
పర్యాటకురాలిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తున్న జవాను
ఊరు తెలియదు, పేరు తెలియదు... ఎవరో, ఎక్కడివారో అసలే తెలియదు. తమ ప్రాంతం కాదు... భాష కాదు. అలాంటివారిని నిష్కారణంగా, నిర్దయగా కాల్చి చంపడం హేయం, దారుణం. కశ్మీర్‌లోని పహల్గావ్‌ు సమీపంలోని బైసారన్ పట్టణంలో పర్యాటకులపై విరుచుకుపడి 28 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు అక్షరాలా మానవాకార మృగాలు. భయకంపితులు తమకు తాము ధైర్యం తెచ్చుకోవటానికి సాగించే క్రూర చర్యే బీభత్సమని మార్క్సిస్టు సిద్ధాంతవేత్త ఫ్రెడరిక్ ఏంగెల్స్ అంటాడు. వీళ్లు నిజంగా భీరువులు. పొరుగు దేశం చేతుల్లో పావులు.
ఈ ఘోరానికి ఎంచుకున్న సమయం, సందర్భం గమనిస్తే ఇది యాదృచ్ఛికంగా, చెదురుమదురుగా జరిగిన దాడి కాదని స్పష్టంగా తెలుస్తుంది. మన దేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇస్లామిక్ ప్రపంచంలో అత్యంత పలుకుబడి కలిగిన సౌదీ అరేబియా పర్యటనకెళ్లారు. అంతర్జాతీయంగా అందరి దృష్టీ పడాలంటే ఇంతకన్నా మెరుగైన సమయం లేదని వీరిని వెనకుండి నడిపించిన పాకిస్తాన్‌లోని సూత్రధారులు అనుకున్న పర్యవ సానంగానే ఈ దారుణం చోటుచేసుకుంది.
దాడికి తెగబడిన ఏడుగురూ సైనిక దుస్తుల్లో ఆ ప్రాంతంలోకి చొరబడ్డారని, వారిలో దాదాపు అయిదుగురు పాకిస్తానీ పౌరులేనని అంటున్నారు. ఈ దాడిని కేంద్రం చాలా తీవ్రంగా తీసుకున్నదని ప్రధాని అర్ధంతరంగా తన సౌదీ పర్యటనను రద్దు చేసుకుని రావడాన్ని గమనిస్తే అర్ధమవుతుంది. మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ బుధవారం హుటాహుటిన సమావేశమైంది.
కాల్పుల్లో గాయపడినవారూ, తప్పించుకున్నవారూ చెబుతున్న కథనాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పెళ్లయి కేవలం ఆరు రోజులే అయిన జంటను ఆ దుర్మార్గులు లక్ష్యంగా ఎంచుకుని భర్తను కాల్చిచంపటం ఎలాంటి వారికైనా కంటతడి పెట్టిస్తుంది. తమ దురంతాన్ని ప్రధానికి చెప్పుకోవాలని, అందుకే ప్రాణాలతో విడిచిపెడుతున్నా మని నవవధువుతో వారు చెప్పిన తీరు గమనిస్తే ఉన్మాదం ఏ స్థాయిలో ముదిరిందో తెలుస్తుంది.
ఒక ప్రాంతాన్ని బలప్రయోగం ద్వారానైనా సొంతం చేసుకోవాలని, దానిపై సర్వహక్కులూ తమకే ఉన్నాయని ఒక దేశమైనా, ఒక ముఠా అయినా భావించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధా రణ పౌరులను లక్ష్యంగా ఎంచుకుని సంహరిస్తే మందీమార్బలంవున్న ప్రభుత్వం లొంగిపోతుంద నుకోవటం పిచ్చితనమని ఈ ఉన్మాదులూ, వీరి వెనకుండి ప్రోత్సహిస్తున్నవారూ గ్రహించలేక పోతున్నారు.
ఈ మధ్యే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కశ్మీర్ తమ కంఠనాళమని, దాన్ని మరిచిపోయే లేదా విడనాడే ప్రసక్తేలేదని ప్రకటించారు. కానీ ఈ దుస్సంఘటన జరిగిన వెంటనే దీనితో తమకు సంబంధం లేదంటూ పాత పాటే అందుకున్నారు. తాను పెంచి పోషించిన విష సర్పం తననే కాటేస్తున్న ఉదంతాలున్నా పాక్ మూర్ఖంగా ప్రవర్తిసోంది.
ఉగ్రవాదుల మతిమాలిన చర్యలకు అక్కడి సమాజం మద్దతు లేదని బుధవారం వెలువడిన పత్రికలు చూస్తేనే తెలుస్తుంది. అక్కడి పత్రికలన్నీ ముష్కరుల దురంతానికి నిరసనగా నల్లటి కాగి తంపై తెల్లటి అక్షరాలతో మొదటి పేజీని నింపాయి. పాలక పక్షానికి నేతృత్వం వహిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, హురియత్ కాన్ఫరెన్స్‌తోపాటు పౌర సమాజం మొత్తం దాడిని ముక్తకంఠంతో ఖండించింది. పర్యాటకులపై ఈ స్థాయిలో విరుచుకుపడటం 2012 తర్వాత ఇదే మొదటిసారి.
ఆ సంవత్సరం బిజ్‌బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు మహారాష్ట్ర నుంచి వెళ్లిన నలుగురు మహిళా పర్యాటకులను పొట్టన బెట్టుకున్నారు. అంతకుముందు పహల్గామ్‌లో 2000 సంవత్సరంలో తీర్థ యాత్రల కోసం వచ్చిన 32 మంది ప్రాణాలు తీశారు. ఆ తర్వాత ఇదే పెద్ద దాడి. జమ్మూ–కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని 2019 ఆగస్టులో కేంద్రం రద్దు చేసిన నాటినుంచీ తీసుకున్న చర్యల వల్ల అక్కడ పరిస్థితులు మెరుగు పడుతున్నాయన్న అభిప్రాయం అందరిలో కలిగింది.
కానీ అదంతా నిజం కాకపోవచ్చని అడపా దడపా జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. అందుకే భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. ఇటీవల జరిగిన దాడుల్లో కూలిపనుల కోసం వెళ్లే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నారు. కానీ మంగళవారం నాటి ఘటన తీరు గమనిస్తే వారి వ్యూహం మారిందన్న అభిప్రాయం కలుగుతుంది.
కశ్మీర్‌లో ఉగ్రవాదం కోరలు పీకామని, ఇక అక్కడేం చేయలేక జమ్మూ ప్రాంతంలో మిలిటెంట్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఈమధ్యే జమ్మూ, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. ఉగ్రవాదం ఎప్పుడు పడగవిప్పి బుసలు కొడుతుందో అంచనా వేయటం సులభం కాదు. కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం పర్యాటకులపై దాడి జరిగే అవకాశం వున్నదని నిఘా సంస్థలు హెచ్చరించాయి.
అదే నిజమైతే లోటుపాట్లకు కారకులైనవారిపై కఠినంగా చర్య తీసుకో వాల్సిన అవసరం వుంది. అందాల కశ్మీరాన్ని తనివితీరా చూడాలని, స్థానిక రుచులను ఆస్వాదించి అక్కడి సంస్కృతిని ఆకళింపు చేసుకోవాలని దేశం నలుమూలల నుంచీ అనేకమంది నిత్యం అక్కడికెళ్తున్నారు. ఇప్పుడు ఉగ్రదాడిలో మరణించినవారిలో కూడా భిన్న రాష్ట్రాలకు చెందిన వారున్నారు.
దాడికి దిగిన ముఠా సభ్యులు ఎటునుంచి వచ్చారో తెలుసుకోవటం, వారిని సజీవంగా పట్టుకుని విషయాలు రాబట్టడం, అంతర్జాతీయంగా పాక్ నిజస్వరూపాన్ని చాటడం అత్యవసరం. దేశం మొత్తం ఏకమై ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన తరుణమిది. అందుకే బాధ్యతా యుతంగా మాట్లాడటం అవసరమని రాజకీయ పక్షాలన్నీ గ్రహించాలి.