
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఆడేందుకు పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. కేన్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో ప్రారంభం నుండి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కేన్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్‌ఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. పీఎస్‌ఎల్‌లోని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ కేన్‌ను రూ. 86 లక్షలకు కొనుగోలు చేసింది.
ఇదే కరాచీ కింగ్స్ ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను రూ. 2.57 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ కూడా కట్టబెట్టింది. కేన్ పీఎస్‌ఎల్‌లో తదుపరి మ్యాచ్‌లు వార్నర్ కెప్టెన్సీలో ఆడతాడు. కేన్ పీఎస్‌ఎల్‌లో ఆడటం ఇదే మొదటిసారి. పాక్ జట్టుతో చేరిన విషయాన్ని కరాచీ కింగ్స్ యాజమాన్యం సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది.
𝐇𝐢 𝐊𝐚𝐫𝐚𝐜𝐡𝐢 𝐟𝐚𝐧𝐬! 𝐈 𝐡𝐚𝐯𝐞 𝐚𝐫𝐫𝐢𝐯𝐞𝐝 👋
The wait is over! Kane Williamson has joined the #KingsSquad 🤩#YehHaiKarachi | #KarachiKings | #HBLPSLX pic.twitter.com/R2z8nEpXbp— Karachi Kings (@KarachiKingsARY) April 24, 2025
కేన్ 2015 నుండి 2024 వరకు ఐపీఎల్‌లో ఆడాడు. 9 సీజన్లలో అతను అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. ఎక్కువ కాలం సన్‌రైజర్స్‌కు ఆడిన కేన్.. ఆ జట్టును 2018 సీజన్‌లో ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఆ సీజన్‌లో కేన్ 17 మ్యాచ్‌ల్లో 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. కేన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు ముద్దుగా కేన్ మామ అని పిలుచుకుంటారు.
కేన్‌ను 2022 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ వదిలేసింది. ఆతర్వాత అతను గుజరాత్ టైటాన్స్‌తో జత కట్టాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు గుజరాత్ కూడా కేన్‌ను వదిలేసింది. మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నా కేన్‌ను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. ఘన చరిత్ర కలిగిన కేన్ ఐపీఎల్‌లో 79 మ్యాచ్‌లు ఆడి 18 అర్ద సెంచరీల సాయంతో 2128 పరుగులు చేశాడు.
పీఎస్‌ఎల్‌లో కేన్ సహా చాలామంది న్యూజిలాండ్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఐపీఎల్‌లో అవకాశాలు రాకపోవడంతో వీరంతా పీఎస్‌ఎల్ పంచన చేరారు. పీఎస్‌ఎల్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ (1.88 కోట్లు) కాగా.. టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్, మార్క్ చాపమన్, ఆడమ్ మిల్నే, కొలిన్ మున్రో, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జేమీసన్ ఓ మోస్తరు వేతనంతోనే సరిపెట్టుకున్నారు.
పీఎస్‌ఎల్-2025లో కేన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌తో (ఏప్రిల్ 25) తలపడనుంది. ఈ మ్యాచ్‌తో కేన్ పీఎస్‌ఎల్ అరంగేట్రం చేస్తాడు.