
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్‌లో సంభాషించారు. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఆయన చర్చించారు. ప్రస్తుత ప్రపంచంలోనే ఉగ్రవాదానికి చోటులేదని తేల్చిచెప్పారు.
ప్రాంతీయ ఉద్రిక్తతలను నివారించడం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. అదే సమయంలో బందీలందరినీ సురక్షితంగా విడుదలయ్యేలా చూడాలన్నారు. పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని నెతన్యాహూకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. అయితే, ప్రత్యేకంగా ఏ సంఘటననూ ప్రధాని మోదీ ప్రస్తావించలేదు.