‘హిట్‌ 3’ మూవీ రివ్యూ | HIT 3: The Third Case Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

HIT 3 Review: ‘హిట్‌ 3: ది థర్డ్‌ కేస్‌’ మూవీ ఎలా ఉందంటే..?

Published Thu, May 1 2025 12:23 PM | Last Updated on Thu, May 1 2025 3:36 PM

HIT 3: The Third Case Movie Review And Rating In Telugu

హాలీవుడ్‌, బాలీవుడ్‌తో పోలిస్తే తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు చాలా తక్కువ. ఎఫ్‌ 2తోనే ఆ సినిమాలు పరిచయం అయ్యాయి. ఆ తర్వాత ‘హిట్‌’ కూడా ఫ్రాంచైజీగా వస్తోంది. నాని(Nani) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ఫ్రాంచైజీ తొలి చిత్రం ‘హిట్‌’లో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించగా.. రెండో కేసుతో అడివి శేష్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మూడో కేసుకి ఏకంగా నానినే రంగంలోకి దిగాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘హిట్‌ 3’పై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ (HIT 3: The Third Case Movie Review )లో చూద్దాం.

కథేంటంటే..
ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్‌ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్‌) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్‌ సర్కార్‌ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్‌ టార్చర్‌ కిల్‌) డార్క్‌ వెబ్‌సైట్‌ గురించి చెబుతాడు. 

అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్‌ వెబ్‌సైట్‌ రన్‌ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్‌ సర్కార్‌ సీటీకే గ్యాంగ్‌ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్‌ సర్కార్‌ జీవితంలోకి మృదుల(శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్‌ సర్కార్‌ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
ఓ హత్య జరగడం.. దానిని ఛేదించేందుకు హోమిసైడ్ ఇంట‌ర్వెన్ష‌న్ టీమ్ (హిట్‌) రంగంలోకి దిగడం.. చిక్కుముడులన్నీ విప్పి చివరకు హంతకులను పట్టుకోవడం.. ‘హిట్‌’, హిట్‌ 2.. ఈ రెండు చిత్రాల నేపథ్యం ఇలాగే ఉంటుంది. అదే ప్రాంఛైజీలో వచ్చిన హిట్‌ 3 మాత్రం ఒక హత్య చుట్టు కాకుండా కొన్ని హత్యలు చుట్టూ తిరుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరో ఈ కేసును ఎలా పరిష్కరించాడన్నదే ఈ సినిమా కథ. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల కథలన్నీ దాదాపు ఇదే లైన్‌లో ఉంటాయి. తెరపై ఎంత ఆసక్తికరంగా, భయంకరంగా చూపించారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం దర్శకుడు శైలేష్‌ కొలనుకు బాగా తెలుసు. అందుకే హిట్‌ ఫ్రాంచైజీలలో క్రైమ్‌ సీన్లు అన్ని భయంకరంగా తీర్చిదిద్దాడు. హిట్‌ 3లో అయితే ఆ భయాన్ని మూడింతలు చేశాడు. 

సైకో గ్యాంగ్‌ చేసే అరాచకాలను తెరపై చూస్తున్నప్పుడు రక్తం మరిగిపోతుంది. అసలు వీళ్లు మనుషులేనా అనే అనుమానం కలుగుతుంది.  వాళ్ల ప్రవర్తన, హత్యలు చేసే తీరు చూస్తే.. బయట అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు గుర్తుకొస్తాయి.  చిత్రబృందం ముందు నుంచి చెబుతున్నట్లుగా ఇందులో యాక్షన్‌ సీన్లు లిమిట్‌ దాటి ఉన్నాయి. యానిమల్‌, మార్కో, కిల్‌  సినిమాల ప్రభావం దర్శకుడిపై బాగానే పడిందన్న విషయం ఆ యాక్షన్‌ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది. 

(చదవండి: హిట్‌-4లో హీరో ఫైనల్‌.. ఏసీపీ వీర‌ప్ప‌న్‌గా ఎంట్రీ)

కథ ప్రారంభమే భయంకరమైన సీన్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోయిన్‌ ఎంట్రీతో యాక్షన్‌ థ్రిల్లర్‌.. కాస్త లవ్‌ ఎంటర్‌టైనర్‌లోకి వెళ్తుంది. పెళ్లి కోసం మాట్రిమొనీలో అమ్మాయిలను చూడడం.. అర్జున్‌ వేసే ప్రశ్నలకు ఆ అమ్మాయిలు పారిపోవడం అంతా హిలేరియస్‌గా సాగుతుంది. సీటీకే డార్క్‌ వెబ్‌సైట్‌ గురించి తెలిసిన తర్వాత కథనం ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకుంటుంది.  ఫస్టాఫ్ అంతా సైకో గ్యాంగ్‌ చేసే హత్యలు.. ఇన్వెస్టిగేషన్‌తో ముందుకు వెళ్లిపోతుంది. జమ్ములో జరిగిన హత్య వెనుక సీటీకే గ్యాంగ్‌ ఉందన్న విషయాన్ని అర్జున్‌ కనుక్కునే ఎపిసోడ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం మొత్తం సీటీకే గ్యాంగ్‌తో అర్జున్‌ సర్కార్‌ చేసే యుద్ధమే ఉంటుంది. 

ద్వితీయార్థంలో అక్కడక్కడా ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు ఉంటాయి. చిన్నపిల్ల ఎపిసోడ్‌ని చాలా ఎమోషనల్‌గా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో నాని యాక్షన్ సీక్వెన్సులు చూస్తే భయమేస్తుంది.  అయితే ఈ తరహా పోరాట ఘట్టాలను చాలా హాలీవుడ్‌ చిత్రాల్లో చూసే ఉంటాం. అలాగే ఈ మధ్య వచ్చిన కొన్ని వెబ్‌ సిరీస్‌లలో కూడా ఇలాంటి సీన్లు ఉన్నాయి. సైకో గ్యాంగ్‌ అంతు చూసేందుకు హీరో కూడా సైకోగా మారడం ఇబ్బందికరంగా అనిపించినా.. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే.. ఇందులో హీరో చేసే పనికి ఓ బలమైన కారణం  ఉండడంతో ఆ ప్లేస్‌లో ఏ వ్యక్తి ఉన్నా అలాంటి పనే చేస్తాడనే భావన ఆడియన్స్‌లో కలుగుతుంది. పైగా హీరో చేసే అరాచక పనులకు చాగంటి ప్రవచనాలను ముడిపెట్టి దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు. చివరగా చెప్పేది ఏంటంటే.. చిన్న పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను చూపించొద్దు. క్రైం యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇష్టపడే వాళ్లకు హిట్‌ 3 తెగ నచ్చేస్తుంది. మిగతా వారికి మాత్రం ఇంత హింసాత్మక చిత్రాలు అవసరమా అనిపిస్తుంది. 

ఎవరెలా చేశారంటే.. 
నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. అర్జున్‌ సర్కార్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. నిజమైన పోలీసు ఆఫీసర్‌లాగే తెరపై కనిపించాడు. యాక్షన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. శ్రీనిధి శెట్టి అద్భుతంగా పెర్ఫామ్‌ చేసింది.  ప్రతీక్‌  బబ్బర్‌ విలనిజం అంతగా పండించలేకపోయినా..ఉన్నంతలో బాగానే నటించాడు. అర్జున్‌ సర్కార్‌ టీమ్‌ సభ్యురాలు వర్షగా కోమలి ప్రసాద్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రఖనితో పాటు  మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్‌ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సాను జాన్ వర్గీస్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement