
శతాబ్దాల చరిత్రకు, కళాచాతుర్యానికి, అపురూపమైన శిల్పకళకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) డిచ్‌పల్లి మండలం డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం. ఈ ఆలయం క్రీ.శ. 16 వ శతాబ్దంలో నిర్మితమైనట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. డిచ్‌పల్లి గ్రామానికి చివర సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ద్వారాలపై నగిషీ, గోపురాల మీద ద్రావిడుల సంప్రదాయం కనిపిస్తుంది. ఈ దేవాలయం విజయనగర రాజుల శిల్పకళా రీతిని చూపుతోంది. పదహారో శతాబ్దం మధ్య కాలంలో రామరాయల హయాంలో దీనిని నిర్మించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. మరికొందరు.. ఈ ఆలయ నిర్మాణం 14వ శతాబ్దంలో నిర్మితం కావచ్చని అభిప్రాయ పడుతున్నారు. ఈ కట్టడాన్ని వైష్ణవులు నిర్మించారా?.. శైవులు నిర్మించారా? అన్నది పరిశీలకులకు కూడా అంతుబట్టడం లేదు. కాకతీయుల కాలంలోనే వైష్ణవులు ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని మరికొందరి అభిప్రాయం. గర్భగుడి వద్ద ఉన్న ముఖ ద్వారాలను పరిశీలిస్తే కాళీమాత విగ్రహాలు కనిపిస్తాయి. దీంతో ఈ గుడి శైవులకు సంబంధించిందనే భావన కలుగుతుంది.
ఆలయ గోడలపై గజకేసరి (ఏనుగుపై దాడి చేస్తున్న సింహం) చిత్రాలు మలచబడి ఉన్నాయి. విజయనగర రాజులు, కాకతీయ రాజ్యాన్ని స్వాధీన పరచుకున్నామని చాటడానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించి గజకేసరి విగ్రహాలను చెక్కించారన్నది చరిత్రకారుల అభిప్రాయం.
డిచ్‌పల్లి రామాలయంలో 1947 వరకు ఎలాంటి విగ్రహాలు ఉండేవి కావు. గ్రామ సర్పంచ్ గజవాడ చిన్నయ్య గుప్తా అప్పట్లో రాజస్తాన్ నుంచి శ్రీ రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడి పాలరాతి విగ్రహాలను తెప్పించి ఆలయంలో ప్రతిష్టింపజేశారు. అప్పటి నుంచి ఈ చారిత్రక శిల్పకళా నిలయం రామాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ మూల విగ్రహాలను ఇతర దేవాలయాల్లా కాకుండా ఉప పీఠంపై ప్రతిష్టించారు. గర్భగుడి మధ్యలో ఎత్తయిన రాతి సింహాసనం ఉంది. సింహాసనం ఎడమ భాగాన మూల విగ్రహాలను ప్రతిష్టించక ముందు నుంచి.. రెండు విగ్రహాలు ప్రతిష్ఠించడానికి అనువుగా నిర్ధారిత పరిమాణంలో రెండు సాంచలు (రంధ్రాలు) చేసి ఉన్నాయి.
మొదట్లో దేవాలయం చేరడానికి మెట్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడేవారు. తర్వాత కాలంలో దేవాలయం చేరుకోవడానికి 125 మెట్లు నిర్మించారు. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. 1971 వరకు డిచ్‌పల్లి సర్పంచ్‌గా పని చేసిన గజవాడ చిన్నయ్య ఆలయం అభివృద్ధికి విశేష కృషి చేశారు. నిత్య నైవేద్యం, పూజలు చేయడానికి అర్చకుడిని ఏర్పాటు చేశారు. అర్చకుడి కుటుంబ జీవనోపాధికి రెండు ఎకరాల భూమిని దేవాలయం పేరిట ఏర్పాటు చేశారు.
ఏటా రెండుసార్లు కల్యాణోత్సవాలు..
ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి పాడ్యమి వరకు దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. త్రయోదశి రోజు శ్రీసీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు శ్రీసీతారామస్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఇలా ఏటా రెండుసార్లు స్వామి వారి కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఆలయం దక్షిణ దిక్కున సుమారు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. చెరువు మధ్యలో మండపం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

రాతి కట్టడం..
ఆలయం చుట్టూ చక్కగా మలచిన రాతి స్తంభాలు ఉన్నాయి. స్తంభాల పీఠభాగాలు రెండున్నర మీటర్ల చుట్టు కొలతను కలిగి ఉంటాయి. దేవాలయం నిర్మాణం చాలా వరకు నల్లరాయితోనే చేశారు. ఈ ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. అప్పట్లో గోపురం ఉండేది కాదు. కొద్ది సంవత్సరాల క్రితం సిమెంట్‌తో గోపురం నిర్మించారు. నిజామాబాద్ జిల్లాలోనే ఈ ఆలయానికి శిల్పకళలో అగ్రస్థానం లభిస్తుంది.

గిచ్చు బొమ్మలు..
ఈ ఆలయం గోడలపై గిచ్చు (శృంగార) బొమ్మలు చెక్కి ఉన్నాయి. గతంలో నిజాం రాజు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని వర్తమానం రాగా, ఆయన ఈ బొమ్మలను చూసి ఎలా స్పందిస్తారోనని స్థానికులు వీటిపై సిమెంట్ పూశారు. అయితే పూర్వీకులు ఏ ఉద్దేశంతో వీటిని చెక్కారో తెలియదని, వాటిని అలాగే ఉంచాలని నిజాం రాజు ఆదేశించడంతో సిమెంట్‌ను తొలగించారు.

అబ్బురపరిచే శిల్పకళా నైపుణ్యం
ఆలయంపై గజకేసరి శిల్పాలతో పాటు ఇతర శిల్ప కళ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. నాట్యమాడుతున్న నెమళ్లు, పోట్లాడుతున్న జింకలు, పడగ విప్పిన నాగరాజు, విష్ణువు దశావతారాలు, ఐదు తలల ఆవు, తాబేలు (Tortoise) ఆకారం ఇలా పలు చిత్రాలు కనువిందు చేస్తాయి.

ఆలయం పక్కనే చెరువు.. మధ్యలో మండపం
డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం (Dichpally Ramalayam) పక్కనే విశాలమైన చెరువు.. చెరువు మధ్యలో రాతి మండపం ఉన్నాయి. వేసవి కాలంలో చెరువులో నీళ్లు తగ్గిపోయిన తర్వాత.. ఈ రాతి మండపంలో అప్పటి కళాకారుల నృత్య ప్రదర్శనలు జరిగేవని పూరీ్వకులు తెలిపారు. రామాలయం నుంచి మండపానికి, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రఘునాథ ఆలయానికి వెళ్లడానికి సొరంగాలు ఉండేవని ప్రస్తుతం వాటిని మూసివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కృషితో.. ఆలయ పర్యాటకంలో భాగంగా చెరువులో బోటింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం త్వరలో చర్యలు చేపట్టనుంది.