జూన్‌ నాటికి పాఠ్యపుస్తకాలు! | School Text Books Reached Kurnool in June | Sakshi
Sakshi News home page

జూన్‌ నాటికి పాఠ్యపుస్తకాలు!

Published Wed, Apr 17 2019 12:47 PM | Last Updated on Wed, Apr 17 2019 12:47 PM

School Text Books Reached Kurnool in June - Sakshi

కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జూన్‌ నాటికి స్కూల్‌ పాయింట్లకు చేర్చేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. మూడు, నాలుగేళ్లుగా విద్యా సంవత్సరం ప్రారంభమై.. నెలలు గడిచినా పూర్తి స్థాయి పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు చేరలేదు. అరకొర పుస్తకాలతోనే చదువులు కొనసాగించారు. అయితే.. 2019–20 విద్యా సంవత్సరంలో అలాంటి ఇబ్బందులేవీ ఉండకూడదనే ఉద్దేశంతోనే విద్యాశాఖ ఈ ఏడాది జనవరి నుంచే పాఠ్యపుస్తకాలను సిద్ధం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వేసవి సెలవులు ముగిసే నాటికే ప్రింటర్ల నుంచి జిల్లా కేంద్రానికి, ఇక్కడి నుంచి మండల విద్యా వనరుల కేంద్రాలకు(ఎంఆర్‌సీలు) పాఠ్య పుస్తకాలను చేర్చి, స్కూళ్లు పునఃప్రారంభమైన వెంటనే విద్యార్థులకు అందజేసే విధంగా చర్యలు చేపడుతోంది.

జిల్లాకు చేరిన మొదటివిడత పుస్తకాలు
మొదటి విడత పాఠ్య పుస్తకాలు మంగళవారం జిల్లాకు చేరాయి. 2వ తరగతి, 5వ తరగతి, పర్యావరణ విద్యకు సంబంధించిన పుస్తకాలు వచ్చాయి. మొత్తం 61,500 పుస్తకాలు జిల్లాకు చేరినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. 2019–20 విద్యా సంవత్సరం కొత్తగా ప్రైమరీ తరగతులలో పర్యావరణ విద్యను కూడా ప్రవేశ పెట్టనున్నారు. వీటికి సంబంధించిన పుస్తకాలు ఇప్పటికే ముద్రణ పూర్తయ్యింది. గతంలో కంటే మూడు నెలల ముందుగానే ముద్రణకు టెండర్లు పిలవడం, ప్రింటర్లు సైతం నిర్ధేశించిన సమయానికి ప్రింటింగ్‌ పూర్తి చేసి మొదటి విడత పుస్తకాలను జిల్లాలకు చేర్చుతున్నారు. కర్నూలు నగరంలోని పాఠ్యపుస్తకాల గోదామును ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి, డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం తనిఖీ చేశారు. జిల్లాలో 2018 డిసెంబరు యూడైస్‌ వివరాల ప్రకారం ప్రాథమిక స్కూళ్లు 2,422, ప్రాథమికోన్నత 932, ఉన్నత పాఠశాలలు 985, మొత్తంగా 4,339 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రైమరీ విద్యార్థులు 2,62,069 మంది, అప్పర్‌ ప్రైమరీ 1,15,844 మంది, హైస్కూల్‌ విద్యార్థులు 2,87,659 మంది చదువుతున్నారు.  ప్రభుత్వ యాజమాన్యాలు, ఎయిడెడ్‌ స్కూళ్లతో పాటు ఏపీ మోడల్‌ స్కూల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న వారికి విద్యాశాఖ ఉచితంగానే పాఠ్య పుస్తకాలను అందజేస్తోంది. గతేడాది ఈ సమయానికి ముద్రణ ప్రక్రియనే మొదలుకాలేదు.  ఆలస్యంగా పుస్తకాలు రావడంతో పాత పుస్తకాలతోనే చదువులు కొనసాగించాల్సి రావడంపై విద్యాశాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

యూడైస్‌ ప్రకారం సరఫరా
గతంలో ఎన్ని పుస్తకాలు కావాలో జిల్లా అధికారుల నుంచి వివరాలను తీసుకునేవారు. అయితే.. గత ఏడాది నుంచి విద్యాశాఖనే యూడైస్‌ ప్రకారం ఏయే జిల్లాకు ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమో ఆన్‌లైన్‌లోని వివరాల ప్రకారం సరఫరా చేస్తోంది. ఈ ఏడాది మే  15 నాటికి 80 శాతం పుస్తకాలు ఎంఆర్‌సీలకు చేర్చాలని అధికారులు నిర్ణయించారు. కన్నడ మీడియం పుస్తకాలు మాత్రమే కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. మొత్తం ఐదు విడతల్లో పుస్తకాలు రానున్నాయి. మొదటి విడత కింద 2,5 తరగతులకు చెందిన ఇంగ్లిష్, ఇంగ్లిష్‌ వర్క్‌బుక్స్, పర్యావరణ విద్యకు సంబంధించిన పుస్తకాలు వచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement