
చెప్పడానికేముంది?
ఒక యువకుడు ఆత్మజ్ఞానం పొందాలనుకున్నాడు. అందుకోసం ఒక మఠాలయానికి వెళ్ళి గురువు అంగీకారంతో అక్కడ చేరాడు. అక్కడ ఉన్న రోజుల్లో బోలెడు పుస్తకాలు చదివాడు.
ఒక యువకుడు ఆత్మజ్ఞానం పొందాలనుకున్నాడు. అందుకోసం ఒక మఠాలయానికి వెళ్ళి గురువు అంగీకారంతో అక్కడ చేరాడు. అక్కడ ఉన్న రోజుల్లో బోలెడు పుస్తకాలు చదివాడు. సూత్రాలు తెలుసుకున్నాడు. అన్నింటిలోనూ తర్ఫీదు పొందాడు. తత్త్వవేత్తలతో వాదోపవాదాలు చేసి తనదే పైచేయి అనిపించుకున్నాడు.
అయితే ఒకరోజు ఒక గురువు అతనితో చెప్పాడు -
‘‘నువ్వు వొట్టి తర్కశాస్త్రంలో ఆరితేరావు తప్ప నీ దగ్గర సహజ జ్ఞానం లేదు. నీదంతా పుస్తకాలు చదవడం వల్ల అబ్బిన జ్ఞానమే. దానివల్ల ప్రయోజనం లేదు. ఈ జ్ఞానం నువ్వో మేధావంతుడవు అనే గర్వాన్ని మాత్రం ఇస్తుంది. కనుక దేశసంచారం చెయ్యి. అప్పుడు లభించే ప్రపంచానుభవం నీకు అసలైన జ్ఞానాన్ని ఇస్తుంది’’ అని.
ఆయన మాటలు విన్న ఆ యువకుడు దేశాటనకెళ్లాడు. మొదటి నెల గడిచింది. గురువుగారికి ఒక ఉత్తరం రాశాడు.
‘‘నా ఉద్వేగానుభూతుల పరిధి పెరిగింది. ఒక్క చోటే ఉండి పొందిన దానికన్నా ఇలా సంచారం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. స్వయంగా చూస్తున్నాను. నేను క్రమంగా ప్రకృతితో మమేకమవుతున్నాను’’ అని ఆ ఉత్తరంలో తెలియజే శాడు.
దాన్ని చదివి గురువు మండిపడ్డారు. ఉత్తరాన్ని నలిపి పారేశారు.
మరో నెలకి యువకుడు ‘‘దేవుడు అన్ని చోట్లా ఉండటాన్ని తెలుసుకున్నాను’’ అని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని కూడా గురువుగారు చించి విసిరేశారు.మరో నెల గడిచింది.
దేశాటన చేస్తున్న యువకుడు ఈసారి పంపిన ఉత్తరంలో ‘‘చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నీ ఒక దానికొకటి పెనవేసుకునే ఉంటున్నాయి. ఈ సంఘటనలన్నీ అతని ప్రమేయం లేకుండా జరగడం లేదని తెలుసుకున్నాను’’ అని రాశాడు.
గురువుగారు ఆ ఉత్తరాన్నీ పక్కన పడేశారు.
తర్వాతి ఉత్తరంలో యువకుడు ‘‘ఆత్మ ఒక్కటే... దానికి జనన మో మరణమో లేదు. మనసు మాత్రమే చలిస్తున్నట్టు సంచరిస్తున్నట్టు తెలుసుకున్నాను’’ అని రాశాడు.
గురువుగారు ఒకసారి ముఖాన్ని తుడుచుకున్నారు.
ఆ తర్వాత దాదాపు ఏడాది దాటింది. అతని నుంచి తనకేదీ సమాచారం లేకపోవడంతో గురువు అతనికి ఒక కబురంపారు వెంటనే విషయం చెప్పమని.
శిష్యుడు పెదవివిరుస్తూ రెండు ముక్కలు రాశాడు.
‘‘విషయం చెప్పడానికి ఏముంది? దీనిగురించి ఎవరు ఆలోచిస్తున్నారు?’’ అని.
గురువుగారికి అర్థమైంది. ‘‘భగవంతుడికి కృతజ్ఞతలు’’ చెప్పుకున్నారు గురువుగారు.
జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం అన్వేషిస్తున్నాను అనే మాటే ఒట్టి మాట. వృధా ప్రయాస. వె తుకులాట ముగిసిందనుకున్న చోటే మనం దేనికోసం వెతుకుతున్నామో అది ఉంటుంది.
- యామిజాల జగదీశ్