
తిరువనంతపురం: కేరళ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఓడరేవును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘‘ఇవాళ శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారు. ఈ వేదికపై ఆయన ఉండటం కొందరికి నచ్చదు. కొందరికి ఇది నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుకుంటుంది’’ అంటూ మోదీ చురకలు అంటించారు. కేరళ సీఎం విజయన్ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా.. గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని.. శశి థరూర్ స్వయంగా వెళ్లి స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘‘ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా.. నా నియోజకవర్గానికి వచ్చిన మోదీని సాదరంగా స్వాగతించా’’ అంటూ శశి థరూర్ ట్వీట్ కూడా చేశారు.
శశిథరూర్ గత కొన్ని నెలలుగా తన సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్న తెలిసిందే. ఇటీవల ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ కూడా ఆయన ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇవాళ ఆయన ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, భారత సముద్ర వాణిజ్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు.. సముద్ర రవాణాకు కీలకమైన కేంద్రంగా మారనుంది. దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ ఓడరేవు అయిన విజింజం ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాంకేతికంగా అధునాతనమైన ట్రాన్స్‌షిప్‌మెంట్ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది.