Sakshi Editorial
-
ఇదేనా అంబేడ్కర్ వారసత్వం!
అనుకున్నట్టే పార్లమెంటు శీతాకాల సమావేశాలు పరస్పర వాగ్యుద్ధాలతో మొదలై ఘర్షణలతో ముగిశాయి. పార్లమెంటు ముఖద్వారం వద్ద అధికార, విపక్ష సభ్యులు ఒకరినొకరు తోసుకోవటం, ఒకరిద్దరు గాయడటం, పోలీసు కేసుల వరకూ పోవటం వంటి పరిణామాలు అందరికీ దిగ్భ్రాంతి కలిగించాయి. తమ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారని బీజేపీ అంటున్నది. కాదు... వారే తమను పార్లమెంటులోకి వెళ్లకుండా అడ్డగించారని, ఆ తోపులాటలో కిందపడ్డారని కాంగ్రెస్ చెబుతున్నది. వారు అడ్డగించటం వల్ల తమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా గాయపడ్డారని, ముగ్గురు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై భౌతికదాడికి పాల్పడ్డారని వివరి స్తున్నది. రెండు వర్గాలూ అటు స్పీకర్‌కూ, ఇటు పోలీసులకూ ఫిర్యాదులు చేసుకున్నాయి. నాగా లాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సభ్యురాలు కోన్యాక్ తనతో రాహుల్ గాంధీ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నదంటున్నారు. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏదో వివాదం రేకెత్తి ఒకరిపైకొకరు లంఘించటం, ఘర్షణపడటం, కుర్చీలు విసురుకోవటం, దుర్భాషలాడుకోవటం రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కానీ ఇదేమిటి... దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే అత్యున్నత చట్టసభ ఇంత చట్టుబండలు కావటం ముందూ మునుపూ విన్నామా? సమావేశాల ప్రారంభంలోనే అదానీ వ్యవహారంపై విపక్షాలు పెద్ద రగడ సృష్టించాయి. ఆయనపై అమెరికాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు చేస్తారని వచ్చిన వార్తలు నిజం కావని ప్రముఖ న్యాయవాదులు చెప్పాక అది సద్దుమణిగింది. వివాదాలు ఉండొచ్చు... విధానాల విషయంలో విభేదాలుండొచ్చు. కానీ చట్టసభ అనేది అధి కార, విపక్షాలు ప్రజలకు గరిష్టంగా మేలు చేయటానికి గల అవకాశాలను అన్వేషించే వేదిక. తమ నిర్ణయాల పర్యవసానం గుర్తెరగకుండా పాలకపక్షం ప్రవర్తిస్తున్నప్పుడు విపక్షాలు నిరసన గళం వినిపిస్తాయి. అందువల్ల పాలకపక్షం తనను తాను సరిదిద్దుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అది లేనప్పుడు కాస్త ఆలస్యం కావొచ్చుగానీ... అధికార పక్షానికి ప్రజలే కళ్లు తెరిపిస్తారు. ఇందిరాగాంధీ ఏలుబడిలో ఎమర్జెన్సీ విధించినప్పుడేమైంది? ఆ తర్వాత వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా రద్దుచేసినప్పుడు భంగపాటు తప్పలేదు. ఏకంగా 400 మంది సభ్యుల బలం ఉన్న రాజీవ్‌గాంధీ ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు కూడా ఆయనకు చేదు అను భవాలే ఎదురయ్యాయి. 2020లో వచ్చిన సాగుచట్టాలు కూడా ఎన్డీయే సర్కారు ఉపసంహరించు కోక తప్పలేదు. ఏ విషయంలోనైనా తక్షణమే అమీతుమీ తేల్చుకోవాలనుకునే మనస్తత్వం వల్ల ఉన్న సమస్య కాస్తా మరింత జటిలమవుతున్నది. ఇటీవలి కాలంలో చట్టసభలు బలప్రదర్శన వేదికలవు తున్నాయి. సమస్య ఎదురైనప్పుడు దాని ఆధారంగా అవతలి పక్షం అంతరంగాన్ని బయటపెట్టి ప్రజలు గ్రహించేలా చేయటం అనే మార్గాన్ని వదిలి బాహాబాహీ తలపడటం అనేది దుష్ట సంప్రదాయం. అందువల్ల చట్టసభ అంటే సాధారణ పౌరుల్లో చులకన భావం ఏర్పడటం తప్ప సాధించే దేమీ ఉండదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఎవరు అవమానించారు... ఎవరు నెత్తిన పెట్టుకున్నారన్న విషయమై ఏర్పడిన వివాదం కాస్తా ముదిరి పరస్పరం క్రిమినల్ కేసులు పెట్టుకోవటం వరకూ పోవటం విచారకరం. బీజేపీ ఎంపీలు అప్పటికే బైఠాయించిన ప్రధాన ద్వారంవైపునుంచే పార్లమెంటులోకి ప్రవేశించాలని కాంగ్రెస్ అనుకోవటం వల్ల బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి వేరే ద్వారంనుంచి వెళ్లమని భద్రతా సిబ్బంది చేసిన సూచనను రాహుల్ గాంధీ బేఖాతరు చేశారని, పైగా ఇతర సభ్యులను రెచ్చగొట్టారని బీజేపీ ఫిర్యాదు సారాంశం. దేశంలో ఏదో ఒకమూల నిత్యమూ సాగిపోతున్న విషాద ఉదంతాలు గమనిస్తే డాక్టర్ అంబే డ్కర్ నిజమైన వారసులెవరన్న అంశంలో భౌతికంగా తలపడిన రెండు పక్షాలూ సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకపక్క పార్లమెంటులో ఈ తమాషా నడుస్తుండగానే తన పెళ్లికి ముచ్చటపడి గుర్రంపై ఊరేగుతున్న ఒక దళిత యువకుడిపై ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆధిపత్య కులాలవారు దాడిచేసి కొట్టారన్న వార్త వెలువడింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా కులోన్మాదులు చేసిన చర్య కాదు. దశాబ్దాలుగా ఇలాంటి ఘోరాలు సాగుతూనే ఉన్నాయి. తాము ఉపయోగించే బావిలో లేదా చెరువులో దప్పిక తీర్చుకున్నారన్న ఆగ్రహంతో దళితులపై దాడులు చేసే సంస్కృతి ఇంకా పోలేదు. చాలాచోట్ల రెండు గ్లాసుల విధానం ఇంకా సజీవంగా ఉంది. మన రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చర్చిస్తుండగానే... డాక్టర్ అంబేడ్కర్ వారసత్వం గురించి పార్టీలు పోటీపడుతుండగానే వాస్తవ స్థితిగతులు ఇలా ఉన్నాయి.సైద్ధాంతిక విభేదాలను ఆ స్థాయిలో మాట్లాడుకుంటే, ఆరోగ్యకరమైన చర్చల ద్వారా అన్ని విషయాలనూ ప్రజలకు తేటతెల్లం చేస్తే మెరుగైన ఫలితం వస్తుంది. నిజానిజాలేమిటో అందరూ గ్రహిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ తన జీవితకాలమంతా రాజీలేని పోరాటం చేశారు. మెజారిటీ ప్రజానీకం ప్రయోజనాలను దెబ్బతీసే భావాలనూ, చర్యలనూ అడుగడుగునా తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు నిర్వహించారు. అంతేతప్ప అవతలిపక్షంపై హింసకు దిగలేదు. ఆయన వారసత్వం తమదేనంటున్నవారు వాస్తవానికి తమ చర్యల ద్వారా ఆ మహనీయుడి స్మృతికీ, ముఖ్యంగా ఆయన నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగానికీ అపచారం చేస్తున్నామని గుర్తిస్తే మంచిది. -
కుదుపు రేపే నిర్ణయం
భారత క్రికెట్ రంగంలో బుధవారం ఉరుము లేని పిడుగు పడింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు అయిదు టెస్ట్‌లు ఆడుతుండగా సిరీస్ మధ్యలోనే అగ్రశ్రేణి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించడం అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని మూడో టెస్ట్‌తో పాటు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ సైతం ముగిసింది. సంచలనం రేపిన ఈ వార్త పలు అనుమానాలు, ఊహాగానాలకు కూడా తెర తీసింది. తాజాగా పెర్త్, బ్రిస్బేన్ మ్యాచ్‌లలో తుది జట్టులో స్థానం దక్కకపోవడంతో అశ్విన్ స్వచ్ఛందంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ‘సిరీస్‌లో ఇప్పుడు నా అవసరం లేనట్టయితే, ఆటకు గుడ్‌బై చెప్పేస్తాను’ అంటూ రిటైర్మెంట్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆయన తేల్చిచెప్పేశారు. ‘ఆడే సత్తా నాలో ఇంకా మిగిలే ఉంది. బహుశా, (ఐపీఎల్ లాంటి) క్లబ్–స్థాయి క్రికెట్లో దాన్ని చూపుతాను. భారత జట్టు తరఫున ఆడడం మాత్రం ఇదే ఆఖరి రోజు’ అన్న అశ్విన్ ప్రకటన క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని విషయమే. మొత్తం 106 టెస్టుల్లో 537 వికెట్లు సాధించిన అశ్విన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్. 132 మ్యాచ్‌లలో 619 వికెట్లు సాధించిన నిన్నటి తరం అగ్రశ్రేణి స్పిన్నర్ అనిల్ కుంబ్లే తరువాత అలా ద్వితీయ స్థానంలో నిలిచారు అశ్విన్. బంతితోనే కాదు... బ్యాట్‌తోనూ అరడజను శతకాలు, 14 అర్ధ శతకాలతో 3,503 పరుగులు సాధించిన ఘనత ఆయనది. ఇంకా చెప్పాలంటే, గత 14 ఏళ్ళ పైచిలుకు కాలంలో స్వదేశంలో భారత జట్టు తిరుగులేని శక్తిగా ఎదగడం వెనుక ఈ తమిళ తంబి కీలక పాత్రధారి. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆయన ఏకంగా 11వ సారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికై, ప్రపంచ రికార్డును సమం చేశారు. బరిలో ఓర్పు, బంతి విసరడంలో నేర్పు, ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో నైపుణ్యం ఉన్న తెలివైన ఆటగాడాయన.అందుకే, ఆటలో ఈ అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ చూపే ప్రతిభకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుత భారత జట్టు బౌలర్లలో ప్రత్యేకంగా నిలిచారు. ఏ క్రికెటరైనా విదేశాల్లో కాకుండా సొంతగడ్డపై ఆటకు స్వస్తి పలకాలనుకుంటారు. అది సర్వసాధారణం. ఎందుకంటే, స్వదేశంలో సొంత క్రీడాభిమానుల జయజయ ధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలకవచ్చని భావిస్తారు. కానీ, అశ్విన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దానికి కారణాలు లేకపోలేదు. ఆడే సత్తా ఉన్న ఏ క్రీడాకారుడైనా బరిలో ఉండాలనుకుంటాడే తప్ప, అవకాశం కోసం నిరీక్షిస్తూ బెంచ్ మీద కూర్చొనే జాబితాలో చేరాలనుకోడు. అది ఎవరికైనా బాధాకరమే. అలాంటిది... టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆరు టెస్ట్ సెంచరీలు, 500కు పైగా వికెట్లు తీసుకొన్న ఏకైక క్రికెటర్‌కు తరచూ అలాంటి అనుభవం ఎదురైతే? అది మరింత బాధ కలిగిస్తుంది. 38 ఏళ్ళ వయస్సులో, కెరీర్లో కాలం కరిగిపోతున్న వేళ... అశ్విన్‌కు అది అవమానమూ అనిపించింది. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్‌లో మధ్యలో ఆయన హఠాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించారనుకోవాలి. సరిగ్గా పదేళ్ళ క్రితం 2014 డిసెంబర్లో మరో అగ్రశ్రేణి భారత క్రికెటర్ ధోనీ సైతం ఇలాగే ఆటకు అల్విదా చెప్పారు. ఈ వాస్తవ పరిణామాలన్నీ గమనిస్తూ, క్షేత్రస్థాయి అంశాలను గమనంలోకి తీసుకున్న వారికి మాత్రం అశ్విన్ నిర్ణయం మరీ దిగ్భ్రాంతికరంగా తోచదు. అదే సమయంలో జీవితంలో, ఆటలో అత్యంత కఠినమైన ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా విమర్శల జోలికి పోకుండా, పక్కా జెంటిల్మన్గానే వ్యవహరిస్తూ అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం చెప్పుకోదగ్గ విషయం. ఆస్ట్రేలియా సిరీస్‌లోని తొలి మూడు టెస్టుల్లో అడిలైడ్‌లోని రెండో టెస్ట్‌లో మాత్రమే అశ్విన్‌కు జట్టులో స్థానం దక్కింది. ప్రతిభావంతుడైన పాతికేళ్ళ వాషింగ్టన్ సుందర్ అంతకంతకూ ముందు కొస్తూ, అశ్విన్‌ను పక్కకు జరిపి జట్టులో చోటు సంపాదించుకుంటూ పోతున్నారు. ఫలితంగా అశ్విన్ హుందాగానే పక్కకు తప్పుకున్నారు. వికెట్లు పడగొట్టడంలో పేరున్న ఈ స్పిన్నర్ నిర్ణయం ‘వ్యక్తిగతం’ అని రోహిత్ శర్మ చెప్పారు కానీ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం విలేఖరుల ప్రశ్నలు వద్దని అశ్విన్ సున్నితంగానే తప్పుకోవడంతో కంటికి కనిపించని కథలున్నాయనే వాదనకు బలం చేకూరింది. అయితే, అశ్విన్ ఆది నుంచి జట్టు సమష్టి ప్రయోజనాలకై ఆడినవారే. అనేక సందర్భాల్లో సెలెక్టర్ల బంతాటలో వైట్ బాల్ గేమ్స్‌లో స్థానం దక్కించుకోకున్నా, పట్టుదలతో ఆడుతూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ కనీసం మరో రెండేళ్ళ పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆడగల సత్తా ఆయనకుంది. అయినా పక్కకు తప్పుకున్నారు. గతంలో ధోనీ ఆస్ట్రేలియాతోనే మెల్ బోర్న్ టెస్ట్‌లో హుందాగా టెస్ట్ క్రికెట్ నుంచి పక్కకు తప్పుకొని, యువకులకు దోవ ఇచ్చారు. కార ణాలేమైనా, అశ్విన్ ప్రస్తుతానికి పెదవి విప్పి పెద్దగా చెప్పకుండానే పదవీ విరమణ ప్రకటించారు. పేరు ప్రతిష్ఠలు, డబ్బు అన్నీ కెరీర్లో భాగమైన ఆటగాళ్ళు వాటన్నిటినీ వదులుకొని, రిటైరవుతున్నట్టు చెప్పడం నిజానికి ఎప్పుడూ కష్టమే. అశ్విన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కాకుంటే, పైకి గంభీరంగా కనిపిస్తూ భావోద్వేగాల్ని ప్రదర్శించకపోవడం విశేషం. అశ్విన్ వ్యక్తిగతం మాటెలా ఉన్నా, ఆయన నిష్క్రమణతో భారత క్రికెట్ ఇప్పుడో చిత్రమైన సంధి దశలో నిలిచింది. బహుశా, ఈ ప్రతిభావంతుడి తాజా నిర్ణయంతో ఒకప్పటి ఫామ్ కోల్పోయి, తడబడుతున్న రోహిత్ శర్మ, కోహ్లీలు సైతం ఆత్మపరిశీలనలో పడాల్సి రావచ్చు. ఎంతైనా ఆర్ట్ ఆఫ్ ‘లీవింగ్’ కూడా ఆర్ట్ ఆఫ్ ‘లివింగ్’లో భాగమే కదా! వెరసి, అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం అన్వేషణతో పాటు ఆయన నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులపై చర్చ చాలాకాలం కొనసాగడం ఖాయం. -
చర్చ జరగాలి కానీ, ఇలాగా..?
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈ సోమవారంతో ఆఖరి వారం వ్యవధిలోకి ప్రవేశించాయి. దేశంలో చలి పెరుగుతుంటే, సభలో వాతావరణం మాత్రం వేగంగా వేడెక్కుతోంది. మొన్న నవంబర్ 26న 75 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం చూస్తే ఆ భావనే కలుగుతుంది. లోక్‌సభలో గత శుక్ర, శనివారాలు రాజ్యాంగ చర్చ జరిగితే, ఈ సోమ, మంగళవారాలు రాజ్యసభలో అది కొనసాగుతోంది. ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ బిల్లుకు కావాల్సిన రాజ్యాంగ సవరణ మాట అటుంచితే, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కాక గాంధీల కుటుంబ శ్రేయానికై కాంగ్రెస్ నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని సవరిస్తూ పోయిందని ఆర్థిక మంత్రి ఆరోపించడం తాజాగా అగ్గి రాజేసింది. అనేక జటిల సమస్యలకు రాజ్యాంగ సవరణలే ఏకైక పరిష్కారం అంటూ నెహ్రూకు సాక్షాత్తూ సర్దార్ పటేలే లేఖ రాశారంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టాల్సి వచ్చింది. వెరసి, భారత గణతంత్రానికి ఆత్మ లాంటి రాజ్యాంగంపై చర్చ పక్కదోవ పట్టి, పార్టీలు బురదజల్లుకొనే ప్రక్రియగా మారిపోయింది. నిజానికి, స్వాతంత్య్రానంతరం భారతదేశ భవితవ్యమెలా ఉంటుందన్న దానిపై బోలెడన్ని అనుమానాలు, జోస్యాలు వెలువడినా, మన రాజ్యాంగం పటాపంచలు చేసింది. నిజానికి, నవ యువ గణతంత్ర రాజ్యంగా మనం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ తట్టుకొని నిలవడంలోనూ విజయవంతమయ్యాం. భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచి, దేశానికి మూలస్తంభంగా నిలిచింది. ఇవాళ అనేక దేశాల్లో, చివరకు సోకాల్డ్ ప్రజాస్వామ్యాల్లోనూ అధికార బదలాయింపులో పలు సమస్యలను ఎదుర్కొంటున్నా, భారత్‌లో మాత్రం ప్రజాభీష్టాన్ని ప్రతిఫలించే అధికార బదలీ శాంతియుతంగా సాగిపోవడం మన రాజ్యాంగం వేసిన పటిష్ఠమైన పునాదికీ, చూపిన ఆచరణాత్మకమైన మార్గానికీ తార్కాణం. ఈ ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో వేర్వేరు రాజకీయ పార్టీలు, కూటములు దేశాన్ని పాలించాయి. 1975లో ఎమర్జెన్సీ విధింపు లాంటి అశనిపాతాలు అడపాదడపా ఎదురైనా, ప్రభుత్వాలన్నీ దేశాన్ని ముందుకే నడిపాయి. క్రియాశీలక సజీవపత్రంగా రాజ్యాంగ రూపకర్తలు సంభావించిన భారత రాజ్యాంగం అంతర్గత సంకల్పబలం, స్థితిస్థాపక చైతన్యంతో నవ భారత అవసరాలకు తగ్గట్టుగా మార్పులతో నిత్య నూతనంగా నిలుస్తూ వచ్చింది. దానికి తగ్గట్టే రాజ్యాంగాన్ని ఇప్పటికి శతాధిక పర్యాయాలు సవరించడం జరిగింది. దేశ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకు తగ్గట్టు దేశం ముందుకు పోయేందుకు అనేక ఏళ్ళుగా భారత రాజ్యాంగం వీలు కల్పిస్తూనే వచ్చింది. అనేక పార్ష్వాలున్న ఈ రాజ్యాంగ ప్రస్థానాన్ని పార్లమెంట్లో చర్చిస్తున్నారంటే, భవిష్యత్తుపై దృష్టి సారిస్తారని భావించాం. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, లక్ష్యాలు సాకారమయ్యేందుకు పథ నిర్దేశం జరుగుతుందని ఆశించాం. భారత స్వాతంత్య్ర శతవర్ష సమారోహం సాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై మేధా మథనం జరపాలని ఆకాంక్షించాం. ఆ దిశలో సామాన్యుల జీవితాలు మెరుగయ్యేలా లక్షించాల్సింది పోయి విమర్శల పర్వానికే చర్చ పరిమితమైపోవడం శోచనీయం. నిజానికి, ఎవరూ విమర్శలకు అతీతులు కారు. గాంధీ, నెహ్రూలైనా అంతే. వారిని విమర్శించ దలుచుకుంటే నేరుగా విమర్శించవచ్చు. అంతేకానీ, రాజ్యాంగంపై చర్చ పేరిట పరోక్షంగా కొంద రిపై బురద జల్లడం ఏమిటన్నది ఒక వాదన. తాజా చర్చ సందర్భంలో అధికార ఎన్డీఏ వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను తప్పుబడుతున్నారని కూడా ఆరోపణ. అయితే, అసలు భావప్రకటనా స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు పెట్టవచ్చంటూ తొలి రాజ్యాంగ సవరణ తెచ్చింది కాంగ్రెసే అని బీజేపీ ఎత్తిచూపుతోంది. స్వేచ్ఛ ఉండాలి నిజమే కానీ, అన్ని సమయాల్లోనూ అది నిర్నిబంధమైతే కష్టం గనక సహేతుకమైన పరిమితులు విధించవచ్చని అలా ప్రథమ సవరణతో రాజ్యాంగ రూపకర్తలే దిద్దుబాటు బాట పట్టారన్నది కాంగ్రెస్ వర్గీయుల ప్రతివాదన. రాజ్యాంగ అమలుకు అమృతోత్సవ వేళ చర్చ దాని అమలు తీరుతెన్నులు, భవిష్యత్ సవాళ్ళపైనే సాగాల్సింది. సామూహిక ఆత్మపరిశీలనకు దీన్ని అవకాశంగా మలుచుకోవాల్సింది. కానీ, జరుగుతున్నది వేరు. చర్చంతా రాజకీయ రంగు పులుముకొని, నెహ్రూ కుటుంబం, ఎమర్జెన్సీ, మోదీ సర్కార్ చుట్టూ సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవిశ్వాస తీర్మానంపై చర్చ ఫక్కీలోకి జారిపోయింది.1975 ఎమర్జెన్సీలోనైనా, ఇప్పుడు ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఉందంటున్నా... రెండు సందర్భాల్లో పాలకుల చేతిలో నలిగిపోయింది రాజ్యాంగానికి గుండె లాంటి పౌరుల ప్రాథమిక హక్కులే అని విస్మరించరాదు. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ సవాళ్ళు అధికరిస్తున్నాయి. లౌకికవాదం, సమాఖ్య వాదం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, దుర్విచక్షణ లేకపోవడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ లాంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలపైనే ప్రశ్నార్థకాలు పొడసూపుతున్నాయి. సమాన అవకాశాల మాట దేవుడెరుగు, ఆర్థికంగా– సామాజికంగా– లింగపరంగా సమానత్వం సైతం నేటికీ పూజ్యం. అంత రాలు పెరుగుతున్న సమాజంలో అసమానతల నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామా? అన్ని పక్షాలూ ఆత్మావలోకనం చేసుకోవాలి. రాజకీయ పత్రం, దేశ రాజకీయాలకు పునాది అయినప్పటికీ, రాజ్యాంగమనేది అదే సమయంలో రాజకీయాలకు అతీతమైనది. దానిపై చర్చలో ప్రధాని సహా అందరూ సంకుచిత రాజకీయాలకే చోటిస్తే ఇంకేమనాలి? ఈ ధోరణి మారాలి. రాజ్యాంగం ఇన్నేళ్ళుగా జాతికి దిక్సూచిగా నిలిచింది. ప్రభుతకూ, పౌరులకూ ప్రజాస్వామ్య ఫర్మానాగా వెలిగింది. ఆ ఉజ్జ్వల స్ఫూర్తికి కట్టుబడడమే సమస్త సమస్యలకూ పరిష్కారం. సామాన్యుల హక్కులకు శ్రీరామరక్ష. -
మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ జదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల జదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుకుకు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతకకర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తల మీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతిరోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దారులు మూస్తున్నట్టే!ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్‌ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం– రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి. -
‘వేధింపుల’ చట్టానికి కళ్లెం?
మానసిక ఒత్తిళ్లకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాన్ కెస్లర్ చాన్నాళ్ల క్రితం ఒక అధ్యయనం సందర్భంగా తేల్చారు. మహిళలు ఆ ఒత్తిళ్ల పర్యవసానంగా విషాదంలో మునిగితే మగవాళ్లూ, పిల్లలూ ఆగ్రహావేశాలకు లోనవుతారని చెప్పారు. ఒత్తిళ్లకు స్పందించే విషయంలో పిల్లలూ, మగవాళ్లూ ఒకటేనని ఆమె నిశ్చితాభిప్రాయం. ఈ ధోరణికామె ‘ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. అయితే ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారని చెప్పలేం. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ తన భార్యతో వచ్చిన తగాదాకు సంబంధించిన కేసుల్లో తనకూ, తన తల్లిదండ్రులకూ ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి ముందు విడుదల చేసిన 90 నిమిషాల వీడియో, 24 పేజీల లేఖ ఇప్పుడు న్యాయవ్యవస్థలో సైతం చర్చనీయాంశమయ్యాయి. తనపైనా, తనవాళ్లపైనా పెట్టిన 8 తప్పుడు కేసుల్లో, వాటి వెంబడి మొదలైన వేధింపుల్లో యూపీలోని ఒక ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఉన్నారన్నది ఆ రెండింటి సారాంశం.బలహీనులకు జరిగే అన్యాయాలను నివారించటానికీ, వారిని కాపాడటానికీ కొన్ని ప్రత్యేక చట్టాలూ, చర్యలూ అవసరమవుతాయి. అలాంటి చట్టాలు దుర్వినియోగమైతే అది సమాజ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వంకన అసలైన బాధితులకు సకాలంలో న్యాయం దక్కదు సరికదా... బలవంతులకు ఆయుధంగా మారే ప్రమాదం ఉంటుంది. మహిళలపై గృహ హింస క్రమేపీ పెరుగుతున్న వైనాన్ని గమనించి 1983లో భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 498ఏ చేర్చారు. అనంతర కాలంలో 2005లో గృహహింస చట్టం వచ్చింది. 498ఏ సెక్షన్ గత ఏడాది తీసు కొచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లో సెక్షన్ 84గా ఉంది. అయితే అటుతర్వాత కుటుంబాల్లో మహిళలపై హింస ఆగిందా? లేదనే చెప్పాలి. సమాజంలో కొనసాగే ధోరణులకు స్పందన గానే ఏ చట్టాలైనా వస్తాయి. ఎన్నో ఉదంతాలు చోటుచేసుకున్నాక, మరెన్నో ఉద్యమాలు జరిగాక, నలుమూలల నుంచీ ఒత్తిళ్లు పెరిగాక మాత్రమే ఎంతో ఆలస్యంగా ఇలాంటి చట్టాలు వస్తాయి. బల హీనులకు ఉపయోగపడే అటువంటి చట్టాల్ని దుర్వినియోగం చేసే వారుండటం నిజంగా బాధాకరమే.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం 498ఏ వంటి చట్టాలు ఈమధ్యకాలంలో దుర్వినియోగమవుతున్న ఉదంతాలు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత కక్షతో అత్తింటివారిపైనా, భర్తపైనా తప్పుడు కేసులు పెట్టే తీరువల్ల వివాహ వ్యవస్థ నాశన మవుతున్నదని వ్యాఖ్యానించింది. ఇప్పుడే కాదు... 2014లో కూడా సుప్రీంకోర్టు ఒక సంద ర్భంలో ఇలాంటి వ్యాఖ్యానమే చేసింది. ‘భర్తలపై అలిగే భార్యలకు సెక్షన్ 498ఏ రక్షణ కవచంగా కాక ఆయుధంగా ఉపయోగపడుతోంద’ని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇకపై శిక్షాస్మృతిలోని సెక్షన్ 41కి అనుగుణంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కూడా సూచించింది. నిజమే... ఎలాంటి చట్టాలైనా నిజమైన బాధితులకు ఉపయోగపడినట్టే, అమాయకులను ఇరికించడానికి కూడా దోహదపడుతాయి. చట్టాన్ని వినియోగించేవారిలో, అమలు చేసేవారిలో చిత్తశుద్ధి కొరవడితే జరిగేది ఇదే. ఆ తీర్పు తర్వాత గత పదేళ్లుగా వేధింపుల కేసులు నత్తనడక నడుస్తున్నాయి. అందులో నిజమైన కేసులున్నట్టే అబద్ధపు కేసులు కూడా ఉండొచ్చు. మనది పితృస్వామిక సమాజం కావటంవల్ల పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి కుటుంబ బాధ్యతలు మీద పడేవరకూ ఏ దశలోనూ ఆడవాళ్లపై హింస మటుమాయమైందని చెప్పలేం. వాస్తవానికి ఇందులో చాలా రకాల హింసను మన చట్టాలు అసలు హింసగానే పరిగణించవు. ఆర్థిక స్తోమత, సమాజంలో హోదా వంటివి కూడా మహిళలను ఈ హింస నుంచి కాపాడలేకపోతున్నాయన్నది వాస్తవం. ఒకనాటి ప్రముఖ నటి జీనత్ అమన్, భారత్‌లో మొట్టమొదటి లేడీ ఫిట్నెస్ ట్రైనర్‌గా గుర్తింపు సాధించిన నవాజ్ మోదీలు ఇందుకు ఉదాహరణ. వీరిద్దరూ తమ భర్తల నుంచి తీవ్రమైన గృహహింసను ఎదుర్కొన్నారు. జీనత్‌కు కంటి కండరాలు దెబ్బతిని కనుగుడ్డు బయటకు రాగా, దాన్ని య«థాస్థితిలో ఉంచటానికి గత నలభైయేళ్లలో ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఫలితం రాలేదు. నూతన శస్త్ర చికిత్స విధానాలు అందుబాటులోకొచ్చి నిరుడు ఆమెకు విముక్తి దొరికింది. ఒకప్పుడు కట్టుబాట్లకు జడిసి, నలుగురిలో చులకనవుతామన్న భయంతో ఉండే మహిళలు ఉన్నత చదువుల వల్లా, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం రావటం వల్లా మారారు. వరకట్న వేధింపులు, ఇతర రకాల హింసపై కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అదే సమయంలో కొందరు దుర్వినియోగం చేస్తున్న మాట కూడా వాస్తవం కావొచ్చు. అలాంటివారిని గుర్తించటానికీ, వారి ఆట కట్టించటానికీ దర్యాప్తు చేసే పోలీసు అధికారుల్లో చిత్తశుద్ధి అవసరం. ఈ విషయంలో న్యాయస్థానాల బాధ్యత కూడా ఉంటుంది. లోటుపాట్లు తప్పనిసరిగా సరిచేయాల్సిందే. కానీ ఆ వంకన అలాంటి కేసుల దర్యాప్తులో జాప్యం చోటు చేసు కోకుండా ఇతరేతర మార్గాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఏటా ప్రతి లక్షమంది మహిళల్లో దాదాపు ముగ్గురు వరకట్న హింసకు ప్రాణాలు కోల్పోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. వరకట్న నిషేధ చట్టం వచ్చి 63 ఏళ్లవుతున్నా ఇదే స్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత చట్టాలను నీరగార్చకుండానే ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఆలోచించాలి. -
సరైన దిశలో ఒక ప్రయత్నం
ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. బంగ్లాదేశ్‌లోని పరిస్థితి పట్ల తన మనోభావాలను భారత్ స్పష్టంగా పంచుకోగలిగింది. బంగ్లాదేశ్‌లోని మధ్యంతర సర్కారుకు ప్రధాన సలహాదారైన మహమ్మద్ యూనస్, బంగ్లా విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్ తదితరులతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఢాకాలో సమావేశమవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత్ నుంచి తొలిసారిగా ఓ ఉన్నతాధికారి బంగ్లా వెళ్ళడం, దౌత్య భేటీ జరపడం విశేషమే. ఇటు హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం, అటు బంగ్లాలో అల్పసంఖ్యాక హిందువులపై దాడులతో ద్వైపాక్షిక సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా భేటీలో ఇరుపక్షాలూ నిర్మొహమాటంగా పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం సరైన దిశలో పడిన అడుగు. హసీనా హయాంతో పోలిస్తే, భారత్ పట్ల పెద్ద సానుకూలత లేని సర్కారు బంగ్లాలో ప్రస్తుతం నెలకొన్నందున తాజా దౌత్యయత్నాలు కీలకం. చారిత్రకంగా మిత్రత్వం, పరస్పర ప్రయోజనాలున్న పొరుగు దేశాలు అపోహలు, అనుమానాలు దూరం చేసుకోవడానికి ఇవి ఏ మేరకు ఉపకరిస్తాయో చూడాలి. బయట ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో జరిగిన ఈ చర్చలు మైనారిటీలపైన, హిందూ ఆలయాలపైన దాడులు, రాజద్రోహ నేరంపై హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు సహా అనేక వివాదాస్పద అంశాలపై దృష్టి సారించాయి. రెండు కోట్ల పైగా హిందువులున్న ముస్లిమ్ మెజారిటీ దేశంలో మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తే, ఆ ఘటనలు రాజకీయమైన వంటూ బంగ్లా వాదించింది. ప్రజల భావోద్వేగాలు, రాజకీయ ప్రయోజనాలు కలగలిసినప్పుడు పరస్పర భిన్న వాదనల మధ్య రాజీ కుదర్చడం కష్టమే. కానీ, విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీతో చిరు ప్రయత్నమైనా సాగడం విశేషం. బంగ్లాదేశ్ సైతం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, జరుగుతున్నదే మిటో గ్రహించి, అసలంటూ సమస్య ఉన్నదని గుర్తించడానికి ఈ భేటీ ప్రేరేపిస్తే మంచిదే. 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరులో భారత్ పాత్ర మరపురానిది. అదే సమయంలో స్వాతంత్య్రం ముందు నుంచి చారిత్రకంగా ఉన్న అనుబంధం రీత్యా సాహిత్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ పరంగా ఆధునిక భారతావని రూపుదిద్దుకోవడంలో బంగాళ ప్రాంతపు భాగ స్వామ్యం అవిస్మరణీయమే. బ్రిటీషు కాలం నుంచి భౌగోళిక రాజకీయాలు, సామాజిక సాంస్కృతిక కారణాలతో ముడిపడిన భారత – బంగ్లా బంధం ఇటీవలి ఉద్రిక్తతల నడుమ నలిగిపోతోంది. ఇరుదేశాల మధ్య 4,096 కి.మీల ఉమ్మడి సరిహద్దుంది. ప్రపంచంలోనే సుదీర్ఘమైన అయిదో సరిహద్దు ఇది. పైగా, చాలా ప్రాంతంలో పూర్తిస్థాయిలో సరిహద్దుల గుర్తింపు జరగనేలేదు. సరిహద్దులో నెలకొన్న పశ్చిమ బెంగాల్‌లోని ఒక్క పెట్రాపోల్ వద్దనే రెండు దేశాల మధ్య భూమార్గ వాణిజ్యంలో 30 శాతం జరుగుతుంది. ఏటా సుమారు 23 లక్షల మంది సరిహద్దులు దాటి, భారత్‌కు వైద్య చికిత్సకు వస్తుంటారు. కాబట్టి, ఇటీవలి ఉద్రిక్తతల్ని దాటి వాణిజ్యం, ఇంధనం, సహకారం, సామర్థ్యాల పెంపు దలను బంగ్లా చూడగలగాలి. ఇరుదేశాలూ చేతులు కలిపి అడుగులు వేస్తేనే అభివృద్ధి సాధ్యం. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లి లాంటి నిత్యావసర వస్తువుల విషయంలో ఢిల్లీ పైనే ఢాకా ఆధారపడి ఉంది. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం దేశీయ ఉత్పత్తిని పెంచుకొని, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇక, బంగ్లా రోగులకు శస్త్రచికిత్స చేసేది లేదంటూ కొన్ని భారతీయ ఆస్పత్రులు అమానవీయంగా, మూర్ఖంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. ఈ చర్యల వల్ల బంగ్లా దేశీయులు ఇప్పుడు మలేసియాను ఆశ్రయిస్తున్నట్టు వార్త. ఇలాంటివన్నీ దీర్ఘకాలంలో భారత ప్రయోజనాలకే దెబ్బ. అసలు మిగతా ప్రపంచంతో భారత వాణిజ్యంతో పోలిస్తే, సరుకుల్లో భారత – బంగ్లాల ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా వృద్ధి చెందింది. అనేక అంశాలు ముడిపడి ఉన్నందున తెగేదాకా లాగడం ఇరుపక్షాలకూ మంచిది కాదు. కొత్త వాస్తవాలను గుర్తించక ఒకవేళ మనం ఇదే వైఖరితో ముందుకు సాగితే చివరకు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవులు, మయన్మార్ వరుసలోనే బంగ్లాదేశ్ సైతం ఢిల్లీకి దూరమవుతుంది. పొరుగున మిత్రులెవరూ లేని దుఃస్థితి భారత్‌కు దాపురిస్తుంది. యూనస్ సారథ్యంలోని ప్రస్తుత బంగ్లా సర్కార్ పాక్‌కు చేరువవుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య వీసాల ఎత్తివేత, రక్షణ ఒప్పందాలు, కరాచీ నుంచి పాకిస్తానీ సరుకుల రవాణా నౌకను చిట్టగాంగ్ వద్ద లంగరేసుకునేందుకు అనుమతించడం లాంటివి చూస్తే అదే అనిపిస్తోంది. దాదాపు 47 ఏళ్ళ తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా సముద్ర నౌకాయాన సంబంధాల పునరుద్ధరణకు ఇది ఒక సూచన. వ్యూహాత్మకంగా సుస్థిర దక్షిణాసియాకు కట్టుబడ్డ భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాలి. బంగ్లా అంతర్గత రాజకీయాల్లోకి అతిగా జొరబడి, ప్రస్తుత హయాం నమ్మకాన్ని పోగొట్టు కోరాదు. ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగ కార్యదర్శి ఢాకా పర్యటన ఇరుగుపొరుగు బాంధవ్యం, భాగస్వామ్యాల ప్రాధాన్యాన్ని గుర్తించినట్టే అనిపిస్తోంది. బంగ్లా సైతం ముందుగా తన అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి. ఆ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటే, మైనారిటీలు సురక్షితంగా ఉంటే, పాత బంధం మళ్ళీ మెరుగవుతుంది. వెరసి, భారత్ – బంగ్లాలు ప్రస్తుతం నాలుగురోడ్ల కూడలిలో నిలిచాయి. మనసు విప్పి మాట్లాడుకొని, పరస్పర ప్రయోజనాల్ని కాపాడుకుంటే మేలు. అలాకాక సహకార మార్గం బదులు సంఘర్షణ పథాన్ని ఎంచుకుంటే ఇరువురికీ చిక్కే! -
ముందున్న సవాలు
21వ శతాబ్దంలో అత్యంత దీర్ఘకాలం సాగిన యుద్ధం... లక్షలాది ప్రజల ప్రాణాలు తీసి, మరెందరినో వలస బాట పట్టించి, శరణార్థులుగా మార్చిన యుద్ధం... ఎట్టకేలకు ఒక ముగింపునకు వచ్చింది. సంక్షుభిత సిరియా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అధ్యక్షుడు బషర్ – అల్ – అసద్ పాలనకు ఆదివారం ఆకస్మికంగా తెరపడడంతో సిరియాలో అంతర్యుద్ధం కొత్త మలుపు తిరిగింది. అలెప్పో, హమా, హామ్స్ల తర్వాత డమాస్కస్ సైతం తిరుగుబాటు శక్తుల వశం కావడంతో సిరియా రాజకీయ, సైనిక దృశ్యం సమూలంగా మారిపోనుంది. ఈ పరిణామాల ప్రభావం ఆ ప్రాంతమంతటా కనిపించనుంది. దాదాపు 53 ఏళ్ళ పైచిలుకు నిరంకుశ కుటుంబ పాలన పోయినందుకు సిరియన్లు సంబరాలు చేసుకుంటున్నా, తరువాతి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. తిరుగుబాటు తర్వాత డమాస్కస్‌లో సాగుతున్న విధ్వంసం, లూటీ దృశ్యాలు 2021లో అఫ్ఘానిస్తాన్‌లో జరిగిన సంఘటనల్ని తలపిస్తున్నాయి. అక్కడ తాలిబన్ల లానే ఇక్కడ ఇస్లామిస్ట్ బృందాలు సైతం గద్దెనెక్కాక వెనకటి గుణం మానక నిజ స్వభావం చూపిస్తాయని భయాందోళనలు రేగుతున్నాయి. వెరసి, అసలే రగులుతున్న పశ్చిమాసియా కుంపటికి కొత్త సెగ వచ్చి తోడైంది. చరిత్ర గమనిస్తే, ప్రజాగ్రహ ఉద్యమం 2011 మార్చిలోనే సిరియాను తాకింది. ఎప్పటికప్పుడు కూలిపోవడం ఖాయమని భావించినా, అసద్ ఏలుబడి వాటన్నిటినీ తట్టుకొని, దాటుకొని వచ్చింది. జనాగ్రహాన్ని ఎదుర్కొనేందుకు ఆయన తీవ్ర హింసకు పాల్పడ్డారు. స్వదేశీయులపైనే ఒక దశలో రసాయన ఆయుధాలు వాడినట్లు ఆరోపణలూ వచ్చాయి. సిరియాకు ఆయన పీడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురుచూస్తున్న పరిస్థితి తెచ్చాయి. దాదాపు దశాబ్ద కాలం దూరం పెట్టాక, అరబ్ ప్రపంచం గత ఏడాది మళ్ళీ చేరదీయడం అసద్‌కు కలిసొస్తుందని భావించారు. అయితే, అరబ్ రాజ్యాలు తమ స్వలాభం కోసమే ఆ పని చేశాయి. అసద్ పోతే వచ్చే తెలియని దేవత కన్నా తెలిసిన దయ్యం మేలని భావించాయి. వారం రోజుల క్రితం దాకా ఈ పాలనకు చరమగీతం తథ్యమని ఎవరూ ఊహించ లేదు. రష్యా, ఇరాన్, హెజ్బుల్లాల అండతో అసమ్మతిని అణచివేస్తూ, అసద్ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా మళ్ళీ తిరుగుబాటు బృందాలు విజృంభించడంతో నాటకీయంగా కథ అడ్డం తిరిగింది. ఒక పక్క ఉక్రెయిన్‌తో పోరాటం నేపథ్యంలో రష్యా వైమానిక సాయం ఉపసంహరించుకోగా, మరోపక్క ఇజ్రాయెల్‌తో యుద్ధం వల్ల హెజ్బొల్లా వనరులు క్షీణించాయి. ఇదే అదనుగా ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ – తహ్రీర్ అల్ – షామ్ (హెచ్‌టీఎస్) సారథ్యంలోని తిరుగుబాటుదారులు చకచకా ముందుకు చొచ్చుకువచ్చారు. అసద్‌కు పట్టున్న ప్రాంతాలన్నీ కైవసం చేసుకుంటూ, ఆఖరికి అధికార పీఠానికి ప్రతీక అయిన డమాస్కస్‌ను చేజిక్కించుకోవడంతో ఏళ్ళ తరబడి సాగుతున్న నియంతృత్వానికి తెరపడింది. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు విమానంలో పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. అసద్ పదవీచ్యుతి ప్రభావం ప్రాంతీయంగా గణనీయమైనది. ఆ ప్రాంతంలో ఇంతకాలంగా స్నేహంగా మెలిగిన కీలక దేశం సిరియాలో అనుకూల పాలన పోవడం ఇరాన్‌కు వ్యూహాత్మకంగా ఇబ్బందికరమే. మరోపక్క హెజ్బుల్లా భవిష్యత్తూ అనిశ్చితిలో పడింది. తిరుగుబాటుదారులకు తెర వెనుక అండగా నిలిచిన టర్కీ ఇప్పుడిక అక్కడ చక్రం తిప్పే సూచనలున్నాయి. అయితే, టర్కీ ప్రయోజనాలకూ, ప్రాంతీయ శక్తులకూ మధ్య వైరుద్ధ్యం తలెత్తితే ఉద్రిక్తతలు పెరుగుతాయి. మానవ హక్కులను సైతం కాలరాస్తున్న నియంతృత్వంపై పోరాటం ఎవరు, ఎక్కడ చేసినా అది సమర్థనీయమే. ప్రపంచం సంతోషించాల్సిన అంశమే. నియంతృత్వం పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తాం. కానీ, అసద్ పాలన స్థానంలో రానున్న పాలన ఏమిటన్నది ప్రశ్న. ఒకటికి పది సంస్థలు ఈ సాయుధ తిరుగుబాటును నడిపాయని విస్మరించలేం. అసద్‌ను గద్దె దింపడం సరే కానీ, అనేక వైరుద్ధ్యాలున్న ఇవన్నీ ఒకతాటిపైకి రావడం, రేపు సజావుగా పాలన సాగించడం సాధ్య మేనా అన్నది బేతాళప్రశ్న. తీవ్రవాద అల్‌ఖైదాకు ఒకప్పటి శాఖ అయిన హెచ్‌టీఎస్ లాంటి తీవ్ర వాద సంస్థలు తమను తాము జాతీయవాద శక్తులుగా చెప్పుకుంటున్నా, అవి తమ వెనకటి స్వభా వాన్ని వదులుకుంటాయా అన్నదీ అనుమానమే. అదే గనక జరగకపోతే... దశాబ్దాలుగా అల్లాడు తున్న సిరియా, అక్కడి సామాన్యుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. ఒకప్పటి సంపన్న సిరియా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై, అంతర్యుద్ధంలో మగ్గుతూ శిథిలాల కుప్పగా మారింది. అసద్ హయాంలో దాదాపు 1.2 కోట్లమంది దేశం విడిచి పోవాల్సి వచ్చింది. ఉద్రిక్తతా నివారణ జోన్లలో అతి పెద్దదైన ఒక్క ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోనే సుమారు 20 లక్షల మంది శరణార్థులుగా బతుకీడుస్తున్నారు. తాజా పరిణామాలతో ఆ దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా ఒక గాడిన పెట్టాల్సిన తరుణమిది. స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న సిరియన్లు సైతం ఈ భగీరథ ప్రయత్నంలో భాగస్వాములవ్వాలి. అలాగే, ఆంక్షల విధింపుతో అసద్ పతనానికి దోహద పడ్డ పాశ్చాత్య దేశాలు సైతం సిరియా వాసుల కష్టాల తొలగింపుపై దృష్టి పెట్టాలి. తద్వారా వేలాది సిరియన్ శరణార్థులు స్వచ్ఛందంగా స్వదేశానికి వచ్చి, దేశ పునర్నిర్మాణంలో భాగమయ్యే వీలు చిక్కుతుంది. అసద్ పదవీచ్యుతితో సిరియా పునర్నిర్మాణానికి అవకాశం అంది వచ్చినా, అందుకు సవాలక్ష సవాళ్ళున్నాయి. మితవాద, అతివాద బృందాల సమ్మేళనమైన ప్రతిపక్షం సైనిక విజయం నుంచి సమర్థమైన పరిపాలన వైపు అడుగులేయడం ముఖ్యం. అందులో జయాపజయాలను బట్టే సిరియా భవితవ్యం నిర్ణయం కానుంది. అందుకే, రానున్న కొద్ది వారాల పరిణామాలు కీలకం. -
అకాలీల ప్రస్థానం ఎటువైపు?
పంజాబ్‌లో అవసానదశలో పడిన అకాలీదళ్‌కు కాయకల్ప చికిత్స చేసి రక్షించటానికి చేసిన ప్రయత్నం కాస్తా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రాణానికి ముప్పు తెచ్చింది. బుధవారం ఆయనపై కాల్పులు జరపబోయిన ఖలిస్తానీ మిలిటెంట్ నారాయణ్ సింగ్ చౌరాను అక్కడున్నవారు సకాలంలో నిరోధించకపోయివుంటే పంజాబ్‌లో మరో నెత్తుటి అధ్యాయం మొదలయ్యేది. గత తప్పిదాలకు బాదల్‌నూ, ఇతర నేతలనూ సిక్కు అత్యున్నత పీఠం అకల్‌తఖ్త్ మతద్రోహులుగా ప్రకటించి విధించిన శిక్షలు అమలవుతుండగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. పంజాబ్ స్థితిగతులు ప్రత్యేకమైనవి. మతమూ, రాజకీయాలూ కలగలిసి పోవటాన్ని వ్యతిరేకించేవారు సైతం ఈ ప్రత్యేకతను గమనించబట్టే అక్కడ అకాలీదళ్ వంటి మధ్యేవాద పక్షం అవసరమని భావిస్తారు. లేనట్టయితే మతాన్ని తలకెక్కించుకున్న అతివాదులది అక్కడ పైచేయి అవుతుందని వారి వాదన. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అకాలీదళ్‌ను బలహీనపరచటానికి భింద్రన్‌వాలే వంటి మిలిటెంట్లకు మొదట్లో అందించిన పరోక్ష ప్రోత్సాహం పంజాబ్‌కు శాపంగా మారింది. పరిస్థితి చేయిదాటాక అమృత్సర్ స్వర్ణాలయంలో తలదాచుకున్న భింద్రన్‌వాలేను, అతని ముఠాను అదుపు చేయటానికి సైన్యంతో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కాస్తా వికటించి చివరకు ఇందిర ప్రాణాలనే బలితీసుకుంది. ఆ హత్యకు ప్రతీకారమన్నట్టు ఢిల్లీతోసహా దేశంలో అనేకచోట్ల కాంగ్రెస్ నేతలు వెనకుండి సిక్కులపై సాగించిన హత్యాకాండ పర్యవసానంగా ఉగ్రవాద గ్రూపులు పుట్టుకొచ్చాయి. దశాబ్దంపాటు పంజాబ్ కనీవినీ ఎరుగని కల్లోలం చవిచూసింది. వేలాదిమంది అమాయక పౌరులు ఆహుతయ్యారు. ఉగ్రవాదాన్ని అదుపుచేయటం కోసమంటూ భద్రతా బలగాలు సాగించిన ఎన్కౌంటర్లు, అపహరణలు, అదృశ్యాలు సరేసరి. మన దేశంలో నామరూపాల్లేకుండా పోయిన ఆ ఉద్యమం ప్రస్తుతం కెనడాలో సాగిస్తున్న కార్యకలాపాల పర్యవసానమేమిటో కనబడుతూనే వుంది. అయిదుగురు సిక్కు మత పూజారుల అత్యున్నత పీఠం అకల్‌తఖ్త్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను స్వర్ణాలయ ప్రధానద్వారం వద్ద సాధారణ సేవాదార్‌గా పనిచేయాలని తీర్మానించింది. ఆయన తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని తెలిపే పలకను మెడలో ధరించారు. ఇతర అకాలీ నేతలకు స్వర్ణాలయంలో అంట్లు తోమటం నుంచి మరుగుదొడ్లు శుభ్రం చేయటం వరకూ వేర్వేరు శిక్షలు విధించింది. ఈ శిక్షలకు 2007–17 మధ్య పంజాబ్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన కూటమి సర్కారులోని భాగస్వామ్య పక్షమైన బీజేపీ అత్యుత్సాహం కారణం. పంథ్ కోసం ప్రాణత్యాగాలు చేసిన వ్యక్తులను విస్మరించి, సిక్కులను అనేకవిధాల హింసించి చంపిన రిటైర్డ్ పోలీసు అధికారుల కుటుంబ సభ్యులకు పదవులు పంచిపెట్టడం అకాలీదళ్ నేతలు చేసిన ‘ప్రధాన నేరం’. వీరిలో చాలామంది బీజేపీవారు కాగా, అకాలీ తరఫున ఎంపికైనవారు కూడా ఉన్నారు. అలాగే మతాన్ని అపవిత్రం చేసిన దేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీంపై ఉన్న కేసుల్ని ఆయన కోరకుండానే రద్దుచేయటం, దాన్ని సమర్థించుకోవటానికి తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వాల్సిందిగా జతేదార్లను పిలిపించి ఒత్తిడి చేయటం వంటివి ఇతర ఆరోపణలు. అధికారంలో ఉండగా చేసిన పనులకు అకాలీదళ్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. 1920లో ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రైతాంగం దూరమైంది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. దానికితోడు సాగు సంక్షోభం, ఉపాధి లేమివంటì సమస్యలు మధ్యతరగతిని, ఇతర వర్గాలవారినీ అసంతృప్తిలో ముంచెత్తాయి. అందుకే అకాలీలను వరస ఓటములు వెంటాడాయి. పర్యవసానంగా అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రంగప్రవేశం అకాలీని నిలువునా ముంచింది. ఆ పార్టీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేకపోయింది. తన భాగస్వామ్య పక్షాన్ని బలహీనపరిచి ఎదగాలని చూసే బీజేపీ ఎత్తుగడలు ఆ రాష్ట్రంలో ఫలించలేదు. అందుకే అకాలీ నేతల ‘తప్పుల’కు తగిన శిక్ష విధించి, వారికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశమీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖడ్ గత నెలలో అకల్తఖ్త్కు విజ్ఞప్తి చేశారు. అయితే ఉగ్రవాదం విస్తరిస్తుందన్న సాకుతో రాజకీయాల్లో మత సంస్థల ప్రాబల్యం పెంచటం ఎంతవరకూ సబబన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఆప్ ఆగమనం, అది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవటం విశ్లేషిస్తే మత రాజకీయాల ప్రాబల్యం బలహీన పడిందన్న అభిప్రాయం కలుగుతుంది. అకాలీదళ్ 1977 తర్వాత బాదల్ కుటుంబ ప్రాబల్యంలోకొచ్చాక రాష్ట్రంలో సిక్కు–నిరంకారీ ఘర్షణలు పెరిగాయి. అటూ ఇటూ పదులకొద్దీ మంది మరణించారు. ఇందిర పుణ్యమా అని ఉగ్రవాదం విస్తరించింది. ఈ అయోమయ పరిస్థితుల్లో 1996లో బీజేపీతో కలిసి ప్రయాణించటానికి నిర్ణయించుకుని మోగాలో జరిగిన పార్టీ సమావేశాల్లో సిక్కు మత మూలాలున్న అకాలీదళ్‌ను సెక్యులర్ పార్టీగా మారుస్తూ తీర్మానించటం పంథ్ అనుకూల ఓటర్లను క్రమేపీ పార్టీకి దూరం చేసింది. బీజేపీ ఆ పని చేయకపోవటాన్ని అందరూ వేలెత్తి చూపారు. అకాలీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ జోషి పార్టీ తిరిగి పంథ్ అనుకూల వైఖరి తీసుకుని శిక్షలకు తలొగ్గటాన్ని నిరసిస్తూ అకాలీదళ్‌కు రాజీనామా చేశారు. ఈ అంతర్మథనం బాదల్‌పై జరిగిన తాజా దాడితో ఏయే మలుపులు తీసుకుంటుందో, అకాలీదళ్ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో మున్ముందు చూడాలి. -
బైడెన్ పుత్రవాత్సల్యం
చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండటం, తలకెత్తుకున్న విలువలను చివరివరకూ శిరోధార్యంగా భావించటం అంత తేలిక కాదు. అధికార వైభోగాల్లో మునిగితేలేవారికి అది ప్రాణాంతకం కూడా. ఇందుకు మినహాయింపు ఎవరని జల్లెడ పడితే ప్రపంచవ్యాప్తంగా వేళ్లమీద లెక్కబెట్టేంత మంది మిగులుతారేమో! అధికార పీఠం నుంచి మరో నెలన్నరలో తప్పుకోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్రిమినల్ కేసుల నుంచి విముక్తి కలిగించే ఉత్తర్వులపై ఆదివారం సంతకం చేసిన ఉదంతం ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చనీయాంశమైంది. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ అధికార పీఠం అధిష్ఠించాక ఒక్కొక్కరి సంగతీ చూస్తానంటూ వీలైనప్పుడల్లా హూంకరిస్తున్నారు. ప్రత్యేకించి హంటర్ బైడెన్ గురించి కూడా చెప్పారు. మన అధమస్థాయి నేతల్లా ‘రెడ్ బుక్’ అని పేరేమీ పెట్టుకోలేదుగానీ వేధించదల్చుకున్నవారి పేర్లన్నిటినీ ఒక చిట్టాలో రాసుకున్నట్టే కనబడుతోంది. కత్తికి పదును పెట్టుకుంటున్న వైనం కళ్ల ముందే కనబడుతోంది. 2021 జనవరి 6న వాషింగ్టన్లో కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన కాపిటల్ హిల్‌లోకి చొరబడి కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించిన మూకకు క్షమాభిక్ష పెట్టడం ఆయన తొలి ప్రాధాన్యం. ఆ కేసుల్ని దర్యాప్తు చేసినవారినీ, కేసులు దాఖలు చేసిన న్యాయవాదులనూ, వీరి వెనకున్న డెమాక్రటిక్ నేతలనూ జైళ్లపాలు చేయటం ట్రంప్ ఎజెండా. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అయితేనేమి... ఇతర సందర్భాల్లో అయితేనేమి తాను విలువలకు మారు పేరని బైడెన్ ఒకటికి పదిసార్లు చెప్పుకున్నారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని విచారణ ఎదుర్కొంటున్న తన కుమారుడు హంటర్ బైడెన్‌కు అధ్యక్షుడిగా విశేషాధికారాలను వినియోగించి క్షమాభిక్ష పెట్టే యోచన లేదని చెప్పారు. నిరుడు హంటర్‌ను వివిధ అభియోగాల్లో నేరస్తుడని ప్రకటించి, శిక్షాకాలాన్ని తర్వాత ప్రకటిస్తామని న్యాయస్థానం చెప్పినప్పుడు ‘తుది నిర్ణయం ఏదైనా శిరసావహిస్తాను. న్యాయవిచారణ ప్రక్రియను గౌరవిస్తాను’ అని బైడెన్ ప్రకటించారు. ఆర్నెల్ల క్రితం ఇటలీలో జీ–7 సమావేశాల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సైతం ఆయన దీన్నే చెప్పారు. మరేమైంది? తన మాటల్ని తానే ఎందుకు మింగేశారు? సరిగ్గా 82 ఏళ్ల వయసులో పదవి నుంచి నిష్క్రమించే వేళ తన డెమాక్రటిక్ పార్టీని ఎందుకని ఇరుకున పడేశారు? తమది పురాతన పరిణత ప్రజాస్వామ్యమని అమెరికన్లు గొప్పలు పోతారు. ఎవరైనా– సామాన్య పౌరులైనా, ఉన్నతస్థాయి నేతలైనా–తమ దేశంలో చట్టం ముందు సమానులేనని చెప్పుకుంటారు. అయితే అదంతా నిజం కాదని అడపా దడపా రుజువవుతూనే ఉంటుంది. పైపైన చూస్తే ఇప్పుడు బైడెన్ చర్య కూడా ఆ తానులో ముక్కేనని అందరూ భావిస్తారు. కానీ ఆయన అందర్నీ మించిపోయాడన్నది డెమాక్రాట్లలోనే వినిపిస్తున్న విమర్శల సారాంశం. ఎందుకంటే ఇంతక్రితం అధ్యక్షులు తమ సన్నిహితులకు క్షమాభిక్ష పెట్టారు తప్ప సంతానానికి ఇలాంటి వెసులుబాటు కల్పించే స్థితి ఏర్పడలేదు. గతంలో జార్జి డబ్లు్య బుష్ అమెరికా రక్షణ మంత్రిగా పనిచేసిన కాస్పర్ వీన్బెర్గర్నూ, మరికొంతమంది అధికారులనూ ఇరాన్–కాంట్రా వ్యవహారంలో నేరారోపణల నుంచి విముక్తం చేశారు. బిల్ క్లింటన్ తన సవతి సోదరుడిని మాదకద్రవ్యాల కేసు నుంచి తప్పించారు. ట్రంప్ మాత్రం 2016–20 మధ్య ఎడాపెడా క్షమాభిక్షలు ప్రకటించారు. అందులో తన అల్లుడు జేర్డ్ కుష్నెర్ తండ్రి చార్లెస్ కుష్నెర్ ఒకరు. ఆయనకు పన్ను ఎగవేత కేసులో రెండేళ్ల శిక్షపడగా క్షమాభిక్ష పెట్టారు. అతన్నిప్పుడు ఫ్రాన్స్ రాయబారిగా కూడా ప్రకటించారు. హంటర్‌కు క్షమాభిక్ష పెట్టాక విడుదల చేసిన ప్రకటనలో బైడెన్ తన కుమారుణ్ణి కావాలని అన్యాయంగా ఇరికించి విచారణ తంతు సాగించారని ఆరోపించారు. అతణ్ణి జైలుపాలుచేసి మానసికంగా తనను ఛిద్రం చేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. ‘ఇది ఇక్కడితో ఆగుతుందనుకోవటానికి లేద’ని ప్రకటించారు. హంటర్ కేసుల్ని గమనిస్తే జో బైడెన్‌ది పుత్ర ప్రేమ తప్ప మరేం కాదని సులభంగా తెలుస్తుంది. ఆయన మాదకద్రవ్యాల వినియోగంలో ఒకప్పుడు మునిగి తేలేవాడు. దశాబ్దం క్రితం ఆయనది చీకటి జీవితం. ఒబామా హయాంలో తన తండ్రి ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయానికి హంటర్ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. అతని ప్రవర్తన బైడెన్‌కు చాలా తలనొప్పులు తెచ్చిపెట్టింది. తుపాకీ కొనుగోలు చేశాక దాన్ని తన దగ్గర కేవలం 11 రోజులే ఉంచుకుని తిరిగి అధికారులకు అప్పగించి ఉండొచ్చు. కానీ దరఖాస్తు చేసినప్పుడు తన నేర చరిత్ర దాచిపెట్టాడు. మాదక ద్రవ్యాలు వాడుతున్న సంగతిని చెప్పలేదు. పన్ను ఎగవేత కేసు సరేసరి. మొత్తానికి రెండు రకాల న్యాయం అమలవుతున్న వైనం కళ్ల ముందు కనబడుతుండగా అనవసర స్వోత్కర్షలకు పోరాదని ఇకనైనా అమెరికన్లు గుర్తించాల్సివుంది. నిజానికి ఇలాంటి అసమ వ్యవస్థే ట్రంప్ వంటివారి ఆవిర్భావానికి దారితీసింది. ఏదేమైనా విలువల గురించి మాట్లాడే నైతికార్హత డెమాక్రాట్లు కోల్పోయారు. ట్రంప్ మున్ముందు ఏం చేయబోతారో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకమే చెబుతోంది. దాన్ని చూపించి బైడెన్ చర్య హేతుబద్ధమైనదని డెమాక్రాట్లు చెప్పలేరు. పైపెచ్చు వచ్చే నాలుగేళ్లలో తాను చేసే ప్రతి అక్రమాన్నీ సమర్థించుకోవటానికి డోనాల్డ్ ట్రంప్ బైడెన్‌ను ఉదాహరిస్తుంటే వారు మౌనంగా మిగిలిపోక తప్పదు. -
మానని గాయం
ఆధునిక కాలంలో మనిషి అంతరిక్షాన్ని అందుకోగలిగాడు; చంద్రమండలం మీద అడుగు మోప గలిగాడు; సహజ మేధకు పోటీగా కృత్రిమ మేధను సృష్టించాడు; విశ్వామిత్ర సృష్టిని తలపించేలా మనుషులకు దీటైన మరమనుషులను సృష్టించాడు. ఇంతటి మహత్తర ఘనతలను చూసినప్పుడల్లా ‘మానవుడే మహనీయుడు/ శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు... జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే!’ అనుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోతాం. రేపో మాపో అంగారక గ్రహం మీద ఆవాసాలను ఏర్పాటు చేసే దిశగా మనుషులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్నప్పుడు ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతాం. మనిషి సాధించిన ఘన విజయాలను ఏకరువు పెట్టాలంటే, ఎన్ని గ్రంథాలైనా చాలవు.చరిత్రలో ఇన్ని ఘన విజయాలు సాధించిన మనిషికి అనాది పరాజయాలు కూడా ఉన్నాయి. ఆధునికత సంతరించుకుని, అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్న మనిషి–అమరత్వాన్ని సాధించే దిశగా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే, ఆకలి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని నేటికీ కనుక్కోలేకపోవడం మాత్రం ముమ్మాటికీ మనిషి వైఫల్యమే! యుద్ధాలలో ఉపయోగించ డానికి అధునాతన ఆయుధాలను ఎప్పటికప్పుడు తయారు చేయగలుగుతున్న మనిషి – అసలు యుద్ధాల అవసరమే లేని శాంతియుత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం కూడా వైఫల్యమే! ప్రపంచంలో మనిషికి క్షుద్బాధను మించిన దుర్భర బాధ మరొకటేదీ లేదు. పురాణ సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు ఆకలి ప్రస్తావన మనకు విరివిగా కనిపిస్తుంది. తాను ఆకలితో అలమటిస్తున్నా, అతిథికి అన్నం పెట్టి పుణ్యలోకాలకు వెళ్లిన రంతిదేవుడి కథ తెలిసినదే! ఆకలికి తాళలేక కుక్కమాంసం తిన్న విశ్వామిత్రుడి కథ పురాణ విదితమే! ఆకలి బాధ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది.అందుకు విశ్వామిత్రుడి కథే ఉదాహరణ. పురాణాల్లో అక్షయపాత్రలు పుణ్యాత్ముల ఆకలి తీర్చిన గాథలు ఉన్నాయే గాని, సామాన్యుల ఆకలి తీర్చిన ఉదంతాలు లేవు. ఆకలితో అలమ టిస్తున్నా, త్యాగం చేయడం గొప్ప సుగుణమని చెప్పే పురాణాలు – ఆకలికి శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చెప్పలేదు.ఆధునిక సాహిత్యంలో ఆకలి ప్రస్తావనకు కరవు లేదు. స్వాతంత్య్రోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అని ఎలుగెత్తిన గరిమెళ్ల – ఆ పాటలోనే ‘పన్నెండు దేశాలు పండుతున్నాగాని/ పట్టెడన్నమె లోపమండీ/ ఉప్పు పట్టుకుంటే దోషమండీ/ నోట మట్టి కొట్టుకుపోతామండీ/ అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండీ’ అంటారు. స్వాతంత్య్రం రాక ముందు మన దేశంలోని ఆకలి బాధలు అలా ఉండేవి. ప్రపంచమంతా ఆర్థికమాంద్యంతో అతలా కుతలమైన హంగ్రీ థర్టీస్ కాలంలో కలాలతో కవాతు చేసిన కవులందరూ ఆకలి కేకలు వినిపించిన వారే! ‘ఆకలి ఆకలి తెరిచిన/ రౌరవ నరకపు వాకిలి/ హృదయపు మెత్తని చోటుల గీరే జంతువు ఆకలి/... ఈ ఆకలి హోరు ముందు/ పిడుగైనా వినిపించదు/ ఆకలి కమ్మిన కళ్లకు/ ప్రపంచమే కనిపించదు’ అన్న బైరాగి ‘ఆకలి’ కవిత పాఠకులను విచలితులను చేస్తుంది. ‘అన్నపూర్ణ గర్భగుడిని/ ఆకలి గంటలు మ్రోగెను/ ఆరని ఆకలి కీలలు/ భైరవ నాట్యము చేసెను/ ఘోర పరాజ యమా ఇది?/ మానవ మారణ హోమం/ తల్లీ! ఆకలి... ఆకలి!’ అంటూ సోమసుందర్ ఆకలి కేకలు వినిపించారు.‘నేను ఆకలితో ఉన్నాను/ నువ్వు చంద్రుడి వద్దకు వెళ్లావు... నేను తిండిలేక నీరసిస్తున్నాను/ నాకు వాగ్దానాలు మేపుతున్నావు’ అంటూ ఆధునిక శాస్త్ర సాంకేతిక పురోగతి ఒకవైపు, ఆకలి బాధలు మరోవైపుగా ఉన్న ఈ లోకంలో పాలకుల తీరును శ్రీశ్రీ ఎత్తిపొడుస్తారు. ఇప్పటికీ లోకం తీరు పెద్దగా మారలేదు. మానవుడు పంపిన ఉపగ్రహాలు అంగారకుడి వద్దకు వెళ్లినా, ఆకలి బాధలు సమసి పోలేదు; ఆకలి చావులు ఆగిపోలేదు.మనిషి ఘన విజయాల చరిత్రలో ఆకలి, అశాంతి– రెండూ మాయని మరకలు. ఈ రెండు మరకలూ పూర్తిగా చెరిగిపోయేంత వరకు మనిషి ఎన్ని విజయాలు సాధించినా, అవేవీ మానవాళికి ఊరటనూ ఇవ్వలేవు; మానవాళిని ఏమాత్రం ఉద్ధరించనూ లేవు. ఆకలికి, అశాంతికి మూలం మను షుల్లోని అసమానతలే! ప్రపంచంలో అసమానతలు తొలగిపోనంత వరకు ఆకలిని రూపుమాపడం, శాంతిని నెలకొల్పడం అసాధ్యం. నిజానికి సంకల్పం ఉంటే, సాధ్యం కానిదంటూ ఏదీ లేదు గాని, అసమానతలను రూపుమాపే సంకల్పమే ఏ దేశంలోనూ పాలకులకు లేదు. అందువల్లనే ఆకలి, అశాంతి మనుషులను తరతరాలుగా పట్టి పీడిస్తున్నాయి. అకాల మరణాలకు కారణమవుతున్నాయి. ఆకలి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు పాతికవేల నిండు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అంటే, ఏడాదికి సగటున ఏకంగా తొంభై లక్షల మంది ఆకలికి బలైపోతున్నారు. ఆకలితో మరణిస్తున్న వాళ్లలో పసిపిల్లలు కూడా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న శిశుమరణాల్లో దాదాపు యాభై శాతం ఆకలి చావులే! నాణేనికి ఇదొకవైపు అయితే, మరోవైపు వంద కోట్లమందికి ఆకలి తీర్చడానికి తగినంత ఆహారం ప్రతిరోజూ వృథా అవుతోంది. ఈ పరిస్థితిని గమనించే ‘అన్నపు రాసులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట’ అని కాళోజీ వాపోయారు.ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఐదో స్థానంలో ఉన్న మన దేశం– ఆకలి సూచిలో నూట ఐదో స్థానంలో ఉండటం ఒక కఠోర వాస్తవం. అమృతోత్సవ భారతంలో ఆకలి సమస్య ఒక మానని గాయం! -
వ్యక్తిత్వాన్ని దహించలేరు!
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిట్టనిలువునా దహించడానికి,అడ్డంగా నరికివేయడానికి చాలాకాలంగా కొందరు వ్యూహకర్తలు పడుతున్న ఆపసోపాలను గమనిస్తున్నాము. విషపు కత్తుల్ని విసురుకుంటూ జాగిలాలను విదిలిస్తూ పదమూడేళ్లుగా వారు పడుతున్న ప్రయాసను చూస్తున్నాము. కానీ ఏమైనది? వ్యక్తిత్వం మీద నీలాపనిందలు మోపగలరేమో! బురద చల్ల గలరేమో! మసి పూయగలరేమో! వెలుగు రేకను మబ్బులు కాస్సేపు మాయం చేయగలవేమో! అది త్రుటికాలం మాత్రమే! నిక్కమైన వ్యక్తిత్వాన్ని కూడా మబ్బులు శాశ్వతంగా మాయం చేయలేవు.ఘంటసాల గాత్ర మాధుర్యం కారణంగా భగవద్గీతలోని శ్లోకాలు కొన్ని తెలుగు వారికి బాగా పరిచయమైపోయాయి. ‘‘నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః! ...’’ అనే శ్లోకం కూడా అందులో ఒకటి. ‘ఆత్మ ఎట్టి ఆయుధము చేతనూ ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుప బడదు, వాయువుచే ఎండిపోదు’ అని దాని తాత్పర్యం. వ్యక్తిత్వం కూడా అటువంటిదే! ఎటువంటి ఆయుధం చేతనూ ముక్కలు చేయబడదు. అగ్నిచే కాల్చబడదు.జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని ఒక ధారావాహికగా కొనసాగిస్తున్న తీరును గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. తెలుగు నేలపైనున్న ఒక బలమైన వర్గం చాలా ముందుచూపుతో మీడియా రంగంలో బ్రూటల్ డామి నెన్స్‌ను ఏర్పాటు చేసుకోగలిగింది. ట్రెజర్ హంట్ చేయాలన్నా, పవర్ హంట్ చేయాలన్నా మీడియా కంటే పదునైన ఆయుధం లేదనే సంగతిని ఈ వర్గం గుర్తించింది. ఆయుధం మీద ఆధిపత్యాన్ని సంపాదించగలిగింది. ఎన్టీ రామారావును అధికార పీఠంపై ప్రతిష్ఠించగలిగింది. ఆయన వల్ల తమ వర్గానికి అనుకున్నంత మేలు జరగడం లేదన్న గ్రహింపు కలగగానే చంద్రబాబును ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన వైనం సరిగ్గా మూడు దశాబ్దాల కిందటి చరిత్ర.మీడియా తుపాకీ ట్రిగ్గర్ను చంద్రబాబు నొక్కగానే ఎన్టీ రామారావు కుప్పకూలిపోయాడు. అప్పటి నుంచి చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా తోడూనీడలా కలిసిపోయారు. ‘నీకింత – నాకింత’ అనే డ్యూయెట్ పాడుకుంటూ రాజ్యాధికారాన్ని వారు అనుభవించసాగారు. ఎదురు నిలబడేవారి మీద మీడియా వెపన్‌ను గురిపెట్టారు. ఎన్టీ రామారావే వీరి ముందు నిలబడలేకపోవడంతో చాలామంది భయపడ్డారు.ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమే వారిని ధిక్కరించి నిల బడ్డారు. చాలాకాలం పాటు వారిని ఎదిరించారు. విజయాలు సాధించారు. కానీ దురదృష్టం. ఆయన అకాల మరణంతో బాబు కూటమి మళ్లీ బుసలుకొట్టింది. వైఎస్ఆర్ మరణించిన రోజునే తమకు భవిష్యత్తులో దీటైన ప్రత్యర్థి కాగల యువకుడిని వారు గుర్తించగలిగారు. ఆరోజు నుంచే జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం మొదలైంది. ఇప్పటికి పదిహేనేళ్లు దాటింది.చంద్రబాబు పార్టీ, యెల్లో మీడియాగా పేరుపడ్డ ఆయన మిత్ర మీడియా జగన్మోహన్రెడ్డిపై నిరంతరాయంగా దాడులు జరుపుతూనే ఉన్నది. దేశాల మధ్య జరిగే భీకర యుద్ధాల్లో కూడా కొన్ని నియమాలుంటాయి. శత్రు దేశాల మీద రసాయన బాంబులు వేయడం, విషవాయువుల్ని వెదజల్లడం వంటివి నిషిద్ధం. కానీ యెల్లో మీడియాకు ఇటువంటి విధినిషేధాలేమీ లేవు. జగన్ మోహన్‌రెడ్డిపై ప్రయోగించని అస్త్రం లేదు. చేయని ప్రచారం లేదు. కానీ జగన్ తట్టుకొన్నారు. తట్టుకొని జనబలంతో నిల బడ్డారు. ఘన విజయాలను నమోదు చేయగలిగారు. ‘అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె’ అనుకుంటూ యెల్లో కూటమి నిర్వేద స్థితిలోకి జారిపోయింది. బీజేపీని బతిమాలు కొని వారి అండతో బాబు కూటమి ఒక ‘సాంకేతిక విజయా’న్ని సాధించగలిగింది.సాంకేతిక విజయంతో గద్దెనెక్కిన ఈ ఆరు మాసాల్లో అరడజనుకు పైగా దారుణమైన నిందల్ని జగన్‌పై మోపి, తమ ‘సూపర్ సిక్స్’ వైఫల్యాన్ని చర్చలోకి రాకుండా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. అరడజన్ నిందారోపణలు – ‘సూపర్ సిక్స్’ వైఫల్యాలుగా ఈ ఆరు మాసాల పుణ్యకాలం గడిచిపోయింది. తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఎల్లో మీడియా దేవతా వస్త్రాలతో ఊరేగుతూ ఎంత కంపరం పుట్టిస్తున్నదో ఇప్పుడు చూస్తున్నాము. ‘సెకీ’ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో! అదీ వ్యవసాయ రంగానికి నాణ్య మైన, నికరమైన, ఉచిత విద్యుత్‌ను అందజేయడం కోసం! జగన్ కంటే ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సౌర విద్యుత్ కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ సంస్థలకు ఆయన సగటున యూనిట్‌కు రూ. 5.90 కట్ట బెట్టారు.జగన్మోహన్రెడ్డి ‘సెకీ’తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ ధర రూ.2.49. ఎక్కువ ధర చెల్లిస్తూ ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందంలో స్కామ్ ఉండే అవకాశం ఉంటుందా? సగానికంటే తక్కువ రేటు పెట్టి ప్రభుత్వ సంస్థతో చేసుకునే ఒప్పందంలో స్కామ్ ఉంటుందా? అదనపు ఛార్జీలంటూ దీనికేదో మెలికపెట్టే ప్రయత్నాన్ని యెల్లో మీడియా కొనసాగిస్తున్నది. కానీ దీనికి అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీ లను వర్తింపచేయడం లేదని ‘సెకీ’ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగానే పేర్కొన్నది. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వ్యవసాయ విద్యుత్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ అందుకు సహాయకంగా ఈ ఒప్పంద ప్రతిపాదన చేసింది.ఈ ఒప్పందంలోని మూడు కీలక అంశాలను పరిశీలించాలి. మొదటిది: ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందం మాత్రమే! ఇందులో ఎక్కడా థర్డ్ పార్టీ ప్రమేయం లేదు. రెండు: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత తక్కు వగా రూ.2.49కే యూనిట్ సరఫరా చేస్తామని ప్రతిపాదించడం. మూడు: ప్రత్యేక ప్రోత్సాహకం కింద ఈ ఒప్పందానికి అంత ర్రాష్ట్ర రవాణా ఛార్జీలను మినహాయిస్తున్నట్టు చెప్పడం. ఇంత స్పష్టత, పారదర్శకత ఉన్న ఒప్పందం మధ్యలో స్కామ్ ఏ రకంగా దూరుతుంది?‘సెకీ’తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవ డానికి ముందు అదానీ అప్పటి ముఖ్యమంత్రిని కలిశారని అమెరికా దర్యాప్తు సంస్థ చెప్పిందట! యెల్లో మీడియాకు ఇది చాలదా? కోతికి కొబ్బరిచిప్ప దొరికినంత సందడి. జగన్ మోహన్‌రెడ్డికి అదానీ ముడుపులు అందాయంటూ పతాక శీర్షికలు పెట్టి వార్తలు వేశాయి. ఇంతకంటే నీతిబాహ్యత వేరే ఉంటుందా? అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక ప్రముఖ వ్యక్తి ప్రతిష్ఠతో ఆటలాడుకోవడం కాదా? ‘సెకీ’తో ఒప్పందం, సీఎంను అదానీ కలవడం... రెండూ వేరువేరు విషయాలు. సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు ఈ ఒప్పందం కుదిరింది. రవాణా ఛార్జీల మినహాయింపు బోనస్. ఇది రాష్ట్రానికి విజయం – లాభదాయకం!ఇక అదానీ గానీ, అంబానీ గానీ, ఇతర పారిశ్రామిక వేత్తలెవరైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని కలవడం సర్వసాధారణమైన విషయం. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబును అందరికంటే ఎక్కువమందే పారిశ్రామికవేత్తలు కలిసి ఉంటారు. ఆ భేటీలన్నీ స్కామ్‌ల కోసమే అనుకోవాలా? ఒక వ్యక్తి పట్ల గుడ్డి వ్యతిరేకత, ద్వేషం, పగ పేరుకొనిపోయి ఉంటే తప్ప ఇంత దిగజారుడు ప్రచారం సాధ్యం కాదు.ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో కష్టం వచ్చిపడింది. గద్దెనెక్కి ఆరు మాసాలు కావస్తున్నా ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల రూపా యల భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు సరిగదా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేదు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ నెలకు 15 వేలు (నీకు పదిహేను, నీకు పదిహేను ఫేమ్) ఇస్తామ న్నారు. ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’ని ఎత్తిపారేశారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల సాయం చేస్తామన్నారు. ‘రైతు భరోసా’ను ఎత్తేశారు తప్ప కొత్త సాయం గురించిన ఆలోచనే చేయలేదు. ప్రతి మహిళకూ నెలకు 1500 రూపాయలిస్తామన్నారు. అదీ మరిచి పోయారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణం అదుగో ఇదుగో అనడం తప్ప ఆ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీకి గాను ఈ యేడాదికి ఒక్క సిలిండర్‌తో సరిపెట్టారు. ‘సూపర్ సిక్స్’లోని ఐదు హామీలను అటకెక్కించి ఒక్క దాంట్లో మూడో వంతు నెరవేర్చారన్నమాట!హామీల అమలులో ఈ దారుణ వైఫల్యం పట్ల సహజంగానే ప్రజల్లో అసంతృప్తి బయల్దేరింది. ఇంత కీలకమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం జగన్ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు జరుగుతున్న ఘటనల ద్వారా అర్థమవుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఓ కపట నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతకుముందు తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసి విజ్ఞుల చేత చీవాట్లు తిన్న తర్వాత తోక ముడిచారు. విజయవాడ వరదల సందర్భంగా పాలనాపరమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చి ప్రకాశం బ్యారేజీలో వైసీపీవాళ్లు బోట్లు అడ్డంపెట్టి నగరాన్ని ముంచేశారని హాస్యపూరితమైన ఆరోపణ చేశారు. అప్పుల గణాంకాలపై ఇప్పటికీ పిల్లిమొగ్గలు వేస్తూనే అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చిన లెక్కలకు విరుద్ధంగా అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల ఆశలకు ఆలంబనగా నిలబడి రెండు లక్షల డెబ్బయ్ మూడు వేల కోట్ల రూపా యలను వారి అకౌంట్లలోకి బదిలీ చేసిన ‘నవరత్న’ పథకాలను అవహేళన చేస్తూ స్కీములన్నీ స్కాములేనని ప్రచారం చేశారు.జగన్ ఐదేళ్ల పాలననూ, కూటమి సర్కార్ తాజా ఆరు మాసాల పాలననూ జనం బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి, జనం ముందు జవాబుదారీ తనాన్ని నిలబెట్టుకున్న జగన్ వ్యక్తిత్వాన్నీ, ఎన్నికల హామీలన్నీ హుష్ కాకీ అంటున్న చంద్రబాబు వ్యక్తిత్వాన్ని జనం పోల్చి చూసుకుంటున్నారు. పేదబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వారి నాణ్యమైన చదువులపై వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టిన జగన్ విజన్కూ, పేదలకు ఇంగ్లిష్ మీడియం అవసరం లేదని ఎత్తిపారేసిన చంద్రబాబు విజన్కూ మధ్యనున్న తేడాలోని రహస్యమేమిటో తెలుసుకుంటున్నారు. ప్రజలందరి సాధికార తకు పెద్దపీట వేసిన జగన్ ఫిలాసఫీని, కొద్దిమందికి కొమ్ముకాసే చంద్రబాబు ఫిలాసఫీని ఆమూలాగ్రంగా పరిశీలిస్తున్నారు. ఎల్లకాలం జనం కళ్లకు గంతలు కట్టడం సాధ్యం కాదు. ప్రత్యర్థి వ్యక్తిత్వహననంతో పబ్బం గడుపుకోవాలంటే ప్రతిసారీ కుద రదు. ఇప్పుడు యెల్లో మీడియాకు జగన్ లీగల్ నోటీసులు పంపించారు. ఇక జనంలో చర్చ మొదలవుతుంది. ఇద్దరి వ్యక్తిత్వాల మీద ఆ చర్చ జరగాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కోర్టులు కదిపిన తేనెతుట్టెలు
దేవుడు అంతటా, అందరిలో ఉన్నాడని నమ్మే గడ్డపై... ఆయనను నిర్ణీత స్థల, కాలాలకే పరిమితం చేసే సంకుచిత రాజకీయ స్వార్థాలు చిచ్చు రేపుతూనే ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య విద్వేషాగ్ని రగిలిస్తున్న ఈ ప్రయత్నాలకు తాజా ఉదాహరణ – యూపీలోని సంభల్ జామా మసీదు వివాదం, దరిమిలా అక్కడ రేగిన హింసాకాండ, ఆస్తి, ప్రాణనష్టం. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనతో మందిరం – మసీదు వివాదాలు ముగిసిపోతాయని ఎవరైనా ఆశపడితే అది వట్టి అడియాసని మరోసారి తేలిపోయింది. మత రాజకీయాలకూ, వర్గ విభేదాలకూ ప్రార్థనా స్థలాలు కేంద్రాలు కారాదనే సదుద్దేశంతో చేసిన ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం–1991 స్ఫూర్తికే విఘాతం కలిగింది. ప్రార్థనా మందిరాల నిర్మాణమూలాలను తెలుసుకోవాలన్న ఒక వర్గం ఉత్సాహం తప్పేమీ కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఒక దశలో అదాటున చేసిన వ్యాఖ్యలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. వివాదం వస్తే చాలు... దేశంలో ప్రతి చిన్న కోర్టూ అనాలోచితంగా సర్వేలకు ఆదేశించేలా ఊతమిచ్చాయి. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం. తాజా ఘర్షణలకు కేంద్రమైన సంభల్‌లోని షాహీ జామా మసీదు 16వ శతాబ్దికి చెందిన రక్షిత జాతీయ కట్టడం. వారణాసిలోని జ్ఞానవాపి, యూపీలోని మథురలో నెలకొన్న ఈద్గా, మధ్యప్రదేశ్ లోని ధార్‌లో ఉన్న కమాల్ మౌలా మసీదుల్లో లానే దీనిపై రచ్చ మొదలైంది. అక్కడ కేసులు వేసినవారే ఇక్కడా కోర్టుకెక్కారు. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టిన 3 మసీదుల్లో (పానిపట్, అయోధ్య, సంభల్) ఇదొకటి. ప్రాచీన హరిహర మందిర్ స్థలంలో ఈ మసీదును నిర్మించారని పిటిషనర్ల వాదన. జిల్లా కోర్టులో ఈ నెల 19న కేసు వస్తూనే జడ్జి మసీదులో ఫోటో, వీడియో సర్వేకు ఆదేశిస్తూ, 29వ తేదీ కల్లా నివేదిక సైతం సమర్పించాలన్నారు. తొలి సర్వే ప్రశాంతంగా సాగినా, నవంబర్ 24 నాటి రెండో సర్వే భారీ హింసకు దారి తీసింది. సర్వేకు వచ్చినవారిలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారనీ, దాంతో నిరసనకారులు రాళ్ళురువ్వారనీ వార్త. కాల్పుల్లో అయిదుగురు మరణించారు. అమాయకుల ప్రాణాలు, పట్నంలో సామరస్య వాతావరణం గాలికెగిరి పోయాయి.శతాబ్దాల తరబడి అన్ని వర్గాలూ కలసిమెలసి జీవిస్తున్న చోట విద్వేషాగ్ని రగులుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అయోధ్య, వారణాసి వివాదాలకు భిన్నంగా సంభల్ కథ చిత్రంగా ఈ ఏడాదే తెర మీదకొచ్చింది. పశ్చిమ యూపీలో సంభల్ జిల్లా మూడు దశాబ్దాలుగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి కంచుకోట. 1980ల నుంచి అక్కడ అధికారం కోసం బర్ఖ్, మెహమూద్ కుటుంబాలు వేర్వేరు పార్టీల పక్షాన పరస్పరం తలపడుతూ వచ్చాయి. తర్వాత 1990ల నుంచి రెండు వర్గాలూ ఎస్పీతోనే అనుబంధం నెరపుతున్నాయి. అధికారంలో పైచేయి కోసం ఒకే పార్టీలోని ఈ రెండు వర్గాల మధ్య పోరాటమే తాజా హింసకు కారణమని బీజేపీ ప్రచారం చేస్తోంది. హిందూ – ముస్లిమ్‌ల తర్వాత, ఇక ముస్లిమ్‌లలోని ఉపకులాల మధ్య చీలికలు తీసుకురావడానికే కాషాయ ధ్వజులు ఈ ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఖండిస్తోంది. మొఘల్ శిల్పనిర్మాణ శైలికి ఈ మసీదు ప్రతీకైతే, ఈ సంభల్ ప్రాంతం విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి వచ్చే ప్రదేశమని హిందువుల నమ్మిక. భిన్న విశ్వాసాల మధ్య సొంత లాభం చూసుకొనే కొందరి రాజకీయంతో సమస్య వచ్చి పడింది. నిజానికి, 1947 ఆగస్ట్ 15కి ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారమే అన్ని ప్రార్థనా ప్రదేశాలూ కొనసాగాలి. ఒక్క అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదమే దానికి మినహాయింపని దీర్ఘకాలం క్రితమే కేంద్ర సర్కార్ చేసిన 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం. అయోధ్య తరహాలో మరిన్ని సమస్యలు రాకూడదన్నది దాని ప్రధానోద్దేశం. ఏ ప్రార్థనా స్థలాన్నీ పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ ఒక మతవిశ్వాసం నుంచి మరోదానికి మార్పిడి చేయరాదనీ, చర్చ పెట్టరాదనీ చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టంగా నిషేధించింది. అయితే, ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపమేమిటో నిర్ధారించడం చట్టవిరుద్ధం కాదంటూ 2002 మేలో జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు సందు ఇచ్చాయి. అనేకచోట్ల చిన్న కోర్టులు మందిర– మసీదు వివాదాలపై విచారణ చేపట్టి, పర్యవసానాలు ఆలోచించకుండా హడావిడిగా సర్వేలకు ఆదేశిస్తున్నాయి. సంభల్ ఘటన తర్వాతా అజ్మీర్‌లోని ప్రసిద్ధ షరీఫ్ దర్గాను గుడిగా ప్రకటించాలంటూ దాఖలైన కేసును రాజస్థాన్ కోర్ట్ అనుమతించడం ఓ మచ్చుతునక. సమస్యల్ని తేల్చాల్సిన గౌరవ కోర్టులే ఇలా తేనెతుట్టెల్ని కదిలించడం విషాదం.ప్రార్థనాస్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీమ్‌లో ఇప్పటికే నాలుగు పిటిషన్లున్నాయి. దానిపై నిర్ణయానికి కేంద్రం, కోర్ట్ తాత్సారం చేస్తుంటే ఆ లోగా వారణాసి, మథుర, ధార్, సంభల్, తాజాగా అజ్మీర్... ఇలా అనేక చోట్ల అత్యుత్సాహం వ్యక్తమవుతోంది. ఇది శాంతి, సామరస్యాలకు పెను ప్రమాదం. ఈ ప్రయత్నాలను ఆపేందుకు సర్కారు కానీ, సర్వేలపై జోక్యానికి సుప్రీమ్ కానీ ముందుకు రాకపోవడం విడ్డూరం. ఒక వివాదాస్పద స్థలపు ధార్మిక స్వభావ అన్వేషణ చారిత్రక నిర్ధారణ, పురాతత్వ అన్వేషణతో ఆగుతుందనుకుంటే పొరపాటు. అది మత పరంగా, రాజకీయంగా రావణకాష్ఠమవుతుంది. కాశీ, మథురల్లో, ఇప్పుడు సంభల్ జరుగుతున్నది అదే. ‘ప్రతి మసీ దులో శివలింగాన్ని అన్వేషించాల్సిన పని లేద’ంటూ ఆరెస్సెస్ అధినేత రెండేళ్ళ క్రితం అన్నారు కానీ జరుగుతున్నది వేరు. అధికార వర్గాల అండదండలతోనే ఈ విభజన చిచ్చు రగులుతోందన్నదీ చేదు నిజం. 2019 నవంబర్‌లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించిన సుప్రీమ్ మరోసారి గట్టిగా ఆ పని చేయకుంటే కష్టమే. ఓ హిందీ కవి అన్నట్టు, మసీదులు పోనివ్వండి... మందిరాలు పోనివ్వండి... కానీ రక్తపాతం మాత్రం ఆపేయండి. మతాలకు అతీతంగా మనిషినీ, మానవత్వాన్నీ బతకనివ్వండి! -
దారుణ విద్వేష క్రీడ!
అయిదు నెలలుగా బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాకులపై అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న పెను సవాళ్ళకు తాజా ఉదాహరణ. మైనారిటీల హక్కుల కోసం బలంగా గళం విప్పే దాస్ బంగ్లాదేశీ జాతీయ పతాకాన్ని అవమానించారంటూ రాజద్రోహ నేరం మోపడం విడ్డూరం. ఆయనను మంగళవారం అరెస్ట్ చేసి, బెయిలివ్వకుండా, పది రోజుల కస్టడీకి పంపడంతో నిరసనలు చెలరేగాయి. సందట్లో సడేమియాగా దుష్టశక్తులు అల్లర్లు రేపి, పొరపాటున ఓ ముస్లిమ్ లాయర్ మరణానికి కారణమై, ఆ పాపం మైనా రిటీల నెత్తిన వేయడంతో ఢాకా మరోసారి భగ్గుమంది. ఆలయాలపై దాడులు, ప్రాణనష్టంతో... మైనారిటీలనూ, భావప్రకటనాస్వేచ్ఛనూ కాపాడాలంటూ బంగ్లాను భారత్ అభ్యర్థించాల్సొచ్చింది.ఇస్లామ్ అధికారిక మతమైనా, లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంగా, సమానత్వానికి రాజ్యాంగ బద్ధులమని చెప్పుకొనే బంగ్లా ఆ మాటకు తగ్గట్టు వ్యవహరించడం మానేసి, చాలాకాలమైంది.అందుకు తగ్గట్టే తాజాగా ‘ఇస్కాన్’ను ర్యాడికల్, మత ఛాందసవాద సంస్థ అని బంగ్లా అటార్నీ జనరల్ బుధవారం అభివర్ణించడం ఆందోళనకరం. ‘ఇస్కాన్’ను నిషేధించాలని బంగ్లా యోచిస్తు న్నట్టు వార్త. ఆధ్యాత్మిక చైతన్యం, పీడిత జన సముద్ధరణ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో పనిచేస్తున్న ఒక సంస్థపై అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడం అక్షరాలా బుద్ధిహీనతే. దేశంలోని విభిన్న వర్గాల మధ్య సౌహార్దం పెంపొందించి, బాధితులకు న్యాయం చేసి, మానవ హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏ శక్తుల ప్రోద్బలంతో ఇలా మాట్లాడుతోందన్నది ఆశ్చర్యకరం. జూలై నాటి ప్రజా ఉద్యమంతో ఢాకాలో ప్రభుత్వ మార్పు జరిగిపోయింది కానీ, అల్పసంఖ్యాక వర్గాలపై సాగుతున్న దాడులు మాత్రం అప్పటి నుంచి ఆగడం లేదు. మైనారిటీలను పూర్తిగా తరిమేసి, బంగ్లాను హిందూ రహిత దేశంగా మార్చాలనే పన్నాగం దీనికి వెనక ఉందని స్థానిక స్వతంత్ర విశ్లేషకుల మాట. ఈ అల్లర్లు, అల్పసంఖ్యాక హిందువులపై దాడుల వెనుక మత ఛాందస జమాతే ఇస్లామీ ఉందనేది స్పష్టం. హసీనా సర్కారు కాలంలో నిషేధానికి గురైన ఈ ర్యాడికల్ గ్రూపు, అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)లు యూనస్ యంత్రాంగంలో భాగమే. అసలు ఈ ప్రయత్నమంతా ఇస్లామిక్ షరియత్‌ను ప్రవేశపెట్టి, బంగ్లాదేశ్‌ను ప్రజాస్వామ్య ఎన్నికలు, పార్ల మెంట్‌తో పని లేని దేశంగా మార్చాలనే వ్యూహంలో భాగమని ఒక వాదన వినిపిస్తోంది. అదే గనక నిజమైతే, అత్యంత ప్రమాదకర పరిణామం. పౌరసమాజం, రాజకీయ నేతలు, ప్రజలు కలసి కట్టుగా అలాంటి వ్యూహాలను భగ్నం చేసి, కష్టించి సంపాదించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి. అసలు అఫ్ఘన్ లాగానే బంగ్లాను తమ ప్రయోగశాలగా చేసుకోవాలని పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్నట్టుంది. అప్పుడిక బంగ్లా మరో తీవ్రవాద కేంద్రంగా మారే ప్రమాదముంది. అది భారత్‌కే కాదు... యావత్ ప్రపంచానికి నష్టం. నిజానికి, ఆసియా – పసిఫిక్ కూటమిలో బంగ్లాను భాగం చేసుకొని, లబ్ధి పొందాలని అమెరికా భావించింది. నిరుటి హసీనా సర్కార్ నో చెప్పడంతో అది కుదరలేదు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలిచి ఉంటే ఏమో కానీ, ట్రంప్ గెలవడంతో బంగ్లా మధ్యంతర సర్కార్ సారథి – ట్రంప్ ద్వేషి ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ట్రంప్ పగ్గాలు చేపట్టాక బంగ్లాపై కఠినవైఖరి అవలంబిస్తారని యూనస్‌కు తెలుసు. అందుకే, ఆలోగా మైనారిటీలపై అల్లర్లను ఆఖరి అస్త్రంగా చేసుకున్నారట. బంగ్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణకు అయిదు దశాబ్దాల పైచిలుకు క్రితం భారత్ అండగా నిలిచింది. కానీ, ఇప్పుడు అదే గడ్డపై భారత వ్యతిరేకత, మైనారిటీలపై ద్వేషాలను స్వార్థపరులు పెంచిపోషించడం విషాదం. దాదాపు 14 ఏళ్ళ పైగా షేక్ హసీనా ఏలుబడిలో నియంత పోకడల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత సాగిందని ఆరోపణలొస్తే, కొత్త హయాం కూడా తక్కువేమీ తినలేదు. విజృంభిస్తున్న విద్వేషం, విధ్వంసం ఢాకాలో పత్రికా స్వాతంత్య్రానికి సైతం ముప్పుగా మారాయి. ‘ప్రథమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’లాంటి స్వతంత్ర పత్రికా రచనకు పేరుపడ్డ పత్రికలపై దాడులు అందుకు ఓ మచ్చుతునక. బాధితు లకు సత్వర న్యాయం కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్ళ ఏర్పాటు సహా మైనారిటీల కనీసపాటి ఆకాంక్షల్ని నెరవేర్చడానికి బంగ్లా సర్కార్‌కు ఉన్న కష్టమేమిటి? హసీనా సర్కార్‌ను గద్దె దింపినప్పటి నుంచి ఇప్పటికి బంగ్లాలో మైనారిటీలపై 2 వేలకు పైగా దాడులు జరిగాయి. హిందూ, బౌద్ధ, క్రైస్తవ సోదరులపై జరుగుతున్న ఈ దౌర్జన్యకాండను మతపరంగా కాక మానవ హక్కుల పరంగా చూడాలి. అప్పుడే సమస్య తీవ్రత అర్థమవుతుంది. 1930లో బంగ్లాలో 30 శాతం పైగా ఉన్న హిందువులు ఇప్పుడు కేవలం 8 శాతం చిల్లరకు పడిపోయారన్న నిష్ఠుర సత్యం అక్కడ జరుగుతున్నదేమిటో ఎరుకపరుస్తుంది. విద్యుత్ సహా, బియ్యం, పత్తి, చమురు లాంటి అనేక సరుకుల విషయంలోనూ మనపై భారీగా ఆధారపడ్డ బంగ్లా సర్కార్‌పై ఇకనైనా భారత్ కఠినవైఖరిని అవలంబించాలి. పొరుగు దేశంలో బతుకు భయంలో ఉన్న హిందువులను కాపాడేందుకు క్రియాశీలంగా వ్యవహరించాలి. కేవలం మాటలకు పరిమితం కాకుండా, దౌత్య, వాణిజ్య రంగాల్లో చేయగలిగినదంతా చేయాలి. పేరుకు మాత్రం లౌకికవాదం ముసుగు వేసుకొని, మైనారిటీలకు వ్యతిరేకంగా, తెర వెనుక శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మిగిలిన అసమర్థ యూనస్ సర్కార్‌పై అంతర్జాతీయంగానూ ఒత్తిడి తేవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. -
ఎన్నికల మహా పాఠం
తాజా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి ఒకటి, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి మరొకటితో... పైకి వన్ ఆల్ అనిపించాయి. రెండు చోట్లా గద్దె మీద ఉన్న పార్టీలే అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. రెండు విజయాల్లోనూ కొన్ని పోలికలున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు మునుపటి కన్నా పెద్ద మెజారిటీతో విజయం సాధించాయి. అనేక కారణాలు విజయాన్ని ప్రభావితం చేసినా, ప్రధానంగా సంక్షేమ పథకాలు కీలక భూమిక పోషించాయి. మరీ ముఖ్యంగా, మహిళలకు నగదు బదలీ పథకం గేమ్ ఛేంజరైనట్టు విశ్లేషణ. మహారాష్ట్రలో మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తూ ఏక్నాథ్ శిందే తెచ్చిన ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’, జార్ఖండ్‌లో అర్హులైన స్త్రీలకు నెలవారీగా వెయ్యి రూపాయల హేమంత్ సోరెన్ సర్కార్ ‘ముఖ్య మంత్రి మయ్యా సమ్మాన్ యోజన’ వారిని విజయతీరాలకు చేర్చాయి. మరిన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు రావడం ఖాయమని తేల్చేశాయి. భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే కావచ్చు. కానీ, మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి సాధించిన మహా విజయం, ప్రతిపక్ష మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి మూటగట్టు కున్న ఘోర పరాజయం మాత్రం ఆశ్చర్యపరుస్తాయి. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత దాదాపు 9.5 లక్షల ఓట్లు పెరిగాయంటూ వస్తున్న ఆరోపణల మాట ఎలా ఉన్నా, 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్కుకు కేవలం 13 తక్కువగా 132 స్థానాలు బీజేపీ గెలవడం విశేషం. కేవలం అయిదు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 9 మాత్రమే గెల్చిన బీజేపీ, ఆ ప్రాతిపదికన ఇప్పుడు కేవలం 83 సీట్లే గెలవాలి. కానీ, అప్పటి లెక్క కన్నా మరో 49 స్థానాలు అదనంగా తన ఖాతాలో వేసుకోగలిగింది. అంటే, జూన్ నాటి ఎదురు దెబ్బల నుంచి బీజేపీ మళ్ళీ పూర్తిస్థాయిలో పుంజుకుంటే, అప్పట్లో దక్కిన కొద్దిపాటి ఉత్సాహం, ఊపును కాంగ్రెస్ చేజార్చుకుంది. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్‌లు 75 స్థానాల్లో ముఖాముఖి పోరుకు దిగితే, హస్తానికి పట్టుమని 10 దక్కడం గమనార్హం. ఇది నిర్ద్వంద్వంగా స్వయంకృతం. కాంగ్రెస్ తప్పిదాలకు కొదవ లేదు. మరాఠీ భాషే తెలియని పెద్దలను పార్టీ పరిశీలకులుగా పంపిన ఘనత ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీది. పరిశీలకులుగానే కాదు... ప్రచారకులుగానూ బయటి జనాభాయే. వచ్చేది హంగ్ అసెంబ్లీ అంటూ పార్టీ అధిష్ఠానానికి వర్తమానం పంపి, ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయించారంటే క్షేత్రస్థాయి వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘బటేంగే తో కటేంగే’, ‘ఏక్ హై తో సేఫ్ హై’ లాంటి నినాదాలతో జనంలో భయాన్నీ, అభద్రతనూ పెంచుతూ మహాయుతి కూటమి ప్రచారం హోరెత్తిస్తే, సరైన ప్రచార కథనాన్ని ఎంచుకోవడంలో మహావికాస్ ఆఘాడీ కూటమిలోని మూడు ప్రతిపక్షాలూ విఫలమయ్యాయి. దాదాపు 40 పైచిలుకు స్థానాల్లో ముస్లిమ్‌ల మద్దతు కోసం చూసుకొని, మెజారిటీ వర్గాలు బీజేపీ వైపు మొగ్గేలా చేశాయి. అలాగే, ‘ఇండియా’ కూటమి ప్రధాన పక్షాలు ఇతర పార్టీలను కలుపుకొని పోవడంలో, కనీసం నియంత్రించడంలో విఫలమయ్యాయి. అలా దాదాపు 17 శాతం ఓట్ షేర్ వచ్చిన ‘ఇతరులు’ కూటమి అవకాశాల్ని దెబ్బ తీశారు.2023 నవంబర్ – డిసెంబర్లలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఓటమికి కారణాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ వేసుకున్న అంతర్గత కమిటీలు ఇప్పటికీ తమ నివేదికలు ఇవ్వనేలేదు. ఆ పార్టీలో జవాబుదారీతనం లేకపోవడానికి ఇది ఓ మచ్చుతునక. దూరదృష్టి లేకపోవ డంతో పాటు ఉదాసీనత కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలను పట్టి పడిస్తోంది. ప్రతిపక్షాలకు భిన్నంగా బీజేపీ పటిష్ఠమైన వ్యూహంతో ముందుకు వెళ్ళింది. ఆరెస్సెస్ శతవసంత వత్సరంలో అడుగిడిన వేళ మహారాష్ట్రలో కాషాయ విజయాన్ని కానుకగా అందించాలన్న సంకల్పం సైతం సంఘ్ కార్యకర్తలను లక్ష్యసాధనకు పురిగొల్పింది. పోలింగ్ బూత్ స్థాయి దాకా వెళ్ళి వారు శ్రమించడం ఫలితమిచ్చింది. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పరిమితంగా ప్రచారం చేస్తే, ‘చొరబాటు దారుల’ బూచితో బీజేపీ భయపెట్టిన జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పన దాదాపు 100 ర్యాలీలలో పాల్గొని విజయసాధనకు శ్రమించాల్సిన విధానం ఏమిటో చూపెట్టారు. ఇటీవల జమ్ము – కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, ఇప్పుడు జార్ఖండ్‌లో జేఎంఎం భుజాల మీద ఎక్కి, హస్తం విజయకూటమిలో నిలిచింది కానీ, వ్యక్తిగతంగా అది సాధించిన సీట్లు స్వల్పమే. ఈ ఫలితాలు ఆత్మపరిశీలన తప్పనిసరి అని కాంగ్రెస్‌కు పదే పదే బోధిస్తున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ, అధికార బీజేపీ ఆశ్రిత పక్షపాతం లాంటి పాత పాటకు పరిమితం కాకుండా కొత్త పల్లవి అందుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. విజేతగా నిలిచిన బీజేపీ, ముఖ్యంగా మోదీ ఇప్పటికే స్వరం పెంచి, ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు. మోదీ, షాలు మళ్ళీ పట్టు బిగించారు. ఇదే ఊపులో కమలనాథులు ఉమ్మడి పౌరస్మృతి, ఒక దేశం... ఒకే ఎన్నిక, వక్ఫ్ బిల్లు వగైరాలపై వేగం పెంచవచ్చు. బీమా రంగంలో పూర్తి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లాంటి విపరీత సంస్కరణలకూ గేట్లెత్తే అవకాశం ఉంది. మహారాష్ట్ర పీఠమెక్కే కొత్త దేవేంద్రులకూ చాలా బాధ్యతలున్నాయి. దేశానికి ఆర్థిక కేంద్రంగా, స్థూలజాతీయోత్పత్తిలో దాదాపు 14 శాతం అందించే మహారాష్ట్రలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడాలి. అవినీతి, నిరుద్యోగం, రైతాంగ సమస్యల లాంటివి ఎన్నికల ప్రచారంలో వెనుకపట్టు పట్టినా, ఇకనైనా ఆ కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. వెరసి, మహా ఫలితాల దరిమిలా అధికార, ప్రతిపక్షాలు అందరికీ చేతి నిండా పని ఉంది. -
మీ చేతి ఉన్నివస్త్రం
‘తపాలా బండి గంటల చప్పుడుకు ఏ పడుచు పిల్లయినా నిద్ర లేచినా మళ్లీ అటు తిరిగి పడుకుని తియ్యటి కలలు కంటుంది’ అని ఉంటుంది చెహోవ్ రాసిన ‘ఒక చలి రాత్రి’ కథలో! ఊహించండి. దట్టమైన చలికాలం. రాత్రి మూడు గంటల సమయం. ఏ వెధవ ప్రాణమైనా ముడుక్కుని పడుకుని కాసింత సుఖాన్ని అనుభవించే వేళ. ఒడలు మరిచే వేళ. వెచ్చదనమూ భోగమే అని భావించే వేళ. పొట్టకూటి కోసం, రోజూ చేయాల్సిన పని కోసం తపాలా మూటలను బగ్గీలో వేసుకుని స్టేషనుకు చేర్చక తప్పని మెయిల్మేన్ మనసులో ఎలా ఉంటుంది? నిశ్శబ్దాన్ని కప్పుకొని గాఢ సుషుప్తిలో ఉన్న ఊరి వీధుల గుండా అతడొక్కడే చలికి వణుకుతూ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో వెళుతూ ఉంటే అతడి అంతరంగ జగాన ఏముంటుందో ఆ సమయాన ఇళ్లల్లోని గదుల్లో రగ్గుల చాటున శయనిస్తున్న మనుషులకు తెలుస్తుందా?శ్రీమంతులు కూడా భలే వాళ్లులే! చలి రాత్రుళ్లలో వారికి మజాలు చేయాలనిపిస్తుంది. అతిథులను పిలవాలనిపిస్తుంది. పార్టీలూ గీర్టీలూ. పనివాళ్లను తొందరగా ఇళ్లకు పోండి అంటారా ఏమి? లేటు అవర్సు వరకూ పని చేయాల్సిందే! బయట చలి ఉంటుంది. పాకల్లో పసిపిల్లలు ‘కప్పుకోవడానికి ఇవాళైనా దుప్పటి కొనుక్కుని రా నాన్నా’ అని కోరడం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒంటి మీదున్న ఈ కనాకష్టం బట్టలతో ఇంతరాత్రి చలిలో ఇంటికి ఎలా చేరాలనే భీతి ఉంటుంది. వెచ్చటి ద్రవాలు గొంతులో ఒంపుకునే శ్రీమంతులు ‘ఒరే... ఆ రగ్గు పట్టుకుపో’ అంటారా? ‘ఈ పాత స్వెటరు నీ కొడుక్కు తొడుగు’ అని దయతో పారేస్తారా? ఆ సోయి ఉంటే కొందరు ఎప్పటికీ శ్రీమంతులు కాలేరు. పాపం పనివాడు రంగడు పార్టీలో యజమాని ఉండగా ఆ అర్ధరాత్రి రగ్గు దొంగిలిస్తాడు. పేదవాణ్ణి దొంగను చేసింది లోపలి పెద్దమనిషా... బయటి చలా? డి.వెంకట్రామయ్య ‘చలి’ కథ ఇది.దర్శకుడు బి.నరసింగరావు కథలు కూడా రాశారు. ‘చలి’ అనే కథ. నగరానికి వచ్చిన వెంటనే మొగుడు పారిపోతే ఆ వలస కూలీ చంకన బిడ్డతో వీధుల్లో తిరుగుతూ చలిరాత్రి ఎక్కడ తల దాచుకోవాలా అని అంగలారుస్తుంటుంది. అక్కడ నిలబడితే ఎవరో కసురుతారు. ఇక్కడ నిలబడితే ఎవరో తరుముతారు. నోరూ వాయి లేని చెట్టు ‘పిచ్చిదానా... నిలుచుంటే నిలుచో. నీకేం వెచ్చదనం ఇవ్వలేను’ అని చిన్నబోతూ చూస్తుంది. చెట్టు కింద తల్లీబిడ్డా వణుకుతుంటారు. చలి. చెట్టు కింద తల్లీ బిడ్డా కొంకర్లు పోతూ ఉంటారు. శీతలం. చెట్టు సమీపంలోని చాటు అటుగా వచ్చి ఆగిన కారులోని యువతీ యువకులకు మంచి ఏకాంతం కల్పిస్తుంది. బయట చలి మరి. ఒకే తావు. చెట్టు కింద చావుకు దగ్గరపడుతూ తల్లీబిడ్డ. అదే తావులో ఏమీ పట్టని వెచ్చని సరస సల్లాపం. చలి ఒకటే! బహు అర్థాల మానవులు.శతకోటి బీదలకు అనంతకోటి ఉపాయాలు. పేదవాడు బతకాలంటే నోరు పెంచాలి. లేదా కండ పెంచాలి. కండ పెంచిన మల్లయ్య రైల్వేస్టేషన్ దగ్గర సగం కట్టి వదిలేసిన ఇంటి వసారాను ఆక్రమించుకుంటాడు. తక్కిన కాలాల్లో దాని వల్ల లాభం లేదు. చలికాలం వస్తే మాత్రం రాత్రిళ్లు తల దాచుకోవడానికి అలగా జనాలు ఆ వసారా దగ్గరికి వస్తారు. తలకు ఒక్కరూపాయి ఇస్తే వెచ్చగా పడుకునేందుకు చోటు. కొందరి దగ్గర ఆ రూపాయి కూడా ఉండదు. దీనులు. పేదవాడు మల్లయ్య దయ తలుస్తాడా? తరిమి కొడతాడు. లేచిన ప్రతి ఆకాశహర్మ్యం నా ప్రమేయం ఏముందని నంగనాచి ముఖం పెట్టొచ్చుగాని అది ఎవడో ఒక పేదవాడిలో మంచిని చంపి రాక్షసత్వం నింపుతుంది. వి. రాజా రామమోహనరావు ‘చలి వ్యాపారం’ కథ ఇది.చలిరాత్రి ఎప్పటికీ అయిపోదు. అది పేదవాళ్లకు తామెంత నగ్నంగా జీవిస్తున్నారో గుర్తు చేయడానికే వస్తుంది. చలికి వణికే కన్నబిడ్డల్ని చూపి బాధ పెట్టడానికే వస్తుంది. మనందరం మధ్యతరగతి వాళ్లమే. ఇంటి పనిమనిషిని అడుగుదామా ‘అమ్మా... నీ ఇంట ఒక గొంగళన్నా ఉందా... పిల్లలకు ఉన్ని వస్త్రమైనా ఉందా?’.... ‘చలికి వ్యక్తి మృతి’ అని వార్త. మనిషి చలికి ఎందుకు చనిపోతాడు? ప్రభుత్వం అతనికి ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోతే, ఇల్లు ఏర్పాటు చేసుకునేంత ఉపాధి చూపకపోతే, నీ దిక్కులేని బతుకును ఇక్కడ వెళ్లదీయమని వింటర్ షెల్టరైనా చూపకపోతే, తన నిర్లక్ష్యాన్ని తోడు చేసుకుని చలి హత్యలు చేయగలదని గ్రహించకపోతే అప్పుడు ఆ వ్యక్తి ‘చలికి చనిపోయిన వ్యక్తి’గా వార్తలో తేలుతాడు. విలియమ్ సారోయాన్ అనే రచయిత రాస్తాడు– చలి నుంచి కాపాడటానికి కనీసం శవాల మీదున్న వస్త్రాలనైనా తీసివ్వండ్రా అని! అతని కథలో ఒక యువకుడు ఆకలికి తాళలేక ఓవర్‌కోట్ అమ్మి చలితో చచ్చిపోతాడు.పగిలిన గాజుపెంకుతో కోసినట్టుగా ఉంటుందట చలి. అదంత తీవ్రంగా ఉండేది మను షుల్లో నిర్దయను పెంచడానికా? కాదు! దయను పదింతలు చేయడానికి! పాతదుప్పట్లో, పిల్లలు వాడక వదిలేసిన స్వెటర్లో, నాలుగు కంబళ్లు కొనేంత డబ్బు లేకపోలేదులే అని కొత్తవి కొనో వాటిని స్కూటర్లో, కారులో పడేసి ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి వస్తే ఎలా ఉంటుందో ఈ చలికాలంలో చూడొద్దా? ఉబ్బెత్తు బ్రాండెడ్ బొంతలో నిద్రపోయే వేళ మన చేతి ఉన్నివస్త్రంతో ఒక్కరైనా నిద్ర పోతున్నారన్న భావన పొందవద్దా? అదిగో... అర్థమైందిలే... మీరు అందుకేగా లేచారు! -
బైడెన్ తప్పుడు నిర్ణయం
అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రత్యర్థికి అధికారం అప్పగించటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలోపడిన నేతను అమెరికా జనం ‘లేమ్ డక్ ప్రెసిడెంట్’ అంటారు. అధ్యక్షుడు జో బైడెన్ అంతకన్నా తక్కువ. ఎందుకంటే ఆయన కనీసం పోటీలో కూడా లేరు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతుండగా అందరూ బలవంతంగా ఆయన్ను తప్పించి కమలా హారిస్‌ను బరిలో నిలిపారు. ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇక అధికారం బదలాయింపు లాంఛనాలు తప్ప బైడెన్ చేయగలిగేదీ, చేసేదీ ఏమీ ఉండదు. కానీ ఆయన తగుదనమ్మా అంటూ ఉక్రెయిన్‌కు ఏడాదిన్నర క్రితం ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగించటానికి అనుమతినిచ్చారు. దాంతోపాటు తాము సరఫరా చేసిన ప్రమాదకరమైన మందుపాతరలను కూడా వాడుకోవచ్చని ఉక్రెయిన్‌కు తెలిపారు. యుద్ధం మొదలై వేయిరోజులైన సందర్భంగా అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ప్రయోగించి రష్యా భూభాగంలోని బ్రిన్స్క్ ప్రాంతంలోని కరచెవ్ భారీ ఆయుధ గిడ్డంగిని ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా అణ్వాయుధ వినియోగం ముసాయిదాను సవరించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పర్యవసానంగా ప్రపంచం అణ్వస్త్ర యుద్ధం అంచులకు చేరింది. యుద్ధం మొదలయ్యాక కేవలం కొన్ని రోజుల్లో... మహా అయితే కొన్ని నెలల్లో రష్యా పాదాక్రాంతం కావటం ఖాయమన్న తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్ను యుద్ధరంగంలోకి నెట్టింది అమెరికాయే. 2014లో పుతిన్ క్రిమియాను స్వాధీనం చేసుకున్నాక వరసగా ఎనిమిదేళ్లపాటు జరిగిన ఘర్షణలు నివారించటానికి 2022లో వాటి మధ్య శాంతి ఒప్పందం ముసాయిదాను అమెరికా, బ్రిటన్లే రూపొందించాయి. చిత్రమేమంటే, ఆ ఒప్పందాన్ని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కూడా ఆమోదించాయి. ప్రాథమిక అవగాహన పత్రంపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. కానీ ఆఖరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మనసు మార్చు కున్నారు. ఆ రెండు దేశాల సాయంతో అక్రమంగా అధికారంలోకొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వారి ఒత్తిడికి లొంగి ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలగారు. ఆ తర్వాతే రష్యా దురాక్రమణ యుద్ధా నికి దిగింది. అసలు రెండు నెలల క్రితం నాటి స్థితికీ, ఇప్పటికీ వచ్చిన మార్పేమిటో, ఎందుకు మూడో ప్రపంచయుద్ధం ముప్పు తీసుకొచ్చారో బైడెన్ చెప్పాలి. తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు స్టార్మ్ షాడోలను రష్యాపై ప్రయోగించటానికి బ్రిటన్ నిరుడు అనుమతించినప్పుడు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ బైడెన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. దీన్ని ఆపనట్టయితే ఇది నాటో–రష్యా యుద్ధంగా పరిణమిస్తుందని వివరించింది. దాంతో బైడెన్‌కు తత్వం బోధపడి బ్రిటన్ను వారించారు. అంతక్రితం 2022 మార్చిలో రష్యా గగనతలంపై ‘నో ఫ్లైజోన్’ విధించటానికి తమ మిగ్–29 యుద్ధ విమానాలను వాడుకోవచ్చని విదేశాంగమంత్రి బ్లింకెన్ పోలెండ్‌ను అనుమతించినప్పుడు అమెరికా ప్రతినిధుల సభంతా ఏకమై పెంటగాన్ అభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారించారు. దాంతో బైడెన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ‘నో ఫ్లైజోన్’ విధించటమంటే మూడో ప్రపంచయుద్ధానికి అంకురార్పణ చేసినట్టేనని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడేమైంది? తన పార్టీ చిత్తుగా ఓడి, కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో పడినప్పుడు అనుమతినీయటం అనైతికం, బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు... నేరం కూడా. ఒకపక్క జనవరిలో అధ్యక్షుడిగా రానున్న డోనాల్డ్ ట్రంప్ తన మొదటి కర్తవ్యం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆపటమేనని ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా ఇలాంటి పనే రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ 1992లో చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలై ఇక 11 నెలల్లో దిగిపోతాననగా సోమాలియా దురాక్రమణకు ఆయన ఆదేశాలిచ్చారు. దాంతో కొత్తగా అధికారంలోకొచ్చిన క్లింటన్ అన్నీ వదిలిపెట్టి దానిపైనే చాన్నాళ్లు దృష్టి సారించాల్సి వచ్చింది. బైడెన్‌కు సైతం కేవలం 11 వారాలే గడువుంది. కనీసం నిర్ణయం తీసుకునేముందు సెనేట్ను సమావేశపరిచి సలహా తీసుకోవాలన్న ఇంగితం కూడా లేకపోయింది. ఈ నిర్ణయాన్ని పెంటగాన్ సీనియర్ అధికారులు వ్యతిరేకించారంటున్నారు.నిజానికి క్షిపణుల్ని వినియోగించే సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం ఉక్రెయిన్‌కు లేవు. అమెరికా నిఘా ఉపగ్రహాలు నిర్దిష్ట సమాచారం ఇస్తేనే, దాని ఆధారంగా అమెరికా సైనికాధికారులు రష్యా ఆయుధ గిడ్డంగిని ధ్వంసం చేశారని సాధారణ పరిశీలకులకు సైతం సులభంగా తెలుస్తుంది. రష్యా గ్రహించదనుకోవటం, పాపభారమంతా ఉక్రెయిన్‌పైనే పడుతుందనుకోవటం తెలివితక్కువతనం. మందుపాతరల వినియోగాన్ని పూర్తిగా ఆపేస్తామని ఐక్యరాజ్యసమితిలోని 161 దేశాలు కుదుర్చుకున్న ఓస్లో ఒడంబడికను అమెరికా, రష్యాలు కాదన్నాయి. ఆ ఒడంబడికకు కారణమైన మందు పాతరల నిరోధ ప్రచార సంస్థకూ, దాని అధ్యక్షుడు జోడీ విలియమ్స్కూ 1997లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. మందుపాతరలివ్వాలన్న బైడెన్ తాజా నిర్వాకంవల్ల ఆ ఒడంబడికపై సంతకం చేసిన ఉక్రెయిన్ అపరాధిగా మారినట్టయింది. మందుపాతరల వల్ల కీయూవ్లోకి చొచ్చుకొస్తున్న రష్యా బలగాల వేగాన్ని కొంతవరకూ నిరోధించవచ్చు. కానీ ఆపటం అసాధ్యం. యుద్ధం పూర్త య్యాక సాధారణ పౌరులు వందలమంది ఏదో ఒక ప్రాంతంలో నిత్యం మందుపాతరలకు బలయ్యే ప్రమాదం ఉంటుంది. బైడెన్ తప్పుడు నిర్ణయాన్ని వెంటనే సరిదిద్దకపోతే ప్రపంచ ప్రజలముందు అమెరికా దోషిగా నిలబడాల్సివస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోరాదని అక్కడి ప్రజానీకం తెలుసు కోవాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. -
ముందుకు కదలని ముచ్చట
మరో ఏడాది గడిచింది. మరో జీ20 సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల పెద్దలు కలిశారన్న మాటే కానీ, ఏం ఒరిగింది? బ్రెజిల్లో రెండు రోజులు జరిగిన సదస్సు తర్వాత వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ 20 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల కూటమి ఓ సమష్టి తీర్మానం చేసింది కానీ, తీర్మానంలోని భాషపై అర్జెంటీనా అభ్యంతరాలతో ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. ఆకలిపై పోరాటానికి ఒప్పందం, ప్రపంచంలో అత్యంత సంపన్నులపై పన్ను లాంటి అంశాలపై సదస్సులో మాటలు సాగాయి. కానీ, ఉక్రెయిన్‌లో, మధ్యప్రాచ్యంలో... జరుగుతున్న ప్రధాన యుద్ధాల క్రీనీడలు సదస్సుపై పరుచుకున్నాయి. చివరకు సదస్సు చివర జరపాల్సిన విలేఖరుల సమావేశాన్ని సైతం బ్రెజిల్ దేశాధ్యక్షుడు ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. రష్యాపై ఉక్రెయిన్ క్షిపణి దాడులు, పరిమిత అణ్వస్త్ర వినియోగానికి మాస్కో సన్నద్ధతతో ఉద్రిక్తతలు పెరిగినా అమెరికా అధ్యక్షుడు ఏమీ మాట్లాడకుండానే పయనమయ్యారు. వెరసి, అధికారులు అంటున్నట్టు ఈ ‘జీ20 సదస్సు చరిత్రలో నిలిచిపోతుంది’ కానీ, గొప్పగా చెప్పుకోవడానికేమీ లేనిదిగానే నిలిచిపోతుంది. మాటలు కోటలు దాటినా, చేతలు గడప దాటడం లేదనడానికి తాజా జీ20 సదస్సు మరో ఉదాహరణ. నిజానికి, పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణ, నిధులు అనేవి ఈ సదస్సుకు కేంద్ర బిందువులు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, పరస్పర సహకార ప్రయత్నాలకు కట్టుబడినట్టు సదస్సు పేర్కొంది. కానీ, శిలాజ ఇంధనాల వినియోగం నుంచి క్రమంగా పక్కకు మరలేందుకు స్పష్టమైన ప్రణాళికలేమీ చేయలేకపోయింది. పర్యావరణ పరిరక్షణ నిధులకు సంబంధించీ పురోగతి లేకుండానే ఈ జీ20 ముగిసింది. ప్రపంచ దేశాల నేతలు కృత నిశ్చయాన్ని ప్రకటిస్తూ, బలమైన సూచన ఏదో చేస్తారని ‘కాప్–29’ ఆశించినా, అలాంటిదేమీ జరగనేలేదు. కాకపోతే, ‘జీ20’ సదస్సు తుది తీర్మానంలో నిర్దిష్టమైన ఆర్థిక వాగ్దానాలేమీ లేనప్పటికీ, మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంకుల సంస్కరణలపై దృష్టి పెట్టినందున అది పరోక్షంగా పర్యావరణ నిధులకు ఉపకరిస్తుందని కొందరు నిపుణుల మాట. కాగా, ప్రపంచం నుంచి దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ జీ20 దేశాలు వచ్చే అయిదేళ్ళను కాలవ్యవధిగా పెట్టుకోవడం సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకపోయినా, సత్సంకల్పమని సంతోషించాలి. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం వాషింగ్టన్లో జరిగిన జీ20 నేతల తొలి సమావేశానికి హాజరయ్యానని గుర్తు చేసుకుంటూ, పదహారేళ్ళ తర్వాత ఇప్పటికీ ప్రపంచం ఘోరమైన పరిస్థితిలో ఉందని బ్రెజిల్ అధ్యక్షుడన్న మాట నిష్ఠురసత్యం. ఆకలి, దారిద్య్రం ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. దీనికి తప్పుడు రాజకీయ నిర్ణయాలే కారణమన్న ఆయన మాట సరైనదే. ఆకలి, దారిద్య్రంపై పోరాటానికి ప్రపంచ కూటమి స్థాపన మంచి ఆలోచనే. కానీ, ఇన్నేళ్ళుగా ఇలాంటివెన్నో సంకల్పాలు చేసుకున్నా, ఎందుకు నిర్వీర్యమయ్యాయన్నది ఆలోచించాల్సిన అంశం. పేరుకు కూటమి అయినా జీ20లోని సభ్య దేశాల మధ్య యుద్ధాలు సహా అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్నా యన్నది సదస్సు ఆరంభం కాక ముందు నుంచీ తెలిసినదే. అందుకే, ఈ సదస్సును అతిగా అంచనా వేస్తే ఆశాభంగమే. కొన్ని విజయాలున్నా అధిక శాతం అంతర్జాతీయ శక్తుల మధ్య విభేదాలే సదస్సులో బయటపడ్డాయి. ఏ దేశాల పేర్లూ ఎత్తకుండా శాంతి సూక్తులకే జీ20 పరిమితమైంది. సమష్టి లక్ష్యం కోసం పలుదేశాలు కలసి కూటములుగా ఏర్పడుతున్నా, అవి చక్రబంధంలో చిక్కుకొని అడుగు ముందుకేయలేని పరిస్థితి ఉందని అర్థమవుతోంది. ఇటీవలి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు ‘కాప్29’, ఇరవై ఒక్క ఆసియా – పసిఫిక్ దేశ ఆర్థిక వ్యవస్థల వేదిక ‘ఆసియా – పసిఫిక్ ఆర్థిక సహకార మండలి’, జీ20ల్లో ఎదురైన ప్రతిష్టంభనలే అందుకు తార్కాణం. అవి ఇప్పుడు సమష్టి సవాళ్ళను పరిష్కరించే వేదికలుగా లేవు. వ్యాపార సంరక్షణవాద విధానాలు, భౌగోళిక – రాజకీయ శత్రుత్వాల యుద్ధభూములుగా మారిపోయాయి. ఈ వైఫల్యం వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు అశనిపాతం. అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటివి స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం నుంచి పక్కకు జరిగాయి. ఫలితంగా తక్కువ కూలీ ఖర్చు, సరళమైన పర్యావరణ ప్రమా ణాలున్న వర్ధమాన దేశాలకు మునుపటి సానుకూలత ఇప్పుడు లేదు. పారిశ్రామికీకరణ వేళ సరళ తర నిబంధనలతో లబ్ధి పొందిన పెద్ద దేశాలు, తీరా ఇప్పుడలాంటి ఆర్థిక అవకాశాలేమీ లేకుండానే వర్ధమాన దేశాలను సుస్థిరాభివృద్ధి వైపు నడవాలని కోరడం అన్యాయమే. ప్రపంచాన్ని పీడిస్తున్న అంశాలపై దృష్టి సారించడంలో జీ20 విఫలమవడం విషాదం. పర్యావరణ సంక్షోభం, దారిద్య్రం, ఉత్పాతాల లాంటి అనేక సవాళ్ళు కళ్ళెదుటే ఉన్నా, వాటి పరిష్కారం బదులు రష్యా, చైనాలను ఏకాకుల్ని చేయాలన్నదే జీ7 దేశాల తాపత్రయం కావడమూ తంటా. భౌగోళిక – రాజకీయ వివాదాలు అజెండాను నిర్దేశించడంతో జీ20 ప్రాసంగికతను కోల్పోతోంది. సమాన అవకాశాలు కల్పించేలా కనిపిస్తున్న బ్రిక్స్ లాంటి ప్రత్యామ్నాయ వేదికల వైపు పలు దేశాలు మొగ్గుతున్నది అందుకే. జీ20 లాంటి బహుళ దేశాల వ్యవస్థల కార్యాచరణను ఇతరేతర అంశాలు కమ్మివేస్తే అసలు లక్ష్యానికే చేటు. పరస్పర భిన్నాభిప్రాయాల్ని గౌరవిస్తూనే దేశాలు సద్భావంతో నిర్మాణాత్మక చర్చలు జరిపితే మేలు. ఏ కూటమైనా శక్తిమంతులైన కొందరి వేదికగా కాక, అంద రిదిగా నిలవాలి. పశ్చిమదేశాలు ఆ సంగతి గ్రహిస్తేనే, జీ20 లాంటి వాటికి విలువ. విశ్వ మాన వాళికి ప్రయోజనం. వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరిగేనాటికైనా జీ20 వైఖరి మారుతుందా? -
విషతుల్య రాజధాని
భారత రాజధాని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతి శీతకాలంలానే ఈ ఏడాదీ పాత కథ పునరావృత్తం అయింది. ఒకపక్క పెరిగిన చలికి తోడు ధూళి నిండిన పొగ లాంటి గాలి, కాలుష్య ఉద్గారాలు, పొరుగున ఉన్న పంజాబ్ – హర్యానా లాంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో అక్రమంగా సాగుతున్న కొయ్యకాళ్ళ దహనం... అన్నీ కలిసి అతి తీవ్ర వాయు కాలుష్యంగా పరిణమించాయి. వారంగా అదే పరిస్థితి కొనసాగుతూ ఉండడం, వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) సోమవారం గరిష్ఠంగా దాదాపు 500 మార్కును చేరడంతో సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్కూల్ పిల్లలకు భౌతికంగా తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. చివరకు బాకూలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు సైతం ఈ కాలుష్యాన్ని ఆందోళనకరంగా పరిగణించడం, నిపుణులు దీన్ని ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు తార్కాణం. ఢిల్లీలో సోమవారంæ కాలుష్య స్థాయి దీపావళి నాటి రాత్రి కన్నా దాదాపు 40 శాతం ఎక్కువంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి... భారతీయ ప్రమాణాల కన్నా 14 రెట్లు ఎక్కువ, అదే ఐరాస పర్యావరణ పరిరక్షక సంస్థ (యూఎస్‌ఈపీఏ) నిర్దేశించిన ప్రమాణాల లెక్కలో అయితే 55 రెట్లు ఎక్కువ నమోదైంది. వాయు నాణ్యత ఇంతలా క్షీణించడం పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి ప్రమాదంగా పరిణమిస్తోంది. పీఎం 10 స్థాయిని బట్టి అంచనా వేసే ధూళి కాలుష్యమూ హెచ్చింది. ఆగ్రాలో కళ్ళు పొడుచుకున్నా కనిపించని దట్టమైన పొగ. తాజ్‌మహల్ కట్టడం విషవాయు కౌగిలిలో చేరి, దూరం నుంచి చూపరులకు కనిపించడం మానేసి వారమవుతోంది. మాస్కులు లేకుండా వీధుల్లోకి రాలేని పరిస్థితి. వెరసి, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమనే దుష్కీర్తి ఢిల్లీకి దక్కింది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ తేల్చిన ఈ నిష్ఠురసత్యం ఇన్నేళ్ళ మన బాధ్యతా రాహిత్యానికీ, పాలకుల నిష్క్రియాపరత్వానికీ నిదర్శనం. ఆ మాటకొస్తే, 2018లో కానీ, గడచిన 2023లో కానీ ఏడాదిలో ఏ ఒక్కరోజూ ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి లేదని రికార్డులు చెబుతున్నాయంటే ఏమనాలి? కాలుష్యం దేశవ్యాప్తంగా ఉందనీ, నివారణ బాధ్యత రాష్ట్రానిదే కాదు కేంద్రానిది కూడా అని ఢిల్లీ ‘ఆప్’ సర్కార్ వాదన. కానీ, ఏటేటా శీతకాలంలో రాజధానిలో పెరుగుతూ పోతున్న ఈ కష్టానికి చెక్ పెట్టడంలో పాలకులు ఎందుకు విఫలమయ్యారంటే జవాబు దొరకదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ సర్కార్ కాలుష్య నిరోధానికి యంత్రాల ద్వారా నీటి తుంపర్లు జల్లడం లాంటి చర్యలు చేపడుతోంది. ఇవేవీ చాలక చివరకు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లలో కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. మేఘమథనం జరిపేందుకు ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని అనుమతి కోరినా, జవాబు లేదన్నది ‘ఆప్’ ఆరోపణ. ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రయోజనమెంత అనేది చర్చనీయాంశమే. అయితే, ప్రజలకు తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించే ఇలాంటి ప్రయత్నాలకు కేంద్రం మొదటే మోకాలడ్డడం సరికాదు. వాయు కాలుష్యం ‘అతి తీవ్ర’ స్థాయులకు చేరిన నేపథ్యంలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రాప్) నాలుగోదశ చర్యలను కఠినంగా అమలు చేయాలన్నది సుప్రీమ్ తాజా ఆదేశం. పాఠశాలల్ని మూసివేయడం, ఆఫీసుకు రాకుండా ఇంటి వద్ద నుంచే పనిచేయడం, పరిశ్రమల మూసివేత లాంటి చర్యలన్నీ నాలుగో దశ కిందకు వస్తాయి. ముప్పు ముంచుకొస్తున్నా మూడో దశ, నాలుగో దశ చర్యల్లో అధికారులు ఆలస్యం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు షరతులు అమలు చేయాల్సిందేనని కోర్ట్ చెప్పాల్సి వచ్చిందంటే అధికార యంత్రాంగం అలసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. నిద్ర లేచిన ప్రభుత్వం ఇప్పుడిక ‘గాప్’ నాలుగో దశ కింద వాహనాల రాకపోకలు, భవన నిర్మాణ కార్యకలాపాలపై షరతులు విధించింది. అయితే, దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో దాదాపు 34 లక్షల చిన్న, మధ్యశ్రేణి సంస్థల్లో ఉత్పత్తి దెబ్బతిననుంది. అంటే కాలుష్య పాపం ఆరోగ్యాన్నే కాక ఆర్థికంగానూ కుంగదీస్తుందన్న మాట. ఢిల్లీలో వాహనాల వల్ల అత్యధిక కాలుష్యం సంభవిస్తుంటే, ఎన్సీఆర్లో పరిశ్రమలు ప్రధాన కాలుష్య కారకాలని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి) 2021లోనే తేల్చింది. అనేకచోట్ల ఇప్పటికీ కట్టెల వాడకం కొనసాగుతోంది. ఇక, పొలాల్లో కొయ్య కాళ్ళ దహనం తాజా దురవస్థకు 40 శాతం కారణమట. అన్నీ కలిసి పీల్చే గాలే విషమయ్యేసరికి, ఢిల్లీ వాసుల ఆయుఃప్రమాణం సగటున ఏడేళ్ళు తగ్గుతోంది. రాజధాని, ఆ పరిసరాల్లోని 3 కోట్ల పైచిలుకు మంది వ్యధ ఇది. నిజానికి, స్వచ్ఛమైన గాలి ప్రాథమిక మానవహక్కని గత నెలతో సహా గత అయిదేళ్ళలో సుప్రీమ్ అనేకసార్లు స్పష్టం చేసింది. వాయునాణ్యతకు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర, రాష్ట్రస్థాయి యంత్రాంగాలను ఆదేశించింది. అయినా జరిగింది తక్కువ. సరైన ప్రాణ వాయువు కూడా అందని ఈ పరిస్థితికి ప్రజల నుంచి పాలకుల దాకా అందరూ బాధ్యులే. కాలుష్య నివారణ, నియంత్రణలకు సృజనాత్మక ఆలోచనలు చేయలేకపోవడం ఘోరం. దాహమేసినప్పుడు బావి తవ్వకుండా ఏడాది పొడుగూతా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టడం అవసరం. ఆధునిక సాంకేతికత, ప్రజారవాణా, ప్రజల అలవాట్లలో మార్పులు సహా అనేక అంశాల్లో రాజకీయ కృత నిశ్చయంతో విధాన నిర్ణేతలు పనిచేయాలి. లేదంటే, సాక్షాత్తూ దేశ రాజధానే నివాసయోగ్యం కాక జనం తరలిపోతుండడం చూసి వికసిత భారత్, లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ లాంటివన్నీ వట్టి గాలి మాటలే అనుకోవాల్సి వస్తుంది. -
రగులుతున్న అగ్నిపర్వతం!
ఏణ్ణర్ధం దాటినా... మణిపుర్ మండుతూనే ఉంది. జాతుల మధ్య ఘర్షణ తగ్గకపోగా, అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా పదిరోజుల క్రితం ఓ కుకీ మహిళ అత్యాచారం – హత్య, దానికి ప్రతిగా మెయితీలపై కుకీ తీవ్రవాదుల దాడులు, చివరకు ఓ సహాయ శిబిరం నుంచి నవంబర్‌లో అపహరణకు గురైన ఓ పసిబిడ్డతో సహా ఆరుగురు అమాయక మెయితీలు ప్రాణాలు కోల్పోవడం... ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సీఎం సహా రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల ఇళ్ళపై దాడులతో చివరకు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ స్తంభన, వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విధింపు, కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపడం దాకా వెళ్ళింది. ప్రభుత్వ మనుగుడకు ముప్పేమీ లేకున్నా, బీజేపీ సర్కారుకు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్టు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించడం మిత్రుల్లోనూ బీజేపీ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. గత 2023 మేలో హింసాకాండ మొదలైనప్పటి నుంచి జాతుల ఘర్షణల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎంతసేపటికీ బాహ్య శక్తులు కారణమంటూ ఆరోపించడం, శుష్కవాగ్దానాలు చేయడమే తప్ప, రాష్ట్రం రావణకాష్ఠమైనా పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. మణిపుర్ సామాజిక – ఆర్థిక జీవితంలో జాతుల ఉనికి అత్యంత కీలకమైనది. దాన్నిబట్టే ఆ ఈశాన్య రాష్ట్రంలో భూములపై హక్కులు, తదనుగుణంగా రాజకీయ సైద్ధాంతిక విభేదాలు రూపు దిద్దుకుంటూ వచ్చాయి. దాదాపు డజనుకు పైగా గిరిజన తెగలను కలిపి, బ్రిటీషు పాలనా కాలంలో కుకీలు అని పేరుపెట్టారు. విభిన్న జాతుల్లో ప్రధానమైనవైన మెయితీ వర్గానికీ, కుకీలకూ మధ్య పాలకులు తమ స్వార్థప్రయోజనాల కోసం అగ్నికి ఆజ్యం పోశారు. అదే అసలు సమస్య. జనరల్ వర్గానికి చెందిన మెయితీలు తమకు కూడా షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కల్పించాలని కోరు తున్నారు. అయితే, దానివల్ల తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని కుకీల ఆందోళన. మరోపక్క మిజోరమ్తోనూ, పొరుగున మయన్మార్‌లోని చిన్ రాష్ట్రంతోనూ జాతి సంబంధాలున్న కుకీల వాంఛ వేరు. మణిపుర్ నుంచి తమ ప్రాంతాన్ని విభజించి, ప్రత్యేక పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు బలంగా వాదిస్తున్నారు. ఇది చాలదన్నట్టు మెయితీ వర్గానికి చెందిన మణిపుర్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, కుకీలను అణచివేస్తున్నారనే అభిప్రాయం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమయ్యాయి. కారణాలు ఏమైనా, రాష్ట్రంలోని బీజేపీ పాలిత ప్రభుత్వ సారథి అన్ని వర్గాలనూ ఒక తాటి మీదకు తీసుకురావడంలో విఫలమవడంతో బాధ్యత అంతా కేంద్రం భుజాల మీద పడింది. కేంద్ర హోమ్‌శాఖ మొన్న అక్టోబర్‌లో మెయితీ, కుకీల వర్గాల రాజకీయ ప్రతినిధులతో సమావేశం జరిపింది కానీ, శాంతిసాధన దిశగా అడుగులు పడలేదు. ప్రత్యేక శాసనవ్యవస్థతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం తమకు కావాల్సిందేనని కుకీలు భీష్మించుకు కూర్చున్నారు. మణిపుర్ విభజనతో మాత్రమే సాధ్యం. అయితే, కేంద్ర జోక్యంతో సమస్యను పరిష్కరించవచ్చని ఇప్పటికీ కుకీలు భావిస్తున్నారు. ఇంత సంక్షోభంలోనూ అది ఓ సానుకూల అంశం. ఢిల్లీ పెద్దలు దాన్ని వినియోగించుకోవాలి. కానీ, అలా జరుగుతున్నట్టు లేదు. విధానపరంగా, రాజకీయంగా సీఎం విఫలమయ్యారని తెలుస్తున్నా, గద్దె మీది బీరేన్‌సింగ్‌ను మార్చడానికి బీజేపీ, కేంద్రంలోని ఆ పార్టీ పెద్దలు ఎందుకు ముందుకు రావడం లేదో తెలియదు. బీరేన్‌పై అంత ప్రేమ ఎందుకన్నది బేతాళప్రశ్న. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ప్రగతి అంటే ఇదేనా? మణిపుర్‌ను దేశంలో అంతర్భాగమని వారు అనుకోవట్లేదా? ఈశాన్యంలో పార్టీ విస్తరణపై ఉన్న శ్రద్ధలో కాసింతైనా శాంతిస్థాపనపై కాషాయ పెద్దలకు ఎందుకు లేదు? అంతకంతకూ క్షీణిస్తున్న పరిస్థితులు ప్రభుత్వంతో పాటు రాజకీయ పక్షాలు సైతం బాధ్యతను వదిలేశాయనడానికి సూచన. ఈ సంక్షుభిత ఈశాన్య రాష్ట్రానికి ఇప్పుడు కాస్తంత సాంత్వన కావాలి. బాధిత వర్గాలన్నిటినీ ఓదార్చి, ఉపశమనం కలిగించే పెద్ద మనసు కావాలి. పౌరసమాజాన్ని కూడా భాగస్వామ్యపక్షం చేసి, సమస్యకు రాజకీయ పరిష్కారం చూడడమే మార్గం. అందుకు కేంద్ర సర్కారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో చొరవ తీసుకోవాలి. పాలకులు మణిపుర్‌ను వట్టి శాంతిభద్రతల కోణం నుంచే చూస్తే కష్టం. దాని వల్ల సామాన్య ప్రజానీకానికీ, ఈశాన్య ప్రాంతంలోని సాయుధ బలగాలకూ కష్టాలు పెరుగుతాయి. రాష్ట్రంలో చేజారిన పరిస్థితుల్ని ఇప్పటికైనా చక్కదిద్దేందుకు కేంద్రం ప్రయత్నించకపోతే, అది దేశ సమగ్రతకే ప్రమాదం. పొరుగున మయన్మార్, బంగ్లాదేశ్‌లలో సంక్షుభిత వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తత అత్యవసరం. అనేక సాయుధ తీవ్రవాద గ్రూపులతో, ఇట్టే చొరబాట్లకు చాలా అవకాశం ఉన్న సరిహద్దుల్లో మణిపుర్ ఉందని విస్మరించరాదు. కేవలం సాయుధ బలగాల మోహరింపుతో అక్కడ శాంతి సాధ్యంకాదు. హింసలో తాత్కాలిక విరామాన్ని చూపి, అదే శాంతి అని నమ్మబలకడం మూర్ఖత్వం. అన్ని వర్గాల మధ్య సామరస్యం, సహజీవనం సాగేలా రాజకీయ ఏర్పాటు చేయగలిగితేనే హింసకు తెర పడుతుంది. కేంద్రం ఇప్పటికైనా చిత్తశుద్ధితో అందుకు సర్వశక్తులూ ఒడ్డాలి. లేదంటే, అగ్ని పర్వతం సమీపంలోనే ఉన్నా అలసత్వంతో వ్యవహరిస్తున్నట్టే! దాదాపు 33 లక్షల సోదర భారతీయ జనాభాను స్వార్థ ఆర్థిక, అధికార ప్రయోజనాల కోసం గాలికి వదిలేస్తున్నట్టే! గుజరాత్, ముజఫర్ నగర్, ఢిల్లీ లాంటి అనేక చోట కొద్ది రోజుల్లో హింసకు ముకుతాడు వేయగలిగినచోట ఇన్ని నెలలుగా ఒక రాష్ట్రాన్ని మంటల్లో వదిలేయడం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ పాలకులకు సిగ్గుచేటు! -
సందిగ్ధ జ్ఞానం
జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉన్నది ‘అ’భేదమే కదా అనుకుంటాం కానీ, ఆ రెండింటికీ మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంది. అజ్ఞానమనే చీకటి ఒడ్డు నుంచి, జిజ్ఞాస అనే అలల మీదుగా, జ్ఞానమనే వెలుగుల తీరం వైపు సాగే ప్రయాణంలో ఆనందమే మనకు తెప్పవుతుంది. అందుకే జ్ఞానానందమనే మాట పుట్టింది. అయితే, ఆ ఆనందాన్ని అంటిపెట్టుకుని ఒక విషాదమూ ఉంటుంది. అది ఏమిటంటే... మన ఊహకు అందనంత వయసున్న ఈ అనంతవిశ్వంలో భూమి ఒక గోళీకాయ కన్నా కూడా చిన్నదనుకుంటే, దానిపై జీవించే మనిషి నలుసుపాటి కూడా చేయడు. అతని అస్తిత్వాన్ని కాలం కొలమానంతో కొలిస్తే అది కొన్ని క్షణాలను మించదు. కనుక అనంతవిశ్వం గురించిన జ్ఞానం సంగతలా ఉంచి, ఈ భూమి గురించి, ఈ భూమి మీద తన మనుగడ గురించిన జ్ఞానం మొత్తాన్నే ఒక మనిషి తన జీవితకాలంలో సంగ్రహించుకోవడం అసాధ్యం. అదీ అసలు విషాదం. మనిషిలో మెదడు ఎప్పుడు వికసించిందో అప్పుడే అతనిలో విశ్వం గురించిన జ్ఞానాన్వేషణ మొదలై, వేలసంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. చంద్రుడి వృద్ధి, క్షయాలను అనుసరించి కాలగణనాన్నీ, ఋతుభ్రమణాన్ని అనుసరించి వేటజంతువుల గుర్తింపునూ మనిషి ప్రారంభించి వాటిని ఒక పొడవాటి ఎముకపై నమోదు చేయడం నక్షత్రాలు, రాశులతో ముడిపడిన జ్యోతిర్విజ్ఞానానికి నాంది అయిందంటారు. ఆపైన మొక్కల సేకరణ నుంచి, పెరటిసాగుకు; అక్కడి నుంచి వ్యవసాయానికి సాగే క్రమంలో ఆహారవిజ్ఞానాన్ని బహుముఖాలుగా విస్తరించుకుంటూ వెళ్ళాడు. రాతిపనిముట్ల తయారీలో సాంకేతికజ్ఞానాన్ని, ఏదో అతీతశక్తి ఈ విశ్వాన్ని సృష్టించి నడిపిస్తోందన్న ఊహ నుంచి మత, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని; నియమ నిబంధనలు, కట్టుబాట్లతో కలసి జీవించడం నుంచి సంస్కృతిని సంతరిస్తూ, నిర్మిస్తూ వచ్చాడు. ఇందులో ప్రతిదీ జ్ఞానాన్వేషణలో మేలి మలుపే; జ్ఞానపు నిచ్చెన నధిరోహించడంలో నిశ్చయాత్మకమైన మెట్టే. నగరాల నిర్మాణం మీదుగా నాగరికతాదిశగా సాగిన ఈ యాత్రలో ఇంతవరకు మనిషి ఎక్కడా మడమ తిప్పింది లేదు; ఆకాశమే హద్దుగా ఆ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినా సరే, సంపూర్ణజ్ఞానం మనిషికి ఎప్పటికీ అందని ఎండమావిలా ఊరిస్తూనే ఉంది. కనిపించని జ్ఞానచంద్రుడి చీకటిపార్శ్వం అదే. సంకేతాల నుంచి లిపిని అభివృద్ధి చేసుకుని జ్ఞానాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం ఈ క్రమంలో మరొక మెరుపుల మజిలీ. మొదట్లో విశ్వసృష్టి, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, శాస్త్ర విజ్ఞానం, సాంకేతికజ్ఞానం వగైరా వింగడింపు లేకుండా తనకు తెలిసిన జ్ఞానం మొత్తాన్ని, తనకు తెలిసిన ప్రక్రియలో ఒకేచోట రాశిపోసిన ఉత్సాహం మనిషిది. అందుకే గణితశాస్త్రాన్ని కూడా పద్యాల్లో చెప్పిన పావులూరి మల్లన్నలు మన దేశంలో, మన సాహిత్యంలో కనిపిస్తారు. తర్వాత తర్వాత జ్ఞానం అనేక శాఖలు గల మహావృక్షంగా ఎదిగిపోయి, ఒక మనిషి తన జీవితకాలంలో ఏ ఒక్క శాఖనూ పూర్తిగా తేరి చూసే వీలుకుండా నిలువుగా అడ్డంగా విస్తరించిపోయింది. తన కళ్ళ ముందే ఉన్న, తన నిత్యజీవనంతో ముడిపడి ఉన్న, తన అనుభవంలోకి వచ్చే అనేక విషయాల ఆనుపానులు తెలియకుండానే మనిషి తన జీవితకాలాన్ని ముగించవలసి రావడం కన్నా పెనువిషాదం ఇంక ఏముంటుంది? ప్రసిద్ధ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ఇంగువ’ అనే కథలో ఈ విషాదాన్నే ఒకింత హాస్యగంభీరస్ఫోరకంగా చిత్రిస్తారు. అందులో రాజశేఖరం అనే వ్యక్తిని ఇంగువ ఎలా తయారవుతుందనే ప్రశ్న చిరకాలంగా వేధిస్తూ ఉంటుంది. అతను వృద్ధాప్యంలో మంచం పడతాడు. ఒక మిత్రుడు అతణ్ణి చూడడానికి వెడతాడు. రాజశేఖరం అతి కష్టం మీద నోరు తెరచి అదే ప్రశ్న అడుగుతాడు. దానికి సమాధానం తెలుసుకోకుండానే జీవితం చాలిస్తానేమోనన్న బెంగ అతని ముఖంలో కనిపిస్తుంది. మిత్రుడు వెంటనే వెళ్ళి ఇంకో మిత్రుని కలసి సమాధానం కనుక్కొని తిరిగి వస్తాడు. కానీ అప్పటికే రాజశేఖరం కన్నుమూస్తాడు. ఇప్పటిలా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి, గూగుల్ శోధించి ఉంటే, ‘ఫెరులా’ అనే మొక్క నుంచి పుట్టే జిగురే గట్టిపడి ఇంగువగా తయారవుతుందనీ, ‘అసాఫోటిడా’ అనేది దాని శాస్త్రీయ నామమనీ, ఈ మొక్క ఎక్కువగా ఇరాన్ ఎడారుల్లో, అఫ్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పర్వతప్రాంతాలలో సాగవుతుందనీ రాజశేఖరం తెలుసుకుని ఉండేవాడు.అలాగని అతనికా అదృష్టం లేకపోయిందనడానికీ వీల్లేదు. ఇంటర్నెట్ ఆధారిత బహుళ మాధ్యమాలతో సమాచారవిప్లవం కొత్తపుంతలు తొక్కిందనుకునే ఈ రోజున కూడా చిన్న చిన్న సందేహాలు తీరకుండానే దేహం చాలించే రాజశేఖరాలు ఉంటూనే ఉన్నారు. జ్ఞానతీరానికి ఏ కొంచెమైనా దగ్గరవడానికి ఏ అత్యాధునిక సాధనాలూ సాయపడడం లేదు. పరిమిత జీవితకాలం అతని నిస్సహాయతను ఇప్పటికీ గుర్తుచేసి వెక్కిరిస్తూనే ఉంది. మరోవైపు సమాచార ఉల్బణం నుంచి నిక్కమైన సమాచారానికి బదులు అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు పుట్టుకొచ్చి జ్ఞానాన్వేషణను అజ్ఞానాన్వేషణగా మార్చివేశాయి. అలా వ్యాప్తిలోకి వచ్చినదే ‘ఫేక్’ లేదా నకిలీ సమాచారమనే మాట. నేటి రాజశేఖరాలను వేధిస్తున్నది కేవలం సమాచార రాహిత్యం కాదు, నిజమో, అబద్ధమో తెలియని సమాచార సందిగ్ధం. జ్ఞాన, అజ్ఞానాల మధ్య ఆ మాత్రపు అక్షరభేదాన్ని కూడా తుడిచేసి పూర్తి అభేదాన్ని స్థాపించే యుగంలో ఉన్నాం. అదీ విషాదం! -
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్‌లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్‌లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్‌గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్‌పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
ఓట్ల వేటలో వాగ్దానవర్షం
మహారాష్ట్రలో ఎన్నికల పర్వం ఇప్పుడు కాక పుట్టిస్తోంది. ఈ 20న జరగనున్న ఎన్నికల కోసం ఇటు బీజేపీ సారథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి, అటు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష ‘మహా వికాస్ ఆఘాడీ’ (ఎంవీఏ)... రెండూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రంలో ఇప్పుడు ఉచితాల పోరు సాగుతోంది. గృహాలకు 100 యూనిట్ల మేర కరెంట్ ఉచితం, గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఆడపిల్లలకు ఉచిత టీకాకరణ, మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా రెండు రోజులు ఋతుక్రమ సెలవుల లాంటి గ్యారెంటీలతో ఎంవీఏ ముందుకొచ్చింది. ఫలితంగా మహాయుతి సైతం మరింత ఎక్కువ వాగ్దానాలు చేయక తప్పలేదు. దాంతో, ఎన్నికల మేనిఫెస్టోలు కలకలం రేపుతున్నాయి. ఖజానాపై భారం రీత్యా పథకాల సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైంది. దేశాభివృద్ధికి ఉచితాల సంస్కృతి ప్రమాదకరమన్న మోదీ సొంతపార్టీ బీజేపీ సైతం ‘మహా’పోరులో ప్రతిపక్షం బాట పట్టక తప్పలేదు. అయితే, వైరిపక్షం వాగ్దానాలు సాధ్యం కావంటూ ప్రతి పార్టీ పక్కవారిపై ఆరోపణలు చేయడమే విడ్డూరం.మహిళలు, రైతులు, విద్యార్థులు – నిరుద్యోగులైన యువతరం, సీనియర్ సిటిజన్లు... ఇలా వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఇచ్చిన పోటాపోటీ హామీలు అనేకం. సమాజంలోని వెనుక బడిన వర్గాలను పైకి తీసుకురావడానికీ, అవసరంలో ఉన్నవారికి చేయూత అందించడానికీ సంక్షేమ పథకాలను హామీ ఇవ్వడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడం తప్పు కాదు, తప్పనిసరి కూడా! అయితే, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అమలు చేయడానికి వీలే కాని వాటిని హామీ ఇచ్చినప్పుడే అసలు సమస్య. అధికారంలో ఉండగా అవసరార్థులను పట్టించుకోకుండా, తీరా ఎన్నికల వేళ మేని ఫెస్టోలతో మభ్యపెట్టాలనుకోవడం మరీ దారుణం. ఎన్నికల వాగ్దానపత్రాలపై విమర్శలు వస్తున్నది అందుకే. ఆర్థికభారం సంగతి అటుంచితే, స్త్రీలకు తప్పనిసరి ఋతుక్రమ సెలవు లాంటివి పని ప్రదేశాల్లో వారికే ప్రతికూలంగా మారే ప్రమాదముందని జూలైలో సుప్రీమ్ కోర్ట్ అభిప్రాయపడింది. అయినా, ఆ అంశాన్ని పార్టీలు చేపట్టడం విచిత్రమే. పని గంటల్లో వెసులుబాటు, వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర ప్రత్యామ్నాయాలను పట్టించుకోకుండా, జపాన్, స్పెయిన్, ఇండొనేసియా లాంటి చోట్ల ఆదరణకు నోచుకోని పద్ధతిని తెస్తామని హామీ ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే బలమైన ఓటరు వర్గంగా మహిళలు మారిన సంగతిని పార్టీలు గుర్తించాయి. స్త్రీలు స్వీయ నిర్ణయంతో ఓట్లేస్తున్న ధోరణి పెరుగుతోందనీ గ్రహించాయి. అందుకే, 4.5 కోట్ల మంది మహిళా ఓటర్లున్న మహారాష్ట్రలో రెండు కూటములూ వారిని లక్ష్యంగా చేసుకున్నాయి. లడకీ బెహిన్ యోజన కింద ఇస్తున్న నెలవారీ భృతిని పెంచుతామనీ, స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులకు ‘లఖ్పతీ దీదీ’ పథకంతో చేయూతనిచ్చి, 2027 కల్లా 50 లక్షల మందిని లక్షాధికారిణుల్ని చేస్తామనీ ‘మహాయుతి’ మాట. ఎంవీఏ కూటమి ఏమో ‘మహా లక్ష్మి పథకం’ ద్వారా నెలవారీ ఆర్థికసాయం, ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం వగైరా హామీలి స్తోంది. నిజానికి, పశ్చిమ బెంగాల్లో కన్యాశ్రీ, మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెహనా యోజన... ఇలా రక రకాల పేర్లతో మహాలక్ష్మి పథకం లాంటివి ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి. ఈ తీపి మాటల్ని అటుంచితే,, మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను రెండు కూటముల పక్షాన కలసి ఈ ఎన్నికల్లో 56 మంది మహిళలే బరిలో ఉన్నారు. లెక్కలు తీస్తే, మొత్తం అభ్యర్థుల్లో స్త్రీల సంఖ్య 10 శాతమే. వెరసి, ఆడవారికి ఉచితాలిచ్చి ఓటర్లుగా వాడుకోవడమే తప్ప, చట్టసభల్లో సరైన భాగస్వామ్యం కల్పించడంలో పార్టీలకు ఆసక్తి లేదు. మహిళా రిజర్వేషన్లను పైకి ఆమోదించినా, ఆచరణలో ఇదీ దుఃస్థితి.పార్లమెంట్‌కు అతిపెద్ద సంఖ్యలో రాజ్యసభ సభ్యుల్ని పంపే రాష్ట్రాల్లో రెండోది అయినందున మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ కీలకంగా భావిస్తోంది. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేక చట్టం చేస్తామంటూ కాషాయపార్టీ హిందూత్వ కార్డును విసురుతుంటే, ఓబీసీలు గణనీయంగా ఉన్న రాష్ట్రమైనందున కులగణన, ఉద్యోగాల రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి ఎత్తివేత లాంటి మాటలతో ఎంవీఏ సామాజిక న్యాయం నినాదాన్ని భుజానికి ఎత్తుకుంది. ఇక, విభజనవాద నినాదాలైన ‘బటేంగే తో కటేంగే’ (హిందువులు విడిపోతే నష్టపోతాం), ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ (కలసివుంటే భద్రంగా ఉంటాం) మధ్య రైతాంగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వగైరా అసలు అంశాలు వెనక్కిపోవడమే విషాదం. స్థూలంగా 6 జోన్లయిన మహారాష్ట్రలో ఆర్థికంగా వెనకబడ్డ విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహా రాష్ట్ర ప్రాంతానికీ – రెండు, మూడు రెట్లు తలసరి ఆదాయం ఎక్కువుండే ముంబయ్, థానే – కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలకూ మధ్య ఆలోచనలో తేడా ఉంటుంది. మొత్తం స్థానాల్లో నాలుగోవంతు పైగా సీట్లలో ఎప్పుడూ హోరాహోరీ పోరే. అలాగే, మూడోవంతు పైగా స్థానాల్లో విజేత మెజారిటీ కన్నా మూడోస్థానంలో నిలిచిన అభ్యర్థి ఓట్ షేర్ ఎక్కువ. కాబట్టి, ఫలితాల అంచనా అంత సులభం కాదు. రాష్ట్రాన్ని పాలించేది ఎవరన్నది ఒక్కటే కాదు... ఉద్ధవ్ ఠాక్రే, శిందే వర్గాలలో ఎవరిది అసలైన శివసేన అన్నదీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పునివ్వనున్నారు. వాగ్దానపర్వంలో ఏ పార్టీని ఎంత నమ్మిందీ చెప్పనున్నారు. తక్షణ ఆర్థిక సహాయం పట్ల గ్రామీణ ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తోంది కానీ, వచ్చే ఏడేళ్ళలో రూ. 2.75 లక్షల కోట్ల అప్పు తీర్చాల్సిన రాష్ట్రంలో రేపు ఏ కూటమి అధికారంలోకి వచ్చినా తమ హామీలను అమలు చేయగలుగుతుందా అన్నది ప్రశ్న. -
నయవంచనకు నకలు పత్రం!
దొంగ హామీలతో, వక్రమార్గంలో అయిదు నెలలక్రితం అధికారాన్ని చేజిక్కించుకున్న నాటినుంచీ అనామతు పద్దులతో తప్పించుకు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సర్కారు ‘తప్పనిసరి తద్దినం’లా సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఘనమైన అంకెలు చూసి జనం నవ్విపోరా అన్న వెరపు లేకుండా రూ. 2,94,427 కోట్లతో ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ. 32,712 కోట్లు, ద్రవ్యలోటు రూ. 68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొన్నటి ఎన్నికల్లో భూమ్యా కాశాలను ఏకం చేస్తూ మోత మోగించిన సూపర్ సిక్స్ హామీల జాడ లేకుండా... అంచనా వేస్తున్న పన్ను రాబడి రూ. 24,000 కోట్లూ వచ్చే మార్గమేమిటో చెప్పకుండా ఆద్యంతం లొసుగులు, లోపాలతో బడ్జెట్ తీసుకురావడం బాబు సర్కారుకే చెల్లింది. ఈమాత్రం బడ్జెట్ కోసం అయిదు నెలలు ఎందుకు ఆగాల్సివచ్చిందో కూటమి నేతలే చెప్పాలి. 53.58 లక్షలమంది రైతులకు రూ. 20,000 చొప్పున రూ. 10,716.74 కోట్లు కేటాయించాల్సిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి కేవలం వెయ్యి కోట్లు మాత్రమే విదిల్చి రైతు సంక్షేమమే లక్ష్యమంటూ బీరాలు పోవటం... 84 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 12,600 కోట్లు కావాల్సి వుండగా కేవలం రూ. 5,387.03 కోట్లు కేటాయించి ఊరుకోవటం దుస్సాహసానికి పరాకాష్ఠ.రైతులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకానికి ఈ ఖరీఫ్ సీజన్ తర్వాత మంగళం పాడుతున్నట్టు ప్రభుత్వమే చెప్పింది. ఇక రూ. 3 లక్షల వరకూ సున్నావడ్డీ రాయితీ, డ్రిప్ పరికరాలపై 90 శాతం సబ్సిడీ వగైరాల గురించి ప్రస్తావన లేదు. అలాగే ధరల స్థిరీకరణ నిధికీ, ప్రకృతి వైపరీత్యాల నిధికీ ఇచ్చిందేమీ లేదు! అయినా రైతు సంక్షే మానికి కట్టుబడివున్నారట! పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18,000 ఇస్తామని చెప్పిన ‘ఆడబిడ్డ’ నిధికి రూ. 32,400 కోట్లు కేటాయించాల్సి వుండగా ఇచ్చింది సున్నా. ఏడాదిలో ఇంటింటికీ మూడు సిలెండర్లు ఉచితమని ఊదరగొట్టిన పథకం కింద కోటీ 54 లక్షల కుటుంబాల కోసం రూ. 4,000 కోట్లు అవసరం కాగా దానికోసం కేటా యించింది కేవలం రూ. 895 కోట్లు! ఈ అరకొర మొత్తంతో ఇంటికో సిలెండరైనా ఇవ్వగలుగు తారా? లబ్ధిదారుల జాబితాకు అడ్డగోలుగా కోత పెడితే తప్ప ఇది అసాధ్యం. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 చొప్పున ఏడాదిలో కోటిమందికి మొత్తం రూ. 36,000 కోట్లు కావాల్సి వుండగా దాని ఊసే లేదు! జాబ్ క్యాలెండర్, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు వగైరాల గురించిన ప్రస్తావన లేదు. అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ. 10 లక్షల వరకూ సబ్సిడీ ఇస్తామని చెప్పిన వాగ్దానానికి సైతం చోటులేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి తగినన్ని నిధులు కేటాయిస్తే, చెప్పిన రీతిలో సబ్సిడీ సొమ్ము అందిస్తే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. కానీ వీటి గురించి మాట్లాడింది లేదు. ఆ రంగానికి బాబు హయాంలో పెట్టిపోయిన బకాయిలు కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో సైతం చెల్లించి ఆ పరిశ్రమలకు ఊపిరులూదిన జగన్ సర్కారుకూ, ఈ మాయదారి కూటమి ప్రభుత్వానికీ పోలికెక్కడ! యువతకు ఏటా లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మాట దేవుడెరుగు – మూడు లక్షలమంది వలంటీర్లకు మంగళం పాడినట్టు బడ్జెట్ అధికారికంగా తేల్చి చెప్పింది. కాపు వర్గానికి సైతం మొండిచెయ్యి చూపారు.‘బడ్జెట్ అంటే అంకెల సముదాయం మాత్రమే కాదు... అది మనం పాటిస్తున్న విలువలు, ఆకాంక్షల వ్యక్తీకరణ’ అని ఒకనాటి అమెరికా ఆర్థిక మంత్రి జాకబ్ ల్యూ ఉవాచ. పీఠంపై పేరాశతో మొన్నటి ఎన్నికల్లో ఎడాపెడా వాగ్దానాలిచ్చినవారి నుంచి విలువలేమి ఆశించగలం? వారికి జనం ఆకాంక్షలెలా అర్థమవుతాయి? అందుకే– వంచనాత్మక విన్యాసాలు ఆగలేదు. బడ్జెట్లో అంకెల గారడీ సరే, బయట పారిశ్రామికవేత్తలతో సైతం బాబు అదే మాదిరి స్వోత్కర్షలకు పోయారు. రానున్న రోజుల్లో ఏకంగా 15 శాతం వృద్ధి రేటు సాధిస్తారట! అవకాశాల కల్పనతో సంపద సృష్టించి, పేదల జీవన ప్రమాణాలు పెంచుతారట!! కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచీ పన్ను రాబడి మైనస్‌లోకి పోయిందని సాక్షాత్తూ కాగ్ చెప్పింది. జగన్ సర్కారు హయాంలో మొన్న ఏప్రిల్‌లో పన్ను రాబడిలో దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కాగా, ఆ తర్వాత తగ్గటం సంగతలా వుంచి మైనస్‌లోకి పోయింది. మే నెలలో –2.8 శాతం, ఆ తర్వాత వరసగా –8.9, –5.3, –1.9, –4.5 శాతాలకు పడిపోయిందని కాగ్ నివేదిక బయటపెట్టింది. వాస్తవం ఇలావుంటే పన్ను రాబడి కింద అదనంగా రూ. 24,000 కోట్లు వస్తాయని బడ్జెట్ నమ్మబలుకుతోంది. అంటే రానున్న కాలంలో అదనపు పన్నుల మోత మోగుతుందన్నమాట!జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి గడచిన అయిదేళ్ళూ సాగించిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కూటమి నేతలు, వారి వందిమాగధ మీడియా నోటికొచ్చినట్టు రూ. 12 లక్షల కోట్లు, రూ. 14 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారాలు చేశారు. తీరా మొన్న మార్చి 31 నాటికి ఆ అప్పు రూ. 6.46 లక్షల కోట్లని తాజా బడ్జెట్ వెల్లడించింది. ఇందులో గ్యారెంటీల కింద తెచ్చిన అప్పు రూ. 1,54,797 కోట్లనూ తీసేస్తే నికరంగా ఉన్నది రూ. 4.91 లక్షల కోట్లు మాత్రమే! నిజానికి ఈ బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయంలో గతంలో తప్పుడు ప్రచారం చేశామని క్షమాపణలు చెప్పాలి. కానీ ఆపాటి నిజాయితీ ఆశించటం అత్యాశే. మొత్తానికి నయవంచనకూ, నేల విడిచిన సాముకూ ఈ బడ్జెట్ అసలు సిసలు ఉదాహరణ. -
నిధులు రావాలి! నిశ్చయం కావాలి!
పర్యావరణ మార్పుల సమస్యపై ప్రపంచ దేశాలు మరోసారి చర్చకు కూర్చున్నాయి. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) శిఖరాగ్ర సదస్సు ‘కాప్–29’ అజర్‌బైజాన్‌లోని బాకూలో సోమవారం మొదలైంది. బొగ్గు, ముడిచమురు, సహజవాయువుల వినియోగం నుంచి దూరం జర గాలని చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన ఏడాది తరువాత జరుగుతున్న ఈ 12 రోజుల మేధామథనం అనేక విధాల ప్రాధాన్యం సంతరించుకుంది. గడచిన 2023, ఆ వెంటనే వర్తమాన 2024... ఇలా వరుసగా రెండో ఏడాది కూడా అత్యధిక వేడిమి నిండిన వత్సరంగా రుజువవుతున్న వేళ జరుగు తున్న సదస్సు ఇది. అలాగే, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన కొద్ది రోజులకే ఇది జరుగుతోంది. పర్యావరణ సంక్షోభం వట్టి నాటకమన్నది ఆది నుంచి ట్రంప్ వైఖరి కావడంతో మిగతా ప్రపంచమంతా బాకూ వైపు ఆసక్తిగా చూస్తోంది. నిజానికి, ఈ 2024 చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతా నామ సంవత్సరం కానున్నట్లు కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ లాంటి నివేదికలు సూచిస్తున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రత ఎక్కువైన తొలి ఏడాదే ఇదే కానుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్యవసానంగా కరవు, తుపానులు, వరదలు ప్రపంచమంతటిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాప్–29 జరుగుతుండడం గమనార్హం. గమనిస్తే, ప్రపంచ కాలుష్య ఉద్గారాలలో ఇప్పటికే చైనా ప్రథమ స్థానంలో, అమెరికా రెండో స్థానంలో ఉంటే, భారత్ మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారి సదస్సుకు అమెరికా, చైనా, భారత్, బ్రిటన్, జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాల అగ్రనేతలు హాజరు కావడం లేదు. అధ్యక్షుడు బైడెన్ రావట్లేదు. కొత్తగా ఎన్నికైన ట్రంప్ ఎలాగూ రారు. అయితేనేం, అమెరికా ప్రభావం ఈ కాప్–29పై అమితంగా ఉండనుంది. నిరుటి చర్చల్లో చేసుకున్న ప్రధాన వాగ్దానానికి కట్టుబడడంలో అనేక దేశాలు విఫలమయ్యాయి. ఉదాహరణకు, అన్ని దేశాల కన్నా అత్యధికంగా ముడిచమురును ఉత్పత్తి చేస్తున్న అమెరికా తన పద్ధతి మార్చుకోనే లేదు. ఇప్పుడు ట్రంప్ గద్దెనెక్కినందున చమురు ఉత్పత్తి, వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గే సూచన లేదు. పర్యావరణ పరిరక్షణ చర్యల నుంచి అమెరికా పూర్తి దూరం జరిగినా జరగవచ్చు. ఇది ప్రమాద ఘంటిక. అగ్ర దేశాలు హాజరు కాకున్నా సమస్య తీవ్రతయితే మారదు. వాతావరణ సంక్షోభ నివారణకు మరిన్ని నిధులవసరం. అందుకే, కాప్–29 కొత్త వాతావరణ పరిరక్షణనిధిని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. వర్ధమాన దేశాలు తమ ఉద్గారాల సమస్యను దీటుగా ఎదుర్కొని, పెరుగుతున్న వాతావరణ ముప్పును వీలైనంత తగ్గించాలంటే ఆ దేశాలకు తగినంత ఆర్థిక సహాయం అవసరం. అందుకు 100 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని 2009లోనే నిర్ణయించారు. 2020 కల్లా దాన్ని చేరాలని భావించారు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న వాతావరణ సంక్షోభ పరిస్థితుల మధ్య ఆ నిధులు ఇప్పుడు ఏ మూలకూ రావు. కాబట్టి, వర్తమాన పరిస్థితులకూ, అవసరాలకూ తగ్గట్టు దాన్ని ఇప్పుడు సవరించుకోవాల్సిన పరిస్థితి. భాగస్వామ్య పక్షాలైన 198 దేశాలకూ వీటో ఉన్న నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధన సులభమేమీ కాదు. అలాగే, ఈ మొత్తంలో ఎంత మేర ప్రజాధనం సేకరించా లనేది కూడా కీలక ప్రశ్నే. అనేక దేశాలు ఆర్థిక భారంతో ఉన్న వేళ దీని పైనా అందరి వైఖరీ ఒకేలా లేదు. అయితే, చర్యలు చేపట్టడం ఆలస్యమైన కొద్దీ మరింత భారీగా నిధులు అవసరమవుతాయి. నిధులెంత కావాలన్నదే కాదు... వాటిని ఎలా సేకరించాలి, పర్యావరణ మార్పుల కష్టనష్టాల నుంచి కోలుకొనేందుకు దేశాలకు ఎలా ఆ నిధుల్ని పంచాలి, సంక్షోభ పరిష్కారానికి రూపొందించాల్సిన ఆర్థిక వ్యవస్థ ఏమిటనేది కూడా సదస్సులో కీలక చర్చనీయాంశాలే. పర్యావరణ, ఆర్థిక, మానవ నష్టాలను నిరోధించాలంటే పరిస్థితి చేతులు దాటక ముందే ఉద్గారాల్ని తగ్గించడం కీలకం. వాతావరణ ఉత్పాతాలతో విస్తృతంగా నష్టం, పర్యవసానాలు తప్పవు. నష్టం పెరిగిన కొద్దీ ఆ దేశాల పునరుజ్జీవానికి మరింత ఖర్చవుతుంది. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుడమి పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండాలంటే, తక్షణ చర్యలు అవసరం. అభివృద్ధి చెందిన దేశాలు గతంలో కోవిడ్–19 సమయంలో తమ పౌరులకూ, వ్యాపారాలకూ అండగా నిలిచేందుకు 48 నెలల్లోనే దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లను అందించి, ఆ సవాలును ఎదుర్కొన్నాయి. అప్పటి కోవిడ్లానే ఇప్పుడీ పర్యావరణ మార్పు సమస్యనూ అంతే అత్యవసరంగా చూడడం ముఖ్యం. ప్రజాధనంతో పాటు ప్రైవేట్ రంగ ఆర్థిక సాయం కూడా లేకుంటే కష్టమని కాప్–29 బాధ్యులు సైతం తెగేసి చెబుతున్నారు. హరిత పర్యావరణ నిధి అంటూ పెట్టినా, సమకూరింది తక్కువే. ఇప్పటికైతే ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్లు అవసరమంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తుండడంతో, వర్ధమాన దేశాల స్వచ్ఛ అభివృద్ధి, దారిద్య్ర నిర్మూలనకు గండి పడుతోంది. అసలు ఆ నిధుల్లోనూ 60 శాతం పైగా రుణాలైతే, 30 శాతం పైగా ఈక్విటీలు. కేవలం 5 శాతమే గ్రాంట్లు. అసలే కునారిల్లుతున్న అనేక పేద దేశాలకు ఇది మోయలేని భారమే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, కాప్–29 చర్చించడం ముఖ్యం. బలమైన ఆర్థికవ్యవస్థగా రూపొందుతున్న భారత్ సైతం చొరవ తీసుకోవాలి. హరిత ఇంధన టెక్నాలజీ, పరిశోధన – అభివృద్ధి, తక్కువ ఖర్చు పరిష్కారాల వైపు ప్రపంచం దృష్టి సారించేలా చూడాలి. ఏమైనా, గండం గట్టెక్కాలంటే మరిన్ని నిధులు కావాలి. అదీ వేగంగా అందాలి. వనరుల సమీకరణ సాధ్యమేనని చరిత్ర చెబుతోంది గనక, ఇప్పుడిక రాజకీయ కృతనిశ్చయముందా అన్నదే ప్రశ్న. ఈ 12 రోజుల సదస్సులో దానికి సమాధానం స్పష్టం కానుంది. -
సుదీర్ఘ తగువుకు పాక్షిక ఊరట!
షష్టిపూర్తికి చేరువలో ఉన్న ఒక వివాదాస్పద కేసుకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం పాక్షికంగా ముగింపు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి నుంచి వైదొలగుతున్న చివరి రోజున ఆయన ఆధ్వర్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కు మైనారిటీ ప్రతిపత్తి అర్హతలేదన్న 1967 నాటి నిర్ణయాన్ని కొట్టేస్తూనే వేరే ధర్మాసనం దాన్ని నిర్ధారించాలని తెలిపింది. గత తీర్పుకు అనుసరించిన విధానం సరికాదని తేల్చింది. బెంచ్‌లోని ముగ్గురు సభ్యులు అసమ్మతి తీర్పునిచ్చారు. ఒక వివాదాన్ని ఏళ్ల తరబడి అనిశ్చితిలో పడేస్తే నష్టపోయే వర్గాలుంటాయి. ఏళ్లు గడిచేకొద్దీ సమస్య జటిలమవుతుంది కూడా. జేఎన్‌యూ మాదిరే ఏఎంయూ కూడా వివాదాల్లో నానుతూ ఉంటుంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఇవి మరింత పెరిగాయి. చిత్రమేమంటే ఈ రెండు యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైనవారిలో చాలామంది సివిల్ సర్వీసులకూ, ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలకూ ఎంపికవుతుంటారు. పార్టీల్లో, ప్రభుత్వాల్లో, బహుళజాతి సంస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. ఏఎంయూది ఒక విషాద చరిత్ర. సమస్యలు కూడా భిన్నమైనవి. సర్ సయ్యద్ మహ్మద్ ఖాన్ అనే విద్యావంతుడు మదర్సాల్లో కేవలం ఇస్లామిక్ విలువల విద్య మాత్రమే లభించటంవల్ల ఆ మతస్తులు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని భావించి వాటితోపాటు ఆధునిక విద్యాబోధన ఉండేలా 1877లో స్థాపించిన ఓరియంటల్ కళాశాల ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. మౌల్వీలనుంచీ, మదర్సాలనుంచీ సర్ సయ్యద్‌కు ప్రతిఘటన తప్పలేదు. ఆధునిక విద్యనందిస్తే పిల్లల మనసులు కలుషితమవుతాయన్న హెచ్చరిక లొచ్చాయి. అన్నిటినీ దృఢచిత్తంతో ఎదుర్కొని ఆధునిక దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ ఉన్నత విద్యాసంస్థపై 147 ఏళ్లు గడిచాక మత ముద్ర పడటం, దాన్నొక సాధారణ వర్సిటీగా పరిగణించా లన్న డిమాండు రావటం ఒక వైచిత్రి. చరిత్ర ఎప్పుడూ వర్తమాన అవసరాలకు అనుగుణంగా కొత్త రూపు తీసుకుంటుంది. అందు వల్లే కావొచ్చు... ఏఎంయూ చుట్టూ ఇన్ని వివాదాలు! 1920లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఓరియంటల్ కళాశాలనూ, ఆ ప్రాంతంలోనే ఉన్న ముస్లిం యూనివర్సిటీ అసోసియేషన్ సంస్థనూ విలీనం చేసి 1920లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఆ చట్టంలోని 23వ నిబంధన యూనివర్సిటీ పాలకమండలిలో కేవలం ముస్లింలకు మాత్రమే చోటీయాలని నిర్దేశిస్తోంది. అయితే ముస్లిం విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధన లేదు. స్వాతంత్య్రానంతరం 1951లో ఆ చట్టానికి తెచ్చిన రెండు సవరణలు మతపరమైన బోధననూ, పాలకమండలిలో ముస్లింలు మాత్రమే ఉండాలన్న నిబంధననూ రద్దుచేశాయి. ఈ చర్య రాజ్యాంగంలోని 30వ అధికరణతోపాటు మత, సాంస్కృతిక, ఆస్తి అంశాల్లో పూచీపడుతున్న ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనంటూ పిటి షన్ దాఖలైంది. అయితే ఆ సవరణలు చెల్లుతాయని 1967లో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల బెంచ్ వెలువరించిన తీర్పే ప్రస్తుత వివాదానికి మూలం. వర్సిటీ స్థాపించిందీ, దాన్ని నిర్వహిస్తు న్నదీ ముస్లింలు కాదని ఆ తీర్పు అభిప్రాయపడింది. అయితే అలా మారటం వెనక ముస్లిం పెద్దల కృషి ఉన్నదని అంగీకరించింది. ప్రభుత్వం స్థాపించిన వర్సిటీకి మైనారిటీ ప్రతిపత్తి ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ 1981లో ప్రభుత్వం ఏఎంయూ చట్టానికి సవరణలు తెచ్చింది. తిరిగి మైనారిటీ ప్రతిపత్తినిచ్చింది. దాంతో మెడికల్ పీజీలో 50 శాతం సీట్లను ముస్లింలకు కేటాయించాలని పాలకమండలి 2005లో నిర్ణయించింది. దాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. నాటి యూపీఏ సర్కారు, పాలకమండలి 2006లో దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు స్వీకరించినా రిజర్వేషన్ల విధానంపై స్టే విధించింది. ఆనాటినుంచీ అనాథగా పడివున్న ఆ కేసు నిరుడు అక్టో బర్లో జస్టిస్ చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయటంతో ముందుకు కదిలింది. అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 30వ అధికరణను పరిమితార్థంలో చూసిందనీ, యాంత్రికంగా అన్వయించిందనీ తాజా మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ఏఎంయూ స్థాపన నేపథ్యం, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి తప్ప తర్వాతకాలంలో వచ్చిన చట్టాన్ని కాదని తెలిపింది. ఈ తీర్పుతో విభేదించిన ముగ్గురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు కూడా ప్రాధాన్యత గలవే. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై మరో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు ఎలా సిఫార్సు చేస్తుందని వారి ప్రశ్న. కేశవానంద భారతి కేసులో 1973 నాటి ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ తీర్పుపై 15 మందితో ధర్మాసనం ఏర్పాటు చేయమని రేపన్నరోజు మరో బెంచ్ ఆదేశిస్తే పరిస్థితేమిటని నిలదీశారు. ఏదేమైనా ఆలస్యమైనకొద్దీ సమస్య ఎంత జటిలమవుతుందో చెప్పటానికి ఏఎంయూ కేసే ఉదాహరణ. ఈ వర్సిటీ స్థలదాత జాట్ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అని హిందూ సంస్థలూ... ఆయన నెలకు రూ. 2కు 1929లో లీజుకు మాత్రమే ఇచ్చారని ముస్లింలూ రోడ్డుకెక్కారు. హిందువు ఇచ్చిన స్థలమై నప్పుడు దానికి మైనారిటీ ప్రతిపత్తేమిటన్న ప్రశ్న తలెత్తింది. మైనారిటీ సంస్థలో చదువుకుని ఎదిగి నందుకు కృతజ్ఞతగా లీజుకిచ్చారని, అలా ఇచ్చిన వందమందిలో ఆయనొకరని అవతలి పక్షం వాదించింది. మొత్తానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల మహేంద్ర పేరిట అక్కడే మరో వర్సిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ ధర్మాసనం సూచించిన విధంగా ఏఎంయూ ప్రతిపత్తిపై మరో బెంచ్ ఏర్పాటై తీర్పు వస్తే ప్రస్తుత అనిశ్చితికి తెరపడుతుంది.