అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..! | Akshaya Tritiya 2025, Spiritual Significance Story And History In Telugu | Sakshi
Sakshi News home page

Akshaya Tritiya 2025: అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ.. బంగారం కొనాల్సిందేనా?

Published Wed, Apr 30 2025 9:13 AM | Last Updated on Wed, Apr 30 2025 12:26 PM

Akshaya Tritiya 2025: Spiritual Significance Story History

వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం (Chandanotsavam) కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం.

1. పరశురాముని జన్మదినం.

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.

3. త్రేతాయుగం మొదలైన దినం.

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.

5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

అక్షయ తృతీయ నాడు మనం  చేపట్టిన ఏ కార్యఫలమైనా, (అది  పుణ్యం కావచ్చు, లేదా పాపం కావచ్చు) అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధం లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ, కూజాలో గానీ,  మంచి నీరు పోసి, దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు.

అతిథులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో కూడిన  భోజనం  సమర్పిస్తే, ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే, మన ఉత్తర జన్మలలో, వాటికి లోటురాదు. గొడుగులు, చెప్పులు, విసనకర్రల లాటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ  రోజు నిషిధ్ధ  కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టాన్ని, విజయాన్ని చేకూర్చుతుంది అని పౌరాణిక ఉదంతాలు కొన్ని చెబుతున్నాయి.

బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి?
మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి, ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం (Gold) కొనాల్సిందేనా! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి?

అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.

అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి, ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం, హోమం, వ్రతం, పుణ్యం, దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందనీ, జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.

అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి, ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో, అప్పుచేసో, తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు, అప్పులు, పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.

అక్షయ తృతీయ రోజున వర్జ్యం , రాహుకాలంతో పనిలేదు

''వైశాఖ శుక్ల పక్షోతు తృతీయ రోసిణి యుతా
దుర్లభా బుధచారేణ సోమనాపి ఉతా తథా''

మత్స్య పురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం (Akshaya Tritiya Vratham) గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది.

పుణ్యకార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే , పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.

ఈ రోజున ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం (Rahu Kalam) వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు అంటున్నారు.

చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?

ఇంకా గృహనిర్మాణం, ఇంటిస్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే అక్షయ తృతీయనాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసినా సంపద , పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.
- డీ వీ ఆర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement