ontimitta kodandaramalayam
-
అల ఏకశిలా నగరిలో..
శతాబ్దాల చరిత్ర, ఏకశిలానగరిగా గుర్తింపు. ఒంటిమిట్ట రాములోరిగా ప్రఖ్యాతి. ఇప్పుడు ఆ పురాతన కోదండరామాలయంలో గర్భగుడి జీర్ణోద్ధరణ పనులు చేయడానికి కేంద్రపురావస్తు శాఖ సన్నద్ధం అవుతోంది. శతాబ్దం కాలం తర్వాత చేపడుతున్న ఈ పనులతో ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం కొత్త సొబగులు సంతరించుకోనుంది. వందేళ్ల క్రితం ఆంధ్ర వాల్మీకిగా గుర్తింపు పొందిన వావికొలను సుబ్బారావు నేతృత్వంలో ఓ సారి గర్భగుడిలో జీర్ణోద్ధరణ పనులు జరిగాయి. టీటీడీ ఆదీనంలోకి ఆ రామాలయం వెళ్లిన తర్వాత అంతరాలయం జీర్ణోద్ధరణ పనులను కేంద్ర పురావస్తుశాఖ చేపట్టనుంది. – రాజంపేట విజయనగర సామ్రాజ్య కాలంలో.. విజయనగర సామ్రాజ్య కాలంలో.. క్రీ.శ 1340లో ఉదయగిరి పాలకుడు కంపరాయలు ఒంటిమిట్ట ప్రాంతంలో తన పరివారంతో పర్యటించారు. ఇక్కడి అడవుల్లో వంటడు, మిట్టడు అనే ఇద్దరు బోయలు రాజుగారికి సేవలందించారు. ఆ సమయంలో ఒంటిమిట్ట ప్రాంతంలో ఉన్న ఆలయం గురించి రాజుకు వివరించారు. గుట్టమీద చిన్న గుడిలో జాంబవంతుడు ప్రతిష్టించిన ఏక శిలలో సీతారామలక్ష్మణులను పూజిస్తున్నామని, అక్కడ ఓ గుడి కట్టాలని వారు రాజును అభ్యర్థించారు. వంటడు, మిట్టడు చెప్పిన మేరకు కంపరాయలు గుడి, చెరువు నిర్మించేందుకు అంగీకరించి ఆ బాధ్యత బోయలకే అప్పగించారు. ఒకే శిలలో సీతారామలక్ష్మణులను జాంబవంతుడు ప్రతిష్టించినట్లే.. అదే సంప్రదాయంతో ఏకశిలలో ముగ్గురు మూర్తులు ఉండేటట్లు నిర్మాణం చేయించారు. అప్పట్లో గర్భాలయం, అంతరాలయం, చిన్నగోపురం ఉండేవి. మొదటిదశ నిర్మాణమిది. కొబ్బరి చిప్ప చేతపట్టుకుని.. రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాలు ఆక్రమణకు గురికాగా, వందేళ్ల క్రితం రామునికి నైవేద్యం కరువైన పరిస్థితి వచ్చింది. జీర్ణదశకు చేరిన ఒంటిమిట్ట రామాలయాన్ని ఉద్ధరించటానికి వావికొలను సుబ్బారావు కంకణం కట్టుకున్నారు. కొబ్బరి చిప్పను చేతపట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఊరూరా తిరిగి జోలెపట్టారు. ఆ డబ్బుతో రామాలయాన్ని పునరుద్ధరించారు. 1925లో దాదాపు రూ. 2 లక్షలను సేకరించి, గర్భగుడి, ఆలయ ప్రాంతాన్ని జీర్ణోద్ధరణ చేశారు. అప్పట్లో పదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.6 నుంచి గర్భాలయం మూసివేత ఇప్పుడు జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో సెపె్టంబర్ 6 నుంచి గర్భాలయం మూలవిరాట్టు దర్శనం ఉండదు. ఆలయ ప్రాంగణంలో టీటీడీ బాలాలయం నిరి్మస్తోంది. దాదాపు రూ. 75 లక్షలతో గర్భగుడి పనులు చేపట్టనున్నారు. గర్భాలయం మూలవిరాట్టు (ఏకశిల) చుట్టూ చేపట్టే పనులను వీడియో చిత్రీకరణ చేయనున్నారు. ఈవిషయాన్ని కేంద్రపురావస్తుశాఖ అధికారి బాలకృష్ణారెడ్డి తెలియచేశారు. అలాగే గోపురం పైభాగంలో ఉన్న శిలారూపాలను కూడా అందంగా తీర్చిదిద్దనున్నారు. శతాబ్ద కాలం తర్వాత గర్భగుడిలో పనులు జరగడంపై రామభక్తుల్లో ఆనందం నెలకొంది. -
ఇక జాంబవ క్షేత్రంగా ఒంటిమిట్టకు ఖ్యాతి
కడప కల్చరల్ : ఒంటిమిట్ట దివ్య క్షేత్రానికి కొత్త హంగు కలగనుంది. జాంబవ ప్రతిష్టగా పేరున్న ఈ క్షేత్రంలో జాంబవంతుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని చాలా కాలంగా భక్తులు కోరుతున్నారు. వారి వినతులకు స్పందించిన టీటీడీ అదికారులు ఇటీవలి పర్యటన సందర్భంగా ఈ మేరకు విగ్రహ ప్రతిష్ట చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రానికి తలమానికంగా, జిల్లాకు గర్వ కారణంగా నిలిచిన శ్రీమద్ ఒంటిమిట్టకు జాంబవ క్షేత్రంగా పేరుంది. ఈ ఆలయానికి అధికార హోదా దక్కేందుకు స్థానిక పరిశోధకులు ఆలయ ప్రాచీనత గురించి చెబుతూ క్షేత్ర పాలకుడిగా రామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టించినది జాంబవంతుడేనని స్పష్టం చేశారు. ఇందుకు పురాణ గాథలను ఉదాహరణగా చూపారు. తిరుమల క్షేత్రానికి వరాహ స్వామి, దేవునికడపకు హనుమంతుడు క్షేత్ర పాలకులు. అలాగే ఒంటిమిట్ట ఆలయానికి జాంబవంతుడు క్షేత్ర పాలకుడని స్థానిక చరిత్రకారుడు స్పష్టం చేశారు. ఒంటిమిట్ట జాంబవ క్షేత్రమని పేర్కొనేందుకు జిల్లాలో పలు ఆధారాలు లభించాయి. సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో రోడ్డు వారగా జాంబవంతుని శిలాచిత్రం గల శాసనం లభించింది. పలు తరాలుగా తాము జాంబవంతుడిని పూజిస్తున్నామని, ఒంటిమిట్ట తిరునాలకు గ్రామ వాసులంతా తప్పక వెళతామని తెలిపారు. అంబవరంలో.. కడప నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో అంబవరం గ్రామం ఉంది. గ్రామం మధ్యలో గల చిన్న దిమ్మెపై రెండు అడుగుల జాంబవంతుని విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. ఒకప్పుడు ఈ స్థలంలో చిన్న రాయి ఉండేదని, దాన్నే జాంబవంతునిగా పూజించేవారమని, పెద్దల కాలం నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. తరతరాలుగా తమ గ్రామంలో జాంబవంతుని పూజలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వరుసగా రెండేళ్లుగా వర్షాలు రాకపోతే నెల రోజుల పాటు ఇంటికొక బిందె చొప్పున నీళ్లు తెచ్చి జాంబవంతుని విగ్రహాన్ని అభిషేకిస్తామని, తప్పక మంచి ఫలితం ఉంటోందని వారు వివరించారు. తాడిగొట్లలో.. కడప నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తాడిగొట్ల గ్రామం ఉంది. ఊరి మధ్య విశాలమైన అరుగుపై ఆ గ్రామ ప్రజలు జాంబవంతుని విగ్రహం ఉంది. గ్రామంలో ఏ ఇంటిలోనైనా శుభ కార్యాలు జరిగితే తొలిపూజ జాంబవంతునికే నిర్వహిస్తామని తెలిపారు. వర్షాభావ పరిస్థితి ఏర్పడితే స్వామికి అభిషేకాలు చేస్తామని, తప్పక వర్షాలు కురుస్తాయన్న విశ్వాసం ఉందన్నారు. ఈ గ్రామాలే గాక చిట్వేలితోపాటు కడప నగరానికి సమీపంలోని మరికొన్ని గ్రామాలలో కూడా జాంబవంతుని విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒంటిమిట్ట క్షేత్ర పాలకుడు జాంబవంతుడు గనుక జిల్లాలోని ఆ క్షేత్రానికి సమీపంలో గల చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న గ్రామాలలో నేటికీ పూజిస్తూ ఉండడంతో.. ఒంటిమిట్ట క్షేత్రానికి జాంబవంతుని గల అనుబంధాన్ని భావితరాలకు శాశ్వతంగా తెలిపేందుకు అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని రామయ్య భక్తులు చిరకాలంగా కోరుతున్నారు. ఇటీవల ఆలయాన్ని పరిశీలించిన టీటీడీ అధికారులకు కూడా విన్నవించడంతో.. వావిలకొలను సుబ్బారావు తపం చేసిన శృంగిశైలంపై జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కొండపైనే తొలుత జాంబవంతుడు నివసించినట్లు కైఫీయత్తుల పరిష్కర్త, చరిత్ర పరిశోధకులు దివంగత విద్వాన్ కట్టా నరసింహులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గిరి ప్రదర్శన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరుణాచలం, సింహాచలంతోపాటు మరికొన్ని దివ్య క్షేత్రాలలో ఆయా దేవతామూర్తుల పూజలో భాగంగా అక్కడ గిరి ప్రదర్శన నిర్వహిస్తుండడం తెలిసిందే. అదే పద్ధతిలో ఒంటిమిట్టలోని శృంగిశైలానికి కూడా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదిజాంబవ మఠాల పెద్దలు పలు సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కొండపై జాంబవంతుని ప్రతిష్ట జరిగితే ఇక్కడ కూడా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయాలని వారు మరోమారు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, ఒంటిమిట్ట తిరునాల సందర్బంగా తాము తమ శిష్య గణాలతో కలిసి శృంగిశైలం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని గుర్తు చేశారు. మంచి నిర్ణయం తీసుకున్నట్లు హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీ అధికారులను అభినందించారు. ఇదీ చదవండి: శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం -
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవం (ఫొటోలు)
-
ముగిసిన ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవం
అప్డేట్స్ ► ముగిసిన ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవం ► వెన్నెల వెలుగుల్లో.. కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం.. భక్తుల పారవశ్యం ► కన్నుల పండువగా కోదండ రాముని కల్యాణ మహోత్సవం 8.10PM ► కోదండ రాముని కల్యాణోత్సవానికి హాజరైన సీఎం జగన్ ► ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న సీఎం జగన్. 7.44PM ► స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం జగన్ 7.42PM ► సంప్రదాయ రీతిలో రామయ్య దర్శనానికి వెళ్లిన సీఎం జగన్. 7.37PM ► ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. ఆహ్వానం పలికిన మంత్రి ఆర్కే రోజా, అధికారులు. 6.46PM ► ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీఎం జగన్. మరికొద్దిసేపట్లో ఒంటిమిట్ట ఆలయానికి. ► కోదండ రామాలయంలో సీతారామ కల్యాణోత్సవం కోసం తొలుత ఒంటిమిట్ట కోదండరామాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని.. అక్కడ నుంచి నేరుగా స్వామి వారి కల్యాణ వేదికకు చేరుకోనున్న సీఎం జగన్. 5.50PM ► కడప చేరుకున్న సీఎం వైఎస్ జగన్. కడప ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఒంటిమిట్ట చేరుకోనున్నారు. ► ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామ కల్యాణోత్సవం కోసం సీఎం వైఎస్ జగన్ బయలుదేరారు. ► కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా కల్యాణం ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి లక్షలాది భక్తుల సమక్షంలో జగదభిరాముడి జగత్కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ► ఈ కల్యాణమహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై.. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ► కల్యాణం రాత్రి 8 గంటల నుంచి 10 గంటలవరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం.. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. ► ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఒంటిమిట్ట రామయ్య కోసం.. టెంకాయ చిప్పతో ఊరూరా..భిక్షమెత్తి
భద్రాచలం రామయ్య కోసం గుడి నిర్మించి రామభక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు రామదాసు. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండరాముని ఆలయ జీర్ణోద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో రామదాసు.. వావిలికొలను సుబ్బారావు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం – రాజంపేట ఆంధ్రవాల్మీకిగా పేరుగడించిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట ఆలయ జీర్ణోద్ధరణకు విశేష కృషి చేశారు. ఈయన జనవరి 23, 1863న ప్రొద్దుటూరులో జన్మించారు. తండ్రి రామచంద్ర, తల్లి కనకమ్మ, భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలుకా ఆఫీసులో గుమస్తాగా చేరి రెవిన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు. ఆగస్టు 1, 1936లో మద్రాసులో పరమపదించారు. ఆలయ అభివృద్ధికే.. రాజులు ఒంటిమిట్ట ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికివారు భోంచేయగా రామునికి నైవేద్యం కరువైన స్థితికి కోదండరామాలయం వచ్చింది. జీర్ణదశకు చేరిన ఈ రామాలయంను ఉద్ధరించటానికి వావిలికొలను కంకణం కట్టుకున్నారు. టెంకాయచిప్పను చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఊరురా తిరిగి బిచ్చమెత్తారు. ఆ ధనంతో రామాలయంను పునరుద్ధరించారు. టెంకాయచిప్పలో ఎంతధనం పడినా ఏదీ తన కోసం ఉంచుకోకుండా రాయాలయ అభివృద్ధికే ఇచ్చేశారు. ►ఈయన రామాయణంతోపాటు శ్రీకృష్ణలీలామృతం, ద్విపద భగవద్గీత, ఆంధ్ర విజయం, దండకత్రయం, టెంకాయచిప్ప శతకం, పోతన నికేతన చర్చ, శ్రీరామనుతి, కౌసల్యా పరిణయం లాంటి ఎన్నో రచనలు కూడా చేశారు. ►వాల్మీకి సంస్కృత రామాయణంను 24వేల చందోభరిత పద్యాలుగా తెలుగులో రాశారు. ఆయన రాసిన రామాయణంను ఒంటిమిట్ట శ్రీరామునికి అంకితం ఇచ్చారు. అప్పుడు బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు వావిలికొలను సుబ్బారావుకు ఆంధ్రవాల్మీకి అని బిరుదు ప్రదానం చేశారు. -
కల్యాణానికి సర్వం సిద్ధం.. సీఎం జగన్ పర్యటన వివరాలిలా..
సాక్షి, ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా కల్యాణం ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి లక్షలాది భక్తుల సమక్షంలో జగదభిరాముడి జగత్కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా గురువారం టీటీడీ ఈఓ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఒంటిమిట్టలోని స్వామి వారి కల్యాణ వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. కల్యాణం రాత్రి 8 గంటల నుంచి 10 గంటలవరకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. భక్తులందరికి అక్షింతలు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామని వెల్లడించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, ఈఎంసీ సీఈఓ గౌతమి, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. కడప కార్పొరేషన్: ఈనెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. రాత్రి 7.20 గంటలకు టీటీడీ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 7.30 నుంచి 7.40 గంటల వరకు కోదండరామస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సీతారాముల కల్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు. 8.00 నుంచి 10.00 గంటల వరకు జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణాన్ని తిలకిస్తారు. తర్వాత రోడ్డు మార్గాన ఒంటిమిట్ట నుంచి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు కడపలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు, 16వ తేదీ శనివారం ఉదయం 9.10 గంటలకు కడప ఎన్జీఓ కాలనీలో నంద్యాల జాయింట్ కలెక్టర్ మౌర్య వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి పాత బైపాస్‌లో ఉన్న ఆదిత్య కల్యాణ మండపానికి చేరుకుంటారు. 9.30 నుంచి 9.45 గంటల వరకు కడప నగర మేయర్ సురేష్‌బాబు కుమార్తె ఐశ్వర్య వివాహ ముందస్తు వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి కడపకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని 10.10 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలుజిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు వెళతారు. -
శేషవాహనంపై శ్రీరాముడు
ఒంటిమిట్ట/నెల్లిమర్ల రూరల్/సింహాచలం(పెందుర్తి): ఆంధ్ర రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సతీసమేతంగా స్వామి వారికి పట్టువ్రస్తాలు సమరి్పంచారు. ఉత్సవ నిర్వాహకులు రాజేష్ సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదపండితులు గరుడ పతాక ప్రదర్శన చేపట్టారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసి సకల దేవతలు, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహా్వనించారు. విష్వక్సేన పూజ, ధ్వజస్తంభ రక్షాబంధనం, ఆరాధన జరిపారు. బుధవారం రాత్రి జగదభిరాముడు శేషవాహనంపై విహరించారు. రామతీర్థంలో వైభవంగా కల్యాణ వేడుక విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీ సీతారామస్వామి సన్నిధిలో బుధవారం స్వామివారి కల్యాణం కోవిడ్ నేపథ్యంలో ఏకాంతంగానే జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింహాచలం దేవస్థానం పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలను ఆరేళ్లుగా అందజేస్తున్న నేపథ్యంలో వాటిని ఏఈవో రాఘవకుమార్, ఇన్చార్జి ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు రామతీర్థం ఆలయానికి సమర్పించారు. వాటిని ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు రాములవారికి అందజేశారు. కల్యాణ క్రమంలో ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ ఆశీర్వచన మండపం వద్దకు అర్చకులు తీసుకువచ్చారు. అక్కడ వెండి మండపం మధ్యభాగంలోని అమ్మవారిని, స్వామివారిని వేంచేపు చేశారు. వేదమంత్రోచ్ఛారణ నడుమ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారామస్వామి వార్ల శిరస్సుపై ఉంచారు. శా్రస్తోక్తంగా మాంగల్యధారణ గావించారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ పాల్గొన్నారు. -
ఆలయాలకు కరోనా ఎఫెక్ట్
ఒంటిమిట్ట/లేపాక్షి: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆంక్షలు అమలవుతున్నాయి. తాజాగా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఆలయాలను తాకింది. కరోనా ఉధృతి నేపథ్యంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని అన్ని చారిత్రక, పురాతన ఆలయాలు, కట్టడాలు, సందర్శన ప్రదేశాలు, మ్యూజియంలను వెంటనే మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని శుక్రవారం నుంచి మూసివేశారు. మే 15 వరకు ఆలయంలోకి భక్తులను ఎవర్నీ అనుమతించబోమని ఆలయ ఏఈవో మురళీధర్ తెలిపారు. అయితే, స్వామివారికి నిత్యం జరిగే పూజా కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఒంటిమిట్ట ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వహణపై కూడా టీటీడీ అధికారులు పురావస్తు శాఖ అధికారులతో సమీక్షిస్తున్నారని, సమీక్ష అనంతరం బ్రహ్మోత్సవాలపై అధికారిక ప్రకటన వెలువరిస్తామని చెప్పారు. ఇక, అనంతపురం జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో మే 15 వరకు భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో నరసింహమూర్తి తెలిపారు. లేపాక్షి నంది విగ్రహం వద్ద కూడా పర్యాటకులకు ప్రవేశం లేదని, నంది విగ్రహం పార్కింగ్‌ను కూడా మూసివేశామని పేర్కొన్నారు. -
ఒంటిమిట్ట: 3 రోజులుగా ప్రాణాలు అరచేతిలో..
సాక్షి, కడప: అధికారుల నిర్లక్ష్యం కారణంగా 90 ఏళ్ల వృద్ధురాలు కూలిన రేకుల షెడ్డు కింద మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. వివరాలు.. శుక్రవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురియడంతో వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు చనిపోవడం, 32 మందికి గాయాలైన సంగతి తెల్సిందే. అధికారులు సరిగ్గా గమనించకపోవడంతో రేకుల షెడ్డు కింద ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలు మూడు రోజులుగా అక్కడే ఉండిపోయింది. సోమవారం రేకులను తొలగిస్తుండగా కార్మికులు గమనించడంతో ప్రాణాలతో బయటపడగలిగింది. అనంతరం ఆమెను హుటాహుటిన 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కమనీయం...రామయ్య కల్యాణం
వైఎస్సార్ జిల్లాలోని అపర అయోధ్య ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణం నిర్వహించారు. కనులపండువగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల రామనామ స్మరణలు మార్మోగుతుండగా పురోహితులు కల్యాణ క్రతువును చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ప్రత్యేక విమానంలో కడపకు వచ్చి, అక్కడి నుంచి రోడ్డుమార్గాన ఒంటిమిట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల మూలమూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు సంప్రదాయంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పురోహితులు అమ్మవారి మహామంగళ సూత్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. మంగళ వాయిద్యాల మధ్య పురోహితులు స్వామి పక్షాన అమ్మవారి గళసీమలో మంగళ సూత్రాలను అలంకరించారు. - సాక్షి, కడప -
ఒంటిమిట్టకు బ్రహ్మోత్సవ శోభ
సాక్షి, కడప: అపర అయోధ్యగా పేరొందిన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. చారిత్రక ప్రాశస్త్యంగల ఒంటిమిట్టలో నాలుగేళ్లుగా ప్రభుత్వ లాంఛనాలతో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3 వరకు జరగనున్నాయి. ఏకశిలా నగరంలో కిక్కిరిసిన భక్తులు ఏకశిలా నగరంగా పేరున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఒంటిమిట్ట కిటకిటలాడింది. క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. ఉ.9 గంటల ప్రాంతంలో ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసి సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. శాస్త్రబద్ధంగా గరుడ పటాన్ని ప్రతిష్టించడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణం సందర్బంగా ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 30న కల్యాణోత్సవం: ఒంటిమిట్టలో 30న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కల్యాణంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు రానున్నట్లు సమాచారం. అలాగే, గవర్నర్ కూడా హాజరయ్యే అవకాశమున్నందున అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. చంద్రునికి ప్రీతిగా రాత్రివేళ కల్యాణం రాజంపేట: విశ్వవ్యాప్తంగా సీతారాముల కల్యాణం పగటిపూట జరిపితే ఒక్క ఒంటిమిట్టలోనే రాత్రిపూట జరపడం విశేషం. దీనివెనుక పెద్ద కథే ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అదేమిటంటే.. ఎక్కడ చూసినా సీతాశ్రీరాముల కల్యాణం ఉదయంపూటే జరుగుతుండడంతో దానిని కనులారా వీక్షించి తరించే అవకాశం చంద్రునికి లేకుండాపోయింది. చంద్రుడు ఈ బాధ భరించలేకపోయాడు. బ్రహ్మోత్సవాలకు అధినాయకుడైన బ్రహ్మకు తన ఆవేదనను నివేదించుకున్నాడు. బ్రహ్మ అందుకు తగిన ఏర్పాటుచేస్తానని.. భూమ్మీద ఏదో ఒకచోట ఆ అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చాడు. దాని ఫలితంగానే ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో చైత్ర శుద్ధ చతుర్ధశి నాటి రాత్రి వివాహ మహోత్సవం, కళాపూర్ణుడైన చంద్రుడు శ్రీ సీతారామకల్యాణాన్ని పరమానందంతో తిలకిస్తాడు. ఇదిలాఉంటే.. ఈ కల్యాణం ఏర్పాటుచేసింది బ్రహ్మదేవుడు కాదు.. శ్రీ మహావిష్ణువు అని కూడా అంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో పగటిపూట జన్మించాడు. పగటివేళ జననం కారణంగా చంద్రుడు ఆ సన్నివేశం చూడలేకపోయాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడుగా రాత్రిపూట జన్మించాడు. చంద్రుడు కృష్ణ జననం చూడగలిగాడు. అయినా శ్రీరామకల్యాణం చూడలేకపోతున్నానే చంద్రుని ఆవేదనను శ్రీ మహావిష్ణువు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో తీర్చినట్లు మరో కథనం. అలాగే, బుక్కరాయలు ఒంటిమిట్టలో శ్రీరామ బ్రహ్మోత్సవాలు ప్రారంభించాడు. ఇందులో భాగంగా శ్రీరామ కల్యాణం జరగాలి. తొలి కల్యాణ మహోత్సవానికి ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రిపూట వచ్చింది. ఈ విధంగా బుక్కరాయల కాలంలో రాత్రిపూటే తొలి సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగినట్లు తెలుస్తోంది. ఆ నాటి నుంచి నేటి దాకా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఆంజనేయుడు లేని ఏకైక రామాలయం ఒంటిమిట్ట ఆలయంలో బుక్కరాయలు ఏకశిలపై ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన కాలంలోనే ఆలయ నిర్మాణం ప్రారంభమైనట్లు, చివరగా సిద్దవటం మట్లి రాజులు ఆలయ నిర్మాణాన్ని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉండగా, ఆంజనేయస్వామిలేని ఆలయం ఇదొక్కటే కావడం విశేషం. మరోవైపు.. ఇక్కడ ఒకే శిలలో సీతారామలక్ష్మణ విగ్రహాలు రూపుదిద్దుకోవడంతో ఈ ప్రాంతం ఏకశిలా నగరంగా ఖ్యాతి పొందింది. -
ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణం.. కమనీయం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట దివ్యక్షేత్రం బుధవారం అయోధ్యనగరిని తలపించింది. కళ్లు చెదిరే కళ్యాణశోభతో ఆ ప్రాంతమంతా కళకళలాడింది. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి ప్రభుత్వపక్షాన రాజలాంఛనాలు సమర్పించగా శ్రీ ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణం అత్యంత వైభవోపేతంగా సాగింది. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఆ క్షేత్రంలోని ప్రత్యేక వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒంటిమిట్ట టీటీడీలో విలీనమైన తర్వాత తొలిసారిగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని టీటీడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. కానుకలను సమర్పించిన గవర్నర్, సీఎం తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీరామచంద్రుడు, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, సువర్ణ కిరీటాలను కల్యాణ కానుకలుగా సమర్పించారు. ఒంటిమిట్ట చెరువు సమీపంలో రూ.142 కోట్ల అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. శ్రీరామ ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. -
ఒంటిమిట్టను టీటీడీలో విలీనం చేస్తే వ్యతిరేకిస్తాం
కడప రూరల్ : జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని తిరుమల-తిరుపతి దేవస్థానంలో విలీనం చేయాలనుకుంటే గట్టిగా వ్యతిరేకిస్తామని భారతీయ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లపురెడ్డి హరినాథరెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపించారు. పైగా తమ పార్టీపైనే ఆరోపణలు చేయడం, దిష్టిబొమ్మలు దహనం చేయడం తగదని హితవు పలికారు. గురువారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని తిరుమల-తిరుపతి దేవస్థానంలో విలీనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమైనట్లు సమాచారం ఉందన్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలోని పుణ్యక్షేత్రాలైన దేవునికడప, గండిక్షేత్రాలు టీటీడీలో విలీనం అయ్యాయన్నారు. అయినప్పటికీ వాటి అభివృద్ధి ఏమాత్రం జరగలేదని తెలిపారు. ఒంటమిట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, తెలుగుదేశం పార్టీ నాయకులు మిత్రపక్షంగా ఉంటూ బీజేపీపై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి పలు విద్యా సంస్థలను కేటాయించగా, రాష్ర్ట ప్రభుత్వం ఏ ఒక్క విద్యా సంస్థలను నెలకొల్పుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. ఆ పార్టీ నాయకులు రాజోలి వీరారెడ్డి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీజేపీతో అన్ని వర్గాల సంక్షేమం జరుగుతోందన్నారు. -
ఇదేమిటి.. రామయ్య!
రాజంపేట: రాష్ట్ర విభజన కాకముందు రెండవ భద్రాద్రిగా వెలుగొందిన ఒంటిమిట్ట కోదండరామాలయూన్ని విభజన తర్వాత మొదటి భద్రాద్రిగా గుర్తించి అధికారిక నవమి ఉత్సవాలు చేపడతారనుకుంటే నిరాశే మిగులుతోంది. ఈ ఉత్సవాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయేందుకు రంగం సిద్ధమవుతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి మహోత్సవాలు భద్రాచలంలో నిర్వహించేవారు. భద్రాచలం ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలోకి వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక పురాతన గొప్ప రామాలయం ఒంటిమిట్టలోదే. భారతదేశంలోని గొప్ప కట్టడాల్లో ఒంటిమిట్ట రామాలయం కూడా ఒకటని విదేశీ యాత్రికుడు తావర్నియర్ ప్రశంసించారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరపాలని అందరూ కోరుకుంటున్నారు. మరో రామాలయూనికి అధికారిక గుర్తింపునకు ప్రయత్నాలు.. ఆంధ్రా భద్రాద్రిగా ఒంటిమిట్ట కోదండరామాలయూనికి అధికారిక గుర్తింపు లభించే సమయంలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు తమ ప్రాంతంలోని రామాలయూనికి ఆ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు విజయనగరం జిల్లా మెలిమర్ల మండలం రామతీర్థం రామాలయంలో చేపట్టాలని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు కృషి చేస్తున్నారని తెలియడంతో జిల్లాలోని రామభక్తుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రభుత్వపరంగా జరిపించడానికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కోరడానికి ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ దేవస్థాన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ స్థానిక నాయకులను, ప్రజాప్రతినిధులను కలిసి అధికార బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట కోదండరామాలయంలో నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరనున్నారు. ఆలయ విశిష్టతలోకి వెళితే.. ఒంటిమిట్ట కోదండరామాలయం దేశంలో రెండవ అయోధ్యగా, రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా గుర్తెరిగినది. ఈ రామాలయంలోని మూలవిరాట్లను త్రేతాయుగంలో ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ రామాలయంలోని సీతారామలక్ష్మణులు విడివిడిగా కనిపించినా ఒకే రాతిలో ఉండటంతో ఏక శిలానగరంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ఏ రామాలయంలోనైనా ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఈ రామాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు. ఎందుకంటే శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగిందనేది కథనం. ఒంటిమిట్ట రామాలయానికి ఉన్నంత పవిత్రత, ప్రాసత్యం, శిల్పకళాసంపద మరే రామాలయంలోనూ లేదు. ఒంటిమిట్ట రామాలయంలోని మధ్య మంటపంలో 31స్తంభాలు ఉన్నాయి. చూపరులను ఆకట్టుకునే శిల్పసంపద, విశాలమైన ప్రాంగణం ఈ రామాలయంలోనే ఉంది. సహజ పండితుడైన పోతనామాత్యుడు శ్రీమదాంద్ర భాగవతం ఇక్కడే రచయించి శ్రీరామునికే అంకితం ఇచ్చారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో పోతన భాగవత తాంబూల సంప్రదాయం బ్రిటీషు కాలం నుంచి ఉంది. దండకారణ్యంలో ఉన్నప్పుడు సీతారామలక్ష్మణులు ఇటుగా వెళుతున్న సమయంలో సీతమ్మకు ఒంటిమిట్టలో దాహం వేయగా ఆమె దాహం తీర్చేందుకు రామలక్ష్మణులు బాణాలు సంధించగా ఏర్పడిన నీటి బుగ్గలే శ్రీరామలక్ష్మణుల తీర్థాలుగా ఇప్పటికీ ఉన్నాయి. కడప నవాబు ఈ రామాలయ ఆవరణంలో ఒకబావిని తవ్వించారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసి జీవితాన్ని రామాలయ అభివృద్ధి కోసం అంకితం చేసిన వావిలకొలను సుబ్బారావు ఊరూరాా భిక్షమెత్తి ఒంటిమిట్ట రామాలయానికి కొన్ని కోట్లరూపాయల విలువ చేసే ఆభరణాలు, భూములు, భవనాలు సమకూర్చారు. ఇంతటి చరిత్ర ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయూన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారిక బ్రహోత్సవాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.