
పహల్‌గావ్
ఘోర ఉదంతాలు జరిగినప్పుడు వాటి నుంచి తప్పించుకున్నవారు అందుకు గల కారణాలకు ఆశ్చర్య పోతుంటారు. మంగళవారం పహల్‌గావ్ ఉగ్రదాడిలో ‘ఉప్పు’ వల్ల కొందరు ప్రాణాలు కాపాడు కున్నారు. మధ్యాహ్నం భోజనంలో రెస్టరెంట్ వారు వేసిన ఎక్కువ ఉప్పు వారిని కాపాడింది. గుర్రం ఎక్కడానికి ఇష్టపడని భార్య వల్ల భర్త, కుమారుడితో పాటు ఆమె కూడా బతికిపోయింది. ఇలాంటివే ఎన్నో. వీటిని అదృష్టం అనొచ్చు. మిరాకిల్ అనొచ్చు. మనిషి విశ్వాసాలు బలపడే, బలహీనపడే సందర్భాలు ఇవి.
ఒకే రోజు. ఒకే సమయం. ఒకే స్థలం. అటు చూస్తే మరణం. ఇటు చూస్తేప్రాణ భయం. రక్తపు మడుగులో కొందరు.ప్రాణాలు ఉగ్గబట్టుకొని మరికొందరు. ఏప్రిల్ 22, 2025, మంగళవారం, మధ్యాహ్నం 2.50 గంటలు.
కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్‌గావ్‌లోని బైసరన్ లోయలో మృత్యుఘోషలు వినిపించాయి. క్షుద్ర ఆలోచనల మనుషులు అక్కడ మారణకాండ రచించారు. ఐదు మంది ఉగ్రవాదులు అధునాతన తుపాకులతో పురుషులను ఎంచి, వారి మతాన్ని అడిగి హతమార్చారు. ఆ క్షణాన అక్కడ ఉన్నవారు జీవితాంతం ఆ ఘటనకు ఉలిక్కిపడుతూనే ఉంటారు. దేశం యావత్తూ ఆ ఘటనను పీడకలగా భావిస్తూనే ఉంటుంది.
అయితే ఇంత పెనువిషాదంలో కొన్ని నిట్టూర్పులు ఉన్నాయి. కొందరుప్రాణాలు దక్కించుకోగలిగారు. కొందరిని అదృష్టం బయటపడేసింది. కొందరు ఊహించని శక్తుల ఆశీస్సులతో తప్పించుకోగలిగారు. ఒకే స్థలంలో ఉన్న కొందరికి మరణం లభిస్తే కొందరికిప్రాణం దక్కడం చూస్తే ‘విధి’ అనే మాటో ఏ దైవకృపో అనుకోకతప్పదు.
కేన్సిలేషన్‌తో బతికారు
నాగపూర్‌కు చెందిన నర్సింగ్ ఆఫీసర్ స్వాతి కోల్కర్‌కు ఇంకా వణుకు తగ్గలేదు. ఆమె తన ఆరుమంది కుటుంబ సభ్యులతో బతికిపోయింది. విహారానికి శ్రీనగర్ చేరుకున్న ఆమె కుటుంబం సోమవారం గుల్‌మార్గ్ మంగళవారం పహల్‌గావ్‌కు వెళ్లాలి. అయితే గుల్‌మార్గ్ ట్రిప్ సోమవారం కేన్సిల్ అవడంతో ఆ రోజున పహల్‌గావ్ వెళ్లి చూసి వచ్చారు. అందువల్ల ఘటన జరిగిన రోజు వాళ్లు ఆ చోటులో లేరు. ‘మేం గుల్‌మార్గ్‌లో ఉన్నాం. కాని పహల్‌గావ్‌లో ఉంటే మా గతేం కాను అనే ఆలోచనకే భయం వేసేస్తోంది. ఏ శక్తి మా ట్రిప్‌ను తారుమారు చేసిందో ఊహించలేకపోతున్నాను’ అని ఆకాశం వైపు చూసి దండాలు పెట్టుకుంటోందామె.
చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
ఎక్కని గుర్రం... దక్కినప్రాణం
గోవా ఎండలకు దడిచి భార్య, కొడుకులతో శ్రీనగర్ వచ్చిన అక్కడ డిప్యూటి కమిషనర్ శివరామ్ వైగాంకర్ తన భార్యకు కృతజ్ఞతల మీద కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. మంగళవారం ఆ కుటుంబం పహల్‌గావ్ చేరుకుంది. అయితే పహల్‌గావ్ నుంచి బైసనర్ వ్యాలీ 7 కిలోమీటర్లు. నడక ద్వారాగాని, గుర్రం మీదగాని వెళ్లాలి. శివరామ్ భార్య శిల్ప ‘నేను గుర్రం ఎక్కలేను. లోయలోకి వద్దు’ అంది. వాళ్లు పహల్‌గావ్ రెస్టరెంట్‌లో కూచుని గుర్రం ఎక్కాలా వద్దా అనే చర్చలోనే గంట సేపు గడిపేశారు. అప్పుడే కలకలం రేగింది. లోయలో ఉగ్రవాద దాడి జరిగిందనే వార్త తెలియగానే చస్తూ బతుకుతూ వాళ్లు అక్కడి నుంచి బయల్దేరి వచ్చేశారు. ‘నా భార్య గుర్రం ఎక్కి మేం అక్కడికి చేరుకుని ఉంటే ఇవాళ మా కుటుంబమే లేదు’ అన్నారు శివరామ్.
ఉప్పు దక్కించిన ప్రాణాలు
కేరళ నుంచి మొత్తం 11 మందితో వచ్చిన అల్బీ జార్జ్‌ను అతని మొత్తం కుటుంబాన్ని ఉప్పు కాపాడింది. శని, ఆది, సోమ వారాలు కశ్మీర్‌లో తెగ తిరిగిన వీరి కుటుంబం మంగళవారం ఉదయం శ్రీనగర్ నుంచి పహల్‌గావ్ బయల్దేరింది. అయితే రోజూ మధ్యాహ్నం ఏమీ తినడం లేదు... ఇవాళ మంచి భోజనం చేద్దాం అని అల్బీ జార్జ్ నిర్ణయించడంతో పహల్‌గావ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని ధాబా దగ్గర వారి కారు ఆగింది. అయితే రెస్టరెంట్‌లోని ఫ్రైడ్ రైస్‌లో విపరీతంగా ఉప్పు ఉంది. ‘ఇదెలా తినాలి’ అని జార్జ్ దబాయిస్తే రెస్టరెంట్ యజమాని ‘ఫ్రెష్‌గా చేయిస్తాను’ అని కూచోబెట్టాడు. ఆ వంట లేటయ్యి మూడు వరకూ అక్కడే ఉండిపోయారు. అప్పుడే అన్నివైపుల నుంచి గందరగోళం చోటు చేసుకుంది. వాళ్లుప్రాణాలు దక్కించుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేశారు. ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదంటారుగాని ఇక్కడ అదిప్రాణదాత అయ్యింది.
చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్
గుర్రం వెనుక దాక్కుని...
జైపూర్‌కు చెందిన దంపతులు కమల్ సోని, మిహిర్ దాడి జరుగుతున్నప్పుడు బైసరన్ లోయలో ఉన్నారు. ఒక్కసారిగా తుపాకీ చప్పుళ్లు వినిపించగానే స్థానికులు గుర్రం వెనుక దాక్కోండి అన్నారు. ‘మేం ఒక గుర్రం వెనుక దాక్కున్నాం. మా కళ్లెదుటే వాళ్లు కాల్చి చంపుతున్నారు. మేం కదల్లేదు. వారికి కనిపించలేదు. అలా మాప్రాణాలు దక్కాయి. అది మైదానం కావడంవల్ల చాలామందికి అడ్డు దొరక్కప్రాణాలు పోయాయి. కొందరు పొదల్లో దాక్కుని బతికారు’ అని తెలిపారు వాళ్లు.భారతీయులకు వేదాంతం ఎక్కువ. ‘రాసి పెట్టి ఉంది’ అంటారు. ఎవరికి ఏది రాసి ఉందో. కాని మన దేశంపై ఉగ్రవాదాన్ని రాయాలని వచ్చినవారికి మళ్లీ ఇటు చూడాలంటే వణుకు వచ్చే రాత రాయగల శక్తి మనకు ఉంది. ఆ రాతను మనం త్వరలో చదువుతాం.
చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి