గయ మహిమ : ఆయన శరీరమే క్షేత్రంగా | Gaya Kshetra Story – Unity of Trimurtis & Importance of Gaya Shraddha | Sakshi
Sakshi News home page

గయ మహిమ : ఆయన శరీరమే క్షేత్రంగా

Sep 18 2025 11:38 AM | Updated on Sep 18 2025 11:51 AM

ishnupad Temple  At Gaya an important and holy place

దత్తబోధ 

‘త్రిమూర్తుల్లో భేదం లేదు, ముగ్గురూ ఒకటే’ అనటానికి గయ క్షేత్రం నిదర్శనం. చనిపోయిన ఆత్మీయ బంధు మిత్రుల పేర ఈ చోట కర్మకాండలా చరిస్తే మరణించిన వారికి ఉత్తమ గతులు కల్గుతాయి. ఈ కర్మనే ‘గయా శ్రాద్ధ’ మంటారు. మన ఇంటిలో పితృకార్యం జరిగినప్పుడు కూడా ‘గయా శ్రాద్ధ ఫలితమస్తు’ అని మంత్రం చదువుతారు. పిండ ప్రదానం చేస్తూ ‘గయా పిండ సదృశా భవంతు’ అని అంటారు. 

మన దేశంలో గయ, కాశీ, ప్రయాగ... ఈ మూడు ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన క్షేత్రాలు, తీర్థాలున్నూ! వీటినే క్షేత్ర త్రయమంటారు. ఈ గయా క్షేత్రానికి పెద్ద చరిత్ర ఉంది. వేల సంవత్సరాలకు పూర్వం గయుడనే రాక్షసుడుండేవాడు. విష్ణువును గురించి ఘోరంగా తపస్సు చేసి, వందల మైళ్ళ దీర్ఘమైన భారీ శరీరం కావాలని వరం కోరుకున్నాడు. క్షణంలో అంత పెద్ద భయంకర శరీరం గయునికి వచ్చింది. 

గర్వం నెత్తికెక్కినప్పుడు ఎవరికైనా తిక్క మాటలు వస్తాయి. ఏకంగా బ్రహ్మదేవుడినే ఉద్దేశించి, ‘నీకేమైనా వరం కావాలంటే కోరుకో’ అన్నాడు. ఎంత కండకావరమో చూడండి! ‘అయితే గయుడా! ఈ శరీర భాగాల్లో ఒక చోట నాకు యజ్ఞం చేయాలని ఉంది’ అంటాడు బ్రహ్మ. ‘అలాగే యజ్ఞం చేయి కానీ, ఒక షరతు! అప్పుడు నా శరీరం కదలటానికి వీలులేనంత బరువు నాపై పెట్టాలి’ అన్నాడు. 

బ్రహ్మ ముందు శివ పార్వతులను ప్రార్థించాడు. ‘శివ శిల’ అనే పెద్ద రాయిని గయుడి మీద పెట్టారు. వెంటనే రాక్షసుని రొమ్ము మీద నిలబడ్డాడు విష్ణువు. ఎంత గింజుకున్నా గయుడింక కదలలేడు. బ్రహ్మ సంకల్పం కదా! శివుని శిల, విష్ణు పాదం... ఈ ముగ్గురి స్పర్శాదుల వల్ల వాడిలో మార్పు వచ్చింది. ‘త్రిమూర్తులు నా వల్ల జగత్తుకు ఏ మాత్రం బాధ కలగకూడదని సంకల్పించి యుక్తిగా నా లోని చెడును ఈ విధంగా తొక్కిపెట్టారు’ అని తప్పు తెలుసుకున్నాడు. ‘నా చివరి కోరిక ఒక్కటే. ఈ ప్రాంతానికి నా పేరు పెట్టాలి. నా మీద పడిన పవిత్ర పాదముద్రలకు అభిషేకం చేసినా, పితృశ్రాద్ధం చేసినా, నివేదనం పెట్టినా భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థించాడు.

తమాషా ఏమిటంటే ఇంతవరకూ బ్రహ్మ గయుని దేహం మీద యజ్ఞం చేయలేదు. గయుని పైకి లెమ్మని కూడా అనలేదు. గయుని శరీరమే గయా క్షేత్రంగా ఉండిపోయింది. త్రిమూర్తుల సమష్టి కృషి ఫలితంగా లోక కల్యాణం కలుగుతున్నది.

శ్రీ గణపతి సచ్చిదానందస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement