palmyra
-
సిటీ అంతటా బాంబులు పెట్టి వెళ్లిన ఐసిస్
బీరుట్: ఉగ్రవాద ఇస్లామిక్ స్టేట్ తోకముడిచింది. సిరియా ప్రముఖ వారసత్వ నగరం పామిరాను రాత్రికి రాత్రే ఖాళీ చేసింది. ఇప్పటికే రష్యా బలగాలతో ఉమ్మడిగా సిరియా సేనలు పామిరా ప్రాంతం సమీపానికి చేరుకోవడంతో అక్కడ తలదాచుకున్న ఉగ్రవాదులు, ఆయా నివాసాలను స్వాధీనం చేసుకొని ఉన్నవారంతా అర్థరాత్రి తరలివెళ్లిపోయారని సిరియా హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. అయితే, వెళుతూ వెళుతూ ఆ నగరం చుట్టుపక్కల మొత్తం కూడా భారీ విస్ఫోటనాలకు తావిచ్చే మందుపాతరలాంటి పేలుడు పధార్థాలు (మైన్స్) అమర్చి వెళ్లిపోయింది. అంతేకాదు.. కొంతమంది ఆత్మాహుతి దళ సభ్యులను కూడా విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు ఆ సంస్థ పేర్కొంది. దీంతో పామిరా నగరంలోకి నేరుగా ప్రవేశించకుండానే చాలా జాగ్రత్తగా లోపలికి భద్రతా బలగాలు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు బాంబు దాడులతో ప్రాచీన నగరమైన పామిరాలోని పలు వారసత్వ సంపదను కోల్పోయింది. తాజాగా, మరోసారి మైనింగ్స్‌ను ఉగ్రవాదులు పెట్టి వెళ్లడంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందుకు వెళ్లాలని సైన్యం భావిస్తోంది. -
ఐసిస్ మళ్లీ అడుగుపెట్టింది
బీరుట్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పునరాగమనం చేశారు. ఒకప్పుడు గుప్పిట్లో ఉన్న సిరియా ప్రాచీన నగరం పామిరాను కోల్పోయి దాదాపు తొమ్మిది నెలలు ఆ వైపు కన్నెత్తి కూడా చూడని ఉగ్రవాదులు తిరిగి ప్రవేశించారు. పామిరాకు వెలుపల ఉన్న ఎడారి ప్రాంతంలో మూడువైపుల నుంచి ఏక కాలంలో దాడులు చేసి దాదాపు 200 మంది ఉగ్రవాదులు తిరిగి చొరబడ్డారని అక్కడి వార్తా సంస్థలు తెలిపాయి. రోమన్ సంస్కృతికి చెందిన పలు కట్టడాలన్నీ కూడా సిరియాలోని పామిరాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నగరంపై విపరీతంగా దాడులు చేసి పురాతన కట్టడాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. ప్రతిగా సిరియా బలగాలు కూడా వరుసదాడులు చేసి తొమ్మిది నెలల కిందట అక్కడ ఐసిస్ లేకుండా తుదముట్టించాయి. -
ముక్కలైన సింహం కోసం..
పామిరా(సిరియా): ఉగ్రవాదుల దాడిలో సిరియాలోని పామిరా మ్యూజియంలో ధ్వంసమైన భారీ సింహపు ఆకారాన్ని తిరిగి పునరుద్దరించేందుకు పాలిష్ హెరిటేజ్ నిపుణులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా గతంలో తాము ప్రతిష్టించిన ఆ సింహపు ఆకారం నేటమట్టమై పోవడం గురించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి రూపొందించిన ఈ సింహపు తలభాగం ఇలా ముక్కలై తమకు కనిపిస్తుందని అస్సలు ఊహించలేదని తెలిపారు. మార్కోవోస్కీ అని శిల్ప నిపుణుడు మాట్లాడుతూ '2005లో ఈ సింహాపు ప్రతిమను ప్రతిష్టించే సమయంలో ఇది కనీసం 200 నుంచి 300 ఏళ్ల వరకు ఉంటుందని లేదా అంతకంటే ఎక్కువ సమయమే ఉంటుందని భావించాను. కానీ పదేళ్లు తిరగకుండానే ఇలా చూడాల్సి వచ్చింది. 15 టన్నుల బరువుండే ఈ భారీ ప్రతిమ 2015 మే నెలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో రెండు ముక్కలై పోయింది. దాని ముఖ భాగం చిన్నచిన్న ముక్కులుగా మిగిలిపోయింది. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన మూడు మీటర్ల ఈ ప్రతిష్టాత్మక సింహపు ప్రతిమను 1977లో గుర్తించారు. అప్పట్లోనే ఇదొక్కటే కాకుండా ఎన్నో ప్రముఖ ఆలయాలను ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. -
స్తంభాలకు ముగ్గుర్ని కట్టి.. పేల్చేశారు
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కూరత్వం పరాకాష్టకు చేరుకుంది. అత్యంత అమానుష పద్ధతుల్లో బందీలు చంపుతున్న ఆ గ్రూప్ తాజాగా ముగ్గురిని అత్యంత కిరాతకంగా హతమార్చింది. సిరియాలోని పాల్మిరా నగరంలో ఒక ప్రాచీన కట్టడం స్తంభాలకు ముగ్గురు వ్యక్తుల్ని కట్టేసి.. ఆ స్తంభాలను పేల్చేసింది. దీంతో వారు ముక్కలుముక్కలు అయ్యారు. ఈ ఘటన గురించి నగరంలోని స్థానిక వర్గాలు తమకు సమాచారం ఇచ్చాయని లండన్‌కు చెందిన సిరియా అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ తెలిపింది. గత మే నెల నుంచి ప్రాచీన పాల్మిరా నగరం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉంది. ఇలా ముగ్గురిని స్తంభాలకు కట్టివేసి ఎందుకు హతమార్చారో.. వారు ఏ నేరం చేశారో కారణాలు తెలియదు. కానీ చిన్నచిన్న నేరాలకు సైతం ఐఎస్ఐఎస్ అత్యంత కిరాతకమైన రీతిలో హత్యలకు పాల్పడుతున్నది. కొందరికి మరణశిక్షలు విధించి.. వారే తమ గోతిని తవ్వుకొని.. అందులో తమకుతామే సజీవ సమాధి అయ్యేలా వ్యవహరిస్తున్నది. ఇరాక్, సిరియాలో పెద్దమొత్తంలో భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్న ఐఎస్ఐఎస్ ఇక్కడ కఠినమైన ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలుచేస్తున్నది. ధ్వంసమవుతున్న ప్రాచీన పాల్మిరా నగరం ప్రస్తుతం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న పాల్మిరా నగరం అత్యంత ప్రాచీనమైనది. ఈశాన్య డామస్కస్కు సమీపంలోని ఈ నగరంలో ఎన్నో అందమైన ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. వీటి కారణంగా ఈ నగరాన్ని 'ఎడారి పెళ్లి కూతురు'గా పిలుస్తారు. ఒకప్పుడు ఈ నగరం మీదుగా పర్షియా, ఇండియా, చైనా, రోమన్ సామ్రాజ్యానికి వాణిజ్య మార్గం ఉండేది. నగరానికే వన్నె తెచ్చెలా ఇక్కడ 'ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్' పేరిట పెద్ద ప్రాకార నిర్మాణం ఉంది. ప్రపంచంలోని ప్రాచీన నగరాలలో ఒకటిగా పేరొందిన ఈ నగరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపునిచ్చింది. ఈ ఏడాది మే 20న ఈ నగరాన్ని సిరియా భద్రతాదళాల చేతుల్లో నుంచి తమ అధీనంలోకి తీసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు.. ఇక్కడున్న ప్రాచీన కట్టడాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడున్న పురాతత్వశాస్త్ర నిపుణులను ఉగ్రవాదులు తలనరికి చంపేశారు. అంతేకాకుండా గత ఆగస్టులో సాంస్కృతికంగా ప్రాధాన్యమున్న బెల్, బాల్షామిన్ ఆలయాలను నేలమట్టం చేశారు. ఇలా ప్రాచీన సంపదను ధ్వంసం చేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసన, ఆగ్రహం వ్యక్తమయ్యాయి. ప్రాచీన కట్టడాలను నామరూపాలు లేకుండా చేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల తీరుపై పురాతత్వ, చరిత్ర పరిశోధకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మరో పురాతన ఆలయం కూల్చేశారు
పామిరా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సిరియాలోని ప్రముఖ పురాతన బాల్ ఆలయంపై మరోసారి విరుచుపడ్డారు. పురాతన క్షేత్రం వద్ద కొలువై ఉన్న సిరియన్ల ప్రముఖ దైవం బాల్ ఆలయాలను ఒక్కొక్కటీగా ధ్వంసం చేస్తున్నారు. గతవారం ఓ ఆలయాన్ని బాంబు దాడులో కూల్చివేయగా.. తాజాగా మరో ప్రముఖ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసి నేలమట్టం చేశారు. క్రీ.శ 32లో నిర్మించిన ఈ ఆలయానికి దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఘటనను పరిశీలించిన స్థానికుడు అదొక మహా విస్ఫోటనంగా అభివర్ణించాడు. వారు పేల్చిన బాంబుకు వెలువడిన శబ్ధం విన్నవారి చెవులకు చిల్లులు పడాల్సిందే, వినికిడి లోపం సమస్య తలెత్తాల్సిందే అని చెప్పారు. షాటిలైట్లో కూడా ఆలయం ధ్వంసం సమయంలో ఏర్పడిన దుమ్ము దూళి పొగ భారీగా ఎగిసిపడటం కనిపించింది. ఈ ప్రాంతానికి యునస్కో హెరిటేజ్ గుర్తింపు కూడా ఉంది.