
ఏపీ రెసిడెన్షియల్ సిబ్బందికి 10 నెలలుగా వేతనాలివ్వని ప్రభుత్వం
విద్యార్థుల డైట్ చార్జీలు, భవనాల అద్దె చెల్లింపులూ నిలిపివేత
మైనార్టీ స్కూళ్ల పరిస్థితి మరీ దారుణం.. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇస్తున్నా డబ్బులివ్వని తీరు
సాక్షి, అమరావతి: ఎంతో ఉన్నతమైన ఆశయాలతో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల(ఏపీఆర్‌ఎస్ అండ్ జేసీ) పరిస్థితి తీసికట్టుగా మారింది. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా కూటమి సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఆ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆర్థిక కష్టాలు పడుతున్నారు. విద్యా సంవత్సరమంతా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు జీతాలు ఇవ్వకపోవడంతో పాటు విద్యార్థులకు డైట్ చార్జీలను సైతం చెల్లించలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 4 నెలల క్రితం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్‌వో) ఇచ్చినా.. నిధులు విడుదల కాకపోవడంతో అధికారులు దిక్కులు చూస్తున్నారు.
రెసిడెన్షియల్ స్కూళ్లలో సదుపాయాల కల్పనకు ఇచ్చిన బడ్జెట్ నుంచి కొంత మొత్తాన్ని రెండు నెలల వేతనంగా సర్దుబాటు చేసినా.. ఇంకా 8 నెలల వేతనాలు అందలేదు. ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని రెసిడెన్షియల్ కాలేజీలకు నాలుగైదు నెలలకు బడ్జెట్ విడుదల చేస్తుండగా.. మైనార్టీ కాలేజీలకు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు ఒక్క నెల వేతనం గాని, విద్యార్థులకు చెల్లించే డైట్ చార్జీలు గాని విడుదల చేయలేదు. నాగార్జున సాగర్‌లోని డిగ్రీ కాలేజీ సిబ్బందికీ 7 నెలలుగా వేతనాలు నిలివేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకే తరహా స్కూళ్లకు వేర్వేరు బడ్జెట్‌లు
నిరుపేద విద్యార్థులకు పూర్తిస్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీని ఏర్పాటు చేశారు. దీనికింద 50 రెసిడెన్షియల్ స్కూళ్లు, 11 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ (నాగార్జునసాగర్) నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పేరుకు ఒకే సొసైటీ కింద కొనసాగుతున్నా స్కూళ్ల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ, జూనియర్ కాలేజీలకు ఇంటర్మిడియట్ బోర్డు, డిగ్రీ కాలేజీకి ఉన్నత విద్యశాఖ నిధులిస్తున్నాయి. మైనార్టీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 6 రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమైన బడ్జెట్‌ను మైనార్టీ సంక్షేమ శాఖ కేటాయిస్తోంది.
విద్యా సంవత్సరం పూర్తయినా..
సిబ్బంది వేతనాలకు రూ.15 లక్షలు, విద్యార్థుల డైట్ చార్జీలకు రూ.30 లక్షలు కలిపి ప్రతి స్కూల్‌కు రూ.45 లక్షలు ఇవ్వాలి. అయితే, 50 స్కూళ్లలో 6 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లకు 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి సిబ్బందికి వేతనాలు, విద్యార్థులకు డైట్ చార్జీలు విడుదల చేయలేదు. ఏప్రిల్ నెలతో విద్యా సంవత్సరం పూర్తయింది. అయినా గత 10 నెలలుగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. విద్యాసంవత్సరం మొత్తానికి రూ.4.50 కోట్లు నిధులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. మరోపక్క 11 రెసిడెన్షియల్ జూనియర్, ఒక డిగ్రీ కాలేజీలకు నవంబర్ నుంచి వేతనాలు, డైట్ చార్జీల చెల్లింపుల్ని నిలిపివేశారు. జూనియర్ కాలేజీలకు నెలకు రూ.1.20 కోట్ల చొప్పున రూ.7.20 కోట్లు, డిగ్రీ కాలేజీకి రూ.30 లక్షల చొప్పున రూ.1.80 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మైనార్టీ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు అన్నింటికీ కలిపి రూ.13.50 కోట్లు చెల్లించాలి.
అద్దెలూ అంతే
వీటిలో కొన్ని స్కూళ్లు, కాలేజీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వేతనాల కోసం సిబ్బంది నుంచి ఒత్తిడి వస్తుండటంతో మూడు నెలలకోసారి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందేగాని నిధులు మాత్రం ఇవ్వడం లేదు. మరోపక్క భవనాల అద్దె చెల్లించకపోవడంతో యాజమాన్యాల నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో చేసేది లేక భవనాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లపై కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరికి ఇది అద్దం పడుతోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. వేతనాలు లేకుండా బతికేదెలా అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.