Devotion
-
ఉగాది గురించి పురాణ కథలు కనిపించవు.. ఎందుకు?
ఉగాదికి సంబంధించిన వేడుకలూ, సంప్రదాయాలూ ఉన్నాయి కానీ, ఉగాది గురించి పురాణ కథలు కనిపించవు. కారణం – ఉగాది (Ugadi) దైవానికి సంబంధించిన పండగ కాదు, కాలానికి సంబంధించిన పండగ! మనిషికున్న వనరులలో అన్నిటికంటె విలువైనది కాలం. అందులో క్షణం ఖర్చయిపోయిందంటే, దాన్ని తిరిగి సంపాదించుకొనే అవకాశం ఎవరికీ లేదు! మనిషి ఆయుర్దాయాన్ని పన్నెండు నెలల పొడుగు ఉన్న ముక్కలుగా విభజిస్తే, ఒక్కొక్క భాగం ఆరంభానికి, ఒక్కొక్క ఉగాది మైలురాయి. ‘నిన్నటితో నీ జీవితంలో మరో ఏడు వెళ్ళి పోయింది. అది ఇక తిరిగిరాదు. ఇవ్వాళ ఇంకొక భాగం ఆరంభం. గతం గతః కనుక, రాబోయే ఏడాదిలోనైనా ధర్మార్థ కామ మోక్షాల సాధనకు సమయాన్ని సరిగా కేటాయించుకొని, సద్వినియోగం చేసు కొమ్మని కాలం చేస్తున్న హెచ్చరికగా ఉగాదిని స్వీకరించవచ్చు.కాలం (Time) చిత్రమైంది. అందులో ప్రతిక్షణమూ మన కళ్ళముందే క్రమం తప్పకుండా టిక్‌టిక్‌మని జరిగిపోతూ ఉంటుంది. కానీ విలువయిన కాలం, విలువలేని భోగలాలసతలో వేగంగా మన చేయి జారిపోయిందని, మనకు బోధపడే నాటికి, సాధారణంగా మనం ముది వయసులో ఉంటాం. ‘లాలసులగు మానవులను/ కాలము వంచించు, దురవగాహము! సుమతీ!’ అన్నారు కదా పోతన గారు. ‘తస్మాత్ జాగ్రత్త’ అని గుర్తు చేసే పర్వదినంగా ఉగాదిని చూడవచ్చు.కాలంలో మరో విచిత్రం కూడా ఉంది. ‘కాలం మారిపోతున్నది, రోజురోజుకూ భ్రష్టమై, నాశనమై పోతున్నది!’ అని లోకులం తరచుగా వాపోతూ ఉంటాం. కానీ అది సబబు లేని మాట. కాలం సృష్ట్యాది నుంచి, ఒకే క్రమంలో ఒకే వేగంతో దాని దోవన అది పోతూ ఉన్నది. దానికి మార్పెక్కడ? మారేది లోకం, కాలం కాదు. కాలం మారిపోతున్నదనటం ‘... తల/ తిరుగు మానిసి ఇల యెల్ల తిరుగుననుటె!’ (పానుగంటి).శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాశిఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి‘మారేదీ, మారిందీ, మారగలిగిందీ, మారవలసిందీ కాలం కాదు, దేశం. దేశం (Country అంటే మనుషులు. అంటే మేమే! జరిగిపోయిన చెడుగు, అధర్మం, పతనం, భ్రష్టత్వాలు జరిగిపోయాయి. కనీసం రాబోయే కాలంలోనన్నా మేమంతా ‘మంచి’ దిశగా మారేలా చేయి స్వామీ! ఇప్పటి అంధకారం నుంచి మమ్మల్ని వెలుగుదిశగా నడిపించు. ‘తమసో మా జ్యోతిర్గమయ!’ అని చిత్తశుద్ధితో లోకులందరూ సర్వేశ్వరుడిని ప్రార్థించదగిన సుదినం ఉగాది.– ఎం. మారుతి శాస్త్రి -
షడ్రుచుల ఉగాది పచ్చడి తయారీ ..తినేటప్పుడు చదవాల్సిన శ్లోకం..!
తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. మామూలుగా ఏ పండుగ రోజైనా స్పెషల్‌గా పిండివంటలు, గారెలు, బూరెలు, పాయసం లాంటి వంటకాలు ఉంటాయి. కానీ ఉగాది స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడే!. ఎన్నో ఔషధగుణాలు ఉన్న షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారంలో ఉండే ఔషధ గుణాలను స్వీకరిస్తూ, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ కొత్త సంవత్సరమంతా ఆరోగ్యంగా, ఆనందంగా సాగిపోతుందనేది పురాణ వచనం. మరీ అందరికి ఎంతో ఇష్టమైన ఆ ఉగాది పచ్చడి తయారీ ఎలాగో చూద్దామా..!.ఉగాది పచ్చడి కావలసినవి: కొత్త బెల్లం – 100 గ్రామలు, పచ్చి మామిడి – ఒకటి (మీడియం సైజు), వేప పువ్వు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – రెండు (తురమాలి), ఉప్పు – చిటికెడు, చింతపండు – పెద్ద నిమ్మకాయంత (కొత్త చింతకాయల నుంచి సేకరించినది). తయారీ: బెల్లాన్ని తురిమి, అందులో కొద్దిగా నీటిని చిలకరించి పక్కన ఉంచాలి. వేప పువ్వు కాడలు లేకుండా వలిచి పువ్వు రెక్కలను సేకరించి పక్కన ఉంచాలి. మామిడి కాయ మొదలు (సొన కారే భాగం) తీసేయాలి. కాయను నిలువుగా కోసి లోపలి గింజను కూడా తీసేయాలి. ఇప్పుడు మామిడి కాయను తొక్కతోపాటు సన్నగా ముక్కలు తరగాలి లేదా తురిమి బెల్లం నీటిలో వేయాలి. చింతపండు గుజ్జును చిక్కగా రసం తీసి పై మిశ్రమంలో కలపాలి. అందులో పచ్చిమిర్చి తురుము, ఉప్పు, వేప పూత వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా ఉంటుంది. మరింత రుచి కోసం చెరకు ముక్కలు, మిగుల మగ్గిన అరటి పండు గుజ్జు కలుపుకోవచ్చు. ఈ పచ్చడి తినేటప్పుడు చదవాల్సిన శ్లోకం..శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచసర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్॥"అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు(చదవండి: -
చైత్ర మాసం విశిష్టత.. వ్రతాల మాసంగా ఎందుకు పిలుస్తారు..?
చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటి రాశియైన మేషరాశిలో సంచరిస్తాడు. పురాణాలు చైత్రమాసాన్ని మధుమాసంగా, పవిత్ర మాసంగా కీర్తిస్తాయి. శుభాకార్యలు జరపకపోయినా..ఈ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు పండితులు. కొత్త సంవత్సరం ప్రారంభ సూచిక, మనందరికీ ఇష్టమైన ఉగాది పండుగతో ప్రారంభమయ్యే ఈ చైత్ర మాసం విశిష్టత, వ్రతాల మాసంగా పిలవడానికి కారణం తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’. ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు. కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది. అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60 ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.పురాణ గాథ!ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని సంకల్పించారు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు. అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.వ్రతాలన్నీ ఈ మాసంలోనే..“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి "ఉగాది, "శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటి అవతారం అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం, వసంత నవరాత్రులు వంటి విశిష్టమైన వ్రతాలు ఆచరించేది ఈ మాసంలోనే. అమ్మకు ఇష్టమేన మాసం కూడా..అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం చైత్రమాసం. అమ్మవారిని ఈ కాలంలో పూజించిన వారికి విశేషఫలం లభిస్తుందని దేవీభాగవతమహిమ చెపుతోంది. దీనికి గల కారణం ఏమిటో శివుడే స్వయంగా బ్రహ్మవిష్ణువులకు వివరించినట్లు శివపురాణం చెపుతున్నది. ఈశ్వరుడు సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం, అనుగ్రహం అనబడే అయిదు జగత్కార్యాలు చేస్తుంటాడు. ఈ అయిదుపనులలో సకలలోకాల ప్రాణుల ఉత్పత్తి లేక ఆరంభం, సృష్టిగా పిలుస్తారు. ఆరంభం అయిన ప్రాణులు, లోకాలు పోషింపబడి స్థిరంగా ఉండుట అనగా, జీవుల నుంచి జీవులు ఉత్పన్నులవుతూ కొనసాగడాన్ని స్థితి అంటారు. జీవులు కొంతకాలం అభివృద్ధిని చెంది, శిథిలావస్థకు వచ్చి, వినాశమును పొందడాన్ని సంహారం అంటారు. ప్రాణం బయటకు వచ్చి వేరొక దేహాన్ని పొంది, వేరు లోకాలకు పోవడాన్ని “తిరోధానం” అంటారు. జననమరణాదిచక్రమును తొలగించి ముక్తినివ్వడాన్ని అనుగ్రహము అంటారు. ఈ పంచకృత్యాలు నడిపించేపని భవుడు, భవానికి ఇచ్చాడు. ఈ పనులన్నీ ప్రారంభమైన కాలం చైత్రమాసం. అందువల్లనే ఈ కాలంలో భవానిని పూజించమని భవుడు చెప్పాడు.భవభవానీప్రీతికరమాసం, మధుమాసం కనుక ఈ మాసంలో ఆదిదంపతులను పూజించాలి.రామాయణ పారాయణము చేసేది కూడా.."రామో విగ్రహవాన్ ధర్మః" అని రామాయణంలో వాల్మీకి స్పష్టం చేసాడు. ధర్మాచరణకోసం ఎన్నో శాస్త్రాలు తిరగవేయవలసిన అవసరం లేదు. రాముని జీవితాన్ని సంపూర్ణంగా చదవాలి. జీర్ణించుకోవాలి. అప్పుడు ధర్మసూక్ష్మాలు స్పష్టంగా తెలుస్తాయి. శిష్యునిగా, ధర్మప్రభువుగా, దాతగా, రక్షకునిగా, శిక్షకునిగా ఒకటేమిటి అనేకపాత్రలు శ్రీరామచంద్రునిలో కనిపిస్తాయి.సంపూర్ణమానవునిగా జీవితం గడిపిన దివ్యావతారం శ్రీరామావతారం. శ్రీరామచంద్రుని ఆవిర్భావం జరిగినది చైత్రమాసంలోనే. అందువల్లనే చైత్రమాసాన్ని ధర్మమాసం అంటారని సౌరసంహిత చెపుతోంది. ఈ మాసంలో రామాయణ పారాయణము, శ్రవణమూ ఈ రెండూ అనంతఫలితాలను ఇస్తాయి. మానవులజీవితాలను వారివారి కర్మఫలాలను అనుసరించి నడుపుతూ సుఖదుఃఖాలను ఇచ్చేవారిలో నవగ్రహ దేవతలది ప్రధాన స్థానం. నవగ్రహాలలో ఒకరైన కేతువు గ్రహంగా ఆవిర్భవించినది చైత్రమాస కృష్ణపక్షచతుర్దశీ తిథి. ఈ తిథినాడు దర్భలు శిరస్సున ధరించి, నదీస్నానం చేసి కేతుతర్పణాలు ఇచ్చి, ఉలవలు దానం చేసినవారికి సకలబాధలూ తొలగుతాయి. ఊపిరితిత్తుల రోగాలు తక్షణమే తొలగిపోతాయి. కాబట్టి అంత మహిమాన్వితమైన ఈ మాసాన్ని భక్తులందరూ తమ శక్త్యానుసారం పూజలు చేసి..ఆ భగవంతుడి కృపకు పాత్రులుకండి. (చదవండి: -
అందం, వికారం పక్కపక్కనే ఉంటాయా..? షాక్‌లో చిత్రకారుడు
అతను ఓ చిత్రకారుడు. అతనికి ఓ అందమైన నగుమోము, వికారమైన మోము చిత్రాలు గీయాలనుకున్నాడు. ముందుగా అతను ఓ అందమైన నగుమోము గల ఓ చిత్రం గీయడానికి నిర్ణయించుకున్నాడు. చాలాకాలానికి అతను అనుకున్నట్టే ఓ అందమైన అయిదేళ్ళ చిన్నవాడొకడు కనిపించాడు. ఆ పసివాడి పెద్దల అనుమతితో వాడి బొమ్మ గీశాడు. ఆ చిత్రం ఎంతో అందంగా ఉంది. ఆ తర్వాత వికారస్వరూపమోము కోసం వెతకడం మొదలుపెట్టాడు. చాలా కాలమే పట్టింది. అతనిలో విసుగు మొదలైంది. అయినా ప్రయత్నం మానలేదు. ఉన్నట్లుండి అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఎక్కడెక్కడో వెతకడమెందుకు ఒక జైలుకి వెళ్తే తాననుకున్న వికారస్వరూపుడు తారసపడతాడనుకున్నాడు. దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత అతను అనుకున్నట్టే ఒక జైలులో ఓ వికారమైన మోముగల ఒక వ్యక్తి కనిపించాడు. దాంతో అప్పటి దాకా అతనిలో ఉన్న నీరసం, విసుగు మటుమాయమయ్యాయి. ఉత్సాహం ఉ΄ప్పొంగింది. జైలు అధికారి అనుమతితో ఆ వికారస్వరూపుడి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. గీస్తున్నంతసేపు ఆ వికారస్వరూపుడిని మాటల్లో పెట్టాడు. అతని ఊరు, పేరు, పెద్దల వివరాలు ఇలా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అతను చెప్పిన వివరాలన్నీ విన్న తర్వాత చిత్రకారుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎందుకంటే అతను మరెవరో కాదు, అందమైన చిన్నవాడనుకుని కొన్నేళ్ళ క్రితం గీసిన ఆ కుర్రాడే ఇప్పుడీ వికారస్వరూపుడు. కాలక్రమంలో ఆ అందమైన చిన్నోడు అనేక నేరాలూ ఘోరాలు చేసి ఇప్పుడిలా వికారస్వరూపుడిగా మారి తనముందున్నాడు. ఈ నిజం తెలిసి చిత్రకారుడి నోటి వెంట మాట లేదు. ప్రతి మనిషిలోనూ అందమూ, వికారమూ ఉంటాయి. అయితే అతన్ని ఒకసారి అందంగానూ, మరోసారి వికారంగానూ చూపేది అతనున్న పరిస్థితులే!– యామిజాల జగదీశ్ (చదవండి: సహజ యోగం..సమతుల్య జీవనం..!) -
సహజ యోగం.. సమతుల్య జీవనం..!
మానవుల ఆధ్యాత్మిక ప్రయాణంలో స్త్రీ పాత్ర అత్యంత కీలకమైనది. పురుషులు నిత్యజీవితంలో తమ చుట్టూ ఉండే స్త్రీలను గౌరవించడం ద్వారా తమ సూక్ష్మ శరీరం లోపల శక్తి కేంద్రాలను లేదా షట్చక్రాలను చైతన్యవంతం చేసుకోవచ్చు. తల్లిని గౌరవించినప్పుడు అతని లోపల శ్రీ గణేశుని సుగుణాలు స్థిరపడడం వలన మూలాధార చక్రము చైతన్య వంతం అవుతుంది. అలానే తల్లితో ఉండే అనుబంధం చక్కగా ఉన్నప్పుడు ఎడమవైపు హృదయ చక్రం చైతన్యవంతం అవుతుంది. తన సోదరీమణులను గౌరవించినప్పుడు, ఎడమవైపు విశుద్ధి చక్రం చైతన్య వంతం అవుతుంది. తన భార్యను గౌరవించినప్పుడు ఆమె తన ఇంటికి గృహ లక్ష్మి కాబట్టి ఎడమవైపు నాభీ చక్రం చైతన్య వంతం అవుతుంది. అలానే భార్యతో అతని సంబంధం చక్కగా ఉన్నప్పుడు ఎడమవైపు హృదయ చక్రం చైతన్యవంతం అవుతుంది. పరస్త్రీలను తల్లి వలె లేదా సోదరి వలె గౌరవించినప్పుడు ఆజ్ఞా చక్రం చైతన్యవంతం అవుతుంది. కాబట్టి పురుషులు తమ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం స్త్రీలను గౌరవించవలసిన ఆవశ్యకతను తెలుసుకొని తదనుగుణంగా నడుచుకోవాలి.ఎప్పుడైతే ఒక స్త్రీ తన సంపూర్ణ శక్తులను ధరించి ఉపయోగిస్తుందో అప్పుడు ఆమె చాలా శక్తివంతమై భీకరంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడూ వాదిస్తూ, కొట్లాడుతూ, విమర్శిస్తూ, చౌకబారుగా ప్రవర్తిస్తుందో, అప్పుడు ఆమె శక్తులన్నీ వృధా అయిపోతాయి. ఆమె కావాలనుకుంటే పురుషులకంటే ఎక్కువగా పని చేయగలదు. అయితే మొట్టమొదటగా ఆమె ఎంతో నమ్రతతోను, అణకువతోనూ, హుందాతనంతోను, చక్కటి అవగాహనతోను, వాత్సల్యపూరితంగా ఉండి తనలోగల శక్తులను గౌరవించుకుంటూ, శాంతిని నెలకొల్పటం నేర్చుకోవాలి. ఒక కవచం వలే రక్షణను కల్పించటం స్త్రీ యొక్క బాధ్యత. కవచం కత్తి యొక్క పనిని చేయలేదు. అలానే కత్తి కవచం చేసే పనిని చేయలేదు. అయితే ఆ రెండింటిలో ఏది గొప్ప? కవచమే గొప్ప. ఎందుచేతనంటే అది కత్తి యొక్క దెబ్బను తట్టుకోవాలి కాబట్టి. కత్తి విరుగుతుందేమో కానీ, కవచం మాత్రం విరగదు. అలా స్త్రీలు వారి శక్తులను గుర్తించి అందులో స్థిరపడాలి. నమ్రత అనేది ఆ శక్తికి ఒక గొప్ప ఇరుసు లాంటిది. ఎంతో నమ్రతా భావంతో, విధేయతతో ఆ శక్తులను తమ లోనికి గ్రహించుకుని వారు అందులో స్థిరపడాలి. మనం రోజూ పేపర్లో కానీ టీవిలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎన్నోహింసాత్మక, అనైతిక కార్యక్రమాలను చూస్తున్నాము. వాటి ప్రభావం చిన్న పిల్లల మీద, స్త్రీల మీద పడి సమాజం నాశనమవుతోంది. సహజయోగ మార్గాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని ఆచరించడం ద్వారా మహిళలు అటువంటి సమాజంలో పరివర్తన తీసుకు రాగలరు.ప్రపంచ వ్యాప్తంగా సహజ యోగా ధ్యాన సాధన చేస్తున్న మహిళలు అందరూ శ్రీ మాతాజీ నిర్మలా దేవి అనుసరించిన, ప్రబోధించిన స్త్రీ ధర్మాలను ఆచరిస్తూ ఉత్తమ కుటుంబ సభ్యులుగా తమ తమ దైనందిన జీవితంలో ప్రశాంతమైన, సమతుల్య జీవనం గడుపుతున్నారు.– డా. పి. రాకేష్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా (చదవండి: కాశీ కంటే పురాతన క్షేత్రం: 'వృద్ధాచల క్షేత్రం'..!) -
కాశీ కంటే పురాతన క్షేత్రం: 'వృద్ధాచల క్షేత్రం'..!
వృద్ధాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడి స్థలపురాణం ప్రకారం వృద్ధ కాశిగా పేరొందిన ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృద్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు. అదే విధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి. ఈయన చిదంబరంలో కాళీమాతతో పోటిపడి నాట్యం చేస్తే ఈ విరుదాచలం లేదా వృద్ధాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడని చెబుతారు. అంతే స్వామి సంతోష తరంగాల్లో తేలి΄ోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే.స్థలపురాణం...పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్ట కష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి, స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చె΄్పాడు. దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది. దీనికి విభాసిత మహర్షి, వృద్ధేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పని చేయండి చేసుకొన్నవారికి చేసుకొన్నంతగా లాభం చేకూరుతుందని చెప్పారు. దీంతో ప్రజలు ఆ పనికి పూనుకొన్నారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు. ఆశ్చర్యం... ఎవరు ఎంత పని చేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణాలుగా మారేవి. అప్పటి నుంచే చేసిన వారికి ‘చేసినంత, చేసుకున్నవారికి చేసుకొన్నంత’ అనే నానుడి మొదలయ్యిందని చెబుతారు. ఐదుతో అవినాభావ సంబంధం...ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది. ఈ ప్రాంగణంలో పూజలందుకొనే మూర్తులు 5. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. ఇక్కడ స్వామి వారికి 5 పేర్లు ఉన్నాయి. అవి విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృద్ధ గిరీశ్వరుడు. ఆలయానికి 5 గోపురాలు, 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయి. వేకువ జాము నుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయంలో 5 సార్లు పూజలు చేస్తారు. ఇక్కడ 5 రథాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు స్వయంభువుడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మనశ్శాంతి కలగడమే కాకుండా అన్నిరకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు. ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు. ΄ాతాళ వినాయకుడు శ్రీ కాళహస్తిలో ఉన్నట్లు ఇక్కడ విఘ్నేశ్వరుడు భూతలం నుంచి కిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి 18 మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. చని΄ోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణి ముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు. ఈ విరుదా చలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు... ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయంలో చూస్తాం. అందులో ఇది ఒకటి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నించుకొన్న కోరికలు త్వరగా తీరుతాయని చెబతారు.ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ అదే విధంగా సాయంకాలం 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా తిరువణ్ణామలైలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికీ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. దీనివల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ వేసిన నాణేలు అక్కడి కొలనులో ...ఒకసారి సుందరర్ అనే శివభక్తుడు ఈ దారి గుండా వెడుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు. దీంతో స్వామి వారు స్వయంగా 12 వేల బంగారు నాణాలను అంద జేస్తాడు.తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతాడు.ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని, నీవు తిరువారూర్ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు. ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణాలను తీసుకొన్నాడని కథనం. అదే విధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటు పై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు. డి.వీ.ఆర్(చదవండి: ప్రియాంక చోప్రా..ఫ్రీడమ్ సెలబ్రేషన్) -
మానవ సేవతో...
మూడు శతాబ్దాలు చూసిన మునిగా పేరు గాంచిన కల్యాణ్ దేవ్... వివేకానుందుని బోధనలతో ఉత్తేజితుడై మానవ సేవ ద్వారా మాధవునికి సేవ చేసి తరించారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పట్ జిల్లాలోని కోటనా గ్రామంలో 1876లో జన్మించిన ఆయన అసలు పేరు కాలూరామ్. రిషీకేశ్‌లో స్వామి పూర్ణానంద శిష్యులై స్వామి కల్యాణ్ దేవ్ అయ్యారు. కొన్నేళ్ళు హిమాలయాలలో తపస్సు చేశారు. అనంతరం ఆయన తన ప్రాంతంలోని పేద ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఇతర ప్రాంతాల ప్రజల కోసం దాదాపు మూడు వందల పాఠ శాలలు, వైద్యకేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటరాని తనం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన తన వాణిని వినిపించారు. నిర్లక్ష్యానికి గురైన మతపరమైన, చారిత్రక ప్రదే శాల పునర్నిర్మాణానికి కల్యాణ్‌దేవ్ మద్దతు ఇచ్చారు. ముజఫర్‌నగర్‌లోని శుక్తల్‌లో ఆయన ‘శుకదేవఆశ్రమం’, ‘సేవా సమితి’ని కూడా స్థాపించారు. హస్తినా పూర్లోని కొన్ని ప్రాంతాలను, హరియాణాలోని అనేక తీర్థయాత్రా స్థలాలను పునరుద్ధరించారు.ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కల్యాణ్‌దేవ్ మాట్లా డుతూ... 1893లో ఖేత్రిలో వివేకానందుడిని కలిసి నప్పుడు తనకు ప్రేరణ కలిగిందని, ఆయన తనతో... ‘నువ్వు దేవుడిని చూడాలనుకుంటే, పేదల గుడిసెలకు వెళ్ళు... నువ్వు దేవుడిని పొందాలనుకుంటే, పేదలకు, నిస్సహాయులకు, అణగారినవారికి, దుఃఖితులకు సేవ చేయి’ అని అన్నారని చెప్పారు. పేదల సేవ ద్వారా దేవుడిని పొందడమే తనకు స్వామీజీ నుండి లభించిన మంత్రమని కల్యాణ్‌దేవ్ పేర్కొన్నారు.భారత ప్రభుత్వం 1982లో ఆయనను పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది మీరట్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డి.లిట్. ప్రదానం చేసింది. తుదకు ఆయన 2004లో పరమపదించారు. – యామిజాల జగదీశ్ -
దేవాలయాల్లో రావి, వేపచెట్టు ఎందుకు ఉంటాయి!
మన సంప్రదాయాలలో ప్రతి ఒకటి అద్భుతమే,ప్రతి ఒక్కటీ జీవనవిధానానికి సంబంధించినవే. అందుకే చాలా ఆలయాలలో రావిచెట్టు, వేపచెట్టు ఉంటాయి, ఎక్కువ చోట్ల రావి, వేప చెట్లు కలిపి ఉంటాయి. రావిచెట్టును విష్ణు స్వరూపంగానూ, వేపచెట్టును లక్ష్మీస్వరూపంగానూ భావించి పెళ్లిళ్లు చేయిస్తుంటారు. అలా పెళ్లి చేసిన జమిలి వృక్షానికి భక్తితో ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు తొలగి సంసారం సజావుగా సాగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆ రెండు వృక్షాల మీదినుంచి వచ్చే గాలికి శారీరక, మానసిక రుగ్మతలను పారద్రోలే శక్తి ఉందని ఆధునిక పరిశోధనలు సైతం నిరూపిస్తున్నాయి. జోతిష శాస్త్రం ప్రకారం శనిదోషం పోవాలంటే ప్రతిరోజు రావిచెట్టు నీడన నిలబడటం, రావిచెట్టుకి నమస్కారం చెయ్యడం, రావిచెట్టుకు ప్రదక్షిణ చేయడం, శనివారం నాడు మాత్రం రావిచెట్టుని హత్తుకోవడం మంచిదని, ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే శనిదోషం తొలుగుతుందట. రావిచెట్టు (Peepal Tree) నీడన కొంచం సేపు కూర్చుంటే రక్తపోటు సక్రమ రీతిలో ఉంటుందని, రావిచెట్టు గాలి మంచి ఆలోచనలు కలిగిస్తుందనీ చెబుతారు వైద్యులు. అదేవిధంగా వేపచెట్టుకు కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేప చెట్టు (Neem Tree) గాలికి అన్నో రోగాలను కలిగించే క్రిములు చచ్చిపోతాయి, అమ్మవార్లకు వేపాకు బాగా ఇష్టం. అందుకే జాతర్ల సమయంలో వేపాకు ఎక్కువగా వాడతారు. చదవండి: బౌద్ద వాణి.. మీకూ, నాకూ అదే తేడా ! -
నిర్మల వాణి : భూమి ఇరుసే సుషుమ్న
మనిషిలో సమతుల్యత అనేది భూమి మధ్యలో వున్న ఇరుసు లాంటిది. మానవుడిని అతిగా భవిష్యత్ లేక గతం వైపు వెళ్లకుండా ఒక నిశ్చలమైన, నిర్దిష్టమైన సమతుల్య స్థితిలో ఉంచేది అతనిలో అంతర్గతంగా సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థలో ఉన్న సుషుమ్నా నాడి. అదే మనలోని ఇరుసు (అక్షం). మనం ఎప్పుడూ మనలోని ఇరుసు అయిన సుషుమ్న మీదనే ఉండాలి.అలాగే భూమి ఇరుసే (అక్షం) సుషుమ్న. భూమాతలో నిక్షిప్తమై ఉన్న ఇరుసు ఎంత బలంగా పనిచేస్తుందంటే, విశ్వం ఎంత విశాలంగా వ్యాప్తి చెంది ఉన్నా సరే, భూమి తన ఇరుసు ఆధారంతో అత్యంత వేగంగా తిరుగుతూనే ఉంటుంది. తద్వారా పగలు మనం పనిచేసుకొనేటట్లు, రాత్రి నిద్రించేటట్లుగా మనలను సమతుల్య స్థితిలో ఉంచడానికి అది పగలు, రాత్రులను సృష్టించింది. అంతేకాకుండా తాను సూర్యుని చుట్టూ తిరుగుతూ, సగం దేశాలలో వేసవికాలం, సగం దేశాలలో శీతాకాలాన్ని కలిగించేలా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇరుసే ఇదంతా నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఈ ఇరుసు విశ్వంలో పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలకు భూమిని అవసరమైనంత దూరంలో ఉంచుతుంది.చదవండి: World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా!ఈ కేంద్రం లేక ఇరుసు భూమి మేధస్సునే కాదు, పరిమళాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఈ కేంద్రమే భూమి సుషుమ్నా నాడి అని చెప్పవచ్చు. ఈ కేంద్రం ద్వారానే ’స్వయంభూలు’ వెలుస్తూ ఉంటాయి. భూకంపాల లాంటి గొప్ప విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. నిజానికి కదిలేది ఈ ఇరుసే. అదొక గొప్పశక్తి. ఆ శక్తి భూమాతలోని లావాను వివిధ దిశలలో పంపిస్తుంది. ఆ లావా భూమిపైకి చొచ్చుకుని రావడం వల్ల భూకంపాలు, అగ్ని పర్వతాలలాంటివి ఏర్పడతాయి. ఇవన్నీ భూమాతలోని ఇరుసుకు ఉన్న అవగాహన వలననే ఏర్పడతాయి. అంతేకాదు ఋతువులు కూడా ఏర్పడతాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు, వాటిని మనకు అందించడానికే ఈ కాలాలు సృష్టించబడ్డాయి. భూమాత తనలోని ఉష్ణాన్ని కోల్పోతే, మొత్తం మంచుతో గడ్డకట్టిపోవడం వలన మనకు తినడానికి ఏమీ ఉండదు. చంద్రగ్రహమే ఇక్కడ ఉన్నట్లుగా ఉంటుంది. (తరువాయి వచ్చేవారం)– డా. పి.రాకేష్ (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
ఆంతర్యంలోని ఆత్మీయతతోనే ఆశీర్వాదాలు...
గిబియోనీయులంటే అమ్మోరీయులనే శాపగ్రస్తుల సంతతికి చెందిన కనాను ప్రజలు. వాగ్దాన దేశమైన కనానులో యెహోషువా నాయకత్వంలో సాగుతున్న జైత్రయాత్రలో యెరికో, హాయి పట్టణాలు అప్పటికే నేలకూలగా ఆ వార్త విని, తాము కూడా వారిలాగా త్వరలోనే సంహారం కానున్నామని గ్రహించి గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో శాంతియుత సంధి చేసుకోవడానికి నిర్ణయించుకొని, తాము ఎక్కడో దూరదేశానికి చెందిన వారమంటూ కపట నాటకమాడి యొహోషువా శరణు కోరారు. దేవుని వద్ద విచారణ కూడా చెయ్యకుండానే, యొహోషువ, ఇతర ఇశ్రాయేలీయుల పెద్దలు గిబియోనీయుల జోలికి రాబోమంటూ వారికి ప్రమాణం చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు వాస్తవం తెలిసి వారిని నిలదీస్తే, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ పక్షంగా గొప్ప కార్యాలు చేశాడని విని ఆయన శరణులో, మీ నీడలో బతకాలని నిర్ణయించుకున్నామని వారు వెల్లడించారు. మాటిచ్చిన తర్వాత మడమ తిప్పకూడదన్న దేవుని ఆజ్ఞకు లోబడి ఇశ్రాయేలీయులు తమ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు. సంధి ఒప్పందానికి దేవుడు కూడా ఆమోద ముద్ర వేశాడు. గిబియోనీయుల ఉదంతం విని ఆ వెంటనే మిగిలిన కనాను రాజులంతా కలిసి గిబియోనీయులతో సమిష్టిగా మహా యుద్ధం చెయ్యగా ఇశ్రాయేలీయులు కూడా వారికి అండగా నిలిచారు. దేవుడైతే ఒక రోజుపాటు సూర్యుణ్ణి ఉన్నచోటే నిలిపి మరీ వారికి ఘనవిజయా న్నిచ్చాడు(యొహో 10:12). ఇశ్రాయేలీయుల మధ్య పనివారుగా ఉండేందుకు అంగీకరించిన గిబియోనీయులకు, ఆలయంలో బలిపీఠం వద్ద కట్టెలు నరికే, నీళ్లు మోసితెచ్చే పనినిచ్చి, దేవుడు తన ఆరాధనా కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యాన్నిచ్చాడు. లేవీయులు అంటే అర్చకులుండే పట్టణాల్లో దేవుడు గిబియోను పట్టణాన్నికూడా చేర్చాడు. దావీదు వద్ద ఉన్న 30 మంది మహా వీరుల్లో ఇష్మాయా అనే గిబియోనీయుడు కూడా ఉన్నాడని బైబిల్ చెబుతోంది. చదవండి: World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా!చక్రవర్తిగా సొలొమోను గిబియోనులో బలులర్పించినప్పుడు దేవుడు అక్కడేప్రత్యక్షమై అతనికి వరాలనిచ్చాడు, బబులోను చెరనుండి తిరిగొచ్చిన వారిలో 95 మంది గిబియోనీయులు కూడా ఉన్నారని బైబిల్లో నెహెమ్యా రాశాడు. ఝెరూషలేము ప్రాకారాలు తిరిగి నిర్మించిన వారిలో కూడా గిబియోనీయుల ప్రస్తావన ఉంది. మామూలుగా అయితే కాలగర్భంలో కలిసి΄ోవాల్సిన గిబియోనీయులకు దేవుడు ఇంతటి మహా చరిత్రనిచ్చాడు. ఇశ్రాయేలీయులతో తలపడి కనానీయులంతా సంహారం కాగా. గిబియోనీయులనే కనాను ప్రజలు మాత్రం, దేవునికి తలవంచి, దేవుని ప్రజలతో సఖ్యత కోరుకొని తమ ప్రాణాలే కాదు, తమ ఉనికిని కూడా కాపాడుకున్నారు. పాములకున్న వివేకం, పావురాలకున్న నిష్కపటత్వం విశ్వాసి కుండాలన్న యేసుప్రభువు వారి బోధనలకు గిబియోనీయలే ఉదాహరణ. తలుపు చిన్నదైతే, లోనికి వెళ్లేందుకు తలవంచడమొక్కటే మార్గం. నేను తల వంచడమా? అనుకుంటే, తల బొప్పికట్టడం ఖాయం. అపకార దృష్టితో కాక ప్రాణభీతితోనే గిబియోనీయులు కపటనాటకమాడారని దేవునికి ముందే తెలుసు. ఆయన వారి పై వేషాలను కాదు, ఆంతర్యంలో తన పట్ల వారికున్న విశ్వాసాన్ని, భయభక్తుల్ని చూశాడు. పైకి మాత్రం నీతిమంతుల్లాగా నటిస్తూ గొప్పగా జీవించేవారి ఆంతర్యంలోని దుష్టత్వాన్ని, పైకి నాటకాలాడినా ఆంతర్యంలో వారి ఆత్మీయతను చూసి మరీ దేవుడు ప్రతిస్పందిస్తాడు. లేకపోతే వారితో సంధి చేసుకోవద్దని దేవుడు ఏదో విధంగా యెహోషువాకు తెలియజేసేవాడే లేదా వారితో సంధి చేసుకున్నావెందుకని ఆ తర్వాతైనా యెహోషువాను మందలించేవాడే. కత్తితో తలపడటం కన్నా యుక్తితో మెలగడమే మెరుగనుకొని గిబియోనీయులు అలా గొప్ప ఉపద్రవం నుండి తప్పించుకోవడమే కాక, దేవుని ప్రజల్లో భాగమయ్యారు, దేవుని ఆశీర్వాదాలకూ పాత్రులయ్యారు.పై వేషాలు, పదవులు, నాటకాలను బట్టి కాక ఆంతర్యంలోని భక్తి, నీతి, పరిశుద్ధతను బట్టి దేవుడు ప్రతిఫలాన్నిస్తాడు. మనవాడు కదా, ఇలా చేయవచ్చా... అని ఇతరులను నిందించే ముందు, పైకి ఎంతో భక్తిగా, పవిత్రంగా, నీతిమంతుల్లాగా ప్రవర్తించే నా ఆంతర్యంలో లేదా మనవాళ్ళ ఆంతర్యంలో ఇంతటి ఆత్మీయ దుర్గంధమా? ఇన్ని మురికి కాలువలా? ఇంతటి భ్రష్టత్వమా... అని ప్రశ్నించుకునేవాడే నిజమైన విశ్వాసి. దేవుడు విశ్వాసి ఆంతర్యంలోని ఆత్మీయత, ఉదాత్తమైన ఆలోచనలను బట్టే అనూహ్యమైన విజయాలు, ఆశీర్వాదాలిస్తాడు, కోట్లాదిమందికి విశ్వాసిని ఆశీర్వాదంగా మార్చుతాడు. – సందేశ్ అలెగ్జాండర్ -
బౌద్ధ వాణి : మీకూ నాకూ అదే తేడా..!
బుద్ధుడిని చూడడం కోసం ఓరోజు అనేక మంది వచ్చారు. ఆ సమయంలో బుద్ధుడు ఓ చెట్టు కింద ఉన్న అరుగుమీద కూర్చుని ఉన్నారు. బుద్ధుడు చేతిలో ఓ పట్టు రుమాలు ఉండటం చూసి అక్కడున్న వారందరికీ ఆశ్చర్యం వేసింది. విలాసాలకూ ఖరీదైన వస్త్రాలకూ ఆమడదూరంలో ఉండే బుద్ధుడి దగ్గర పట్టు రుమాలు ఉండటమేమిటని అందరూ చెవులు కొరుక్కున్నారు. అక్కడ మౌనం ఆవరించిన తర్వాత బుద్ధుడు తన చేతిలో ఉన్న రుమాలుని చూపిస్తూ ఏమిటది అని ఆడిగారు. అందరూ ఒక్క మాటగా అది పట్టు రుమాలు అని చెప్పారు. అనంతరం బుద్ధుడు ఆ రుమాలులో అయిదు ముళ్ళు వేసి చూపిస్తూ ఇప్పుడిదేమిటీ అని అడిగారు. అందరూ ఒక్క మాటగా అది పట్టు రుమాలని చెప్పారు. అప్పుడు బుద్ధుడు ‘అదే మీకూ నాకూ తేడా. ఆ తేడా వల్లే మీరక్కడా నేనిక్కడా ఉన్నాను‘ అంటూ తన మాటలు కొనసాగింంచారు. ‘అయిదు ముళ్ళు ఏంటంటే హింసకు పాల్పడకపోవడం, చైతన్యం కలిగి ఉండటం, అత్యాశకు దూరంగా ఉండటం, ఏం జరిగినా అబద్ధం చెప్పకపోవడం, నిజాయితీతో కూడిన సత్పవ్రర్తన కలిగి ఉండటం‘ అని చెప్పారు. ఈ అయిదూ అనుసరించగలిగితే ఎవరితోనూ ఏ గొడవలూ రావని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ అయిదు పురోగతికీ, మానసిక ప్రశాంతతకూ ఎంతో అవసరం. అందుకోసమే బుద్ధుడు అయిదు ముడులు వేసారు. కానీ ఆ ముళ్ళ విషయం ఆలోచించని వాళ్ళందరూ ఆ రుమాలు పట్టుదనే చెప్పారు తప్ప వాళ్ళెవరికీ బుద్ధుడెందుకు ముళ్ళు వేసారన్నది ఆలోచించలేదు. చదవండి: World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా! -
విషమ సమయంలో ప్రశాంతతను కోల్పోతే ఎలా? కృష్ణ మందహాసం
సరిగ్గా యుద్ధం ఆరంభం కాబోతుండగా, అర్జునుడు అకస్మాత్తుగా అశ్రునయనాలతో ‘నేను ఈ యుద్ధం చేయ లేను!’ అనేశాడు. ఆ మాటకు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు: ‘తం ఉవాచ హృషీకేశః ప్రహసన్ ఇవ.’ సమాధానం విషయం తరవాత. తనకు అత్యంత ఆప్తుడూ, మహావీరుడూ అంతటి విషాదగ్రస్థుడై ఉంటే, అచ్యుతుడికి చిరునవ్వు ఎందుకు వచ్చినట్టు అంటే చాలా కారణాలు కనిపిస్తాయి. సమ్మోహనకరమైన చిరునవ్వు శ్రీకృష్ణుడి సహజ లక్షణం. ఆయన నల్లనివాడూ, నవ్వు రాజిల్లెడి మోమువాడూ కదా! అదొక కారణం.ఎన్నో ఆశలు తన మీద పెట్టుకొని, ఇంత సేన యుద్ధంలోకి దిగ గానే, తమ పక్షంలో అందరికంటె గొప్పవీరుడు ‘నేను యుద్ధం చేయను, పొ’మ్మంటే, సామాన్యుడయితే కోపావేశంలో మునిగి పోయేవాడు. కానీ, విషమ సమయంలో ప్రశాంతతను కోల్పోతే, తల పెట్టిన కార్యం తలకిందులవుతుందని ఆ ఘటనాఘటన సమర్థుడికి బాగా తెలుసు. కనక ఆయన చిరునవ్వు చెదరలేదు.శ్రీకృష్ణుడి చిరునవ్వుకు ముఖ్య కారణం అర్జునుడి ఆవేదన వెనక ఉన్న అజ్ఞానమూ, అమాయకత్వమూ! ‘నేను స్వజనాన్ని చంపితే పాపాన్ని పొందుతాను!’ అన్న అభ్యంతరం ఆధ్యాత్మిక దృష్ట్యా అన్నివిధాలా అవక తవకగా ఉంది. ఆయన ‘నేను, నేను’ అని అహంకరిస్తు న్నాడు, ‘నేను’ అంటే ఎవరో గ్రహించకుండా. ‘స్వజనం, బంధుమిత్రులూ’ అంటూ ‘మమ’కారం చూపుతున్నాడు, ఆత్మస్వరూపుడైన తనకు స్వజనం–పరజనం అన్న పరి మితులు లేవని విస్మరించి! ‘చంపటం’ గురించి వాపోతు న్నాడు, చావు గురించిగానీ, చంపేదెవరూ, సమసేదెవరూ అని గానీ సరైన ఎరుక లేకుండా! ‘పాపం తగులుతుంద’ని బాధపడుతున్నాడు, ఎటువంటి కర్మల వల్ల పాప పుణ్యాలు చుట్టుకొంటాయో, ఎలాంటి కర్మలవల్ల పాప పుణ్యాల బంధనాలను తప్పించుకోవచ్చో మరచిపోయి! మహామహా వీరులు కూడా జగన్మాయకు అతీతులు కాలేరు గదా అన్న స్ఫురణ కలిగి, మాధవుడి ముఖాన ముందొక మందహాసం వెలిగింది. ఆ తరవాత వివరంగా గీతాబోధ చేశాడు.– ఎం. మారుతి శాస్త్రి -
రాముడు విధించిన శిక్ష : శిక్ష తప్పదు!
ఇది రామాయణ ఇతిహాసానికి చెందిన సంఘటన. ఒక రోజు శ్రీరామచంద్రుడు సభలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఓ శునకం సభకు వచ్చింది. దాని తలకు గాయమై రక్తం కారుతోంది. సభలో ఉన్నవారందరూ దాని వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు కూడా దానిని చూశాడు. ‘నువ్విక్కడికి ఏ పని మీద వచ్చావు... ఏం జరిగింది. జరిగిందేదైనా సరే ధైర్యంగా చెప్పుకో. భయ పడకు’ అన్నాడు రాముడు.అప్పుడా శునకం...‘అయ్యా, నేను వీధిలో వెళ్తున్నాను. మార్గ మధ్యంలో వేదశాస్త్రాలు చదువుకున్న ఒక పెద్దాయన ఎదురొచ్చాడు. ఆయన ఏ కారణమూ లేకుండా తన దగ్గరున్న కర్రతో నా తల మీద దెబ్బ వేశాడు. అందువల్ల రక్తం కారుతోంది. ఈ వ్యవహారంలో తగిన తీర్పు ఇవ్వండి’ అంది శునకం. రాముడు వెంటనే తన భటులను పంపించి నిందితుణ్ణి రప్పించాడు. అతడు ‘నేను వీధిలో వస్తుండగా ఈ కుక్క నాకు అడ్డొచ్చింది. అందువల్ల దానిని కొట్టాను. శాస్త్రాలు చదవుకున్నా... నేను హద్దు మీరాను. నాకు మీరు ఏ శిక్ష వేసినా సరే’ అన్నాడు. రాముడు శునకాన్నే అడిగాడు ఏ శిక్ష విధించాలని. అందుకు ఆ శునకం ‘ఆయనను ఏదైనా గుడికి ధర్మకర్తగా నియమించండి. అదే ఆయనకు సరైన శిక్ష’ అన్నది. అది విన్న రాముడు చిరునవ్వు నవ్వాడు. కానీ అక్కడున్న వారికి ఆశ్చర్యమేసింది. ‘అదెలాగూ... తప్పు చేసిన వారికి శిక్ష విధించడమే సముచితం. కానీ అది మానేసి అతనికి ధర్మకర్త హోదా కల్పించమని కోరడమేమిటీ’ అని వారు ఆ శునకాన్నే అడిగారు. దానికి శునకం... ‘నేను క్రితం జన్మలో ఓ ఆలయానికి ధర్మకర్తగా ఉండేదానిని. ఎంతో అప్రమత్తంగానే నా విధులను నిర్వహిస్తూ వచ్చాను. అయినా మానవ సహజమైన కక్కుర్తితో ఆలయ సంపదను తప్పుగా అనుభవించాను. ఫలితంగా మరుజన్మలో కుక్కగా జన్మించి అవస్థలు పడుతున్నాను. ఇవే అవస్థలు ఈ పెద్దమనిషి కూడా పడాలి’ అని పలికింది. హిందువుల్లో తప్పు చేసినవారు ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా శిక్ష అనుభవించాల్సిందే అనే నమ్మకం ఉంది. ప్రజల్లో నైతికత, ధర్మం వర్థిల్లడానికి ఇటువంటి నమ్మకాలు దోహదం చేస్తాయి. సమాజానికి ఈ తరహా నీతి బోధనలు చేయడమే పురాణ కథల లక్ష్యం. – యామిజాల జగదీశ్ -
పద్ధతిగా బతకడం అంటే ఇది..!
ఓ రాజుకు ఒక గురువు తారసపడ్డాడు. రాజ్యం సుఖసంతోషాలతో ఉండాలంటే ఏమి చేయాలని ఆ గురువును అడిగాడు రాజు. ప్రతి గ్రామంలోనూ సత్సంగం జరుపుకోడానికి, ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడానికి తగిన భవన సముదాయాలు కట్టించమన్నాడు గురువు.అలాగేనన్నాడు రాజు. అయితే రాజు మనసులో ఓ అనుమానం మొదలయ్యింది. ‘నిజంగా అలాంటి ఏర్పాట్లు చేస్తే ప్రజల్లో నైతికత, భక్తి భావం నెలకొని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారా?’ అని! ‘సరే, ప్రయత్నించి చూద్దాం, సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం’ అని మందీమార్బలంతో బయలుదేరాడు.తమ రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న చిన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ గుడి దగ్గర ప్రవచనకర్త ప్రవచనాలు చెబుతూ ఉన్నాడు. జనం దండిగా కూర్చుని ప్రవచనాలను ఆసక్తిగా వింటూ ఉన్నారు. కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు రాజు అక్కడే ఉండి ‘‘నాలుగు మంచి మాటలు వినడానికి మీరు చూపిస్తున్న ఆసక్తి ఎంతో సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీకందరికీ నా కానుకగా ఒక్కో వెండినాణెం ఇవ్వదలిచాను. వచ్చి తీసుకోండి’’ అని చెప్పాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆశ్చర్యపోయాడు రాజు. విషయం ఏమిటని ప్రవచనకర్తను అడిగాడు. ‘‘ఇక్కడి వారికి చేయి చాపడం ఇష్టం ఉండదు. ఉచితంగా ఇస్తే ఏదీ తీసుకోరు’’ అని చెప్పాడు ప్రవచనకర్త. ఎందువల్ల వారు ఇలా చేస్తున్నారని అడిగాడు రాజు.‘‘ఏళ్లకొద్దీ ఈ గ్రామంలో సత్సంగం జరుగుతోంది. బతికినంత కాలం పద్ధతిగా బతకాలని అనుకుంటారు. తాము కష్టపడి సంపాదించిన దానితో తృప్తిగా జీవనం సాగిస్తారు’’ అని బదులిచ్చాడు ప్రవచనకర్త. రాజు చిన్నగా అక్కడినుంచి బయలుదేరి నదికి ఆవల ఉన్న మరో గ్రామానికి వెళ్ళాడు. అక్కడ రచ్చబండ దగ్గర చాలామంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాజు వచ్చింది తెలుసుకుని అందరూ గుమికూడారు.‘‘మీ ఊర్లో సత్సంగం జరుగుతోందా?’’ అని అడిగాడు రాజు. అలాంటి పదమే వినలేదని బదులిచ్చారు. మీకందరికీ వెండి నాణేలు పంచాలని ఉందని చెప్పాడు రాజు. అంతే... జనం పరుగులు తీస్తూ వచ్చి, ఎగబడి తీసుకున్నారు. రాజులో ఆలోచనలు మొదలయ్యాయి.‘మొదటి గ్రామంలో ఇచ్చేవాడున్నా తీసుకోలేదు వారు. ఆధ్యాత్మిక భోధనల వల్ల గ్రామస్తులు ఉన్నదానితో తృప్తిగా ఉన్నారు. వారి మనస్సుల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటబడ్డాయి. రెండవ గ్రామంలో... ఎవరైనా ఇస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామస్తులు తీసుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారంటే వారిలో ‘ఇంకా... ఇంకా’ కావాలన్న కోరిక బలంగా ఉంది. ఎందుకంటే ఆ గ్రామస్తుల మనస్సుల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటబడ లేదు’ అని గుర్తించాడు రాజు.‘ఆధ్యాత్మిక బోధనలు చేయించి మంచి చెడ్డలు తెలియజేయాల్సిన బాధ్యత నాది’ అని అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు రాజు. త్వరత్వరగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భవన సముదాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి: దైనందిన జీవితంలో దైవం అంటే..?) -
దైనందిన జీవితంలో దైవం అంటే..?
దైవాన్ని స్తుతించడం, క్రతువులు చేయడం, సంప్రదాయాలు పాటించడం లాంటి పనులే దైవసంబంధమైన పనులు అనుకోవద్దు. ఈ పనులు చేస్తూ ఉంటేనే ఆధ్యాత్మికంగా ఉన్నట్టు అని అనుకోవద్దు. వీటివలన దైవానికి సంతోషం కలుగదు, పైగా దైవంతో ఐక్యం కాలేవు. అసలు దైవమంటే నీకు భిన్నం కానే కాదు. నీ ఆత్మే దైవం. ఆత్మ దర్శనమే దైవదర్శనమంటే. ఆత్మదర్శనం కోసం చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత. అత్మశోధనే ఆధ్యాత్మికత. కానీ సమాజంలో ప్రస్తుతం ఉన్న వందలకొద్దీ మతాలు ఆత్మచైతన్యం వైపు తీసుకెళ్ళడం లేదు.. మనస్సుకు సంబంధించిన విషయాలనే బోధిస్తున్నాయి. మనస్సుకు అతీతమైన ఆత్మచైతన్యాన్ని కనుగొనే దిశగా ప్రోత్సహించడం లేదు. నిజానికి వాటి ఉద్దేశ్యం శాంతి, పవిత్రత, ప్రేమ, కానీ సమాజంలో కనిసిస్తున్నది ద్వేషం, కల్మషం, యుద్ధం. నీవు నిజంగా ఆధ్యాత్మికంగా ఉన్నట్టయితే అది నీలో పరివర్తనను కల్గిస్తుంది. నీలోని ద్వేషం, కల్మషం నశించి ప్రేమ, శాంతి జనిస్తాయి. నీవే దైవమౌతావు, సత్యాన్ని తెలుసుకుంటావు. అంటే ఆధ్యాత్మికత అనేది ఒక ప్రయాణం. దైవత్వం అనేది నీ నిజతత్వం. కానీ ఇప్పుడు దైవమంటే ఒక వ్యక్తి అనే భావనే కనిపిస్తోంది సమాజంలో దైవత్వ నిజమైన భావాన్ని తెలుసుకోకుండా దైవాన్ని కూడా విషయ సంబంధంగా చూస్తున్నారు. విషయాలకు అతీతమైనదే దైవం. మహాశూన్యమే దైవం. ఈ క్షణంలో కాలానికీ, స్థలానికీ అతీతమై ఉన్నదే దైవం. అదే నీ నిజస్థితి. ఆ స్థితిలో ఆలోచనలే లేవు. అత్మసాక్షాత్కార స్థితిలో నమ్మకాలు, ప్రార్థనలు లాంటివి ఏవీ ఉండవు. కేవలం శుద్ధచైతన్యమే ఉంటుంది. నీవు జన్మించిన ఉద్దేశ్యమే నిన్ను నీవు తెలుసుకోవడం, నీ నిజస్థితి ఐన ఆత్మస్థితిలో ఉండడం. నీతినియమాలు, ఆదర్శాలు అనేవి నీ మనస్సు నమ్మకాల నుంచి రావడం కాదు. నీలోని ఆత్మ చైతన్యవంతమైనపుడు నీ ప్రవర్తన సహజంగానే ఆదర్శవంతంగా ఉంటుంది. ప్రేమ, క్షమ, కరుణ వంటి గుణాలు సహజంగానే నీలో ప్రవహిస్తాయి. సంపూర్ణ చైతన్యం నుండి వస్తాయి. అలా కాకుండా యాంత్రికంగా పాటించే నియమాలతో దైవత్వాన్ని చేరలేవు. ఉదాహరణకు దేవాలయం కనిపించగానే అలవాటుగా లెంపలేసుకుని నమస్కరించడంలో దైవత్వం ఉండదు. అక్కడ పనిచేసేది నీ మనస్సు, నీ నమ్మకాలు మాత్రమే. దైవత్వం మనస్సుకు అతీతం. అనుక్షణం ఆత్మ చైతన్యంతో ఉండడమే నిజమైన దైవత్వం. దైవం బయట వెదికే విషయమే కాదు. సమాజంలోని నియమాలతో, నమ్మకాలతో పద్ధతులతో దానికి సంబంధమే లేదు. ఇప్పుడు సమాజంలో కనిపిస్తున్న ఆధ్యాత్మికత అంతా సమాజానికి చూపించుకోవడానికి, నలుగురిలో మంచి అనిపించుకోవడానికి చేసే ప్రయత్నాలు. నిజానికి ఆధ్యాత్మిక ప్రయాణం నీలోనికి నీవుచేసే ప్రయాణం. గర్భగుడిలోనికి ఒక్కరినే అనుమతించడంలోని అంతరార్థం ఇదే. సత్యాన్ని తెలుసుకోవడానికి బయటి వ్యక్తులు, మధ్యవర్తుల ప్రమేయమే అవసరం లేదు. సత్యం ఒకరు చెబితే అర్థమయ్యే విషయం కాదు. నీకు నీవుగానే సత్యాన్ని తెలుసుకోవాలి. నీ నమ్మకాల నుండి, అహం నుండి పూర్తిగా బయటపడాలి. నేను శరీరం మనస్సు కాదు. వీటికి సాక్షిగా ఉన్న దివ్య చైతన్యాన్ని అని తెలుసుకోవాలి. ఆత్మ చైతన్యవంతమవ్వడమే ధ్యానం.– స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక గురువు (చదవండి: దృష్టి.. సృష్టి..! కేవలం చూసే కన్నుని బట్టే..) -
దృష్టి.. సృష్టి..! కేవలం చూసే కన్నుని బట్టే..
భగవంతుడి సృష్టిలో ఏ భేదం లేదు. దేనికి ఏది ఎంత కావాలో అంత చక్కగా అమరి ఉంటుంది. చీమకి తగిన ఆహారం దానికి అందే ఏర్పాటు ఉంది. ఏనుగుకి తగినంత దానికీ అందుతుంది. ఆహారం మాత్రమే కాదు, ఉండటానికి, తిరగటానికి, ఇత్యాదులన్నిటికి లోటు లేదు. కానీ, తెలివితేటలు ఉన్న మనిషి మాత్రం సమానత్వాన్ని చూడ లేకపోవటం జరుగుతోంది. ఎందుకు? అంటే చూసే దృష్టిలో ఉన్న తేడా వల్ల. భేదం దృష్టిలోనే కాని, సృష్టిలో కాదు. దీనికి మనస్తత్వ శాస్త్రంలో ఒక చిన్న ఉదాహరణ చెపుతారు. ఒక పాత్రలో సగానికి నీళ్ళు ఉంటే ఆశావాది పాత్ర సగం నిండింది అంటే, నిరాశావాది పాత్ర సగం కాళీ అయిపోయింది అన్నాడట. ఒకే సత్యాన్ని ఇద్దరూ చెరొక దృష్టి కోణంలోనూ చూశారు. మోడైన చెట్టు కనపడగానే ‘‘అయ్యో! చెట్టు ఎండి΄ోయింది. చచ్చి పోయింది.’’ అని ఒకరు వా΄ోతే,‘‘రాబోయే వసంతాన్ని తనలో ఇముడ్చుకున్న గర్భవతి లాగా ఉన్నది.’’ అన్నాడట మిత్రుడు. ‘‘ఇది మంచి కొయ్య. ఎక్కడా ముడులు, వంకరలు లేవు, సింహద్వారానికి పనికి వస్తుంది దీని కలప’’ అని ముచ్చట పడ్డాడు ఒక వడ్రంగి. ‘‘ఇది మంచి జాతి. అమ్మవారి శిల్పాన్ని చెక్కటానికి తగినది.’’ అని మురిసి΄ోయాడు ఒక దారు శిల్పి. ‘‘కావలసినన్ని కట్టెలు కొట్టుకోవచ్చు’’ అని సంబరపడ్డాడు కట్టెల దుకాణదారు. ఉన్నది ఒక్కటే ఎన్ని రకాలుగా భావించారు ఒక్కొక్కరు? అది దృష్టిలో ఉన్న భేదం. ఉన్నది ఒకటే కదా! ఒకే ఒక పరబ్రహ్మ తత్త్వాన్ని ఎవరికి నచ్చిన విధంగా వారు ఆరాధించుకునే వెసులుబాటు సనాతన ధర్మంలో ఉంది. దానినే ఇష్టదేవతారాధన అని అంటారు. ఒకే రూపంలో, ఒకే నామంతో ఆరాధించాలి అంటే, మిగిలిన రూపాలలో దైవప్రజ్ఞ లేనట్టేనా? మిగిలిన నామాలు దైవాన్ని సూచించవా? సర్వవ్యాపి అన్న మాట సార్థకం ఎట్లా అవుతుంది? నామరూపాతీతమైన భగవంతుణ్ణి ఏరూపంతో నైనా, ఏ నామంతో నైనా ఆరాధించ వచ్చు. శివుడి రూపం నచ్చితే ఆ రూపంలో, ఆ నామంతో, అదేవిధంగా విష్ణువు, జగదంబ, గణపతి, స్కందుడు, సూర్యుడు అనే నామ రూ΄ాలతో ఆరాధించ వచ్చు. అంతే కాదు ఒకే దైవాన్ని భిన్న రూపాలలో కూడా పూజించవచ్చు. ఉదాహరణకి కృష్ణుడు. బాలకృష్ణుడు – అందులో మళ్ళీ పోరాడే కృష్ణుడు, వెన్నముద్ద కృష్ణుడు, గోపాల కృష్ణుడు, గోవర్ధనోద్ధారి, కాళీయమర్దనుడు, మురళీ కష్ణుడు ఇలా ఎన్నో! రాధాకృష్ణుడు, పార్థసారథి .. ఇంతమంది కృష్ణులు ఉన్నారా? ఒకే కృష్ణుడు ఇన్ని విధాలుగా సందర్భాన్ని పురస్కరించుకుని కనపడుతున్నాడన్నది సత్యమా? దృష్టి లోనూ, దర్శనం అనుగ్రహించటం లోనూ ఉన్న తేడా మాత్రమే అని సరిగ్గా గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. సృష్టిలో ఉన్న చైతన్యం అంతా ఒకటే అయినా చూడటానికి రకరకాలుగా కనపడుతుంది పెట్టుకున్న రంగు కళ్ళజోడుని బట్టి. అంతే!ఏ భేదాలు వచ్చినా, కలతలు, కల్లోలాలు పుట్టినా అవన్నీ దృష్టి భేదం వల్ల మాత్రమే. దీనినే వేదాంతులు ‘‘ఏకం సత్, విప్రా బహుధా వదంతి’’ అని భగవంతుడి గురించి ఏక వాక్యంలో చెప్పారు. ఉన్న భగవత్ చైతన్యం ఒక్కటే. వేదవిదులైన పండితులు అనేక విధాలుగా చెపుతారు. సనాతన ధర్మంలో ఎంతోమంది దేవతలని పూజిస్తారు అని మాట్లాడే వారికి ఈ అసలు సంగతి తెలియదు. అదెట్లా? అంటే, ఒక కుటుంబంలో ఒకే పిల్లవాడు ఉంటే, వాడికి ఎవరికి నచ్చిన వేషం వారు వేసి, తయారు చేసి ఫోటోలు తీయించి పెడితే ఇంత మంది పిల్లలు ఉన్నారా? అని అడిగినట్టు ఉంటుంది. – డా.ఎన్. అనంత లక్ష్మి(చదవండి: ఉభయ దేవతా పుణ్యక్షేత్రం సింగరకొండ..!) -
ఏది శాశ్వతం? ఏదశాశ్వతం
ఒక మహారాజు ప్రపంచంలో ఎవరూ కట్టించని అద్భుతమైన భవనాన్ని నిర్మింప జేయాలను కున్నాడు. లెక్కలేనంత ధనాన్ని ఖర్చు చేసి, దేశం నలుమూలల నుంచి గొప్ప గొప్ప శిల్పులను పిలిపించి కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో పనిచేయించి గొప్ప భవనాన్ని నిర్మింపజేశాడు. ఆ భవనం విశాలమైన గదులు, ధగ ధగ మెరుస్తున్న కాంతులతో, బంగారు తాపడాల గోడలతో, మంచి శిల్ప నైపుణ్యంతో దేవేంద్ర వైభవాన్ని తలపిస్తూ ఉంది. ఒక రోజు రాజు గృహ ప్రవేశ కార్యక్రమానికిఘనంగా ఏర్పాటు చేసి, దేశం లోని రాజ ప్రముఖులను, విద్వాంసులను, వ్యాపారవేత్తలను, వాస్తు శాస్త్రజ్ఞులను ఆహ్వానించాడు. గృహ ప్రవేశం అయ్యాక, రాజు సభ ఏర్పాటు చేసి, వారితో... ‘ఈ గొప్ప భవనాన్ని ఎంతో ఖర్చు చేసి కట్టించాను. ప్రపంచంలో ఇంత సర్వాంగ సుందరమైన భవనం ఇంకోటి ఉండకూడదు. అందుకని, మీలో ఎందరో ప్రతిభా వంతులు ఉన్నారు. మీరు ఈ భవనాన్ని సమగ్రంగా పరిశీలించి, ఇందులో లోపాలు, దోషాలు ఏమైనా ఉంటే చెప్పండి. సవరణలు చేయిస్తాను. ఇప్పుడే తెలపండి’ అన్నాడు.రాజు మాటలు విని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్య పోయారు. ఇంత అందమైన కట్టడంలో లోపాలా? అనుకున్నారు. అయినా, రాజు మాట కాదనలేక, వారిలో శిల్పులు, వాస్తు శాస్త్రజ్ఞులు భవనమంతా చూసి ఏ లోపం లేదని నిర్ధరించారు. రాజు చాలా సంతోషించాడు. అంతలో, సభాసదులలో నుంచి ఒక సాధువు లేచి నిల్చున్నాడు. ‘రాజా! ఈ భవనంలో రెండు దోషాలున్నాయి’ అన్నాడు. రాజు వినయంగా అవేమిటో తెలపమన్నాడు. అప్పుడా సాధువు, ‘ఈ భవనాన్ని కట్టించినవారు ఎప్పటికైనా చనిపోతారు. ఇది ఒక దోషం. ఈ భవనం కాలగర్భంలో ఎప్పటికైనా కలిసిపోతుంది. ఇది ఇంకో దోషం’ అన్నాడు. అప్పుడు రాజుకు వివేకం ఉదయించింది. ‘ఈ లోకంలో ప్రతిదీ నశించి పోయేదే. నశ్వరమైన భౌతిక సంపదల కోసం, తక్షణఆనందం కోసం ఇంత ఖర్చు చేసి ఇన్ని సంవత్సరాల సమయం వృథా చేశాను కదా. శాశ్వతమైనది దైవం ఒక్కడే! ఆ దైవం ముందు ఇవన్నీ నశ్వరాలే’ అని తెలుసుకున్నాడు. రాజుతో పాటు అందరం తెలుసుకోవలసింది ఇదే! దైవ అనుగ్రహానికే మనిషి పాటుపడాల్సింది. – డా. చెంగల్వ రామలక్ష్మి -
రమజాన్ ఆశయం ! కేవలం ఉపవాసాలు, నమాజులు కాదు..
రమజాన్ మాసం విశ్వాస కుసుమాలను వికసింపజేసే వరాల వసంతం. దైవ ప్రసన్నత, దైవభీతి పరాయణతల సాధనకు అనుకూలమైన రుతువు. దేవుని కారుణ్య కడలిని.ఆ యన మన్నింపు కెరటాలను ఉప్పొంగజేసే మహోజ్వలమైన మాసం. రమజాన్ ఆరంభం నుండి అంతం వరకు అపార దైవానుగ్రహాలను వర్షింపజేసే శుభాల సీజన్.ఈ శుభ మాసంలో ఉపవాసాలు పాటిస్తూ, తరావీహ్ నమాజులు చేస్తూ, ఖురాన్ పారాయణం చేస్తూ, బీదసాదలకు సహాయం చేస్తూ పూర్తి జీవితాన్ని దేవుని విధేయత పరిధిలో గడిపేవారు ఎంతో అదష్టవంతులు. అయితే కేవలం ఆరాధనలు చేసినంత మాత్రాన మనం రమజాన్ శుభాలను పొందలేం. రమజాన్ శుభాలకు అర్హులు కావాలంటే, అంతరంగాల్లో దైవభీతి దృఢంగా నాటుకోవాలి. దాని ప్రభావం మన దైనందిన జీవితంలోనూ కనిపించాలి. అంటే, అన్ని విధాల చెడులను వదలిపెట్టి పరిశుద్ధమైన జీవితం గడపాలి. ‘ఎవరైనా ఉపవాసం ఉండి కూడా అబద్ధాలు చెప్పడం, వాటిని అమలు చేయడం వదలుకోకపోతే ఆ వ్యక్తి అన్నపానీయాల్ని వదలిపెట్టడం పట్ల దేవునికి ఎలాంటి ఆసక్తి ఉండదు‘ అని ప్రవక్త(సల్లం) ప్రవచించారు.ఉపవాసాలు పాటిస్తూ, నమాజులు చేస్తూ కూడా అబద్ధం చెప్పడం, అబద్ధాన్ని ఆచరించడం మానుకోని వ్యక్తి కష్టపడినా ఫలితం దక్కని రైతులాంటివాడు. ఆ రైతు తీవ్రమైన ఎండలో చెమటలు చిందిస్తూ నాగలితో పొలం దున్ని విత్తనాలు చల్లుతాడు. అవి మొలకెత్తిన తర్వాత పెరగటానికి కావలసిన సదుపాయాలన్నీ కలగజేస్తాడు. రాత్రిళ్ళు మేల్కొని పొలానికి కాపలా కూడా కాస్తాడు. కానీ పంట పండి కొన్ని రోజుల్లో చేతికి వస్తుందనగా దాన్ని వదిలేస్తాడు. దాంతో ఆ పొలం ఒక వైపు కలుపు మొక్కలు, చీడ పురుగులతో, మరోవైపు పక్షులు, పశువులు అడపాదడపా మేయడంతో పంట చేతికి రాకముందే పూర్తిగా నాశనం అవుతుంది. ఈ విషయాన్నే దైవప్రవక్త(సల్లం) ఇలా తెలిపారు:‘ఎందరో ఉపవాసం పాటించే వారికి తమ ఉపవాసాల ద్వారా ఆకలిదప్పులు తప్ప మరేమీ లభించదు. అలాగే ఎందరో తరావీహ్ నమాజ్ చేసే వారికి తమ తరావీహ్ నమాజ్ ద్వారా జాగరణ తప్ప మరేమీ ప్రాప్తం కాదు.‘దైవభీతి పరాయణత మస్జీద్ లోనే కాదు, మస్జిద్ వెలుపల బజారుల్లో, ఇండ్లల్లో, దుకాణాల్లో, కార్యాలయాల్లో, కార్ఖానాల్లో కూడా కనిపించాలి. ఏదైనా వ్యవహారంలో తప్పు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడనే భావన కలగాలి. మనిషిని చెడులకు దూరంగా ఉంచగలిగేది కేవలం దైవభయమే. హృదయంలో చెడు పట్ల వెగటు, మంచి పట్ల అభిమానం జనించాలి. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, బయటి ఒత్తిళ్ళకు లొంగకుండా కేవలం దైవ ప్రసన్నత కోసం చెడులను మాని మంచిని అవలంబించాలన్న కోరిక కలగాలి. అధర్మ విషయాలను పూర్తిగా వదిలేసి దైవధర్మం మోపిన బాధ్యతలను తు.చ తప్పకుండా నిర్వహిస్తూ ఉండాలి. ఈ విధేయతా భావం రమజాన్ నెల గడిచిపోగానే అంతరించకుండా సంవత్సరంలోని మిగిలిన పదకొండు నెలలు కూడా సజీవంగా ఉండేలా రమజాను ఉపవాసాలు శాశ్వత శిక్షణ ఇస్తాయి. హృదయంలో దైవభీతి పరాయణత, జీవిత వ్యవహారాలపై దాని ప్రభావం తాత్కాలికంగా కాకుండా జీవితాంతం ఉండినప్పుడే రమజాన్ అసలైన ఆశయం నెరవేరుతుంది.– తహ్సీన్ హుమైర్వీ -
ప్రతి పురుషుని విజయం వెనుక ఓ స్త్రీ శక్తి..!
మన పురాణాలలో స్త్రీని శక్తి స్వరూపిణిగా వర్ణిస్తారు. ఒక స్త్రీ శక్తి స్వరూపిణిగా ఉంటూ చుట్టూ అందరి చేత గౌరవింప బడితే అక్కడ దేవతలు నివసిస్తారు అంటారు. అయితే ఆమె శక్తి ఏమిటి? ఆ శక్తికి ఏమైనా కొలమానం ఉందా? అది ఏ విధమైన శక్తి? ఎలా పని చేస్తుంది? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ మాతాజీ నిర్మలా దేవి బోధనలలో మనకు సరైన సమాధానం లభిస్తుంది.మన ఇతిహాసాలలో శ్రీ రాముని శక్తి సీత. శివుని శక్తి పార్వతి. శ్రీ కృష్ణుడి శక్తి రాధ. ఈ శక్తులు రాక్షస సంహారం కోసం కానీ యుద్ధం చేయడానికి కానీ రణరంగానికి వెళ్ళలేదు. శ్రీ కృష్ణుడు లేదా శ్రీ రాముడే యుద్ధం చేశారు. కానీ వారి శక్తి ప్రభావం వారి చేత యుద్ధం చేయించింది. దీని గురించి మాతాజీ నిర్మలా దేవి ఎలా వివరిస్తారు అంటే పురుషులది గతి శక్తి... స్త్రీలది స్థితి శక్తి. ఉదాహరణకు స్విచ్ వేసినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. మనకు బయటకు చూడడానికి ఫ్యాన్ తిరుగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ నిజానికి దానిని తిప్పుతున్నది దాని లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తి. అదే విధంగా పురుషులు బయటకు పనులు చేస్తున్నట్లు కనిపించినా వారి చేత ఆ పనులు చేయించే శక్తి మాత్రం స్త్రీల శక్తియే. అందుకే స్త్రీని శక్తి స్వరూపిణి అంటారు.ఆసక్తికరమైన విషయమేమిటంటే జీవశాస్త్రం ప్రకారం కణంలో ఉండే శక్తి కేంద్రాన్ని మైటోకాండ్రియా అంటారు. ఈ మైటోకాండ్రియా మానవులలో ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించేటప్పుడు తల్లి నుండే లభిస్తుంది. అంటే ప్రతీ మానవునికి శక్తి తల్లి నుండే లభిస్తుంది. కావున సైన్సు ప్రకారం కూడా శక్తికి మూలం స్త్రీ యే. ఈ తల్లులందరికీ మూలమైన తల్లిని హిందూ ధర్మంలో ఆదిశక్తి అని పిలుస్తారు. ఆమెనే గ్రీకులు అథెనా అనే దేవతగా కొలుస్తారు.శక్తి అంటే మొత్తం అన్ని శక్తులు అని, ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి అని కాదు. ఈ శక్తులన్నీ మన సూక్ష్మ శరీరంలో షట్చక్రాలన్నింటిపై ఉంటాయి. ఈ శక్తులు లేకుండా దేవతల ఏ పనీ జరగదు. ఉదాహరణకు శ్రీ కృష్ణుడి శక్తి శ్రీ రాధ, శ్రీ రాముడి శక్తి శ్రీ సీత; శ్రీ మహా విష్ణువు శక్తి శ్రీ లక్ష్మి. అదేవిధంగా శక్తులన్నింటి నివాసం దేవతలతో ఉంటుంది. శక్తి లేకుండా దేవతలు ఏమీ చేయలేరు. ఆ మొత్తం శక్తి అంతా శ్రీ జగదాంబగా మన మధ్య హృదయ చక్రంలో ఉంటుంది. ఈ జగదాంబ శక్తి చాలా ప్రబలమైనది. శక్తి ఆరాధన అంటే అందరు దేవతల అన్ని శక్తులకు పూజ జరుగుతుంది. ఈ శక్తులు చెడి΄ోవడం వలన మన చక్రాలు దెబ్బతింటాయి. అందువల్ల మనకు శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన సమస్యలన్నీ వస్తాయి. అందుకే ఈ శక్తులను ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంచుకోవడం ముఖ్యం. అందుకే దేవిని ప్రసన్నం చేసుకోవాలని అంటుంటారు. సహజ యోగ సాధన ద్వారా మన సూక్ష్మ శరీరంలో కుండలినీ శక్తి ని మేల్కొలపడం వలన ఈ శక్తి మరొక శక్తిని పొందుతుంది. ఈ శక్తులలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అవి ఆది శక్తి యొక్క సర్వవ్యాప్త శక్తి అయిన పరమ చైతన్యంతో ఏకమవుతాయి. ఆ విధంగా ఏకమవ్వడం వలన ఆ శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. ఈ చిన్న చిన్న శక్తులన్నీ ఆ శక్తితో కలిసిపోతాయి. ఉదాహరణకు, మీ హృదయ శక్తి బలహీనంగా ఉంటే, అది పరమ చైతన్యంతో అనుసంధానించబడినప్పుడు, ఈ బలహీనమైన శక్తి తిరిగి బలాన్ని పొందుతుంది. ఆ సందేశం అన్ని శక్తులకు చేరుతుంది, ఇప్పుడు ఈ శక్తి బలాన్ని పొందింది కాబట్టి చింతించాల్సిన పనిలేదు అని. శక్తి స్వభావం స్త్రీ స్వభావం కాబట్టి స్త్రీని గౌరవించడం, గృహిణిని గృహలక్ష్మిగా చూడడమనేది పురుషులు నేర్చుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం.స్త్రీలు తమ భర్తను, పిల్లలను గృహ సంబంధ కార్యాలను చూసుకోవాలి. కానీ భర్తకు బయటి కార్యాలకు సంబంధించి, సంపాదన, ఆర్థిక వ్యవహారాలు లాంటి అనేక పనులు ఉంటాయి కాబట్టి. అదే విధంగా పురుషులు కూడా భార్యను బాగా చూసుకోవడం చాలా ముఖ్యం. భార్యను ఒక దేవిలా, తన గృహశక్తిలా చూడడం భర్త బాధ్యత. భార్యతో అతని అనుబంధం ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే ఆ గృహం స్వర్గసీమ అవుతుంది.– డా. పి. రాకేష్(పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవిప్రవచనాల ఆధారంగా) -
గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!
అందరూ మహిళలే జరుపుకొనే వేడుక ఇది. అత్యధిక సంఖ్యలో మహిళలు ఒకేచోట చేరి జరుపుకొనే కార్యక్రమంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన అరుదైన వేడుక ఇది. ఈ వేడుకలో పాల్గొనడానికి పురుషులకు అనుమతి ఉండదు. తరతరాలుగా సాగుతున్న ఈ వేడుక కేరళ రాజధాని తిరువనంతపురం చేరువలోని అట్టుకల్ గ్రామంలో వెలసిన భగవతి అమ్మవారి ఆలయంలో జరుగుతుంది. ఏటా పదకొండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు.తిరువనంతపురం జిల్లా అట్టుకల్ గ్రామంలోని భగవతి అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. అట్టుకల్ గ్రామంలో వెలసినందున ఈ అమ్మవారు ‘అట్టుకల్ భగవతి’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు ఈ ఆలయంలో అట్టుకల్ భగవతి అమ్మవారి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల తొమ్మిదో రోజున లక్షలాది మంది మహిళలు ఇక్కడకు చేరుకుని, అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ‘అట్టుకల్ పొంగల్’ వేడుకగా పిలుస్తారు. తొమ్మిదో రోజున తిరువనంతపురం నగరంలోని అన్ని రహదారులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లే మహిళలతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి కేరళ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మలయాళీ మహిళలు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు.ఇక్కడకు వచ్చే మహిళలు ఆలయ ప్రాంగణంలోను, ఆలయ పరిసరాల్లోని వీథుల్లోను ఇటుకలతో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని, వాటి మీద పొంగలి, చక్కెరపొంగలి వండుతారు. ఆలయ ప్రధాన అర్చకుడు నిర్ణయించిన ముహూర్తానికి అందరూ ఒకేసారి పొయ్యిలు వెలిగించి వంట మొదలుపెడతారు. ముహూర్త సమయం ఆసన్నం కాగానే, అర్చకుడు గంట మోగిస్తాడు. అయితే, మహిళలు పొంగలి వండుతున్న ప్రదేశంలోకి ఆలయ అర్చకులు కూడా అడుగు పెట్టరు. ఈ వేడుకలో భాగంగా మహిళలందరూ తిరువనంతపురంలోని మనకాడు ప్రాంతంలో ఉండే శ్రీధర్మ శాస్త ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. మొదటి రోజున ‘కప్పుకెట్టు’ కార్యక్రమంతో ఈ వేడుక మొదలవుతుంది. ఇందులో భాగంగా ‘కణ్ణగి చరిత’ను గానం చేస్తారు. ‘కణ్ణగి చరిత’గానం వరుసగా తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున ‘కురుత్తి తర్పణం’ పేరుతో తర్పణాలు విడిచిపెట్టడంతో ఈ వేడుకలు ముగుస్తాయి. వేడుక కొనసాగినన్ని రోజులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి చేరుకునే వీథులన్నీ రంగురంగుల అలంకరణలతో కనువిందు చేస్తాయి. ఈ వేడుకల సందర్భంగా వీథుల్లో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంప్రదాయ నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్టుకల్ పొంగల్ వేడుకలలో 1997 సంవత్సరంలో 15 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొనడంతో తొలిసారి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో నమోదైంది. ఆ తర్వాత 2009లో 25 లక్షలకు పైగా మహిళలు పాల్గొనడంతో మరోసారి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. ఈ వేడుక ప్రశాంతంగా జరగడానికి వీలుగా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తుంది.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!) -
కొమురయ్య.. దీవెనలివ్వాలయ్యా..
రామగుండం: ఆరు దశాబ్దాల క్రితం నాటి మాట ఇది.. గోపు వంశీయుడొకరు భవిష్యవాణి చెప్పేవారు. తన మరణాన్ని కూడా ముందుగానే ప్రకటించి కన్ను మూశారు. ఆ రోజు నుంచి ఆయనను దైవంగా గో పు వంశీయులు కొలుస్తూ జాతరను నిర్వహిస్తు న్నారు. గోపు వంశీయులు భక్తి ప్రపత్తులతో కొలిచే ఆ దైవం పేరు గోపు కొమురయ్య. 65 ఏళ్లుగా జాతరపెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామానికి చెందిన గోపు కొమురయ్య మరణానంతరం.. ఆయన పేరిట 65 ఏళ్లుగా (మల్లికార్జున కల్యాణం) గోపు వంశీయులు జాతరను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భవిష్యవాణితోనే బహుళ ప్రాచుర్యంఆరు దశాబ్దాల క్రితం గోపు కొమురయ్య బతికుండగానే భవిష్యవాణి చెప్పారని ఆయన భక్తులు విశ్వసిస్తారు. సమాజంలో జరిగే శుభాలు, దుష్పరిణామాలు ముందుగా గ్రహించేవారని.. పూనకం వచ్చిన సమయంలో.. తన వద్దకు వచ్చే వారికి భవిష్యవాణిని వినిపించేవారంటారు. తన మరణ తేదీని ముందుగా ప్రకటించారని.. తన పేరుతో జాతర నిర్వహించాలని ప్రకటించిన సమయానికే శివైక్యం పొందారని భక్తుల కథనం. దీంతో కొమురయ్య సమాధిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. యాదవ కులబాంధవులు ఆయనను ప్రత్యక్ష దైవంగా కొలుచుకుంటున్నారు. కొమురయ్య సమాధికి గది నిర్మించి ఆలయంగా పూజిస్తున్నారు. దశాబ్దాల తరబడి.. రోజూ ఉదయం క్రమం తప్పకుండా సమాధి వద్ద గోపు వంశీయులు దీపారాధన చేస్తున్నారు. సమాధి వద్ద గోపు వంశీయులు శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం పేరిట జాతర నిర్వహిస్తుండడం ఆనవాయితీ. పొరుగు జిల్లాల నుంచి సైతం అధిక సంఖ్యలో యాదవ కులస్తులు రావడం జాతర ప్రత్యేకత. ఈ క్రమంలో ప్రతీ హోలీ పండుగకు ముందు ఫాల్గుణ మాసం ఆది, సోమవారాల్లో జాతర నిర్వహిస్తుంటారు.జాతరకు సకల ఏర్పాట్లుఅంతర్గాం మండలం ముర్మూర్ శివారులోని ఆయ న సమాధి (ఆలయం) వద్ద ఈనెల 9 నుంచి కార్య నిర్వాహక ప్రతినిధి గోపు అయిలయ్య యాదవ్ నేతృత్వంలో జాతర నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే తొలిరోజు దృష్టి కుంభం, మైల లు తీయడం, రుద్రాభిషేకం, బియ్యం, సుంకు పెద్ద పట్నంతో పాటు ఉదయం 11.45 గంటలకు శ్రీమల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. 10వ తేదీ వేకువజామున 4 గంటలకు అగ్నిగుండ ప్రవేశం అనంతరం ఇప్పలపల్లి భరత్ స్వామి జంగమ మహేశ్వరులచే కొమురన్న జీవిత చరిత్రపై ఒగ్గు కథ ప్రదర్శించనున్నారు. ఈసారి తొలిసారిగా ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించనుండగా, ముగ్గురికి భారీగా ప్రోత్సాహక బహుమ తులు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొ న్నారు. రెండు రోజుల పాటు జాతరకు వచ్చే భక్తుల కు అన్నదానం చేస్తారు.కొమురయ్య ఉన్నట్టే భావిస్తాంగోపు కొమురయ్య జ్ఞాపకార్థం నిర్వహించే జాతరకు ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. 65 ఏళ్లుగా మా వంశీయులు నిష్టతో దీపారాధన చేస్తున్నారు. ఆయన మా మధ్య లేకపోయినా.. జీవించి ఉన్నట్లుగానే భావిస్తున్నాం. – గోపు అయిలయ్యయాదవ్, జాతర కార్యనిర్వాహక ప్రతినిధి -
శివతత్త్వాన్ని పొందాలంటే...!
మన హృదయంలో ఉండేది శ్రీ మహాదేవుని ప్రతిబింబం. ఇది శ్రీ శివుని నివాసం. ఇది అన్నింటినీ మించినది. మన మనస్సుకు, ఆలోచనలకు అన్నింటికీ అతీతమైనది. ఈ శివ తత్త్వాన్ని పొందాలంటే, ముందుగా మనం శ్రద్ధ వహించి మన హృదయం ఎంత స్వచ్ఛంగా ఉందో మన లోపలికి మనం చూసుకోవాలి. మన హృదయం లోపల, మనం చాలా మురికిని పెంచుకుంటాము. ఉదాహరణకు, మనం ఎవరినైనా చూసి అసూయపడతాం. ఎవరో మనకు చెడు చేసినట్టు అసూయ పడుతుంటాము. వారు మనకు నిజంగా హాని చేసినా కూడా, ఇబ్బంది కలిగించినా కూడా వారి పట్ల అసూయపడి ప్రయోజనం లేదు. మన హృదయం శుభ్రంగా ఉంటే, మన హృదయమనే అద్దంలో గల సర్వ శక్తిమంతుడైన భగవంతుని ప్రతిబింబం స్పష్టంగా ఉంటుంది. కానీ మనం మన లోపల అసూయను కలిగి ఉంటే, అప్పుడు ఆ అద్దం శుభ్రంగా ఉండదు. అందులో భగవంతుని ప్రతిబింబం కూడా పరిపూర్ణంగా ఉండదు. ఎవరితోనైనా శత్రుత్వం కలిగి ఉండటం, ఎవరి పట్లనైనా హృదయంలో కోపం లేదా చెడు భావాలను కలిగి ఉండటం చాలా తప్పు. దాని వలన శ్రీ శివతత్త్వాన్ని కలిగి ఉండలేము. అందుకే మనం అందరినీ ప్రేమించడం, క్షమించడం చాలా ముఖ్యం. మనం రోజూ శివునికి పూజలు, అభిషేకాదులు చేస్తూ మన లోపల గల అరిషడ్వర్గాలను విడిచి పెట్టలేకపోతే శ్రీ శివతత్త్వాన్ని పొందలేం. శ్రీ శివతత్త్వాన్ని పొందాలంటే మన హృదయం నిర్మలంగా ఉండాలి. ఎటువంటి అలజడులు లేని స్వచ్ఛమైన నీటిని కలిగి ఉన్న సరస్సు మాత్రమే ఆకాశంలో ఉన్న సూర్యుని చక్కగా ప్రతిబింబించ గలుగుతుంది. అదే విధంగా మన హృదయం కూడా ఎటువంటి ఆలోచనలు లేని నిర్విచార స్థితిలో, ఇతరుల పట్ల ఏ విధమైన ద్వేషం, కోపం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని నిజమైన స్వరూపాన్ని ప్రతిబింబించ గలుగుతాము. అనగా శ్రీ శివ తత్త్వాన్ని పొందగలుగుతాం.శ్రీ శివుని సచ్చిదానంద స్వరూపుడు అని వర్ణిస్తారు. అనగా సత్ + చిత్ + ఆనంద స్వరూపుడు. సత్యము, చిత్తము మరియు ఆనందమును స్వరూపముగా కలిగిన వాడు శ్రీ శివుడు. ఏ విషయం గురించైనా సత్యము ఏమిటి అనేది మనకు సహస్రారములో ఉండే శ్రీ సదాశివుని పాదాల వద్దనే తెలుస్తుంది. మన చిత్తం ఆత్మ ప్రకాశంతో నిండినప్పుడే మనకు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. నిరంతరం నిర్మలమైన ఆనందంతో ఉండే వ్యక్తే భగవంతుని పరిపూర్ణంగా ప్రతిబింబించ గలుగుతాడు. ఈ సచ్చిదానంద స్వరూపమయిన శ్రీ శివ తత్త్వాన్ని పొందగలిగిన వారి జన్మ ధన్యం.మన లోపల ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు మన హృదయంలో ఉండే శ్రీ శివుని ప్రకాశానికి అడ్డు పొరలుగా ఏర్పడతాయి. మనం సహజ యోగంలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు ఈ ఆత్మ ఉనికిని మన చేతి వేళ్ళపై అనుభూతి చెందడం ప్రారంభిస్తాం. అప్పుడు ఆత్మ పరిశీలన ద్వారా ఈ అరిషడ్వర్గాలను క్రమంగా తొలగించుకొన్నప్పుడు, పరిపూర్ణంగా ఆత్మ స్వరూపులమయ్యి భగవంతుని ప్రతిబింబాన్ని స్పష్టంగా మన హృదయంలో ప్రతిబింబించ గలుగుతాం. అటువంటి వ్యక్తులలో దైవికమైన సుగుణాలన్నీ స్పష్టంగా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తులు నిత్య నిరామయమైన శ్రీ శివ తత్త్వాన్ని పొంది, సదా శివసాన్నిధ్యంలో ఉంటారు.– డా. పి. రాకేష్(పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
గృహ సామ్రాజ్యానికి మహారాణి..!
ఒక ఉత్తమ సమాజ స్థాపనకు వెన్నెముక కుటుంబం కనుక పురుషుడు బయటి సామ్రాజ్యానికి అధిపతి అయితే స్త్రీని ఆ గృహ సామ్రాజ్యానికి మహారాణిగా చేసింది ఇస్లాం. పిల్లల ఆలన భర్త పాలన చేస్తూ, ఎలాంటి ఆర్థిక బాధ్యతలు లేకుండా స్త్రీని మినహాయించింది. ఏ విషయంలోనూ ఆడపిల్లను తక్కువగా చూడరాదని, మగపిల్ల వాడిని అధికుడిగా చూడరాదనీ, ఇద్దరిపట్ల సమానమైన ప్రేమను చూపించాలనీ, భ్రూణ హత్యలను నిషేధిస్తూ ఆడపిల్లను అన్యాయంగా హతమార్చితే కఠిన శిక్షకు గురవుతారని హెచ్చరించింది. తల్లి పాదాల చెంత స్వర్గం ఉందని ప్రకటించి స్త్రీ జాతి ఔన్నత్యాన్ని పతాక స్థాయికి చేర్చిన ఘనత ఇస్లాం ధర్మానికే దక్కుతుంది.1400 సంవత్సరాలకు పూర్వమే స్త్రీలకు ఓటు హక్కును కల్పించి, తన తండ్రి, భర్త, పిల్లల ఆస్తిలో వాటాను కల్పిస్తూ, ఆమెకు ఆస్తిహక్కును ప్రకటించింది. వివాహ విషయంలో తనకిష్టమైన వరుడిని ఎంపిక చేసుకునే విషయమై ఆమె సమ్మతి తీసుకోవాలనీ, దుర్మార్గుడైన భర్త నుండి ‘ఖులా‘ అనే ప్రక్రియ ద్వారా విడిపోయి తనకు తానుగా జీవించే హక్కును కలిగి ఉండడమే కాక పునర్వివాహం చేసుకునే హక్కునూ ప్రసాదించింది. కనుకనే తనకన్నా వయసులో 15 ఏళ్ల పెద్దదైన హజరత్ ఖదీజా అనే వితంతువును పాతికేళ్ల నిండు యవ్వనంలో వివాహమాడి స్త్రీ జాతి కీర్తిని సమున్నత స్థాయికి చేర్చారు ప్రవక్త ముహమ్మద్ (సం). స్త్రీ సహ ధర్మచారిణి అంటూ మీరు తిన్నదే ఆమెకు తినిపించండని సమాజానికి హితవు పలికారు. విద్యనభ్యసించడం స్త్రీ పురుషుల విధి అని విద్యనభ్యసించడాన్ని ప్రోత్సహించడమే కాక, సమాజానికి స్ఫూర్తిదాయకమైన స్త్రీ మూర్తులను అందించింది ఇస్లాం. ఇస్లామీయ చరిత్ర లో హజరత్ ఆయిషా (ర) ప్రముఖ విద్వాంసురాలిగా, హజరత్ షిఫా(ర) ప్రముఖ గైనకాలజిస్టు గా, హజరత్ ఖదీజా(ర )అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారవేత్తగా సమాజానికి అమూల్యమైన సేవలందించారు. ప్రముఖ మేధావి ఫాతిమా అల్ ఫహ్రీ మురాకోలో స్థాపించిన ‘అల్ ఖరావీన్’ యూనివర్సిటీ ప్రపంచంలోనే అతి పురాతన విశ్వవిద్యాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదయ్యింది. హదీసు విద్యావేత్తలలో మహిళా ఉపాధ్యాయులుగా పేరుగాంచి ఇస్లామీయ చరిత్రకు వన్నెతెచ్చిన వనితలు కోకొల్లలు. మహిళలు తమ కార్య పరిధిలో ఉంటూనే మౌలికమైన బాధ్యతలతో పాటు సమాజంతో చక్కటి బాంధవ్యాన్ని ఏర్పరచుకోగలరనే స్ఫూర్తినిచ్చింది ఇస్లాం ధర్మం..– బతూల్ హుమైర్వీ(చదవండి: -
ఆ పరీక్షే నాకు ఆనందాన్నిస్తోంది..!
ప్రవచనాలు చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే పాఠశాలలో లేదా కళాశాలలో ఏమీ తెలియని వారికి, చిన్న వాళ్లకీ పాఠాలు బోధించడం చాలా సులువు. కానీ అన్నీ తెలిసిన వారికి, పెద్దవారికి ప్రవచనాలు చెప్పడం అంటే కత్తిమీద సామే. అది మహిళా ప్రవచనకారులకు మరీ పరీక్ష. అయినా సరే, ఆ పరీక్షే తనకు ఆనందాన్నిస్తోందంటున్నారు దుర్భాకుల హేమ... అది ఆమె మాటల్లోనే...ప్రవచనాలు చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే పాఠశాలలో లేదా కళాశాలలో ఏమీ తెలియని వారికి, చిన్న వాళ్లకీ పాఠాలు బోధించడం చాలా సులువు. కానీ అన్నీ తెలిసిన వారికి, పెద్దవారికి ప్రవచనాలు చెప్పడం అంటే కత్తిమీద సామే. అది మహిళా ప్రవచనకారులకు మరీ పరీక్ష. అయినా సరే, ఆ పరీక్షే తనకు ఆనందాన్నిస్తోందంటున్నారు దుర్భాకుల హేమ... అది ఆమె మాటల్లోనే...నా పూర్వజన్మ సుకృతంప్రతిసారీ ప్రవచనం చెప్పడం నాకొక గొప్ప పరీక్ష. ఆ పరీక్షే నాకు చాలా అనందాన్నిచ్చేది. విస్తృతంగా గ్రంథ పఠనం చేయడం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, ఆవళింపు చేసుకున్న విషయాన్ని సభాముఖంగా సుస్పష్టంగా వివరిస్తూ శ్రోతలకు ఆనందం కలిగించడం ప్రవచనకారిణిగా నా ప్రథమ కర్తవ్యంగా భావించాను. ఎంతోమంది ప్రఖ్యాత ప్రవచనకారుల ఉపన్యాస వైదుద్యాన్ని తెలుసుకోవడం కోసం వీలున్నప్పుడల్లా వారి ఉపన్యాసాలు వినేదాన్ని. ఇంకొక విషయం, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు లభించిన ప్రవచన వేదికలన్నీ చాలా శక్తివంతమైనవి. ఎన్నో దేవాలయ ప్రాంగణాలు, ఎన్నో ధార్మిక సంస్థల వారి వేదికలు, మరెన్నో ప్రాచుర్యం వహించిన ఆధ్యాత్మిక స్థలాలు నాకు చేయూతనిచ్చాయి. కాలం మారింది. నేడు ఎందరో యువతీయువకులు ఆధ్యాత్మిక రంగం పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. నా ప్రవచనం పూర్తయ్యాక నా దగ్గరకు వచ్చి ‘‘అమ్మా! మీరు చెబుతున్న విషయాలు బాగున్నాయి. ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఏ ఏ పుస్తకాలు చదవాలి ? ఏ ఏ గ్రంథాలయాలలో పుస్తకాలు కోసం వెదకాలి. అని అడుగుతుంటే మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. నాకు సాధ్యమైనంతవరకు వారికి తగిన మార్గాన్ని సూచిస్తుంటాను. – డాక్టర్ దుర్భాకుల హేమ -
అభయమిచ్చే వీర హనుమానుడు..!
ఆసియా ఖండంలో అతి ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహం 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన కొలువై ఉంది. ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆంజినీపుత్రుడిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల 65వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి నడుమ అభయాంజనేయ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామి వారిని విశాలమైన ్ర΄ాంగణంలో జాతీయ రహదారి పక్కన 2003వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. వర్షాకాల నేపథ్యంలో చుట్టూ పచ్చని పొలాల మధ్య అభయమిచ్చే వాయుపుత్రుని చూసేందుకు నిత్యం భక్తులు వచ్చి వెళ్లుతుంటారు. జాతీయ రహదారి పక్కన పరిటాల సమీపంలో ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ధర్మకర్త బోడేపూడి వెంకటేశ్వరరావు 28 ఏప్రిల్ 2001లో శంకుస్థాపన చేశారు. నాలుగున్నర ఎకరాల్లో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంజినీ పుత్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఆలయ ్ర΄ాంగణంలో ప్రతిరోజు హనుమాన్‌చాలీసా పారాయణం చేశారు. విగ్రహం ఏర్పాటు చేసే నాటికి 1.35 లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది.అతి ఎత్తయిన విగ్రహం...ఆసియా ఖండంలో అతి ఎత్తయిన ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం పరిటాల గ్రామ సమీపంలో పాదపీఠంతో కలుపుకుని 150 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన విజయవాడకు 28 కిలోమీటర్ల దూరంలో ఈ విగ్రహం వుంది. ప్రతి ఏటా నిత్యం ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతుండేది. ఆలయంలో ఒకపక్క స్వామి వారికి భక్తిపారవశ్యంతో భజన కీర్తనలు, మరో పక్క హనుమాన్ చాలీసా, ఇంకోపక్క అన్నసమారాధనతో ఆలయ ప్రాంగణం భక్తులతో విరాజిల్లుతుంటుంది.పర్యాటక కేంద్రంగా పరిటాల ఆలయం...కంచికచర్ల మండలంలోని పరిటాల జాతీయ రహదారి పక్కన కొలువై ఉన్న ఆంజనేయస్వామి ఆలయం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. అభయాంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేసేందుకు భక్తులు బస్సులు, కార్లు ఇతర వాహనాల ద్వారా వస్తుంటారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి నిత్యం వందల సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటారు.హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి విశేష పూజలు చేస్తుంటారు. ఆలయ ధర్మకర్త వెంకటేశ్వరరావు భారీగా అన్న సమారాధన చేస్తుంటారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో బాలాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో రామాలయం, క్షేత్ర ΄ాలకురాలయిన రేణుకాంబ అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి. ఆలయంలో నిత్యం హనుమాన్ చాలీసా మహాన్యాస పూర్వక నీరాజన, అష్టోత్తర పూజలు జరుగుతుంటాయి. నిత్యం భక్తులచే ప్రత్యేక పూజలందుకుంటున్న అభయాంజనేయ స్వామిని ప్రజలు చూసి తరించాల్సిందే.– శ్రీనివాస శర్మ, ప్రధాన అర్చకులు, పరిటాల – బొక్కా ప్రభాకర్, సాక్షి, కంచకచర్ల (ఎన్టీఆర్ జిల్లా)(చదవండి: మహిమాన్విత క్షేత్రం.. ఓంకారం! ఏకంగా 13 రకాల వంటకాలతో..) -
సహనం విలువ
బయాజిద్ బిస్తామి ఓ సూఫీ. ఆయనను ‘జ్ఞానవాదుల రాజు‘ అని పిలిచేవారు. ఒకరోజు ఎక్కువసేపు మసీదులో గడిపి ఇంటికి బయలు దేరారు. మార్గమధ్యంలో ఓ తాగుబోతు ఎదురు పడ్డాడు. అతని చేతిలో ఓ సంగీత వాద్యం ఉంది. నోటికొచ్చి నట్టల్లా ఏదో పాడుకుంటూ వస్తు న్నాడు. ఆ దారిన వచ్చిపోతున్న వారిని తిడు తున్నాడు. అదే దారిలో బిస్తామీ వెళుతూ అతని స్థితిని చూసి బాధపడ్డారు. అతని దగ్గరకు వెళ్ళి ‘ఎందుకిలా ఉన్నావు?’ అని జాలిగా అడిగారు. బయటకు వచ్చిన ప్పుడు ఎలా ఉండాలో నాలుగు మంచి మాటలు చెప్పసాగారు. అయితే తాగుబోతుకి కోపం వచ్చింది. అతను తన చేతిలో ఉన్న సంగీత వాద్యంతో బిస్తామీ తల మీద కొట్టాడు. ఆయన తలకు గాయమైంది. రక్తం కారింది. అంతేకాదు, తాగుబోతు దగ్గరున్న వాద్యం కూడా విరిగింది. ఇంత జరిగినా సూఫీ జ్ఞాని అతనిని ఏమీ అనలేదు. ఆయన ఇంటికి దగ్గర్లోనే ఉంటాడా తాగుబోతు. మరుసటి రోజు ఆయన తీపి పదార్థాలను, కాస్తంత డబ్బు, ఒక ఉత్తరం ఒకరికి ఇచ్చి తాగుబోతు వద్దకు పంపించారు. తాగుబోతు ఆ ఉత్తరం చదివాడు. అందులో ఇలా ఉంది.‘మీ సంగీత వాద్యం ముక్కలైంది. అందుకు కారణం నా తలే. అందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. కనుక నేను మీకిస్తున్న డబ్బుతోవాద్యం కొనుక్కోండి. అన్నట్టు మరొక విషయం. మీరు నిన్న రాత్రి నాతో మాట్లాడుతున్నప్పుడు మీ నోటంట అనేక చేదు మాటలు దొర్లాయనిపించింది. కనుక మీకు పంపిన తీపి పదార్థాలు తినండి. లోపల ఉన్న చేదు పోతుంది. అప్పుడు మీ మాటలు తీయగా ఉంటాయి’.తాగుబోతు ఈ సంఘటన తర్వాత తాగుడు మానేశాడు. బిస్తామీ వద్దకు వెళ్ళి తన తప్పును క్షమించ మన్నాడు. ఇంకెప్పుడూ అలా చేయనని హామీ ఇచ్చాడు. ‘మీ సహనం, మీ మంచి మాటలు నా కళ్ళు తెరిపించాయ’న్నాడు. – యామిజాల జగదీశ్ -
మహిమాన్విత క్షేత్రం.. ఓంకారం!
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో ఉండే ఓంకారేశ్వరుడు కోరిక కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి. అందుకే ఇక్కడి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కోరికలు తీరిన వారు.. కోరికలు కోరుకుని ముడుపులు కట్టుకునే భక్తులతో ఆలయం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఆలయానికి తూర్పు, దక్షిణ ద్వారాలు కలిగి ఉన్నాయి. ఈశాన్యంలో పుష్కరిణి కలిగి ఉండడటం, సిద్దులు తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ చరిత్ర ఇక్కడున్న శివలింగాన్ని సిద్ధేశ్వరుడు అనే ముని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని వందల ఏళ్ల క్రితం సిద్ధేశ్వరుడు అనే ముని తపస్సు చేసుకునేందుకు బయలుదేరి ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఓం అనే శబ్దం వినిపించిందట. తాను తపస్సు చేసుకునేందుకు ఇదే సరైన ప్రదేశమని నిర్ణయించుకున్న ఆ ముని ఇక్కడ ఓ శివలింగాన్ని ప్రతిష్టించి తపస్సు మొదలు పెట్టాడట. అప్పటి నుంచే ఈ ఆలయానికి ఓంకార సిద్ధేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఆ ముని వల్లే ఇక్కడ పంచ బుగ్గ కోనేరు వెలసిందనీ... ఆ నీటితోనే పార్వతీపరమేశ్వరులకు రోజూ అభిషేకం నిర్వహిస్తారనీ చెబుతారు. వ్యాస మహర్షి అశ్వత్థనారాయణ స్వామి (ఆంజనేయస్వామి)ని ఇక్కడ ప్రతిష్టంచడంతో ఈ ప్రాంతానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొన్నాళ్లకు వేంకటేశ్వరస్వామి, దుర్గాదేవి ఆలయాలనూ ఇక్కడ నిర్మించారు. ఇక్కడ అన్నదానం ప్రారంభించడానికి కాశీనాయన అనే యోగి కారణమని అంటారు. నెల్లూరు జిల్లా బెడుసుపల్లిలో జన్మించిన కశిరెడ్డి మొదటి నుంచీ ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు. కొన్నాళ్లకు ఓ స్వామీజీ వద్ద మంత్రదీక్ష తీసుకుని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ చివరకు 1933లో ఇక్కడకు చేరుకుని ఆశ్రమం ఏర్పాటు చేశాడనీ ప్రతీతి. కశిరెడ్డి మహిమలు తెలిసిన భక్తులు ఆ యోగిని ‘నాయనా’ అని పిలవడం మొదలుపెట్టడంతో ఆ స్వామి కాశీనాయనగా గుర్తింపు పొందాడట. ఆకలిగా ఉన్నవారికి లేదనకుండా అన్నం పెట్టాలనే సందేశాన్ని చాటిన ఈ యోగి ఇక్కడే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాడనీ, ఆయన పరమపదించాక అద్దాల మండపాన్ని కట్టి ఆ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యాన్నదానాన్ని కొనసాగిస్తున్నారనీ అంటారు. ధర్మస్థాపనకు కష్ణభగవానుడు వీరభోగ వసంతరాయలు రూపంలో ఎప్పుడైనా రావొచ్చని కాలజ్ఞానంలో రాసి ఉందనీ, అలా వచ్చే స్వామికి నివేదించాలనే ఉద్దేశంతోనే ఇలా పదమూడు రకాల వంటకాలతో భోజనాలు సిద్ధం చేస్తుంటామనీ చెబుతారు. భక్తులే అన్నీ సమకూరుస్తారు కొండపైనున్న శివాలయంతోపాటూ ఇతర ఉపాలయాల్లో పూజల్ని నిర్వహించే భక్తులు ఆ తరువాత కాశీనాయన క్షేత్రానికి చేరుకుంటారు. సాధారణ రోజుల్లో రోజుకు దాదాపు 1,500 మంది భోజనం చేస్తే కార్తీక మాసం, శివరాత్రి సమయాల్లో అయిదారు లక్షల మందికి అన్నసంతర్పణ జరుగుతుంది. ఈ ఆశ్రమంలో మధుమేహులకు ప్రత్యేక కౌంటరు ద్వారా కొర్ర అన్నం, రాగి,లడ్డూ వంటివి వడ్డిస్తారు. ఇరవై నాలుగు గంటలూ ఇక్కడ పొయ్యి వెలుగుతూనే ఉంటుందనీ, ఇందుకు అవసరమైన నిత్యావసరాలను భక్తులే ఎప్పటికప్పుడు సమకూరుస్తుంటారనీ అంటారు. అర్ధరాత్రో, అపరాత్రో ఇక్కడికి వచ్చేవారు భోజనం వండుకుని తినేందుకు వీలుగా నిత్యావసరాలను ఈ ప్రాంగణంలో ఉంచుతారు. ఏటా 20 లక్షల మంది ఇక్కడ భోజనం చేస్తారు. మార్చి 1 వరకు ఉత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం మార్చి 1వ తేది వరకు ఉత్సవాలకు ఓంకార క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ నాగప్రసాద్ తెలిపారు. 25న బండిఆత్మకూరు గ్రామంలో ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. 26న ఉత్సవమూర్తులకు మంగళవాయిద్యాలతో బండిఆత్మకూరు గ్రామం నుంచి బయలుదేరి శింగవరం, సోయయాజులపల్లె, గ్రామాల్లో గ్రామోత్సవం జరిపి ఆలయ ప్రవేశం చేసి, గణపతిపూజ, రక్షాబంధనం, ద్వజరోహణం, వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి ఉత్సవమూర్తులకు కళ్యాణం ఉంటుంది. 27న నంది వాహనోత్సవం, 28న రథోత్సవం అనంతరం వసంతోత్సవం ఉంటుంది. మార్చి 1న స్వామివారు ఓంకారం నుంచి బయలుదేరి బండిఆత్మకూరు చేరటంతో బ్రహోత్సవాలు ముగుస్తాయి. ఎలా రావాలంటే..భక్తులు ఓంకారం చేరుకునేందుకు నంద్యాల, బండిఆత్మకూరు, ఆత్మకూరు ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వసులు ఏర్పాటు చేశారు. (చదవండి: Shivaratri2025 పుణ్యప్రదం.. జ్యోతిర్లింగ దర్శనం) -
శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎవరు.. గిరిజనులకు ఆరాధ్యుడు ఎలా అయ్యారు?
ఆయన భారత గిరిజన ప్రజలకు ఆరాధ్య దైవం. లంబాడీలను అహింసావాదంవైపు నడిపించిన దార్శనికుడు. బ్రహ్మచర్య నిష్టను ఆచరించి ఎంతో మంది గిరిజనులను ఆకర్షించిన వ్యక్తి. ఆయనే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ (sant shri sevalal maharaj). 17వ శతాబ్దంలో అవతరించిన ఆయన, గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యారు. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను సేవాలాల్ బంజార సంఘం (Banjara Community) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు సెలవుదినంగా ప్రకటించాలని గిరిజనులు (Tribals) కోరుతున్నారు.గిరిజన రాజుగా..అసలు శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎవరు..? ఆయనకు మూడు దశాబ్దాలుగా గిరిజనుల్లో ఇంత ఆదరణ ఎందుకు ఉంది? ఆయన రాజా? లేక దార్శనికుడా? లేక ఆధ్యాత్మిక గురువా? అనేది చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న. తెలంగాణలో గిరిజనులు ఆరాధించే ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న ఏపీలోని అనంతపురం జిల్లాలో గుత్తి సమీపంలోని ఓ మారుమూల తండాలో జన్మించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన అప్పట్లోనే దేశమంతటా తిరిగి లంబాడీ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అందుకే ఆయన వారికి ఆరాధ్య దేవుడయ్యాడు. రాజపుత్ర సంతతికి చెందిన గిరిజన జాతుల్లో లంబాడీ జాతికి చెందిన దంపతులకు జన్మించడం వల్ల ఆయనను సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్‌గా, గిరిజన రాజుగా, లంబాడీ గురువుగా కొలుస్తారు. అప్పట్లోనే నిజాం రాజులకు ఎదురొడ్డి నిలిచిన ఘనత సేవాలాల్ మహారాజ్ది. కఠోర నిష్ట సేవాలాల్ మహారాజ్ పూజా విధానం చాలా కఠినతరంగా ఉంటుంది. సేవాలాల్ గుడిని దర్శించిన భక్తులందరూ ఉదయం, సాయంత్రం కలుసుకోవాల్సి ఉంటుంది. బలన్బోగ్ మరియు బేలన్బోగ్ అనే ఆధ్యాత్మిక సాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ సమయంలో భగవంతునికి నివేదించి ధర్మబోధన చేస్తారు. ప్రతీ బంజార యువకుడు కనీసం జీవిత కాలంలో ఒక్క సారైనా బంజార సేవాలాల్ గుడిని దర్శించాలని విశ్వసిస్తుంటారు. చదవండి: కామాఖ్య దర్శనం.. చిరస్మరణీయంఅనంతపురం (Anantapur) గుత్తి సమీపంలోని ఓ గిరిజన తండాలో భీమానాయక్, ధర్మిణి దంపతులకు జన్మించిన రమావత్ సేవాలాల్ క్రమక్రమంగా దార్శనికుడిగా, అహింసావాదిగా పేరు సంపాదించారు. తర్వాత కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో ఆయనకు గిరిజనులు ఆలయాన్ని నిర్మించారు. సేవాలాల్ మహారాజ్ జన్మించిన ఊరును ప్రస్తుతం పురితండాగా పిలుస్తున్నారు.సంత్ శ్రీ సేవాలాల్ మార్గాన్ని ఆచరించాలి గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ చూపించిన మార్గాన్ని రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోని ప్రతి గిరిజనుడు ఆచరించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆదర్శాలను ప్రచారం చేస్తూ, జయంతి ఉత్సవాలకు రాష్ట్రంలోని ప్రతి గిరిజనుడు జరుపుకోవాలి. – రమావత్ చిరంజీవి, అంగడిపేట జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి గిరిజనులు ఎంతో భక్తితో జరుపుకునే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతోపాటు, జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. – రమావత్ శ్రీనునాయక్, సేవాలాల్ బంజార సంఘం నాయకుడు, గుడిపల్లి మండలం -
కూతురి పెళ్లి... పెరుమాళ్ కోసం...!
అది తమిళనాడు రాష్ట్రం, రామేశ్వరం దగ్గరున్న ఓ చిన్న పల్లెటూరు. అక్కడ పెయింటింగ్ ని జీవనోపాధిగా చేసుకుని జీవించే ఓ పెయింటర్ ఉండేవాడు. అతడికి పెళ్ళి కావాల్సిన కూతురు ఉండేది. బి.ఏ., డిగ్రీ మాత్రమే చదివిన ఆ అమ్మాయి అందం కూడా అంతంత మాత్రమే. అయినా పెద్ద మొత్తాల్లో జీతం తీస్తున్న ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పెళ్ళి చేసుకుంటామని ముందుకు వచ్చారు. పెళ్ళి కూతురు, ఆమె తల్లి వచ్చిన సంబంధాల పట్ల ఆసక్తి ప్రదర్శించినా పెయింటర్ ఒప్పుకోలేదు. ‘‘వయసైతోంది, మీరు బిడ్డకి పెళ్ళి చేయాలని ఉన్నారా, లేదా?’’ అని భర్తని గట్టిగా అడిగింది పెయింటర్ భార్య. అతడు నవ్వి ఊరకున్నాడు. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పంపించేస్తున్నాడన్న విషయం తెలిసి బంధువులు అతడిని తిట్టిపోశారు. అయినా అతడు పట్టించుకోలేదు. చివరికి మిత్రుల ద్వారా తిరుపతి నుంచి ఓ సంబంధం వచ్చింది. పెళ్ళికుమారుడు చిన్న వ్యాపారి. ఆదాయం అంతంత మాత్రమే. అయినా దానికి వెంటనే అంగీకరించాడు పెయింటర్. ఆశ్చర్యపోయారు పెయింటర్ కుటుంబ సభ్యులు.‘ఇక్కడ పెళ్ళికుమారులు దొరక్కనా, పది గంటలకు పైగా ప్రయాణ దూరమున్న తిరుపతి సంబంధం చేసుకుంటున్నాడు’ అని బంధువులు ముక్కు మీద వేలు వేసుకున్నారు. పెయింటర్ ఎవ్వరి మాటలకీ స్పందించ లేదు. పెళ్ళి పనుల్లో పడ్డాడు. పెళ్ళి కూడా తిరుపతిలోనే పెట్టుకున్నారు. పెళ్ళిరోజు రానే వచ్చింది. అమ్మగారి ఇంటినుంచి వెళ్ళిపోతున్నామనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ పెళ్ళికూతురు తండ్రిని ఇలా అడిగింది.‘‘నాన్నా... మన రామేశ్వరం పక్కనే ఎన్నో మంచిమంచి సంబంధాలు వచ్చాయి. వాటికి నువ్వు ఒప్పుకోలేదు. రాష్ట్రం కాని రాష్ట్రం. పరిచయం లేని ప్రాంతం, దూరాభారం. తెలియని భాష. అయినా ఈ కొత్త సంబంధానికి సుముఖత చూపావు, కారణమేమి?’’ అని. ఎదురుగా కనిపిస్తున్న శేషాచలం కొండల్ని చూపిస్తూ ఇలా చెప్పాడు అతడు– ‘‘ఏడాదికి ఒక్కసారైనా, పెరుమాళ్ ని చూడాలని ఉంటుంది నాకు. అయితే... నోట్లోకి నాలుగేళ్ళు పోయే సంపాదన నాది. ఆ సంపాన కోసమే నా సమయమంతా సరిపోయేది. ఉన్న ఊరు వదిలేదానికి కుదిరేది కాదు. స్వామి వారి దర్శనభాగ్యం వాయిదాలు పడేది. కూతురైన నువ్వు తిరుపతిలో ఉంటే నిన్ను చూడాలని అనిపించినప్పుడల్లా తిరుపతి వస్తాము. అలాగైనా అపుడప్పుడూ స్వామి దర్శన భాగ్యం చేసుకోవచ్చని నా ఆశ. అందుకే ఈ సంబంధం ఒప్పుకున్నాను’’అని. తండ్రికి స్వామివారి పట్ల ఉన్న భక్తికి ఆశ్చర్యపోయింది పెళ్ళికూతురు. అక్కడే ఉన్న బంధుమిత్రులందరూ శేషాచలం కొండల వైపు తిరిగి గోవిందలు పలికారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
సీతారామచంద్ర స్వామికి కాసుల పంట
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారికి కాసుల పంట పండింది. ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం దేవాదాయ శాఖ, దేవస్థాన అధికారుల సమక్షాన చిత్రకూట మండపంలో లెక్కించారు. ఈ సందర్భంగా 36 రోజులకు రూ.1,13,23,178 ఆదాయం నమోదైంది. ఇవికాక 0.109 గ్రాముల బంగారం (Gold), 0.895 గ్రాముల వెండితో పాటు యూఎస్, సింగపూర్, ఆస్ట్రేలియా, యూఏఈ దేశాల కరెన్సీ వచ్చిందని ఈవో రమాదేవి తెలిపారు. జనవరిలో స్వామి వారి అధ్యయనోత్సవాలు, ఉత్తర ద్వారదర్శనం, తెప్పోత్సవం, సంక్రాంతి (Sankranti) సెలవులు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు రావడం వల్ల కూడా ఆదాయం పెరిగిందని భావిస్తున్నారు. నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.పూర్వగిరిలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచియాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు. శ్రీస్వామి వారు ఊరేగే వాహన సేవలను, ఆలయంలో యాగశాలను సైతం సిద్ధం చేశారు. ఈనెల 7వ తేదీ (శుక్రవారం) నుంచి.. ఈ నెల 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఏడు రోజులు మొక్కు పూజలు రద్దు చేస్తున్నట్లు ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. పూర్వగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు శుక్రవారం ముగిశాయి.కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నా యి. ఈ మేరకు దేవస్థానంలో దేవాదా యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయం, గోపురాల పైకి ఎక్కి కలశాలకు సంప్రోక్షణ జరిపేందుకు పరంజాలతో మెట్ల మార్గం నిర్మించారు. ప్రధాన ఆలయంతోపాటు గోపురాలకు తుని తపోవనం పీఠా ధిపతి సచ్చిదానందసరస్వతితో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మూడు రోజు లు భక్తులకు ఉచిత ప్రసాదం, అన్నదానం నిర్వహిస్తారని ఈవో మహేశ్ తెలిపారు. చదవండి: పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి -
ఆత్మసాక్షాత్కారం అంటే..?
ఆత్మసాక్షాత్కారం మానవుని జన్మహక్కు అంటారు శ్రీ మాతాజీ. మనలోని కుండలినీ శక్తియే మన తల్లి. ఆమె మన అన్ని జన్మలలోను మనతోనే ఉంటూ, జాగృతి చెందే సదవకాశం కోసం ఎదురు చూస్తూ వస్తున్నది. స్త్రీలు, పురుషులు, పిల్లలు, అన్ని వర్ణాల, జాతుల వారు, ఎవరైనా సహజయోగ సాధన చేసుకోవచ్చును. ఆత్మసాక్షాత్కార అనుభూతి పొందవచ్చును. దీనికి కావలసింది ఆత్మసాక్షాత్కారం పొందాలనే శుద్ధమైన కోరిక మాత్రమే. అన్ని మతాలలోను, జ్ఞానమూర్తులు, అవతార పురుషులు సహజ యోగం గురించే బోధించారు. ఆత్మసాక్షాత్కారం ద్వారా పొందే ఆధ్యాత్మిక జీవనమే గొప్పదని చెప్పారు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి?పూర్వంలోలా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి ఏ అడవులకో, హిమాలయాలకో వెళ్ళనవసరం లేకుండానే తమ, తమ సంసారిక బాధ్యతలు, సాంఘిక పరమైన విధులు నిర్వర్తిస్తూనే ఆత్మసాక్షాత్కారం పొందే ప్రక్రియను మాతాజీ కనుగొన్నారు.ఆత్మసాక్షాత్కారం పొందాలి అనే శుద్ధ ఇచ్ఛాశక్తి మనకు కలిగినప్పుడు నిద్రాణ స్థితిలో ఉన్న కుండలినీ శక్తి జాగృతమై కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా ఊర్ధ్వముఖంగా పయనించి, శిరస్సునందు గల సహస్రార చక్రాన్ని ఛేదించి, పరమ చైతన్య శక్తితో అనుసంధానం జరగటం వలన అనంతమైన దైవశక్తులన్నీ అనుభవంలోకి వచ్చి, తద్వారా మనకున్న అజ్ఞానం తొలగి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానిగా... బ్రహ్మజ్ఞానిగా మార టమే ఆత్మసాక్షాత్కార పరమార్ధం.ఆత్మసాక్షాత్కారం అనేది ఒక అంధ విశ్వాసం, మూఢ నమ్మకమూ కానే కాదు. అనుభవ స్థిరమైనది, స్వయం అనుభూతి కలిగినటువంటిది. మాతాజీ ఫోటో ముందు కూర్చుని, నిస్సంకోచంగా హృదయపూర్వకంగా శుద్ధ ఇచ్ఛాశక్తితో ధ్యానం చేసినా ఈ అనుభూతి సహస్రార చక్రంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు అప్రయత్నంగా ఆలోచనలు నిలిచి΄ోతాయి. ఈ స్థితిని ‘నిర్విచారస్థితి’ అంటారు. ఈ స్థితిలో మన అరచేతులలో గానీ, మాడు పైనగాని, చల్లని వాయుతరంగాల అనుభూతి కలుగుతుంది. ఇది మీలోనే సంభవించు ‘ఆత్మసాక్షాత్కార’ అనుభవం, అనుభూతి.శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన గీతోపదేశంలో ‘యోగక్షేమం వహామ్యహం’ అన్నాడు. భగవంతుని యందు ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలో నిమగ్నమై ఉన్న వారి యోగ క్షేమాలు తానే వహిస్తానని, యోగం ద్వారా భగవంతుని చేరినప్పుడే ఈ క్షేమం కలుగుతుందని బోధించిన విషయం మనందరికీ తెలిసినదే. ఇటువంటి యోగం అంటే ఆ సర్వవ్యాప్త భగవంతుని శక్తితో కలయిక ఈ సహజ యోగం ద్వారా సిద్ధిస్తుంది. శ్రీ లలితా సహస్రనామావళిలో పొందుపరచిన మంత్రాల సారాంశం కుండలిని జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందగోరటమే. సాధారణంగా మనం ఎల్లప్పుడూ గతానికి సబంధించిన లేక భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన విషయాలను ఆలోచిస్తూ ఉండటం వల్ల, శారీరకంగానూ, మానసికంగానూ సమతుల్యత లోపించటం వలన సదా మానసిక ఒత్తిడికి, శ్రమకు గురవుతూ ఉంటాం. అయితే సహజయోగలో కుండలినీ జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మనల్ని ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంచడం వల్ల మనం సమతుల్యతలో ఉండటం జరుగుతుంది. ఈ స్థితిని పొందటాన్ని ‘ఆధ్యాత్మిక పరివర్తన’ అని చెప్పవచ్చును.– డాక్టర్ పి. రాకేష్ (శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాల ఆధారంగా) (చదవండి: పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి..!) -
కోపాన్ని దిగమింగినవాడే సిసలైన శూరుడు
కోపం మానవుల ఆగర్భ శతృవు. అది అనేక అనర్ధాలకు హేతువు. కోపం అభివృధ్ధి నిరోధకం. కోపంలో మనిషి తనపై తాను అదుపును కోల్పోతాడు. కోపంలో మనిషి దుర్భాషలాడతాడు. కొట్లాటకు దిగుతాడు. భార్యా బిడ్డలపై చేయి చేసుకుంటాడు. అసభ్య పదజాలం ప్రయోగిస్తాడు. చిన్నాపెద్దా వయోభేదాన్ని కూడా పాటించడు. కోపంలో మనిషి ఎవరి మాటా వినే పరిస్థితిలో ఉండడు. హత్యలు చేయవచ్చు. ఆత్మహత్యకూ పాల్పడవచ్చు. కోపస్థితిలో సరైన నిర్ణయం తీసుకోలేడు. క్షణికావేశానికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. రెప్పపాటులో చేసే ఆ చిన్న తప్పువల్ల జీవిత కాలానికి సరిపడా చేదు అనుభవాలు మిగిలినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.అసలు ఒకటనేమిటి? నేడు సమాజంలో జరుగుతున్న అనేక అనర్ధాలకు కోపమే కారణమంటే అతిశయోక్తికాదు. మరి ఈ కోపమనే శత్రువును పారద్రోలాలంటే ఏం చెయ్యాలి? దీనికి దైవప్రవక్త ముహమ్మద్ (స) ఒక ఉపాయం చెప్పారు. కోపం వచ్చినప్పుడు నియంత్రించుకోవాలంటే, మనిషి తాను ఉన్నచోటునుండి పక్కకు జరగాలి. అంటే ఆ చోటును వదిలేయాలి. నిలబడి ఉంటే కూర్చోవాలి. కూర్చొని ఉంటే పడుకోవాలి. ఇలా చేయడంవల్ల కోపం అదుపులోకొస్తుంది. అంతకూ ఇంకా కోపం తగ్గకపోతే, వజూ చేయాలి. అంటే నియమబద్ధంగా చేతులూ, ముఖమూ, కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే, ఆగ్రహం షైతాన్ ప్రేరణ వల్ల కలుగుతుంది. షైతాన్ సృజన అగ్నితో జరిగింది. అగ్ని నీటితో ఆరుతుంది. కనుక షైతాన్ ప్రేరణతో కలిగిన ఆగ్రహం చల్లారాలంటే నీటిని ఉపయోగించాలి. వజూచేయాలి. ఇలాచేస్తే తప్పకుండా కోపం మటుమాయమవుతుంది.వాస్తవానికి, కోపం రావడమన్నది మానవ సహజమే. మానవమాత్రులెవరూ దీనికి అతీతులు కాదు. కాని కోపంలో విచక్షణ కోల్పోకపోవడమే గొప్పతనం. కోపానికి లోనై జుట్టుపీక్కోవడం, చిర్రుబుర్రు లాడడం, అయిందానికీ, కానిదానికి ఎవరిపైబడితే వారిపై విరుచుకుపడడం, చేతిలో ఏముంటే అది విసిరి కొట్టడం, నోటికొచ్చినంత మాట్లాడడం, బూతులు లంకించుకోవడం ఇవన్నీ ఉన్మాదపు చేష్టలు. మానవ ఔన్యత్యానికి ఏ మాత్రం శోభించని లక్షణాలు. అసలు ఏకోశానా ఇది వీరత్వమూకాదు, ధీరత్వమూకాదు. మానవత్వమూ కాదు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ (స)’కుస్తీలో ప్రత్యర్ధిని మట్టికరిపించే వాడు వీరుడు కాదు. తనకు కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోకుండా నిగ్రహించుకున్నవాడే అసలైన వీరుడు, శూరుడు’.అన్నారు.ఇదీ చదవండి: Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్వికనుక, కోపం మానవ సహజమే అయినప్పటికీ, దానిపై అదుపుకలిగిఉండాలి. విచక్షణ కోల్పోయి ఉన్మాదిగా ప్రవర్తించకూడదు. తాను కోపగించుకొని, కస్సుబుస్సులాడి ఏం సాధించగలనని ఆలోచించ గలగాలి. అందరికంటే బలవంతుడు దైవం ఉన్నాడని, ఏదో ఒకరోజు ఆయన ముందు హాజరు కావలసిందేనని, ఆయన అందరి మనోస్థితులూ తెలిసిన సర్వజ్ఞాని అని తెలుసుకొని, విచక్షణాజ్ఞానంతో మసలుకుంటే ఎటువంటి అనర్ధాలూ ఉండవు. కోపానికి దూరంగా ఉంటే జీవితమంతా సంతోషమే. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి..!
కురుక్షేత్ర యుద్ధ సమయంలో నిలువెల్లా గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన అనంతరం స్వచ్ఛంద మరణమనే వరం తో విష్ణుసాయుజ్యాన్ని పొందుతాడు భీష్ముడు. ఆయన భక్తికి మెచ్చిన కృష్ణపరమాత్మ అష్టమి మొదలుకొని ద్వాదశి వరకు గల ఐదు రోజులూ భీష్మపంచకంగా ప్రసిద్ధికెక్కుతాయనీ, ముఖ్యంగా భీష్ముని మరణానంతరం వచ్చిన ఏకాదశి భీష్మ ఏకాదశిగా... పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధికెక్కుతుందని వరమిచ్చాడు. ఈ భీష్మ ఏకాదశికే జయ ఏకాదశి అని కూడా పేరు. ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈరోజున శ్రీ మహావిష్ణువును భీష్ముడు బోధించిన విష్ణు సహస్ర నామాలతో పూజించిన పాండడవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి.. అటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైంది. ఇక ఈ భీష్మ ఏకాదశినాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం.తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన్రపాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం. భీష్ముడు ప్రవచించిన ‘విష్ణుసహస్రనామస్తోత్రం’ ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే వుంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం సర్వదుఃఖహరం, సకల శుభకరం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే. ప్రతినామమూ మహామంత్రమే. అది అజరామరం. భీష్మ ఏకాదశిన అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో, సింహాచలం నరసింహ స్వామి ఆలయంలో, యాదగిరి గుట్ట, భద్రాచాలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేకపూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమని, ఈ రోజున తలపెట్టిన కార్యక్రమాలు జయప్రదం అవుతాయనీ పెద్దలు చెబుతారు.ఈవేళ ఇవి నిషిద్ధం..మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాయధాన్యాలు వంటి వాటికీ దూరంగా ఉండాలి.ఉపవాస దీక్ష చేపట్టాలి.ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి.ఏకాదశి రోజున.. ఇంటిని శుభ్రం చేసుకోకుడదు. ఎందుకంటే చీమలు, పురుగులు వంటివి చంపే అవకాశం ఉంటుంది.తెల్లవారు జామునే నిద్ర లేవాలి.. మధ్యాన్నం కునుకు తీయకూడదు.ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ.. రాత్రంతా జాగారం చేయాలి.జుట్టు కత్తిరించకూడదు.ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు.విష్ణు సహస్రనామాలు, భగవద్గీతను పఠించడం మంచిది.పేదవారికి, ఆకలి అన్నవారికి ఈ రోజు అన్నం పెట్టడం పుణ్యప్రదం. ఈవేళ ఇలా చేయాలిపూజకు విష్ణుమూర్తి పటాన్ని పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం’’ఓం నమోనారాయణాయ’’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. అభ్యంగ స్నానం చేసి.. పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేయాలి. దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు అనుసరించ వలసి ఉంటుంది. --డి.వి.ఆర్(చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!) -
సమస్య, పరిష్కారాలు : సంస్కారాలు
గతాన్ని విడిచిపెడుతూ, ఎప్పటికప్పుడు పునరుత్తేజాన్నిపొందుతూ శిశిర రుతువులో ఒక్క ఆకు కూడా లేనటువంటి చెట్లు వసంత రుతువులో ఆకుపచ్చని ఆకులతో నిండిఉంటాయి. ఎందుకు? ఎందుకంటే ప్రాణంలేని ఆకులన్నీ రాలి పోయి, తిరిగి ప్రాణశక్తిని పొంది కొత్త ఆకులతో చెట్లు నిగనిగ లాడతాయి.మన సంస్కారాలు కూడా మనల్ని గతంలోనికి తోసి వేస్తాయి లేక భవిష్యత్తు లోనికి లాక్కెళతాయి. పర్యవసానంగా మనం మన కళ్లెదుట ఉన్న వర్తమానాన్ని కోల్పోతున్నాం. మన చంచలమైన మనస్సును స్థిర పరచాలి. దీనిని లోపలికి మళ్ళించుట (అనగా అంతర్ముఖత్వం గావించుట)ను అభ్యసించాలి. గతంలో సంభవించిన వాటిని లేక భవిష్యత్తులో సంభవించనున్న వాటిని పట్టుకొని మనస్సు ఊగిసలాడకూడదు. జీవితం దాని మార్గంలో అది నడుస్తూ ఉంటుంది. వర్తమాన కాలంలో ఏం జరుగనున్నదో దానికి సాక్షీభూతుడుగా ఉండాలి. ఇదీ చదవండి: Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్విమనస్సు నుండి అనేక కోరికలు పుడతాయి. అటువంటి వానిలో కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే పూర్తవుతాయి. అందువలన మనం సంతోషాన్ని పొందుతాం. మరికొన్ని కోరికలు మనం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తి కావు. కోరికలు ఫలించని పరిస్థితిలో... నా కోరికలు ఏ విధంగా నెరవేరతాయి? ఏ కోరికలు నెరవేరతాయో అటువంటి కోరికలనే నేను కోరుకోవాలా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఈ రెండింటికి సమాధానాలు మన దగ్గర లేవు.మనస్సు వస్తువులతో అంటిపెట్టుకొని ఉండటం వలన కోరికలు జనిస్తాయి. కోరికలు నెరవేరినా, నెరవేరకున్నా వాటిని గూర్చి మనస్సులో ఎక్కువ ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే ఇటువంటి పరిస్థితిలో చిక్కుకుంటారో అటువంటివారి విధిని ఊబిలో చిక్కిన మనిషితో పోల్చవచ్చు. ఈ విధంగా చిక్కుకున్నప్పుడు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది?మనస్సును నెమ్మదిగా, క్రమంగా ఆలోచనారహిత స్థితికి తీసుకొని రావాలి. అందుకోసం సాధకుడు తన సాధనల ద్వారా ఆలోచనల వలన కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఆధ్యాత్మిక లక్ష్యంపైననే మనస్సును కేంద్రీకరింప చేయాలి. దేవుని (గురువు) అనుగ్రహం వలన సాధకుడు కాస్త ముందుగానో లేక ఆలస్యంగానో తన సాధన ఫలితాలను పొందగలడు. -
పని చెయ్యడమే!
సూఫీ సాధువులలో అత్యంత ప్రముఖులు ఇబ్రహీం. ఆయన జీవనశైలి నిరాడంబరమైనది. ఇబ్రహీం నిశ్చలమైన ధ్యానం ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు. ఆయన కుటుంబం అరబ్ మూలాలతో కూడినది. ఇప్పటి అఫ్గానిస్తాన్‌లోని బాల్ఖ్‌లో జన్మించారు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం, ఆయన 2వ రషీద్ ఖలీఫా ఉమర్ మాతృ వంశానికి చెందినవారు. సన్యాసిగా మారడానికి సింహాసనాన్ని విడిచి పెట్టారు. తన జీవితంలో పాక్షికంగాసంచార జీవనం గడిపారు. ఆయన భిక్షా టనను అసహ్యించుకున్నారు. జీవనో పాధి కోసం అవిశ్రాంతంగా పని చేశారు. ఒకానొకమారు ఇబ్రహీం ఓ ధనవంతుడిని కలుసు కున్నారు. అతడు ఆయన జ్ఞాని అని తెలియక తోటమాలిగా నియమించాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి కొందరు స్నేహితులు వచ్చారు. అందరూ కలిసి తోటలోకి ప్రవేశించారు. ఇబ్రహీంను చూసి తమకు తినడానికి మంచి మామిడిపళ్ళు కావాలని అడిగారు. సరే నని ఇబ్రహీం పండ్లు కోసిచ్చారు. వాటిని తిన్న మిత్రులు పుల్లగా ఉన్నాయని ధనవంతుడితో అన్నారు. అప్పుడు ధనవంతుడు ఇబ్రహీంను పిలిచి ‘ఏమిటీ పళ్ళన్నీ పుల్లగా ఉన్నాయంటున్నారు... చాలా కాలంగా తోటలో పని చేస్తు న్నావు. ఏ పండ్లు పుల్లటివో, ఏవి తియ్యటివో తెలియవా’ అని కసురుకున్నాడు. అందుకు ఇబ్రహీం చాలా నిదానంగా, ప్రశాంతంగా ఇలా జవాబిచ్చారు: ‘మీరు నాకు తోటమాలి పని అప్పజెప్పారు తప్ప పండ్లు తినమని చెప్ప లేదు. తింటే కదా వాటి రుచి తెలిసేది?’ ఈ సంఘటన తర్వాతే ఆ ధనవంతుడికి తన ఎదుట ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదని, గొప్ప జ్ఞాని అని తెలుసుకున్నారు. కొన్ని నిముషాల ముందు కసురుకున్నందుకు తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు ధనవంతుడు.సాధువుగా ఉండాలనుకుంటే, ఈ లోకంలోని లేదా పరలోకంలోని వస్తువులను కోరుకోవద్దని ఇబ్రహీం చెప్పేవారు. దృష్టంతా ఆ దేవునిమీదే కేంద్రీకరించినప్పుడే మిమ్మల్ని తన సాధువుగా చేసుకుంటా డనే వారు. ‘ముసుగులు తొలగించినప్పుడే ఆనందం తలుపు తెరవ బడు తుంద’న్నది ఆయన సూక్తి. – యామిజాల జగదీశ్పని చెయ్యడమే! -
ఈశ్వరాజ్ఞ
రజతాచలం పైని వనాంతర సీమలలో వసంతం నిండుగా కమ్ముకుని ఉంది. ఆ ప్రకృతి రామణీయకతలో ఒకచోట దాగి ఏకాంత క్షణాలను గడుపుతూ, ఆనందిస్తున్నారు శివపార్వతులు. వారి ఏకాంతాన్ని ఎవరూ భంగపరచకుండా నంది కాపు కాస్తున్నాడు. అలాఉండగా, అది రజతాచలమని, అక్కడ మదనారియైన శివుడు వసిస్తూ ఉంటాడనే ఆలోచన మరచి, ఆవసంత శోభను తాము కూడా ఆనందించి తరించాలనే ఉద్దేశంతో గంధర్వ గణాలు ఒక్కసారిగా వచ్చి గిరిపై పడ్డాయి. తమ అరుపులతో, కేరింతలతో ఆ వన ప్రాంతంలో అట్టహాసం చేయసాగాయి. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన నంది, కోపగించి, వారిపై మాటల దూషణలతో విరుచుకుపడ్డాడు. ’అంధులా మీరు? లోకేశ్వరుడైన ఈశ్వరుడు, ఈశ్వరితో ఏకాంతంలో ఉండగా, ఇలా వచ్చి గోల చేయడం తగిన పనికాదు. ఆలస్యం చేయక, ఇక్కడి నుండి వెంటనే దూరంగా వెళ్ళిపొండి!’ అని మందలించాడు. నంది మాటలను వారు లెక్క చేసే స్థితిలో లేరు. గంధర్వ గణాల ఆ స్థితిని ఆత్మలో ఎరిగిన శంకరుడు, ఉగ్రుడై చెంతనే పడివున్న గడ్డిపోచలను పిడికిట పట్టి ‘పిశా చాలుగా మారండని’ శపించి వారిపై విసిరాడు. కనువిందు చేసే అంద మైన రూపాలు కాస్తా అంతలోనే అంతరించిపోయి, రూపురేఖలు తప్పి వికటాంగులయ్యారు గంధర్వులు. ఆ సందర్భాన్ని తెనాలి రామకృష్ణకవి ఇలా వర్ణించాడు ఉద్భటారాధ్య చరిత్రలో. కం. కొఱకును బోవం బడిక /ల్లుఱక పయింబడిన కరణి నొకపనికై రా నుఱుమని పిడుగై వారికి /గఱకంఠుని చేత నీచగతి వాటిల్లెన్.పక్షులు ఎఱను ఏరి తినడానికని వెళ్ళగా, ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియని పడికల్లు – తుపాకి గుండు – వేగంగా వచ్చి వెంటాడి మీద పడినట్లుగా, రజతాచలంపైని వసంత శోభను ఆనందించాలనే ఒక పని మీద రాగా, ఉరుము లేకుండానే మీద పడిన పిడుగు చందంగా,శంకరుడి శాపం తగిలి నీచ గతి ప్రాప్తించింది కదా అని గంధర్వ గణాలు బాధపడడం పై పద్యం భావం. ఏదైనా తప్పుతుందేమో కాని ఈశ్వరాజ్ఞ తప్పదు కదా!– భట్టు వెంకటరావుఈశ్వరాజ్ఞ -
దురలవాట్లను దూరం చేసే కొల్లూరు మూకాంబికాలయం
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం. క్షేత్రపురాణం: జగద్గురు ఆదిశంకరులు కుడజాద్రి పర్వతంపై ఉండి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి, అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆమెను తనతోబాటు తన జన్మస్థలమైన కేరళకు రావలసిందిగా శంకరులు చేసిన ప్రార్థనకు అంగీకరించిన దేవి, అందుకు ఒక షరతు విధిస్తుంది. అదేమంటే, తాను వచ్చేటప్పుడు శంకరులు వెనక్కు తిరిగి చూడకూడదని, ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే తాను శిలలా మారిపోతానంటుంది. అందుకు అంగీకరిస్తాడు శంకరులు. ముందుగా శంకరులు, వెనుక అమ్మవారు వెళ్తూ ఉంటారు. కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారి కాలి అందెల రవళి వినిపించకపోవడంతో, వెనక్కు తిరిగి చూస్తాడు శంకరులు. ఇచ్చిన మాట తప్పి వెనక్కు తిరిగి చూడడంతో అమ్మవారు అక్కడే శిలలా మారిపోతుంది. తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించిన శంకరులతో తనను అక్కడే ప్రతిష్ఠించమని చెబుతుంది. దీంతో ఆదిశంకరులు శ్రీ చక్రంతోపాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడనందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది. నాటినుంచి అమ్మవారికి ఆదిశంకరులు సూచించిన విధానంలోనే పూజాదికాలు జరుగుతున్నాయి. మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్నవారు ఒక్కసారైనా హారతి సమయంలో అమ్మవారి దివ్యమంగళరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అమ్మవారికి ప్రదోష కాలంలో ఇచ్చే హారతి ప్రత్యేకమైనది.సౌపర్ణికానది: ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ప్రవహిస్తుంటుంది. ఈ నది లోతు తక్కువ. కుటజాద్రి పర్వతం నుంచి ఉద్భవించే ఈ నదిలో ఇతర నదీపాయలు కూడా కలుస్తాయి. ఈ నది ఒడ్డున సుపర్ణుడు అంటే గరుత్మంతుడు తన తల్లి దుఃఖాన్ని పోగొట్టమని కోరుతూ అమ్మవారిని గురించి ఘోర తపస్సు చేసి వరం పొందాడట. ఆ నాటినుంచి ఈ నదికి సౌపర్ణికానది అని పేరు వచ్చింది. ఈ నదిలో అనేక వనమూలికలు ఉంటాయని, అందువల్ల ఈ నదిలో స్నానం చేస్తే చర్మరోగాలు నయం అవుతాయని చెబుతారు. ఇతర సందర్శనీయ స్థలాలు ఆలయ బయటి ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి తదితర దేవతల సన్నిధులున్నాయి. కొల్లూరు చుట్టుపక్కల మంగుళూరు మంగళాదేవి, ఉడిపి కృష్ణుడు, కుందాపూర్, భత్కల్, షిమోగా, ధర్మస్థల, శృంగేరీ శారదాపీఠాలు సందర్శనీయ స్థలాలు. ఇక్కడ గల కుటజాద్రి పర్వత శ్రేణి అందమైన అటవీ సంపదతో ఆకట్టుకుంటుంది. ఈ పర్వతశ్రేణి ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఎలా వెళ్లాలి? మంగుళూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కొల్లూరుకు వెళుతుంటుంది. ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. మంగుళూరుకు నేరుగా అన్ని ప్రధాన నగరాలనుంచి బస్సులు, రైళ్లు ఉన్నాయి. మంగుళూరులో విమానాశ్రయం కూడా ఉంది. (చదవండి: లోకహితం కోసం ప్రాణాలర్పించిన అసురుడు..!) -
భోగభాగ్యాల భోగి పండగ దేనికి సంకేతమంటే.?
'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.ఆరోగ్య రహస్యం..ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. భోగి మంటలు ఎందుకంటే..చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ పండగ సందేశం, అంతరార్థం..చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!) -
అనంతపద్మనాభ స్వామి ఆలయం..! కొండనే ఆలయాలుగా..
ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా, విశాలమైన విహారాలుగా మందిరాలుగా, అందమైన స్తంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా వివిధ ఆకృతులలో మలచిన ఆనాటి శిల్పుల అనన్య శిల్పనైపుణ్యానికి, అనల్పశిల్ప కళా ప్రావీణ్యానికి శిరసువంచి వందనాలు సమర్పించాల్సిందే. శ్రీ అనంతపద్మ నాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చూడగానే ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో అవాక్కయి నిలబడి పోవాలసిందే! గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై కొద్దిగా ముందుకు వెళితే .... ఉండవల్లి సెంటరు వస్తుంది. కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్డులో 5 కి.మీ ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాము. వీటిని ఉండవల్లి గుహలు అని పిలుస్తున్నారు. ఈ గుహాలయాలు క్రీ.శ 420 –620 ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలుగా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. . మొదటి అంతస్తు: కింద భాగం మొదటి అంతస్తులో గుప్తుల,చాళుక్యుల కాలపు శిల్పనిర్మాణం కనిపిస్తుంది. ఇవి అసంపూర్తి గానే ఉన్నాయి. బౌద్ధ సన్యాసుల విహారాలుగా ఉండేటట్లు వీటి నిర్మాణం ప్రారంభమైంది. వీనిలో ఒకదానిలోనుండి మరొక దాని లోనికి మార్గం, విశాలమైన తిన్నెల నిర్మాణం ఉంది. రెండవ అంతస్తు: రెండవ అంతస్తు లోనికి మెట్లమార్గం ఉంది. దీనిలో త్రిమూర్తుల మందిరాలున్నట్టుగా చెపుతున్నారుగాని ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగిలున్నాయి. గదులుగా . మందిరాలుగా ఉన్న వానికి సన్నని తీగలున్న తలుపులను బిగించారు. అక్కడక్కడా ఏవో ఉన్నట్లు గా భ్రాంతిగా కన్పిస్తున్నాయి కాక ఎక్కడా స్పష్టత లేదు. వేసిన తలుపుల వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి. మూడవ అంతస్తులోకి మెట్లమార్గం...చారిత్రక నేపథ్యం – ఈ గుహాలయాలు నాలుగు అంతస్తులు కూడ రాయిను తొలిచి చేసిన నిర్మాణాలే కాని, పెట్టినవి, ప్రతిష్ఠించినవి లేవు. మూడవ అంతస్తు పూర్తిగా విష్ణు బంధమైన గుహాలయం. సాధారణం గా బౌద్ధ, జైన గుహాలయాలు ఉంటాయి కాని వైష్ణవ గుహాలయం ఉండటం ఇక్కడొక ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాధికారిగా పనిచేసిన మాధవరెడ్డి ఈ అనంత పద్మనాభుని గుహాలయాన్ని నిర్మింపజేసినట్లుగా చరిత్ర చెబుతోంది. ఇక్కడ నుంచి 9 కి.మీ దూరం సొరంగమార్గం మంగళగిరి నరసింహస్వామి కొండపైకి ఉందని, ఆరోజుల్లో సాధువులు, మునులు కృష్ణానదిలో స్నానానికి, పానకాల నరసింహుని దర్శనానికి రాకపోకలు సాగించే వారని నానుడి. ప్రస్తుతం ఈ సొరంగ మార్గాన్ని మూసివేశారు. ఎడమవైపుకు తిరిగితే వరుసగా కొండను తొలిచి తీర్చిదిద్దిన శిల్పాలు కనువిందు చేస్తాయి. వాటిలో ముందుగా మనల్ని ఆకర్షించేది గణనాయకుడైన వినాయకుని రమణీయ శిల్పం. మహా గణపతి...లంబోదరుని సహస్ర రూ΄ాలను దర్శించిన సందర్శకునికైనా ఈ వినాయకుని దర్శనం అపరిమితానందాన్ని ఇస్తుంది. ఎందుకంటే గజాననుని ముఖం మీద తొండం మీద కన్పించే ఆ విధమైన గజచర్మపు ముడతలను శిల్పంలో దర్శింపజేయడం అనన్య సామాన్యం. ఉగ్రనరసింహుడు: ఈ రూపం ఈమండపంలోనే మూడు ప్రదేశాల్లో మనకు కన్పిస్తుంది. రెండు ఒకే పోలికతో ఉన్నాయి. ఇవి కుడ్యచిత్రాలు. వీనిలో శంకరునితోపాటు వివిధ దేవతల శిల్పాలు కూడ ఉన్నాయి. శ్రీ లక్ష్మీదేవితో ఆదివరాహస్వామి...స్థంభాలపై కన్పించే వాటిలో మొదటిది చాల అరుదుగా కన్పించే ఆదివరాహస్వామి. లక్ష్మీ సమేతుడైన ఈ స్వామి కడు రమణీయంగా దర్శనమిస్తాడు. ఆకాశంలో విహరిస్తున్నట్లున్న గరుత్మంతుడు... నాగబంథం: మూడవ అంతస్థులో మండపానికి వెలుపల నాగబంథమున్నదని, దానివలన ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద కాని, విలువైన గ్రంథ సముదాయం కాని ఉండవచ్చని కూడ ప్రచారం జరిగింది.నారద తుంబురులా ? ఈ మూడవ అంతస్థులో వెలుపల భాగాన నాలుగు విగ్రహాలు, సింహం బొమ్మలు కన్పిస్తున్నాయి. వీటిని నారద, తుంబురులు అని వ్రాస్తున్నారు. నారద తుంబురులయితే ఇద్దరే ఉండాలి కదా! కాని ఎందుకో ఆ నలుగురు వేద పురుషులకు ప్రతీకలనే భావన కలుగుతుంది. వాటిని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటి పురుషుని కుడి చేతిలోజపమాల, రెండవ చేతిలో తాళపత్రాలు కన్పిస్తున్నాయి. ఋగ్వేదానికి ప్రతీక ఏమో? అలాగే నాల్గవ పురుషుని చేతిలో తంత్రీ వాద్య విశేషం ఉంది. ఇది సామవేదానికి ప్రతీక కావచ్చు. కాబట్టి పండితులు, మేథావులు, చరిత్ర పరిశోథకులు మరొక్కసారి ఈ విగ్రహాలను పరిశీలిస్తే విశేషం వెలుగు చూడవచ్చు? రవాణాసౌకర్యాలు...విజయవాడకు దేశంలోని అన్ని ్ర΄ాంతాలనుండి బస్సు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి. విజయవాడనుండి ప్రకాశం బ్యారేజి మీద బస్సులు వెళ్లవు కాబట్టి ఆటో చేసుకొని వెళ్లవచ్చు. లేదా మంగళగిరి నుండి ఉండవల్లి సెంటరుకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఆటోలో వెళ్లవచ్చు. రోడ్డు మార్గం... ఉండవల్లి గుహలకు చేరుకునే మార్గాలు ఆలయానికి మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 31 కిలోమీటర్ దూరంలో ఉంది. మంగళగిరి నుండి ఉండవల్లి గుహలకు 7 దూరంలో ఉంది. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ గుహలను సందర్శించడానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. అదేవిధంగా గుంటూరులో రైల్వే జంక్షన్, విజయవాడలో రైల్వే జంక్షన్ ఉంది. గుంటూరు నుంచి ఆలయానికి 30 కిలోమీటర్లు, విజయవాడ నుంచి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్లు ఉంది. రైలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మంగళగిరిలో రైలు జంక్షన్ కూడా ఉంది. అక్కడ నుంచి కూడా ఉండవల్లి గుహకు వెళ్లడానికి సదుపాయాలు ఉన్నాయి.(చదవండి: దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం) -
తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకొన్న శివుడు!
సాక్షి, పెద్దపల్లి: ‘గజ్జల లాగులను ధరించిన ఓదెల మల్లన్న దండాలో.. మమ్మేలు మా స్వామి దండాలో.. ఆలుమిలా తారడో బోలుమియా గారడో..’ అంటూ గంతులు వేస్తూ తమ ఇలవేల్పును దర్శించేందుకు భక్తులు ఆ ఆలయానికి భారీగా తరలివస్తుంటారు. తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకొన్న శివుడు.. మల్లన్నగా.. ఓదెల మల్లన్నగా పూజలందుకుంటున్నాడు. తెలంగాణ శ్రీశైలంగా ప్రసిద్ధి చెందాడు. అదే పెద్దపల్లి జిల్లా (Peddapalli District) ఓదెల మల్లికార్జునస్వామి ఆలయం. ఆ ఆలయ చరిత్ర తెలుసుకుందాం.నాగలి చేసిన గాయంతో..పూర్వం ఈ ప్రాంతం దండకారణ్యంగా (Deep Forest) ఉండేది. ఆ రోజుల్లో స్వయంభూలింగంగా వెలసిన మహాశివుడిని పంకజ మహామునీశ్వరుడు నిత్యం కొలుస్తూ తపస్సు చేసేవాడని ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఆలయ స్తంభంపై మునీశ్వరుల బొమ్మలు, నామం చెక్కి కనిపిస్తాయి. ఆయన తర్వాత పూజ చేసేవారు లేక శివలింగంపై పెద్దఎత్తున పుట్ట పెరిగింది. అయితే, చింతకుంట ఓదెలు అనే రైతు వ్యవసాయం చేస్తుండగా.. నాగలి కర్ర పుట్టలోని శివలింగానికి తగిలింది. జరిగిన పొరపాటును ఓదెలు తెలుసుకొని, స్వామివారిని మన్నించమని వేడుకున్నాడు. దీంతో ఓదెలుకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా, అతడి పేరుతోనే భక్తులకు దర్శనం ఇస్తానని స్వామివారు చెప్పినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటికీ శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ క్రమం, స్తంభ వర్ణ శిలలు, శిల్పాల ఆధారంగా సుమారు 1300 మధ్య కాకతీయుల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయని చెబుతున్నారు. ఆ సమయంలో దక్షిణ దిశగా శ్రీభ్రమరాంబ అమ్మవారిని, ఉత్తర దిశగా శ్రీవీరభద్రస్వామిని, క్షేత్రపాలకుడిగా శ్రీభైరవస్వామిని ప్రతిష్టించారు.మల్లన్న ఆలయానికి సమాంతరంగా సీతారామ చంద్రస్వామి విగ్రహాలుశ్రీసీతారాములు వనవాసం చేసే సమయంలో రామగిరిఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే దారిలో ఓదెల శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకున్నారని ప్రతీతి. దానికి ప్రతీకగా మల్లన్నస్వామి ఆలయానికి సమాంతరంగా శ్రీసీతారామచంద్రస్వామి వారి విగ్రహాలను ప్రతిష్టించారని స్థానికులు చెబుతుంటారు.సంతానం కోసం టెంకాయ బంధనం‘గండాలు తీరితే గండదీపం పెడతాం.. కోరికలు తీరితే.. కోడెలు కడతాం.. పంటలు పండితే.. పట్నాలు వేస్తాం.. పిల్లాజెల్ల సల్లంగా ఉంటే.. సేవలు చేస్తాం’ అని స్వామివారికి భక్తులు మొక్కుకుంటారు. వచ్చే భక్తుల్లో చాలామంది సంతానం కోసం ‘టెంకాయ బంధనం’ కట్టి వారికి సంతానం కలిగిన తర్వాత స్వామివారికి మొక్కుబడి చెల్లిస్తారు. మల్లన్నను దర్శించుకున్న తర్వాతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.ఒగ్గుపూజారుల పట్నాలతో..ఓదెల మల్లన్న సన్నిధిలో భక్తులు (Devotees) స్వామివారి పేరిట పట్నం వేస్తారు. ఒగ్గుపూజారుల చేతిలో ఢమరుకాన్ని మోగిస్తూ శ్రుతిని తలుస్తుండగా స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మండపంలో ఒగ్గు పూజారులు గజ్జెలతో కుట్టిన లాగుల (నిక్కర్లు)తో పూసలు కట్టిన అంగీలు (చొక్కాలు), పూసల కుల్లాయి (టోపీ) సన్నని జాలిచెద్దరు, చేతిలో త్రిశూలం, దానికి చిరుగంటలు, మరోచేతిలో కొరడా (వీరకొల) వంటివి ధరించి భక్తి తన్మయత్వంతో పూనకాలతో ఊగుతూ, గంతులు వేస్తూ.. శివతాండవం చేస్తూ దేవున్ని ప్రత్యేకంగా కొలవడం విశేషం.పలు రాష్ట్రాల నుంచి భక్తుల రాకఏటా సుమారు రూ.2 కోట్లకుపైగా ఆదాయం సమకూరే ఓదెల శ్రీమల్లికార్జునస్వామి దేవాలయానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.భక్తుడి పేరుతో దర్శనం చింతకుంట ఓదెలు అనే భక్తుడి పేరు మీద మల్లన్న క్షేత్రం విరాజిల్లు తోంది. శ్రీరాముడు కూడా మల్లన్నను దర్శించుకొని పూజలు చేశాడని ప్రతీతి. శ్రీశైలం, ఓదెల ఆలయం రెండు ఒకే సమయంలో నిర్మించడంతో తెలంగాణ శ్రీశైలం అని ఈ ఆలయానికి పేరు వచ్చింది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.– పంచాక్షరి, ఆలయ అర్చకులుబుధ, ఆదివారాల్లో రద్దీ ఉగాది పర్వదినం రోజున ఎడ్లబండ్లతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత జాతర ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పెద్దపట్నాలు, అగ్నిగుండాలు దాటడంతో ఏటా జాతర సాగుతుంది. ఆలయంలో పలు అభివృద్ధి పనులు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వాటి నిర్మాణాలకు సహకరించిన దాతలకు జాతర సమయంలో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తాం.– బి.సదయ్య, ఈవో(403) -
మౌనం ఒక వరం...!
మౌనంగా ఉండటం చాలా మందికి తెలీదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. కొందరు పూజలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది మత గ్రంథాలు చదువుతూ ఒక పక్క మాట్లాడుతూ మరోప్రక్క అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటారు. ఏదో ఉదయమే చదివితే చాలు అనే ధ్యాసలో ఉంటారు. మరి కొంతమంది ఎటువంటి పూజలు కాని మత గ్రంథాలు చదవటం కాని చేయరు. అనునిత్యం పైకి అనకుండా మనసులోనే తమ దైవాన్ని స్మరించుకుంటారు. వారు ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. చిరునవ్వుతోనే సమాధానం ఇస్తూ ఉంటారు. ఇటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ముఖ్యంగా ఎవరు ఏమైనా అంటే దానికి సమాధానం ఇవ్వకుండా ఉంటే మేలు. లేకపోతే మాటకు మాట పెరిగి వాగ్వివాదం పెరిగి చూసేవారికి అసహనం కలుగుతుంది. సమాధానం ఇవ్వకుండా ఉంటే మౌనంగా ఉండొచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు. వృద్ధాప్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. కొందరికి అన్ని కావాలి. ఎవరు, ఏమిటీ అని ఆరా తీస్తారు. అది వారి పెద్దరికానికి తగదు. పూజలు చేస్తేనే పుణ్యం అనే భ్రమలోనుంచి వారు బయటకు రావాలి. చేత కానప్పుడు మదిలోనే భగవంతుని స్మరించవచ్చు. అంతేకాని వితండవాదం చేయకూడదు. మన మాట పిల్లలు విననప్పుడు మనం మారు మాటాడకూడదు. వారు ఏదయినా అడిగితేనే మనం సలహా ఇవ్వాలి. అయినా ఈ రోజులలో పెద్దల మాట ఎవరూ పట్టించుకోరు. మనం సాధ్యమైనంత వరకు మనసులోనే మౌనంగా మన ఇష్టదైవాన్ని తలచుకుంటే అదే పదివేలు. మౌనమే మనం అలవర్చుకోవాలి. మౌనాన్ని మించిన విద్య లేదు. మౌనం అన్నిటికి పరిష్కారం.– కనుమ ఎల్లారెడ్డి, విశ్రాంత పౌరశాస్త్ర అధ్యాపకులు (చదవండి: దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం) -
దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం
పూర్వం పాపాత్ములందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను పోగొట్టుకునే వాళ్ళు. గంగానది, పాపం, వీళ్ళందరి పాపలతో అపవిత్రమై, నల్లని రూపాన్ని సంతరించుకుంది. ఆ పాపలనుంచి విముక్తికై ఆమె మహావిష్ణువుని ప్రార్ధించింది. అప్పడాయన, పాపత్ముల పాపల మూలంగా నువ్వు నల్లగా మారిపోయావు, అందుకని నువ్వు నల్లని కాకి రూపంలో వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ వుండు. ఏ తీర్థంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదలి హంసలా స్వచ్ఛంగా మారుతావో, అది దివ్య పుణ్య క్షేత్రం అని చెప్పాడు. గంగ కాకి రూపంలో వివిధ తీర్ధాలలో స్నానం చేస్తూ, కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో కూడా చేసింది. వెంటనే ఆవిడకి కాకి రూపం నశించి హంస రూపం వచ్చింది. అందుకని ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథ.పులిగడ్డ దగ్గర కృష్ణానది చీలి దక్షిణ కాశియని పేరు పొందిన కళ్ళేపల్లి (నాగేశ్వర స్వామి) మీదుగా హంసలదీవికి వచ్చినౖ వెనం గురించి ఒక కథ వుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో వున్నది. పూర్వం దేవతలు సముద్ర తీరంలో ఒక విష్ణ్వాలయం నిర్మించి అక్కడ వారు పూజాదికాలు నిర్వర్తించాలనుకున్నారు. మరి దేవతలు వచ్చి పూజలు చెయ్యాలంటే వారికి ఏ ఆటంకం లేని ప్రదేశం కావాలి కదా. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిర్మానుష్యంగా వుండేది. అందుకని దేవతలు ఇక్కడ వేణు గోపాల స్వామి ఆలయం నిర్మించాలనుకున్నారు. అందుకోసం వాళ్ళు ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారుట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. దాంతో వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చోళ, మౌర్య రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగినా, అసంపూర్తిగా వున్న గాలి గోపురాన్ని అలాగే వదిలేశారు. ఇటీవల విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని నూతన గాలి గోపురాన్ని నిర్మించారు. పురాతన గాలి గోపుర శిధిలాలు కొన్ని ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి.స్వామి ఆవిర్భావం గురించి.... పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా ఉండేవి. అందులో కొన్ని ఆవులు ఇంటి దగ్గర పాలు సరిగ్గా ఇవ్వక పోవటంతో వాటిని జాగ్రత్తగా కాపలా కాశారు. అవి వెళ్ళి ఒక పుట్ట దగ్గర పాలు వర్షించటం చూసి గోపాలురు కోపంతో అక్కడున్న చెత్తా చెదారం పోగుచేసి ఆ పుట్టమీద వేసి తగులబెట్టారు. పుట్టంతా కాలిపోయి అందులో స్వామి శరీరం తునాతునకలయింది. స్వామిని చూసిన గోవుల కాపరి వెంటనే మంట ఆపివేశాడు. అందరూ వచ్చి పుట్ట తవ్వి చూడగా ముఖం తప్ప మిగతా శరీరమంతా ఛిన్నా భిన్నమయిన స్వామి దర్శనమిచ్చారు.. అదిచూసి వారంతా సతమతమవుతున్న సమయంలో స్వామి ఒకరికి కలలో కనిపించి పశ్చిమ గోదావరి జిల్లాలో కాకరపర్తి అనే గ్రామంలో భూస్వామి ఇంటి ఈశాన్య మూలగల కాకర చెట్టుకింద వున్న నన్ను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించమని ఆనతినిచ్చారు. ఆ విగ్రహమే ఇది. నల్లశానపు రాతిలో చెక్కిన విగ్రహంలాగా కాక నీలమేఘ ఛాయతో విలసిల్లుతోంది.దేవాలయంపై పెద్ద రాతి దూలాలు అమర్చబడివున్నాయి. ఈ ప్రాంతంలో కొండ గుట్టలు కానీ, పర్వతాలుగానీ లేవు. ఆ రాతి దూలాలను ఇప్పుడు తీసుకు రావాలన్నా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. మరి ఎటువంటి సౌకర్యాలూ లేని ఆ కాలంలో వాటిని ఎక్కడనుంచి తెచ్చారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆలయ కుడ్యాలపై గరుత్మంతుడు, లక్ష్మీ నారాయణులు, నరసింహుడు, ఆంజనేయ స్వామి మొదలగు విగ్రహాలున్నాయి.ఉత్సవాలు...ప్రతి సంవత్సరం మాఘ శుధ్ధ నవమి నుండి మాఘ బహుళడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.సరదాలు... కృష్ణా నది సముద్రంలో కలిసే అందమైన ప్రదేశంలో సత్యభామ, రుక్మిణీ సమేత శ్రీ వేణు గో΄ాల స్వామి ఆలయం ఉంది. దీన్ని దేవతలు నిర్మించారని చరిత్ర చెబుతోంది. అంతే కాదు మహర్షులు, దేవతలకు మధ్య అనేక విషయాలు జరిగిన ప్రదేశం కూడా ఇది. దీన్ని చూడటానికి పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఇక్కడి దైవాన్ని దేవతలు ప్రతిష్టించారు అని ,సముద్ర తీరంలో చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం లో సేద తీరడానికి అందరూ వయసుతో సంబంధం లేకుండా ఇష్టపడతారు.ఎలా వెళ్లాలి?విజయవాడకు 110 కి.మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో ఉంది హంసలదీవి. విజయవాడ నుంచి పామర్రు, కూచివూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే మచిలీ పట్నం నుంచి కూడా. అయితే ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కొంచెం తక్కువ. అవనిగడ్డనుంచి హంసలదీవి దాకా బస్సులున్నాయి.దారి బాగుంటుంది. సొంత వాహనాల్లో వెళ్తే కృష్ణానదీ, సాగర సంగమాల దాకా కూడా వెళ్ళిరావచ్చు. అయితే మనకి కావలసిన ఆహారం, మంచినీరు వగైరాలన్నీ తీసుకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఇంకా అన్ని సౌకర్యాలూ లేవు. వెలుతురు ఉన్న సమయంలో వెళ్తే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. – స్వాతీ భాస్కర్(చదవండి: జీవితాల్ని మార్చే జీవన'గీత'!) -
మౌనం.. శక్తికి ఆధారం
భారతదేశం ఎన్నో దివ్య క్షేత్రాలకు, ఎన్నెన్నో దివ్య ధామాలకు నిలయం. ఆ సేతు శీతాచలం అసంఖ్యాకమైన పవిత్ర ఆలయాలు ఈ నేలపై కొలువై ఉన్నాయి. యుగాలు మారినా, తరాలు గడిచినా ఆ ఆలయాల శక్తి ఏ మాత్రం తరగలేదు. ఈ రోజుల్లో ఆలయాలకు వెళ్ళినప్పుడు భగవంతుడిని మొక్కుబడిగా చూసి, కోరికల చిట్టా విప్పడం అనవాయితీగా మారిపోయింది. గుడికి వెళ్లి కూడా అనేకమైన సమస్యల గురించిన చింతను వదలకుండా అదే పనిగా తలుచుకోవడం సామాన్యంగా మారింది. ఆలయాలు మహా శక్తి క్షేత్రాలు. ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు శక్తిని గ్రహించాలి.దేవుడిని దర్శించడంతో పాటు పరమాత్మ తత్వంతో ఏకీకృతం అయ్యే ప్రయత్నం చేయాలి. భగవద్ తత్వంతో లయం కావాలంటే మొదట మౌన స్థితికి చేరాలి. ఎందుకంటే భౌతిక జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి స్వాంతనను ఇవ్వగలిగే శక్తిని మీరు మౌనం ద్వారా పొందగలరు. మౌనం మీకు సత్య దర్శనాన్ని కలిగిస్తుంది. దివ్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసును ప్రయత్న పూర్వకంగా స్థిమిత పరిచి శక్తిని ప్రోది చేసుకోవాలి. తక్షణమే మీ చింతలు తగ్గి, మనసు మీ అదుపులోకి వస్తుంది. ఎన్ని పనులున్నా కోవెలకు వెళ్ళినప్పుడు మాత్రం అన్నీ వదిలిపెట్టాలి. ఫోన్ కాల్స్ కానీ, మెసేజీలు కానీ, ఆఫీస్ విషయాలు కానీ, ఇంటి పనులు, ఇతరితర విషయాలన్నీ పక్కన పెట్టి భగవద్ చైతన్యంతో మమేకం కావాలి. మహిమాన్విత ఆలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు, అక్కడికి చేరడంతోనే మీరు ఎంతో కొంత శక్తిని స్వీకరిస్తారు. అదే గనుక మౌన స్థితిలో ఉండగలిగితే మరింత అద్భుత శక్తిని పొందుతారు. ఆలయాలలో అనేక మాధ్యమాల ద్వారా ప్రసరించే దివ్యశక్తి మీ శక్తి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. శక్తి శరీరాన్ని కాంతి శరీరం అని కూడా అంటారు. శక్తి శరీరానికి దివ్య శక్తే ఆధారం. మీరు మౌన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దివ్యశక్తి మీలోనికి అధికంగా ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఋషులు, దేవతలు ప్రతిష్ఠించిన పురాతన ఆలయాల్లో దేవతా శక్తి, ఋషుల తపొశక్తులు రెండూ కలగలిసి ఉంటాయి. ఎన్నియుగాలు గడిచినా ఇటువంటి ఆలయాలలోని శక్తి సంపద చెక్కుచెదరదు. అందుకే వందల సంవత్సరాలుగా భక్తకోటి తరలి వస్తున్నా ఇంకా అదే శక్తి ప్రకంపనలతో ఈ ఆలయాలు అలరారుతున్నాయి. ఈ కారణంగా ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, భక్తి ప్రపత్తులతో మౌన స్థితో ఉండటం ఉత్తమం. అవకాశం కుదిరితే కాసేపు ఆ ప్రదేశాల్లో ధ్యానసాధన కూడా చేయండి. భగవంతుడి వద్దకు వెళ్లిన ప్రతిసారీ మీ సమస్యలను గురించో, లేక΄ోతే మీరు పొందాలనుకుంటున్న కోరికల గురించో విన్నవించుకునే బదులుగా, మీకు భగవంతుడు ప్రసాదించిన ఎన్నో వరాలకు భక్తితో కృతజ్ఞతలు తెలిపి, మౌనస్థితికి వెళ్ళండి. మీరు అనుభవిస్తున్న బాధలు, సమస్యలు అన్నీ పరమాత్మకు తెలుసు. అలాగే మీరు ఏమి కోరుకుంటున్నారో కూడా ఆయనకు తెలుసు. భగవంతుడు సర్వాంతర్యామి. మీరు చేయవలసింది భగవంతునికి మీ భక్తిని సమర్పించడం. స్వచ్ఛమైన మనసుతో, మౌనస్థితిలో భగవంతుడి చైతన్యంలో లయమవ్వడం. ఇలా చేస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలను క్రమక్రమంగా ఓర్పు నేర్పులతో పరిష్కరించుకోగల శక్తి మీకే లభిస్తుంది. దివ్యశక్తి మీతో కలిసి మీ ప్రగతికై పని చేస్తుంది. – మాతా ఆత్మానందమయి, ఆధ్యాత్మిక గురువు -
తప్పుని ఎత్తిచూపడం కంటే.. చక్కదిద్దడమే ఉత్తమం
ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా ఆకస్మికంగా తప్పుదారిలో నడిచినప్పుడు వారిని తిరస్కార భావంతో చూసి ఎగతాళి చేసే వారే కానీ చెడుదారిన వెళ్లేవారి తప్పును సున్నితంగా ఎత్తి చూపించి, ప్రేమతో దిద్ది, ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసానికీ, ఆత్మాభిమానానికీ దెబ్బ తగలకుండా అతడిని చక్కదిద్దే నేర్పరితనం మనలో ఎంతమందిలో ఉంటుంది? తప్పు చేసినప్పుడు సహనం కోల్పోయి తీవ్రంగా దండించి ‘అలా చేయకూడదు, ఇలా చేయకూడదు..’ అంటూ చెప్పినంత మాత్రాన పెద్దల కర్తవ్యం ముగిసిందా? ఒకడు కాలుజారి కిందపడుతున్నప్పుడు వాడిని లేవదీయకుండా వ్యంగ్యంగా విమర్శిస్తూ ‘అయ్యో పాపం!’ అని జాలి ప్రదర్శించే మాటలు కురిపించే వారే చాలామంది! అటువంటి వారిపై దోషారోపణ చేసినంత మాత్రాన మనకొచ్చే ఫలితం ఏమీ ఉండదు. తాము విద్యార్థులుగా ఉన్నప్పుడు తమ ఉపాధ్యాయులు తమకు విధించిన శిక్షలు (కొట్టడం వంటివి) తమకు నచ్చకపోయినా, తాము ఉపాధ్యాయులు అయిన తర్వాత ఆ పద్ధతినే అనుసరిస్తూ వస్తారు. సహనం, ప్రేమ ఆచరణ యోగ్యం కావనీ, ఉపన్యాసాలకూ, రాతలకూ మాత్రమే పనికి వస్తాయనీ భావిస్తారు. బానిసత్వంలో పెరిగిన వర్గాల ప్రజల్లో కనిపించే ఒక అలవాటు ఇది. తమకంటే పై మెట్టులో ఉన్నవారి ఎదుట దైన్యంగా ఉండటం, తమకంటే కిందిస్థాయిలో ఉన్న వారి పట్ల దర్పం చూపడం గమనిస్తూనే ఉన్నాం. సామాజిక విప్లవం, కుల నిర్మూలన వంటి విషయాలను గురించి భావోద్వేగంతో ప్రసంగించే ఒక కార్యాలయాధికారిని ‘మీరెప్పుడైనా మీ విభాగంలోని సిబ్బందినంతా సమీకరించి దానిలో అందరూ పాల్గొనేటటువంటి ఒక ఒక సభను నిర్వహించారా?’ అని అడిగితే, ‘లేదు’ అన్నాడా అధికారి. ఒకే ప్రభుత్వ శాఖలో, ఒకే కార్యాలయంలో కొన్ని ఏళ్లపాటు కొద్ది వేతన వ్యత్యాసాలతో పనిచేసే వారిలో అధికారికీ, ఉద్యోగులకూ సామరస్యం లేదని తెలిసింది. కేవలం యాంత్రికంగా వారి ఉద్యోగం నిర్వహిస్తూ వచ్చారు. అంతేకాని, పరస్పర ప్రేమ, విశ్వాసం, సహకార భావం వంటివి వారిలో మచ్చుకైనా కనిపించలేదు. బుద్ధిమంతులు, సంస్కారవంతులూ అయినవారంతా అణగదొక్కబడిన వారిపట్ల ప్రేమ, ఆదరాభిమానాలు చూపాలి. అంతేకాని, క్షణికమైన ఉద్రేకంతో నేను పరోపకారిని అని ప్రకటించుకుని ప్రయోజనం లేదు. నిష్కల్మషమైన ప్రేమ ఒక్కటే ప్రగతిశీలమైన రాచబాట అనే వాస్తవాన్ని మరువకూడదు. పైస్థాయిలో ఉన్న వారు ఈ విషయాన్ని గ్రహించి, కింది వారిపట్ల శ్రద్ధాసక్తులు చూపాలి. అప్పుడే సమన్యాయం సాధ్యం అవుతుంది. – స్వామి జగదాత్మానంద (చదవండి: సంపదలు సత్కార్యాలకు ద్వారాలు) -
ధర్మసూక్ష్మం ఇలా ఉంటుందా..? ఆత్వస్తుతి అంత పాపమా..?
కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. ఒకనాడు కర్ణుడితో యుద్ధం చేస్తూ ధర్మరాజు అతడి శరాఘాతాలకు గురై గాయాల పాలయ్యాడు. కర్ణుడి సూటిపోటి మాటలతోనైతే మృత్యు సమాన స్థితినే పొందాడు. అవమాన భారం తట్టుకోలేక దూరంగా పారిపోయి వెళ్ళి దాక్కున్నాడు. మరోపక్క అశ్వత్థామను తీవ్ర గాయాలపాలు చేసి అర్జునుడు విజయగర్వంతో ధర్మరాజు కోసం చూశాడు. ఎక్కడా కనిపించపోయేసరికి కృష్ణుడితో కలిసి ధర్మరాజు కోసం వెతుకుతూ వెళ్ళాడు. ఒకచోట ధర్మరాజును కలుసుకున్నాడు. తనను సమీపించిన కృష్ణార్జునుల ముఖంలో సంతోషం చూసి కర్ణుణ్ని వధించి ఉంటారని అనుకున్నాడు ధర్మరాజు. అతణ్ని ఎలా వధించారో చెప్పమన్నాడు. కర్ణుణ్ని ఇంకా చంపలేదని అర్జునుడు సమాధానమిచ్చాడు.అవమానభారంతో కోపంగా ఉన్న ధర్మజుడు అర్జునుణ్ని అనేక విధాలుగా నిందించాడు. ఎంతో గొప్పదైన గాండీవం ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు కాబట్టి దాన్ని ఎవరికైనా ఇచ్చేయమన్నాడు. ఆ మాట వినడంతోనే అర్జునుడు ధర్మరాజును చంపడానికి కత్తి ఎత్తాడు. పక్కనే ఉన్న కృష్ణుడు అర్జునుణ్ని ఆపి అతడి కోపానికి కారణాన్ని ప్రశ్నించాడు. తన ఎదురుగా ఎవరైనా గాండీవాన్ని అవమానించి దాన్ని విడిచి పెట్టమని అంటే వాళ్లను ఆ క్షణంలోనే చంపుతానని ప్రతిజ్ఞ చేసినట్లు అర్జునుడు చెప్పాడు. అదొక విషమ సందర్భం. ఆ సమయం లో వారిద్దరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత కృష్ణుడిపై పడింది. అప్పుడు కృష్ణుడు ముందు ధర్మరాజును రక్షించాలనే ఉద్దేశంతో అర్జునుడికి ధర్మం స్వరూప స్వభావాలను తెలియజేశాడు. జీవహింస మహాపాపంమంటుంది ధర్మం. కానీ బలాకుడు అనే బోయవాడు భార్యాపుత్రులు, వృద్ధులైన తల్లిదండ్రుల ఆకలి తీర్చడం కోసం క్రూర జంతువును చంపి స్వర్గానికి వెళ్ళిన వృత్తాంతాన్ని వివరించాడు. అలాగే సత్యాన్ని మాత్రమే మాట్లాడమంటుంది వేదం. ఒక్కోసారి అది తప్పంటుంది ధర్మసూక్ష్మం. ఒకరోజు కొందరు వ్యక్తులు తమను దొంగలు వెంటపడుతుంటే ప్రాణభయంతో పారిపోయి కౌశికుడనే తపస్వి ముందు నుంచే అరణ్యంలోకి వెళ్ళారు. కొంతసేపటికి దొంగలు అటుగా వచ్చి వారి గురించి కౌశికుణ్ని ప్రశ్నించగా వారు ఎటు పారిపోయిందీ వివరించాడు. దొంగలు వెళ్ళి వారిని సంహరించి ధనాన్ని దోచుకుపోయారు. వారి మరణానికి పరోక్ష కారణమైన కౌశికుడు తాను చేసిన పనిమూలంగా పాపభారాన్ని మోయాల్సి వచ్చింది. కృష్ణుడి మాటలు విని అర్జునుడు ధర్మస్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అన్నను చంపబోయానని చింతించాడు. ప్రతిజ్ఞాభంగం కలగకుండా ధర్మరాజును, తనను కాపాడమని వేడుకొన్నాడు. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు పెద్దలను, గురువులను ఏకవచనంతో సంబోధిస్తే వారిని చంపినట్లే కాగలదన్నాడు. వెంటనే అర్జునుడు అలాగే చేశాడు. ధర్మరాజును అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు నేనింకా బతికుండటం వృథా అంటూ మరణానికి సిద్ధమయ్యాడు. వెంటనే శ్రీ కృష్ణుడు అతణ్ని ఆపి ఆత్మస్తుతి చేసుకోవడం ఆత్మహత్యా సదృశమని చెప్పాడు. వెంటనే ధర్మరాజు ఎదుట అర్జునుడు తనను తాను అనేక రకాలుగా ప్రశంసించుకొని తాను చేసిన పాపం బారినుంచి విముక్తుడయ్యాడు. ఈ విధంగా ధర్మం అనేక ధర్మసూక్ష్మాలతో మిళితమై ఉంటుంది.(చదవండి: -
శివపరివారం కొలువుదీరిన మహాపుణ్య క్షేత్రం ఉజ్జయిని
పరమేశ్వరుడు కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఉజ్జయిని. ఇక్కడ ఉన్నది మహాకాళేశ్వరుడు. మహాకాలుడు అంటే చాలా నల్లనివాడు అని ఒక అర్థం. అలాగే మృత్యువుకే మృత్యువు, కాలానికే కాలం.. అంటే కాలాన్నే శాసించేవాడు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి విశిష్టత ఏమిటంటే.. తెల్లవారుఝామున జరిగే అభిషేకం. అది భస్మాభిషేకం. ఆ భస్మం చితాభస్మం. అంటే మహాకాలేశ్వరుడి రూపంలో ఉన్న శివుడికి అప్పుడే కాలిన శవభస్మంతో చేసే అభిషేకం అత్యంత ప్రీతిపాత్రం. దీనికే భస్మహారతి అని పేరు. తెల్లవారుఝామున 3.30 గంటలకు మాత్రమే జరిగే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు పురుషులు మాత్రమే అర్హులు. అదీ ప్రత్యేక వస్త్రధారణతో మాత్రమే. సాధారణంగా జాతకంలో అపమృత్యు దోషాలు ఉన్నవారు, దీర్ఘరోగాలతో బాధపడేవారు, అంతుచిక్కని సమస్యలతో మానసిక వేదన పడుతున్నవారు ఈ భస్మహారతిలో పాల్గొని, ఉపశమనం పొందుతుంటారు.నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిని పూర్వం అవంతీ నగరమనేవారు. సప్తమహానగరాలలో అవంతీనగరం కూడా ఒకటి. ఈ ఉజ్జయిని నగరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మూలంగా ఎంత ప్రసిద్ధి పొందిందో, మహాకాళికాదేవి వల్ల కూడా అంత ప్రసిద్ధి పొందింది కాబట్టి ఉజ్జయినీ నగరానికి వెళితే ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని, అటు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మహాకాళిని కూడా సందర్శించి నేత్రపర్వాన్ని పొందవచ్చు.స్థలపురాణంఉజ్జయినీ నగరంలో వేదప్రియుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నలుగురు కొడుకులూ తండ్రికి తగ్గ పుత్రులు. ఆ నగరానికి సమీపంలోని పర్వతం మీద దూషణుడనే రాక్షసుడుండేవాడు. వాడు ఋషి పుంగవుల జపతపాలకు, వైదిక ధర్మానుష్టానానికి ఆటంకం కలిగిస్తూ ఉండేవాడు. దూషణుడు ఉజ్జయినీ పురప్రజలను కూడా అలాగే భయభ్రాంతులకు గురిచేయసాగాడు. అయితే వేదప్రియుడు మాత్రం ఇవేమీ పట్టకుండా ఒక పార్థివ లింగాన్ని తయారు చేసుకుని, శివదీక్షలో తదేక ధ్యానంలో గడపసాగాడు.దూషణుడు ఒకనాడు వేదప్రియుణ్ణి సంహరించేందుకు ప్రయత్నించగా ఆ లింగం నుంచి మహాశివుడు మహాకాళేశ్వరుడిగా ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని భస్మం చేశాడు. వేదప్రియుడి భక్తితత్పరతలకు సంతోషించిన మహేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అసహాయులైన, దీనులైన తనవంటి భక్తులను అకాల మృత్యుభయం నుంచి కాపాడేందుకు ఇక్కడే ఉండవలసిందిగా నీలకంఠుడిని వేడుకున్నాడు వేదప్రియుడు. ఆ కోరికను మన్నించిన స్వామి ఆనాటి నుంచి మహాకాళేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగస్వరూపుడిగా ఉజ్జయినీ క్షేత్రంలో కొలువుదీరాడు.మరో గాథఉజ్జయినీ రాజ్యాధిపతి చంద్రసేనుడు ఒకరోజు శివపూజ చేస్తుండగా శ్రీకరుడనే గోపాలుడు అక్కడికి వచ్చాడు. చంద్రసేనుడి శివార్చనా విధానాన్ని గమనించి తానూ అలాగే స్వామికి పూజ చేయాలని భావించిన శ్రీకరుడు, దారిలో ఒక రాతిముక్కను తీసుకుని దాన్నే శివలింగంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజించసాగాడు. ఆ బాలుడు పూజలో నిమగ్నమై ఒక్కోసారి బాహ్యస్మృతిని కూడా కోల్పోయేవాడు. తల్లి ఎంత పిలిచినా పలికేవాడు కాదు. ఒకరోజు పూజలో లీనమై బాహ్యస్మృతి మరిచిన శ్రీకరుని దగ్గర నుంచి అతను శివలింగంగా భావిస్తున్న రాతిముక్కను అతని తల్లి తీసిపారేసింది. స్మృతిలోకి వచ్చిన బాలుడు తల్లి చేసిన పనికి చింతస్తూ శివుణ్టి వేడుకుంటూ ధ్యానం చేశాడు. అప్పుడు శివుడు అతన్ని కరుణించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు.భస్మాభిషేకంఉజ్జయినీ మహాకాళేశ్వరుడికి సాధారణ అభిషేకానంతరం చితాభస్మంతో అభిషేకం చేయడం ఇక్కడి విశిష్టత. చితాభస్మం సాధారణంగా అమంగళకరమైనా, స్వామిని తాకడం వల్ల అతి మంగళప్రదమైనదిగా మారుతోంది. భస్మ హారతితోబాటు మరోవిధమైన అర్చన కూడా కాలేశ్వరుడికి జరుగుతుంది. ఇది భస్మాభిషేకం. ఆవుపేడను కాల్చి బూడిద చేసి, మూటగట్టి, దానిని శివలింగం పై భాగాన వేలాడదీసి, అటువంటి మరో మూటతో మెల్లగా కొడుతుంటారు.అప్పుడు భస్మం మహాకాలుడి మీదనేగాక, మొత్తం ఆలయమంతా పరుచుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో నాగసాధువులు రుద్రనమకం చెబుతూ ఢమరుకం, మృదంగం, భేరీలు మోగిస్తూ, శంఖనాదాలు చేస్తారు. ఆ సమయంలో ఆలయంలో ఉన్నవారికి సాక్షాత్తూ కైలాసంలోనే ఉన్నామేమో అనుకునేంతటి అలౌకికానుభూతి కలుగుతుంది.ఇతర విశేషాలుమహాకాళేశ్వరాలయం నేటి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో క్షి్ర΄ా(శి్ర΄ా)నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో ఏడు సాగర తీర్థాలు, 28 సాధారణ తీర్థాలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండాలు ఉన్నాయి. ఉజ్జయినిలో శివలింగాలు మూడు అంతస్థులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాలేశ్వర లింగం. ఇది దక్షిణాభిముఖంగా ఉంటుంది. మహాకాలేశ్వరుడి విగ్రహం పైన ఓంకారేశ్వర లింగం ఉంటుంది. ఆ పైన ఉండేది నాగచంద్రేశ్వర లింగం. ఆలయంలో గణపతి, ΄ార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పుగోడలపై ఉంటాయి. దక్షిణభాగంలో మహాదేవుని వాహనమైన నంది విగ్రహం ఉంటుంది. మహాకాలేశ్వరలింగం స్వయంభూలింగం. ఇది అత్యంత ్ర΄ాచీనమైనది. సృష్టి ్ర΄ారంభంలో బ్రహ్మ శివుడిని ఇక్కడ మహాకాలునిగా కొలువు తీరి ఉండమని ్ర΄ార్థించాడట. బ్రహ్మ అభీష్టం మేరకు శివుడు ఇక్కడ కొలువై ఈ మందిరానికి ప్రత్యేక శోభను ఇస్తున్నాడని పురాణగాథలు ఉన్నాయి. వేల సంవత్సరాలుగా ఉన్న ఉజ్జయిని మహాకాలుడి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండదీ΄ాలని పిలుస్తారు.కాలభైరవాలయంఉజ్జయిని వెళ్లినవారు ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైరవుని సందర్శించుకుని, అటు పిమ్మట మహాకాళికా లేదా మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడం ఆచారం. కాగా కాలభైరవుడి విగ్రహానికి మద్యంతో అభిషేకం చేయడం, మామూలుగా గుడికి కొబ్బరికాయ తీసుకు వెళ్లినట్లుగా కాలభైరవుడి ఆలయానికి వెళ్లే భక్తులు మద్యం, కల్లు సీసాలను తీసుకువెళ్లి సమర్పించడం ఆచారం. కాలభైరవార్చన విశిష్ట ఫలప్రదమైనదిగా పేరు పొందింది.ఎలా వెళ్లాలంటే..? హైదరాబాద్‌నుంచి ఉజ్జయినికి నేరుగా రైళ్లున్నాయి. లేదంటే పూణే వెళ్తే అక్కడినుంచి కూడా ఉజ్జయినికి రైళ్లుంటాయి. హైదరాబాద్‌నుంచి జైపూర్ఎక్స్ప్రెస్ ట్రెయిన్ ఎక్కితే సుమారు 19 గంటల్లో ఉజ్జయినిలో దిగవచ్చు. చవకగా, తొందరగా వెళ్లగలిగే మార్గాలలో అది ఒకటి. ఇంకా యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా వెళ్లవచ్చు. విమానంలో అయితే హైదరాబాద్‌నుంచి పూణే లేదా ఇండోర్ వెళ్తే అక్కడినుంచి ఉజ్జయినికి రైలు లేదా బస్సులో వెళ్లవచ్చు.– డి. పూర్ణిమాభాస్కర్ (చదవండి: దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!) -
మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపించే నెలరేడు!
ప్రకృతి తీరుతెన్నులను చురుకుగా పరిశీలించే స్వభావం కలవారికి ఎవరికయినా, కలువపూలు వెన్నెలలో వికసిస్తాయనీ, మనిషి మనసుకూ చందమామకూ సంబంధం ఉంటుందనీ మరొకరు చెప్పవలసిన పని ఉండదు. పున్నమి చంద్రుడిని చూస్తే... సముద్రమే పట్టరాని ఆవేశంతో పొంగిపోతుంది. మనిషి మనసూ అంతే. ‘రసమయ జగతిని ఉసిగొలిపే తన మిసమిస’తో నెలరేడు మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపిస్తాడు. మనసు పని తీరును తీవ్రతరం చేస్తాడు. కోరిన దిశలో మరింత వేగంగా నడిపిస్తాడు. భోగులను భోగంవైపూ, యోగులను యోగంవైపూ, భావుకులను భావ తీవ్రతవైపూ, ప్రేమికులను ప్రేమ జ్వరం దిశగానూ, భక్తులను అనన్య భక్తి మార్గంలోనూ నడుపుతాడు. ‘చంద్రమా మనసో జాతంః’ చంద్రుడు విరాట్ పురుషుని మనసు నుండి సృష్టి అయినవాడు అని వేదం. అందుకే కాబోలు మనసుకు పున్నమి చంద్రుడంటే అంత వెర్రి ఆకర్షణ.అందునా, కార్తీక పూర్ణిమ మరీ అందమైంది. అసలే శరదృతువు. ఆపైన రాతిరి. ఆ పైన పున్నమి. పున్నమి అంటే మామూలు పున్నమి కాదు. పుచ్చ పూవు వెన్నెలల పున్నమి. మనసు చురుకుగా చిందులు వేస్తూ పరవశంతో, రెట్టింపు ఉత్సాహంతో విజృంభించి విహరించే సమయం.అయితే చిత్త నది ‘ఉభయతో వాహిని’ అన్నారు. అది ‘కల్యాణం’ (శుభం) దిశగానూ ప్రవహించగలదు. వినాశం దిశగానూ ప్రవహించ గలదు. మనస్సు యజమానిగా ఉండి, ఇంద్రియాలను నియంత్రిస్తే, చిత్త నది సరయిన దిశలో ప్రవహించేందుకు అవి సాయపడతాయి. ఇంద్రి యాలు లాక్కెళ్ళినట్టు, మనసు వెళితే ప్రవాహం వినాశం దిశ పడుతుంది.చదవండి: కార్తీక పూర్ణమి విశిష్టత.. త్రిపుర పూర్ణిమ అని ఎందుకు అంటారు?చిత్త నదిని ‘కల్యాణం’ దిశగా మళ్ళించే ప్రయత్నాలకు పున్నమి దినాలు అనువైనవనీ, పున్నములలో కార్తీక పూర్ణిమ ఉత్తమోత్తమమనీ భారతీయ సంప్రదాయం. ఈ పుణ్య దినాన చేసిన నదీస్నానాలకూ, తులసి పూజలకూ, జపతప దాన యజ్ఞ హోమాది కర్మలకూ ఫలితాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయని నమ్మిక. ప్రాకృతిక కారణాలవల్ల ఈ పర్వదినాన, మనసు మరింత శ్రద్ధా, శుద్ధీ నిలుపుకొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈనాడు చేసే ఉపవాసాలూ, శివారాధనలూ, ప్రత్యేక దీపారాధనలూ, దీపదానాలూ, ఆలయాలలో ఆకాశ దీప నమస్కారాలూ, జ్వాలా తోరణ దర్శనాలూ వంటి పర్వదిన విధులు, సత్ఫలాలు కాంక్షించే సజ్జనులకు పెద్దలు చూపిన మార్గం.కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు!!– ఎం. మారుతి శాస్త్రి -
Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు?
కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు, విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. వారాణాసి లాంటి ఉత్తర భారతదేశంలోఇదే రోజుని దేవ దీపావళి, దేవ దివాళి అని పిలుస్తుంటారు. అలాగే అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల దీన్ని త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. అంత పరమ పవిత్రమైన ఈ కార్తీక పూర్ణిమ వెనుకున్న నేపథ్యం, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా..!ఏం చేస్తారంటే..కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి ఆ పరమ శివుడిని పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకి ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే , శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని... అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నదీ స్నానం మరింత పవిత్రతని , పుణ్యంని చేకూరుస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందువల్లే కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసి భక్తుల రాకతో కిటకిటలాడుతుంటుంది.ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మరింత పుణ్యం , పూజా ఫలం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది కార్తిక పౌర్ణమి రోజున 365 దీపాలు వెలిగిస్తుంటారు. దీనికి అర్థం.. సంవత్సరంలో ఒక్కో రోజుకి ఒక్కో దీపం చొప్పున అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి మీ అనుగ్రహం కోరుకుంటున్నాను దేవా అని.సత్యనారాయణ వ్రతం :సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కారణం ఆ శ్రీ మహా విష్ణువుకి ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతి పాత్రమైనది కావడమే. అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయడం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజా ఫలం అధికం అని అంటుంటారు పెద్దలు.ఏకాదశి రుద్రాభిషేకం :ఈరోజు శివనామస్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలో సర్వ సాధారణంగా కనిపించేది ఏకాదశి రుద్రాభిషేకం. పదకొండుసార్లు రుద్ర చమకం లేదా శివ నామస్మరణతో శివుడిని అభిషేకించడమే ఈ ఏకాదశి రుద్ర అభిషేకం ప్రత్యేకత. జ్వాలాతోరణం...ఈ రోజు సంధ్యాసమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకిలో ఉంచి ఈ తోరణం నుంచి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకిని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుంచి చేసిన పాపాలన్నీ పటాపంచలై సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని శాస్త్రవచనం.ఈ పూర్ణిమకు మరొక పేరు..కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకపురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామ దానం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని భక్తుల నమ్మకం. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత గలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. పౌర్ణమినాడు శ్రీ కృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈ రోజు శ్రీ కృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది. మరోవేపు సిక్కులు , జైనులు కూడా..సిక్కులు , జైన మతస్తులు కూడా ఈ కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటుంటారు. సిక్కులు దైవంగా భావించే శ్రీ గురు నానక్ పుట్టింది కార్తీక పౌర్ణమి రోజే కావడంతో సిక్కులు ఈ రోజుని పవిత్రమైనదిగా భావిస్తారు. జైన్లు కూడా ఈ కార్తీక పౌర్ణమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం విశేషం.(చదవండి: 365 వత్తులు..కార్తీక పురాణం ఏం చెబుతోంది?) -
డియోర్ బ్యాగ్‌పై క్లారిటీ.. ఎవరీ జయ కిషోరి
ఢిల్లీ: ఆధ్యాత్మిక వక్త జయ కిషోరి సుమారు రూ.2 లక్షల విలువైన డియోర్ బ్యాగ్‌తో ఇటీవల ఎయిర్‌పోర్టులో కనిపించారు. దీంతో నిరాడంబర జీవితం గడపాలని బోధనలు చేసే.. ఆమె ఇలా ఖరీదైన బ్యాగ్‌తో కనిపించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె ఖరీదై బ్యాగ్ వాడటంపై ఫాలోవర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై 29 ఏళ్ల జయ కిషోరీ తాజాగా స్పందించారు.‘‘నేను కూడా సాధారణ అమ్మాయినే. సాధారణమైన ఇంట్లోనే ఉంటున్నా. కుటుంబంతో కలిసి జీవిస్తున్నా. యువత కష్టపడాలి. కష్టపడి డబ్బులు సంపాదించాలి. మంచి జీవితం కోసం ఖర్చు పెట్టుకోవాలి. కుటుంబానికి ఇవ్వాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పాను. ఈ బ్యాగ్ కస్టమైజ్డ్. అందులో లెదర్ ఉపయోగించలేదు. కస్టమైజ్డ్ అంటే మన ఇష్ట ప్రకారం తయారు చేసుకోవచ్చు. దానిపై నా పేరు కూడా రాసి ఉంది. ...నేనెప్పుడూ లెదర్ వాడలేదు, వాడను కూడా. నేను దేనినీ వదులుకోలేదు. కాబట్టి నేను అలా చేయమని మీకు ఎలా చెప్పగలను?. నేను సన్యాసిని, సాధువు లేదా సాధ్విని కాదని మొదటి రోజు నుంచే స్పష్టంగా చెబుతున్నా’’ అని ఆమె వివరించారు. జయ కిషోరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 12.3 మిలియన్లకు ఫాలో అవుతున్నారు.Jaya Kishori ji Said I'm not BABa or SANT, I'm just ordinary girl !!Waah kya Acting hai phle Dharm k naam pr paisa chapo or fir ye gyaan do . waah DIDI waah 🫡 pic.twitter.com/bCQjD4zedE— Yogesh (@yogesh_xrma) October 29, 2024ఎవరీ జయ కిషోరి..యువ ఆధ్యాత్మిక వక్తగా జయ కిషోరి తన ప్రేరణాత్మక సందేశాల ద్వారా వార్తల్లో నిలిచారు. ఆమె ఆధ్యాత్మిక కథలు చెప్పటంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆమె వక్తనే కాకుండా సంగీత కళాకారిణీ, కథకురాలు కూడా. జయ కిషోరి 13 జూలై, 1996న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఓపెన్ స్కూల్ ద్వారా బి.కామ్ పూర్తి చేశారు. ఆమె ఫాలోవర్స్ ద్వారా 'ది మీరా ఆఫ్ మోడర్న్ వరల్డ్', 'కిషోరి జీ'గా ప్రసిద్ధి చెందారు. జయ కేవలం ఏడేళ్ల వయస్సులోనే బహిరంగంగా ఉపన్యాసం ఇవ్వటం ప్రారంభించారు. ఆమె తన 7 రోజుల నిడివి గల మానసిక కథ 'శ్రీమద్ భగవత్ గీత', 3 రోజుల నిడివి గల 'కథా నాని బాయి రో మేరో'తో గుర్తింపు పొందారు. మరోవైపు.. ఆమె శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఆమె భజనలు యూట్యూబ్‌లో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఆమె జూలై 24, 2021న ‘జయ కిషోరి ప్రేరణ’ అనే కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఆమె ఛానెల్‌కు దాదాపు 9 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రసిద్ధ పాటల్లో ‘శివ్ స్తోత్ర’, ‘మేరే కన్హా’, ‘సాజన్ మేరో గిర్ధారి’ వంటివి ఉన్నాయి.చదవండి: టికెట్ నిరాకరణ, సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం.. ‘తగిన శాస్తి జరిగిందంటూ’... -
ఊరకరారు మహాత్ములు...
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో ఐదవది – ‘....నృయజ్ఞోతిథిపూజనమ్’. అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. నేను ఆహ్వానిస్తే నా ఇంటికి వచ్చినవాడు అతిథి. నేను ఆహ్వానించకుండా వచ్చినవాడు– అభ్యాగతుడు. అతిథి పూజనమ్...పూజించడం అంటే గౌరవించడం. ఇంటికి వచ్చినవారిపట్ల మర్యాదగా మెలుగుతూ గౌరవించి పంపడం నేర్చుకో... తన ఇంటికి వచ్చినవాడు గొప్పవాడా, నిరక్షరాస్యుడా, సామాన్యుడా అన్న వివక్ష గృహస్థుకు ఉండదు. భోజనం వేళకు వచ్చాడు. భోజనం పెట్టు. లేదా ఏ పండో కాయో లేదా కాసిని మంచినీళ్లయినా ఇవ్వు.. అన్ని వేళలా అన్ని పెట్టాలనేం లేదు. వచ్చిన వారిని ప్రేమగా పలకరించు. నీకూ పరిమితులు ఉండవచ్చు. వాటికి లోబడే ఎంత సమయాన్ని కేటాయించగలవో అంతే కేటాయించు. కానీ ఒట్టి చేతులతో పంపకు. పండో ఫలమో ఇవ్వు. లేదా కనీసం గుక్కెడు చల్లటి నీళ్ళయినా ఇవ్వు. నీకు సమయం లేక΄ోతే ఆ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించు. అతిథి సేవతో గృహస్థు పాపాలు దహించుకు ΄ోతున్నాయి. కారణం – ఆయన ఏది పెడుతున్నాడో దానిని ‘నేను పెడుతున్నాను’ అన్న భావనతో పెట్టడు. వచ్చిన అతిథి నీ దగ్గరకు వచ్చి గుక్కెడు నీళ్ళు తాగాడు, ఫలహారం చేసాడు, భోజనం చేసాడు...అంటే అవి అతనికి లేక దొరకక రాలేదు నీదగ్గరికి. ఆయన హాయిగా అవన్నీ అనుభవిస్తున్న స్తోమత ఉన్నవాడే. కానీ ఆయన ఏదో కార్యం మీద వచ్చాడు. భగవంతుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని రాడు నీ ఇంటికి. అతిథి రూపంలో వస్తాడు. ఆ సమయంలో నీవిచ్చిన నీళ్ళు తాగవచ్చు, పట్టెడన్నం తినవచ్చు, బట్టలు కూడా పుచ్చుకోవచ్చు. కానీ ఆయన పుచ్చుకున్న వాడిగా ఉంటాడు. అలా ఉండి నీ ఉద్ధరణకు కారణమవుతాడు. అందునా నీవు పిలవకుండానే వచ్చాడు. అభ్యాగతీ స్వయం విష్ణుః– విష్ణుమూర్తే నీ ఇంటికి వచ్చాడని గుర్తించు. మహితాత్ములైనవారు, భాగవతోత్తములు, భగవద్భక్తి కలవారు నీ ఇంటికి వస్తే.. గృహదేవతలు కూడా సంతోషిస్తారు.అంటే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం అతిథి పూజనమే. అతిథికి నీవు పెట్టలేదు. భగవంతుడే అతిథి రూపంలోవచ్చి నీదగ్గర తీసుకున్నాడు. అతిథిని మీరు విష్ణు స్వరూపంగా భావించి పెట్టినప్పుడు మీ అభ్యున్నతికి కారణమవుతుంది. మహాత్ములయినవారు మనింటికి వస్తూండడమే దానికి సంకేతం. శ్రీ కృష్ణుడి క్షేమ సమాచారం తెలుసుకురమ్మని వసుదేవుడు పంపిన పురోహితుడితో నందుడు ‘‘ఊరకరారు మహాత్ములు/ వారథముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం/గారణము మంగళములకు/ నీ రాక శుభంబు మాకు, నిజము మహాత్మా !’’ అంటాడు. అతిథి ఇంట అడుగు పెట్టడం అంత గొప్పగా భావిస్తుంది మన సమాజం.రామకార్యంమీద పోతున్న హనుమకు మైనాకుడు ఆతిథ్యం స్వీకరించమని అర్ధిస్తాడు. ఇప్పుడు వీలుపడదంటే...కనీసం ఒక్క పండయినా తిని కాసేపు విశ్రాంతయినా తీసుకువెళ్ళమంటాడు. ఇంటి ముందు నిలిచిన బ్రహ్మచారి ‘భవతీ భిక్షాందేహి’ అంటే... ఇంట్లో ఏవీ లేవంటూ ఇల్లంతా వెతికి ఒక ఎండి΄ోయిన ఉసిరికాయ తెచ్చి శంకరుడి భిక్షా΄ాత్రలో వేస్తుంది ఒక పేదరాలు. ఆ మాత్రం అతిథి పూజకే ఆమె ఇంట బంగారు ఉసిరికకాయలు వర్షంలా కురిసాయి. -
సప్త మోక్షపురి..మాంగళ్య గౌరికాలయం..
మాంగల్య గౌరీ/మంగళ గౌరీ/సప్త మోక్షపురి/ పంచ గయా క్షేత్రం బీహార్‌లోని గయలో మంగళగౌరి కొండలు, ఫల్గుణీ నది ఒడ్డున ఉన్న 51 శక్తి పీఠాలలో ఒకటి. 15వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ ఆదిశక్తి దేవి పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. మంగళ గౌరీ ఆలయం గురించిన ప్రస్తావన పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, ఇతర గ్రంథాలు, తాంత్రిక రచనలలో తప్పక కనిపిస్తుంది. మంగళగౌరిని ఉపకార దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం ఉప–శక్తి పీఠాన్ని కలిగి ఉంది. శ్రీ సతీదేవి శరీరభాగాలు భూమిపై పడిన 108 ప్రదేశాలను శక్తి పీఠాలుగా కొలుస్తారు. వాటిలోని కీలకమైన వాటిని 51 శక్తిపీఠాలుగా, తిరిగి వాటిలోని అత్యంత కీలకమైన వాటిని అష్టాదశ శక్తిపీఠాలుగా పూజిస్తారు. వాటిలో అమ్మవారి ఎడమ స్తనం పడిన ప్రదేశమే గయలోని మాంగళ్య గౌరికా ఆలయం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి, శ్రీ సతీదేవి రొమ్ము భాగం భూమిపై పడిన ప్రదేశం శ్రీ మాంగల్య గౌరీ మందిరం. ఈ మందిరంలో రెండు గుండ్రని రాళ్లు ఉన్నాయి, ఇవి సతీదేవి స్తనాలను సూచిస్తాయి. ఇక్కడ శక్తి రొమ్ము రూపంలో పూజించ బడుతుంది, ఇది పోషణకు చిహ్నం. ఎవరైతే కోరికలు, ప్రార్థనలతో అమ్మ దగ్గరకు వస్తారో, వారు అన్ని కోరికలు తీరి విజయవంతంగా తిరిగి వస్తారని నమ్ముతారు. సతీదేవి మృతదేహంతో శివుడు కైలాసానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశం గుండా వెళ్ళాడు అంటారు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మితమైంది. గుడికి చేరుకోవాలంటే ఆ చిన్న కొండ ఎక్కాలి. మెట్ల మార్గం స్థానిక ప్రజల నివాసాల మధ్య ఉంటుంది. మెట్ల మార్గం ప్రారంభంలో, భీముని ఆలయం ఉంది. అతని మోకాలి ముద్రను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ భీముడు శ్రాద్ధకర్మ చేసాడు, అందుకే దీనిని భీమవేది గయ అని పిలుస్తారు.కొండపై కూర్చున్న అమ్మవారిని దయగల దేవతగా భావిస్తారు. వర్షాకాలంలో ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్త్రీలు తమ కుటుంబాలు అభివృద్ధి చెందాలని, వారి భర్తలు విజయం, కీర్తిని పొందాలని ఉపవాసం ఉంటారు. ఈ పూజలో మంగళ గౌరీ దేవికి 16 రకాల కంకణాలు, 7 రకాల పండ్లు, 5 రకాల మిఠాయిలు నైవేద్యంగా పెట్టడం మొదటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. మంగళ గౌరీ ఆలయంలో శివుడు, దుర్గ, దక్షిణ–కాళి, మహిషాసుర మర్దిని, సతీదేవి వివిధ రూపాలను చూడవచ్చు. ఈ ఆలయ వివరణ పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, శ్రీ దేవి భాగవత పురాణం, మార్కండేయ పురాణాలలో కూడా ఉంది. ఈ ఆలయ సముదాయంలో కాళి, గణపతి, శివుడు, హనుమంతుని ఆలయాలు కూడా ఉన్నాయి. ఆశ్వీయుజ మాసంలో జరిగే లక్షలాది మంది భక్తులు ఉత్సవాలలో పాల్గొనేందుకు ఆలయానికి వస్తుంటారు.ఈ క్షేత్రంలోని ప్రసిద్ధ పండుగ ’నవరాత్రి’, ఇది అక్టోబర్‌లో జరుగుతుంది. ఈ మందిరం ‘మరణానంతర క్రతువులకు’ (శ్రాద్ధము) ప్రసిద్ధి చెందింది. ‘మహా–అష్టమి’ (ఎనిమిదవ రోజు), భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. ఈ ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ మంగళ గౌరీ వ్రతం (వ్రతం), దీనిని మహిళలు తమ కోరికల సాఫల్యం కోసం చేస్తారు. మంగళవారాలలో ఉపవాసం ఉండి, స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం, సంతానం, కుటుంబ శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. కొత్తగా పెళ్లయిన స్త్రీలు ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు, ఇతర వివాహిత స్త్రీలందరూ శ్రావణ మాసంలో మాత్రమే వ్రతం చేస్తారు. ఇవే కాకుండా, ఈ ఆలయంలో దీపావళి, హోలీ, జన్మాష్టమి వంటి ఇతర ప్రధాన పండుగలను కూడా బాగా జరుపుకుంటారు. ఆలయం ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. ఎలా వెళ్లాలి?గచ రైల్వే జంక్షన్ ఆలయానికి 4 కిమీ దూరం, బస్ స్టాండ్ ఆలయం నుండి 4.7 కిమీ దూరంలో ఉంది. -
Ananda Nilayam: ఒకేచోట.. ఈ అష్టాదశ శక్తిపీఠాలు!
పురాణాల ప్రకారం, అమ్మవారిని ఆరాధించే దేవాలయాలలో ప్రశస్తమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. శివుడి అర్ధాంగి సతీదేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠాలను దర్శించుకుని, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని భక్తులు భావిçస్తుంటారు. రకరకాల కారణాల వల్ల కొంతమందికి శక్తిపీఠాల దర్శనభాగ్యం కరవవుతోంది. అలాంటివారికి అన్ని శక్తిపీఠాలను ఒకేచోట దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ అష్టాదశ శ«క్తిపీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించారు.అది ఎక్కడో కాదు తెలంగాణ, సిద్దిపేట జిల్లా, కొండపాక గ్రామ శివారులోని ఆనంద నిలయంలో! గత ఏడాది నవంబరులో.. ఇక్కడి అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో 18 శక్తిపీఠాలతో పాటు లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులనూ ప్రతిష్ఠించారు.గట్టు రాంరాజేశం గుప్త సంకల్పంతో..సిద్దిపేటకు చెందిన గట్టు రాంరాజేశం గుప్త అమ్మవారికి అపర భక్తుడు. అష్టాదశ శక్తి పీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఒకసారి, తన మనసులో మాటను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆనంద నిలయ వ్యూహకర్త కేవీ రమణాచారి ముందుంచారు. ఆయన ట్రస్ట్ సభ్యులతో చర్చించి, ఆనంద నిలయంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా రాంరాజేశం రూ. 1.5 కోట్లను అందజేశారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమ ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాలను నిర్మించారు. అమ్మవార్ల రాతి విగ్రహాలను తమిళనాడులో తయారుచేయించారు. వీటిని పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి, శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రతిష్ఠించారు.22 దేవాలయాలు..పద్దెనిమిది శక్తిపీఠాల్లో పదిహేడు మనదేశంలో ఉండగా, శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. మన దేశంలో ఉన్న కామాక్షీదేవి (కంచి, తమిళనాడు), శృంఖలాదేవి (కోల్‌కతా, పశ్చిమబెంగాల్), చాముండేశ్వరీదేవి (మైసూరు, కర్ణాటక), జోగులాంబ (ఆలంపూర్, తెలంగాణ), భ్రమరాంబికాదేవి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), మహాలక్ష్మీదేవి (కొల్హాపూర్, మహారాష్ట్ర), ఏకవీరాదేవి (మాహుర్, మహారాష్ట్ర), మహాకాళీదేవి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), పురుహూతికాదేవి (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), గిరిజాదేవి (జాజ్‌పూర్, ఒడిశా), మాణిక్యాంబాదేవి (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), కామాఖ్యాదేవి ( గౌహతి, అస్సాం), మాధవేశ్వరీదేవి (ప్రయాగ, ఉత్తరప్రదేశ్), వైష్ణవీదేవి (జమ్మూ, జమ్మూ– కశ్మీర్ రాష్ట్రం), మంగళగౌరీదేవి (గయ, బిహార్), విశాలాక్షీ (కాశి), సరస్వతీదేవి (శ్రీనగర్) రూపాలను కొండపాక శివారులోని ఆనంద నిలయంలో దర్శించుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మరకత లింగం, శివపార్వతులతో కూడిన 22 దేవాలయాలను నిర్మించడం విశేషం. ఆయా శక్తిపీఠాల్లో జరిగినట్లుగానే ఇక్కడా పూజాకార్యక్రమాలుంటాయి. ప్రతి పౌర్ణమికి హోమం, ప్రతి శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు.సామాజిక సేవ.. ఆధ్యాత్మిక శోభ!ఆనంద నిలయంలో సామాజిక సేవతోపాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సుమారు వంద ఎకరాల్లోని ఈ ట్రస్ట్‌లో ఒకవైపు వృద్ధాశ్రమం, మరోవైపు అనాథాశ్రమం, ఇంకోవైపు సత్యసాయి పిల్లల హృద్రోగ ఆసుపత్రి, జూనియర్ కళాశాల ఉన్నాయి. భక్తులు, సామాజిక సేవకుల సందర్శనతో ఈ ప్రాంగణమంతా సందడిగా ఉంటుంది. ఇది హైదరాబాద్‌కు 73 కిలోమీటర్లు, సిద్దిపేటకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట, ఫొటోలు: కె సతీష్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్శక్తిపీఠాల్లో జరిగినట్టుగానే..ఇక్కడ పూజాకార్యక్రమాలన్నిటినీ శక్తిపీఠాల్లో మాదిరే జరుపుతాం. భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం పోస్తారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణ ఉంటుంది. ప్రతిరోజు శివుడికి, మరకత లింగానికి రుద్రాభిషేకం చేస్తాం. – పురుషోత్తమ రామానుజ, అర్చకుడుఅందరికీ దర్శనభాగ్యం కలగాలని.. అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకోవటం కొందరికి సాధ్యపడకపోవచ్చు. అలాంటివారికి శక్తిపీఠాల దర్శనభాగ్యం అందాలనేది నాన్నగారి కోరిక. కేవీ రమణాచారి, ఇంకెంతో మంది దాతల సహకారంతో నేడు అది నెరవేరింది. – గట్టు అమర్నాథ్, రవి, శ్రీనివాస్అమ్మవారి అనుగ్రహం..కొండపాకలో అష్టాదశ శక్తిపీఠాల నిర్మాణం అమ్మవారి దయ. అమ్మవారి అనుగ్రహం, అందరి సహకారంతో దేవాలయ నిర్మాణాలు సాధ్యమయ్యాయి. – డాక్టర్ కేవీ రమణాచారి, ఆనంద నిలయ వ్యూహకర్తఇవి చదవండి: అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే.. -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: అది... క్షీరసాగరమథనం!
మనిషి జీవితంలో సంస్కారానికి ఆలంబన గృహస్థాశ్రమంలోనే. దానిలోకి వెడితే భార్య వస్తుంది, పిల్లలు వస్తారు...అలా చెప్పలేదు శాస్త్రం. అక్కడ ఆటు ఉంటుంది, పోటు ఉంటుంది. దెబ్బలు తగిలినా, సుఖాలు వచ్చినా... అవన్నీ అనుభవంలోకి రావల్సిందే. వాటిలో నీవు తరించాల్సిందే. కుంతీ దేవి చరిత్రే చూడండి. ఎప్పుడో సూర్య భగవానుడిని పిలిచి నీవంటి కొడుకు కావాలంది. కర్ణుడిని కనింది. అయ్యో! కన్యా గర్భం.. అపఖ్యాతి ఎక్కడ వస్తుందో అని విడిచిపెట్టలేక విడిచిపుచ్చలేక... మాతృత్వాన్ని కప్పిపుచ్చి నీళ్ళల్లో వదిలేసింది. తరువాత బాధపడింది. కొన్నాళ్ళకు పాండురాజు భార్యయింది. సుఖంగా ఉన్నాననుకుంటున్న తరుణంలో సవతి మాద్రి వచ్చింది. పిల్లలు లేరంటే మంత్రంతో సంతానాన్ని ధర్మరాజు, భీముడు, అర్జునుడిని ΄÷ందింది. ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పమన్నాడు పాండురాజు. చెప్పింది. మాద్రికి నకులుడు, సహదేవుడు పుట్టారు.శాపం వచ్చింది. పాండురాజు చచ్చిపోయాడు. మాద్రి సహగమనం చేసింది. ఈ పిల్లలు నీ పిల్లలేనని ఏం నమ్మకం? అని... పాండురాజు పిల్లలకు రాజ్యంలో భాగం ఇవ్వరేమోనని... ఇది ధార్మిక సంతానం అని చెప్పించడానికి మహర్షుల్ని వెంటబెట్టుకుని పిల్లల్ని తీసుకుని హస్తినాపురానికి వెళ్లింది. అంత కష్టపడి వెడితే లక్క ఇంట్లో పెట్టి కాల్చారు. పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పారేసారు, విషం పెట్టారు. .. అయినా చలించకుండా ఇన్ని కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆఖరికి ధర్మరాజు ఆడిన జూదంతో అన్నీ పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళాల్సి వచ్చింది.అజ్ఞాతవాసం కూడా అయింది. తిరిగొచ్చారు. కురుక్షేత్రం జరిగింది. హమ్మయ్య గెలిచాం, పట్టాభిషేకం కూడా అయిందనుకున్నది. కంటికి కట్టుకున్న కట్టు కొంచెం జారి... కోపంతో ఉన్న గాంధారి చూపులు ప్రసరిస్తే ధర్మరాజుకు కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. అటువంటి గాంధారీ ధృతరాష్ట్రులు అరణ్యవాసానికి వెడుతుంటే... తన పిల్లలు గుర్తొచ్చి గాంధారి మళ్ళీ ఎక్కడ శపిస్తుందోనని, మీకు సేవ చేస్తానని చెప్పి... సుఖపడాల్సిన తరుణంలో వారి వెంట వెళ్ళిపోయింది. ఆమె పడిన కష్టాలు లోకంలో ఎవరు పడ్డారు కనుక !!!గంగ ప్రవహిస్తూ పోయి పోయి చివరకు సముద్రంలో కలిసినట్లు ఈ ఆట్లు, పోట్లు కష్టాలు, సుఖాలతో సంసార సాగరంలో చేరి తరించాలి. చివరలో తిలోదకాలు ఇచ్చేటప్పడు ఒక్కొక్కరి పేరు చెబుతున్నారు.. కొంత మంది పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ అంటున్నాడు... కొంత మందికి ధర్మరాజు ‘నావాడు’ అంటున్నాడు. కర్ణుడి పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ కాదన్నాడు. ధర్మరాజు కూడా ‘నావాడు’ కాదన్నాడు... తట్టుకోలేకపోయింది తల్లిగా. ‘‘వరంవల్ల పుట్టాడ్రా.. వాడు నీ అన్నరా, నీ సహోదరుడు... నా బిడ్డ...’’ అంది.మరి ధర్మరాజేమన్నాడు... తల్లిని శపించాడు..‘‘ఆడవారి నోట్లో నువ్వుగింజ నానకుండుగాక..’’ అని. దీనికోసమా ఇంత కష్టపడ్డది. అప్పుడొచ్చింది ఆమెకు వైరాగ్యం. కృష్ణభగవానుడిని స్తోత్రం చేసింది. గృహస్థాశ్రమం అంటే క్షీరసాగర మథనం. అక్కడ అమృతం పుట్టాలి. జీవితం అన్న తరువాత ఆటుపోటులుండాలి. రుషిరుణం, పితృరుణం, దేవరుణం... ఈ మూడు రుణాలు తీరాలన్నా, మనిషి తరించి పండాలన్నా గృహస్థాశ్రమంలోనే... అంతే తప్ప భార్యాబిడ్డలకోసం మాత్రమే కాదు.. కర్తవ్యదీక్షతో అన్నీ అనుభవంలోకి వచ్చిన నాడు ఈశ్వర కృప దానంతటదే వస్తుంది. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఐదు పురాణాల్లో వినాయక గాథ..!
వినాయక చవితి పండుగ గురించి, ఈ పండుగ మహాత్మ్యాన్ని గురించిన గాథలు ప్రముఖంగా ఐదు పురాణాల్లో కనిపిస్తాయి. అవి: 1. శివ పురాణం 2. బ్రహ్మవైవర్త పురాణం 3. ముద్గల పురాణం 4. స్కాంద పురాణం 5. పద్మ పురాణం.శివపురాణం: శివ పురాణం గణేశుడి జన్మ వృత్తాంతం, గణేశుడు గణ నాయకుడిగా మారిన వైనం, మానవ జీవితంలో గణనాథుని ప్రాముఖ్యత విపులంగా చెబుతుంది.బ్రహ్మవైవర్త పురాణం: బ్రహ్మవైవర్త పురాణం గణేశుడి జన్మ వృత్తాంతంతో పాటు వినాయక చవితి రోజున గణేశుని పూజించే విధానం, ఈ పూజ ద్వారా మానవ జీవితంలో కనిపించే ప్రభావం చెబుతుంది.ముద్గల పురాణం: ముద్గల పురాణం గణనాథునికి చేయవలసిన పూజలు, వాటి ప్రాముఖ్యత, గణనాథుని వివిధ అవతారాల గాథలను, వివిధ సందర్భాల్లో వినాయకుడు భక్తులను అనుగ్రహించిన సందర్భాలు, ప్రదర్శించిన మహిమల గాథలను చెబుతుంది.స్కాంద పురాణం: స్కాంద పురాణం కూడా గణేశుడి జన్మ వృత్తాంతం, వినాయక చవితి పండుగ ప్రాముఖ్యత, గణేశుడికి సంబంధించిన పూజా విధానాలు విపులంగా చెబుతుంది.పద్మ పురాణం: పద్మ పురాణం వినాయక చవితి విశేషాలను చాలా విస్తృతంగా వివరిస్తుంది. ప్రతేకించి వినాయక చవితి పూజలో ఉపయోగించవలసిన పూజా పత్రీ వివరాలను విపులంగా చెబుతుంది.(చదవండి: తెలుగునాట ప్రసిద్ధిగాంచిన గణపతి ఆలయాలివే..!) -
వినాయక విజయం: విచిత్ర వినాయకుడు..!
వాతాపి నగరానికి సాధువుల గుంపుతో కలసి ఒక పద్నాలుగేళ్ల కుర్రవాడు వచ్చాడు. ఆ కుర్రవాడు వాతాపి గణపతి ఆలయాన్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉండిపోయాడు. అతడి ఊరేదో పేరేదో అతడికే తెలియదు. అతడి నుదుటి మీద గాయం మానిన మచ్చ చూసిన జనాలు, పాపం ఏదో దెబ్బ తగిలి గత స్మృతి అంతా పోగొట్టుకున్నాడని అనుకున్నారు. ఆ కుర్రవాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఎంతసేపూ వాతాపి ఆలయ మంటపం రాతి పలకల మీద, గోడల మీద సుద్దతో బొమ్మలు గీస్తూ ఉండేవాడు. బొమ్మలు గీస్తున్నంత సేపూ అతడి ముఖం చిరునవ్వుతో వెలుగుతూ ఉండేది. బొమ్మలు గీస్తూ ఆనందం పొందుతుండే ఆ బాలుడిని వాతాపి వాసులు చిత్రానందుడు, చిత్రముఖుడు అని పిలవసాగారు. అతడు ఎక్కువగా వినాయకుడి బొమ్మలే గీస్తుండటంతో వినాయక చిత్రకారుడనే పేరును సంక్షిప్తంగా మార్చి విచిత్రుడు అని పిలవసాగారు. కాలక్రమంలో ఆ బాలుడికి విచిత్రుడు అనే పేరు స్థిరపడింది.వాతాపి నగరంలో గణపతి భక్తుడైన గజానన పండితుడు రోజూ సాయంత్రం ఇంటి వద్ద పిల్లలకు వినాయక కథలు చెబుతుండేవాడు. మిగిలిన పిల్లలతో కలసి విచిత్రుడు కూడా గజానన పండితుడు చెప్పే కథలను అరుగు మీద కూర్చుని శ్రద్ధగా ఆలకించేవాడు. కథ విన్న మర్నాడు ఆ కథలోని సన్నివేశాలను గోడల మీద చిత్రించేవాడు. విచిత్రుడు చిత్రించే వినాయకుని బొమ్మలు చూసి గజానన పండితుడు మురిసిపోయేవాడు. విచిత్రుడికి ఎన్నో విఘ్నేశ్వరుడి కథలను ప్రత్యేకంగా చెబుతుండేవాడు.విచిత్రుడి వెంట ఎప్పుడూ పిల్లలు గుంపులు గుంపులుగా ఉండేవారు. అతడు చిత్రించే బొమ్మలను వారు అబ్బురంగా చూస్తుండేవారు. కొందరు అతడిలాగా బొమ్మలు గీయడానికి ప్రయత్నిస్తూ చిత్రకళా సాధన చేస్తుండేవారు. విచిత్రుడి ప్రభావంతో వాతాపి నగరంలోని పిల్లలకు చిత్రకళ అబ్బింది.విచిత్రుడు పగలంతా గోడల మీద బొమ్మలు వేస్తూ, వాతాపి గణపతి ఆలయంలో పంచే ప్రసాదంతో కడుపు నింపుకొనేవాడు. రాత్రిపూట ఆలయం మెట్ల మీద ఒక మూలనో, ఊరి చివరనున్న వాడలో ఏ ఇంటి అరుగు మీదనో నిద్రపోయేవాడు. వాడలోని కుమ్మరులు, చర్మకారులు విచిత్రుడంటే ప్రాణం పెట్టేవారు. అతడు ఏ రాత్రి వచ్చినా, అతడి కోసం దాచిపెట్టిన భోజనం తినిపించి, అతడి పడకకు ఏర్పాట్లు చేసి మరీ నిద్రపోయేవారు. అలా విచిత్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు.కాలం ఇలా గడిచిపోతుండగా, వాతాపి నగరంలో వినాయక నవరాత్రుల కోలాహలం పండుగకు కొద్ది రోజుల ముందు నుంచే మొదలైంది. ఉత్సవాల సందర్భంగా ఒక శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు జరిగింది. ప్రదర్శనలో అత్యుత్తమంగా నిలిచిన విగ్రహాన్ని ఉత్సవ నిర్వాహకులు వెయ్యి బంగారు కాసులు ఇచ్చి కొంటారు. ఆ విగ్రహాన్ని మలచిన కళాకారుడిని నగరపాలకులు రత్నఖచిత స్వర్ణకంకణంతో ఘనంగా సత్కరిస్తారు.ఆ పోటీ ప్రదర్శనలో చుట్టుపక్కల రాజ్యాల ఆస్థాన చిత్రకారులు సహా ఎందరో పేరుగాంచిన శిల్పులు, చిత్రకారులు తమ తమ విగ్రహాలను తీసుకొచ్చారు. విదేశాల నుంచి తెప్పించిన రంగులు, బంగారు పూతలతో, రంగురాళ్లతో ఒకరిని మించి మరొకరు కళ్లు మిరుమిట్లు గొలిపేలాంటి వినాయక విగ్రహాలను రూపొందించి, ప్రదర్శనకు పెట్టారు.తాను రూపొందించిన విగ్రహాన్ని కూడా ప్రదర్శనలో పెట్టాలని విచిత్రుడు ఉబలాటపడ్డాడు. అతడికి ఒక కుమ్మరి మిత్రుడు ఉన్నాడు. విచిత్రుడు తీర్చిదిద్దిన రూపురేఖలతో అతడు బంకమట్టిని ఉపయోగించి విగ్రహం తయారు చేశాడు. సున్నం, బొగ్గుమసి, జేగురు, పచ్చమట్టి, ఆకుపసర్లు ఉపయోగించి విచిత్రుడు ఆ విగ్రహానికి చక్కగా రంగులు వేశాడు. ప్రదర్శనలో పెట్టడానికి విచిత్రుడు ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లాడు. అక్కడి పెద్దలందరూ విచిత్రుడి విగ్రహాన్ని ప్రదర్శనలో పెట్టనివ్వలేదు. తన విగ్రహాన్ని చిట్టచివరనైనా ఉంచాలని విచిత్రుడు ఎంతగా ప్రాధేయపడినా, వారు కనికరించలేదు. ‘కులగోత్రాలు లేనివాడివి, ఊరూ పేరూ లేనివాడివి, కడజాతుల వారితో కలసి తిరిగేవాడివి. అలాంటి నీ చేతుల్లో తయారైన విగ్రహానికి వంశప్రతిష్ఠలు గల సుప్రసిద్ధ చిత్రకారుల విగ్రహాల సరసన ప్రదర్శించే అర్హత లేదు’ అని నిర్దాక్షిణ్యంగా అతడి కోరికను తిరస్కరించారు.విచిత్రుడు చాలా బాధపడ్డాడు. అతడి బాధను చూసిన కుమ్మరి మిత్రుడు ‘ప్రదర్శన పందిట్లో పెట్టకపోతే పోయారు. మనం వేరే చోట ఈ విగ్రహాన్ని అందరికీ కనిపించేలా పెడదాం, పద!’ అని నచ్చచెప్పాడు. ప్రదర్శన పందిరికి ఎదురుగా కొంత దూరంలో ఉన్న ఒక చెట్టు మొదట్లో విగ్రహాన్ని పెట్టి, విచిత్రుడిని తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. పెద్దలందరూ పందిరిలో ప్రదర్శించిన విగ్రహాలను తిలకిస్తుంటే, పిల్లలు మాత్రం గుంపులు గుంపులుగా విచిత్రుడు రంగులద్దిన విగ్రహం ముందు గుమిగూడారు.ఒకవైపు పందిట్లోని ప్రదర్శనలో పెద్దల సందడి, మరోవైపు చెట్టుకింద విగ్రహం వద్ద పిల్లల కోలాహలం కొనసాగుతుండగా, ఎక్కడి నుంచో ఇద్దరు యువతులు వచ్చారు. మెరుపుతీగల్లాంటి వారిద్దరూ నిండుగా విలువైన నగలు ధరించి కళకళలాడుతూ ఉన్నారు. జనం వారిని ఆశ్చర్యంతో చూస్తుంటే, వారిలోని పెద్దామె ‘అయ్యలారా! మాది కళానంద నగరం. మాకు నచ్చిన వినాయక విగ్రహం కోసం పదివేల వరహాలు పట్టుకొచ్చాం’ అంటూ చేతిలోని బంగారు అల్లిక జలతారు సంచిని గలగలలాడించింది. ప్రదర్శనలో పిచ్చాపాటీ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్న చిత్రకారులందరూ ఆమె మాటలతో అప్రమత్తమయ్యారు. ఎవరి విగ్రహాల దగ్గరకు వారు చేరి, గంభీరంగా నిలుచున్నారు.‘మా అక్క ప్రసన్నవదన గొప్ప గాయనీమణి. విగ్రహపుష్టి మాత్రమే కాదు, గొప్ప తిండిపుష్టి, గాత్రపుష్టి ఉన్నది. గొంతు విప్పిందంటే, ఆమె పాటకు ఎంతటి వారైనా మైమరచిపోవాల్సిందే!’ అంటూ ఇద్దరిలోనూ చిన్నది కాలి గజ్జెలను మోగిస్తూ, అక్కడున్న అందరి వంకా ఓరచూపులు విసిరింది.‘మా చెల్లి మోహన గొప్ప వాగుడుకాయ. అంతకు మించి గొప్ప నర్తకీమణి. చూడటానికి నాజూకు చిన్నదిలా ఉన్నా, నాట్యమాడుతూ నన్నే ఎత్తి తిప్పేస్తుంది. నాట్యంలో దాని చురుకుదనం చూడటానికి రెండు కళ్లు చాలవు. మాతో ఆడించడం, పాడించడం సాక్షాత్తు ఇంద్రుడికి, కుబేరుడికే సాధ్యం కాదు. అయితే, ఇక్కడ మాకు నచ్చిన విగ్రహం ముందు ఆటపాటలను ప్రదర్శిస్తామని వినాయకుణ్ణి మొక్కుకున్నాం’ అని చెప్పింది ప్రసన్నవదన. వారి మాటలకు మంత్ర ముగ్ధులైన జనాలు, వారు విగ్రహాలు చూడటానికి వీలుగా పక్కకు తొలగి, దారి ఇచ్చారు.అక్కా చెల్లెళ్లిద్దరూ ఒక్కొక్క విగ్రహం దగ్గర ఆగి, వాటిని పరిశీలనగా చూస్తూ ముందుకు సాగారు. అన్ని విగ్రహాలనూ చూసినా, ఏదీ నచ్చకపోవడంతో పెదవి విరిచి బయటకు మరలుతుండగా, ప్రదర్శన పందిరి ఎదురుగా పిల్లల కోలాహలం కనిపించింది. ‘అక్కడ పిల్ల వెధవలెవరో తయారు చేసిన తక్కువరకం విగ్రహం ఉంది లెండి’ అని గుంపులోంచి ఎవరో అనడం వాళ్లకు వినిపించింది. అది విని మోహన, ‘పదవే అక్కా! అక్కడేదో విగ్రహం తక్కువలోనే దొరికేటట్లుంది’ అంటూ ప్రసన్నవదన చేయి పట్టుకుని అటువైపుగా దారితీసింది. ప్రదర్శనశాలలోని జనాలంతా వాళ్లనే అనుసరిస్తూ బయటకు వచ్చారు. ప్రదర్శనశాలలో ఒక్కరూ మిగల్లేదు.ప్రసన్నవదన చెట్టు కిందనున్న విగ్రహం వద్దకు వెళ్లి, ఆ విగ్రహం ముందు వరహాల సంచి పెట్టింది. తన మెడలోని రత్నహారాన్ని తీసి, విచిత్రుడి చేతికి కంకణంలా తొడిగింది. అది చూసిన జనం ‘వీళ్లకేదో పిచ్చి ఉన్నట్లుంది! గొప్ప విగ్రహాలను కాదని వచ్చి, ఈ నాసిరకం విగ్రహం ముందు డబ్బు ధారపోస్తున్నారు’ అన్నారు.వాళ్ల మాటలు విన్న ప్రసన్నవదన జనాల వైపు చూసి, ‘ఇక్కడున్న విగ్రహంలోని ఏ విశేషాన్ని చూసి పిల్లలందరూ మురిసి ముచ్చటపడుతున్నారో, ఆ విశేషమే మమ్మల్ని కూడా ఆకట్టుకుంది. బాల దీవెనలు బ్రహ్మ దీవెనలు.అందుకే ఈ పిల్లల ఎంపికను శిరసావహిస్తున్నాము’ అని చెప్పింది.‘మట్టిశిల్పంలో లేని రూపసౌందర్యాన్ని సామాన్యమైన జేగురు వంటి రంగులతోనే తీర్చిదిద్దిన ఈ చిత్రకారుడి ప్రతిభ అమోఘం, అద్వితీయం. ఈ విగ్రహానికి మా బహుమానం అతిస్వల్పం’ అంది మోహన.‘మా కోరిక నెరవేరింది. ఇక్కడే మా మొక్కు చెల్లించుకుంటాం’ చెప్పింది ప్రసన్నవదన.వినాయక విగ్రహాన్ని అంటిపెట్టుకుని కూర్చుని, ప్రసన్నవదన తాళాలు మోగిస్తూ, ‘తాండవ నృత్యకరీ గజానన’ అంటూ కీర్తన మొదలుపెట్టింది. ఆ వెంటనే మోహన విద్యుల్లతలా నాట్యం ప్రారంభించింది. జనాలందరూ విస్మయచకితులై ఆ ప్రదర్శనను తిలకించసాగారు.ప్రసన్నవదన గానం ఇంట్లో ఉన్న గజానన పండితుడి చెవిన పడింది. అప్పటికే శతాధిక వృద్ధుడైన ఆయన ఇల్లు కదల్లేని స్థితిలో ఉన్నాడు. అయితే, ప్రసన్నవదన గానానికి ఆయనకు ఎక్కడలేని జవసత్త్వాలూ వచ్చాయి. మంచం మీద నుంచి లేచి, ఒక్క పరుగున ప్రదర్శన జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. ప్రసన్నవదనను చూసి, చేతులెత్తి జోడించి, సాగిలబడి, ధ్యాన ముద్రలో అలాగే ఉండిపోయాడు.నృత్యం చేస్తూ, చేస్తూ మోహన అంత పెద్ద వినాయక విగ్రహాన్నీ భుజం మీదకెత్తుకుంది. అది చూసిన జనం ‘అంత బరువు మోయలేవమ్మా! పడిపోతావు!’ అని కేకలు వేశారు. ‘నాకు అలవాటేగా!’ అని చెబుతూ ఆమె విగ్రహాన్ని భుజాన పెట్టుకునే నాట్యం చేస్తూనే పరుగులాంటి నడకతో బయలుదేరింది. జనం ఆమెను పరుగు పరుగున అనుసరించారు. ఈ సందడిలో ప్రసన్నవదన ఎప్పుడు అదృశ్యమైపోయిందో కూడా ఎవరూ గుర్తించలేదు.మోహన ఆలయ తటాకం వద్దకు చేరుకుంది. నాట్యం చేస్తూ, ఒక్కొక్క మెట్టే దిగుతూ తటాకంలో మునిగి అదృశ్యమైంది. కొద్ది క్షణాల్లో ఒక చిట్టెలుక విగ్రహాన్ని వీపున మోసుకుంటూ, నీటిలోకి మాయమైంది. ఆ రోజే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే రోజు. జనాలు ఈ దృశ్యాన్ని చూసి, దిగ్భ్రాంతులయ్యారు.గజాననుడు ధ్యానముద్ర నుంచి తేరుకునే సరికి చెట్టు కింద విచిత్రుడు, అతడి కుమ్మరి మిత్రుడు, బంగారు జలతారు వరహాల సంచి తప్ప మరేమీ కనిపించలేదు. గజాననుడు లేచి, విచిత్రుడి వద్దకు వెళ్లి, అతడి తలమీద చేయివేసి ‘వాతాపి గణపతి ఆలయాన్ని నీ కళతో చిత్రశోభితం చేయి. కావలసిన ధనాన్ని ఆ విఘ్ననాయకుడే అనుగ్రహించాడు కదా! నీ వల్ల వాతాపి నగరం పావనమైంది. ఇక నుంచి నువ్వు పావనమిశ్రుడిగా ప్రఖ్యాతి పొందుతావు’ అని ఆశీర్వదించాడు. – సాంఖ్యాయన(చదవండి: దూర్వాయుగ్మపూజ అనగా..? గరికతోనే ఎందుకంటే..?) -
దూర్వాయుగ్మపూజ అనగా..? గరికతోనే ఎందుకంటే..?
వినాయక చవితి వ్రతవిధానంలో దూర్వాయుగ్మపూజ విశేషమైనది. గరికతో వినాయకుని ప్రత్యేకంగా పూజించటమే దూర్వాయుగ్మపూజ. ఏకవింశతిపత్ర పూజలో భాగంగా, వినాయకచవితి వ్రతవిధానంలో దూర్వాయుగ్మంతో పూజ తప్పనిసరి. గణనాథుని దశనామాలను స్మరిస్తూ గరికను దేవునికి అర్పించటం ఈపూజలో భాగం.వంద యజ్ఞాలు ఇవ్వలేని ఫలితాన్ని ఒక్క గరికపోచ ఇస్తుంది. గరికలేని వినాయక పూజ వ్యర్థమని సాక్షాత్తు ఆ గణపతే పేర్కొన్నాడు. అందుకే, వినాయక చవితినాడు గరికకు అంతటి ప్రాధాన్యం. గరిక మహిమను తెలిపే కథలు మనకు గణేశ పురాణంలో కనిపిస్తాయి.పూర్వం సులభుడనే ఒక గంధర్వరాజు ఉండేవాడు. ఆయన భార్య సముద్ర. ఒకసారి ఆ దంపతులు పురాణశ్రవణంలో ఉండగా, అక్కడకు మధుసూదనుడనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతనిని చూడగానే సులభుడికి పేద, గొప్ప అనే తారతమ్యం గుర్తొచ్చి నవ్వాడు. పేదవాడైన మధుసూదనుడి అహం దెబ్బతినటంతో కోపగించిన అతను, గంధర్వరాజును చూసి ‘రాజా! గర్వాంధుడవైన నీవు పొలం దున్నే ఎద్దుగా జన్మిస్తావు’ అని శపించాడు. అతని శాపాన్ని విని కోపగించిన గంధర్వరాజు భార్య సముద్ర ‘దరిద్రుడా! నువ్వు చెత్తాచెదారం తినే గాడిదగా జన్మించు‘ అని మధుసూదనుడికి ప్రతిశాపం ఇచ్చింది. ఆమె శాపానికి ఆగ్రహోదగ్రుడైన మధుసూదనుడు ఆమెను ‘చండాలురాలివి కమ్ము’ అని శపించాడు.ఆవిధంగా శాపగ్రస్తులైన ఆ ముగ్గురూ, శాపకారణాన శరీరాలను త్యజించారు. చండాలినిగా మారిన సముద్ర దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ గణపతి ఆలయాన్ని చూసింది. ఆరోజు చతుర్థి. గుడిలో గణేశారాధన జరుగుతోంది. బయట కుండపోతగా వర్షంకురుస్తోంది. వానకు తట్టుకోలేని చండాలిని ఇళ్ళవైపుకు పోగా, అక్కడివాళ్ళు ఆమెను తరిమారు. వేరే గత్యంతరంలేని ఆమె గణేశాలయ ప్రాకారం కిందకు వచ్చి, గడ్డీగాదం పోగుచేసి మంటవేసి చలి కాచుకోసాగింది. ఇంతలో శాపానికి గురైన ఎద్దు, గాడిదలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పోగుచేసిన గడ్డిని తినసాగాయి. గడ్డి కోసం ఎద్దు, గాడిదలు కుమ్ములాడుకోగా, కొన్ని గడ్డిపరకలు గాలికి కొట్టుకెళ్ళి గుడిలోని వినాయకుని శిరస్సుపై పడ్డాయి. ఇంతలో చండాలిని తన చేతిలోని దుడ్డుకర్రతో వాటిని బాదసాగింది. అవి రెండూ పరుగెత్తుకుంటూ, గుడిలోకి ప్రవేశించి అక్కడున్న ఖాద్య వస్తువులన్నిటినీ తినసాగాయి. అక్కడున్న పూజారులు వాటిని తరమసాగారు. ఈ కలకలం చెవినబడ్డ చండాలిని ఏమిటన్నట్టుగా ఆలయంలోకి ప్రవేశించింది. అప్పుడామె చేతిలోని గడ్డిపోచలు వినాయకుని తలపై పడ్డాయి. అటుగా వచ్చిన భక్తులు ఆమెను అక్కడి నుంచి తరిమి, తలుపులు మూసేశారు. అలా బయటపడిన ఆ మూడు జీవుల పరిస్థితి దుర్భరంగా మారింది. అయితే, తెలియక వారు వినాయకునికి సమర్పించిన గడ్డిపోచలు తన శిరస్సును అలంకరించినందుకు సంతసించిన గణపతి వారిని కరుణించాడు.వెంటనే గణపతి భృత్యులు విమానంలో దిగివచ్చి వారు ముగ్గురినీ ఉత్తమ లోకాలకు తీసుకువెళ్లసాగారు. ఆ వింతదృశ్యం చూసిన ఋషులు చేతులు జోడించి, ఓ దేవతలారా! వీరికి ఎలా శాశ్వత గతులు లభించాయి. ఈ జీవులు పూజలు పునస్కారాలు చేసినవారు కారే! ఇందుకు ఏదైనా సులభోపాయం ఉంటే సెలవివ్వగలరు’ అంటూ వినమ్రంగా ప్రశ్నించారు. వారి ప్రశ్నలను ఆలకించిన గణేశ దూతలు గరిక మహిమను తెలియచేసే ఇంద్ర–నారద సంవాదంలోని ఆసక్తికరమైన కథను ఇలా వివరించారు:పూర్వం స్థావరం అనే పట్టణంలో కౌండిన్యుడు అనే ముని పరమ గణేశ భక్తుడు. ఆయన భార్య ఆశ్రమ. ఆమె ఒకరోజు తన భర్తను, ‘స్వామీ! మీరు గణపతి విగ్రహం శిరస్సు మీద గరిక పెట్టి పూజించటంలో ఆంతర్యమేమిటి?’ అని ప్రశ్నించింది.అందుకు కౌండిన్యుడు ఈవిధంగా చెప్పాడు. పూర్వం ధర్మ అనే నగరంలో జరిగిన ఒక మహోత్సవానికి, సిద్ధులు, చారులు, యక్షులు, నాగులు, మునులు అంతా విచ్చేశారు. అక్కడ తిలోత్తమ నాట్యమాడుతుండగా, ఆమె ధరించిన పైవస్త్రం జారి కిందపడింది. అప్పుడు ఆ సభలో ఉన్న యముడు ఆమెను చూసి మదన తాపానికి గురై ఆమెను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. ఆయన అలా ప్రవర్తించటం సభా గౌరవానికి భంగం అని అందరూ భావించటంతో ఆ విషయాన్ని గ్రహించిన యముడు సభ నుంచి బయటకు వచ్చాడు. అలా వచ్చిన యముని రేతస్సు స్ఖలితమై భూమిపై పడింది. ఆ రేతస్సు నుంచి వికృతాకారుడైన రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రాక్షసుడి జటలు ఖగోళాన్ని ఆక్రమించినట్లుగా ఉన్నాయి. ఆ రాక్షసుడు పెద్దపెద్ద అరుపులతో అందరినీ భయపెట్టసాగాడు. అప్పుడు దేవతలు, ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరణు వేడగా, ఆయన వారిని గణపతి వద్దకు వెళ్లమని సూచించాడు. దాంతో వారందరూ గణపతి వద్దకు వెళ్ళి వివిధ స్తోత్రాలు చేశారు. అప్పుడు పద్మంవంటి నేత్రాలతో కోటిసూర్యుల తేజస్సుతో మల్లెపువ్వుల కంటే తెల్లనైన పలువరుసతో, శంఖంవంటి కంఠంతో, నానాలంకారాలతో దివ్యాంబరాలను ధరించి రత్నసింహాసనంపై కూర్చొని దేవతలకు బాలగణపతిగా దర్శనమిచ్చాడు. దేవతల కోరిక మేరకు బాలగణపతి ఆ అనలాసురుడనే రాక్షసుడిని చంప నిశ్చయిస్తాడు. బాలగణపతిని చూసిన అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ ముందుకురాగా, తన యోగమాయా బలంతో అనలాసురుడిని మింగుతాడు. కాని అనలాసురుడు కడుపులోకి వెళితే, తన కడుపులో ఉన్న భువనాలు దగ్ధమవుతాయని తలచిన స్వామి, ఆ రాక్షసుడిని తన కంఠంలోనే నిలుపుకున్నాడు. ఆ తాపాన్ని ఉపశమింప చేయటానికి ఇంద్రుడు చంద్రకళను గణపతికి ప్రసాదించాడు. అప్పటి నుంచి స్వామివారు ఫాలచంద్రుడయ్యాడు. బ్రహ్మదేవుడు సిద్ధి, బుద్ధి అనే మానవకన్యలను సృష్టించి స్వామికి ప్రసాదించాడు. వారిని ఆలింగనం చేసుకోవటం వల్ల స్వామివారి తాపం కొంతమేరకు శాంతించింది. విష్ణువు పద్మాలను ప్రసాదించటంతో స్వామి పద్మహస్తుడు అయ్యాడు. అప్పటికీ అగ్నిని శాంతింప చేయడానికి వరుణదేవుడు నీటితో స్వామిని అభిషేకించాడు. పరమేశ్వరుడు ఆదిశేషుడిని ప్రసాదించాడు. దానితో స్వామివారి ఉదరం బంధింపబడటం వల్ల ఆయనకు వ్యాళబద్ధుడనే పేరు వచ్చింది. అప్పటికీ తాపం శాంతించలేదు. అప్పుడు ఎనభైవేలమంది ఋషులు వచ్చి ఒకొక్కరు, ఇరవై ఒక్క దుర్వాంకురాలు (గరికపోచలు) చొప్పున స్వామికి ప్రసాదించటంతో స్వామివారి తాపం పూర్తిగా ఉపశమించింది. అందుకే గణపతికి గరిక ప్రీతిపాత్రమైనది. అప్పటి నుంచి గణపతి పూజలో గరికకు విశిష్ట స్థానం దక్కింది. – కప్పగంతు వెంకటరమణమూర్తి(చదవండి: పూరి జగన్నాథుడిని గణనాథుడిగా ఆరాధిస్తారని తెలుసా..!) -
Devotion: పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమా?
పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమా? – డి. వరలక్ష్మి, హైదరాబాద్– కావాలని కుళ్లిన కొబ్బరికాయని మనం తేలేదు కాబట్టి భయపడనక్కర్లేదు. మరో కొబ్బరికాయని తేగల అవకాశం అప్పుడుంటే సరే సరి. మరోసారి పూజకి కూర్చున్నప్పుడు ఈ కొబ్బరికాయకి బదులుగా మరో కొబ్బరికాయని కొడితే సరి. పూజ లోపానికీ కొబ్బరికాయ కుళ్లడానికీ సంబంధం లేదు.రాహుకాల దీపం గురించి చెప్పగలరు.. – అప్పారావు, సాలూరు– జాతకంలో రాహుదోషం ఉన్న పక్షంలో ప్రతిదినం వచ్చే రాహుకాలంలో రాహుగ్రహ స్తోత్రాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి 18 గుణకాలలో (36, 54, 72, 90...) ఇలా ఆ స్తోత్రాన్ని రాహుకాలం ఉండే 90 నిమిషాలసేపూ పారాయణం చెయ్యాలి.గృహంలో వాస్తుదోష పరిహారానికి ఏం చెయ్యాలి? – ఆర్. కౌసల్య, చిల్కమర్రి– వాస్తు దోష పరిహారం కోసం గృహప్రవేశం రోజున ‘వాస్తుహోమ’మంటూ ఒకదాన్ని చేస్తారు. దోషం తప్పనిసరిగా ఉన్న పక్షంలో మత్స్యయంత్రం, కూర్మయంత్రం వేస్తారు. ఏది వేసినా ఇంట్లో నిత్యపూజ జరిగితే దోషం ఏమీ చెయ్యదు. ఇది అనుభవపూర్వకంగా పెద్దలు నిరూపించిన సత్యం.ప్రయాణంలో చెప్పులు వేసుకుని స్తోత్రాలు చదివాను. దోషమా? – పార్వతి, హైదరాబాద్– ఇంట్లో దైవమందిరం ముందు ఆచారం తప్పనిసరి. పత్తనే పాదమాచారమ్ (బయటకు వెళ్లాక ఆచారం నాలుగవ వంతే ఆచరించ సాధ్యమౌతుంది) అన్నారు. ఇల్లు దాటాక కూడా చదువుకునేందుకే పుట్టినవి స్తోత్రాలు. ఇంట్లో, గుడిలో తప్ప మరోచోట నియమాలు లేవు.మరణానంతరం నా శరీరాన్ని ఉచితంగా వైద్య కళాశాలకి ఈయదలిచాను. పిల్లలు అంగీకరించడం లేదు..? – ఒక పాఠకురాలు, హైదరాబాద్– మీరు జీవించినంతసేపే మీ శరీరం మీద మీకు హక్కు. మీ పిమ్మట ఆస్తిపాస్తులతోపాటు పార్థివ శరీరమ్మీద అధికారం కూడా పిల్లలకే ఉంటుంది. వాళ్లు అంగీకరించనప్పుడు ఇవ్వడం భావ్యం కాదు. చివరి కాలంలో పిల్లలతో విరోధించడమూ సరికాదు.60 సంవత్సరాలు నిండినా నేను, నా భార్య ప్రతి విషయంలోనూ తూర్పుపడమరలుగానే ఉన్నాం. లలితానామాలతో సయోధ్య కుదురుతుందా? – శ్రీనివాస్, విజయనగరం– ఆలుమగలకు బాధ్యతలు తీరాక పరస్పర నిర్లక్ష్య భావం వస్తుంది. ఎదుటివారు తమను అగౌరవ పరుస్తున్నారనే అభి్రపాయం పెరుగుతుంది. గతాన్ని తవ్వుకుంటూ తప్పుల్ని ఎత్తి చూపించుకోవడాన్ని మానితే, సయోధ్య పెరుగుతుంది. లలితాంబ ఇందులో ఏమీ చేయలేదు.ఇవి చదవండి: సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి! -
సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి!
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువు తీరాడు పార్వతీ తనయుడు.రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్‌కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్‌కు ఏం చెయ్యాలో పాలు΄ోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు.ఒక రోజు రాత్రి అతను నిద్ర΄ోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరి΄ోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసి΄ోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు.ఇదీ విశిష్టత..ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ్రపార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి?రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్‌లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్‌కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్‌కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్ లో ఉంది.ఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
వరలక్ష్మి కృపకు ఆఖరి శుక్రవారం...ముఖ్యంగా పెళ్లికాని పడతులకు
మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం శ్రావణమాసపు రెండో శుక్రవారం జరుపుకోవడం శాస్త్రంగా ఎంతో కాలం జరుగుతూ వస్తున్నది. అయితే ఏదైనా కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం కానీ, ప్రత్యేక పూజలు కానీ చేసుకోలేని వాళ్లకు ఆఖరి శుక్రవారం చివరి అవకాశంగా భావిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, సకలశుభాలు కలగాలని ప్రార్థిస్తారు.చివరి రోజు మరింత ప్రత్యేకం..శ్రావణమాసం, శుక్రవారాలు ఎంత ప్రత్యేకమైనవో వేరుగా చెప్పక్కర్లేదు. అయితే శుభప్రదమైన శ్రావణమాసంలో చివరి వారం కావడంతో బోలెడంత సందడి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిల లక్ష్మీ దేవి పూజకు మరింత ప్రత్యేకమని చెప్పాలి. ఆఖరి రోజు వ్రతం చేస్తే:ఆఖరి రోజున ఉపవాసం పాటించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. ఈ రోజున యథావిధిగా రకరకాల పిండి వంటలు, క్షీరాన్నం, పళ్లు, పూలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ శుభసమయంలో శ్రీ యంత్రానికి పూజలు నిర్వహిస్తారు. రాత్రి నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ హ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే లక్ష్మి ఇంట్లో నివాసం ఉంటుందని నమ్మకం.అలాగే వరలక్ష్మి రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 11 పసుపు పిండి ముద్దలను లక్ష్మీదేవి పాదాలకు సమర్పించి, పూజ తర్వాత వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచితే దీనివల్ల ఆర్థిక లబ్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. లక్ష్మీదేవికి కొబ్బరికాయ సమర్పించాలి. దీనివల్ల ఆర్థిక లబ్ది పొందే అవకాశం ఏర్పడుతుంది. పెళ్లికాని పడుచులకు వరం..పూజ చేసుకున్న వారి నుంచి తాంబూలం తీసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకు తొందరగా పెళ్లవుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. వరమహాలక్ష్మి వివిధ రూపాలలో కరుణిస్తుందని, అన్ని సమస్యలు తొలగిపోయి పెళ్లి జరిగేలా అనుకూలత ఇస్తుందని నమ్మకం. అందుకే కొన్ని ప్రాంతాలలో ఈ రోజు భక్తితో ఉపవాసం ఉండి, పూజ చేసుకుని ముత్తైదువుల నుంచి తాంబూలం అందుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. -
పూజ ఎందుకు చేయాలి !
గృహస్థాశ్రమ వైశిష్ట్యంకొడుకు ఉన్నాడా ఇంట్లో !!!.. ఉన్నాడు... చాలు ... పెద్ద ఊరట. ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ...’’ ..వెళ్ళవలసిందే. తప్పదు... వాడుంటే చాలు.. తనూభవుడు... ఒక ఊరట. ‘‘ఆత్మావై పుత్రనామాసి...’’ (ఓ పుత్రా! నేనే నువ్వు) ఈశ్వరుడు ఎంత ఊరట కల్పించాడో చూడండి!!! మరిదంతా ఎలా ప్రభవిస్తున్నది...అంటే వివాహం వల్ల. ఈ సంపదకంతటికీ పునాది గృహస్థాశ్రమం... ఇక్కడే నువ్వు తండ్రి రుణం నుంచి విముక్తడవవుతున్నావు. తండ్రి నీకు ఎలా జన్మనిచ్చాడో నీవు కూడా వేరొక జీవునకు శరీరాన్ని కల్పించావు. అలా కల్పించి సంతానం ద్వారా ఊరట పొందావు. పితృరుణాన్ని తీర్చుకున్నావు. అది ధర్మపత్ని సహకారం లేకుండా తీరేది కానే కాదు. అందుకు గృహస్థాశ్రమ ప్రవేశం.తరువాత.. వైరాగ్య సుఖం... అదెట్లా రావాలి! రామకృష్ణ పరమహంస– ‘బొట్టుబొట్టుగా రాదు, వైరాగ్యం వస్తే వరదలా వస్తుంది’..అంటారు. వైరాగ్యంలోకి వెళ్ళినవాడు నిరంతరం పరబ్రహ్మను గురించి తనలో తాను రమిస్తుంటాడు. మళ్ళీ మునుపటి జీవితంలోకి రాడు.. ‘‘యోగరతో వాభోగరతోవా/సం^గరతో వా సంగవిహీనః /యస్య బ్రహ్మని రమతే చిత్తం/ నందతి నందతి నందత్యేవ...’’.. దీనికంతటికీ కారణం గృహస్థాశ్రమం. ఆపైన దేవతల రుణం. ఇంద్రియాలన్నింటికీ దేవతలు అధిష్ఠాన శక్తులుగా ఉన్నారు. అందువల్ల వారి రుణం తీర్చుకోవాలి. దానికోసమే ఇంటింటా పూజా విధానం అనేది వచ్చింది. పూజ దేనికి? కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం– కృతజ్ఞత కలిగి ఉండడం.‘‘బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా / నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః’’అంటాడు లక్ష్మణ స్వామి కిష్కింధ కాండలో. ఎవరికయినా నిష్కృతి ఉందేమో కానీ, పొందిన ఉపకారాన్ని మరిచిపోయిన వాడికి మాత్రం నిష్కృతి లేదు.ఎవరు మనకు ఉపకారం చేశారో వారికి మనం ప్రత్యుపకారం చేయడం చాలా గొప్ప విషయం... అందుకే..ఏష ధర్మః సనాతనః(ఇదీ మన సనాతన ధర్మం) అంటారు రామాయణంలో. బద్దెన గారు కూడా..‘‘ఉపకారికినుపకారము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ’’.. అన్నారు కదా! అందుకే మనకు ఉపకారం చేసిన దేవతలకు ప్రత్యుపకారం చేసి దేవతా రుణాన్ని తీర్చుకోవాలి... అలా చేయాలన్నా గృహస్థాశ్రమ స్వీకారం తప్పనిసరి. ఇంద్రియాల ద్వారా దేవతలు మనకు చేసిన ఉపకారం ఏమిటి? ఐదు జ్ఞానేంద్రియాలను శక్తి సమకూర్చి ఇస్తున్నారు. వీటి ద్వారానే కొన్ని కోట్ల సుఖాలను, కొన్ని కోట్ల దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం. కన్నును ఆధారం చేసుకుని మనకు ఇస్తున్న సుఖాలకు కృతజ్ఞతగా పాదాల చెంత దీపం పెట్టి నమస్కరిస్తున్నాం. చెవులిచ్చాడు. వేదాలే కాదు, సంగీతమే కాదు, చిన్న పిల్లల వచ్చీరాని మాటలను కూడా విని ఆనందిస్తున్నాం.హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడితో.. ‘అనుదిన సంతోషణములు/జనితశ్రమతాపదుఃఖ సంశోషణముల్/తనయుల సంభాషణములు/ జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్‘ అంటాడు. ఆ అవకాశం కల్పించినందుకు పూలతో పూజ చేస్తాం. రుచులను ఆస్వాదించడానికి నాలుక ఇచ్చినందుకు మధుర పదార్థాలతో నైవేద్యం పెడుతున్నాం. చర్మస్పర్శ అనుభూతిని ప్రసాదించినందుకు చందన లేపనంతో సేవిస్తున్నాం. ఈ ఐదు ఉపచారాలతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సమ్మోహన స్వరూపుడు
రూపు నల్లన.. చూపు చల్లన. మనసు తెల్లన... మాట మధురం. పలుకు బంగారం.నవ్వు సమ్మోహకరం. వ్యక్తిత్వం విశిష్టం..ఆ ముద్ర అనితర సాధ్యం. అందుకే... నమ్మిన వారికి కొండంత అండ. అసలు కృష్ణుడంటేనే సచ్చిదానంద రూపం.. అలౌకిక ఆనందానికి ప్రతిరూపం..అందుకే ఆ నామం ఆరాధనీయం.. సదా స్మరణీయం.కృష్టజన్మాష్టమీ వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని పూజించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి. కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినా చతుర్విధ çపురుషార్థాలు సిద్ధిస్తాయని భాగవతోక్తి.దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకూ శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతారాలలో ఎనిమిదవ అవతారంగా నందన నామ సంవత్సర దక్షిణాయన వర్ష బుుతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ, వసుదేవులకు జన్మించాడు. నేడు ఆయన ఆవిర్భవించిన రోజు. ఈ సందర్భంగా ఓ వ్యాస పారిజాతం. చిలిపి కృష్ణునిగా, గో పాలకునిగా, రాధా మనోహరునిగా, రుక్మిణీ సత్యభామాది అష్టపత్నులకూ ఇష్టుడైన వాడిగా... గోపికావల్లభుడిగా... యాదవ ప్రభువుగా, పార్థుడి సారథియైన పాండవ పక్షపాతిగాను, గీతా బోధకునిగా, తత్త్వోపదేశకునిగా, దేవదేవునిగా, రాజనీతిజ్ఞునిగా... ఇలా బహువిధాలుగా శ్రీ కృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం ద్యోతకమవుతుంటాయి. ఎన్నిసార్లు చదివినా, ఎంత తెలుసుకున్నా ఆయన లీలలు మిగిలిపోతూనే ఉంటాయి. శ్రీ కృష్ణుడు బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. గోపికల ఇళ్లలో వెన్నముద్దలను దొంగిలించి తినేవాడు. అది చాలదన్నట్టు వారిలో వారికి తంపులు పెట్టేవాడు. అందులోని అంతరార్థమేమిటంటే.. జ్ఞానానికి సంకేతమైన వెన్న అజ్ఞానానికి చిహ్నమైన నల్లని కుండలలో కదా ఉండేది. అందుకే కుండ పెంకులనే అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నమైన వెన్నను దొంగిలించడం ద్వారా తన భక్తుల మనసులో విజ్ఞానపు వెలుగులు నింపేవాడు. గోపాలకృష్ణుడు‘గో’ అంటే ఆవు అని సామాన్యార్థం. గోపాలకుడు అంటే గోవులను కాసే వ్యక్తి. అయితే ‘గో’ అనే శబ్దానికి కిరణాలు, భూమి, పంచభూతాలు, జీవుడు అన్నవి విశేషార్థాలు. కాబట్టి గోవులను పాలించేవాడు అంటే సంరక్షించేవాడు కాబట్టి ఆయన గోపాలకృష్ణుడయ్యాడు. మోహన కృష్ణుడుశ్రీకృష్ణునిది మేఖశ్యామల వర్ణం. అంటే చామన చాయ. నల్లని రంగు దేనికీ తక్కువ కాదని చాటటమే అందులోని అంతరార్థం. బంగారు పిందెల మొలతాడు, సరిమువ్వగజ్జెలు, శిఖలో పింఛం, పట్టు దట్టి, కస్తూరీ తిలకం, వక్షస్థలంలో కౌస్తుభమణి... ఇవన్నీ ఆయన విభవానికి చిహ్నాలు. నాయనమ్మ అలంకరించిన నెమలిపింఛాన్ని ఆమె ప్రీతికోసం ఎల్లప్పుడూ ధరించేవాడు. చేతిలోని మురళి గోవులను, గోపబాలకులను అలరించేందుకు ఉద్దేశించినదే. శ్రీకృష్ణుని పూజించేవారికి మాయవలన కలిగే దుఃఖాలు దరిచేరవని అంటారు.వేణుమాధవుడుకన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...కృష్ణుడికి అర్పించుకోవడం కోసం వేణువు తనను తాను డొల్లగా చేసుకుంటే, ఆ డొల్లలో గాలిని నింపడం కోసం కృష్ణుడు ఎప్పుడూ దానిని తన పెదవుల దగ్గరే ఉంచుకునేవాడు. అందుకే కృష్ణుడి పెదవులు తనను తాకి నప్పుడు పరవశించి మృదు మధురమైన గానాన్ని వినిపిస్తుంది వేణువు. అందుకే నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
‘శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే అర్థినామ్...’ అనే మంగళ శ్లోకం?
‘శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే అర్థినామ్...’ అనే మంగళ శ్లోకం, వైష్ణవాలయాల్లో, వైష్ణవుల నిత్య పూజల్లో దేశ విదేశాలలో ప్రతిరోజూ కొన్ని లక్షలసార్లు వినబడుతుంది. శ్రియః కాంతాయ (శ్రీదేవి వల్లభుడైన స్వామికి), కల్యాణ నిధయే (సమస్త కల్యాణ గుణాలకూ నెలవైన స్వామికి), నిధయే అర్థినామ్ (ప్రార్థ నలు చేసే అర్థి జనానికి పెన్నిధి అయిన స్వామికి), శ్రీ వేంకటనివాసాయ (శ్రీ వేంకటాద్రి నివాసుడికి), శ్రీనివాసాయ (లక్ష్మీ నివాసు డైన స్వామికి) మంగళమ్ (మంగళమగుగాక)! వేంకటేశ్వర సుప్ర భాతంతో పాటు రోజూ వినిపించే మంగళ ఆశాసన శ్లోకాల్లో ప్రప్ర థమ శ్లోకం ఇది. ఈ మంగళాశాసన శ్లోకాలు రచించిన ధన్యుడు 14వ శతాబ్దంలో జీవించిన ప్రతివాది భయంకర అన్నంగరాచార్యు లవారు అనే విద్వన్మణి. మనోహరమైన భావా లను, మధురమైన పదాలతో పొదిగి చెప్పే ఈ శ్లోకాలు ఆస్తికులకు సుపరిచితాలు.ఒక శ్లోకం... లక్ష్మీ– సవిభ్రమ – ఆలోక – సుభ్రూ విభ్రమ – చక్షుషే (లక్ష్మీదేవిని సంభ్ర మంతో కుతూహలోత్సాహాలతో రెప్పలారుస్తూ చూస్తున్నప్పుడు ముచ్చట గొలిపే కనుబొమల కదలికలు కలిగిన వాడినిగా వేంకటేశ్వరుడిని వర్ణిస్తే; మరొక శ్లోకం... సర్వావయవ సౌందర్య/ సంపదా, సర్వచేతసామ్/ సదా సమ్మోహనాయ (సకల అవయవ సౌందర్య సంపద చేత, సర్వ ప్రాణులకూ సదా సమ్మో హనకారుడు)గా ఆయనను అభివర్ణిస్తుంది. శ్రీ వేంకటాద్రి శృంగ అగ్రానికి మంగళకరమైన శిరోభూషణంగా నిలిచిన స్వామిని మరొక శ్లోకం కొనియాడింది.వైకుంఠం మీద విరక్తి కలిగి, తిరుమల క్షేత్రంలో స్వామి పుష్క రిణి తీరంలో స్వామి, లక్ష్మీదేవితో విహరిస్తున్నాడని ఒక శ్లోకం చమ త్కరిస్తే, భక్త పురుషులకు తన పాదాల శరణ్యత్వాన్ని, స్వామి స్వయంగా తన దక్షిణ హస్తం ద్వారా చూపుతున్నాడని మరొక శ్లోకం ఉత్ప్రేక్షిస్తుంది. ఈ మంగళాశాసన శ్లోకాల విశేష ప్రాచుర్యా నికి వాటి అసాధారణ సౌందర్యమే కారణం. – ఎం. మారుతి శాస్త్రి -
వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం? ఈజీగా చేసుకోవాలంటే..?
శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘'వర'అంటే శ్రేష్ఠమైన అని అర్థం కూడా ఉంది.సిద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతిశ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదాకార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది. ఈ వ్రతం రోజు చదివే వరలక్ష్మీ కథలో.. సాక్షాత్తూ లక్ష్మీ దేవే కలలో సాక్షాత్కరించి, వ్రత విధానాన్ని వివరించడం.. గృహిణిగా చారుమతి ఆదర్శనీయతకు నిదర్శనం. నిస్వార్థత, తోటివారికి మేలు కలగాలనే మనస్తత్వం, ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే సహృదయత కలిగిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఈ కథ తెలియజేస్తోంది. ఈ లక్షణాలను అందరూ అలవరచుకోవాలనే సందేశాన్ని ఇస్తోంది.పూజా విధానం..భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది.శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఇంటి ఆచారాన్ని బట్టి కలిశం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవడం లేదా అమ్మవారి ఫొటో లేదా రూపును తెచ్చుకుని పూజించాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.తోరం తయారు చేయు విధానం..తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.ఆ రోజు వీలుకాకపోతే..శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.కేవలం వరాల కోసం కాదు..లక్ష్మీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు... భావ దారిద్య్రాన్ని తొలగించాలని ప్రార్థించడానికి. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం.. ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలి.(చదవండి: అభిషేకప్రియుడైన శివుడికి చీపురు సమర్పించడం గురించి విన్నారా..?) -
తొలి ఏకాదశి విశిష్టత? ఆ పేరు ఎలా వచ్చిందంటే..!
హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా.. ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి సవివరంగా తెలుసుకుందాం..ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.పూజకు పూజ.. ఆరోగ్యానికి ఆరోగ్యం..ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట.ఏకాదశి విశిష్టత..కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు.. బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట. నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు రుషులు చెబుతారు.ఏం చేయాలి..?ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తికంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు తిరిగి మేల్కొంటాడు. దక్షిణాయన ప్రారంభకాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణుభక్తులకు పరమపవిత్రం. ఉపవాస జాగరణలతో ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ రోజు జగన్నాథుడికి స్వర్ణాలంకారం జగన్నాథుడి తిరుగు రథయాత్ర మొదలైన మరునాడు– అంటే, తొలి ఏకాదశి రోజున జగన్నాథుని స్వర్ణాలంకృతుని చేస్తారు. దీనినే స్థానికంగా ‘సునా బేషొ’ అంటారు. జగన్నాథుడి స్వర్ణాలంకార వేషాన్నే ‘రాజ వేషం’, ‘రాజాధిరాజ వేషం’ అని కూడా అంటారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలకు బంగారు కాళ్లు, చేతులను, ముఖాలకు బంగారు ఊర్థ్వపుండ్రాలను అలంకరిస్తారు. జగన్నాథుడి ఊర్ధ్వపుండ్రానికి వజ్రం, బలభద్రునికి కెంపు, సుభద్ర ఊర్ధ్వపుండ్రానికి పచ్చ ΄దిగి ఉంటాయి.జగన్నాథుడి చేతుల్లో బంగారు శంఖు చక్రాలను, బలభద్రుడి చేతుల్లో బంగారు గద, హలాయుధాలను అలంకరిస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు వజ్రాలు సహా రత్న కిరీటాలు, కర్ణకుండలాలు, నాసాభరణాలు, కంఠహారాలు, బంగారు పుష్పమాలలు, వడ్డాణాలు, రాహురేఖలను అలంకరిస్తారు. జగన్నాథుడి కిరీటంపై ప్రత్యేకంగా బంగారు నెమలి పింఛాన్ని కూడా అలంకరిస్తారు.(చదవండి: రూ.14 వేలకే 'దివ్య దక్షిణ యాత్ర'..తొమ్మిది రోజుల్లో ఏకంగా ఏడు..!) -
రైభ్యుడికి సనత్కుమారుడి దర్శనం..
రైభ్య మహర్షి ఒకసారి పితృతీర్థమైన గయాక్షేత్రానికి వెళ్లాడు. అక్కడ పితృదేవతలకు పిండప్రదానాలు చేసి, వారిని తృప్తిపరచాడు. ఆ తర్వాత అక్కడే ఆయన కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. రైభ్యుడు తపస్సు చేస్తుండగా, ఒకనాడు అతడి ముందు ఒక దివ్యవిమానం నిలిచింది. అందులో ఒక యోగి నలుసంత ప్రమాణంలో ఉన్నాడు. అతడు గొప్పతేజస్సుతో సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. అతడు ‘ఓ రైభ్యా! ఎందుకు ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నావు?’ అని అడిగాడు. రైభ్యుడు బదులిచ్చేలోగానే ఆ యోగి తన శరీరంతో భూమ్యాకాశాలంతటా వ్యాపించాడు. రైభ్యుడు విభ్రాంతుడయ్యాడు. ‘మహాత్మా! మీరెవరు? అని ప్రశ్నించాడు.‘నేను బ్రహ్మమానస పుత్రుణ్ణి. నా పేరు సనత్కుమారుడు. భూలోకానికి పైనున్న ఐదో ఊర్ధ్వలోకమైన జనలోకంలో నివసిస్తుంటాను. నాయనా రైభ్యా! నువ్వు ఉత్తముడివి, వేదాభిమానివి. పవిత్రమైన ఈ గయాక్షేత్రంలో పితృదేవతలను సంతృప్తిపరచినవాడివి. నీకు నేను ఈ పితృతీర్థ మహాత్మ్యం గురించిన ఒక వృత్తాంతం చెబుతాను విను’ అని ఇలా చెప్పసాగాడు.‘పూర్వం విశాలనగరాన్ని విశాలుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతడికి పుత్రసంతానం లేదు. ఒకనాడు విశాలుడు విప్రులను పిలిపించి, పుత్ర సంతానం కోసం ఏం చేయాలో చెప్పండని అడిగాడు. ‘రాజా! పుత్రసంతానం కావాలంటే, మీరు గయాక్షేత్రానికి వెళ్లి అక్కడ పితృదేవతలకు పిండప్రదానాలు చేసి, అన్నదానం చేయాలి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే తప్పక పుత్రసంతానం కలుగుతుంది’ అని విప్రులు సలహా ఇచ్చారు. విప్రుల సూచనతో సకల సంభారాలను తీసుకుని, పరివారాన్ని వెంటబెట్టుకుని విశాలుడు గయాక్షేత్రానికి బయలుదేరాడు. అక్కడ మఖనక్షత్రం రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచి, పిండ ప్రదానాలు చేయడం మొదలుపెట్టాడు.విశాలుడు అలా పిండప్రదానాలు చేస్తుండగా, ఆకాశంలో ముగ్గురు పురుషులు ఆయనకు కనిపించారు. వారు ముగ్గురూ మూడు రంగుల్లో– తెల్లగా, పచ్చగా, నల్లగా ఉన్నారు. వారిని చూసిన విశాలుడు ‘అయ్యా! తమరెవరు? ఎందుకు వచ్చారు? మీకేం కావాలి?’ అని అడిగాడు.వారిలో తెల్లగా ఉన్న పురుషుడు ‘నాయనా! విశాలా! నేను నీ తండ్రిని. నన్ను పితుడు అంటారు. నా పక్కన ఉన్న వ్యక్తి నా తండ్రి. అంటే, నీకు తాత. బతికి ఉండగా, బ్రహ్మహత్య సహా అనేక పాపాలు చేశాడు. ఇతడి పేరు అధీశ్వరుడు. ఇతడి పక్కనే నల్లగా ఉన్న పురుషుడు నా తండ్రికి తండ్రి. అంటే, నీకు ముత్తాత. బతికి ఉన్నకాలంలో ఎందరో మహర్షులను చంపాడు.నాయనా! విశాలా! నా తండ్రి, అతడి తండ్రి చేసిన పాపాల ఫలితంగా మరణానంతరం అవీచి అనే ఘోర నరకంలో భయంకరమైన శిక్షలను అనుభవించారు. నేను వారిలా పాపకార్యాలు చేయకపోవడం వల్ల, చేతనైన మేరకు పుణ్యకార్యాలు చేయడం వల్ల ఇంద్రలోకం పొందాను. ఈనాడు నువ్వు శ్రద్ధగా పితృతీర్థమైన ఈ గయాక్షేత్రంలో పితృదేవతల సంతృప్తి కోసం సంకల్పించి, పిండప్రదానాలు చేయడం వల్ల వీరిద్దరూ నన్ను కలుసుకోగలిగారు. పిండప్రదాన సమయంలో నీ సంకల్పబలం వల్లనే మేం ముగ్గురమూ ఒకేసారి ఇలా కలుసుకోగలిగాం.ఈ తీర్థమహిమ వల్ల మేం ముగ్గురమూ ఇప్పుడు పితృలోకానికి వెళతాం. ఇక్కడ పిండప్రదానం చేయడం వల్ల ఎంతటి దుర్గతి పొందినవారైనా సద్గతులు పొందుతారు. ఇందులో సందేహం లేదు. నాయనా! నీ కారణంగా మాకు సద్గతులు కలుగుతున్నందుకు ఎంతో ఆనందిస్తూ, నిన్ను చూసి వెళ్లాలని వచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది. నీకు సకల శుభాలు కలుగుగాక!’ అని ఆశీర్వదించి పితృదేవతలు ముగ్గురూ అక్కడి నుంచి అంతర్థానమయ్యారు. పితృదేవతల ఆశీస్సుల ఫలితంగా విశాలుడు కొంతకాలానికి పుత్రసంతానాన్ని పొందాడు.‘రైభ్యా! నువ్వు కూడా ఈ పరమపవిత్ర గయాక్షేత్రంలో పితృదేవతలకు పిండప్రదానాలు చేశావు. వారికి ఉత్తమ గతులు కల్పించావు. అంతేకాకుండా, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని, గొప్ప తపస్సు చేస్తున్నావు. అంతకంటే భాగ్యమేముంటుంది? అందుకే నువ్వు ఉత్తముడివి, ధన్యుడివి అంటున్నాను. రైభ్యా! ఈ గయాక్షేత్రంలోనే గదాధారి అయిన శ్రీమహావిష్ణువు కొలువున్నాడు. నువ్వు ఆయనను స్తుతించి స్వామి అనుగ్రహాన్ని పొందు’ అని చెప్పి సనత్కుమారుడు అంతర్థానమయ్యాడు.రైభ్యుడు సనత్కుమారుడి మాట ప్రకారం గదాధరుడైన శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ ఆశువుగా ‘గదాధరం విభుదజనై రభిష్టుతం ధృతక్షమం క్షుదితజనార్తి నాశనం/ శివం విశాలాసురసైన్య మర్దనం నమామ్యహం హతసకలాశుభం స్మృతౌ...’ అంటూ గదాధర స్తోత్రాన్ని పలికాడు. రైభ్యుడి స్తోత్రానికి పరమానందభరితుడైన పీతాంబరధారిగా, శంఖచక్ర గదాధారిగా శ్రీమహావిష్ణువు అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు.‘రైభ్యా! నీ స్తోత్రానికి సంతోషించాను. నీకు ఏ వరం కావలో కోరుకో’ అన్నాడు శ్రీమహావిష్ణువు.‘స్వామీ! నీ సాన్నిధ్యంలో సనక సనందాది మహర్షులు ఉండే స్థానాన్ని అనుగ్రహించు’ అని కోరాడు.‘తథాస్తు’ అన్నాడు శ్రీమహావిష్ణువు.రైభ్యుడు వెంటనే సనక సనందాది సిద్ధులు ఉండే స్థానానికి చేరుకున్నాడు. – సాంఖ్యాయన -
భక్తిలో విశ్వాసం..!
భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా కేవలం యాంత్రికంగా ఎన్ని రకాల, ఎన్ని వర్ణాల పూలతో పూజ చేసినా ఉపయోగం ఉండదు. విశ్వాసం లేకుండా చేసే తీర్థయాత్రల వల్ల, గంగా స్నానాల వల్ల ఫలితం ఉండదు. గంగలో మునక వేస్తే పాపాలు హరిస్తాయంటారు కానీ నిజంగా అలా జరుగుతుందని నమ్మకం ఏమిటి? అనే అవిశ్వాసం తోనే చాలా మంది ఉంటారు. మనుషులలో సందేహ జీవులే ఎక్కువ.ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఈ విషయం గురించే ‘నిత్యం గంగలో ఎంతోమంది స్నానం చేస్తూ, శివస్మరణ చేస్తున్నారు కానీ ఎవరిలోనూ పూర్తి విశ్వాసం కనిపించటం లేదని అనుకుంటారు. నిజమైన భక్తి ఎవరిదో పరీక్షిద్దామని అనుకుని వృద్ధ దంపతుల రూపంలో గంగా తీరానికి వెళతారు. అక్కడ వృద్ధుడు ఒక గోతిలో పడిపోతాడు. భార్య దుఃఖిస్తూ ఎవరైనా చేయందించి తన భర్తను కాపాడమని అక్కడ చుట్టూ చేరిన వారిని కోరుతుంది.వాళ్ళు ముందుకు రాబోతుంటే ఆమె ‘మీలో ఎప్పుడూ ఏ పాపం చేయని వాళ్ళు మాత్రమే నా భర్తను కాపాడండి. లేకుంటే, చేయందిస్తున్నప్పుడు మీ చేయి కాలిపోతుంది’ అంది. అక్కడ ఉన్నవారంతా గంగా స్నానం చేసినవారు. నిరంతరం శివ స్మరణ చేసేవారు. అయినా, తమ భక్తి మీద తమకు నమ్మకం లేదు. ఎవరూ ముందుకు రాలేదు. వృద్ధుణ్ణి కాపాడే ప్రయత్నం చేయలేదు.అంతలో ఒక దొంగ అక్కడకి వచ్చాడు. వృద్ధురాలు చెప్పిన విషయం తెలుసుకుని, వెంటనే గంగలో మూడు మునకలు వేశాడు. వృద్ధుణ్ణి కాపాడాడు. గంగలో మునిగిన తర్వాత తన పాపాలన్నీ నశించిపోయాయని అతని నమ్మకం. వృద్ధునికి చేయందించినపుడు అతని చేయి కాలలేదు. అదీ విశ్వాసమంటే! ఆ తర్వాత అతడు దొంగతనాలు మాని శివభక్తుడయ్యాడు. అపనమ్మకంతో, సందేహంతో చేసే పనులు ఏవీ సత్ఫలితాన్నివ్వవు. చేసే పనిపై విశ్వాసం ఉండాలి. – డా. చెంగల్వ రామలక్ష్మి -
భిన్నత్వంలో.. ఏకత్వం!
ఓ మానవుడా! భగవంతుని బ్రహ్మాండ రచనను మెచ్చుకొని దానికి శిరసు వంచి వినమ్రునిగా ఉండు. కొంచెం ఆలోచించు. ఎక్కడ నీడ ఉంటుందో అక్కడ ఒక చెట్టు; ఎక్కడ చెట్టు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. అదే మాదిరిగా ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ దుఃఖం, అది ఉన్న చోట సంతోషం ఉంటుంది. భిన్నత్వం, ఏకత్వాల కలబోతే ప్రకృతిమాత.ఎక్కడ భగవంతుడు ఉంటాడో, అక్కడ భక్తుడూ; ఎక్కడ భక్తుడు ఉంటాడో, అక్కడనే భగవంతుడూ ఉంటాడు. ఈ ఇరువురి మధ్య భిన్నత్వం లేదు. అదే మాదిరిగా ఎచ్చట శిష్యుడు ఉంటాడో, అచ్చటనే అతని గురువు ఉంటాడు; గురువు ఉన్న చోటే అతని శిష్యుడూ ఉండవలసినదే. ఈ ద్వంద్వాలను చూచి మోసపోకూడదు. ఈ బ్రహ్మాండ మంతయూ బ్రహ్మ పదార్థమే వ్యాపించియున్నది. ఈ సత్యాన్ని గ్రహించాలి.దేనివల్ల భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వములో భిన్నత్వం కలిగెనో అటువంటి మూలాన్ని స్తుతిస్తూ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మౌనమే ధ్యానం. సాధకుడికి మౌనావలంబనం ఎంతైనా ముఖ్యం. మౌనం మానవుణ్ణి ప్రశాంతపరచి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లడానికి సహాయపడుతుంది. ఏ ఒక్కరూ అనవసరంగా, అధికంగా మాట్లాడకూడదు. అత్యవసరమైనదే మాట్లాడాలి. నిర్ణీత వేళల్లో మౌనంతో ఉండడమే తపస్సు. కేవలం నాలుకను కదల్చకుండా ఉంచుట మౌనం కాదు. మనసుకు కూడా పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా చేసినపుడు మనిషి ఎక్కువ శక్తినీ, ఎక్కువ నిర్మలత్వాన్నీ పొందుతాడు.ఇందువలన మనసు అలసట తీర్చుకొంటుంది. ఏకాగ్రతా పెరుగుతుంది. నీ మనసు ఎంత ఖాళీగా ఉంటుందో, అంత ఏకాగ్రత పెరుగుతుంది. మనసును ఖాళీ చేయటానికి మౌనం చాలా ప్రభావశాలి. మహాత్ములు, జ్ఞానులు దీర్ఘకాలం మౌనం పాటిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ‘గీత’లో తెలిపిన విషయం:‘గోప్యమైన వానిలో, నేనే మౌనమును’. అందువలన మనము కూడా మౌనాభ్యాసం చేద్దాం.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
దేవుని సేవకు ఇదోమార్గం..
భక్తి ఎక్కువైతే కొందరు ఊహాతీతంగా ప్రవర్తిస్తారు. వరగుణ పాండ్యన్ అనే రాజు ప్రవర్తన ఇందుకు మంచి ఉదాహరణ. తిరవిడై మరుదూర్ అనే ఊళ్లో ఆలయానికి కావలసిన నూనెను తీయడం కోసం ఒక రోజు నువ్వులు ఆరబెట్టారు. ఆ సమయంలో అటువైపుగా ఓ శివభక్తుడు వచ్చి ఓ పిడికెడు నువ్వులు తీసుకుని నోట్లో వేసుకున్నాడు.దేవుడి కోసం ఉపయోగించాలని ఎండబెట్టిన నువ్వుల్ని ఇలా నోట్లో వేసుకోవచ్చా? అది తప్పు కదా? అపచారం కదూ! అక్కడ కాపలా ఉన్నవారు ఇది చూశారు. ‘అయ్యో... అపచారం అపచారం’ అంటూ పరుగున వచ్చి అతనిని పట్టుకుని తీసుకుపోయి రాజు వరగుణ పాండ్యన్ ఎదుట హాజరుపరచారు.వరగుణ పాండ్యన్ అతని వంక తీక్షణంగా చూశాడు. నుదుట బొట్టుతో పరమ శివభక్తునిలా కనిపించిన అతడిని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ఈయన ఇలా చేయడమేమిటీ అని అనుకున్న రాజు నమ్మలేకపోతున్నాడు.‘నువ్విలా చేయడమేమిటీ?’ అని అడిగాడు. దానికి ఆ భక్తుడు ఇలా చెప్పాడు... ‘నేను ఆకలి వల్ల అలా చేశాను. ఈ ఊరు నాకు ఎంతో నచ్చింది. శివాపచారం చేస్తే ఏడు జన్మలకు ఈ ఆలయానికి గానుగ ఆడించే ఎద్దుగా పుడతారన్న విషయం తెలుసు. అందుకే అలా చేశాను’ అన్నాడు. పూర్వం ఎద్దులతో గానుగను ఆడించి నూనెను తీసేవారు. పుడితే ఈ ఊళ్ళో పుట్టాలి. అదీనూ గానుVýæ ఆడించే ఎద్దుగా. ఆ ఆలయంలో సేవ చేయాలి. ఒక తప్పు చేస్తే ఆ అవకాశం దక్కుతుందని తెలిసి ఆ భక్తుడు అలా చేశాడు.రాజు వరగుణ పాండ్యన్ భక్తుణ్ణి నోరు తెరవమన్నారు. శివభక్తుడు నోరు తెరిచాడు. అతని నోటిని రాజు చీలుస్తాడని అక్కడున్న వారందరూ అనుకున్నారు. కానీ రాజు భక్తుని నోటిలో అంటుకుని ఉన్న నువ్వుల్ని తీసి తన నోట్లో వేసుకున్నాడు. ‘మీరు చేసిన అపచారాన్ని నేనూ చేశాను. మీతో కలిసి నేనూ గానుగ ఆడించే ఎద్దుగా పుడతాను’ అన్నాడు రాజు. ఇలా ఉంటుంది అపరిమత భక్తిగలవారి ప్రవర్తన. ప్రవర్తనలోని తప్పొప్పుల కన్నా వారి భావన ప్రధానమని గ్రహించాలి. – యామిజాల జగదీశ్ -
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
హిందూ సాంప్రదాయంలో పాములను నాగ దేవతగా భావించి పూజలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ప్రతి నెలలలో వచ్చే పంచమి, చవితి తిథులకు పుట్టలో పాలు పోయడం, పూజలు చేయడం వంటివి కూడా చేస్తారు. కానీ కొందరు మూఢ భక్తితో చేసే పనులు చాలా భయానకంగా ఉంటాయి. అది భక్తో లేక మూర్ఖత్వం అనాలో తెలియదు. అలాంటి షాకింగ్ ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. నిజానికి నాగుపాముని విష్ణవు, శివ స్వరూపాలుగా భావిస్తారు. ఎందుకంటే విష్ణువుకి పాన్పుగా ఆదిశేషుడు, శివుని మెడలో వాసుకిగా నాగులు ఉండటంతో వాటికి పురాణల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ముఖ్యమైన పర్వదినాల్లో నాగులను పూజించి వేడుకోవడం జరుగుతుంది. అంత వరకు ఓకే కానీ ఏకంగా విషసర్పాలను నేరుగా తెచ్చి పూజించడం అంటే..వామ్మో అనిపిస్తుంది కదా!. మహా అయితే పుట్టకో లేదా దేవాలయాల్లో నాగుల జంట ఉండే ప్రతిమకు పూజలు చేస్తే చాలు. దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ కుటుంబం ఏకంగా మూఢ భక్తితో నల్ల నాగుపాముని తెచ్చి ఓ ప్లేటులో ఉంచి పూజలు చేసేస్తున్నారు. అదేమో ఒక పక్క బుసలు కొడుతూ కాటేసే యత్నం చేస్తున్నా..వీళ్లు మాత్రం భక్తిపారవశ్యంతో పూజలు చేసేస్తున్నారు. మరోవూపు అది కాటేస్తుందేమోనన్న భయంతో ఒక పక్క మనుసులో ఉన్నా సరే పూజల తంతు మాత్రం ఆపడం లేదు. పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థిత ఏంటీ..?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వాళ్లు నాగుపాముకి నేరుగా పూజలు చేస్తున్న విధానం చూస్తే..బాబోయ్! అనిపిస్తుంది. View this post on Instagram A post shared by हिंदू धर्म रक्षक (@omkar_sanatanii) (చదవండి: టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..! వీడియో వైరల్) -
ఉత్తముడి వృత్తాంతం.. ‘మహారాజా! నేను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో..
ఉత్తానపాదుడికి, సురుచికి ఉత్తముడు అనే కుమారుడు జన్మించాడు. ఉత్తముడు సార్థకనామధేయుడు. సకల శాస్త్రాలు, శస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. తండ్రి గతించిన తర్వాత రాజ్యాధికారం చేపట్టి, ధర్మప్రభువుగా పేరు పొందాడు. బభ్రు చక్రవర్తి కుమార్తె బహుళను ఉత్తముడు పెళ్లాడాడు.ఉత్తముడు భార్య బహుళను అమితంగా ప్రేమించేవాడు. అయినా ఆమె భర్త పట్ల విముఖురాలిగా ఉండేది. అతడు ఆమెకు దగ్గర కావాలని చూసినా, ఆమె ఏదో వంకతో అతడిని దూరం పెట్టేది. ఉత్తముడు ఒకనాడు తన మిత్రులను పిలిచి విందు ఇచ్చాడు. వాళ్లంతా తమ తమ భార్యలతో సహా వచ్చారు. విందులో అందరూ ఆనందంగా రుచికరమైన వంటకాలను ఆరగిస్తూ, మధువు సేవించసాగారు. ఉత్తముడు తన భార్య బహుళకు మధుపాత్ర అందించాడు. ఆమె అందరి ఎదుట ఉత్తముడిని తిరస్కరించి చరచరా లోపలకు వెళ్లిపోయింది. భార్య చర్యతో ఉత్తముడికి సహనం నశించింది. వెంటనే భటులను పిలిచి, ఆమెను ‘అడవిలో విడిచిపెట్టి రండి’ అని ఆజ్ఞాపించారు. కోపం కొద్ది భార్యను విడిచిపెట్టినా, ఉత్తముడికి ఆమెపై ప్రేమ తగ్గలేదు. లోలోపల బాధను అణచుకుని పాలన కొనసాగించసాగాడు.ఒకనాడు ఒక విప్రుడు ఉత్తముడి వద్దకు వచ్చాడు. ‘మహారాజా! నిన్న అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో నా భార్యను అపహరించుకుపోయారు. దయచేసి ఆమెను వెదికించి నాకు ఇప్పించు’ అని కోరాడు. ‘బ్రాహ్మణోత్తమా! నీ భార్య ఎలా ఉంటుంది?’ అడిగాడు ఉత్తముడు.‘మహారాజా! నా భార్య కురూపి. అంతేకాదు, గయ్యాళి. భార్య ఎలాంటిదైనా ఆమెను భరించడం భర్త ధర్మం. అందువల్ల నా భార్యను వెదికి తెప్పించు. రాజుగా అది నీ ధర్మం’ అన్నాడు విప్రుడు. విప్రుడి భార్యను వెదకడానికి ఉత్తముడే స్వయంగా సిద్ధపడ్డాడు. విప్రుడిని వెంటపెట్టుకుని రథంపై బయలుదేరాడు. రాజధాని దాటిన కొంతసేపటికి ఒక అడవిని చేరుకున్నాడు. అక్కడ ఒక ముని ఆశ్రమాన్ని గమనించి, రథాన్ని నిలిపి ఆశ్రమం లోపలకు వెళ్లాడు.రాజును గమనించిన ముని, అతణ్ణి ఆదరంగా పలకరించాడు. అర్ఘ్యాన్ని తెమ్మని శిష్యుడికి చెప్పాడు. ఆ ముని రాజు వృత్తాంతం తెలుసుకుని అర్ఘ్యం ఇవ్వకుండానే ఆసనం సమర్పించి, సంభాషణ ప్రారంభించాడు. ‘మునీశ్వరా! మీ శిష్యుడు అర్ఘ్యం తేబోయి, మళ్లీ తిరిగి వెనక్కు ఎందుకు వెళ్లాడో అంతుచిక్కడం లేదు. కారణం తెలుసుకోవచ్చునా?’ అడిగాడు ఉత్తముడు. ‘రాజా! నా శిష్యుడు త్రికాలవేది. నిన్ను చూసిన వెంటనే గతంలో నువ్వు నీ భార్యను అడవిలో ఒంటరిగా వదిలేశావని తెలుసుకున్నాడు. అందుకే నువ్వు అర్ఘ్యం స్వీకరించడానికి యోగ్యతను పోగొట్టుకున్నావు’ అన్నాడు. ‘స్వామీ! నా తప్పును తప్పక దిద్దుకుంటాను. నాతో వచ్చిన ఈ విప్రుడి భార్యను ఎవరో అపహరించారు. ఆమెను ఎవరు తీసుకువెళ్లారో, ఎక్కడ బంధించారో చెప్పండి’ అడిగాడు ఉత్తముడు. ‘రాజా! ఈ విప్రుడి భార్యను బలాకుడు అనే రాక్షసుడు అపహరించాడు. ఉత్తాలవనంలో బంధించాడు’ అని చెప్పాడు.ఉత్తముడు విప్రుడిని వెంటపెట్టుకుని ఉత్తాలవనం చేరుకున్నాడు. అక్కడ రాక్షసుడి చెరలో ఉన్న విప్రుడి భార్యను చూశాడు. రాజును చూడగానే ఆమె ‘రాజా! ఎవరో రాక్షసుడు నన్ను అపహరించి ఇక్కడ బంధించాడు. ఇప్పుడు అతడు తన అనుచరులతో వనానికి అటువైపు చివరకు వెళ్లాడు’ అని చెప్పింది. ఉత్తముడు ఆమె చెప్పిన దిశగా బయలుదేరాడు. అక్కడ బలాకుడు తన అనుచరులతో కనిపించాడు. ఉత్తముడు విల్లంబులను ఎక్కుపెట్టగానే ఆ రాక్షసుడు భయభ్రాంతుడై కాళ్ల మీద పడ్డాడు. ‘ఓరీ రాక్షసా! నువ్వు వేదపండితుడైన ఈ విప్రుడి భార్యను ఎందుకు అపహరించావు?’ అని గద్దించాడు ఉత్తముడు.‘రాజా! ఈ విప్రుడు యజ్ఞాలలో రక్షోఘ్న మంత్రాలను పఠిస్తూ, నేను ఆ పరిసరాల్లో సంచరించకుండా చేస్తున్నాడు. అతడి నుంచి భార్యను దూరం చేస్తే అతడు యజ్ఞాలు చేయడానికి అనర్హుడవుతాడు. అందుకే ఆమెను అపహరించుకు వచ్చాను. అంతకు మించి నాకే దురుద్దేశమూ లేదు’ అని బదులిచ్చాడు. ‘అయితే, రాక్షసా! నువ్వు ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను విప్రుడికి అప్పగించు’ అన్నాడు ఉత్తముడు.అతడు సరేనంటూ, ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను సురక్షితంగా విప్రుడికి అప్పగించి వచ్చాడు. ‘రాజా! ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను తలచుకుంటే వచ్చి సాయం చేస్తాను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బలాకుడు.విప్రుడి భార్యను అప్పగించాక ఉత్తముడు తన భార్య ఆచూకీ కోసం తిరిగి ముని ఆశ్రమానికి వచ్చాడు.‘నీ భార్యను కపోతుడనే నాగరాజు మోహించి, రసాతలానికి తీసుకుపోయాడు. అతడి కూతురు నంద నీ భార్యను రహస్యంగా అంతఃపురంలో దాచింది. నాగరాజు కొన్నాళ్లకు తిరిగి వచ్చి తాను తెచ్చిన వనిత ఏదని అడిగితే కూతురు బదులివ్వలేదు. దాంతో కోపించి, ‘నువ్వు మూగదానిగా బతుకు’ అని శపించాడు. ఇప్పుడు నీ భార్య నాగరాజు కూతురి సంరక్షణలో సురక్షితంగా ఉంది’ అని చెప్పాడు ముని.ఉత్తముడు వెంటనే బలాకుడిని తలచుకున్నాడు. నాగరాజు చెరలో ఉన్న తన భార్యను తీసుకురమ్మని చెప్పాడు. బలాకుడు ఆమెను అక్కడి నుంచి విడిపించి తెచ్చి ఉత్తముడికి అప్పగించాడు. — సాంఖ్యాయనఇవి చదవండి: ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'? -
ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా.. ఒకనాడు..
శ్రీరామ పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు ఆంజనేయుడు రాముని వద్ద సెలవు తీసుకుని, తపస్సు చేసుకోవడానికి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని, నిరంతరం తపస్సు కొనసాగించేవాడు. సముద్రాన్ని లంఘించి, లంకకు వెళ్లి అక్కడ సీతమ్మవారిని చూడటమే కాకుండా, రావణుడి ఆజ్ఞపై రాక్షసులు తోకకు నిప్పంటిస్తే లంకను తగులబెట్టి మరీ తిరిగి వచ్చిన వైనం సహా రామ రావణ యుద్ధంలో హనుమంతుని సాహసాలను జనాలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. అయోధ్యవాసులకే కాదు, రామరాజ్యం అంతటా జనాలకు శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు కూడా ఆరాధ్యుడయ్యాడు. గంధమాదన పర్వతం మీద నిర్మించుకున్న ఆంజనేయుడి ఆశ్రమం తాపసులకు ఆశ్రయంగా ఉండేది. ఆశ్రమంలో ప్రతిరోజూ వేదపఠనం సాగేది. తాత్త్విక చర్చలు సాగుతుండేవి. ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా, ఒకనాడు ఆంజనేయుడికి శ్రీరాముడిని దర్శించుకోవాలని కోరిక పుట్టింది. వెంటనే తన ఒంటె వాహనం మీద అయోధ్య నగరానికి బయలుదేరాడు. జానకీ సమేతుడైన శ్రీరాముడిని దర్శించుకుని, పరిపరి విధాలుగా స్తుతిస్తూ ప్రణమిల్లాడు. శ్రీరాముడు ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుని, ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ఇక్కడి నుంచి గంధమాదనానికి వెళ్లిపోయాక చాన్నాళ్లకు వచ్చావు. నీ రాక నాకే కాదు, సీతకు కూడా ఆనందదాయకమే! నువ్వు ఉంటున్న చోటు సౌకర్యంగానే ఉందా? ఆశ్రమవాసంలో అంతా కుశలమే కదా?’ అంటూ కుశలప్రశ్నలు వేశాడు. ‘రామా! నీ దయ నిరంతరం నా మీద ఉండగా నాకు చింత ఏమిటి? క్షేమంగానే ఉన్నాను స్వామీ!’ అని బదులిచ్చాడు ఆంజనేయుడు. ‘హనుమా! సీతాన్వేషణ మొదలుకొని రావణుడితో యుద్ధం వరకు నాకు ఎన్నో రకాలుగా తోడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు నాకు మరొక పని చేసిపెట్టాలి’ అన్నాడు రాముడు. ‘ఆజ్ఞాపించు ప్రభూ! నీ ఆజ్ఞను నెరవేర్చడమే నా కర్తవ్యం’ చేతులు జోడించి అన్నాడు హనుమంతుడు. ‘నా అంగుళీయకాన్ని అడిగితే దానిని బ్రహ్మదేవుడికి ఇచ్చాను. లంకలో ఉన్నప్పుడు సీత ఆ ఉంగరాన్ని చూసుకుంటూ తన దుఃఖాన్ని తీర్చుకునేది. ఇప్పుడు ఆ ఉంగరం కావాలి. నువ్వు వెంటనే సత్యలోకానికి వెళ్లి, ఆ ఉంగరాన్ని తెచ్చి ఇవ్వు’ అన్నాడు రాముడు. శ్రీరాముడి మాట పూర్తికావడమే తడవుగా ఆంజనేయుడు రివ్వున ఆకాశానికి ఎగిరాడు. వాయువేగ మనోవేగాలతో నేరుగా సత్యలోకానికి చేరుకున్నాడు. సత్యలోకంలో బ్రహ్మదేవుడి కొలువు నిండుగా ఉంది. అష్టదిక్పాలకులు, సనక సనందాది మహామునులు అక్కడ ఉన్నారు. ఆంజనేయుని చూడగానే వారందరూ లేచి నమస్కరించి, అతడిని ఉచితాసనంపై కూర్చుండబెట్టారు. సభలోకి బ్రహ్మదేవుడు అడుగుపెట్టాడు. సభాసదులందరూ ఆయనకు నమస్కరించారు. ఆంజనేయుడు కూడా లేచి నిలుచుని బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. ‘దేవా! మా శ్రీరామచంద్రుడు తన రత్నఖచిత కనక అంగుళీయకాన్ని నీకు ఇచ్చాడట. ఆ ముద్రికను తీసుకు రమ్మని నన్ను ఇక్కడకు పంపాడు. ఆ ముద్రికను వెంటనే ఇచ్చేస్తే, నేను దానిని తీసుకువెళ్లి నా ప్రభువుకు అందిస్తాను’ అన్నాడు. ‘ఇది సత్యలోకం. ఇక్కడ ఒకసారి ఇచ్చినది ఏదైనా తిరిగి ఇవ్వడానికి వీలుపడదు’ అని పలికాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి మాటలకు ఆంజనేయుడికి కోపం వచ్చింది. ‘బ్రహ్మదేవా! బొత్తిగా కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు. నాకు ఇక్కడ ఆలస్యం చేయడానికి వీలుపడదు. నువ్వు ఇవ్వకుంటే, ఈ సత్యలోకాన్నే పెళ్లగించుకుని పోయి నా ప్రభువు పాదాల ముందు ఉంచుతాను’ అంటూ తన దేహాన్ని విపరీతంగా పెంచి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సత్యలోకంలో ఉన్నవారంతా ఆంజనేయుని భీకర విశ్వరూపాన్ని చూసి హాహాకారాలు చేశారు. ఇంతలో సనక మహర్షి కల్పించుకుని, ‘బ్రహ్మదేవా! రామదూత ఆంజనేయుడి బలవిజృంభణను చూశావు కదా! పరిస్థితి అదుపు తప్పక ముందే ఆ ముద్రికను అతడికి ఇచ్చి పంపడమే మంచిది’ అని పలికాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పక్కనే తామరలతో నిండి ఉన్న కొలనను చూపించి, ‘ఆ ముద్రిక అందులోనే ఉంది. తీసుకువెళ్లు’ అన్నాడు. హనుమంతుడు కొలనులోకి చూస్తే, నీటి అడుగున అసంఖ్యాకంగా రామ ముద్రికలు కనిపించాయి. అన్నిటినీ తీసుకువెళ్లడానికి రామాజ్ఞ లేదు. ఏం చేయాలో తోచక ఆంజనేయుడు రిక్తహస్తాలతోనే అయోధ్యకు చేరుకుని, రాముడికి జరిగిన సంగతంతా చెప్పాడు. ‘హనుమా! ఆ సరస్సున ఉన్నవి నా అంగుళీయకానికి బింబ ప్రతిబింబాలే! వాటి మహిమతోనే బ్రహ్మదేవుడు సత్యలోకాన్ని సకలలోక సమ్మతంగా పరిపాలిస్తున్నాడు. వాటిలో ఒకటి తీసుకురా’ అని చెప్పాడు. హనుమంతుడు వెంటనే మళ్లీ సత్యలోకానికి వెళ్లి సరస్సులో ఉన్న ముద్రికల్లో ఒకదానికి తీసుకువచ్చి, రాముడికి అందజేశాడు. రాముడు సంతోషించి, ‘హనుమా! భవిష్యత్తులో నువ్వే సత్యలోకాధిపత్యం పొంది భవిష్యద్బ్రహ్మవై వర్ధిల్లగలవు’ అని ఆశీర్వదించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు.. -
భద్రాచలం: రామా కనవేమిరా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూద్దామని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భద్రాచలంలో వసతి, సౌకర్యాలకు నోచుకోవడంలేదు. అధికారులు దశాబ్దాలుగా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు తప్ప సామాన్య భక్తులను పట్టించుకోవడంలేదు. ఒక్కరోజులోనే ఏసీ గదులు బుకింగ్.. రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు దేవస్థానానికి చెందిన సత్రాలు, కాటేజీలతోపాటు ప్రైవేటు లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో గదులను బుక్ చేసుకునేందుకు దేవస్థానం ఆన్లైన్లో అవకాశం కల్పించింది. ఈ నెల 17,18 తేదీల్లో కల్యాణం, పట్టాభిషేకం ఉండగా, 11 నుంచి ఆన్లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇలా బుకింగ్స్ మొదలయ్యాయో లేదో ఇటు దేవస్థానం, అటు ప్రైవేటు లాడ్జీల్లో ఉన్న ఏసీ గదులన్నీ బుక్ అయిపోయాయి. సింగిల్ రూమ్ మొదలు సూట్ వరకు ఏ ఒక్కటీ అందుబాటులో లేవు. వేసవిలో భద్రాచలంలో నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. దీంతో ఏసీ రూమ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది. నాన్ ఏసీలదీ అదే బాట నాన్ ఏసీ గదులకు సంబంధించి దేవస్థానం ఆధ్వర్యంలోని కుటీరాలు, సత్రాల్లోని గదులు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. కేవలం ప్రైవేటు లాడ్జీల్లో నాన్ ఏసీ గదులే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా ఈ నెల 16 సాయంత్రం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రెండు రోజుల ప్యాకేజీతో లభిస్తున్నాయి. ఇవి సింగిల్ రూమ్‌కి రూ.1,732 మొదలు ట్రిపుల్ రూమ్‌కు రూ. 3,464 వరకు చార్జీలుగా ఉన్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ఇంత ధర చెల్లించేందుకు కూడా భక్తులు పోటీ పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి ఈ గదులు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. భద్రాచలంలో ఉన్న గదులన్నీ ఆన్లైన్లో ముందుగానే బుక్ అయిపోతే నవమి రోజు ఇక్కడికి చేరుకునే సామాన్య భక్తులు, అడ్వాన్స్ రిజర్వ్ చేసుకోని వారికి ఇక్కట్లు తప్పేలా లేవు. డార్మిటరీలు కరువే నవమి వేడుకలు చూసేందుకు యాభై వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఇలా వచ్చే భక్తుల్లో సగం మంది ఉదయమే (ఏప్రిల్ 17) భద్రాచలం చేరుకుని కల్యాణం చూసుకుని, దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఇలాంటి వారికి వసతితో పెద్దగా అవసరం పడదు. కానీ స్నానాలు చేసేందుకు, సామన్లు దాచుకునేందుకు అనువుగా నామామాత్రపు సౌకర్యాలను ఈ భక్తులు ఆశిస్తారు. ప్రస్తుతం భద్రాచలంలో ఈ సదుపాయాలు కూడా కరువయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకు గోదావరి నదినే స్నానాలకు దిక్కవుతోంది. తమతో పాటు తెచ్చుకున్న లగేజీని దాచుకోవడం కష్టంగా మారుతోంది. బొమ్మలు, కొబ్బరికాయల దుకాణాలే క్లోక్‌రూమ్ సేవలు అందిస్తున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న భద్రాచలంలో ఎప్పుడో దశాబ్దాల కిందట కట్టిన సత్రాలు, ప్రైవేటు లాడ్జీలే ఆశ్రయం కల్పిస్తున్నాయి. గడిచిన పదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం సత్రంలో 32 గదులు, జానకీ సదనంలో 32 గదులు తప్ప మరో నిర్మాణం జరగలేదు. మరోవైపు ప్రైవేటు సెక్టారులో ఒకటి రెండు హోటళ్లు, కుల సంఘాల ఆధ్వర్యంలో సత్రాలు అందుబాటులోకి వచ్చాయి. హోం స్టే పద్ధతి అమల్లోకి తెస్తే.. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా భద్రాచలంలో మౌలిక సదుపాయలు మెరుగుపరచడంపై దేవస్థానం, ప్రభుత్వం, భద్రాచలం పంచాయతీలు ప్రయత్నించడం లేదు. ఫలితంగా శ్రీరామనవమి, ముక్కోటి, ఇతర పర్వదినాలు, సెలవు రోజుల్లో భద్రాచలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. దాతల ద్వారా నిధులు సమీకరించి కొత్తగా సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టడం లేదు. ఇతర ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో ఉన్నట్టుగా ‘హోం స్టే’ పద్ధతిని భద్రాచలంలో అమల్లోకి తీసుకురావడంపై కనీస స్థాయిలో కూడా ప్రయత్నాలు జరగడం లేదు. భద్రాచలంలో ఉన్న స్థానికులకు హోం స్టే విధానంపై అవగాహన కలిగిస్తే పైసా ఖర్చు లేకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం సాధ్యం అవుతుంది. కానీ ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు. ఎంత సేపు అరకొర సౌకర్యాల నడుమ ఉన్న మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు వేయడం, సెక్టార్లుగా విభజించి టిక్కెట్ల అమ్మకాలు సాగించడంపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చివరికి భద్రాద్రిలో తమ ఇబ్బందులు తీర్చాలంటూ ఆ రామయ్యకే మొర పెట్టుకుని వెళ్లిపోతున్నారు. -
లండన్‌లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
Manali Hidimba Temple Photos: మంచు ముద్దగా.. హిడింబ దేవాలయం అద్భుతమైన దృశ్యలు (ఫోటోలు)
-
మనుషులకూ.. మూగ ప్రాణులకు ఒక ధర్మాచరణ ఉంది!
నరజన్మకూ, మిగిలిన ప్రాణులకూ ఒక ప్రత్యేకమైన భేదం ఉంది. ఇతరప్రాణులకు ఒకే ధర్మం–పశుధర్మం. ఆకలి, నిద్ర, ప్రత్యుత్పత్తి.. అంతకుమించి వాటికి ధర్మం అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కానీ ఒక్క మనిషికి మాత్రం అత్యంత ప్రధానమైనది – ధర్మాచరణ. అయితే దీనిలో ఒక సంక్లిష్టత ఉంది. ఇదే ధర్మము.. అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ధర్మం నిరంతరం మారిపోతుంటుంది. భార్యముందు నిలబడితే–భర్త ధర్మం. తల్లి ముందు నిలబడితే–పుత్ర ధర్మం. సోదర ధర్మం... ఉద్యోగ ధర్మం.. అలా నిరంతరం మారిపోతుంటుంది. దేశాన్నిబట్టి, కాలాన్నిబట్టి మారిపోతుంది. ఉత్తర భారతదేశంలో చలి కారణం చేత వీలయినంతగా శరీరాన్ని కప్పుకుని పూజాదులు చేయడం అక్కడి ధర్మం. దక్షిణ భారతదేశంలో.. కేవలం ఉత్తరీయం పైన వేసుకుని అభిషేకాలు, పూజలు చేయడం ఇక్కడి ధర్మం. అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు, సన్యాసికి.. ఇలా ధర్మం మారుతుంటుంది. బ్రహ్మచారి ఏదీ కూడబెట్టకూడదు. విద్యార్థిగా గురువుగారు చెప్పింది శ్రద్ధగా విని మననం చేసుకోవడం ఒకటే ధర్మం. అదే గృహస్థాశ్రమంలో భోగం అనుభవించవచ్చు. భార్యాబిడ్దలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. రేపటి అవసరాలకోసం సంపాదించి దాచుకోవచ్చు. వానప్రస్థు భార్యతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారం చేస్తూ గడపవచ్చు. చిట్టచివరన అన్నీ పరిత్యజించి ఏకాకిగా వైరాగ్యంలో ఉండడం ధర్మం. అలా ధర్మం మారిపోతున్నా ఎక్కడికక్కడ ధర్మం నియమాలకు కట్టుబడి ఉంటుంది. అసలు ధర్మం లేకుండా ఉండడం, దానిని పాటించకుండా జీవించడం సాధ్యం కాదు. ధర్మాచరణతోనే మనుష్యప్రాణి ఉత్తమగతులు పొందగలడు. శాస్త్రం చెప్పినట్టుగా ధర్మాచరణ చేస్తూ శరీరం పతనమయిన తరువాత స్వర్గలోకం వెళ్ళవచ్చు. పుణ్యఫలితం అయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుకోవచ్చు.‘నాకు శాస్త్రం మీద నమ్మకం లేదు. ఈ పుణ్యకర్మలు నేను చేయను. నాకు ఏది సంతోషం అనిపిస్తే, నా ఇంద్రియాలకు ఏది సుఖం అనిపిస్తే, నా మనసుకు ఏ భోగం అనుభవించాలనుకుంటే దానిని అనుభవిస్తూ శాస్త్రాన్ని పక్కనబెట్టి ప్రవర్తిస్తే.. ఆ పాటిదానికి నరజన్మ అవసరం లేదని తిర్యక్కుగా (వెన్నుపూసలేని జీవిగా) జన్మ లభిస్తుంది. అలా కాదు, నాకు పాపమూ వద్దు, పుణ్యమూ వద్దు. నేను ఈ మంచిపని చేసి పుణ్యం కావాలనుకోవడం లేదు, నేను కేవలం భగవంతుడు చెప్పినట్లు బతకడం నాకు సంతోషం. నేను చేయవలసినివి కాబట్టి చేస్తున్నా.. దానినుంచి నేను ఏ ప్రయోజనమూ ఆశించడం లేదనుకున్నప్పుడు అది చిత్తశుద్ధిని సూచిస్తుంది. ఇది ఏదో ఒకనాడు భగవంతుని అనుగ్రహానికి కారణమయి, జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని ఇస్తుంది. అంటే ధర్మాన్ని అనుష్ఠానం చేసి దేవతాపదవిని అధిష్టించగలడు. ధర్మాచరణను పక్కనబెట్టి పతనమమై తిర్కక్కు అయిపోగలడు. ఏ ఫలితాన్ని ఆశించకుండా ధర్మాచరణచేసి మోక్షాన్ని పొందగలడు. కాబట్టి ధర్మం కన్నా గొప్పది మరొకటి లేదు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవి చదవండి: మీరెంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట! -
US: అమెరికాలో భక్తి ఇంతలా ఉంటుందా?
అందరి దేశం అమెరికా. ఏ ఒక్క జాతికో మతానికో పరిమితమైన దేశం అనే పరిస్థితి మాత్రం అక్కడ లేదు. నానా జాతులు, భిన్న మతస్తులు, ఎన్నో సంస్కృతుల వారంతా కలిసి అమెరికా సంయుక్త రాష్ట్రాల పేర ఒక ఆధునికమైన దేశాన్ని నిర్మించుకున్నారు. ఒక కొత్త సంస్కృతికి బాటలు వేశారు. అమెరికాలోని యాభై రాష్ట్రాల్లోనున్న జనాభా దాదాపు దాదాపు 33 లేదా 34 కోట్లు మాత్రమే, మన దేశంతో ( 140 కోట్ల పైనే ) పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. యూ ఎస్ జనాభాలో తెల్లవారు దాదాపు 75 శాతం ( వైట్స్ 57, లాటినోస్ 18 ) నల్లవారు 12 శాతం, మిగతా వారు అమెరికా భూమి పుత్రులైన రెడ్ ఇండియన్స్, ఆసియా, ఫసిఫిక్ వగైరా దేశస్తులు. మత పరంగా చూసినప్పుడు 2022 అంచనా ప్రకారం క్రిస్టియన్ ప్రొటెస్టెంట్లు (34 శాతం ) ముందు వరసలో వారి తర్వాతి స్థానం ( 23 శాతం ) క్యాతోలిక్స్ది. యూదులు 2 శాతం కాగా, ఇతర చిన్న మతాల వారు 3 శాతం లేదా ఏ మతంతో సంబంధం లేదు అనేవారు 38 శాతం అమెరికాలో ఏ పట్టణానికి వెళ్లినా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రముఖమైన అన్ని మతాల ప్రార్థణా మందిరాలు కనబడతాయి. ముఖ్యంగా మెజారిటీ వర్గానికి సంభందించిన చర్చిలకు కొదవ లేదు. అయితే వీటికి రెగ్యులర్‌గా హాజరు అయ్యేవారి సంఖ్య మాత్రం అంతంతేనని చెప్పవచ్చు. ఇక్కడ భక్తులను ఆకర్షించడానికి నిర్వాహకులు ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగమే ఉచిత వారాంత లంచ్‌లు, వైద్య శిభిరాలు, ఆస్పత్రులు, అనాథ, వృద్ధ ఆశ్రమాలు, విద్యా సంస్థల నిర్వహణ వంటివి. అవి ఏవైనా, ఏ మతం వారు చేసినా "మానవ సేవే మాధవ సేవ"గా భావించి చేసిన కార్యక్రమాలతో పేద వర్గాలకు అంతో ఇంతో మేలు జరుగుతుంది. అమెరికన్ చర్చిల్లో ఎక్కువగా కనబడేవారు అక్కడ స్థిరపడిన చైనా, దక్షిణ కొరియా ,జపాన్, తైవాన్, థాయిలాండ్, వియత్నాం, మెక్సికో, టర్కి, జర్మనీ తర్వాత మనవారు. అమెరికా వైశాల్యంలో భారత్ కన్నా చాలా పెద్ద దేశం. వాళ్లకు భూమి కొరత లేదు. అందుకే అక్కడి ప్రార్థణా స్థలాలు ఏ మతం వారివైనా విశాలమైన ప్రాంగణాల్లో ఉంటాయి. రోడ్ల పక్క, కూడళ్లలో ఎక్కడ ఉచిత స్థలం దొరికితే అక్కడ ప్రార్థణా స్థలాలు నిర్మించడం, మైకులు పెట్టి శబ్ద కాలుష్యం సృష్టించడం వాళ్లకు నచ్చదు. కాకపోతే కరపత్రాలు వేస్తారు, పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు, ప్రచార సాహిత్యాన్ని పంచుతారు, ఎలక్ట్రానిక్ మీడియాను వాడుకుంటారు. అమెరికన్ చర్చిల్లో చాలాచోట్ల ఆటస్థలాలు, ప్లే స్కూల్లు, గ్రంధాలయాలు, సమావేశ మందిరాలు ఉంటాయి. ఇక పార్కింగ్ స్థలాల గురించి చెప్పే పని లేదు. ఆ సౌకర్యం లేకుండా వాళ్ళు అలాంటి నిర్మాణాలను అనుమతించకపోవడం విశేషం. క్రైస్తవేతర మతాలయాల విషయంలో హిందువులు, ముస్లింలు, బౌద్దులు ముందున్నారని చెప్పవచ్చు. అమెరికాలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా భారతీయులు కనబడుతారు ముఖ్యంగా మన తెలుగువారికి కొదువ లేదు, అదే విధంగా హిందూ దేవుళ్ళు దర్శన మిస్తారు. ఒక అంచనా ప్రకారం ఆ దేశంలో నున్న హిందువుల సంఖ్య దాదాపు రెండున్నర మిలియన్లు. హిందూ ఆలయాల్లో ప్రసిద్ధమైనవి పిట్స్ భర్గ్ వెంకటేశ్వరాలయం, న్యూ జెర్సీ, అట్లాంటా , హ్యూస్టన్‌లోని స్వామి నారాయణ్ అక్షరధాంలు, వెస్ట్ వెర్జినియాలోని బృందావనం, మేరీలాండ్‌లోని శివ విష్ణు ఆలయం, న్యూయార్క్ గణేష, ఇవేకాక మీనాక్షి , హనుమాన్, సాయిబాబా వంటి మందిరాలు మనకు ఎన్నో చోట్ల దర్శనం ఇస్తాయి. హరే కృష్ణ, రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, గురు రవిశంకర్ గారి ఈషా యోగా ధ్యాన కేంద్రాలు, గతంలో ఒక వెలుగు వెలిగిన మహేష్ యోగి, ఓషో వంటి వారివి ఇలా అక్కడ తమ కార్యకలాపాలు సాగించిన భారతీయ ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో. ఇలాంటివి భారతీయులు కలుసుకోడానికి, సేవా కార్యక్రమాలు చేపట్టడానికి, పరస్పరం సహాయ సహకారాలు అందించుకోడానికి కూడా ఉపయోగ పడుతున్నాయి. ఈ మందిరాల నిర్వాహకులు భారత్ నుంచి తరచుగా గురువులను, ప్రభోదకులను ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటివాటి వల్ల భారత్ నుంచి అమెరికా వెళ్లిన వాళ్లకు కూడా స్వదేశంలో ఉన్న భావన కలగడం సహజం . నేను 2006 మొదలు 2022 వరకు ఒక దశాబ్దంన్నర కాలంలో పదికి పైగా పర్యాయాలు ఒకసారి జంటగా మరోసారి ఒంటరిగా, అమెరికాలోనున్న మా పిల్లలను చూడడానికి వెళ్ళిన ప్రతిసారి ఏవోకొన్ని పర్యాటక ప్రాంతాలను, అక్కడి హైందవ ఆలయాలను దర్శించు కున్నప్పుడు ఆ దేశస్తుల్లో గమనించిన పరమత సహనం ప్రశంసనీయం ! వేముల ప్రభాకర్ (చదవండి: విమానం కన్నా హాయిగా అమెరికాలో బస్సు జర్నీ!) -
భక్తి అంటే..?
భక్తి అంటే ఏమిటి? వేదాంత గ్రంథాలిచ్చే నిర్వచనాల జోలికి వెళ్లవద్దు మనం. మామూలు మాటల్లో అర్థం కావటానికి భక్తి అంటే ఏమిటి? చాలామంది అభిప్రాయంలో ఫోటో పెట్టి, దండలు వేసి, పూలు, అగరొత్తులు, దీపాలు పెట్టి నివేదన చెయ్యటం, దణ్ణం పెట్టటం అనుకుంటారు. అది భక్తా? ఒకరకంగా తను మారకుండా ఉండటాన్ని సమర్థించుకునే ప్రయత్నం. ‘‘ఆయన మహానుభావుడు కనుక అట్లా చేయగలిగాడు. మనవంటి సామాన్యులకి సాధ్యమా?’’ అని తప్పించుకునే మార్గం. అట్లా పూజ చెయ్యటం తప్పు అని కాని, చెయ్య కూడదని కాని చెప్పటం లేదు. అది ఒకరకం. దానివల్ల ఒరిగేది ప్రత్యేకంగా ఏమీ లేదు. అది ఒక క్రమశిక్షణ. చిత్త శుద్ధిని కలిగిస్తుంది. ఇది మొదటిమెట్టు అని చెప్పవచ్చు. కానీ చాలా మంది ఇదే పరమార్థం అనుకుంటారు. కొంతమంది అనుకరించటమే భక్తి అనే భ్రమలో ఉంటారు. అనుకరించటానికి, అనుసరించటానికి చాలా వ్యత్యాసం ఉంది. వారిలాగా ఉండే ప్రయత్నం అనుకరణ. ఇది భౌతికంగా తమ ఆదర్శమూర్తుల లాగా ఉండేట్టు చేస్తుంది. చూడగానే ఫలానా వారి అభిమానులని తెలియ చేస్తుంది. కాని వారిస్థాయికి చేర్చదు. అయితే అనుకరణ పనికి రానిదని చెప్పటానికి వీలు లేదు. అది రెండవ మెట్టు. ఒకరిపట్ల భక్తి ఉన్నది అంటే వారు చెప్పిన దానిని చెప్పినట్టు అనుసరించటమే. భక్తిలో ప్రశ్నలకు, సందేహాలకు, వాదోపవాదాలకు తావుండదు. నోటితోనే చెప్పనక్కరలేదు. వారి ప్రవర్తనను చూసి అనుసరించవలసి ఉంటుంది. ‘‘మీ బొమ్మకి పూజ చేస్తాం, కాని, మీరు చెప్పినట్టు చెయ్యటం మావల్ల కాదు, మీరు ఉన్నట్టు ఉండటం అసాధ్యం’’ అంటే అది భక్తి అనిపించుకోదు. భగవంతుడివిషయంలోనైనా అంతే! దేవుణ్ణి గదికే పరిమితం చేసి, పూజచేసిన కొద్దిసేపు మాత్రం ఆయన్ని తలచుకొని, తరువాత దుర్మార్గంగా లోకకంటకంగా ప్రవర్తిస్తే అది భక్తి అనిపించుకోదు. పరమాత్మ నిర్దేశించిన విధంగా, ఆయన మెప్పు వడసే పద్ధతిలో ప్రవర్తిస్తే అది నిజమైన భక్తి. సాటిమనిషి మీద సానుభూతి, జాలి చూపించలేని వాడు, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమించ లేని వాడు, తనకి హాని చేసిన శత్రువుని కాక పోయినా కనీసం ఎదుటివాడిని క్షమించలేనివాడు విశ్వాసి ఎలా అవుతాడు? పొరుగువారిని తనవలే ప్రేమించమని చెప్పిన ఏసు క్రీస్తు అంటే భక్తి ఉంటే ఆయన చెప్పిన మాటలని పాటించాలి, ఆయనలాగా ప్రవర్తించాలి. ఆయన మార్గాన్ని అనుసరించాలి. ఎక్కువసేపు వాళ్ళతో ఉండటం వల్లనో, పోలికలు రావటం వల్లనో మనవలు, మనవరాళ్ళు తరచుగా తాతానాయనమ్మల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాతలకి నాయనమ్మలకి, అమ్మమ్మలకి మనవలు, మనవరాళ్ళు అంటే ఇష్టం ఉండటానికి కూడా ఇదే కారణం. మనుషుల విషయంలోనే ఇలా ఉంటే భగవంతుడి విషయంలో ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తే ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భగవంతుడికి, భక్తుడికి ఉండే సంబంధాన్ని భ్రమరకీట న్యాయంగా చెప్పటం ఈ కాణంగానే. తన చుట్టూ తిరుగుతున్న భ్రమరం చేసే ఝుమ్మనే నాదం విని గూటిలో సుప్తావస్థలో ఉన్న కీటకం దానిని అనుసరిస్తూ తాను కూడాఅటువంటి నాదం చేసే ప్రయత్నంలో భ్రమరం లాగా రూపాంతరం చెందుతుంది. ఈ అనుసరణ అన్నది తానే లక్ష్య వస్తువు అయ్యేట్టు చెయ్యగలదు. ఒక గురువునో, నాయకుణ్ణో అనుకరించేవారు వారి వలె తయారౌతారే కాని, వారుగా అయిపోరు. వారుగా, కనీసం వారంతటి వారుగా అయిపోవటానికి కావలసినది అనుసరణ మాత్రమే. భగవత్తత్త్వాన్ని అందుకోవాలంటే కూడా అంతే! శ్రీరాముడు పితృభక్తి కలవాడు అని చెపుతాం. అంటే అర్థం తండ్రి చెప్పిన విధంగా జీవించాడు అని. ఆయన మాట జవదాట లేదు. ఆయన తనతోచెప్పిన మాటనే కాదు ఆయన ఎవరికిచ్చిన మాటనైనా పాటించాడు. రాముడిపితృభక్తి, గురుభక్తి విశ్వామిత్రుడు తాటకను సంహరించమన్నప్పుడు మారు మాటాడక సంహరించటంలో వ్యక్తమౌతాయి. తల్లితండ్రులని వృద్ధాశ్రమాలలో ఉంచి ‘‘మేము రామభక్తులం’’ అంటే రాముడిపట్ల అపచారం చేసినట్టే. ఆయనలో ఉన్న కొన్నిగుణాలనైనా అలవరచుకుంటే రామభక్తులు అనిపించుకోగలుగుతారు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఆ సుఖం...నిజమైన సుఖం కాదు!
అది ‘కురువుల’ పట్టణం. దాని సమీపంలో యమునా నది. చల్లని నీడనిచ్చే మామిడి చెట్ల వనం. అందులో అగ్ని భరద్వాజుని ఆశ్రమం. ఆ సమయంలో బుద్ధుడు ఆ ఆశ్రమంలో ఉంటున్నాడు. అగ్ని భరద్వాజుడు బుద్ధునికి తగిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు బుద్ధుడు ఆ పట్టణంలోకి వెళ్ళి భిక్ష స్వీకరించి వచ్చి, ఈ వనంలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సమయం మధ్యాహ్నం దాటింది. అగ్ని భరద్వాజుని దగ్గరకు మాగందియుడు అనే తాపసి వచ్చాడు. పరస్పర కుశల ప్రశ్నల తర్వాత వారిద్దరూ కలిసి మామిడి తోటలో బుద్ధుడున్న చోటుకు వెళ్లారు. అప్పటికీ మాగందియుని విషయం బుద్ధునికి తెలుసు. వారు వచ్చాక కొంత సంభాషణ కామసుఖాల మీద జరిగింది... ‘‘మాగందియా! కామసుఖాలకంటే సుఖాన్నిచ్చే గొప్పసుఖం వేరే ఉంది.’’ అన్నాడు బుద్ధుడు. వారిద్దరూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ‘‘నేను యువరాజుగా ఉన్నప్పుడు నాకోసం మూడు ప్రత్యేక భవంతులు నిర్మించారు. వేసవిలో, వర్షాకాలంలో, హేమంత కాలాల్లో నివసించడానికి అనువైన భవనాలు అవి. ఆయా కాలాల్లో హాయిని చేకూర్చే భవనాలు. దివ్య సుఖాన్నిచ్చే భవనాలు నేను ఆ నాలుగు నెలూ ఆ భవనాలు దిగి వచ్చేవాడినే కాదు. చివరికి ఈ కామ సుఖాల బేలతనాన్ని తెలుసుకున్నాను. నాలో కామతృష్ణ తొలగిపోయింది. పిపాస నశించింది. రాగం వదిలిపోయింది. అప్పుడు కూడా ఆనందించాను. కామం, తృష్ణ, పిపాసలు ఇవ్వలేని ఆనందాన్ని కూడా పొందాను. ఆనందం, దుఃఖం భవనాల్లో లేవు. మన మనస్సులోనే ఉంటాయి.’’ అని వారివైపు చూశాడు బుద్ధుడు. శ్రద్ధగా వింటూ కనిపించారు. ‘‘మాగందియా! రాగం ద్వేషం, పిపాస ఉన్న మనస్సునే ప్రక్షాళన చేయాలి. కుష్ఠు వ్యాధి శరీరం, వేడి గ్రహించి హాయి పొందినట్లు రాగద్వేషాలతో ఉన్న మనస్సు కూడా వాటిని పొందినప్పుడు హాయి పొందుతుంది. రాజ భవనాల్లో నేను పొందిన హాయి అలాంటిదే! కుష్ఠువ్యాధి తగ్గిన శరీరం వేడికి హాయి పొందదు. దానికి వేడితో పనిలేదు. అలాగే రాగరహిత హృదయానికి భవనాలు సుఖాలు అవసరం లేదు. ఆరోగ్యమైన శరీరానికి మంటల వేడి అవసరం లేనట్లే... ఆరోగ్యమైన మనస్సుకి కోర్కెలు అవసరం లేదు. మాగందియా! ఈ కామభోగలాలసలు గతంలోనూ, భవిష్యత్‌లోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఇంద్రియాల్ని లోబరుచుకుంటూనే ఉంటాయి. వీటికి లోబడి పొందే సుఖం, కుష్ఠువారు వేడివల్ల పొందే సుఖం లాంటిది. ఆ సుఖం సుఖం కాదు. దుఃఖమే!’’ అన్నాడు. ‘‘భగవాన్! చల్లని మీ మాటల ద్వారా ఏది నిజమైన సుఖమో, ఏది సత్యమైన దుఃఖరహిత మార్గమో... తెలుసుకోగలిగాను. నన్ను కూడా ఇకనుంచి మీ అనుయాయిగా స్వీకరించండి’’ అంటూ ప్రణమిల్లాడు మాగందియుడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!! -
అలంకరణ మెండుగా.. మది నిండుగా.. సంక్రాంతి పండగ!
'ప్రకృతి పండగ సంబరంగా జరుపుకోవాలంటే ఆ కళ కూడా మన ఇంటికి కొత్త కళాకాంతులు తీసుకురావాలి. అప్పుడే పండగ మరింత అందంగా, శోభాయమానంగా మారిపోతుంది. సంక్రాంతి రోజున ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి కొన్ని సంక్రాంతి అలంకరణలు ఇవి.' సంక్రాంతి, పొంగల్ ఈ రెండింటినీ హిందువులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున, ఇళ్లను అందంగా అలంకరించడానికి పోటీపడుతుంటారు. సంప్రదాయ పద్ధతులే కాకుండా, పొంగల్ లేదా మకర సంక్రాంతికి ఇంటిని అలంకరించుకోవడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. వాటిలో ఇంటీరియర్ నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలు.. రంగుల రంగోలి ఏ భారతీయ పండుగకైనా ఇంటి ముందు అందమైన రంగోలీ ముచ్చటగొలుపుతుంది. ముగ్గుల పండగగా పేరొందిన సంక్రాంతికి ఇంటి గుమ్మం వద్ద, పూజ గది, పొంగల్ కోసం బయట రంగోలి డిజైన్లను రూపొందించడానికి మీ సృజనాత్మకతను చూపచ్చు. అందరూ వేసేదిగా కాదు అనుకుంటే వినూత్నమైన డిజైన్లను ప్రయత్నించవచ్చు. దీంతో పొరుగువారిని మించిపోవచ్చు. అపార్ట్మెంట్ల కోసం ఇన్డోర్.. అందరూ అలంకరించుకోవడానికి విశాలమైన పచ్చికతో కూడిన పెద్ద బంగ్లాలలో నివసించరు. అనేక మంది పట్టణవాసులు పట్టణాలు, నగరాల్లోని అపార్ట్మెంట్లలో నివసిస్తున్నారు. కానీ ఇన్డోర్ డెకరేషన్ అవుట్‌డోర్‌లో చేసినట్లే ఆహ్వానించదగినదిగా ఉంటుంది. మీ గదిని ఆకులతో పొడవాటి చెరకుతో అలంకరించండి. బియ్యం పాలు, బెల్లం ఉడకబెట్టడాన్ని సూచించే మట్టి కుండలతో అలంకరించండి. సంక్రాంతి లేదా పొంగల్ జరుపుకోవడానికి మీకు పెద్ద బాల్కనీ లేదా తోట అవసరం లేదని గ్రహించాలి. ఆకులతో అందంగా.. పొంగల్, సంక్రాంతి అనేది శ్రేయస్సు వేడుక, ఈ థీమ్‌లో ఆకుపచ్చ రంగుదే అగ్రతాంబూళం. అందుకని, పొంగల్ రోజున మామిడి ఆకుల తోరణాలను ఇంటి ప్రవేశద్వారం వద్ద వేలాడదీయడం శుభప్రదమైనది. రంగు రంగు కాగితాలను ఉపయోగిస్తూ చేతితో పర్యావరణ అనుకూలమైన అలంకరణ చేయచ్చు. థీమ్ డెకరేషన్లో గాలిపటం గాలిపటాల హంగామా ఈ పండగ ప్రత్యేకం. కాబట్టి, పేపర్ క్రాఫ్ట్తో రంగురంగుల గాలిపటాల తయారీ ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకు వస్తుంది. వీటిని తయారు చేయమని పిల్లలను ప్రోత్సహించవచ్చు. వాల్ హ్యాంగింగ్లను అందమైన అలంకరణలుగా ప్రయత్నించవచ్చు. కాగితంతో తయారు చేసిన సీతాకోకచిలుకలు, పువ్వులు, జంతువుల బొమ్మలు ఇంటీరియర్‌కు అదనపు ఆకర్షణను తీసుకువస్తాయి. మార్కెట్లో కూడా గాలిపటాలు అన్ని ఆకారాలు, పరిమాణాలలో లభిస్తాయి. బాల్కనీ అయితే గాలిపటాలను వేలాడదీయవచ్చు. లివింగ్ రూమ్‌లోని ఓ వాల్ని ఎంచుకుని రంగు రంగుల గాలిపటాలతో ఆకర్షణీయమైన అలంకరణ కోసం అతికించవచ్చు. వీటికి పువ్వులు, చెరకు డిజైన్లను కూడా జోడించవచ్చు. వాల్ పేపర్స్ పొంగల్ అలంకరణ చిటికేసినంత సులువుగా నట్టింటికి రావాలంటే ఇప్పుడు అందమైన ఫెస్టివల్ వాల్ పేపర్లు, వాల్ డెకార్ బ్యాక్‌డ్రాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నచ్చిన వాల్పేపర్ని ఎంచుకొని, డెకార్ చేయడమే తరువాయి. పండగ పిండివంటలు ఒక టేబుల్‌పైన కాగితం లేదా చెక్కతో తయారుచేసిన ఎడ్ల బండ్ల బొమ్మలు, అరిశెలు, సకినాలు, నువ్వుల లడ్డూలు.. వంటివి పలహారాల పేట్లు, కొయ్య బొమ్మలను ఉంచితే చాలు పండగ కళ వచ్చేసినట్టే. ఇవి చదవండి: 'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి.. -
మైసూర్లో శ్రీహరి సన్నిధి ప్రతిష్టించిన దత్త పీఠాధిపతి
మైసూర్లో ప్రపంచంలోని అరుదైన రెండు వేల సాలగ్రామాలతో శ్రీహరి సన్నిధి ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. సాధారణంగా 100 సాలిగ్రామాలు ఉంటే ఆలయం నిర్మించాలని శాస్త్ర వచనం చెబుతుంది. తాజాగా రెండు వేల సాలిగ్రామాలతో శ్రీహరి సన్నిధి ఆలయం అత్యంత శోభాయ మానంగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి స్వర్ణ యంత్ర ప్రతిష్ట చేసి, శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని,శ్రీహరి సన్నిధిని దర్శించుకొని మొక్కుల చెల్లించుకున్నారు. -
భగవద్గీత: విజయవంతమైన జీవనానికి దివ్యౌషధం
గీతా జయంతి ప్రత్యేకం.. సర్వధర్మములను విడనాడి నన్నే శరణు పొందు. నేను నిన్ను అన్ని పాపముల నుండి విడిపించెదను. నీవు శోకింప తగదు! — అధ్యాయం 18: శ్లో 66 మహర్షి వ్యాసులవారు రచించిన భగవద్గీతకు పరమహంస యోగానంద చేసిన విస్తారమైన అనువాదము, వివరణలో ఆ మహా యోగివర్యులు కృష్ణ భగవానుడు తన శిష్యుడైన అర్జునునికి చేసిన వాగ్దానానాన్ని ఈ విధంగా అనువదించారు; “నీవు అహంకార జనితాలైన కర్తవ్యాలను విస్మరించి, నేను నిర్దేశించిన దివ్య కర్తవ్యాలను నిర్వహిస్తూ, నాలోనే ఆనందిస్తే, విముక్తిని పొందుతావు.” ఆధ్యాత్మిక గ్రంథరాజమైన ‘ఒక యోగి ఆత్మ కథ’ రచయిత, ఒక శతాబ్ది కంటే ఎక్కువ కాలం క్రితమే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను స్థాపించిన పరమహంస యోగానంద ఈ విశ్వంలోని మొత్తం సమాచారం గీతలోని 700 శ్లోకాల్లో నిబిడీకృతమై ఉన్నదనీ, “భగవంతుని చేరుకోవడానికి చేసే ప్రయాణంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, వారి ఆధ్యాత్మిక ప్రయాణంలోని ఆ భాగం పైన గీత తన కాంతిని ప్రసరిస్తుందనీ” వివరించారు. యోగానందగారు గీతా వ్యాఖ్యానం పై తమ పనిని తన గురువు అయిన శ్రీయుక్తేశ్వర్ గిరి, శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు మరియు శ్రీకృష్ణ భగవానుడు గీతలో రెండుసార్లు ప్రస్తావించిన పవిత్ర క్రియాయోగ ప్రక్రియను పునరుజ్జీవింపచేసిన మహావతార్ బాబాజీ తమ అంతర్దృష్టితో చేసిన మార్గదర్శకత్వంలో ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభించారు. యోగానంద ఈ విధంగా విశదపరిచారు; “ఒక దైవ సాక్షాత్కారం పొందిన గురువు సహాయంతో, సహజావబోధాజనిత అంతర్దృష్టితో కూడిన గ్రహణశక్తి అనే ఆడకత్తెరను ఉపయోగించడం ద్వారా భాష ,నిగూఢత అనే గట్టి పెంకును పగలగొట్టి, ధార్మిక బోధలలోని లోపలి సారమైన సత్యాన్ని అందుకోవడం ఎలాగో మనం నేర్చుకోగలుగుతాము.“ 1952 లో జరిగిన తమ మహా సమాధికి కొద్ది నెలల ముందు గీతలోని లోతైన అధ్యాత్మిక భావాల అంతిమ సమీక్ష మరియు వివరణ కాలిఫోర్నియాలోని మొజావే ఎడారిలోని ఒక చిన్న ఆశ్రమంలో ఏకాంతవాసంలో గురుదేవులు చేపట్టారు. “ఆ గదిలోని స్పందనలు (యోగానంద ఈ రచనా వ్యాసంగం చేపట్టిన గదిలో) నమ్మశక్యం కాకుండా ఉన్నాయి; ఆ గదిలోకి వెళ్తుంటే భగవంతుడిలోకి ప్రవేశిస్తున్నట్లే ఉండేది.” అని అక్కడి సన్న్యాసి ఒకరు గుర్తుచేసుకొన్నారు. యోగానంద బృహత్కృషి కేవలం గీతను తన స్వంత భావాల ప్రకారం, మేధస్సుతో మెలితిప్పి అర్థం చేప్పి వివరించడంలో కాకుండా, శ్రీకృష్ణుడికి, అర్జునుడికి మధ్య జరిగిన నిజమైన సంభాషణను మహర్షి వ్యాసులవారికి తమ ‘బ్రహ్మానంద స్థితిలోని వివిధ స్థాయిలలో’ ఏవిధంగా వెల్లడి అయిందో దానిని ప్రపంచానికి వివరించడంలో ఉంది. అలా ‘గాడ్ టాక్స్ విత్ అర్జున’ సర్వవ్యాప్త పరమాత్మ (శ్రీకృష్ణుడు) కు, అర్జునుడి రూపంలోని ఒక ఆదర్శ భక్తుడి ఆత్మకు మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది. గ్రహించగలిగిన భక్తుడికి మొట్టమొదటి అధ్యాయం నుండే కురుక్షేత్ర యుద్ధం యొక్క చారిత్రక నేపథ్యాన్ని ప్రతి వ్యక్తిలోనూ — ఆత్మతో సంబంధం కలిగిన స్వచ్చమైన విచక్షణాయుత మేధస్సు (పాండు పుత్రులు) కు,అహంకారం అనే మాయకు లోనైన ఇంద్రియబద్ధమైన గుడ్డి మనస్సు (గ్రుడ్డి వాడైన ధృతరాష్ట్రుడు, అతడి కుటిల సంతానం) కు మధ్య — జరుగుతున్న ఆధ్యాత్మిక,మానసిక యుద్ధాన్ని వివరించడానికి పోలికగా ఊపయోగిస్తున్నారని స్పష్టమౌతుంది. కృష్ణుడి (గురువు లేక జాగృతమైన ఆత్మ చైతన్యం, లేక ధ్యాన జనిత సహజావబోధం) సహాయంతో యుద్ధం చేయాలి; భౌతికంగా, మానసికంగా, అధ్యాత్మికంగా ‘రాజ్యాన్ని అహంకారం నుండి, మరియు దుష్ట మానసిక ప్రవృత్తులనే దాని సైన్యం నుండి తిరిగి స్వాధీనపరచుకోవడం,’ తద్ద్వారా సర్వసమర్థ ఆత్మ సామ్రాజ్యాన్ని స్థాపించడం. కృష్ణుడు శోకతప్తుడైన అర్జునునికి నిశ్చయమైన ఓదార్పును అందించినట్టే, యోగానంద ప్రతి నిజమైన అధ్యాత్మిక అన్వేషకుడిలో ఉన్న అర్జునునికి తన అపూర్వమైన పలుకులతో ఈ విధంగా సలహా ఇచ్చారు. ”ప్రతి వ్యక్తీ తన కురుక్షేత్ర యుద్ధాన్ని తానే పోరాడి గెలవాలి. ఇది కేవలం గెలవ తగిన పోరు మాత్రమే కాదు, ఈ విశ్వానికి నిర్దేశింపబడిన దివ్య న్యాయాన్ని అనుసరించి, జీవాత్మకు పరమాత్మతో ఉన్న శాశ్వత సంబంధాన్ననుసరించి, ముందో తరువాతో తప్పక గెలవాల్సిన యుద్ధమిది.” గాడ్ టాక్స్ విత్ అర్జున‘, క్రియాయోగం గురించిన మరింత సమాచారంకోసం:yssofindia.org -
ఇవాళే సుబ్రమణ్య షష్ఠి! ఈ రోజున ఏం చేస్తారంటే..?
ప్రతి నెలలో వచ్చే షష్ఠి తిథిని గాక కేవలం ఈ మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి తిథినే సుబ్రమణ్య షష్ఠి అంటారు ఎందుకు. అసలేం చేస్తారు ఈరోజున. దక్షిణ భారతదేశ ప్రజలు ఎందుకంతా ఈ పండుగకు ప్రాముఖ్యత ఇస్తారు. పైగా ఆ రోజు పలు చోట్ల తీర్థం కూడా జరుగుతుంది. ఈ సుబ్రమణ్య షష్ఠిని పలు చోట్ల పలు విధాలుగా పిలుస్తారు ఎందుకని?. తదితరాల గురించే ఈ కథనం!. సుబ్రమణ్య షష్ఠి అనగా? శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామియే కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా వ్యవహరిస్తారు. కుమారస్వామి జననం.. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు, కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న "తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలిగే పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అనితరుణోపాయం చెప్పాడు. దేవతలు శివున్ని ఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. పలు పేర్లు ఎలా వచ్చాయంటే..? ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తీకేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి" గా పిలుచుకుంటున్నాము, "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీస్వామివారిసహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానంచేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. ఈ పండగలో దాగున్న సామాజిక ప్రయోజనం.. జాతకంలో కుజ దోషం, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని, ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని, దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోపకారం మిధం శరీరం" అని భావించి పేదవారికి కంబళ్ళు, దుప్పట్లు తోపాటు చలి నుంచి రక్షించే దుస్తులను, తిను బండారాలను దానం చేయాలని తెలుపుతుంది. (చదవండి: ధనుర్మాసంలో ఇలా చేస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందట!) -
ధనుర్మాసంలో ఇలా చేస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందట!
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు. భోగితో ముగుస్తుంది: సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు , పూజలు , జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం. శ్రీకృష్ణుడికి తులసిమాల ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు , నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా: ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి , తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ , ఆశిద్దాం. ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ? ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం , జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. కోరికలు నెరవేరుతాయి వివాహం కాని , మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది. పాశురములు చదివేటప్పుడు.. మొదటి పాశురము రెండు సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను , చివరపాశురంలో ఒక లైను చదవాలి. చివరగా గోదా హారతి చదవాలి. మంత్ర పుష్పం కూడా చదవాలి. మళ్ళి ఏ రోజు పాశురం ఆ రోజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి. నైవేద్యం సమర్పంచాలి (రోజు పొంగలి , దద్ధోజనం , పరవాన్నం) ఉండి తీరాలి. టైమ్ ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి , పొంగలి ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పండ్లు , పాలు పెట్టి చేసుకోండి , భక్తి ముఖ్యం* -
కార్తీక పౌర్ణమి రోజున ఈ వ్రతం చేస్తే సిరిసంపదలు సిద్ధిస్తాయట
కార్తీక మాసం..అనేక పర్వదినాలకు ఆలవాలం. శివకేశవులకు, ఆయన వారి కుమారుడు అయ్యప్ప స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం. నోములు, వ్రతాలు, పూజలు ఈ మాసంలో చేసుకుంటే అధిక ఫలాన్నిస్తాయి. అటువంటి వాటిలో కేదారేశ్వర వ్రతం ఒకటి. కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం నోచుకుంటే సిరిసంపదలకు, అన్న వస్త్రాలకు లోటుండదని పండితులు, పెద్దలు చెబుతుంటారు. మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు , పురుషులనే తారతమ్యం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులు ఇంటిల్లిపాది ఉపవాసాలుండి ఆ కేదారేశ్వరుని ధ్యానించాలి. గంగాజలం లేదా శుద్ధజలం, ఆవుపాలు, చెరుకు రసం, కొబ్బరినీళ్లు, తమలపాకులు , పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం సమర్పించిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకోవాలి. కార్తీక మాసంలో కొన్ని ప్రాంతాల్లో నవగ్రహ దీపాల నోముగా నోస్తారు. ఈ నోములో ముందుగా గణపతి ఆరాధన చేసి, తరువాయి శివలింగార్చన చేసి, నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసి వాటిపై వేస్తూ దీప ప్రమిదల నుంచి ఓం నమఃశ్శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరిస్తారు. తరువాత అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఆ దీపాలను దానం ఇస్తారు. దానం చేసేటప్పుడు యథాశక్తి నిండు మనస్సుతో ఇవ్వాలి. ఈ నోము శుభతిథులలో సాయంత్రం వేళల్లో మాత్రమే జరగాలి. నోము అనంతరం అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగా చల్లి , కుటుంబంలో అందరూ శిరస్సుపై చల్లుకోవాలి. ఇది సర్వ రక్షాకరంగా కుటుంబాన్ని కాపాడుతుందని పురాణోక్తి. శ్రీ కేదారేశ్వర వ్రత కథ శివుడిని మనం అర్ధనారీశ్వరుడిగా ఆరాధిస్తాం కదా... ఆయన అర్ధనారీశ్వరుడెలా అయ్యాడో వివరించే కథ ఇందులో కనిపిస్తుంది. ఈ కథను సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందడం కోసం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతాన్ని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పాడు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉన్నాడు. సిద్ధ–సాధ్య– కిన్నర కింపురుష–యక్ష–గంధర్వులు శివుని సేవిస్తున్నారు. దేవముని గణాలు శివుని స్తుతిస్తున్నారు. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనందపులకితుడై వినోద సంభరితమైన నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించాడు. శివుడాతనిని అభినందించి సింహాసనం నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలు గాగల వంది మాగదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి ‘‘నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరి?’’ అని ప్రశ్నించింది. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని ‘‘దేవీ! పరమార్ధ విదులగు యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించార’’ ని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి ఆ దండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సు చేయాలనుకుని కైలాసాన్ని వదలి భూలోకంలో సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి వచ్చింది. అక్కడి మునులు, వారి పత్నులను చూసి వారితో ‘‘నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా! పవిత్రాంగన లారా! నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను. కాబట్టి నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి’’ అని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు ‘‘అమ్మా! పార్వతీ! ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతం. నీవావ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందంటూ వ్రతవిధానాన్ని వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తన మేనులో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. కొంతకాలమునకు శిభక్తపరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరవ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. తదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అనే ఇరువురు కుమార్తెలున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చుని తోరం కట్టుకొని భక్తితో పూజ చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తంగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్యసోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యం నుంచి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి ‘‘నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడాసొమ్మును తీసుకొని పోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ‘‘ఓయీ! నీవు ఎన్నిసార్లు నీపెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు’’ అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడాప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీమార్బలంతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్టలతో కల్పోక్తంగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖంగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యం పొందుతారు. -డి. వీ. ఆర్. భాస్కర్ -
అలవాటుని అధిగమించటం అతికష్టం!
అలవాట్లు మనిషిని పట్టిస్తాయి. అంతే కాదు బంధిస్తాయి, బానిసని కూడా చేస్తాయి. అలవాటుకి ప్రయత్నం అవసరం లేదు. అలవాటు రెండవ స్వభావం అని చెప్పవచ్చు. స్వభావం లాగానే అలవాటుని కూడా అధిగమించటం చాలా కష్టం. అది ఎంతగా వంటపట్టిపోతుందంటే దాన్ని విడిగా గుర్తించటం కూడా కుదరదు. నిజానికి అది పుట్టుకతో వచ్చింది కాదు. తరవాత పెంపొందించుకున్నది. అలవాట్లు మనిషిని పట్టిస్తాయి. అంతే కాదు బంధిస్తాయి, బానిసని కూడా చేస్తాయి. అలవాటుకి ప్రయత్నం అవసరం లేదు. అలవాటు రెండవ స్వభావం అని చెప్పవచ్చు. స్వభావం లాగానే అలవాటుని కూడా అధిగమించటం చాలా కష్టం. అది ఎంతగా వంటపట్టిపోతుందంటే దాన్ని విడిగా గుర్తించటం కూడా కుదరదు. నిజానికి అది పుట్టుకతో వచ్చింది కాదు. తరవాత పెంపొందించుకున్నది. పెరిగిన భౌగోళిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయ, పరిస్థితులు, వాతావరణం, మనుషులు, మత విశ్వాసాలు మొదలైన ఎన్నో అంశాలు ఒక అలవాటు ప్రబలటానికి దోహదం చేస్తాయి. అవే పరిస్థితుల్లో ఉన్న మరొక వ్యక్తికి అది కాక మరొక అలవాటు ఉండవచ్చు. దీనికి వ్యక్తి స్వభావం కారణం అవుతుంది. అంటే, వ్యక్తి సహజ స్వభావం, పరిస్థితుల ప్రభావాల సమాహారంగా అలవాట్లు ఏర్పడుతాయి. ఆ అలవాటు తెచ్చి పెట్టుకున్నది అని గుర్తించటం ఉండదు. అది సహజ లక్షణం అనే భ్రమలో ఆ వ్యక్తి మాత్రమే కాదు, చుట్టుపక్కల వారు కూడా ఉంటారు. అలవాటు ఎట్లా ఏర్పడిందో గుర్తించటం చాలా కష్టం. దానిని మానుకోటం మాత్రం కష్టం. ముందు అది మంచిది కాదు అని గుర్తించాలి, తరవాత మానాలి అనే సంకల్పం ఉండాలి. ఆ పైన ప్రయత్నం చేయాలి. మొదటిదే చాలా కష్టం. ఎందుకంటే మనిషికి తనని తాను సమర్థించుకోటం అన్నది సహజంగా ఉంటుంది. అలవాటై పోయంది అనటం అలవాటుగా మారింది. ఇంతకీ అలవాటు అంటే? అల+వాటు = అలవాటు. అంటే, సముద్రంలో అల ఎంత సహజంగా పైకి ఎగసి, అంతే వేగంగా ఎటువంటి ప్రయత్నం, శ్రమ లేకుండా పడుతుందో అంత తేలికగా హాయిగా జరిగిపోయేది. దానిని ప్రత్యేకంగా గుర్తించటం కూడా ఉండదు. అలవాటు అన్నది ఎంత బలంగా ఉంటుందంటే దానిని మానటం చాలా కష్టం. బలవంతంగా మానే వాతావరణం కల్పిస్తే గిజగిజ లాడిపోతారు. అందులోనూ దురలవాట్లు అయితే మరీనూ. పిచ్చిగా ప్రవర్తించటం, అవతలి వారికి పిచ్చెక్కేట్టు ప్రవర్తించటం లేదా ఆత్మహత్యలకి ΄పాల్పడటం చూస్తూనే ఉన్నాం. అదే మంచి అలవాటు అయితే ఇబ్బంది పడతారు కాని, ఉన్న పరిస్థితుల్లోనే సద్దుకునే ప్రయత్నం చేస్తారు. కాని, గిజగిజలాడరు. ఉదాహరణకి రోజూ ఒక సమయానికి ధ్యానమో, పూజో చేసుకునే అలవాటు ఉన్నవారు ఎప్పటిలాగా వీలుకాకపోతే ఉన్నంతలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా తమ పని పూర్తి చేసుకుంటారు. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ఎక్కడ ఉన్నా, ఎంత మంది మధ్య ఉన్నా, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా పుస్తకం పట్టుకుని కూర్చొంటారు. కొంతమంది త్వరగా దేనినైనా అలవాటు చేసుకుంటారు. వీరి అలవాట్లని మార్చటం అంత కష్టం కాదు. కొత్త అలవాట్లని తేలికగా చేసుకోగలరు కనుక మంచివి అలవాటు చేస్తే సరి! కొంతమందికి ఏది అలవాటు కావటం అన్నదే ఉండదు. వీళ్ళతో ప్రమాదం ఏమంటే మంచివి, పనికి వచ్చే అలవాట్లు కూడా ఉండవు. మనిషి జీవితం చాలావరకు అలవాటుగా సాగుతుంది. కొంతమందిని ఈ విధంగా ఎట్లా బతుకుతున్నావు? అని అడిగితే అలవాటయి పోయింది అంటారు. చిన్నప్పటినుంచి ఏది అలవాటు చేస్తే అదే అలవడుతుంది. రుచులు కూడా అలవాటు వల్లనే కలుగుతాయట! చిన్నతనం నుండి కారం తినటం అభ్యాసం చేస్తే అదే అలవాటు అవుతుంది. ఎప్పుడు తినని వారికి నోరు మంట పుడుతుంది. ఒక్కొక్కప్రాతం వారు ఒక్కొక్క ఆహారాన్నీ ఇష్టపడటానికి కారణం ఇదే. అభిరుచులు కూడా అంతే! సాధారణంగా చేదు ఇష్టం ఉండదు ఎవరికీ. కాని నెమ్మదిగా అలవాటు చేసుకుని వదల లేని స్థితికి వచ్చింది సమాజం. కాఫీ, టీ, శీతల పానీయాలు ఇత్యాదులు. మొదటిసారి గొంతు దిగవు. ఆ తరువాత వదలవు. ధూమపానం, మద్యపానం సంగతి సరే సరి. – డా.ఎన్. అనంత లక్ష్మి (చదవండి: పుట్టలో పాలు పోయటంలో అంతరార్థం? ఆ 12 నాగులనే పూజిస్తారు ఎందుకు?) -
'కార్తీకమాసంలో ఇలా చేస్తే సర్వ పాపాలు తొలుగుతాయి'
మాసాల్లో కార్తీకం..యుగాల్లో కృత యుగం..శాస్త్రాల్లో వేదం..తీర్థాల్లో గంగానదికి సమానమైనవి లేవన్నది పురాణ వచనం. అంతటి మహత్యం గల కార్తిక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైది. అందుకే భక్తులు వేకువనే చన్నీటి స్నానాలు.. జప, తప నియమాలు..పూజలు.. ఉపవాసదీక్షలు చేస్తారు. కార్తీక మాస విశిష్టతపై ప్రత్యేక కథనం. చిత్తూరు రూరల్: కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండడంతో ఈ నెలకు ఆ పేరు వచ్చింది. ఈ నెల శివకేశవులిద్దరికీ ప్రీతికరం. ఈ నేపథ్యంలో ఊరూరూ హరిహరుల నామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రి వేళల్లో వదీపాల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నెల రోజులు శైవ, వైష్ణవ క్షేత్రాలు భక్తుల సందడితో కిటకిటలాడనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,197 దేవాలయాలున్నాయి. వీటిలో శివాలయాలు 45 వరకు ఉన్నాయి. ఈ ఆలయాల్లో కార్తిక పూజలు శ్రేష్టంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ఆలయాలు భక్తులతో కళకళలాడనున్నాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆయా ఆలయ నిర్వాహకులు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు లేకుండా దీపారాధన చేసేందుకు పనులు పూర్తి చేశారు. కార్తీక స్నానం కార్తీక మాసమంతా తెల్లవారుజామునే లేచి కృతికా నక్షత్రం అస్తమించేలోపు నది, చెరువు, కాలువల్లో కానీ, ఈ వనరులు అందుబాటులో లేకుంటే ఇంట్లో కానీ తలస్నానం చేయాలి.అప్పుడే కార్తీక స్నానం అవుతుంది. ఈ నియమంతో స్నానం చేసి, శివుడు, విష్ణువు, మరే దైవాన్ని అయినా ధ్యానించి, అర్ఘం ఇవ్వడంతో గంగానది, పుష్కర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతాయి. సర్వ పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. పుణ్యప్రదం.. కార్తీక దీపం భారతీయ సంస్కృతిలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో దీపారాధనకే ప్రథమ స్థానం. అందుకే ఇంట్లోకానీ, శివాలయంలో కానీ ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేస్తారు. ఎవరైనా తెలిసికానీ, తెలియకుండా కానీ ఎక్కడైనా సరే దీపం పెడితే వారి పాపాలు హరిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి. దీపం, బంగారం, నవధాన్యాలు, అన్నం దానం చేస్తే సీ్త్రలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే దీపారాధనతో పాటు శివుడికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం, లక్షబిల్వార్చ, అమ్మవారికి లక్షకుంకుమార్చన జరిపిస్తారు. వన భోజనం ప్రకృతి ఒడిలో సేదతీరుతూ అప్యాయతలను పంచుకునే అపురూప సందర్భం వనభోజనం కార్తిక మాస ప్రత్యేకం. ఐక్యత సాధనకు ఇది ఎంతో ఉపకరణం. కలిసిమెలసి మసలుకునే తత్త్వం వనభోజన సంబరాలతో అలవడుతుంది. ఈ కార్యక్రమం వనాలపై మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ భోజన సంబరంలో పూర్తి సాత్విక వంటకాలనే భుజిస్తారు. కార్తీకం.. ఆచరణ ఇలా కార్తిక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. తేలికైన ఆహారం భూజించాలి. ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. పాలు, పండ్లు భుజించవచ్చు. రాత్రి భోజనం చేయకూడదు. అబద్ధాలు, దైవదూషణ చేయకూడదు. తప్పుడు పనులు చేస్తే పాపమని పురాణాలు చెబుతున్నాయి. పుణ్యఫలం సిద్ధిస్తుంది కార్తీక మాసంలోని ప్రతి రోజు కూడా అత్యంత శ్రేష్టమైనది. కార్తిక మాసం శివకేశవులకు చాలా ప్రీతపాత్రమైనది. తెల్లవారుజామునే ఆలయాలను దర్శించుకుని పూజలు చేయాలి. ఈ మాసంలో శివకేశవులను పూజిస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞాన జ్యోతులు కావాలి. ఈ నెలలో 17న నాగుల చవితి, 18న స్కంధషష్టి, 26న కార్తీకదీపం అతిముఖ్యమైన పండుగలు. –సుధాకర్ గురుక్కల్, వేదపండితులు, చిత్తూరు -
ఇలా దీపాలు వెలిగిస్తే నరకం నుంచి విముక్తి లభిస్తుందట!
చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపాలు లేకుండా దీపావళి పండుగ అసంపూర్ణమనే చెప్పాలి. దీపావళి నాడు దీపాలను వెలిగించడమనేది సాంప్రదాయంగా వస్తోంది. దీపాలు ఇంటికి వెలుగులు ఇవ్వటమే కాదు మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగ ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగకి వెలిగించే దీపాల వల్ల నరకం వల్ల విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ దీపాల ప్రత్యేకత ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. నరక చతుర్దశి రోజున వస్తువులను దానం చేయడం సాంప్రదాయంగా వస్తోంది. చాలామంది ఆరోజు యమధర్మరాజు పూజలు కూడా చేస్తారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఇంటి ప్రధాన ద్వారాల వద్ద పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు అనుగ్రహం లభించి అకాల మరణాలు సంభవించకుండా కాపాడుతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు. అందుకే ఈ పూజలో భాగంగా పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. దక్షిణం దిక్కున అభిముఖంగా ఈ పిండి దీపాలను వెలిగించి యమునికి ప్రీతికరమైన శ్లోకాలను పాటిస్తే మంచి జరుగుతుందని అంటారు. ఇలా చేయడం వల్ల అనుగ్రహంతో పాటు యమధర్మరాజు అనుగ్రహం కూడా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ముందుగా ఈ దీపాలను తయారు చేసుకోవడానికి ఒక కప్పులు గోధుమ పిండిని తీసుకుని అందులో తగినంత నీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని తీసుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని దీపాల ఆకారంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన దీపాలలో నూనె వేసి వెలిగించుకోవాలి. ఈ దీపాలను వెలిగించడం వల్ల చనిపోయిన తర్వాత నరకం నుంచి కూడా విముక్తి లభిస్తుందని అంటారు. దీపంతో దోషం పరిహారం జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. పిండి దీపం వెలిగించడం ద్వారా మీ కోరిక నెరవేరుందట. పిండి దీపాల వల్ల ఈ సమస్యలు తొలిగిపోతాయట ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే ప్రతిరోజూ లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయట. బియ్యపు పిండితో చేసిన దీపారాధన వల్ల అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. -
Diwali 2023: ఈసారి దీపావళి పండుగ 12,13.. ఎప్పుడు జరుపుకోవాలి?
హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో దీపావళి కూడా ఒకటి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళిచేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కుల, మత భేదం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెబుతారు. అయితే ఈసారి దీపావళి వేడుకలు ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై ఆయోమయం నెలకొంది. మరి అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? ధనత్రయోదశి ఎప్పుడు నిర్వహించాలి? అన్న విషయాలపై పండితులు ఏమంటున్నారంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన దీపావళి పండగను జరుపుకుంటారు.అయితే అధికమాసం కారణంగా దాదాపుగా అన్ని పండుగలు రెండు రోజులు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీపావళి కూడా రెండు రోజులు రావడంతో ఏరోజు పండగను జరుపుకోవాలి అన్న సందిగ్ధత నెలకొంది. ఈ సంవత్సరం కార్తీక మాస అమావాస్య నవంబర్ 12, 2023న మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం. కాబట్టి అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు పండితులు. అయితే సోమవారం(నవంబర్13)న మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆరోజు వైధిక క్రతువులు నిర్వహించుకోవచ్చని తెలిపారు. దీపదానాలు, యమ తర్పణాలు ఇతరత్ర దీనం చేయడానికి సోమవారం వీలుంటుందని, ఆరోజు వైధిక దీపావళిగా పండగను జరుపుకోవచ్చని పేర్కొన్నారు. -
గరుత్మంతుడు, హనుమంతుడి మధ్య పోరులో ఎవరు గెలిచారో తెలుసా?
శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు యుగయుగాలుగా సేవలందిస్తూ వస్తున్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారంలో కూడా అవసరమైన వేళల్లో గరుత్మంతుడు శ్రీహరిని సేవించుకుంటూ ఉండేవాడు. గరుత్మంతుడు పుట్టుకతోనే అమిత బలశాలి. ‘అసలు ముల్లోకాలలోనూ నా ఎదుట నిలిచి, తనను యుద్ధంలో గెలవగల ధీరుడెవడున్నాడు? లోకపాలకుడైన శ్రీమన్నారాయణుడినే వీపుమీద మోస్తున్నవాడిని నన్ను మించిన వీరుడింకెవడున్నాడు’ అనుకుని గర్వించసాగాడు.గరుడుని ధోరణిని కొన్నాళ్లుగా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఎలాగైనా, అతడికి గర్వభంగం చేయాలని తలచాడు. ద్వారకలో సత్యా సమేతుడై సభలో కొలువుదీరిన శ్రీకృష్ణుడు ఒకసారి గరుత్మంతుడిని తలచుకున్నాడు. వెంటనే గరుత్మంతుడు కృష్ణుని ముందు వాలి, ‘ప్రభూ! ఏమి ఆజ్ఞ’ అంటూ మోకరిల్లాడు.‘వీరాధి వీరా! వైనతేయా! నీతో ముఖ్యమైన పని పడింది. అందుకే నిన్ను తలచుకున్నాను’ అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు కృష్ణుడు. ‘ఆజ్ఞ ఏమిటోసెలవివ్వు ప్రభూ’ అంటూ చేతులు జోడించాడు గరుత్మంతుడు.‘మరేమీ లేదు. గంధమాదన పర్వతం మీద కదళీవనంలో తపస్సు చేసుకుంటూ హనుమంతుడు ఉంటాడు. అతడితో ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది. అతణ్ణి ఇక్కడకు తోడ్కొని రావాలి. ఈ పనికి నువ్వే తగిన సమర్థుడవు’ అన్నాడు కృష్ణుడు. కృష్ణుడి ఆదేశానికి గరుత్మంతుడు మనసులో నొచ్చుకున్నాడు. ‘నేనేమిటి? నా పరాక్రమమేమిటి? ఒక వానరాన్ని తోడ్కొని రావడానికి నేను స్వయంగా వెళ్లడమా?’ అనుకున్నాడు. అయినా ప్రభువు ఆజ్ఞ కదా, ఎలాగైనా నెరవేర్చవలసిందే అనుకుని తక్షణమే బయలుదేరాడు. మనోవేగంతో ఎగురుకుంటూ వెళ్లి, గంధమాదన పర్వతం మీద వాలాడు. అక్కడ హనుమంతుడు నిశ్చల ధ్యానమగ్నుడై కనిపించాడు. గరుత్మంతుడు హనుమంతుడిని పిలిచాడు. ధ్యానంలో ఉన్న హనుమంతుడికి అతడి పిలుపు వినిపించలేదు. ‘ఓ వానరశ్రేష్ఠా! మహాత్ముడైన భగవంతుడు శ్రీకృష్ణుడు నిన్ను పిలుస్తున్నాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ అనుల్లంఘనీయం. కనుక నిన్ను తీసుకుపోకుండా ఇక్కడి నుంచి కదలను’ అని బిగ్గరగా అన్నాడు. తదేక ధ్యానంలో ఉన్న హనుమంతుడు కదల్లేదు, మెదల్లేదు. గరుత్మంతుడికి కోపం వచ్చింది. హనుమంతుడికి ధ్యానభంగం కలిగించైనా, తనతో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. తన పొడవాటి ముక్కును హనుమంతుడి ముక్కు రంధ్రంలోకి పోనిచ్చాడు. గరుత్మంతుడి వికారచేష్టను గమనించి కూడా, హనుమంతుడు నిశ్చలంగా ఉన్నాడు. కాసేపటికి తన ధ్యానాన్ని విరమించుకుని, ప్రాణాయామం ప్రారంభించాడు. ముక్కు కుడి రంధ్రం నుంచి వాయువును విడిచి, ఎడమ రంధ్రం ద్వారా పీల్చుకోసాగాడు. హనుమంతుడి ప్రాణాయామ సాధన గరుత్మంతుడికి ప్రాణసంకటంగా మారింది. హనుమంతుడు గాలి విడిచేటప్పుడు ఎవరో బలంగా నెట్టేసినట్లు గరుత్మంతుడు దూరంగా వెళ్లి పడుతున్నాడు. హనుమంతుడు గాలి పీల్చుకునేటప్పుడు ఎవరో బలంగా లాగుతున్నట్లు హనుమంతుడి వైపు రాసాగాడు. హనుమంతుడు ఊపిరి బిగించి వాయువును కుంభించేటప్పుడు అతడి ముక్కుకు అతుక్కుంటున్నాడు. ఈ ఉత్పాతానికి బిక్కచచ్చిన గరుడుడు వజవజ వణకసాగాడు. హనుమంతుడి ప్రాణాయామం పూర్తయ్యాక గరుత్మంతుడు విడుదలయ్యాడు. బతుకు జీవుడా అనుకుని తెప్పరిల్లాడు. కృష్ణాజ్ఞను ఉల్లంఘించినందుకు హనుమంతుడి మీద కోపం తెచ్చుకున్నాడు. దేహాన్ని పెంచి, ఆకాశాన్ని కమ్మేస్తూ హనుమంతుడిని తీసుకుపోయేందుకు అతని చుట్టూ ఎగురుతూ తిరగసాగాడు.గరుత్మంతుడిని పట్టుకునేందుకు హనుమంతుడు తన తోకను ఆకాశం వరకు పెంచాడు. అదేదో కొయ్య స్తంభం అనుకున్నాడు గరుత్మంతుడు. ఎగిరి ఎగిరి అలసిపోయి, కాసేపు ఈ స్తంభాన్ని ఆనుకుని సేదదీరాలనుకుని, హనుమద్వాలం మీద వాలాడు. తాను వాలినది స్తంభం కాదని, హనుమంతుడి తోక అని గ్రహించి, దానిని తన పదునైన ముక్కుతో పొడవడం ప్రారంభించాడు. హనుమంతుడికి చిర్రెత్తింది. తన తోక రోమాల మధ్య గరుత్మంతుణ్ణి బంధించాడు. అంత బలశాలి అయిన గరుత్మంతుడు కూడా హనుమంతుడి తోక రోమాలలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరయ్యాడు. హనుమంతుడు తన తోకను గిరగిర తిప్పి, గరుత్మంతుణ్ణి ఒక్కసారిగా విసిరేశాడు. ఆ దెబ్బకు అవయవాలన్నీ చితికిన గరుత్మంతుడు ఏకంగా పాలసముద్రంలో పడ్డాడు. కాసేపు అక్కడే సేదదీరాడు. తిరిగి శక్తి కూడదీసుకుని, ద్వారక చేరుకుని శ్రీకృష్ణుడి ముందు వాలాడు. తన ముందు దీనంగా నిలుచుకున్న గరుత్మంతుణ్ణి చూసిన కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘ఖగేంద్రా! అలా నిర్విణ్ణుడవై నీరసంగా నిలుచున్నావేమిటి? ఏం జరిగింది? చెప్పు’ అన్నాడు. ‘దేవదేవా! జగన్నాటక సూత్రధారీ! మీ ఆజ్ఞ నెరవేర్చడానికి హనుమంతుడి వద్దకు వెళ్లాను. అతడు నా మాట వినలేదు’ అని గరుత్మంతుడు చెబుతుండగానే శ్రీకృష్ణుడు అడ్డు తగిలాడు.‘ఛీ! ఏమిటీ ఆలస్యం? అతడితో నాకు ముఖ్యమైన పని ఉంది. వెంటనే తీసుకురా’ అన్నాడు.‘స్వామీ! నా బలగర్వం అణిగింది. వానరరూపంలో నా మృత్యువే అక్కడ ఉంది. హనుమంతుడు ఉండే చోటుకు తప్ప ఇంకెక్కడికి పంపినా వెళతాను’ అన్నాడు గరుత్మంతుడు.‘ఈసారి అలా జరగదు. రామనామం జపిస్తూ వెళ్లు. నీ సీతారాముడు నిన్ను పిలుస్తున్నాడని చెప్పు. హనుమ నీతో మారు మాటాడకుండా వస్తాడు’ అని చెప్పాడు శ్రీకృష్ణుడు. గరుత్మంతుడు ఈసారి వినయంగా వెళ్లి, శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారమే చెప్పి హనుమంతుడిని తనతో తోడ్కొని వచ్చాడు. -
అమ్మవారి నామాలే ఆ మహా నగరాలు!
విభిన్న నామాలతో, వివిధ రూపాలలో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద ఏకంగా కొన్ని మహానగరాలే వెలిశాయంటే ఆశ్చర్యం కాక మరేమిటి? అమ్మవారి నామంతో వెలసిన అలాంటి నగరాలు కొన్ని... వాటి ప్రాశస్త్యం క్లుప్తంగా... కోల్‌కతా – కాళీమాత కోల్‌కతా పేరు చెప్పగానే ఆ మహానగరంలో వెలసిన కాళికాదేవి రూపంతోపాటు కాళీఘాట్‌లో ప్రతి యేటా అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు కళ్లకు కడతాయి. నల్లని రూపంతో, రక్త నేత్రాలతో, పొడవాటి నాలుక బయటపెట్టి ఎంతో రౌద్రంగా కనిపించే ఈ అమ్మవారు తనను పూజించే భక్తుల పాలిట కరుణామయి. కన్నతల్లిలా బిడ్డలను కాపాడుతుంది. కోల్‌కతాకు ఆ పేరు రావడం వెనక ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పురాణ గాథలను చూద్దాం... ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు చాలామంది చెబుతారు. అలాగే బెంగాలీ భాషలో కాలికా క్షేత్ర అంటే.. కాళికాదేవి కొలువై ఉన్న ప్రాంతం అని అర్థం. అమ్మవారు కొలువైన కాళీఘాట్ కాళీ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చాటుతోంది. మంగళాదేవి పేరు మీదుగా మంగళూరు కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో మంగళూరు ఒకటి. ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఈ నగరానికి మంగళూరు అనే పేరొచ్చింది. పురాణాల ప్రకారం మంగళాదేవి ఆలయాన్ని శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఆరో అవతారమైన పరశురాముడు స్థాపించినట్లు తెలుస్తుంది. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సప్తమి రోజున ‘చండీ’ లేదా ‘మరికాంబ’గా, అష్టమి రోజున ‘మహా సరస్వతి’గా, నవమి రోజు ‘వాగ్దేవి’గా పూజలందుకుంటోందీ తల్లి. మహర్నవమి రోజున అమ్మవారి ఆయుధాలకు విశేష పూజలు నిర్వహించడంతోపాటు చండీయాగం కూడా చేస్తారు. దశమిరోజు అమ్మవారిని దుర్గా దేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర ఎంతో కన్నుల పండువగా సాగుతుంది. ముంబై – ముంబా దేవి దక్షిణ ముంబైలోని బులేశ్వర్ ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలోని అమ్మవారు వెండి కిరీటం, బంగారు కంఠహారం, రతనాల ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా దర్శనమిచ్చే ఈ అమ్మల గన్న అమ్మను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమే అని చెప్పవచ్చు. ఇక్కడ దసరా ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. వాణిజ్యపరంగా దేశంలోకెల్లా అత్యంత సుప్రసిద్ధమైన ముంబై మహానగరానికి ఆ పేరు రావడంలో అక్కడ వెలసిన ముంబాదేవి ఆలయమే కారణం. ఇందుకో పురాణ కథనం ఉంది. పార్వతీమాత కాళికాదేవిగా అవతారమెత్తే క్రమంలో ఆ పరమశివుని ఆదేశం మేరకు ‘మత్స్య’ అనే పేరుతో ఇప్పుడు ముంబైగా పిలుస్తున్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో పుట్టిందట. ఆమె అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు‘ముంబాదేవి’గా మారినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్యామలాదేవి పేరు మీదుగా సిమ్లా సాక్షాత్తూ ఆ కాళీమాతే శ్యామలా దేవిగా వెలసిన పుణ్యస్థలి సిమ్లా అని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గా మాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది. చండీగఢ్ – చండీ మందిర్ అటు పంజాబ్‌కు, ఇటు హరియాణాకు రాజధానిగా విరాజిల్లుతోన్న చండీగఢ్ నగరానికి ఆ పేరు రావడం వెనక అమ్మవారి పేరే కారణం. చండీ అంటే పార్వతీదేవి ఉగ్రరూపమైన చండీమాత అని, గఢ్ అంటే కొలువుండే కోట అని అర్థం. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు వచ్చిందంటే అక్కడ కొలువైన చండీ దేవాలయమే కారణం. చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. పాటన్‌దేవి పేరుతో పట్నా శక్తి స్వరూపిణి ‘పాటన్‌దేవి’ అమ్మవారు కొలువైన ఆలయం ఉండటమే పట్నాకు ఆ పేరు రావడానికి కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం దక్షయజ్ఞం సమయంలో అగ్నికి ఆహుతైన సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానందకరి పాటనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు‘పాటనేశ్వరి’గా, ఇప్పుడు ‘పాటన్‌దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది. దసరా సమయంలో పది రోజులపాటు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులతో కన్నుల పండువగా ఉత్సవాలు జరుగుతాయి. నైనాదేవి పేరుతో నైనిటాల్ ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన కొండ ప్రాంతాలతో అత్యంత శోభాయమానంగా అలరారే నైనిటాల్‌కు ఆ పేరు రావడం వెనక ఓ అద్భుతమైన చరిత్ర ఉంది, దక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థల పురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవి కొలువైన చోటును మహిషపీuŠ‡ అని కూడా పిలుస్తారు. అలా మహిషుడిని సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ’జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు అప్పట్నుంచి ‘నైనాదేవి’గా పూజలందుకుంటోందట. శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. దుర్గా మాత పేరుతో విరాజిల్లే మరికొన్ని ప్రాంతాలు అంబాలా – భవానీ అంబాదేవి (హరియాణా) అంబ జోగే – అంబ జోగేశ్వరి/ యోగేశ్వరి దేవి (మహారాష్ట్ర) తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర) హసన్ – హసనాంబ (కర్ణాటక) త్రిపుర – త్రిపురసుందరి (త్రిపుర) మైసూరు – మహిషాసురమర్దిని (కర్ణాటక) కన్యాకుమారి – కన్యాకుమారి దేవి (తమిళనాడు) సంబల్పూర్ – సమలాదేవి/ సమలేశ్వరి (ఒడిశా) (చదవండి: ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..! ) -
మూడు వాహనాల్లో మురిపించిన ముగ్ద మనోహరుడు!
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సంబరంగా సాగుతున్నాయి. సప్తగిరులు భక్తసిరులతో నిండిపోతున్నాయి. తిరుమాడ వీధులు గోవిందనామస్మరణతో మార్మోగుతున్నాయి. సాంస్కృతిక సరాగాలు అంబరాన్ని తాకుతున్నాయి. విద్యుద్దీప కాంతులు మంత్రముగ్దులను చేస్తున్నాయి. విరబూసిన అందాలు భక్తులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. దేవదేవుని దివ్య స్పర్శతో పునీతమవుతున్నాయి. పుష్పక విమానం తిరుమల: తిరుమలలో శుక్రవారం బ్రహ్మోత్సవ శోభ ఉట్టిపడింది. మలయప్ప మూడు వాహనాలపై ఊరేగుతూ భక్తులను మురిపించారు. ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం పుష్పక విమానం, రాత్రి గజవాహనంపై ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలారు. కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. హనుమంత వాహన సేవలో టీడీపీ చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డి నేటి వాహన సేవలు ►ఉదయం సూర్యప్రభ వాహనం: బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతూ కనువిందు చేయనున్నారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ నిర్వహిస్తారు. ►రాత్రి చంద్రప్రభ వాహనం:రాత్రి తెల్లటి వ్రస్తాలు, పుష్ప మాలలు ధరించి చల్లని వాతావరణంలో తిరువీధుల్లో స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తిరువీధుల్లో స్వామివారు ఊరేగనున్నారు. (చదవండి: తిరుమల బ్రహ్మోత్సవం అంకురార్పణతో మెదలై.. ఎన్ని వాహనాలో తెలుసా?) -
స్వామివారు స్వయంభువుగా వెలసిన శేషాచలం కొండల మహాత్మ్యం అదే
ఓ విదేశీయుడు భారతదేశంలోని దేవాలయాల ప్రాశస్త్యాన్ని కంప్యూటర్ ద్వారా తెలుసుకున్నాడు. శేషాచలం కొండల్లో నెలవై ఉన్న వేంకటేశ్వరస్వామి అతడిని ఆకర్షించాడు. వెంటనే స్వామిని దర్శించుకోవాలనిపించింది. అనుకున్నదే తడవుగా చెన్నై విమానమెక్కాడు. పక్కన కూర్చున్న ప్రయాణికుడి సలహా మేరకు విమానాశ్రయం నుంచి కాలి నడకన తిరుమలకి వెళ్ళదలిచాడు. సంప్రదాయ దుస్తులు ధరించి, భుజానికి సంచీ తగిలించుకుని బయలుదేరాడు. ఎప్పుడూ చెప్పులు లేకుండా నడవని అతడు, ఎర్రటి ఎండకి కాళ్ళు కాలుతున్నా లెక్కచేయలేదు. స్వామి రూపాన్నే తలుచుకుంటూ ముందుకు నడిచాడు. దారిలో కొండకి నడిచి వెళ్ళే బృందాలు కొన్ని కనిపించాయి. వారితో కలిసి నడవటం కొనసాగించాడు. అలా మైళ్ళ కొద్దీ ప్రయాణం చేశాక, తిరుచానూరు చేరాడు. తల్లి పద్మావతి అమ్మవారి దర్శనం పూర్తయ్యింది. అమ్మవారి ప్రసాదం తింటూ తలెత్తి చూశాడు. వెండిరంగు లో మిలమిలా మెరుస్తున్న శేషాచలం కొండ చాలా దగ్గరగా అనిపించింది. చిన్న పిల్లవాడిలాగా ఎగిరి గంతులేశాడు. చకచకా నడుచుకుంటూ తిరుపతి పట్టణంలోని గోవింద రాజస్వామి గుడికి వెళ్ళి దండం పెట్టాడు. అక్కడే నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు కొని చదువుతూ మళ్ళీ శేషాచలం కొండల వైపు చూశాడు. ఆశ్చర్యం... కొండలు దూరంగా ఉన్నట్లు కనిపించాయి. ఉండబట్టలేక అతడు, తనతో పాటు నడుస్తూ ఉన్న మరో భక్తుడితో ‘‘అదేమిటండీ...? శేషాచలం కొండలకు దూరంగా ఉంటే, అవి చాలా దగ్గరగా ఉన్నట్లు, దగ్గరికి వెళితే ఎక్కడో... దూరంలో ఉన్నట్లు కనబడుతున్నాయి’’ అని ఆసక్తిగా అడిగాడు. ఆ భక్తుడు చిన్న నవ్వు నవ్వి ‘‘అదే నాయనా శేషాచలం కొండల మహాత్మ్యం. అవి స్వామివారు స్వయంభువుగా వెలసిన పవిత్రమైన కొండలు కదా! మనం పనుల్లో పడి స్వామిని మరిస్తే ‘నీకు దగ్గరే ఉన్నాను, వచ్చిపోరాదా!’ అని పిలిచినట్లు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే ‘వచ్చావు కదా, నీ కష్టాలు తీరుతాయిలే...’ అని చెప్పి దూరమైనట్లవుతుంది. అయినా... అది చెబితే అర్థమయ్యేది కాదు. అనుభూతి చెందాల్సిందే. అందుకే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి భక్తులు స్వామి దర్శనానికి పరుగులు తీస్తారు’’ అని వివరించాడు.భక్తిభావంతో ఆ విదేశీయుడి కళ్ళు తడి అయ్యాయి. గట్టిగా గోవిందనామ స్మరణలు చేస్తూ బృందాలతో కలిసి అలిపిరి చేరి మెట్ల మార్గంలో తిరుమలకు చేరాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
తిరుమల బ్రహ్మోత్సవం అంకురార్పణతో మెదలై.. ఎన్ని వాహనాలో తెలుసా?
శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోక వైకుంఠమైన వెంకటాద్రిపై కన్యామాసం (ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రాన దివ్యమైన ముహూర్తంలో అర్చారూపంలో స్వయంవ్యక్తమూర్తిగా శ్రీవేంకటేశ్వరునిగా వెలశాడు. శ్రీస్వామి ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్త ప్రియుడు. కోరినవారికి కొంగు బంగారమై కోర్కెలు నెరవేర్చే ఆ శ్రీవేంకటేశ్వరుని 'వైభోగం న భూతో న భవిష్యతి!'. వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. • దసరా నవరాత్రులు, కన్యామాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. • సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించడం కూడా సంప్రదాయమే. • వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా ఉత్సవాలను అలంకారప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదవ నాడు.. మహారథానికి (చెక్కరథం) బదులు ముందు వరకు వెండి రథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుండి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై ఊరేగింపు సాగింది. 2012లో దాని స్థానంలో మరో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది. అంకురార్పణతో ఆరంభం.. వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు)– శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా చేస్తారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. • శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబరు 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంది. అంకురార్పణం (14–10–2023) (రాత్రి 7 నుండి 9 గంటల వరకు): వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారికి ఆలయ మాడ వీథుల్లో ఊరేగింపు చేపడతారు. ఆ తరువాత అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంగారు తిరుచ్చి ఉత్సవం (15–10–2023) (ఉదయం 9 గంటలకు): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీథుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. పెద్దశేషవాహనం (15–10–2023) (రాత్రి 7 గంటలకు): మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీథులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. భూభారాన్ని వహించేది శేషుడే! శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. చిన్నశేషవాహనం (16–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రతీతి. హంస వాహనం (16–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీమలయప్ప స్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని కలిగిస్తాడు. సింహ వాహనం (17–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహాన్ని బలానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఈ వాహనసేవలోని అంతరార్థం. ముత్యపుపందిరి వాహనం (17–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ముత్యపుపందిరి వాహనంలో స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. కల్పవృక్ష వాహనం (18–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీ«థుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. సర్వభూపాల వాహనం (18–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మోహినీ అవతారం (19–10–2023) (ఉదయం 8 గంటలకు): బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు. గరుడ వాహనం(19–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీథుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్యభక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెబుతున్నారు. హనుమంత వాహనం (20–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం అవగతమవుతుంది. పుష్పకవిమానం (20–10–2023) (సాయంత్రం 4 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి పుష్పకవిమానంపై విహరిస్తారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు. గజవాహనం(20–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీథుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది. సూర్యప్రభ వాహనం (21–10–2023) (ఉదయం 8 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీ«థుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య విద్య, ఐశ్వర్య, సంతాన లాభాలు భక్తకోటికి సిద్ధిస్తాయి. చంద్రప్రభ వాహనం (21–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాలలో అనందం ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. స్వర్ణరథం (22–10–2023) (ఉదయం 7.15 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. అశ్వవాహనం (22–10–2023) (రాత్రి 7 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణ్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. చక్రస్నానం (23–10–2023) (ఉదయం 6 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వారు ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. -లక్ష్మీకాంత్ అలిదేన, సాక్షి, తిరుమల ఇవి చదవండి: శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఎప్పుడు.. ఎందుకు.. ఎలా మొదలయ్యాయో తెలుసా..!? -
కాశీని శపించబోయిన వ్యాసుడు,ఆ తర్వాత ఏం జరిగిందంటే..
విశాలాక్షీ సమేతుడైన విశ్వనాథుడు కొలువుదీరిన కాశీ నగరంలో కొంతకాలం గడుపుదామని భావించి, శిష్యగణాన్ని వెంటబెట్టుకుని అక్కడకు చేరుకున్నాడు. ఆయన వెంట వచ్చిన శిష్యులలో వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు సహా ఎందరెందరో మహామహులు ఉన్నారు. కాశీలో వ్యాసుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. రోజూ వేకువ జామునే కాలకృత్యాలు తీర్చుకుని, గంగలో స్నానం చేసి, సంధ్యవార్చి, ఆశ్రమంలో అగ్నికార్యం, అనుష్ఠానం పూర్తయ్యాక మధ్యాహ్నం భిక్షాటన కోసం ఊళ్లో తలోదారిన బయలుదేరేవారు. కాశీలో వారికి భిక్షకు లోటు ఉండేది కాదు. రోజులు ఇలా గడిచిపోతుండగా, విశ్వేశ్వరుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలనిపించింది. ‘వ్యాసుడి అంతరంగం ఎలాంటిదో తెలుసుకుందాం. అతడికీ, అతడి శిష్యులకూ ఎక్కడా భిక్ష పుట్టకుండా చేయి’ అని విశాలాక్షితో చెప్పాడు. ఆమె సరేనంది. మరునాడు వ్యాసుడు, అతడి శిష్యులు యథాప్రకారం భిక్షాటనకు బయలుదేరారు. విశాలాక్షి ప్రభావంతో ఏ ఇల్లాలికీ భిక్ష పెట్టే ఇచ్ఛ లేకుండాపోయింది. వ్యాసుడు ఇల్లిల్లూ తిరుగుతూ గుమ్మం ముందు నిలబడి ‘భిక్షాందేహి’ అని గొంతెత్తి పిలిచినా, కొందరు గృహస్థులు కనీసం తలుపులైనా తీశారు కాదు. వ్యాసుడికి ఎదురైన అనుభవమే అతడి శిష్యులకూ ఎదురైంది. కాలే కడుపులతో, ఖాళీ భిక్షపాత్రలతో ఒక్కొక్కరే ఆశ్రమానికి చేరుకున్నారు. ‘నాకు ఎక్కడా ఒక్క మెతుకైనా పుట్టలేదు. మీలో ఎవరికైనా భిక్ష దొరికిందా?’ శిష్యులను అడిగాడు వ్యాసుడు. ‘లేదు గురుదేవా! ఎవరూ మాకు భిక్ష వేయలేదు’ బదులిచ్చారు శిష్యులు. వ్యాసుడు, అతడి శిష్యులు కడుపులో కాళ్లు ముడుచుకుని పస్తు పడుకున్నారు. మర్నాడు వేకువనే నిద్రలేని స్నాన సం«ధ్యాది నిత్య నైమిత్తిక అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని మళ్లీ భిక్షకు బయలుదేరారు. ఎక్కడా భిక్ష పుట్టలేదు. సాయంత్రం అయ్యే సరికి అందరూ నీరసంగా ఆశ్రమానికి చేరుకున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు, వరుసగా ఏడు రోజులు వ్యాసుడికి గాని, అతడి శిష్యులకు గాని కాశీ నగరంలో ఎక్కడా భిక్ష పుట్టలేదు. విశాలాక్షీ సమేతుడైన విశ్వేశ్వరుడు కొలువైన కాశీ నగరంలో ప్రతి ఇల్లాలూ ఒక అన్నపూర్ణ అని లోకం చెప్పుకుంటుంటే, తనకు తన శిష్యులకు ఇలా ఉపవాసాలు ఎదురవడం ఏమిటని వ్యాసుడు అమితంగా బాధపడ్డాడు. ఎనిమిదో రోజు వ్యాసుడు, అతడి శిష్యులు నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని, కాశీలో కొలువుదీరిన దేవతలందరికీ నమస్కారాలు పెట్టుకుని భిక్షకు బయలుదేరారు. వ్యాసుడికి ఒక్క ఇంటా భిక్ష దొరకలేదు. వరుస ఉపవాసాలతో వ్యాసుడు వ్యాకుల పడ్డాడు. తన శిష్యుల దురవస్థ తలచుకుని దుఃఖించాడు. అతడికి సహనం నశించింది. ఉక్రోషం ముంచుకొచ్చింది. నడివీథిలో తన భిక్షపాత్రను రాళ్లకేసి కొట్టి పగులగొట్టాడు. కాశీ వాసులకు మూడు తరాల వరకు విద్య, భక్తి, ధనమూ లేకుండా పోవాలని సంకల్పిస్తూ, కమండలం నుంచి శాపజలం అందుకోబోయాడు. వణుకుతున్న చెయ్యి ముందుకు రాకుండా నిలిచిపోయింది. అప్పుడే ఆ వీథిలోనున్న ఒక ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. సర్వాభరణ భూషితురాలైన ఒక నడివయసు స్త్రీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ‘ఓ బ్రాహ్మడా! ఏమిటీ అఘాయిత్యం! కోపం మాని ఇలా రా’ అని పిలిచింది. ఆమె పిలుపుతో వ్యాసుడు తెప్పరిల్లాడు. ఆమె ఎవరో కనుక్కోకుండానే అప్రయత్నంగా నమస్కరించాడు. ‘భిక్ష దొరకనంత మాత్రాన కాశీ నగరాన్ని శపించేయడానికి సిద్ధపడ్డావే! ఇది నీకు విశ్వేశ్వరుడు పెట్టిన పరీక్ష. ఇదేనా నీ ధీరత్వం? ఏడురోజులు భిక్ష దొరకనంత మాత్రానికే నీ స్థైర్యం సడలిందేం?’ అని మందలిస్తూ, ‘మధ్యాహ్నానికి వస్తే, భిక్ష పెడతాను’ అంది. ‘తల్లీ! నన్నొక్కణ్ణేనా? నా శిష్యులను కూడానా? నాతో పాటే వాళ్లూ వారం రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు’ అన్నాడు వ్యాసుడు.‘గంగ వద్ద మధ్యాహ్న పూజలు ముగించుకుని అందరూ రండి. కడుపు నిండా భోజనం పెడతాను’ అందామె. మధ్యాహ్నం వెళ్లగానే విస్తర్లు వేసి, అందరూ ఆపోశనలు పట్టండని చెప్పింది. విస్తర్లు ఖాళీగా ఉన్నాయి. ఆపోశనలు పట్టగానే విస్తర్లలో ఎవరికి ఇష్టమైన పదార్థాలు వారికి ప్రత్యక్షమయ్యాయి. ఈమె సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయి ఉంటుందనుకుని అందరూ తృప్తిగా భోజనం చేశారు. భోజనాలు పూర్తి చేసి విశ్రమిస్తుండగా, పార్వతీ సమేతంగా శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి ప్రశాంతంగానే ఉన్నా, శివుడి ముఖం కోపంతో చిరచిరలాడుతూ ఉంది. శివుడు వ్యాసుణ్ణి కోపంగా చూస్తూ ‘ఓరీ దుర్మార్గుడా! నా భార్యలాంటి కాశీ నగరానికే శాపం ఇవ్వబోతావా? నువ్వు కాశీలో అడుగు పెట్టడమే ద్రోహం. నువ్వూ నీ శిష్యులూ కాశీ పొలిమేరలు దాటి వెళ్లండి’ అన్నాడు. చేసిన తప్పుకు బాధపడుతూ వ్యాసుడు శిష్యులతో సహా కాశీ నగరాన్ని విడిచిపెట్టాడు. -
మరణం లేని వరం.. అయినా రాక్షస వీరుల్ని అంతం చేసిన ఆదిపరాశక్తి
శుంభ నిశుంభులు రాక్షస సోదరులు. శివుడి కోసం ఘోర తపస్సు చేశారు. పురుషుల చేతిలో మరణం లేకుండా వరం పొందారు. వరగర్వం తలకెక్కిన శుంభ నిశుంభులు ముల్లోకాలనూ పీడించసాగారు. దేవతలు సహా ముల్లోకాల జనాలందరూ ఆదిపరాశక్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. శుంభ నిశుంభులు స్వర్గంపై దండెత్తి, దేవతలను తరిమికొట్టారు. స్వర్గాన్ని ఆక్రమించుకున్నాక శుంభుడు తనను తాను త్రిలోకాధిపతిగా ప్రకటించుకున్నాడు. శుంభుడి ప్రాపకం కోసం కొందరు రాక్షస సేనానులు అతడి వద్ద ఆదిపరాశక్తి సౌందర్యాన్ని వైనవైనాలుగా వర్ణించారు. తనవంటి వీరుడు పెళ్లాడితే అలాంటి సౌందర్యరాశినే పెళ్లాడాలని తలచాడు శుంభుడు. శుంభ నిశుంభుల దాష్టీకాలను ఆలకించిన ఆదిపరాశక్తి క్రోధావేశంతో తన భ్రుకుటి ముడివేసింది. ఆమె లలాటం నుంచి కాళీ పుట్టుకొచ్చింది. కాళీ సమేతంగా జగజ్జనని శుంభ నిశుంభులు నివసించే పరిసరాలకు వెళ్లి, అక్కడ ఒక ఉద్యానవనానికి చేరుకుంది. అక్కడ ఆసీనురాలై, మధురగాత్రంతో సంగీతాలాపన చేయసాగింది. అనుచరుల ద్వారా శుంభుడికి ఈ సమాచారం తెలిసింది. ఎవరో దేవకన్య తనను వలచి వచ్చిందని తలచాడు. ఆమెకు తన బలపరాక్రమాలను వివరించి, ఆమెను సగౌరవంగా అంతఃపురానికి తోడ్కొని రమ్మంటూ సుగ్రీవుడనే మంత్రిని పంపాడు. సుగ్రీవుడు ఉద్యానవనంలోకి చేరే సమయానికి కాళీ సమేత అయిన ఆదిపరాశక్తి మధుపానం చేస్తూ కనిపించింది. ‘ఓ కాంతామణులారా! మీరెవరో తెలియదు. మీ సౌందర్యాన్ని తెలుసుకుని త్రిలోకాధిపతి అయిన మా ప్రభువు శుంభుడు నన్ను ఇక్కడకు పంపాడు. మీ అదృష్టం పండింది. మీరిద్దరూ శుంభుడి క్రీడాసౌధానికి విచ్చేసినట్లయితే, అర్ధసింహాసనాన్ని అధివసించి ముల్లోకాలనూ ఏలవచ్చు కదా’ అన్నాడు. ఆదిపరాశక్తి సుగ్రీవుడి వంక చిరునవ్వుతో చూసి, ‘మీ శుంభుడి బలపరాక్రమాలను నేను ఎరుగుదును. అయితే, నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడినే పెళ్లాడాలనే ప్రతినబూనాను. నా మాటను మీ నాయకుడికి తెలియజెప్పు’ అని అతడిని పంపేసింది. సుగ్రీవుడు శుంభునికి ఆదిపరాశక్తి మాట చెప్పాడు. అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. వాళ్లను ఈడ్చుకు రమ్మంటూ ధూమ్రలోచనుడనే వాడిని పంపాడు. కాళీ వాడిని హతమార్చింది. ఈసారి చండ ముండులనే వారిని సైన్యంతో పంపాడు. ధూమ్రలోచనుడిని చంపిన కాళీపై చండ ముండులు యుద్ధానికి దిగారు. ఎటు చూసినా తానే కనిపిస్తూ కాళీ రణరంగంలో వీరవిహారం చేసింది. రాక్షసవీరులను ఒక్కొక్కరినే అంతం చేసింది. చండ ముండుల శిరస్సులు ఖండించి, వారిని హతమార్చింది. చండ ముండుల చావు చూడగానే మిగిలిన రాక్షస సేనలు పలాయనమంత్రం పఠించాయి. చారులు ఈ సంగతిని శుంభుడికి చేరవేశారు. అమిత పరాక్రమవంతులైన చండ ముండులు హతులైన సంగతి విని శుంభుడు హతాశుడయ్యాడు. ఈసారి మహాభీకరుడైన రక్తబీజుడిని సైన్యంతో పంపాడు. రక్తబీజుడు రంకెలు వేస్తూ యుద్ధానికి వచ్చాడు. కాళీ రక్తబీజుడితో యుద్ధానికి తలపడింది. రణరంగమంతా ఎటు చూసినా తానే కనిపిస్తూ రాక్షస సేనలను దునుమాడసాగింది. రక్తబీజుడికి ఆయుధాలతో గాయాలు తగిలినప్పుడల్లా వాడి ఒంటి నుంచి నేలరాలే రక్తబిందువుల నుంచి రక్తబీజులు పుట్టుకురాసాగారు. కాళీ సహస్ర రూపాలతో సహస్రజిహ్వలు చాస్తూ విజృంభించింది. రక్తబీజుడు నెత్తుటిబొట్టు నేల రాలకముందే తన జిహ్వలతో తాగేస్తూ, భీకర యుద్ధం కొనసాగించింది, చివరకు వాడిని వధించింది. రక్తబీజుడి మరణవార్త తెలియగానే శుంభుడిలో ధైర్యం సడలింది. నిశుంభుడు అది గమనించి, ‘అన్నా! నేనుండగా నీకెందుకు విచారం? నేనే స్వయంగా ఆమెను బంధించి తెచ్చి, నీ ముందు ఉంచుతాను’ అని పలికి అట్టహాసంగా బయలుదేరాడు. ఆదిపరాశక్తి వాడిని యుద్ధంలో అంతమొందించింది. యుద్ధానికి పంపడానికి ఎవరూ మిగలకపోవడంతో చివరకు శుంభుడు తానే బయలుదేరాడు. ‘కాంతామణీ! నా అనుచరులను హతమార్చావని నీ మీద నాకు కినుక లేదు. రమణులకు రాణివాసం శోభిస్తుంది గాని, రణరంగం కాదు. నాతో రాణివాసానికి వస్తే, ముల్లోకాలను ఏలుకోగలవు. ఇక ఆలస్యం చేయక బయలుదేరు’ అన్నాడు. ‘ఓహో! నువ్వేనా శుంభుడవు? నా ప్రతిజ్ఞ తెలుసు కదా! నీ బలపరాక్రమాలు ఏమాత్రానివో ఒకసారి చూస్తాను, రా!’ అని పలికింది ఆదిపరాశక్తి. యుద్ధానికి సిద్ధపడ్డాడు శుంభుడు. కాళ్లు నేలకు తాటిస్తూ, భీకర సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి. దేవతలు భయకంపితులయ్యారు. ఇంతలో శివుడు అక్కడకు వచ్చాడు. ఆదిపరాశక్తికి నవశక్తులను అందించాడు. ఆదిపరాశక్తి ఆదేశంతో కాళీ రణరంగంలో వీరవిహారం ప్రారంభించింది. తోడుగా నవశక్తులు సహస్రాది రూపాలతో రాక్షస సేనలను మట్టుపెట్టసాగారు. భీకర సంగ్రామంలో రణరంగమంతా కళేబరాల గుట్టలు పోగుపడ్డాయి. నెత్తుటేర్లు ప్రవహించాయి. కాళీ చివరకు శుంభుడిని దొరకబుచ్చుకుని వాడి చేతులు, కాళ్లు, తల నరికి పారేయడంతో వాడు నేలకూలాడు. రాక్షసులందరూ హతమారడంతో కాళీతో కలసి ఆదిపరాశక్తి రణరంగంలో విజయతాండవం చేసింది. దేవతలు వేనోళ్ల స్తుతులు చేస్తూ ప్రార్థించడంతో ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుని, ప్రసన్నవదనంతో దేవతలను ఆశీర్వదించింది. -
క్షమయే దైవము
క్షమా శస్త్రం కరే యస్య దుర్జనః కిం కరిష్యతి? అతృణో పతితో వహ్నిః స్వయమేవోపశమ్యతి! గడ్డి పరక లేని నేలమీద పడిన మంట తనంత తానే ఆరి పోతుంది. ఎవరి దగ్గరైతే క్షమ అనే శస్త్రం ఉంటుందో వారిని దుర్జనులు కూడా ఏమీ చేయలేరని శ్లోకం భావం. మంట తనని కాలుస్తున్నా తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా నేలతల్లి సహనం వహించడం వల్ల మంటలో ఉన్న కాలే గుణం తగ్గి పోతుందట. రావణుడితో మొదటిసారి యుద్ధంలో తలపడినప్పుడు ‘సీతను అప్పగించి శరణు కోరితే క్షమించి వదిలేస్తాను’ అని పలికాడు రాముడు. ఎంతటి శత్రువునైనా క్షమించగల దయా గుణ సంపన్నుడు రాముడు. తన భార్యని అపహరించిన శత్రువుని కూడా క్షమాగుణంతోనే పలకరించాడు. రావణుడు చనిపోయాక శ్రాద్ధ కర్మల అవసరం లేదని విభీషుణుడు చెప్పగా ‘ఎంతటి శత్రువైనా మరణంతో పగలన్నీ మరచిపోవాలి. అతడు మీకెలా సోదరుడో నాకూ అంతే. అతడికి సద్గతులు కలగాలంటే శ్రాద్ధ కర్మలు జరిపించాలని’ పలికాడు. అంతటి క్షమాగుణం సీతాపతిది. కార్త వీర్యార్జునుడిని, పదిహేడు అక్షౌహిణుల సైన్యాన్ని హతమార్చిన పరశురాముడితో తండ్రి జమదగ్ని ‘క్షమయే మన ధర్మం. ధర్మతత్వానికి క్షమయే మూలం. క్షమ కలిగి ఉండడం చేతనే సర్వేశ్వరుడు బ్రహ్మ పదాన్నీ, సకల జీవరాశినీ పరి పాలిస్తున్నాడు. క్షమ కలిగి ఉంటే సిరి కలుగుతుంది. విద్య అబ్బుతుంది. సౌఖ్యాలు కలుగుతాయి. శ్రీహరి మెప్పు పొందగలరని’ హితబోధ చేశాడు. ఫలితంగా ఏడాది పాటు తీర్ధయాత్రలు చేశాడు పరశురాముడు. ఈ కాలం వారికి వింతగా కనబడవచ్చు కానీ క్షమా గుణానికి ఉన్న బలం అంచనా కట్టలేనిది. ఎవరైనా ఒక్క మాటంటే భరించలేకపోవడం, దూషిస్తూ తిరిగి ఎదురు దాడి చేయడం నేటి కాలంలో చూస్తుంటాం. ఒక్క క్షణం ఓపికతో అవతలి వారి కోణంలో ఆలోచిస్తే వారి మీద కోపం రావడం బదులు సానుభూతి కలుగుతుంది. క్షమాగుణాన్ని చూప డమంటే చేతకానితనం కాదు. ఆత్మబల మున్న బలవంతులకే అది సాధ్యం. – అమ్మాజీ ఉమామహేశ్వర్ -
దేవుడికి రాజోపచారాలు అందుకే..!
‘‘గీతం వాద్యం తథా నృత్యం త్రయ సంగీతముచ్యతే...’’... అన్నట్లు గీతం, వాద్యం, నృత్యం .. ఈ మూడూ సంగీతంలో అంతర్భాగాలే. అది త్రివేణీ సంగమం. అది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితిని ఇస్తుంది. మొట్టమొదట సంగీతాన్ని ఎవరు పట్టుకున్నారు... అంటే భగవంతుడే. పరమశివుడికన్నా బాగా నృత్యం చేసేవారెవరు! శ్రీకృష్ణ పరమాత్మకన్నా వేణువు వాయించగల విద్వాంసుడెవరు! శంకరుడికన్నా దక్షిణామూర్తిగా వీణ వాయించేదెవరు! వైదికమైన రూపాలు వేరయినా సరస్వతీ దేవి కూడా ఎప్పుడూ వీణతోనే కన్పిస్తుంటుంది. అయితే మనసుకు ఒక లక్షణం ఉంటుంది. దానికున్న శక్తి – వేగం, యాంత్రీకరణ. ఇక్కడున్నట్టుంటుంది... క్షణాల్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. పూజలో కూర్చుంటాం.. శివాయనమః అంటూ చేతితో పువ్వును శివలింగం మీద ఉంచుతాం. తరువాత.. మంత్రాలు నోరు చెబుతుంటుంది, చెయ్యి పూలు వేస్తుంటుంది... కానీ మనసు మాత్రం మెల్లగా జారుకుని ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేముడికి ఇది కాదు కావలసింది. ఆయన వీటితో సంతోషించడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యాప్రయచ్ఛతి/తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః... భక్తితో ఆకులు, పండ్లు, పూలు, నీళ్ళిస్తే నేను తీసుకుంటా... అవి చాలు నాకు... అంటాడు. కానీ చంచలమైన మనసును ఒకేచోట నిలబెట్టడం అంత తేలికయిన పనేమీ కాదు. అందుకే ఏకాగ్రత లేనప్పుడు గంటలకొద్దీ పూజలొద్దు... సమయం ఉంటే 16 రకాలుగా సేవించు... లేదా ‘పంచసంఖ్యోపచారిణీ’... అన్నారు.. గంధ, పుష్ప, ధూపం, దీపం, నైవేద్యాలతో చేయి.. దానికీ మనసు మొండికేస్తుందా... రాజోపచారాలు చెయ్యి. ... చామరం వెయ్యి, పాట విను, నృత్యం చెయ్యి... ఇవి మనసును బాగా పట్టుకుంటాయి. కంజదళాయతాక్షీ కామాక్షీ... అని కీర్తన అందుకున్నాడు శ్యామ శాస్త్రి.... కుంజరగమనే.. అని పాడాడు వాసుదేవాచార్యులవారు. శుక్రవారం మంటపంలో కామాక్షీ పరదేవత నడచివస్తుంటే ఏనుగు నడిస్తే ఎంత గంభీరంగా ఉంటుందో అంత నయానానందకరంగా ఉంటుందన్నాడు... అంటే ఆ కీర్తన వింటూంటే మనం అమ్మవారి నడకనే చూస్తున్నాం.. మనసుకు కళ్ళెం పడింది. ఆ తత్త్వం మనసును అలరించి శాంతినిస్తుంది. అందుకే గీతం, వాద్యం, నృత్యం మనసుకి ప్రశాంతతను ఇస్తాయి. అందుకే వాటిని రాజోపచారాల్లో చేర్చారు. అసలు మనకంటే ప్రశాంతంగా ఉండాల్సింది .. భగవంతుడు. ఉద్వేగాలు ఎవరికి ఉండాలి? అదీ ఆయనకే. అందరి మనసుల్లో భగవంతుడున్నప్పుడు మన ఉద్వేగాలు, అశాంతి అన్నింటి సెగ ఆయనకే కదా తగులుతుంటుంది. ఆ వేడిని తట్టుకోవడానికే ఆయన అభిషేకం స్వీకరిస్తున్నాడట. నెత్తిన చల్లటి చంద్రుడిని కూడా ఉంచుకున్నాడని చమత్కారంగా చెప్పారు. అమ్మవారు శక్తి స్వరూపం. శక్తి అంటే కదలిక. మరి అన్ని కదలికలతో అమ్మవారు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతారు... దానికి కాళిదాసంటారు కదా... సరిగమపదనిరతాం తాం... వీణా సంక్రాంత హస్తాంతాం... ఆ తల్లి చేతిలో వీణ పట్టుకుని సప్త స్వరాల్లో రమిస్తూ ఉంటుంది. అందుకే ఆమె ప్రశాంతంగా ఉంటుంది... అంటే సంగీతం మనసుకు ఏకాగ్రతను, శాంతిని ఇస్తుంది... చివరిదయిన మోక్ష సాధనకు వాగ్గేయకారులు కూడా సంగీతాన్నే సాధనంగా చేసుకుని తరించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు (చదవండి: పంపాతీరంలో హనుమంతునిచే త్రిశూలరోముడి హతం.. మునులకు ప్రశాంతత) -
గణపతిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తాం?అసలు కారణమిదే!
అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడ్ని నవరాత్రుల అనంతరం నిమజ్జనం చేయడం ఆచారంగా వస్తుంది. సాధారణంగా హిందూ పండగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగా గణనాథుడికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు. మండపాలు వేసి అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు పూజలు చేసి తర్వాత గంగమ్మ ఒడికి సాగనంపుతారు. హిందూ దేవుళ్లలో ఎవరికి పూజలు చేసినా ఆ ప్రతిమలను ఇంట్లోనే పెట్టుకుంటాం. కానీ ఒక్క వినాయకుడిని మాత్రమే నిమజ్జనం ఎందుకు చేస్తాం?దీని వెనకున్న కారణం ఏంటన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు... ఘనమైన దైవం కూడా. ఎందుకంటే, ఈ సృష్టి యావత్తూ అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ, సృష్టిని శాసించే మహా శక్తిమంతుడు. అంతటి శక్తిమంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. అందుకే ఆయన ఘనులకే ఘనుడు. రుతుధర్మాన్ననుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. యేటా వర్షరుతువు చివర్లో భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుందీ పండుగ. వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళం వెదజల్లుతుంటాయి. నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త... వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనను గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం. మట్టితోనే ఎందుకు? గణేశుని మట్టితో చేయడం వెనుక కూడా విశేషముంది. ఈ కాలంలో జలాశయాల్లో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. మట్టితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి అంటితే మంచిది. ఒండ్రుమట్టిలో నానడం శరీరానికి మంచిదని ప్రకృతి చికిత్స వైద్యులు చెబుతుంటారు. ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసిందే. షోడశోపచార పూజల్లో వాడే పత్రిని మనం తాకడం వల్ల కూడా వాటిలోని ఔషధ గుణాలు మనలోకి ప్రవేశిస్తాయి. తొమ్మిది రోజులు విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో గాలి ఔషధ గుణాల్ని పంచుతుంది. ఎంతో మేలు చేస్తుంది. వినాయకుడిని దగ్గరలో ఉన్న చెరువు, నది లేదంటే బావిలో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్లుగా ఈ కాలంలో నదులు, చెరువులు నిండుగా కళకళలాడుతుంటాయి. మట్టి విగ్రహాల్ని, పత్రిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. కానీ ఈమధ్యకాలంలో గణపతికి రసాయనిక రంగులు వేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటిలో నివసించే జీవులకు హానికారకమవుతుంది.అందుకే మట్టి గణపతులనే పూజించాలని చెబుతారు. నిమజ్జనమెందుకు? అయితే పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల(భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలసిపోవాల్సిందే.అలా ఎందుకంటే, భూమినుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా, తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేనిమీదా వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న నీతిని చెప్పేందుకే!ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేస్తారు. శాస్త్రీయ కారణాలు.. వినాయక నిమజ్జనం వేనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. వినాయక చవితి నాటికి.. జోరుగా వానలు కురిసి.. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగి పొర్లుతుంటాయి. వరదలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక అలాంటి సమయంలో మట్టితో చేసిన గణపయ్య విగ్రహాలను నీళ్లల్లో నిమజ్జనం చేయడం వల్ల.. వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. అలానే వానాకాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా.. ఆయన పూజకు వాడిన ఆకులను కూడా నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు పరిశుభ్రంగా మారుతుందని చెబుతున్నారు. మట్టి గణపతి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న రహస్యం. -
ఆ ఘనత ముహమ్మద్ ప్రవక్తకే దక్కింది, మానవాళికి ఆదర్శమయ్యారు
మానవుల మార్గదర్శనం కోసం అల్లాహ్ అన్ని కాలాల్లో, అన్నిజాతుల్లో తన ప్రవక్తలను ప్రభవింప జేశాడు. గ్రంథాలనూ అవతరింప జేశాడు. హజ్రత్ ఆదం (అ) మొదలు, ముహమ్మద్ ప్రవక్త (స) వరకు అనేక మంది సందేశహరులు భూమండలంపై జన్మించారు. వారిలో చిట్టచివరి దైవప్రవక్త ముహమ్మద్ (స). ఆయనపై అవతరించిన చివరి గ్రంథం పవిత్ర ఖురాన్ . ఇక ప్రళయకాలం వరకూ ప్రవక్తలూ రారు, గ్రంథాలూ అవతరించవు. కనుక మానవులు ప్రళయకాలం వరకు ఆయనను అనుసరించవలసిందే. ముహమ్మద్ ప్రవక్త తనంత తాను ఏమీ బోధించలేదు. మానవుల సంక్షేమం కోసం, సాఫల్యం కోసం దైవం అవతరింపజేసిన హితోపదేశాలనే ఆయన మానవాళికి అందజేశారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో, వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏది హితమో, ఏది హితం కాదో ఆచరణాత్మకంగా ఆయన విశద పరిచారు. అందుకే ఆయన ప్రపంచ మానవాళికి సంపూర్ణ మార్గదర్శిగా పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని పవిత్ర జీవనానికి సంబంధించిన కొంత సమాచారాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. దాదాపు 1450 సంవత్సరాల క్రితం అరేబియా దేశంలోని మక్కానగరంలో ముహమ్మద్ ప్రవక్త (స) జన్మించారు. ఆమినా, అబ్దుల్లాహ్ తల్లిదండ్రులు. పుట్టకముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. తాతయ్య ఆయన్ని పెంచారు. చిన్నతనం నుంచే అనేక సుగుణాలను పుణికి పుచ్చుకున్న ముహమ్మద్ ప్రవక్త, ‘అమీన్’గా, ‘సాదిఖ్’గా వినుతికెక్కారు. ఆయన గొప్ప మానవతావాది. సంస్కరణాశీలి. ఉద్యమనేత. అతి సాధారణ జీవితం గడిపిన సామ్రాజ్యాధినేత. జ్ఞానకిరణాలు ప్రసరింపజేసిన విప్లవజ్యోతి. ప్రాణశత్రువును సైతం క్షమించిన కారుణ్య కెరటం. సుమారు వెయ్యిన్నర సంవత్సరాలంటే.. ఆ సమాజం ఎంత అనాగరికంగా ఉండేదో నేటి ఆధునికులకు తెలియనిదేం కాదు. ప్రవక్త జననానికి ముందు నాటి సమాజంలో ‘కర్రగలవాడిదే బర్రె’ అన్నట్లుగా బలవంతుడు బలహీనుణ్ణి పీక్కుతినేవాడు. స్త్రీల హక్కుల విషయం కాదుగదా అసలు వారికంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న విషయాన్నే వారు అంగీకరించే వారు కాదు. స్త్రీని విలాస వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు. అలాంటి జాతిని అన్ని విధాలా సంస్కరించి, వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దిన ఘనత ముహమ్మద్ ప్రవక్తకే దక్కింది. నాటి సమాజంలో లేని దుర్మార్గమంటూ లేదు. అలాంటి ఆటవిక సమాజాన్ని నిరక్షరాస్యులు అయిన ముహమ్మద్ ప్రవక్త సమూలంగా సంస్కరించి, ఒక సత్సమాజంగా ఆవిష్కరించారు. ప్రవక్త బోధనల ప్రకారం... మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ఆయనకు మాత్రమే భయపడాలి. తోటిమానవుల్ని, సమాజాన్ని ప్రేమించాలి. స్త్రీలను గౌరవించాలి. ఎలాంటి స్థితిలోనూ నీతినీ, న్యాయాన్ని విస్మరించకూడదు. అనాథలను, వృద్ధులను ఆదరించాలి. తల్లిదండ్రులను సేవించాలి. వారిపట్ల విధేయత కలిగి ఉండాలి. బంధువులు, బాటసారులు, వితంతువులు, నిస్సహాయుల పట్ల తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. సంఘంలో ఒక మనిషికి మరో మనిషిపై పడే విధ్యుక్త ధర్మాల పట్ల ఉపేక్ష వహించకూడదు. అన్యాయం, అధర్మ సంపాదనకు ఒడికట్టవద్దు. ధనాన్ని దుబారా చేయవద్దు. వ్యభిచారం దరిదాపులకు పోవద్దు. దానికై పురిగొలిపే అన్నిరకాల ప్రసార ప్రచార సాధనాలను రూపుమాపాలి. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపవద్దు. ప్రజల ధన, మాన, ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిని సాధించలేదు. సదా సత్యమే మాట్లాడాలి. చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి. వాగ్దాన భంగానికి పాల్పడకూడదు. పలికే ప్రతి మాటకూ, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. వ్యాపార లావాదేవీల్లో, ఇచ్చి పుచ్చుకోవడాల్లో లెక్కాపత్రాలు, కొలతలు, తూనికలు చాలా ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలి. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలి. తోటి మానవ సోదరులను తమకన్నా తక్కువగా చూడకూడదు. స్త్రీ జాతిని గౌరవించాలి. ఆమె మీకు జన్మనిచ్చిన తల్లి. ఆత్మీయత కురిపించే చెల్లి. ప్రేమించే ఇల్లాలు. అమ్మ పాదాల చెంత స్వర్గం ఉంది. వితంతువుల్ని చిన్నచూపు చూడకూడదు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలి. శుభకార్యాల్లో వారినీ ఆహ్వానించాలి. వితంతువుల పునర్వివాహం వారి హక్కు. అజ్ఞానకాలపు దురాచారాలు, దుర్మార్గాలన్నింటినీ నేను అంతం చేస్తున్నాను. ఒక మనిషికి మరో మనిషిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మానవులంతా ఒక్కటే. విద్యార్జన స్త్రీలు, పురుషులు అందరి విధి. జ్ఞానం జీవితం.. అజ్ఞానం మరణం. కళ్ళున్న వాళ్ళు, గుడ్డివాళ్ళు సమానం కానట్లే, జ్ఞాన సంపన్నులు, జ్ఞాన విహీనులు సమానం కాలేరు. ప్రతి తల్లీదండ్రీ తమ సంతానానికి విద్య నేర్పాలి. భావితరాల సంక్షేమానికి ఇది చాలా అవసరం. అధికార దుర్వినియోగం చేయకూడదు. పరిపాలన అంటే కేవలం ప్రజాసేవ మాత్రమే... పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని భావించాలి. ప్రతినిత్యం ప్రజలకు జవాబుదారుగా దైవానికి భయపడుతూ జీవించాలి. ఇక్కడ మనం పలికే ప్రతి మాటకు, చేసే ప్రతిపనికీ రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవాలన్న భావన కలిగి ఉండాలి. ఇలాంటి భావనలే మానవులను మంచివారుగా, నిజాయితీ పరులుగా, సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. ఇటువంటి బాధ్యతాభావాన్ని, జవాబుదారీ తనాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ప్రజల మనసుల్లో నూరిపోసి, మానవీయ విలువలతో తులతూగే ఓ చక్కని సత్సమాజాన్ని ఆవిష్కరించారు. అందుకే ఆయన మానవాళికి ఆదర్శమయ్యారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మహాభారతంలోని ఖాండవవనం దహనం గురించి మీకు తెలుసా?
ఒకసారి వేసవిలో చల్లగా ఉంటుందని కృష్ణార్జునులు సపరివారంగా అరణ్యప్రాంతానికి వెళ్లారు. కొన్నాళ్లు అక్కడే గడిపేందుకు వీలుగా విడిది ఏర్పాటు చేసుకున్నారు. ఒకరోజు కృష్ణార్జునులు వనవిహారం చేస్తుండగా, ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. వారు అతడికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి, సత్కరించారు. కుశల ప్రశ్నలయ్యాక ఏం కావాలని ప్రశ్నించారు.‘అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది. భోజనం పెట్టించగలరా?’ అని అడిగాడు.‘విప్రోత్తమా! మీకు ఏమేమి ఇష్టమో చెప్పండి. వండించి పెడతాం’ అన్నారు కృష్ణార్జునులు. అప్పుడా బ్రాహ్మణుడు తన నిజరూపంలో అగ్నిదేవుడిగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘నేను అగ్నిదేవుడిని. ఔషధమూలికలు పుష్కలంగా ఉన్న ఖాండవవనాన్ని నేను దహించాలి. అప్పుడు గాని నా అజీర్తిబాధకు ఉపశమనం కలగదు. అయితే, నేను ఖండవవనాన్ని దహించకుండా దేవేంద్రుడు ఆటంకం కలిగిస్తున్నాడు. మీరిద్దరూ తోడుంటే, ఖాండవాన్ని దహించివేస్తాను’ అన్నాడు.‘స్వామీ! అమితశక్తిమంతులు మీరు. మీకు అజీర్తిబాధ కలగడమా? ఆశ్చర్యంగా ఉందే!’ అన్నాడు అర్జునుడు.‘చాలాకాలం కిందట శ్వేతకి అనే రాజర్షి వందేళ్ల సత్రయాగం చేయ సంకల్పించాడు. అన్నేళ్లు ఏకధాటిగా రుత్విక్కుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అతడు ఈశ్వరుని కోసం తపస్సు చేసి, ఆయనను మెప్పించాడు. శ్వేతకి తన సంకల్పం చెప్పడంతో ఈశ్వరుడు దుర్వాస మహర్షిని అతడికి యాజ్ఞికుడిగా నియమించాడు. దుర్వాసుడి ఆధ్వర్యంలో శ్వేతకి నిరాఘాటంగా వందేళ్లు సత్రయాగం చేశాడు. యజ్ఞగుండంలో విడిచిన నేతిధారలను నేను అన్నేళ్లూ ఆరగించాను. అందువల్ల నాకు అజీర్తి పట్టుకుంది. నివారణ కోసం బ్రహ్మ వద్దకు వెళితే, ఖాండవవనంలో పుష్కలంగా ఔషధ మూలికలు ఉన్నాయి. వాటిని ఆరగిస్తే, అజీర్తి నయమవుతుందని సెలవిచ్చాడు. ఖాండవ దహనానికి నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఇంద్రుడు అడ్డుకుంటూ వస్తున్నాడు’ అని అగ్నిదేవుడు గోడు వెళ్లబోసుకున్నాడు. ‘దేవా! నీకు మేము సహాయం చేయగలం గాని, ఇప్పుడు మా వద్ద ఆయుధాలేవీ లేవు’ అన్నాడు అర్జునుడు. ‘మీకా చింత వద్దు’ అంటూ అగ్నిదేవుడు వెంటనే వరుణ దేవుడిని పిలిచాడు. వరుణుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.‘వరుణదేవా! నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ధనుర్బాణాలను, రథాన్ని అర్జునుడికి ఇవ్వు. చక్రాన్ని, గదను కృష్ణుడికి ఇవ్వు’ అన్నాడు.వరుణుడు సరేనంటూ, కృష్ణార్జునులకు ఆయుధాలను, రథాన్ని ఇచ్చాడు. కృష్ణార్జునులను తనకు తోడుగా తీసుకువెళ్లి, అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించడం మొదలుబెట్టాడు. కృష్ణార్జునులు ఇరువైపులా అగ్నిదేవుడికి రక్షణగా నిలిచారు. అడ్డు వచ్చిన వనరక్షకులను సంహరించారు. అడవిలోని పశుపక్ష్యాదులన్నీ అగ్నిజ్వాలలకు ఆహుతి కాసాగాయి.ఇంద్రుడికి ఈ సంగతి తెలిసి, ఖాండవవనం మీద కుంభవృష్టి కురవాలంటూ మేఘాల దండును పంపాడు. ఖాండవంపై మేఘాలు కమ్ముకోగానే, అర్జునుడు తన బాణాలతో ఖాండవ వనమంతా కప్పేస్తూ పైకప్పును నిర్మించాడు.మేఘాలు కుంభవృష్టి కురిసినా, ఖాండవంపై చినుకైనాకురవలేదు. అగ్నిదేవుడికి ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు.అగ్నికీలల నుంచి రక్షించుకోవడానికి తక్షకుడి కొడుకైన అశ్వసేనుడు తల్లి తోకను పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. అర్జునుడు అశ్వసేనుడిని బాణాలతో కొట్టాడు. అది చూసి ఇంద్రుడు అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడిపై మోహినీ మాయ ప్రయోగించి, అశ్వసేనుడిని, అతడి తల్లిని కాపాడాడు. నిమిషంలోనే తేరుకున్న అర్జునుడు వెంటనే ఇంద్రుడిపై తిరగబడ్డాడు. చాలాసేపు యుద్ధం సాగింది. తనను తాను కాపాడుకోవడానికి ఇంద్రుడు యుద్ధం కొనసాగిస్తూ ఉండగా, ‘దేవేంద్రా! వీరిద్దరూ నరనారాయణులు. వీరిని జయించడం నీకు అసాధ్యం.తక్షకుడు తప్పించుకుని కురుక్షేత్రానికి పారిపోయాడు’ అని అశరీరవాణి పలికింది. చేసేదేమీ లేక ఇంద్రుడు తిరిగి స్వర్గానికి బయలుదేరాడు. ఖాండవదహనం సాగుతుండగా, సముచి అనే రాక్షసుడి కొడుకైన మయుడు అర్జునుడిని శరణుజొచ్చి ప్రాణాలను దక్కించుకున్నాడు. మయుడితో పాటు అతడి తల్లి, మందపాలుడు, అతడి కొడుకులైన నలుగురు శారఙ్గకులు కూడా ప్రాణాలు దక్కించుకున్నారు.అగ్నిదేవుడు పదిహేను రోజుల పాటు ఖాండవవనాన్ని సమూలంగా దహించి, తన ఆకలి తీర్చుకున్నాడు. అగ్నిదేవుడి అజీర్తిబాధ నయమైంది. తనకు సహకరించిన కృష్ణార్జునులకు కృతజ్ఞతలు తెలిపి తన దారిన వెళ్లిపోయాడు. -
నారదుడు విష్ణుమూర్తిని ఎందుకు శపించాడు?స్వయంవరంలో ఏం జరిగింది?
నారదుడు ఒకసారి హిమాలయాలకు చేరుకుని తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి నారదుడి ఘోరతపస్సు కొనసాగుతుండటంతో ఇంద్రుడికి భయంవేసి, నారదుడి తపస్సును ఎలాగైనా భంగం చేయాలనే ఆలోచనతో రంభ మేనక ఊర్వశి తదితర అప్సరసలందరినీ పంపాడు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు. కొన్నాళ్లు తపస్సు చేశాక, తన తపస్సు సిద్ధి పొందినట్లు అనిపించి, తపస్సును విరమించుకున్నాడు నారదుడు. బ్రహ్మ వద్దకు వెళ్లి, తన తపస్సు సిద్ధించిందని చెప్పి, అక్కడి నుంచి కైలాసానికి వెళ్లాడు. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘నా తపస్సు సిద్ధించింది. ఇక శివమాయ నన్నేమీ చేయలేదు’ అన్నాడు. ‘నాయనా! శివమాయను నేనే ఇంకా తెలుసుకోలేదు. కాస్త జాగ్రత్తగా ఉండు’ అని హెచ్చరించాడు శివుడు.శివుడి హెచ్చరికను లక్ష్యపెట్టకుండా, నారదుడు వైకుంఠానికి వెళ్లాడు. లక్ష్మీ సమేతుడైన విష్ణువుకు నమస్కరించి, ‘లక్ష్మీ జనార్దనులారా! నేను తపస్సిద్ధి పొందాను. నన్ను శివమాయ, విష్ణుమాయ ఏమీ చేయలేవు’ అన్నాడు.‘నారదా! మాయ ప్రకృతి నుంచి పుట్టింది. అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉంది. దానిని జయించడం ఎవరి వల్లా కాదు’ అని హెచ్చరించాడు విష్ణువు. నారదుడు విష్ణువు వద్ద సెలవు తీసుకుని, లోకసంచారానికి బయలుదేరాడు. కళ్యాణదుర్గం అనే నగరానికి చేరుకున్నాడు. నగరంలో ఏదో వేడుక జరుగుతున్నట్లుగా కోలాహలంగా ఉంది. ‘ఏమిటి విశేషం? ఈ సందడంతా దేనికి?’ అని తనకు తారసపడిన పురప్రజలను అడిగాడు నారదుడు. ‘రేపే మహారాజు కుమార్తె స్వయంవరం. అందుకే ఈ సందడి’ చెప్పారు వాళ్లు. నారదుడు నేరుగా రాజప్రాసాదానికి వెళ్లాడు. రాజు ఎదురేగి, నారదుడిని స్వాగత సత్కారాలు జరిపి, ఉన్నతాసనంపై ఆసీనుణ్ణి చేశాడు. పరిచారికలను పంపి, తన కుమార్తెను పిలిపించాడు. ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు. ‘మహర్షీ! ఈమె నా కుమార్తె రమాలక్ష్మి. రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను. మహావిష్ణువును తప్ప మరెవరినీ వరించనంటోంది’ అని చెప్పాడు. రాకుమార్తెను చూడగానే, నారదుడికి మాయ ఆవరించింది. ‘రాజా! నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి. నీ వంశం తరిస్తుంది’ అన్నాడు. ‘మునీశ్వరా! స్వయంవరంలో కన్య అభీష్టమే ప్రధానం కదా! రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి. మిమ్మల్నే కోరుకుంటుందేమో చూడండి’ అన్నాడు. ‘తప్పకుండా వస్తాను’ అని చెప్పి, నారదుడు తిన్నగా వైకుంఠానికి వెళ్లాడు. ‘రేపు కళ్యాణదుర్గ నగరంలో రాకుమార్తెకు స్వయంవరం జరగనుంది. ఆమె విష్ణువునే పెళ్లాడుతానంటోంది. నీ రూపు నాకు అనుగ్రహించావంటే, స్వయంవరంలో ఆమె నన్నే వరించగలదు’ అని విష్ణువుతో అన్నాడు. ‘నారదా! నువ్వు శివమాయలో పడ్డావు. కోరిక వదులుకుంటే గాని నీకు శాంతి దక్కదు. అయినా నీ కోరిక మేరకు రేపు నీకు నా రూపాన్ని అనుగ్రహిస్తున్నాను’ అన్నాడు విష్ణువు.నారదుడికి కోపం వచ్చింది. ‘శివమాయ, విష్ణుమాయ నన్నేమీ చేయలేవు’ అంటూ విసవిసా వెళ్లిపోయాడు. మర్నాడు స్వయంవరానికి వెళ్లాడు. ఎందరో రాజకుమారులు అక్కడికి అప్పటికే వచ్చి ఉన్నారు. రాకుమార్తె రమాలక్ష్మి వరమాలతో ఒక్కొక్కరినే పరికిస్తూ ముందుకు సాగుతోంది.సభా మధ్యంలోకి వచ్చేసరికి సమ్మోహనాకారంతో వెలిగిపోతున్న మహావిష్ణువు కనిపించాడు. ఆమె వరమాలను అతడి మెడలోనే వేసింది. మరుక్షణంలోనే రాకుమార్తెను గరుత్మంతునిపై ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. సభాసదులంతా నిశ్చేష్టులయ్యారు. ‘రాకుమార్త ఏదీ?’ అని నారదుడు అడుగుతుంటే, సభాసదులంతా అతణ్ణి చూసి గొల్లున నవ్వసాగారు. ‘ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు’ ఉక్రోషంగా అడిగాడు నారదుడు. ‘నీ శరీరం విష్ణవులాగా ఉన్నా, ముఖం కోతిలాగ, భల్లూకంలాగ ఉంది’ అన్నారు.ఆగ్రహించిన నారదుడు హుటాహుటిన వైకుంఠానికి వెళ్లి విష్ణువుపై నిప్పులు చెరిగాడు.‘నువ్వు నన్ను మోసం చేశావు. నా ముఖాన్ని కోతిలాగ, భల్లూకంలాగ చేశావు గనుక నువ్వు కూడా కోతులను, భల్లూకాలను ఆశ్రయిస్తావు’ అని శపించాడు.‘నిన్ను నేను మోసం చేయలేదు. శివమాయలో చిక్కుకుని నువ్వే మోసపోయావు’ అన్నాడు విష్ణువు. తన దురుసుతనానికి చింతించిన నారదుడు విష్ణువును క్షమాపణ వేడుకుని లోక సంచారానికి బయలుదేరాడు. ∙సాంఖ్యాయన -
సింగపూర్ లో శాస్త్రోక్తంగా ఏకాదశ రుద్రాభిషేకం
లోకాసమస్త సుఖినో భవంతు అన్న మహా సత్సంకల్పంతో మన ఋషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సాంప్రదాయ, అనుష్ఠానాలని కొనసాగించాలన్న ముఖ్య ఉద్దేశం తో సింగపూర్ లో నివసించే కొంతమంది తెలుగు బ్రాహ్మణులు ఒక సమూహంగా ఏర్పడి, ధర్మ నిరతి, ధర్మ అనుష్టానం కొరకు 2014 నుంచి అనేక కార్యక్రమాలు (నిత్యసంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం) నిర్వహిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో 16 Sept 2023 (భాద్రపద శుద్ధ పాడ్యమి నాడు) జరిగిన ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. దాదాపు 40 మందికి పైగా రుత్వికులు పాల్గొన్న ఈ కార్యక్రమములో సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు బ్రాహ్మణలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, సౌందర్య లహరి, లింగాష్టక పఠనం, హారతి గానంతో అందరిని మంత్రముగ్దులను చేసారు. కార్యక్రమమునకు విచ్చేసిన మహిళలు అందరు చక్కని సమన్వయంతో తీర్ధ ప్రాసాదాలను, చక్కటి తెలుగు సాంప్రదాయ ప్రసాద విందుని ఏర్పటు చేసారు. (చదవండి: కొలంబియా వర్సిటీలో ఏపీ విద్యార్థుల ప్రసంగం) -
రంగులు మార్చుకునే వినాయకుడు..మీరెప్పుడు చూసుండరు!
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువుతీరాడు పార్వతీ తనయుడు. రాజ్య రక్షకుడు: రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్‌కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్‌కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు. ఒక రోజు రాత్రి అతను నిద్రపోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరిపోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసిపోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు. ఇదీ విశిష్టత: ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ప్రార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఎక్కడ? రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్‌లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్‌కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్‌కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్‌లో ఉంది. రంగులు మార్చే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ తమిళనాడు రాష్ట్రంలోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయమే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా... ప్రాశస్త్యం మాత్రం చాలా పెద్దది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. మార్చి నుంచి జూన్ వరకూ నల్లని రంగులో ఉండే ఈ వినాయకుడు జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.. నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడి వినాయకుడు తన రంగును మార్చుకు న్నట్లే.. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు. ఇక చారిత్రక విషయాల కొస్తే... ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది ‘శివాలయం’. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని అంటారు. ఈ ఆలయానికో చరిత్ర కూడా ఉంది. ఆ రోజులలో ‘కేరళపురం’ రాజుగారు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ వెళ్లాడట. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..‘దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం’ అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ, మరొక ‘మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతనమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. దొడ్డ గణపతి ఆలయం, బెంగళూరు బెంగళూరులోని బసవన గుడి బుల్ ఆలయం పక్కనే ఉంది ఈ ఆలయం. దేవాలయంలోని గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని పిలుస్తుంటారు.విశేషం ఏమిటంటే ... ఆలయం కుడివైపు క్రమంగా పెరగటం. భక్తులు ఇది దేవుని మహిమగా చెబుతారు. బెంగళూరు నుంచే కాక రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి, తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు. స్వామి వారి అలంకరణ: వారంలో అన్ని రోజులలో స్వామి వారికి పూజలు చేసి రకరకాల అలంకరణ చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఈ అలంకరణ లో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించటం. దీన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అని భక్తులు చెప్పుకొంటారు. ఇది చూస్తే జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు ఈ భారీ గణేషుని శరీరానికి వెన్న పట్టించటానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరం అవుతుంది. ఆలయ వెనక శ్రీ శివ శక్తి బేడర కన్నప్ప, శ్రీ కానేశ్వర, శివాలయాలు ఉన్నాయి. ఆలయ సందర్శన సమయం దొడ్డ గణేశ దేవాలయంలో స్వామి దర్శనం ఉదయం ఏడు నుంచి పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం అయిదున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది. వినాయక చవితి నుంచి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. బెంగళూరు లో వాయు, రోడ్డు, విమాన సౌకర్యాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉంది. అలాగే రెండు రైల్వే స్టేషన్ లు – బెంగళూరు సిటీ, యశ్వంతపుర ఉన్నాయి ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు, విమానాలు వస్తుంటాయి. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బెంగళూరు కు బస్సు సౌకర్యం ఉంది. తెలుగు రాష్ట్రాలలో సిద్ధివినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం దీనికి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయతలతో ఈ ఆలయం అలలారుతోంది. ఉమాసుతుడు ఇక్కడ సిద్ధి వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతల ఆలయాలూ ఉన్నాయి. స్థల పురాణం కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం చెబుతోంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామం లో చేసిన దక్షయజ్ఞానికి ముందు ఇక్కడి వినాయకుని పూజించి పునీతుడయ్యాడని ప్రతీతి. వ్యాస మహర్షి దక్షణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. క్షేత్ర ప్రత్యేకత అయినవిల్లి ఆలయ ప్రస్తావన క్రీ.శ 14వ శతాబ్ధంలో శంకరభట్టు రచించిన శ్రీపాదవల్లభ చరిత్రలో ఉంది. శ్రీపాదవల్లభుల మాతామహులు అయినవిల్లిలో స్వర్ణ గణపతి యజ్ఞం చేసినట్లు.. యజ్ఞం ముగింపులో గణనాథుడు సర్ణమయకాంతులతో దర్శనమిచ్చి హారతులను స్వయంగా అందుకున్నట్లు అందులో పేర్కొన్నారు. శ్రీపాద వల్లభుని జననాన్ని తెలియజేశారని చెబుతారు. దక్షిణాభిముఖంగా దర్శనం..సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్ తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై భక్తకోటికి అభయమిస్తున్నాడు. అలాగే దక్షిణ సింహద్వారం ఉన్న గృహాలకు ఎలాంటి విఘ్నాలు కలగవని అయినవిల్లివాసుల నమ్మకం. వివిధ ఉత్సవాలు.. ఇక్కడి సిద్ధి వినాయకుని మూలవిరాట్ అత్యంత ప్రాచీనమైంది. రోజూ స్వామికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేక సేవకు ఈ ఆలయంలో విశేష ప్రాముఖ్యం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు పాంచాహ్నిక దీక్షతో అయిదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్ణిమనాడు కల్యాణం.. గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతి, కనుమనాడు ప్రభల ఉత్సవం చేస్తారు. విజయదశమి, కార్తీకమాసం మొదటి, నాలుగు సోమవారాలు, కృష్ణాష్టమినాడు ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఏటా మాఘ మాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండగలో భాగంగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు. లక్ష కలములను సిద్ది వినాయకుని పాదాల వద్ద ఉంచి... లక్ష దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు, చదువులో రాణిస్తారని భక్తుల విశ్వాసం. వివిధ ఆలయాలు... అయినవిల్లి క్షేత్రంలో గణపతి ఆలయంతో పాటు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరాలయం, శ్రీదేవీ, భూదేవీ సమేత కేశవస్వామి ఆలయం, కాలభైరవ ఆలయాలు ఉన్నాయి. ఇలా చేరుకోవాలి... రాజమహేంద్రవరం నుంచి అయినవిల్లికి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం నుంచి బస్సు, ఆటోలో దేవాలయాన్ని చేరుకోవచ్చు. కాకినాడ నుంచి యానాం, అమలాపురం, ముక్తేశ్వరం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు. ఇతర సమాచారం.. దేవాలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 8గంటల వరకు తెరిచి ఉంటుంది. అభిషేకం ఉదయం 7 గం.ల నుంచి 11 గం. వరకు జరుగుతుంది. (సాధారణ రోజుల్లో) – డి.వి.రామ్ భాస్కర్ -
మహారాష్ట్రలోని అష్టగణపతి ఆలయాల గురించి మీకు తెలుసా?
గణపతి ఉపాసనకు మహారాష్ట్ర పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో గణపతి క్షేత్రాలు కోకొల్లలు. వాటన్నిటిలోకి అష్టగణపతి క్షేత్రాలుగా ప్రాముఖ్యం సంతరించుకున్న ఎనిమిది క్షేత్రాలు గణాధిపత్యులకు ముఖ్యమైనవి. ఈ ఎనిమిదీ ‘అష్టగణపతి క్షేత్రాలు‘గా ప్రసిద్ధికెక్కాయి. 1. మయూరేశ్వర గణపతి – పూనా జిల్లాలో పూనా నుండి నలభై మైళ్ళ దూరంలో నున్న ’మోరగావ్’లో మయూరేశ్వర గణపతి ఆలయం ఉంది. 2. చింతామణి గణపతి – పూనా నుండి పధ్నాలుగు మైళ్ళదూరంలో నున్న ’థేపూర్’ చింతామణి గణపతి క్షేత్రం. 3. గిరిజాత్మజ గణపతి – పూనా నుండి అరవై మైళ్ళదూరంలో నున్న ’లేహ్యాద్రి’ అనే స్థలంలో గిరిజాత్మజ గణపతి క్షేత్రం వెలిసింది. 4. శ్రీ విఘ్నేశ్వర గణపతి – లేహ్యాద్రి సమీపంలోనే ’ఓఝల్’ స్థలంలో ’శ్రీవిఘ్నేశ్వర’ క్షేత్రం వెలిసింది. 5. మహోత్కట గణపతి – పునానుండి 32 మైళ్ళ దూరంలో ’’రాజన్గావ్’’లో మహోత్కట గణపతి ఆలయం ఉంది. 6. భల్లాలేశ్వర గణపతి – మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో ’పాలీ’ అనేచోట భల్లాలేశ్వర గణపతి క్షేత్రం ఉంది. 7. వరదవినాయకుడు – కులాబా జిల్లాలో ’’మహర్’’ అనే స్థలంలో ’’వరదవినాయక’’ ఆలయం ఉంది. 8. సిద్ధివినాయకుడు – అహ్మద్ నగర్ జిల్లాలో ’’సిద్ధటేక్’’ అనే స్థలంలో సిద్ధివినాయక క్షేత్రం వెలిసింది...!! -
గణపతి నవరాత్రులు..ఇలా పూజిస్తే విజయమే కాదు ధనం కూడా
మన భారతీయ సంప్రదాయం ముఖ్యంగా మూడు నవరాత్రుల పండుగలను చెప్పింది. 1) వసంత నవరాత్రులు, 2) గణపతి నవరాత్రులు, 3) దేవీ నవరాత్రులు. వినాయక నవరాత్రులనకుండా గణపతి నవరాత్రులనటంలోనే గణపతి వైభవం మనకు స్పష్టంగా అర్థమౌతున్నది. వేదం కూడా వినాయకుణ్ణి గణపతిగానే కీర్తించింది. ఏ శుభకార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ‘‘ఓమ్ గణానాం త్వా గణపతిగ్ం హవామహే‘‘ అనే వేదమంత్రంతోనే వినాయక పూజ ప్రారంభిస్తారు, గణపతులు మహాగణపతి, వాతాపిగణపతి, విద్యాగణపతి, విజయగణపతి, నృత్యగణపతి, సంగీత గణపతి, ఉచ్ఛిష్ట గణపతి ఇలా చాలా రకాలుగా ఉన్నారు. అందరికీ అవసరమైన వానినందిస్తూ అందరిచేత పూజలందుకొనే వాడు లక్ష్మీగణపతి. ఈనాడు చదువులు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, ఆరాధనలు, అన్నదానాలు అన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల లక్ష్మీగణపతిని ఆరాధిస్తే విద్యా, విజయం, ధనం అన్నీ కైవసం అవుతాయి. ఈ లక్ష్మీగణపతి వృత్తాంతం గణేశ జననం అనే పేరుతో బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో పూర్వాపరాలతో చాలా వివరంగా ఉంది.పార్వతీ పరమేశ్వరులు ఏర్పాటు చేసిన ఒక ఉత్సవంలో దేవతలందరితో పాటుగా హాజరైన లక్ష్మీదేవి ఆ సందర్భంలో గణేశుని ఉద్దేశించి మమ స్థితిశ్చ, దేహే తే గేహే భవతు శాశ్వతీ! (నీ శరీరంలో, నీవు ఉన్న ఇంటిలో శాశ్వతంగా నా స్థితి ఉంటుంది. అంటే నేను నివసిస్తాను) అని లక్ష్మీదేవి ప్రత్యేకంగా చెప్పినందువల్ల ఈ స్వామి లక్ష్మీగణపతి అయినాడు. వైభవం అంటే విశేషమైన పుట్టుక. ఆ పుట్టుక ఈ లక్ష్మీ గణపతిది. శ్రీకృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్ననివారకమ్ ‘ పార్వతీశ్వరయోః పుత్రం లక్ష్మీగణపతిం భజే ‘‘ అనే ఈ శ్లోకాన్ని జపిస్తూ లక్ష్మీగణపతి స్వామిని ఆరాధిస్తే అఖండంగా ఆయుర్లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి కలుగుతాయి. ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆలయాలు బెంగళూరులోను, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో రత్నగిరి నగర్, పలకలూరి పంచాయతీలో లక్ష్మీగణపతి ఆలయం ఉన్నది. అక్కడి స్వామి ఎడమ వైపున ఒడిలో లక్ష్మీ అమ్మవారిని కూర్చుండపెట్టుకొని దశ భుజుడై దర్శనమిస్తాడు. అష్టలక్ష్ములకు సంకేతంగా ఎనిమిది చేతులతో ఎనిమిది విధాలైన ఆయుధాలను ధరించి ఒక చేతిలో అభయ ముద్రతో, మరొక చేతితో అమ్మవారిని ధరించి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యే వినాయకచవితి రోజున లక్ష్మీగణపతి స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిద్దాం మనతో పాటు దేశ సౌభాగ్యాన్ని కూడా పొందుదాం. -
ముక్కోటి దేవుళ్ళలో వినాయకుడికే మొదటి పూజ ఎందుకు? గణాధిపత్యం ఎలా దక్కింది?
కుమారస్వామి అప్పటికే దేవసేనాధిపతిగా ఉన్నాడు. అందువల్ల వినాయకుడికి ప్రమథ గణాధిపత్యం ఇవ్వాలనుకున్నాడు శివుడు.‘నువ్వు నా ప్రమథగణాలకు నాయకుడిగా ఉండు’ అని వినాయకుడితో అన్నాడు శివుడు.‘తండ్రీ! నాయకుడిగా ఉండమంటే సరా? అర్హత నిరూపించుకోనిదే నాయకత్వం స్వీకరించడం ఏమంత సమంజసం? తమ్ముడు ఇప్పటికే దేవసేనాధిపతిగా సేనానాయకత్వంలో ఆరితేరి ఉన్నాడు. అతడికే గణాధిపత్యం కట్టబెడితే బాగుంటుంది’ అన్నాడు వినాయకుడు.‘ఇప్పటికే నీ తమ్ముడు దేవసేనాధిపతిగా ఉన్నాడు గనుకనే నిన్ను ప్రమథగణాలకు నాయకత్వం వహించమంటున్నాను. ఒక్కడే రెండు బాధ్యతలు నిర్వహించడం అతడికి భారంగా మారవచ్చు’ అన్నాడు శివుడు.‘తండ్రీ! అయితే, ఏదైనా పరీక్షపెట్టి, నెగ్గినవారికి నాయకత్వం అప్పగించడం న్యాయంగా ఉంటుంది’ అన్నాడు వినాయకుడు. దేవతలు, ప్రమథులు కలసి వినాయకుడికి, కుమారస్వామికి ఒక పందెం పెట్టారు. ముల్లోకాల్లోని తీర్థ క్షేత్రాలను సేవించి ముందుగా ఎవరు కైలాసానికి చేరుకుంటారో వారికే గణాధిపత్యం అప్పగించాలని తీర్మానించారు.కుమారస్వామి తన మయూరవాహనంపై రివ్వుమని ఎగురుతూ బయలుదేరాడు.వినాయకుడు ఎక్కడికీ కదలకుండా, ఉన్నచోటనే చతికిలబడి కూర్చుండిపోయాడు.అప్పుడు విష్ణువు అతణ్ణి ఏకాంతంలోకి తీసుకుపోయి, ‘నాయనా! మేమంతా నిన్ను అభిమానిస్తున్న వాళ్లం. నీ ఓటమి మా ఓటమి అవుతుంది. నువ్వెక్కడికీ తిరగనక్కర్లేదు. నేను చెప్పినట్లు చేస్తే చాలు’ అని చెప్పాడు.విష్ణువు సలహాతో వినాయకుడు ఉన్నచోటనే మఠం వేసుకు కూర్చుని, శివపంచాక్షరి మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు.కుమారస్వామి వెళ్లిన ప్రతి తీర్థంలోనూ, క్షేత్రంలోనూ వినాయకుడు అతడికి తిరుగుముఖం పడుతూ ఎదురవుతూ వచ్చాడు. ఆశ్చర్యపోతూనే ముల్లోకాల్లోని తీర్థ క్షేత్రాలను కుమారస్వామి సేవించుకున్నాడు. కైలాసానికి తిరిగివస్తూనే, ‘తండ్రీ! ఈ పందెంలో నేను ఓడిపోయాను. అన్నదే గెలుపు. నీవనుకున్నట్లు అతడికే గణాధిపత్యాన్ని అప్పగించు’ అన్నాడు. కుమారస్వామి కైలాసంలో కొలువుదీరిన దేవతలు, మునులు, ప్రమథగణాల మధ్యకు వచ్చి, ‘పందెంలో మా అన్న వినాయకుడే గెలిచాడు. అతడికి సత్వరమే గణాధిపత్య పట్టాభిషేకం జరగాలి. శివుని ఆజ్ఞ అందరికీ శిరోధార్యం’ అని చెప్పాడు. కుమారస్వామి ప్రకటనతో దేవతలందరూ హర్షం వెలిబుచ్చారు. అయితే, ప్రమథగణ ప్రముఖులలో శృంగీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, నందీశ్వరులు మాత్రం దీనిని వ్యతిరేకించారు.అదివరకు వినాయకుడు పుత్రగణపతి రూపంలో వారికి గర్వభంగం చేశాడు. ఆ అక్కసుతోనే వారు వినాయకుడికి గణాధిపత్యం కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, ‘మొదటి నుంచి మేము శివుడికి నమ్మినబంట్లుగా ఉంటున్నాం. అలాంటిది వినాయకుడు మాకు ఎలా అధిపతి అవుతాడు? అతడికి తనదంటూ ఎలాంటి బలగమూ లేదు. అతడికి గణాధిపత్య అభిషేకమేమిటి?’ అంటూ నానా మాటలూ అన్నారు.ప్రమథుల కలకలం విన్న శివుడు అక్కడకు చేరుకున్నాడు. వారి మాటలు విని కళ్లెర్రజేశాడు. ‘నా నిర్ణయానికే ఎదురాడేటంత గొప్పవారైపోయారా మీరు?’ అంటూ ఆగ్రహోదగ్రుడయ్యాడు.ఇంత జరుగుతున్నా వినాయకుడు శాంతంగా, ‘నిజమే! నాకు గణాలెక్కడివి? లేవు కాబోలు. అన్నట్లు పుత్రగణపతిగా ఉన్నప్పుడు నాకూ కొన్ని గణాలు ఉన్నట్లు గుర్తు. ఆ గణాలు ఎక్కడ?’ అన్నాడు. వినాయకుడి నోట ఆ మాట వెలువడగానే, ముమ్మూర్తులా వినాయకుడిని పోలి ఉన్న గజముఖులు కోటాను కోట్లుగా పుట్టుకొచ్చారు. దిక్కులు పిక్కటిల్లేలా వినాయకుడికి జయజయ ధ్వానాలు పలుకుతూ అతడికి బాసటగా వచ్చి నిలుచున్నారు. వారందరూ చతుర్భుజులే! కొందరి చేతుల్లో ఘంటాలు, లేఖినులు, కుంచెలు ఉన్నాయి. ఇంకొందరి చేతుల్లో త్రిశూల కరవాల గదా ధనుర్బాణాది ఆయుధాలు ఉన్నాయి. మరికొందరి చేతుల్లో వీణా వేణు మృదంగ ఢక్కాది వాద్యపరికరాలు ఉన్నాయి. వారిలో కొందరు అరుణపతాకాలను పట్టుకున్నారు. ఇంకొందరు వినాయకుడికి ఛత్ర చామరాలు పట్టారు. వారు రత్నఖచితమైన భద్రసింహాసనాన్ని తీసుకువచ్చి, వినాయకుణ్ణి దానిపై కూర్చుండబెట్టారు. ఈ సంరంభానికి వినాయకుడి వాహనమైన మూషికం సింహాసనం కింద ఆనందంతో చిందులు వేయడం మొదలుపెట్టింది. దేవతలు, మునులు వేదస్తోత్రాలు పఠిస్తుండగా ప్రమథ గణాధిపతిగా వినాయకుడికి ఘనంగా అభిషేకం జరిగింది. ∙సాంఖ్యాయన -
వినాయకుడి వివాహం ఎలా జరిగిందో తెలుసా?మనకు తెలియని కథ..
వినాయకుని వివాహం గురించి చక్కటి పౌరాణిక గాథ. ప్రళయవేళ శ్రీ మహావిష్ణువు నాభినుండి వచ్చిన తామరపువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ప్రళయానంతరం విష్ణువు మేల్కొని జీవనసృష్టి కార్యకలాపాన్ని ప్రారంభించమని తన కొడుకైన బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ సృష్టి ఆరంభిచాడు. కానీ అంతా వక్రంగా వుంది. అప్పటికి ఎన్నో కల్పాలలో సృష్టి చేస్తూ వస్తున్న బ్రహ్మకు ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో పడ్డాడు. అప్పుడు నారదుడు కార్యారంభానికి ముందు వినాయక పూజ చేయనందువల్లే ఈ వైకల్పికము వచ్చిందని గణేశ అర్చనం చేయమని బ్రహ్మకు బోధించాడు. బ్రహ్మ వినాయకునికై కఠోర తపస్సు చేశాడు. ప్రత్యేక్షమైన వినాయకుడు బ్రహ్మ ఆంతర్యాన్ని గ్రహించి జ్ఞానం, క్రియలనే శక్తులను ఉపాసించమని బోధించాడు. బ్రహ్మ ఆ ఉపాసన చేశాడు. అప్పుడు ఆ రెండు శక్తులు సిద్ధి, బుద్ధి అనే రూపాలతో ప్రత్యక్షమయ్యాయి. బ్రహ్మ కోరిక మేరకు వారిరువురూ ఆయన కుమార్తెలుగా జన్మించారు. ఆ తరువాత బ్రహ్మ చేసిన సృష్టి సక్రమముగా కొనసాగింది. సిద్ధిబుద్ధులు యౌవనవతులయ్యారు. వారి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించాడు. ఈలోగా నారదుడు కథ నడిపి సిద్ధిబుద్ధులు గణేశుని కోరుతున్నారని ఆయనకు చెప్పాడు. వినాయకుడు అంగీకరించాడు. తరువాత గణేశుడు మిమ్మల్ని కోరుతున్నాడని వారిద్దరికీ చెప్పాడు. బ్రహ్మ సమక్షంలో వినాయకుడికి పెళ్ళి జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించి నారదుడు వినాయకునివైపు ఆశ్చర్యంగా చూశాడు. అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారదా! మా మధ్య కలహం వస్తుదని నీవు భావించావు. ఈ సిద్ధిబుద్ధి ఎవరోకాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం.నీ కలహ చింతన లోకోపకారమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధిబుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పాడు. ఇది వినాయకుడి పెళ్ళి కథ ఆంతర్యం. -
వినాయకుని పూజకు ముఖ్యంగా అవి ఉండాల్సిందే!
ఆదిదంపతుల మానసపుత్రుడు, ఓంకార స్వరూపుడు, విఘ్నాలను శాసించే వాడు, సర్వకార్యాలను సిద్ధింపజేసే సర్వ దేవతా లక్షణసమన్వితుడు, స్వల్పకాలంలో భక్తులకు ముక్తినిచ్చే మోక్షప్రదాత మన గణపయ్య.. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతికి పూజ చేయ్యాల్సిందే.. తలచిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్ననాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావాల్సిందే! దైవారాధనలో, పూజాదికాలలో, సర్వ శుభకార్యాల ఆరంభంలో ఈ మొత్తం జగత్తులో తొలి పూజలందుకునే స్వామి శ్రీగణేశ్వరుడే అందుకే ఆయన్ని ‘జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం’ అన్నది వేదం. జపహోమాదుల్లోనూ గణపతిపూజే ప్రథమ కర్తవ్యం. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అనేది అందుకే! అమ్మ చేతిలో పసుపుముద్దగా అవతరించి పసుపు గణపతిగా మనందరి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్న నివారకుడు మాత్రమే కాదు, విద్యాప్రదాత కూడా! అందుకే కోరిన విద్యలకెల్ల ఒజ్జయైయుండెడి పార్వతీ తనయ, ఓయి! గణాధిప నీకు మ్రొక్కెదన్ అంటూ మనం గణపతిని ప్రార్థిస్తూ ఉంటాము. వినాయకచవితి నాడు ఉదయాన్నే మేల్కొని, కాలకృత్యాలు తీర్చుకొని, అభ్యంగన స్నానమాచరించి, శుభ్రమైన దుస్తులు ధరించి, వ్రతమాచరించాలి. ఇంటిని శుభ్రపరచుకొని, స్వస్తిక్ పద్మాన్ని లిఖించి, అరటిబోదెలతో మంటపాన్ని ఏర్పాటు చేసుకొని, పాలవెల్లి కట్టిన పీఠంపై తెల్లటి వస్త్రం పరచి, హరిద్రా గణపతిని, మట్టి వినాయకుని స్థాపించి, ఆహ్వానించి దూర్వా (గరిక) తదితర ఏకవింశతి (21) రకాల పత్రాలతోను, షోడశోపచారాలతో పూజించి, వినాయకోత్పత్తి కథను చదువుకొని, అక్షతలను శిరస్సుపై ధరించాలి. స్వామివారికి వడపప్పు, కొబ్బరి, చెరకు, బెల్లం, ఉండ్రాళ్లు, లడ్డూలు, మోదకాలు, కుడుములు నివేదించాలి. మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజూ ఓ పండుగే! పండుగ వస్తుందంటే పిల్లలకు ఎంతో సంబరం. వినాయకుడు అనే పేరు విన్నా, పలికినా ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహించి ఆనందం కలుగుతుంది. గణపతి తనగోడు వింటాడు, తను తలచిన ఏ కార్యక్రమానికైనా ఎటువంటి ఆటంకం కలుగనీయడు అని ప్రతి భక్తుడు భావిస్తాడు. భక్తుల భావాల్లో ఇంతగా సుప్రతిష్ఠమైన గణపతిని ఆరాధించటంలో అనంతమైన భావాలు నిక్షిప్తమై ఉన్నాయి. భాద్రపదమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ. ఆనాడు ఆదిదేవుడైన వినాయకుడి ఆవిర్భావం జరిగిన రోజు. ఆరోజు గణపతి పూజ విశేష ఫలితాన్నిస్తుంది. ఎన్ని కష్టాలు, అవరోధాలున్నా, వాటన్నిటినీ తొలగించే తొలిదైవం వినాయకుడు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయక చవితి పర్వదినాన సకల విఘ్నాలకు అధిపతియైన ఆ విఘ్నేశ్వరున్ని భక్తితో కొలిస్తే చాలు విఘ్నాలన్నింటినీ తొలగించి స్వామి కోరిన వరాలిస్తాడు. ఈ వ్రత పరమార్థం సమాజంలో ఐకమత్యాన్ని, దైవభక్తిని, జీవనశైలిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందింప జేయటమే కాక, భావసమైక్యతకు సహజజీవన సిద్ధాంతానికి నిదర్శనం. పూజా ద్రవ్యములు: వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు. పూజా వస్తువులు: దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశం మీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠము. నైవేద్యం: ఉండ్రాళ్లు–21, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి. పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి, ఆయా మంత్రాలతో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపము కల్గినను భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి. పాలవెల్లి పూజ: శ్రీ విఘ్నేశ్వరస్వామివారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము. పూజా మందిరంలో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు తమ ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఏ వృత్తి వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడం శుభఫలదాయకం. మట్టి వినాయకుడ్ని పూజిద్దాం... పర్యావరణాన్ని కాపాడుకుందాం !! మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్థాలతో తయారు చేసిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలగదు. ఏ తత్త్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్త్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సృష్టిధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి. (చదవండి: ఓట్స్ – యాపిల్ లడ్డూలు) -
గణపయ్యలకు మస్తు డిమాండ్.. జోరుగా అమ్మాకాలు
వినాయక విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సమయం రెండు రోజులే ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో యువత సందడి చేస్తోంది. కరోనా కారణంగా గత రెండు, మూడు సంవత్సరాలుగా అంతంత మాత్రంగానే విగ్రహాలు నెలకొల్పారు. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ సమితులు సిద్ధమయ్యాయి. దీనికి తోడు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం ఉత్సవ నిర్వాహకులకు కలిసొచ్చింది. ఆశావహులు, అభ్యర్థులు పెద్ద ఎత్తున విగ్రహాలు ఇప్పిస్తున్నారు. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో వినాయక విగ్రహాల అమ్మకాలు ఉన్నట్లు తయారీదారులు చెబుతున్నారు. అయితే మట్టి వినాయకులపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇళ్లలో ఏర్పాటు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.పండుగ మరో రెండు రోజులు ఉన్నందున ఇంకా పెరిగే అవకాశం ఉంది. ధరలు గత ఏడాది మాదిరిగానే నిర్ణయించామని విగ్రహ తయారీదారులు తెలిపారు. -
బాలాపూర్ గణనాథుడు.. ఈసారి స్పెషల్ ఇదే
బాలాపూర్ గణనాథుని వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏటా గణేశుడి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్వామి వారి చేతిలోని లడ్డూకు ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది. ఈసారి ఐదు తలల నాగరాజు పడగల కింద స్వామివారిని సుందరంగా రూపొందించారు. విజయవాడ కనకదుర్గ ఆలయ నమూనాలో మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. కోల్‌కతాకు చెందిన కళాకారులు 11 రోజులుగా ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. 18 ఫీట్ల ఎత్తుతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు. -
శివుడిని హడలెత్తించిన వృకాసురుడు.. చివరికి తలపై చేయిపెట్టి
పూర్వం వృకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. నిష్కారణంగా అమాయకులను రకరకాలుగా వేధిస్తూ ఆనందించేవాడు. కొన్నాళ్లకు వాడికో దుర్బుద్ధి పుట్టింది. ‘బలహీనులైన మనుషులను, చిన్నా చితకా దేవతలను ఏడిపిస్తే ఏముంది? ఏడిపిస్తే మహాదేవుడని పిలిపించుకుంటున్న శివుణ్ణే ఏడిపించాలి. అప్పుడు కదా నా ఘనత ఏమిటో ముల్లోకాలకూ తెలిసి వస్తుంది’ అనుకున్నాడు. శివుణ్ణి ఏడిపించాలంటే, ముందు అతను తనకు ప్రత్యక్షమవ్వాలి కదా! వృకాసురుడు ఈ ఆలోచనలో ఉండగానే నారద మహర్షి అటువైపుగా వస్తూ కనిపించాడు.వృకాసురుడు ఎదురేగి నారదుడికి నమస్కరించాడు. ‘స్వామీ! పరమశివుడు ప్రత్యక్షం కావాలంటే ఏం చేయాలి?’ అని అడిగాడు. ‘భగవంతుణ్ణి వశం చేసుకోవాలంటే ఒకటే మార్గం. అందుకు తపస్సు చెయ్యాలి. శుచివై, దీక్షతో తపస్సు చెయ్యి నీకు తప్పక పరమశివుడు కనిపిస్తాడు’ బదులిచ్చాడు నారదుడు. నారదుడి సలహాతో వృకాసురుడు శుచిగా నదీ స్నానం చేశాడు. ఒక చెట్టు కింద కూర్చుని శివుడి కోసం తపస్సు ప్రారంభించాడు. ఎన్నాళ్లు గడిచినా శివుడు ప్రత్యక్షం కాలేదు. ముక్కుమూసుకుని చేసే ఉత్తుత్తి తపస్సుకు శివుడు ప్రత్యక్షం కాడేమో! రాక్షసోచితంగా ఉగ్రతపస్సు చేస్తే ప్రత్యక్షమవుతాడేమోనని తలచి, ఎదుట హోమగుండం వెలిగించి ఉగ్రతపస్సు ప్రారంభించాడు. తన శరీరం నుంచి మాంసఖండాలను కోసి హోమగుండంలో వేయసాగాడు. శరీరంలోని మాంసమంతా కోసి హోమగుండంలో వేసినా శివుడు ప్రత్యక్షం కాలేదు. వృకాసురుడికి పట్టుదల పెరిగింది. ఏకంగా తన తలను తెగనరుక్కుని హోమగుండంలో వేసేందుకు సిద్ధపడ్డాడు. అంతా కనిపెడుతున్న పరమశివుడు ఇక క్షణమైనా ఆలస్యం చేయలేదు. వెంటనే వృకాసురుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ‘వృకాసురా! నీ సాహసానికి మెచ్చాను. అయ్యో! శరీరంలోని మాంసమంతా కోసేసుకున్నావే! నేను అనవసరంగా ఆలస్యం చేశాను. అయినా ఇప్పుడు వచ్చాను కదా! నీకు ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు. ‘స్వామీ! నువ్వు నాకు దర్శనం ఇవ్వడమే పదివేలు. ఇక నాకు వరాలెందుకు? అయినా, నువ్వు కోరుకొమ్మని అంటున్నావు గనుక కోరుకుంటున్నాను. నా చెయ్యి ఎవరి నెత్తిన పెడితే వారి తల వెయ్యి వక్కలై చచ్చేటట్లు వరం ఇవ్వు చాలు’ అన్నాడు వృకాసురుడు. శివుడు అవాక్కయ్యాడు. ‘వీడు ఉత్త వెర్రివాడిలా ఉన్నాడు. నేను ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడిగితే ఇలాంటి వరం కోరుకున్నాడేమిటి?’ అనుకున్నాడు. ‘ఇదేమిటి? ఇలాంటి వరం కోరుకున్నావు? నీకు ఉపయోగపడేది ఏదైనా కోరుకోరాదా?’ అన్నాడు శివుడు. ‘స్వామీ! నువ్వు కోరుకొమ్మంటేనే నేను కోరుకున్నాను. వరం ఇవ్వడం ఇష్టం లేకపోతే, ఆ ముక్క చెప్పి పోరాదా!’ అన్నాడు దెప్పిపొడుపుగా. శివుడికి అహం దెబ్బతింది. ‘నేను వరం ఇవ్వలేకపోవడం ఏమిటి? ఇచ్చాను. పుచ్చుకుని పో! నీ కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’ అని చెప్పి వెళ్లిపోబోయాడు. వృకాసురుడు వెకిలిగా నవ్వుతూ ‘మహాదేవా! ఆగాగు. నీ కర్మకాలే నాకీ వరం ఇచ్చావు. మొట్టమొదట నీ నెత్తి మీద చెయ్యిపెట్టి, వర ప్రభావాన్ని పరీక్షించుకుంటాను’ అంటూ చెయ్యి పైకెత్తి ముందుకొచ్చాడు. శివుడు హడలి పోయాడు. వృకాసురుడి చెయ్యి నెత్తిన పడకుండా చటుక్కున తప్పించుకుని, దిక్కు తోచక పరుగు లంకించుకున్నాడు. వృకాసురుడు కూడా శివుడిని వెంబడిస్తూ పరుగు తీయసాగాడు. ముందు శివుడు, వెనుక వృకాసురుడు– ఒకరి వెనుక ఒకరు పరుగు తీస్తున్న దృశ్యాన్ని ఆకాశమార్గాన వెళుతున్న నారదుడు తిలకించాడు. దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. వెంటనే వైకుంఠానికి బయలుదేరి వెళ్లి, విష్ణువుకు వృకాసురుడు పరమశివుడిని తరుముతున్న సంగతి చెప్పాడు. పరమశివుడిని ఎలాగైనా రక్షించాలని కోరాడు. శివుడిని కాపాడటం కోసం విష్ణువు తక్షణమే బయలుదేరాడు. బాల బ్రహ్మచారి వేషం ధరించి వృకాసురుడు వస్తున్న దారిలో నిలిచాడు. పరుగుతో ఆయాసపడుతున్న వృకాసురుడు బాల బ్రహ్మచారిని ‘ఏమయ్యా! శివుడు ఇటుగా వెళ్లడం చూశావా?’ అని అడిగాడు. ‘పరుగున వెళుతుంటే చూశాను. ఆ కొండల మాటుగా పరుగు తీస్తూ పోయాడు. అప్పటికీ ఎందుకు పరుగు తీస్తున్నావని నేను అడిగాను కూడా’ అన్నాడు.‘ఏం చెప్పాడేమిటి?’ అడిగాడు వృకాసురుడు. ‘నా భక్తుడు వృకుడు నన్ను తాకుతానంటూ వెంబడిస్తున్నాడు. తాకితే ఇబ్బందేమీ లేదుగాని, ఒళ్లంతా కండలు కోసేసుకుని, దుర్గంధమోడుతున్న శరీరంతో ఉన్నాడు. కనీసం శుచిగా స్నానమైనా చేసి ఉంటే, తాకనివచ్చేవాణ్ణే అని చెప్పాడు’ అన్నాడు బాల బ్రహ్మచారి రూపంలోని విష్ణువు. ‘ఇదీ సమంజసంగానే ఉంది. పరమశివుడు ఎంతైనా దేవుడు. అతణ్ణి తాకేటప్పుడు శుచిగా ఉండటం ధర్మం’ అనుకుని పక్కనే ఉన్న నదిలో స్నానానికి దిగాడు. మెడ లోతు వరకు దిగాక, శిఖ ముడి విప్పుకోవడానికి నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు. అంతే! తల వెయ్యి వక్కలై చచ్చాడు. -
శివపార్వతుల్లో ఎవరు అధికులు?
ఒకరోజు శివపార్వతులిద్దరూ కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉన్నారు. పార్వతీదేవి ఉన్నట్టుండి ‘‘ప్రకృతి– పురుషులలో ఎవరు అధికులు?’’ అని శివుణ్ణి అడిగింది. శుద్ధసత్త్వమైన పురుషుని వలననే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు సమాధానమిచ్చాడు. దాంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. చూస్తుండగానే వాదన కాస్తా ముదురు పాకాన పడింది. అమ్మవారు ప్రకృతి గొప్పదనం ఏమిటో తెలియజేయాలనుకుని తన శక్తిని ఉపసంహరించి అంతర్ధానం అయింది. దానితో పోషణ లేక లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోయాయి. సృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తుండటం చూసి తట్టుకోలేకపోయింది అమ్మ. దాంతో కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోటానుకోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివగణమంతా ఆకలికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని ఆనందస్వరూపుడు శివుడు భిక్షాపాత్ర తీసుకుని కాశీకి వెళ్లి అన్నపూర్ణ చేతి నుండి అన్నం స్వీకరించాడు. సాక్షాత్తూ తన పతిదేవుడే తన వద్దకు భిక్షాపాత్ర పట్టుకుని రావడం చూసిన అమ్మవారు తనదే పై చేయి అని ముందు సంతోషించినప్పటికీ, తర్వాత భర్తనే భిక్షకుడిగా చూసినందుకు బాధపడుతుంది. దాంతో పరమేశ్వరుడు ఇద్దరిలో ఎవరూ అధికులు కారని, ప్రకృతి, పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి పార్వతి చేయి పట్టుకుని మరల కైలాసానికి వెళ్ళిపోయాడు. శక్తి లేకపోతే స్థూల శరీరం ఉండి లాభం లేదు. ఎవరైనా శక్తి హీనుడు అంటారు కానీ విష్ణుహీనుడు, శివహీనుడు అని అనరు. శరీరం లేని శక్తి నిరర్ధకం. శక్తి ఉన్న శరీరం శివం లేకపోతే శవం. కాబట్టి రెండూ సమపాళ్లలో ఉంటేనే మనుగడ అని చాటి చెప్పడానికి ఇద్దరిగా ఉన్న ఒక్కరు ఆడిన నాటకం ఇది. – డి.వి.ఆర్. (చదవండి: ధర్మం అంటే ఏంటో తెలిపేది..ఈ శంఖలిఖితుల కథ) -
తిరుమల శ్రీవారి పాదరక్షలు ఎందుకు అరిగిపోయి ఉంటాయి?
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పాదరక్షలకోసం ఏటేటా తిరుమలకు ఉత్తరాన గల శ్రీకాళహస్తి గ్రామం, దక్షిణానగల కాంచీపుర గ్రామాలలోని చర్మకారులకు శ్రీవారి పాదముద్రలు ఇస్తారు. వారిరువురు విడివిడిగా ఆ పాదముద్రల కొలతలతో పాదరక్షలను చేసి వాటిని శిరస్సున పెట్టుకుని, ఊరూరా తిరిపమెత్తుకుంటూ వచ్చి అలిపిరి పూజ చేసి ఆ పాదరక్షను పూజామందిరంలో ఉంచుతారు. ఈ కొత్తపాదరక్షలు తయారై వచ్చే సమయానికి పాత పాదరక్షలు చాలావరకు అరిగిపోయి ఉంటాయి. శ్రావణ శనివారాలు ఉపవాసం ఉండి, పిండి తళిగలు వేస్తారు. ఆ పిండిమీద శ్రీవారి పాదముద్రలు వేస్తారు. ఆ రెండు పాదముద్రలను ఒకరికి తెలియకుండా మరొకరికి ఇస్తారు. శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన ఎందుకు? సిరులను, సంపదలను, సకలైశ్వర్యాలను కోరగానే భక్తులకు అందించే శ్రీమహాలక్ష్మికి పూవులన్నా, గాజులన్నా, కుంకుమన్నా బహుప్రీతి. విష్ణుమూర్తి అలంకారపియుడు కావడానికి బహుశ ఇదే కారణమేమో! పరమేశ్వరునికి పాలతో, ఉదకంతో అభిషేకం చేయడం, ఆంజనేయునికి సింధూరం పూత పూయడం, విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించడం ఎంతటి సత్ఫలితాలను ఇస్తుందో, శ్రీ మహాలక్ష్మికి కుంకుమతో చేసే పూజ అంతటి దివ్యసంపదలను అందిస్తుంది. త్వరిత గతిన శుభాలను చేకూరుస్తుంది. -
విశిష్టుడు, సర్వలోకహితుడైన "కృష్ణుడు" ధర్మపక్షపాతి
కృష్ణుడు పుట్టినరోజును కృష్ణజన్మాష్టమి, గోకులాష్టమి అని పిలుస్తారు. దేవకి, వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షమి, అష్టమితిధి రోజు పుట్టినట్లుగా పురాణాలు,ఇతిహాసాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కృష్ణభక్తులంతా వేడుకలు జరుపుకొనే విశిష్టమైన రోజు కృష్ణాష్టమి. 'భగవద్గీత' ద్వారా లోకానికి గొప్ప ఉపదేశం చేసిన మూలంగా కృష్ణుడిని 'జగద్గురువు'గా భావిస్తారు, కృష్ణం వందే జగద్గురుమ్... అంటూ పూజిస్తారు. శ్రీకృష్ణుడి లీలలు అనంతం. అవన్నీ ఆనందదాయకం, జ్ఞానప్రదాయకం. మానవ జీవన క్రమంలో సుఖవంతంగా, జయప్రదంగా జీవించాలంటే కృష్ణతత్త్వాన్ని అర్థం చేసుకొని ఆచరించాలని పెద్దలు చెబుతారు. నర-నారాయణ (అర్జునుడు-కృష్ణుడు) సంవాదంలో నరునికి బోధించినట్లుగా కనిపించే 'భగవద్గీత' నరలోకం మొత్తానికి నారాయణుడు (కృష్ణుడు) చేసిన జ్ఞానబోధగా భావించాలని పండితులు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మనిషి మరణించినప్పుడు తల దగ్గర పెట్టి వినిపించే విషాదగీతం కాదు భగవద్గీత. మానవులకు కర్తవ్య బోధ చేస్తూ కార్యోన్ముఖులను చేసే 'విజయగీత'. వ్యక్తిత్వ వికాసానికి ఇంతకు మించిన ఉద్గ్రంథం ఇంకొకటి లేదని ప్రపంచ మేధావులంతా ఏకమై చెప్పారు. అందుకే, 'గీత' భారతీయ భాషలతో పాటు అనేక అంతర్జాతీయ భాషలలో అనువాదమైంది. అది చదివిన పిమ్మట అనేక దేశాలవారు కృష్ణతత్త్వం వెంట పరుగులు తీస్తున్నారు. భారతదేశానికి తరలి వస్తున్నారు. ధర్మం, వృత్తిధర్మం, స్వధర్మం వైపు నడవండని గీతాచార్యుడైన కృష్ణుడు చెప్పాడు. స్వధర్మం ఏంటో తెలుసుకోవడంలోనే జ్ఞాన వికాసం దాగివుంది. తెలుసుకున్న తర్వాత ఆచరించడంలో వివేకం దాగివుంటుంది. ఈ మనోయోగం పట్టాలంటే భగవద్గీతను చదివి తీరాల్సిందే. కౌరవ-పాండవ యుద్ధంలో కృష్ణుడు పాండవుల వైపు నిలుచున్నాడు. అది అధర్మానికి - ధర్మానికి మధ్య జరిగిన యుద్ధం కాబట్టి వివేకవంతుడు, విశిష్టుడు, సర్వలోకహితుడైన కృష్ణుడు ధర్మపక్షపాతిగా పాండవుల వైపే నిల్చొని, వారికి విజయం కలిగించాడు. అధర్ములకు అపజయాన్ని చూపించి గుణపాఠం నేర్పాడు. కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని తలుచుకోవడం, కొలుచుకోవడమంటే? కృష్ణతత్త్వాన్ని తెలుసుకోవడమే. కృష్ణతత్త్వం తెలియాలంటే జయదేవుడు రచించిన అష్టపదులు, లీలాశుకుడి 'శ్రీకృష్ణ కర్ణామృతం', నారాయణతీర్ధుడి తరంగాలు చదివి, అనుభవించండని మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య తెలియజేశారు. 'జగదాష్టమి'గా గుజరాతీయులు కృష్ణజన్మాష్టమిని విశిష్టంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు ప్రపంచంలోని భక్తులంతా నాట్యం, నాటకం (రూపకం),ఉపాసన,ఉపవాసాలు మొదలైన వివిధ మార్గాల్లో తమ భక్తిని చాటుకుంటారు. ఇది తరతరాల నుంచి వైభవంగా సాగుతున్న సంప్రదాయం. ఉట్టికొట్టడం గొప్ప ఆసక్తిగా సాగే క్రీడ. మన తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వరుని పక్కనే రజితమూర్తిగా శ్రీకృష్ణుడు విరాజిల్లుతుంటాడు. వెయ్యేళ్ళపై నుంచే ఈ విగ్రహం అక్కడ ఉన్నట్లు చెబుతారు. శ్రీకృష్ణుడి బాల్యక్రీడలకు సంబంధించిన విశేషాలు ప్రతిస్పందించేలా తిరుమల మాడ వీధుల్లో పెద్ద కోలాహలం జరుగుతుంది. ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైందని తెలుస్తోంది.1545 నాటి శాసనాల ఆధారంగా ఈ వివరాలు తెలుస్తున్నాయి.తాళ్లపాకవారే ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంటారు. శ్రీకృష్ణుడు గొప్ప రాజనీతి చతురుడు.ఎంతటి చతురుడో అంతటి రసికుడు.ఎంతటి రసికుడో అంతటి అప్తజన రక్షకుడు. సౌందర్యవిలాసుడు, విలక్షణ వాగ్భూషణుడు. అందుకే "నల్లనివాడు, పద్మ నయనంబులవాడు, కృపారసంబు పై చల్లెడివాడు" అన్నాడు మన పోతన్న. తనను నమ్ముకున్నవారిపై దయారసాన్ని గొప్పగా కురిపించే కరుణాసముద్రుడని భావం. కేవలం పాండవులపైనే కాదు, ధర్మమూర్తులందరిపైనా తన దయను విశేషంగా చూపించి విజయులను చేశాడు. కృష్ణుడిని అర్థం చేసుకుంటే ఆత్మజ్ఞానం కలిగినట్లే. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: భావోద్వేగాలను కట్టడి చేసే మహత్తరమైన శక్తి వాటికే ఉంది!) -
మంత్రాలయంలో వారం రోజుల పాటు ఆరాధన మహోత్సవాలు
మంత్రాలయం: భక్తకోటి కల్పతరువు శ్రీరాఘవేంద్రస్వామి. సశరీరంగా చింతామణి సదృశ్యులైన స్వామి వారి 352వ ఆరాధన సప్త రాత్రోత్సవ మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో వారం రోజుల పాటు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఆరాధనోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. శ్రీరాఘవేంద్ర స్వామి ప్రశస్థి అవార్డులు అందుకోవడానికి ప్రముఖులు మంత్రాలయం రానున్నారు. ఏపీ రాష్ట్ర గవర్నర్ నజీర్.. పూర్వారాధన వేడుకల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఉత్సవాల నేపథ్యంలో వేదభూమి మంత్రాలయం విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతోంది. పూర్తయిన ఏర్పాట్లు ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి శ్రీమఠం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల వసతి కోసం హెచ్ఆర్బీ, భూ, దుర్గారమణ, నరహరి, పద్మనాభ డార్మెటరీలు, పాత పరిమళ విద్యానికేతన్ పాఠశాలలను కేటాయించారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు 50 మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. నదిలో నీటి కొరత దృష్టా పుణ్య స్నానాలకు వంద షవర్లు ఏర్పాటు చేశారు. మఠం సీఆర్ఓ, ప్రధాన ముఖధ్వారం, మఠం ప్రాకారం, అన్నపూర్ణ భోజనశాల దారిలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆరు లక్షల పరిమళ ప్రసాదాలు తయారు చేశారు. మహా రథోత్సవం సందర్భంగా హెలికాప్టర్ నుంచి పూలవాన కురిపించనున్నారు. అవార్డుల ప్రదానం ఆనవాయితీలో భాగంగా శ్రీరాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయనున్నారు. పూర్వారాధన రోజున ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రాలయం రానున్నట్లు సమాచారం. విద్వాన్ రామవిఠలాచార్య, శతావధాని గరికపాటి నరసింహారావు, టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, ఎంఐటీ శాంతి యూనివర్సిటీ వ్యవస్థాపకులు డా.విశ్వనాథ్‌కు రాయరు అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయనున్నారు. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్ భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. వేడుకల నిర్వహణ ఇలా.. ● మంగళవారం రాయరు ఉత్సవాలు ప్రారంభోత్సవంలో భాగంగా ధ్వజారోహణ, ధాన్యపూజ, రజిత మంటపోత్సవం, గో, గజ, తురగ పూజలు చేస్తారు. ● బుధవారం శాఖోత్సవం, రజత మంటపోత్సవం ఉంటుంది. ● గురువారం పూర్వారాధన సందర్భంగా రజత సింహ వాహనోత్సవం నిర్వహిస్తారు. ● శుక్రవారం మధ్యారాధన సందర్భంగా రాఘవేంద్రుల బృందావనానికి మహా పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్ర సమర్పణ ఉంటుంది. గజ, రజత, స్వర్ణ రథోత్సవాలు ఉంటాయి. ● శనివారం ఉత్తరారాధన సందర్భంగా మహా రథోత్సవం, వసంతోత్సవం జరుపుతారు. ● ఆదివారం శ్రీ సుజ్ఞానేంద్ర తీర్థుల ఆరాధన, అశ్వ వాహనోత్సవం ఉంటుంది. ● సోమవారం సర్వ సమర్పణోత్సవంలో భాగంగా బంగారు పల్లకీ, చెక్క, వెండి, బంగారు రథోత్సవాలు ఉంటాయి. -
మనుషులు రాళ్లు, రప్పలు కాదు, అలా చేయకుండా ఉండటానికి
శీలభ్రష్టత అంటే వ్యభిచరించడం ఒక్కటే కాదు. అసత్యాలు పలకడం, దొంగిలించడం, నిండు ప్రాణాలు తియ్యడం, మత్తుపానీయాలు సేవించడం. ఇవన్నీ శీలభ్రష్టతలే! ఈ దోషాలు లేని వ్యక్తి గానీ, సమాజం గానీ నైతికంగా దిగజారదు. తప్పు చేయడం తప్పు కాదు. తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ అవి తప్పు అని తెలిశాక కూడా అవే తప్పులు చేయడమే పెద్ద తప్పు. తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవడాన్ని మరలా ఆ తప్పుని చేయకపోవడాన్ని బుద్ధుడు ధర్మతాదృష్టి అంటాడు. ఒక భిక్షువు వెనుకటి అలవాటుని మానుకోలేక సారాయి సేవించాడు. అతను భిక్ష కోసం వెళ్ళినప్పుడు గృహస్తులు చక్కగా భోజనం పెట్టారు. ధర్మ ప్రవచనం విన్నారు. ఆ తరువాత మోమాటం పెట్టి పానీయానికి బదులు పులిసిన ద్రవాన్ని ఇచ్చారు. అది సారాయి లాంటిదే అని తెలిసి కూడా నిగ్రహించుకోలేక కొద్దిగా సేవించాడు. కానీ.. ఆ తరువాత ఎంతో తప్పుచేసిన వాడిగా మధనపడ్డాడు. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తిరిగి ఆశ్రమానికి వచ్చాక తన మిత్ర భిక్షువులు ఒకరిద్దరికి చెప్పుకున్నాడు. అయినా ఆ భిక్షువు మనస్సు శాంతించలేదు. ఏదో ఒకమూల తప్పుచేశాను అనే భావన తొలుస్తూనే ఉంది. చివరికి బుద్ధుని చుట్టూ బౌద్ధసంఘం చేరి ఉంది. అప్పుడు బుద్ధుడు ఆ భిక్షువుని శాంతపరచి, అందరితో పాటు కూర్చోబెట్టి–‘‘భిక్షువులారా! తెలిసో తెలియకో తప్పులు, దోషాలు కలిగినప్పుడు వాటిని కప్పిపుచ్చుకునే వారు దుశ్శీలురు. కానీ కొందరు తమ దోషాన్ని విజ్ఞులకీ మిత్రులకీ చెప్పుకుంటారు. ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా నడుచుకుంటారు. ఇలా సరిదిద్దుకునే పద్ధతిని ‘ధర్మతా దృష్టి’ అంటారు.వీరు పసిపిల్లలతో, ఆవుతో సమానం’’ అంటూ భిక్షు సంఘాన్ని కలయ చూశాడు. ఆ భిక్షువు వంక పరిశీలనగా చూశాడు. అతనిముఖంలో తొంగి చూసే సిగ్గు, బిడియం పోయాయి. మనోనిర్మలత అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది. బుద్ధుడు మరలా– ‘‘భిక్షువులారా! ఒక పసిబిడ్డ వెల్లికిలా పడుకుని ఉంటాడు గదా! ఆ పసితనంలో కూడా ఆ బిడ్డ తన చేతితో గానీ, కాలితో గానీ.. అగ్నిని ముట్టుకుంటే ఏం చేస్తాడు? చాలా వేగంగా.. ఆ చేతినో, కాలినో వెనక్కి ముడుచుకుంటాడు. అలాగే ధర్మతాదృష్టి కలిగిన వారూ తమ దోషాన్నుండి అంతే వేగంగా వెనక్కి మళ్ళుతారు. గట్టున మేస్తూ ఉన్న ఆవు ఆకలితో ఉండి, తాను ఆబగా మేస్తూ కూడా తన దూడను గమనిస్తూనే ఉంటుంది. అలాగే ఈ ధర్మతాదృష్టి కలిగిన వారు తమ దోషాల్ని తామే సరిదిద్దుకుంటూ.. ఆవులా జాగ్రత్తగా ఉంటూ తమ జ్ఞానాన్ని, శీలాన్నీ వృద్ధి చేసుకోవాలి’’ అని చెప్పాడు. ఆ భిక్షువుకి మనస్సులోని అల్లకల్లోలాలు శాంతించాయి. తన మీద తనకు ధైర్యం వచ్చింది. ధర్మసాధనలో అందరికంటే ముందు శిఖరాగ్రానికి చేరాడు. ఇలాంటి దృష్టి సంపన్నుడు ధర్మబలుడై లోకోత్తరుడౌతాడు. మనుషులు మానూ మాకులూ, రాయీ రప్పలూ కాదు ఏం దోషం చేయకుండా పడి ఉండటానికి. తాను సమాజంలో, సమాజం తనలో ఉండి నడిచేవారు. సమాజ హితాన్ని కోరే వారు ధర్మతాదృష్టితో తమని తాము సంస్కరించుకుంటూ, సమాజాన్ని సంస్కరించాలి. ఇదే ఉత్తమ ధర్మం. అత్యుత్తమ ధర్మం. అలాంటి మార్గాన్ని అందించిన తథాగత బుద్ధుడు సదా స్మరణీయుడు! – డా. బొర్రా గోవర్ధన్ -
మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే..
ఊపిరి వాక్కుగా మారిన కారణంగా శరీరం పడిపోయినా, కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. నిజానికి మనకు సనాతన ధర్మంలో గొప్పది వేదం. వేదం అపౌరుషేయం. ఈశ్వరుడిచేత చెప్పబడినది. ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదం అంత సనాతనమైనది. నా ఊపిరి రెండు కాదు, ఊపిరి తీస్తున్నంతసేపే ‘నేను’ నేనుగా ఉన్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడమంటే మాట్లాడలేను. ఊపిరి విడిచి పెడుతున్నప్పుడు అది వాక్కుగా మారుతుంది. తీసిన ఊపిరులను సమాజ శ్రేయస్సు కోసం వాక్కులుగా మార్చిన వారున్నారు. తామేదీ ఆశించకుండా కేవలం సమాజ శ్రేయస్సే కోరుకున్నారు వారు. భగవంతుడిచ్చిన ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడుతున్నాను, అది నన్ను శాశ్వతుడిని చేస్తుందన్నాడు పోతన. శాశ్వతమైనది పరబ్రహ్మము. దానిలో చేరిపోతాను... అన్నాడు. శంకరాచార్యులవారు శివానందలహరి చేస్తూ..అసలు భక్తికి చివరి మాట ఏది అన్నదానికి సమాధానంగా ... ‘‘అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచికా/ సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం సింధు స్సరిద్వల్లభమ్/ ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదార వింద ద్వయమ్/ చేతో వృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే ’’ అంటారు. నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నదికి రంగు, రుచి ఇవేం ఉండవు. అటువంటి త్యాగమయ జీవితాన్ని గడిపి భగవంతునిలో ప్రవేశించాడు, నది సముద్రంలో కలసిపోయినట్లు కలిసిపోయాడు. కానీ ఆయన మాత్రం లోకంలో చిరస్థాయిగా ఉండిపోయాడు. ఎలా ... వాక్కు కారణంగా. భారతం ద్వారా నన్నయ అలా ఉండిపోయాడు. ఎర్రాప్రగడ, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, రామదాసు... వీళ్ళందరూ అలాగే వాక్కుల కారణంగా ఉండిపోయారు. ఆ వాక్కును కొందరు పద్యరూపంగా, కొందరు గద్యరూపంగా, శ్లోకంగా, పాటగా చెప్పారు. పాటకున్న లక్షణం .. అది సంస్కృతికి మూలకందమై నిలబడుతుంది. భూమినుంచి మొక్కలు పుట్టాలి... అంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. అందుకే గ్రీష్మం తరువాత వర్షరుతువు వస్తుంది. దానిముందు ఆషాఢమాసం ప్రవేశించగానే ప్రతి ఊరిలోనూ అధిష్ఠాన దేవతయిన గ్రామదేవతను దర్శించుకుని నైవేద్యం పెడతారు. ఎందుకు! ఆమె అనుగ్రహంతో నేను ఈ ఊరిలో ఉండి అన్నం తినగలుగుతున్నా... కాబట్టి ఏడాదికొక్కసారి నేను ఆమెకు నైవేద్యం పెట్టాలి. ఆమె భూమికి ఆర్ద్రత కలిగిస్తుంది, వర్షరూపంలో. తడి తగలగానే ఏడాదికి సరిపడా నేను తినగలిగిన అన్నం నాకు దొరుకుతుంది... అన్న భావన. భూమికి తడి తగలకపోతే, ఎండి పడిపోయిన జామ గింజలు, బత్తాయి గింజలు, ధాన్యపు గింజలు ఏవీ మొక్కలుగా పైకి లేవవు. తడి తగలగానే గడ్డిపరకనుంచి మొదలుపెట్టి, భూమికి చేరిన గింజలన్నీ మొక్కలై పెరుగుతాయి. అంటే ఆర్ద్రత ఉండాలి. ప్రాణుల మనుగడకు అది ఆధారం. అలాగే ఒక దేశ సంస్కృతి నిలబడాలంటే... భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్టు, కళలుండాలి. కళలద్వారా సంస్కృతి పెరుగుతుంది. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? శ్రావణంలో వచ్చే రెండో శుక్రవారం ప్రత్యేకత ఏంటి?) -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్: రూ. 31.25 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని తెలుగు లోగిళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తూర్పగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ముసలమ్మ తల్లి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయ నిర్వాహకులు సుమారు ₹13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో జగన్మాతను ప్రత్యేకంగా అలంకరించారు. రూపాయి, రెండు, ఐదు, పది,ఇరవై,ఏభై, వంద,రెండొందలు,అయిదొందలు సహా చెలామణిలో ఉన్న నోట్లతో అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు. అలాగే బ్యాంకుల నుంచి కూడా కొత్త నాణేలు తీసుకొని అలంకరించడం మరో ప్రత్యేకత. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాము ప్రతి ఏడాది కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఇలా అలంకరిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. సుమారు 30 రోజుల పాటు ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేశారు. ఇక గతంలోనూ సంక్రాంతి,విజయదశమి, దీపావళి తదితర వేడుకల్లో అమ్మవారిని వినూత్న రీతిలో అలంకరిస్తూ ఈ ఆలయ కమిటీ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ఇలా ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరించడం అందర్నీ ఆకట్టుకుంది. -
వరలక్ష్మీ వ్రతం ఎవరైనా చేయొచ్చా? పూజా విధానమేంటి?
Varalakshmi Vratham 2023: శ్రావణమాసం అంటేనే పండుగలు, శుభకార్యాలకు ప్రతీకగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వరలక్ష్మి అంటే వరుడితో కూడిన లక్ష్మి అనే అర్థం ఉంది. ‘వర’అంటే శ్రేష్ఠమైంది అని అర్థం వస్తుంది. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీని భక్తి శ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతం విశేషాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు, నియమాలు, మడులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసు, ఏకాగ్రత ఉండే భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభ యోగం కలిగి, అమ్మవారి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతారు. మహామాయారూపిణి, శ్రీ పీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంక, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్టయిశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మీ రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఆచరిస్తారు. అది శ్రేష్టం కూడా. ఒకవేళ ఏదైనా కారణం వల్ల కుదరని పక్షంలో శ్రావణ పూర్ణిమ రోజున లేదా తర్వాతి శుక్రవారం చేసుకోవచ్చు. అదీ కుదరలేదంటే ఈ మాసంలో ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి? శ్రావణమాసంలో అత్యంత విశిష్టంగా భావించే వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అన్నది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఈ విధంగా వివరించారు. వరలక్ష్మీ వ్రత కథ : కైలాసగిరిలో పరమేశ్వరుడు తన అనుచర గణములతో, మునిశ్రేష్టులతో కూడియుండగా పార్వతీదేవి అక్కడికి వచ్చింది.స్వామీ! ప్రీలు సుఖసౌఖ్యాలను, పుత్రపొత్రాదులతో కళకళలాడుతూ ఉండాలంటే ఎటువంటి వ్రతాలను, నోములను ఆచరించాలో తెలియచేయవలసిందిగా కోరుతున్నాను అన్నది. పరమేశ్వరుడు సమాధానమిస్తూ 'స్త్రీలకు సమస్త సుఖాలను ప్రసాదించు వ్రతం వరలక్ష్మీవ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతం పూర్తయ్యాక వ్రత కథను వినాలి. వ్రతాన్ని ఆచరించిన వారి మనోభీష్టాలు నెరవేరుతాయి. ఈ కథను తెలియచేస్తాను అని పరమేశ్వరుడు వ్రత కథను వినిపించాడు. పూర్వం కుండినం అనే ఒక పట్టణం ఉందేది. ఆ పట్టణాన చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె వేకువఝామునే లేచి స్నానమాచరించి పుష్పాలను తెచ్చి భర్త పాదాలకు నమస్కరించి పూజలు చేసేది. అత్తమామలకు తల్లిదండ్రుల వలె చూచుకుంటూ ఉందేది. గృహకార్యాలన్నీ స్వయంగా తానే చేసుకొనేది. చుట్టుప్రక్కల వారితో, బంధువులతో చనువుగా కలసిమెలసి ఉందేది. చారుమతి సద్దుణాలకు వరలక్ష్మీదేవి ప్రసన్నమైంది ఒకనాడు చారుమతి కలలో వరలక్ష్మీదేవి కనిపించి ఇలా అన్నది. చారుమతీ! నీ సత్ప్రవర్తనకు, సద్ద్గుణాలకు ప్రసన్నురాలిని అయ్యాను. నీకు ఒక వరం ఇవ్వాలన్న సంకల్పం కలిగింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. నీ సమస్త కోరికలు నెరవేరుతాయి. చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదవికి ప్రదక్షిణాలు చేసి స్తుతించింది. తెల్లవారిన తరువాత భర్త, అత్తమామలకు తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. చుట్టుప్రక్కల గల స్త్రీలు కూడా ఆ వృత్తాంతాన్ని విని సంతోషించారు. అందరూ కలసి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పించుకున్నారు. అందరూ శ్రావణ శుక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కొరకు వేచి చూడసాగారు. ఆరోజు చారుమతితో సహా ప్రీలందరూ వేకువ రూమననే లేచి స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించారు. చారుమతి వాకిట ముందర గోమయంతో అలికింది. అలికిన చోట బియ్యం పోసి మంటపాన్ని ఏర్పాటుచేసింది. ఆ మంటపంలోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసింది. భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించింది. ఆనాటి నుంచి ఆనవాయితీగా.. శ్లోః పద్మప్రియే పద్నిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయిధత్స్వ అనే శ్లోకాన్ని పఠిస్తూ షోడశోపచార పూజలు గావించింది. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని దక్షిణి హస్తానికి కట్టుకున్నది. వరలక్ష్మీదేవికి వివిధ ఫలభక్ష్య పానీయ, పాయసాదులను సమర్పించింది. అనంతరం 'ప్రీలందరూ కలసి వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు. మొదటి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఘల్లు ఘల్లుమని శబ్దాలు వినిపించాయి. కిందికి కాళ్ళవైపు చూసుకుంటే గజ్జెలు, రెండవ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి హస్తాలు నవరత్నఖచిత కంకణాలతో ప్రకాశించసాగాయి. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే స్త్రీలందరూ సర్వాలంకార భూషణాలతో ప్రకాశించసాగారు. వారి గృహాలన్నీ సకల సంపదలతో సమృద్ధమయ్యాయి. వ్రతం పరిసమాప్తి కాగానే చారుమతి వ్రతం చేయించిన 'బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి సత్కరించింది. వరలక్ష్మీ ప్రసాదాన్ని బంధుమిత్రులకు పెట్టి తానూ భుజించింది. లోకోపకారం కొరకు చారుమతి అందరిచేత వరలక్ష్మీ వ్రతాన్ని చేయించిందని పౌరులందరూ ఆమెను ప్రశంసించారు. ఆనాటి నుంచి అందరూ ఈ వ్రతాన్ని చేయడం ఆనవాయితీగా వస్తుంది. -
వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తాం? వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..
వరలక్ష్మీ ప్రసన్నత శ్రావణ మాసం వ్రతాల, నోముల మాసం. వాన ఇచ్చిన కొత్తందాలు, కొత్త మొలకలు, పచ్చదనాల పలకరింతలు మొదలయ్యే చల్లని నెల. 'ఆర్ద్రాం పుష్కరిణీం' అని శ్రీసూక్తం వర్ణించినట్లు 'ఆర్ద్రత' కలిగిన కరుణ రస స్వరూపిణీ జగదంబను గౌరిగా, లక్ష్మిగా ఆరాధించే మాసమిది. ఈ మాసం సర్వదేవతా ప్రీతికరం. శ్రావణ సోమవారాలు శివునకు అత్యంత ప్రీతికరాలు. అందుకే ఉత్తరాదిలో కాశీ, ఉజ్జయిని, సోమనాథ్ వంటి శివక్షేత్రాలు శివవ్రతాచరణ చేసే భక్తులతో కిటకిటలాడుతుంటాయి. మంగళవారం గౌరీ వ్రతాలు, శుక్రవారం లక్ష్మీవ్రతం, శ్రావణ పూర్ణిమ హయగ్రీవ జయంతి - ఇలా శ్రావణమాసమంతా ఒక మంగళకర వాతావరణాన్ని దర్శించింది మన సంప్రదాయం. శుక్రవారం భారతీయులకు పవిత్ర దినాల్లో ఒకటి. శక్తి ఆరాధనకు ప్రశస్తి. అందునా శ్రావణ మాసం - శుక్లపక్షం... చంద్రకళలు వృద్ధి చెందే శుక్ల పక్షపు శుక్రవారం... పైగా పూర్ణిమకు దగ్గరగానున్న శుక్రవారం మహాప్రాశస్త్యం. ఈ ఏడాది పూర్ణిమ ముందు శుక్రవారం లక్ష్మీ పూజ కొందరు చేస్తే, సరిగ్గా పూర్ణిమా శుక్రవారం కలసిన రోజున కొందరు వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారు. రెండూ మహిమాన్వితాలే. అసలు వలక్ష్మీవ్రతం అంటే ఏమిటి? ఎందుకు చేస్తాం?..ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలి?.. అమ్మవారు రసస్వరూపిణి. అందుకే రసమయుడైన చంద్రుని కళల వృద్ధిని అనుసరించి ఆమెను మనం ఆరాధించడం. 'చన్ద్రాం చన్ద్రసహోదరీం' అని లక్ష్మీనామాలు. చంద్రుని తోబుట్టువు - అని పురాణాల మాట. ఆహ్లాదం, ప్రసన్నత, ఆర్ద్రత (రసస్వభావం), నిండుదనం, ప్రీతి... మొదలైనవన్నీ చంద్ర భావనలు. ఈ భావనల దేవత లక్ష్మి. విశ్వవ్యాపక చైతన్యం వివిధ భావాలుగా వ్యక్తమవుతుంటుంది. ప్రసన్నత, గాంభీర్యం, ప్రచండత, సౌజన్యం, కారుణ్యం, కాఠిన్యం... ఈ భావాలన్నీ విశ్వచైతన్య విన్యాసాలే. ఆయా భావనల రూపంగా ఆ మహా చైతన్యాన్ని గ్రహించడమే వివిధ దేవతా రూపాల ఆవిష్కారం. ఒకే చైతన్యం నుంచి అన్ని భావనలు వ్యక్తమైనట్లుగానే, ఒకే పరమాత్మను అనేక దేవతాకృతుల్లో ఆరాధిస్తున్నారు. విశ్వవ్యాపకమైన శోభ, కళ, ఆర్ద్రత, సంపద, కాంతి, సౌమ్యత, వాత్సల్యం, ఉత్సాహం, ఆనందం వంటి దివ్య భావనలన్నీ సమాహారం చేస్తే ఆ స్వరూపమే లక్ష్మి. జగతిని పోషించే ఐశ్వర్యశక్తి, లక్షణ శక్తి లక్ష్మి. ఏ వస్తువు లక్షణం దానికి ఐశ్వర్యం. కంటికి బంగారు కళ్లజోడు లక్ష్మికాదు. కంటికి చక్కని చూపు, చక్కని ఆకృతి లక్ష్మి. ఇలా ప్రకృతిలో ప్రతి పదార్థానికి ఉండవలసిన లక్షణ సమృద్ధి, కళ లక్ష్మీ స్వరూపం. ఏ రంగంలోనైనా ఉన్నతే.. సిద్ధ లక్ష్మీః మోక్షలక్ష్మీః జయలక్ష్మీః సరస్వతీ! శ్రీర్లక్షీః వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ॥ ఏ కార్యమైనా సిద్ధే ప్రయోజనం. అది లేనపుడు కార్యానికి ప్రయత్నమే ఉండదు. అందుకే 'సిద్ధి' అనేది మొదటి లక్ష్మి. సిద్ధించిన తరువాత కార్య భారం నుంచి విముక్తులమవుతాం. ఇల్లు పూర్తవడం అనే సిద్ధి లభించాక, ఇల్లు కట్టడం అనే కార్య శ్రమ నుంచి విడుదల పొందినట్లుగా. ఆ ముక్తియే 'మోక్ష లక్ష్మి'. ప్రతికూల పరిస్థితులను దాటడమే జయలక్ష్మి. పనికి కావలసిన తెలివి తేటలు, సమయస్ఫూర్తి సరియైన నిర్ణయశక్తి విజ్ఞానం... వంటివన్నీ విద్యా లక్ష్మి, అదే 'సరస్వతి', ఫలితంగా పొందే సంపద, ఆనందం శ్రీ లక్ష్మి. దాని వలన కలిగే శ్రేష్ఠత్వం, (ఏ రంగంలోనైనా) ఉన్నతి వరలక్ష్మి. చివరి గమ్యం ఇదే. అందుకే వరలక్ష్మీ వ్రతమంటే మిగిలిన ఐదు లక్ష్ములను కూడా ఆరాధించి, ఆ అనుగ్రహాన్ని సంపాదించడమే. వరలక్ష్మీ కథ ముఖ్యోద్దేశం.. ఈ పూజలో ఆరాధించే స్వరూపం 'కలశం'. కలశంలో బియ్యమో, జలమో వేసి పచ్చని చిగుళ్ళు పెట్టి, దానిపై ఫలాన్ని ఉంచి ఆరాధించడం గొప్ప విశేషం. బ్రహ్మాండమనే కలశంలో సంపద, పచ్చదనం (మంగళం), సత్ఫలం నిండి ఆరాధన పొందుతున్నాయి. వ్రతంపై శ్రద్ధను పెంచడానికి పురాణం అందించిన కథలో - 'చారుమతి’ అనే సాధ్వి లక్ష్మీ దయను పొంది అమ్మను ఆరాధించింది. ఇది నిజానికి కథా పాత్ర కాదు. భవగదారాధనకు కావలసిన పాత్రత. దైవాన్ని ఆరాధించే వారి మతి 'చారుమతి’ కావాలి. ఉత్తమమైన గుణాలే 'చారు' (చక్కదనం). అవి కలిగిన బుద్ధి చారుమతి. ఆ బుద్ధిని లక్ష్మి కరుణిస్తుంది. ఈ సంకేతమే ఆ కథ అందించే సందేశం. పొందే సంపదలన్నీ దేవతా స్వరూపాలుగా, ప్రసాదాలుగా (ప్రసన్న భావాలుగా) దర్శింపజేసే సత్సంప్రదాయాలు మనవి. 'వరం' అంటే శ్రేష్ఠత. ప్రతిదీ శ్రేష్టమైనదే కావాలని అనుకుంటుంటాం. అలాంటి శ్రేష్టతలను ప్రసాదించే జగదంబ వరలక్ష్మి. ఆ తల్లి ప్రసన్నత కన్నా కావలిసిందేముంది!. (చదవండి: నేడు నాగ పంచమి?..గరుడు పంచమి? అనలా! ఎందుకిలా అంటే..) -
మంగళ గౌరీ వ్రతం ఎవరైనా చేయొచ్చా? పూజ ఎలా చేయాలి?
శ్రావణ మాసమంటేనే ప్రత్యేకం. మహిళలు ఈ మాసం కోసం ఎదురుచూస్తారు. ఈసారి అధిక శ్రావణం రావడంతో ముహూర్తాలు లేక ఇన్నాళ్లు శుభ కార్యాలకు బ్రేక్ పడింది. ఈ నెల 17వ తేదీ నుంచి నిజ శ్రావణమాసం ఆరంభం కావడంతో వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి. ఈ నెలలో వరలక్ష్మీ వ్రతం ఆచరించేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు. శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని అంతే భక్తిశ్రద్ధలతో చేస్తుంటారు. శ్రావణమాసంలో మంగళవారాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. మరి ఈ వ్రతాన్ని ఎవరెవరు చేయొచ్చు, నియమాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. 25న వరలక్ష్మీ వ్రతం తెలుగు మాసాలన్నింటితో పోల్చితే ఈ మాసంలో పండగలు ఎక్కువగా వస్తాయి. జిల్లాలోని అమ్మవార్ల ఆలయాలు విశేష పూజలకు సిద్ధమవుతున్నాయి. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈ నెల 25న ఈ వ్రతం చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. 31న రాఖీ పౌర్ణమి. సోదరీ, సోదరుల అనుబంధానికి ఈ పండగ ప్రతీక. వరుణుడికి కొబ్బరి కాయలు సమర్పిస్తూ సముద్రంలోకి విసురుతారు. సెప్టెంబర్ 3న శ్రావణ బహుళ చవితి సందర్భంగా సంకష్ట హర చతుర్ధి వ్రతాలు ఆచరిస్తారు. ఈ రోజున గణపతి ఆలయాల్లో వినాయకుడికి విశేష పూజలు, వ్రతాలు చేస్తారు. సెప్టెంబర్ 6న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 14న పోలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది. పెళ్లికాని అమ్మాయిలు వ్రతం చేయొచ్చా? శ్రావణమాసంలో మంగళవారాలకు కూడా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు. అయితే ఈ వ్రతం చేశాకా.. వాయినం ఇచ్చేటప్పుడు పసుపు, కుంకుమ ఇవ్వరంటా.. ఎందుకో ఇప్పుడు తెలుసకుందాం.నాలుగు మంగళవారాలు.. మహిళలు మంగళగౌరీ వ్రతాలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ ఐదవతనం కలకాలం నిలుస్తుందని భావిస్తారు. అందుకే శ్రావణమాసంలోని ప్రతి మంగళవారం.. కొత్తగా పెళ్లైయిన మహిళలు ఎక్కువగా మంగళగౌరీ వ్రతం చేస్తారు. భక్తి, శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తారు.వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ, ఆ తర్వాత ఏడాది నుంచి అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని చేసుకుంటారు. మంగళగౌరీ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాకుండా, దీర్ఘ సుమంగళిగా ఉంటారని భావిస్తారు. ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు మాత్రమే కాదు, మంగళ గౌరి దేవిని పెళ్లికాని అమ్మాయిలు కూడా ఆచరించొచ్చు. ఇలా చేస్తే మంచి వరుడు దొరుకుతాడని, వివాహం త్వరగా జరగాలని కోరుతూ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మంగళవారం వ్రతాన్ని ఆచరించే ముందురోజు కూడా నియమ నిబంధనలు పాటించాలి. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి.పూజకు గరిక, తంగెడు పూలు కచ్చితంగా ఉపయోగించాలి. వ్రతం రోజు ఉపవాసం ఉండాలి. వ్రతానికి కనీసం ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి. ఒకే మంగళగౌరీ దేవి విగ్రహాన్ని.. ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. వ్రతం పూర్తైన తర్వాత వినాయక చవితి తర్వాత, వినాయక నిమజ్జనంతో పాటు అమ్మవారిని కూడా నిమజ్జనం చేయాలి. వ్యాపారుల్లో నూతనోత్సాహం శ్రావణ మాసం ఆగమనంతో వ్యాపారుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అన్ని వ్యాపారాలూ ఊపందుకుంటాయి. ఆషాఢ మాసం తరువాత అధిక శ్రావణ రావడంతో రెండు నెలలుగా వ్యాపారాలు నత్తనడకన సాగాయి. శుక్రవారం నుంచి వ్యాపారాలు జోరందుకుంటాయని వీరంతా ఆశలు పెట్టుకున్నారు. పూలు, పండ్లు, నిత్యావసరాల వినియోగం అధికంగా ఉంటుంది. వరలక్ష్మీ వ్రతం రోజునే కాక ప్రతి శ్రావణ శుక్రవారంతో పాటు మంగళవారాల్లో కూడా మహిళలు ప్రత్యేక పూజలు ఆచరించడంతో ఆయా వస్తువులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. వస్త్ర దుకాణాలు కళకళలాడతాయి. బంగారు వ్యాపారాలు సరేసరి. బంగారు రూపులు, ఇతర వెండి వస్తువులు కొనుగోలు చేయడానికి మహిళలు ఆసక్తి చూపుతారు. జిల్లాలోని కొన్ని బంగారు ఆభరణాల వ్యాపారులు పలు ఆఫర్లను ప్రకటించారు. శుభప్రదమైన మాసం శ్రావణ మాసం హిందువులకు శుభప్రదమైన మాసం. ఈ మాసంలో ఆలయాల్లోని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించడం పుణ్యప్రదం. తమ కుటుంబాలు పదికాలాల పాటు చల్లగా ఉండాలని మహిళలు వరలక్ష్మీ వ్రతాలు, మంగళగౌరీ వ్రతాలు ఆచరిస్తారు. దీని ద్వారా లక్ష్మీకటాక్షం, సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది. వరలక్ష్మీ వ్రతాలు సామూహికంగా ఆచరించుకోవడం మరింత పుణ్యప్రదం. – శ్రీమాన్ గురుగోవింద్ చిన్న వెంకన్నబాబు స్వామీజీ శివకేశవులకు ప్రీతికరం ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. మహావిష్ణువు, లక్ష్మీదేవీలకు ఈ మాసంలో వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. శివునికి ప్రత్యేక అభిషేకాలు చేయడం ద్వారా పాపాలు కడతేరతాయని శాస్త్ర వచనం. శ్రావణ శుక్లపక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైనవి. ఈ మాసంలో పూజలు భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల తగిన ప్రతిఫలం ఉంటుంది. – టి. శ్రీమన్నారాయణాచార్యులు, గోవింద క్షేత్ర ప్రధాన అర్చకుడు -
''తలుపులు తాళాలు లేని ఇళ్ళు... దొంగతనం కూడా జరగదు''
వారణాసిలో గంగానదీ ఒడ్డున ఒక సత్రం ఉంది. ఆ సత్రానికి ఒకరోజున ముగ్గురు బాటసారులు వచ్చారు. వారు ఉదయం భోజనం ముగించాక సత్రం మధ్యలో ఉన్న చెట్టు కింది రచ్చబండ మీద కూర్చొన్నారు. ఒకరి సమాచారం ఒకరు చెప్పుకున్నారు. వారిలో పొడగరి సుదత్తుడు. అతను అంగరాజ్యం నుండి వచ్చాడు. బట్టతల వాడు సుశీలుడు కోసల రాజ్య వాసి. పొట్టిగా నల్లగా ఉన్నవాడు ధర్మధరుడు. అతను శాక్య రాజ్యం నుంచి వచ్చాడు. ‘‘మిత్రులారా! మన దగ్గర ధనం ఉంది. ఈ ప్రాంతంలో దొంగలు ఎక్కువ. మనం చూస్తూ ఉండగానే మాయం చేయగలరు. కళ్లు గప్పి సొమ్ములు కాజేసుకుపోగల నేర్పరులు.’’ అన్నాడు సుదత్తుడు. ‘‘ఇక్కడ కంటే మగధ రాజ్యం మరీనూ. పట్టపగలే దోపిడీలు చేస్తారు’’ అన్నాడు సుశీలుడు. ‘‘మా రాజ్యంలో ఆ బెడద ఉండదు’ అన్నాడు ధర్మధరుడు.‘‘మా రాజ్యంలో కూడా... మా రాజ్యంలో కూడా’’ అన్నారు మిగిలిన ఇద్దరు! ‘‘నిజమా!’’ అని ప్రశ్నించాడు ధర్మధరుడు.‘‘ఔను మిత్రమా! మా రాజ్యంలో ఇళ్ళన్నీ గట్టి గోడలతో ఉంటాయి. బలమైన తలుపులు ఉంటాయి. ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండరు. వస్తువులన్నీ ఎడాపెడా పడవెయ్యరు. పైగా.. రాజభటులు ఎప్పుడూ కావలి కాస్తూనే ఉంటారు. మన అజాగ్రత్తే దొంగలకు అవకాశం అవుతుంది. మనం నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకుని నేరం దొంగల మీద వేస్తాం’’ అన్నాడు అంగ రాజ్యానికి చెందిన సుదత్తుడు. ‘‘అసలు మా రాజ్యంలో అయితే.. దొంగతనం చేయాలి అంటేనే దొంగలకీ భయమేస్తుంది. దొంగల విషయంలో మా మహారాజుగారు మహా క్రూరంగా వ్యవహరిస్తారు. కఠిన శిక్షలు అమలు చేస్తారు’’ అన్నాడు సుశీలుడు. ‘‘దొంగతనం చేయాలంటే.. దొంగలకి వెన్నులో వణుకు వస్తుంది. అందుకే మా రాజ్యంలో ఇళ్ళకు సరైన తాళాలు కూడా వెయ్యరు. దండం దశగుణం భవత్... అంటూ ముగించాడు సుశీలుడు. ధర్మధరుడు వాళ్ళిద్దరి మాటలు విని మౌనంగా ఉన్నాడు. ‘‘మిత్రమా! మరి మీ రాజ్యం’’అని అడిగాడు సుదత్తుడు. ‘‘మిత్రులారా! మా రాజ్యంలో మా ఇళ్ళకు తాళాలు ఉండవు.’’ అన్నాడు. ‘అంటే మా రాజ్యం లాగానే అన్నమాట’’ అన్నాడు ఆతృతగా సుశీలుడు. ‘‘కాదు మిత్రమా! ఈ సుదత్తుని రాజ్యంలో ప్రజలు తమ జాగ్రత్తల్లో ఉంటారు. ఇంటికి బలమైన గోడలూ, వాటి చుట్టూ రక్షక వలయాలూ.. ఇతరులకి దొంగతనం చేసే అవకాశమే ఇవ్వరు. కాబట్టి ఆ రాజ్యంలో దొంగతనాలు లేవు. ఇక మీ రాజ్యంలో కఠోరమైన శిక్షలు. కాబట్టి, శిక్షల భయంతో మీ రాజ్యంలో చోరులు లేరు. కానీ మా రాజ్యంలో వేరు. దొంగతనానికి కఠినమైన శిక్షలు లేవు. మా ఇళ్లకూ గట్టి రక్షణలూ లేవు. అయినా దొంగతనాలు జరగవు. కారణం! దొంగతనం చేయాలనే ఆలోచనే ఎవ్వరిలోనూ ఉండదు. ‘శిక్షించబడతాం’ అనే భయంతో కోరికల్ని వదిలిపెట్టకూడదు. భయంతో వదిలే కోరికలు తాత్కాలికమే. ఇక్కడ శిక్షలు లేవు, ఎవ్వరూ చూడడం లేదు’ అనుకుంటే వెంటనే కోర్కెలు తీర్చుకోవడానికి సిద్ధపడతారు. అవకాశం లేకపోవడం వల్లనో, శిక్షల భయం వల్లనో తప్పులకు దూరంగా ఉండటం కాదు... స్వీయ నిగ్రహం వల్ల ఉండాలి. అలా ఉండాలంటే మనస్సులో కామరాగాలు నశించాలి. వాళ్లే వీతరాగులు. పరుల సొమ్ముని పాములా భావిస్తారు. మనో నిబ్బరంతో ఉంటారు. శీలవంతులుగా జీవిస్తారు. కాబట్టి మా రాజ్యంలో దొంగతనాలు తెలియవు. దొంగలకి శిక్షలు తెలియవు. వారి కోసం చెరసాలలూ లేవు.’’ అన్నాడు. ‘‘ఐతే.. మేము విన్నది నిజమే అన్నమాట’’ మీరందరూ వీతరాగులే’’ అన్నారు మిగిలిన ఇద్దరూ!‘‘అవును.. తథాగత బుద్ధుని బోధనలు పాటిస్తాం. వీతరాగులుగానే జీవిస్తాం’’ అన్నాడు ధర్మధరుడు. అలాంటి మనుషులు, వారి మనస్సులూ దుఃఖాలకి దూరమవుతాయి. అలాంటి మనుషులున్న సమాజం ఆదర్శనీయమవుతుంది. అల్లకల్లోలాలకు దూరమవుతుంది. ఆ సమాజంలో శాంతి తాండవిస్తుంది’’ అంటాడు బుద్ధుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
శ్రావణమాసంలో మాంసాహారం తినకూడదు అని ఎందుకు అంటారు?
శ్రావణమాసం అంటేనే శుభ ముహూర్తాల సమ్మేళనం. ఈ మాసంలో మహిళలందరూ భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాలతో నియమ, నిబంధనలతో పూజలు ఆచరిస్తారు. ఇక శ్రావణమాసం పూర్తయ్యేవరకు మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి? మాసం పూర్తయ్యే వరకు నాన్‌వెజ్ ముట్టుకోకపోవడానికి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు చూద్దాం. శ్రావణం కోసం కోసం తెలుగు లోగిళ్లలో చాలామంది వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.శ్రావణ మాసం అనగానే శుభకార్యాలకు ప్రత్యేకంగా భావిస్తారు. అయితే అధిక శ్రావణ మాసం అశుభకర మాసమని పండితులు నిర్ణయించటంతో ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించలేదు. నిజ శ్రావణ మాసం శుభ కార్యక్రమాలకు అనుకూలంగా నిర్ణయించగా వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి.నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనం, అక్షరాభాస్యం, అన్నప్రాశన, వ్యాపార, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనలు.. ఇలా పలు శుభకార్యాలు జరగనున్నాయి. ఎప్పటివరకు శ్రావణమాసం? సాధారణంగా శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంటుంది. సగటున జులై మధ్య నెలలో ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతుంది. కొన్నిసార్లు అధికమాసం వస్తుంటుంది. ఈసారి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఓ నెల అధిక శ్రావణ మాసం కాగా, మరో నెల నిజ శ్రావణ మాసం. తొలుత వచ్చిన అధిక శ్రావణ మాసం గత నెల 18న ప్రారంభమై ఈ నెల 16తో ముగిసింది. ఈనెల 17 నుంచి మొదలైన నిజ శ్రావణమాసం సెప్టెంబర్ 15వరకు ఉండనుంది. అయితే ఈ మాంసంలో శాకాహారానికే అధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. మాంసం ముట్టరు.. కారణాలు అవేనా? ► శ్రావణమాసం వర్షాకాలంలోనే వస్తుంది. సాధారణంగానే వర్షాకాలంలో కొన్నిరకాల ఆహార పదార్థాలను తినకూడదంటారు. వాటిలో ముందు వరుసలో ఉండేది మాంసాహారం. ఎందుకంటే ఈ కాలంలో హెపటైటిస్, కలరా, డెంగీ వంటి అనేక రోగాలు చుట్టుముడతాయి. ► నీరు నిల్వ ఉండటం, శుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో వ్యాధులు వ్యాపిస్తాయి. ఇదే సమస్య జంతువులకు కూడా ఎదురవుతుంది. దీంతో వాటి ద్వారా ఇన్ఫెక్షన్లు మనుషులకు కూడా వస్తాయని అంటుంటారు. ► ఈ కాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది.మాంసం అరగక పేగుల్లో బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణ మార్పులతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి తేలికపాటి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు. ► ఇక మరో కారణం ఏంటంటే.. చేపలు, అలాగే ఇతర జలచరాలు వర్షాకాలంలో సంతానోత్పత్తి చేపడతాయి. ఈ ప్రక్రియలో ఉన్నప్పుడు జలచరాలు కొన్ని వ్యర్థాలను నీటిలో విడుదల చేస్తుంటాయి. మళ్లీ వాటినే చేపలు తింటుంటాయి. అలా ఈ మాసంలో నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలని అంటారు. పైగా, గర్భంతో ఉన్న జీవాలను చంపి తినడం మంచిది కాదన్న విశ్వాసం కూడా దీనికి మరో కారణం. -
అధిక శ్రావణమాసం.. పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే
శ్రావణం...శుభ ముహూర్తాల సమ్మేళనం. అందుకే అందరూ శ్రావణం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండగా..నోములు, వ్రతాలతో పాటు పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కల్యాణమండపాల వద్ద సందడి కనిపిస్తోంది. పెళ్లి... ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైన వేడుక. అందుకే కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేస్తారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతి ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఇటు నూతన వధూవరులతో పాటు అటు వారి కుటుంబ సభ్యులు, బంధువులూ భావిస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది పెళ్లి ముహూర్తం. వివాహం నిశ్చయమైనా ఆషాఢమాసం, అధిక శ్రావణంతో శుభ ముహూర్తాలు లేక నిరీక్షిస్తున్న వేలాది జంటలు ఈ శ్రావణంలో ఒక్కటి కాబోతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా పెళ్లికి సన్నాయి మేళాలు మోగనున్నాయి. ఈ నెల 17న శ్రావణం ప్రారంభం కానుండగా, మరుసటి రోజు నుంచే ముహూర్తాలూ ఉన్నాయి. 18 నుంచి వివాహ ముహూర్తాలు సాధారణంగా శ్రావణ మాసంలోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతాయి. బుధవారం(16న) అమావాస్య వచ్చింది. తర్వాత నిజ శ్రావణమాసం. ఈ నెల 18వ తేదీ నుంచి దాదాపు వరుసగా 10 రోజుల పాటు వివాహ ముహూర్తాలున్నాయి. ఇవి డిసెంబర్ వరకూ కొనసాగనున్నాయి. ముహూర్త బలం వల్ల ఒకేరోజు ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతుండటంతో కల్యాణమండపాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ శ్రావణంలో చాలా ముహూర్తాలు ఉన్నప్పటికీ కొన్నింటిని దివ్యమైనవిగా పేర్కొంటారు. ఆ ముహూర్తంలోనే పిల్లల పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకే ఆయా తేదీల్లో కల్యాణ మండపాలతో పాటు అన్నీంటికీ డిమాండే. పెళ్లితో కొత్తగా ఒక్కటి కానున్న జంటలు, వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అన్ని హంగులూ ఉన్న కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల కోసం పరుగులు పెడుతున్నారు. శ్రావణమాసం మొదలు డిసెంబర్ వరకూ జిల్లాలో వెయ్యికిపైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. శ్రావణంలో పెళ్లిళ్లలతో పాటు పండుగలూ ప్రతి ఇంటా సంతోషాలు నింపుతాయి. ఈనెల 21న వచ్చే నాగుల చవితి, గరుడ పంచమి రాకతో ప్రధాన పండుగలు ఆరంభం కానున్నాయి. 22న మంగళగౌరీ వ్రతాలు 25న వరలక్ష్మీవ్రతం, 31న రాఖీ పౌర్ణిమ, ఈనెల చివరలో 31 నుంచి మూడు రోజుల పాటు రాఘవేంద్రస్వామి ఆరాధనా ఉత్సవాలు, సెప్టెంబర్ 6న శ్రీ కృష్ణాష్టమి పర్వదినాలు వరుసగా వస్తాయి. 14న పొలాల అమావాస్యతో నిజ శ్రావణంలో వచ్చే పండుగలు ముగిసి భాద్రపదంలో ప్రవేశిస్తాయి. అలాగే ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకూ నోములు, వ్రతాలు ఆచరించుకునేందుకు మహిళలు సిద్ధమయ్యారు. ఎందరికో ఉపాధి పెళ్లంటే రెండు జీవితాల కలయిక మాత్రమే కాదు. ఎందరికో ఉపాధి కూడా. పెళ్లి పత్రికల ముద్రణ, ప్లెక్సీల ఏర్పాటు, కల్యాణ మండపం, అద్దె గదులు తీసుకోవడం, ఫ్లవర్ డెకరేషన్, పెళ్లి భోజనాలు, ఫొటోలతో పాటు వీడియోలు తీయడం, పెళ్లి కూతురు అలంకరణ, ఫంక్షన్ హాలు శుభ్ర పరచడం, పురోహితులు, భజంత్రీలు, రవాణా ఇలా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే బంగారు, నిత్యవసర సరుకులు, వస్త్ర వ్యాపారులకు కూడా పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారం బాగా జరుగుతుంది. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ శుభ ముహూర్తాలు తక్కువే. జూలైలో ఆషాఢమాసం వచ్చింది. అందుచేత పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. గురువారం నుంచి శ్రావణమాసం వస్తోంది. కాబట్టి ఈ నెల 18, 20, 21, 23, 27, 31 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. సెప్టెంబర్ నెలలో కూడా 1, 3, 10వ తేదీల్లో శుభ ముహూర్తాలున్నాయి. డిసెంబర్ ఆఖరు వరకూ పెళ్లిళ్ల సీజనే. -
శుభకార్యాలకు వేళాయే.. నేటి నుంచే శ్రావణమాసం
నిజశ్రావణం గురువారం నుంచి ప్రారంభమవుతోంది. దీంతో పాటే శుభముహూర్తాలు మొదలుకానున్నాయి. నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనం, అక్షరాభాస్యం, అన్నప్రాశన, వ్యాపార, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనలు నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో అధిక మాసంగా శ్రావణం వచ్చింది. ఓ నెల అధిక శ్రావణ మాసం కాగా, మరో నెల నిజ శ్రావణ మాసం. తొలుత వచ్చిన అధిక శ్రావణ మాసం గత నెల 18న ప్రారంభమై ఈ నెల 16తో ముగిసింది. ఈ నెల 17వ తేదీ గురువారం నుంచి మొదలయ్యే నిజ శ్రావణ మాసం సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది. శుభకార్యాలకు వేళాయె.. శ్రావణ మాసం అనగానే శుభకార్యాలకు ప్రత్యేకంగా భావిస్తారు. అయితే అధిక శ్రావణ మాసం అశుభకర మాసమని పండితులు నిర్ణయించటంతో ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించలేదు. నిజ శ్రావణ మాసం శుభ కార్యక్రమాలకు అనుకూలంగా నిర్ణయించగా వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి. కాగా, శ్రావణ మాసంలో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు ముహూర్తాలు ఉండగా, ఆ తర్వాత సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 14 వరకు కొనసాగే భాద్రపదంలో ఎలాంటి ముహూర్తాలు లేవు. దీంతో ఈ నెలలో వివాహాలు, ఇతర శుభకార్యాల నిర్వహణకు అంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుభకార్యాల కాలం నిజ శ్రావణ మాసం శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. భాద్రపదం, పుష్యమాసాల్లో మినహా మిగిలిన మాసాల్లో శుభ ముహూర్తాలు బాగానే ఉన్నాయి. నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు ఇప్పటికే చాలామంది ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. -
మరణాన్ని జయించిన మార్కండేయుడు..శివానుగ్రహంతో చిరంజీవిగా
మృకండు మహర్షి భృగు సంతతికి చెందినవాడు. ఆయన భార్య మరుద్వతి. ఎన్నాళ్లయినా వాళ్లకు సంతానం కలగలేదు. సంతానం కోసం దంపతులిద్దరూ తీర్థయాత్రలు చేయసాగారు.కేదారక్షేత్రం దర్శించుకున్నప్పుడు ‘మీకు పుత్రభాగ్యం కలుగుతుంది’ అని అశరీరవాణి వినిపించింది. మృకండుడు, మరుద్వతి తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కొన్నాళ్లకు మరుద్వతికి పండంటి మగశిశువు కలిగాడు. మృకండు దంపతుల పుత్రోత్సాహానికి భంగం కలిగిస్తూ, ‘ఈ బాలుడు అల్పాయుష్కుడు. పన్నెండేళ్లు మాత్రమే ఇతడి ఆయుష్షు’ అశరీరవాణి వినిపించింది. ఈ మాటలకు వారు దుఃఖించినా, అంతా పరమశివుని లీల అని సరిపెట్టుకున్నారు. పుత్రుడికి శాస్త్రోక్తంగా జాతకర్మ జరిపించి, మార్కండేయుడు అని నామకరణం చేశారు. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న మార్కండేయుడికి మృకండు మహర్షి ఉపనయనం చేసి, గురుకులానికి పంపాడు. పదకొండేళ్ల వయసు వచ్చేసరికి మార్కండేయుడు అన్ని విద్యలూ నేర్చుకున్నాడు. తిరిగి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. బ్రహ్మతేజస్సుతో గురుకులవాసం నుంచి తిరిగి వచ్చిన మార్కండేయుణ్ణి చూసి మృకండుడు సంతోషించాడు. మరుద్వతి కొడుకును అక్కున చేర్చుకుని మురిసిపోయింది. అతడికి పదకొండేళ్లు నిండాయని ఇంకొక్క ఏడాదే గడువు ఉందనే సంగతి గుర్తుకొచ్చి ఆ దంపతులకు గుండెతరుక్కుపోయింది. మృకండుడు గుండెచిక్కబట్టుకున్నా, మరుద్వతి కొడుకును పట్టుకుని వలవలా కన్నీరు కార్చసాగింది. ఈ దుఃఖానికి కారణమేమిటని తరచి తరచి అడిగినా మరుద్వతి బదులివ్వలేదు సరికదా, బిగ్గరగా రోదించసాగింది.చివరకు మృకండుడే చెప్పలేక చెప్పలేక అసలు సంగతిని కొడుకుతో చెప్పాడు.‘నాయనా! నీ ఆయువు ఇంకొక్క ఏడాది మాత్రమే ఉంది’ అన్నాడతడు. తండ్రి మాటకు మార్కండేయుడు ఏమాత్రం తొణకలేదు. ‘తండ్రీ! అన్నింటికీ ఆ పరమశివుడే రక్ష. నేను ఆయన గురించి తపస్సు చేస్తాను. మృత్యుంజయుడినై తిరిగి వస్తాను. ఆశీర్వదించండి’ అంటూ తల్లిదండ్రుల దీవెనలు పొందాడు. మార్కండేయుడు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, అక్కడకు నారదుడు వచ్చాడు. మార్కండేయుని సంకల్పం తెలుసుకుని, ప్రశంసించాడు. ‘నాయనా! ఇక్కడి నుంచి గౌతమీ తీరానికి వెళ్లు. పంచాక్షరీ జపంతో శివుడిని అర్చించు. నీ సంకల్పం నెరవేరుతుంది’ అని ఆశీర్వదించాడు. మార్కండేయుడు గౌతమీ తీరానికి వెళ్లి, అక్కడొక సైకతలింగాన్ని ప్రతిష్ఠించి, శివుడి కోసం తపస్సు చేయసాగాడు. లోకసంచారం చేస్తూ, నారదుడు యముడి దగ్గరకు వెళ్లాడు. ‘మృత్యువును జయించడానికి మార్కండేయుడనే మునిబాలకుడు శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు. నీ బలాబలాలేమిటో తేలే సమయం వచ్చింది’ అని చెప్పి చల్లగా జారుకున్నాడు. మార్కండేయుడికి మృత్యుఘడియ రానేవచ్చింది. అతడి ప్రాణాలను తోడితెమ్మని యముడు తన దూతలను పంపాడు. శివలింగం నుంచి వెలువడే తేజస్సుకు కళ్లుచెదిరి అతణ్ణి సమీపించలేకపోయారు. చేసేదేమీ లేక వెనుదిరిగి, యముడికి జరిగినదంతా చెప్పారు. ఇక యముడే స్వయంగా మహిషాన్ని అధిరోహించి బయలుదేరాడు. సైకతలింగాన్ని గట్టిగా వాటేసుకుని, దానిపైనే తల ఆన్చి నిద్రిస్తున్న మార్కండేయుణ్ణి చూశాడు. అతడి ప్రాణాలు తీయడానికి తన కాలపాశాన్ని మార్కండేయుడి కంఠం మీదకు విసిరాడు.అంతే! హుంకారం చేస్తూ, శివలింగం నుంచి సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయుడి మీదకు పాశాన్ని విసిరిన యముడి మీదకు తన త్రిశూలాన్ని ఎక్కుపెట్టాడు. రౌద్రాకారంలో కనిపించిన శివుడిని చూసి యముడు గజగజలాడాడు. ‘హర హరా! రక్షించు’ అంటూ మోకరిల్లాడు. శివుడు యముణ్ణి క్షమించి, విడిచిపెట్టాడు. మార్కండేయుని తలపై నిమిరి లేవదీశాడు. ‘వత్సా! నీకిక మృత్యుభయం లేదు. కల్పకల్పాంతరాల వరకు చిరంజీవిగా ఉంటావు’ అని వరమిచ్చాడు. శివానుగ్రహంతో చిరంజీవి అయిన మార్కండేయుడు కళకళలాడుతూ తల్లిదండ్రులను చేరుకున్నాడు. -సాంఖ్యాయన -
మిత్రద్రోహికి మించిన ద్రోహి! కుష్టి వ్యాధి కంటే భయంకరమైన వ్యాధి..
బుద్ధుడు ధర్మ ప్రబోధం చేస్తూ, సుబాహుడనే ఓ రైతు కథ చెప్పాడు. పూర్వం ఒక గ్రామంలో సుబాహుడు అనే రైతు ఉండేవాడు. అతనికి అడవిని ఆనుకుని పంటపొలం ఉంది. ఒకరోజున పొలం దున్ని నాగలి విప్పాడు. ఎద్దుల్ని పచ్చికలో తోలాడు. తాను పొలం పనుల్లో మునిగిపోయాడు. చాలాసేపటికి గమనిస్తే ఎద్దులు కన్పించలేదు. వాటిని వెతుక్కుంటూ అడవిలోకి పోయాడు. అడవి మధ్యకు చేరాడు. దారి తప్పాడు. ఆకలి వేసింది. అక్కడ కొండ అంచున తిందుక వృక్షం కనిపించింది. మెల్లగా చెట్టెక్కాడు. ఒక కొమ్మ మీదికి చేరి పండ్ల గుత్తిని అందుకోబోయాడు. కొమ్మ విరిగి బావి లాంటి పెద్ద గుంటలో పడ్డాడు. బయటకు రాలేకపోయాడు. అలా రోజులు గడిచాయి. నీరసించి శక్తి సన్నగిల్లి మూలుగుతూ పడి ఉన్నాడు. ఆ మరునాడు ఉదయం తిందుక ఫలాల కోసం ఒక పెద్ద తోక వానరం అక్కడికి వచ్చింది. గుంటలోంచి వచ్చే మూలుగును వింది. జాలి పడింది. అరచి పిలిచింది. వాడు కళ్ళు తెరచి చూశాడు. ‘‘మానవా! భయపడకు నిన్ను కాపాడుతాను’’ అంది. ఆ పక్కనే ఉన్న రాతిబండలు గోతిలోకి జారవిడిచి మెట్లుగా పేర్చింది. గోతిలోకి దిగి, అతణ్ణి భుజాన ఎత్తుకుని పైకి చేర్చింది. ఆకు దొన్నెలో నీరు తెచ్చింది. తిందుక ఫలాలు తినిపించింది. వాడు నెమ్మదిగా శక్తి తెచ్చుకున్నాడు. తన వివరాలు చెప్పాడు. ‘‘సుబాహూ.. చింతిల్లకు.. నా వీపున ఎక్కి భుజాలు పట్టుకో’’ అంది. సుబాహుని తీసుకుని అతని గ్రామంవైపు సాగింది. కొంతసేపటికి అలసిపోయింది. ‘‘సుబాహూ... అలసటగా ఉంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఈ ప్రాంతంలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, చిరుతలు తిరుగుతూ ఉంటాయి. నీవు జాగ్రత్తగా చూస్తూ ఉండు. అవసరమైతే నన్ను లేపు’’ అని, ఆ ప్రక్కనే ఉన్న చెట్టుకి ఆనుకుని కునుకు తీసింది వానరం. ‘ఈ వానరం బలంగా ఉంది. దీని మాంసం చాలా రుచిగానూ ఉంటుంది. దీన్ని చంపి తిన్నంత తిని మిగిలినది దార్లో తింటూ పోవచ్చు.’ అనే దురాలోచన కలిగింది సుబాహుకు. వెంటనే పక్కనే ఉన్న రాయి ఎత్తి తలమీద కొట్టబోయాడు. కానీ శక్తి లేకపోవడం వల్ల చేయి వణికింది. గురి తప్పింది. వానరం లేచింది. సుబాహు వైపు చూసింది. వాడు గడగడ వణికిపోతున్నాడు. దానికి జాలి వేసింది. ‘‘మానవా! అన్నిటి కంటే పెద్దనేరం మిత్రద్రోహం. అయినా, నేను ధర్మాన్ని తప్పను. నిన్ను నమ్మను. నేను చెట్లకొమ్మల మీదినుండి వెళ్తూ ఉంటాను. నీవు నేలమీద ఆ వెనుకే రా.. నీ గ్రామానికి చేరుస్తాను’’ అంది. అలా అడవి చివరకు చేర్చి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాడు ఆ నీటిలో దిగి దాహం తీర్చుకున్నాడు. స్నానం చేశాడు. ఆ తరువాత వాడి శరీరంలో మార్పులు వచ్చాయి. ఒళ్ళంతా బొబ్బలు లేచాయి. అవి మానని గాయాలుగా మారాయి. సుబాహు కుష్ఠువ్యాధి పీడితుడయ్యాడు’’ అని చెప్పి–‘‘భిక్షువులారా! కుష్ఠువ్యాధి కంటే భయంకరమైంది మేలు చేసిన వారికి కీడు చేయడం. మిత్ర ద్రోహిని, చేసిన మేలు మరిచే వారిని చూసి అసహ్యించుకోవాలి. వ్యాధిగ్రస్తుల్ని, రోగాల్ని చూసి కాదు’’ అన్నాడు. – బొర్రా గోవర్ధన్మిత్రధర్మం (చదవండి: సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా హయిగా ఉంటుంది!) -
నాటి షబ్నం.. నేటి మీరా.. కృష్ణ ప్రేమలో మునిగితేలుతున్న లేడీ బౌన్సర్
శ్రీ కృష్ణుని జన్మస్థలి మధుర, లీలాస్థలి బృందావనం.. ఈ రెండూ భక్తులకు భక్తి భావాన్ని పెంపొందింపజేస్తాయని అంటారు. శ్రీకృష్ణుని అపార ప్రేమకు ఈ రెండు ప్రాంతాలు నిదర్శనంగా నిలిచాయి. తాజాగా ఒక ముస్లిం మహిళ తన అపార భక్తిభావనతో బృందావనం చేరుకుని, శ్రీకృష్ణుని భక్తిలో మునిగితేలుతోంది. షబ్నం.. ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లోని జిగర్ కాలనీ నివాసి ఇక్రమ్ హుస్సేన్ కుమార్తె. ఇక్రమ్ వంటపాత్రలతో పాటు లోహ విగ్రహాలను తయారు చేస్తుంటాడు. షబ్నంనకు చిన్నప్పటి నుంచే హిందూ దేవీదేవతలపై ఆరాధనా భావం ఏర్పడింది. ఇదే ఆమెను కృష్ణునిపై ప్రేమకు, ఆపై బృందావనానికి పయనమయ్యేలా చేసింది. నాలుగు నెలల క్రితం ఆమె.. చేతిలో లడ్డూ పట్టుకున్న బాలగోపాలుని విగ్రహాన్ని తీసుకుని బృందావనం చేరుకుంది. ఇక్కడి గోవర్థన ప్రదక్షిణ మార్గంలోని గోపాల ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. దీంతో ఇక్కడే ఉంటూ శ్రీకృష్ణుని భక్తిలోనే తన జీవితం అంతా గడపాలని నిశ్చయించుకుంది. 2000లో షబ్నంకు ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తితో నిఖా జరిగింది. ఐదేళ్ల తరువాత ఆమకు భర్త తలాక్ చెప్పాడు. దీంతో ఆమె తన తండ్రి ఇక్రమ్ ఇంటికి తిరిగివచ్చి కొన్నాళ్లు అక్కడే ఉంది. తరువాత షబ్నం ఢిల్లీ చేరుకుని మొదట ఒక ప్రేవేట్ కంపెనీలో, ఆ తరువాత లేడీ బౌన్సర్గానూ పనిచేసింది. శ్రీకృష్ణునిపై తనకు ఏర్పడిన ప్రేమ గురించి షబ్నం మాట్లాడుతూ ఇప్పుడు తాను తన కుటుంబ సభ్యులందరితో బంధాన్ని తెంచుకున్నానని, ఎవరితోనూ మాట్లాడటం లేదని తెలిపింది. శ్రీ కృష్ణుడే తనకు సర్వస్వం అని, అందుకే అందరికీ దూరంగా ఉన్నానని తెలిపింది. ఇది కూడా చదవండి: యువత పాడైపోతున్నదంటూ సంగీత పరికరాల దహనం! -
గ్రామదేవతలే భరత సంస్కృతికి ఆధారం!
నిజామాబాద్: భారతీయ సంస్కృతికి ఆధారం గ్రామ దేవతలేనని, ఆ గ్రామ దేవతలే గ్రామాలను, దేశాన్ని రక్షిస్తున్నాయని విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ గంగల్ లక్ష్మీపతి వ్యాఖ్యానించారు. శనివారం ఇందూరు ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో స్థానిక హరిచరన్ మార్వాడీ విద్యాలయంలో శ్రీగ్రామ దేవతలు – ఆరాధనా సంస్కృతిశ్రీ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనిషి తాను చేసే ప్రతి పనిలో భగవంతుని దర్శించడమే సంస్కృతి అని పేర్కొన్నారు. శ్రీరాముడు, పాండవులు సైతం అయోధ్య గ్రామ దేవతను, రాజ్యలక్ష్మీ దేవతను ఆరాధించినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 145 రూపాల్లో గ్రామ దేవతల్ని ఆరాధిస్తున్నారని వెల్లడించారు. ఇతిహాస సంకలన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్ మాట్లాడుతూ చరిత్ర అధ్యయనం కోసమే ఇతిహాస సంకలన సమితి అంకితమైన సంస్థ అన్నారు. ఈ కార్యక్రమంలో భోగరాజు వేణుగోపాల్, ఆకాశవాణి అధికారి మోహన్ దాస్, బొడ్డు సురేందర్, డా వారె దస్తగిరి, బలగం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
మలినాల నుంచి విముక్తి చెందాలి.. అప్పుడే ధర్మ సాధన
మనోశుద్ధి అంటే చిత్తశుద్ధి. చిత్తం ఈ మలినాల నుండి విముక్తి చెందడం. అలా విముక్తి చెందిన చిత్తంలో తిరిగి మరలా అమానవీయ విషయాలు మొలకెత్తవు. సమూలంగా నిర్మూలించబడతాయి. ఒకసారి బుద్ధుడు తన భిక్షువులతో కలసి ఒక విశాలమైన పొలంలోంచి నడిచిపోతున్నాడు. ఆ పొలం అంతకుముందే తగలబడి ఉంది. పంటను తీశాక రైతులు చెత్తనంతా తగలబెట్టారు. కానీ... ఆ తర్వాత వర్షం పడింది. ఆ తగలబడిన మసిలోంచి పచ్చని గడ్డి పిలకలు నవనవలాడుతూ పైకి లేస్తున్నాయి. బుద్ధుడు వాటి వంక చూస్తూ ముందుకు నడిచాడు. ఆ పొలం దాటి పెద్ద కాలువ కట్ట ఎక్కారు. ఆ కట్ట మీద మొదలు పైకి నరికిన పెద్ద తుమ్మచెట్టు మోడు కనిపించింది. ఆ తర్వాత రకరకాల చెట్ల మోడులు కనిపించాయి. వాటి మద్య నరికేసిన తాటిచెట్లు మోడులూ కనిపించాయి. బుద్ధుడూ, భిక్షువులూ ఆ మోళ్ళను గమనిస్తూనే ముందుకు నడిచి వెళ్ళారు. వారు కొంత దూరం పోయాక నదీ తీరంలో పెద్ద మర్రిచెట్టు కనిపించింది. అప్పటికే ఎండ ఎక్కుతూ ఉంది. కొంత సేపు సేద తీరడానికి ఆ చెట్టు కింద ఆగారు. భిక్షువులు కొన్ని సందేహాలు అడిగారు. వాటికి సమాధానమిచ్చాడు. ఆ తరువాత ఆయన ప్రబోధం ‘చిత్త మలినాలు’ మీదికి మళ్ళింది. ఆ విషయం చెప్తూ స్వచ్ఛ జలం గురించి చెప్పాడు. బుద్ధునికి నిత్య జీవితంలో తమకు అనుభవమయ్యే అంశాల్ని జోడించి, తేలికగా అర్థం అయ్యేలా చెప్పటం అలవాటు. దానితో అప్పటి వరకూ తాము నడచి వచ్చిన దారిలోని సంఘటనలు తీసుకున్నాడు. ‘‘భిక్షువులారా! చూశారుగా! మనం నడచి వచ్చిన పొలాన్ని తగులబెట్టారు. అయినా ఆ తరువాత దానిలోని గడ్డి, తుంగ పరకలూ మొలకెత్తాయి. అలాగే... గట్టు మీది ఎన్నో చెట్లు మొదలంటూ నరికినా, మరలా పిలకలు వేశాయి. చివురులు తొడిగాయి. ఐతే ఒకే ఒక జాతి వృక్షాలు మాత్రం నరికివేశాక అవి ఎలాంటి చివురులు తొడగలేవు. అవి ఏమిటో గమనించారా?’’ అని అడిగాడు. ఒక భిక్షువు వినమ్రంగా ‘భగవాన్! తాటిచెట్లు’ అన్నాడు. బుద్ధుడు చిరుమందహాసంతో –‘‘అవును భిక్షూ! నీ పరిశీలన సరైనదే! మన మనస్సులో రాగద్వేషాలూ, కోరికలూ, మోహాలు అనే అకుశలాలు అన్నీ అలాగే నరికివేయబడాలి. అవి మరలా మొలకెత్తకూడదు. చివురులు తొడక్కూడదు. తాటిచెట్టును కొట్టి వేశాక, ఎలా చివురులు వేయదో, పిలకలు తొడగదో మన మనో క్షేత్రంలో అకుశలాల్ని, కోర్కెల్ని (తృష్ణల్ని) అలాగే తొలగించుకోవాలి. మొదలంటూ నరికిన తాటిచెట్టులా తృష్ణల్ని తెగతెంచుకోవాలి. అదే తృష్ణాక్షయం. అలాంటి చిత్తమే నిర్మల చిత్తం. స్వచ్ఛమైన నీటిలాంటి చిత్తం. మన ధర్మ సాధనంతా అలాంటి నిర్మల చిత్తం కోసమే!’’ అన్నాడు. ఆ గంభీర ధర్మోపదేశం వారి హృదయాల్ని తాకింది. వారి మనో ఫలకంపై మొదలు నరికిన తాటిచెట్టు ప్రత్యక్షం అయింది. అప్రయత్నంగా అందరూ కనురెప్పలు మెల్లగా మూశారు. ఏకాగ్రతలోకి జారుకున్నారు. ధ్యాన నిమగ్నులయ్యారు. – డా. బొర్రా గోవర్ధన్ -
అసలు 'ఆచమనం' ఎందుకు చేయాలి? మూడుసార్లే ఎందుకు తాగాలి..
పూజలు, వ్రతాల్లో 'ఆచమనం' అనేమాట చాలాసార్లు వింటాం. కానీ ఆ పదానికి అర్ధం.. అసలు అలా ఎందుకు చేయాలి అనే విషయం చాలామందికి తెలియదు. అందుకే 'ఆచమనం' అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో చూద్ధాం. "ఆచమనం" అనే ఆచారం అపరిమితమైనది. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు. ఆచమనం చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఎన్నిసార్లు అయినా చేయొచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి. ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజ మునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసే నీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి. ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. అంతా బాగానే ఉంది మరీ అసలు ఆచమనం ఎందుకు చేయాలి? నీటిని అరచేతిలో పోసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి?. అలానే ఎందుకు తాగాలి?. ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు?. మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి?. నీరు కొంతఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది. “కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా” అని మాత్రమే ఎందుకు చెప్పాలి? ఇలాంటి ఎన్నో లెక్కకు మించి సందేహాలు మీమదిలో వచ్చే ఉంటాయి. పైగా దేవుడు, ఆచారాల పట్ల నమ్మకం లేని నాస్తికులు అయితే వీటిని అపహాస్యం చేస్తారు కూడా. అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం. మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి. ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక, గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం. ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అని చెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. ఒక రకంగా వ్యాయామం.. ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు. శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్నినీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగా తాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ, జాగ్రత్త అలవడుతుంది. రోజులో ఆచమనం పేరుతొ అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది. 'కేశవాయ స్వాహా' అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. 'నారాయనాయ స్వాహా' అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా 'మాధవాయ స్వాహా' అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది. ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్లమేలు జరుగుతుంది. ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది. ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, పేగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి. ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై, లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి. ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉండటమేగాక శాస్త్రీయత కూడా ఉంది. (చదవండి: నేటి నుంచి అధిక శ్రావణమాటాసం? అంటే ఇది డూప్లికేటా?) -
నేటి నుంచి అధిక శ్రావణమాసం? అంటే ఇది డూప్లికేటా?
ఈనెల జూలై 18వ తారీకు నుంచి అధిక శ్రావణమాసం ప్రారంభం అవుతోంది. 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం ఇది. ఈ మాసం నేటి(జూలై 18) నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు అధిక శ్రావణ మాసం ఉంటుంది. అయితే ఈ అధిక మాసం అనేది కేవలం వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలకు మాత్రమే వస్తుంది. మిగతా మాసాలకు ఎప్పుడూ అధిక మాసం రాదు. ఐతే ముందుగా ఈ అధిక మాసం వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. అసలు అధికమాసం ఎందుకు వస్తుంది?. అంటే ఇది డూప్లికేట్ అని అర్థమా? ఎలాంటి జపతప వ్రతాలు ఆచారించాల్సిన పని లేదా? అధికమాసం ఎందుకు వస్తుదంటే.. తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, రుతువులు, పంచాంగ గణన ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంపావు రోజులు వ్యత్యాసం ఉంటుంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం అవదు. చాంద్రమానంలో సూర్య సంక్రాంతి లేని మాసాన్ని అధికమాసం అంటారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని పిలుస్తారు. ఇది పాటించం అంటే కుదరదు.. కొన్ని ఏళ్ల తర్వాత జోడు శ్రావణ మాసాలు రావడం జరిగింది. శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తామో అదేవిధంగా మొదటి శ్రావణంలో కూడా అవే నియమాలను తప్పక పాటించాలి. ఉదాహరణకు కవల పిల్లలు పుడితే వద్దంటామా..? లేదు కదా అలాగే జోడు శ్రావణ మాసాలు వచ్చినప్పుడు కూడా ఒకటి పాటిస్తాం మరొకటి పాటించము అంటే ధర్మశాస్త్రము అంగీకరించదు. కావున రెండూ శ్రావణ మాసాలే. మొదటి శ్రావణ మాసంలో కూడా వ్రతాలు, పూజలు అనగా శ్రావణ సోమవారాలను, శ్రావణ శుక్రవారాలను, శ్రావణ శనివారాల వంటివి, అలాగే మధ్య మాంసాలను స్వీకరించకుండా కేవలం సాత్విక ఆహారాలను మాత్రమే స్వీకరించడం తదితరాలన్ని చేయాల్సిందే. విష్ణువుకి ఎంతో ఇష్టమైనది.. శ్రీమహా విష్ణువుకి మహా ప్రీతికరమైన మాసం ఇది. అందుకే దీన్ని అధిక రాధా పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఈ మాసంలో చేసే దానాలు, వ్రతాలు అధిక ఫలితాలనిస్తాయి. ఈ మాసంలో ఏది దానం చేసిన శ్రీ అధిక రాధా పురుషోత్తమ ప్రీత్యర్థం ఇస్తున్న దానం పేరు చెప్పి కరిష్యే అనాలి. అలాగే ఈ రోజుల్లో శ్రీ అధిక రాధా పురుషోత్తమాయ నమః అని 108 సార్లు జపం చేయాలి. విష్ణువు శ్రీమహాలక్ష్మికి ఓ సందర్భంలో పురుషోత్తమ మాస విశిష్టతను వివరిస్తూ ‘ఎవరైతే ఈ మాసంలో పుణ్య నదీస్నానాలు, జపహోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయి. అధిక మాసంలో పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో కష్టనష్టాలు ఎదురవుతాయి. అధిక మాసం శుక్ల పక్షంలో కానీ, కృష్ణ పక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి నాడైనా పుణ్యకార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన ఫలితం లభిస్తుందని వివరించాడని పురాణ కథనం. (చదవండి: ఈ అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో సమానమైనది!) -
దంభోద్భవుడి గర్వభంగం.. అందుకే విర్రవీగకూడదంటారు
పూర్వం దంభోద్భవుడు అనే రాజు ఉండేవాడు. మహా బలశాలి. సమస్త భూమండలాన్నీ పాలించేవాడు. అంతేకాదు, పేరుకు తగినట్లే మహా గర్విష్టి. రాజోచితంగా అలంకరించుకుని సభకు వచ్చి స్వర్ణ సింహాసనంపై ఆసీనుడయ్యేవాడు. ప్రతిరోజూ అతడు సభలోకి అడుగుపెడుతూనే వందిమాగధులు అతడి బలపరాక్రమాలను చిలవలు పలవలుగా పొగుడుతూ కీర్తనలను గానం చేసేవారు. సభాసదులు జయజయ ధ్వానాలు పలికేవారు. దంభోద్భవుడు వీనులవిందుగా వాటిని ఆలకిస్తూ, గర్వాతిశయంతో మీసాలను మెలితిప్పుకొనేవాడు. గుణగానాల ప్రహసనం సద్దుమణిగాక దంభోద్భవుడు గర్వాతిశయంతో సభాసదులను తిలకిస్తూ, స్వోత్కర్ష మొదలు పెట్టేవాడు. ‘ఈ భూమండలంలో నన్ను ఎదిరించి, ఓడించే వీరుడెవడైనా ఉన్నాడా? బాణ ఖడ్గ గదా యుద్ధాల్లో నన్ను మించిన వాడున్నారా? మల్లయుద్ధంలోనైనా నాతో తలపడగల వాడున్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి. క్షణాల్లోనే మట్టుబెడతాను’ అంటూ గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగరేసేవాడు. దంభోద్భవుడి మంత్రులు కూడా అతడికి తగిన వారే! రోజూ అతడి బల పరాక్రమాలను పొగుడుతూ కాలక్షేపం చేసేవారు. దంభోద్భవుడికి నానాటికీ అహంకారం పెరగసాగింది. ఒకరోజు కొందరు విప్రులు దంభోద్భవుడిని చూడవచ్చారు. దంభోద్భవుడు వారికి సాదరంగా స్వాగతం పలికి, అతిథి సత్కారాలు చేశాడు. వారి ఎదుట అలవాటు కొద్దీ స్వోత్కర్ష మొదలుపెట్టాడు. పాపం ఆ విప్రులు కిక్కురుమనకుండా అతడి ప్రగల్భాలన్నింటినీ ఓపికగా ఆలకించారు. దంభోద్భవుడు తన ప్రసంగాన్ని ఆపి, ఇక మీరేమంటారు అన్నట్లుగా విప్రులకేసి చూసి కళ్లెగరేశాడు.‘రాజా! నువ్వు మహావీరుడవు, అసామాన్య శూరుడవు, పరాక్రమవంతుడవు, అమిత బలసంపన్నుడవు. భూమ్మీద ఉన్న రాజులెవరూ నిన్ను ఎదిరించి నిలువలేరు. అంతవరకు నిజమే!’ అన్నారు.‘అంతవరకు నిజమే అనడంలో అంతరార్థమేమిటి?’ కనుబొమలు ముడివేస్తూ ప్రశ్నించాడు దంభోద్భవుడు.‘రాజా! గంధమాదన పర్వతంపై నరనారాయణులనే ఇద్దరు రుషిపుంగవులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారిని జయించగల వీరులు ముల్లోకాలలోనూ లేరని విన్నాం. నీ పరాక్రమాన్ని చాటుకోవాలనే కోరిక ఉంటే, వారితో యుద్ధంచేసి సంగతి తేల్చుకోవచ్చు’ అన్నారు విప్రులు.విప్రులు ఆ మాట అనడంతోనే దంభోద్భవుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. కాలు నేలకేసి బలంగా తాటించాడు. కత్తి తీసి ఝుళిపించాడు. మీసం మెలితిప్పాడు. ‘నన్ను మించిన వీరులా వాళ్లు, ఎంత కావరం?’ అంటూ అప్పటికప్పుడే యుద్ధానికి బయల్దేరమంటూ సైన్యాన్ని ఆదేశించాడు. సాయుధంగా రథం సిద్ధం చేసుకుని, హుటాహుటిన బయలుదేరాడు.దంభోద్భవుడు గంధమాదన పర్వతం వద్దకు చేరుకునే సరికి, కొండ మీద నరనారాయణులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ కనిపించారు. వారిని చూసి, తొడగొట్టి యుద్ధానికి రమ్మంటూ పిలిచాడు. పిలుపు విని నరనారాయణులు లేచి వచ్చి, అతడికి అతిథి సత్కారాలు చేయబోయారు. ‘ఇవన్నీ నాకు వద్దు. నాకు కావలసింది మీతో యుద్ధం’ అన్నాడు దంభోద్భవుడు.‘నాయనా! మేం మునులం. ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాం. మమ్మల్ని తపస్సు చేసుకోనీ. నువ్వు వచ్చిన దారినే వెనక్కు వెళ్లు’ అన్నారు. దంభోద్భవుడు వినలేదు. వికటాట్టహాసం చేస్తూ యుద్ధం చేయాల్సిందేనంటూ వారిపై సంధించడానికి బాణం తీశాడు. నరనారాయణుల్లోని నరుడు ఒక దర్భపుల్ల తీసుకుని ప్రయోగించాడు. అది దంభోద్భవుడి బాణాన్ని తుంచేసింది. అతడు వరుస బాణాలు కురిపించాడు. అతడి సైన్యం కూడా బాణాలు ప్రయోగించింది. వాటన్నింటినీ ఆ దర్భపుల్ల తుత్తునియలు చేసింది. సైనికులను గాయపరచింది. వారు హాహాకారాలు చేస్తూ పలాయనం చిత్తగించారు. దంభోద్భవుడికి ధైర్యం సడలింది. ఆయుధాలను కిందపెట్టి, నరనారాయణుల పాదాల మీద వాలాడు. ‘మహర్షులారా! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చిత్తం జరిగింది’ అని ప్రార్థించాడు.‘నాయనా! పరాక్రమం ఉన్నవారు ఇతరుల రక్షణ కోసం ఆ పరాక్రమాన్ని ఉపయోగించాలి. ధనం ఉన్నవారు నిరుపేదలకు దానం చేయడానికి ఉపయోగించాలి. గర్వాతిశయంతో మిడిసిపడటం తగదు. నిస్సహాయులకు సహాయం చేయని జన్మ వ్యర్థం’ అని హితవు పలికారు. గర్వభంగమైన దంభోద్భవుడు వారి నుంచి సెలవు తీసుకుని వెనక్కు మళ్లాడు. -
హద్దులు దాటితే ప్రమాదం.. చెడ్డ ఆలోచనలు మనసులోకి రానీయకూడదు
పూర్వం కురు రాజ్యాన్ని ఇంద్రప్రస్థ నగరం రాజధానిగా ధనంజయ కౌరవ్యుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని ఆస్థాన పురోహితుడు, మంత్రి సుచీరతుడు అనే పండితుడు. ఒకరోజున వారిద్దరూ కూర్చొని పరిపాలన విషయాలు చర్చించుకుంటూ ఉండగా ‘ధర్మయజ్ఞం’ అనే విషయం చర్చకు వచ్చింది. ‘‘అశ్వమేధం, రాజసూయం, పుత్రకామేష్టి మొదలైన యాగాలు తెలుసు. ధర్మ యాగం ఎలా చేయాలి అచార్యా!’’ అని అడిగాడు రాజు. ‘‘మహారాజా! నాకూ పూర్తిగా తెలియదు. మన రాజ్యంలో భగీరథీ తీరంలో విదుర పండితుడు ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడు. వెళ్ళి వివరంగా తెలుసుకు వస్తాను. శెలవియ్యండి’’ అని అడిగి మరునాడు బయలుదేరి వెళ్ళి విదుర పండితుణ్ణి కలుసుకున్నాడు. విదురుడు తన మిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నల తర్వాత తాను వచ్చిన విషయం చెప్పాడు సుచీరతుడు.అంతలో ఎందరో శిష్యులు ఆయన సందర్శన కోసం వచ్చారు. దానితో ....‘‘మిత్రమా! నేను ఈ సమయంలో ధర్మయాగం గురించి చెప్పలేను. అదిగో.. అక్కడ అడవి సమీపంలో నా పెద్ద కుమారుడు భద్రకారుని ఆశ్రమం ఉంది. అతనూ పండితుడే. వెళ్ళి భద్రకారుణ్ణి అడుగు’’ అని చెప్పి పంపాడు సుచీరతుడు ఆయన వద్దకు వెళ్లి తాను వచ్చిన విషయాన్ని వివరించగా... ‘‘మహాశయా! మీ ప్రశ్నకు సమాధానం చెప్పే యోగ్యత నాకు లేదు. ఇంకా రెండు యోజనాల దూరం ముందుకు వెళ్ళు. అక్కడ నదీతీరంలో ఒక ఆశ్రమం ఉంటుంది. అది నా పెద్ద తమ్ముడు సంజయునిది. అతడు ప్రాజ్ఞుడు. నీకు అతను సమాధానం చెప్తాడు’’ అని సగౌరవంగా సాగనంపాడు భద్రకారుడు. సుచీరతుడు వెళ్ళే సమయానికి సంజయుడు అక్కడ లేడు. తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. వచ్చాక, సుచీరతునికి తగు సత్కారాలు చేశాడు. ఆ విషయం తెలుసుకుని– ‘‘సుచీరతా! నేను కూడా దీనికి సమాధానం చెప్పలేను. నిజం చెప్పాలంటే అందుకు తగను. సదాచార భ్రష్టుణ్ణి. ఇందుకు తగినవాడు మా అందరికంటే చిన్నవాడు మా తమ్ముడు సంభవుడు. అతని ఆశ్రమం ఈ పక్కనే ఉంది. వెళ్ళు’’ అని మర్యాద పూర్వకంగా చెప్పాడు. సుచీరతుడు మరునాటి వేకువనే లేచి సంభవుని దగ్గరకు వెళ్ళాడు. విషయం అంతా చెప్పాడు. ఉదయం స్నానాదికాలు పూర్తయ్యాక వారిద్దరూ ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నారు. ‘‘సుచీరతా! ధర్మయాగం చేసేవారు ఐదు విషయాలు పాటించాలి. అందులో మొదటిది; ఎప్పుడు చేసే పని అప్పుడే చేయాలి. తరువాత చేయవచ్చులే అని బద్ధకించకూడదు. నిర్లక్ష్యం తగదు. ఈ రెండు లక్షణాల్ని సమయపాలన అనే యజ్ఞగుండంలో కాల్చి బూడిద చెయ్యాలి. ఇక రెండోది; ఎవ్వరు ఏది చెప్పినా జాగ్రత్తగా వినాలి. విన్న ప్రతిదాన్ని ఆచరించకూడదు. బాగా ఆలోచించి సరైన వాటిని మాత్రమే ఆచరించాలి. మూడోది; ఏ విషయంలోనూ హద్దు దాటకూడదు. ప్రకృతిలో ఒక్కో శక్తికి ఒక్కో హద్దు ఉంటుంది. సమాజంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో హద్దు ఉంటుంది. అర్హత ఉంటుంది. ప్రతి వారు తమ తమ హద్దులు తెలుసుకోవాలి. ఈ హద్దులు అమానవీయ, అకుశల విషయాల్లో లింగ భేదాల్లో కాదు. మన సామాజిక నైతిక నడవడికలో తండ్రికి, తల్లికి, తనయులకీ, గురువులకీ ఒక్కొక్కరికి ఒక్కో హద్దులుంటాయి. వారి వారి హద్దుల్లో వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి. నైతిక హద్దులు దాటడం చాలా ప్రమాదం. అలాగే అధర్మ కార్యాలు చేయకూడదు. మనం చేసే పనులు మనకూ, పరులకూ హితాన్ని, సుఖాన్ని ఇవ్వాలి. ఇలా అందరికీ సుఖాన్నిచ్చేవే ధర్మకార్యాలు. అధర్మ కార్యాలు చేసేవారు రేవు కాని చోట నదిలో స్నానానికి దిగిన వారితో సమానం. అది వారికే ప్రమాదం. ఇక ఐదో విషయం; చెడు తలపులు మానాలి. చెడు చేష్టలే కాదు. చెడ్డ ఆలోచనల్ని మన మనసులోకే రానీయకూడదు. ఒకవేళ వచ్చినా యజ్ఞ జ్వాలలో మండించే సమిధల్లా వాటిని కాల్చి బూడిద చెయ్యాలి. సుచీరతా! ఈ ఐదూ పాటిస్తే అదే ధర్మయాగం. ఈ యాగం చేసినవారు శుక్ల పక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెంది, పున్నమి చంద్రునిలా శోభిల్లుతారు’’ అని చెప్పాడు. సుచీరతుడు ఇంద్రప్రస్థం చేరి ధనంజయు కౌరవ్యునికి ఈ విషయాలు చెప్పాడు. తన రాజ్యంలో ప్రజలందరూ– ‘ధర్మయాగం’ చేయవలసిందిగా రాజు చాటింపు వేయించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
నేడు సోమావతి అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో..
ఈ అమావాస్య అత్యంత శక్తిమంతమైనది. సోమవారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతీ అమావాస్య అని పిలుస్తారు. ఇక ఇది కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైనది. సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్రం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి: ⇒ సోమావతీ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. ⇒ ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ⇒ శని మంత్రాన్ని పఠించి, శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించాలి. ⇒ గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. ⇒ వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం - సోమావతీ అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. సోమావతి అమావాస్య గురించి ఒక కథఉంది. పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన ఏడుగురు కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉంది. ఒకరోజు పెళ్ళికాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడతారు. ఈ విషయమై ఒక పురోహితుడి దగ్గరకి వెళ్లి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది ఆ వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్లైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా.. వారు చాలా బాధపడి దీనికి ఎలాంటి పరిష్కారమూ లేదా అని అడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెల్లి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు, తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి ఆ ప్రాంతానికి బయలుదేరుతాడు. వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సివస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటారు. ఆ చెట్టుపైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి ఆ రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈ సారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయ చేస్తుంది. ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు పాటు సేవ చేయగా.. ఈ సోమావతి అమావాస్య రోజునే ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతీ అమావాస్య కథ. అంతేగాకుండా సోమావతీ అమావాస్య రోజున పూర్వీకుల కోసం దానం చేస్తే కోపంతో ఉన్న పూర్వీకులు కూడా సంతోషించి తమ సంతతి పురోగతిని దీవిస్తారు. ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీపరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, వీలైతే మౌనం పాటించాలి. (చదవండి: సైన్స్ ఆగిపోయిన సమయాన ..) -
Thursday Myths: గురువారం ఆ రంగు శుభసూచికం, అదృష్టం వరిస్తుందట!
హిందూ సాంప్రదాయంలో అనేక ఆచారాలను పాటిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజుకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. గురువారం శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజని చెబుతుంటారు. అందుకే గురువారం దేవ గురువు బృహస్పతి, విష్ణుదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయన అనుగ్రహం పొందాలంటే ఎంతో నిష్టగా పూజాక్రతువులను ఆచరించాల్సి ఉంటుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం నాడు కొన్ని పనులు చేయడాన్ని నిషిద్దంగా భావిస్తారు. మరి గురువారం నాడు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. గురువారం ఆ రంగు శుభసూచికం గురువారం శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం చేయడం వల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయట. పెళ్లి ఆలస్యం అవుతున్నా, వివాహంలో సమస్యలున్నా గురువారం రోజున ఉపవాసం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇలా 11 వారాలు ఉపవాసాలు చేస్తే చాలా మంచిదట. గురువారం నాడు అరటిపండ్లను దానం చేసినా, పసుపు రంగు బట్టలు వేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయట. గురువారం అరటి చెట్లకు పూజించడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయట. గురువారం నాడు చేయకూడని పనులు ♦ గురువారం బృహస్పతికి అత్యంత ప్రీతికరమైన రోజు. బృహస్పతి ఆధిపత్యం వహించే గురువారం నాడు మహిళలు తలస్నానం చేయకూడదట. మహిళల జాతకంలో బృహస్పతి భర్త కారకం. అవుతుందట. అందుకే తలంటు పోసుకోవడం వల్ల కుజుడు బలహీనంగా మారుతాడని అంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీ ముఖ్యంగా భర్త, పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అంటారు. ఫలితంగా ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారని విశ్వాసం. ♦ గురువారం శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన రోజు. ఆరోజు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేస్తే ఆయనకు కోపానికి కారణమవుతారని పండితులు విశ్వసిస్తారు. ఫలితంగా డబ్బుకు కొరత ఏర్పడుతుందని అంటారు. ♦ గురువారం నాడు బట్టలు ఉతకడం, ఇంట్లో బూజు దులపడం వంటివి చేస్తే విష్ణుమూర్తికి కోపం వస్తుందట. ♦ గురువారం నాడు అద్దాలు, కత్తెరలు వంటి పదునైన వస్తువులకు కొనుగోలు చేస్తే అరిష్టమని పండితులు చెబుతారు. ♦ గురువారం నాడు డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం లాంటివి చేయకూడదట ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై సంపద కొలువ ఉండదని చెబుతారు. గమనిక: పైన పేర్కొన్న అంశాలు విశ్వాసాలకు, ఆచారాలకు సంబంధించినవి. వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్, కశ్చితమైన ఆధారాలు లేవు. -
జీవితం విస్తరాకు.. తిన్నాక మరి ఉంచరు! ఏమీ లేకుండానే నిన్ను కూడా!
జీవితం క్షణ భంగురం అని తెలిసి కూడా చేయరాని పనులు చేసి మనిషి ఎన్నో అగచాట్లు పడుతుంటాడు. కొందరు అధికారం, అహం, ఆవేశం, అసూయ అనే 'అ'అక్షరం పట్టుకుని ఆఖరికి.. 'ఆ!'.... అని అర్రుల చాచుతూ ఆక్రందన చేసే పరిస్థితిని కొనితెచ్చుకుంటారు. మరికొందరు కామం, క్రోధం, అనే వాటితో క్షమార్హమైన పనులకు పాల్పడి కష్టాల కడలిలో కొట్టుకుపోతుంటారు. పగ, పిసినారితనం, అనే 'ప' అక్షరాన్ని పట్టుకుని పడరాని పాట్లు పడి పెడబొబ్బలు పెడుతుంటారు మరికొందరు. ఆ తర్వాత ఏదో జబ్బు చేసో లేక అనుకోని ప్రమాదంలోనో తనువు చాలిస్తారు. మన జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అసహ్యం కలగకూడదు. ఏంటిది! జీవితం ఇలా వృథా చేసుకున్నానా? అని తెలుసుకునేలోపే మన కథ ముగిసిపోతుంది. అందుకే అంటారు పెద్దలు బతికి ఉన్నప్పుడే నలుగురికి ఉపయోగపడే పనులు కనీసం ఒక్కటైన చేసి మనిషి అనిపించుకోమని. కనీసం కౌమర, యవ్వన దశలో తెలిసో తెలియకో ఉడుకురక్తంతో ఉచితానుచితాలు ఆలోచించకుండా చేసి ఉండొచ్చు. కనీసం వృద్ధాప్యంలోనైనా తనకు చేతనైనంతలో ఇతరులకు సేవ చేసి తరించాలి. బహుశా అందుకే కాబోలు పెద్దలు మనిషి జీవితం విస్తరాకులాంటిది అని చెప్పారేమో! ఎందుకిలా అన్నారంటే.. ఇది వరకు ఎక్కువగా పెళ్లిళ్లు, పేరంటాలు, వేడుకల్లో.. భోజనాలు విస్తరాకుల్లోనే వడ్డించేవారు. అందువల్ల దీనితో మనిషి జీవితాన్ని పోల్చి ఉండవచ్చు. ఇక మనిషి జీవితానికి విస్తరాక్కి ఉన్న పోలిక ఏంటో చూస్తే.. భోజనం చేసేటప్పుడు మనం కొద్దిగా నీళ్లు విస్తరిలో జల్లి శుభ్రంగా చేసుకుంటాం. ఆ తర్వాత భోజనం పూర్తయ్యేవరకు దానిని జాగ్రత్తగా చూసుకుంటాం. తిన్న మరుక్షణం, ఆ ఆకుని మడిచి దూరంగా విసిరేస్తాం. మనిషి జీవితం కూడా అంతే! ఊపిరి పోగానే ఒక్క క్షణం కూడా ఉంచం. అయితే ఇక్కడ విస్తరాకు పడేసినప్పుడు అది సంతోషడుతుందట. ఎందుకంటే తాను పోయే ముందు కనీసం ఒక్కరి ఆకలినైనా తీర్చటానికి ఉపయోగపడ్డానులే అని తృప్తి పడుతుందట. కానీ మనిషికి ఆ తృప్తి ఉండదు. పోయే ముందు వరకు ఏదో ఒక వ్యాపకంతో సతమతమవుతూ.. ఎవరో ఒకరితో పోట్లాడుతూనే ఉంటాడు మనిషి. చేద్దాంలే సేవ అనుకునేలోపే జీవితం జగడాలు, పట్టింపులతో ముగిసిపోతుంది. ఏ క్షణం మనల్ని మృత్యువు కౌగిలించుకుంటుందో చెప్పలేం. ఆ తరుణం రాగానే మన ఒంటిపై గుడ్డకూడా ఉంచరు. ఎంత పెద్ద ధనికుడైన శ్మశానానికి చేరుకోవాల్సిందే. ఏ డబ్బు కోసం అందరితో తగవులాడి, శత్రుత్వం తెచ్చుకున్నామో.. ఆ సొత్తులోంచి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకుపోలేం. అందుకే పెద్దలు ఊపిరి ఉన్నప్పుడే నలుగురుకి ఉపయోగపడే పనులు చేసేలా జీవించండిరా! అని హితవు చెప్పేది. లేదంటే విస్తరాకు పాటి విలువ కూడా లేని వృథా జీవితంగా మారుతుందని వారి హెచ్చరిక. (చదవండి: సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం ఎక్కడో తెలుసా!) -
మంగళవారం మంచిదికాదా? ఎందుకు ఆ రోజు ఆ పనులు చేయరు!
మనలో చాలా మంది ఏ పని ప్రారంభించాలన్నా వారం, వర్జ్యం అనేవి చూసుకుంటారు. అలాగే చాలా మంది మంగళవారం గోర్లు, వెంట్రుకలు కత్తిరించుకోవడం అశుభంగా భావిస్తారు. దీని వెనుక కారణమేంటో తెలుసా? వారంలో అన్ని రోజులు తెరిచి ఉండే సెలూన్ షాప్‌లు మంగళవారం మాత్రం మూసి ఉంటాయి. ఆరోజున క్షౌరశాలలు నిర్వహించే నాయి బ్రాహ్మణులు అందరూ సెలవు దినంగా పాటిస్తారు. పైగా ఆ రోజు ఏ మంచి పని మొదలుపెట్టరు. ఎక్కడికీ వెళ్ళరు మరీ అర్జెంటు.. తప్పనిసరి ఐతే తప్ప. మంగళవారం మంచిదికాదన్న సంగతి ఎలా వచ్చింది..? ఎవరు చెప్పారు..? ఎంతవరకు నిజం..? చూద్దామా!. తమ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే హిందువులు ఎవరూ కూడా మంగళవారం రోజున కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోరు. శరీరంపై అంగారక గ్రహ ప్రభావం మంగళవారాన్ని అంగారక గ్రహం రోజుగా (Mars Day) భావిస్తుంటారు. అంగారక గ్రహం అనేది ఎరుపు వర్ణానికి చిహ్నం. ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది. గ్రహ ప్రభావం వల్ల మంగళవారం రోజున ఆ వేడి మానవ శరీరంపై ప్రభావం చూపుతుందంటారు. ఆ రోజు శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ. శరీరంపై గాట్లు పడే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. కాబట్టి ఆ రోజున కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోవద్దని పెద్దలు చెప్పారు. జుట్టు కత్తిరించుకోడాన్ని ఆయుష్కర్మ అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పని చేయరాదు. ముందుగా గడ్డం, ఆపైన మీసం, ఆ తరువాత తలమీద ఉన్న జుట్టూ తీయించుకోవాలి. ఆపైన చేతిగోళ్లు, చివరగా కాలిగోళ్ళు తీయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరుసను అతిక్రమించరాదు. కొన్ని రోజులలో ఈ ఆయుష్కర్మ నిషిద్ధం. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య పౌర్ణమి తిధులు నిషిద్ధాలు. ప్రతినెలా వచ్చే సంక్రాంతి కూడా నిషిద్ధమే. వ్యతీపాత, విష్టి యోగ కరణాలలో, శ్రాద్ధ దినాలలో నిషిద్ధం. వ్రతదినాలైతే కూడా క్షవరము చేయించుకోరాదు. ఆయుష్కర్మ చేయించుకునే వారాన్ని బట్టి ఆయుష్షు పెరగడం కానీ తరగడం కానీ ఉంటుంది. శుక్ర వారమైతే పదకొండు నెలలు, బుధవారం అయితే ఐదు నెలలు, సోమవార అయితే ఎనిమిది నెలలు ఆయుష్షు పెరుగుతుంది. గురువారమైతే ఆయుష్షు పది నెలలు పెరుగుతుంది. ఆదివారం క్షవరము చేయించుకుంటే ఆయుష్షు నెల రోజులు తగ్గుతుంది. శనివారం అయితే ఏడు నెలలు తగ్గుతుంది. మంగళవారం అయితే ఎనిమిది నెలలు తగ్గుతుంది. పూర్వం షాపులు లేని రోజుల్లో ఇంటికి వచ్చే మంగలి పని చేసేవారు. (ఈ పదం వృత్తిరీత్యా వాడబడింది కానీ కులాన్ని సూచించేది కాదు.) ప్రతిరోజూ ఉద్యోగానికి వెడుతూ, గడ్డం, మీసం కావలసినంతగా కత్తిరించుకుని వెళ్లే అవసరం కూడా ఆ రోజుల్లో లేదు. మంగలి అతను వచ్చి క్షవరకర్మ చేసి వెళ్ళాక అతని భార్య వచ్చి ఇంట్లో వారిచ్చిన అన్నము, పదార్థాలు తీసుకుని వెళ్ళేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పంచాంగం చూసి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం చూసి క్షవరకర్మ చేయించుకునే పరిస్థితి లేదు. క్షవర కర్మ వృత్తిలో ఉన్నవారు కూడా షాపు తెరిచి అక్కడకు వచ్చిన వారికే ఆయుష్కర్మ చేస్తున్నారు. కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంచితే వారికి కిట్టదు. ఈ సూత్రాలలో చెప్పినవన్నీ పూర్తిగా వదిలివేయడానికి భారతీయులు ఇష్టపడరు అందుకే క్షవరం చేయించుకుంటే ఆయుష్షు ఎక్కువగా తరిగిపోయే మంగళవారాన్ని మాత్రమే సెలవు దినంగా స్వీకరించడం జరిగింది. తగాదలయ్యే అవకాశం ఎక్కువ.. అంగారక గ్రహ ప్రభావం కారణంగా మంగళవారం రోజున తగాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఇబ్బందుల్లో పడతారు. మంచి శకునాలు ఉండవు కాబట్టి ఆ రోజున ఏ కార్యం తలపెట్టినా అశుభంగా భావిస్తారు. దేవతలకు ఆ రోజు ప్రత్యేకం పూజలు, వ్రతాలకు ప్రత్యేకం ఇదే కాకుండా, మంగళవారం రోజున గోర్లు, జుట్టు కత్తిరించుకోకపోవడానికి మరో నమ్మకం కూడా ప్రాచుర్యంలో ఉంది. దుర్గాదేవి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఎక్కువగా మంగళవారాల్లోనే ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ఆ రోజున దేవతలను పూజించడం వల్ల మంచి ఐశ్వర్యం, ధన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. అమ్మవార్లకు సంబంధించి మంగళవారం ప్రత్యేక దినంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేయరు. -
ఆయోధ్య రాముడికి మర్చిపోలేని కానుక..ఏకంగా 108 అడుగుల..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024 కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా ఆ అయోధ్య రాముడి కోసం గుజరాత్‌ని వడోదరాలో తర్సాలీ గ్రామం తమ వంతుగా మర్చిపోలేని ఓ గొప్ప కానుక ఇవ్వాలనుకుంది. అందులో భాగంగా భారీ అగరబత్తి తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆ గ్రామ ప్రజలు. అంతేగాదు ఈ భారీ అగర్బత్తి కారణంగా ప్రతిరోజు రాముడికి ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందట. తొలుత ఈ భారీ అగరబత్తిని తయారు చేయాలని సంకల్పించింది విహాభాయ్ అనే రైతు. అయనకు రాముడంటే అమితమై భక్తి. ఈ నేపథ్యంలోనే ఆయన 108 అడుగులు పోడవు ధూపం తయారు చేయాలని సంకల్పించారు. అందుకోసం 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్ మెటీరియల్, 1475 కిలోల ఆవు పేడ పొడి తదితరాలను వినియోగించినట్లు విహాభాయ్ తెలిపారు. ఇలా మొత్తంగా సుమారు 3,400 కిలోల బరువు ఉన్న అగరుబత్తిని సిద్ధం కానుంది. ఆయనకు ఈ అగరుబత్తిన తయారు చేయడంలో గ్రామస్తులు కూడా తమవంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు కావాల్సిన ముడి సరుకును, ఉపయోగించే పదార్థాలను సమకూర్చి ఆయనకు తగినంత సాయం అందించారు. ఈ విధంగా అక్కడున్న వారంతా రాముడిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అంతేగాదు ఈ భారీ అగరుబత్తి తయారయ్యిన తదనంతరం డిసెంబర్ 2023 కల్లా భారీ ఊరేగింపుగా రామజన్మ భూమి అయోధ్యకు తరలిస్తామని ఆనందంగా చెబుతున్నారు విహాభాయ్. ఈ భారీ పంచద్రవ్య ధూపదీపం(అగర్బత్తి) తయారీ పనులు కూడా తుదిదశకు చేరుకున్నట్లు వెల్లడించారు విహాభాయ్. (చదవండి: ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో? దశరథుని మాటల్లో..) -
ఆడపిల్ల తండ్రి అంటే ఏమిటో? తెలుసా!..
ఆదికావ్యమైన మన రామాయణాన్ని ఆదర్శ జీవనానికి ప్రమాణంగా భావిస్తాం. అందులోని పాత్రలు.. ఓ వ్యక్తి బంధాలకు ఎలాంటి విలువ ఇవ్వాలి, ఏవిధంగా నడుచుకోవాలి, కుటుంబాన్ని ఎలా చక్క పెట్టాలో చెబుతాయి. నిజానికి దాన్ని ఓ కథలా వినేస్తాం గానీ దాన్ని అనుసరించే యత్నం గానీ కనీసం వాటిని గుర్తుపెట్టుకుని అనర్థదాయకమైన పనుల చేయకుండా మసులుకోవడం గానీ చేయం. ఈనాడు ఆడిపిల్లల కోసం ఎన్ని చట్టాలు వచ్చిన ఇంకా చిన్న చూపే, అడుగడుగున వివక్షత. అందులోనూ ఆడపిల్ల తండ్రికి అస్సలు విలువే ఉండదు. ఇప్పటికి ఆడపిల్ల పుట్టిందంటే చంపేసే తల్లిదండ్రులు ఉంటున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. మరొకందరూ ప్రబుద్దులు ఇద్దరు ఆడపిల్లల కంటే చాలు.. భార్యని పిల్లలను వదిలేసి పరారవ్వడం లేదా అదనంగా కట్నం తీసుకురావాలని డిమాండ్ చేయడం వంటి ఉదంతాలు చూస్తున్నాం. గానీ మన రామాయాణ గాథలో ఆడపిల్ల తండ్రి గొప్పతనం, అతని ప్రాముఖ్యత గురించి దశరథ మహారాజు ఎంత చక్కగానో విపులీకరించాడు. అందులో సీతరాముల కళ్యాణ సర్గ చదివితే ..మన కళ్లముందు ఒక్కసారిగా సీతారాముల కళ్యాణం కళ్లముందు మెదులుతుంది. గానీ ఆ వివాహతంతులో వైవాహిక జీవితం, ఆడపిల్లవారు గొప్పతనం గురించి చక్కగా వివరించాడు ఆదికవి వాల్మీకి. ఇక ఆ సర్గలో..దశరథ మహారజు తన నలుగురు కొడుకులను తీసుకుని వివాహ శోభాయాత్రకు కదిలి వస్తూ..జనకమహారాజు ద్వారం వద్ద వేచి ఉన్నాడు. అప్పుడు జనకమహారాజు వారి వివాహా శోభాయాత్రకు సాధరపూర్వకంగా స్వాగతం పలుకుతుండగా.. వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనకమహారాజుకి పాదాభివందనం చేశాడు. అప్పుడూ జనకమహారాజు దశరథ మహారాజు భుజం తట్టి పైకిలేపి సంతోషంతో కౌగలించుకున్నాడు. ఈ ఘట్టం ఆడపిల్ల తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం గురించి అద్భుతంగా తెలియజేసింది. ఇక ఆ ఘట్టంలో.. రాజా మీరు పెద్దవారు, పైగా వరుని పక్షం వారు, ఇలా నాకు పాదాభివందనం చేయడం ఏమిటి? గంగానది వెనక్కి ప్రవహించడం లేదు కదా! అంటూ సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నిస్తాడు జనకమహారాజు. దీంతో దశరథుడు మహారాజా మీరు దాతలు..కన్యను దానం చేస్తున్నారు. మా అబ్బాయికి పిల్లనివ్వమని మీతో సంబంధం కోరుకుంటున్న యాచకులం. మీతో సంబంధం ద్వారా నా కొడుక్కి కన్యను పొందాలనుకుంటున్నా!.. గనుక ఇప్పుడూ ఎవరూ గొప్పో చెప్పండి అని అడుగుతాడు దశరథ మహారాజు. ఆ మాటలకు ఒక్కసారిగా జనకమహారాజు కళ్లల్లోంచి ఆనందబాష్పాలు వచ్చాయి. అంతేగాదు ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో..వాళ్ళు భాగ్యవంతులు. ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు అని సగర్వంగా చెబుతాడు జనకమహారాజు. నేటి పెళ్లిళ్లలో జరగుతున్నది ఏంటి?.. ఇంకా వివాహం జరగకమునుపే ఇలా సంబంధం కుదుర్చుకున్నామో! లేదో ఇక ఆడపిల్లవారిపై యజామాయిషి మొదలైపోతుంది. పోనియిలే మగపెళ్లివారు కదా అలానే ఉంటారు కదా! అని సరిపెట్టుకుంటే.. ఇక వాళ్ల గొంతెమ్మ కోరికలకు హద్దు, అదుపు ఉండవు. అది వివాహామేనా అన్నట్లు ఉంటుంది ఆ తంతు. ఓపక్క తమకు మర్యాదలు తక్కువయ్యాయని, మా అబ్బాయికి ఇది పెట్టాలని, ఆడపడచు లాంఛనంగా అది కావాలంటూ అరుపులు కేకలు. వాస్తవానికి ఇవి మన సనాతన ధర్మంలో లేని ఆర్భాటాలు. ఆడపిల్ల తండ్రి అంటే.. తలవంచుకుని మగపెళ్లివారి మాటలు పడేవాడని అర్థం కాదు. కన్యను దానం చేస్తున్న దాత. ఆ వేదికపై హక్కు ఆయనదే. ఆ రోజు వేదికపై జరిగేదానికి అధికారం అయనదని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవడానికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?. దానం ఇస్తున్నవాడిని ఇంకా.. ఇంకా.. కట్నాలు, కానుకలు, లాంఛనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెప్పారు మీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా?!. కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. పైగా వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న తన ఇంటి లక్ష్మిని పంపిస్తున్నాడు కన్యాదాత. కాబట్టి అతన్ని గౌరవించగలిగే మర్యాద మీ వద్ద లేకపోతే గమ్మని కూర్చొండి. అంతేగానీ అతడిని తిట్టడం, విస్తుక్కోవడం వంటివి చేసే హక్కు మీకు లేదు. వివాహ తంతులో సీతారాముల్లా ఉండండి! అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో అందరికి అవగతమవుతుంది. మన సనాత ధర్మాన్ని గౌరవిస్తే ఇలాంటి దారుణాలకు దిగకండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఓ స్త్రీ ప్రమేయం లేకుండా మనుగడ సాగించగలమా! లేదా అన్నది ప్రశ్నించుకుని మసులుకోండి. (చదవండి: ఓ చిన్న రేకుల షెడ్‌కి..ఏకంగా లక్ష రూపాయాల కరెంట్ బిల్లు) -
కమలహాసన్ నాస్తికుడు..శ్రుతిహాసన్‌కు దైవ భక్తి ఎక్కువట!
నటి శ్రుతిహాసన్ విశ్వనటుడు కమలహాసన్ వారసురాలు అనే విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ బ్రాండ్‌ను ఆమె సినీరంగప్రవేశానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. ఆ తరువాత తన స్వశక్తితోనే కథానాయకిగా ఎదిగారు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. అంతేకాదు తాను తన కాళ్ల మీదే నిలబడ్డానని, ఆర్థికపరంగా ఎప్పుడూ తన తల్లిదండ్రులను సాయం కోరలేదని చెప్పారు. తనకు తన తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చారని చెప్పే శ్రుతిహాసన్ ఇప్పటికీ స్వతంత్రభావాలతోనే సినీ రంగంలో నటిగా ఎదుగుతున్నారు. ప్రస్తుతం ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం అంటూ బహుబాషా నటిగా పేరు తెచ్చుకున్నా తెలుగులో వరుస విజయాలతో క్రేజీ కథానాయకిగా వెలుగొందుతున్నారు. తమిళంలో ఇంతకుముందు విజయ్ సరసన పులి, అజిత్‌కు జంటగా వేదాళం, సూర్యతో ఏళాం అరివు, విశాల్ సరసన పూజై వంటి చిత్రాల్లో నటించినా ఎందుకనో ఇక్కడ పెద్దగా విజయాలను అందుకోలేకపోయారు. కాగా త్వరలో ఒక తమిళ చిత్రంలో నటించనున్నట్లు చెప్పారు. ఆ చిత్రం ఏమిటన్నది ఇప్పుడు ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా కమలహాసన్ పక్కా నాస్తికుడు అన్న విషయం తెలిసిందే. అయితే అందుకు విరుద్ధ భావాలు కలిగిన నటి శ్రుతిహాసన్. తనకు దైవభక్తి ఎక్కువని చెప్పారు. అలాగని దేవాలయాలకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపనని, మనసు ఆలయం అని భావిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంట్లో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఇకపోతే తన ఆధ్యాత్మిక భావాన్ని వ్యక్తం చేసే విధంగా శ్రుతిహాసన్ తన వీపు పైభాగంలో శ్రుతి అని తన పేరుతో పాటు కుమారస్వామి ఆయుధం అయిన వేలాయుధం గుర్తును టాటూ వేసుకున్నారు. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఆర్టీసీ బస్సు ఎక్కండి, తీర్థయాత్రలు పూర్తి చేసుకోండి
సాక్షి, విశాఖపట్నం : ఆదాయం పెంపు కోసం ఆర్టీసీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ప్రయాణికుల ద్వారా వచ్చే రాబడికంటే దానికయ్యే ఖర్చే అధికంగా ఉంటోంది. అయినప్పటికీ సేవా దృక్పథంతో ప్రజల కోసం బస్సులను నడుపుతోంది. దీంతో ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే లాజిస్టిక్స్ ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. కొత్తగా కార్గోలో డోర్ డెలివరీ, పికప్ సదుపాయాలను కూడా ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదార్ల నుంచి ఆదరణ బాగుంటోంది. ఈ నేపథ్యంలో సరికొత్తగా టెంపుల్ టూరిజంపై ఫోకస్ పెట్టింది. ఇందులోభాగంగా విశాఖపట్నం నుంచి తమిళనాడులోని అరుణాచలం, పొరుగున ఒడిశాలో ఉన్న పూరీ సహా మరికొన్ని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి అరుణాచలానికి 120 వరకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. ప్రతి పౌర్ణమికి అరుణాచల గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విశాఖ (ద్వారకా బస్‌స్టేషన్) నుంచి అరుణాచలానికి ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ జోన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మే 5 నాటి పౌర్ణమికి 3వ తేదీ నుంచే ఇక్కడ నుంచి ఈ బస్సులు బయలుదేరేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అరుణాచలం వెళ్లేటప్పుడే కాణిపాకం, శ్రీపురం, కంచి, శ్రీకాళహస్తి దేవాలయాలను కూడా దర్శించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పౌర్ణమి దర్శనం అయ్యాక ఏడో తేదీన విశాఖలో చేరుస్తామన్నారు. సూపర్ లగ్జరీ సర్వీసుకు రూ.4,000, ఇంద్ర ఏసీ సర్వీసుకు రూ.5,000 చొప్పున ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర నిర్ణయించామన్నారు. ఈ యాత్రకు ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే వీలు కల్పించామన్నారు. పూరీ, భువనేశ్వర్‌లకు కూడా.. మరోవైపు పొరుగున ఒడిశాలోని కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా స్పెషల్ ప్యాకేజీతో బస్సులను నడపనున్నట్టు ఈడీ రవికుమార్ తెలిపారు. పూరీలోని జగన్నాథస్వామి, భువనేశ్వర్‌లోని లింగరాజస్వామి, కోణార్క్ సూర్య దేవాలయం, చిలక సరస్సుల సందర్శనకు ప్రతి వారాంతం (శనివారం)లో వీటిని నడుపుతామన్నారు. ఈనెల 29 నుంచి ఈ బస్సులను ప్రారంభిస్తామన్నారు. ఈ ప్యాకేజీలో (సూపర్ లగ్జరీ) టిక్కెట్టు ధర రూ.2,350గా నిర్ణయించామని చెప్పారు. డిమాండ్‌ను బట్టి ఏసీ సర్వీసులను కూడా ప్రవేశపెడతామన్నారు. అరుణాచలంతో పాటు ఒడిశా పుణ్యక్షేత్రాలకు ఏడాది పొడవునా ఈ టెంపుల్ టూరిజం బస్సులు నడుపుతామని తెలిపారు. మీడియా సమావేశంలో ఆర్టీసీ డీపీటీవో బలిజి అప్పలనాయుడు, డిప్యూటి సీటీఎం జి.సత్యనారాయణ, విశాఖ డిపో మేనేజర్ గంగాధరరావులు పాల్గొన్నారు. -
మిన్నంటిన భక్తిభావం
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని ఆలయాల్లో శుక్రవారం భక్తి భావం మిన్నంటింది. తమిళ కొత్త సంవత్సరాదిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడల్లో పరస్పరం శుభాకాంక్షలతో ఆనందాన్ని పంచుకున్నారు. చిత్తిరై మాసం తొలిరోజును తమ కొత్త సంవత్సరంగా మొదటి నుంచి తమిళులు అనుసరిస్తున్నారు. గతంలో కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో పొంగల్ పండుగను తమిళ కొత్త సంవత్సరంగా ప్రకటించారు. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే యథాప్రకారం చిత్తిరై మాసం తొలిరోజునే తమిళ ఉగాదిగా ప్రకటించింది. అప్పటి నుంచి చిత్తిరై మాసం తొలిరోజును కొత్త సంవత్సరంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం తమిళ కొత్త సంవత్సరం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో భక్తి భావం మిన్నంటింది. ఆలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. బారులు తీరిన భక్తులు.. మదురై మీనాక్షి, తిరుచ్చి శ్రీరంగనాథ స్వామి, రామనాథపురం రంగనాథ స్వామి, పళణి దండాయుధ పాణి, తిరుచెందూరు సుబ్రమణ్యస్వామి, పిల్లయార్ పట్టి వినాయకుడి ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయంలో, చైన్నె వడపళని మురుగన్, కాంచీపురం మీనాక్షి ఆలయం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో వేకువజామున భక్తులు బారులు తీరారు. ఆలయంలో జరిగిన పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరగాలని ఆకాంక్షించారు. తిరునల్వేలిలోని రాజగోపాల ఆలయంలో గోపూజ పెద్ద ఎత్తున జరిగింది. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లోని ఆదిపరాశక్తి పీటంలో చిత్తిరై తొలిరోజు ఉత్సవం కనులపండువగా జరిగింది. భక్తులకు కొత్త రూపాయి, రూ. ఐదు నాణెలను అందజేశారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఎడ్లబండి, రెక్లా పోటీలు జరిగాయి. చైన్నె టీనగర్లో టీటీడీ సమాచారం కేంద్రంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. తమిళ ఉగాది ఆస్తాన కార్యక్రమం జరిగింది. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే, జీఎన్ చెట్టి రోడ్డులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దర్శనం చేసుకున్నారు. తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా తమిళ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తమిళ ఉగాదికి వరుససెలవులు వచ్చాయి. శుక్ర, శని, ఆది వారాలు సెలవు దినాలు కావడంతో చైన్నె నుంచి పెద్ద ఎత్తున జనం స్వస్థలాలు, స్వగ్రామాలకు తరలి వె వెళ్లారు. గురువారం అర్ధరాత్రి వరకు చైన్నెలోని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. -
నేటి విశేషం.. సంకష్టహర చతుర్థీ
గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి... మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం!!... పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు, సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు... సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం:- సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి... సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. సంకట హర చతుర్ధి వ్రత కథ ఒకానొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి ( వినాయకుని గొప్ప భక్తుడు ) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు.. ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు... సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది, ఈ రోజు మరణించింది' అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు, ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది, దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. -
‘మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కోల్పడంలో క్రియాయోగాది అద్భుత పాత్ర’
ఢిల్లీ: మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కోల్పడంలో క్రియాయోగా సాధనదే ప్రధాన పాత్ర అని యోగధా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీశ్రీ స్వామి చిదానంద గిరి పేర్కొన్నారు. యోగదా సత్సంగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్మాత్మిక కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి శ్రీశ్రీ స్వామి చిదానంద గిరి ప్రసంగించారు. ‘మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కొల్పడంలో క్రియాయోగ సాధనది అద్భుత పాత్ర. ఒడిదుడుకుల జీవన గమనంలో తీవ్రమవుతున్న ఆందోళన, ఆత్రుత, అసహనం వంటి రుగ్మతలను తొలగించే శక్తి క్రియా యోగాకు ఉంది. ప్రేమ, శాంతి, సహనం, సుహృద్భావం, అవగాహన వంటి సాత్విక గుణాలను వృధ్ధి చేయడంలో క్రియాయోగ పాత్ర విశిష్టమైంది. క్రియాయోగ సాధన ద్వారా అంతరంగ శుధ్ధి, ఆధ్యాత్మిక వృధ్ధి, లక్ష్య సిధ్ధి సులువుగా సాధ్యం. శరీరం, మెదడు, మనస్సులను అనుసంధానించే క్రియాయోగ ద్వారా అనేక సంక్లిష్టతలు, ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కోవడం సులువు. సానుకూల ఆలోచనా ధోరణిని, భవిష్యత్‌పై భరోసాను కల్పించే క్రియాయోగ, ధ్యానం, గురువుల భోధనల పుస్తకాలు నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. కనుబొమ్మల మధ్య దృష్టి కేంద్రీకరించి శ్వాస మీద ధ్యాసను నిలుపుతూ, దైవత్వంతో తన్మయత్వాన్ని ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రక్రియతో మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చు’ అని పేర్కొన్నారు. -
కోనసీమ జిల్లా : వైభవంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం (ఫొటోలు)
-
మంచి మాట: దిద్దుకోవలసిన తప్పులు
మానవ జీవనాన్ని, మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వాటిల్లో ప్రధానమైనవి తప్పులు. ఆచరణల్లోని తప్పులు మాత్రమే కాదు ఆలోచనల్లోని తప్పులు కూడా మానవాళికీ, ప్రపంచానికీ అనాదిగా హానిచేస్తూనే ఉన్నాయి. ఆత్మావలోకనం చేసుకుంటే మనం చేసిన తప్పులవల్ల మనకు ఎంత హాని జరిగిందో, మన తప్పులవల్ల ఇతరులకు ఎంత హాని జరిగిందో మనకే తెలిసిపోతుంది. చరిత్రను అవలోకిస్తే దేశాలకూ, ప్రపంచానికీ తప్పులు ఎంత హాని చేశాయో తెలిసిపోతుంది. హిట్లర్ తప్పులవల్ల ప్రపంచయుద్ధమే జరిగి తత్ఫలితంగా కలిగిన వినాశనం మనకు తెలిసిందే. పెద్దస్థాయిల్లో జరిగిన తప్పులవల్ల సామాన్య ప్రజలు విలవిలాడిపోయిన కథనాన్ని చరిత్ర మనకు చెబుతూనే ఉంది. కళ, భాష, సాంస్కృతిక రంగాలకూ తప్పులవల్ల హాని జరుగుతూనే ఉంది. కొన్ని దశాబ్దుల క్రితం చోటు చేసుకున్న తప్పులవల్ల తెలుగు సాహిత్యానికే కాదు భాషకు కూడా జరిగిన పెనుహాని ఇవాళ క్షేత్రవాస్తవంగా మనకు తెలుస్తూనే ఉంది. తప్పులవల్ల మనం తప్పులతోనే ప్రయాణం చేస్తున్నాం; తప్పులవైపే ప్రయాణం చేస్తున్నాం; తప్పులతో మనం మమైకమైపోయాం. తప్పులకు ప్రతి మనిషీ గురయ్యాడు; బలయ్యాడు. విద్యలోని తప్పులు, వృత్తిలోని తప్పులు, వ్యవహారాల్లోని తప్పులు, ఆచారాల్లోని తప్పులు, మతపరమైన తప్పులు, విశ్వాసాల్లోని తప్పులు, ప్రవర్తనల్లోని తప్పులు వీటివల్ల మనిషి జీవితం తప్పులమయం అయిపోయింది. ఫలితంగా మనిషి ఒక తప్పుడు జీవి అయిపోయాడు! మనిషి చేస్తున్నట్లుగా, చేస్తున్నంతగా జంతువులు తప్పులు చెయ్యడం లేదు! మనుషులు చేసిన, చేస్తున్న తప్పులవల్ల మానవప్రపంచానికే కాదు జంతుజాలానికి కూడా హాని జరుగుతోంది. చాల తప్పులు చలామణిలోకి వచ్చేశాయి. చాపకింద నీరులా తప్పులు మనలోకి రావడం కాదు కొనసాగుతున్న వానలా తప్పులు మనపై పడ్డాయి, పడుతున్నాయి.. అందువల్ల మనం తడిసిపోతూ ఉండడం కాదు, ఆ తప్పులు చప్పుడు చెయ్యని నిప్పులుగా అయిపోవడం వల్ల మనం మనకు తెలియకుండానే వాటికి కాలిపోతూ ఉన్నాం. చాల కాలంగా తప్పులతో, తప్పులలో, తప్పుల కోసమే బతుకుతున్నామా అన్నట్లుగా మనం బతుకుతున్నాం. దానికి పర్యవసానంగా చాల కాలంగా తప్పులు మనల్ని శిక్షిస్తున్నాయి... బతకుతున్నాం అనడానికి ఋజువుగా నిత్యమూ మనం తప్పులవల్ల శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. అయినా మనకు తప్పుల విషయమై ఉండాల్సిన అవగాహన రావడంలేదు. చరిత్రలోని తప్పులు, తప్పుల చరిత్ర... వీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదు. అందుకే మనల్ని భయాలు, అందోళనలు, ఆపదలు, గందరగోళం చుట్టుముట్టాయి, చుట్టుముడుతున్నాయి. గతంలోని తప్పులతో మనం పోరాడడం లేదు. వర్తమానంలోని తప్పుల గురించి మనం ఆలోచించడంలేదు. భవిష్యత్తులో తప్పులవల్ల జరగనున్న విపత్తుల్ని గ్రహించడం లేదు. తప్పు జరగడం, తప్పు చెయ్యడం అనేవి మనిషికి సహజమైనవే. కానీ తప్పే జరుగుతూ ఉండడం, తప్పే చేస్తూ ఉండడం సహజం కాకూడదు. మన తప్పుల్ని, మనలోని తప్పుల్ని తెలుసుకోలేకపోతే మనం నేరస్థులం అవుతాం.తప్పులవల్ల వర్తమాన, భవిష్యత్తుల్లో మనం ముప్పుల పాలు కాకూడదు. ప్రతి సంవత్సరమూ ధనుర్మాసంలో మన ముందుకు వస్తూ ఉండే తిరుప్పావై పాసురాలలో ఒక చోట ఆణ్డాళ్ చెప్పింది: ‘దామోదరుణ్ణి నోరారా గానం చేసి, మనసారా ధ్యానిస్తే జరిగిపోయిన తప్పులూ, జరగబోయే తప్పులూ మంటల్లో దూదిపింజలైపోతాయి’. జరిగిన, జరగబోయే తప్పులు కాలి భస్మం అయిపోవాలని 1,200 యేళ్ల క్రితమే ఇలా ఇంత గొప్పగా ఆశంసించడం జరిగింది. మన తప్పులు, మన చుట్టూ ఉన్న తప్పులు కాలిపోకపోతే ఆ తప్పులకు మనం కాలిపోతాం. సరైన మనస్తత్వంతో, వివేకంతో మనలోని తప్పుల్ని తొలగించుకోవాలి; మనం ఒప్పుల్ని ఒంటబట్టించుకోవాలి; ఆపై మనం క్షేమంగానూ, మేలైనవాళ్లంగానూ బతకాలి. – రోచిష్మాన్ -
వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి?
ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం గణేశ చతుర్థి. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది. ఈ స్వామి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయని ప్రతీతి. భక్తితో పూజిస్తే చాలు అపారమైన కృపావర్షం కురిపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు గురించి కొన్ని విశేషాలు... చదవండి: పచ్చగా నిను కొలిచేమయ్యా.. చల్లగా చూడు మా బొజ్జ గణపయ్యా.. వినాయకుడికి, విద్యకు సంబంధం ఏమిటి? చదువంటే గణపతికి ఇష్టం. నారదుడు, బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగు రోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు. ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం ఉంది. వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండునని అనుకున్నాడట. గణపతి దగ్గరకు వచ్చాడట. ‘లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసిపెడతావా!’ అని అడిగాడట.‘అలాగే రాస్తాను కానీ, మీరు వెంట వెంటనే చెబుతుండాలి. చెప్పడం ఆపితే నేను మాయం అవుతా!’ అన్నాడట గణపతి. ‘సరే! నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే నేనూ వేగంగా చెబుతా!’ అన్నాడట వ్యాసుడు. అలా సరస్వతి నది తీరాన మహాభారత రచన మొదలైంది. వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతి కఠినమైనవి చెబుతుండేవాడట. వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవాడట. చివర్లో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా అనుకోకుండా వ్యాసుడి కవిత్వ ధార ఆగిపోయింది! తన నిబంధన ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు. తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలిపోయిందని విచారించాడట వ్యాసుడు. సరే తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే ఏముంది? ఆయన చెప్పాల్సిన పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట. అంటే ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలిసుండాలి. అంటే వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే వూహించాడు! వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో ‘నీ పుట్టినరోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలూ పొందుతారు. వారికి సకల విద్యలు అబ్బుతాయి’ అని ఆశీర్వదించాడట. నాటినుంచి వినాయక చవితినాడు చేసే పూజలో పిల్లలు తమ పుస్తకాలను, కలాలను ఉంచి, పుస్తకాలకు పసుపు కుంకుమలు అలంకరించి పూజించడం ఆచారంగా మారింది. క్షేమం, లాభం కూడా.. ఏ పూజ చేసినా, తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితోబాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికయినా ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెట్టడం ఆచారంగా వస్తోంది. వీటిలోని ఆంతర్యం ఇదే! వినాయకుని నక్షత్రం ‘హస్త’. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, ఉండ్రాళ్లుగా తయారు చేసి చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి నివేదన చేస్తారు. పత్రిపూజ: అదేవిధంగా వినాయకునిది కన్యారాశి. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. బుధునికి ఆకుపచ్చ రంగు ప్రీతికరమైనది. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. మూషిక వాహనం: మూషికం అంటే ఎలుక వాసనామయ జంతువు. తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. పంజరంలో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పట్టినప్పుడు మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు – వినాయకుడు. చదవండి: గణేశ్ చతుర్థి: కుడుము..ఆరోగ్యకరము -
గురుపూర్ణిమ స్పెషల్: ఒక గురువు... వేలాది మంది శిష్యులు
గురు శిష్య సంబంధం అనేది మన జీవితాల్లో ఒక ప్రధాన అంశం. మన సాంప్రదాయక విలువల్లో విధిగా అది ఒక భాగం. మన భారతీయ సమాజం గురువుని అత్యున్నత పీఠంపై నిలిపింది. అలాగే పరమహంస యోగానంద శిష్యురాలూ, యోగదా సత్సంగ సమాజానికి పూర్వ అధ్యక్షురాలు మృణాళినీ మాత తాను రచించిన ‘గురుశిష్య సంబంధం’ అనే పుస్తకంలో శిష్యుడి జీవితాన్ని మరెవరూ మార్చలేని విధంగా ఒక గురువు మార్చగలరన్న సత్యాన్ని శక్తివంతంగా ఉద్ఘాటించారు. శిష్యుడిని అన్ని విధాలా తనకు ప్రతిరూపంగా తయారుచేయడానికి కావలసిన శక్తిని, సహజమైన సామర్థ్యాన్ని గురువు కలిగి ఉంటారు. చదవండి: నిన్ను వెలిగించే దీపం... నవ్వు నేటి ప్రపంచంలో బాగా పేరున్న ఒక గురువును పట్టుకోవడం తేలికే. అయితే యోగానంద గురువును ఎంచుకోవడంలో జాగ్రత్త వహించమని సలహా ఇచ్చారు: ‘‘జీవితమనే లోయలో నీవు గుడ్డిగా తప్పటడుగులు వేస్తూ వెళ్తున్నపుడు, కళ్ళున్నవారి సహాయం నీకు కావాలి. ఆ మార్గం సత్యమైనదా, కాదా అని తెలుసుకోవడానికి, దాని వెనుక ఎటువంటి గురువు ఉన్నారు, ఆయన చేసే పనులు తాను భగవంతుని చేత నడపబడుతున్నట్టు ఉన్నాయా, లేక తన స్వంత అహంతో నడపబడుతున్నట్టు ఉన్నాయా అని విచక్షణతో తెలుసుకోండి. ఆత్మసాక్షాత్కారం పొందని గురువుకు ఎంత పెద్ద శిష్యబృందం ఉన్నా అతడు మీకు దైవ సామ్రాజ్యాన్ని చూపలేరు.’’ అని చెప్పేవారాయన. శతాబ్దాలుగా హిమాలయాల్లో జీవించి ఉన్న మహావతార బాబాజీ తన గొప్ప శిష్యులలో ఒకరైన లాహిరీ మహాశయులకు 1861లో ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయిన క్రియాయోగంలో దీక్ష ఇచ్చారు. ఆ తరువాత ఆయన శిష్యులైన యుక్తేశ్వర్ గిరి వై.ఎస్.ఎస్./ ఎస్.ఆర్.ఎఫ్. సంస్థలను స్థాపించి ఈ మార్గంలోకి వేలాదిమందిని తీసుకువచ్చిన పరమహంస యోగానందకి శిక్షణనిచ్చి ఆయనను సిద్ధం చేసే బాధ్యత స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా జీవితాల్ని మార్చగల ఉజ్జ్వల ఆధ్యాత్మిక కావ్యంగా ప్రఖ్యాతి పొందిన తన ‘ఒక యోగి ఆత్మకథ’లో గురుశిష్య సంబంధాన్ని గురించి యోగానంద అత్యంత విశదంగా వివరించారు. ఎంతో జాగ్రత్తతోనూ సూక్ష్మదృష్టితో శ్రీ యుక్తేశ్వర్ యోగానందకి ఇచ్చిన శిక్షణతో యోగానంద భగవంతుడితోనూ గురువుతోనూ అనుసంధానంలో ఉండడం ఎలాగో చూపించిన ఒక నిజమైన దృష్టాంతంగా రూపుదిద్దుకొన్నారు. ఇక యోగానంద తన వంతుగా యోగధ్యానం, సమతుల జీవనాన్ని బోధించే తన సార్వత్రిక బోధల ద్వారా తన జీవిత కాలంలో వేలకొద్దీ శిష్యులకు, అనంతరం లక్షలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకునిగా, తత్వవేత్తగా తోడ్పాటు నందించారు. పతంజలి బోధించిన అష్టాంగయోగ మార్గంపై ఆధారపడిన తన ఆధ్యాత్మిక సాధనా పద్ధతిని విశ్వాసంతో, స్థిరంగా అభ్యసించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు యోగానంద. ప్రతి వ్యక్తీ ఒక ఆత్మ అనీ అంతర్గతంగా అది పరమాత్మ తో తన ఏకత్వాన్ని పునఃస్థాపించుకోవడానికి తపిస్తుంటుందనీ బోధించారు. సత్యాన్వేషకులందరూ లోతుగా అర్థం చేసుకోవడం కోసం... ఆయన రచించిన జీవించడం ఎలాగో నేర్పే గహాధ్యయన పాఠాలు ఆయన బోధలకు ఆనవాళ్లు. భారతదేశపు గొప్ప గురువులకు మనం అందించగల అత్యంత గొప్ప నివాళి గురుపూర్ణిమ. గురువు ఆదర్శాలకు ఈ ముఖ్యమైన రోజున పునరంకితం కావడం ద్వారా చిత్తశుద్ధి గల శిష్యుడు ఆత్మసాక్షాత్కార నిచ్చెనపై తరువాతి మెట్టును ఎక్కుతాడు. (నేడు గురుపూర్ణిమ) -
మంచి మాట: అనుకూలతలు ఆరోగ్య హేతువులు
అధికశాతం మంది వారి వారి మనస్తత్వాల వల్లనే ఆనందం కోల్పోతున్నారు. ఒక చిన్న విషయాన్ని సైతం పదే పదే తలచుకోవడం వలన అది వారి ఆరోగ్య సమస్యపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న విషయం వీరు గుర్తించటం లేదు. కొద్దిపాటి ‘చిరుగు’ను వేలితో పెద్దగా చేస్తే, అది పెద్ద చిరుగు అవుతుంది. అలాగే ఆలోచనలు కూడా.. చిన్నపాటి సమస్య గురించి ‘అతి’గా ఆలోచిస్తే ఎంత అనర్థమో వీరు ఆలోచించలేరు. దైనందిన జీవితంలో, జీవన విధానంలో, ఎవరో ఏదో అన్నారని, ఆ మాటలకు పెడర్థాలు తీస్తూ, అదే పనిగా ‘కుమిలి’ పోవడం ఎంత నష్టమో వీరు ఆలోచించలేరు. ఏ విషయాన్నైనా మనస్సులో పెట్టుకోవడం వలన, అది వారి వారి అంగరంగాలనే దహింపజేస్తుంది. లోకంలో ఉన్నవారు, వారి వారి మనస్తత్వాలు వేరువేరుగా ఉంటుంటాయి.మన ఐదు వేళ్ళే ‘సమంగా’ లేవు. కొంతమంది తమ ‘అసూయ’ను లోపల మింగలేక, ఏదో ఒక సూటి పోటి మాట విసిరి ‘స్వ ఆనందం’ పొందుతారు. అంతటితో ఆ మాట అన్నవారి మనస్సు ‘శాంతం’ పొందవచ్చు. ధానం జారితే తీసుకోవచ్చు.. మాట జారితే తీసుకోలేము. అనే జ్ఞానం లేకుండా ఉంటుంది అటువంటి వారి ప్రవర్తన. ఇటువంటి, మనస్సు నొచ్చుకునేలా చేసే వారికి, ఎంత దూరం పాటించినా, వారే చొచ్చుకు వచ్చి, ఒక కుళ్ళు పదాన్ని విసిరి పోతుంటారు. అయితే ఆ మాట స్వీకరించి, దానిని తేలికగా తీసుకోకపోవడం అనర్థమే.. అది మానసిక సమస్యనే. అన్ని వ్యాధులకు మందు ఉంది. మానసిక వ్యాధికి మందు లేదు. సున్నిత మనస్కులు, అననుకూల దృక్పథం ఉన్న వారే ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. అదీ అనుకూలం దృృక్పధం ఉన్నవారు అతి తేలికగా తీసుకుంటారు. మన సమాజంలో మాట పట్టింపులు ఎక్కువ. ఎవరో ఏదో అన్నారని, ఆ మాటల గురించి పదే పదే ఆలోచించే వారిని ‘నిద్రలేమి’ పట్టి పీడిస్తుంది. అనవసర వాక్కుల గురించి అతిగా ఆలోచిస్తూ, అదేపనిగా లోలోపల కుమిలిపోతూ మనస్సును ‘రొచ్చు’ చేసుకోవడం అవసరమా? ఇలా, అననుకూల దృక్పథం గల వ్యక్తులను ఏ ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసులు సైతం మార్చలేవేమో! అయితే ఇటువంటి సున్నిత మనస్తత్వం గల వారి వలన కుటుంబ వ్యవస్థ అతి తీవ్ర ప్రభావం ఎదుర్కొంటోంది. కుటుంబ వ్యక్తుల మనశ్శాంతులను సైతం దహించడానికి కారణం, ఇటువంటి సున్నిత మనస్కుల ‘అతి’ ఆలోచనలే! ఏదైనా ఒక వ్యాపకం అలవరచుకోవాలి. అనుకూల దృక్పథం గల రచనలను అభ్యసించాలి. అయితే ఇక్కడ దురదృష్టకర విషయమేమిటంటే, నేడు సామాజిక మాధ్యమాలలో, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపజేసే వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ వింటున్నా, చూస్తున్నా అది అంతవరకే. అననుకూల దృక్ప«థం, అతి అననుకూల ఆలోచనలూ ఉన్నవారిని ఎటువంటి ఉపోద్ఘాతాలూ సంస్కరించలేవేమో! అన్పిస్తుంది. వాస్తవానికి సున్నిత మనస్కుల హృదయం ‘బోళా’ గా ఉంటుంది. వీరు ఆనందం వచ్చినా, దుఃఖం కలిగినా తట్టుకోలేరు. చాలామందికి, మానసిక చికిత్స చేయించవలసిన పరిస్థితి. అదేసనిగా, తీవ్ర ఆలోచనలు చేయడం వల్లనే ఇటువంటి విపత్కర సంఘటనలు ఎదుర్కొనవలసి వస్తోంది. ఆనందం ఆహ్లాదం మన చేతికందే సమీసంలోనున్నా, అందుకోలేరు ఆ వ్యక్తులు. కుటుంబ వ్యవస్థలో, ఇటువంటి మనస్కులను అతి సున్నితంగా చూసుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో ‘రక్తపోటు’ తీవ్రస్థాయికి చేరి, ఏదేదో మాట్లాడుతుంటారు. ఘర్షణ పూరిత వాతావరణంలోకి చేరుకునేలా... అటువంటి సమయంలో ఎదుటి వారు ‘మౌనంగా’ ఉండటం శ్రేయస్కరం.. కొద్దిసేపటి తర్వాత, సహజంగా ప్రశాంతత నెలకొంటుంది. పరుల గురించి ‘అతిగా ఆలోచించేవారు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. తన గురించి ఆ ఇతరులు ఆలోచించటం లేదని! ప్రతి విషయానికి ప్రతిస్పందించటం మంచిది కాదు. కొద్దినిముషాలు కళ్ళు మూసుకుని, ధ్యానంలో నిమగ్నమైతే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇటువంటి సుభాషితాలు అనంతంగా విన్నా, చదివినా షరామామూలే.. అన్నట్టు వారి ప్రవర్తన మార్చలేని విధంగా ఉంటుంది. ఆలోచనలను మంచి పనులకు వినియోగించాలి. ఎదుటి వారి మాటలు అనుకూల దృక్పథంతో వున్నా కూడా, ఆ మాటల్లో రంధ్రాన్వేషణ చేస్తే మరీ ప్రమాదం. ‘నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే’ అనే విషయం విస్మరిస్తేనే ఇటువంటి జాడ్యాలు పట్టి పీడిస్తుంటాయి. రాజకీయాల్లో, సినిమాల్లో.. ఇంకా ప్రజా జీవితంలో ఉండే వారి మీద ఎన్నో వ్యతిరేక, ఇంకా ‘చెడు’ వ్యాఖ్యానాలు వస్తుంటాయి. వాటన్నింటినీ వారు పట్టించుకుంటే అటువంటి వారు ‘సెలబ్రిటీ’లుగా కొనసాగలేరు. ఎవరైనా ఏదైనా సందర్భంలో ‘ప్రతిస్పందిస్తే’ మరింతగా ‘ఎదురుదాడు’లను నెటిజన్ల నుంచి ఎదుర్కొనవలసి ఉంటుంది. అందుకే వ్యక్తిగత ఆనందాలను కోల్పోకుండా వుండాలంటే ‘లోకులు పలుకాకులు’ అనే సూక్తి ప్రకారం అతిగా ఆలోచనలు పెట్టుకోకుండా ఉండటం, వారి వారి ఆరోగ్యాలకే క్షేమదాయకం. ఆనందాలను దూరం చేసుకోకుండా తోటలో విరబూసిన పువ్వులను గుర్తు చేసుకోండి. అవి ఎలా ఎల్లవేళలా మందహాసం చేస్తుంటాయో! ఆ పువ్వునే మీకు ఎందుకు ఆదర్శం కాకూడదు! ఆలోచించండి!! – పంతంగి శ్రీనివాసరావు