Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Trump Putin Alaska Talks: USA Sanctions Warn to India1
అదే జరిగితే భారత్‌కు మరిన్ని సుంకాలు తప్పవు: అమెరికా

భారత్‌ సుంకాలతో దాడి చేసిన అమెరికా.. భారత్‌కు మరో హెచ్చరిక జారీ చేసింది. భారత్‌పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవని అంటోంది. ఉక్రెయిన్‌ శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అలస్కాలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చర్చల ఫలితాలను బట్టి ట్రంప్‌ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.రష్యాతో చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై ఇప్పటికే సుంకాలు విధించాం. ఒకవేళ.. ట్రంప్‌-పుతిన్‌ మధ్య చర్చలు గనుక విఫలమైతే భారత్‌పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్‌ బెస్సెంట్‌ బుధవారం బ్లూమరాంగ్‌టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్‌పై సెకండరీ టారిఫ్‌లు, లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని స్కాట్‌ స్పష్టం చేశారు.భారత్‌ తమ మిత్రదేశమంటూనే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది అమెరికా. అంతేకాదు.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు తమ వాణిజ్యం ద్వారా భారత్‌ పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్‌ ఆ టైంలో ఆరోపించారు. ఈ తరుణంలో.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు ఆపకపోవడంతో పెనాల్టీ కింద మరో 25 శాతం మోపారు. దీంతో భారత్‌పై అగ్రరాజ్యం టారిఫ్‌లు 50 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. భారమని తెలిసినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కూడా. ట్రంప్‌ విధించిన దటి దఫా సుంకాలు ఇప్పటికే అమలు అవుతుండగా.. ఈ నెల 27 నుంచి రెండో దఫా ప్రకటించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్‌లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్‌ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో.. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారాయన. అయితే ఫాక్స్‌న్యూస్‌తో ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి స్కాట్‌ బెస్సెంట్‌ మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్‌కు చేరుకుంటారని తెలిపారు. అయితే.. వ్యవసాయ, డెయిరీ మార్కెట్‌ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్‌ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలు ఉండబోతున్నాయని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధినేత కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది అలస్కా వేదికగా శుక్రవారం జరగబోయే చర్చలతోనే తేలిపోతుందని చెబుతున్నారాయన. అదే సమయంలో భూభాగాల మార్పిడితోనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇరు దేశాలకు మరోసారి సూచించారు కూడా. అయితే ఈ ఆలోచనను ఉక్రెయిన్‌ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భూభాగాల విషయంలో రాజీ పడటం తమ రాజ్యాంగానికి విరుద్ధమని అంటోంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి యూరప్‌ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్‌ లేకుండా జరిగే చర్చలకు అర్థం ఉండదని, పుతిన్‌తో జరగబోయే ఒకే ఒక్క భేటీ రష్యా లక్ష్యాలకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వవచ్చని యూరప్‌ దేశాలు భావిస్తున్నాయి.

Make Public 65 Lakh Names Top Court To Poll Body2
తొలగించిన 65 లక్షల ఓటర్ల జాబితాను బహిర్గతం చేయండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై మరోసారి సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ఏదైతే ఓటర్లను తొలగించామని చెప్పిందో.. ఆ 65లక్షలకు పైగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో వారిని ఎందుకు తొలగించారో పేర్కొంటూ వివరణతో కూడిన ఆ లిస్టును పబ్లిక్‌లోకి తీసుకురావాలని పేర్కొంది ధర్మాసనం. ఈ అంశానికి సంబంధించి గురువారం(ఆగస్టు 14వ తేదీ) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 22 లక్షల మందిని చనిపోయారన్న కారణంతో తొలగించడాన్ని సైతం​ ప్రశ్నించింది. బూత్‌ లెవెల్‌ స్థాయిలో దీనిని ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీసింది. పౌరుల హక్కు రాజకీయ పార్టీలపై ఆధారపడటం మాకు ఇష్టం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘భారత ఎన్నికల కమిషన్ వాదనలను మేము పూర్తిగా విన్నాం. విచారణ సమయంలో, ఈ క్రింది దశలను అంగీకరించారు. 2025 జాబితాలో పేర్లు కనిపించినప్పటికీ, తాజాగా జాబితాలో చేర్చబడని 65 లక్షల మంది ఓటర్ల జాబితాను జిల్లా స్థాయి వెబ్‌సైట్‌లలో ప్రదర్శించాలి’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.కాగా, బీహార్లో ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు ఈ జాబితా సవరణలోని లోపాలు ప్రతీ రోజూ బయటపెడుతూనే ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయ.మరొకవైపు ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, అనర్హులైన ఓటర్లను తొలగిస్తూ, ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరణ ఇస్తూ వస్తోంది.. అయితే ప్రతిపక్షాలు ఈ ఓటర్లు జాబితా సవరణ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇంతలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్నాటకలలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైనా పలు విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదీ కూడా చదవండి'దేశ'మంత మందికి ఓటుండదా?

Shoaib Akhtar rips into Pakistan batters3
'ఇక‌నైనా దేశం కోసం ఆడండి'.. పాక్ జ‌ట్టుపై షోయ‌బ్ అక్త‌ర్ ఫైర్‌

పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జ‌ట్టు ఆట తీరు ఏ మాత్రం మార‌డం లేదు. తాజాగా ట్రినిడాడ్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన సిరిస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో పాకిస్తాన్ ఘోర ప‌రాజ‌యాన్ని ఎదుర్కొంది. 295 ప‌రుగుల భారీ ల‌క్ష్య‌చేధ‌న‌లో పాకిస్తాన్ కేవ‌లం 92 ప‌రుగులకే కుప్ప‌కూలింది. విండీస్ పేస‌ర్ జైడ‌న్ సీల్స్ 6 వికెట్ల ప‌డ‌గొట్టి పాక్ ప‌త‌నాన్ని శాసించాడు. దీంతో 34 ఏళ్ల త‌ర్వాత విండీస్‌పై పాకిస్తాన్ వ‌న్డే సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్ర‌మంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ సేన‌పై ఆ జ‌ట్టు మాజీ పేస‌ర్ షోయబ్ అక్తర్ విమర్శలు గుప్పించాడు. ఇక‌నైనా పాకిస్తాన్ ఆట‌తీరు మారాల‌ని అక్త‌ర్ మండిప‌డ్డాడు."ఒక‌ప్పుడు మా జ‌ట్టులో అద్బుత‌మైన టాలెంట్ ఉన్న ఆట‌గాళ్లు ఉండేవారు. మేము అప్ప‌టిలో ఎవ‌రో ఒక‌రిపై ఆధార‌పడే వాళ్ల‌ము కాదు. ప్ర‌తీ ఒక్క‌రూ జ‌ట్టు విజ‌యాల్లో త‌మ వంతు పాత్ర పోషించేవారు. ఎవరూ తప్పించుకునే మార్గాల కోసం వెతికేవారు కాదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది.గ‌త పది, ప‌దేహేను ఏళ్ల నుంచి ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ వ్య‌క్తిగ‌త రికార్డులు, స‌గ‌టును పెంచుకునేందుకు ఆడుతున్నారు. కానీ ఎప్పుడైనా ఓ ఆట‌గాడిగా దేశం కోసం ఆడాలి. అదే మీ ల‌క్ష్యంగా ఉండాలి. ప్ర‌స్తుతం మీ ఉద్దేశ్యం, మనస్తత్వాన్ని మార్చుకోవాలి. మీరు ఆధునిక క్రికెట్ త‌గ్గ‌ట్టు ఆడాలి. ఇది ఆర్ధం చేసుకోవ‌డం మీకు పెద్ద విష‌యం కాక‌పోవ‌చ్చు. ఇక‌నైనా మీలో మార్పు రావాలి" అంటూ గేమ్ ఆన్ హాయ్ షోలో అక్త‌ర్ పేర్కొన్నాడు. అయితే విండీస్‌ వ‌న్డే సిరీస్‌ను కోల్పోయిన పాక్ జ‌ట్టు టీ 20 సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో సొంతం చేసుకుంది.చదవండి: PAK Vs WI: హోప్‌ విధ్వంసకర శతకం.. 34 ఏళ్ల తర్వాత పాక్‌పై సిరీస్‌ గెలిచిన విండీస్‌

IMD Big Flash Floods Alert To Andhra Districts Details4
ఏపీకి భారత వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక

విశాఖపట్నం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో గురువారం భారత వాతావరణశాఖ ఏపీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్‌ ఫ్లడ్‌) ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని తెలుస్తోంది.పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదిలే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణకేంద్రం అధికారి జగన్నాథ్‌ కుమార్ తెలిపారు.ఏపీ వ్యాప్తంగా గురువారం పలుజిల్లాలో భారీ వర్షాలు కొనసాగాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22, ముమ్మిడివరంలో 18, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఏగురవేశారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.

August 15 meat ban row Maharashtra CM Fadnavis intervenes5
మాంసం దుకాణాలు క్లోజ్‌.. 'మాకేం సంబంధం'

'ఎవ‌రు ఏం తింటారో తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి మా ప్ర‌భుత్వానికి ఏమాత్రం లేదు. రాష్ట్రంలో ప‌రిష్క‌రించాల్సిన ముఖ్య‌మైన‌ స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయ'ని అన్నారు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌. పంద్రాగ‌స్టు నాడు మాంసం దుకాణాలు మూసివేయాల‌న్న ఆదేశాల‌పై విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆయ‌న ఈవిధంగా స్పందించారు. డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ కూడా ఇదే ర‌క‌మైన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. మాంసం అమ్మ‌కాల‌పై నిషేధం విధించ‌డం సరికాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఫుడ్ చాయిస్‌పై ఆంక్షలు పెట్ట‌డం ఏంట‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ప్ర‌శ్నించగా, ముందుగా మొద‌లు పెట్టింది మీరేన‌ని బీజేపీ కౌంట‌రిచ్చింది.అస‌లేం జ‌రిగింది?స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15న ప‌శువ‌ధ శాల‌లు, మాంసం దుకాణాలు మూసివేయాల‌ని మ‌హారాష్ట్ర‌లోని ప‌లు న‌గ‌ర పాల‌క సంస్థ‌లు అధికారికంగా ఆదేశాలిచ్చాయి. డోంబివ్లి, కొల్హాపూర్‌, నాసిక్‌, ఇచల్కరంజి, జల్గావ్ స‌హా పలు న‌గ‌రాల్లో ఇలాంటి ఆదేశాలు వెలుప‌డ్డాయి. దీనిపై ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన రోజు కూడా ఆంక్ష‌లు ఏమిటంటూ జ‌నంతో పాటు ప‌లువురు నాయ‌కులు ప్ర‌శ్నించారు. దీంతో సీఎం ఫ‌డ్న‌వీస్ స్పందించారు.'ఎవ‌రేం తినాలో చెప్పాల‌న్న ఆస‌క్తి రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేదు. మా ముందు చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ'ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే ప్ర‌త్యేక దినాల్లో ప‌శువ‌ధ శాల‌లు మూసివేయాల‌ని 1988లో ప్ర‌భుత్వం తీర్మానం చేసింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. అప్ప‌టి నుంచి ప్ర‌తి ఏడాది దీన్ని ఆన‌వాయితీగా అమ‌లు చేస్తున్నార‌ని చెప్పారు. ఉద్ధ‌వ్ ఠాక్రే ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా ఈ ఆదేశాలు అమ‌లు చేశార‌'ని వెల్ల‌డించారు. కాగా, పంద్రాగ‌స్టు నాడు కబేళాల మూసివేత ఆదేశాల‌ను శ‌ర‌ద్ ప‌వార్ సీఎంగా ఉన్న‌ప్పుడే మొట్ట మొద‌టిసారిగా అమ‌లు చేశార‌ని బీజేపీ పేర్కొంది.క‌రెక్ట్‌కాదు: ప‌వార్‌పంద్రాగ‌స్టు నాడు మాంసం అమ్మ‌కాల‌పై నిషేధం విధించ‌డం స‌రికాద‌ని ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ (Ajit Pawar) అన్నారు. 'ఇలాంటి నిషేధం స‌రికాదు. వివిధ మ‌తాలు, కులాల‌కు చెందిన వారు పెద్ద న‌గ‌రాల్లో నివ‌సిస్తుంటారు. మ‌హావీర్ జ‌యంతి, మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాల్లో మాంసం విక్ర‌యాలపై ఆంక్ష‌లు విధించినా ప్ర‌జ‌లు ఆమోదిస్తారు. కానీ స్వాతంత్ర్య దినోత్స‌వం, రిప‌బ్లిక్ డే, మ‌హారాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం నాడు ఎటువంటి ఆంక్ష‌లు విధించరాద‌ని ప్ర‌జ‌లు కోరుకుంటార‌'ని చెప్పారు.నాన్‌-వెజ్ తింటా: జితేంద్రచికెన్, మ‌ట‌న్ స‌హా అన్ని మాంసం దుకాణాల‌ను మూసివేయాల‌ని క‌ళ్యాణ్ డోంబివ్లి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (కేడీఎంసీ) ఇచ్చిన‌ ఆదేశాల‌ను ధిక్కరించి నాన్‌-వెజ్ తింటామ‌ని ఎన్సీపీ- శ‌రద్‌ప‌వార్ వ‌ర్గం నేత జితేంద్ర అహ్వాద్ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు త‌మ ఆదేశాల‌ను వెన‌క్కు తీసుకోబోమ‌ని కేడీఎంసీ (KDMC) స్ప‌ష్టం చేసింది.హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఆశ్చ‌ర్యంపంద్రాగ‌స్టు నాడు మాంసం విక్ర‌యాల‌ను నిషేధిస్తూ వివిధ న‌గ‌ర పాల‌క సంస్థ‌లు ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ సప్కల్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఇలాంటి చ‌ర్య‌లను త‌ప్పుబ‌డుతూ, ఖండిస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌జ‌లు ఏం తినాలో నిర్దేశించి హ‌క్కు ప్ర‌భుత్వానికి లేద‌న్నారాయ‌న‌. చ‌ద‌వండి: పేరుకే ప‌ల్లెటూరు.. చూస్తే సిటీ లెవ‌ల్‌!హైద‌రాబాద్‌లోనూ..పంద్రాగ‌స్టు, జ‌న్మాష్టమి సంద‌ర్భంగా ఆగ‌స్టు 15, 16 తేదీల్లో పశువ‌ధ శాల‌లు మూసివేయాల‌ని జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే చికెన్‌, చేప‌ల విక్ర‌యాలపై ఎటువంటి ఆంక్ష‌లు లేవ‌ని.. బీఫ్ విక్ర‌య‌శాల‌ల‌పై మాత్ర‌మే నిషేధం ఉంటుంద‌న్నారు. జీహెచ్ఎంసీ ఆదేశాల‌పై మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నిషేధం పంద్రాగ‌స్టును మిన‌హాయించాల‌ని కొంత‌మంది కోరారు. కాగా, బీఫ్‌ దుకాణాలు, కబేళాలు సంవత్సరంలో ఏడు రోజులు మూసివేయడం అనేది రెండు దశాబ్దాలకు పైనుంచి జ‌రుగుతోంద‌ని అధికారులు వెల్ల‌డించారు. శాంతిభద్రతలకు విఘాతం క‌ల‌గ‌కూడ‌ద‌నే కొన్ని ప్ర‌త్యేక దినాల్లో బీఫ్ అమ్మ‌కాల‌పై నిషేధం కొన‌సాగుతుంద‌ని వివ‌రించారు. గాంధీ జయంతి, వర్ధంతి నాడు మ‌ట‌న్ విక్రయించర‌ని చెప్పారు.అమానుషం: అస‌దుద్దీన్‌ఆగస్టు 15న కబేళాలను మూసివేయడం అమానుషం, రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సంతోషకరమైన సందర్భమ‌ని, ఇలాంటి రోజున ఆంక్ష‌లు విధించ‌డం స‌రికాద‌న్నారు. దాదాపు 20 ఏళ్ల త‌ర్వాత వ‌రుస‌గా రెండు రోజులు క‌బేళాలు మూసివేయాల్సిన ప‌రిస్థితి రావ‌డంతో, త‌మ జీవ‌నోపాధి దెబ్బ తింటుంద‌ని దుకాణాదారులు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రోవైపు జీహెచ్ఎంసీ ఆదేశాల‌ను లా స్టూడెంట్ ఒక‌రు కోర్టులో స‌వాల్ చేశారు.

Father Lost Everything in Stocks But Son Earn Rs 2 4 Crore Salary6
స్టాక్‌ మార్కెట్‌లో నిండా మునిగాడు.. ఇప్పుడు రూ.2.4 కోట్ల వేతనం!

జీవితమంటేనే కష్టాలు, కన్నీళ్లు. వీటికి భయపడకుండా పట్టుదలతో కృషి చేస్తేనే.. సక్సెస్ సాధ్యమవుతుంది. దీనిని నిరూపించినవాళ్ల గురించి గతంలో చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఇదేకోవకు చెందిన మరో వ్యక్తి గురించి.. అతని సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.2008లో ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి స్టాక్ మార్కెట్లో సర్వసం కోల్పోయాడు. కానీ కొడుకు దశాబ్దానిపైగా కృషి చేసి.. కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఏడాదికి రూ. 2.4 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఢిల్లీలో మధ్య తరగతిలో పుట్టి పెరిగిన ఆ వ్యక్తి (కొడుకు).. ప్రారంభ జీవితం చాలా సాఫీగా సాగింది. అయితే 2008లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చదువుకునే రోజుల్లోనే.. పాఠశాలలో నాటకాలు, డ్యాన్స్ ఇతర కార్యకలాపాలలో పాల్గొనేవాడు. ఇంటర్మీడియట్‌లో సైన్స్ ఎంచుకున్నాడు. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో తన బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.చదువు పూర్తయిన తరువాత 2014లో నెలకు రూ. 35,000 జీతంతో ఉద్యోగం సంపాదించాడు. 2016లో తన స్నేహితురాలికి దగ్గరగా ఉండాలని ఉద్యోగం మారాడు. అప్పుడు అతని జీతం రూ. 60,000లకు పెరిగింది. 2017లో మరొక ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతని జీతం రూ. 90,000లకు చేరింది. ఐదేళ్లు అదే కంపెనీలు ఉంటూ.. 2021 నాటికి నెలకు రూ. 2 లక్షల జీతం సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఇదీ చదవండి: వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!2022లో విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఆఫర్ వచ్చింది. అక్కడ అతని వార్షిక వేతనం 202000 డాలర్లు (రూ.1.7 కోట్ల కంటే ఎక్కువ). 2025 నాటికి అతని వేతనం రూ. 2.4 కోట్ల కంటే ఎక్కువ అయింది. కేవలం రూ. 35000 జీతంతో మొదలైన వ్యక్తి.. రూ.2.4 కోట్ల వేతనం వరకు ఎదిగాడంటే.. దాని వెనుక అతని శ్రమ ఎంత ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఉద్యోగం చేసే సమయంలో.. జీవితాన్ని ఆస్వాదించడం కొనసాగించారు. మొత్తం నాలుగు ఖండాల్లో 17 దేశాలు ప్రయాణించాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎడ్ల బండిలో ప్రయాణించిన ఇతడు.. లగ్జరీ విమానాలలో ప్రయాణించే వరకు ఎదిగాడు. డబ్బు ఒక నిర్దిష్ట స్థాయి వరకు ముఖ్యమైనదని, కానీ దానికి మించి, ఆరోగ్యం, సంబంధాలు, అనుభవాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వ్యక్తి చెబుతాడు. జీవితంలో ఏ దశలోనైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి పొందలేమని పేర్కొన్నారు.

War 2 Movie Review And Rating In Telugu7
‘వార్‌ 2 ’మూవీ రివ్యూ

టైటిల్‌ : వార్‌ 2నటీనటులు: హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులునిర్మాణ సంస్థ: యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌నిర్మాత : ఆదిత్యా చోప్రాదర్శకత్వం: అయాన్‌ ముఖర్జీసంగీతం: ప్రీతమ్‌(పాటలు), సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా(బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌)సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్విడుదల తేది: ఆగస్ట్‌ 14, 2025బాలీవుడ్‌ బడా నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్‌ ఫిలిం వార్‌ 2. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం కావడంతో టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను వార్‌ 2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.వార్ 2 కథేంటంటే..కలి.. ఓ అజ్ఞాత శక్తి. ఎవరికి కనిపించడు కానీ, ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్‌పై పడుతుంది. భారత్‌ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు ‘ రా’ మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని పావుగా వాడతాడు. కలి టీమ్‌లో చేరాలంటే.. తన గాడ్‌ ఫాదర్‌ లాంటి వ్యక్తి, కల్నల్‌ సునీల్‌ లూథ్రా(అశుతోష్‌ రాణా)ని చంపాలని కబీర్‌కు టాస్క్‌ ఇస్తాడు. సునీల్ లూథ్రాని కబీర్‌ చంపేస్తాడు. దీతో ‘రా’ కబీర్‌ని వెంటాడుతుంది. అతడిని పట్టుకోవడానికి ‘రా’ చీఫ్‌ (అనిల్‌ కపూర్‌) ఓ స్పెషల్‌ టీమ్‌ని నియమిస్తాడు. కేంద్రమంత్రి విలాస్‌ రావు సారంగ్‌ సూచనతో స్పెషల్‌ టీమ్‌కి మేజర్‌ విక్రమ్‌ చలపతి(ఎన్టీఆర్‌)ని లీడర్‌గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్‌ లూథ్రాని చంపిన కబీర్‌పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా విక్రమ్‌ టీమ్‌లో చేరుతుంది. విక్రమ్‌ టీమ్‌ కబీర్‌ని పట్టుకుందా? లేదా? అసలు కబీర్‌ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతని లక్ష్యం ఏంటి? విక్రమ్‌కి, కబీర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజ్ఞాతంలో ఉన్న కలి ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్పై యాక్షన్‌ థ్రిల్లర్ అనగానే క‌ళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకొనే థియేటర్స్‌కి వస్తాడు. వార్‌ 2లో ఆ రెండూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్‌ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘కొత్తగా ఏమీ లేదే’ అనిపిస్తుంది. కథ, కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్టులు అనుకొని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించొచ్చు. విజువల్స్‌ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. ఒకటి రెండు యాక్షన్‌ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ఎమోషనల్‌ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి. ఓ భారీ యాక్షన్‌ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్‌.. హృతిక్‌కి ఒక టాస్క్‌ ఇవ్వడం.. అందులో భాగంగా కల్నల్‌ సునీల్‌ లూథ్రాని చంపేయడం.. అతన్ని పట్టుకునేందుకు ‘రా’ రంగంలోకి దిగడం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఇక మేజర్‌ విక్రమ్‌గా ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతంది. భారీ ఎలివేషన్‌తో ఎన్టీఆర్‌ ఎంట్రీ ఉంటుంది. కబీర్‌ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్‌ ఛేజింగ్‌ సీన్‌, మెట్రో ట్రైన్‌పై వచ్చే యాక్షన్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌కు ముందు విమానంపై వచ్చే యాక్షన్‌ సీన్‌ సినిమాకే హైలెట్‌. స్పై యాక్షన్‌ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఈజీగా ఊహించొచ్చు. సెకండాఫ్‌ ప్రారంభంలో హృతిక్‌, ఎన్టీఆర్‌పై వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఆకట్టుకుంటుంది. కావ్య లూథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్‌, ఎన్టీఆర్‌ మధ్య వచ్చే యాక్షన్‌ సీన్‌ అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌..ఇద్దరూ గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్‌కు ఆల్రేడీ స్పై యాక్షన్‌ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్‌ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్‌ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్‌కి ఇది తొలి స్పై యాక్షన్‌ మూవీ. మేజర్‌ విక్రమ్‌గా అద్భుతంగా నటించాడు. యాక్షన్‌, డ్యాన్స్‌ విషయంలో హృతిక్‌తో పోటీ పడి యాక్ట్‌ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకే భారీ ఎలివేషన్‌, ట్విస్టులు ఉంటాయి. దాదాపు 80 శాతం కథ ఎన్టీఆర్‌, హృతిక్‌ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్‌ సునీల్‌ లూథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియరా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి స్క్రీన్‌స్పేస్‌ చాలా తక్కువ అనే చెప్పాలి. హృతిక్‌తో వచ్చే యాక్షన్‌ సీన్‌లో కియారా అదరగొట్టేసింది. అనిల్‌ కపూర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ప్రీతమ్‌ పాటలు ఓకే. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్‌ సన్నివేశాలు ఒకటి, రెండు బాగున్నాయి. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Tip of the day Say Goodbye to Monsoon Acne Ayurvedic Superfood8
వర్షాకాలంలో మొటిమలా : ఆయుర్వేద సూపర్‌ ఫుడ్స్‌ ఇవిగో!

వర్షాకాలంలో మారుతున్న సీజన్ తేమ, ఉష్ణోగ్రత మార్పులను తెస్తుంది. ఈ మార్పులు అనేక చర్మ సమస్యలకు దారి తీస్తాయి. అయితే రసాయనలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఆధార పడడం కాకుండా కొన్ని ఆయుర్వేద మూలికల ద్వారా చాలా చర్మ సమస్యలకు చెక్‌ చెప్పవచ్చు. ఇవాల్టి టిప్‌ ఆఫ్‌ది డేలో భాగంగా అవేంటో చూద్దాం.ఆయుర్వేదం ప్రకారం, రుతుపవనాల సమయంలో వచ్చే కాలానుగుణ మార్పులు దోషాలను - ముఖ్యంగా వాత, పిత్త - తీవ్రతరం చేస్తాయి . మొటిమలు లేదా దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు దారితీస్తాయి.ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మధుమిత కృష్ణన్ చర్మ సమస్యల నివారణ, మొటిమలు నివారణ, చక్కగా మెరిసే చర్మాన్ని కలిగి ఉండటానికి తీపి పదార్థాలు, పోషక బాదం నుండి త్రిదోష సమతుల్య ఆమ్లా వరకు ఐదు ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లను సిఫార్సు చేస్తున్నారు.బాదం: బాదం రుచిలో తీపిగా ఉంటాయి. వాత , పిత్త దోషాలను సమతుల్యం చేస్తాయి. ఇవి కొద్దిగా జిడ్డుగా ఉండటం వల్ల చర్మాన్ని లోపలి నుండి పోషించడానికి పరిపూర్ణంగా ఉంటాయి. ఆయుర్వేదం, సిద్ధ ,యునాని గ్రంథాల ప్రకారం వర్షాకాలం అంతటా బాదం చర్మమెరుపునకు, ఆరోగ్యానికి మంచిది. రాత్రంతా నానబెట్టడం వల్ల మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది . లోతైన చర్మ పోషణను అందిస్తుంది.పసుపు: ఈ బంగారు సుగంధ ద్రవ్యాన్ని తరతరాలుగా వాడుతున్నారు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియనె మెరుగుపర్చి, వాత దోషాన్ని చర్మానికి సరైన సమతుల్యం చేయడానికి అద్భుతమైన మార్గం. సాధారణ భోజనంలో పసుపును చేర్చుకోవడం ద్వారా, తరచుగా మొటిమలు ,మొటిమలకు కారణమయ్యే మంటను తగ్గించుకోవచ్చు. పసుపు ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.ఆమ్లా (భారతీయ ఉసిరి) : అన్ని త్రిదోషాలను సమతుల్యం చేసే ఆమ్లా, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది. శక్తినిస్తుంది. శరీరం నుండి మలినాలను తొలగించడం ద్వారా, దాని నిర్విషీకరణ లక్షణాలు వర్షాకాలంలో మొటిమలు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.వేప: మొటిమలు లేని చర్మానికి ఆయుర్వేదంలో అత్యంత నమ్మదగిన చికిత్సలలో ఒకటి వేప. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,రక్త శుద్ధి లక్షణాల మెండుగా ఉంటాయి. వెల్లుల్లి: వెల్లుల్లిలోని వాత బ్యాలెన్సింగ్ లక్షణాలు దాని బలమైన రుచి ఉన్నప్పటికీ లోపలి నుండి పనిచేస్తాయి. ఇవి సహజమైన, చర్మాన్ని శుభ్రపరిచే సూపర్‌ఫుడ్‌ వెల్లుల్లి.నోట్‌... చర్మ ఆరోగ్యం, అందం పైపైనదిగా మాత్రమే ఉండదు. ఆయుర్వేదం మనకు బోధించినట్లుగా, నిజమైన అందం లోపలి నుండే ప్రారంభమవుతుంది. కాలిఫోర్నియా బాదం వంటి గింజలు ,పసుపు వంటి సుగంధ ద్రవ్యాలను చేర్చడం వల్ల ఈ తేమ వాతావరణంలో కూడా మెరుస్తున్న చర్మం మన సొంతం. ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో మొటిమలకు వీడ్కోలు చెప్పేద్దాం.

cloud burst in jammu and kashmir9
కిష్ట్‌వార్‌లో క్లౌడ్ బరస్ట్‌.. 33 మంది మృతి.. 220మంది గల్లంతు

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో స్వల్ప వ్యవధిలో కిష్ట్‌వార్‌, పహల్గాంలో రెండో చోట్ల జరిగిన క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆకస్మికంగా ముంచెత్తిన వరదల కారణంగా గురువారం సాయంత్రం (ఐదుగంటల) సమయానికి 33 మంది మరణించారు. 220మంది గల్లంతయ్యారు. ఓవైపు క్లౌడ్‌ బరస్ట్‌ మరోవైపు కుండపోత వర్షంతో భారీ ఎత్తున ఆస్తినష్టం,ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.గురువారం మధ్యాహ్నం కిష్ట్‌వార్‌ జిల్లాలోని చషోటీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. స్థానికులు ఏర్పాటు చేసుకున్న గుడారాలు ఎగిరిపోయాయి. కిష్ట్‌వార్‌లో క్లౌడ్‌ బరస్ట్‌ అయిన కాసేపటికే పహల్గాంలో క్లౌడ్‌ బరస్ట్‌ జరిగింది. పహల్గాంకు సమీపంలో మెరుపు వరదలు ముంచెత్తాయి. జల ప్రవాహం ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. కిష్ట్‌వార్‌లో మెరుపు వరదలతో 220మంది గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు.క్లౌడ్‌ బరస్ట్‌తో అప్రమత్తమైన రెస్క్యూబృందాలు వరదల్లో చిక్కుకున్న వందల మంది బాధితుల్ని రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాయి. చషోటీ ప్రాంతంలో ప్రతీ ఏడాది జూలై 25 నుండి సెప్టెంబర్ 5 వరకు మచైల్ మాతా యాత్ర (Machail Mata Yatra) ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఏడాది చండీ మాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా మచైల్‌ మాతా ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు, స్థానికుల మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.వరద సంభవించిన చషోటీ ప్రాంతం మచైల్ మాతా యాత్రకు ప్రారంభ ప్రాంతంతో పాటు కిష్ట్‌వార్‌లోని హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో వాహన సదుపాయం ఉన్న చివరి గ్రామం కూడా. దీంతో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా చషోటీ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ముంచెత్తిన వరద నుంచి గ్రామస్తులతో పాటు భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కిష్ట్‌వార్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ పంకజ్‌ శర్మ తెలిపారు. వరదలపై జమ్మూకశ్మీర్‌ ఉదంపూర్‌ ఎంపీ, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ అప్రమత్తమయ్యారు. క్లౌడ్‌ బరస్ట్‌ జరిగిన ప్రాంతంలోని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సహాయకచర్యల్ని వేగవంతం చేయాలని అదేశాలు జారీ చేశారు. Massive cloudburst struck Chishoti area in the Jammu and Kashmir’s Kishtwar district, along the route to the Machail Matta Yatra.Casualties are feared, though further details and official confirmation are awaited. https://t.co/d5AQMPAbfU pic.twitter.com/xJgI5WrpwP— Rakesh Kumar (@RiCkY_847) August 14, 2025 సీఎం ఒమర్‌ అబ్దుల్లా విచారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కార్యాలయం జిల్లా యంత్రాంగంతో సంప్రదిస్తున్నట్లు, అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. కిష్ట్‌వార్‌లో జరిగిన విషాదంపై సీఎం ఒమర్‌ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాలు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పోలీసు,సైన్యం,రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ‘కిష్ట్‌వార్‌లో జరిగిన క్లౌడ్‌ బరస్ట్‌ బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలనేది నా ఆకాంక్ష. పౌరులు, పోలీసు,సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులు రక్షణ, సహాయ కార్యకలాపాలను బలోపేతం చేయాలని, బాధితులకు కావాల్సిన సహాయం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు.

Actor Darshan Bail Cancelled By Supreme Court10
దర్శన్‌కు సిగరెట్లు, మందు అందిస్తే ఊరుకునేది లేదు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: కన్నడ స్టార్‌ నటుడు దర్శన్ తూగుదీపకు భారీ షాక్‌ తగిలింది. కర్ణాటక హైకోర్టు ఆయనకు జారీ చేసిన బెయిల్‌ను సుప్రీం కోర్టు గురువారం రద్దు చేసింది. తక్షణమే ఆయన్ని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. తన అభిమాని అయిన రేణుకాస్వామిని హత్య కేసులో అరెస్టైన దర్శన్‌.. ప్రస్తుతం బెయిల్‌ మీద ఉన్న సంగతి తెలిసిందే.‘‘మేము బెయిల్ మంజూరు, రద్దు ఈ రెండు అంశాలను పరిశీలించాం. హైకోర్టు ఉత్తర్వు యాంత్రికంగా అధికారాన్ని వినియోగించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బెయిల్ మంజూరు చేయడం విచారణపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు’’ అని బెయిల్‌ రద్దు చేస్తూ తీర్పు సందర్భంగా జస్టిస్‌ మహదేవన్‌ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుపై బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ జేబీ పార్దీవాలా హర్షం వ్యక్తం చేశారు. ‘‘జే మహదేవన్‌ వర్ణించలేనంత గొప్ప తీర్పును ప్రకటించారు. నిందితులు ఎంతటి వాళ్లైనా.. చట్టానికి అతీతులేం కాదు అనే ఓ స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది’’ అని జస్టిస్‌ జేబీ పార్దీవాలా అన్నారు. ప్రస్తుతం దర్శన్‌ తమిళనాడులో ఉన్నట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కాపీని ట్రయల్‌ కోర్టుకు అందించి.. ఆపై వారెంట్‌ ద్వారా దర్శన్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీర్పు సందర్భంగా ద్శిసభ్య ధర్మాసనం.. ‘‘బెయిల్ మంజూరు చేయడానికి చట్టపరమైన కారణం లేదు. దర్శన్‌కు బెయిల్‌ ద్వారా లభించిన స్వేచ్చ.. న్యాయ వ్యవస్థను దెబ్బతీయే ప్రమాదంలోని నెట్టింది’’ అని అభిప్రాయపడింది. ఈ క్రమంలో.. గతంలో జైలులో దర్శన్‌కు ప్రత్యేక వసతులు అందిన విషయాన్ని జస్టిస్‌ పార్దీవాలా ప్రస్తావించారు. ‘‘జైల్‌లో నిందితుడికి ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ట్రీట్‌మెంట్‌ అందిన విషయం మా దృష్టికి వచ్చింది. జైలు ప్రాంగణంలోనే నిందితుడు సిగరెట్లు, మందు తాగిన విషయం మాకు తెలిసింది. ఈ వ్యవహారంలో జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు’’ అని కర్ణాటక పోలీసు, జైళ్ల శాఖను జస్టిస్‌ పార్దీవాలా హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ చట్టం సమానంగా వర్తించాలి అని పునరుద్ఘాటిస్తూ.. దర్శన్‌పై ఉన్న ఆరోపణలు, అలాగే ఫోరెన్సిక్ ఆధారాలు.. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరాన్ని బలపరిచాయని పేర్కొంది. ఈ విషయంలో మేము మా అసాధారణ అధికారాన్ని వినియోగించేందుకు సంతృప్తిగా ఉన్నాం అని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది.కేసు నేపథ్యం.. పోలీసుల అభియోగాల ప్రకారం.. చాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్‌లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్‌లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్‌లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్‌ అయ్యారు. ఆ సమయంలో వాళ్లకు అందిన వీఐపీ ట్రీట్‌మెంట్‌పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దర్శన్‌ను మరో జైలుకు మార్చారు. ఆపై వాళ్లు బెయిల్‌ మీద బయటకు వచ్చారు. 2024 డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏడుగురి బెయిల్‌ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. అయితే విచారణలో దర్శన్‌కు హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. తాజాగా సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కావడంతో దర్శన్ మళ్లీ అరెస్ట్ కానున్నాడు. కేసు టైమ్‌లైన్‌2024 జూన్‌ 8: రేణుకాస్వామి హత్య.. బెంగళూరులోని కామాక్షిపాళ్య ప్రాంతంలోని కాలువ ప్రాంతంలో దొరికిన మృతదేహాం2024 జూన్‌ 11: నటుడు దర్శన్‌ అరెస్ట్‌2024 జూన్: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. 2024 సెప్టెంబర్ 21: అనారోగ్య కారణంగా బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2024 అక్టోబర్ 31: కర్ణాటక హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.2024 డిసెంబర్ 13: హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.2025 జనవరి 24: దర్శన్‌ బెయిల్‌ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో కర్ణాటక ప్రభుత్వం పిటిషన్‌2025 ఆగస్టు 14: దర్శన్‌ బెయిల్‌ రద్దు చేసిన సుప్రీం కోర్టు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement