
వ్యూహాత్మకంగా పాత్రధారుల ఎంపిక.. ఎవరి మీద కుట్ర పన్నాలి? ఎవరిని ఇరికించాలని ముఖ్యనేత పన్నాగం
బెదిరింపులు, ప్రలోభాలతో తమ దారికి తెచ్చుకుని అబద్ధపు వాంగ్మూలాలు
తెరపైకి భేతాళ కథలు.. సిట్ రిమాండ్ రిపోర్టులో అవే కట్టు కథలు
తాము సంతకం చేయలేదని న్యాయమూర్తి ఎదుట చెబుతున్న నిందితులు
రెడ్‌బుక్ ఆగడాలపై కోర్టుకు మొర పెట్టుకున్న డిస్టిలరీల యజమానులు
సిట్ బెదిరింపులు, బలవంతపు వాంగ్మూలాలపై మూడుసార్లు కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి
ఎట్టకేలకు తమ దారికి రావడంతో రిలీవ్ చేసి వెంటనే కేంద్ర సర్వీసుకు పంపిన ప్రభుత్వ పెద్దలు
బెవరేజెస్ కార్పొరేషన్ చిన్న స్థాయి ఉద్యోగులకూ బెదిరింపులు..
రాజ్యసభ సభ్యత్వం మరో మూడున్నరేళ్లు ఉన్నా.. రాజీనామా చేసి కూటమికి ప్రయోజనం కల్పించిన విజయసాయిరెడ్డి
సరికొత్త పాత్రధారిగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామి రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకున్నారు
ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పలేనని రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయలేదని స్వయంగా జడ్జి ఎదుట చెప్పిన రాజ్ కేసిరెడ్డి
లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే కుట్రలు
నూతన మద్యం విధానం పేరుతో దోపిడీకి రాచబాట వేసిన చంద్రబాబు
విచ్చలవిడిగా విక్రయాలు.. కమీషన్లు బాబు ఘనతే
సాక్షి, అమరావతి: మద్యం మాఫియా డాన్‌గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్‌బుక్ కుట్రను రక్తి కట్టించేందుకు సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేసుకుని ప్రలోభపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకుని అబద్ధపు వాంగ్మూలాలతో రోజుకో భేతాళ కథను తెరపైకి తెస్తున్నారు. కట్టు కథలు అల్లుతూ, బేతాళ కథలను సృష్టిస్తూ వాటిని వారితో పలికిస్తున్నారు. అవే కల్పిత కథలను రిమాండ్ రిపోర్టులో పొందుపరుస్తున్నారు.
దానిపై తాము సంతకం చేయలేదని నిందితులే స్వయంగా న్యాయమూర్తుల ఎదుట వెల్లడిస్తున్నారంటే బాబు భేతాళ కథలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని సరికొత్త పాత్రధారిగా చంద్రబాబు తీసుకొచ్చారు. తాను అబద్ధాలు చెప్పలేనని, ఇంత దారుణమైన రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయలేదని రాజ్ కేసిరెడ్డి స్వయంగా చెప్పారు. అదే విషయాన్ని న్యాయస్థానంలోనూ వెల్లడించారు.
సిట్ అధికారుల వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలపై మూడుసార్లు కోర్టుకు మొర పెట్టుకున్న బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి చివరకు తమ దారికి రావడంతో ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు సాగనంపారు. రెడ్‌బుక్ అరాచకాలు, బెదిరింపులను డిస్టిలరీల యజమానులు సైతం న్యాయస్థానానికి నివేదించారు. చంద్రబాబు సూత్రధారిగా ఆడిస్తున్న ఈ కపట నాటకంలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూష, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి పావులుగా మారారు.
బెదిరించడం.. వెంటాడి వెంటాడి వేధించడం.. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించడం దాకా అంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే సాగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అడ్డంగా దొరికిపోయి బెయిల్‌పై ఉన్న చంద్రబాబు.. గత ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక మద్యం విధానంపై దుష్ప్రచారం సాగిస్తూ అవే అంశాలను పాత్రధారులతో పలికిస్తున్నారు. గతంలో 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సాగించిన మద్యం దందాను మించి ఇప్పుడు 2024లో నూతన విధానం పేరుతో దోపిడీకి రాచబాట వేసుకున్నారు. టీడీపీ సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన దశలవారీ మద్య నియంత్రణ విధానంపై అక్రమ కేసుతో కుయుక్తులకు పదును పెడుతున్న వైనం ఇదిగో ఇలా ఉంది...
సిట్ వేధింపులపై మూడుసార్లు కోర్టుకు..
చివరికి తలొగ్గడంతో కేంద్ర సర్వీసులకు
చంద్రబాబు రెడ్‌బుక్ కుట్రలో మొదటి పాత్రధారి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి. తమ కుట్రకు అనుగుణంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం ఆయన్ను తీవ్రంగా బెదిరించింది. అందుకు మొదట్లో ససేమిరా అన్న వాసుదేవరెడ్డి మూడుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు తనను బెదిరిస్తున్నట్లు కోర్టుకు మొర పెట్టుకున్నారు. అయినా సరే సిట్ అధికారులు వెనక్కి తగ్గకుండా వేధించారు.
కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయనను డెప్యుటేషన్ కాలపరిమితి ముగిసినా రిలీవ్ చేయలేదు. చివరికి సిట్ వేధింపులకు వాసుదేవరెడ్డి తలొగ్గారు. చంద్రబాబు కుట్రకు అనుగుణంగా.. సిట్ అధికారులు చెప్పమన్నట్లుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కుట్ర నాటకంలో తాను ఇచ్చిన పాత్రకు వాసుదేవరెడ్డి న్యాయం చేశారని చంద్రబాబు సంతృప్తి చెందారు. అంతే.. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయడం... ఢిల్లీలో కేంద్ర సర్వీసులో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి.
ఆ ఇద్దరూ.. కీలు బొమ్మలే
బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషను సైతం చంద్రబాబు తన కుట్ర నాటకంలో పాత్రధారులుగా చేశారు. వారిని కూడా సిట్ అధికారులు భయపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకున్నారు. దాంతో సిట్ అధికారులు చెప్పినట్టుగా సత్యప్రసాద్, అనూష అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు.
రాజకీయ పాత్రధారి విజయసాయిరెడ్డి అనంతరం చంద్రబాబు పక్కా పన్నాగంతో తన కుట్రలో రాజకీయ నేతను పాత్రధారిగా ప్రవేశపెట్టారు. అది మరెవరో కాదు.. మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి.
వైఎస్సార్‌సీపీ అధినేత ఆయన్ను విశ్వసించి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. మరో మూడున్నరేళ్లు పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికలు వస్తే రాజ్యసభ సీటును తిరిగి గెలుచుకునేంత ఎమ్మెల్యేల బలం వైఎస్సార్‌సీపీకి లేదని తెలిసి కూడా రాజీనామా చేయడం గమనార్హం. అంటే రాజ్యసభలో టీడీపీ కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన రాజీనామా చేశారు.
అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై టీడీపీ కూటమి సర్కారు బనాయించిన అక్రమ కేసుకు ఆయన వంతపాడటం అసలు కుట్రను బట్టబయలు చేసింది. కాకినాడ పోర్టులో వాటాల బదిలీపై కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక మద్యం అక్రమ కేసు గురించి మాట్లాడారంటే దీని వెనుక ఉన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు.
తాజాగా తెరపైకి టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డి
రెడ్‌బుక్ కపట నాటకంలో చంద్రబాబు తాజాగా టీడీపీ నేత శ్రీధర్‌రెడ్డిని తెరపైకి తెచ్చారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచి, వెంటనే టీడీపీలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డికి ఆయన అల్లుడు కావడం గమనార్హం. అందుకే ఎస్పీవై రెడ్డి కుటుంబ డిస్టిలరీకి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి శ్రీధర్‌రెడ్డి టీడీపీ కూటమిలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించి వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు సిట్ కుట్ర పన్నుతుండటం గమనార్హం.
విజయవాడ ఎంపీ వ్యాపార భాగస్వామి రాజ్ కేసిరెడ్డి
ఈ కుట్రలకు మరింత పదును పెడుతూ ఈ కేసులో రాజ్ కేసిరెడ్డిని ఏ 1గా చూపించారు. ఆయన ఎవరో కాదు.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామే! ఇద్దరి కంపెనీల చిరునామా, మెయిల్ ఐడీ కూడా ఒకటే కావడం గమనార్హం. అమెరికా, దుబాయ్ సహా వివిధ దేశాలకు అక్రమ నిధులు తరలించేందుకు వారిద్దరూ భాగస్వాములుగా ఏర్పాటు చేసుకున్న కంపెనీల వివరాలను చిన్ని అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల స్వయంగా వెల్లడించడం తెలిసిందే. ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకిలక్ష్మి, రాజ్ కేసిరెడ్డి ప్రైడ్ ఇన్ఫ్రా ఎల్‌ఎల్‌పీతోపాటు ఇతర వ్యాపార సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నట్లు కేశినేని నాని స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం తెలిసిందే.
ఆ అధికారులకేం సంబంధం..?
చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో విధులు నిర్వర్తించిన ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికిస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏ.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో నిందితులుగా చేర్చడం కుట్రలకు పరాకాష్ట. ధనుంజయ్‌రెడ్డి సీఎంవోలో ఎక్సైజ్ శాఖ వ్యవహారాలను ఏనాడూ పర్యవేక్షించలేదు. ఇక ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డికి ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం ఉండదు. అయినా సరే వారిని నిందితులుగా చేర్చడం విడ్డూరంగా ఉంది.
సీఐడీ చేతులెత్తేయడంతో..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కేసును సీఐడీకి అప్పగించింది. మూడు నెలలపాటు దర్యాప్తు చేసిన సీఐడీ ఎలాంటి అక్రమాలూ లేవని చేతులెత్తేసింది. అయినా సరే ఇది ఎల్లో మీడియాకు పట్టదు. తరువాత టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. రోజుకో కట్టుకథ అల్లుతూ అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారంలోకి తేవడమే పనిగా పెట్టుకుంది.
కమీషన్లు టీడీపీ పెద్దలకే తెలుసు..!
మద్యం అమ్మకాలు పెరిగే కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు పాలనలో 2014–19లో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున జరగగా... అనంతరం వైఎస్ జగన్ హయాంలో 2019–24 మధ్య అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది టీడీపీ పెద్దలకేనని స్పష్టమవుతోంది.
సిట్ వేధింపులపై కోర్టుకు డిస్టిలరీల ప్రతినిధులు
దర్యాప్తు పేరిట సిట్ అధికారులు తమను వేధిస్తుండటంపై పలు డిస్టిలరీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. సిట్ అధికారులు తమను హింసిస్తున్నారని వాపోయారు. దాంతో డిస్టిలరీల ప్రతినిధులను వారి నివాసాల్లోనే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరి తెగిస్తోందో చెప్పేందుకు ఈ ఉదంతమే తార్కాణం.
మిథున్‌రెడ్డి సవాల్‌పై స్పందించని సర్కారు
చంద్రబాబు తాను ప్రవేశపెట్టిన పాత్రధారుల ద్వారా వైఎస్సార్‌సీపీ కీలక నేతలపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. వాటిని తిప్పికొడుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విసిరిన సవాల్‌కు మాత్రం స్పందించలేదు. తన నివాసంలో సమావేశమయ్యామని విజయసాయిరెడ్డి పేర్కొనటాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. అదే నిజమైతే గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిరూపించాలని మిథున్‌రెడ్డి సవాల్ చేస్తే కూటమి ప్రభుత్వం నోరు విప్పలేదు.
మద్యం దోపిడీ వ్యవస్థీకృతం..
రాచబాట పరిచిన టీడీపీ సర్కారు
మద్యం విధానం ముసుగులో 2014–19 మధ్య భారీ దోపిడీకి కుట్ర పన్నింది చంద్రబాబు ప్రభుత్వమే. అందుకు అవసరమైన అన్ని దోపిడీ మార్గాలను పొందుపరిచింది చంద్రబాబే. భారీగా నల్లధనం వరద పారించేందుకు అవసరమైన దొంగదారులన్నిటికీ తమ ప్రభుత్వ విధానంలో స్థానం కల్పించారు. అందుకే 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే అనుమతినిచ్చింది. అవన్నీ యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, డీకే ఆదికేశవులు తదితర టీడీపీ నేతలకు చెందినవే కావడం గమనార్హం.
బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రంలోని మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మద్యం అమ్మకాలు భారీగా పెంచి డిస్టిలరీల నుంచి కమీషన్లు కొల్లగొట్టింది. ఊరూపేరూలేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది స్వయానా చంద్రబాబే. క్షేత్రస్థాయిలో మద్యం విక్రయించే మొత్తం 4,380 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్‌కు అడ్డగోలుగా కట్టబెట్టారు. వాటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4,380 పర్మిట్ రూమ్‌లకు అనుమతినిచ్చారు. అంతేకాదు.. ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేశారు.
ఎంఆర్‌పీ కంటే బాటిల్‌పై రూ.15 నుంచి రూ.25 అధిక ధరకు మద్యం విక్రయించారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. అంటే మద్యం దోపిడీదారు చంద్రబాబే అన్నది నిగ్గు తేలుతోంది. వైఎస్సార్‌సీపీ పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై బురద జల్లుతుండటం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది స్పష్టం. మద్యం విధానం ముసుగులో 2014–19లో చేసిన దోపిడీని చంద్రబాబు ఇప్పుడు మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు.
లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం..
వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల కోసం సిట్ దర్యాప్తు ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధింపులకు తెగబడుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టి వేళలను కుదించింది.
టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934కి తగ్గించింది. చంద్రబాబు సర్కారు అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటైన 43 వేల బెల్ట్ దుకాణాలను నిర్మూలించింది. కొత్తగా ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సు మంజూరు చేయలేదు. ఇలా విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితేనే డిస్టిలరీలు లాభాలు గడించి కమీషన్లకు ఆస్కారం ఉంటుంది.
మరి వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? మద్యం అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోవడంతో తాను ఎంపిక చేసుకున్న పాత్రధారుల ద్వారా చంద్రబాబు అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అక్రమ కేసు కుట్రలు మరోస్థాయికి..
అందుకే బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చిన వైనం
వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో చేర్చడం చంద్రబాబు భేతాళ కుట్రకు పరాకాష్ట. ఎందుకంటే ఆయనకు ప్రభుత్వ వ్యవహారాలతో అసలు ఏమాత్రం సంబంధమే లేదు. వికాట్ అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్ కంపెనీ. 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతీయ సంస్థ. యూరప్‌లో టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా ఉంది. సిమెంట్ రంగంలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వికాట్ కంపెనీకి అనుబంధ సంస్థ భారతీ సిమెంట్స్. అటువంటి అంతర్జాతీయ కంపెనీకి భారత్‌లో ఆపరేషన్ల ఫైనాన్స్ డైరెక్టర్‌గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు.
ఆ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండరు. బాలాజీ గోవిందప్ప వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్. వికాట్ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన నిరంతరం తలమునకలై ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధమే లేని ఆయనకు ఐఏఎస్‌లతోగానీ ఇతర ప్రభుత్వ అధికారులతోగానీ ఎలాంటి సంబంధంగానీ, పరిచయంగానీ లేనే లేవు. ఇక రాజ్ కేసిరెడ్డితో కనీసం పరిచయం ఉండే ఆస్కారమే లేదు. పక్కా కుతంత్రంతోనే బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చారు. తద్వారా ఈ అక్రమ కేసు కుట్రను మరో స్థాయికి తీసుకువెళ్లాలన్నదే చంద్రబాబు పన్నాగం.
భారతీ సిమెంట్స్‌ను ఏనాడో టేకోవర్ చేసిన వికాట్..
భారతీ సిమెంట్ కంపెనీలో మెజార్టీ వాటా వికాట్ కంపెనీకే ఉంది. మైనార్టీ వాటా మాత్రమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి ఉంది. కాబట్టి కంపెనీ సర్వసభ్య సమావేశ వివరాలు తెలియచేయడం, కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు వివరించడం, త్రైమాసిక ఫలితాల ముందుగానీ తరువాతగానీ తెలియజేయడం.. భారతీ సిమెంట్స్‌పై కొనసాగుతున్న సీబీఐ అక్రమ కేసుల పురోగతి వివరాలు వివరించేందుకు వైఎస్ జగన్ కుటుంబాన్ని ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు.
వైఎస్ జగన్ కుటుంబం వికాట్ కంపెనీలో వాటాదారు కావడంతోపాటు నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానంలో ఉన్నందున ఆ పరిణామాలన్నీ వివరిస్తారు. ఓ కంపెనీ తన వాటాదారులకు ఈ అంశాలను వివరించడం సర్వసాధారణ వ్యవహారం. రిలయన్స్ లాంటి కంపెనీలు కూడా తమ కంపెనీల్లో ఎక్కువ షేర్లు ఉన్నవారికి సంస్థకు సంబంధించిన పరిణామాలను తరచూ వివరిస్తూ ఉంటాయి. ఈ అంశాలను వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం పక్కా కుట్రే. వైఎస్ జగన్ కుటుంబ కంపెనీ కాకపోయినా భారతీ సిమెంట్స్‌ను అప్రతిష్ట పాలు చేయడం, అందులో మైనార్టీ వాటాదారుగా మాత్రమే ఉన్న ఆ కుటుంబంపై దుష్ప్రచారం చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు పన్నిన భేతాళ కుట్రే ఇది.
బాబు కుట్రలకు ఎల్లో మీడియా భజన
చంద్రబాబు కుట్రలకు ఎల్లో మీడియా కోరస్ పాడుతోంది. వైఎస్ జగన్ కుటుంబానికి బాలాజీ గోవిందప్ప ఆర్థిక సలహాలు ఇస్తుంటారని దుష్ప్రచారం చేస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఫ్లెక్సీ డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడులపై వైఎస్ జగన్ కుటుంబం బాలాజీ గోవిందప్ప సలహాలను ఎందుకు తీసుకుంటారు? వైఎస్ జగన్ కుటుంబానికి దశాబ్దాలుగా పవర్ ప్రాజెక్టులు, మీడియా, రియల్ ఎస్టేట్ లాంటి సొంత కంపెనీలున్నాయి. తమకు మెజార్టీ వాటా ఉన్న ఆ కంపెనీల ద్వారా ఏటా దాదాపు రూ.150 కోట్ల లాభం ప్రకటిస్తున్నారు.
ఆ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు, సలహాలు ఇచ్చేందుకు ఎంతోమంది ఆడిటర్లు, ఫైనాన్స్ డైరెక్టర్లు ఉన్నారు. ఆర్థిక సలహాల కోసం వారిని సంప్రదిస్తారు. అంతేగానీ తాను మైనార్టీ వాటాదారుగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌ను ఎందుకు సంప్రదిస్తారు? ఈ దుష్ప్రచారం అంతా కేవలం చంద్రబాబు భేతాళ కుట్రే. వాస్తవాలతో నిమిత్తంలేని ఎల్లో మీడియా ఇందులో తరిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లో వైఎస్ జగన్ కుటుంబంపై దుష్ప్రచార కుతంత్రానికి వత్తాసు పలుకుతోంది.