ఐసిస్ మళ్లీ అడుగుపెట్టింది
బీరుట్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పునరాగమనం చేశారు. ఒకప్పుడు గుప్పిట్లో ఉన్న సిరియా ప్రాచీన నగరం పామిరాను కోల్పోయి దాదాపు తొమ్మిది నెలలు ఆ వైపు కన్నెత్తి కూడా చూడని ఉగ్రవాదులు తిరిగి ప్రవేశించారు. పామిరాకు వెలుపల ఉన్న ఎడారి ప్రాంతంలో మూడువైపుల నుంచి ఏక కాలంలో దాడులు చేసి దాదాపు 200 మంది ఉగ్రవాదులు తిరిగి చొరబడ్డారని అక్కడి వార్తా సంస్థలు తెలిపాయి.
రోమన్ సంస్కృతికి చెందిన పలు కట్టడాలన్నీ కూడా సిరియాలోని పామిరాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నగరంపై విపరీతంగా దాడులు చేసి పురాతన కట్టడాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. ప్రతిగా సిరియా బలగాలు కూడా వరుసదాడులు చేసి తొమ్మిది నెలల కిందట అక్కడ ఐసిస్ లేకుండా తుదముట్టించాయి.