కూటమి సర్కార్కు లోకేష్ రెడ్బుక్తో ముప్పు!
సూపర్ సిక్స్తోపాటు ఎన్నికల హామీలను అమలు చేసే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నట్ట? లేనట్టా?. హామీలైతే ఇచ్చాను కానీ.. అమలు చేయలేని పరిస్థితి ఉందని ఆయన పదే పదే చెబుతున్నా టీడీపీ జాకీ మీడియా మాత్రం ‘‘అబ్బెబ్బే.. బాబు అలా అనలేదు... ఇలా అనలేదు’’ అని గొంతు సవరించుకుంటోంది. ఎందుకు మరి? ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా.. ప్రజల దృష్టిని హామీల నుంచి మళ్లించేందుకు నానా తంటాలూ పడుతన్నాయెందుకు?. ఇటీవల చంద్రబాబు ఒక మీడియా సమావేశం పెట్టారు. నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు కొన్నింటిని వక్రీకరించి.. గత ప్రభుత్వాన్ని నిందించాలన్నది ఈ సమావేశం ఉద్దేశం. ఇందులోనే ఆయన ‘సూపర్ సిక్స్’పై ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పేశారు. డబ్బులున్నా ఇవ్వడం లేదని, నమ్మకం పెట్టుకున్నామని ఫీలింగ్స్తో ఉంటున్నారని అన్న బాబు.. కేంద్రం ఇతర ఖర్చుల కోసం ఇచ్చిన నిధులను సంక్షేమానికి పెట్టలేనని తేల్చేశారు. ఆర్థిక పరిస్థితి రీత్యా ప్రభుత్వమైనా అవస్థలు పడాలని లేదంటే రైతులైనా అవస్థలు పడాలని తన మనసులోని మాట చెప్పేశారు. అంటే.. రైతు భరోసా ఇవ్వలేనని అర్థమన్నమాట. తల్లికి వందనం ఈ ఏడాది కాదని ఇప్పటికే టీడీపీ నాయకత్వం తేల్చేసింది. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3000ల ఊసు అస్సలు ఎత్తడం లేదు. ఇవి కాకుండా.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల్లోని వారికి యాభై ఏళ్లకే ఇస్తామన్న పింఛన్, ఇతర ఎన్నికల హామీల సంగతి సరేసరి. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయమయ్యే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీల అమలు సాధ్యం కాదని ఎన్నికల సమయంలోనే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విస్పష్టంగా చెప్పినా.. తాము సంపద సృష్టిస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని కూడా కూటమి నమ్మబలికింది. కానీ ఈ మాటలన్నీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్క వరకే! ఆ తరువాత స్వరం మారింది. రోజుకో డైవర్షన్ రాజకీయాలతో అసలు సంగతిని నెమ్మదిగా ప్రజల మనసుల్లోంచి చెరిపేసేందుకు తలో సన్నాయి నొక్కు నొక్కడం మొదలుపెట్టారు. పైగా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్నింటికీ జగన్దే బాధ్యతన్నట్టుగా తలకూ.. మోకాలికి ముడివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్ర్రజ్యోతి వంటి వార్తా పత్రికలు ప్రజల పక్షాన నిలవాలన్న ప్రాథమిక జర్నలిజమ్ సూత్రాన్ని ఎప్పుడో గాలికి వదిలేసి.. చంద్రబాబుకు వత్తాసు పలికే పనిలో బిజీ అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తాయని, సాక్షి మీడియాలో వచ్చిన వార్తల్లో తప్పులున్నాయని అనుకుందాం. అలాంటప్పుడు ఫలానా తేదీ నుంచి ఫలానా హామీ అమలవుతుందని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? కారణం ఒక్కటే. ఎల్లో మీడియా పైరవీలు, వ్యాపారాలు సాగాలంటే ఇలాగే పచ్చి అబద్దాలు ప్రచారం చేయాలి. వారికి గిట్టుబాటు అయితే ప్రజలందరికి స్కీములు వచ్చినట్లే అన్నమాట. చంద్రబాబు చెప్పిన విషయాలు కొన్నిటిని గమనించండి. కేంద్రం విశాఖ స్టీల్ కు రూ.11 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ.. ఆ డబ్బును తాను సంక్షేమ పథకాలకు వాడలేనని బాబు అంటున్నారు. విశాఖ స్టీల్ ఇచ్చిన డబ్బుతో ఈయనకు ఏమి సంబంధం? పోలవరం ప్రాజెక్టు నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి ఎలా వస్తాయి? అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది అప్పు తప్ప గ్రాంట్ కాదు. అయినా బాబు ఈ మాటలన్నారంటే.. ఆయన అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమైపోతుంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా ఆసాములకు ఉపయోగపడేలా నిధులు తీసుకు వచ్చి ఖర్చు చేస్తాం కాని, పేదలకు ఇస్తామన్న స్కీములకు మాత్రం డబ్బు తేలేమని చెప్పినట్లే కదా! దానికి తగినట్లే ఒక్క అమరావతి మినహా మిగిలిన చోట్ల మాత్రమే భూముల ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా ఛార్జీల రూపంలో ప్రజలను మరోసారి బాదుతారన్నమాట. ఇదెంత వరకూ న్యాయం?. మరో వైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీకి ఏడు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి వెళ్లారు. దానిని చంద్రబాబు కాదనలేదు. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? అయినా ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఎందుకు చెబుతున్నారు? ఏపీలో ఆర్దిక వ్యవస్థను పునరుద్దరించడానికి తొమ్మిది, పదేళ్లు పడుతుందట.. అంటే దాని అర్దం అప్పటివరకు ఈ స్కీములు అమలు చేయలేమని చెప్పడమే! పోలవరం, అమరావతి వంటి వాటిని అభివృద్ది చేసి అప్పుడు ఆదాయం సంపాదించి ఖర్చు చేస్తారట. అసలు సంపద సృష్టి అన్నది తన తర్వాతేనని, పీ-4 అంటే పేదలను భాగ్యవంతులను చేసే స్కీములన్నీ తన వద్ద ఉన్నాయని, తన మంత్రజాలంతో అన్నిటిని మార్చి వేస్తానని చంద్రబాబు చెబితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాన, తందానా అన్నారా? లేదా? ఇక చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏమి చెప్పారు. తన వద్ద అన్ని లెక్కలు ఉన్నాయని, అన్ని స్కీములు అధికారం వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని, ఒకవేళ అమలు చేయలేకపోతే చొక్కా కాలర్ పట్టుకోండని ఓపెన్ గా చెప్పారా? లేదా? ఇప్పుడేమో ఎవరైనా హామీలను గుర్తు చేసినా, ప్రశ్నించినా, వారిపై రెడ్ బుక్ అంటూ కేసులతో వేధిస్తున్నారే! అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ ‘రెడ్ బుక్’ను పిచ్చి కుక్కలతో పోల్చుతున్నారు. అవి ఎప్పుడు ఎవరిని కరుస్తాయో చెప్పలేం. లోకేష్ అర్థం చేసుకోవల్సింది ఏమిటంటే.. ఆ పిచ్చికుక్క ప్రమాదం టీడీపీకి కూడా పొంచి ఉంది. జీఎస్డీపీ 15 శాతం చొప్పున పెరిగితేనే స్కీములు అమలు చేస్తారట. ప్రజలు అర్థం చేసుకోవాలట. గత ప్రభుత్వం అప్పులు చేసిందని పదే, పదే గోబెల్స్ ప్రచారం కొనసాగించారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని, దానికి వైసీపీ కారణమని తప్పుడు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడ్జెట్ లో రూ.ఏడు లక్షల కోట్లు అని వారే చెప్పారు. అందులో కూడా విభజన నాటి అప్పు, చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పు కలిపి మూడున్నర లక్షల కోట్లు ఉన్న సంగతిని దాచేస్తారు. జగన్ టైమ్లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచం అంతటిని గడగడలాడించిన కరోనా విషయాన్ని ఏమార్చి అప్పులు అని ఊదరగొడతారు. ఏపీ శ్రీలంక మాదిరి మారిందని ఆరోజుల్లోనే ప్రచారం చేశారు. కానీ ఎన్నికల హామీలు ,సూపర్ సిక్స్ ప్రకటించడానికి మాత్రం చంద్రబాబుకు ఇవేవి అడ్డు కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించి హామీలు అమలు చేస్తామని మాటవరసకైనా అనలేదు. పైగా తమ అంత మొనగాళ్లే లేరని డబ్బా కొట్టుకున్నారు. 2014లో విభజిత ఏపీ అప్పులపై వడ్డీ కింద ఏడాదికి రూ.7488 కోట్లు వ్యయం చేస్తే, చంద్రబాబు టరమ్ పూర్తి అయ్యే 2018 నాటికి వడ్డీ చెల్లింపులు రూ.15342 కోట్లకు చేరింది. అంటే టీడీపీ హయాంలో ఎంత అప్పు తెచ్చింది తెలియడం లేదా? అయినా దాన్నంతటినీ వైసీపీ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తుంటారు. తాజాగా చంద్రబాబు సర్కార్ మరో రూ. 6,000 వేల కోట్ల అప్పు సేకరిస్తోంది. పోనీ ఆదాయపరంగా పరిశీలించినా జగన్ పాలనలోనే అధికంగా కనిపిస్తుంది. జగన్ పాలన కాలంలో జీఎస్డీపీ, జీఎస్టీ వంటి వాటిలో ఏపీ దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉంది. అప్పట్లో 12 శాతం వృద్ది కనిపిస్తే, చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో ఆదాయం - ఆరు శాతంగా ఉంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నమాట. కాగ్ గణాంకాల ప్రకారం 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర ఆదాయంలో ఏకంగా 185 శాతం లోటు నమోదైందని మీడియాలో వార్తలు వచ్చాయి. టీడీపీ బడ్జెట్ లో రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే, డిసెంబర్ వరకు 1.13 లక్షల కోట్లే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు,అమ్మకం పన్ను ఇలా అన్ని అంశాలలో నెగిటివ్ గ్రోత్ నమోదు చేసుకుంది. సంపద సృష్టిస్తానని హోరెత్తించిన చంద్రబాబు ప్రభుత్వం సాధించింది ఏమిటంటే ఉన్న సంపదను కూడా కోల్పోవడం అన్నమాట. పోనీ అప్పులు ఏమైనా తగ్గాయా అంటే లేదు. డిసెంబర్ వరకు రూ.డెబ్బై వేల కోట్లకు పైగా తీసుకు వచ్చారు. అది కాకుండా ఇతరత్రా మరో రూ.ఏభై వేల కోట్లకు పైగా అప్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క అమరావతికే రూ.31వేల కోట్ల అప్పు సమకూర్చుకోవడానికి సన్నద్దం అవుతున్నారు. ఇదంతా ఏపీ ప్రజలు తీర్చవలసిన రుణాలే. పోనీ పరిశ్రమలు ఏమైనా కొత్తగా వస్తున్నాయా అంటే అదీ లేదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు దావోస్ వెళ్లి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే, చంద్రబాబు అండ్ కో భారీ బృందంతో వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. దీనికి కారణం రెడ్ బుక్ పేరుతో పారిశ్రామికవేత్తలను వేధించడం, జిందాల్ వంటివారిని టీడీపీ ప్రభుత్వం తరిమేయడం కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు స్కీములు అమలు చేయలేమని ఇంత ఓపెన్ గా చెబుతున్నా, జనసేన పక్షాన ఉప ముఖ్యమంత్రి పవన్ నోరు విప్పకపోవడం. సీజ్ ద షిప్ అని, తోలు తీస్తామని అంటూ డంబాలు పలుకుతూ ఇన్ని రోజులు తిరిగిన పవన్.. సూపర్ సిక్స్ , ఎన్నికల ప్రణాళిక హామీల గురించి చంద్రబాబు చేతులెత్తేసినట్లుగా మాట్లాడినా ప్రశ్నించలేకపోతున్నారు. రెడ్ బుక్ గురించి సదే,పదే మాట్లాడే లోకేష్ కూడా.. తండ్రి మాదిరే బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కీములు అమలు చేయకపోతే చొక్కా కాలర్ పట్టుకోవచ్చన్న ఆయన హామీ ప్రకారం.. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ లను నిలదీయవచ్చా!. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్