మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విచక్షణాధికారం మాకు ఉంది | AP High Court on Singayya Incident | Sakshi
Sakshi News home page

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విచక్షణాధికారం మాకు ఉంది

Jul 2 2025 4:48 AM | Updated on Jul 2 2025 4:48 AM

AP High Court on Singayya Incident

సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు.. వైఎస్‌ జగన్, మిగతావారిపై తదుపరి చర్యలన్నీ నిలుపుదల 

విచారణ రెండు వారాలకు వాయిదా 

పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మరణానికి బాధ్యులుగా చేస్తూ... కారులో ప్రయాణిస్తున్న మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీ తదితరులపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యల­న్నిం­టినీ నిలిపేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాదనల సందర్భంగా కౌంటర్‌ దాఖ­లుకు తాము సమయం కోరుతుండగా మధ్యంతర ఉత్త­ర్వులు జారీ చేయడం సరికాదని పోలీసుల తర­ఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వ్యతి­రేకించారు. తమ వాదనలను పూర్తిగా వినిపించలేదని, అలాంటప్పుడు స్టే ఇవ్వడం సరికా­దంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు.  దీంతో క్వాష్‌ పిటిషన్‌లలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే విచక్ష­ణాధికారం ఈ కోర్టుకు ఉందని జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు.

సింగయ్య మృతికి సంబంధించి నమోదు చేసిన కేసును కొట్టివే­యాలంటూ వైఎస్‌ జగన్, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినీ, జగన్‌ పీఏ నాగేశ్వర­రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేవరకు తదుపరి చర్యలన్నీ నిలి­పేయాలని కోరారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయ­స్థానం.. పిటిషనర్లపై తొంద­ర­పాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మంగళవారం జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి మరోసారి విచారణ జరిపారు.

సింగయ్య ప్రమాదవశాత్తు కారు కిందపడ్డారని సాక్షులు చెబుతున్నారు..
వైఎస్‌ జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సుబ్ర­హ్మ­ణ్య శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ సింగయ్య గుర్తు­తెలియని వాహనం కిందపడి మృతి చెందారని తొలుత మీడియాకు చెప్పిన జిల్లా ఎస్పీ, తర్వాత మాట మార్చారని పేర్కొన్నారు. అనంతరం బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106ను సెక్షన్‌ 105కు మార్చారని తెలిపారు. కోర్టు తమకు రక్షణ కల్పించిన మాట వాస్తవమేనని, అయితే తప్పుడు ఉద్దేశాలతో పెట్టిన కేసు నిలవడానికి ఎంతమాత్రం వీల్లేదని పేర్కొ­న్నారు. వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన కారు కిందపడే సింగయ్య మృతి చెందారంటూ ఆ కారును సీజ్‌ చేశారన్నారు.

ఆయనను అవమానించడానికే ఇలా చేశారని.. పోలీసుల అత్యుత్సాహానికి, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదనడానికి, రాజకీయ కక్షకు ఇదో పరాకాష్ఠ అని తెలిపారు. కేసులో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించాలంటూ దానిని చదివి వినిపించారు. సింగయ్యే ప్రమాదవశాత్తు కారు కింద పడ్డారని తెలిపారు. ఈ మేరకు వీడి­యోలు ఉన్నాయన్నారు. అతడు కారు కిందపడిన వెంటనే పార్టీ కార్యకర్తలు పక్కకు తీసుకొచ్చి అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకె­ళ్లారని, 40 నిమిషాలు బతికే ఉన్నారని వివరించారు.

సోషల్‌ మీడియా నుంచి డౌన్‌లోడ్‌ చేసినట్లు దర్యాప్తు అధికారే చెబుతున్నారు..
సింగయ్యపైకి కారు ఎక్కించినట్లు పోలీసులు ఉద్దేశ­పూర్వ­కంగానే తప్పుడు సెక్షన్‌ను జత చేశారని సుబ్ర­హ్మణ్య శ్రీరామ్‌ తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపారంటూ మొదట కేసు పెట్టి, దానిని మార్చి కల్పబుల్‌ హోమిసైడ్‌ కింద కేసు పెట్టారన్నారు. సింగయ్య ప్రమా­ద­వశాత్తు కారు కిందపడ్డారని సాక్షులు చెబుతుంటే, పోలీసులు మాత్రం కారులో ఉన్న వైఎస్‌ జగన్‌ తదితరులపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 105 కింద కేసు పెట్టారని.. ఈ సెక్షన్‌ కింద కేసు ఎంతమాత్రం చెల్లదని వివరించారు. ఘటనాస్థలంలో లేనివారిని కూడా సాక్షులుగా పేర్కొంటూ వారి వాంగ్మూలాల ఆధారంగా కేసు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు.

విశ్వసనీయ సమాచారం అంటూ పోలీ­సులు వాస్తవాలను మరు­గున పెడుతున్నారన్నారు. ఇది రాజకీయ దురుద్దేశా­లను స్పష్టం చేస్తోందన్నారు. సింగయ్య కారు కింద పడిన వీడియోను సోషల్‌ మీడియా నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి చెబుతున్నారని, ఈ రోజుల్లో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా ఏ వీడియోనైనా సృష్టించడం చాలా తేలిక అని వివరించారు. వైఎస్‌ జగన్‌ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్‌ను తొందర పెట్టారంటూ పోలీసులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

జగన్‌ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది
న్యాయమూర్తి స్పందిస్తూ... కోర్టు ఇప్పటికే పిటిషన­ర్లకు రక్షణ కల్పించింది కదా? అత్యవసరంగా విచా­రణ జరపాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. ఏజీ కౌంటర్‌ దాఖలుకు గడువు కోరుతున్నారని గుర్తుచేశారు. దీనికి శ్రీరామ్‌ ప్రతి­స్పందిస్తూ, వైఎస్‌ జగన్‌ విషయంలో రాష్ట్ర ప్రభు­త్వం తీవ్ర వివక్షతో వ్యవ­హరిస్తోందని, ఉద్దేశపూర్వ­కంగా భద్ర­తను పట్టించుకోవడం లేదని, దీంతో ఆయన పర్యటనల సందర్భంగా దురదృష్టకర ఘటనలు జరుగుతున్నా­యని తెలిపారు. పొదిలి, గుంటూరు మిర్చి యార్డు, అనంతపురం జిల్లాలో జరిగిన ఘట­నలు ప్రభుత్వ నిర్ల­క్ష్యాన్ని చాటుతున్నాయ­న్నారు. ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, లేదంటే సింగయ్య కారు కింద పడేవారు కాదన్నారు. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు.

అత్యవసర విచారణ అవసరం లేదు
విచారణ మొదలుకాగానే ఏజీ స్పందిస్తూ, మరిన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామని, పూర్తి వివ­రాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని, రెండు వారాల గడువు ఇవ్వాలని, లేకపోతే వారం అయినా గడువు ఇవ్వాలని కోరారు. పిటిషనర్లకు హైకోర్టు ఇప్పటికే రక్షణ కల్పించిందని, అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయ­మూర్తి... పిటిషనర్లు వైఎస్‌ జగన్, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement