సుపరిపాలన కాదు..‘సూపర్‌’ మోసపు పాలన | Chandrababu Naidu Govt is Reign of Fraud in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సుపరిపాలన కాదు..‘సూపర్‌’ మోసపు పాలన

Jul 2 2025 4:57 AM | Updated on Jul 2 2025 4:57 AM

Chandrababu Naidu Govt is Reign of Fraud in Andhra Pradesh

ఏడాదిలోనే రాష్ట్రాన్ని పతనం అంచులకు చేర్చిన చంద్రబాబు 

సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలు గాల్లో కలిసిపోయాయి

తిరోగమనంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు 

ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్నవే ఊడగొట్టారు.. రోడ్డెక్కిన అన్నదాతలు.. కళ తప్పిన పల్లెలు 

రైతన్నలు, మహిళలు, యువత, చివరకు పిల్లలకూ వెన్నుపోటు 

రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో దిగజారిన శాంతి భద్రతలు 

యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ..  

అప్పుల్లో కొత్త రికార్డు.. ఏడాదిలో రూ.1.70 లక్షల కోట్ల అప్పులు 

నేటి నుంచి ‘సుపరిపాలనలో తొలి అడుగు’.. మండిపడుతున్న ప్రజలు   

చంద్రబాబు సర్కారు ఏడాది పాలన అంతా కక్షపూరిత చర్యలు, సూపర్‌ సిక్స్‌ సహా 143 ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమే లక్ష్యంగా సాగింది.. హామీలిచ్చి ఐదు కోట్ల మంది ప్రజలను వంచించారు.. ప్రశ్నిస్తే రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో బెదిరిస్తున్నారు.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. పిల్లలకు ఫీజులు లేవు.. యువతకు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగులకు భృతి లేదు.. ఇదా సుపరిపాలన?

ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే రూ.1.70 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు... ఇది సుపరిపాలనా?

ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన విద్య, వైద్య రంగాలతోపాటు వ్యవసాయాన్ని నీరుగార్చి కోలుకోకుండా చేశారు.. పేదలు అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ అందక అప్పుల పాలవుతున్నారు.. రైతన్నల పరిస్థితి దుర్భరంగా ఉంది.. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు.. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు..పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు.. కనీసం బకాయిలు కూడా చెల్లించకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు... ఇదా సుపరిపాలన?

గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఊరిలో విప్లవాత్మక మార్పులకు చిహ్నంగా నిలిచిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌  లైబ్రరీలు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, వలంటీర్‌ వ్యవస్థలు కూటమి సర్కారు కుట్రపూరిత నిర్ణయాలకు నిర్దాక్షిణ్యంగా బలైపోయాయి.. ఇది సుపరిపాలనా?
సాక్షి, అమరావతి

రాష్ట్రంలో ప్రతి ఇంటినీ, ప్రతి వ్యక్తినీ మోసం చేసిన చంద్రబాబు సర్కారు సుపరిపాలనలో తొలి అడుగు అంటూ నేటి నుంచి ఇంటింటి ప్రచారానికి సిద్ధం కావడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకు­తున్నాయి. బాబు ఏడాది పాలనంతా మోసం, దగా, కుట్రలతోనే సాగిందని.. కూటమి ఎమ్మె­ల్యేలు ఏ మొఖం పెట్టుకుని తమ ఇళ్లకు వస్తారని  ప్రజలు నిలదీస్తున్నారు. 

సూపర్‌ సిక్స్‌ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించి సుపరిపాలన అందించామని చెప్పుకోవడం సిగ్గు చేటని మండిపడుతున్నారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. వైఎస్‌ జగన్‌ హయాంలో పండుగలా అమలైన సంక్షేమ పథకాలను రద్దు చేసిన సీఎం చంద్రబాబు పేదల పొట్టగొట్టారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో పోలీసు వ్యవస్థను ఉండవల్లిలోని తన ఇంట్లో బంధించి శాంతి భద్రతలను దిగజార్చారు. 

మద్యం దుకాణాలను పచ్చ ముఠాలకు అప్పగించారు. గనులు, ఇసుకతో సహా అన్ని సహజ వనరుల దోపిడీకి తెరతీశారు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని అధ్వా­న­ంగా మార్చిన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు సుపరిపాల­నకు తొలి అడుగు అంటూ డైవర్షన్‌ నాటకం మొద­లుపెట్టారు. సుపరిపాలనలో తొలి అడుగు వేయక­పోగా అధఃపాతాళానికి వేల అడుగులు వేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని ప్రజలు మండిపడుతున్నారు.

‘సూపర్‌’ మోసాలు.. హామీలు బుట్టదాఖలు
అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు పీఠమెక్కాక వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారు. సూపర్‌ సిక్స్‌ హామీలంటూ  నమ్మించి దగా చేశారు. 2023లో రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీలైన యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి, రైతులకు అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు, ఆడబిడ్డ నిధి కింద 19 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు ఏడాదికి రూ.18 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. 

తల్లికి వందనం కింద రూ.15 వేలను ఒక ఏడాది ఎగ్గొట్టి ఇటీవలే తూతూమంత్రంగా విదిలించి చేతులు దులుపుకొన్నారు. ఒక్క సిలిండర్‌ ఇచ్చి సూపర్‌ సిక్స్‌ను సమాధి చేశారు. ‘సంపద సృష్టించాక సంక్షేమం అమలు చేస్తాం’’ అని ఒకసారి.. ‘హామీలన్నీ అమలు చేసేశాం.. చేయలేదని ఎవరైనా అంటే వారి నాలుక మందం అనుకోవాలి...’ అంటూ చంద్రబాబు బుకాయిస్తూ, బెదిరిస్తూ ప్రజలను వంచిస్తున్నారు.  ఎన్నికలకు ముందు హామీల బాధ్యత తనదేనని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు నోరు మెదపకుండా మౌనముద్ర దాల్చారు. 


నిర్వీర్యమైన విద్య, వైద్యం, వ్యవసాయం
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశా­లలు, ఆస్పత్రులను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి తొలి ఏడాది ఐదు చోట్ల 750 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తెచ్చింది. 

చంద్రబాబు ప్రభుత్వం వాటిని కుట్రపూరితంగా అడ్డుకుని ప్రైవేటీకరణ పేరుతో తమ సన్నిహితులకు కట్టబెట్టేందుకు అడుగులు వేస్తోంది.  రైతు భరోసా, ఉచిత పంటల బీమా లాంటి పథకాలను ఎగరగొట్టి అన్నదాత­లను నడిరోడ్డు మీద నిలబెట్టింది. రెండు నెలలుగా కనీసం ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో అన్నదాతలు ఈ సర్కారుపై మండిపడుతూ రోడ్డెక్కి ధర్నాలకు దిగుతున్నారు. టీడీపీ కూటమి సర్కారు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 

యువతకు వెన్నుపోటు..
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి 6.38 లక్షల ఉద్యోగాలను, గ్రామ–వార్డు సచివాలయాల ద్వారా 1.34 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. కానీ చంద్రబాబు ప్రభు­త్వం ఎన్నికల హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ ఇప్పటికీ విడుదల చేయలేదు. 

ఏడాదిలో ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాలేదు. గ్రూప్‌–2 పోస్టులను గ్రూప్‌–1లో కలపడం, డీఎస్సీలో 50 శాతం అర్హత మార్కుల నిబంధనతో 3 లక్షల మంది అభ్యర్థులకు అవకాశాలను దూరం చేశారు. పైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటినే ఊడగొడుతున్నారు.

రెడ్‌ బుక్‌తో టెర్రర్‌.. దిగజారిన శాంతి భద్రతలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కక్ష పూరితంగా కేసులు, అరెస్టులు, దౌర్జన్యాలతో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఏడాదిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు పెట్టి 500 మందిని జైలుకు పంపారు. 

సోషల్‌ మీడియా కార్యకర్తలపై 440 కేసులు, జర్నలిస్టులపై 63 కేసులు బనాయించి ప్రశ్నించే స్వరాన్ని రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో నొక్కేస్తున్నారు. 390 హత్యలు, 766 హత్యాయత్నాలు, 198 లైంగిక దాడులతో రాష్ట్రం భయానక స్థితిలో ఉంది. చంద్రబాబు ఈ టెర్రర్‌ రాజ్యానికి సారథిగా మారారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుల్లో సరికొత్త రికార్డు..
ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. అప్పులతో రాష్ట్రా­న్ని శ్రీలంక మాది­రి­గా మారుస్తున్నారని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై విషం చిమ్మిన చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే రూ.1.70 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. బడ్జెట్‌ పరిధిలోనే రూ.1.20 లక్షల కోట్ల అప్పులు తేగా బడ్జెట్‌ బయట రూ.50 వేల కోట్ల అప్పులు తెచ్చారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే అప్పులు తేవడంలో కొత్త రికార్డు సృష్టించారు.

మాఫియా ముఠాలతో సహజ వనరుల లూటీ
వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం పారదర్శక ఇసుక విధానం ద్వారా ఖజా­నాకు ఏటా రూ.750 కోట్ల ఆదాయం జమ చేయగా.. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో పచ్చ­ముఠాల జేబులు నింపుతూ రూ.వేల కోట్ల ఇసుకను దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్, గ్రానైట్‌ సహా అన్ని గనులను వ్యవస్థీకృతంగా దోచు­కుంటూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. 

విశాఖలో రూ.2 వేల కోట్ల భూమిని లులూ సంస్థకు, రూ.3 వేల కోట్ల భూమిని ఉర్సా సంస్థకు అప్పనంగా అప్పగించే కుట్ర జరుగుతోంది. ఈ సంస్థలు చంద్రబాబు సన్నిహితులవని ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీతో రాష్ట్రం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది.

డైవర్షన్‌ పాలిటిక్స్‌... మభ్యపెట్టే కుతంత్రం
చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీశారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయ అగ్నిప్రమాదం, ప్రకాశం బ్యారేజ్‌పై కుట్ర, తిరుమల లడ్డూ వివాదం లాంటి అంశాలతో వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేశారు. తన నిర్వాకాల కారణంగా విజయవాడ వరదల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కుట్ర ఆరోపణలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టే యత్నం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మం, సీజ్‌ ది షిప్‌ నాటకాలతో ఈ డైవర్షన్‌కు ఊతమిస్తున్నారు.

రద్దుల రాజ్యం... కమీషన్ల పర్వం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసిన కూటమి సర్కారు 2.60 లక్షల మందిని రోడ్డున పడేసింది. వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పి మొత్తంగా ఆ వ్యవస్థనే ఎత్తివేసింది. ఎండీయూ వ్యవస్థ రద్దుతో 9,280 మంది ఆపరేటర్లు ఉపాధి కోల్పో­యారు. 

జ్యుడీషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ వ్యవస్థలను రద్దు చేసి టెండర్లను సన్నిహితులకు కట్టబె­ట్టారు. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ విధానంతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను రద్దు చేసి పేదలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. ఇలా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దెబ్బతీసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement