ఐసిస్.. సిరియా, ఇరాక్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులు నిర్వహించి వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న రాక్షసమూక. పశ్చిమాసియా దేశాలైన సిరియా, ఇరాక్‌లో గణనీయమైన భూభాగాన్ని అక్రమించుకుని ఖలీఫత్ పేరిట 2014లో ఏకంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆయిల్, ఇతర సహజవనరుల్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటూ ఆ సొమ్ముతో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద భావజాలానికి మద్దతుగా నిలిచింది. మైనారిటీ మతస్తుల్ని బందీలుగా చేసుకుని గొంతు కోసి హతమార్చడం, తమ భావజాలాన్ని వ్యతిరేకించే సొంత మతస్తుల్ని సజీవ దహనం చేయడం వంటి దారుణ చర్యలతో వణుకు పుట్టించింది.
అయితే ఇదంతా గతం. 2014లో ఐసిస్‌ను అణచివేసేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారీ ఎత్తున వైమానిక దాడులకు ఆదేశాలిచ్చారు. చివరికి 2017, అక్టోబర్‌లో ఐసిస్ ఉగ్రవాదులు నక్కిన చివరి నగరమైన రక్కాను సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకోవడంతో ఐసిస్‌ను ఓడించేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించారు. అయితే నిజంగానే ఐసిస్‌ను పూర్తిగా అణచేశారా? భవిష్యత్‌లో ఉగ్రదాడులు చేయడానికి వీల్లేకుండా దాన్ని ఆర్థికమూలాల్ని పూర్తిగా నాశనం చేశారా? అంటే జవాబు కాదనే వినిపిస్తోంది.
ఈ విజయం తాత్కాలికమే: జమాత్–అల్–తావీద్–వల్–జీహాద్ (జేటీజే) పేరుతో 1999లో ఏర్పడ్డ ఈ సంస్థ.. క్రమక్రమంగా పశ్చిమాసియాలో పట్టు పెంచుకోవడం ప్రారంభించింది. లాడెన్ నేతృత్వంలోని అల్‌కాయిదాకు విధేయత ప్రకటించుకున్న జేటీజే.. 2003లో ఇరాక్‌పై–అమెరికా యుద్ధంలో పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా దాడులకు పాల్పడింది. 2014 నాటికి ఇరాక్, సిరియాల్లో గణనీయమైన భూభాగాన్ని స్వాధీనం చేసుకుని సంస్థ పేరును ఐసిస్‌గా మార్చుకుంది. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా సిరియా, ఇరాక్, ఫ్రాన్స్, బెల్జియం సహా 29 దేశాల్లో 140 ఉగ్రదాడులకు పాల్పడి వేలాది మందిని పొట్టనపెట్టుకుంది. కశ్మీర్‌లోనూ అల్లరిమూకలు ఐసిస్ జెండాలు ప్రదర్శించంపై భారత నిఘా సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.
ఓ రక్షణ సంస్థ నివేదిక ప్రకారం సంకీర్ణ సేనలు ఐసిస్ అధీనంలోని 29,741 స్థావరాలపై ఇప్పటివరకూ 1,07,814 మిస్సైళ్లను, బాంబుల్ని ప్రయోగించాయి. ఈ దాడుల్లో 60,000 మంది ఉగ్రవాదులు, 6,321 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, మరోవైపు రష్యా, ఇరాన్, సాయంతో పోరాడుతున్న సిరియన్ బలగాలు ఐసిస్ కబంధ హస్తాల నుంచి చాలా పట్టణాలకు విముక్తి కల్పించాయి. అయితే ఈ విజయం తాత్కాలికమేననీ, ఇరుపక్షాల మధ్య దీర్ఘకాలిక పోరాటానికి ఇది ఆరంభమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకూ అఫ్గాన్‌లో 17 మంది అమెరికన్ కమాండర్లు మారినా పరిస్థితి మారకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు.
సోషల్ మీడియానే ఆయుధం: సంకీర్ణ సేనలు, రష్యా, ఇరాన్ బలగాల వరుస దాడులతో కుదేలయినప్పటికీ ఈ ప్రాంతంలో ఐసిస్ తన ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోలేదని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అమెరికా, యూరప్ దేశాలపై ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడాలని సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు ఉగ్రవాదులు విషాన్ని నూరిపోస్తున్నారని తెలిపారు. సరికొత్తగా గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అనుసరిస్తున్నారన్నారు. ఇందులోభాగంగా యుద్ధాలు, ప్రభుత్వ అసమర్ధత కారణంగా ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా ఉన్న యువతను భారీగా భర్తీ చేసుకుంటూ ఐసిస్, ఇతర ఉగ్రసంస్థలు శక్తిమంతంగా మారేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు. ఉగ్రమూకల్ని అణచివేయడంలో సైనిక చర్య ద్వారా తాత్కాలిక ఫలితాలను మాత్రమే సాధించగలమనీ, దీర్ఘకాలంలో పరిస్థితిలో ఎలాంటి మార్పు రాబోదన్నారు. ఈ దేశాల్లో సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కారానికి యత్నించినప్పుడు సానుకూల ఫలితాలు వస్తాయన్నారు.
► సంకీర్ణ సేనలు లక్ష్యంగా చేసుకున్న ఐసిస్ స్థావరాలు 29,741
► ఐసిస్‌పై ప్రయోగించిన మిస్సైళ్లు, బాంబులు 1,07,814
► హతమైన ఉగ్రవాదులు 60,000
► చనిపోయిన పౌరులు 6,321
► ఐసిస్ పంజా విసిరిన దేశాలు 29
► ప్రపంచవ్యాప్తంగా జరిపిన ఉగ్రదాడులు 140
► ఐసిస్ వద్ద ఆధునిక మెషీన్‌గన్‌ల నుంచి రసాయన ఆయుధాల వరకు
► ఇటీవలే బల్గేరియా నుంచి ఓ శక్తివంతమైన మిసైల్‌ను కూడా ఐసిస్ సేకరించిందన్న అమెరికా
Comments
Please login to add a commentAdd a comment