దేవభూమి | Sakshi Editorial On Literature and Book lovers | Sakshi
Sakshi News home page

దేవభూమి

Published Mon, Feb 3 2025 12:43 AM | Last Updated on Mon, Feb 3 2025 12:43 AM

Sakshi Editorial On Literature and Book lovers

గతేడాది డిసెంబర్‌ 25న మరణించిన మలయాళ మహారచయిత ఎమ్‌.టి.వాసుదేవన్‌  నాయర్‌ తన సాహిత్య జీవితంలో తనను బాగా కదిలించిన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన 1976లో తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడో పల్లెటూరతను వచ్చి, ఆయనంటే అభిమానమని చెప్పడమే కాదు, ‘మీరు జబ్బుతో ఉన్నారని తెలిసి సేవ చేయడానికి వచ్చాను. కొన్ని పనులు మగ నర్సులే చేయాల్సి ఉంటుంది. మీకు నయమయే దాకా ఆ పనులు చేస్తాను’ అన్నాడట. మనిషి మానసిక ఘర్షణల మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఎమ్‌టీ విస్తారంగా రాశారు. 

కథలు, నవలలు, యాత్రా రచనలు, బాల సాహిత్యం, విమర్శతో పాటు సినిమాలకు స్క్రీన్‌ ప్లే రచనలు చేయడమే కాకుండా, అత్యుత్తమ చిత్రాలు అనదగ్గవాటికి దర్శకత్వమూ వహించారు. కేరళ సంస్కృతి మీద ఆయన ప్రభావం ఎనలేనిది. ఆ పల్లెటూరి మనిషి ఎమ్‌టీ రచనలు చదవడమే కాదు, ఆయన కోసం తన వ్యవసాయ పనులను ఆపుకొని మరీ వచ్చాడు. ఏ రచయితకైనా తన రచనా ప్రయాణంలోని కష్టాల బరువు దిగిపోయే ఘట్టమిది. సహజంగానే ఆ స్పందనకు వాసుదేవన్‌ నాయర్‌ కళ్లు చెమ్మగిల్లాయి. 

ఇది ఒక గొప్ప రచయితగా వాసుదేవన్‌  నాయర్‌కు జరిగిన ఒక విడి అనుభవమే కావొచ్చు; కానీ మలయాళీయుల సాహిత్య సంపన్నతకు అది గుర్తు. పామరులను కూడా సాహిత్యం ఎలా పెనవేసుకుపోయిందో చెప్పడానికి నిదర్శనం. ఎందుకంటే, ఇదే వాసుదేవన్‌  నాయర్‌ మరో సందర్భంలో ఒక గ్రామీణుడు ఆయన దగ్గర ఉచితంగా పుస్తకం తీసుకోవడానికి నిరాకరించి, అతడి దగ్గరున్న ముడుతలు పడిన నోట్లు బలవంతంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ నేల అలాంటిది. దోస్తోవ్‌స్కీ లాంటి రష్యన్‌  రచయిత మీద కూడా ఒక సాధారణ ఆటోడ్రైవర్‌ తనదైన అభిప్రాయాన్ని కలిగివుంటాడని మురిసిపోయే మలయాళీ సాహిత్యజీవులు ఎందరో!  
‘స్వర్గాన్ని నేను ఎప్పుడూ ఒక రకమైన గ్రంథాలయంలా ఊహిస్తాను,’ అంటారు అర్జెంటీనా రచయిత జార్జ్‌ లూయీ బోర్హెస్‌. పుస్తకాలను మించిన పెన్నిధి ఏముంది! గ్రంథాలయం అనేది ఒక ఆశ. ఒక దారిదీపం. ఎమ్‌టీ సహా చాలామంది రచయితలు తాము రచయితలు కావడానికి ఒక కారణంగా ‘ఎక్కువ సమయం లైబ్రరీలో గడపడం’ అని చెబుతారు. అత్యంత ప్రకృతి రమణీయత వల్ల కాబోలు కేరళను దేవభూమి అని పిలుస్తుంటారు. కానీ అక్కడి గ్రంథాలయాల వల్ల కూడా అది దేవభూమి అవుతోంది. రాష్ట్రంలో ఎనిమిది వేలకు పైగా లైబ్రరీలు ఉండటమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ముప్పైకి పైగా పెద్ద సాహిత్య ఉత్సవాలు జరుగుతుంటాయి. 

దేశంలో ప్రతి పంచాయితీలో దాదాపు ఎనిమిది గ్రంథాలయాలున్న ఏకైక రాష్ట్రం కేరళ. దేశంలో అత్యధిక పబ్లిక్‌ లైబ్రరీలున్న రాష్ట్రం మహారాష్ట్ర (12,191). తర్వాతి స్థానంలో ఉన్న కేరళ (8,415)తో పోల్చితే మహారాష్ట్ర విస్తీర్ణం సుమారు ఎనిమిదింతలని గ్రహిస్తే కేరళ గొప్పదనం అర్థమవుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కూడా కేరళ సంఖ్యలో నాలుగో వంతైనా లేవు. అక్కడి గిరిజన గ్రామాల్లోనూ కొత్తగా 630 గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలని గతేడాది నిర్ణయించారు. 

కేరళ గ్రంథాలయోద్యమ పితామహుడు పీ.ఎం.పణిక్కర్‌ వర్ధంతి అయిన జూన్‌  19ని అక్కడ ‘రీడింగ్‌ డే’గా జరుపుతుంటారు. చదవడాన్నీ, చదివే వాతావరణాన్నీ మలయాళీయులు ఎంతగా ప్రోత్సహిస్తున్నారనడానికి ఇది రుజువు. ఈమధ్య ‘కేరళ లెజిస్లేచర్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెస్టివల్‌–2025’ ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా తిరువనంతపురంను ‘యునెస్కో’ గుర్తించాలని కోరింది అందుకే. తమ రాజధాని నగరం ఆ గౌరవానికి పూర్తిగా అర్హమైనదేనని ఆయన ధీమా!

గతేడాదే ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో కేరళలోని మరో నగరమైన కోళిక్కోడ్‌ను ‘సాహిత్య నగరం’గా గుర్తించిన సంగతి ఇక్కడ గుర్తుచేసుకోవాలి. భారత్‌లో యునెస్కో గౌరవం దక్కించుకున్న తొలి నగరం ఇదే. ఒక్క కోళిక్కోడ్‌లోనే 600 గ్రంథాలయాలు, రీడింగ్‌ రూములు ఉన్నాయి. వాసుదేవన్‌  నాయర్, వైకోం మహమ్మద్‌ బషీర్, పి.వత్సల లాంటి ఎందరో రచయితలకు కోళిక్కోడ్‌తో అనుబంధం ఉంది. యునెస్కో మొదలైన 1945లోనే కేరళలో ‘సాహిత్య ప్రవర్ధక సహకార సంఘం’ ఏర్పాటుకావడం ఆ రాష్ట్ర ఘన సాహిత్య వారసత్వాన్ని గుర్తుచేస్తోంది. 

పుస్తకాల ప్రచురణ కోసం కొంతమంది రచయితలు కలిసి ఏర్పాటుచేసిన ఈ సంఘం సుమారు 8,400 పుస్తకాలను ప్రచురించింది. మలయాళ సినిమా అంతగా వర్ధిల్లుతుండటానికి కూడా ఈ సాహిత్య దన్నే కారణం. అందుకే ప్రముఖ సినీ జర్నలిస్ట్‌ అనుపమా చోప్రా నవతరం మలయాళ దర్శకులను ఇంటర్వ్యూ చేస్తూ, ‘అసలు మీరు ఏంచదువుతారు? ఏం చూస్తారు?’ అని ప్రశ్నించారు.

పుస్తక ప్రేమికులుగా వ్యక్తులు ఉండటం దానికదే విశేషమే. కానీ వ్యవస్థలు పుస్తకాన్ని ప్రేమిస్తే దాని ప్రభావం వేరే ఉంటుంది. ‘పర్వతము ఎంత ఎత్తయి గగన భేద్యమయినా దాని విశాలమైన వక్షస్థలము నుండి చిన్న సెలయేరుగాని ప్రవహించకపోతే ఆ ప్రకృతి సౌందర్యం అసమగ్రంగా ఒంటరిగా శుష్కంగా గోచరిస్తుంది, ’ అంటారు తన ‘జీవనలీల’ పుస్తకంలో కాకాసాహెబ్‌ కాలేల్కర్‌. ఒక ఇల్లు ఎంత ఘనంగా నిర్మించినా దానిముందు ఒక పూలచెట్టో, ఒక ఊరు ఎంత పెద్దదయినా దాని మధ్యన ఒక గ్రంథాలయమో లేకపోతే అవి అసంపూర్ణం అవుతాయి. పువ్వులు (ప్రకృతి), పుస్తకాలు (వివేకం) ఉన్న ప్రతిచోటూ దేవభూమే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement