బ్రిటన్ లక్ష్యంగా దాడులకు ఐఎస్‌ఐఎస్ కుట్ర
లండన్: బ్రిటన్‌లో రానున్న కొన్ని వారాల్లో పారిస్ తరహా దాడులు చేసేందుకు ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులు కుట్రపన్నారు. అందుకోసం సిరియా, ఇరాక్ దేశాల్లో టెర్రరిస్టుల తరఫున దాడులు చేస్తున్న బ్రిటన్ జీహాదీలను బ్రిటన్‌కు వెళ్లాల్సిందిగా టెర్రరిస్టు నాయకులు ఆదేశాలు జారీ చేసినట్టు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసినట్టు టైజమ్ విశ్లేషకుడు పాల్ క్విక్‌షాంక్ శుక్రవారం నాడిక్కడ మీడియాకు తెలిపారు.
సిరియాపై బ్రిటన్ నిర్ణయాత్మక వైమానిక దాడులు చేస్తున్నందుకు ప్రతీకారంగా పారిస్ తరహా దాడులు నిర్వహించి ప్రజల్లో భీతావహాన్ని సృష్టించాలని పథకం వేసినట్టు సీనియర్ యూరోపియన్ కౌంటర్ టైజమ్ అధికారి ఒకరు ఐఎస్‌ఐఎస్ కమ్యూనికేషన్ ట్రేస్ చేయడం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారని, ఆయనతో తను స్వయంగా మాట్లాడి ఈ సమాచారాన్ని సేకరించానని పాల్ వివరించారు. ఆ దాడుల తీవ్రత ఎంతగా ఉంటుందీ, ఎలా ఉంటుందనే విషయాలు మాత్రం తెలియవని తెలిపారు. గతేడాది కూడా ఇలాంటి తరహా దాడులకు జిహాదీలు కుట్ర పన్నారని, అయితే సకాలంలో ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించడంతో ఆ కుట్రను భగ్నం చేయగలిగామని చెప్పారు.
గతేడాది దాదాపు 800 మంది ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు బ్రిటన్ నుంచి వెళ్లారని, ఆ తర్వాత వారిలో దాదాపు సగం మంది వెనక్కి తిరిగి వచ్చారని పాల్ తెలిపారు. తాజా సమాచారం ప్రకారం వారి కదలికలపై కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. సిరియాలో ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టుల స్వాధీనంలో ఉన్న చమురు క్షేత్రాల లక్ష్యంగా బ్రిటన్ యుద్ధ విమానాలు ఇప్పటికే రెండు సార్లు దాడులు జరపడం తెల్సిందే. తాము లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలిగామని రాయల్ ఏర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి.