాగో చూడాలి. అలాగే భారతీయ ఆర్ అండ్ డీ (పరిశోధన–అభివృద్ధి) రంగానికి కూడా భారీ ప్రోత్సాహకం అవసరం. మోదీ ఆ మధ్య అమె రికా పర్యటనకు వెళ్లినప్పుడు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ , అమెరికాకు చెందిన నేషనల్ సైన్ ్స ఫౌండేషన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అలాగే ఏఐలో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వంతోపాటు, ప్రైవేట్ రంగం కూడా పెట్టుబడులు పెట్టేలా చేయాలి. ఇవన్నీ చేయడం ద్వారా మాత్రమే సుశిక్షితమైన ఎల్ఎల్ఎం లేదా ఇంకో వినూత్న ఏఐ ఉత్పత్తి ఆవిష్కృతమవుతుంది. ఇలా చేయడం ద్వారా భారత్ ప్రపంచస్థాయిలో తనదైన గుర్తింపు పొందగలుగుతుంది. రెండో విషయం... ఏఐలో వినూత్న ఆవిష్కరణల కోసం ఓపెన్ సోర్స్ పద్ధతిని అవలంబించడం మేలు. డీప్‌సీక్–ఆర్1, మిస్ట్రల్ వంటివి అన్నీ ఓపెన్ సోర్స్ పద్ధతిలో అభివృద్ధి చేసినవే. ఇలాంటివి మేలా? ఛాట్ జీపీటీ వంటి క్లోజ్డ్ సోర్స్ ఎల్ఎల్ఎంలు మేలా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఫ్రాన్ ్సకు చెందిన మిస్ట్రల్, యూఎస్ కంపెనీ మెటా, చైనా కంపెనీ డీప్ సీక్‌లు ఓపెన్ సోర్స్ బాట పట్టాయి. భారత్ కూడా ఇదే పద్ధతిని ఎంచుకోవాలి. ఓపెన్ సోర్స్ ద్వారా భారతీయ స్టార్టప్ కంపెనీలు, పరిశోధకులు మెరుగ్గా పోటీపడగలరు. అదే క్లోజ్డ్ సోర్స్ అనుకోండి... విదేశీ ఏఐలపై ఆధారపడటం మరింత ఎక్కువ అవుతుంది. ఓపెన్ సోర్స్ బాట పట్టేందుకు యూరప్‌తో పాటు దక్షిణ దేశాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి భారత్ అందరికీ మేలు చేసేలా ఆ యా దేశాలతో ఏర్పాటు చేసుకోవడం మంచిది.మూడో అంశం... ఏఐలో పోటీతత్వాన్ని పెంచేందుకు భారత్ తక్షణం ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ నుంచి రక్షణ ఎలా అన్న అంశంపై ప్రస్తుతానికి అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్యారిస్ సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐపై అమెరికా వైఖరి ఏమిటన్నది సుస్పష్టంగా చెప్పారు. ఈ రంగంలో చైనా పైస్థాయిలో ఉంది కాబట్టి... అమెరికా కూడా ఎలాగైనా ఈ రేసులో తనది పైచేయి అనిపించుకోవాలని చూస్తోంది. ఈ పోటీలో భారత్ కూడా తనదైన ప్రత్యేకతను నిరూపించుకోవాలి. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఈ పోటీ తీరుతెన్నులను ఒడిసిపట్టుకోకపోతే కష్టమే.అందుకే ఏఐ నైపుణ్యాలను పెంచేందుకు, ఏఐ ఆర్ అండ్ డీకి సంబంధించి ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీల వాడకానికి తగిన వ్యూహం రూపొందించాలి. యూపీఐ వంటి భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన డేటా సాయంతో ఏఐ రంగంలో సృజనకు వీలుకల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రపంచం ఏఐ ఆటలో మనల్ని గుర్తించగలదు.అనిరుధ్ సూరి వ్యాసకర్త ఇండియా ఇంటర్నెట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ -
కఠిన వాస్తవాలను దాచేస్తారా?
ఆమె పేరు సూచిస్తున్నట్టుగానే సంధ్యా సూరి భారత సంతతికి చెందిన ఫిల్మ్ మేకర్. ఆమె దర్శకత్వం వహించిన ‘సంతోష్’ సినిమా గత ఏడాది యూకే తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్స్‌కు వెళ్లింది. కాన్ (ఫ్రాన్స్) చిత్రోత్సవంలో విశేష మన్ననలు అందుకుంది. ‘బాఫ్టా’ (బిఏఎఫ్‌టీఏ– ద బ్రిటిష్ అకాడెమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్)కు నామినేట్ అయ్యింది. ఇందులో నటించిన షహానా గోస్వామి ఏసియన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఇంత ఖ్యాతి గడించినప్పటికీ, కోట్లాది మంది భారతీయులు మాత్రం ఈ సినిమాను ఎప్పటికీ చూడలేరు. సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ– సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) దీనికి దారుణమైన కత్తెరలు వేసింది. వాటికి అంగీకరిస్తేనే భారత్‌లో ప్రదర్శనకు అనుమతి ఇస్తామని చెప్పడంతో, సంధ్యా సూరి సహజంగానే అందుకు నిరాకరించారు.పూర్తిగా భారత్‌లోనే నిర్మించిన, భారతీయ నటీనటులతోనే చిత్రీకరించిన, అదీ హిందీలో తీసిన చిత్రం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి భారతీయ చిత్రం. కానీ భారతీయులమైన మనం దీన్ని వీక్షించలేక పోవడం మన దౌర్భాగ్యం. ఎందుకంటే, మనం కాదనలేని ఒక సత్యాన్ని ఇది ఆవిష్కరించింది. దాన్ని మనకు తెలియకుండా దాచి ఉంచగలనని సెన్సార్ బోర్డు అనుకుంటోంది. నేను ప్రస్తావిస్తున్న ఈ సత్యం పోలీసుల కర్కశత్వం, వారు పెట్టే చిత్రహింసల గురించి!ఈ సినిమా నేను చూశాను. ఇది అంతులేని బాధ కలిగిస్తుంది. మనసును విపరీతంగా కలవరపెడుతుంది. ఉత్తర భారత గ్రామీణ ప్రాంతాల్లో సాగే పోలీసుల దాష్టీకానికి ఇది వాస్తవ చిత్రీకరణ. అమాయక ప్రజలను పోలీసులు ఎలా టార్చర్ పెట్టగలరో, దళితులు, ముస్లింలు వారి చేతిలో ఎన్ని దుర్మార్గాలకు గురవుతున్నారో, మానభంగాలను ఏ విధంగా వారు వెనకేసుకొస్తారో, సాధారణ ప్రజానీకాన్ని ఎంతగా భయభ్రాంతులకు గురిచేస్తారో ఈ సినిమా కళ్లకు కడుతుంది. పుట్టుక, సంపద, పలుకుబడి... ఈ మూడింటిలో ఏ బలమూ లేకుండా పోలీసులతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ ఇది సత్యమని, ఇదే వాస్తవమని తెలుసు. ఈ య«థార్థం వారికి ఆశ్యర్యం కలిగించదు, వారిని దిగ్భ్రాంతికి అసలు గురి చేయదు. ఎందుకంటే వారికి పోలీసుల వైఖరి నిత్యజీవిత అనుభవం. కానీ సెన్సార్ బోర్డు దీన్ని సమ్మతించడానికి ఇష్టపడటం లేదు. గుర్తించడానికి అంగీకరించడం లేదు. పోలీసుల హింస, జవాబుదారీతనం లేకపోవడం గురించి ‘పోలీస్ టార్చర్ అండ్ (అన్) అకౌంటబిలిటీ’ పేరుతో ‘కామన్ కాజ్’, ‘లోక్‌నీతి సీఎస్డీఎస్’లు ఇటీవలే సంయుక్తంగా ప్రచురించిన ఒక నివేదిక ఈ సినిమా వాస్తవికతను ధ్రువీకరిస్తోంది. 17 రాష్ట్రాల్లో 8,000 మందికి పైగా పోలీసులను ఈ సంస్థలు సర్వే చేశాయి. వారిలో రమారమి 30 శాతం మంది చిత్రహింసలను సమర్థించారు. ప్రమాదకరమైన నేరగాళ్లను విచారణ ముగిసే వరకూ వేచిచూడకుండా చంపేయడమే మెరుగు అని దరిదాపు 25 శాతం మంది తేల్చి చెప్పారు. ప్రజల్లో భయం ఉండాలంటే కఠిన పద్ధతులు అవలంబించాల్సిందే అంటూ 20 శాతం మంది వెల్లడించారు. ముస్లింలు నేరప్రవృత్తికి లోనయ్యే అవకాశం ఉందని 50 శాతం మంది చెప్పడం ఆశ్చర్యకరం. ఇక, ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్’ (ఎస్ఓపీ)ను పాటించడం ఎప్పుడో తప్ప జరగదని 40 శాతం కంటే ఎక్కువ మందే అంగీకరించారు. అందుకే కాబోలు... కేవలం 33 శాతం మంది భారతీయులే పోలీసులను విశ్వసిస్తారని ‘ఇప్సాస్’ సర్వే (యూకే) నిర్ధారించింది. వీటిలో ఏదీ మనకు ఆశ్యర్యం కలిగించదు. ఎవరూ చెప్పనవసరం లేకుండానే ఇవన్నీ నిజాలేనని మనకు సహజంగానే తెలుసు. పోలీసుల దాష్టీకాన్ని వెల్లడించే అధ్యయనాలకు కొరత లేదు. ‘నేషనల్ క్యాంపేన్ ఎగైనెస్ట్ టార్చర్’ వార్షిక నివేదిక (2019) ప్రకారం, ఆ ఏడాది 1,723 కస్టడీ చావులు వెలుగు చూశాయి. అంటే పోలీసు కస్టడీలో రోజుకు అయిదుగురు ప్రాణాలు విడిచారు. ఈ అధ్యయ నాలు బట్టబయలు చేసిన వాస్తవాలకే ‘సంతోష్’ సినిమా కర్కశ, వాస్తవిక దృశ్యరూపం ఇచ్చింది. అయినా సరే, భారతీయలు ఈ సినిమా ఎప్పటికీ చూడలేరు. ఏదైనా అద్భుతం జరిగి సెన్సార్ బోర్డు మనసు మారితే తప్ప!ముచ్చటైన విషయం ఏమిటటే, ఇండియాలో చిత్రీకరణ కోసం అనుమతి కోరుతూ సంధ్యా సూరి తన సినిమా స్క్రిప్టును అధికా రులకు సమర్పించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాలేదు. ‘గార్డియన్’ వార్తాపత్రికకు ఆమె ఇదే చెప్పారు. ‘ఇప్పుడు చాంతాడు పొడవన్ని కట్స్ జాబితా ఇచ్చారు. ఈ సెన్సార్ కోత లన్నీ కలిపి పేజీలకు పేజీలు ఉన్నాయి’. వాటికి అంగీకరించడం ‘అసాధ్యం’. ఎందుకంటే, సినిమా ‘విజన్’ పూర్తిగా దెబ్బతింటుందని ఆమె వాపోయారు.నేను ఈ సినిమా చూసిన ప్రభావంతో చెబుతున్నాను. ఇది తప్పనిసరిగా చూడాల్సినది. బాలీవుడ్ సినిమాల్లో కూడా పోలీసు జులుం తరచూ కనబడుతూనే ఉంటుంది. అయితే, అది మృదువుగా, ప్రభావ శూన్యంగా ఉంటుంది. సానుకూల కోణం కూడా సమాంతరంగా నడుస్తుంది. కానీ ‘సంతోష్’ అలాకాదు.అందులో ఎలాంటి చక్కెర పూతా ఉండదు. కర్కశమైన, ఉపశమన రహితమైన వాస్తవికతను చూపిస్తుంది. చూడటం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వాస్తవాన్ని చూడకుండా మనం ఎలా కళ్లు మూసు కుంటాం? అది తగిన పని కాదు. అయినా మనం సత్యాన్ని తిరస్కరిస్తూనే పోతున్నాం. ‘సంతోష్’ అలాంటి తిరస్కారాల జాబితాలో తాజాగా చేరింది. చిత్రహింసలకు వ్యతిరేకంగా రూపొందించిన ఐక్యరాజ్య సమితి ఒప్పందం (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఎగైనెస్ట్ టార్చర్)పై సంతకం చేయని అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటి. అలా ఆమోదించకపోవడానికి... కస్టడీ హింసను నిరోధించే సొంత చట్టం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. నిజానికి ఇవి మనం ఎప్పుడూ చర్చించని యథార్థాలు. ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినా, ఆ వెంటనే మర్చిపోతాం. ఒకవేళ ‘సంతోష్’ను మనం చూడడం జరిగితే... ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించే అవకాశం అది ఇస్తుంది. ఈ దారుణాలు ఎందుకు అనుమతిస్తున్నారు? ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? అని నిలదీస్తాం. బహుశా అందుకే సెన్సార్ బోర్డు మనం ఎప్పటికీ ఈ సినిమా చూడకుండా జాగ్రత్త పడింది. సత్యమేవ జయతే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పీయూష్ గోయల్ (కేంద్ర మంత్రి) రాయని డైరీ
ఇండియాలో ఎందుకు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు?! తింటూ మాట్లాడుతుం టారు?! తింటూనే కాన్ఫరెన్సులు, తింటూనే ‘డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్’లు, తింటూనే చాట్ జీపీటీలు, ్రగ్రోక్లు, జిబ్లీలు... ఆఖరికి నిద్రలోకి జారుకోవటం కూడా తింటూనేనా! మనిషి లోపల గుండె కొట్టుకుంటూ ఉన్నట్లు మనుషుల నోట్లో తిండెందుకు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంది?! ‘స్టార్టప్ మహాకుంభ్’లో కూడా తిండి... తిండి... తిండి! మహాకుంభ్‌కు మూడువేల స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. అన్నీ ఇండియన్ల తిండీతిప్పల కంపెనీలే. వెయ్యి మంది ఇన్వెస్టర్లు వచ్చారు. అంతా తిండి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటానికి వచ్చిన ఇండియన్లే! ఏప్రిల్ 3 నుంచి 5 వరకు ప్రగతి మైదాన్‌లోని ‘భారత మండపం’లో ఒకటే తిండి గోల.విజిటర్స్కైతే అదొక తిండి మహా సముద్రం. మనుషులు తిండిలో ఓలలాడి,తిండిలో మైమరచి, తిండిలో స్పృహ తప్పటం స్టార్టప్ మహాకుంభ్ ప్రాంగణంలోని ‘ఆహార్ కుంభ్’లో కళ్లారా చూశాన్నేను!‘రెక్టిజా అండ్ కో’ స్టార్టప్ కంపెనీవారు అక్కడ స్టాల్ పెట్టుకుని పిజ్జాలు అమ్ము తున్నారు. పిజ్జాను రౌండ్‌గా కాకుండా రెక్టాంగిల్లో చేసివ్వటం రెక్టిజా అండ్ కో ప్రత్యేకత. జనం వాటి కోసం ఎగబడుతున్నారు! ఇంకోచోట, ‘సంప్రదాయ భారతీయ ఆహారపు ప్రామాణిక రుచులు మా ప్రత్యేకత’ అని ‘శాండీ ఫుడ్స్’ స్టార్టప్ వాళ్లు బోర్డు పెట్టారు. టేబుల్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి! అవి ఖాళీ అయితే కూర్చోటానికి ఆ టేబుల్స్‌కి నాలుగు వైపులా జనం! ఆ పక్కనే ‘ఫార్చూన్ ఫుడ్స్’ స్టార్టప్ వారి ‘ఇంటి తరహా భోజనం’! అక్కడా నిలువుకాళ్ల గుంపులే. ఇంట్లో భోజనం చేసుకోకుండా ‘ఇంటి తరహా భోజనం’ కోసం ఇంటిల్లిపాదీ ఇలా ఆహార కుంభాలకు రావటం ఏమిటి? ఇందు కేనా ఇండియాలో కొత్త కొత్త తిండి యాప్‌లు, తిండి స్టార్టప్‌లు వచ్చేస్తున్నాయి!కామర్స్ మినిస్టర్‌గా నేనీ చెత్తంతా మాట్లాడకూడదు. మనిషి తింటేనే దేశానికి పుష్టి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్‌గా కూడా పని చేశాను కనుక ఇలా అసలే మాట్లాడకూడదు. మనుషులందరికీ తిండి చేరితేనే దేశానికి ముందుకు నడిచే శక్తి అందుతుంది.నిజానికి ఇండియా కంటే చైనాలోనే తిండి ధ్యాస ఎక్కువ. కానీ వాళ్ల స్టార్టప్‌లు... ఈవీలు, ఏఐలు, సెమీ కండక్టర్లు, రోబోటిక్స్, గ్లోబల్ లాజిస్టిక్స్, ట్రేడ్, డీప్ టెక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఎక్కువగా పని చేస్తున్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ అన్నారు. అటల్ బిహారి వాజ్‌పేయి ఆ నినాదానికి ‘జై విజ్ఞాన్’ను జోడించారు. మోదీజీ ‘జై అనుసంధాన్’ అనే మాటను చేర్చి... ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ అన్నారు. సిపాయి ఎంతో, రైతు ఎంతో, విజ్ఞానం ఎంతో, పరిశోధన అంత ముఖ్యం దేశ భవిష్యత్తుకు!‘‘మీరు డెలివరీ బాయ్స్‌ని, డెలివరీ గర్ల్స్‌ని సృష్టించటంతోనే ఆగిపోతారా?’’ అని... స్టార్టప్ మహాకుంభ్‌కు వచ్చిన ఇండియన్ ‘స్టెమ్’ గ్రాడ్యుయేట్లను నేను అడిగాను. అది కేవలం అడగటం మాత్రమే కాదు... థామస్ ఆల్వా ఎడిసన్‌లా శాస్త్ర విజ్ఞానాన్ని, వ్యాపారాన్ని కలిపి డెలివరీ చెయ్యమని చెప్పటం కూడా! స్టార్టప్ మహాకుంభ్ ముగిశాక భారత మండపం నుంచి బయటికి వచ్చేస్తూ, ‘‘ఏమైనా తిన్నారా?’’ అని ఆ యంగ్ గ్రాడ్యుయేట్లను అడిగాను. అడగాలని అడగలేదు. అనుకోకుండా అలా అడిగేశాను. ఇంటికి రాగానే సీమ కూడా నన్ను అదే మాట అడిగింది... ‘‘ఏమైనా తిన్నారా?’’ అని!! ఇండియాలోని విశేషం.. తింటూ మాట్లాడటం, తింటూ పని చేయటం మాత్రమే కాదా? ‘‘తిన్నావా?’’ అని అడగటం కూడానా!!గొప్ప టెక్నాలజీని కనిపెట్టటం మాత్రమే కాదు, సాటి మనిషిని ‘‘తిన్నారా?’’ అని అడిగి కనుక్కోవటం కూడా ఎప్పటికప్పుడు ఒక గొప్ప ఇన్వెన్షనే అనిపిస్తోంది నాకిప్పుడు! - మాధవ్ శింగరాజు -
ఈ సుంకాలతో లాభనష్టాలు
భారత్ ఎగుమతులపై అమెరికా 26 శాతం దిగుమతి సుంకాన్ని విధించడం ఆర్థిక ఆందో ళనలకు దారి తీసింది. భారత్‌తో పోల్చిన ప్పుడు అధికంగా చైనాపై 40–60 శాతం (కొన్ని ఉత్పత్తులపై 100 శాతం వరకు), వియత్నాంపై 30–45 శాతం, థాయ్‌లాండ్‌పై 35–50 శాతం దిగుమతి సుంకాలను అమె రికా విధించింది. భారత్‌కన్నా తక్కువగా యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం, జపాన్‌పై 24 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం దిగుమతి సుంకాలను అమెరికా విధించింది.అమెరికా వాదన2024లో అమెరికాకు సంబంధించి భారత్ ఎగుమతుల విలువ 91.23 బిలియన్ డాలర్లు. భారత్ మొత్తం ఎగుమతుల విలువలో అమెరికా వాటా 18 శాతం. ఇదే సంవత్సరం అమెరికా ఉత్పత్తుల దిగుమతులలో భారత్ వాటా 2.6 శాతం. మొత్తంగా భారత్‌తో వాణి జ్యానికి సంబంధించి అమెరికా వాణిజ్య లోటు 2023–24లో 45.7 బిలియన్ డాలర్లు కాగా, 2024–25 (జనవరి వరకు) 22.9 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అమెరికాకు సంబంధించిన పాసింజర్ వాహనాలపై 70 శాతం, యాపిల్స్‌పై 50 శాతం, ఆల్కహాల్‌పై 100 –150 శాతం దిగుమతి సుంకాలను భారత్ విధిస్తున్నప్పుడు, ప్రస్తుతం భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం దిగుమతి సుంకం సమంజసమేనని అమెరికా వాదిస్తున్నది. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య నియమావళికి విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తున్నదని అమెరికా భావిస్తున్నది.దిగుమతి సుంకాల పెంపు కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50తో పాటు చైనా, థాయ్‌లాండ్‌కు సంబంధించిన ముఖ్య సూచీల లోనూ క్షీణత ఏర్పడింది. 2023–24లో అమెరికాతో వాణిజ్యంలో చైనా మార్కెట్ వాటా 21.6 శాతం కాగా, వియత్నాం వాటా 19.3 శాతంగా, భారత్ వాటా 6 శాతంగా నిలిచింది. వివిధ దేశాలపై అమె రికా దిగుమతి సుంకాల పెంపు కారణంగా చైనా, వియత్నాంలతో పోల్చినప్పుడు భారత్ ఎగుమతులలో పోటీతత్వం పెరుగుతుందని భావించవచ్చు.సగటు అమెరికా దిగుమతి సుంకాల కారణంగా– భారత్‌లో రొయ్యలు, వస్త్రాలు, స్టీల్ రంగాలపై; చైనాలో సోలార్ పానల్స్, సెమీ కండక్టర్, స్టీల్, ఎలక్ట్రిక్ వాహనాలపై; వియత్నాంలో ఫుట్‌వేర్, ఎల క్ట్రానిక్స్, ఫర్నీచర్‌పై; థాయ్‌లాండ్‌లో ఆటో పరికరాలు, రబ్బరు ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని అంచనా.భారత్‌పై ప్రభావంప్రాథమిక కేటగిరీకి సంబంధించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరిక రాలు, ఫార్మా ఉత్పత్తులు, విలువైన రాళ్ళు భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మార్చి 2025లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకొనే చర్యలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై భారత్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వలన రెండు దేశాలకు పరస్పర ప్రయోజనం చేకూరుతుంది. ఆసియా ఖండంలోని ఇతర దేశాలతో పోల్చినప్పుడు సౌరవిద్యుత్, ఫార్మాసూటికల్స్, టెక్స్టైల్స్ – అప్పారెల్ రంగాలలో భారత్‌కు అధిక ప్రయోజనం ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ – అప్పారెల్ రంగాలకు సంబంధించి పోటీ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత దిగు మతి సుంకాల నిర్ణయం కారణంగా అమెరికా మార్కెట్లో ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్‌కు పోటీ తగ్గుతుంది. చైనాకుసంబంధించిన సౌర ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం కారణంగా చైనా సౌర ఉత్పత్తుల ధరలు పెరగడం వలన భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది. చైనాపై అమెరికా అధికంగా ఆధార పడటం తగ్గి భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠమయ్యే అవకాశం ఉంది.భారత్ నుండి రొయ్యల ఎగుమతుల విలువ రూ. 22,000 కోట్లు కాగా, ఈ మొత్తంలో అమెరికా వాటా 44 శాతంగా ఉంది. ప్రస్తుతం అధిక సుంకాల కారణంగా భారత్ నుండి అమెరికా రొయ్యల ఎగుమతుల విలువలో తగ్గుదల ఏర్పడవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు సంబంధించి అమెరికాలో భారత్ మార్కెట్ వాటా తగ్గుతుంది. వజ్రాలు, ఆభరణాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. భారత్‌లో అనేక సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు హ్యాండిక్రాఫ్ట్ గార్మెంట్స్ ఎగుమ తులపై అధికంగా ఆధారపడ్డాయి. అధిక సుంకాల నేపథ్యంలోఎం.ఎస్.ఎం.ఇ. సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. తద్వారా ఆ యా సంస్థలలో లే ఆఫ్ కారణంగా ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది.సిద్ధించే ప్రయోజనాలుఅమెరికా దిగుమతి సుంకాలను ముఖ్యంగా వస్తువులపై విధించినందువలన భారత్‌లో పటిష్ఠంగా ఉన్న ఐటీ, సేవల రంగంపై ఈ ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. భారత్ నుండి సాఫ్ట్వేర్ సర్వీ సులు, ఫైనాన్షియల్ టెక్నాలజీ, బిజినెస్ అవుట్ సోర్సింగ్‌కు సంబంధించి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ వస్తువులకు సంబంధించి భారత్‌తో పోల్చినప్పుడు చైనా, యూరప్లపై అధిక సుంకాలు విధించిన కారణంగా అమెరికా కొనుగోలుదారులు భారత్ ఇంజినీరింగ్ ఉత్పత్తులపై దృష్టి సారించే వీలుంది. దానివల్ల భారత్ ఎగుమతులలో పెరుగుదల ఏర్పడుతుంది.చైనా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాల కారణంగా బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తిని భారత్‌లో చేపట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే అవ కాశం ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే అమలులో ఉన్న ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్ స్కీమ్’ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం) కారణంగా ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, సెమీ కండక్టర్లకు సంబంధించిన సంస్థలు భారత్‌లో అధికంగా ఏర్పాటవుతాయి. తద్వారా భార త్లో పెట్టుబడులు, ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతుల విలువలో పెరుగు దల కనబడుతుంది. అది స్థూల దేశీయోత్పత్తిలో కూడా పెరుగు దలగా ప్రతిఫలిస్తుంది.అమెరికా దిగుమతి సుంకాల కారణంగా ఇతర దేశాల వ్యవ సాయ ఉత్పత్తుల ధరలలో పెరుగుదల ఏర్పడుతుంది. తద్వారా భారత్ నుండి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌కు అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరగడంతోపాటు భారత్ ఎగుమతుల విలువలో పెరుగుదల ఏర్పడుతుంది. ఎగుమతుల పరంగా ఇబ్బంది ఎదుర్కొనే నేపథ్యంలో (కొన్ని ఉత్పత్తులకు సంబంధించి) భారత్ లోని ఉత్పత్తి స్వదేశీ డిమాండ్‌ను తీర్చడానికి ఉపకరిస్తుంది. ఈ స్థితి దేశంలో కొన్ని ఉత్పత్తుల కొరతను నివారించడం ద్వారా సాధారణ ధరల స్థాయి తగ్గుదలకు దారితీస్తుంది.చేయాల్సిందిఅయితే, అమెరికా ఆటో పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే ఒత్తిడిని భారత్ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే అమెరికాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించు కోవాలి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలతో భారత్ నూతన వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి.-వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐ.ఎఫ్.హెచ్.ఇ., హైదరాబాద్- డా‘‘ తమ్మా కోటిరెడ్డి -
దాడి కోసం సాకుల వెతుకులాట
ఇరాన్ అణు కార్యక్రమం గురించి మార్చి 25న ఆసక్తికరమైన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. బయట అంతగా ప్రచారంలోకి రాని ఆ నివేదిక, అమెరికాకు చెందిన 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి రూపొందించింది. వాటిలో సీఐఏ, పెంటగాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్, అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటివి ఉండటం గమనించదగ్గది. ఆ నివేదికను బట్టి, ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేయడం లేదు, చేయాలని కూడా అనుకోవటం లేదు.ఇది ఇరాన్ నాయకత్వం స్వయంగా చెప్తున్న విషయమే!్డ అయి నప్పటికీ అమెరికా నాయకత్వం, ఇజ్రాయెల్‌తో పాటు, అమెరికా ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తుందా అనిపించే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుశక్తి పర్యవేక్షణ సంస్థ ఇందుకు విరుద్ధమైన వాదనలు చేస్తూ వస్తున్నాయి. అణ్వస్త్రాల ఉత్పత్తికి వీలు లేదని అమెరికా హెచ్చరిస్తుండగా, అసలు శాంతియుత ఉపయోగానికా లేక ఆయుధాల కోసమా అనే దానితో నిమిత్తం లేకుండా అణు పరిశోధనలనే సహించబోమని ఇజ్రాయెల్ వాదిస్తున్నది. చర్చలకు సిద్ధం అంటున్నప్పటికీ...వాస్తవానికి ఇరాన్ అణు పరిశోధనా కేంద్రాలన్నీ ఐక్యరాజ్య సమితి అణుసంస్థ పర్యవేక్షణలో ఎప్పటి నుంచో ఉన్నాయి. తమ పరిశోధనలు, వాటి నియంత్రణల విషయమై పాశ్చాత్య దేశాలతో చర్చలకు సిద్ధమని గతంలోనూ ప్రకటించిన ఇరాన్ నాయకత్వం, నిరుడు ఇజ్రాయెల్‌తో క్షిపణుల రూపంలో ప్రతి దాడుల తర్వాత మరొకమారు స్పష్టం చేసింది. అటువంటి అంగీకార పత్రం ‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీఓఏ) పేరిట 2015 నుంచి ఉండేది కూడా! కానీ ట్రంప్ పోయినమారు అధ్యక్షునిగా ఉన్నప్పుడు అమెరికా దాని నుంచి ఏకపక్షంగా ఉపసంహరించుకున్నది. ఇపుడు తిరిగి ఆ విషయమై చర్చలకు యూరోపియన్ దేశాలు సుముఖంగా ఉన్నా ఇజ్రాయెల్ అంగీకరించటం లేదు. అమెరికా ఒకవైపు చర్చలంటూ, మరొకవైపు బాంబింగ్ అని బెదిరిస్తున్నది. అయితే చర్చలు మధ్యవర్తుల ద్వారా తప్ప ప్రత్యక్షంగా జరిపే ప్రసక్తి లేదని ఇరాన్ స్పష్టం చేస్తున్నది.దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటి? అమెరికా, ఇజ్రాయెల్‌లకు కావలసింది ఇరాన్ శాంతియుత వినియోగానికైనా సరే అణు పరిశో ధనలు జరుపుకొనేందుకు వీలు లేదు. ఇరాన్ నుంచి అమెరికాకు మధ్య సుమారు 7,000 మైళ్లు, యూరప్‌తో సుమారు 1,500 మైళ్ల దూరం ఉంది. ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయనుకున్నా వాటి నుంచి ముప్పు ఉండేది మొదట యూరప్‌కు. అయినప్పటికీ ఇరాన్ ప్రతిపాదించిన ప్రకారం చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారు. ఇరాన్ అణ్వస్త్ర ప్రయోగం అమెరికాపై చేయాలంటే వాటిని అంతదూరం మోసుకుపోగల దీర్ఘశ్రేణి క్షిపణులు, బాంబర్లు అవసరం. ఇరాన్ వద్ద ఇటు అణ్వస్త్రాలుగానీ, అటు క్షిపణులూ బాంబర్లుగానీ లేవని అమె రికాకు తెలుసు. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల వద్ద అవన్నీ వేలాదిగా ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకీ వైఖరి? ఇక్కడ అర్థమవుతుంది రహస్యం. ఇరాన్ భౌగోళికంగా పశ్చిమాసియాలో భాగం. ఆ ప్రాంతం యావత్తూ పాశ్చాత్య శక్తులకు రెండు కారణాల వల్ల ముఖ్యమైనది. ఒకటి – తమ సామ్రాజ్యవాద భౌగోళిక వ్యూహాల దృష్ట్యా. రెండు, ఇరాన్ సహా ఆ ప్రాంతపు దేశాలన్నింటా గల అపారమైన చమురు నిక్షేపాలు. గాజా యుద్ధం ముమ్మరంగా సాగుతుండిన రోజుల్లో ఇజ్రాయెల్ తాము గాజాతో ఆగబోమని, మొత్తం పశ్చిమాసియా చిత్రాన్నే మార్చివేయగలమని ప్రకటించింది. ఆ మార్పులో భాగంగా ఇరాన్ ప్రస్తుత నాయకత్వాన్ని లేకుండా చేయగలమని బాహాటంగా హెచ్చరించింది. ఇరాన్లో ప్రస్తుత నాయకత్వం పట్ల ప్రజలలో కొంత అసంతృప్తి ఉన్న మాట నిజం. కానీ ఆ స్థాయి ఎక్కడైనా మామూ లుగా ఉండేదేగానీ తీవ్రమైనది కాదు. అటువంటిది ఉంటే ప్రజాగ్రహంతో ఇరాన్ షా 1979లో పతనమైనట్లు జరిగేది. లేదా యూరప్‌లోని జార్జియా, ఉక్రెయిన్, కిర్గిజ్‌స్థాన్, యుగోస్లావియా వంటి దేశాలలో సీఐఏ ప్రోత్సాహంతో ‘కలర్ రివల్యూషన్స్’ పేరిట ప్రభుత్వాలను కూలదోయటం, దేశాలనే చీల్చటం చేసినట్లు జరిగి ఉండేది. కానీ అవేవీ సాధ్యం కాగల పరిస్థితులు ఇరాన్లో లేవు.నేను ఒకసారి వారం రోజులపాటు ఇరాన్లో ఉండటం తటస్థించింది. అంతకు ముందు మొహమ్మద్ రజా పహ్లవీ చివరి నియంతగా ఉండిన కాలంలో, ఇండియాలోని పలు నగరాలలో చదువుతుండిన ఇరానియన్ విద్యార్థులు మా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి వచ్చి కొద్ది రోజుల చొప్పున హాస్టళ్లలో బస చేసి, షా పాలన పట్ల నిరసనలు ప్రకటించి వెళుతుండేవారు. అలాగే పాశ్చాత్య దేశాల పన్నుగడల పట్ల ఆ ప్రజల వ్యతిరేకతలు ఎంతటివో కూడా వారి ద్వారా తెలుస్తుండేవి. షా ప్రభుత్వంతోపాటు పహ్లవీ వంశ రాచరికం కూలిన దశాబ్దాల అనంతరం సైతం పాశ్చాత్య శక్తుల పట్ల వ్యతిరేకతలు ఎంతమాత్రం మారలేదని నేనక్కడ ఉన్న రోజులలో అర్థమైంది. అందుకు కారణం తమ పట్ల అమెరికా కూటమి విధానాలుగానీ, ఇజ్రాయెల్ కేంద్రిత వ్యూహాలుగానీ మారక పోవటమే!ఇరానే ఎందుకు లక్ష్యం?పాలస్తీనా సమస్యపై అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య యుద్ధాలలో ఇజ్రాయెల్ గెలవటం, ఈజిప్టు నేత గమాల్ అబ్దుల్ నాసర్ మృతితో పాన్ అరబిజం బలహీన పడటంతో అరబ్ రాజ్యా లకు ఇజ్రాయెల్ పట్ల రాజీ వైఖరి, అమెరికా కూటమి పట్ల సఖ్యత మొదలయ్యాయి. ఇజ్రాయెల్‌ను గుర్తించి దౌత్య సంబంధాలు నెల కొల్పుకోసాగాయి. పాలస్తీనాను నెమ్మదిగా మరచిపోయాయి. పాలస్తీనా నాయకుడు అరాఫత్ 2004లో మృతి చెందిన తర్వాత కొత్తగా అధికారానికి వచ్చినవారు అమెరికా, ఇజ్రాయెల్‌లకు పూర్తిగా మచ్చిక అయిపోయారు. హమాస్ కారణంగా ఇటీవలి యుద్ధం తలెత్తకపోయి ఉంటే బహుశా పాలస్తీనా విషయం అన్నదే క్రమంగా మరుగున పడేది. అరబ్ రాజ్యాలన్నీ పాలస్తీనాను ఇంచుమించు వదిలివేయగా, బలమైన మద్దతుగా నిలిచిన దేశం ఇరాన్. ఆసక్తికరం ఏమంటే, సున్నీ ముస్లిం దేశమైన పాలస్తీనాను సున్నీ అరబ్ రాజ్యాలు వదలివేయగా, షియా రాజ్యమైన ఇరాన్ వారి వెంట నిలిచింది. వారికి ఇరాన్ కనీసం పొరుగు దేశమైనా కాదు. పాలస్తీనా సమస్యతో తనకేమి సంబంధం అని భావిస్తే అడిగేవారు లేరు. అయినా ఇటువంటి వైఖరి తీసుకోవటం ఇజ్రాయెల్, అమెరికాలకు ఎంత మాత్రం సరిపడనిది అయింది. ఇరాన్‌తో అరబ్ దేశాలకూ సున్నీ–షియా భిన్నత్వం కారణంగా అరకొర సంబంధాలు మాత్రమే ఉన్నాయి.ఈ మొత్తం పరిస్థితుల మధ్య పశ్చిమాసియాలో ఇరాన్ ఒక్కటే ఇజ్రాయెల్, అమెరికాలకు ఏకైక శత్రు దేశంగా మిగిలింది. లెబనాన్, సిరియా, హిజ్బుల్లా, హౌతీలను ఏదో ఒక విధంగా దారికి తెచ్చు కోవచ్చు. కానీ ఇరాన్ సాధారణమైన శక్తి కాదు. అది గాక దాని వెంట రష్యా, చైనా ఉన్నాయి. పైపెచ్చు ఇటీవల ఉమ్మడి సైనిక విన్యాసాలు జరిపాయి. అణు రంగం విషయమై కూడా త్రైపాక్షిక చర్చలు నిర్వహించాయి. అణు ఇంధనం ఇరాన్ రియాక్టర్లలో ప్రస్తుతం 60 శాతం మేరకు శుద్ధి అయి ఉంది. శాంతియుత వినియోగానికి అది అవసరం. అణ్వస్త్రాల కోసం 90 శాతం శుద్ధి కావాలి. ఆ స్థాయికి వెళ్లగల సాంకేతిక శక్తి ఇరాన్‌కు ఉంది. కానీ అటువంటి ఆయుధాల తయారీ ఇస్లాంకు వ్యతిరేకమంటూ పాతికేళ్ల క్రితం ప్రకటించిన అధినాయకుడు అలీ ఖమేనీ ఇప్పటికీ అందుకు కట్టుబడి ఉన్నారు. అయినప్పటికీ ఇజ్రాయెల్, అమెరికాలు యుద్ధం చేయదలచిన వారికి సాకులు కరవా అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ద్విముఖ పోరు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఇటీవలి ఎన్కౌంటర్లో ఒక లేఖ బయటపడింది. మహిళా కమాండర్ మన్ కీకి నక్సల్ నేత మోటూ రాసిన ఆ లేఖను చూస్తే మునుపు ఎన్నడూ లేని విధంగా నక్సలైట్లలో నిస్పృహ ఆవరించి ఉన్నట్లు అనిపిస్తుంది. బోడ్కా నుంచి గామ్‌పూర్ వరకూ, దోడితుమ్నార్ నుంచి తోడ్కా వరకూ నక్సలైట్లకు సురక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు. భద్రతా దళాల నిరంతర నిఘా, దాడులు ఈ పరిస్థితిని తెచ్చాయి. నక్సలైట్లను 2026 మార్చ్ 31లోగా ఛత్తీస్‌గఢ్‌లో లేకుండా చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటన నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. బస్తర్, అబూర్nుమాడ్ అడవుల నుంచి గరియాబంద్ వరకూ భద్రతాదళాలు నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏడాది కాలంలో సుమారు 300 మంది నక్సలైట్లు మరణించగా, మరెందరో అరెస్ట్ అయ్యారు. లేదా లొంగిపోయారు. భారత అంతర్గత భద్రతకు వామపక్ష తీవ్రవాదం చాలాకాలంగా సవాలు విసురుతున్నది. రాజ్యాంగానికి సమాంతరంగా వ్యవస్థలు ఏర్పాటు చేసిన నక్సలైట్లను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థంగా అణచివేయగలిగింది. ఇందుకోసం ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఒకవైపు అభివృద్ధి కార్యకలాపాలకు పెద్దపీట వేస్తూనే, ఇంకోవైపు భద్రతా దళాల కార్య కలాపాలనూ ముమ్మరం చేసింది. నక్సలైట్ల రాజ్యంలోకి...సామాజిక, ఆర్థిక వెనుకబాటు, దశాబ్దాల నిర్లక్ష్యం కారణంగా దేశంలో నక్సలిజం పెరిగిపోయింది. ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు. వివక్షకు గురైన ప్రజలు, ప్రాంతాలు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచు కోలేదు. ఫలితంగా అక్కడ తిరుగుబాటు పుట్టుకొచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం అభివృద్ధి విషయంలోని లోటుపాట్లను సరిచేయడంతోపాటు, దేశాద్యంతం రాజ్యాంగ పరిధిలోనే పనిచేసేలా ద్విముఖ వ్యూహం అనుసరించింది. పట్టు కోల్పోయిన ప్రాంతాలను భద్రతా దళాలు మళ్లీ తమ స్వాధీనంలోకి తీసుకోగలిగాయి. ఒకప్పటి నక్సలైట్ల రాజ్యంలో ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేయగలిగాయి.అయితే ఈ మార్పు ఒక్కరోజులో జరిగిందేమీ కాదు. కచ్చితమైన ప్రణాళికతో అమలు చేసిన ఈ వ్యూహం నక్సలైట్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించింది. వ్యూహా త్మక మోహరింపులు, నిఘా వర్గాలను బలోపేతం చేయడం, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ వంటి భద్రతాదళాల సాయంతో అతివాదుల అడ్డాలను నిర్వీర్యం చేయగలిగారు. అననుకూల పరిస్థి తుల్లో పనిచేసే ఈ భద్రతా దళాలు అత్యాధునిక డ్రోన్లు, నిఘా పరికరాలు, కృత్రిమ మేధ, ఉపగ్రహ ఛాయా చిత్రాల వంటి వాటి సాయంతో నక్సలైట్ల ఆట కట్టిస్తున్నాయి. తీవ్రవాద సంస్థల ఆర్థిక వనరులపై ఉక్కుపాదం మోపడం కూడా కీలకమైంది. ఎన్ఐఏ, ఈడీ వంటి సంస్థలు కొన్ని కోట్ల రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకుని నక్సలైట్ల వెన్నువిరిచాయి. పీఎంఎల్ఏ చట్టాలతో కఠిన చర్యలు తీసుకోవడంతో నక్సలైట్లకు ఆర్థిక దన్నుగా నిలిచిన వారినీ కట్టడి చేయగలిగారు. ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ పని చేయడం నక్సలైట్ల సమస్య గణనీయంగా తగ్గేందుకు ఒక కారణంగా నిలిచింది. మౌలిక సదుపాయాల్లో వృద్ధి కూడా నక్సలిజం అణచివేతకు సాయపడింది. 2014–2024 మధ్యకాలంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 11,503 కిలోమీటర్ల హైవేలు, 20 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించారు. ఫలితంగా అక్కడి ప్రజలు ఆర్థికంగా స్థిరపడేందుకు అవకాశాలు వచ్చాయి. వేలాదిగా ఏర్పాటు చేసిన మొబైల్ టవర్ల కారణంగా సమాచార వినిమయం సులువైంది. వెయ్యికి పైగా బ్యాంక్ శాఖలు, 937 ఏటీఎంల ఏర్పాటుతో ఈ ప్రాంతాలు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యాయి. నక్సలైట్ల ఆధ్వర్యంలో నడిచే ఆర్థిక వ్యవస్థ ప్రభావం తగ్గింది.తగ్గిన ప్రభావంఈ చర్యల ఫలితం సుస్పష్టం. 2004–2014 దశతో పోలిస్తే ఇప్పుడు హింసాత్మక ఘటనలు 53 శాతం, భద్రతా దళాల మరణాలు 73 శాతం తగ్గాయి. సాధారణ ప్రజల మరణాలు కూడా 70 శాతం మేరకు తగ్గడం గమనార్హం. ఏడాది కాలంలో ఛత్తీస్‌గఢ్‌లోనే 380 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పో యారు. 1,194 మంది అరెస్ట్ అయ్యారు. 1,045 మంది లొంగిపోయారు. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య దేశవ్యాప్తంగా 2014 నాటి 126 నుంచి 12కు చేరుకోవడం విశేషం. నక్సలిజానికి ముగింపు పలికే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతాదళ సిబ్బంది కుటుంబాలను ఆదుకునే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. ఆయుష్మాన్ భారత్‌లో వీరిని భాగస్వాములను చేసింది. ఆరోగ్య సేవలను దగ్గరకు చేర్చింది. సుమారు లక్ష మందికి ఈ–హౌసింగ్ పోర్టల్ ద్వారా ఖాళీగా ఉన్న ఇళ్లలో ఆవాసం లభించింది. సెంట్రల్ పోలీస్ వెల్ఫేర్ ఫండ్‌కు తీసుకొచ్చిన మార్పుల కారణంగా ఎక్స్‌గ్రేషియా మొత్తం పెరిగింది. ‘భారత్ కే వీర్’ వంటి కార్య క్రమాలు వీరమరణం పొందిన వారి కుటుంబాలకు ఆధారంగా నిలుస్తున్నాయి.నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టడం చేయడంతోపాటు ఈ ప్రాంతాలకు బడ్జెట్ కేటాయింపులు కూడా మూడు రెట్లు పెరగడం విశేషం. నైపుణ్యాభివృద్ధి, గిరిజన యువతను భద్రతా దళాల్లో చేర్చుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాలు ముమ్మరం చేయడం ద్వారా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలందరూ జన జీవన స్రవంతిలో భాగమయ్యేలా జాగ్రత్త తీసుకున్నారు.నక్సలిజానికి చరమగీతం పాడే ఈ దశలో ఇప్పటివరకూ సాధించిన విజయాలన్నీ అభివృద్ధి, భద్రత అన్న రెండు అంశాల మేళవింపునకు నిదర్శనంగా నిలుస్తాయి. కృతనిశ్చయం, విధానపరంగా స్థిరత్వం మాత్రమే నక్సలిజం అంతానికి పరిష్కార మార్గాలని రుజువు చేశాయి.- డాక్టర్ సువ్రోకమల్ దత్తా వ్యాసకర్త కన్జర్వేటివ్ పొలిటికల్, ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్ -
వైఫల్యాల వెనుక వ్యవస్థ లోపాలు!
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో అక్రమ నగదు కనిపించినట్లు గత వారం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ బయట పెట్టింది. అంతకు మునుపు, జస్టిస్ శేఖర్ యాదవ్ న్యాయవ్యవస్థ గౌరవప్రతిష్ఠలకు భంగం కలిగిస్తూ మాట్లాడారు. భారతదేశం మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తోందని జస్టిస్ శేఖర్ యాదవ్ గత డిసెంబరులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో అనడం వివాదాస్పదమయింది. అప్పుడు ఆయనపై సరైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడీ రెండో కేసులో అంతటా నిరసన పెల్లుబుకటంతో ఆలస్యంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. న్యాయవ్యవస్థ స్పందనలు అర్థవంతంగా, బాధ్యతాయుతంగా ఉంటున్నాయా? లేవని సమా ధానం చెప్పుకునేటట్లయితే, జ్యుడీషియరీ జవాబుదారీతనం కోసం పనిచేయాల్సిన అంతర్గత విచారణ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? ఇక న్యాయమూర్తుల ఎంపిక విధానం ఈ పరిస్థితికి దారి తీసిన రెండో సమస్య. హైకోర్టు స్థాయిలో జరిగే నియామకాల తీరు మరీ ఆందోళన కలిగిస్తోంది.న్యాయవ్యవస్థ జవాబుదారీతనాన్ని కాపాడవలసిన అంతర్గత యంత్రాంగం (ఇన్–హౌస్ మెకానిజం) గుణదోషాల్ని జస్టిస్ అజిత్ ప్రకాష్ షా ‘రోసలిండ్ విల్సన్ స్మారక ఉపన్యాసం’లో తీవ్రాతి తీవ్రంగా విమర్శించారు. ఇది 2019 నాటిదైనా నేటి సందర్భానికి అతికినట్లు సరిపోతుంది. మొట్టమొదటగా అంతర్గత వ్యవస్థ స్వభావం మీద ఆయన అస్త్రం ఎక్కుపెట్టారు. అది అనుసరించే పద్ధతులు ఎప్పటికప్పుడు తాత్కాలికంగా, ఇష్టాగోష్ఠిలా ఉంటాయి. ‘‘ఈ ప్రొసీజర్‌కు ఎలాంటి చట్టబద్ధ ప్రాతిపదిక లేదు’’. ‘‘ న్యాయ వ్యవస్థ లోపల దానికి ఉన్న మన్నన పరిమితం’’. ‘‘ఇందుకు నిదర్శనం – కమిటీ నివేదిక వ్యతి రేకంగా వచ్చిందని చెప్పి రాజీనామాకు సిద్ధపడిన న్యాయమూర్తి ఒక్క రంటే ఒక్కరూ లేకపోవటం...’’ అని ఆయన అంటారు. ‘‘న్యాయవ్యవస్థ దానికదే ఒక చట్టం, ఒక ప్రపంచం’’ అన్నట్లు అంతర్గత యంత్రాంగం పరిగణిస్తుందని జస్టిస్ షా మరీ ముఖ్యంగా ప్రస్తావించారు. వారిని వారే నియమించుకుంటారు. తమ ప్రవర్త నను నియంత్రించే విధివిధానాలను వారే అంతర్గతంగా రూపొందించుకుంటారు. ఇది ‘‘ఒక తరహా స్వీయపాలన’’ అంటూ, ‘‘ఏలాగైతే ఉండాలో కచ్చితంగా అందుకు భిన్నంగా ఉంది..’’ అని విమర్శించారు. అంతర్గత యంత్రాంగం వాస్తవ పనితీరు ఎలా ఉంటుందో తెలిపేందుకు పలు విమర్శలు ఉన్నాయి. న్యాయమూర్తుల నడత గురించి బహిరంగంగా చెప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నా, వారిపై ఇన్–హౌస్ విచారణలు ఏనాడూ జరగలేదు. అలాగే, జడ్జీల మీద నిర్దిష్ట ఆరోపణలు చేసిన కేసుల్లోనూ అంతర్గత విచారణకు ఆదేశాలు లేవు. న్యాయవ్యవస్థ జవాబుదారీతనం కోసం తటస్థమైన, అధికా రికమైన, చట్టబద్ధ యంత్రాంగం ఒకటి ఎందుకు ఉండాలో జస్టిస్ షా తీవ్ర పదజాలంతో వివరించారు. ‘‘న్యాయపీఠం మీద కూర్చున్న క్షణం నుంచీ వారి ప్రవర్తన ఎలా ఉండాలో నిర్దేశించే నైతిక వర్తన నియమావళి న్యాయమూర్తులకు మనసుల్లో పాతుకుపోయి ఉండాలి. కాని అలా ఉండదు. కచ్చితంగా చెప్పాలంటే, వారు తమ ముందుండే లాయర్లు, వాదులు, ప్రతివాదులు, నేరస్థులు, సాక్షులు, పోలీసుల మాదిరిగానే ఫక్తు సాధారణ మానవులు. వారు నిర్వహించే పదవుల స్వభావాన్ని బట్టి వారికి నైతికతను ఆపాదిస్తే అది మోసం, ప్రమాదకరం...’’ అన్నారు.న్యాయమూర్తుల నడత, ప్రవర్తన గురించి మాట్లాడుకుంటు న్నాం కాబట్టి, వారి ఎంపిక విధానం గురించిన ప్రశ్న తలెత్తక మానదు. కొలీజియం వ్యవస్థ పరిపూర్ణంగా పనిచేయడం లేదన డంలో సందేహం లేదు. మనకు వేరొక విధానం కావాలి. దాని గురించి మాట్లాడుకునే ముందు, ప్రస్తుత కొలీజియం వ్యవస్థ ఎక్కడ విఫలమైందో చూద్దాం.జస్టిస్ షాతో నేను ఈ విషయం మాట్లాడినప్పుడు, ఆయన పలు అంశాలు చెప్పారు. మొదటిది – జడ్జీలను ఎంపిక చేయడానికి ఇవీ అంటూ చెప్పగలిగిన ఆమోదిత ప్రమాణాలేవీ లేవు. అంతా ‘‘అడ్ హాక్’’గా ఉన్నట్లు ఉంటుంది. నోటిమాట చెల్లుబాటు అవుతుంది. తరచూ ఇష్టులకే పెద్దపీట వేస్తారు.ఎంపికల్లో అత్యుత్తములను నిర్లక్ష్యం చేయడం కూడా పరిపాటి. ఇది మరీ ఆందోళనకరం. కొట్టొచ్చినట్లు కనబడే రెండు ఉదాహ రణలు జస్టిస్ షా చెప్పారు. జస్టిస్ అకిల్ ఖురేషీ, జస్టిస్ మురళీధర్‌లు సుప్రీం కోర్టులో స్థానం పొందలేకపోయారని, సుప్రీంలో ప్రవేశించ డానికి వారు పూర్తిగా అర్హులని ఆయన విశ్వసిస్తారు. ఎంపిక ప్రక్రియ నుంచి ప్రభుత్వాన్ని దూరం పెట్టడానికి కొలీజియం వ్యవస్థ రూపొందింది. అయినప్పటికీ ప్రభుత్వం తాను చేయగలిగినంతా చేయగలదు. పార్లమెంటులో మంచి మెజారిటీ ఉన్న ప్రభుత్వం కొలీజియం సిఫారసులను తొక్కిపట్టగలదు. అంటే ఏదైతే జరగకూడదన్న భావనతో కొలీజియం ఏర్పడిందో దొడ్డిదారిన అదే జరుగుతోంది. ఏమైనప్పటికీ, హైకోర్టు జడ్జీల నియామక స్థాయిలో కొలీజియం వ్యవస్థ అత్యంత బలహీనమైనదని భావించాలి. ఇది ఆందోళనకర పరిస్థితి. ఎందుకంటే, సుప్రీంకోర్టులో బహుశా 95 శాతం మంది న్యాయమూర్తులు హైకోర్టు జ్యుడీషియరీ నుంచే ఎంపిక అవుతారు. హైకోర్టు జడ్జీల నియామకాలు లోపభూయిష్ఠంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం సుప్రీం కోర్టు మీదా పడుతుంది. చివరగా, మనం చర్చించిన రెండు సమస్యలూ... అంతర్గత యంత్రాంగం, నియామక విధానం... ఏమాత్రం అలక్ష్యం చేయదగి నవి కావు. ఈ అలక్ష్యం మన న్యాయవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. వాస్తవానికి వీటికి దేనికదిగా కాకుండా, రెంటికీ కలిపి పరిష్కారం ఆలోచించాలి. పాలక, న్యాయ వ్యవస్థల పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. మరి ఇందుకు అవి సిద్ధంగా ఉన్నాయా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చక్రవర్తులందరూ పన్నులను వడ్డించినవారే!
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ క్రూరుడూ, హిందూ వ్యతిరేకీ కాబట్టి, మహారాష్ట్రలో ఉన్న అతని సమాధిని తవ్వి తీసిపారెయ్యాలని డిమాండ్ చేస్తూ, నాగపూర్‌లో, వారం కిందట, కొన్ని హిందూ సంస్థలు సభలూ, నిరసన ప్రదర్శనలూ జరిపాయి. ఔరంగజేబు సమాధిని తీసెయ్యనక్కరలేదనీ, అతను అంతిమంగా మరాఠా ప్రజల చేతుల్లో ఓడిపోయాడు గనక, అతని సమాధి, మరాఠా ప్రజల వీరత్వానికి గుర్తుగా ఉంటుందని చీలిన శివసేనలోని ఒక పక్షం వాదన. తీసేస్తే తీసెయ్యండి, కానీ మహారాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి– అని కూడా ఒక విమర్శ. ఇటీవల వచ్చిన, హిందీ సినిమా ‘ఛావా’లో చూపించినట్టు... ఔరంగజేబు క్రూరుడు కాదనీ, ఎన్నో మంచిపనులు కూడా చేశాడనీ, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒక ముస్లిం సభ్యుడు అన్నాడు. వివాదం పెరిగి పెద్దదై, నాగపూర్‌లో చిన్న స్థాయి మతకలహాల వంటివి జరిగి షాపులూ, ఇళ్ళూ, వాహనాలూ ధ్వంసం అయ్యాయి. 50మందికి గాయాలయ్యాయట! ఇంగ్లీషూ, హిందీ టీవీ చానళ్ళలో ఈ వివాదంపై చర్చలు చూపించారు. ఇదే సమయంలో ఛత్రపతి శివాజీ ఎంత గొప్ప ప్రజానుకూల చక్రవర్తో వాదించిన వారున్నారు. ఔరంగ జేబ్ సైన్యంలో కీలకమైన పదవుల్లో హిందూ సైనికాధి కారులున్నారని వాళ్ళ జాబితా ఇచ్చిన వారున్నారు. అలాగే, శివాజీ సైన్యంలో కూడా, అతనికి ఎంతో నమ్మకస్తులైన ముస్లిం ఉన్నత సైనికాధికారులున్నారని వాళ్ళ పేర్లు చెప్పారు. ఈ చర్చల్లో ముస్లిం చక్రవర్తుల్ని ప్రజా వ్యతిరేకులుగానూ, హిందూ చక్రవర్తుల్ని ప్రజలకు అనుకూలురుగానూ వాదించు కోవడమే ఎక్కువగా కనిపించింది. పత్రికల్లోగానీ, టీవీ డిబేట్లలో గానీ, అసలు ప్రపంచ చరిత్రలో చక్రవర్తులనేవారు, వాళ్ళు ఏ మతస్థులైనా, పాలకవర్గ ప్రతినిధులనీ, పాలకవర్గం ఎప్పుడూ ప్రజలకు అనుకూలంగా ఉండజాలదనీ వివరించే వర్గ సిద్ధాంత దృష్టితో ఒక్క మాటంటే ఒక్క మాట చెప్పిన వారు లేరు. ఆ దృష్టికోణాన్ని పట్టించుకోకపోతే, సత్యానికి కళ్ళు మూసినట్టవుతుంది. చక్రవర్తులంటే, అనేక చిన్నా పెద్దా భూభాగాల మీద పరిపాలన చేసే వాళ్ళు గదా? ఉదాహరణకి, ఔరంగజేబ్ (1618–1707) అయినా, శివాజీ (1630–1680) అయినా, చక్రవర్తులుగా విశాలమైన భూభాగాలను వారి కాలంలో పాలించారు. వారు ఎవరితో కలిసి ఎవరిని ఓడించారో, ఎన్నెన్ని ప్రాంతాలను ఆక్రమించారో, ‘ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫియతులూ’ ఇక్కడ చెప్పు కోలేము. అదంతా రకరకాల చరిత్ర పుస్తకాలలో దొరుకుతుంది. వారి ప్రభుత్వాలలో కూడా ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, సైనిక శాఖ, ఇతర అనేక రకాల శాఖలూ ఉన్నాయి. ఏకాలంలో అయినా, ఏ ప్రభుత్వమైనా పరిపాలన చెయ్యాలంటే, తప్పనిసరిగా కావలిసినవి పన్నులే. చరిత్రనించీ, మార్క్స్ గ్రహించి చెప్పినది ఇదే: ‘అధికార గణానికీ, సైన్యానికీ, మత గురువులకూ, కోర్టులకూ, క్లుప్తంగా చెప్పాలంటే, మొత్తం కార్యనిర్వాహక అధికార యంత్రాంగపు మనుగడకీ ఆధారం... రాజ్యానికి అందే పన్నులే! పన్నులు అంటే, ప్రభుత్వపు యంత్రాంగపు ఆర్థిక పునాది తప్ప, మరేమీ కాదు’. అయితే, పన్నులు ఏ పేర్లతో వచ్చినా, ఏ రూపంలో చెల్లించినా, వాటి మూలం ఎక్కడుంది? ఏ కాలం గురించి మనం మాట్లాడుతున్నామో, ఆ కాలానికి చెందిన శ్రామిక జనాల శ్రమలోనే ఉంది! అదెలాగో చూద్దాం. ఔరంగజేబు ప్రభుత్వమైనా, శివాజీ ప్రభుత్వమైనా ఆ కాలంలో రకరకాల పద్ధతుల్లో పన్నులు వసూలు చేసేవి. వసూళ్ళకు ఒక యంత్రాంగం ఉండడం తప్పనిసరి. మనం మాట్లాడుకుంటున్న ఇద్దరు చక్రవర్తులూ పన్నులు ఎవరి దగ్గర్నించి ప్రధానంగా వసూలు చేశారు? వ్యవసాయ రంగం నించీ. అలాగే, ఆనాటి పరిమితుల్లో ఉండిన పరిశ్రమలనించీ, సరుకులతో వ్యాపారం జరిపే వర్తకుల నించీ! అసలు, ఒక రాజ్యంలో ఉండే భూములు ఎవరి అధీనంలో ఉంటాయి? వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎవరు? పంటలు పండించేది ఎవరు? (1) జమీందారులనీ, మిరాసీదారులనీ, రకరకాల పేర్లతో ఉండే పెద్ద భూస్వాములు. వీళ్ళసలు ఒళ్ళు వంచరు. అంతా కౌలు రైతులు ఇచ్చే కౌలు మీదే ఆధారపడతారు. ఏ శ్రమా చెయ్యకుండా, కౌలు రైతులనించి గుంజిన కౌలులో నించే, చక్రవర్తికి శిస్తుగానీ, కప్పం గానీ, రకరకాల పన్నులు గానీ కడతారు. (2) సొంత శ్రమల మీదే, ప్రధానంగా ఇంటిల్లిపాదీ, కష్టపడి జీవించే ‘స్వతంత్ర రైతులు’. వీళ్ళు కట్టే శిస్తులు గానీ, పన్నులు గానీ అన్నీ వీళ్ళ సొంత శ్రమ వల్లనే కడతారు. (3) సొంత శ్రమ మీదే కాక, కొంత ఇతరుల శ్రమల మీద కూడా ఆధార పడి జీవించే రైతులు వీళ్ళు. వీళ్ళు కట్టే పన్నులు కూడా, వీరి సొంత శ్రమలో నించీ కొంతా, ఇతరుల నించీ వచ్చిన అదనపు శ్రమ నించీ కొంతా. (4) వ్యవసాయ శ్రామికులు. వీళ్ళు లేకుండా వ్యవసాయంలో ఏ దశలోనూ, ఏ పనీ జరగదు. వీళ్ళని పనిలో పెట్టుకునే వారు, వారు పేద రైతులైనా, కొంత మెరుగైన స్థితిలో ఉన్న వారైనా, కౌలు రైతులైనా, ఈ కూలీల శ్రమ మీద ఆధారపడే వారే! వీళ్ళకి ‘కూలి’ అనేది డబ్బు రూపంలో ఇచ్చినా, ధాన్యం రూపంలో ఇచ్చినా, వాళ్ళకి అందేది వాళ్ళ శ్రమ శక్తి విలువే. మొత్తం శ్రమ విలువ కాదు. శ్రమ శక్తి విలువ అంటే, మర్నాడు వచ్చి పని చెయ్యడానికి శ్రామికులకి కావలిసిన జీవితావసరాలకు తగ్గ జీతం అన్నమాట. శ్రమ విలువ అంటే, తాము జీతం రూపంలో తీసుకునే విలువా, యజమాని లాభంగా మిగుల్చు కునే అదనపు విలువా కూడా కలిసినదే. వ్యవసాయ రంగం నించీ వచ్చే పన్నులు ఎక్కువ భాగం ఈ అదనపు విలువలో నించీ తీసి ఇచ్చేవే!ఆ కాలపు రెవెన్యూ చరిత్ర ప్రకారం, ఈ ఇద్దరు చక్రవర్తులకీ ప్రధానమైన ఆదాయం వ్యవసాయ రంగం నించే వచ్చేది. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ‘శిస్తు’ అనీ, ‘చౌత్’ అనీ, ‘జప్త్’ అనీ, ‘సర్దేశ్ ముఖీ’ అనీ, ఇంకేవో పేర్లు. అవన్నీ మనకి అనవసరం. భూమి వైశాల్యాన్ని బట్టో, సారాన్ని బట్టో, వచ్చిన పంట మొత్తాన్ని బట్టో కొంత భాగం పన్ను కట్టాలి. వీటిని చెల్లించే వారిని రైతులనీ, జమీందారులనీ, మిరాశీ దారులనీ, కౌల్దారులనీ... ఏ పేరుతో మనకి చెప్పినా, అసలు సంగతి కాయకష్టం చేసే రైతుల శ్రమని దోచడమే! ఈ ఆర్థిక సత్యాన్ని పట్టించుకోకుండా, ఈ చక్రవర్తి గొప్పా, ఆ చక్రవర్తి గొప్పా అనే తగువు అర్థం లేనిది. వ్యక్తిగత స్వభావాల్లో కొన్ని తేడాల వల్ల, కొందరు చక్రవర్తులు కొంత గంభీరంగానూ, కొందరు కొంత సాత్వికంగానూ, కొందరు కటువు గానూ, మరికొందరు కర్కశంగానూ, క్రూరంగానూ ఉంటారు. ‘ఏ రాయి అయితేనేమీ పళ్ళూడగొట్టుకోవడానికి?’ అనే నానుడిలో ఉన్న గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటే... చక్రవర్తులందరూ శ్రమ దోపిడీదారులే! మనం మాట్లాడుకునే చక్రవర్తుల కాలంలో చిన్న స్థాయిలో అయినా రకరకాల పరిశ్రమలు ఉండేవి. వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడిగానీ, ఇతరత్రా గానీ సరుకులు తయారయ్యేవి. ఉప్పూ, దూదీ, దారం, నేతా, నూనెలూ, చర్మంతో తయారు చేసే వస్తువులూ, నివాసాల సామగ్రీ... ఇలా ఎన్నో రకాల పరిశ్రమలూ, వర్తకాలూ ఉండేవి. పరిశ్రమల యజమానులైనా, వర్తకులైనా, కట్టే పన్నులు, వాళ్ళ దగ్గిర పనిచేసే శ్రామికులు ఇచ్చే అదనపు విలువలోనించే తీసి కడతారు. అంటే, మళ్ళీ శ్రమ దోపిడీ ద్వారానే! ఈ విషయాలు ప్రజలు గమనంలో ఉంచుకుంటే మత ఘర్షణలు తలెత్తవు. ప్రజల అనైక్యత నుంచి ఎన్నికల ప్రయో జనం పొందాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం గమనార్హం.బి.ఆర్. బాపూజీ వ్యాసకర్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవిశ్రాంత ఆచార్యులు -
నిజంగా హర్షణీయం!
కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. దాని పర్యవసానాల్లో ఒకటి, బయటికి వెళ్లే పనిలేకుండా చేయగలిగే పనుల గురించి ఆలోచించడం. అలాంటి ఒక కారణంతో మొదలైన ‘హర్షణీయం’ తెలుగు పాడ్‌కాస్ట్, సమస్త సాహిత్య ప్రపంచాన్ని తెలుగు గడపలోకి తెచ్చిపెట్టింది. అంతేనా? అనువాద ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే ఏ భాషవారికైనా ఒక ఆన్ లైన్ నిధిగా రూపొందింది. 2020 మార్చ్‌లో ముందు తెలుగులో ప్రారంభమై, తర్వాత తెలుగు– ఆంగ్లంగా మారి, అటుపై ఆంగ్లంలోకి కూడా వ్యాపించిన ఈ పాడ్‌కాస్ట్ ‘నూరు మంది అనువాదకుల’ సిరీస్‌ను ఇటీవలే ముగించుకుంది. ఇందులో మలయాళం, తమిళం, కన్నడం, గుజరాతీ లాంటి భారతీయ భాషల్లోంచి ఆంగ్లంలోకి అనువదిస్తున్నవారితో పాటు– థాయి, ఉజ్బెక్, వియత్నమీస్, హంగేరియన్, తుర్కిష్, నార్వేజియన్, మంగోలియన్, కిస్వాహిలీ లాంటి భాషల ఆంగ్లానువాదకుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. దోస్తోవ్స్కీ ఉపరితల అంశాల మీద సమయం వృథా చేయరని చెబుతారు, గతేడాదే ‘బ్రదర్స్ కరమజోవ్’కు మరో ఆంగ్లానువాదం వెలువరించిన మైకేల్ ఆర్. కట్జ్. మనిషిని మలిచే కీలక క్షణాలు, విశ్వాసం, నైతికత, హింస, తీవ్రోద్వేగాల మీద దోస్తోవ్స్కీ దృష్టి ఉంటుందని అంటారు. పంతొమ్మిదో శతాబ్దపు రష్యన్ సాహిత్యాన్ని బోధించే మైకేల్ సుమారు 20 రష్యా నవలల్ని అనువదించారు. దోస్తోవ్స్కీ ‘నోట్స్ ఫ్రమ్ అండర్‌గ్రౌండ్’లోని తొలి 30 పేజీలు అనువాదానికి అసలు లొంగనివని ఆయన అభిప్రాయం. ఒక పుస్తకం పుట్టించే తక్షణ స్పందనే దాన్ని అనువాదానికి పూనుకునేలా చేస్తుందని చెబుతారు అరుణవ సిన్హా. పదహారేళ్ల కాలంలో సుమారు 80 పుస్తకాల్ని బంగ్లా నుంచి ఆయన ఆంగ్లంలోకి అనువదించారు. సగటున ఏడాదికి ఐదు పుస్తకాలు! ఒక దానిలో దిగితే అందులో మునిగిపోవడమే ఇంత వేగంగా అనువదించడానికి కారణమంటారు. ఫుట్‌నోట్ ఇవ్వాల్సి రావడాన్ని ఒక వైఫల్యంగా చూస్తారు హిందీ, ఉర్దూ నుంచి అనువాదాలు చేసే అమెరికన్ డైసీ రాక్వెల్. భాషల మీద ప్రేమతో ఆమె దాదాపు పదిహేను భాషలు నేర్చుకున్నారు. ఇంకా, కరీమ్ అబ్దుల్ రహమాన్ (కుర్దిష్), జెస్సికా కోహెన్ (హీబ్రూ), లోలా రోజర్స్ (ఫిన్నిష్) లాంటివాళ్లు ఈ పాడ్‌కాస్ట్‌లో తమ ఆలోచనలను పంచుకున్నారు. అనువాద క్రాఫ్ట్తో పాటు మొత్తంగా అనువాద ఎకో సిస్టమ్ గురించి ఇంత విస్తారంగా ఒకేచోట మాట్లాడిన పాడ్‌కాస్ట్ ప్రపంచంలో ఇంకోటి లేదని ఐస్లాండిక్ అనువాదకురాలు విక్టోరియా క్రిబ్ కితాబునివ్వడం హర్షణీయం అందుకున్న ప్రశంసల్లో ఒకానొకటి.మూడు దశాబ్దాలుగా స్నేహితులైన ఇంజినీరింగ్ క్లాస్మేట్లు హర్ష, అనిల్, గిరి ఉద్యోగాలు చేస్తూనే, పాఠకులుగా తమ అభిరుచితో ‘హర్షణీయం’ మొదలుపెట్టారు. ఇందులో హర్ష కథకుడు, అనిల్ అనువాదకుడు, గిరి సాంకేతిక నిపుణుడు. వక్తలను ఎంచుకోవడం, ప్రశ్నలు కూర్చుకోవడం ముగ్గురూ కలిసి చేస్తారు. ఎడిటింగ్ బాధ్యత కుదిరినవాళ్లు తీసుకుంటారు. ఇంటర్వ్యూలు మాత్రం అనిల్ చేస్తారు. సాహితీవేత్తలను ఇంటర్వ్యూలు చేయడంలో ప్రొఫెసర్ మృణాళిని ‘అక్షర యాత్ర’ తమకు స్ఫూర్తి అంటారు. ముందు తెలుగు రచయితల సంభాషణలతో మొదలుపెట్టి, తర్వాత ఇరవై నాలుగు రాష్ట్రాల్లోని పర్యావరణవేత్తల అభిప్రాయాలకు వేదికై, బిభూతీభూషణ్ బంధోపాధ్యాయ ‘వనవాసి’ నవలను యాభై వారాలు ఆడియోగా ఇచ్చి, తర్వాత అనువాదకుల వైపు మళ్లారు. లోప్రొఫైల్‌లో ఉండే అనువాదకుల మెయిల్స్, కాంటాక్ట్ నంబర్స్ సంపాదించడం, వాళ్లకు తమ వివరాలు చెబుతూ సందేశాలు పంపడం, ఒక్కోసారి ఎనిమిది నెలల తర్వాత కుదురుతుందని చెబితే వేచివుండి(ఉదా: మైకేల్ కట్జ్) మళ్లీ సంప్రదించడం, ప్రశ్నలు ముందే పంపడం, విదేశీయుల సమయాన్ని బట్టి రాత్రుళ్లు మాట్లాడటం, వివాదాల జోలికి పోకుండా పుస్తకాల మీదే ఫోకస్ పెట్టడం వీళ్ల పనితీరు. ఎక్కువ అనువాదాలు జరిగే ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్ అనువాదకులు కూడా సహజంగానే ఈ పాడ్‌కాస్ట్‌లో చోటుచేసుకున్నారు. ‘ది హర్షణీయం పాడ్‌కాస్ట్ అండ్ ఇట్స్ ఇటాలియన్ లిటరేచర్ ఇన్ ట్రాన్ ్సలేషన్ ’ పేరుతో ‘ద గ్లోబల్ లిటరేచర్ ఇన్ లైబ్రరీస్ ఇనీషియేటివ్’ 2024 నవంబర్‌లో వీళ్ల పాడ్కాస్ట్ట్ను ప్రస్తావించడం విశేషం. కొన్నింటికి కాలం కూడా కలిసిరావాలి. ఇంకో కాలంలో అయితే ఇలాంటిది జరిగే అవకాశం లేదు. కొన్ని మెయిల్స్‌తో, ఒక్క ఫోన్‌కాల్‌తో ప్రపంచంలో ఎక్కడో ఉన్నవారితో సంభాషించడం ఎలా సాధ్యం? కాని కలిసొచ్చే కాలంలో కూడా ఎంతమంది ఇలాంటి పనికి పూనుకున్నారు? అందుకే వీళ్ల పని హర్షణీయం.తెలుగు భాషలోని 56 అక్షరాలన్ని దేశాల వారితోనైనా మాట్లాడాలని సరదాగా వీళ్లు పెట్టుకున్న లక్ష్యం నెరవేరింది. అనువాదకుల సిరీస్‌లో భాగంగా, గతేడాది ప్రతిష్ఠాత్మక బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ లాంగ్‌లిస్ట్‌లోని పదముగ్గురు అనువాదకులతోనూ సంభాషించారు. ఈ ఏడాది లాంగ్‌లిస్ట్‌లోని రిఫరెన్సుల్ని సాక్షాత్తూ ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్’ అడ్మినిస్ట్రేటర్ ఫియమెత్తా రోకో ఇచ్చి ఇంటర్వ్యూలకు సహకరించడం వీళ్ల విశ్వసనీయతకు చిహ్నం. ఈ సంభాషణలు ఈ ఏప్రిల్‌లోనే ప్రసారం అవుతాయి. అక్కడివాళ్లను ఇక్కడికి తెస్తున్నారు సరే, తెలుగువాళ్లు అటుపోయే మార్గమేమిటి? ‘తెలుగులో గొప్ప రచయితలు చాలామంది ఉన్నారు. కానీ ముందు ఆంగ్లంలోకి అనువాదం కావడం; ముఖ్యంగా యూకే, యూఎస్‌లో ప్రచురితం కావడం అతిపెద్ద సవాలు. దానికి నాణ్యమైన అనువాదకులతో పాటు నిబద్ధత ఉన్న ప్రచురణకర్తలు అవసరం’ అని చెబుతారు అనిల్. తెలుగు సాహిత్యంలో ఆ వాతావరణం క్రమంగా చోటుచేసుకుంటోందనీ, రెండేళ్లలో సానుకూల మార్పు చూడబోతున్నామనీ అంటారు. ఇది ఇంకోరకంగా హర్షణీయం. -
జాతి పునర్నిర్మాణంలో... 'ఆర్ఎస్ఎస్'@100
దేశమాత సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నూరు వసంతాలను పూర్తిచేసుకుంటున్న తరుణంలో, ఈ మైలు రాయిని సంఘ్ ఏ విధంగా పరిగణిస్తుందో అనే విషయంలో ఒక స్పష్టమైన జిజ్ఞాస ఉంటుంది. ఇలాంటి సందర్భాలు... ఉత్సవాల కోసం కావని, ఆత్మపరిశీలన చేసుకుని, లక్ష్యసాధనకు పునరంకితం కావడానికి వీటిని అవకాశంగా తీసుకోవాలన్నది సంఘ్ స్థాపించినప్పటి నుండి సుస్పష్టమైన విషయం. అదే సమయంలో, ఈ మహోద్యమానికి మార్గదర్శకులైన మహనీయ సద్గురువులు, నిస్వార్థంగా ఈ మార్గంలోకి ప్రవేశించిన స్వయంసేవకులు, వారి కుటుంబాల స్వచ్ఛంద సహకారాన్ని స్మరించుకునేందుకు ఇదొక అవకాశం. ప్రత్యేకించి, సంఘ్ స్థాపకులైన డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ జయంతి సుదినమే హిందూ కాలదర్శినిలో మొదటి రోజైన వర్ష ప్రతిపద కూడా అయిన తరుణంలో... ఈ నూరు సంవత్సరాల ప్రయాణాన్ని పునర్దర్శనం చేసుకునేందుకు, సమరసతతో కూడిన సమైక్య భారతావని దిశగా సంకల్పం చేసుకునేందుకు ఇంతకు మించిన అనువైన సందర్భం మరేముంటుంది? దేశం కోసం జీవించేలా...డాక్టర్ హెడ్గేవార్‌లో భారతదేశం పట్ల అహంకార రహితమైన ప్రేమ, అఖండమైన అంకితభావం చిన్నతనం నుంచే కనపడింది. కోల్‌కతాలో తన వైద్య విద్యను పూర్తిచేసేనాటికే, సాయుధ విప్లవం నుంచి సత్యాగ్రహం వరకూ భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తిని కలిగించేందుకు చేపట్టిన అన్ని రకాల ప్రయత్నాలతోనూ ఆయనకు అనుభవం ఉంది. అదే సమయంలో దైనందిన జీవితంలో దేశభక్తి లేకపోవడం, సంకుచిత ప్రాంతీయ విభేదాలకు దారితీసేలా ఉమ్మడి జాతీయ వ్యక్తిత్వం పతనం కావడం, సామాజిక జీవితంలో క్రమశిక్షణరాహిత్యం వల్ల భారతదేశంలో బయటివారి దురాక్రమణ సంభవించి వీరి స్థానం సులభతరమైందని ఆయన గ్రహించారు. ఎడతెగని దురాక్రమణలతో మన ఘనచరిత్రకు సంబంధించిన సామాజిక జ్ఞాపకాలను ప్రజలు మరచిపోయారని ఆయనకు అనుభ వానికి వచ్చింది. ఫలితంగా మన సంస్కృతి, జ్ఞాన సంబంధమైన సంప్రదాయం పట్ల నైరాశ్యభావం, ఆత్మన్యూనతాభావం చోటు చేసు కున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరో కొద్దిమంది నాయకుల నేతృత్వంలో జరిగే రాజకీయ కార్యకలాపాలు మన ప్రాచీన దేశపు సమస్య లను పరిష్కరించలేవన్న నిశ్చయానికి వచ్చారు. అందుకే, దేశం కోసం జీవించేలా ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు నిరంతర ప్రయత్నా లతో కూడిన ఒక పద్ధతిని రూపొందించాలని నిర్ణయించారు. రాజ కీయ పోరాటానికి అతీతంగా దార్శనిక దృష్టికోణంతో ఆయన చేసిన ఆలోచన ఫలితమే శాఖా పద్ధతి ఆధారంగా వినూత్నమైన పద్ధతిలో నడిచే సంఘం ఆవిర్భావం.ఈ ఉద్యమం, సిద్ధాంతాల క్రమబద్ధమైన పురోగతి ఒక అద్భు తానికి ఎంతమాత్రం తక్కువ కాదు. హెడ్గేవార్ ఈ భావజాలాన్ని సిద్ధాంతంగా రూపొందించలేదు, కానీ ఆయన ఒక కార్యాచరణ ప్రణాళికను విత్తన రూపంగా ఇచ్చారు, అది ఈ ప్రయాణంలో చోదక శక్తిగా నిలిచింది. ఆయన జీవితకాలంలో, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకూ సంఘ కార్యం విస్తరించింది.శాఖోపశాఖలుగా ‘శాఖ’మనం స్వాతంత్య్రాన్ని పొందినప్పుడు, అదే సమయంలో భారతమాతను మతం ఆధారంగా విచ్ఛిన్నం చేసినప్పుడు, పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ జనాభాను రక్షించి వారికి గౌరవ, మర్యాద లతో కూడిన పునరావాసాన్ని కల్పించడంలో సంఘ్ స్వయంసేవ కులు తమ అంకితభావాన్ని కనబరిచారు. సమాజం కోసం బాధ్యత, కర్తవ్యభావాలతో ముడిపడిన స్వయంసేవక్ అనే భావన విద్య, కార్మిక రంగం, రాజకీయరంగాల వంటి చోట తన శక్తిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. రెండవ సర్సంఘ్చాలక్ అయిన శ్రీ గురూజీ (మాధవ సదాశివ గోల్వాల్కర్) మార్గదర్శక శక్తిగా ఉన్న ఈ దశలో ప్రతి విషయం జాతీయ సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని పునర్వ్యవస్థీ కరించబడాలి! దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాజ్యాంగంపై క్రూర దాడి జరిగిన కాలంలో ప్రజాస్వామ్య పునరు ద్ధరణకు జరిగిన శాంతియుతపోరులో సంఘ్ స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు. రామజన్మభూమి విముక్తి వంటి ఉద్యమాలు సాంస్కృతిక విమోచనం కోసం భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలను అనుసంధానించాయి. జాతీయ భద్రత నుంచి సరిహద్దుల నిర్వహణ వరకు, పాలనా భాగస్వామ్య వ్యవస్థ నుంచి గ్రామీణాభి వృద్ధి వరకు, సంఘ్ స్వయంసేవకులు స్పృశించని అంశం లేదు. ప్రతి విషయాన్నీ రాజకీయ దృష్టికోణంతో చూసే ధోరణి ఉన్నప్పటికీ, సంఘ్ ఇప్పటికీ సమాజపు సాంస్కృతిక జాగరణపైన, సరైన ఆలోచనలు గల వ్యక్తులు – సంస్థలతో బలమైన అనుసంధాన వ్యవస్థను సృష్టించడంపైన దృష్టి పెట్టింది. సామాజిక పరివర్తనలో మహిళల భాగస్వామ్యం, కుటుంబ వ్యవస్థ పవిత్రతను పునరుద్ధరించడంపై గత కొన్ని సంవత్సరాలుగా సంఘ్ దృష్టి సారించింది. లోక మాత అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా సంఘ్ పిలుపుతో దేశమంతటా 27 లక్షల మందికి పైగా వ్యక్తులతో సుమారు 10 వేల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మన దేశ నాయకుల విషయంలో మనమంతా కలిసి ఎలా వేడుక చేసుకుంటున్నామో ఇది సూచిస్తుంది. సంఘ్ తన నూరవ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు బ్లాక్, గ్రామ స్థాయి వరకూ జాతి నిర్మాణం కోసం వ్యక్తి నిర్మాణ కార్యాన్ని కీలకంగా చేపట్టాలని సంఘ్ నిర్ణయించింది. గత ఏడాది కాలంలో పటిష్ఠమైన ప్రణాళికతో మరో పది వేల శాఖలను జోడించేలా కార్యాచరణ చేయడమన్నది అంకితభావానికి, అంగీకారానికి చిహ్నం. అయితే, ప్రతి గ్రామానికి, బస్తీకి చేరుకోవడ మనే లక్ష్యం ఇంకా ఒక అసంపూర్ణంగా ఉంది. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాబోయే సంవత్సరాలలో పరివర్తనకు ఉద్దేశించిన పంచ్ పరివర్తన్ అనే ఐదంశాల కార్యక్రమం ప్రధానంగా కొనసాగుతుంది. శాఖ నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో పౌరవిధులు, పర్యా వరణహితమైన జీవనశైలి, సామాజిక సమరసతా వర్తన, కుటుంబ విలువలు, స్వీయత్వ స్పృహపై ఆధారపడిన దైహికమార్పుపై దృష్టిని ఉంచింది. తద్వారా ప్రతి ఒక్కరూ ‘పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం’ – మన దేశాన్ని మహావైభవ స్థితికి తీసుకువెళ్లే బృహత్ ప్రయోజనం కోసం తమ వంతు కృషి చేస్తారు.గత వంద సంవత్సరాలలో, సంఘ్ ఒక జాతీయ పునర్నిర్మాణ ఉద్యమంగా ప్రయాణించింది. ఎవ్వరినైనా వ్యతిరేకించడం పట్ల సంఘ్‌కి నమ్మకం లేదు. అలాగే, ఈ రోజున సంఘ్ పనిని వ్యతిరే కిస్తున్నవారు కూడా సంఘ్‌లో భాగమవుతారనే విశ్వాసాన్ని కలిగి ఉంది. ప్రపంచం పర్యావరణ మార్పుల నుంచి హింసాత్మక ఘర్షణల వరకు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో సత్వర పరిష్కా రాలను అందించే సామర్థ్యాన్ని భారతదేశపు ప్రాచీన, అనుభవ ఆధారిత జ్ఞానం కలిగివుంది. ఈ అతి పెద్దయిన, అనివార్యమైన కార్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే, భారతమాత పుత్రులందరూ తమ పాత్రను అర్థం చేసుకుని, ఇతరులు సైతం అనుసరించేలా ప్రేరేపించే దేశీయ నమూనాను నిర్మించడంలో తమ వంతు కృషి చేసినప్పుడే! ఇందుకోసం సజ్జన శక్తి నాయకత్వంలో సమరసతతో కూడిన సంఘటిత భారతీయ సమాజంలో ఆదర్శవంతులమై నిలిచే సంకల్పంతో ఏకమవుదాం!దత్తాత్రేయ హోసబాళె వ్యాసకర్త ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ (జాతీయ ప్రధాన కార్యదర్శి) -
పళనిస్వామి (ఏఐఎడీఎంకే) రాయని డైరీ
ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న అమిత్‌షా నివాసానికి వెళ్లి, ఆయన్ని కలిసి బయటికి రాగానే... ఆ చీకట్లో మీడియా వాళ్లు నిలబడి మిణుగురుల్లా మెరుస్తూ ఉన్నారు!‘‘సర్! వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోతు న్నారట కదా? పొత్తు కుదుర్చుకోవటం కోసమే మీరు అమిత్‌షాను కలిసేందుకు వచ్చారా?’’ – ఆరంభ ప్రశ్న.‘‘లేదు లేదు, ఢిల్లీలో మా పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం పని మీద వచ్చాం...’’ అన్నాను. ‘‘సర్! మీ ఢిల్లీ ఆఫీస్‌ని మీరు ఫిబ్రవరి 10 నే వర్చువల్‌గా చెన్నై నుంచి ప్రారంభించారు కదా, మళ్లీ ఇప్పుడేమిటి! అమిత్షాతోగంటన్నరకు పైగా మాట్లాడారు. ఏడాదిన్నర క్రితం బీజేపీకి బ్రేకప్ చెప్పాక, తిరిగి ఇన్నాళ్లకు ఇప్పుడే కదా మీరు అమిత్‌షాను కలవటం!ఇంతసేపూ ఆయనతో ఏం మాట్లాడారు సర్ మీరు?’’ – ఆరాలు తీస్తున్న ప్రశ్న. ‘‘అలా ఏం లేదు. అమిత్జీని అనుకోకుండా కలిశాం...’’ అన్నాను.‘‘కానీ సర్, చెన్నై నుంచి ఉదయాన్నే మీరు ఢిల్లీ వచ్చారు. మధ్యాహ్నానికి మీ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేపీ మునుస్వామి, సీనియర్ లీడర్ వేలుమణి మీ వెనుకే ఢిల్లీకి రీచ్ అయ్యారు. సాయంత్రానికి ఢిల్లీలోనే ఉంటున్న మరో ఇద్దరు సీనియర్ లీడర్లు తంబిదొరై,సీవీ షణ్ముగం మీతో జాయిన్ అయ్యారు.అంతా కలిసి చీకటి పడ్డాక అమిత్‌షా నివాసానికి వెళ్లారు. అమిత్‌షాను కలవాలని అందరూ అనుకునే కలిశాక, అదెలా సర్ అమిత్‌షాను అనుకోకుండా కలవటం అవుతుంది?’’ – ఆధారాలు సేకరించిన ప్రశ్న!‘‘మీరనుకుంటున్నట్లు మేమేమీ చీకటి పడ్డాక అమిత్జీని కలవలేదు. అమిత్జీని కలిసేటప్పటికే చీకటి పడినట్లుంది. వెళ్లి కలిశాం, శాలువా కప్పాం, కాసేపు మాట్లాడాం. వచ్చేశాం...’’ అని నవ్వుతూ చెప్పాను.‘‘మరి, బీజేపీ వాళ్లు ఇంకోలా చెబుతు న్నారు కదా సర్?’’ – చీకట్లో విసిరిన ప్రశ్న!‘‘మేము లోపలికి వెళ్లినప్పుడు లోపల ఉన్నది మీరంటున్న బీజేపీ వాళ్లలో అమిత్జీ ఒక్కరే. ఆయనే మీకు చెప్పారంటారా,ఇంకోలా?’’ అని అడిగాను. ‘‘లేదు సర్, ‘కలిసి పోటీ చేద్దాం’ అని మీరు అమిత్‌షాను అడిగినప్పుడు, అందుకాయన ‘మీరు 117 సీట్లలో, మేము 117 సీట్లలో సగం సగం పోటీ చేయటానికి ఒప్పుకుంటేనే మీతో కలుస్తాం...’ అని మీకు కండిషన్ పెట్టారట కదా?! – ఊహించి వేసిన ప్రశ్న.‘‘ఇంకా?!’’ అన్నాను.‘‘పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్‌ని, శశికళను, పన్నీర్‌సెల్వంను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని కూడా అమిత్‌షా మీకు కండి షన్ పెట్టారట కదా సర్...’’ – ఇదైతే కచ్చితంగా బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై వేయించిన ప్రశ్న!పొత్తు కోసం నేను అమిత్జీ దగ్గరకు వెళ్లకుండా, అమిత్జీనే పొత్తు కోసం నా దగ్గరకు వచ్చి ఉంటే, ముందు ఆ అన్నామలైని మార్చి, వేరెవరినైనా బీజేపీ ఛీప్‌గా పెట్టమని నేనే కండిషన్ పెట్టి ఉండేవాడిని.‘‘చెప్పండి సర్! బీజేపీతో పొత్తు కోసం కాదా మీరు అమిత్‌షాను కలిసింది?’’ – తిరిగి మళ్లీ అదే ఆరంభ ప్రశ్న. ‘‘తమిళనాడులో డ్యామ్‌ల సమస్య ఉంది. స్కామ్‌ల సమస్య ఉంది. లాంగ్వేజీల సమస్య ఉంది. డీ–లిమిటేషన్ సమస్య ఉంది. డీఎంకే సమస్య ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మేము వాటి గురించి మాట్లాడి ఉండొచ్చని మీరెందుకు అనుకోరు?’’ అని అడిగాను. ‘‘బీజేపీతో పొత్తు కోసం మీరిక్కడికి వస్తే, అక్కడ చెన్నైలో అన్నామలై మీరంటే పడని వాళ్లందరితో పొత్తు పెట్టుకుంటున్నారు. దీనికేమంటారు సర్?’’ – ఇంకేదో రాబట్టే ప్రశ్న. నేనేమీ అనలేదు. డ్యామ్‌లు, స్కామ్‌లు, లాంగ్వేజీలు, డీ–లిమిటేషన్, డీఎంకే... వీటన్నిటికన్నా తమిళనాడుకు అతి పెద్ద సమస్య అన్నామలై... అని నాతో చెప్పించటానికే ఈ మిణుగురులు ఇక్కడికి చేరినట్లు నాకర్థమైంది! -
భాషా రాజకీయాల ఆట
తమిళనాడు తన బడ్జెట్ ప్రమోషనల్ లోగోలో భారత కరెన్సీ సింబల్‌కు బదులుగా తమిళ అక్షరం ‘రూ’ వాడి దేశవ్యాప్తంగా దుమారం లేవనెత్తింది. ఈ చర్య కేవలంసింబల్ వివాదం కాదనీ, ఇది భారత సమైక్యతను బలహీనపరుస్తుందనీ, ప్రాంతీయ అభిమానం మాటున వేర్పాటువాద సెంటిమెంటును రెచ్చగొడుతుందనీ విమ ర్శిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే మాజీ చట్టసభ్యుడి తనయుడు, గువాహటి ఐఐటీలో డిజైనర్ అయిన ఒక తమిళ వ్యక్తి రూపకల్పన చేసిన సింబల్‌ను తిరస్కరించడం డీఎంకే ‘మందబుద్ధి’ని బయటపెడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అభివర్ణించారు. తమిళంలో రూపాయి గుర్తుకు తమిళ అక్షరం ‘రూ’ వాడటం సహజమే. మూడు భాషలను ప్రతిపాదించిన ఎన్ఈపీ 2020 పట్ల అసమ్మతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే బడ్జెట్ పత్రాల్లో రూపాయి సింబల్‌కు బదులుగా తమిళ ‘రూ’ అక్షరం వాడటం వెనుక డీఎంకే ఉద్దేశం. ఏడాదిలో రాష్ట్ర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ భాషాదురహంకారాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. తమిళ సెంటిమెంట్ ఆందోళనహిందూ అహంకారం పతాకస్థాయికి చేరిన తరుణంలో అస్తిత్వ పోరుకు నడుం బిగించిన రాజకీయ నాయకుడు నిజానికి డీఎంకే అధినేత ఒక్కరే కాదు. అయితే ఒక్క డీఎంకే మీద మాత్రమే బీజేపీ నేతలు శ్రుతి మించిన ఆగ్రహావేశాలు ప్రదర్శించడం చూస్తే, ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని అనుకోవాలి. మతం ప్రాతిపదికగా వ్యక్తులను అవమానించడం, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం దేశ సమైక్యతకు ముప్పుగా భావించే రోజు ఎప్పుడు వస్తుంది? రెండోసారి అధికారం చేజిక్కించుకోవడానికి స్టాలిన్ సన్నద్ధం అవుతున్నారు, వాస్తవమే! ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళనాడు అలవాటు. ఈ సింగిల్ టర్మ్ ఆనవాయితీని భగ్నంచేసింది జయలలిత ఒక్కరే! 2016లో ఆమె ఏఐఏడీఎంకేను రెండో టర్మ్ అధికారంలోకి తెచ్చారు. ఈ సెంటిమెంటుతో పాటు నటుడు విజయ్ నాయకత్వంలో ఏర్పడిన తమిళగ వెట్రి కళగం పార్టీ సైతం డీఎంకేకు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ లేదా మరో ఇతర పార్టీ రానున్న ఎన్నికలకు అజెండా సెట్ చేసేవరకూ డీఎంకే వేచి చూడదలచుకోలేదు. భాష, నియోజకవర్గాల పునర్విభజన అస్త్రాలను బయటకు తీసింది. రాష్ట్రంలో ఏ మూలైనా ఈ అంశాల మీదే మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, విజయ్‌లు... ఈ రెండు అంశాల మీద డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రహస్థితులు అనుకూలిస్తే, రానున్న ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ కూటమి కట్టే అవకాశాలున్న ఏఐఏడీఎంకే ఇప్పుడు పులుసులో పడింది. 2020లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఈపీకి వ్యతిరేకంగా తొలి శంఖం పూరించిన పార్టీ ఇదే. హిందీని నిర్దేశించకపోయినా...హిందీ వ్యతిరేక రాజకీయాల్లో తమిళనాడుకు వందేళ్ల చరిత్రఉంది. మూడు భాషల సూత్రానికి అంగీకరిస్తేనే రాష్ట్రానికి కేంద్ర విద్యానిధులు విడుదల చేస్తామని ప్రకటించి, నిద్రాణంగా పడి ఉన్న ఒక జటిల సమస్యకు బీజేపీ ఎందుకు తిరిగి ప్రాణం పోసింది? ఇది అంతుచిక్కని విషయం. ‘హిందీకరణ’ ఇండియా పట్ల తన మక్కు వను వెల్లడిస్తూ ఆ పార్టీ సంకేతాలపై సంకేతాలు ఇస్తోంది. వలసవాద అవశేషాలు తుడిచిపెట్టాలన్న మిషతో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పేర్లను హిందీలోకి మార్చడం ఇందుకు ఉదాహరణ. ఇంతా చేసి ఇప్పుడు వెనకడుగు వేస్తే రాజకీయ బలహీ నత అవుతుందేమో అన్నది బీజేపీ డైలమా. మూడో భాష హిందీయే అవ్వాలని ఎన్ఈపీ ఆంక్ష పెట్టని మాట నిజమే. ఆచరణలో మాత్రం మూడో భాష హిందీనే అవుతుంది. లెక్కలేనన్ని మూడో భాషలను బోధించే టీచర్లను నియమించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా తలకు మించిన భారం. పైగా ఎక్కడెక్కడి నుంచో వారిని తీసుకురావడం మరీ కష్టం. స్కూళ్లలో హిందీ బోధించడం తప్ప గత్యంతరం లేదు. ఇదో దుఃస్థితి. తమిళనాడులో కూడా మలయాళం, కన్నడం, తెలుగు టీచర్ల కంటే హిందీ బోధించేవారిని నియమించుకోవడం సులభం.సరికొత్త ప్రచారకర్తఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘వాళ్లు ఆర్థిక లాభాలు ఆశించి ఎందుకు తమిళ చిత్రాలను హిందీలోకి డబ్ చేస్తు న్నారు?’ అంటూ ఒక తప్పు ప్రశ్న వేస్తున్నారు. దక్షిణాదిన హిందీకి, హిందుత్వకు సరికొత్త ప్రచారకర్తగా మారిన ఈయన డీఎంకేది ‘హిపో క్రసీ’ అని కూడా నిందిస్తున్నారు. ఒక్కమాటలో ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పవచ్చు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదు. దాని వ్యతిరేకత అంతా హిందీని బలవంతంగా రుద్దడం మీదేఆశ్చర్యం ఏమిటంటే, తమిళనాడులో లక్షల మంది స్వచ్ఛందంగా హిందీ నేర్చుకుంటారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడూ వారిని అడ్డుకోడు. హిందీ తప్ప మరో భాష మాట్లాడని లక్షల మంది ఉత్తర భారతీయలు ఉపాధి కోసం తమిళనాడు రావడం నాణానికి రెండో పార్శ్వం. ఉత్తరప్రదేశ్ లేదా బిహార్ స్కూళ్లలో తమిళం నేర్చుకోరు. తమిళనాడులో ఉపాధి కోసం తమిళం నేర్చుకోవాలని వారిని ఎవరూ ఒత్తిడి చేయరు. హిందీ మాట్లాడటానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షా లేదు. అందరూ వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చీరాని హిందీలో ప్రయత్నించి సహకరిస్తారు.చెన్నైలో ఏ రెస్టారెంటుకి వెళ్లినా మీకో దృశ్యం కనబడుతుంది. ఉత్తరాది వెయిటర్, తమిళ కస్టమర్ పరస్పరం ఎదుటి వారి భాషలో మాట్లాడుతారు. ఆ సంభాషణ ఎలా ఉన్నా ఆర్డర్ చేసిన ఆహారం రాకుండా పోదు. అదే తరహాలో హిందీ, తమిళ సినిమా పరిశ్రమల నడుమ విలసిల్లుతున్న చిరకాల సహకారం పవన్ పేర్కొంటున్నట్లు హిపోక్రసీ కాదు. ఆర్థికం కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు... ప్రజలు స్వచ్ఛందంగా చేరువ అవుతారనడానికి ఇదో ఉదాహరణ.దొడ్డిదారినో మరో అడ్డదారినో ఒక భాషను బలవంతంగా రుద్దడం ఎప్పుడూ, ఎక్కడా సుఖాంతం కాలేదు. తమిళనాడు హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఈ విషయంలో తగినంత గుణపాఠం నేర్ప లేదు. పొరుగు దేశాల పరిణామాలు దీన్ని రుజువు చేస్తాయి. ఒకే భాష ద్వారా జాతీయ సమైక్యత సాధించాలన్న రాజకీయాలు చావు దెబ్బ తిన్నాయి. పాకిస్తాన్ ఇందుకు చక్కటి ఉదాహరణ. 1947లో ఏర్పాటై సంబరాలు జరుపుకొన్న కొద్ది నెలల్లోనే ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. ఆనాడే వాస్తవంగా ఆ దేశం తన తూర్పు ప్రాంతాన్ని కోల్పోయింది. ఉర్దూకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం 1971లో, ఇండియా తోడ్పాటు లభించి, దేశవిభజనతో సమసింది. ‘సింహళ ఒక్కటే’ శాసనంతో... సింహళీయులకు తమిళు లకు నడుమ ఉన్న విభేదాలు ఒక్కసారిగా పతాకస్థాయికి చేరాయి. అదే 30 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీసింది. డీఎంకే అన్ని అంశాల్లోనూ, ఎన్ఈపీతో సహా, కేంద్రంతో సంప్ర దింపుల ధోరణితోనే వ్యవహరిస్తోంది. ‘రూ’ తమిళ అక్షరం వాడిందన్న సాకుతో ఆ పార్టీని ‘వేర్పాటువాది’గా అభివర్ణించడంతో బీజేపీ నైజం వెల్లడైంది. సర్వం కేంద్రం అధీనంలోకి తెచ్చుకోవాలన్న వీరావేశం, తనను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల పట్ల దాని వైఖరి బట్టబయలు అయ్యాయి. చరిత్ర పట్ల ఆ పార్టీ నిర్లక్ష్య భావం కూడా బయటపడింది. ఇదే అన్నిటి కంటే ప్రమాదకరం.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-నిరుపమా సుబ్రమణియన్