సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’కు వ్యతిరేకంగా ఐదారు రాష్ట్రాల్లో కర్ణిసేన అల్లర్లు సష్టిస్తున్న నేపథ్యంలో ఈ సేన ఎప్పుడు పుట్టింది ? ఎందుకు పుట్టింది ? దీనికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు ? అన్న ఆసక్తికరమైన ప్రశ్నలు రావడం సహజమే. రాజస్థాన్ రాజ్‌పుత్ సామాజిక వర్గానినికి చెందిన నిరుద్యోగ యువత 2006 సంవత్సరంలో ‘శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన’ను ఏర్పాటు చేసింది. అప్పటికే రాజ్‌పుత్ నాయకుడిగా ఆ కమ్యూనిటీలో మంచి గుర్తింపు ఉన్న లోకేంద్ర సింగ్ కల్వీ అండదండలతో అది ప్రాణం పోసుకుంది.
కులాల ప్రాతిపదికన తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసింది. కులాల ప్రాతిపదిక రిజర్వేషన్లను రాజ్‌పుత్ రాజకీయ నాయకులు మొదటి నుంచి వ్యతిరేకిస్తుండగా, శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన ఏర్పాడ్డాక హఠాత్తుగా వారి వైఖరి మారింది. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా వారి వైఖరి అదే. ఆ తర్వాత తమ నాయకుల రాజకీయ సమీకరణల కారణంగా ఈ సేనలో చీలికలు వచ్చి మూడు గ్రూపులుగా సేన విడిపోయింది. తొలిగ్రూపు శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన కాగా, రెండో గ్రూపు రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేనా సమితి, మూడో గ్రూపు శ్రీరాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన.
శ్రీరాజ్‌పుత్ కర్ణిసేనను లోకేంద్ర సింగ్ కల్వీ ఏర్పాటు చేసినప్పుడు సేనకు అధ్యక్షుడిగా అజీత్ సింగ్ మందోలిని నియమించారు. 2008లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చినప్పుడు తనకు కాంగ్రెస్ టిక్కెట్ కావాలని మందోలి పట్టుపడ్డారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కల్వీ టిక్కెట్‌ను ఆశిస్తున్నందున ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో మొదటిసారిగా కర్ణిసేన విడిపోయింది. ఆ తర్వాత 2010లో మూడో వర్గం ఏర్పడింది. రెండు లక్షల మంది సభ్యులున్నారని చెప్పుకుంటున్న ఆవిర్భావ సంస్థ ‘శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన’నే ప్రస్తుతానికి బలమైన గ్రూపు. ఉమ్మడి లక్ష్యాల కోసం ఏ ఆందోళనలు చేసినా ఈ మూడు గ్రుపులు పోటాపోటీగా వ్యవహరిస్తాయి. ఆందోళనల సందర్భంగా విధ్వంసానికి దిగడంలో కర్ణిసేనలకు పెట్టింది పేరు.
అశుతోశ్ గోవరికర్ తీసిన ‘జోధా అక్బర్’ బాలీవుడ్ సినిమాను 2006లో అడ్డుకోవడం ద్వారా కర్ణిసేన పేరు మొదటిసారి దేశవ్యాప్తంగా వినిపించింది. ఇప్పుడు పద్మావత్ సినిమాను అడ్డుకోవడం ద్వారా ఆ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెల్సింది.
Comments
Please login to add a commentAdd a comment