books
-
మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ జదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల జదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుకుకు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతకకర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తల మీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతిరోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దారులు మూస్తున్నట్టే!ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్‌ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం– రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి. -
డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది
‘ఆలియా భట్ నటి మాత్రమే కాదు, ఎంటర్ప్రెన్యూర్ కూడా’... ఈ వాక్యానికి కొనసాగింపుగా ‘చక్కని స్టోరీ టెల్లర్’ అనే ప్రశంసను కూడా చేర్చవచ్చు. ఎందుకంటే ఆలియా ప్రతి రాత్రి తన కూతురు రాహాకు ఏదో ఒక పిల్లల పుస్తకం చదివి వినిపిస్తుంది. రాహా ‘ఆహా’ అంటూ వింటుంది.‘తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పుస్తకాలు చదవడం అనేది వారి భవిష్యత్‌కు పెట్టుబడి పెట్టడంలాంటిది’ అంటుది ఆలియాభట్. ‘ఎడ్–ఏ–మమ్మా’ అనే చిల్డ్రన్ బ్రాండ్ (ప్లేవేర్, స్టోరీ బుక్స్, టాయ్స్ అండ్ మోర్) వోనర్ అయినా ఆలియా తన బ్రాండ్‌లో కొత్త చిల్డ్రన్ బుక్ సిరీస్‌ను లాంచ్ చేసింది. ‘పిల్లల కోసం తల్లులు స్టోరీ టెల్లింగ్ సెషన్లు నిర్వహించడం అనేది మంచి విధానం’ అంటున్నారు మానసిక నిపుణులు. ‘బెడ్ మీద పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడం అనేది వారి మానసిక వికాసంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉచ్చారణలను, కొత్త పదాలను నేర్చుకుంటారు. పిల్లలకు కొత్త విషయాలు తెలియజేయడానికి ఇదొక అద్భుత సాధనం. ఇది పిల్లలతో తల్లిదండ్రుల భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది. పిల్లల ఏకాగ్రతను పెంచుతుంది. రోజువారీ షెడ్యూల్లో ప్రతి రాత్రి పుస్తక పఠనాన్ని తప్పనిసరి చేయడం పిల్లల్లో క్రమశిక్షణను పెంచుతుంది’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ శృతి వస్త. -
అపురూపమైన పుస్తక నిధి.. బ్రౌన్ గ్రంథాలయం
సాక్షి ప్రతినిధి కడప: ఆంగ్లేయుడైనప్పటికీ తెలుగు భాషపై ఉన్న అభిమానంతో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు. అటువంటి మహనీయుడి పేరుమీద స్థాపించిన గ్రంథాలయం సాహితీవేత్తల కృషితో అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. దాతల సహకారంతో విలువైన పుస్తకాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం రికార్డుల ప్రకారం దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. సాధారణ కథల పుస్తకాలు, కవితా సంకలనాల నుంచి మహా పండితులు రాసిన కావ్యాలు, గ్రంథాలు, అత్యంత విలువైన పరిశోధక గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ గ్రంథాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కడప నడి»ొడ్డున ఉన్న ఈ గ్రంథాలయం తెలుగు సాహితీ అభిమానులకు సందర్శనీయ స్థలంగా మారింది. కడప నగరంలో నిర్వహించిన జిల్లా రచయితల సంఘం ఉత్సవాలకు అతిథులుగా ప్రముఖ సాహితీవేత్తలు ఆరుద్ర, జీఎన్‌రెడ్డి, బంగోరె తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా కడపలో బ్రౌన్ నివసించిన శిథిల భవనాన్ని చూడాలని స్థానిక సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్త్రిని కోరారు. దాన్ని చూసిన సాహితీవేత్తలు.. దీన్ని ఇలాగే వదిలేయొద్దని, నిరంతర సాహితీయజ్ఞం సాగిన ఈ పవిత్ర స్థలం భవిష్యత్తులో కూడా విరాజిల్లాలని బ్రౌన్ మహాశయుని పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని హనుమచ్చాస్తికి సూచించారు. అందరూ నాటి కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డిని కలిసి విషయం వివరించారు. ఆయన సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిరి్మంచాలని నిర్ణయించారు. కలెక్టర్ సహకారంతో స్థానిక సాహితీవేత్తలు, పెద్దలు బ్రౌన్ నివసించిన శిథిల భవనం స్థలాన్ని నాటి సీనియర్ ఆడిటర్ సీకే సంపత్‌కుమార్ నుంచి కానుకగా తీసుకున్నారు. జానమద్ది హనుమచ్ఛా్రస్తితోపాటు స్థానిక సాహితీవేత్తల సహకారంతో కమిటీ ఏర్పడింది. బ్రౌన్ పేరిట గ్రంథాలయ భవన నిర్మాణం ప్రారంభమైంది. పుస్తక సాగరం పలువురు పుస్తక దాతలు, సాహితీవేత్తలు తమ వద్దనున్న విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. వల్లూరుకు చెందిన పోలేపల్లె గంగన్న శ్రేష్టి అలియాస్ రాజాశెట్టి అనే దాత ఇచ్చిన కొన్ని పుస్తకాలతో బ్రౌన్ గ్రంథాలయం ప్రారంభమైంది. ప్రస్తుతం రికార్డుల ప్రకారం ఇక్కడ దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. రికార్డులకు ఎక్కాల్సిన పుస్తకాలు మరో 10వేల దాకా ఉన్నాయి. రెండో అంతస్తులో తాళపత్ర గ్రంథాల విభాగం ఉంది. పూర్వం కాగితాలు అందుబాటులో లేనికాలంలో మన పెద్దలు సమాచారాన్ని తాటాకులపై రాసి భద్రపరచేవారు. వీటినే తాళపత్ర గ్రంథాలు అంటారు. అలాంటి ఎన్నో గ్రంథాలు, ముఖ్యంగా 200 సంవత్సరాలకు పూర్వం నాటి తాళపత్ర గ్రంథాలెన్నో ఇక్కడ ఉన్నాయి. పట్టుకుంటే పొడి, పొడిగా రాలిపోయే స్థితిలో ఉన్న పురాతన కాలం నాటి హ్యాండ్‌మేడ్ పేపర్, ఇతర రకాల కాగితాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నిపుణులైన ఉద్యోగులు వీటిని మరో వందేళ్ల పాటు భద్రంగా ఉంచేందుకు కెమికల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ కూడా చేసి భావితరాల కోసం వాటిని జాగ్రత్తపరుస్తున్నారు. ఈ గ్రంథాలయంలో రాగి రేకులు కూడా ఉన్నాయి.తాళపత్ర గ్రంథాల కంటే ఎక్కువ రోజులు నిలిచి ఉండేందుకు అప్పట్లో రాగి రేకులపై రాయించేవారు. ఈ గ్రంథాలయాన్ని సందర్శించేవారు తప్పక ఈ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు, సాహితీవేత్తలు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే సాహితీవేత్తలు, అధికారులు కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. తెలుగునాట ఈ గ్రంథాలయం వైఎస్సార్ జిల్లా కీర్తిని నలుదిశలా చాటుతోంది. యేటా దాదాపు 100కు పైగా సాహితీ కార్యక్రమాల నిర్వహణతో బంగోరె, ఆరుద్రల ఆశయం నెరవేరినట్లయింది. ఈ లైబ్రరీలో ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు. రూ.500 నగదుతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధారం కోసం ఏదైనా సర్టిఫికెట్ తీసుకుని వచ్చి సభ్యత్వం పొందవచ్చు. వివరాలకు గ్రంథాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. అలాగే ఈ గ్రంథాలయాన్ని ఆదివారంతో పాటు, ఇతర సెలవు దినాల్లోనూ సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఓ సంచాలకులు ప్రధాన బా«ధ్యులుగా ఉన్నారు. ఇద్దరు సహాయ పరిశోధకులు, మరో ఇద్దరు గ్రంథాలయ సహాయకులు, అటెండర్లు, వాచ్మెన్లు మరో ఐదుగురు సేవలందిస్తున్నారు. విస్తరణ దిశగా... బ్రౌన్ గ్రంథాలయాన్ని విస్తరించాలని పాలకమండలి, అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 20 సెంట్లలో ఉన్న గ్రంథాలయంతో పాటు వెనుక ఉన్న స్థలంలో 25 సెంట్లు కొనుగోలు చేశారు. స్థల దాతలు సీకే సంపత్‌కుమార్ మనవరాలు మరోమారు తమ వంతు విరాళంగా మరో ఐదు సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రంథాలయాన్ని సందర్శించి విస్తరణ కోసం రూ. 6.50 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. కొత్త భవనం పూర్తయితే తెలుగు వారికి మరింత అపురూపమైన గ్రంథనిధి అందినట్లవుతుంది. నాటి నుంచి నేటి దాకా... 1987 జనవరి, 22న బ్రౌన్ పేరిట గ్రంథాలయానికి పునాది పడింది. ఆ భవన నిర్మాణాన్ని యజ్ఞంలా భావించారు జానమద్ది. నిధుల సేకరణకు ఒక దశలో ఆయన జోలె పట్టారు. 1996లో మొదటి అంతస్తు పూర్తి కాగా, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చిన నిధుల నుంచి రూ. 5లక్షలతో 2003 అక్టోబర్, 9న రెండో అంతస్తు పూర్తయింది. 1995 నవంబరు, 29న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. సాహితీవేత్త, సమాజ సేవకులు వావిలాల గోపాలకృష్ణయ్య గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. కాలక్రమంలో గ్రంథాలయ నిర్వహణ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కూడా కష్టతరమైంది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 జనవరి, 27న బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని వాగ్దానం చేయడమే కాక, శాశ్వత నిర్వహణ కోసం యోగివేమన విశ్వ విద్యాలయానికి అప్పగించారు. -
దేవుణ్ణి చూసిన వాడు
‘వానలో కలిసిన చీకటి ఆకాశం నుంచి నల్లటి విషంలా కారుతోంది’ అని మొదలవుతుంది తిలక్ ‘దేవుణ్ణి చూసిన వాడు’ కథ. ఆ రాత్రి వానలో ఉలిక్కిపడి లేచిన గవరయ్యకు పెరటి వసారాలో ఏదో మూలుగు. ఏమిటది? లాంతరు తీసుకుని బయటకి వచ్చాడు. హోరుగాలి... భీకర వర్షం... మూలుగుతూ పడి ఉన్న ప్రాణి. లాంతరు ఎత్తి చూసి దిమ్మెరపోయాడు. భార్య. తనను వదిలిపెట్టి వెళ్లిన భార్య. ‘గవరయ్య భార్య లేచిపోయిందట’ అని ఊరంతా గేలి చేయడానికి కారణమైన స్త్రీ. మోసపోయి, నిండు గర్భంతో, నొప్పులు పడుతూ, మొహం చెల్లక వసారాలో పడి ఉంది. దూరంగా మెరుపు మెరిసింది. చెవులు చిల్లులుపడేలా పిడుగు. కాన్పు జరిగిపోయింది. కేర్‌మని– చేతుల్లోకి తీసుకోగానే సముదాయింపు పొందిన ఆ పసికూన గవరయ్యతో బంధమేసింది. క్షణం ఆలోచించలేదు అతడు. ఆమెను, ఆమె కన్న తనది కాని బిడ్డను లోపలికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఊరిపెద్దలు ‘లేచిపోయిందాన్ని ఏలుకుంటావా’ అని వస్తే గవరయ్య ఏం చేశాడు? కత్తి పట్టుకు వచ్చి ‘అడ్డు పడినవాళ్లను అడ్డంగా నరుకుతాను’ అన్నాడు. అతడు మనిషి. దేవుడు. మానవత్వంలో దేవుడిని చూసినవాడు.మధురాంతకం రాజారాం ‘కొండారెడ్డి కూతురు’ అనే కథ రాశారు. ఫ్యాక్షనిస్టు కొండారెడ్డి కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. పారిపోయి బతుకుతోంది. చాన్నాళ్ల తర్వాత ఊరి మనుషులు చూడటానికి వచ్చారు. తన మనుషులు. తన తండ్రి దగ్గర పని చేసే మనుషులు. కొండారెడ్డి కూతురు ఎంతో సంతోషపడింది. మర్యాదలు చేసింది. వారి చేసంచుల్లో చాటుగా ఉన్న ఆయుధాలు చూసి అంతలోనే నిశ్చేష్టురాలైంది. తనను, భర్తను చంపుతారన్నమాట. తండ్రి పంపించాడన్న మాట. కాని ఇంటికి వచ్చిన అతిథులను అవమానించవచ్చా? వారి కోసం ఏమిటేమిటో వండింది. కొసరి కొసరి వడ్డించింది. ఊరి ముచ్చట్లు అడిగి చెప్పించుకుంది. ఆ రాత్రి తనకు ఆఖరు రాత్రి. హాలులో కుర్చీ వేసుకుని భర్త గదికి కాపలా కూర్చుంది. వాళ్లు వస్తారు. తనని చంపుతారు. కొండారెడ్డికి పుట్టినందుకు తాను చస్తుంది. కాని భర్తను చంపడానికి వీల్లేదంటుంది. వాళ్లు వచ్చారు. నీడల్లా నిలబడ్డారు. చంపుతారనుకుంటే కాళ్ల మీద పడ్డారు. ‘అమ్మా మేమెందుకొచ్చామో తెలిసీ అన్నం పెట్టావు. చెడ్డ పనులు చేసే రోజు మీ అమ్మ ముఖం చూడకుండా తప్పుకునేవాళ్లం. చూస్తే చేయలేమని. ఇవాళ నీ ముఖం చూస్తూ నిన్నెలా చంపుతా మమ్మా’... ఏడుస్తూ కాళ్లు కడుగుతున్నారు. ఆమె మనిషే. దేవత కాకపోవచ్చు. కాని మానవీయత ఉన్న మనిషి వదనంలో దైవత్వం ఉంటుంది.‘మనందరం దేవుళ్లమే’ అంటాడు ‘సత్యమే శివం’లో కమలహాసన్. ‘సృష్టీ విలయం రెండూ మన చేతుల్లోనే’ అంటాడు ‘సెపియెన్స్’ పుస్తక రచయిత హరారి. ‘నేటి మనిషి రెండు విషయాల వల్ల మనిషి గుణాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ఒకటి ప్రకృతి విధ్వంసం– రెండు సాంకేతికతను పెంచి తాను మరుగుజ్జుగా మారడం’ అంటాడు హరారి. ప్రకృతికి ఎడంగా జరిగే కొద్ది, పరిసరాల్లో సిమెంటు పెరిగే కొద్ది, నాలుగు గోడల నుంచి నాలుగు గోడలకు అతని దినచర్య మారేకొద్ది సహజమైన మానవ స్పందనలు మొద్దుబారక తప్పదు. పెట్ డాగ్స్ సమక్షంలో అతడు పొందగలుగుతున్నది కొద్దిగా ఓదార్పే. పల్లెలో ప్రకృతిలో ఉన్నప్పుడు గొడ్డూ గోదా, మేకా ఉడుతా, కాకీ పిచుకా అన్నీ అతని స్పందనలను సజీవంగా ఉంచేవి. ‘ఎలా ఉన్నావు?’ నుంచి ‘ఎంత సంపాదిస్తున్నావు?’ను దాటి ‘ఏం కొన్నావు?’కు వచ్చేసరికి అతనిలో మొదలైంది పతనం.‘లాభం’ అనే మాట కనిపించని దారాలతో ఆడించే మాయావి. మనిషిని ఎంత ఓడిస్తే లాభం అంత గెలుస్తుంది. అంతేకాదు ‘మనిషి మీద నమ్మకం పోయింది’ అనే మాటను పుట్టించడం లాభాపేక్ష గల పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాథమిక అవసరం. మనిషి మీద నమ్మకం పోయేలా... వాణ్ణి అది వస్తుగత, స్వార్థపరమైన, సంపద లాలసలో కూరుకుపోయేలా చేస్తుంది. లాభపడాలంటే, సుఖపడాలంటే చేయవలసింది మానవత్వాన్ని త్యాగం చేయడమే. అది పోగానే వాడు కుటుంబంతో, స్నేహితులతో, సమాజంతో, ప్రకృతితో, మానవాళితో ఎంత దారుణంగా అయినా వ్యవహరించవచ్చు. ‘మనిషి మీద నమ్మకం పోయేలా’ చేస్తే పెట్టుబడిదారీ వ్యవస్థకు మరో లాభం ఏమిటంటే... ఏ మనిషీ మరో మనిషితో కలవడు. సమూహంగా మారడు. తిరుగుబాటు చేయడు. నలుగురు బాగుపడి కోట్ల మంది మలమలమాడే వ్యవస్థకు ఢోకా రానివ్వడు. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ ‘యుద్ధం’ అనే ముద్దుబిడ్డను పదేపదే కంటూ ఉంటుంది. యుద్ధం మానవత్వానికి అతి పెద్ద విరుగుడు. అయితే మనిషి ఇలాగే ఉంటాడా? ఏ రచయితో అన్నట్టు ‘రగిలిస్తే రాజుకునే మహాఅగ్ని మానవత్వం’. కోల్‌కతా నిరసనల్లో ఇవాళ అదే చూస్తున్నాం. యుగాలుగా... చితి పెట్టిన ప్రతిసారీ బూడిద నుంచి మానవత్వం తిరిగి జనిస్తూనే ఉంది. కాకుంటే అందుకు కావల్సిన రెక్కలు సాహిత్యమే ఇస్తుందని గ్రహించాలి. తల్లిదండ్రులూ..! మీ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు తప్పకుండా చేయండి. కాని నాలుగు మంచి పుస్తకాలు చదివించి మొదట మనిషిని చేయండి. ఏ విటమిన్ లేమికి ఏం తినాలి సరే... మానవత్వ లేమి ఉందేమో కనిపెట్టి విరుగుడుగా ఒక పుస్తకం చేతిలో పెట్టండి. ఎక్కడ పుస్తకాలు ఉంటాయో అక్కడ మానవత్వపు ఆవరణం ఏర్పడుతుంది. అదే దేవుడు తిరుగాడే తావు. ప్రపంచ మానవత్వ దినోత్సవ శుభాకాంక్షలు. -
మీ ఇంటి దగ్గర పుస్తకాలను అద్దెకు ఇచ్చే షాపులు ఉన్నాయా?
మన పక్కింటికో, ఎదురింట్లోకో పండగ సెలవులకని ఎవరైనా కొత్తపిల్లలు వచ్చినపుడు మాటా మాటా కలిసినపుడు మీ ఊరు పెద్దదా మా ఊరు పెద్దదా అని ఒక అంచనా వేసుకొవడానికి అడిగే మొదటి ప్రశ్న మీ ఊర్లో సినిమా టాకీసులు ఎన్ని ఉన్నాయి? అని అయి ఉండేది. నా కటువంటి సమస్యే ఎదురయ్యేది కాదు. నాకు కావలసిన భోగట్టా అల్లా మీ ఊర్లో, మీ ఇంటి దగ్గర పుస్తకాలకు అద్దెకు ఇచ్చే షాపులు ఎన్ని ఉన్నాయని మాత్రమే.నాకు ఊహ తెలిసాకా తరుచుగా ఎమ్మిగనూరుకు వెల్తుండే వాడిని. ఊర్లో దిగి మా మేనత్త ఇంటికి వెళ్ళే రిక్షా ఎక్కాకా దారికి అటూ ఇటూ చూస్తూ ఆ ఊరిలో పుస్తకాల బంకులు ఎన్ని ఉన్నాయా ? ఎక్కడెక్కడ ఉన్నాయా అని బుర్రలో గురుతులు పెట్టుకునేవాడిని . మా నూనెపల్లె లో భద్రయ్య బంకు అద్దె పుస్తకాలకు పేరెన్నికది. నూనెపల్లె సెంటరు లో గుర్రాల షెడ్డుకు ఎదురుగా ఉండేదది. ఆ బజారు అంతా కోమట్ల ఇల్లు ఎక్కువగా ఉండేవి. భద్రయ్య గారు కూడా కొమట్లే. ఆయన కొడుకు భాస్కర్ ఆ బంకులో ఎక్కువగా కూచునేవాడు. బంకు సీలింగు కు ఒక చిన్న ప్యాన్ బిగించి ఉండేది. బంకులో ఒక మూల రేడియో కూడా. అక్కడ నాకు పుస్తకాల తరువాత అత్యంత ప్రీతిప్రాత్రమైన వస్తువు బెల్లంపాకపు వేరుసేనగ గట్టా. ఎంతో రుచిగా ఉండేదది . ఇప్పుడు అటువంటి గట్టాలే ఆల్మండ్ హౌస్ లో కనపడతాయి. రూపం ఒకటే కాని ధర మాత్రం హస్తిమశకాంతరం. పుస్తకాలు, గట్టాల తరువాత నాకు ఫేవరెట్ అనదగ్గది గుడ్ డే బిస్కత్తు. గాజు సీసాలలో చక్కగా అమర్చి పెట్టి ఉండేవి. సుతారంగా అల్యూమినియం మూత తిప్పి అడిగిన వారికి బిస్కట్లు ఇచ్చేవాడు భద్రయ్య . అపుడు ఆ సీసాలోనుంచి బిస్కెట్ల వాసన ఎంత కమ్మగా వచ్చేదో. ఇప్పుడు అప్పుడప్పుడూ రత్నదీప్ సూపర్ మార్కెట్ కు ఏదయినా సరుకులు కొనడానికి వెడతానా, బిస్కెట్ కౌంటర్ దగ్గర గుడ్ డే ప్యాకెట్ పుచ్చుకుని ఆ చిన్ననాడు తగిలిన చక్కని వాసన వస్తుందా లేదా అని చూస్తా, రానే రాదు. ఆ వాసన లేని బిస్కెట్ కూడా రుచిగా అనిపించదు నాకు . నేను భద్రయ్య అంగట్లో పుస్తకం తీసుకుంటే కూడా ఉన్న ఫ్రెండ్ ఎవరో ఒకరు బిస్కెటో , బుడ్డల గట్టానో కొనేవాడు అది ఇద్దరం పంచుకుని తినుకుంటూ నడిచే దారిలోనే పుస్తకాన్ని నమిలేస్తూ కదిలేవాడ్ని.పుస్తకాలు అద్దెకిచ్చే షాపులో ఆ గోడల నిండా వందలుగా పుస్తకాలను నిలువ వరుసల్లో నింపేవారు. స్కెచ్చు పెన్నులతో పుస్తకాల మీద పేర్లు రాసి ఉండేవి. ఏ పుస్తకం కోసం కష్టపడి వెదుక్కోనక్కరలేదు. చక్కని చేతి రాతలో ఆ పేర్లు కళ్ళని ఆకర్షించేవి. చాలా షాపుల్లో అయితే పత్రికలో సీరియల్ గా వచ్చిన నవల పేజీలని చించి పుస్తకంగా బైండ్ చేసి అద్దెకు ఇచ్చెవారు. కొత్తగా రిలీజ్ అయిన పుస్తకాలయితే డిమాండ్ ఎక్కువ కాబట్టి వాటిని జనం కంట పడకుండా సెపరేట్ గా ఉంచేవాళ్ళు. నియమిత ఖాతాదారుల కోసం ఆ పుస్తకాలు పక్కకు తీసిపెట్టేవారు. షాపు వాళ్ళు ఏ పుస్తకాన్ని కూడా ఒకటి ఒకటిగా కొనేవాళ్ళు కాదు. ప్రతి పుస్తకం రెండు మూడు ఉండేవి సూపర్ స్టార్లయిన మధుబాబు, మల్లాది, యండమూరి పుస్తకాలయితే అయిదు లెక్కన కొనేవారు. ఆ పుస్తకాలు వచ్చిన కొత్తలో అయిదేం ఖర్మ పది కొన్నా అంత సులువుగా పాఠకుల చేతికి వచ్చేవి కావు. త్రిమూర్తులకు డిమాండ్ ఎక్కువ. ఎవరు ఎంత గీ పెట్టి చచ్చినా ఒకానొక కాలంలో హైస్కూలు పిల్లవాళ్ళ దగ్గరి నుండి సకుటుంబ సపరివారం వరకు తెలిసిన రచయితలంటే వీరే . పెరిగిపెద్దయి అతి పెద్ద చదవరులయిన ఆ రోజుల చదువరులు చాలామందికి అక్షర ప్రాశన చేసింది వీరే. వీరిలో యండమూరి కాస్త హట్ కే. రాసింది కమర్షియల్, పాపులర్ సాహిత్యమే కావచ్చు. అయినా ఆయన తన పుస్తకాల్లో ఎక్కడో ఒకక్కడ బుచ్చిబాబు, తిలక్ , విశ్వనాథ సత్యనారాయణ, చలం... ఇత్యాదుల ప్రస్తావన తెచ్చేవారు. నాకయితే ఈ మహారచయితల తొలి పరిచయం వీరేంద్రనాథ్ గారి పుస్తకాల్లోనే. ఒక పుస్తకంలో ఆయన ఇట్లావాక్యం వ్రాశారు "తెలుగు సాహిత్యంలో ఒకే ఒక హీరో తంగిరాల శంకరప్ప" ఆ వాక్యాన్ని పట్టుకుని నేను పెద్దయ్యాకా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి సాహిత్యాన్ని మొత్తం చదువుకునే భాగ్యం కలిగింది. లేకుంటే ఎక్కడి చిన్న పల్లె నూనెపల్లె? దానికి అద్భుతమైన సాహిత్యం ఎంతెంత దూరం?షాపు పెట్టాము కదాని వచ్చిన ప్రతి ఒక్కరికి పుస్తకాలు ఇవ్వబడవు. బ్యాంకులో అకవుంట్ తెరవడానికి సాక్షి సంతకం కావాలన్నట్లు, షాపువారికి తెలిసిన వారినెవరినయినా తోడుగా తీసుకెడితేనే పుస్తకాలు ఇస్తారు. లేదా పుస్తకం ధరమొత్తం అడ్వాన్సుగా కట్టాలి. నాకు గుర్తు ఉండి కొందరు 20 రూపాయలు బయానా గా పుచ్చుకునేవారు. అంత డబ్బు ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? అందుకని నేను ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి అడ్వాన్స్ కట్టే వాణ్ని, అద్దె చెల్లించే వాడిని. పుస్తకాలు నాకు దొంగతనం నేర్పాయి. అలవాటు ఐయింది కదాని ప్రతిఎప్పుడూ దొంగతనం చేయకూడదు. పట్టుబడి పోతాం. అందుకే పుస్తకాలకు అద్దె అప్పు పెట్టడం నేర్చుకున్నాను. ఈ రోజుల్లో చోరీ చేస్తూ పట్టుబడిన పిల్లలు ఎవరైనా పుస్తకాలు కొనడానికి దొంగతనం చేసాను అని ఏడుపుముఖంతో అంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోబుద్ది వేస్తోంది. నేను పెరిగి పెద్దయ్యాక ఒకసారి నాకెంతో ఇష్టమైన ఆర్టిస్ట్ పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక దిగాలుగా ఉంటే ఏమిటి విషయమని అడిగి తెలుసుకుని చిత్రకారులు శ్రీ బాపు గారు దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకోలేదు కానీ ఇరవైవేల రూపాయలు ఇచ్చి నా ముఖంలో నవ్వు చూశారు . అద్దెకు తీసుకున్న పుస్తకాన్ని తమ వద్దనున్న రిజిస్టరు పుస్తకంలో తేది, సమయం వేసి , మళ్ళీ ఆ పుస్తకాన్ని రేపటి రోజున అదే సమయం లేదా అంతకంటే ముందుగా తెచ్చి ఇస్తే ఒక రోజు అద్దె, రోజు మారిన కొద్దీ అద్దె రెట్టింపు అయ్యేది ,ఒక్కొక్క సారి అద్దె కట్టడానికి కి డబ్బులు లేక పుస్తకాన్ని అట్లానే అట్టిపెట్టేసుకుని పుస్తకం ధరకన్నా ఎక్కువ అద్దె డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడప్పుడు షాపు యజమానికి ఏదయినా పనిపడో , భోజనానికి వెళ్ళవలసి వచ్చినపుడో పుస్తకాల షాపు మూసి ఉండేది. షాపు మూసి ఉన్నదేమి అని ఖంగారు పడకూడదు. అంగడి చెక్కలకు సన్న సందులు ఉంటాయి . అందు గుండా పుస్తకాన్ని పడెయ్యాలి. షాపు ఆయన తిరిగి వచ్చాక మన పుస్తకం నెంబరు , పేరూ చూసి పుస్తకం ముట్టినట్టుగా పద్దు వేసుకుంటాడు. అద్దె బకాయి రాసుకుంటాడు.మా ఇంటి దగ్గరలోనే, శివశంకర విలాస్ దగ్గర ఒక క్రైస్తవ కుటుంబం పుస్తకాల బంకు పెట్టుకున్నారు. అమ్మా, నాన్న, ఒక అబ్బాయి. ఒకరు లేనప్పుడు ఒకరు ఆ షాపు చూసుకునేవారు. నేను వాళ్లదగ్గర పుస్తకాలు అద్దెకు తీసుకునేవాడిని. యండమూరి వీరేంద్రనాథ్ "’రక్తసింథూరం" పుస్తకం అక్కడే తీసుకున్న గుర్తు నాకు. ఆ పుస్తకానికి చిత్రకారులు చంద్ర గారు వేసిన బొమ్మని చూసి మంత్రముగ్దుణ్ణి అయ్యాను ఆ కాలల్లోనే. ఒకసారి పుస్తకాలకు అద్దె చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు ఒక ఉపాయం చేశా. కొడుకు ఆ షాపులో ఉన్నపుడు పుస్తకం తీసుకున్నాను అనుకో, పుస్తకం తిరిగి ఇచ్చేటప్పుడు అతను కాకుండా వాళ్ళ అమ్మగారో , నాయనో ఉన్నప్పుడు పుస్తకం వాపసు ఇచ్చి అద్దె ముందే కట్టా అని చెప్పేవాడిని. కొన్ని సార్లు పుస్తకం అద్దె ముందే కట్టించుకునేవారు. పుస్తకాలు నాకు మోసాన్ని కూడా నేర్పాయి. ఆ కుటుంబం వారు కడు బీదవారు. వారి రూపు, వేసుకున్న బట్టలు ఆ విషయాన్ని యథాతంగా చూపేవి. ఇప్పుడు ఎప్పుడయినా నాకు ఏదయినా అన్యాయం జరిగింది అనిపించినపుడు నేను ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని వారిని మోసం చేసినందుకు ఇదంతా నాకు తగినదే జరిగింది అనుకుంటాను. ఇపుడు ఆ బంకు వాళ్ళు ఎవరూ కనపడరు కానీ కనపడితే బావుండు, వాళ్ళ చేతులు పట్టుకుని మన్నించమని ప్రాధేయపోయేవాడినే. పుస్తకాల చదువు వలన నేను దొంగతనం, మోసం నేర్చుకుంటే నా ప్రెండు బాషా అనేవాడికి పుస్తకాలు వ్యాపారం నేర్పాయి. ఆ రోజుల్లో ఎంత పెద్ద పుస్తకాన్నయినా ఒక దెబ్బకు గంటా రెండు గంటల్లో చదివేసేవాళ్లం. మరి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లొక లెక్క. మా బాషాగాడు ఏం చేసేవాడంటే వాడు ఒక పిల్లల పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకుని చదివేసి , ఒకోసారి చదవకుండా కూడా మాకు అద్దెకు ఇచ్చేవాడు. గంటకు పావలా పుచ్చుకునేవాడు . షాపులో అయితే పుస్తకాన్ని ఒక గంటకు వెనక్కి ఇచ్చినా, ఒక రోజుకు వెనక్కి ఇచ్చినా రూపాయో, రూపాయిన్నరనో కట్టక తప్పదు . బాషగాడి పావలా పథకం హాయిగా ఉండేది. వాడు ఇచ్చినంత మందికి అద్దెకు ఇచ్చి , అద్దె చెల్లించి ఆ పై దర్జాగా మిగిలిన డబ్బులు జేబులో వేసుకునే వాడు.చిన్న చిన్న బంకుల్లో కుదరదు కానీ, కాస్త పెద్ద షాపుల్లో అయితే పుస్తకాలు చూస్తూన్నట్టుగా నటిస్తూ, షాపు యజమాని తల తిప్పగానే చేతిలో ఉన్న పుస్తకాన్ని చొక్కా ఎత్తి లటుక్కున నిక్కరుకు పొట్టకు మధ్యలో దాచేవాళ్లం. పుస్తకం చదివెయ్యగానే మళ్ళీ వెనక్కి వచ్చి పుస్తకాన్ని ఆ అరల మధ్యనే ఇరికించి వెళ్ళేవాళ్లం. చెప్పుకుంటూ పొతే చాలా సంగతులు ఊరుతూనే ఉంటయి. నిజానికి ఎలా కనుమరుగయ్యాయో, ఎప్పుడు కనుమరుగయ్యాకో కూడా ఊహకు అందడం లేదు ఆ పుస్తకాలని అద్దెకు ఇచ్చే షాపులు. టెంత్ క్లాస్ లోనా? కాదేమో ! ఇంటర్ మీడియట్ లోనా , లేక డిగ్రీ రోజుల్లోనా? ఏమో గుర్తు లేదు. సినిమా థియేటర్ టికెట్ కౌంటర్ బయట నిలబడ్డంత పెద్ద బారు వరుస కాకపోయినా , అద్దె పుస్తకాల షాపు, బంకుల బయట వరుసలో నాలుగురయిదుగురే ఉన్నా, కొత్త నవల కోసం విపరీతమయిన ఒత్తిడి తోనో , నాలుగురోజులుగా తెగ తిరుగుతున్నా ఇంకా దొరకని అభిమాన రచయితా పుస్తకం ఈరోజైనా దొరుకుతుందా లేదా అనే మనోదౌర్బల్యం తోడుగానో నిలబడి ఉండేవారు పాఠకులు. వట్టి అద్దె పుస్తకాలే కాదు. ఊరి మెయిన్ సెంటర్లలోనూ, సందు చివర, వీధి మలుపులో ప్రతిచోటా దినపత్రికలు, వార పత్రికలూ, పక్షపత్రికలు, పిల్లల పత్రికలూ , పాకెట్ నవల్స్ కనపడుతూనే ఉండేవి, ఈరోజు ఒక దినపత్రిక కోసమో, వార పత్రిక కోసమో కిలోమీటర్లకు కిలో మీటర్లు నడిచినా ఒక్క పుస్తకమూ రోడ్డు మీద కనపడుత లేదంటే అత్యంత సాంస్కృతిక లేమి నడుస్తున్న రోజులవి . ఆరోజుల్లో కథలు, నవలలు, పాటలు , పద్యాలు అనేకాలు పుస్తకాలుగా దొరికేవి. రచయితల ముక్కు మొహంతో అవసరం లేని రోజులవి. రాసిందే భాగ్యం. కంటపడిన అచ్చు కాగితమే వరం. ఈ రోజున వద్దన్నా వీధికొక, సందుకోక, నగరం నాలుగు వైపులా రచయితలూ, కవులు ఊరికూరికే కనపడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సరస్వతి మీద ఒట్టు రచయితల పేర్లు తెలుసు , వారు వ్రాసిన ఒక్క వాక్యం కూడా తెలీదు. రాసేవారు మాత్రమే తెలుస్తున్నారు రచన అందడం లేదు . ఏం రాశారో ఆనవాలు లేదు, చూసిన తనని పోల్చుకుంటే చాలన్నంత అల్పసంతోషి అయిపోయినాడు సృజనకారుడు.-అన్వర్ -
జగనన్న విద్యాకానుక రెడీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ఏటా అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫారం, బూట్లతో కూడిన కిట్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంచేసింది. ఈ నెల 12న పాఠశాలలు తెరిచిన మొదటిరోజే వాటిని అందించేందుకు సామగ్రిని మండల స్టాక్ పాయింట్లకు చేరవేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్లో బోధించే 3.12కోట్ల పాఠ్యపుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు ఇప్పటికే చేరవేశారు. యూనిఫారం సరఫరా శనివారం నుంచి మొదలైంది.వస్తువులను ఒక్కొక్కటిగా స్టాక్ పాయింట్లకు చేర్చిన అనంతరం అక్కడ తరగతుల వారీగా కిట్లను రెడీ చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయగా మిగిలిన 2 లక్షల కిట్లకు అదనంగా ఈ విద్యా సంవత్సరానికి 36లక్షల కిట్లను అధికారులు సిద్ధంచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా వస్తువులను అందించేలా సరఫరాదారులకు ఆదేశాలు జారీచేశారు.అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్‌బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతోపాటు మూడు జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. అదేవిధంగా 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతుల విద్యార్థులకు నోట్‌బుక్స్, అందించనున్నారు. ఇప్పటివరకు విద్యాకానుక కిట్‌లో అందించే తొమ్మిది వస్తువుల్లో బూట్లు మినహా మిగిలిన బ్యాగులు, బెల్టులు, సాక్సులు, పాఠ్య, నోటుపుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ వంటి 8 రకాల వస్తువులు 90 శాతం మండల కేంద్రాలకు చేరాయి. ఒకట్రెండు రోజుల్లో బూట్ల సరఫరా చేపట్టనున్నారు. పాఠశాలలకు 3.12 కోట్ల పాఠ్య పుస్తకాలు..ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను స్టాక్ పాయింట్లకు పంపించారు. 3–10 తరగతుల వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. ఈనెల 8వ తేదీ నాటికే అన్ని స్కూళ్లలోను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కిట్లను సిద్ధంచేయాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్లుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది.రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రాన్ని సీబీఎస్ఈ తరహాలో జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ రూపంలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను పూర్తి ఆర్ట్ పేపర్‌పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదేతొలిసారి కావడం విశేషం. ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్‌గా ఇంజినీరింగ్ విద్యార్థులుఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. వీరి బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్‌గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్‌ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలు ముద్రించి పంపిణీకి సిద్ధంచేసింది. -
దేశంలో లైబ్రరీ విలేజ్ ఎక్కడుంది? ఆ పేరెలా వచ్చింది?
పుస్తకాలు మనిషికి మంచి నేస్తాలని చెబుతుంటారు. పుస్తకాలు మనకు ప్రపంచంలోని సమస్త సమాచారాన్ని అందిస్తాయి. మంచి పుస్తకం మానసిక సంతోషాన్ని కలుగజేస్తుంది. అలాంటి పుస్తకాలకు ఒక గ్రామం నెలవుగా ఉందని, అందుకే ఆ గ్రామానికి లైబ్రరీ విలేజ్ అనే పేరు వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఉత్తరాఖండ్‌లోని అందమైన పర్వత లోయల మధ్య పుస్తక ప్రపంచం ఉంది. 17,500కు మించిన పుస్తకాల సేకరణ ఇక్కడ కనిపిస్తుంది. రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న అగస్త్యముని బ్లాక్‌లోని మణిగుహ్ గ్రామం లైబ్రరీ విలేజ్‌గా పేరు పొందింది. ఇందుకు ‘హమారా గావ్ ఘర్’ ఫౌండేషన్ సహకారం అందించింది. 1,664 మీటర్ల ఎత్తులో ఉన్న మణిగుహ్ గ్రామం ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో హోమ్‌స్టేలు కూడా ఉన్నాయి. 2023, జనవరి 26న హమారా గావ్ ఘర్ ఫౌండేషన్‌ను నెలకొల్పామని లైబ్రరీ డైరెక్టర్ మహేష్ నేగి మీడియాకు తెలిపారు. ఈ ఫౌండేషన్ లక్ష్యం గ్రామాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించడం. గ్రామంలోని ఈ లైబ్రరీలో పుస్తకాలు చదివేందుకు ఎటువంటి రుసుము వసూలు చేయరు. ప్రతిరోజు విద్యార్థుల తమ తరగతులు ముగిసిన తర్వాత లైబ్రరీకి చేరుకుని చదువుకుంటారు. గ్రామంలో లైబ్రరీ ప్రారంభించినప్పుడు మూడు రోజుల పాటు గావ్ ఘర్ మహోత్సవ్ నిర్వహించామని మహేశ్ నేగి తెలిపారు. రైతులు, కవులు, రంగస్థల కళాకారులతో సహా సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాల్లో లైబ్రరీలు తెరుచుకున్నాయి. కాగా మణిగుహ్లో ఏర్పాటైన లైబ్రరీలో పోటీ పరీక్షలు మొదలుకొని సాహిత్యం వరకూ వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. -
విశాఖలో మూడు దారులు పుస్తక పరియ కార్యక్రమం
-
అవగాహనే ప్రధానం
ఏడీహెచ్‌డీ, సెరిబ్రల్ పాల్సీ, ఇతర మనోవైకల్యాలు ఉన్న పిల్లల మానసిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు హైదరాబాద్ వాసి ఫరీదా రాజ్.స్పెషల్ చిల్డ్రన్కు శిక్షణ ఎలా ఇవ్వాలనే అంశాల మీద టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సెంటర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, టీచర్ ట్రైనర్, రెమెడియల్ ఎడ్యుకేటర్, రైటర్ అయిన ఫరీదా రాజ్ తన రచనల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా ప్రజలలో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పిల్లల్లో వచ్చే డిస్లెక్సియాపై పుస్తకాలు రాసిన ఫరీదా రాజ్ ఇటీవల ‘అన్బ్రేకబుల్ స్పిరిట్ – నావిగేటింగ్ లైఫ్ విత్ ఎమ్మెస్ పేరుతో మల్టిపుల్ స్కెర్లోసిస్పై పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది భారతదేశంలో వైద్య లేదా వైద్యేతర వ్యక్తి రాసిన మొట్టమొదటి పుస్తకంగా పేరొందింది. సరైన రోగ నిర్ధారణ, సకాలంలో చికిత్స, సంరక్షణ, కుటుంబ మద్దతుతో వ్యక్తులు సుదీర్ఘమైన, చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాలను గడపవచ్చని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా చెబుతారు ఆమె. ‘‘ఇటీవల చాలా కుటుంబాల్లో తెలియని అలజడిని సృష్టిస్తున్న సమస్య మల్టిపుల్ స్కెర్లోసిస్. దీనిని ఒక జబ్బుగా కాకుండా అవగాహనతో సరిదిద్దాల్సిన అంశంగా గుర్తించాలి. సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిని నేరుగా కలిసి, వారి వేదనను, చికిత్సా విధానాలను ఇందులో పొందుపరించాను. స్పెషల్ కిడ్స్ సామర్థ్యాలకు.. నేను స్కూల్ టీచర్‌గా ఉన్న మొదటి రోజులవి. ట్రైనింగ్ పీరియడ్. క్లాస్‌రూమ్‌లో ఉన్నప్పుడు మొదటి రోజే అక్కడి ఓ సంఘటన నన్ను అమితంగా కదిలించింది. ముగ్గురు, నలుగురు పిల్లలు టీచర్ చెబుతున్న విషయంపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. వారిలో అసహనం స్థాయులు దాటడాన్ని, టీచర్ సహనం కోల్పోవడాన్నీ గమనించాను. ఎదిగే వయసు పిల్లల్లో సహజంగానే చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ సమస్య యువతలో మరింత ఎక్కువగా ఉండటాన్ని చూస్తుంటాం. వారిలో ఆందోళన కూడా ఒకింత ఎక్కువే. ఇలాంటప్పుడు వారికి మెంటల్ వెల్బీయింగ్ అవసరం. ఇక మానసిక వైకల్యాలు ఉన్న పిల్లల్లోనైతే అందరికీ వీరి పట్ల నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఇలాంటి పిల్లలను చూసుకునేవారికి సరైన గైడెన్స్ ఉండటం లేదని ఆ రోజే అనిపించింది. మనోవైకల్యాలు ఉన్న పిల్లల్లో సామర్థ్యాలను వెలికితీయడానికి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రతిరోజూ కృషి చేయాల్సి ఉంటుంది. అభ్యాసంలో వారిని నిమగ్నం చేయడానికి కొత్త కొత్త మార్గాలను కనుక్కోవాలి. దానిపైనే కృషి చేయాలనుకున్నాను. ఆ తర్వాత అందుకు తగిన పరిష్కారాలనూ కనుక్కున్నాను. వందల మంది టీచర్లకు శిక్షణ స్పెషల్ చిల్డ్రన్కు ఎలాంటి శిక్షణ అవసరమో, అందుకు టీచర్ల నైపుణ్యత ఎలా ఉండాలనే దానిపై రెగ్యులర్ సెషన్స్ నిర్వహించాను. ఇది రాష్ట్రస్థాయిలో మంచి మార్పులు తీసుకువచ్చింది. ఉపాధ్యాయులు, నేర్చుకునే ఇబ్బందులు ఉన్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఒక హ్యాండ్–బుక్ తీసుకువచ్చాను. జన్యులోపాలపై అవగాహన ముంబైలో పుట్టి పెరిగిన నేను, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కి వెళుతున్న తొలినాళ్లలో ఒక రోజు, మానసిక వికలాంగురాలైన పాపతో ఉన్న ఒక మహిళను అక్కడ చూశాను. ఆమెతో మాటలు కలిపితే ఆ పాప ఆమెకు ఏడవ సంతానం అని తెలిసింది. ఆమె ఇతర పిల్లలందరికీ కూడా అదే సమస్య ఉంది. జన్యుపరమైన లోపాల వల్ల పిల్లలకు అలాంటి సమస్య వచ్చిందని ఆ మహిళకు తెలియదు. ఆ విషయం తెలియక జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం ఆమె ఎప్పుడూ వెళ్లలేదని తెలుసుకున్నాను. దీంతో ఆ రోజే నిర్ణయించుకున్నాను ఇలాంటి మహిళలకు అవగాహన కల్పించాలని. అప్పటి నుంచి మహిళలకు జన్యుపరమైన కౌన్సెలింగ్స్ చేస్తూ ఉండేదాన్ని. ఈ అంశంపై ఉర్దూ పత్రికతో పాటు జాతీయ స్థాయి పత్రికలలోనూ వీటికి సంబంధించిన కథనాలపై వ్యాసాలు ఇచ్చాను. ఒక్కో అడుగు.. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేయడం నుంచి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకునే వరకు చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలు ఎన్నో. క్యాన్సర్ పట్ల ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఆంకాలజిస్టులచే కార్యక్రమాల నిర్వహణ నన్ను ఎంతోమందికి చేరువ చేసింది. మల్టిపుల్ స్కెర్లోసిస్తో బాధపడుతున్న వ్యక్తులను చూసినప్పుడు ప్రజలకు ఈ విషయం పట్ల అవగాహన లేదని అర్థ్ధమైంది. దీంతో సమస్యను ఎదుర్కొంటున్నవారిని కలిసి, కదిలించే కథనాలను పాఠకుల ముందుకు తీసుకువచ్చాను’’ అని వివరించే ఫరీదా రాజ్ మల్టిపుల్ స్కెర్లోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్‌కి కార్యనిర్వాహక సభ్యురాలిగా పనిచేస్తున్నారు. లాభాపేక్ష లేని ఈ సంస్థ ద్వారా మల్టిపుల్ స్కెర్లోసిస్ బారిన పడిన వ్యక్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
Lepakshi: రాతిలో పోత పోసిన లేపాక్షి అందాలు
ఆమధ్య “హంపీ వైభవం" పేరిట వరుసగా వ్యాసాలు రాశాను. అప్పుడు మా లేపాక్షి మనసు చిన్నబుచ్చుకుంది. హంపీ గురించి అన్నన్ని పుస్తకాలు ప్రస్తావిస్తూ వ్యాసాలు రాశావే! నిన్ను పెంచిన లేపాక్షి గురించి పరిశోధించి వ్యాసాలు రాయకపోతే ఎలా? అని లేపాక్షి జనం నన్ను నిలదీశారు. వారి నిలదీతలో అర్థముంది. లేపాక్షిమీద తపన ఉంది. నామీద లేపాక్షికి ఉన్న ఆ హక్కును గౌరవిస్తూ... లేపాక్షి మీద పరిశోధించి రాసిన సాధికారికమయిన పుస్తకాలను, వ్యాసాలను సంవత్సరం పాటు సేకరించాను. రెండు, మూడు కావ్యాలు కాలగర్భంలో కలిసిపోవడం వల్ల దొరకలేదు. నాకు దొరికిన ప్రచురితమైన నలభై తెలుగు, కన్నడ, ఇంగ్లీషు లేపాక్షి పుస్తకాల నుంచి ప్రధానంగా మూడింటి ఆధారంగా ఈ వ్యాసాలను రాస్తున్నాను. అవి:- 1. లేపాక్షి: రచయిత- ప్రఖ్యాత చారిత్రక పరిశోధకుడు ఆమంచర్ల గోపాలరావు. ఇంగ్లీషులో దీన్ని మోనో గ్రాఫ్ పరిచయ వ్యాసంగా పేర్కొన్నా పరిశోధన స్థాయి గ్రంథం ఇది. 1969లో ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడెమీ ప్రచురణ. 2. లేపాక్షి ఆలయం: రచయిత- హిస్టరీ ప్రొఫెసర్ వి కామేశ్వర రావు, ఎస్ వీ యూనివర్సిటీ, తిరుపతి. పరిశోధన గ్రంథం. 1987 ప్రచురణ. 3. త్యాగశిల్పం..పద్య, గద్య కావ్యం: కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో కీలకమైన పదవిలో పనిచేస్తుండిన తెలుగు పద్యప్రేమికుడైన లంకా కృష్ణమూర్తి పద్యాలు; లేపాక్షి ఓరియంటల్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడు, అష్టావధాని పమిడికాల్వ చెంచు సుబ్బయ్య శర్మ(మా నాన్న) గద్యం. ఇద్దరూ కలిసి రాసినది. 1975 ప్రచురణ. ఈ పుస్తకాలేవీ ఇప్పుడు మార్కెట్లో లేవు. ఇలాంటివి పునర్ముద్రణ కావు. లేపాక్షిలో మిత్రుడు లేపాక్షి రామ్ ప్రసాద్ దగ్గర భద్రంగా ఉంటే కొరియర్లో తెప్పించుకుని...జిరాక్స్ చేసుకుని వారి పుస్తకాలు వారికి మళ్లీ కొరియర్లో వెనక్కు పంపాను. రామ్ ప్రసాద్ తాత వెంకటనారాయణప్ప లేపాక్షికి తొలి సర్పంచ్. ఐదు దశాబ్దాలపాటు లేపాక్షి గుడిని వెలికి తీసుకురావడానికి కల్లూరు సుబ్బారావుతో కలిసి పనిచేశారు. నాకు తెలిసిన ఆవగింజంత భాషా సాహిత్యాలకు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలకు లేపాక్షి బీజం. అక్కడ తాకిన ప్రతిదీ శిల్పమే. చూసిన ప్రతిదీ అందమే. రాతిలో పోతపోసిన ఆ అందాలను, ఆనందాలను చెప్పకపోతే... నాకొచ్చిన నాలుగు మాటలకు విలువ ఉండదు. కాబట్టి ఈ ప్రయత్నం. వీరభద్రాలయం లేపాక్షి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనదని మొదట అనుకునేవారు. భారత పురావస్తుతత్వ శాఖ తవ్వకాల్లో బయటపడ్డ శాసనాల ప్రకారం క్రీస్తు శకం 1400 నాటికే లేపాక్షిలో పాపనాశేశ్వర ఆలయం ప్రసిద్ధిలో ఉందని తేలింది. ఇక్కడ వీరభద్రుడు, పాపనాశేశ్వరుడు, దుర్గాదేవి, రఘునాథ స్వామి ప్రధానమైన దేవుళ్లు. "లేపాక్ష్యామ్ పాపనాశనః" అని స్కాంధపురాణంలో ఉన్నది ఈ లేపాక్షి పాపనాశేశ్వర స్వామి ప్రస్తావనే అన్నది ఎక్కువమంది పండితుల అభిప్రాయం. 16వ శతాబ్దిలో విజయనగర రాజులు అచ్యుతదేవరాయలు, అళియరాయల దగ్గర పెనుగొండ మండల కోశాధికారిగా ఉండిన విరుపణ్ణ ఇలవేల్పు వీరభద్రస్వామి. విరుపణ్ణ కలల పంట మనముందున్న ఈ లేపాక్షి కళల పంట. లేపాక్షికి ఆ పేరెలా వచ్చింది? త్రేతాయుగం రామాయణ కథతో లేపాక్షి కథ కూడా మొదలవుతుంది. సీతమ్మను రావణుడు అపహరించుకుని ఆకాశమార్గాన తీసుకువెళుతుంటే జటాయువు అడ్డగించి... యుద్ధం చేస్తుంది. కోపగించిన రావణుడు పక్షికి రెక్కలే బలం కాబట్టి... ఆ రెక్కలను నరికేస్తే చచ్చి పడి ఉంటుందని...రెక్కలను కత్తిరిస్తాడు. జటాయువు రెక్కలు తెగి... రక్తమోడుతూ... నేల కూలుతుంది. సీతాన్వేషణలో భాగంగా చెట్టూ పుట్టా; కొండా కోనా; వాగూ వంకా వెతుకుతూ రామలక్ష్మణులు జటాయువు దగ్గరికి వస్తారు. సీతమ్మ జాడ చెప్పి...రాముడి ఒడిలో జటాయువు కన్ను మూస్తుంది. తమకు మహోపకారం చేసిన జటాయువు అంత్యక్రియలను రామలక్ష్మణులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంలో జటాయువును చూసిన వెను వెంటనే రాముడన్న మాట- “లే! పక్షి!” అదే "లేపాక్షి" అయ్యింది. పమిడికాల్వ మధుసూధన్ -
ఒక ప్రవాహం
మనుషుల మీద లేబుల్స్ వేయడంలో మనకు ఒక సౌలభ్యం ఉంటుంది. దానివల్ల వారిని అంచనా కట్టడానికి ఒక పరిధి ఏర్పడుతుంది. కానీ భూమ్మీద ప్రవాహంలా బతికేవాళ్లు కొందరుంటారు. ఆ ప్రవాహంలో అన్నింటినీ తమలో ఇముడ్చుకుని పోతారు. సాగిపోవడమే వారి లక్షణం. ఆగిపోవడం వారికి తెలియని గుణం. వారు ఏమిటి? అని ప్రశ్న వేసుకున్నప్పుడు, వారు ఏమిటి కాదు? అనే మరో ప్రశ్న ఎదురొస్తుంది. ఆ రెండు ప్రశ్నల మధ్యే వారి జీవితం గురించిన ఒక జవాబు దొరుకుతుంది. 150 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ లోని నార్మండీలో జన్మించిన (1873 జనవరి 28) ‘కొలెట్’ ఒక సజీవ ప్రవాహం. చాలా కారణాల వల్ల ఫ్రెంచ్ సమాజపు సాహిత్య సాంస్కృతిక జీవితాన్నీ, తద్వారా ప్రపంచాన్నీ ఆమె ప్రభావితం చేశారు. ‘చెరి’, ‘జిజి’, ‘ద వేగబాండ్’, ‘ద ప్యూర్ అండ్ ది ఇంప్యూర్’ లాంటి రచనలు చేసిన కొలెట్ జీవితం ఆమె రచనలంతే ఆకర్షణీయం. తన పేరును కేవలం ఏకపదంగా రాసుకున్న ‘కొలెట్’ పూర్తి పేరు సిడోనీ–గాబ్రియెల్ కొలెట్. ఆమె జీవితంలోని వివాహపు అధ్యాయం పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ఉనికి పరిమితులను చెబుతుంది. కేవలం కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి పద్నాలుగేళ్ల పెద్దయినవాడితో వివాహానికి ఒప్పుకొంది. భర్త హెన్రీ గౌథియర్ విల్లర్స్ కలంపేరు ‘విల్లీ’. సమాజంలో ప్రతిష్ఠ ఉన్నవాడు. అతడి ప్రఖ్యాతి ఎంతటిదంటే ‘ఘోస్టు రైటర్స్’తో పుస్తకాలను రాయిస్తుండేవాడు. ‘‘నీ ప్రాథమిక పాఠశాల జ్ఞాపకాలను కాగితం మీద పెట్టు,’’ అని నూతన వధువుకు కూడా చెప్పాడు. మనోరంజకమైనవి ఉంటే వదిలిపెట్టొద్దనీ, వాటిని తాను ఏదోలా వాడుకుంటాననీ కూడా అన్నాడు. కొలెట్ సహజంగానే రైటర్ మెటీరియల్. ఆమె రాతలను విల్లీ ముందు కొంచెం అనుమానించినా, వాటిని 1900లో ‘క్లాడైన్ ఎట్ స్కూల్’ నవలికగా తెచ్చాడు. ఒక పాఠశాల బాలిక కౌమార దశను వాస్తవికంగా చిత్రించిన ఈ రచనకు వెంటనే పేరొచ్చింది. సాహిత్యంలో కౌమార బాలిక గొంతుక వినిపించింది. ఆత్మ కథాత్మక సాహిత్యానికి పథనిర్ణేత అయ్యింది. వీటి మూల రచయిత్రి కొలెటే అని సాహిత్య లోకం అనంతర కాలపు ఆమె రచనల శైలిని బట్టి నిర్ధారించుకుంది కానీ అప్పటికి అధికారిక రచయిత విల్లీనే. అమ్మకాలు పెరగడంతో భార్య మీద ఒత్తిడి పెట్టాడు. ఒక దశలో గదిలో బంధించి, తర్వాతి ఇన్ స్టాల్మెంట్ ఇచ్చేంతవరకూ విడిచిపెట్టలేదు. ఈ వేధింపులు సహిస్తూనే, కొనసాగింపు నవలికలు ‘క్లాడైన్ ఇన్ పారిస్’, ‘క్లాడైన్ మేరీడ్’ రాసింది కొలెట్. క్లాడైన్ పాత్ర ఎంత హిట్టయ్యిందంటే, ఆ థీమ్‌తో సిగరెట్లు, లింజెరీ, పెర్ఫ్యూమ్ కూడా విల్లీ ప్రారంభించాడు. విల్లీ ఆమెను సాహిత్యంలోకి ప్రవేశపెట్టినా, మేలుకొన్నాక, ఆయన్ని జీవితంలోంచి బయటికి నెట్టేసింది కొలెట్. కానీ రాయల్టీల డబ్బులు లేకపోవడంతో స్టేజీ నటిగా పనిచేసింది. 1907లో తనే రాసిన ‘ద ఫ్లెష్’ సంగీత రూపకంలో స్టేజీ మీద ఎడమ చన్నును ప్రదర్శించడం పెద్ద కల్లోలం సృష్టించింది. ఇక, ‘మౌలిన్ రూజ్’లో తన స్నేహితురాలు ‘మిస్సీ’ని బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం దుమారం లేపింది. ఈ మొదటి ప్రదర్శన తర్వాత పోలీసులు దాన్ని సాగనివ్వలేదు. బహిరంగంగా వాళ్లు తమ లెస్బియన్ బంధం గురించి ప్రకటించడం కూడా అప్పటి సమాజానికి విఘాతంలా తగిలింది. దీనివల్ల ఎవరికీ కంటబడని స్థలాల్లో కొంతకాలం బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, స్వలింగ శృంగార సాహచర్య ప్రదర్శనల తాలూకు ధిక్కార బీజాలు ఇలా మొదలయ్యాయని అనుకోవచ్చు. కొలెట్ అంటే ఒక స్కాండల్. పరస్పర వైరుద్ధ్యంగా కనబడే ఎన్నో అంశాలు ఆమె జీవితంలో కనబడతాయి. ప్రపంచమంతా యూదుల పట్ల పట్టింపుతో ఉన్నప్పుడు, నాజీలతో జట్టుకట్టి, యూదు వ్యతిరేక భావనలు ఉన్న రచనలు చేశారు. తాను ఎంత స్వేచ్ఛగా బతికినప్పటికీ, ఓటు హక్కు కోరే స్త్రీలను కొరడాతో బాదాలన్నారు. జర్నలిస్టుగా పనిచేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధరంగం నుంచి వార్తలు పంపారు. ఒక సాహిత్య పత్రికకు సంపాదకురాలిగా పనిచేసినప్పుడు, ఎంతోమంది యువ రచయితలను ప్రోత్సహించారు. సుమారు యాభై పుస్తకాలను వెలువరించిన కొలెట్, పది గంటల పాటు ఏకధాటిగా కూడా రాసేది. ‘‘కొలెట్ స్త్రీవాది అవునో కాదో నిర్ణయించాల్సింది ఆమె కాదు’’ అని ఆమెను స్త్రీవాదిగానే సాహిత్య లోకం తర్వాత గుర్తించింది. సాధారణ మనుషులు కోరుకునే నైతిక చట్రంలోకి ఇమడని కొలెట్ ఒక బైసెక్సువల్. కుమారుడి లాంటి బాలుడితో ప్రణయం కొనసాగించారు. ‘మాంసం’ అనేది ఆమెకు చాలా ఇష్టమైన మాట. వాంఛకు అది సంకేతం. ‘‘ప్రేమ, నా కలానికి బ్రెడ్ అండ్ బటర్’’ అన్నారు. అందం పట్ల ఆమెకు మితిమీరిన పట్టింపు. వృద్ధాప్య ఛాయలు పొడసూపగానే ‘ఫేస్–లిఫ్ట్’ చేయించుకున్నారు. తన శరీరంలో ఏర్పడిన ముడతలను ద్వేషించారు. పాశ్చాత్య దేశాల్లోనూ విడాకులు తీసుకున్నవాళ్లకు మన్నన లేని కాలంలో, రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. ఆ కారణంగా ఆమె మరణించినప్పుడు ధార్మిక క్రతువులు నిరాకరించబడ్డాయి. ‘‘చనిపోయిన తర్వాత కూడా కొలెట్ ఎంత సుదీర్ఘకాలం బతికింది!’’ అన్నారు 1967లో జర్నలిస్ట్ జానెట్ ఫ్లానర్. ఆ మాట అన్న యాభై ఏళ్ల తర్వాత కూడా కొలెట్ బతికేవుంది. ఆమె జీవితం ఇప్పటికీ ఆసక్తిగొలుపుతూనే ఉంది. ఆమె మీద పుస్తకాలు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచో చెడో కొలెట్ రూపంలో ఒక ఉత్సాహం ఈ భూమ్మీద కొన్నాళ్లు తిరగాడిందని మనం అనుకోవచ్చు. అయినా చెడు అని ఎందుకనాలి! -
పుస్తకం కర్ణభూషణం
పుస్తకం హస్తభూషణమన్నారు; అది చదివే పుస్తకాల గురించి! ఇప్పుడు వినే పుస్తకాలు ప్రాచుర్యాన్ని తెచ్చుకుంటూ కర్ణభూషణంగా మారుతున్నాయి. కాలం చేసే తమాషాలలో ఇదొకటి. మన జీవితమూ, ఊహలూ, ప్రణాళికలూ కాలం వెంబడి సరళరేఖలా సాగుతాయనుకుంటాం. కానీ,దృష్టి వైశాల్యాన్ని పెంచుకుని చూస్తే కాలం మళ్ళీ మళ్ళీ బయలుదేరిన చోటికే వచ్చే చక్రంలా కూడా కనిపిస్తుంది. ‘కాలచక్ర’మనే మాట సర్వత్రా ప్రసిద్ధమే. పుస్తక ప్రపంచంలోకే కనుక ఒకసారి తొంగి చూస్తే, ‘చదువు’ అనే మాట పుస్తకంతో ముడిపడే ప్రచారంలోకి వచ్చింది. పుస్తకాలు లేని కాలంలో; లేదా, అవి జనసామాన్యానికి విరివిగా అందుబాటులోకి రాని రోజుల్లో కథలూ, కవిత్వాలూ, ఇతరేతర జ్ఞానాలూ అన్నీ వినుకలి ద్వారానే అందేవి. దీర్ఘకాలంపాటు ప్రపంచవ్యాప్తంగా సమస్త వాఙ్మయమూ చక్షురక్షరాల మధ్య కాకుండా; వక్తకీ, శ్రోతకీ మధ్య ప్రవహిస్తూ మౌఖిక వాఙ్మ యమనే ముద్ర వేసుకుంది. పుస్తక వ్యాప్తితోనే లిఖిత సాహిత్యమన్న మాట వాడుకలోకి వచ్చింది. కాలచక్రం మళ్ళీ మొదటికొచ్చి, పుస్తకమనే ‘పఠన’ మాధ్యమం స్థానాన్ని, ఇయర్ ఫోన్ రూపంలో తిరిగి వెనకటి ‘శ్రవణ’ మాధ్యమం ఆక్రమించుకుంటున్నట్టు తోస్తోంది. నేటి యువత పుస్తకాన్ని చదవడం కన్నా, వినడాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ విధంగా, ‘పుస్తకాలు లేని గది ఆత్మలేని దేహ’మన్న సిసిరో సూక్తిని కొంత సవరించుకోవలసిన అవసరమూ కలుగుతోంది. కనుకలి నుంచి వినుకలికి మారినప్పుడు పుస్తకం కలిగించే అనుభూతి గాఢతలోనూ మార్పు వస్తుందా అన్నది అనుభవంతో మాత్రమే చెప్పగలం. ఏదైనాసరే అంతిమంగా అలవాటు పడడంలోనే ఉంటుంది. మాధ్యమం ఎలాంటిదైనా పుస్తకానికీ మస్తకానికీ పడిన పీటముడి స్థిరమూ, శాశ్వతమనీ మాత్రం నిస్సంశయంగా చెప్పవచ్చు. రాబోయే కాలం అనూహ్యంగా మన అంచనాలను తలకిందులు చేస్తే తప్ప పుస్తకాలతో మన సహజీవనం మరికొన్ని తరాలపాటు నిరాఘాటంగా కొనసాగుతుందనే అనుకోవచ్చు. కాపురంలోలానే పుస్తకాలతో కాపురంలోనూ చేదూ, తీపీ కలగలిసే ఉంటాయి. పుస్తక ప్రియులు వియ్యమందితే ఒక్కోసారి సొంతింటి పుస్తక వారసత్వానికీ, సొంత సేకరణకూ అదనంగా అత్తింటి పుస్తక వారసత్వమూ అంది, పుస్తకాలు ఇబ్బడి ముబ్బడై అల్మైరాలను దాటిపోయి నేల మీద పరచుకుంటూ ఉంటాయి. పుస్తెతోపాటు సంక్రమించిన పుస్తక సంపదా ఇల్లాలికి దినదిన సమస్య అవుతూ ఉంటుంది. పుస్తకాలతో జీవించడం కూడా ఒక పుస్తకానికి సరిపోయే ఇతివృత్త మవుతుంది. బాల్యం నుంచి, వార్ధక్యం వరకూ మనతో ఉండే పుస్తకాలు, ఒక్క పుట కూడా తెరవకుండానే, ఆయా వయోదశల మీదుగా మన అభిరుచులలో వచ్చే తేడాలను బోధిస్తాయి. మనకు పనికిరానివని పక్కన పెట్టిన పుస్తకాలే క్రమంగా మన చదువుల బల్లకెక్కి వెక్కిరిస్తాయి. మన హస్తస్పర్శ కోసం ఏళ్ల తరబడి మౌన తపస్సు చేసే పుస్తకాలే, ఒక్కసారి తెరవగానే అద్భుత ప్రపంచంలోకి మనల్ని లాక్కుపోతాయి. మన ప్రయాణం ఆగినా పుస్తక ప్రయాణం కొన సాగుతూనే ఉంటుంది. కవిత్వానికి ఏదీ అనర్హం కాదని మహాకవి ఉగ్గడించినట్టుగా, చరిత్ర శోధనకూ ఏదీ అనర్హం కాదు. పుస్తక చరిత్రనే తవ్వితే అది కూడా ఎన్నో అవతారాలు ఎత్తుతూ నేటి దశకు వచ్చిన సంగతి అర్థమై రేపటి అవతారం గురించిన దిగులు, గుబుళ్లను తగ్గిస్తుంది. పుస్తకం గురించిన ఊహ క్రీస్తుపూర్వం నాలుగవ సహస్రాబ్ది నాటికే ఉండేది. ప్రాచీన ఈజిప్టు వాసులు మధ్య ఆఫ్రికా, నైలునదీ లోయల్లో పెరిగే ‘పెపారస్’ అనే నీటిమొక్క నుంచి తీసిన మెత్తని బెరడును రాతకు, చిత్రలేఖనానికి ఉపయోగించేవారు. ఈ ‘పెపారస్’ పేరే ‘పేపర్’గా మారి ఇప్పటికీ వ్యవహారంలో ఉంది. ఆంగ్లంలో ‘బుక్’ అనే మాట పుట్టుకా ఇంతే ఆసక్తికరం. యూరప్, ఆసియా అడవుల్లో పెరిగే ‘బచ్’ అనే చెట్టు తాలూకు తెల్లని బెరడును రాతకు ఉపయోగించేవారు. నేటి ఇండో–యూరోపియన్ భాషలకు మాతృక అయిన ప్రోటో–ఇండో–యూరోపియన్ లోని ‘భెరెగ్’, ‘భగో’ అనే మాటలే వివిధ పుత్రికాభాషల్లో ‘బచ్’ గానూ, ‘బీచ్’ గానే కాక; ఇంకా అనేక రూపాంతరాలు చెందుతూ చివరికి ‘బుక్’గా మారాయి. ప్రాచీన భారతదేశంలో రాతకు ఉపయోగించిన ‘భూర్జపత్ర’ మనే సంస్కృత శబ్ద మూలాలు కూడా ‘భెరెగ్’ అనే ప్రోటో–ఇండో–యూరోపియన్ పదంలోనే ఉన్నాయి. క్రీస్తుశకం తొలి శతాబ్దంలో రోమన్లు శిక్షాస్మృతుల రాతకు గొర్రె, మేక చర్మాన్ని వినియో గించేవారు. క్రమంగా తాటియాకులు, రాగిరేకులు రాతకు ఆలంబనమయ్యాయి. క్రీస్తుశకం 2–5 శతాబ్దుల మధ్యలో వచ్చినట్టు చెబుతున్న ‘డైమెండ్ సూత్ర’ తొలి ముద్రితగ్రంథమంటారు. ఇక 15వ శతాబ్దిలో జోహానెస్ గూటెన్‌బర్గ్ కనిపెట్టిన ముద్రణ యంత్రం పుస్తక ప్రచురణను విప్లవీకరించడం, 16వ శతాబ్దిలో రిచర్డ్ ముల్కాస్టర్ అనే పండితుడు ఎనిమిదివేల మాటలతో తొలి నిఘంటువును ప్రచురించడం వగైరాలు ఇటీవలి చరిత్ర. ఎప్పటికప్పుడు పరిమిత సంఖ్యలో పుస్తకాలను ప్రచురించుకునే నేటి అవకాశాన్ని (ప్రింట్–ఆన్ –ఆర్డర్) ఫ్రెడరిక్ ఫో అనే సైన్సు ఫిక్షన్ రచయిత 1966లోనే ఊహించాడు. ఇంతకీ ఈ పుస్తక స్మరణ దేనికంటే, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పుస్తకాల పండుగ సమీపిస్తోంది. కొన్ని రోజులపాటు జరిగే ఈ పండుగకు ముద్రాపకులు, విక్రేతలు, రచయితలు సమధికోత్సాహంతో సిద్ధమవుతున్నారు. ముద్రిత గ్రంథాల భవిష్యత్తు పట్ల ప్రస్తుతానికి అదే కొండంత భరోసా. -
డిసెంబర్ 28 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 7 వరకు 34వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు టి.మనోహర్‌నాయుడు, కె.లక్ష్మయ్య చెప్పారు. ఈ ఏడాది కూడా పుస్తక మహోత్సవాన్ని విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొంటారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన అన్ని రకాల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. చదవండి: పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు -
డల్లాస్‌లో తెలుగు గ్రంథాలయం ప్రారంభం
అమెరికాలో తెలుగువారు అధికంగా నివసించే నగరాల్లో ఒకటైన డల్లాస్‌లో శుక్రవారం సాయంత్రం తెలుగు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. డల్లాస్ శివారు లూయిస్విల్లో ప్రవాసాంధ్రుడు మల్లవరపు అనంత్ R2 Realty కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని గాయని ఎస్పీ శైలజ, గాయకుడు ఎస్పీ చరణ్, తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్‌లు ప్రారంభించారు. ఎస్పీ శైలజ మాట్లాడుతూ అమెరికాలో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేయడాన్ని హర్షించారు. రోజుకు ఒక పేజీ తెలుగు చదవాలని, తద్వారా మాతృభాషకు దూరం కాకుండా ఉండగలమని అన్నారు. ఎస్పీ చరణ్ మాట్లాడుతూ ఒకప్పుడు అమెరికాలో తెలుగువారంటే డాక్టర్లు గుర్తుకు వచ్చేవారని, కానీ ఇప్పుడు అనంత్ వంటి రియల్టర్లతో పాటు సమాజంలోని విభిన్న కోణాలకు చెందిన ఎందరో అమెరికా వస్తున్నారని తెలుగు భాష పట్ల ఆయనకున్న మక్కువతో ఏర్పాటు చేసిన గ్రంథాలయం అమెరికాలో వెలుగులు పంచాలని ఆకాంక్షించారు. తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో తెలుగు కోర్సుల నిర్వహణ నిమిత్తం తానా నిధుల సేకరణ చేపట్టినప్పుడు ఎస్పీ బాలు విభావరితో అలరించాలని ఆయన ఆశ ధ్యాస శ్వాస తెలుగు భాష అని కొనియాడారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆరు సంపుటాలుగా వెలువరించిన సిరివెన్నెల సమగ్ర సాహిత్యాన్ని శైలజ-చరణ్‌ల చేతుల మీదుగా ఈ గ్రంథాలయానికి బహుకరించారు. త్వరలోనే తానా ఆధ్వర్యంలో కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి సమగ్ర సాహిత్యాన్ని వెలువరిస్తామని ప్రసాద్ తెలిపారు. “ట్యాంక్‌బండ్‌పై తెలుగు విగ్రహాల ప్రశస్తి” పేరిట చెన్నపూరి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఈ సభలో ఆవిష్కరించారు. వేముల లెనిన్, మద్దుకూరి చంద్రహాస్, అనంత్ మల్లవరుపులు కొండేపూడి లక్ష్మీనారాయణ రచించిన “పాడరా ఓ తెలుగువాడా” గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. అతిథులకు అనంత్ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి పేరిట స్వదేశంలో పాఠశాల కట్టించానని, అమెరికాలో తన తల్లి పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శారద సింగిరెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, పరమేష్ దేవినేని, రాజేష్ అడుసుమిల్లి, బీరం సుందరరావు, సురేష్ మండువ, లక్ష్మీ పాలేటి తదితరులు పాల్గొన్నారు. -
Maunika Govardhan: నచ్చేలా మెచ్చేలా ఘనంగా గరిట పట్టేలా
‘తినడం కోసం బతకడం కాదు. బతకడం కోసం తినాలి’ అని కాస్త గంభీరంగా అనుకున్నాసరే, ‘వంటల రుచుల కోసం కూడా బతకవచ్చు సుమీ!’ అనిపిస్తుంది కొన్నిసార్లు. పసందైన వంటకాలు జీవనోత్సాహాన్ని కలిగిస్తాయి. చురుకుదనాన్ని నింపుతాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లండన్‌లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని చెఫ్‌గా మారి ప్రవాస భారతీయులకు అపూర్వమైన భారతీయ వంటకాలను పరిచయం చేయడంతో పాటు, వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేదానిపై పుస్తకాలు రాస్తోంది మౌనికా గోవర్ధన్... ముంబైలోని దాదర్ ప్రాంతంలో పుట్టి పెరిగిన మౌనిక ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. చెఫ్‌గా సంప్రదాయ భారతీయ వంటకాల రుచులను విదేశీయులకు పరిచయం చేస్తుంది. ‘సులభంగా చేసుకునేలా... ఆరోగ్యంగా ఉండేలా...’ అనేది ఆమె వంటల పాలసీ. ప్రతి కుటుంబానికి తరతరాలుగా తమవైన ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కొన్నిసార్లు కాలంతోపాటు అవి కనుమరుగు అవుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌనిక తమ కుటుంబంలో ఎన్నో తరాల విలువైన వంటకాలను సేకరించింది. పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, లైవ్ ఈవెంట్స్, సోషల్ మీడియా ద్వారా మన వంటకాలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తోంది. లండన్‌లో ఉంటున్నప్పటికీ మౌనికకు మన దేశంలోని పాతతరం వంటకాలపై ఆసక్తి తగ్గలేదు. ఏమాత్రం సమయం దొరికినా మన దేశానికి వచ్చి మధ్యప్రదేశ్ నుంచి మణిపుర్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళుతుంటుంది. ‘అందరిలాగే అమ్మ వంటకాలు అంటే నాకు ఇష్టం. అయితే కేవలం ఇష్టానికి పరిమితం కాకుండా అమ్మ చేసే వంటకాలను ఓపిగ్గా నేర్చుకున్నాను. నేను చేసే వంటకాలు కూడా అమ్మకు బాగా నచ్చేవి’ గతాన్ని గుర్తు చేసుకుంది మౌనిక. ఆమె అమెరికాలాంటి దేశాలకు వెళ్లినప్పుడు ప్రవాస భారతీయులతో మాట్లాడుతున్న సందర్భంగా మన వంటకాలను గుర్తు చేస్తున్నప్పుడు వారి నోట్లో నీళ్లు ఊరేవి. ప్రతివ్యక్తికి ‘సోల్ ఫుడ్’ అనేది ఒకటి ఉంటుంది అని చెబుతుంటుంది మౌనిక. మౌనిక తాజాపుస్తకం ‘తందూరీ హోమ్ కుకింగ్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ పుస్తకంలో రకరకాల రుచికరమైన తందూరీ వంటకాలతో పాటు ఆయా వంటకాల చరిత్రను ఆసక్తికరంగా వివరిస్తుంది మౌనిక. ఇదంతా సరే, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ మౌనిక ఎందుకు చెఫ్‌గా మారింది? ఆమె మాటల్లోనే... ‘లండన్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో స్నేహితుల కోసం సరదాగా వంటలు చేసి పెట్టేదాన్ని. ఆ వంటకాలు వారికి విపరీతంగా నచ్చేవి. ఆ రుచుల మైమరుపులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మరచి పోయేవారు. కుకింగ్‌ను ప్రొఫెషనల్‌గా తీసుకుంటే తిరుగులేని విజయం సాధిస్తావు అని చెప్పేవాళ్లు. నేను ఆ మాటలను పెద్దగా సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. అయితే పదే పదే ఇలాంటి మాటలు వినిపించడంతో ఒకసారి ట్రై చేద్దామని కార్పొరేట్ జాబ్‌ను వదులుకొని కుకింగ్‌ను ఫుల్–టైమ్ జాబ్ చేసుకున్నాను. అయితే ఇది మా కుటుంబ సభ్యులకు నచ్చలేదు. కొందరైతే లండన్‌కు వెళ్లింది వంటలు చేయడానికా? అని వెక్కిరించారు. దీనికి కారణం కుకింగ్ అనేది వారికి ఒక ప్రొఫెషన్‌గా కనిపించకపోవడమే. కుకింగ్ అంటే ఇంట్లో ఆడవాళ్లు చేసే పని మాత్రమే అనేది వారి అభిప్రాయం. కుకింగ్కు సంబంధించిన రోల్‌మోడల్స్ గురించి కూడా వారికి తెలియదు. అయితే తరువాత మాత్రం వారిలో మార్పు వచ్చింది’ అంటుంది మౌనిక. మౌనిక ఇంట్లో ఆ రోజుల్లో ఒకే ఒక వంటల పుస్తకం కనిపించేది. ఆ పుస్తకాన్నే పదేపదే తిరగేసేది అమ్మ, ఈ పుస్తకాలు కూడా కొన్ని వంటకాలకు సంబంధించినవే ఉండేవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వంటలు ఎలా చేయాలో నేర్పించడం కోసం పుస్తకాలు కూడా రాయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా వెబ్‌సైట్‌ను మొదలుపెట్టింది. ఆ తరువాత ‘ది న్యూయార్క్ టైమ్స్’ ‘ది డెయిలీ మెయిల్’లో మన వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేది. వంటకాల తయారీలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న మౌనిక ఇండియన్ కిచెన్, థాలీ, తందూరీ హోమ్ కుకింగ్ అనే మూడు పుస్తకాలు రాసింది. ‘వంటలు చేసే సమయంలో నా దృష్టి మొత్తం తయారీ ప్రక్రియపైనే ఉంటుంది. ఆ సమయంలో వేరే విషయాల గురించి ఆలోచించడం తాలూకు ప్రభావం రుచిపై పడుతుంది. అందుకే వంటగదిలోకి వెళ్లినప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా భావిస్తాను’ అంటుంది మౌనిక. మౌనిక లండన్‌లో చదువుకునే రోజుల్లో ‘అన్ని భారతీయ వంటకాలకు ఒకటే రెస్టారెంట్’ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు కొత్తిమీర దొరకడం గగనంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ‘మన వంటకాల కోసం రెస్టారెంట్లపై మాత్రమే ఆధారపడడం ఎందుకు? ఆడుతూ పాడుతూ మన ఇంట్లో చేసుకోవచ్చు కదా’ అనుకునే ప్రవాస భారతీయులకు మౌనిక గోవర్ధన్ పుస్తకాలు అపురూపంగా మారాయి. చెఫ్‌గా మౌనికా గోవర్థన్ అపూర్వ విజయానికి కారణం అయ్యాయి. -
నేస్తమా పుస్తకం విందామా!
పుస్తకం హస్తభూషణం అన్నారు.చేతిలో ఉండాల్సిన పుస్తకం ‘ఆడియో బుక్స్’ రూపంలో చెవికి చేరువవుతోంది.వ్యక్తిత్వ వికాసం నుంచి కాల్పనిక సాహిత్యం వరకు పుస్తకాలను ‘ఆడియో బుక్స్’ రూపంలో వినడానికి యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న బెంగళూరుకు చెందిన విరజ, పుస్తకాల విలువ గురించి తెలుసుకొని వాటిపై ప్రేమ పెంచుకున్న భోపాల్‌కు చెందిన చైత్రకు పుస్తకాలకు చేరువ కావడానికి ఒకప్పుడు టైమ్ దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం వీరిద్దరికి మాత్రమే కాదు యువతరంలోని ఎంతోమందికి పుస్తకాలు దగ్గర కావడానికి ‘టైమ్’ అనేది సమస్య కావడం లేదు. దీనికి కారణం... ఆడియో బుక్స్.మిలీనియల్స్, జెన్‌జెడ్ జెనరేషన్‌కు ‘ఆడియో బుక్స్’ హాట్ ఫేవరెట్‌గా మారాయి.‘ఒక పుస్తకం చదవడానికి రకరకాల కారణాల వల్ల నెల రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆడియో బుక్స్ వారానికి ఒకటి వినగలుగుతున్నాను. వినడం పూర్తయిన వెంటనే ఆ పుస్తకానికి సంబంధించిన నోట్స్ రాసుకుంటాను’ అంటుంది విరజ.గూగుల్ ప్లేలో ఆడియో బుక్స్ సెక్షన్ ప్రారంభమైన కొత్తలో యువత అంత దగ్గర కాలేదు. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. వారి ప్రధానమైన ఆసక్తులలో ‘గూగుల్ ఆడియో బుక్స్’ కూడా ఒకటి.గూగుల్ ప్లేలో డబ్బు చెల్లించే ఆడియో బుక్స్‌తో పాటు చెల్లించనవసరం లేనివి కూడా ఉన్నాయి.‘ఓకే గూగుల్, హూ ఈజ్ అథర్?’ ‘ఓకే గూగుల్, స్టాప్ ప్లేయింగ్ ఇన్ 20 మినిట్స్’...ఇలాంటి కమాండ్స్ గూగుల్ అసిస్టెంట్‌కు ఇవ్వవచ్చు. గ్లోబల్ ఆడియో బుక్స్ మార్కెట్ లీడర్‌గా ఉన్న ‘ఆడిబుల్’ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత ఆడియో బుక్స్‌కు ఊపు వచ్చింది. రకరకాల వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని ‘ఆడిబుల్ ఇండియా’లో వేలాది ఆడియో బుక్స్‌ను రొమాన్స్, థ్రిల్లర్, ఆధ్మాత్మికం, హారర్, డ్రామా జానర్లలో తీసుకువచ్చారు.ఇంగ్లిష్తో సహా హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ... మొదలైన భాషలలో ఆడియో బుక్స్ ఉన్నాయి.‘ఆడియో బుక్స్ సక్సెస్ కావడానికి కారణం మన మూలాల్లోనే ఉంది. చిన్నప్పుడు కథలను వినేవాళ్లం’ అంటుంది ముంబైకి చెందిన స్మిత. ఒక పుస్తకం విజయాన్ని అంచనా వేసే ప్రమాణాలలో ఆడియో బుక్స్ కూడా చేరాయి. మాతృభాషలో పుస్తకాలు చదవడానికి ఇబ్బంది పడే యువతరానికి ఆడియో బుక్స్ ఆత్మీయనేస్తాలయ్యాయి.‘పాడ్‌కాస్ట్‌తో పాటు ఆడియో బుక్స్‌కు ఆదరణ పెరిగింది’ అంటున్నాడు ‘వన్ బై టు’ మీడియా కో–ఫౌండర్ రాజేష్ తాహిల్.ఫిక్షన్, రొమాన్స్ జానర్స్ కోసం యాపిల్ బుక్ ‘మాడిసన్’ ‘జాక్సన్’ ‘హెలెన్’ అనే డిజిటల్ నేరేటర్లను క్రియేట్ చేసింది.యూఎస్, యూరోపియన్ దేశాలలో పబ్లిషర్స్‌కు ఆడియో కంటెంట్ క్రియేట్ చేయడానికి సొంతంగా స్టూడియోలు ఉన్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి వచ్చినట్లు లేదు. ఒక ఆడియో బుక్కు కనీసం లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.‘స్పాటిఫై’ అనగానే గుర్తుకు వచ్చేది సంగీతం. ఆడియో బుక్స్ ఆదరణను పసిగట్టిన ఈ డిజిటల్ మ్యూజిక్ సర్వీస్ యూఎస్‌తో పాటు నాలుగు దేశాల్లో ఆడియో బుక్ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. మూడు లక్షల ఆడియో బుక్స్‌ను తీసుకువచ్చిన ‘స్పాటిఫై’ యూజర్ల కోసం ‘ఆడియో కామెంట్’ తీసుకురానుంది.ఆడియో బుక్ ఇండస్ట్రీ ఊపందుకోవడాన్ని గమనించిన పబ్లిషర్లు రానున్న రోజుల్లో ఆడియో బుక్స్ స్పేస్‌ను పెంచాలనుకుంటున్నారు. క్లాసిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.‘గతంతో పోల్చితే ఆడియో బుక్స్ వినడానికి వెచ్చిస్తున్న టైమ్ పెరిగింది’ అంటున్నాడు ‘స్టోరీ టెల్ ఇండియా’ కంట్రీ మేనేజర్ యోగేష్ దశరథ్.ఆడియో బుక్స్ యూత్‌ను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ప్రయాణాలలో, బారెడు క్యూలలో నిలబడిన సందర్భాలలో కూడా వాటిని వినే అవకాశం ఉండడం. కొందరైతే వ్యాయామాలు చేస్తూ కూడా ఆడియో బుక్స్ వింటున్నారు.‘ఆడియో బుక్స్ వల్ల పుస్తకం చదివే దృశ్యం అదృశ్యం కానుందా?’ అనే ప్రశ్నకు ఇంజనీరింగ్ స్టూడెంట్ సౌమ్య మాటల్లో జవాబు దొరుకుతుంది.‘పుస్తకం చదవడం అంటేనే నాకు ఇష్టం. అంతమాత్రాన ఆడియో బుక్స్‌కు దూరం కాలేదు. సమయ సందర్భాలను బట్టి చదవాలా, వినాలా అనేదాన్ని ఎంచుకుంటాను’ అంటుంది సౌమ్య. ఆడియో బుక్ రీడ్ బై సెలబ్రిటీ ఆడియో బుక్స్ విజయంలో పుస్తకంలోని కంటెంట్‌తో పాటు నేరేటర్ ప్రతిభ కూడా ఆధారపడి ఉంటుంది. వినే కొద్దీ వినాలనుకునే గొంతులు ఆడియో బుక్స్ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.‘ఆడియో బుక్ రీడ్బై సెలబ్రిటీస్’ ధోరణి మన దేశంలోనూ పెరగనుంది. ఆడియో బుక్ రీడింగ్‌లో బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మంచి పేరు తెచ్చుకుంది. వుడీ ఎలెన్ ‘కౌంట్ డ్రాకులా’తో పాటు ఎన్నో పుస్తకాలు ఆమె స్వరంలో యువత మంత్రముగ్ధులై విన్నారు. -
సంస్కృతంలో వాళ్లెందుకు రాయరు?
సంస్కృతాన్ని ఇష్టపడే కొందరు భారతీయ అమెరికన్లు తమ పుస్తకాలను సంస్కృతంలో ఎందుకు రాయరు? వీరు ఆంగ్లంలో రాస్తూనే, ఆ భాషను వలసవాదమంటూ దాడి చేస్తారు. చారిత్రకంగా సంస్కృతాన్ని కొందరు రచయితలే నియంత్రించారు. వారు దాని ప్రాప్యతను, విస్తృతిని పరిమితం చేశారు. శూద్రులకు ఆ భాషలో చదవడానికి, రాయడానికి గల అవకాశాన్ని నిరాకరించారు. కానీ, ఇప్పుడు వాళ్లూ సామాజికపరమైన లేదా విద్యాపరమైన ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలు రాయడానికి సంస్కృతాన్ని ఉపయోగించడం లేదు. అలా సంస్కృత అంతర్ధానానికి చైతన్యవంతంగా బాధ్యత వహిస్తున్నారు. అయినా ఆ అంతర్ధానానికి మాత్రం మిగిలిన ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు. దాదాపుగా భారతీయ అమెరికన్లతో కూడిన రాజీవ్ మల్హోత్రా నేతృత్వంలోని బృందం ఇటీవల ‘టెన్ హెడ్స్ ఆఫ్ రావణ: ఎ క్రిటిక్ ఆఫ్ హిందూఫోబిక్ స్కాలర్స్’ పుస్తకాన్ని ప్రచురించింది. ఇంగ్లిషులో రాసిన ఈ పుస్తకం... ఈ రచయితతో సహా రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, శశిథరూర్, రామచంద్ర గుహ, దేవదత్ పట్నాయక్, షెల్డన్ పొలాక్, వెండీ డోనిగర్, ఆద్రీ త్రూష్కే, మైకేల్ విట్జెల్లను విమర్శించింది. మల్హోత్రా బృందం ఈ పండితులను పౌరాణిక పాత్ర అయిన రావణుడితో పోల్చింది. ఈ పండితులు ప్రాచీన సంస్కృత పుస్తకాలు ప్రబోధించిన ధర్మాన్ని చంపేశారని ఆరోపించింది. ‘చారిత్రక రావణుడికి మల్లే ఈ పండితుల రచనల్లో నేడు చాలామంది హిందువులు అధర్మంగా భావిస్తున్న అంశాలు ఉన్నాయి కాబట్టే ఈ పుస్తకంలో పది మంది సమకాలీన విద్వాంసులను లక్ష్యంగా’ ఎంచుకున్నట్లు మల్హోత్రా తన పరిచయంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో లక్ష్యంగా ఎంచుకున్న నలుగురు విదేశీ పండితులు సంస్కృత భాషపై కృషి చేశారు. చాలాకాలం వివిధ పాశ్చాత్య విశ్వ విద్యాలయాలలో సంస్కృత భాషను బోధించారు. మరోవైపు, మల్హోత్రాకు అమెరికాలో ‘ఇన్ఫినిటీ ఫౌండేషన్’ అనే ఆర్థిక నెట్వర్క్ ఉంది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఢిల్లీలోని ‘గరుడ ప్రకాశన్ ’ సంస్థనూ నడుపుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే: సంస్కృతాన్ని ఇష్టపడే ఈ భారతీయ అమెరికన్లు తమ పుస్తకాన్ని సంస్కృతంలో ఎందుకు రాయలేదు? వీరు ఆంగ్లంలో రాస్తూనే, ఆ భాషను వలసవాదమంటూ దాడి చేస్తారు. సంస్కృతాన్ని గొప్ప ప్రపంచ సజీవ భాష అంటారు, కానీ ఆ భాషలో ఏ గ్రంథాన్నీ రాయరు. సంస్కృతాన్ని మృత భాష అని షెల్డన్ పొల్లాక్ సరిగ్గానే అన్నారు. తమ దైనందిన జీవితంలో సంస్కృతాన్ని ఉప యోగించే, అందులో భావ వ్యక్తీకరణ చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఒక భాషను స్థానికంగా మాట్లాడేవారు లేనప్పుడు భాష మరణిస్తుంది. ఆధిపత్య నియంత్రణను కొనసాగించడానికి సంస్కృతాన్ని ఉపయోగించే వ్యక్తుల సమూహమే ఆ భాషను చంపేసింది. చారిత్రకంగా సంస్కృతాన్ని కొందరు రచయితలే నియంత్రించారు. వారు దాని ప్రాప్యతను లేదా విస్తృతిని పరిమితం చేశారు. శూద్రులకు ఆ భాషలో చదవడానికి లేదా రాయడానికి గల అవకాశాన్ని నిరాకరించారు. సామాజికపరమైన లేదా విద్యాపరమైన ప్రాముఖ్యం కలిగిన పుస్తకాలు రాయడానికి సంస్కృతాన్ని ఇప్పుడు వాళ్లూ ఉపయోగించడం లేదు. అలా సంస్కృత అంతర్ధానానికి చైతన్యవంతంగా బాధ్యత వహిస్తున్నారు. కానీ ఆ అంతర్ధానానికి మిగిలిన ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు. ఇతర సంస్కృతులకు చెందిన యూదుల వంటివారు తమ ఆధునిక పుస్తకాలను హీబ్రూలో రాస్తున్నారు. యువల్ నోవా హరారీ ప్రభావవంతమైన రచన ‘సేపియన్స్– ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్’ను మొదట హీబ్రూలోనే రాశారు. అలాగే గ్రీకులు గ్రీకు భాషలో రాస్తారు. అరబ్బులు అరబిక్‌లోనే రాస్తారు. బ్రాహ్మణ వాదులు మాత్రం సంస్కృతంలో రాయరు. శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజానీ కాన్ని మోసం చేయడానికి మాత్రమే సంస్కృతాన్ని పొగడటాన్ని నేటికీ కొనసాగిస్తున్నారా? బ్రాహ్మణవాద మేధావులకు ఆరెస్సెస్, బీజేపీ ఆర్థికంగా, సంస్థాగతంగా మద్దతు ఇస్తున్నాయి. భారతదేశ వ్యవసాయ చేతివృత్తుల చరిత్రను విస్మరిస్తూ సంస్కృత గతాన్ని మాత్రమే వీరు కీర్తిస్తున్నారు. వివిధ విభాగాలలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న జ్ఞానాన్నంతటినీ సంస్కృత గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, రామాయణం, మహాభారతాల నుండే దొంగిలించారనే భావనను ప్రచారం చేస్తారు. బ్రాహ్మణవాద శాస్త్రవేత్తలు కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రాలన్నీ ప్రాచీన సంస్కృత పుస్తకాలలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పండితుల్లో ఎంతమంది సంస్కృతంలో ఆ పుస్తకాలను చదివారు? సంస్కృతంలో ఇంత అపారమైన సృజనాత్మక శక్తి ఉన్నట్లయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయ మేధావులు... ప్రపంచ తాత్విక, మే«ధాపరమైన రచనలను హరారీ వంటి వ్యక్తులకు ఎందుకు వదిలివేస్తున్నారు? భారతదేశ చరిత్ర పొడవునా సంస్కృతాన్ని ‘మాతృభాష’గా కాకుండా ‘పితృభాష’గా పరిగణిస్తూ వచ్చారు. సంస్కృతాన్ని ద్విజ కుటుంబాలలో కూడా మాతృభాషగా మారడానికి అనుమతించలేదని గుర్తుంచుకోవాలి. తల్లి, ఆమె బిడ్డల మధ్య సంభాషణతో సహా ఇంటిలో రోజువారీ జీవితంలో ఒక భాషను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మాత్రమే దానిని ‘మాతృభాష’గా పరిగణించవచ్చు. కులీన గృహాలలో కూడా సంస్కృతాన్ని మాతృభాషగా మారడానికి అనుమతించనప్పుడు, ఉత్పత్తి వర్గాల్లో దాన్ని స్వీకరించే ప్రశ్న తలెత్తదు. ఈ పరిస్థితుల దృష్ట్యా, నాగరికతకు రక్షణకర్తలుగా తమను తాము గుర్తించుకునే ఈ భారతీయ అమెరికన్ల సమూహం... సంస్కృతంలో తమ పుస్తకాలను ఎందుకు రాయడం లేదని ప్రశ్నించాల్సి ఉంది. ఈ బృందం ప్రధానంగా అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో నివసిస్తున్న వ్యక్తులలోని భారతీయ ఆలోచనా విధానాన్ని నిర్వలసీకరించడం, ఆర్థిక వనరులను సమీకరించడం లక్ష్యంగా పెట్టు కుంది. కానీ, భారతదేశంలో స్థాపించిన సంస్కృత పాఠశాలలు,సంస్కృత విశ్వవిద్యాలయాలకు వారు తమ పిల్లలను ఎందుకు పంపరు? బదులుగా వారు తమ పిల్లలను ప్రతిష్ఠాత్మకమైన అమెరికన్ విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఎందుకు పంపాలని భావిస్తున్నారు? ‘టెన్ హెడ్స్ ఆఫ్ రావణ’ పుస్తకాన్ని రచించిన ఈ వ్యక్తులు,సంస్కృత పుస్తకాల నుండి వచ్చిన భారతదేశ నాగరికత మా లాంటి ఎవరికీ తెలియదని ఆరోపించారు. నాగరికత అంటే వారి దృష్టిలో అర్థం ఏమిటి? పుస్తకాల ద్వారా నాగరికతను నిర్మించవచ్చా? సంస్కృత పుస్తకాలకు చెందిన ఏదైనా అనువాదాన్ని చదివితే... శూద్ర, దళిత, ఆదివాసీ వర్గాల నుండి సామాజిక శక్తులు ఏవీ లేవని అది సూచిస్తుంది. ఇవి యుద్ధం, యజ్ఞాలు, క్రతువుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ఆహార ఉత్పత్తి, సేకరణ, జంతువుల మేతకు చెందిన వ్యవస్థలను ఈ పుస్తకాలలో ఏ కోశానా పొందుపర్చలేదు. ఈ హిందూత్వ రచయితలతో సహా మానవులందరూ శూద్ర వ్యవసాయా ధారిత ప్రజానీకం ఉత్పత్తి చేసే ఆహారంతోనే జీవిస్తున్నారని గుర్తించడం ముఖ్యం. ఆ ‘సంస్కృత యుగం’లో భూమిని పండించిన వారి గురించి, జంతువుల మేత ద్వారా మాంసాన్ని, పాలను ఉత్పత్తి చేసిన వారి గురించి ఎప్పుడూ రాయలేదు. హాస్యాస్పదంగా, ఈ భారతీయ అమెరికన్ కులీన వర్గాలు, ప్రత్యేకించి అమెరికాలో కుల వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించే ఇన్ఫినిటీ ఫౌండేషన్ సభ్యులు తమను తాము ‘మేధావులైన క్షత్రియులు’గా పేర్కొంటారు. అది కులతత్వం కాదా? మరోవైపున వీరి సంస్కృత యుగం పట్ల దళితులు, ఆదివాసీలు, శూద్రులకు ఏ మాత్రం ఆసక్తి లేదు. ఇంగ్లిష్ యుగంలోకి వెళ్లాలనీ, జ్ఞానోత్పత్తికి సంబంధించిన అన్ని కేంద్రాల నుండి ఈ శక్తులను స్థానభ్రంశం చేయాలనీ, ఆహార ఉత్పత్తి, జ్ఞానోత్పత్తి మధ్య సంబంధాన్ని ప్రతిష్ఠించాలనీ వారు కోరుకుంటున్నారు. ఇది అమృత్ కాల్ కాదు; నిజానికి ఇది శూద్ర కాలం. ఈ యుగంలో సంస్కృత పుస్తకాలలో వర్ణించినట్లుగా ఉత్పత్తి అనేది లోకువైనది కాదు; ఇక్కడ ఉత్పత్తి చాలా పవిత్రమైనది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రూప..కంప్యూటర్ ఇంజనీర్ కానీ, పిల్లల కోసం పుస్తకాలు రాస్తుంది
పిల్లల పుస్తకప్రపంచంలో తనదైన ప్రత్యేకత నిలుపుకుంది రూపా పాయ్. ఫాంటసీ–అడ్వెంచర్ పుస్తకాలతో పాటు ‘ది గీతా ఫర్ చిల్డ్రన్’లాంటి భిన్నమైన పుస్తకాన్ని రాసి ప్రశంసలు అందుకుంది. ఈ పుస్తకం ‘క్రాస్‌వర్డ్ అవార్డ్’ గెలుచుకుంది. మరో భిన్నమైన పుస్తకం ‘ది యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’తో పిల్లలను పలకరించింది బెంగళూరుకు చెందిన రూప... పిల్లల పత్రిక ‘టార్గెట్’తో పాటు లండన్ కేంద్రంగా ప్రచురితమయ్యే ‘ట్రావెల్ ట్రెండ్స్’ మ్యాగజైన్ కోసం ఎన్నో రచనలు చేసింది రూప. అయితే తనకు పిల్లల కోసం రచనలు చేయడం అంటేనే బాగా ఇష్టం. ‘నేను రచయిత్రి కాకపోయి ఉంటే టీచర్ని అయ్యేదాన్ని’ అంటుంది కంప్యూటర్–ఇంజనీరింగ్ చదువుకున్న రూప. చిన్నప్పటి నుంచి పుస్తకాలు తెగ చదివేది. బెంగళూరులోని లైబ్రరీలన్నీ ఆమెకు సుపరిచితమే. చదవగా, చదవగా తనలో కాల్పనిక ప్రపంచం ఒకటి అస్పష్టంగా ఆవిష్కారమయ్యేది. కళ్ల ముందు ఏవేవో పాత్రలు, దృశ్యాలు కదలాడుతుండేవి. కాగితం, కలం పట్టిన తరువాత వాటికి ఒక రూపం ఇచ్చింది. రకరకాల జానర్స్‌లో రచనలు చేయడం గురించి రూప ఇలా అంటోంది...‘కథ మంచిదైతే, ఆకట్టుకునేలా ఉంటే అది ఏ జానర్ అనేది పిల్లలు పట్టించుకోరు. వారికి కచ్చితంగా హాస్యం ఉండాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ అనేది వారికి నచ్చాలి’.‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పుస్తకం రూపకు ఎంతో పేరు తెచ్చింది.‘మన పురాణాలకు సంబంధించిన ఎన్నో సంక్లిష్టమైన విషయాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా రాస్తున్నారు కదా....మరి భగవద్గీత గురించి ఎందుకు రాయకూడదు’ అని ఒకరోజు అడిగింది ఎడిటర్ వత్సల. అయితే అందుకుముందెన్నడూ భగవద్గీతను రూప చదవలేదు. అలా అని ‘నేను రాయలేను’ అనలేదు. ‘ఓకే’ అంటూ రంగంలోకి దిగింది. ‘గీత’ను ఎన్నోసార్లు చదివింది. అనేకసార్లు చదివిన తరువాత ‘గీత గురించి పిల్లలకు చెప్పాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదు’ అనుకుంది.నిజానికి అదొక సవాలు. కానీ ఆ సవాలును ఇష్టంగా స్వీకరించింది రూప. ‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పిల్లలనే కాదు వారి తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంది. ‘మంచి ప్రయత్నం’ అని ప్రశంసించారు.‘ది గీతా ఫర్ చిల్డ్రన్’ పుస్తకం విజయవంతం అయిన తరువాత ‘ఇదే కోవలో మరో పుస్తకం రాస్తే బాగుంటుంది’ అని చాలామంది అడిగారు. అయితే అలా రాస్తే రొడ్డకొట్టుడుగా ఉంటుందని రూపకు ఆనిపించింది. ‘ఇప్పుడు కావాల్సింది మరో విభిన్నమైన పుస్తకం’ అని అనుకుంది. అలా వచ్చిందే...‘సో యూ వాంట్ టు నో ఎబౌట్ ఎకనామిక్స్’ పుస్తకం. ఈ పుస్తకం రావడానికి మరో కారణం ‘గీతను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడంలో విజయం సాధించాను’ అనే ఆత్మవిశ్వాసం. ఈ పుస్తకం తరువాత వచ్చిన ‘రెడీ 99’కి కూడా మంచి స్పందన వచ్చింది. పుస్తకం రాయడానికి రూప అనుసరించే పద్ధతి ఏమిటి? పుస్తకం రాయడానికి ముందు మనసు అనే కాగితంపైనే ఎన్నో వాక్యాలు రాసుకుంటుంది. అక్కడే ఎడిటింగ్ చేసుకుంటుంది. తాను ఎంచుకున్న అంశంపై ఎన్నో పుస్తకాలు చదువుతుంది. ఆ అంశంపై పట్టు ఉన్న వాళ్లతో మాట్లాడుతుంది. విషయ అవగాహన తరువాత పిల్లలను ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా ఎలా రాయాలో అనేదానిపై కసరత్తు చేస్తుంది.‘పన్నెండు సంవత్సరాల వయసులో ఒక పిల్లల మాసపత్రికను చూస్తూ...పెద్దయ్యాక ఈ పత్రికకు కథలు రాయాలనుకునేదాన్ని. నా కల నెరవేరింది. ఇంతకంటే అదృష్టం, ఆనందం ఏముంటాయి!’ అంటుంది రూపా పాయ్. పిల్లలకు యోగా సూత్రాలు భగవద్గీత శ్లోకాల సారాంశాన్ని, ఆర్థిక సూత్రాల మర్మాన్ని పుస్తకాల ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పిన రూపా పాయ్ తాజా పుస్తకం ‘ది యోగ సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’. చిన్నప్పుడు మనసులో పడిన ఒక బీజం మొక్క అవుతుంది. ఆ తరువాత బలమైన చెట్టు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. ‘మనలో కలిగే రకరకాల భావాలకి మనమే యజమాని’ ‘నేను శరీరాన్ని కాదు. కాని ఈ శరీరమనే అద్భుతమైన నిర్మాణంతో ఈ అద్భుత ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను’ ‘నేను మనసుని కాదు. కానీ మనసు అనే మహా నిర్మాణంలో ఎన్నో అద్భుతాలను అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాను’... ఇలా ఆకట్టుకునే మాటలు ఎన్నో ఉన్న ‘ది యోగ సూత్రాస్ ఫర్ చిల్డ్రన్’ ఆబాలగోపాలానికి ప్రియమైన పుస్తకం అవుతుంది అనడంలో సందేహం లేదు. -
కార్తీక 2.ఒ
కార్తీక వీకే... ఎంతోమంది సాహిత్యాభిమానులకు సుపరిచితమైన పేరు. ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషింగ్’గా కీర్తి అందుకున్న వెస్ట్‌ల్యాండ్ బుక్స్ (అమెజాన్ కంపెనీ) పబ్లిషర్‌గా ఎంతోమంది రచయితలను ప్రపంచానికి పరిచయం చేసింది. పాఠకుల నాడి పట్టుకుంది. మారుమూల పల్లె నుంచి హైటెక్ సిటీ వరకు ఏ చిన్న మెరుపు మెరిసినా ఆ మెరుపును అందుకోగలిగింది. కారణాలపై స్పష్టత ఇవ్వకపోయినా అమెజాన్ కంపెనీ వెస్ట్‌ల్యాండ్ బుక్స్‌ను మూసివేసింది. ఆ తరువాత ఏమైంది? ‘ప్రతిలిపి’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది కార్తీక. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ‘ప్రతిలిపి’ దేశంలోని పన్నెండు భాషలకు సంబంధించిన సృజనాత్మక రచనలకు, సాహిత్యభిమానుల మధ్య చర్చలకు వేదిక అయింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘ప్రతిలిపి’ వెస్ట్‌ల్యాండ్ పబ్లిషింగ్, ఎడిటోరియల్, మార్కెటింగ్, సేల్స్ టీమ్‌ను యథాతథంగా తీసుకొని కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ఈ కొత్త వెంచర్‌ని ‘వెస్ట్‌ల్యాండ్ 2.ఒ’ అని పిలుస్తున్నారు. దేశంలోని మోస్ట్ పవర్ఫుల్ ఎడిటర్లలో ఒకరిగా పేరుగాంచిన కార్తీకకు వెస్ట్ల్యాండ్లాగే ‘ప్రతిలిపి’ని పాపులర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ‘ప్రతిలిపి పేపర్‌బ్యాక్స్’ శీర్షికతో తమ యాప్‌లో పాపులర్ అయిన రచనలను కార్తీక నేతృత్వంలో పుస్తకాలుగా తీసుకు రానుంది ప్రతిలిపి. ‘గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పుడు పాపులర్ రచనలను పుస్తకాలుగా ప్రచురించేదాన్ని. ఇప్పుడు యాప్‌లో పాపులర్ అయిన రచనలను పుస్తకంగా ప్రచురించబోతున్నాను’ అంటుంది కార్తీక. ‘పుస్తకం అంటే కొన్ని పేజీల సముదాయం కాదు. అదొక ప్రపంచం’ అని చెప్పే కార్తీకకు ‘సంప్రదాయ పబ్లిషర్’ అని పేరు ఉంది. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయ పబ్లిషర్ ఆడియోబుక్, యాప్, పాడ్‌కాస్ట్... మొదలైన ఫార్మాట్లలో సాహిత్యాభిమానులకు చేరువ కావడానికి కొత్తదారిలో ప్రయాణం చేస్తుంది. ‘కాలంతోపాటు నడవాలి. కొత్త ఫార్మాట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇది సవాలు మాత్రమే కాదు ఎంతో ఉత్సాహం ఇచ్చే పని కూడా’ అంటుంది కార్తీక. కార్తీకతో కలిసి మరోసారి పనిచేయడానికి రచయితలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహమే ఆమె బలమని చెప్పాల్సి అవసరం లేదు కదా! వైవిధ్యమే బలం ప్రచురణ రంగానికి వైవిధ్యమే ప్రధాన బలం. అందుకే ఎప్పటికప్పుడు పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుంటాను. పాఠకులకు ఎలా చేరువ కావాలనేదానిపై రకరకాలుగా ఆలోచిస్తాను. పాఠకులకు చేరువ కావాలనే లక్ష్యం కోసం వక్రమార్గాల్లో పయనించడం నా సిద్ధాంతం కాదు. సమాజానికి హాని చేసే కంటెంట్‌ను దగ్గరికి రానివ్వను. వ్యాపారానికి నైతికత అనేది ముఖ్యం. విలువలకు ప్రాధాన్యత ఇస్తాను. ఎంపికకు సంబం«ధించిన విషయంలో కూడా ‘నాదే రైట్’ అనే ధోరణితో కాకుండా ఇతరులతో విస్తృతంగా చర్చిస్తాను. సోకాల్ట్–మెయిన్ స్ట్రీమ్ ఆలోచనలకు పక్కకు జరిగితే ఎంతో అద్భుతమైన ప్రతిభను వెలుగులోకి తీసుకురావచ్చు. నా కెరీర్లో సంతోషకరమైన విషయం ఏమిటంటే యువతలో చదివే వారి సంఖ్య పెరగడం. ‘కొత్త పాఠకులు ఎలాంటి కంటెంట్‌ను ఇష్టపడుతున్నారు?’ అని తెలుసుకోవడం ముఖ్యం. శక్తిమంతమైన, సృజనాత్మకమైన ఆలోచనలు ఎక్కడో ఒకచోట ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వెలుగులోకి తీసుకురావడమే పబ్లిషర్ బలం. – కార్తీక వీకే -
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 పుస్తకాలు
-
పుస్తక మర్యాద
ఒక పుస్తకాన్ని చదవడం వేరు, ఆ పుస్తకాన్ని అపురూపంగా చూడటం వేరు. చాలామంది పుస్తకాలను అమర్యాదగా చదువుతారు. అంతే సమానంగా వాటిపట్ల అజాగ్రత్తగా ఉంటారు. పుస్తకాలను వాటి మర్యాదకు తగినట్టుగా గౌరవించడం కూడా ఒక సంస్కృతి! పుస్తకం పేజీలు తీయడం కూడా కొందరు సుతారంగా తీస్తారు; పేజీలు నలగకుండా దాన్నొక పువ్వులా హ్యాండిల్ చేస్తారు. కొందరు నీటుగా బుక్ మార్క్స్ సిద్ధం చేసుకుంటారు. కొందరు చదవడం ఆపిన చోట పేజీ కొసను చిన్నగా మడుచుకుంటారు. ఇక కొందరి పుస్తకం చదవడం పూర్తయ్యేసరికి ఒక బీభత్సం జరిగివుంటుంది. అలాగని పుస్తకం చదువుతూ రాసుకునే నోట్సు దీనికి భిన్నం. అది పుస్తకంతో ఎవరికి వారు చేసుకునే వ్యక్తిగత సంభాషణ. కొందరు కేవలం అండర్లైన్ చేసుకుంటారు. కొందరు పుస్తకం చివర నచ్చిన పేజీ తాలూకు నంబర్ వేసుకుని దానికి సంబంధించిన వ్యాఖ్యో, పొడి మాటో రాసుకుంటారు. ఇలాంటివారికి పుస్తకంలో చివర వచ్చే తెల్ల కాగితాలు చాలా ఉపయుక్తం. పఠనానుభవాన్ని పెంపు చేసుకునేది ఏదైనా పుస్తకాన్ని గౌరవించేదే. అయితే, పుస్తకాన్ని గౌరవిస్తున్నారని చూడగానే ఇట్టే తెలియజేసే అతి ముఖ్యమైన భౌతిక రూప చర్య– దాన్ని బైండు చేయడం. ఈ బైండు చేయించడంలో, స్వయంగా తామే చేసుకోవడంలో కూడా ఎవరి అభిరుచి వారిది. అలాగే పుస్తకం తరహాను బట్టి కూడా ఇది మారొచ్చు. అలాగే బైండింగుకు వాడే మెటీరియల్, అది చేసే పద్ధతులు కూడా చాలా రకాలు. ఏమైనా బైండింగు కూడా దానికదే ఒక కళ. అది కొందరికి బతుకుదెరువు అనేది కూడా ఒక వాస్తవమే. కానీ ప్రపంచంలో గొప్ప బైండింగు కళాకారుల పనితనాన్ని తెలియజేసే పుస్తకాలు కూడా కొన్ని చోట్ల ప్రదర్శనకు ఉన్నాయి. పుస్తకం లోపల వ్యక్తమయ్యే భావాలకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దాలంటే ఆ బైండరు కూడా మంచి కళాకారుడు అయివుండాలి. ఫ్యోదర్ దోస్తోవ్స్కీ నవల ‘ద పొసెస్డ్’లో జరిగే ఈ ఆసక్తికర సంభాషణ పుస్తకాల పట్ల ప్రపంచం ఇంకా ఎక్కడుందో తెలియజేస్తుంది. ఈ నవలకే వాటి అనువాదకులను బట్టి ‘డెమన్ ్స’, ‘డెవిల్స్’ అని మరో రెండు పేర్లున్నాయి. జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, వాస్తవాల చేదును గ్రహించి, బండి బాడుగ కూడా ఇవ్వలేని స్థితిలో చివరకు తానే వదిలేసిన భర్త దగ్గరకు మళ్లీ చేరుతుంది మేరీ. బతకడానికి ఏదైనా మార్గం గురించి ఆలోచిస్తూ, ‘పోనీ పుస్తకాల బైండింగు చేస్తాను’ అంటుంది. అప్పుడు ఆమె భర్త, నవలలో అన్నివిధాలా సంయమనం కలిగిన మనిషి, ‘ఆదర్శాల్లోని’ నిగ్గును తేల్చుకున్న ఇవాన్ షతోవ్ ఆమె భ్రమలు తొలిగేలా ఇలా చెబుతాడు: ‘‘పుస్తకాలను చదవడం, వాటిని బౌండు చేయించడం అనేవి అభివృద్ధికి సంబంధించిన రెండు పూర్తి భిన్న దశలు. మొదట, జనాలు నెమ్మదిగా చదవడానికి అలవాటు పడతారు. దీనికి సహజంగానే శతాబ్దాలు పడుతుంది; కానీ వాళ్లు తమ పుస్తకాలను కాపాడుకోరు. వాటిని నిర్లక్ష్యంగా పడేస్తారు. పుస్తకాలను బైండు చేయించడం అనేది పుస్తకాల పట్ల గౌరవానికి సంకేతం; అది ప్రజలు పుస్తకాలను చదవడానికి ఇష్టపడటమే కాదు, వాళ్లు దాన్ని ఒక ప్రధాన వృత్తిగా భావిస్తున్నారని సూచిస్తుంది. రష్యాలో ఎక్కడా అలాంటి దశకు చేరుకోలేదు. యూరప్‌లో కొంతకాలంగా తమ పుస్తకాలను బైండింగ్ చేయిస్తున్నారు.’’ 1871–72 కాలంలో రాసిన ఈ నవలలో, సాహిత్యం అత్యంత ఉచ్చస్థితిని అందుకొందనుకునే రష్యా సైతం ఒక దేశంగా చదివే సంస్కతిలో వెనుకబడి ఉందన్నట్టుగా రాశారు దోస్తోవ్స్కీ. ఇంక మిగతా దేశాల పరిస్థితి? ఒక సమాజపు అత్యున్నత స్థితిని కొలవగలిగే ప్రమాణాలు అక్కడి కళలు, వాటి పట్ల జనాల వైఖరి మాత్రమే. దీనికి కూడా ఈ నవలలో దోస్తోవ్స్కీ ద్వారా సమాధానం దొరుకుతుంది. అప్పటి కాలానికి తనను తాను అభ్యుదయ రచయితగా భావించుకొనే పీటర్ వెర్కోవెన్ స్కీ ఇలా ఆవేశపడతాడు: ‘‘బానిసల (సెర్ఫులు) దాస్య విమోచన కంటే కూడా షేక్స్పియర్, రఫేల్ అధికోన్నతులని నేను ఘోషిస్తున్నాను; జాతీయత కంటే అధికోన్నతులు, సామ్యవాదం కంటే అధికోన్నతులు, యువతరం కంటే అధికోన్నతులు, రసాయన శాస్త్రం కంటే అధికోన్నతులు, దాదాపు మానవాళి మొత్తం కంటే అధికోన్నతులు; ఎందుకంటే వాళ్లు ఇప్పటికే సమస్త మానవాళి సాధించిన ఫలం. నిజమైన ఫలం. బహుశా ఇంకెప్పటికీ సాధ్యం కానంతటి అత్యున్నత ఫలం!’’ అలాంటి ఒక కళోన్నత స్థితి లేని సమాజంలో తాను జీవించడానికి కూడా సమ్మతించకపోవచ్చునంటాడు వెర్కోవెన్ స్కీ. ఇది ఆర్ట్ అనేదానికి అత్యున్నత స్థానం ఇచ్చే సాంస్కృతిక కులీనుల అతిశయోక్తిలా కనబడొచ్చు. కానీ కళ అనేదాన్ని మినహాయిస్తే మన జీవితాల్లో మిగిలేది ఏమిటి? మహాశూన్యం. గాఢాంధకారం. అందుకే తమ జీవితాల్లో ఏదో మేరకు కళను సజీవంగా నిలుపుకొన్నవాళ్లు అదృష్టవంతులు. అది తమకు నచ్చిన సీరియళ్లను ఒక పుస్తకంగా కుట్టుకోవడం, తమకు నచ్చిన పుస్తకాలను బైండు చేయించుకోవడం కూడా కావొచ్చు. ఏ రూపంలో ఉన్న అతివాదాన్నయినా దాని మూలాలను, అది పాతుకుపోవడానికి దారితీసే పరిస్థితులను, ఒకప్పుడు తమ వర్గంవాడే అయినా కేవలం ఇప్పుడు ఆ వాదంలోంచి బయటపడ్డాడన్న కారణంగా చంపడానికీ వెనుకాడని మూక మనస్తత్వాన్ని–– ఒక శక్తిమంతమైన సూక్ష్మదర్శినిలో చూసినట్టుగా చిత్రించిన నవల ‘పొసెస్డ్’. విషాదాంతంగా ముగిసే ఈ సామాజిక, రాజకీయ వ్యాఖ్యాన నవల కూడా బైండు చేసుకుని దాచుకోవాల్సిన పుస్తకం. అదే అనితర సాధ్యుడైన దోస్తోవ్స్కీ లాంటి రచయితకు ఇవ్వగలిగే సముచిత మర్యాద! -
స్కూల్ బ్యాగ్స్, బుక్స్ ను పరిశీలించిన సీఎం వైఎస్ జగన్
-
Fact Check: ‘కానుక’పైనా కక్ష సాధింపే.. ‘ఈనాడు’ విషప్రచారం
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండి అబద్ధం చెప్పినా ఈనాడు రామోజీకి అమృత వాక్యంలా వినబడుతుంది. ప్రజలను మోసం చేసినా సరే అదే సరైనది అవుతుంది.. బాబు తప్ప మరే ప్రభుత్వం ప్రజలకు మేలు చేసినా అది నేరంగానే కనిపిస్తుంది.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం... ప్రభుత్వ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ జగనన్న విద్యా కానుక పేరుతో మూడేళ్లుగా నాణ్యమైన స్కూలు బ్యాగు లు, పుస్తకాలు, బూట్లు, యూనిఫారం వంటి వస్తువులను అందిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా ‘ఈనాడు’కు మాత్రం కడుపుమంటగా ఉంటోంది. అందుకే 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించే విద్యా కానుకపై శనివారం విషం కక్కింది. వాస్తవాలను వక్రీకరించి ‘పిల్లలు తగ్గినా.. కానుక ఖర్చు పెరిగింది’ అంటూ అడ్డగోలుగా ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. అదేంటంటే.. ♦ ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఇచ్చే వస్తువుల్లో మరింత నాణ్యత ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. గత మూడేళ్లలో జగనన్న విద్యాకానుకలో బ్యాగుల నాణ్యతా ప్రమాణాలను సీపెట్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) చూసింది. అయితే, నాణ్యతా ప్రమాణాల నిర్ధారణలో కాకుండా, అన్ని దశల్లోనూ.. అంటే ముడి సరుకు నుంచి బ్యాగుల ఉత్పత్తి, స్టాక్ పాయింట్‌కు చేరే వరకు అన్ని దశల్లోను పర్యవేక్షణ అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మద్దతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ విద్యా కానుకలోని వస్తువులను మూడు దశల్లో (ముడిసరుకు నుంచి స్టాక్ పాయింట్ వరకు) నాణ్యత పరీక్షలు చేసి మన్నికైన వస్తువులకు మాత్రమే అనుమతినిస్తుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం డబ్బు వృథా చేసినట్లు కాదు. ♦ సరఫరా చేసిన బ్యాగుల్లో 6 లక్షల బ్యాగులు చినిగిపోతే ప్రభుత్వం తిరిగి మంచి స్టాకును తెప్పించింది. అదనంగా వచ్చిన ఈ బ్యాగులకు ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లించలేదు. ♦ గత ఏడాదికి ఈ ఏడాదికి మార్కెట్ రేటు 6.85 శాతం పెరిగింది. కొలతల్లో మార్పులు, గ్లాసీ ఫినిషింగ్, సాధారణ ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని వస్తువు ధర నిర్ణయం జరుగుతుంది. 2022–23 విద్యా సంవత్సరంలో ఇన్సెట్ పేపర్ ధర టన్నుకు రూ.91,492.24, కవర్ పేపరు ధర టన్ను రూ.99,866.40 ఉండేది. 2023–24 విద్యా సంవత్సరానికి పేపరు సేకరణ కోసం టెండర్లు పిలిస్తే తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ ‘తమిళనాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ (టీఎన్‌పీఎల్) సంస్థ సరఫరాకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ఇన్సెట్ పేపర్ ధర టన్ను రూ.1,15,500, కవర్ పేపర్ ధర టన్ను రూ.1,21,000గా టెండర్ వేసింది. ఈ ధర గతేడాది ధరతో పోలిస్తే.. పేపర్ ధర టన్నుకు రూ.24,007 (26.23 శాతం), కవర్ పేపర్ ధర రూ.21,134 (21.16 శాతం) పెరిగింది. ఈ ధరను ప్రభుత్వం అంగీకరించి 15,711 మెట్రిక్ టన్నుల ఇన్సెట్ పేపర్, 1,400 మెట్రిక్ టన్నుల కవర్ పేపర్‌ను పాఠ్య పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, పిక్టోరియల్ డిక్షనరీల ముద్రణకు కొనుగోలు చేసింది. పేపర్ ధర పెరగడంతో పుస్తకాల ధర కూడా స్వల్పంగా పెరిగింది. ♦ ఇక ఈ ఏడాది విద్యార్థులకిచ్చే యూనిఫారం మూడు జతల్లో క్లాత్ పరిమాణం 23 శాతం పెంచడంతో పాటు, ప్లెయిన్ యూనిఫారం నుంచి చెక్ యూనిఫాంకు డిజైన్ మారింది. బ్యాగుల పరిమాణం, నాణ్యత భారీగా పెంచారు. ♦43 లక్షల యూనిట్లకు టెండర్ పిలిచినప్పటికీ బడులు తెరిచే నాటికి వాస్తవ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మాత్రమే వస్తువులను కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటారు. దానికి తగ్గట్లుగానే చెల్లింపులు ఉంటాయి. జాతీయ స్థాయిలోను అన్ని వస్తువుల ధరలు 26.23 శాతం పెరిగాయి. ఏటా ధరల పెరుగుదల సహజ ఆర్థిక పరిణామమైనప్పటికీ దీన్ని ‘ఈనాడు’ వక్రీకరించడం దురదృష్టకరం. -
AP: బడిలో బుక్స్ రెడీ.. అక్షర యజ్ఞానికి అంతా సిద్ధం!
జీకే వీధి, కోటనందూరు నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తొలిరోజే పుస్తకాలను అందచేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల కోసం సుమారుగా ఆరు కోట్ల పుస్తకాలను సిద్ధం చేసి స్టాక్ పాయింట్లకు చేర్చడం గమనార్హం. విద్యార్థుల సంఖ్య, కొత్త చేరికలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు బ్యాగులు, యూనిఫారం, బూట్లు, సాక్సులతో కూడిన ‘జేవీకే’ కిట్లను పాఠశాలలకు రవాణా ఖర్చులు చెల్లించి మరీ చేరవేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు జగనన్న విద్యా కానుక కిట్లలోని వస్తువుల నాణ్యతను విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. స్టాక్ పాయింట్ల వద్ద నాణ్యతను క్షుణ్నంగా పరిశీలించాకే తీసుకుంటున్నారు. ఎక్కడైనా లోపాలున్నట్లు గుర్తిస్తే తిప్పి పంపించి నాణ్యతతో కూడినవి తెప్పిస్తున్నారు. జిల్లా, మండల స్థాయి స్టాక్ పాయింట్లకు చేరిన కిట్ల నాణ్యతను ర్యాండమ్‌గా పరిశీలించాలని విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులను ఆదేశించారు. రెండో సెమిస్టర్‌కు సైతం.. రాష్ట్రవ్యాప్తంగా 2023–24 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు అవసరమైన 3,54,61,730 పాఠ్య పుస్తకాలు, వర్కు బుక్స్‌తోపాటు 2,32,46,064 నోటు పుస్తకాలను మండల స్టాక్ పాయింట్లకు చేర్చారు. జూన్ 11 నాటికి వంద శాతం పాఠశాలలకు చేరవేసేలా చర్యలు చేపట్టారు. పుస్తకాల ప్రింటింగ్‌కు నాణ్యమైన పేపర్‌ను తమిళనాడు న్యూస్ పేపర్ ప్రింటర్స్ నుంచి కొనుగోలు చేశారు. ఇక ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్ కోసం సైతం ఇప్పటి నుంచే పుస్తకాల ముద్రణ చేపట్టారు. రెండో సెమిస్టర్‌కి సంబంధించి 1,06,82,403 పుస్తకాలను జూలై చివరి నాటికి విద్యార్థులకు అందించేలా అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ద్విభాషా పాఠ్య పుస్తకాలు (బైలింగ్యువల్) ముద్రిస్తుండగా రాష్ట్ర సరిహద్దుల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఈ ఏడాది ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా భాషల్లోను పాఠ్యపుస్తకాలను ముద్రించారు. మొత్తం 425 టైటిల్స్‌తో అత్యధిక సంఖ్యలో పుస్తకాలను తేవడం గమనార్హం. తొమ్మిదో తరగతిలో ఎన్సీఈఆర్టీ.. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో ఎన్సీఈఆర్టీ కరిక్యులమ్‌ను సైతం ప్రవేశపెట్టింది. 2023–24 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలో పూర్తిస్థాయిలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో అన్ని సబ్జెక్టుల పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. దీంతో పాటు ఆరు, ఏడు తరగతుల్లో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులను, ఎనిమిదో తరగతిలో ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులను ఎన్సీఈఆర్టీ సిలబస్‌కు అనువుగా మార్చారు. ఈసారి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకూ వర్క్ బుక్స్ అందించనున్నారు. ఐదు శాతం అదనంగా.. జూన్ 12వ తేదీన 39,95,992 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేపట్టనున్నారు. ఐదు శాతం అదనంగా అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కిట్లలో 34,93,765 బ్యాగులు (88 శాతం) ఇప్పటికే స్టాక్ పాయింట్లకు చేరుకోగా మిగిలినవి రవాణాలో ఉన్నాయి. బూట్లు, సాక్సులు కలిపి 36,26,732 యూనిట్లు (92 శాతం), యూనిఫామ్స్ వంద శాతం, నోటు పుస్తకాలు 83 శాతం, బెల్టులు 92 శాతం, డిక్షనరీలు నూరు శాతం స్టాక్ పాయింట్లకు చేరడంతో పాటు అక్కడి నుంచి అన్ని స్కూళ్లకు చేరాయి. -
Karnataka assembly elections 2023: మోదీ, రాహుల్‌ను చూసి నేర్చుకోండి!
జంఖాండి: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. ‘‘వాటన్నింటినీ కలిపినా ఒక పేజీ అవుతాయేమో. కానీ మీరూ, బీజేపీ నేతలూ మా కుటుంబాన్ని తిట్టిన తిట్లన్నీ రాస్తే పుస్తకాలే కూడా చాలవు! ఆమె ఆదివారం కర్ణాటకలోని బాగల్కోటె జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు. దేశం కోసం తూటాలకు ఎదురొడ్డటానికి సిద్ధంగా ఉన్న తన సోదరుడు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలని మోదీకి సలహా ఇచ్చారు. ‘‘ప్రజాజీవితంలో ఉన్నవారు విమర్శలకు సిద్ధపడాలి. కాంగ్రెస్ తరఫున ప్రధానులుగా ఉన్న ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం తూటాలు తిన్నారు. కానీ ప్రజల కష్టాలను వినడానికి బదులు వారికి సొంత బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోసం పాకులాడుతున్న మొట్టమొదటి ప్రధాని మోదీయే’’ అంటూ ఎద్దేవా చేశారు.