
PC: BCCI/IPL.com
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 5000 పరుగుల మైలు రాయిని అందుకున్న క్రికెటర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఈ ఫీట్ సాధించాడు.
కేవలం 130 ఇన్నింగ్స్‌లలోనే కేఎల్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్(135) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో వార్నర్ రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఐదు వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఐదో క్రికెటర్‌గా రాహుల్ నిలిచాడు.
రాహుల్‌కు ముందు విరాట్ కోహ్లి (8326), రోహిత్ శర్మ (6786), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్ (5162) ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలురాయిని తాకారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నోపై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.
160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో ఐడైన్ మార్క్‌రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది.