
ప్రతీకారం దిశగా ఒక్కో అడుగే పడుతోంది. పహల్గాం సమీపంలో వారం రోజుల క్రితం 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల వేటకు రంగం సిద్ధమవుతోంది. దాడి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరగాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను త్రివిధ దళాధిపతులకు ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం తీసుకున్న నిర్ణయం అసాధారణమైనది. దాంతోపాటు జాతీయ భద్రతా సలహా బోర్డు(ఎన్‌ఎస్‌ఏబీ)ను బుధవారం పునర్వ్యవస్థీకరించటం కూడా కీలక పరిణామం.
‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషి సారథ్యంలో ఏర్పాటైన ఈ బోర్డు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌కు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తుందంటు న్నారు. పదునైన వ్యూహం, పక్కా ప్రణాళిక, మెరికల్లాంటి దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించటం వగైరాలన్నీ ఇలాంటి సమయాల్లో అత్యంత అవసరం. ఇప్పటికే పహల్గాం మారణకాండను తక్కువ చేసి చూపటానికి పాకిస్తాన్ చేయాల్సిందంతా చేస్తోంది. దాదాపు 45 యేళ్లుగా దాని వ్యూహం ఇదే.
ఒకపక్క ఎల్‌ఓసీలో వరసగా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ, సరిహద్దుల్లో నిఘా రాడార్లు, యుద్ధ సామగ్రి తరలిస్తూ మరోపక్క అమెరికా తదితర దేశాలముందు తన అమాయ కత్వాన్ని చాటుకోవటానికి ప్రయత్నిస్తోంది. మారణకాండ గురించి ‘నమ్మదగ్గ సమాచారం’ ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పటం ఇప్పటి షెహబాజ్ సర్కార్‌కి మాత్రమే కాదు... కుట్రపూరితంగానో, ఎన్నికల మాటున సైన్యం ప్రాపకంతోనో అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న పాక్ అధినేతలందరికీ అలవాటైన విద్య. దీనికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడటం తప్పనిసరి. అందుకే ప్రభుత్వ తాజా నిర్ణయం అన్నివిధాలా ఆహ్వానించదగ్గది.
మన సహనాన్ని చేతగానితనంగా, మన సుహృద్భావాన్ని అశక్తతగా భావించటం పాకిస్తాన్‌కు అలవాటైంది. మొన్న జరిగిన మారణకాండ అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతీకారేచ్ఛతో రగులుతున్నారు. కేవలం దాన్ని సంతృప్తిపరచటమే అంతిమ లక్ష్యం కారాదు. తాజా దాడిలో పాకి స్తాన్ సైన్యంలో పారా కమాండోగా పనిచేసిన హషీం మూసా అనే ఉగ్రవాది పాల్గొనటాన్నిబట్టి చూస్తే ఐఎస్‌ఐ పాత్రవుందని అర్థమవుతోంది. ఇలాంటివి నివారించాలంటే సరిహద్దుల్లో పటిష్టమైన నిఘావుండాలి. దాంతోపాటు వేర్వేరు సమయాల్లో జరిగిన దాడుల స్వభావాన్ని అధ్యయనం చేయాలి.
నిరుడు అక్టోబర్‌లో మధ్య కశ్మీర్‌లో ఏడుగురు కార్మికులను పొట్టనబెట్టుకున్నది మొదలు మొన్నటి పహల్గాం మారణకాండ వరకూ జరిగిన నాలుగు ఉదంతాల్లో కీలకపాత్ర పోషించింది మూసాయే అంటున్నారు. అదే నిజమైతే మన నిఘా వ్యవస్థ సక్రమంగా లేదని భావించాలి. మొన్న విపక్షాలతో జరిగిన సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం ఉన్నదని అంగీకరించింది. కనుక పాకిస్తాన్ ప్రాపకంతో చెలరేగుతున్న ఉగ్రవాదులను గురిచూసి కొట్టటానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టే మన నిఘా వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయాలి.
జవాబుదారీ తనాన్ని నిర్ధారించాలి. ఉగ్రవాదులు మన లోటుపాట్లేమున్నాయో చూసుకునే దాడులకు దిగుతారు. ఆ పని మన నిఘా వర్గాలు చేయగలిగితే ఉగ్రవాదుల్ని నిరోధించటంతోపాటు వారిని చాకచక్యంగా పట్టి బంధించటానికి కూడా వీలవుతుంది. అప్రమత్తత లోపించటంవల్ల నిరాయుధ పౌరుల ప్రాణాలు మాత్రమేకాదు... స్థానికుల జీవిక కూడా దెబ్బతింటుంది. తాజాగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కశ్మీర్‌లోని 50కి పైగా పర్యాటక స్థలాలను మూసివేసినట్టు అధికారులు ప్రకటిస్తున్నారు. అంటే కొన్ని వేల కుటుంబాల ఉపాధి దెబ్బతింటుంది. మున్ముందు తెరిచినా అటువైపు వెళ్లేందుకు పర్యాటకులు జంకుతారు గనుక ఆ రంగం కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది.
అన్నిటికన్నా మన నేతలు మాటలూ, చేతలూ అదుపులో పెట్టుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం. రెండు పక్షాలు పరస్పరం తలపడుతున్నప్పుడు ఎవరి బలం ఎక్కువన్న దాన్నిబట్టి ఫలితం ఆధారపడి వుండదు. ఎవరు కలిసికట్టుగా ఉన్నారో, ఎవరు మెరుగైన వ్యూహం పన్ను తున్నారో, ఎవరి ఎత్తుగడలు సరైనవో వారినే విజయం వరిస్తుంది. జరిగిన భద్రతాలోపాలకు బాధ్యులెవరో నిర్ణయించాలని అనటం, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరటం వరకూ ఎవరికీ అభ్యంతరం ఉండదు. నిర్మాణాత్మకమైన విమర్శలూ ఆహ్వానించదగ్గవే.
కానీ ప్రధాని చిత్రాన్ని ఒక పార్టీ తప్పుడుగా చిత్రిస్తే, మరొకరు దానికి జవాబుగా విపక్షనేత వెన్నుపోటుకు సిద్ధంగా వున్నట్టు మరో చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నేతల్ని పాకిస్తాన్ పొమ్మంటూ ఉచిత సలహా ఇచ్చారు. 26 మంది అమాయకుల ఉసురు తీసిన ఉగ్రవాదులను ఏరిపారేయటానికి ఏం చేయాలన్న అంశంలో మన భద్రతా వ్యవస్థ తలమునకలై వుంది. ఈ పరిస్థితుల్లో ఐక్యతను చాటి ఆదర్శంగా వుండాల్సిన నాయకులు దిగజారుడు పోస్టులతో అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు.
ఇదంతా దేశభక్తి అనే భ్రమలో వీరు కాలక్షేపం చేస్తున్నారు. వీరిని చూసి అనుచరగణాలు మరింత రెచ్చిపోతున్నాయి. మతం పేరిట, ప్రాంతం పేరిట విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఫలితంగా వేర్వేరు ప్రాంతాల్లోని కశ్మీరీ చిరువ్యాపారుల పైనా, విద్యార్థుల పైనా దాడులు జరుగుతున్నాయి. ఇదంతా మనపై మనమే యుద్ధం చేసుకోవటం. శత్రువుపై సమష్టిగా పోరాడాల్సిన సమయంలో బాధ్యత మరిచి అంతర్గత కలహాలకు దారితీసేలా ప్రవర్తించటం, పైస్థాయి నేతల ప్రాపకానికి వెంపర్లాడటం అత్యంత హీనం. పాపం. సక్రమంగా మాట్లాడటంరాని నేతలు కొన్నాళ్లయినా నోరుమూసుకోవటం ఉత్తమం.