
మురుగు కాలువలో మతిస్థిమితం లేని మహిళ దైన్యం
రెండు రోజుల తర్వాత ఆస్పత్రికి తరలింపు
తూర్పు గోదావరి: ఏం చేస్తుందో ఆమెకు తెలియడం లేదు. ఎండైనా.. వానొచ్చినా మురుగు కాలువలోకి దిగి గంటల తరబడి ఉండిపోతోంది. ఎట్టకేలకు కొందరు చొరవ చూపడంతో.. ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని ఓ యువతి దయనీయ స్థితిలో మురికి కాలువలోనే రెండు రోజుల పాటు గడిపిన హృదయ విదారక సంఘటన కోరుకొండ బస్టాండ్ సెంటర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎక్కడి నుంచి వచ్చిందో, కోరుకొండలో ఆమె సంచరిస్తోంది.
మతి స్థిమితం లేకపోవడంతో ఎవరైనా పెట్టింది తిని కాలం వెళ్లదీస్తోంది. రెండు రోజుల నుంచి స్థానిక బస్టాండ్ సెంటర్‌ను ఆనుకుని ఉన్న మురుగు కాలువలోకి దిగి, మళ్లీ బయటకు వస్తోంది. దుర్వాసన వస్తున్నా.. వ్యర్థాల మధ్యే రెండు రోజులుగా ఇలా చేస్తుండడాన్ని స్థానికులు గమనించారు. ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు ఈ కాలువ నుంచే గోదావరి నదిలోకి వెళ్తుంది. కొన్ని రోజులుగా కాలువకు వర్షపు నీరు రాకపోవడంతో ఆమెకు ఎటువంటి అపాయం కలగలేదు.
కొందరు స్థానికులు ఈ విషయాన్ని పంచాయతీ వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పారిశుధ్య కార్మికులు మంగళవారం ఆమెను కాలువ నుంచి బయటకు తీసుకొచ్చారు. సైగలు చేస్తూ, పొడిపొడిగా మాట్లాడుతూ ఆమె భయంగా ఉంటోంది. పారిశుధ్య కార్మికులు జలడుగుల చిన్నపార్వతి, సోమాజుల బంగారమ్మ, రాజమహేంద్రవరానికి చెందిన డివైన్‌హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహకారంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆమె చికిత్స పొందుతోంది.