
హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో సుమంత్ (Sumanth) పెళ్లి.. కొద్దిరోజులుగా వస్తున్న ఈ వార్తలపై తాజాగా సుమంత్ రియాక్ట్ అయ్యాడు. ఆయన నటించిన కొత్త సినిమా ‘అనగనగా’ (Anaganaga) ఓటీటీలో డైరెక్టగా మే 15న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మృణాల్ ఠాకూర్, సుమంత్ కలిసి దిగిన ఫోటో వెనుక ఉన్న అసలు విషయం చెప్పాడు.
అక్కినేని కుటుంబంలో మరో పెళ్లి బాజా మోగబోతోందని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను సుమంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటిపై ఇద్దరూ మౌనంగా ఉండటంతో నెటిజన్లలో అనుమానాలు మరింత పెరిగాయి. అయితే, ఎట్టకేలకు హీరో సుమంత్ క్లారిటీ ఇచ్చేశాడు. మృణాల్‌తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని కుండ బద్దలు కొట్టేశాడు. ఒక సినిమా సమయంలో తీసుకున్న ఫోటో కొద్దిరోజులుగా వైరల్ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తనను ఎక్కడా కూడా కలిసింది లేదన్నాడు. 'సీతా రామం' సినిమాలో మృణాల్ ఠాకూర్, సుమంత్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ టైమ్‌లోనే వారిద్దరిలో స్నేహం మొదలైంది.
పెళ్లి గురించి క్లారిటీ
పెళ్లి మీద తనకు ఎలాంటి ఆసక్తి లేదని సుమంత్ చెప్పాడు. ఇలా సింగిల్‌గా ఉండడమే లైఫ్ బాగుందని తెలిపాడు. ఈ క్రమంలో తానెప్పుడు ఒంటరితనాన్ని ఫీలవ్వలేదని క్లారిటీ ఇచ్చేశాడు. జీవితంలో ఒక తోడు కావాలని కూడా ఎప్పుడూ అనిపించలేదని చెప్పుకొచ్చాడు. అసలు లైఫ్‌లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని సుమంత్ హింట్ ఇచ్చేశాడు. సుమంత్‌కు గతంలో పెళ్లి అయి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి ఆయన సింగిల్‌గానే ఉంటున్నాడు.