సిటీ అంతటా బాంబులు పెట్టి వెళ్లిన ఐసిస్
బీరుట్: ఉగ్రవాద ఇస్లామిక్ స్టేట్ తోకముడిచింది. సిరియా ప్రముఖ వారసత్వ నగరం పామిరాను రాత్రికి రాత్రే ఖాళీ చేసింది. ఇప్పటికే రష్యా బలగాలతో ఉమ్మడిగా సిరియా సేనలు పామిరా ప్రాంతం సమీపానికి చేరుకోవడంతో అక్కడ తలదాచుకున్న ఉగ్రవాదులు, ఆయా నివాసాలను స్వాధీనం చేసుకొని ఉన్నవారంతా అర్థరాత్రి తరలివెళ్లిపోయారని సిరియా హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. అయితే, వెళుతూ వెళుతూ ఆ నగరం చుట్టుపక్కల మొత్తం కూడా భారీ విస్ఫోటనాలకు తావిచ్చే మందుపాతరలాంటి పేలుడు పధార్థాలు (మైన్స్) అమర్చి వెళ్లిపోయింది.
అంతేకాదు.. కొంతమంది ఆత్మాహుతి దళ సభ్యులను కూడా విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు ఆ సంస్థ పేర్కొంది. దీంతో పామిరా నగరంలోకి నేరుగా ప్రవేశించకుండానే చాలా జాగ్రత్తగా లోపలికి భద్రతా బలగాలు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు బాంబు దాడులతో ప్రాచీన నగరమైన పామిరాలోని పలు వారసత్వ సంపదను కోల్పోయింది. తాజాగా, మరోసారి మైనింగ్స్‌ను ఉగ్రవాదులు పెట్టి వెళ్లడంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందుకు వెళ్లాలని సైన్యం భావిస్తోంది.