స్తంభాలకు ముగ్గుర్ని కట్టి.. పేల్చేశారు
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కూరత్వం పరాకాష్టకు చేరుకుంది. అత్యంత అమానుష పద్ధతుల్లో బందీలు చంపుతున్న ఆ గ్రూప్ తాజాగా ముగ్గురిని అత్యంత కిరాతకంగా హతమార్చింది. సిరియాలోని పాల్మిరా నగరంలో ఒక ప్రాచీన కట్టడం స్తంభాలకు ముగ్గురు వ్యక్తుల్ని కట్టేసి.. ఆ స్తంభాలను పేల్చేసింది. దీంతో వారు ముక్కలుముక్కలు అయ్యారు. ఈ ఘటన గురించి నగరంలోని స్థానిక వర్గాలు తమకు సమాచారం ఇచ్చాయని లండన్కు చెందిన సిరియా అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ తెలిపింది.
గత మే నెల నుంచి ప్రాచీన పాల్మిరా నగరం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉంది. ఇలా ముగ్గురిని స్తంభాలకు కట్టివేసి ఎందుకు హతమార్చారో.. వారు ఏ నేరం చేశారో కారణాలు తెలియదు. కానీ చిన్నచిన్న నేరాలకు సైతం ఐఎస్ఐఎస్ అత్యంత కిరాతకమైన రీతిలో హత్యలకు పాల్పడుతున్నది. కొందరికి మరణశిక్షలు విధించి.. వారే తమ గోతిని తవ్వుకొని.. అందులో తమకుతామే సజీవ సమాధి అయ్యేలా వ్యవహరిస్తున్నది. ఇరాక్, సిరియాలో పెద్దమొత్తంలో భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్న ఐఎస్ఐఎస్ ఇక్కడ కఠినమైన ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలుచేస్తున్నది.
ధ్వంసమవుతున్న ప్రాచీన పాల్మిరా నగరం
ప్రస్తుతం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న పాల్మిరా నగరం అత్యంత ప్రాచీనమైనది. ఈశాన్య డామస్కస్కు సమీపంలోని ఈ నగరంలో ఎన్నో అందమైన ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. వీటి కారణంగా ఈ నగరాన్ని 'ఎడారి పెళ్లి కూతురు'గా పిలుస్తారు. ఒకప్పుడు ఈ నగరం మీదుగా పర్షియా, ఇండియా, చైనా, రోమన్ సామ్రాజ్యానికి వాణిజ్య మార్గం ఉండేది. నగరానికే వన్నె తెచ్చెలా ఇక్కడ 'ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్' పేరిట పెద్ద ప్రాకార నిర్మాణం ఉంది. ప్రపంచంలోని ప్రాచీన నగరాలలో ఒకటిగా పేరొందిన ఈ నగరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపునిచ్చింది.
ఈ ఏడాది మే 20న ఈ నగరాన్ని సిరియా భద్రతాదళాల చేతుల్లో నుంచి తమ అధీనంలోకి తీసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు.. ఇక్కడున్న ప్రాచీన కట్టడాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడున్న పురాతత్వశాస్త్ర నిపుణులను ఉగ్రవాదులు తలనరికి చంపేశారు. అంతేకాకుండా గత ఆగస్టులో సాంస్కృతికంగా ప్రాధాన్యమున్న బెల్, బాల్షామిన్ ఆలయాలను నేలమట్టం చేశారు. ఇలా ప్రాచీన సంపదను ధ్వంసం చేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసన, ఆగ్రహం వ్యక్తమయ్యాయి. ప్రాచీన కట్టడాలను నామరూపాలు లేకుండా చేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల తీరుపై పురాతత్వ, చరిత్ర పరిశోధకు
లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.