
కోలీవుడ్ నటుడు విశాల్ మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై తన పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో హీరో విశాల్ స్పృహ తప్పి పడిపోవడంపై వారు వివరణ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలనే విశాల్ అస్వస్థతకు గురయ్యారని వారు చెప్పారు. దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం విశాల్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు.
తమిళనాడు విల్లుపురంలో ఉండే కూవాగం గ్రామంలో ఉన్న ఆలయంలో కొద్దిరోజులుగా చిత్తిరై (తమిళమాసం) వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో విశాల్ అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం నాడు మిస్ కువాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్‌ను నిర్వాహుకులు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ కొద్దిసేపట్లోనే ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.