
ఒకే ఆర్థిక సంవత్సరంలో 104 స్టార్టప్‌లను అభివృద్ధి చేసిన ఐఐటీ మద్రాస్
సాక్షి, అమరావతి: ఆవిష్కరణల దిశగా గొప్ప ముందడుగు వేయడంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ చరిత్ర సృష్టిస్తోంది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ (ఐఐటీఎంఐసీ), స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ సంయుక్తంగా 2024–25లో ఏకంగా 104 స్టార్టప్‌లను అభివృద్ధి చేయడం విశేషం. ఈ స్టార్టప్‌లలో సగానికిపైగా ఐఐటీ మద్రాస్ కమ్యూనిటీ సభ్యులైన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు స్థాపించారు.
మిగిలిన వాటిని బయట వ్యక్తులకు ప్రోత్సాహకం అందించడం ద్వారా ప్రారంభించారు. ఇది ఐఐటీ మద్రాస్‌లోని స్టార్టప్ అనుకూల వ్యవస్థను బలంగా చాటుతోంది. 12 ఏళ్లుగా ఐఐటీ మద్రాస్ శక్తివంతమైన డీప్‌టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిరి్మస్తోంది. ఇప్పటివరకు రూ.50,000 కోట్లకుపైగా సమష్టి విలువ కలిగిన 457 స్టార్టప్‌లు, 2 యూనికార్న్‌లను అందించింది.
‘స్టార్టప్ మిషన్’ విజయవంతం..
గతేడాది ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ నిర్దేశించిన ‘స్టార్టప్ 100 మిషన్’ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఇది ఏడాదికి సగటున 60 స్టార్టప్‌ల నుంచి 104కు చేరుకోవడం చరిత్రాత్మక విషయం. దీనికి తోడు ఐఐటీ మద్రాస్ ఏడాదిలో ఏకంగా 417 పేటెంట్లను దాఖలు చేసింది. అంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ పేటెంట్లు దాఖలైనట్లు లెక్క.
ఈ స్టార్టప్‌ల్లో తయారీ, రోబోటిక్స్, ఆటోమోటివ్ మెటీరియల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, హెల్త్‌టెక్, స్పేస్, ఫార్మా, క్వాంటం టెక్నాలజీ, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఐఓటీ, అగ్రిటెక్, కృత్రిమ మేధ వంటి ముఖ్యమైన డీప్ టెక్ రంగాల్లో సేవలందిస్తున్నాయి. ఇక్కడే ఇన్‌బౌండ్ ఏరోస్పేస్, మ్యాటరైజ్ వంటి నవ కంపెనీలకు ఐఐటీఎంఐసీ నుంచి తిరుగులేని సహకారం లభించడంతోనే సాధ్యపడింది.