
ప్రధాని మోదీ తల్లిని కాంగ్రెస్ నేతలు అవమానించారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం
గౌహతి: చొరబాటుదార్ల కారణంగా అస్సాంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాటు సమస్యను అధ్యయనం చేయడానికి ప్రధాని మోదీ డెమొగ్రఫీ మిషన్‌ను ప్రకటించారని తెలిపారు. చొరబాటుదార్ల నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామంటూ హామీ ఇచ్చామని, అది కచి్చతంగా నిలబెట్టుకుంటామని తేల్చిచెప్పారు. అమిత్ షా శుక్రవారం అస్సాంలో పర్యటించారు.
అస్సాం తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి గోలాప్ బొర్బోరా శత జయంతి వేడుకల్లో ప్రసంగించారు. ఏ ఒక్క చొరబాటుదారుడు మన దేశంలో ఉండడానికి వీల్లేదని స్పష్టంచేశారు. విదేశీయుల అక్రమంగా వచ్చి మన దగ్గర తిష్టవేస్తే సహించాలా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులందరినీ బయటకు పంపించక తప్పదని అన్నారు.
తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)ను చేపట్టిందని, దానిపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు ఓటర్ అధికార్ యాత్ర ముసుగులో చొరబాటుదార్ల బచావో యాత్ర చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఏ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా ఓటర్ల జాబితా గుండెకాయ లాంటిదని స్పష్టం చేశారు. బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఆ పార్టీ నాయకులు ప్రధాని మోదీ తల్లిని అవమానించారని అమిత్ షా దుయ్యబట్టారు. రాహుల్ గాం«దీకి నిజంగా సిగ్గుంటే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పాకిస్తాన్‌కు వెళ్లొచ్చే నేతలు అస్సాంను పాలించాలా?
తరచుగా పాకిస్తాన్‌కు వెళ్లొచ్చే నాయకులు అస్సాంను పరిపాలిస్తామంటే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్‌కి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని పరోక్షంగా మండిపడ్డారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాజధాని గౌహతితో పంచాయతీ ప్రతినిధుల ర్యాలీలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు చొరబాటుదార్లకు, ఆక్రమణదార్లకు మద్దతిస్తున్నారని ఆరోపించారు.
అలాంటి వారిని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చొరబాటుదార్లు అస్సాంలో వేలాది ఎకరాల భూమిని ఆక్రమించారని, వారిని వెళ్లగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తుండగా, కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. 1.29 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం ఆక్రమణదార్ల చెర నుంచి విడిపించిందని గుర్తుచేశారు. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని చెప్పారు.