
సాక్షి, తాడేపల్లి: రాక్షస పాలనలో ఉన్నామని.. ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుందంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైఎస్సార్‌సీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, మండలాల ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాల దాడిని ఎదుర్కొన్న వైనంపై కూడా ఆయన చర్చించారు. ‘‘ఇలాంటి రెడ్ బుక్ రాక్షస పాలన చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో తెగువ చూపించి, నిబద్ధతతో నిలబడి, విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ... చంద్రబాబూ మావి నీ మాదిరి రాజకీయాలు కాదు.. ఎంపీటీసీలమైనా, జడ్పీటీసీలమైనా మమ్నల్ని చూసి నేర్చుకోమని చంద్రబాబుకి కూడా చూపించి.. గొప్ప తెగువ చూపించారు’’ అని వైఎస్ జగన్ ప్రశంసించారు.
‘‘మీ అందరి తెగువకు, విలువలు పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ హేట్సాఫ్. మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య ఈ 12 నెలల పాలనలో చాలా తేడా కనిపిస్తోంది. 12 నెలల చంద్రబాబు పాలనలో రాజకీయాలకు, మన రాజకీయాలకు తేడా చాలా ఉంది. ప్రజలు మనకు అధికారం ఇస్తేనే తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోటు పొడిచి రాజకీయం చేయలేదు. చంద్రబాబు రాజకీయ ప్రస్ధానం.. వెన్నుపోటుతో మొదలుపెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను జీవితమంతా వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయమంతా కొనసాగిస్తూ వచ్చారు’’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
‘‘సత్యసాయి జిల్లా గాండ్ల పెంటలో ఏడు ఎంపీటీసీ స్ధానాలు ఉంటే.. ప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఏడింట ఆరు మందిని గెలిపించారు. టీడీపీకి ఒక్కటే ఉంది. అలాంటప్పుడు ఎంపీపీ పదవి వైఎస్సార్‌సీపీకే రావాలి. కానీ అక్కడ ఏం జరుగుతుందో మనమంతా చూశాం. బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులను వాచ్ మెన్ లకన్నా హీనంగా వాడుకుంటున్నారు. చివరికి మనం గట్టిగా నిలబడి ఎన్నికలను బాయ్ కాట్ చేసి ఎన్నిక వాయిదా వేయించుకోగలిగాం. కానీ రెండు మూడుసార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా వాళ్లంతట వాళ్లే గెలిచినట్లు ప్రకటించుకున్నారు.
..ప్రకాశం జిల్లా మార్కాపురంలో 15 ఎంటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ తరపున మన పార్టీ గుర్తు మీద 15కు 15 స్థానాలు మనమే గెలిచాం. అక్కడ ఎంపీపీ మనకే రావాలి. అక్కడ కూడా సూట్ కేసులతో ప్రలోభాలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు అంతా ఒక్కటిగా నిలబడ్డారు. మీ తెగువకు హేట్సాఫ్ చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో 30 మంది కౌన్సిలర్లు.. ఇక్కడ వైఎస్సార్‌సీపీ గుర్తు మీద ఏకంగా 26 మంది గెలిచారు. మరి అక్కడ వైఎస్సార్‌సీపీ వాళ్లే గెలవాల్సి ఉండగా.. అక్కడ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు గట్టిగా నిలపబడ్డారు.
..ఇక కుప్పం మున్సిపాల్టీ చూసుకుంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే 25 వార్డులకు గాను వైఎస్సార్‌సీపీ 19 గెలిస్తే.. టీడీపీ కేవలం 6 మాత్రమే గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ తరపున మున్సిపల్ చైర్మన్ కావాలి కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు.. ఏ స్థాయిలో అంటే.. మనవాళ్లను బెదిరించి వాళ్ల పార్టీలోకి తీసుుకుంటున్నారు. ఇది నా నియోజకవర్గం.. నా కుప్పం నియోజకవర్గంలో ఎలా రాక్షస పాలన చేయాలో నేర్పుతాను. రాష్ట్రమంతా ఇలానే చేయాలని సంకేతాలు ఇచ్చాడు చంద్రబాబు. అలా సంకేతాలు ఇచ్చి బలవంతగా మున్సిపల్ చైర్మన్ పోస్టును తీసుకున్నారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.50 లక్షలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు.
..రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయనే కుప్పం నియోజకవర్గంలో తప్పుడు సంకేతాలను పంపించారు. ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యాలకు నిదర్శనంగా కుప్పం మున్సిపాల్టీ నిలిచింది. కుప్పాన్ని మున్సిపాల్టీ చేసింది మనమే. చంద్రబాబు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదు. డివిజన్ మాట అటుంచి తాగడానికి కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో తెగువ చూపించిన నిలబడిన వైయస్సార్పీపీ కౌన్సిలర్లకు హేట్సాఫ్ చెప్పాలి. రాజకీయలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా ప్రజల గుండెల్లో ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని వైఎస్సార్‌సీపీ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి గర్వంగా పోగలుగుతాడు. కానీ ఇవాళ చంద్రబాబు, ఆ పార్టీ కార్యకర్తలు తమ పాలనలో ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలడా అని ప్రశ్నిస్తున్నాను.

..ఏ ఇంటికైనా వాళ్ల కార్యకర్తలు వెలితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి ప్రశ్నిస్తారు. చిన్న పిల్లవాడు నా రూ.15వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి నా రూ.18వేలు ఏమైందని అడుగుతారు. ఆ తర్వాత వాళ్ల ఆ తల్లుల అమ్ములు, ఆ ఇంట్లో నుంచి రైతన్నలు, ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు మాకిచ్చిన హామీలు ఏమయ్యాయని అడుగుతారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న, చిన్న హమీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయి. ప్రజలు ఆ హామీలు ఏమయ్యాయని అఢుగుతున్నారు. ఉచిత బస్సు ఉంటే కడప నుంచి విశాఖపట్నం, కర్నూలు నుంచి అమరావతి వెళ్లి వద్దామనుకున్నాం.. అవి ఏమయ్యాయని అడుగుతున్నారు.
..చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నోటి కాడ కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని రద్దు చేశాడు. అలా రద్దు చేయడమే కాకుండా జగన్ ఇచ్చినవే కాకుండా అధికంగా ఇస్తానని ఎన్నికల్లో చెప్పాడు. చంద్రబాబు చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన బాండ్లు ప్రజలు దగ్గర పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని ఎదురుచూస్తున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి.
స్కూళ్లలో నాడు-నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిషు మీడియం పక్కకు పోయింది. టోఫెల్ పీరియడ్ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. పిల్లలు ప్రభుత్వ బడులకు పోవాలంటే నో వేకెన్సీ బోర్డుల ఉన్న మన హయాం నుంచి ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దు అన్ని స్థితికి తెచ్చేశారు. ఉన్నత విద్య కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చే పరిస్థితి మన హయాంలో ఉండేది. ప్రతి మూడు నెలలకు వారికి ఫీజులు మన హయాంలో చెల్లిస్తే.. నేడు చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయింది. పేదవాడు ఏ కార్పోరేట్ ఆసుపత్రికైనా వెళ్లి ఉచితంగా రూ.25 లక్షల వరకు చికిత్స చేయించుకునే పరిస్థితి మన పాలనలో ఉండేది.
ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3500 కోట్లు సుమారుగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యఆసరా లేదు. పేదవాడు నెట్ వర్క్ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తే నిరాకరిస్తున్నారు. మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా... రైతుల పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ రైతులకు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశాడు. ఇ- క్రాప్ కనబడకుండా పోయింది.ఆర్బీకేలు నీరుగార్చాడు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్ధితుల్లో ఉన్నారు. ధాన్యం, అరటి, కంది, చీనీ ఇలా ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేదు. ఇంత దారుణమైన పాలన చేస్తున్నారు.
మరోవైపు విచ్చలవిడి స్కాంలు జరుగుతున్నాయి. మన హయాంలో ఇసుకలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వంలో మన హయాంలో కన్నా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఏ గ్రామంలో చూసినా ఇవాళ గుడి చివర, బడి చివర, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ఏ నియోజకవర్గంలో మైన్, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. పంచుకో, దోచుకో తినుకో నడుస్తోంది.
రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ... చంద్రబాబు తన మనుషులకు రూపాయికి ఎకరా కేటాయిస్తున్నాడు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ గ్రూపులకు అడ్డగోలుగా భూములు కేటాయిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేశాడు. జ్యుడీషియల్ రివ్యూ తీసేశారు. కొత్తగా మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. మొబలైజేషన్ అడ్వాన్స్ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తున్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. ప్రజలు కూడా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు పుట్ బాల్ తన్నినట్లు తంతారు.
ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్దాలు చెప్పిన ఆయన పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి.
..ఇంతకుముందు మన హయాంలో కార్యకర్తల కోసం అనుకున్నవిధంగా మనం చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ లాంటి మహమ్మూరి వల్ల... ఆ తర్వాత రెండు సంవత్సరాలు పాటు ప్రజల ఆరోగ్యం మీద పాలన మీద దృష్టి పెట్టి నడపాల్సి వచ్చింది. కార్యకర్తలు పడుతున్న కష్టాలు మీ జగన్ చూశాడు. మీ అందరికీ మాట ఇస్తున్నాను. వచ్చే జగన్ 2.0లో మీ అందరికీ పెద్ద పీట వేస్తాడు. రాత్రి వచ్చిన తర్వాత పగలు రాకతప్పదు. కష్టాలు వచ్చిన తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
