ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట రామాలయం.. | Andhra Ayodhya Vontimitta Sri Kodanda Ramalayam | Sakshi
Sakshi News home page

ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట రామాలయం..

Published Thu, Apr 10 2025 11:57 AM | Last Updated on Thu, Apr 10 2025 12:12 PM

Andhra Ayodhya Vontimitta Sri Kodanda Ramalayam

ఆంధ్రా అయోధ్యగా... అపర భద్రాద్రిగా గుర్తింపు పొందిన వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలోని గర్భగుడిలో మనకు ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపిస్తాయి తప్ప హనుమంతుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయ నిర్మాణ సమయానికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదనీ.. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదనే కథ  ప్రచారంలో ఉంది. అయితే ఆలయానికి అభిముఖంగా సంజీవరాయస్వామి పేరుతో ఒంటిమిట్ట క్షేత్రపాలకుడుగా ఆంజనేయస్వామి ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయంలో స్వామివారు సీతారామలక్ష్మణులకు ఎదురుగా నిలబడి అంజలి ఘటిస్తున్నట్లుగా ఎత్తైన విగ్రహంతో నిలచి, భక్తులను కాపాడుతూ ఉంటారు. 

స్థలపురాణం...
ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. పద్నాలుగేళ్ల వనవాస సమయంలో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలోనూ కొంతకాలం గడిపాడట. ఆ సమయంలో మృకండు, శృంగి అనే మహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉండేదట. వాళ్లు చేసే యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట. 

అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ... అయితే ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడనీ అంటారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. 

బోయవాళ్లైన వీళ్లు ఈ అటవీ ప్రాంతాన్ని సంరక్షించేవారు. ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని అడగగా, ఇక్కడ రామాలయం కట్టించమని కోరారట. 

రాజు ఈ ప్రదేశాన్ని పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లి΄ోయాడు. వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు. ఆ తరువాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న నాలుగు సీతారామలక్ష్మణ ఏకశిల విగ్రహాల్లో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. 

ఈ ఆలయంలోని రామతీర్థాన్ని రాముడే సీతకోసం ఏర్పాటు చేశాడని అంటారు. మొదట ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారనీ.. క్రమంగా అదే రామతీర్థం అయ్యిందనీ చెబుతారు. ఎందరో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినా... ఆంధ్రావాల్మీకిగా గుర్తింపు పొందిన వావిలికొలను సుబ్బారావు అనే రామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు ఆ భక్తుడు టెంకాయ చిప్పను పట్టుకుని భిక్షాటన చేసి సుమారు పది లక్షల రూపాయలు సేకరించాడట.

విశేష పూజలు...
మూడు గోపుర ద్వారాలున్న ఈ ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులుంటుంది. శేషాచల పర్వత పంక్తిలో ఆదిశేషుని తలభాగంగా తిరుమల క్షేత్రం మధ్యభాగంగా దేవుని గడప (కడప), ఒంటిమిట్ట, అహోబిలం తోకభాగంగా శ్రీశైల క్షేత్రాలను అభివర్ణిస్తారు. 

దేవుని కడప క్షేత్రాన్ని సందర్శించి తిరుమలకు వెళ్లే భక్తులు ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయాన్ని దర్శించి వెళ్లడం అనాదిగా జరుగుతోంది. ఎత్తైన గోపురాలు, విశాలమైన ఆలయ ప్రాంగణం, సుందరమైన మండపాలు, విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలిపే రమణీయ శిల్పసంపద ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంది.

ఈ ఆలయాన్ని అద్భుత ధామంగా తీర్చిదిద్డడంలో చోళరాజులు, విజయనగర పాలకులు ఇతోధికమైన కృషి చేశారు. దేవాలయ ముఖమండపంలో రామాయణ, భారత, భాగవతాలలోని వివిధ ఘట్టాలను కనులకు కట్టే శిల్పాలున్నాయి. సీతాదేవికి అంగుళీయకాన్ని చూపిస్తున్న హనుమంతుడు, లంకకు వారధిని నిర్మించే వానరులు, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తే దృశ్యం, వటపత్రశాయి, శ్రీ కృష్ణుని కాళీయ మర్ధనం, నర్తకీమణుల బొమ్మలు ఉన్నాయి. 

అలాగే ముఖద్వారంపై దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసే దృశ్యం, ఒక బొమ్మలో ఏనుగు– ఆవు కనిపించేలా చెక్కిన సుందర శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆలయ ద్వారపాలకులుగా అంజలి ముద్రతో శోభిల్లే జయవిజయుల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.  

ఆధ్యాత్మిక కేంద్రం
ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడంతోపాటూ శ్రీరామనవమి సమయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలను చేస్తారు. చతుర్దశి నాడు కల్యాణం, పౌర్ణమిరోజు రథోత్సవం నిర్వహిస్తారు. బమ్మెర పోతనామాత్యుడు ఒంటిమిట్ట కేంద్రంగా భాగవత రచన చేసి, ఆ కావ్యాన్ని ఒంటిమిట్ట కోదండ రామునికే అంకితం ఇచ్చారట. అందుకే ఒంటిమిట్ట ఆలయంలో పోతన విగ్రహం కూడా ఉంది. 
– డి.వి.ఆర్‌. 

(చదవండి: మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాలు..! ఏకంగా 108 మంది రాణులు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement