ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం
మూడు ప్రావిన్స్‌ల్లో తెల్లవారుజామునే భీకర దాడులు
100 ఫైటర్ జెట్లతో 20 లక్ష్యాలపై గురి
క్షిపణులు, డ్రోన్ల తయారీ కేంద్రాలు, సైనిక స్థావరాలపై దాడులు
నలుగురు సైనికులు మృతి చెందినట్లు ఇరాన్ వెల్లడి
తమకు పరిమిత నష్టమే వాటిల్లిందని స్పష్టీకరణ
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. ఊహించినట్లుగానే ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇలామ్, ఖుజిస్తాన్, టెహ్రాన్ ప్రావిన్స్‌ల్లోని సైనిక, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. మొత్తం 100 ఫైటర్ జెట్లతో మూడు దశల్లో 20 లక్ష్యాలపై కచి్చతత్వంతో కూడిన దాడులు నిర్వహించింది. ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ల తయారీ కేంద్రాలు, ప్రయోగ కేంద్రాలపై వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
అయితే, చమురు నిల్వలపై దాడులు జరిగాయా లేదా అనేది తెలియరాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు సమాచారం. తాజా దాడుల్లో ఇరాన్‌కు ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న సంగతి ఇజ్రాయెల్ బయటపెట్టలేదు. ఇరాన్‌పై దాడుల తర్వాత తమ యుద్ధవిమానాలు క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చాయని వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల తర్వాత ఇరాన్‌పై మరో దేశం నేరుగా దాడికి దిగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఆపరేషకు ఇజ్రాయెల్ ‘పశ్చాత్తాప దినాల మిషన్’ అని పేరుపెట్టింది.
రంగంలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు
ఇజ్రాయెల్ సైన్యం పక్కా ప్రణాళికతో ఇరాన్‌పై దాడికి దిగినట్లు సమాచారం. అత్యాధునిక ఫైటర్ జెట్లను సైన్యం రంగంలోకి దించింది. ఐదో తరం ఎఫ్–35 అడిర్ ఫైటర్ జెట్లు, ఎఫ్–15టీ గ్రౌండ్ అటాక్ జెట్లు, ఎఫ్–16ఐ సూఫా ఎయిర్ డిఫెన్స్ జెట్లు ఇందులో ఉన్నాయి. ఇవి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదింగలవు. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ సైనిక, ఆయుధ స్థావరాలపైనే గురిపెట్టింది. జనావాసాల జోలికి వెళ్లలేదు.
తొలుత రాడార్, ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలపై దాడికి పాల్పడింది. అనంతరం సైనిక స్థావరాలు, మిస్సైల్, డ్రోన్ల కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపించింది. మొత్తం మూడు దశల్లో దాడులు జరగ్గా, ఒక్కో దశ దాడిలో దాదాపు 30 చొప్పున యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. మరోవైపు ఇరాన్ నుంచి ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో ఇజ్రాయెల్, అమెరికా తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. విమానాల రాకపోకలకు వీల్లేకుండా ఇరాన్, ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేశాయి.
టెహ్రాన్‌లో సాధారణ పరిస్థితులే..
ఇజ్రాయెల్ దాడుల్లో తమకు పరిమిత నష్టమే వాటిల్లిందని, ఎదురుదాడిలో నలుగురు సైనికులు మృతి చెందారని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. దాడుల అనంతరం టెహ్రాన్‌లో సాధారణ పరిస్థితులే కనిపించాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లారు. దుకాణాలు ఎప్పటిలాగే తెరుచుకున్నాయి. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌పై దాడుల పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇజ్రాయెల్ చర్యను పలు దేశాలు ఖండించాయి. సంయమనం పాటించాలని సూచించాయి. అమెరికా వంటి మిత్రదేశాలు మాత్రం ఇజ్రాయెల్‌కు మద్దతు పలికాయి.
25 రోజుల తర్వాత ప్రతిదాడి
ఇరాన్‌పై దాడుల సందర్భంగా కొన్ని ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇందులో టెల్ అవీవ్ ఉన్న కిర్యా మిలటరీ బేసులోని మిలటరీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ సైనిక సలహాదారులతో, సైనికాధికారుతో చర్చిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్»ొల్లా, హమాస్ నాయకులు మరణించడం పట్ల ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోయింది.
ఈ నెల 1న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ భూభాగంపై దాదాపు 200 క్షిపణులు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, తాము తగిన జవాబు ఇవ్వక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అప్పుడే హెచ్చరించారు. ఇరాన్ దాడి చేసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని అప్పట్లో భావించినప్పటికీ ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో తమ ఆపరేషన్ వాయిదా వేసుకుంది. పరిస్థితులు సానుకూలంగా మారడంతో 25 రోజుల తర్వాత ఇరాన్‌పైకి యుద్ధ విమానాలు పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment