రుచితో పాటు ఆరోగ్యం కూడా..
జోరుగా విక్రయాలతో ఉపాధి
మలికిపురం: ‘తేగ’నచ్చేసే ఆహారం ఇది.. ఆరోగ్య ప్రదాయినీగా పేరొందింది.. అందుకే దీనికి ఉభయ గోదావరి జిల్లాలో ఎంతో ప్రాధాన్యం ఉంది.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అందరూ ఇష్టపడి తినే తేగల విక్రయం కార్తిక మాసంలో వచ్చే నాగుల చవితి అనంతరం ప్రారంభం అవుతోంది. హిందూ సంప్రదాయంలో తేగలకు నాగుల చవితికి పురాణాల్లో అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల నాగుల చవితి తర్వాతే తేగలను వెలికితీసి విక్రయిస్తారు. అలాగే ఆహార ప్రియులు నాగులు చవితి చేసిన తర్వాతే తేగలను తినడం మొదలు పెడతారు. అయితే మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా తేగల దిగుబడి డిసెంబర్ నుంచీ మొదలవుతుంది.
తాటి చెట్ల ద్వారా...
తేగలు తాడి చెట్ల నుంచే ఉద్భవిస్తాయి. వేసవిలో తాటికాయల కాపు మొదలవుతుంది. మార్చి, ఏప్రియల్ నెలల్లో తాటి ముంజులను విక్రయిస్తారు. అనంతరం కురిసే వర్షాల నాటికి తాటికాయలు తాటి పండ్లుగా మారతాయి. అలా రాలిన తాటి పండ్ల గుజ్జును వినియోగించి పిండి వంటలు కూడా పల్లెటూర్లలో తయారు చేస్తారు. అలా రాలిన కాయల టెంకలతో పాటు, తాడి చెట్ల నుంచి తాడి కాయలను దించి ప్రత్యేక ప్రాంతాల్లో రైతులు వ్యాపారులు తేగల పాతరలు వేస్తారు. రైతులు, వ్యాపారులు వారికి ఉన్న చెట్లను బట్టి వ్యాపార స్థాయిని బట్టి ఒక్కొక్కరు ఎకరం నుంచి రెండు ఎకరాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో పాతర వేస్తారు. వీటికి ఎటువంటి ఎరువులు వేయరు. భూమి ఇసుక పొరలలో దృఢంగా పెరుగుతాయి. డిసెంబర్ నాటికి ఇవి తేగలుగా తయారవుతాయి.
సీజనల్ ఆహార పంటగా..
ప్రస్తుతం తేగలు, బుర్ర గుంజుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తేగలు ప్రస్తుత సీజన్‌లో సమృద్ధిగా లభిస్తాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేశనపల్లి, గూడపల్లి, పశ్చిమ గోదావరిలో మొగల్తూరు, ఇరగవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు తేగలకు ప్రసిద్ధి. కోనసీమ తేగలు ఇతర ప్రాంతాలకూ ఎగమతి అవుతున్నాయి. స్థానిక ప్రజలు దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకు తేగలను పార్శిల్ చేసి పంపుతుంటారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు, ముంబయి, ఢిల్లీలకు కూడా తరలిస్తారు. కోనసీమలోని కేశనపల్లి, గూడపల్లి, చింతలమోరిలలో తేగలు రుచిగా ఉంటాయి. దీనికి ఇక్కడి ఎర్రటి ఇసుక నేలలే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే చింతూరులో లభించే అటవీ తేగలకు కూడా మంచి రుచి ఉంటుంది.
అమ్మకాలతో ఉపాధి
తేగల అమ్మకంతో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. సీజనల్ ఆహార పంటల వ్యాపారులు ఈ తేగల సీజన్ వచ్చిందంటే తేగలతో రోడ్లపైనా, ప్రధాన రహదాలు వెంబడి దుకాణాలను తెరుస్తారు. భూమిలో తయారైన తేగలను తవ్వి తీసి వాటిని ప్రత్యేక కుండలలో కాలుస్తారు. వాటిని తంపటి వేయడం అంటారు. ఇలా తంపటి వేస్తేనే అవి రుచిగా ఉంటాయి. రాత్రి తంపటి వేసిన తేగలను అలా కుండల నుంచి తీసి మంచులో ఉంచుతారు. అలా చేయడం వల్ల రుచితో పాటు ఆరోగ్యకారకంగా ఉంటాయి. ఉదయం వీటిని కట్టలుగా కట్టి విక్రయాలు చేస్తారు. సైజులుగా విభజించి కట్టలు కడతారు. సైజును బట్టి పది కట్ట రూ.50 నుంచి రూ.100 వరకూ విక్రయిస్తున్నారు.
బుర్ర గుంజుకూ డిమాండ్ తేగలను పాతర నుంచి తీసే సమయంలో తేగ మొలవడానికి కారణమైన తాటి టెంక (బుర్ర) కూడా బయటకు వస్తుంది. ఆ టెంకలను కత్తితో బద్దలు కొట్టి దానిలో మెత్తగా ఉండే గుజ్జును కూడా బయటకు తీస్తారు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ప్రత్యేక ప్యాకెట్లలో వేసి పావు కిలో రూ.50కి విక్రయిస్తున్నారు.
ఆహా ఆరోగ్యం..
తేగలు గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెడతాయి. ఇవి కొలె్రస్టాల్‌ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి. నోటి సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. డయాబెటిస్‌తో బాధపడే వారు వీటిని తింటే డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా తాటి తేగలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను కలిగించే తాటి తేగలను ప్రతిరోజు క్రమం తప్పకుండా దొరికినప్పుడు ఒకటి చొప్పున తీసుకుంటే చాలా మంచిది. ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పెరిగే ఈ తాటి తేగలు మంచి పోషకాహారంగా మనం చెప్పవచ్చు. వీటిల్లో ఉండే పీచు పదార్థం మన జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది. మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి తాటి తేగలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఇవి మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తెల్లరక్త కణాలను పెంచి, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment