Padmaavat
-
నిజమేనా?
ఈ ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ‘పద్మావత్’ సినిమా నటీనటుల ఎంపిక జరుగుతున్న రోజులవి. ఆల్రెడీ ‘పద్మావత్’ సినిమాలో రాణి పద్మావతి పాత్రకు దీపికా పదుకోన్‌ని ఎంపిక చేశారు. ఖిల్జీ పాత్రకు రణ్‌వీర్‌సింగ్‌ని అనుకుంటున్నారు. పద్మావతి భర్త రాజా రతన్ సింగ్ రావల్ పాత్రకు ఎవరైతే బాగుంటుందా అని చిత్రదర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఆలోచిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ‘‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలోని మహేంద్ర బాహుబలి... అదే మన ప్రభాస్ గుర్తొచ్చారట. వెంటనే.. ఆయన ప్రభాస్‌కు ‘పద్మావత్’ కథ చెప్పారట. ఆ సమయానికి ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా రిలీజై మంచి ఊపు మీద ఉన్న ప్రభాస్ రతన్ సింగ్ పాత్రకు ‘నో’ చెప్పేశారట. ‘‘బాహుబలి ఫస్ట్ పార్ట్‌తో మంచి పాపులారిటీ వచ్చింది. ‘పద్మావత్’ సినిమాలో రతన్ సింగ్‌ది హీరో పాత్ర కాదు. ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. ఇంకా ‘బాహుబలి–2’ రిలీజ్ కావాల్సి ఉంది. ఒకవేళ ఈ పాత్ర చేసి, బాక్సాఫీస్ వద్ద ‘పద్మావత్’ సక్సెస్ కాకపోతే ఆ ఎఫెక్ట్ ‘బాహుబలి –2’ మీద పడే అవకాశం ఉంది. ఐదేళ్ల కష్టం వృ«థా అవుతుంది’’... ఇలా ఆలోచించి ‘పద్మావత్’కి ప్రభాస్ నహీ అన్నారని బాలీవుడ్లో ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. యంగ్ రెబల్‌స్టార్ వద్దనడంతో ఆ పాత్ర షాహిద్ కపూర్‌కు వెళ్లింది. మరి... ఈ కథనాల్లో ఎంత వరకు వాస్తవం ఉందన్నది ‘పద్మావత్’ టీమ్ అయినా చెప్పాలి లేదా ప్రభాస్ అయినా చెప్పాలి. -
‘కాలా’పై కన్నెర్ర!
కుల, మత సంస్థలు, ఇతర బృందాలు చలనచిత్రాల జోలికి రాకూడదని న్యాయస్థానాలు పదే పదే హితవు చెబుతున్నాయి. చలనచిత్రాల మంచి చెడ్డలు నిర్ణయించడానికి సెన్సార్ బోర్డు ఉన్నదని, దాని నిర్ణయాలను ప్రశ్నించేందుకు ఇతరత్రా వేదికలు కూడా అందుబాటులో ఉన్నా యని గుర్తు చేస్తున్నాయి. అయినా చిత్రం పేరు మార్చాలని, ఫలానా సన్నివేశం తొలగించాలని, పాటల్లో ఫలానా పదాలు తీసేయాలని, లేదంటే చిత్రం విడుదలను అడ్డుకుంటామని బెది రింపులకు దిగే బృందాలు తామరతంపరగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం విడుదల కావలసిన రజనీకాంత్ చిత్రం ‘కాలా’ అలాంటివారి బారిన పడింది. ఆశ్చర్యమేమంటే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో చిత్రం విడుదలను వాయిదా వేసుకోమని సలహా ఇస్తున్నారు. కర్ణాటకలో ఆ చిత్రం విడుదలను అడ్డుకుం టామని కన్నడ సంఘాలు కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నాయి. కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశించినట్టు కావేరీ నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని రజనీ కాంత్ డిమాండ్ చేయడం ఆ సంఘాలకు నచ్చలేదు. కన్నడ సంఘాలు మాత్రమే కాదు... తమిళనాడులోని కొన్ని ఇతర సంఘాలు కూడా ‘కాలా’కు సమస్యలు సృష్టించా లని చూస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసేయాలని డిమాండ్ చేస్తూ సాగిన ఉద్యమంపై ఉక్కుపాదం మోపి పలువురిని కాల్చి చంపిన ఉదంతంపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆ సంఘాలకు అభ్యంతరకరం అనిపించాయి. పోలీసులపై కొన్ని అసాంఘిక శక్తులు దౌర్జన్యానికి దిగడం వల్లే వారు కాల్పులు జరపాల్సివచ్చిందన్నది రజనీ వ్యాఖ్యల సారాంశం. తూత్తుకుడి కాల్పుల దృశ్యాలను చూసిన వారెవరూ అలా మాట్లాడరు. పోలీసులు ఉద్యమ కారులను గురిచూసి కాల్చిచంపిన దృశ్యాలు బయటికొచ్చాక కూడా రజనీ అలా మాట్లాడి ఉండా ల్సింది కాదు. అసాంఘిక శక్తులపై పోలీసులు చర్యలు తీసుకుంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. కానీ ఆ క్రమంలో పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇష్టానుసారం ప్రవర్తిస్తే అంగీకరించరు. ఈ విషయంలో రజనీకాంత్‌తో విభేదించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ సాకుతో చిత్రానికి అడ్డంకులు కల్పించడం సరికాదు. ఆమధ్య హిందీ చిత్రం ‘పద్మావత్’పై కూడా ఇలాంటి వివాదాలే ముసురుకున్నాయి. ఆ చిత్రంలో పద్మావతిని కించపరిచేలా చూపుతున్నారని అనుమానించి రాజ్పుట్ సంఘాలు షూటింగ్ మొదలైనప్పటినుంచే దాడులు మొదలుపెట్టాయి. చివరకు చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తలలు తెచ్చినవారికి రూ. 5 కోట్లు బహుమాన మిస్తామని కూడా ప్రకటించాయి. తీరా విడుదలయ్యాక చూస్తే ఆ చిత్రంలో ఎలాంటి అభ్యం తరకమైన అంశాలూ లేవు. రెండు నెలలక్రితం పంజాబీ చిత్రం ‘గురునానక్ దేవ్’ను కూడా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ), అకల్ తఖ్త్లు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. మూడేళ్లక్రితం ఈ చిత్రం విడుదలైనప్పుడు ఎస్జీపీసీ అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, కొన్ని సిక్కు గ్రూపులు ఆందోళనకు దిగడంతో తన అభిప్రాయాన్ని మార్చుకుంది. అప్పట్లో చిత్ర నిర్మాతలు ఒక్క పంజాబ్‌లో మినహా మిగిలినచోట్ల విడుదల చేశారు. కానీ కొద్దిరోజులకే నిలిపివేశారు. ఇప్పుడు తిరిగి విడుదల చేద్దామనుకుంటున్న తరుణంలో ఎస్జీపీసీ అభ్యంతరపెట్టింది. అసలు చిత్రంలో గురునానక్ పాత్రే ఉండరాదని, అలా చూపితే ఆయనకు అపచారం చేసినట్టేనని దాని వాదన. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో అదంతా సద్దుమణిగింది. కానీ ఇకపై సిక్కు సంప్ర దాయానికి సంబంధించి తీసే చిత్రాలకు తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరని ఈమధ్య ఎస్జీపీసీ ప్రకటించింది. అందుకోసం 21మంది సభ్యులతో సిక్కు సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. సెన్సార్‌బోర్డుకు సిక్కు సంప్రదాయాలపై అవగాహన ఉండదు కనుక తామే అందుకోసం దీన్ని ఏర్పాటు చేశామంటున్నది. యువతపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని చర్చించిన ‘ఉడ్తా పంజాబ్’ చిత్రంపైనా 2016లో వివాదం చెలరేగింది. సెన్సార్ బోర్డు 89 కత్తిరింపులు ప్రతిపాదించగా చిత్ర నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి చిత్రం విడుదల చేసుకోవాల్సి వచ్చింది. మన దేశంలో ఒక్క సినిమాలపై మాత్రమే కాదు... వివిధ కళారూపాల గొంతు నొక్కడానికి ఏదో ఒక రూపంలో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. విఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన పెయింటింగ్‌లపై హిందూత్వ సంస్థలు విరుచుకుపడ్డాయి. అనేకచోట్ల కేసులు నమో దుకావడం, బెదిరింపులు రావడం వగైరాలతో విసిగి ఆయన 2006లో భారత్ వదిలి వెళ్లి పోయారు. 2011లో మరణించేనాటికి ఆయన దోహాలో ఉన్నారు. తమిళనాడులో రచయిత పెరు మాళ్ మురుగన్ రాసిన నవలపై కూడా పెద్ద వివాదం తలెత్తింది. ఆయనను అనేకవిధాల వేధిం చారు. కుల, మత సంఘాలు ఆయనపై ఎన్నో కేసులు పెట్టాయి. చివరకు మూడేళ్లక్రితం ఆ రచయిత సృజనాత్మకతపై ఆంక్షలు విధించడానికి వీల్లేదని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. రచయితల, కళాకారుల భావ వ్యక్తీకరణను అడ్డుకునేందుకు, వారి భావాలు ప్రజలకు చేరకుండా నిరోధించేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు బృందాలు అనేక విధాల ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై నిర్మించిన డాక్యుమెంటరీ విడుదలను ఆపాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేస్తూ నిరుడు సుప్రీంకోర్టు విలువైన తీర్పును వెలువరించింది. చట్ట పరిధిలో ఏ కళాకారుడైనా తనకు నచ్చిన రూపంలో భావాలు వ్యక్తం చేయొచ్చునని, అందులో జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వాలకుగానీ, ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకుగానీ లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో ఉదారంగా స్టేలు మంజూరు చేయొద్దని కింది కోర్టులకు సూచించింది. సుప్రీంకోర్టు పదే పదే ఇంత వివరంగా చెప్పినా సమస్యలు తలెత్తడం, అధికారంలో ఉన్నవారు వంతపాడటం విచారకరం. ఇలాంటి ధోరణులను నివారించకపోతే ప్రజాస్వామ్య భావనే ప్రమాదంలో పడుతుంది. -
పద్మావత్ తర్వాత దీపికకు ఏమైంది..!
సాక్షి, ముంబై: వివాదస్పద మూవీ పద్మావత్ తర్వాత బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. అయితే అందుకు కారణాలివే అంటూ కొన్ని వదంతులు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. పద్మావత్ మూవీ రణ్వీర్ సింగ్‌కు ఎంత పేరు తెచ్చిందో దీపికకు అంతకంటే ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఈ మూవీ తర్వాత కొందరు డైరెక్టర్లు తమ స్టోరీ లైన్ వినిపించేందుకు వెళ్లగా హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుందని ఆమె తెలుసుకుంటున్నారట. గతంలో తాను చేసిన మూవీల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉన్న స్టోరీలు కాకపోవడంతో ఏ ప్రాజెక్టుకు ఆమె ఓకే చెప్పడం లేదని ప్రచారం జరుగుతోంది. కాగా, హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ పొడుగుకాళ్ల సుందరి.. తర్వాతి ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. హీరోలతో పోటీపడి నటించి మెప్పించే క్యారెక్టర్ ఉన్న స్టోరీలు తన వద్దకు వస్తే కచ్చితంగా చేస్తానని దీపిక గతంలో చాలాసార్లు పేర్కొన్నారు. కాగా, అనారోగ్య కారణాల వల్లే మూవీలకు కాస్త గ్యాప్ ఇచ్చారని దీపిక సన్నిహిత వర్గాల సమాచారం. ఏది ఏమైతేనేం పద్మావత్ తర్వాత ఆమె తాజా ప్రాజెక్టులపై అప్డేట్స్ అంతగా లేవు. దీపికను తెరపై మళ్లీ ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘బాజీరావ్ మస్తానీ, పద్మావత్’ వంటి చారిత్రక సినిమాల్లో తన నటనతో మెప్పించిన దీపికకు ‘మహాభారతం’ సినిమాలో ద్రౌపది పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్‌గా సరిపోతారని ఆమిర్ చెప్పిన విషయం తెలిసిందే. -
పద్మావత్ 300కోట్లు వసూలు చేసినా...
సాక్షి, హైదరాబాద్ : అనేక వివాదాలు ఎదుర్కొన్న ‘పద్మావత్’ సినిమా ఎట్టకేలకు రూ. 300 కోట్ల క్లబ్లో చోటు సంపాదించుకుంది. ఈ సినిమా వసూళ్లను ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తాజాగా ట్విట్టర్లో వెల్లడించారు. పద్మావత్ వసూళ్లతో బాలీవుడ్ చిత్ర సీమలో ఖాన్ల ఆధిపత్యం మరోసారి స్పష్టంగా నిరూపితమైంది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికి రూ.500 కోట్లు సాధించలేకపోయింది. ఇప్పటివరకూ రూ.500 కోట్ల వసూళ్లు చేసిన సినిమా హీరోలుగా ఆమీర్, సల్మాన్‌లు ముందున్నారు. వీరిని పక్కకునెట్టి పద్మావత్ ముందుకు దూసుకు వెళ్తుందనుకున్న అంచనాలు తారుమారయ్యాయి. సినిమా రిలీజై ఏడు వారాలు కావస్తున్నా రూ.300 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించగలిగింది. వివాదాస్పద సినిమాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదుకునే లీడ్‌రోల్ చేశారు. భారీ తారాగణంతో తెరకెక్కిన పద్మావత్ అప్పట్లో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. జనవరి 25న భారీ అంచనాలు, వివాదాల నడుమ సినిమా రిలీజైనప్పటికీ బాలీవుడ్ ఖాన్లకు పోటీగా రాలేకపోయింది. మొదటివారంలో భారీగా వసూలు చేసి ఖాన్లకు గట్టి పోటీ ఇస్తుందనుకుంటే తర్వాతి కొద్ది రోజులకు అంచనాలను తలకిందులు చేస్తూ వసూళ్లు తగ్గుకుంటూ వచ్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి వచ్చిన సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’ భారీ వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలు ఆరు ఉంటే అందులో 5 సినిమాలు ఆమీర్, సల్మాన్లవే. ఇందులో పీకే, భజరంగీ భాయిజాన్, సుల్తాన్, దంగల్, టైగర్ జిందా హై, బాహుబలిలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విశేషమేంటంటే ఈ సినిమాల లిస్ట్‌లో తెలుగు సినిమా బాహుబలి కూడా ఉండటం, ఈ సినిమా ఒక్క హిందీ వెర్షన్లోనే రూ. 500 కోట్లు వసూలు చేసింది. -
ఖిల్జీని చూస్తే అతనే గుర్తుకొచ్చాడు: నటి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఎంపీ, ప్రముఖ నటి జయప్రద కొంతకాలం కిందటివరకు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంపూర్ నియోజకవర్గం నుంచి ఆమె రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న సమయంలో సొంత పార్టీ ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో తన పట్ల దుష్ప్రచారం చేస్తున్నారని కూడా అప్పట్లో ఆరోపించారు. తాజాగా ‘పద్మావత్’ సినిమా చూస్తే ఆనాటి జ్ఞాపకాలు ఆమెను వెంటాడినట్టు ఉన్నాయి. అందుకే ‘పద్మావత్’ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు ఆజంఖాన్ గుర్తుకువచ్చాడని, ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నప్పుడు అతను తనను ఎంతోగానే వేధించాడని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆజంఖాన్‌ను ఖిల్జీతో పోల్చారు. -
పెళ్లి ఏర్పాట్లలో దీపికా, రణవీర్..!
బాలీవుడ్ హాట్ కపుల్ దీపిక పదుకొనే, రణవీర్ సింగ్‌ల జోడిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నా.. ఈ జంట మాత్రం ఇంతవరకు తమ బంధంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వీరి ప్రైవేట్ పార్టీస్‌కు సంబంధించిన ఫొటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా సార్లు వీరి వివాహానికి సంబంధించిన వార్తలు మీడియా లో వినిపించాయి. తాజాగా మరోసారి ఈ జంట త్వరలోనే ఒక్కటవ్వబోతుందన్న వార్త తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జోడి ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వాలని భావిస్తున్నారట. అది కూడా అత్యంత సన్నిహితుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు పెళ్లి తరువాత రెండు భారీ రిసెప్షన్లను కూడా ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ తారలు, వ్యాపార దిగ్గజాల కోసం ముంబైలో, తరువాత దీపిక పదుకొనే కుటుంబ సభ్యుల కోసం బెంగళూరులో రెండు రిసెప్షన్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై దీపికా, రణవీర్‌లు ఇంత వరకు అధికారంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా ఈ జోడి సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ సినిమాలో కలిసి నటించారు. ఎన్నో అవాంతరాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించటమే కాదు ఇప్పటికీ భారీ వసూళ్లను సాధిస్తూ సత్తా చాటుతోంది. -
రెండు వారాల్లో రూ. 200 కోట్లు క్రాస్
సాక్షి, సినిమా : వివాదాల నడుమ విడుదలైన ‘పద్మావత్’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీతో విజయవంతంగా దూసుకుపోతోంది. సినిమా విడుదలై మూడో వారంలోకి అడుగు పెట్టినా.. కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే ఈ సినిమా 200 కోట్లు దాటిపోయింది. ‘పద్మావత్’ సినిమా ఇప్పటివరకు రూ. 212.5 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మొదటి వారంలో రూ. 166.50 కోట్లు, రెండో వారంలో రూ. 46 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.212.50 కోట్లు వసూలు చేసిందని పోస్ట్ చేశారు. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. #Padmaavat biz at a glance... Week 1: ₹ 166.50 cr Weekend 2: ₹ 46 cr Total: ₹ 212.50 cr India biz. SUPER-HIT. — taran adarsh (@taran_adarsh) 5 February 2018 -
కర్ణిసేన యూటర్న్పైనే మరో యూటర్న్..!
సాక్షి, ముంబై : పద్మావత్ చిత్రానికి రాజ్‌పుత్‌ల ఆధ్వర్యంలోని కర్ణిసేన మరో ఝలక్ ఇచ్చింది. పద్మావత్ సినిమాపై ఆందోళనలు విరమించుకునే ప్రసక్తే లేదని తెలిపింది. ఈ సినిమా రాజ్‌పుత్‌ల ధైర్యసాహసాలను చాటేలే, వారి గౌరవాన్ని ఇనుమడించేలా ఉందని పేర్కొంటూ.. ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలను విరమించుకుంటున్నట్లు కర్ణిసేన పేరుతో ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణిసేన తాజాగా వివరణ ఇచ్చింది. పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు విరమించుకోలేదని, సినిమాపై తమ నిరసన యథాతథంగా కొనసాగుతోందని తాజాగా కర్ణిసేన జాతీయ నాయకులు లోకేంద్ర సింగ్ కల్వీ, సుఖ్‌దేవ్ సింగ్ గొగమేడి తెలిపారు. కర్ణిసేన ముంబై చీఫ్ యోగేంద్ర సింగ్ కటార్‌తోపాటు ముంబై విభాగపు బాధ్యులు పద్మావత్ సినిమాపై తమ ఆందోళనలు విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, దేశవ్యాప్తంగా సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన కల్వీ, గొగమేడి మాత్రం ఈ ప్రకటనను ఖండించారు. శ్రీరాజ్‌పుత్ కర్ణిసేనకు కల్వీ జాతీయస్థాయిలో నాయకత్వం వహిస్తుండగా.. రాజ్‌పుత్‌లకు సంబంధించిన మరో జాతీయ సంఘమైన శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేనకు గోగమేడి జాతీయాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు అనుకూలంగా ప్రకటన ఇచ్చినందుకు యోగేంద్రతోపాటు.. ఆ ప్రకటనలో సంతకాలు చేసిన ఇతరులను సైతం తమ సంఘం నుంచి బహిష్కరించినట్టు గోగమేడి తెలిపారు. పద్మావత్ సినిమాపై తమ అభ్యంతరాలు పరిష్కారం కాలేదని, తాము ఆందోళన విరమించుకున్నట్టు సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న కథనాలు నిజం కాదని వివరించారు. కాగా, 'పద్మావత్ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఏం లేవు. ఇందులో రాజ్‌పుత్‌ల గురించి చాలా గొప్పగా చూపించారు. పద్మావత్ చూశాక ప్రతీ రాజ్‌పుత్ కూడా గర్వపడతారు' అని గోగమేడి నాయకత్వంలోని కర్ణిసేనకు ముంబై చీఫ్‌గా ఉన్న యోగేంద్ర తెలిపారు. కర్ణిసేన జాతీయాధ్యక్షుడు గోగమేడి ఆదేశాలను అనుసరించి ప్రకటన విడుదల చేసినట్టు ఆయన ఇంతకుముందు మీడియాతో తెలిపారు. చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచే అభ్యంతరాలు లేవనెత్తుతూ విడుదలను అడ్డుకునేందుకు కర్ణిసేన శతవిధాల ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆందోళనలు, ధర్నాలు, దాడులు, నిరసనలు, భన్సాలీ-దీపిక తలలపై నజరానాల ప్రకటనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాల(బీజేపీ పాలిత) నిషేధం... ఇలా ఏవీ కూడా పద్మావత్ విడుదలను అడ్డుకోలేకపోయాయి. చివరకు న్యాయస్థానాలు కూడా పద్మావత్ విడుదలకు క్లియరెన్స్ ఇవ్వటంతో కర్ణిసేన కూడా కాస్త వెనక్కి తగ్గింది. -
కర్ణిసేన యూటర్న్.. ‘పద్మావత్ ఓ అద్భుతం’
సాక్షి, ముంబై : పద్మావత్ చిత్రంపై శ్రీరాజ్‌పుత్ కర్ణి సేన ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఈ చిత్రంపై ఆందోళనలను విరమించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో పద్మావత్ అమోఘం అంటూ విపరీతమైన పొగడ్తలు గుప్పించింది. శుక్రవారం ముంబైలో పలువురు కర్ణిసేన నేతలు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం కర్ణిసేన ముంబై చీఫ్ యోగంద్ర సింగ్ కటార్ మీడియాతో మాట్లాడారు. ‘‘చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఏం లేవు. ఇందులో రాజ్‌పుత్‌ల గురించి చాలా గొప్పగా చూపించారు. పద్మావత్ చూశాక ప్రతీ రాజ్‌పుత్ కూడా గర్వపడతారు’’ అంటూ కటార్ తెలియజేశారు. ఇక కర్ణిసేన జాతీయాధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామడి ఆదేశాలను అనుసరించి కర్ణిసేన ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ‘‘సినిమాలో రాణి పద్మినీ, ఖిల్జీ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు కూడా లేవు. రాజ్‌పుత్‌ల మనోభావాలు చిత్రం దెబ్బతీయలేదు. పైగా చాలా గొప్పగా చూపించారు. అందుకే ఆందోళనలు విరమిస్తున్నాం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతోపాటు మిగతా చోట్ల కూడా చిత్రం ఆడేందుకు దోహదం చేస్తాం’’ అని పేర్కొంది. కాగా, చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచే అభ్యంతరాలు లేవనెత్తుతూ విడుదలను అడ్డుకునేందుకు కర్ణిసేన శతవిధాల ప్రయత్నించింది. ఆందోళనలు, ధర్నాలు, దాడులు, నిరసనలు, భన్సాలీ-దీపిక తలలపై నజరానాల ప్రకటనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాల(బీజేపీ పాలిత) నిషేధం... ఇలా ఏవీ కూడా చిత్ర విడుదలను అడ్డుకోలేకపోయాయి. చివరకు న్యాయస్థానాలు కూడా పద్మావత్ విడుదలకు క్లియరెన్స్ ఇవ్వటంతో కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడు సినిమాలో అలాంటి అంశాలేవీ లేవని నిర్ధారణ కావటంతో యూటర్న్ తీసుకుని మద్ధతు ప్రకటించింది. -
ప్లీజ్ దీపిక.. ఒక్కసారి ఇది చూడు
సాక్షి, సినిమా : వివాదాలు, ఆందోళనలు పద్మావత్‌ను అడ్డుకోలేకపోయాయి. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీతో విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలోని ఘూమర్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. అప్పట్లో అంతే వివాదాస్పదం కూడా అయ్యింది. కర్ణిసేన పాటపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో సెన్సార్ ప్యానెల్ సూచనల మేరకు దీపిక నడుమును కవర్ చేస్తూ మరో వర్షన్ పాటను మేకర్లు విడుదల చేశారు. ఇక ఇప్పుడు చిత్రం విడులయ్యాక ఘూమర్ పాట దుమ్మురేపుతోంది. స్కేటింగ్ ఛాంపియన్ ‘మయూరి భండారి’ ఘూమర్ పాటకు ప్రదర్శన ఇచ్చారు. మంచు కోర్టులో ఆమె చేసిన ప్రదర్శనకు అద్భుతమంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ‘‘నా ఈ ప్రదర్శన పద్మావత్ చిత్రానికి అంకితం. ఒక రాజస్థానీగా గర్వంతో ఈ పాటపై ప్రదర్శన ఇచ్చాను’’ అని ఆమె పేర్కొన్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతుండగా.. దీపికను ఒక్కసారి ఆ వీడియోను తిలకించమంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ఎన్బీఏ మ్యాచ్ సందర్భగా అపర్ణ యాదవ్ ఈ పాటపై ఇచ్చిన ప్రదర్శన విదేశాల్లో ఈ పాట క్రేజ్‌ను ప్రపంచం మొత్తం విస్తరింపజేసింది. ఈ ఏడాది ఛార్ట్బస్టర్లో నిలిచిన ఘూమర్ పాట.. యూట్యూబ్‌లోనూ దూసుకుపోతోంది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. -
ప్లీజ్ దీపిక.. ఒక్కసారి ఇది చూడు
-
‘పద్మావత్’ విజయంపై కర్ణిసేన కామెంట్
జైపూర్: వివాదాల నడుమ విడుదలైన ‘పద్మావత్’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కర్ణిసేన ‘పద్మావత్’ బాక్సాఫీస్ వసూళ్లపై కర్ణిసేన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఇది భారతదేశం. ఇక్కడ సన్నిలియోన్(మాజీ పోర్న్ స్టార్)కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నార’ని కర్ణిసేన ప్రతినిధి విజేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘పద్మావత్’కు సానుకూల రివ్యూలు వచ్చాయని, మంచి కలెక్షన్లు సాధిస్తోందని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆయన ఈవిధంగా స్పందించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ఈ సినిమాను కర్ణిసేన వ్యతిరేకిస్తూనే ఉంది. ముమ్మాటికీ ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని పునరుద్ఘాటించారు. ‘ఈ సినిమాలో చూపించినట్టుగా గర్భవతిగా ఉన్న మహిళ జౌహర్ లేదా ఆత్మాహుతికి పాల్పడదు. చిత్తోర్‌గఢ్ కోటపై ఖిల్జీ 55 ఏళ్ల వయసులో దండెత్తాడు. కానీ ఈ సినిమాలో అతడు 25 ఏళ్ల వయసులో దాడి చేసినట్టు చూపించారు. అలాగే చిత్తోర్‌గఢ్ కోట ద్వారాన్ని ఖిల్జీ పగలగొట్టకపోయినా, పగలగొట్టినట్టు తెరకెక్కించారు. చరిత్ర ప్రకారం చూస్తే కోట ద్వారాన్ని పెకలించి తనతో పాటు ఢిల్లీకి ఖిల్జీ తీసుకుపోయినట్టు ఉంది. 400 ఏళ్ల తర్వాత భతర్పూర్ రాజు ఈ ద్వారాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రతిష్టించారు. కానీ సినిమాలో చిత్తోర్‌గఢ్ కోట ద్వారాన్ని ఖిల్జీ పగలకొట్టుకుని లోపలికి ప్రదేశించినట్టుగా చిత్రీకరించారు. ఇలాంటి వక్రీకరణలు చాలా ఉన్నాయ’ని విజేంద్ర సింగ్ వివరించారు. జనవరి 25న విడుదలైన ‘పద్మావత్’ సినిమా ఇప్పటివరకు రూ. 150 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ విశ్లేషకుల అంచనా. -
పద్మావత్‌తో అసలేం చెప్పదల్చుకున్నావ్?
సాక్షి, సినిమా : బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై విలక్షణ నటి స్వర భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్మావత్ చిత్రం ద్వారా ప్రజలకు అసలేం సందేశం ఇవ్వదల్చుకున్నావంటూ భన్సాలీని ఆమె ఏకీపడేశారు. ఈ మేరకు ఆమె రాసిన ఓ బహిరంగ లేఖను ది వైర్ శనివారం ప్రచురించింది. ‘‘అత్యాచార బాధితులు, వితంతువులు, చిన్న, పెద్దా, ముసలి, గర్భవతి... ఇలా మహిళలకు ఈ సమాజంలో బతికే హక్కు ఉంటుంది. మరి అలాంటప్పుడు పద్మావత్ ద్వారా మీరు సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చారు?. చిత్రం చివరలో దీపిక చేసిన పద్మావతి పాత్ర అగ్ని ప్రవేశం చేసి ఆత్మాహుతి చేసుకుంటుందని చూపించారు. అయ్యా భన్సాలీగారు... ఇది 13వ శతాబ్దం కాదు.. 21వ శతాబ్ధం. మహిళలకు మాన-ప్రాణాల మీద అవగాహన,ఆత్మాభిమానం, గౌరవ మర్యాదలు ఉన్నాయి. వారిలో రాను రాను మనోధైర్యం కూడా చాలా పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో పద్మావత్ ద్వారా మీరు అసలు ఏం చెప్పదల్చుకున్నారు?. సతీ సహగమనం, జౌహర్(ఓడిపోయిన రాజుల కుమార్తెలు, భార్యలు, బంధువర్గంలోని స్త్రీలు సామూహికంగా, స్వచ్ఛందంగా అగ్నిలోకి దూకి మరణించటాన్ని జౌహర్ అంటారు) వంటి దురాచారాలకు ఏనాడో కాలం చెల్లిపోయింది. మరి గ్రాండియర్ పేరిట పద్మావత్‌తో ఎలాంటి సందేశం ఇచ్చారో మీ ఆత్మ సాక్షిని ఓ సారి ప్రశ్నించుకోండి?’’ అంటూ స్వర భాస్కర్ 8 పేరాల లేఖలో భన్సాలీకి ప్రశ్నల వర్షంతో చురకలు అంటించారు. అయితే భన్సాలీ మాత్రం ఆమె విమర్శలపై స్పందించేందుకు నిరాకరించారు. గతంలో కూడా స్వర భాస్కర్ భన్సాలీ చిత్రాలపై తరచూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తను వెడ్స్ మను, రాంఝ్నా, తను వెడ్స్ మను రిటర్న్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి కమర్షియల్ చిత్రాలతోపాటు నీల్ బటే సన్నాటా, అనార్కలీ ఆఫ్ ఆరా వంటి ప్రయోగాత్మక చిత్రాలతో స్వర భాస్కర్ మంచి గుర్తింపు పొందారు. -
కర్ణిసేన అంత పవర్ ఫుల్లా?
షాహిద్ కపూర్, రణ్ బీర్ సింగ్, దీపికా పదుకొనే నటించిన సినిమా పద్మావత్ ఎంత వివాదాస్పదమైందో, దాన్ని నిషేధించాలని కోరిన కర్ణిసేన అంతకంటే ఎక్కువ పాపులర్ అయింది. శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన అన్నది ఇప్పటికిప్పుడు ఏర్పడిన సంస్థ కాదు. దానికి చాలా చరిత్రే ఉంది. సరిగ్గా సంవత్సరం క్రితం జనవరి 27న జైపూర్‌లో పద్మావతి షూటింగ్ సందర్భంగా చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై దాడికి దిగి బీభత్సం సృష్టించింది ఈ కర్ణిసేనే. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కడమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ శక్తిమంతమైన సంస్థగా ఎదిగింది కర్ణిసేన. పద్మావత్ సినిమా వివాదం పుణ్యమా అని ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండే వివిధ రాజపుత్ర సంఘాలన్నింటినీ ఇప్పుడు కర్ణిసేన అనడం పరిపాటైంది. వీటిన్నింటిలోనూ అతి పాతది శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన. దీన్ని 2006లో స్థాపించారు. రాజకీయాల్లో విజయం సాధించలేకపోయిన లోకేంద్ర సింగ్ కాల్వి, బిల్డర్ అజిత్ సింగ్ మామ్డోలి ఈ సంస్థను స్థాపించింది తామేనని చెప్పుకుంటారు. సంస్థను ఏర్పాటు చేసిన కొన్ని నెలల తర్వాత తాను కాల్విని చేరాలని కోరానని అజిత్ సింగ్ చెప్తారు. కాని తాను కూడా సహ వ్యవస్థాపకుడినని కాల్వి వాదిస్తుంటారు. 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరు విడిపోయారు. ఇప్పటికీ ఇద్దరూ శ్రీరాజ్ పుత్ కర్ణిసేన పేరుతో సమాంతర సంస్థలను నడుపుతున్నారు. పేరు విషయంలో ఇద్దరి మధ్య కోర్టు కేసు కూడా నడుస్తోంది. ఈ సంస్థలో 7.64 లక్షల మంది సభ్యులున్నారని కాల్వి అంటారు. అజిత్ సింగ్ మాత్రం తమ సభ్యుల సంఖ్య 2.62 లక్షలని చెప్తారు. ఇంతకీ లోకేంద్ర సింగ్ కాల్వి ఎవరు? పద్మావత్ సినిమాపై నిరసనలు మిన్నంటిన వేళ టీవీల్లో ఎక్కువ కనిపిస్తున్న వ్యక్తి లోకేంద్ర సింగ్ కాల్వి. ఆరడుగుల అజానుబాహుడైన ఆయన సినిమాను నిషేధించాలని కోరుతూ రాజ్‌పుత్‌లను ఏకం చేసేందుకు గడిచిన కొన్ని నెలలుగా ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా కార్యాలయమంటూ ఏమి లేదు. జైపూర్‌లోని ఆయన ఇల్లు లేదా మరో రాజ్‌పుత్ సంఘం శ్రీ రాజ్ పుత్ సభా కార్యాలయం నుంచి ఆయన తన కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ మంత్రివర్గంలో పనిచేసిన కళ్యాణ్ సింగ్ కాల్వి కుమారుడు లోకేంద్ర సింగ్. 1993 లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా, 1998 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి రెండుసార్లు కూడా లోకేంద్ర సింగ్ ఓటమిపాలయ్యారు. 1999లో బీజేపీని వీడి, మరో బీజేపీ మాజీ నేత దేవీ సింగ్ భాటీతో కలిసి రాజ్‌పుత్‌లు సహ అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సోషల్ జస్టిస్ ఫ్రంట్ అనే సంస్థను స్థాపించి ఉద్యమం నిర్వహించారు. అంతే కాదు దాన్ని విస్తృతపరిచి రాజస్థాన్ సామాజిక్ న్యాయ్ మంచ్ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి 2003లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 65 మంది అభ్యర్థులను నిలిపారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కాల్వి, భాటి ఆ తర్వాత తిరిగి బీజేపీలోకి వచ్చారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించి కాల్వి విఫలయ్యారు. 2015లో శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన రాజస్థాన్ శాఖ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడిని కాల్వి బహిష్కరించారు. దీంతో ఆయన శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన పేరుతో సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇవే కాదు పద్మావత్ సినిమాను వ్యతిరేకించే రాజ్‌పుత్ సంస్థలు ఉత్తరాదిన అనేకం ఉన్నాయి. ప్రత్యేకంగా మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా మటుకు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసే సంస్థలే. సంస్థ ఎవరిదనే విషయంలో విభేదాలున్నప్పటికీ చిరకాల ప్రత్యర్థులు జాట్లను ఎదుర్కొనేందుకే శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేనను ఏర్పాటు చేశామని లోకేంద్ర సింగ్, అజిత్ కుమార్ అంగీకరిస్తారు. 2006లో రావణ రాజ్‌పుత్ వర్గానికి చెందిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ సింగ్ తన అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డుతగులుతున్నారనే కారణంతో ఇద్దరు జాట్లను హత్య చేశాడు. దీనిపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన జాట్లకు అన్ని రాజకీయపక్షాల నుంచి మద్దతు లభించింది. దీంతో ఆనంద్‌పాల్ అనుచరులుగా భావించిన రాజ్పుత్లందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వేధింపులను అడ్డుకునేందుకు 11 లక్ష్యాలతో సెప్టెంబర్ 23, 2006న శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన ఏర్పాటైంది. రాజపుత్రల్లో ఐకమత్యాన్ని ప్రోత్సహించడం, రాజపుత్రులకు వ్యతిరేకంగా జరిగే సామాజిక, రాజకీయ దుష్ప్రచారాన్ని అడ్డుకోవడం, చరిత్ర, చారిత్రక సంఘటనలను తప్పుగా చూపడాన్ని వ్యతిరేకించడం వంటివి ఆ 11 లక్ష్యాల్లో కొన్ని. రాజస్థానీయులందరూ ఆరాధించే కర్ణిమాత పేరును సంస్థకు పెట్టారు. చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ 2008లో అశుతోష్ గోవారికర్ నిర్మించిన జోధా అక్బర్ సినిమాను కూడా కర్ణిసేన వ్యతిరేకించింది. ఆ చిత్రాన్ని రాజస్థాన్ ప్రభుత్వం నిషేధించనప్పటికీ అది అక్కడ విడుదల కాలేదు. బ్రాహ్మణులను రక్షించడం క్షత్రియుల కర్తవ్యమంటూ బ్రాహ్మణులపై లాఠీ ఛార్జ్‌ను నిరసిస్తూ 2008లో కర్ణిసేన జైపూర్ బంద్‌కు పిలుపునిచ్చింది. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతూ 2013లో జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శివిర్‌ను అడ్డుకుంటామని హెచ్చరించింది. రాజస్థాన్‌లో రాజపుత్రులు బీజేపీకి మద్దతుగా నిలవడం, జాట్లు కాంగ్రెస్‌కు అండగా ఉండటం చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. ఈ విషయాన్ని గుర్తించే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పద్మావత్ సినిమాను మార్పులు లేకుండా విడుదలకు అనుమతి వద్దని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. అంతే కాదు ఆ తర్వాత ఆ సినిమాను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు ఆ తర్వాత కొట్టేసింది. ఈ ఏడాది జరిగే రాజస్థాన్ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామని భావిస్తున్న కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణిసేనను వ్యతిరేకించడం సరైన చర్య కాదని భావిస్తోంది. రాజస్థాన్‌లో రాజకీయంగా బాగా పట్టున్న సామాజిక వర్గం రాజ్‌పుత్. రాష్ట్ర జనాభాలో వారు 12శాతముంటారు. కనీస పాతిక అసెంబ్లీ స్థానాల్లో ఫలితాల్ని తారుమారు చేయగల సత్తా ఆ వర్గానికి ఉంది. జాట్లు మినహా మిగిలిన ఏ సామాజికవర్గాలు కూడా రాజస్థాన్‌లో రాజ్‌పుత్‌లను వ్యతిరేకించే పరిస్థితి లేదు. రాజ్‌పుత్‌లు తన సమస్యలపైనే కాదు ఇతర సామాజికవర్గాల సమస్యలపైనా పోరాటం చేస్తుంటారు. ప్రస్తుత రాజస్థాన్ అసెంబ్లీ దాదాపు పాతిక మంది రాజ్‌పుత్ ఎమ్మెల్యేలున్నారు. పద్మావత్ సినిమాను నిషేధించాలని కోరుతూ సంతకాల ఉద్యమం చేపట్టింది జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి. ఆమె బీజేపీ ఎమ్మెల్యే కూడా. ఆర్. పరమేశ్, సాక్షి -
రాహుల్ ‘మౌనం’ కాంగ్రెస్‌కే ప్రమాదం!
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ చిత్రం ‘పద్మావత్’కు వ్యతిరేకంగా ఆరేడు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తూ కర్ణిసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగుతున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంతవరకు నోరు విప్పి నిర్ద్వందంగా ఖండించక పోవడం పట్ల ప్రగతిశీల పౌరుల్లో విస్మయం వ్యక్తం అవుతుంది. తనకుతాను లౌకికపార్టీగా, ప్రగతిశీల శక్తిగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ భావ ప్రకటనా స్వేచ్ఛను వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్‌లను ఎందుకు ఖండించడం లేదు? రాజస్థాన్ రాష్ట్రంలో రానున్న ఉప ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం రాజీపడుతుందా? రాజ్‌పుత్‌లు పార్టీకి దూరం అవుతారని భయపడుతుందా? హర్యానాలో ఓ చిన్న పిల్లల స్కూల్ బస్సుపై జరిగిన రాళ్ల దాడి వార్త దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ‘ఎంత పెద్ద కారణం ఉన్నప్పటికీ పిల్లలపై జరిగిన దాడిని ఎవరూ సమర్థించుకోలేరు’ అంటూ ట్వీట్ ద్వారా మాత్రమే రాహుల్ గాంధీ తేలిగ్గా స్పందించారు. ‘మీరు చేస్తున్నది తప్పు’ అంటూ బహిరంగంగా రాజ్‌పుత్‌లను నిలదీయాల్సిన రాహుల్ మెతక వైఖరిని అవలంబించడాన్ని ప్రగతిశీల పౌరులు, ముఖ్యంగా మేథావులు విమర్శిస్తున్నారు. గోవథను నిషేధిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకొచ్చిన కఠిన చట్టాలను నిరోధించడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత గోరక్షకుల పేరిట జరిగిన దాడుల నుంచి దళితులను, మైనారిటీలను రక్షించడంలో ఇలాంటి మెతక వైఖరి కారణంగానే విఫలమైంది. ఇప్పుడు రాజ్‌పుత్‌ల ఆందోళన పట్ల కూడా రాహుల్ గాంధీ తన మౌనాన్ని కొనసాగించినట్లయితే మున్ముందు అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్నారుగదా! పైగా రాజ్‌పుత్‌లకు రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైనందున వారంతా బీజేకీ వ్యతిరేకంగా ఉన్నారు కదా! అలాంటి వారిని ఖండించి దూరం చేసుకోవడం ఎందుకు?’ అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండవచ్చు. అప్పుడు ఇక్కడ పార్టీ నైతిక ప్రవర్తన ప్రశ్నార్థకం అవుతుందన్న విషయాన్ని గ్రహించకపోతే ప్రమాదం. పద్మావత్ సినిమాను తమ రాష్ట్రంలో నిషేధించాలంటూ రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినప్పుడు కూడా రాహుల్ గాంధీ అది సరైన మార్గం కాదంటూ నచ్చచెప్పలేకపోయారు. దాంతో కొందరి మనోభావాలను దెబ్బతీసే చారిత్రక చిత్రాలను తీయకపోవడమే మంచిదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ వ్యాఖ్యానించే వరకు వెళ్లింది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కున్న సెక్యులర్ భావాలను చెరిపేస్తాయని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. రాజులకు పుత్రులుగా చెప్పుకునే రాజ్‌పుత్‌ల పూర్వీకులు ఎక్కువగా మొగల్ చక్రవర్తులు దగ్గర సామంత రాజులుగా పనిచేశారు. ఆ తర్వాత బ్రిటీష్ ఇండియా సైన్యంలో చేరి ‘మార్షల్ రేస్ (సుశిక్షితులైన యోధులు)’ అని పిలుపించుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భూస్వాములుగా ఉత్తర భారతమంతా విస్తరించారు. రాజస్థాన్‌లో అధికంగా ఉన్న రాజ్‌పుత్ యువత ప్రభుత్వ ఉద్యోగ, విద్యారంగాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఆధ్వర్యాన 2006లో ‘శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన’గా ఏర్పడింది. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీలకు అనుకూలంగా మూడు ముక్కలుగా విడిపోయింది. -
‘నా హీరోయిన్ చేతిలో దీపిక పని అయిపోతోంది’
సాక్షి, ముంబయి : జీఎస్టీ దూసుకెళుతోంది. జీఎస్టీ అంటే కేంద్రం పన్నులకోసం తీసుకొచ్చిన సంస్కరణ కాదు.. వివాదాలతో సహవాసం చేసే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్). అవును! ఈ విషయాన్ని రామ్‌గోపాల్ వర్మనే ట్విటర్ ద్వారా తెలియజేశారు. అది కూడా ఈ విషయం తాను చెప్పడం లేదని, ఎనాలిటిక్స్ చెబుతున్నాయని విశ్లేషణకు సంబంధించిన రేఖా చిత్రాన్ని పోస్ట్ చేసి మరి వర్మ ఆ విషయాన్ని నిర్దారించి చూపించారు. 'చూస్తుంటే మియామాల్కోవా (పోర్న్‌స్టార్) గాడ్ సెక్స్ ట్రూత్ పేరిట చాలా వేగంగా దీపికా పదుకునేపై..... దండయాత్ర చేస్తున్నట్లుంది' అంటూ వర్మ ట్వీట్లో పేర్కొన్నారు. ఓ హాలీవుడ్ పోర్న్‌స్టార్‌తో రామ్ గోపాల్‌వర్మ జీఎస్టీ అనే చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆయనపై కేసులు కూడా నమోదు అయ్యాయి. పైగా ఈ చిత్రాన్ని ఆపివేయాలంటూ మహిళా సంఘాలు చేసిన డిమాండ్లను కూడా ఆయన ఖాతరు చేయలేదు. పైగా తాను తీసిన చిత్రాన్ని ప్రమోషన్‌కు పనికొచ్చేలాగా ఆయనను నిలదీసిన వారికి సమాధానాలు చెప్పారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందు చెప్పినట్లుగానే రిపబ్లిక్ డేనాడే ఆన్లైన్ ప్లాట్ ఫాంపై ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఆ సినిమా పద్మావతి సినిమాను బీట్ చేస్తుందని వర్మ పోస్ట్ ద్వారా చెప్పారు. అంతేకాదు ప్రాంతాల వారీగా లెక్క చూపిస్తూ పద్మావత్ చిత్రాన్ని భారత్‌లో సగటున 39మంది చూస్తుండగా జీఎస్టీని మాత్రం 100మంది చూస్తున్నట్లు కూడా లెక్కలు తేల్చారు. It looks like @MiaMalkova is very aggressively _______g @deepikapadukone in the name of #GodSexTruth pic.twitter.com/auUXnbX5IW — Ram Gopal Varma (@RGVzoomin) 26 January 2018 -
లైవ్‌లో మాట్లాడుతుండగానే అరెస్ట్ చేసి..!
సాక్షి, చంఢీగఢ్: దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ మూవీ విడుదల కావడంతో కర్ణిసేన దేశంలో పలు చోట్ల విధ్వంసానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలంటూ పిలుపునిస్తున్న కర్ణిసేన కీలకనేత సూరజ్‌పాల్ అమును హర్యానా పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. జాతీయ మీడియాతో పద్మావత్ మూవీపై లైవ్‌లో వ్యతిరేకంగా మాట్లాడుతుండగా అప్రమత్తమైన పోలీసులు సూరజ్‌పాల్‌ను అదుపులోకి తీసుకుని భోండ్సి జైలుకు తరలించారు. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా కర్ణిసేన నేత బయట ఉండటం మంచిది కాదని భావించిన పోలీసులు ఈ నెల 29 వరకూ సూరజ్‌పాల్‌ను జ్యూడిషియల్ కస్టడీలో ఉంచనున్నట్లు సమాచారం. గుర్గావ్ లోని డీసీపీ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించిన అనంతరం ఈస్ట్ జోన్ డీసీసీ కుల్దీప్ సింగ్ మేజిస్ట్రేట్ అధికారాలను వినియోగించి కర్ణిసేన వివాదాస్పదనేత సూరజ్‌పాల్‌ను తమ కస్టడీలో ఉంచడమే ఉత్తమమని నిర్ణయించారు. గురుగ్రామ్‌లో, హర్యానాలో గానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడటంలో భాగంగా వివాదాస్పదనేత కస్టడీకి తీసుకున్నామని, బెయిల్ కూడా నిరాకరించినట్లు వివరించారు. అసాంఘిక శక్తులను రెచ్చగొట్టి, విధ్వంసానికి పాల్పడితే చూస్తు ఊరుకునేది లేదని కర్ణిసేన నేతలతో పాటు మరికొన్ని వర్గాలను డీసీపీ హెచ్చరించారు. పద్మావత్ మూవీలో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్లు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న పద్మావత్ చిత్రాన్ని ప్రదర్శించవద్దంటూ కర్ణిసేన ఆందోళనలు చేస్తోంది. 'దీపికా పదుకునే చెవులు, ముక్కు కోసిన వారికి క్షత్రియ కమ్యూనిటీ రూ.కోటి బహుమతిగా ఇస్తుంది' అని క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ సోషల్ మీడియాలో ప్రకటించడం చర్చనీయాంశమైంది. -
దర్శకుడిని చంపితే తక్షణమే రూ.51లక్షలు
సాక్షి, ముంబై: సంజయ్ లీలా భన్సాలీ వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’ పై తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలకు భారీ నజరానా ఇస్తామంటూ మరో గ్రూపు ప్రకటించింది. భన్సాలీ తల నరికిన వారికి రూ.51 లక్షల పారితోషికం ఇస్తామని ఆల్ ఇండియా బ్రజ్‌మండల్ క్షత్రియ రాజ్‌పుత్ మహాసభ ప్రకటించింది. భన్సాలీని హత్య చేస్తే తక్షణమే ప్రకటించిన బహుమతి అందిస్తామని బ్రజ్‌మండల్ క్షత్రియ రాజ్‌పుత్ మహాసభ ఉపాధ్యక్షుడు దివాకర్ సింగ్ వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఆందోళనకు మద్దతు ఇవ్వకుండా ఈ సమస్యపై మౌనంగా ఉన్న రాజకీయవేత్తలకు తగిన గుణపాఠం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్గావ్ స్కూలు పిల్లలపై దాడిగురించి ప్రశ్నించినపుడు ఆందోళనను పక్కదారి పట్టించేందుకు సినీ పరిశ్రమ అల్లిన కథ ఇది అని మండిపడ్డారు. రాజపుత్‌లు నిరాయుధులు, మహిళలు, పిల్లలపై ఎప్పటికీ దాడిచేయరని వివరణ ఇచ్చారు. కాగా అయితే చారిత్రాత్మక చిత్రం పద్మావత్ విషయంలో ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పద్మావతి పాత్రలో నటించిన దీపికా పదుకొనెను చంపేస్తామన్న బెదిరింపులొచ్చాయి. దీపికా ముక్కు చెవులు కోస్తే కోటి రూపాయలు ఇస్తామనీ, దీపికాను చంపితే రూ.5 కోట్లు ఇస్తామని కూడా కర్ణిసేన సంస్థ ప్రకటించింది. పద్మావత్ చిత్రం విడుదలను అడ్డుకుంటామని , థియేటర్స్‌లో సినిమా ఆడితే తగలబెట్టేస్తామంటూ కర్ణిసేన హెచ్చరించింది. రాజ్‌పుత్‌లను చెడ్డగా చిత్రీకరించిందని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించారంటూ మండిపడుతూ ఆందోళనకు దిగింది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి యు/ఏ సర్టిఫికేట్ పొందిన తరువాత, జనవరి 25న విడుదలైన గత రెండు రోజుల్లో ర్యాలీలు, విధ్వంసం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
భన్సాలీ గర్వపడే సినిమా తీస్తాం : కర్ణిసేన
జైపూర్ : ఎట్టకేలకు పద్మావత్ చిత్రం విడుదలైంది. అయినప్పటికీ కర్ణి సేన ఆందోళనలు మాత్రం తగ్గటం లేదు. దీనికి తోడు చిత్ర యూనిట్ సభ్యులకు తాజాగా మళ్లీ బెదిరింపులు ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తల్లి ‘లీలా భన్సాలీ’పై ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు కర్ణిసేన ప్రకటించింది. చిత్తోర్‌గఢ్ జిల్లా కర్ణి సేన అధ్యక్షుడు గోవింద్ సింగ్ కంగరౌత్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘భన్సాలీ తల్లిపై చిత్రం రాబోతుంది. అరవింద్ వ్యాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. చిత్రం టైటిల్ పేరు ‘‘లీలా కి లీలా’’ . భన్సాలీ పద్మావత్ తో మా తల్లి రాణి పద్మావతిని అవమానించారు. కానీ, మేం తీయబోయే చిత్రాన్ని తీయబోయే చిత్రం చూసి భన్సాలీ ఖచ్ఛితంగా గర్వపడతారు’’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభకాబోతుందని గోవింద్ వెల్లడించారు. ‘దేశంలో ప్రతీ పౌరుడికి స్వేచ్ఛా హక్కు ఉంటుందన్న పాయింట్‌తో పద్మావత్‌ను భన్సాలీ తెరెక్కించారు. సరిగ్గా అదే హక్కును ఉపయోగించుకునే ఇప్పుడు మేం అంతకంటే భేషుగ్గా.. పచ్చి నిజాలను చూపిస్తాం’ అని కర్ణిసేన ప్రకటించింది. ఇదిలా ఉంటే గురుగావ్ దాడుల వెనుక భన్సాలీ ప్రమేయం ఉన్నట్లు కర్ణిసేన సంచలన ఆరోపణలకు దిగింది. -
హోరెత్తుతున్న కర్ణిసేన ఆందోళనలు
-
దిగ్విజయ్ కామెంట్స్.. మరింత రెచ్చిపోతారేమో
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మద్దతిచ్చారు. ఓ మతాన్నిగాని, కులాన్నిగానీ కించపరిచే ఏ సినిమాలను కూడా అసలు విడుదల కానివ్వొద్దంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి చిత్రాన్ని అసలు తీయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. పద్మావత్ చిత్రం తమ మనోభావాలను దెబ్బకొట్టిందంటూ గత కొద్ది రోజులుగా శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా వారు హింసాత్మకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో దిగ్విజయ్ వారికి మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశం అయింది. అంతేకాదు.. ఈ ఆందోళన మొత్తానికి కూడా ప్రధాని నరేంద్రమోదీ, ఆయన పార్టీ బీజేపీ అని ఆరోపించారు. గుర్గావ్లో పాఠశాల బస్సుపై జరిగిన దాడిని గురించి స్పందన తెలియజేస్తూ 'మొత్తం దేశాన్ని బీజేపీ మంటల్లోకి నెడుతోంది' అంటూ తీవ్రంగా విమర్శించారు. -
'పద్మావత్'కు మరోషాక్ :ఎఫ్బీలో ఫుల్ మూవీ
ఎన్నో వివాదాలు, మరెన్నో ఆందోళనల మధ్య సంజయ్ లీలా భన్సాలీ మూవీ 'పద్మావత్' నేడు(గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అటు కర్ణిసేన ఆందోళనలతో తీవ్ర చిక్కుల్లో కూరుకున్న ఈ మూవీకి, ఓ ఫేస్బుక్ పేజీ కూడా తీవ్ర షాకిచ్చింది. పద్మావత్ ఫుల్ మూవీని ఫేస్బుక్లో లీక్ చేసింది. ' జాటోన్ కా అడ్డ' అనే ఫేస్బుక్ పేజీ, థియేటర్లో స్క్రీన్ అవుతున్న ఈ మూవీని లైవ్ స్ట్రీమ్ చేసింది. ఇలా లైవ్ స్ట్రీమ్ అవుతున్న సమయంలోనే ఈ ఫేస్బుక్ పేజీ లింక్‌ను 15వేల మంది షేర్ చేయగా... ఈ వీడియోకు 3.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే కర్ణిసేన విధ్వంసనలతో తీవ్రంగా ఆందోళన చెందుతున్న మూవీ యూనిట్ సభ్యులకు ఇది మరింత దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల ఆపివేశారు. రాజ్‌పుత్‌ల ప్రభావం బలంగా ఉండడం, ప్రజల సెంటిమెంట్, కర్ణిసేన హెచ్చరికలు తదితర కారణాల వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనే భావనతో ఇక్కడ మల్టీప్లెక్స్ యజమానుల సంఘం సినిమాను ప్రదర్శించబోమని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లో పద్మావత్ ప్రదర్శన సాఫీగా సాగుతోంది. దీపికా పదుకోన్, షాహిద్ కపూర్, రణ్వీర సింగ్‌లు ఈ సినిమాలో ప్రధాన పాత్రదారులుగా నటించారు. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా చూడ్డానికి బాగుందంటూ మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చాయి. అయినప్పటికీ కర్ణిసేన ఆందోళనలను మాత్రం తగ్గించడం లేదు. -
'దీపికా చెవులు, ముక్కు కోస్తే కోటి రూపాయలు'
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటికే దాదాపు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తగులబెడుతూ విధ్వంసానికి పాల్పడుతున్న కర్ణిసేన మరింత ఆగ్రహంతో రగిలిపోతోంది. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న పద్మావత్ చిత్రాన్ని విడుదల చేయాడానికి వీల్లేదంటూ ఆందోళనలు చేస్తున్నా ఆ సినిమా గురువారం విడుదల కావడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ ఈ చిత్రంలో పద్మావత్‌గా నటించిన దీపికా పదుకొనేపై నిప్పులు చెరిగాడు. 'దీపికా పదుకునే చెవులు, ముక్కులు కోసినవారికి క్షత్రియ కమ్యూనిటీ రూ.కోటి బహుమతిగా ఇస్తుంది' అని ఆయన ప్రకటించారు. తన అధికారిక ట్విటర్ పేజీలో ఈ మేరకు సంచలన ఆఫర్ చేశారు. ఇదిలా ఉండగా, పద్మావత్ చిత్రం విడుదల అయినప్పటికీ ఆందోళనలు ఎక్కడా ఆగడం లేదు. పోలీసులు ఎక్కడివారిని అక్కడ నిర్బందంలోకి తీసుకుంటున్నా ఏ మాత్రం వారు వెనక్కి తగ్గడం లేదు. గురువారం దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా జరగుతున్నాయి. మహిళలు కూడా పెద్ద మొత్తంలో ఈ ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. కొంతమంది కత్తులతో రోడ్లపై వీరంగం చేస్తున్నారు. మాల్స్‌పై కూడా దండయాత్రలు చేస్తున్నారు. Kshatriya community will contribute & give the person a reward of Rs 1 Crore who chops off Deepika Padukone's ears and nose: Gajendra Singh, President Kshatriya Mahasabha (24.1.2018) #Padmaavat pic.twitter.com/OP9R4EmaG1 — ANI UP (@ANINewsUP) 25 January 2018 -
శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన ఎవరిది?
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’కు వ్యతిరేకంగా ఐదారు రాష్ట్రాల్లో కర్ణిసేన అల్లర్లు సష్టిస్తున్న నేపథ్యంలో ఈ సేన ఎప్పుడు పుట్టింది ? ఎందుకు పుట్టింది ? దీనికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు ? అన్న ఆసక్తికరమైన ప్రశ్నలు రావడం సహజమే. రాజస్థాన్ రాజ్‌పుత్ సామాజిక వర్గానినికి చెందిన నిరుద్యోగ యువత 2006 సంవత్సరంలో ‘శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన’ను ఏర్పాటు చేసింది. అప్పటికే రాజ్‌పుత్ నాయకుడిగా ఆ కమ్యూనిటీలో మంచి గుర్తింపు ఉన్న లోకేంద్ర సింగ్ కల్వీ అండదండలతో అది ప్రాణం పోసుకుంది. కులాల ప్రాతిపదికన తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసింది. కులాల ప్రాతిపదిక రిజర్వేషన్లను రాజ్‌పుత్ రాజకీయ నాయకులు మొదటి నుంచి వ్యతిరేకిస్తుండగా, శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన ఏర్పాడ్డాక హఠాత్తుగా వారి వైఖరి మారింది. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా వారి వైఖరి అదే. ఆ తర్వాత తమ నాయకుల రాజకీయ సమీకరణల కారణంగా ఈ సేనలో చీలికలు వచ్చి మూడు గ్రూపులుగా సేన విడిపోయింది. తొలిగ్రూపు శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన కాగా, రెండో గ్రూపు రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేనా సమితి, మూడో గ్రూపు శ్రీరాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన. శ్రీరాజ్‌పుత్ కర్ణిసేనను లోకేంద్ర సింగ్ కల్వీ ఏర్పాటు చేసినప్పుడు సేనకు అధ్యక్షుడిగా అజీత్ సింగ్ మందోలిని నియమించారు. 2008లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చినప్పుడు తనకు కాంగ్రెస్ టిక్కెట్ కావాలని మందోలి పట్టుపడ్డారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కల్వీ టిక్కెట్‌ను ఆశిస్తున్నందున ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో మొదటిసారిగా కర్ణిసేన విడిపోయింది. ఆ తర్వాత 2010లో మూడో వర్గం ఏర్పడింది. రెండు లక్షల మంది సభ్యులున్నారని చెప్పుకుంటున్న ఆవిర్భావ సంస్థ ‘శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన’నే ప్రస్తుతానికి బలమైన గ్రూపు. ఉమ్మడి లక్ష్యాల కోసం ఏ ఆందోళనలు చేసినా ఈ మూడు గ్రుపులు పోటాపోటీగా వ్యవహరిస్తాయి. ఆందోళనల సందర్భంగా విధ్వంసానికి దిగడంలో కర్ణిసేనలకు పెట్టింది పేరు. అశుతోశ్ గోవరికర్ తీసిన ‘జోధా అక్బర్’ బాలీవుడ్ సినిమాను 2006లో అడ్డుకోవడం ద్వారా కర్ణిసేన పేరు మొదటిసారి దేశవ్యాప్తంగా వినిపించింది. ఇప్పుడు పద్మావత్ సినిమాను అడ్డుకోవడం ద్వారా ఆ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెల్సింది. -
'ఆ క్షణంలో బస్సు ఆపినట్లయితే ఏం జరిగేదో..'
సాక్షి, న్యూఢిల్లీ : 'పద్మావత్' సినిమా వివాదం వారి జీవితాల్లో మర్చిపోలేని సంఘటనగా మిగిలింది. 30మంది చిన్నారులకు, ఓ టీచర్‌కు, బస్సు డ్రైవర్‌కు, కండక్టర్‌కు పెద్ద భయానక అనుభవంగా గుర్తుండిపోనుంది. ఆ సమయంలో డ్రైవర్ బస్సు ఆపి ఉన్నట్లయితే, బహుశా! చెప్పవీలుకానీ దుర్ఘటన చోటుచేసుకుని చరిత్రలో ఓ చెరిగిపోని మరకగా మిగిలి ఉండేదేమో. పద్మావత్ చిత్రం విడుదలను ఆపేయాలంటూ గుర్గావ్లో ఆందోళన చేస్తున్న కర్ణిసేనకు చెందినవారు కొంతమంది ఓ పాఠశాల బస్సుపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఎలాజరిగిందనే విషయాన్ని కండక్టర్‌ను అడిగి తెలుసుకోగా ఒళ్లు గగుర్పొడిచే అనుభవాన్ని చెప్పాడు. 'సరిగ్గా మేం స్కూల్ నుంచి బయలుదేరి 7కిలో మీటర్ల వరకు వచ్చాం. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఓ బస్సు తగలబడిపోతుండటాన్ని మేం చూశాం. పోలీసులు ఆందోళన కారులను చెదరగొడుతున్నారు.. వారు మాత్రం తిరిగి దాడి చేస్తున్నారు. చెట్ల పొదల్లో నుంచి అనూహ్యంగా మా బస్సు వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో స్కూల్లో 30మంది నర్సరీ చదువుతున్న చిన్నారులు ఉన్నారు. దాదాపు 60మంది ఆందోళన కారులు రాళ్లు విసరడం మొదలుపెట్టారు. దాంతో చిన్నారులు ఏడ్వడం మొదలుపెట్టారు. అందులోని టీచర్ వారిని ఓదార్చడం మొదలుపెట్టింది. అన్ని వైపుల నుంచి రాళ్లు రావడం మొదలయ్యాయి. దాంతో చిన్నారులను సీట్ల కింద దాచి ఉంచే ప్రయత్నం చేశాం. ఒక పెద్ద బండరాయి వచ్చి ముందు అద్దాన్ని బద్ధలు కొట్టింది. దాంతో ఇక ఎంత నష్టం జరిగినా పర్వాలేదని డ్రైవర్, నేను నిర్ణయించుకున్నాం. బస్సును ముందుకు పోనిచ్చాం. పిల్లల ప్రాణాలు ముఖ్యం అని భావించి బస్సును వేగంగా ముందుకు తీసుకెళ్లాం. అప్పటికీ కొంతమంది వెదురు బొంగులతో వెంబడించారు. వెళ్లే క్రమంలోనే గాయపడిన చిన్నారులకు ప్రథమ చికిత్స చేశాం. ఆ సమయంలో బస్సును ఆపినట్లయితే ఏం జరిగి ఉండేదో కూడా ఊహించలేకపోయేవాళ్లం' అని వెల్లడించాడు. ఈ సంఘటన మొత్తం దేశాన్ని కదిలించిన విషయం తెలిసిందే. -
‘పద్మావత్’ కోసం శ్రీలంక ప్రధాని నిరీక్షణ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా గురువారం నాడు విడుదలైన వివాదాస్పద బాలివుడ్ సినిమా ‘పద్మావత్’కు వ్యతిరేకంగా దేశంలోని ఆరేడు బీజీపీ పాలిత రాష్ట్రాల్లో రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో బుధవారం కర్ణిసేన ఆందోళనలు విధ్వంసానికి దారితీయడం పట్ల దేశీయ మీడియానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీడియా దిగ్భ్రాంతి వ్యక్తం చే సింది. ప్రపంచ మీడియా కూడా ఎక్కువగా అల్లర్లకే ప్రాధాన్యతనిస్తూ వార్తలను ప్రచురించింది. ముఖ్యంగా గుర్గావ్లో చిన్న పిల్లల స్కూల్ బస్సుపై కర్ణిసేన రాళ్ల దాడులకు దిగడం, ప్రాణభీతితో బస్సులోని బడి పిల్లలు సీట్ల కింద దాక్కున్న వీడియో దృశ్యాలను ప్రపంచ మీడియా ఎక్కువగా ప్రసారం చేసింది. ‘పౌరానిక హిందూ రాణి’కి సంబంధించిన ఇతివృత్తంతో తీసిన సినిమా పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ అహ్మదాబాద్‌లో కర్నిసేన కార్యకర్తలు విధ్వంసానకి దిగిన దృశ్యాలకు ‘పాకిస్థాన్ టుడే’ ప్రాముఖ్యతనిచ్చింది. సినిమా విడుదలకు వ్యతిరేకంగా అహ్మదాబాద్‌లో దాదాపు 200 బస్సులను దగ్ధం చేసిన సంఘటనలకు బంగ్లాదేశ్‌లోని ‘ది ఇండిపెండెంట్’, ‘ప్రోథమ్ హాలో’ పత్రికలు ప్రాధాన్యమిచ్చాయి. పాకిస్థాన్ నుంచి వెలువడుతున్న ‘ది డాన్’ పత్రిక మాత్రం అల్లర్లకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా వివిధ క్రిటిక్స్ రాసిన సినిమా రివ్యూలకు ప్రాధాన్యం ఇచ్చింది. శ్రీలంక నుంచి వెలువడుతున్న ‘ది మిర్రర్’ పత్రిక మాత్రం స్థానిక పాఠకులను ఆకట్టుకునే వార్తా కథనాన్ని ప్రచురించింది. రాణి పద్మావతిని సింహళ (శ్రీలంక) రాజ కుమారిగా చూపించారనే వార్త తెలిసి ఆ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా! అని శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే ఎదురు చూస్తున్నారని ఆ పత్రిక తన సంపాదకత్వంలోనే పేర్కొంది. ఈ సినిమా పట్ల నరేంద్ర మోదీ కూడా అంతే ఉద్విఘ్నతతో ఉన్నారని, ఆయన ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుతో కలిసి అహ్మదాబాద్‌లో ఓ సాంస్కతిక కార్యక్రమాన్ని వీక్షించినప్పుడు అక్కడ విద్యార్థులు పద్మావతి సినిమాలోని గూమర్ పాటకు నృత్య ప్రదర్శన ఇచ్చారని, ఆ సందర్భంగా ఆ పాట మోదీకి ఎంతో నచ్చిందని కూడా ఆ పత్రిక తన సంపాదకత్వంలో పేర్కొంది. మోదీ గూమర్ పాటకు ఇచ్చిన ప్రదర్శనను వీక్షించడం వివాదాస్పదం కూడా అయింది. అయితే ఆయనకు ఆ పాట నచ్చిందో, లేదో తెలియదు. పద్మావతి వివాదంపై ఆరేడు రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగుతున్నా నోరు విప్పని మోదీ ఓ పాట గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారని భావించలేం. భారీ పెట్టుబడులతో అద్భుత సెట్టింగ్‌లతో కళాత్మకంగా తీసిన ‘పద్మావత్’ సినిమా ఎందుకు వివాదాస్పదం అయిందో, ఆ సినిమాను రాజ్‌పుత్‌లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమగ్రంగా వివరిస్తూ అమెరికా నుంచి వెలువడుతున్న ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తమ మాటలను ఖాతరు చేయకుండా గురువారం నాడు సినిమాను విడుదల చేస్తే ‘ఆత్మార్మణం’ చేసుకుంటామని రెండువేల మంది కర్ణిసేన మహిళలు హెచ్చరించడాన్ని కూడా ఆ పత్రిక ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటనలు తమ దృష్టికి రాలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని రాజస్థాన్ పోలీసులు తెలిపారు. -
పద్మావత్: సుప్రీంలో కోర్టుధిక్కారం!
సాక్షి, న్యూఢిల్లీ: ‘పద్మావత్’ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలు హోరెత్తుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కర్ణిసేనతోపాటు ఈ సినిమాను విడుదల చేయని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. పద్మావత్ సినిమా విడుదలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. కర్ణిసేన తీవ్రంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ‘పద్మావత్’ సినిమా విడుదల నిలిచిపోయింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో కర్ణిసేన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కొన్నిచోట్ల ఆందోళనకారులు దుకాణాలపై దాడులకు దిగి విధ్వంసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడటంలో ఈ రాష్ట్రాలు విఫలమయ్యాయని, కాబట్టి ఆ నాలుగు రాష్ట్రాలపై, కర్ణిసేనపై కోర్టు ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా.. కేసు తీవ్రతనుబట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. -
ఆ నాలుగు రాష్ట్రాల్లో పద్మావత్ విడుదల కాలేదు
-
‘మీ పకోడా రాజకీయాలు మా పైనేనా?’
సాక్షి, హైదరాబాద్ : పద్మావత్ చిత్ర విడుదల నేపథ్యంలో కర్ణిసేన చేపట్టిన ఆందోళనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నిరసనకారులు ఇంత చేస్తున్నా ఎందుకు ఉపేక్షిస్తోందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గురువారం ఉదయం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఒవైసీ... ‘‘బీజేపీ పకోడా రాజకీయాలు చేస్తుందని స్పష్టంగా అర్థమౌతోంది. ప్రధాన మంత్రి, ఆయన పార్టీ నిరసనకారుల ముందు మోకరిల్లాయి. 56 ఇంచులంటూ మోదీ ముస్లింలపైనే రొమ్ము విరుస్తారే తప్ప.. వారిని(కర్ణిసేన) అదుపు చేయలేకపోతున్నారు. సిగ్గుచేటు’’ అని తెలిపారు. చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నా వారిని ఎందుకు నిలువరించలేకపోతున్నారని ప్రశ్నించిన ఒవైసీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు భయాందోళనలో గడుపుతున్నారని చెప్పారు. కాగా, గతంలో పద్మావత్ చిత్ర వివాదంపై స్పందించిన ఒవైసీ అది ఓ బక్వాస్(పనికిమాలిన)చిత్రం అని పేర్కొన్న విషయం తెలిసిందే. దయచేసి ఆ చిత్రం చూడకండి అంటూ ముస్లిం ప్రజానీకానికి ఆయన పిలుపు కూడా ఇచ్చారు. -
స్కూల్ బస్సుపై దాడి.. రాహుల్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ‘పద్మావత్’ సినిమా విషయంలో విధ్వంసాలకు దిగుతున్న కర్ణిసేన వ్యవహార శైలి తీవ్ర వివాదం రేపుతోంది. చిన్న పిల్లలు ఉన్నారన్న కనీస విచక్షణ చూపకుండా స్కూల్ బస్సుపై కర్ణిసేన కార్యకర్తలు దాడులు చేయడం విమర్శలకు తావిస్తోంది. స్కూల్ బస్సుపై కర్ణిసేన దాడులపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ‘పిల్లలపై హింసకు కారణం ఎంతపెద్దదైనా అది ఎన్నటికీ సమర్థినీయం కాదు. హింస, విద్వేషాలు బలహీనుల ఆయుధాలు. బీజేపీ హింసను, విద్వేషాన్ని ఉపయోగించుకుంటూ దేశాన్ని తగులబెడుతోంది’ అని రాహుల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. పద్మావత్ సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కర్ణిసేన కార్యకర్తలు బుధవారం సాయంత్రం గురుగ్రామ్‌లో జీడీ గోయెంకా పాఠశాల బస్సుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. స్కూల్ టైం ముగించుకొని పిల్లలతో ఇంటికి బయల్దేరిన బస్సును నిరసనకారులు మధ్యలోనే అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని బస్సును ముందుకు పంపించే ప్రయత్నం చేసేలోపే నిరసనకారులు రెచ్చిపోయి.. దాడి చేశారు. బస్సులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా రాళ్లవర్షం కురిపించారు. దీంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. సీట్లు, బస్సు ఫ్లోర్ అంతా కూడా అద్దాలతో నిండిపోయింది. ఒక్కసారిగా రాళ్లు దూసుకురావడంతో పిల్లలు బిక్కచచ్చిపోయారు. ప్రాణభయంతో వణికిపోయారు. బస్సులో ఉన్న ఉపాధ్యాయులు పిల్లలకు దెబ్బలు తగలకుండా చూసుకున్నారు. సీట్ల కింద దాక్కోవాలని, ఫ్లోర్‌పై పడుకోవాలంటూ గట్టిగా హెచ్చరించారు. చిన్న చిన్న పిల్లలను దగ్గరికి తీసుకొని వారు బెదిరిపోకుండా చూసుకున్నారు. ఈ ఘటనలో కర్ణిసేన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదని, కర్ణిసేన రాళ్లు రువ్వుతూ.. పోలీసులతో కొట్లాడుతున్న సమయంలో ఈ ఘర్షణల్లో చిక్కుకోకుండా చాకచక్యంగా అక్కడి నుంచి బస్సును వేరేరూట్లోకి తరలించానని డ్రైవర్ తెలిపారు. -
హోరెత్తుతున్న కర్ణిసేన ఆందోళనలు
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ‘పద్మావత్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకావడంతో ఈ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన విధ్వంసాలకు దిగుతోంది. పలు రాష్ట్రాల్లో సినిమాకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు జరుపుతోంది. ముఖ్యంగా రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో తొలిరోజు ‘పద్మావత్’ విడుదల నిలిచిపోయింది. ఈ రాష్ట్రాలు మొదటి నుంచి సినిమా విడుదలను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌పుత్‌ల ప్రభావం బలంగా ఉండడం, ప్రజల సెంటిమెంట్, కర్ణిసేన హెచ్చరికలు తదితర కారణాల వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనే భావనతో ఇక్కడ మల్టీప్లెక్స్ యజమానుల సంఘం సినిమాను ప్రదర్శించబోమని ప్రకటించింది. కర్ణిసేన ఆందోళనలు ఇలా.. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో కర్ణిసేన దుకాణాలపై విరుచుకుపడి విధ్వంసాలకు పాల్పడింది. రాజస్థాన్ జైపూర్‌లో పద్మావత్‌కు వ్యతిరేకంగా కర్ణిసేన బైక్ ర్యాలీ చేపట్టింది బిహార్ ముజఫర్‌పూర్‌లో కర్ణిసేన ఆందోళనకారులు తల్వార్లు ప్రదర్శిస్తూ.. టైర్లు తగలబెడుతూ నిరసన తెలిపారు తమిళనాడులో పద్మావత్‌కు శ్రీరామసేన ఆందోళన గుజరాత్ అహ్మదాబాద్‌లో పద్మావత్ సినిమా థియేటర్ల వద్ద భారీ భద్రత.. వారణాసిలో పద్మావత్ థియేటర్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి యత్నం చేసిన యువకుడు. అడ్డుకున్న పోలీసులు దక్షిణాది రాష్ట్రాల్లో సాఫీగా.. దక్షిణాది రాష్ట్రాల్లో పద్మావతి ప్రదర్శన సాఫీగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 400పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు థియేటర్ల వద్ద పోలీసుల బందోబస్తును ఏర్పాటుచేశాయి. బాగుందన్న టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. -
పప్పులో కాలేసిన కర్ణిసేన
భోపాల్ : రాజ్‌పుత్ కర్ణిసేన పప్పులో కాలేసింది. పద్మావత్‌కు నిరసనగా చేపట్టిన ఆందోళనలో అతి చూపించటంతో సొంత కార్యకర్తే నష్టపోయాడు. అంతా కలిసి అతని కారును తగలబెట్టేశారు. బుధవారం సాయంత్రం భోపాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్యోతి టాకీస్ వద్ద సాయంత్రం గుమిగూడిన కర్ణిసేన ఒక్కసారిగా విధ్వంసకాండకు పాల్పడ్డారు. కనిపించిన షాపులను, వాహనాలను పగలగొడుతూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ‘ఎంపీ 04 హెచ్‌సీ 9653’ స్విఫ్ట్ కారును వారు తగలబెట్టారు. అది గమనించిన కారు యాజమాని లబోదిమంటూ పరిగెత్తుకొచ్చాడు. కారు యాజమానిని ఈడబ్ల్యూఎస్ కాలనీలో నివసించే సురేంద్ర సింగ్ గా గుర్తించారు. కర్ణిసేన కార్యకర్త అయిన అతను తన కారును పక్కనే నిలిపి నిరసనకారులతో కలిసి పక్క వీధిలో ఆందోళన చేపట్టాడంట. ఇంతలో ఎవరో కారు తగలబడుతోందని సురేంద్రకు చెప్పటంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లాడంట. కానీ, అప్పటికే కారు సగంకి పైగా కాలిపోయిందని సురేందర్ చెబుతున్నాడు. స్టిక్కర్‌ను కూడా గమనించకుండా కర్ణిసేన కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడినట్లు అతను వాపోయాడు. పోలీసులకు అతను ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అట్టుడుకుతున్న భోపాల్... మొదటి నుంచి పద్మావత్ విడుదలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బ్యాన్ కోసం తీవ్రంగా యత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు రాజ్‌పుత్ కర్ణిసేన మాత్రం పద్మావత్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఆడనివ్వబోమని ప్రకటించి భోపాల్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఎంపీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అల్లర్లకు పాల్పడుతున్న 12 మంది కార్యకర్తలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన కీలక నేతలు స్టేషన్‌ను ముట్టడించటంతో పోలీసులు వారిని విడిచిపెట్టాల్సి వచ్చింది. నేడు చిత్రం విడుదల నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. -
థియేటర్లలోకి పద్మావత్.. టెన్షన్.. టెన్షన్!
సాక్షి, ముంబై: వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న సంజయ్‌లీలా భన్సాలీ తాజా చిత్రం ‘పద్మావత్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్ణిసేన ఆగ్రహావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సినిమా విడుదలవుతోంది. దేశవ్యాప్తంగా ‘పద్మావత్’ సినిమా విడుదల అవుతున్న థియేటర్ల వద్ద భారీ భద్రత కల్పించారు. మరోవైపు ‘పద్మావత్’ సినిమా రాజ్‌పుత్‌లకు అనుకూలంగా ఉందని కథనాలు వెలువడుతున్నా.. కర్ణిసేన ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని కర్ణిసేన అంటోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో హింస చోటుచేసుకోవడం, కర్ణిసేన మూకలు దాడులకు దిగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. సినిమా విడుదలను అడ్డుకునేందుకు కర్ణిసేన ఏమైనా అవాంఛనీయ ఘటనలకు దాడులకు పాల్పడుతుందా? అన్నది టెన్షన్ రేపుతోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ‘పద్మావత్’ మార్నింగ్‌షోలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పుణెలోని ఈస్క్వేర్ థియేటర్లో ఎలాంటి అలజడి, ఆందోళన లేకుండా మార్నింగ్ షోలు నడుస్తున్నాయి. కర్ణిసేన బెదిరింపుల నేపథ్యంలో థియేటర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. చాలా నగరాల్లో మార్నింగ్‌షోలు ప్రశాంతంగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ‘పద్మావత్’ థియేటర్ల వద్ద పోలీసులు అప్రమత్తంగా భద్రత కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కర్ణిసేన ఆందోళనల నేపథ్యంలో గురుగామ్‌లోని పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గురుగామ్‌లోని ఓ స్కూల్ బస్సుపై కర్ణిసేన దాడులు చేసి విధ్వంసానికి దిగడంతో పిల్లలను బడులకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కారణంగానే ఈ భయానక పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు అంటున్నారు. -
పాలన ఇలాగేనా?!
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘రాణి పద్మిని’ పేరుతో ప్రారంభించిన చిత్రం ‘పద్మావతి’గా, ఆ తర్వాత ‘పద్మావత్’గా మారడమే కాదు... సెన్సార్ బోర్డు కత్తిరింపులనూ, ఆ సినిమాపై కత్తులు నూరిన కర్ణిసేన ‘మనో భావాలను’ గుర్తించి మసులుకున్నా దానికి కష్టాలు తప్పలేదు. 68వ గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు గురువారం అది దేశవ్యాప్తంగా విడుదల కాబో తుండగా అన్ని రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అల్లరి మూకలు వీధుల్లో వీరంగం వేస్తున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. థియేటర్లు, షాపింగ్ మాల్స్, బస్సులు, కార్లు, మోటారు సైకిళ్లు, ఇతర ఆస్తులు తగలబడుతున్నాయి. హర్యానాలోని గురుగ్రాంలో పసివాళ్లతో వెళ్తున్న పాఠశాల బస్సును కూడా వదలకుండా రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. అందులోని పిల్లలనూ, టీచర్లునూ భీతావహుల్ని చేశారు. మరో పాఠశాల బస్సును దహనం చేశారు. సెన్సార్ బోర్డు అనుమతి లభించిన ‘పద్మావత్’ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని, దానికి అన్నివిధాలా భద్రత కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పాక కూడా ఇదంతా యధేచ్ఛగా సాగుతోంది. వీధుల్లోకి వస్తున్న వేలమందిని నియంత్రించడానికి అవసరమైన పోలీసు బందోబస్తు కల్పించకుండా ఆ ప్రభుత్వాలన్నీ అటు రాజ్యాంగబద్ధమైన కర్తవ్యాన్ని, ఇటు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనూ బేఖాతరు చేశాయి. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులే కర్ణిసేనతో సమానంగా, కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువగా ఆ చిత్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని గుర్తుంచుకుంటే ఇలాంటి హింసాత్మక ఘటనలు అక్కడే ఎందుకు చోటుచేసుకుంటున్నాయో సులభంగానే అర్ధమవుతుంది. పైగా ఈ గొడవంతకూ బాధ్యత ‘పద్మావత్’ తీసిన సంజయ్ లీలా భన్సాలీదేనని హర్యానా మంత్రి అనిల్ విజ్ ప్రకటించి అందరినీ నివ్వెరపరిచారు. ఈసారి గణతంత్ర దినోత్సవానికి సింగపూర్, ఇండొనేసియా, మలేసియా, వియత్నాం, బ్రూనై తదితర ఆగ్నేయాసియా దేశాల(ఆసియాన్) అధినేతలు పదిమంది ముఖ్య అతిథులుగా వస్తున్నారని, వారు దేశంలో అడుగుపెట్టిన రోజున చానెళ్లన్నిటా ఈ హింసే ప్రధాన వార్తయితే దేశం పరువు పోతుందన్న కనీస జ్ఞానం కూడా అక్కడి ప్రభుత్వాలకు కొరవడింది. గురుగ్రామ్ బహుళజాతి సంస్థలకు ప్రసిద్ధి. అక్కడ అనేక భారీ పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, సాఫ్ట్వేర్ సంస్థలు పనిచేస్తున్నాయి. వేలకొలది కార్మికులు, ఉద్యో గులు ఆ నగరంలో పనిచేస్తున్నారు. పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ అక్కడ వందల సంఖ్యలో విద్యా సంస్థలున్నాయి. అది దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో భాగం. అలాంటిచోట అల్లరిమూకలు రోడ్లపైకొస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు... కేంద్ర ప్రభుత్వానికి సైతం అప్రదిష్ట. చిత్ర మేమంటే ఇంతచేటు హింస జరిగినా బీజేపీ ప్రతినిధులెవరూ చానెళ్లలో జరిగిన చర్చలకు రాలేదు. ఆ పార్టీ వైఫల్యాలను సొమ్ము చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించే ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మోహం చాటేసింది. ఈమధ్య వ్యంగ్యమైన ట్వీట్లు ఇవ్వడంలో ముందుంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం పత్తాలేరు. కులాల పేరిటా, మనోభావాల పేరిటా ఎవరు ఏం చేసినా దేశ ప్రజలకు దిక్కూ మొక్కూ లేదన్నమాట! మన రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛతో సహా ఎన్నో హక్కుల్ని కల్పించింది. చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పింది. ఏవో కొన్ని గ్రూపులు మతం పేరు చెప్పుకుని, కులం పేరు చెప్పుకుని మనోభావాలు దెబ్బ తిన్నాయని రోడ్డెక్కుతుంటే, సమాజం మొత్తంపై తమ అభిప్రాయాలను బల వంతంగా రుద్దాలని ప్రయత్నిస్తుంటే ప్రభుత్వాలన్నీ చేష్టలుడిగి చూస్తున్నాయి. తమకు నచ్చని అభిప్రాయాలను వ్యక్తం చేసిన వ్యక్తులపై, సంస్థలపై విరుచుకుపడే ఈ ప్రభుత్వాలు ఇలాంటి గ్రూపుల ముందు సాగిలపడుతున్నాయి. వాటికి వ్యతిరేకిస్తే తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందన్న భయంతో వణుకుతున్నాయి. ఆ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనైనా ధిక్కరించడానికి సాహసిస్తు న్నాయి. అది చలనచిత్రం కావొచ్చు... ఒక పుస్తకం కావొచ్చు... మరో కళాత్మక చిత్రం కావొచ్చు–దేన్నయినా నచ్చలేదని, విభేదిస్తున్నానని చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. మన రాజ్యాంగం సైతం హక్కులకు కొన్ని పరిమితులను కూడా విధించింది. కానీ ఆ పరిమితుల పేరిట భావప్రకటన హక్కునే కాలరాయాలని చూడటం ప్రభు త్వాలకైనా, ప్రైవేటు గ్రూపులకైనా తగని పని. కేజ్రీవాల్‌పై ‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మాన్’ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీలో తనకు సంబంధించి పెట్టిన పాత్రను వక్రీకరించారని, అది న్యాయస్థానంలో తనపై ఉన్న కేసును ప్రభావితం చేసేలా ఉన్నదని ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మొన్న నవంబర్‌లో తీర్పునిస్తూ సృజనాత్మకతకు సంకెళ్లు విధించే ధోరణులను అనుమతించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. మనోభావాలు దెబ్బతిన్నాయన్న పేరిట సృజనాత్మక వ్యక్తీకరణలను శిలువ ఎక్కించడం తగదన్నది. ఆ తీర్పు వెలువడి మూడు నెలలైనా కాలేదు... ప్రభుత్వాలన్నీ ‘పద్మావత్’పై పగబట్టినట్టు వ్యవహరించాయి. ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చి దాదాపు 25 రోజులవుతోంది. ఆ సినిమా చూడనే చూడం... మేం వద్దన్నాం గనుక విడుదలను ఆపాల్సిందేనని ఆగ్రహించే కర్ణిసేన సంగతలా ఉంచి ప్రభుత్వాల్లో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారో, బీజేపీ ముఖ్యులో దాన్ని వీక్షించి ఏమున్నదో తెలుసుకుంటే, వాటిపై తమకున్న అభ్యంతరాలేమిటో న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే వేరుగా ఉండేది. నిజానికి చిత్రం చూసినవారు అది రాజపుట్ గౌరవప్రతిష్టలను, పద్మావతి పాత్రను ఉన్నతంగా చూపిందని అంటున్నారు. కనీసం నిజానిజాలేమిటో తెలుసు కోవాలన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించేవారిని అదుపు చేయలేకపోతే చట్టబద్ధ పాలన దెబ్బతింటుందని, అది అంతిమంగా అరాచకానికి దారితీస్తుందని ప్రభు త్వాలు గ్రహించాలి. -
‘పద్మావత్’ నిరసనలు హింసాత్మకం
జైపూర్/ముంబై/అహ్మదాబాద్: ‘పద్మావత్’ చిత్రం విడుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. హరియాణాలోని గుర్గావ్లో ఆందోళనకారులు ఓ స్కూలు బస్సుపై రాళ్లురువ్విన ఘటనలో అందులో ఉన్న విద్యార్థులు, టీచర్లు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలోని ఈ చిత్రం గురువారం దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీన్ని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో కర్ణిసేన, పలు హిందూ సంస్థల కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. మాల్స్, సినిమా హాళ్లలో విధ్వంసం సృష్టించారు. చాలాచోట్ల హైవేలను దిగ్బంధించారు. గుర్గావ్, రాజస్తాన్ సహా ముంబై, నాసిక్, లక్నో, ఇండోర్ తదితర ప్రాంతాల్లో ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కాగా, ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాల్లేవని చిత్ర బృందం మరోసారి స్పష్టం చేసింది. రాజ్‌పుత్ గౌరవాన్ని పెంచే దృశ్యాలే ఉంటాయని పునరుద్ఘాటించింది. కాగా, ఆందోళనల నేపథ్యంలో గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోవటం లేదని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆస్తుల విధ్వంసం పద్మావత్ చిత్రం విడుదలను వ్యతిరేకిస్తూ.. రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీల్లో ఆందోళనలు మిన్నంటాయి. జైపూర్‌లో నిరసనకారులు రెండు బస్సులను ధ్వంసం చేశారు. రోడ్రోకోలతో రోడ్లపై నిరసన చేపట్టారు. ముంబై, నాసిక్లలోనూ నిరసనలు జరిగాయి. చిత్రం ప్రదర్శించేందుకు సిద్ధమైన మూడు మల్టీప్లెక్స్‌ల ముందు నిలిపి ఉంచిన 30 బైకులు, స్కూటర్లకు నిరసనకారులు నిప్పంటించారు. ఆందోళన నేపథ్యంలో శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన తీవ్రంగా మండిపడింది. మహారాష్ట్రలో చిత్ర ప్రదర్శనను అడ్డుకునేందుకు శివసేన మద్దతు తెలిపిందని కర్ణిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కాల్వీ వెల్లడించారు. చిత్రంలో రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖల్జీ మధ్య శృంగార భరిత దృశ్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. చిన్నారులని చూడకుండా..! గుర్గావ్.. మధ్యాహ్నం 3 గంటలవుతోంది. స్కూలు ముగించుకున్న విద్యార్థులను తీసుకుని జీడీ గోయెంకా స్కూలు బస్సు బయలుదేరింది. రోడ్డుపై ‘పద్మా వత్’ నిరసనకారులు రాస్తారోకో చేయటంతో వాహనాలన్నీ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. దాని ముందు న్న గోయెంకా స్కూలు బస్సుపై రాళ్లతో దాడిచేశారు. ఆ సమయంలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకున్న విద్యార్థులు, కొందరు టీచర్లు కూడా బస్సులో ఉన్నారు. రాళ్లదాడితో విద్యార్థులు భయంతో వణికిపోయారు. తప్పించుకునేందుకు అవకాశం లేకపోవటంతో ఏడు స్తూ సీట్లకింద నక్కారు. రోడ్డు పక్కనున్న వారు తీసిన వీడియోలో ఈ హృదయవిదారక దృశ్యాలు ఆవేదన కలిగించాయి. -
కష్టాల్లో సినిమా.. ఆలయానికి దీపిక!
సాక్షి, ముంబై: సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రక సినిమా ‘పద్మావత్’.. రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కినట్టు భావిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలకు సుప్రీంకోర్టు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రాదా? అన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అందుకు కారణం అడుగడుగునా కర్ణిసేన ఆధ్వర్యంలో రాజ్‌పుత్‌లు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే. ఇప్పటికే పలుచోట్ల ఈ సినిమాను ప్రదర్శిస్తారని భావించిన థియేటర్లపై కర్ణిసేన దాడులకు దిగుతోంది. ఈ వివాదాల నడుమ వచ్చే గురువారం ‘పద్మావత్’ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్ మంగళవారం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆమె ఆలయానికి వచ్చారు. ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పుజలు నిర్వహించారు. ‘పద్మావత్’ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికపై కూడా కర్ణిసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు భన్సాలీతోపాటు దీపిక తల నరికితే నజరానా ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీపిక కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయాన్ని దర్శించుకున్నారు. -
కష్టాల్లో సినిమా.. ఆలయానికి దీపిక!
-
బొమ్మ పడితే.. థియేటర్ మసే!
సాక్షి, పూణే : సంజయ్ లీలా భన్సాలీ వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’ విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో.. కర్ణిసేన తన అందోళనలను మరింత ఉధృతం చేసింది. ఇప్పటివరకూ సినిమా విడుదలను చట్టపరంగా ఆపేందుకు ప్రయత్నించిన కర్ణిసేన.. తాజాగా థియేటర్ల యజమానులపై బెదిరింపులకు దిగింది. ‘పద్మావత్’ చిత్రాన్ని ప్రదర్శిస్తే.. థియేటర్లను ధ్వంసం చేస్తామని తాజాగా పూణే కర్ణిసేన అధ్యక్షుడు ఓమ్ సింగ్ భార్తి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ‘పద్మావత్’ చిత్రం ఈ నెల 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర విడుదలను ఎలాగైనా అడ్డుకునేందుకు కర్ణిసేన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదిలావుండగా.. హర్యానా రాష్ట్రంలోని ఫరిదాబాద్‌లోని ఓ సినిమా థియేటర్ టిక్కెట్ కౌంటర్‌ను కర్ణిసేనకు చెందిన ఆందోళన కారులు తగులబెట్టారు. కర్ణిసేన బెదిరింపుల నేపథ్యంలో గుజరాత్ సినిమా థియేటర్ల యజమానులు ఈ చిత్రాన్ని విడుదల చేయలేమని చేతులెత్తేస్తున్నారు. -
'సంగీత' లీలా భన్సాలీ
ఇటీవల అత్యంత వివాదాస్పదమైన సినిమా పద్మావత్. ఎన్నో ఇబ్బందులు, ఇంకెన్నో అడ్డంకులు, లెక్కలేనన్ని బెదిరింపులతో హాట్‌టాపిక్‌గా మారిన సినిమా పద్మావత్. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సుప్రీంకోర్టు తీర్పుతో ఊరట లభించింది. అయితే ఇలాంటి వివాదాస్పద సినిమాలు తీయడం భన్సాలీకి కొత్తేమి కాదు. వినూత్న కథలతో, భారీ ఖర్చు, విజువల్ గ్రాండియర్‌తో అందరికంటే భిన్నంగా సినిమాలను తీయడం భన్సాలీకే సొంతం. దర్శకత్వ బాధ్యతలు మోస్తూ ఆ సినిమాకు సంగీతం కూడా అందించటం చాలా కష్టం. అలాంటి కష్టాన్ని ఎప్పుడు చాలెంజ్‌గా తీసుకొని సక్సెస్ సాధిస్తుంటాడు భన్సాలీ. దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్న భన్సాలీ సంగీతంలోని ఇష్టాన్ని తన సినిమాలోని పాటల ద్వారా తెలియజేశారు. తాజాగా ఆయన చిత్రీకరించిన సినిమా ‘పద్మావత్’ వివాదాస్పదమై సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు ‘గూమర్, ఏక్ దిల్ ఏక్ జాన్’ వింటే భన్సాలీ సంగీత ప్రియుడని మరోసారి రుజువైంది. ఇప్పటికే ఆ పాటలు యూట్యూబ్‌లో వైరల్‌గా మారాయి. గూమర్, ఏక్ దిల్ ఏక్ జాన్ పాటలు కేవలం సంగీతపరంగానే కాదు, దృశ్యకావ్యంగానూ అద్భుతంగా మలిచారు భన్సాలీ. బాలీవుడ్లో ఒక పాటను చూస్తే.. కచ్చితంగా ఇది భన్సాలీ పాటే అని చెప్పవచ్చు. అంతలా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. అతడు దర్శకుడిగా, సంగీత దర్శకుడిగానూ రెండు పడవలపై సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణిస్తున్నారు. భన్సాలీ సినిమా విజువల్స్ ఒక ఎత్తు, సంగీతం మరో ఎత్తు. సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతం ఇలా అన్నింటితో ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తారు క్రియేటివ్ జీనియస్. డైరెక్టర్‌గా కామోషీ నుంచి పద్మావత్ వరకు ఆయన సినీ సంగీత సాగరాన్ని ఓ సారి పలకరిద్దాం. కామోషీ , హమ్ దిల్ దే చుకే సనమ్(హెచ్డిడిసిఎస్), దేవ్‌దాస్, బ్లాక్, గుజారీష్, గోలియాన్ కి రాస్లీల : రామ్‌లీల, బాజీరావ్ మస్తానీ ఇవన్నీ మ్యూజికల్ హిట్సే. బాలీవుడ్లో ఓ పది ఆణిముత్యాల్లాంటి గీతాలను తీస్తే..అందులో భన్సాలీ సినిమాలోని పాటలకు సమున్నత స్థానం ఉంటుంది. నింబుడా నింబుడా, డోలా రే డోలా, మార్ డాలా, పింగా, నగాడా సంగ్ డోల్.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో మరుపురాని పాటలు భన్సాలీ మస్తిష్కం నుంచే పుట్టాయి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాకముందునుంచీ కూడా సినిమాలోని ప్రతీ పాటపై ఎంతో జాగ్రత్త వహించేవారనీ ఆయనతో పనిచేసిన వారంతా చెబుతారు. భన్సాలీ గురించి సింగర్ కవితా కృష్ణమూర్తి మాటల్లో.... ‘భన్సాలీ తల్లి నాట్య కళాకారిణి. తండ్రి సినిమా ఇండస్ట్రీకి చెందినవారే. దీంతో భన్సాలీకి చిన్నప్పటినుంచే కళారంగంపై మక్కువ ఏర్పడింది. సంగీత దర్శకుడు ఇస్మాయిల్‌తో భన్సాలీది ప్రత్యేక అనుబంధం. వారిద్దరు మంచి మిత్రులు. అందుకే భన్సాలీ మనసులో ఏం అనుకుంటాడో ఇస్మాయిల్ కు అర్ధమైపోయేది. అందుకు తగ్గట్టుగా సంగీతమందించేవారు ఇస్మాయిల్ తనకు కావల్సినట్టు వచ్చే వరకు వొదిలిపెట్టేవాడు కాదు. భన్సాలీ పాటలోని ప్రతి చిన్న విషయాన్ని ఎంతో నిశితంగా పరిశీలించే వారు. పాటను ఏవిధంగా చిత్రీకరించాలో ముందే ఒక అవగాహన ఉంటుంది. పాట రికార్డింగ్ జరిగేప్పుడు కూడా అక్కడే ఉండేవాడు. భన్సాలీ సినిమాల(హమ్ దిల్ వే చుకే సనమ్, దేవ్‌దాస్)కు పాడిన పాటలు నాకెంతో గుర్తింపును తెచ్చాయి’ అన్నారు. సంగీత దర్శకుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ... ‘నేను కంపోజ్ చేసిన పాటలకు భన్సాలీ మాత్రమే ప్రాణం పోయగలరు. నేను ఏ విధంగా సంగీతాన్ని ఇస్తే..దానికి మించి తను వాటిని విజువలైజ్ చేసేవారు. ఆయన పాటలోని చిన్న మ్యూజిక్ బిట్‌ను కూడా వదిలేవారు కాదు. టింగ్ అనే చిన్న శబ్దం వచ్చినా దానికి కూడా తెరపై అందంగా చూపించేవారు. మ్యూజిక్‌పై ఎంతో ఇష్టం ఉంటే గానీ ఇలా చేయలేరు. హమ్ దిల్ దే చుకే సనమ్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ... నేను చేసిన పాటను అందరికీ వినిపించేవాడిని. కానీ ఏ ఒక్కరు సరిగా వినేవారుకాదు. సంజయ్ మాత్రం విని, మళ్లీ వినిపించు అనేవాడు. ‘తడప్ తడప్’ సాంగ్ విన్న తరువాత సంజయ్ నా వద్దకు వచ్చి ఇస్మాయిల్..ఈ సాంగ్ తరువాత నా సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలిసింది. ఎక్కడ ఇంటర్వెల్, క్లైమాక్స్ ఉండాలో తెలిసింది.’ అన్నారు. ఉదిత్ నారాయణ్ మాట్లాడుతూ.... ‘భన్సాలీతో పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. భన్సాలీ సినిమాల్లో ఏది తీసుకున్నా అదొక మ్యూజిక్ సెన్సెషనే. ఆ సినిమాల్లోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. ఆయన స్వయంగా రికార్డింగ్ రూంలో ఉండి ప్రతీది గమనించేవారు. నాకు వంద శాతం రిజల్ట్ కావాలి అనేవారు. హెచ్డిడిసిఎస్ సినిమా టైంలో జరిగిన ఒక సంఘటన గురించి చెపుతూ...చాంద్ చుపా బాదల్ మైన్..అనే పాట సినిమా రిలీజ్ అయిన తరువాత పదిరోజుల వరకు ప్రదర్శించారు. ఒక రోజు సంజయ్ వచ్చి ఈ పాట వద్దని కొంతమంది అంటున్నారు తీసేద్దాం అన్నారు. మళ్లీ నాలుగు రోజుల తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మళ్లీ సాంగ్ పెట్టండి అన్నారు. ఆ సాంగ్ ఎంతో పాపులర్ అయింది. ఆదిత్యనారాయణ్ మాట్లాడుతూ.... ‘పాటలోని ప్రతీ బీట్‌ను ఆయన గమనిస్తారు. ఆలాపన , తాళం ప్రతీ విషయాన్ని సూక్ష్మంగా చూస్తారు. ఆయన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కావడం వల్ల ఎక్కడ ఏ సన్నివేశానికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో ఆయనకు బాగా తెలుస్తుంది. ఎడిటింగ్ రూంలో కూడా సంగీతం గురించి ఆలోచించేవాడు’ అని రామ్‌లీల సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవాల్ని తెలిపారు. భన్సాలీకి భారతీయ సంగీతం, జానపదాలు అంటే ఇష్టమని ఆయన సినిమాలోని పాటలను చూస్తే తెలుస్తుంది. క్లాసికల్ సాంగ్స్‘అల్బెలా సజన్’, ‘కాహే చెడ్ మోహె’.. జానపద గీతాలు.. దోలీ తారో, నింబుడా, డోలా రే డోలా, పింగా, నగడా సంగ్ డోల్, లహు ముహ్ లగ్ గయ, తాజాగా పద్మావత్ లోని గూమర్ పాటను చూస్తే భన్సాలీ పాటను చిత్రీకరించే విధానం తెలుస్తుంది. పాటకు తన ఆలోచనలతో ప్రాణం పోస్తాడు భన్సాలీ. విరహ వేదన, ప్రణయ గీతాలను కూడా అంతే అందంగా చూపిస్తారు. ‘ఆంకోన్ కి గుస్తాకియాన్, జాన్క హవా కా, బైరీ పియ, సిల్సిలా ఏ చాహత్ క, జబ్ సే తేరా నైనా, మూన్ షబ్నామీ, తోడే బద్మాష్, లాల్ ఇష్క్, ఆయత్ , దీవానీ మస్తానీ లాంటివే ఇందుకు నిదర్శనం. తన పాటలతో తన వ్యక్తిత్వం ఏంటో తెలియజేశాడు భన్సాలీ. ఆయన మ్యూజిక్‌లో సాంప్రదాయ సంగీతానికి స్థానం కల్పించాడు. జానపదాలనూ గౌరవించాడు. నింబుడా, డోలా రే డోల, ఉడి ఉడి పాటలను ప్రస్తావించకుండా బాలీవుడ్ సంగీతం గురించి చెప్పలేం. భారతీయ సినీ సంగీతంలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న భన్సాలీ మరిన్ని దృశ్యకావ్యాలను మనకందించాలని ఆశిద్దాం. -
దీపిక నడుమును కవర్ చేసి..
అనేక వివాదాలు చుట్టుముట్టిన చారిత్రక చిత్రం ‘పద్మావత్’ లో సెన్సార్ బోర్డు సూచనల మేరకు చిత్రయూనిట్ పలు మార్పులు చేసింది. ఈ సినిమాపై కర్ణిసేన అభ్యంతరాలు, ఆందోళనల నేపథ్యంలో ’ఘూమర్’ పాటలో ప్రధానంగా మార్పులు చేసింది. గత నెలలో ఆన్లైన్లో విడుదల చేసిన ఈ పాటపై కర్ణిసేన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాణి పద్మావతిగా కనిపించిన దీపికా పదుకోన్ నృత్యం చేయడం, పాటలో ఆమె నడుము కనిపించడాన్ని ఆక్షేపించింది. రాణి పద్మావతి అలా గంతులేయడం ఏమిటని కన్నెర్ర జేసింది. ఈ పాటపై నృత్య ప్రదర్శన చేసిన పలుచోట్ల విధ్వంసాలకు దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ‘ఘూమర్’ పాటలో దీపిక నడుము కనిపించకుండా.. కంప్యూటర్ జెనరేటెడ్ వస్త్రంతో కవర్ చేశారు. సీబీఎఫ్సీ సలహాల మేరకు యూ/ఏ సర్టిఫికెట్ పొందేందుకు సినిమాలో ఈమేరకు కీలక మార్పులు చేసినట్టు చిత్రయూనిట్ అనధికారికంగా మీడియాకు తెలియజేసింది. పద్మావత్ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి లభించినా ఈ నెల 25న చిత్రం విడుదల అవుతుందా? లేదా? అన్నది సందేహాస్పదంగా మారింది. ఈ సినిమా విడుదలకు అనుగుణంగా అక్షయ్‌కుమార్ తన ‘ప్యాడ్‌మన్’ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. అయినా, కర్ణిసేన దిగిరాకపోవడం.. సినిమా విడుదలైతే.. తీవ్ర విధ్వంసం, పరిణామాలు తప్పవని హెచ్చరిస్తుండటంతో ‘పద్మావత్’ ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ఉత్కంఠకు దారితీస్తోంది. -
సీనియర్ న్యాయవాదికి చంపేస్తామని బెదిరింపులు
న్యూఢిల్లీ: ‘పద్మావత్’ సినిమా నిర్మాతల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను చంపేస్తామని రాజ్‌పుత్ కర్నిసేన బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాము కర్ణిసేన ప్రతినిధులమని, ‘పద్మావత్’ సినిమాకు అనుకూలంగా వాదించినందుకు తీవ్ర పరిణామాలు తప్పవని సాల్వేను కొందరు ఫోన్ చేసి బెదిరించినట్టు సమాచారం. ‘ కర్ణిసేన నా కార్యాలయానికి ఫోన్ చేసి బెదరించింది. దమ్ముంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని సవాల్ విసిరింది’ అని సాల్వే మీడియాతో తెలిపారు. సాల్వేను చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వివాదాస్పదంగా మారిన ‘పద్మావత్’ సినిమా ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ.. కర్ణిసేన మాత్రం ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు ఏమాత్రం ఆపడం లేదు. సినిమా విడుదలైతే.. థియేటర్లు తగలబెడతామని, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది. ‘పద్మావత్’కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కర్ణిసేన తగ్గకపోవడంతో ఈ సినిమా విడుదల ఉత్కంఠ రేపుతోంది. -
పద్మావత్ కోసం వెనక్కితగ్గిన ప్యాడ్‌మ్యాన్
ముంబై : వివాదాల సుడిగుండాలుదాటి విడుదలకు సిద్ధమైన ‘పద్మావత్’కు బాలీవుడ్ బాసటగా నిలిచింది. సంజయ్‌లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా విడుదల తేదీలు మారుతూ.. చివరికి జనవరి 25కు ఖరారైన నేపథ్యంలో ఆ రోజే విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదాపడ్డాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ప్యాడ్ మ్యాన్ సినిమా జనవరి 25న విడుదలకావాల్సి ఉండగా, భన్సాలీ అభ్యర్థన మేరకు విడుదల తేదీని ఫిబ్రవరి 9కి పోస్ట్‌పోన్ చేసుకున్నారు. బుధవారం ముంబైలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో భన్సాలీ-అక్షయ్‌లు ఈ విషయాన్ని చెప్పారు. ‘సినిమా విడుదల కావడం వారికి(పద్మావత్ రూపకర్తలకు) ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నా సినిమాను విడుదల చేయడం భావ్యంకాదు. అందుకే ఫిబ్రవరి 9కి వాయిదావేస్తున్నాను’ అని అక్షయ్ కుమార్ చెప్పారు. అడిగినవెంటనే వాయిదాకు అంగీకరించిన అక్షయ్‌కి కృతజ్ఞుడినని పద్మావత్ దర్మకుడు భన్సాలీ అన్నారు. -
పద్మావత్‌కు వ్యతిరేకంగా పిల్
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ చిత్రంపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ చిత్ర విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది ఒకరు శుక్రవారం న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే కోర్టు మాత్రం పిల్‌ను తోసిపుచ్చింది. ‘‘మాది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. సినిమాలను అడ్డుకోవటం మా పని కాదు. శాంతి భద్రతల పని ప్రభుత్వాలు చూసుకుంటాయని’’ అని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సినిమా విడుదలైతే అల్లర్లతో హింస చెలరేగే పరిస్థితి ఉందని.. ఈ నేపథ్యంలో పద్మావత్ సినిమాను విడుదల కానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేయటమే ఉత్తమమని ఎంఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. అయితే ఇది(పిల్‌ను ఉద్దేశించి) ప్రజలకు ఏ రకంగా మేలు కలిగించేదో అర్థం కావట్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చిత్ర విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు మానేయటం ఉత్తమమని.. ఈ కేసులో మరోసారి వాదనలు వినేందుకు సిద్ధంగా లేమని అని పిటిషనర్‌తో న్యాయమూర్తి తేల్చి చెప్పారు. సెన్సార్ బోర్డు చీఫ్‌కు వార్నింగ్... ఇదిలా ఉంటే పద్మావత్ చిత్ర విడుదలకు క్లియరెన్స్ ఇచ్చిన సీబీఎఫ్సీపై రాజ్‌పుత్ కర్ణిసేన ఆగ్రహంతో ఊగిపోతోంది. బోర్డు చీఫ్ ప్రసూన్ జోషిని ఇక ముందు రాజస్థాన్‌లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. పెద్ద ఎత్తున్న వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సెన్సార్ బోర్డు పట్టించుకోకపోవటం దారుణమని.. మున్ముందు మరిన్ని పరిణామాలు సెన్సార్ బోర్డు ఎదుర్కోవాల్సి ఉంటుందని కర్ణిసేన ఓ ప్రకటన విడుదల చేసింది. -
హెచ్చరికల నేపథ్యంలో స్పందించిన ‘సుప్రీం’
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ చిత్రం విడుదలైతే థియేటర్లను తగలబెడతామంటూ రాజ్‌పుత్ కర్ణిసేన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందించింది. థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయించాలని అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘‘దేశంలో స్వేచ్ఛా హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. సినిమాను అడ్డుకుంటామని.. థియేటర్లు ధ్వంసం చేస్తామని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. కాబట్టి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిందే’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఒకవేళ చిత్ర యూనిట్ సభ్యులు కోరితే... వారికి కూడా వ్యక్తిగతంగా భద్రత కల్పించాలని న్యాయమూర్తి పోలీసులకు సూచించారు. కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిత్రంపై నిషేధం విధించగా.. నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించటం.. చిత్ర విడుదలను అడ్డుకోవద్దంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది తెలిసిందే. బండిట్ క్వీన్ చిత్ర విషయంలోనే అభ్యంతరం వ్యక్తం కానప్పుడు.. పద్మావత్ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయినప్పటికీ చిత్రం విడుదలైతే రాజ్‌పుత్ మహిళలంతా సాముహిక ఆత్మహత్యలకు పాల్పడతారని కర్ణిసేన హెచ్చరిస్తోంది. అనధికార నిషేధం...? కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో... సుప్రీం కోర్టు ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అనధికారిక బ్యాన్ విధించే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల సంగతి పక్కన పెట్టి.. స్థానిక చట్టాల చొరవతో రాష్ట్రాలు నిషేధాన్ని కొనసాగించాల్సిందేనని కర్ణిసేన అధినేత లోకేంద్ర సింగ్ కల్వి కోరుతున్నారు. గతంలో రాజస్థాన్ లో జోధా అక్బర్ చిత్రాన్ని థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు స్వచ్ఛందంగా బహిష్కరించిన విషయాన్ని, మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫనా చిత్రాన్ని గుజరాత్లో నిషేధించిన(అనధికారికంగా) విషయాన్ని లోకేంద్ర గుర్తు చేస్తున్నారు. -
‘పద్మావత్’.. చాలా బాగుంది!
-
‘థియేటర్లు అన్నింటికి నిప్పు పెడతాం’
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ సినిమా విడుదలైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజ్‌పుత్ గ్రూపులు గురువారం మరోమారు హెచ్చరించాయి. సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే రాజ్‌పుత్ గ్రూపులు ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. పద్మావత్ విడుదలను నిషేధించాలని, లేకపోతే సినిమా విడుదలయ్యే థియేటర్లకు నిప్పు పెడతామని రాజ్‌పుత్ శ్రేణులు తీవ్ర హెచ్చరిక చేశాయి. ఇదే తమ ఆఖరి హెచ్చరిక అని కూడా చెప్పాయి. రాణి పద్మావతి అభిమానంతో అడుకునే పనులు ఎవరైనా చేస్తే తాము చూస్తూ ఊరుకోమని పేర్కొన్నాయి. -
‘పద్మావత్’.. చాలా బాగుంది!
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘పద్మావత్’ చిత్రం బాగుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కితాబిచ్చారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి రవిశంకర్ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘పద్మావత్’ చిత్రం చాలా బాగుందన్నారు. దీపికా పదుకునే, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌ల నటన అద్భుతంగా ఉందని రవిశంకర్ చెప్పారు. ఈ చిత్రంపై రాజపుత్రులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అర్థం లేనివని అన్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారంతా చిత్రాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ‘పద్మావత్’ చిత్రం రాజపుత్రుల గౌరవాన్ని పెంచుతుందని, రాణీ పద్మావతి దేవి గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు. -
పద్మావత్ : సుప్రీం గ్రీన్ సిగ్నల్
పద్మావత్ చిత్ర విడుదలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిషేధించిన రాష్ట్రాల్లో కూడా విడుదల చేయాల్సిందేనని గురువారం తేల్చి చెప్పింది. సెన్సార్ సమస్యలను దాటి ఈ నెల 25న రిలీజ్‌కు రెడీ అవుతున్న క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డ్ రిలీజ్ కు అనుమతించినా.. తాము మాత్రం అనుమతించబోమని ఆయా ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. దీంతో నిషేదంపై చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కారణంగా సినిమాను నిషేదించారంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాపై విధించిన నిషేదాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ సుప్రీం తీర్పుతో ఈ నెల 25న దేశవ్యాప్తంగా పద్మావత్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. -
వివాదాస్పద పాటతో ఇజ్రాయెల్ ప్రధానికి ఆహ్వానం!
అహ్మదాబాద్ : పద్మావత్ చిత్రంపై వివాదం కొనసాగిన వేళ.. గూమర్ పాటపై కూడా రాజ్‌పుత్ కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. రాణి పద్మిణి పాత్రతో గంతులేయించటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొన్నీ మధ్యే మధ్య ప్రదేశ్‌లో ఓ స్కూల్ కార్యక్రమంలో ఆ పాటపై పిల్లలు నృత్యాలు చేయగా.. రంగ ప్రవేశం చేసిన కర్ణిసేన.. కుర్చీలు విరిచేసి కార్యక్రమాన్ని రసాభాస చేసిపడేసింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర హోంశాఖా మంత్రి భూపేంద్ర సింగ్ ‘‘చిత్రాన్ని నిషేధించినప్పుడు.. అందులో పాటను ప్రదర్శించటం సరికాదంటూ’’ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అదే పాటను ఇప్పుడు గుజరాత్లో ఓ అధికారిక కార్యక్రమానికి వినియోగించటం విశేషం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో ఇరు దేశాల సంయుక్త కళా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నెతన్యాహు-మోదీ రాక సందర్భంగా నిర్వాహకులు స్కూల్ చిన్నారులతో గూమర్ పాటకు నృత్యాలు చేయించారు . ఇరు దేశాల ప్రధానులిద్దరూ నడుచుకుంటూ వస్తుండగా.. ఈ పాటకు ఓ చిన్నారి ప్రదర్శన ఇవ్వటం విశేషం. స్థానిక బీజేపీ నేతలు దగ్గరుండి మరీ ఈ వేడుకలు నిర్వహించటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇదిలా ఉంటే పద్మావత్‌ను బ్యాన్ చేసిన రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. #Ghoomar song of @filmpadmaavat played and dance performed on it in #Ahmedabad. This program is to welcome PM @narendramodi & Isreal PM #Netanyahu. 👏👏👏 pic.twitter.com/layjWd0t5R — Kirandeep (@raydeep) 17 January 2018 -
సుప్రీం గడపతొక్కిన ‘పద్మావత్’ నిర్మాతలు
న్యూఢిల్లీ: దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన‘పద్మావత్’ చిత్ర వివాదం మళ్లీ మొదటికొచ్చింది. షూటింగ్ మొదలు పెట్టిన దగ్గరనుంచీ వివాదాలతో సహజీవనం చేస్తున్న ‘పద్మావత్’.. తాజాగా మరోమారు సుప్రీంకోర్టు గడపతొక్కింది. మొదట్లో చిత్ర విడుదలకు అంగీకరించని సెన్సార్ బోర్డు కొన్ని షరతులు, సీన్ల తొలగింపు తరువాత ఆమోదముద్ర వేసింది. ఈ చిత్రంపై మొదటినుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నఆందోళనకారులు.. సెన్సార్‌బోర్డు అనుమతిచ్చినా.. అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్, రాజస్తాన్, హర్యానా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు.. చిత్ర విడుదలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. సినిమా విడుదలను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవడంపై పద్మావత్ నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయిచారు. ఎన్నో కష్టాలనోర్చి రూపొందిచిన ‘పద్మావత్’ చిత్రానికి న్యాయం చేయాలంటే.. నిర్మాతలు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చిత్ర నిర్మాతల పిటీషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా.. రేపు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధానపాత్రలలో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన 'పద్మావత్' జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
‘పద్మావత్’పై నిషేధాల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ వివాదాస్పద సినిమా ‘పద్మావత్’పై నిషేధం విధిస్తున్న రాష్ట్రాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హర్యానా కూడా ఈ సినిమా విడుదలపై నిషేధం విధించింది. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నట్టు హర్యానా మంత్రి అనిల్ విజ్ తెలిపారు. చరిత్రను వక్రీకరించి తెరకెక్కించిన ఈ సినిమాపై నిషేధం విధించాలన్న తన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రాణి పద్మావతి పాత్రను దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తప్పుగా చిత్రీకరించారని అంతకుముందు అనిల్ విజ్ ఆరోపించారు. భారతీయ మహిళల గౌరవానికి రాణి పద్మావతి ప్రతీక అని, ఆ పాత్రను ఖూనీ చేయడానికి ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్.. ఇప్పటికే ‘పద్మావత్’ పై నిషేధం విధించాయి. సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ చిత్రం విడుదల కాకుండా నిషేధం పెట్టడం గమనార్హం. ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ‘పద్మావత్’కు వ్యతిరేకంగా రేపటి నుంచి ఆందోళనలకు దిగుతామని రాజస్థాన్‌లోని కర్ణిసేన ప్రకటించింది. -
యోగి.. జ్యోతిష్కుడు కాదంట!
గోరఖ్‌పూర్ : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మీడియాపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనకు పద్మావత్ చిత్ర విడుదలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో మీడియాపై ఆయన చికాకు పడ్డారు. ‘‘నేనేమైనా జ్యోతిష్కుడిని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రిని. చిత్రం విడుదల అవుతుందో.. లేదో నేనెలా చెప్పగలను. ఆ నిర్ణయం నా చేతుల్లో లేదు. జరిగేది జరుగుతుంది. ఈ విషయంలో ఇంకా ప్రశ్నలు అడగకండి’’ అంటూ మీడియాపై యోగి అసహనం ప్రకటించారు. ఈ లెక్కన్న ఖచ్ఛితంగా చిత్రంపై నిషేధం విధించాలన్న ఆలోచనలో ఆయన లేడనే విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, యోగి గతంలో ఓసారి ఈ చిత్ర వివాదంపై స్పందిస్తూ... ‘ప్రజల మనోభావాలతో ఆడుకోవటం చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి అలవాటైన పనే’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున్న నిరసనలు వినిపిస్తున్నాయని, కాబట్టే ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే జనవరి 25న పద్మావత్ హిందీతోపాటు తెలుగు, తమిళ్లో విడుదల కాబోతోంది. మధ్య ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల కానివ్వబోమని ప్రకటించాయి. -
ఆ సినిమాను ఆపకుంటే చచ్చిపోతాం
జైపూర్: వివాదాస్పద ‘పద్మావత్’ సినిమాకు కష్టాలు ఇప్పట్లో తొలగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమాను ప్రదర్శిస్తే ఆత్మాహుతికి పాల్పడతామని రాజ్‌ఫుత్ మహిళలు హెచ్చరించారు. చిత్తోర్‌గఢ్ కోట వద్ద బలిదానాలు చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ‘పద్మావత్’కి వ్యతిరేకంగా పలు దశల్లో పోరాటం చేయాలని సర్వసమాజ్ సంఘం సభ్యులు నిర్ణయించారు. చిత్తోర్‌గఢ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి 500 మంది హాజరయ్యారు. వీరిలో 100 మంది సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నారు. ఈ నెల 17న జాతీయ రహదారులు, రైలు మార్గాలను దిగ్బంధిస్తామని రాజ్‌పుత్ కర్ణిసేన ప్రతినిధి వీరేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు ఉదయ్‌పూర్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసి ‘పద్మావత్’ విడుదల కాకుండా చూడాలని కోరినట్టు చెప్పారు. అలాగే 16న బార్మర్ జిల్లా పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీని కూడా తమ ప్రతినిధులు కలుస్తారని వెల్లడించారు. తమ ప్రయత్నాలు విఫలమైతే ఈ నెల 24న రాణి పద్మావతి ఆత్మాహుతికి పాల్పడిన చిత్తోర్‌గఢ్ కోటలోనే క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో మహిళలు బలిదానాలకు పాల్పడతారని వీరేంద్ర సింగ్ హెచ్చరించారు. కాగా, సెన్సార్ బోర్డు అనుమతించడంతో ఈనెల 25న పద్మావత్ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
దీపిక నడుముతో పెద్ద తలనొప్పి!
పద్మావత్ చిత్ర విడుదలకు క్లియరెన్స్ లభించినా మేకర్లకు మాత్రం చిక్కులు తప్పటం లేదు. ఓవైపు కర్ణి సేన హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందుతున్న దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ.. మరోవైపు సెన్సార్ బోర్డు సూచనల మేరకు చిత్రానికి మరమ్మత్తులు పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనకు ఓ కొత్త సమస్య ఎదురైందని తెలుస్తోంది. ఈ చిత్రంలో గూమర్ సాంగ్‌లో పద్మావతిగా దీపిక వేసిన స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి. కానీ, కర్ణిసేన మాత్రం ఆ పాట పై కన్నెర్ర చేసింది. రాణి పద్మావతి అలా గంతులేయటం ఏంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న సెన్సార్ బోర్డు ప్యానెల్ సభ్యులు ఆ పాటను కూడా ఎడిట్ చేయాల్సిందేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాటలో దీపిక నడుము కనిపించే షాట్లను తొలగించాలని సూచించింది. అయితే అది మొత్తం పాట పైనే ప్రభావం చూపే అవకాశం ఉండటంతో భన్సాలీ ఓ నిర్ణయానికి వచ్చాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ద్వారా దీపిక నడుమును కప్పిపుచ్చే యత్నం చేస్తున్నాడంట. అయితే ఈ ఎడిటింగ్ పనుల వల్ల చిత్రం జనవరి 25 తేదీన విడుదలయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తోందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముందు మాకు చూపించండి : రాజస్థాన్ హైకోర్టు పద్మావత్ చిత్రంపై దాఖలైన ఓ పిటిషన్ పై శుక్రవారం రాజస్థాన్ హైకోర్టు విచారణ చేపట్టింది. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతోపాటు దీపిక, రణ్వీర్లపైన గతేడాది మార్చిలో నగౌర్ జిల్లా దీవానా పోలీస్ స్టేషన్లో ఓ కేసు దాఖలైంది. అయితే ఆ అభియోగాలను కొట్టివేయాలంటూ భన్సాలీ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన బెంచ్.. అభ్యంతరాల నేపథ్యంలో ముందు చిత్రాన్ని తమ ముందు ప్రదర్శించాలని.. చూసి నిర్ధారించుకున్నాకే కేసును కొట్టివేస్తామని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై తదుపరి వాదనను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. 17 నుంచి నిరసన ప్రదర్శనలు చిత్తోర్‌ఘడ్ వేదికగా మరో ఉద్యమానికి రాజ్‌పుత్ కర్ణిసేన సిద్ధమవుతోంది. పద్మావత్ చిత్ర విడుదలను అడ్డుకునే దిశగా పెద్ద ఎత్తున్న ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదివారం కర్ణిసేన ప్రతినిధులు హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. మరోవైపు కర్ణిసేన పెద్దలు 17న తేదీన పద్మావత్ చిత్రానికి దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు.