
మూడు శతాబ్దాలు చూసిన మునిగా పేరు గాంచిన కల్యాణ్ దేవ్... వివేకానుందుని బోధనలతో ఉత్తేజితుడై మానవ సేవ ద్వారా మాధవునికి సేవ చేసి తరించారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ జిల్లాలోని కోటనా గ్రామంలో 1876లో జన్మించిన ఆయన అసలు పేరు కాలూరామ్. రిషీకేశ్‌లో స్వామి పూర్ణానంద శిష్యులై స్వామి కల్యాణ్ దేవ్ అయ్యారు. కొన్నేళ్ళు హిమాలయాలలో తపస్సు చేశారు. అనంతరం ఆయన తన ప్రాంతంలోని పేద ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఇతర ప్రాంతాల ప్రజల కోసం దాదాపు మూడు వందల పాఠ శాలలు, వైద్యకేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటరాని తనం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన తన వాణిని వినిపించారు.
నిర్లక్ష్యానికి గురైన మతపరమైన, చారిత్రక ప్రదే శాల పునర్నిర్మాణానికి కల్యాణ్‌దేవ్ మద్దతు ఇచ్చారు. ముజఫర్‌నగర్‌లోని శుక్తల్‌లో ఆయన ‘శుకదేవ
ఆశ్రమం’, ‘సేవా సమితి’ని కూడా స్థాపించారు. హస్తినా పూర్‌లోని కొన్ని ప్రాంతాలను, హరియాణాలోని అనేక తీర్థయాత్రా స్థలాలను పునరుద్ధరించారు.
ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కల్యాణ్‌దేవ్ మాట్లా డుతూ... 1893లో ఖేత్రిలో వివేకానందుడిని కలిసి నప్పుడు తనకు ప్రేరణ కలిగిందని, ఆయన తనతో... ‘నువ్వు దేవుడిని చూడాలనుకుంటే, పేదల గుడిసెలకు వెళ్ళు... నువ్వు దేవుడిని పొందాలనుకుంటే, పేదలకు, నిస్సహాయులకు, అణగారినవారికి, దుఃఖితులకు సేవ చేయి’ అని అన్నారని చెప్పారు. పేదల సేవ ద్వారా దేవుడిని పొందడమే తనకు స్వామీజీ నుండి లభించిన మంత్రమని కల్యాణ్‌దేవ్ పేర్కొన్నారు.భారత ప్రభుత్వం 1982లో ఆయనను పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది మీరట్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డి.లిట్. ప్రదానం చేసింది. తుదకు ఆయన 2004లో పరమపదించారు.
– యామిజాల జగదీశ్