
దత్తబోధ
గతాన్ని విడిచిపెడుతూ, ఎప్పటికప్పుడు పునరుత్తేజాన్నిపొందుతూ శిశిర రుతువులో ఒక్క ఆకు కూడా లేనటువంటి చెట్లు వసంత రుతువులో ఆకుపచ్చని ఆకులతో నిండిఉంటాయి. ఎందుకు? ఎందుకంటే ప్రాణంలేని ఆకులన్నీ రాలి పోయి, తిరిగి ప్రాణశక్తిని పొంది కొత్త ఆకులతో చెట్లు నిగనిగ లాడతాయి.మన సంస్కారాలు కూడా మనల్ని గతంలోనికి తోసి వేస్తాయి లేక భవిష్యత్తు లోనికి లాక్కెళతాయి. పర్యవసానంగా మనం మన కళ్లెదుట ఉన్న వర్తమానాన్ని కోల్పోతున్నాం. మన చంచలమైన మనస్సును స్థిర పరచాలి. దీనిని లోపలికి మళ్ళించుట (అనగా అంతర్ముఖత్వం గావించుట)ను అభ్యసించాలి. గతంలో సంభవించిన వాటిని లేక భవిష్యత్తులో సంభవించనున్న వాటిని పట్టుకొని మనస్సు ఊగిసలాడకూడదు. జీవితం దాని మార్గంలో అది నడుస్తూ ఉంటుంది. వర్తమాన కాలంలో ఏం జరుగనున్నదో దానికి సాక్షీభూతుడుగా ఉండాలి.
ఇదీ చదవండి: Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్వి
మనస్సు నుండి అనేక కోరికలు పుడతాయి. అటువంటి వానిలో కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే పూర్తవుతాయి. అందువలన మనం సంతోషాన్ని పొందుతాం. మరికొన్ని కోరికలు మనం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తి కావు. కోరికలు ఫలించని పరిస్థితిలో... నా కోరికలు ఏ విధంగా నెరవేరతాయి? ఏ కోరికలు నెరవేరతాయో అటువంటి కోరికలనే నేను కోరుకోవాలా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఈ రెండింటికి సమాధానాలు మన దగ్గర లేవు.
మనస్సు వస్తువులతో అంటిపెట్టుకొని ఉండటం వలన కోరికలు జనిస్తాయి. కోరికలు నెరవేరినా, నెరవేరకున్నా వాటిని గూర్చి మనస్సులో ఎక్కువ ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే ఇటువంటి పరిస్థితిలో చిక్కుకుంటారో అటువంటివారి విధిని ఊబిలో చిక్కిన మనిషితో పోల్చవచ్చు. ఈ విధంగా చిక్కుకున్నప్పుడు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది?మనస్సును నెమ్మదిగా, క్రమంగా ఆలోచనారహిత స్థితికి తీసుకొని రావాలి. అందుకోసం సాధకుడు తన సాధనల ద్వారా ఆలోచనల వలన కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఆధ్యాత్మిక లక్ష్యంపైననే మనస్సును కేంద్రీకరింప చేయాలి. దేవుని (గురువు) అనుగ్రహం వలన సాధకుడు కాస్త ముందుగానో లేక ఆలస్యంగానో తన సాధన ఫలితాలను పొందగలడు.
Comments
Please login to add a commentAdd a comment