west asian countries
-
ఇరాన్‌పై నిప్పుల వర్షం
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. ఊహించినట్లుగానే ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇలామ్, ఖుజిస్తాన్, టెహ్రాన్ ప్రావిన్స్‌ల్లోని సైనిక, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. మొత్తం 100 ఫైటర్ జెట్లతో మూడు దశల్లో 20 లక్ష్యాలపై కచి్చతత్వంతో కూడిన దాడులు నిర్వహించింది. ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ల తయారీ కేంద్రాలు, ప్రయోగ కేంద్రాలపై వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే, చమురు నిల్వలపై దాడులు జరిగాయా లేదా అనేది తెలియరాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు సమాచారం. తాజా దాడుల్లో ఇరాన్‌కు ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న సంగతి ఇజ్రాయెల్ బయటపెట్టలేదు. ఇరాన్‌పై దాడుల తర్వాత తమ యుద్ధవిమానాలు క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చాయని వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల తర్వాత ఇరాన్‌పై మరో దేశం నేరుగా దాడికి దిగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఆపరేషకు ఇజ్రాయెల్ ‘పశ్చాత్తాప దినాల మిషన్’ అని పేరుపెట్టింది. రంగంలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ సైన్యం పక్కా ప్రణాళికతో ఇరాన్‌పై దాడికి దిగినట్లు సమాచారం. అత్యాధునిక ఫైటర్ జెట్లను సైన్యం రంగంలోకి దించింది. ఐదో తరం ఎఫ్–35 అడిర్ ఫైటర్ జెట్లు, ఎఫ్–15టీ గ్రౌండ్ అటాక్ జెట్లు, ఎఫ్–16ఐ సూఫా ఎయిర్ డిఫెన్స్ జెట్లు ఇందులో ఉన్నాయి. ఇవి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదింగలవు. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ సైనిక, ఆయుధ స్థావరాలపైనే గురిపెట్టింది. జనావాసాల జోలికి వెళ్లలేదు. తొలుత రాడార్, ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలపై దాడికి పాల్పడింది. అనంతరం సైనిక స్థావరాలు, మిస్సైల్, డ్రోన్ల కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపించింది. మొత్తం మూడు దశల్లో దాడులు జరగ్గా, ఒక్కో దశ దాడిలో దాదాపు 30 చొప్పున యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. మరోవైపు ఇరాన్ నుంచి ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో ఇజ్రాయెల్, అమెరికా తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. విమానాల రాకపోకలకు వీల్లేకుండా ఇరాన్, ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేశాయి. టెహ్రాన్‌లో సాధారణ పరిస్థితులే.. ఇజ్రాయెల్ దాడుల్లో తమకు పరిమిత నష్టమే వాటిల్లిందని, ఎదురుదాడిలో నలుగురు సైనికులు మృతి చెందారని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. దాడుల అనంతరం టెహ్రాన్‌లో సాధారణ పరిస్థితులే కనిపించాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లారు. దుకాణాలు ఎప్పటిలాగే తెరుచుకున్నాయి. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌పై దాడుల పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇజ్రాయెల్ చర్యను పలు దేశాలు ఖండించాయి. సంయమనం పాటించాలని సూచించాయి. అమెరికా వంటి మిత్రదేశాలు మాత్రం ఇజ్రాయెల్‌కు మద్దతు పలికాయి. 25 రోజుల తర్వాత ప్రతిదాడి ఇరాన్‌పై దాడుల సందర్భంగా కొన్ని ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇందులో టెల్ అవీవ్ ఉన్న కిర్యా మిలటరీ బేసులోని మిలటరీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ సైనిక సలహాదారులతో, సైనికాధికారుతో చర్చిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్»ొల్లా, హమాస్ నాయకులు మరణించడం పట్ల ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోయింది. ఈ నెల 1న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ భూభాగంపై దాదాపు 200 క్షిపణులు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, తాము తగిన జవాబు ఇవ్వక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అప్పుడే హెచ్చరించారు. ఇరాన్ దాడి చేసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని అప్పట్లో భావించినప్పటికీ ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో తమ ఆపరేషన్ వాయిదా వేసుకుంది. పరిస్థితులు సానుకూలంగా మారడంతో 25 రోజుల తర్వాత ఇరాన్‌పైకి యుద్ధ విమానాలు పంపించింది. -
రేటు కోతకు వేళాయెనా..!
ముంబై: పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంసహా భౌగోళిక ఉద్రికత్తలు, దీనితో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్ నుంచి అనుసరిస్తున్న ‘సరళతర ఆర్థిక విధాన ఉపసంహరణ’ నుంచి ‘తటస్థం’ వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సానుకూలాంశమని, సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్‌సూద్ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు... → ఆర్బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతోంది. → 2024–25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతంగా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎకానమీ 6.7 శాతం పురోగతి సాధించగా, క్యూ2, క్యూ3, క్యూ4లలో వృద్ధి రేట్లు వరుసగా 7, 7.4, 7.4 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పులేదు. క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 4.1 శాతం, 4.8 శాతం, 4.2 శాతాలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని, 2025–26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3 శాతమని పాలసీ అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. → ఫీచర్ ఫోన్ యూపీఐ123పే పరిమితిని లావాదేవీకి ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచడం జరిగింది. → లైట్ వాలెట్ పరిమితి ప్రస్తుత రూ.2,000 నుంచి రూ.5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కి ఎగసింది. → తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది.వృద్ధికి వడ్డీరేట్లు అడ్డుకాదు... ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న విశ్వాసంతోనే పాలసీ విధాన వైఖరిని మార్చడం జరిగింది. అయితే రేటు కోత ఇప్పుడే మాట్లాడుకోవడం తగదు. ఇక వృద్ధిపై ప్రస్తుత వడ్డీరేట్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గత 18 నెలల కాలంలో మాకు ఎటువంటి సంకేతాలు లేవు. భారత్ ఎకానమీ పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ నాణ్యతపై అత్యధిక దృష్టి సారించాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వృద్ధికి దోహదం.. ఆర్బీఐ విధాన ప్రకటన పటిష్ట వృద్ధికి, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశం. పాలసీ వైఖరి మార్చుతూ తీసుకున్న నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద కట్టడి చేయడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ రియలీ్టకి నిరాశ..హౌసింగ్ డిమాండ్‌ను పెంచే అవకాశాన్ని ఆర్బీఐ కోల్పోయింది. రియలీ్టకి ఊపునివ్వడానికి రేటు తగ్గింపు కీలకం. వచ్చే పాలసీ సమీక్షలోనైనా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వైఖరి మార్పు హర్షణీయం.. ఆర్బీఐ పాలసీ వైఖరి మార్పు హర్షణీయం. రానున్న సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అంశాన్ని ఇది సూచిస్తోంది. ఎకానమీ పురోగతికి తగిన పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ తగిన సమయాల్లో తీసుకుంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. – దీపక్‌సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
అభద్రతను పెంచుతున్న యుద్ధం
హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాలను నిరోధించ వలసిన ఐక్యరాజ్య సమితి లాంటివి నిర్వీర్యమైపోతున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఐరాస సిబ్బందికే రక్షణ లేని పరిస్థితి. ఇక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నెతన్యాహూకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలు ఆంక్షల విధింపు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వైరి పక్షాలను చర్చల వేదికపైకి తేగలిగిన మధ్యవర్తులు కానరాని పరిస్థితి! ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన శత్రువులపై దాడిచేసే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ... దాని పౌరులు రోజు రోజుకూ అభద్రతాభావంలో కూరుకుపోతుండటం గమనార్హం.ఒక సంవత్సరం క్రితం, అక్టోబర్ 7న జరిగిన ఘటన ఉక్రెయిన్‌లో యుద్ధం నుండి ప్రపంచం దృష్టిని మళ్లించింది. నేడు, హమాస్ తీవ్రవాద దాడిపట్ల ఇజ్రాయెల్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా మారిపోయింది. దీనితో పోలిస్తే మిగతా వన్నీ అప్రధానంగానే ఉన్నాయి. దాదాపు 45,000 మంది, వీరిలో ఎక్కువగా పౌరులు మరణించారు. కనుచూపు మేర కాల్పుల విరమణ లేదు. పైగా వేగంగా పెరుగుతున్న సంఘర్షణ కారణంగా, పశ్చిమాసి యాను యుద్ధం చుట్టుముట్టే అవకాశం ఒక ప్రమాదకరమైన వాస్తవంగానే కనబడుతోంది. కొంత వరకు ఉక్రెయిన్ యుద్ధం, ప్రధానంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం... ప్రాంతీయ యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించే లేదా వాటికి ముగింపు పలికే సామర్థ్యం గల మధ్యవర్తులు కనిపించని ప్రపంచంలో మనం ఈ రోజు ఉన్నామనే వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయి.ఇజ్రాయెల్, ఇరాన్ లేదా అమెరికాను చేరుకోగల ఉపయోగ కరమైన పరోక్ష మార్గాలు కానీ లేదా వారిని సంధానించేవారు కానీ ఇప్పుడు ఎవరూ లేరు. సైద్ధాంతికంగా చెప్పాలంటే, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే లేదా పొడిగించే స్థితిలో అమెరికా ఉండవచ్చు, కానీ పశ్చిమాసియా విషయానికి వస్తే దాని నిస్సహాయత ఆశ్చర్యక రంగా ఉంది. ఈ ప్రాంతంలో పరిష్కారం కోసం ప్రపంచం వాషింగ్టన్ వైపు చూస్తూనే ఉంది, కానీ దాని స్వీయ అధ్యక్ష ఎన్నికల కారణంగా, అమెరికన్ బాడీ పాలిటిక్స్‌పై ఇజ్రాయెల్ ప్రభుత్వం చూపే ప్రభావం కారణంగా అమెరికాకు పరిష్కారం సాధ్యం కావడం లేదు.మరోవైపున అగ్రరాజ్య స్థాయి కోసం ఎదురుచూస్తున్న చైనా మౌనం కూడా ఆసక్తి గొల్పుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా ఉండగా, ఎర్ర సముద్రం సంక్షోభం సమయంలో అది నిష్క్రియాపరత్వంతో వేచి ఉంటోంది. పైగా ఇతర చోట్ల ప్రపంచ సంక్షోభాలను తగ్గించే విషయంలో చైనా పాత్ర తక్కువే అని చెప్పాలి. ఇక పశ్చిమాసియా సంక్షోభంపై మధ్యవర్తిత్వం వహించడంలో చైనా ఏమాత్రం ఆసక్తి చూపలేదు. భారతదేశం ఇప్పటికీ అలాంటి కర్తవ్యా లను చేపట్టేంత శక్తిమంతమైన దేశంగా తనను తాను భావించడం లేదు. రెండో ప్రపంచ యుద్ధానంతర సంస్థలు ప్రపంచ స్థాయిలో నిర్మాణాత్మక అసమానతలను కొనసాగించినప్పటికీ, సంస్థలు,నిబంధనలు లేని ప్రస్తుత ప్రపంచం అధ్వానంగానే ఉంటుంది.ఐక్యరాజ్యసమితిని పరిశీలిస్తే... అది రోగలక్షణంతో అసమర్థ మంతంగానూ, నిస్సహాయంగానూ మారిపోయినట్లుంది. అందుకే యుద్ధంలో పాల్గొంటున్న పక్షాలు... ఐరాస సిబ్బంది ఉన్న ప్రాంతా లలో కూడా బాంబు దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పోరాడుతున్న పక్షాలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చేసిన విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ఇటీవల ధిక్కరించినట్లుగానే, మీడియా కూడా దాన్ని సీరియస్‌గా పరిగణించడం లేదు.అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) ఉదంతాన్ని తీసుకోండి. ఇది ఇజ్రాయెల్ ఆగ్రహ జ్వాలలకు గురవుతూ ఉండడం మాత్రమే కాకుండా... అమెరికా, ఐరోపాలోని ఇజ్రాయెల్ సన్నిహిత మిత్రుల అగ్రహాన్ని కూడా చవిచూస్తూ ఉంది. హాస్యాస్పదంగా, రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలనే విషయంపై ఆసక్తిగా ఉన్న దేశాలు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అదే విధంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు మాత్రం ఐసీసీపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. రెండు యుద్ధాలూ నైతిక పరిగణనలు వాడుకలో లేని ప్రపంచం వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి. ఇంకా, నైతిక రాజకీయం రోజువారీ ప్రభుత్వ ఆచరణలో చెడుకు చెందిన సామాన్యతను కొలిచేందుకు ఒక కొలమానాన్ని అందిస్తుంది. దేశీయ రాజకీయాలు లేదా అంతర్జాతీయ సంబంధాలలో, నైతిక ప్రమాణాలు లేనిదాని కంటే నైతిక ద్వంద్వ ప్రమాణాలు ఉత్తమం. ఆచరణలో లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, కొలత కోసం మనకు ఒక టేప్ అవసరం. ఈ యుద్ధంలో చెడుకు సంబంధించిన సామాన్యత విషయంలో అత్యంత కలతపెట్టే ఉదా హరణ ఏదంటే హమాస్ టెర్రరిస్టులను గాజా ప్రజలతో సమానం చేయడం– అలాంటి చట్రాలను మనం మౌనంగా ఆమోదించడం!ఏ రకంగా చూసినప్పటికీ ఇజ్రాయెల్ మరింత ఒంటరిగా, అభద్రతతో ఉంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులు, దాని అసమాన ప్రతీకార చర్యలు జరిగి ఒక సంవత్సరమైంది. కానీ ఇజ్రాయెల్ అనుభూతి చెందుతున్న శాశ్వతమైన అభద్రతా భావం ఇప్పుడు పెరుగుతున్న ఒంటరితనంతో పాటు మరింత తీవ్రమైంది.ఇజ్రాయెల్‌కు తన శత్రువులను మరింత ఎక్కువ శక్తితో కొట్టే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, ఈ ప్రాంతంలో సంపూర్ణ దుర్బ లత్వం కూడా స్పష్టంగా ఉంది. ఇరాన్ దాని ప్రాక్సీ గ్రూపులుగా గాజా, ఇరాక్, లెబనాన్, సిరియా గురించి ఇజ్రాయెలీలు పిలుస్తున్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనేది ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు మరింత సురక్షితంగా ఉన్నారా అనేది సందేహమే. ఒక దేశం ఎంత శక్తిమంతమైన దేశమైన ప్పటికీ, నిశ్చయాత్మకమైన, సైద్ధాంతికంగా ప్రేరేపితులైన విరోధుల నుండి తనను తాను రక్షించుకోలేకపోతుంది, ప్రత్యేకించి దాని సొంత చర్యలు విరోధుల లక్ష్యాన్ని మరింతగా నిలబెడుతున్నప్పుడు అది అసలు సిద్ధించదు.నేడు ఇజ్రాయెల్ మరింత అభద్రతాభావంతో ఉండటమే కాకుండా ప్రపంచం సానుభూతిని కూడా కోల్పోతోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు దాని మితిమీరిన చర్యలకూ, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినందుకూ, ప్రత్యేకించి గ్లోబల్ సౌత్‌లోని వారిచే వివిధ అంత ర్జాతీయ ఫోరమ్‌లలో సాధారణంగా ఆక్షేపించబడుతూ, విమర్శల పాలవుతోంది. గ్లోబల్ సౌత్ మద్దతుపై ఇజ్రాయెల్‌కు పెద్దగా పట్టింపు లేకపోయినా, ఇజ్రాయెల్ వైపు నిలిచిన యూరోపియన్, ఉత్తర అమె రికా మద్దతుదారులు కనీసం భౌగోళిక రాజకీయ కారణాల వల్ల దక్షి ణాదిని విస్మరించడం కష్టం. అమెరికా ఇప్పటికీ ఇజ్రాయెల్ కోసం బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో అమెరికా యువతరంలో ఇజ్రాయెల్‌కి చెందిన సమస్యపై, విభేదాలు పెరుగుతున్నాయి.మొత్తం మీద చూస్తే అబ్రహం ఒప్పందాలు ప్రమాదకరమైన స్థితిలో ఊగిసలాడుతున్నాయి, వీధుల్లో జనాదరణ పొందిన మనో భావాల ద్వారా నడపబడుతున్న యుద్ధ స్వభావం పెరుగుతున్న కొద్దీ అది ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా, గల్ఫ్ దేశాలు, ప్రత్యేకించి, పాలస్తీనా ఉచ్చులోంచి బయటపడాలని కోరుకున్నప్ప టికీ అవి బలవంతంగా తిరిగి యుద్ధబాటలోకి వెళ్లవచ్చు కూడా.ఇజ్రాయెల్ ప్రభుత్వానికీ, ప్రజలకూ దీని అర్థం ఏమిటంటే పెరుగుతున్న అభద్రత, ప్రపంచ సానుభూతిని కోల్పోవడంతో పాటు కనికరం లేని విలన్లుగా ముద్ర వేయబడటమే. ఈ యుద్ధం నెతన్యా హుకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలను కప్పిపుచ్చడమే కాకుండా ఇజ్రాయెల్ ఉదారవాద, ప్రజాస్వామ్య విలువలను అణిచివేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు తమను తాము ప్రజలుగా ఊహించుకునే భవిష్యత్తు ఇదేనా? గాజా ప్రజలకు ఇజ్రాయెలీలు ఏమి చేస్తున్నారో అది ఇజ్రాయెల్ ప్రజలుగా వారిపై కూడా ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంలోని మనకు, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ’శ్వేత జాతీ యులు శ్వేతజాతీయులను చంపేస్తున్నారు’ అనేటటువంటి కేవల యూరోప్ సమస్యగా మాత్రమే విస్మరించడం సులభం. కానీ పశ్చి మాసియాలో యుద్ధం ప్రాథమికంగా భిన్నమైనది – అది ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఊహించని మార్గాల్లో మనపై ప్రభావం చూపుతుంది.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో భారత విదేశీ విధాన బోధకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో...) -
యుద్ధ భయాలు.. ఊరించే స్టాక్‌లు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆరి్థక వ్యవస్థలకు... చినికి చినికి ‘మిసైళ్ల’వానగా మారిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. తాజాగా ఇరాన్ కూడా రణరంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచ స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. క్రూడ్ ధరలు భగ్గుమనడం (10% పైగా జంప్) మనలాంటి వర్ధమాన దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలతో సెన్సెక్స్ 4,422 పాయింట్లు, నిఫ్టీ 1,383 పాయింట్లు, అంటే 5.3% చొప్పున పతనమయ్యాయి. గడిచిన రెండేళ్లలో వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలనేది విశ్లేషకుల మాట!! నాన్‌స్టాప్‌గా దౌడు తీస్తున్న బుల్‌కు పశి్చమాసియా యుద్ధ ప్రకంపనలు బ్రేకులేశాయి. రోజుకో కొత్త ఆల్‌టైమ్ రికార్డులతో చెలరేగిన దేశీ స్టాక్ మార్కెట్లో ఎట్టకేలకు కరెక్షన్ మొదలైంది. సూచీలు 5 శాతం పైగా క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.26 లక్షల కోట్లు ఆవిరైంది. టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటిదాకా మార్కెట్‌ను పరుగులు పెట్టించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో రివర్స్‌గేర్ వేశారు. మరోపక్క, చైనా ఉద్దీపక ప్యాకేజీ ప్రభావంతో మన మార్కెట్ నుంచి వైదొలగి అక్కడికి క్యూ కడుతున్నారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసే మదుపరులకు ఇది మంచి చాన్సని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే, ఇలాంటి ఉద్రిక్తతలు, యుద్ధాల సమయంలో మార్కెట్లు స్వల్పకాలానికి భారీగా పడటం లేదంటే దిద్దుబాటుకు లోనైనప్పటికీ... మళ్లీ కొద్ది వారాలు, నెలల్లోనే పుంజుకున్నాయని, భారీగా లాభాలను పంచాయని గణాంకాలతో సహా వారు ఉటంకిస్తున్నారు.క్వాలిటీ స్టాక్స్.. మంచి చాయిస్! స్వల్పకాలిక తీవ్ర ఒడిదుడుకుల ఆధారంగా ఇన్వెస్టర్లు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదని.. గతంలో మంచి పనితీరు కనబరిచి తక్కువ ధరల్లో (వేల్యుయేషన్లు) దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఎంచుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ పెట్టుబడులకు పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, మంచి డివిడెండ్ రాబడులను అందించే స్టాక్స్ కూడా ఈ పతనంలో కొనుగోలుకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్ అనేది వారి అభిప్రాయం. ఊరించే వేల్యుయేషన్లు... ‘పటిష్టమైన పోర్ట్‌ఫోలియోను నిరి్మంచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి’ అని రైట్ రీసెర్చ్ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ చెప్పారు. భారీ పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్) నిష్పత్తితో కూడిన అధిక వేల్యుయేషన్ స్టాక్స్.. ఈ కరెక్షన్లో మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో చేతిలో క్యాష్ పుష్కలంగా ఉన్న మదుపరులు... తక్కువ ధరల్లో ఇలాంటి ఊరించే షేర్లను కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు మార్కెట్ పరిశీలకులు.‘మార్కెట్లో ఈ కుదుపులు సద్దుమణిగి, పరుగులంకించుకున్నప్పుడు కొత్త పెట్టుబడులు భారీ లాభాలను అందించే అవకాశం ఉంటుంది’ అని వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వాప్నిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇటీవలి బుల్ రన్‌కు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు దన్నుగా నిలిచాయి, తాజా కరెక్షన్లో ఇవే భారీగా పతనమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక దృష్టితో లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను ఎంచుకోవడం తెలివైన ఆప్షన్ అనేది నిపుణుల సలహా!ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. తమ లాంగ్ పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ మరో 5 శాతం క్షీణించే అవకాశం ఉంది. – రాజేశ్ పలి్వయా, వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ సెక్యూరిటీస్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఆయన చర్చించారు. ప్రస్తుత ప్రపంచంలోనే ఉగ్రవాదానికి చోటులేదని తేల్చిచెప్పారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను నివారించడం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. అదే సమయంలో బందీలందరినీ సురక్షితంగా విడుదలయ్యేలా చూడాలన్నారు. పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని నెతన్యాహూకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. అయితే, ప్రత్యేకంగా ఏ సంఘటననూ ప్రధాని మోదీ ప్రస్తావించలేదు. -
ఐసిస్‌పై లక్ష మిసైళ్లు
ఐసిస్.. సిరియా, ఇరాక్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులు నిర్వహించి వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న రాక్షసమూక. పశ్చిమాసియా దేశాలైన సిరియా, ఇరాక్‌లో గణనీయమైన భూభాగాన్ని అక్రమించుకుని ఖలీఫత్ పేరిట 2014లో ఏకంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆయిల్, ఇతర సహజవనరుల్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఆ సొమ్ముతో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద భావజాలానికి మద్దతుగా నిలిచింది. మైనారిటీ మతస్తుల్ని బందీలుగా చేసుకుని గొంతు కోసి హతమార్చడం, తమ భావజాలాన్ని వ్యతిరేకించే సొంత మతస్తుల్ని సజీవ దహనం చేయడం వంటి దారుణ చర్యలతో వణుకు పుట్టించింది. అయితే ఇదంతా గతం. 2014లో ఐసిస్‌ను అణచివేసేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారీ ఎత్తున వైమానిక దాడులకు ఆదేశాలిచ్చారు. చివరికి 2017, అక్టోబర్‌లో ఐసిస్ ఉగ్రవాదులు నక్కిన చివరి నగరమైన రక్కాను సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకోవడంతో ఐసిస్‌ను ఓడించేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించారు. అయితే నిజంగానే ఐసిస్‌ను పూర్తిగా అణచేశారా? భవిష్యత్‌లో ఉగ్రదాడులు చేయడానికి వీల్లేకుండా దాన్ని ఆర్థికమూలాల్ని పూర్తిగా నాశనం చేశారా? అంటే జవాబు కాదనే వినిపిస్తోంది. ఈ విజయం తాత్కాలికమే: జమాత్–అల్–తావీద్–వల్–జీహాద్ (జేటీజే) పేరుతో 1999లో ఏర్పడ్డ ఈ సంస్థ.. క్రమక్రమంగా పశ్చిమాసియాలో పట్టు పెంచుకోవడం ప్రారంభించింది. లాడెన్ నేతృత్వంలోని అల్‌కాయిదాకు విధేయత ప్రకటించుకున్న జేటీజే.. 2003లో ఇరాక్‌పై–అమెరికా యుద్ధంలో పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా దాడులకు పాల్పడింది. 2014 నాటికి ఇరాక్, సిరియాల్లో గణనీయమైన భూభాగాన్ని స్వాధీనం చేసుకుని సంస్థ పేరును ఐసిస్‌గా మార్చుకుంది. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా సిరియా, ఇరాక్, ఫ్రాన్స్, బెల్జియం సహా 29 దేశాల్లో 140 ఉగ్రదాడులకు పాల్పడి వేలాది మందిని పొట్టనపెట్టుకుంది. కశ్మీర్‌లోనూ అల్లరిమూకలు ఐసిస్ జెండాలు ప్రదర్శించంపై భారత నిఘా సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ రక్షణ సంస్థ నివేదిక ప్రకారం సంకీర్ణ సేనలు ఐసిస్ అధీనంలోని 29,741 స్థావరాలపై ఇప్పటివరకూ 1,07,814 మిస్సైళ్లను, బాంబుల్ని ప్రయోగించాయి. ఈ దాడుల్లో 60,000 మంది ఉగ్రవాదులు, 6,321 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, మరోవైపు రష్యా, ఇరాన్, సాయంతో పోరాడుతున్న సిరియన్ బలగాలు ఐసిస్ కబంధ హస్తాల నుంచి చాలా పట్టణాలకు విముక్తి కల్పించాయి. అయితే ఈ విజయం తాత్కాలికమేననీ, ఇరుపక్షాల మధ్య దీర్ఘకాలిక పోరాటానికి ఇది ఆరంభమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకూ అఫ్గాన్‌లో 17 మంది అమెరికన్ కమాండర్లు మారినా పరిస్థితి మారకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. సోషల్ మీడియానే ఆయుధం: సంకీర్ణ సేనలు, రష్యా, ఇరాన్ బలగాల వరుస దాడులతో కుదేలయినప్పటికీ ఈ ప్రాంతంలో ఐసిస్ తన ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోలేదని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అమెరికా, యూరప్ దేశాలపై ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడాలని సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు ఉగ్రవాదులు విషాన్ని నూరిపోస్తున్నారని తెలిపారు. సరికొత్తగా గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అనుసరిస్తున్నారన్నారు. ఇందులోభాగంగా యుద్ధాలు, ప్రభుత్వ అసమర్ధత కారణంగా ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా ఉన్న యువతను భారీగా భర్తీ చేసుకుంటూ ఐసిస్, ఇతర ఉగ్రసంస్థలు శక్తిమంతంగా మారేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు. ఉగ్రమూకల్ని అణచివేయడంలో సైనిక చర్య ద్వారా తాత్కాలిక ఫలితాలను మాత్రమే సాధించగలమనీ, దీర్ఘకాలంలో పరిస్థితిలో ఎలాంటి మార్పు రాబోదన్నారు. ఈ దేశాల్లో సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కారానికి యత్నించినప్పుడు సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. ► సంకీర్ణ సేనలు లక్ష్యంగా చేసుకున్న ఐసిస్ స్థావరాలు 29,741 ► ఐసిస్‌పై ప్రయోగించిన మిస్సైళ్లు, బాంబులు 1,07,814 ► హతమైన ఉగ్రవాదులు 60,000 ► చనిపోయిన పౌరులు 6,321 ► ఐసిస్ పంజా విసిరిన దేశాలు 29 ► ప్రపంచవ్యాప్తంగా జరిపిన ఉగ్రదాడులు 140 ► ఐసిస్ వద్ద ఆధునిక మెషీన్గన్ల నుంచి రసాయన ఆయుధాల వరకు ► ఇటీవలే బల్గేరియా నుంచి ఓ శక్తివంతమైన మిసైల్‌ను కూడా ఐసిస్ సేకరించిందన్న అమెరికా -
పశ్చిమాసియా దేశాల పర్యటనకు ప్రధాన మోదీ