
వైరింగ్ సరిగ్గా లేకపోవడం వల్లనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు
ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మొదలైన విద్యుత్ భద్రత వారోత్సవాలు
ఈ ఏడాది కొత్తగా విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లకు భద్రత ప్రమాణాలు విడుదల
సౌరఫలకాల నిర్మాణంలో పాటించాల్సిన జాగ్రత్తలపైనా ప్రత్యేక సూచనలు
సాక్షి, అమరావతి: వెలుగులను పంచే విద్యుత్ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా తీవ్ర విషాదాన్ని మిగుల్చుతుంది. ఇంటా బయట షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలతో వందల మంది ప్రాణాలు కరెంటు హరిస్తోంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యుత్ ఉపకరణాలను తయారు చేస్తున్నప్పటికీ వాటిని వినియోగించడం తెలియక అనర్ధం జరుగుతోంది.
ఈ నేపధ్యంలో ‘స్మార్ట్ ఎనర్జీ సేఫ్ నేషన్’ నినాదంతో జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు దేశ వ్యాప్తంగా గత నెల 26 నుంచి జూలై 2 మధ్య నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లో పాటించాల్సిన భద్రత ప్రమాణాలు, సౌరఫలకాల నిర్మాణంలో పాటించాల్సిన జాగ్రత్తలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వివరాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలు: ఈవీ చార్జింగ్ స్టేషన్లలో ఓవర్లోడ్ నుండి ప్రత్యేక రక్షణ ఉండాలి. సాకెట్ అవుట్లెట్లు భూమి మీద నుంచి, కనీసం 800 మిమీ ఎత్తులో ఉండాలి. కార్డ్ ఎక్స్ టెన్షన్ సెట్, రెండవ సరఫరా లీడ్లను ఉపయోగించకూడదు. వాహన కనెక్టర్‌ను వాహన ఇన్లెట్కు కనెక్ట్ చేయడానికి ఎటువంటి అడాప్టర్ను వాడకూడదు. ఛార్జింగ్ పాయింట్, కనెక్షన్ ఇన్లెట్ మధ్య దూరం 5 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. పోర్టబుల్ సాకెట్ అవుట్లెట్లను ఉపయోగించకూడదు. ఛార్జింగ్ స్టేషన్లకు ఉరుములు మెరుపుల నుంచి రక్షణ కల్పించాలి. ఛార్జింగ్ కోసం నాలుగు కోర్ కేబుల్‌ను వాడాలి. కేబుల్స్ వాడకూడదు. అన్ని ఛార్జింగ్ స్టేషన్లలో ఎర్త్ కంటిన్యుటీ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి.
సౌరఫలకాల నిర్మాణంలో పాటించ వలసిన విద్యుత్ భద్రతా ప్రమాణాలు:
సోలార్ ఫోటోవోల్టాయిక్ కోసం ఇన్వర్టర్ యూనిట్లను భవనం అంచున, సోలార్ ప్యానెల్ దగ్గరగా ఏర్పాటు చేయాలి. వ్యవస్థను గ్రిడ్ నుంచి వేరుచేయడానికి మాన్యువల్ డిస్కనెక్షన్ స్విచ్ ఉండాలి. సాధారణంగా ప్యానెల్స్ విక్రేతలు ఈ రక్షణను అందించరు. వినియోగదారులే అడిగి తీసుకోవాలి. ఓవర్ లోడ్, సర్డ్ కరెంట్, సర్జ్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్, అధిక ఉష్ణోగ్రత, ఓవర్ వోల్టేజ్, అండర్ వోల్టేజ్, ఓవర్ ఫ్రీక్వెన్సీ, అండర్ ఫ్రీక్వెన్సీ, రివర్స్ పోలారిటీ వంటి వాటి నుంచి రక్షణ ఏర్పాటు చేయాలి. ఫోటోవోల్టాయిక్ శ్రేణులు, ఇన్వర్టర్లకు ఎర్త్ ఫాల్ట్ రక్షణ, ఇన్సులేషన్ పర్యవేక్షణ అందించాలి.
విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు:
ఎల్లప్పుడూ ఎలక్ట్రికెట్ కేబుల్స్ ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఐఎస్‌ఐ గుర్తు ఉన్న పరికరాలు, స్టార్ రేటెడ్‌తో వాణ్యతగలవి కొనాలి. ప్లగ్ సాకెట్ చిన్న పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవాలి. స్టాండర్డ్ ఎర్తింగ్ ప్రాక్టీస్ ప్రకారం ఎలక్ట్రికల్ ఇన్ స్టాలేషను ఎఫెక్టివ్ ఎర్త్ మేయండి. ప్రభుత్వ లైసెన్స్ పొందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ చేతనే ఎలక్ట్రికల్ వర్క్స్ వేయంచండి. ధృవీకరించిన ఎలక్ట్రిషియన్‌తోనే మరమ్మత్తులు చేయించండి. ఎలక్ట్రికల్ పరికరాలపై పనిచేసేటప్పుడు రబ్బరు చేతి తొడుగులు ఉపయోగించాలి.
అండర్ గ్రౌండ్ కేబుల్స్, గార్డెన్ లైటింగ్ గట్ రైటింగ్ కేబుల్స్‌ను బహిరంగంగా వేయవద్దు. విరిగిన స్విచ్‌లు ప్లగ్ లను ఉపయోగించకూడదు. నీటి పైపులు, విద్యుత్ వైర్లను ఒక దానికి ఒకటి సమీపంలో తీసుకురావద్దు. ఎర్త్ కనక్షన్ లేకుండా వాటర్ హీటర్లు, ఎలక్ట్రిక్ ఐరన్ మొదలైన వాటిని తడి చేతితో తాకవద్దు. గ్రైండర్, ఎ.సి, రిఫ్రిజరేటర్లో అసాధారణ శబ్దాలు వచ్చినప్పుడు ఆశ్రద్ధ చేయకుండా వెంటనే మెకానిక్ చేత పరీక్షించాలి. ఇళ్లలో వినియోగించే ఇన్వర్టర్లకు గాలి, వెలుతురు ప్రవరించే విధంగా ఉంచాలి.
ప్రమాదవశాత్తు విద్యుత్ సాకు గురియైన వ్యక్తిని చేతులతో తాకకుండా ఎండు కర్రలతో విద్యుత్ తీగలను ప్రమాదానికి గురియైన వ్యక్తి నుండి వేరు చేయాలి. వాహనాలపై ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు జారిపడినా లేదా వాటికి మనం ప్రయాణించే వాహనం తగిలినా, వాహనంలో నుంచి బయట పడేందుకు పోపింగ్ (గెంతుట లేదా దుముకుట) విధానం అనుసరించాలి. టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.