వివాదాస్పద పాటతో ఇజ్రాయెల్‌ ప్రధానికి ఆహ్వానం! | Israel PM welcomed with Controversial Ghoomar Song | Sakshi
Sakshi News home page

వివాదాస్పద పాటతో ఇజ్రాయెల్‌ ప్రధానికి ఆహ్వానం!

Published Thu, Jan 18 2018 11:58 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

Israel PM welcomed with Controversial Ghoomar Song - Sakshi

అహ్మదాబాద్‌ : పద్మావత్‌ చిత్రంపై వివాదం కొనసాగిన వేళ.. గూమర్‌ పాటపై కూడా రాజ్‌పుత్‌ కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. రాణి పద్మిణి పాత్రతో గంతులేయించటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొన్నీ మధ్యే మధ్య ప్రదేశ్‌లో ఓ స్కూల్‌ కార్యక్రమంలో ఆ పాటపై పిల్లలు నృత్యాలు చేయగా.. రంగ ప్రవేశం చేసిన కర్ణిసేన.. కుర్చీలు విరిచేసి కార్యక్రమాన్ని రసాభాస చేసిపడేసింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర హోంశాఖా మంత్రి భూపేంద్ర సింగ్‌ ‘‘చిత్రాన్ని నిషేధించినప్పుడు.. అందులో పాటను ప్రదర్శించటం సరికాదంటూ’’ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అయితే అదే పాటను ఇప్పుడు గుజరాత్‌లో ఓ అధికారిక కార్యక్రమానికి వినియోగించటం విశేషం. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో ఇరు దేశాల సంయుక్త కళా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నెతన్యాహు-మోదీ రాక సందర్భంగా నిర్వాహకులు స్కూల్‌ చిన్నారులతో గూమర్‌ పాటకు నృత్యాలు చేయించారు . 

ఇరు దేశాల ప్రధానులిద్దరూ నడుచుకుంటూ వస్తుండగా.. ఈ పాటకు ఓ చిన్నారి ప్రదర్శన ఇవ్వటం విశేషం. స్థానిక బీజేపీ నేతలు దగ్గరుండి మరీ ఈ వేడుకలు నిర్వహించటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇదిలా ఉంటే పద్మావత్‌ను బ్యాన్‌ చేసిన రాష్ట్రాల్లో గుజరాత్‌ కూడా ఒకటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement