
అభిప్రాయం
పహల్‌గామ్‌లో తీవ్రవాదుల ఘాతుకమైన దాడి ఏప్రిల్ 22న జరిగి వారం రోజులు గడిచాయి. ప్రతిగా భారత ప్రభుత్వం దౌత్య పరమైన చర్యలు కొన్ని తీసుకున్నది గాని, దేశంలో రగులుతున్న ఆగ్రహావేశాలు చల్లారు తున్న సూచనలు లేవు. ‘కశ్మీర్ రెసిస్టెన్స్’ పేరిట దాడి జరిపిన వారిని పట్టుకుని శిక్షించటం ఒకటైతే, ఇటువంటి సంస్థలను మొదటినుంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై తగిన ప్రతీకార చర్య అన్నది అంతకుమించిన అవసరంగా సాధారణ భారతీయుల మనస్సులను దహించి వేస్తున్నది. పాక్‌తో గల సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నామన్న ప్రకటన దాని పర్యవసానాల రీత్యా తీవ్రమైనదేగానీ, అంతకుమించిన తక్షణ చర్య, సూటిగా చెప్పాలంటే సైనిక చర్యను జనం కోరుతున్నారు.
తీవ్రవాదుల కోసం కశ్మీర్‌లో ముమ్మరమైన తనిఖీలు సాగు తున్నాయి. అనుమానితులను ఇప్పటికే పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని కొందరి ఇళ్ళను కూల్చివేస్తున్నారు. సాధారణంగా జరిగేట్లు ఇంతవరకు ఎవరినీ ఎన్‌కౌంటర్లలో కాల్చివేయలేదు. కశ్మీర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్య టించి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. వైమానిక బలగాన్ని కూడా. నౌకా బలాలు విన్యాసాలు జరిపాయి. అనగా త్రివిధ బలాలు సన్నద్ధ మవుతున్నాయన్నమాట.
యుద్ధంతో మనకూ నష్టమే!
కొద్ది రోజులుగా ప్రతి రోజూ రాత్రి సరిహద్దు దళాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అది ‘తేలిక రకం’ ఆయుధాలతోనన్నది సైన్యం స్వయంగా చెప్తున్నమాట. తేలిక రకం అనే మాట కిందకు పలు రకాల ఆయుధాలు వస్తాయి. వాటిలో ప్రజలు వినే పేర్లు ఇన్సాస్ రైఫిళ్లు, లైట్ మెషీన్ గన్స్, సబ్ మెషీన్ గన్స్. వాటి ప్రయోగంతో రెండువైపులా ప్రాణ నష్టాలు ఇప్పటికి జరగలేదు.
సరిహద్దులలో తగినంత దూరం పాటిస్తారు, బంకర్లలో ఉంటారు. గనుక ప్రాణ నష్టాలు సాధారణంగా జరగవు. తేలిక రకం ఆయుధాల వినియోగం స్థానిక కమాండర్ల నియంత్రణలో జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీ ఆయుధాల వినియోగం జరిగితేనే ఘర్షణ పైస్థాయికి వెళ్లినట్లు!
త్రివిధ బలాలను అప్రమత్తం చేసినందున పూర్తి స్థాయి యుద్ధమా? 2019లో పుల్వామా వద్ద భారత సైనికులపై దాడిలో 40 మంది చనిపోయిన దరిమిలా పాకిస్తాన్‌లోని బాలాకోట్ టెర్రరిస్టు స్థావరాలపై మెరుపు దాడులు జరిపి అంతకు పరిమితం కావడం వంటిదా? కొద్దిగా ఆలోచించినట్లయితే పూర్తి స్థాయి యుద్ధానికి అవకాశం కన్పించదు. ఇండియా కన్నా పాకిస్తాన్ సైనిక శక్తి తక్కువే గానీ మరీ అంత బలహీనమైనది కాదు. యుద్ధం దీర్ఘకాలం సాగితే పాకిస్తాన్ ఓడుతుంది గానీ భారతదేశానికి కూడా తీవ్ర నష్టాలు కలుగుతాయి.
యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనపరచుకోవచ్చునని ఎవరైనా భావిస్తే, కొత్త సమ స్యలు కొని తెచ్చుకోవటమవుతుంది. సగం కశ్మీర్‌తోనే ఇన్ని సమస్య లున్నాయి. అణు యుద్ధానికి ఇపుడెవరూ సుముఖంగా లేరు. కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనపరచుకునే స్థితి అంటూ కనిపిస్తే, అణు ప్రయోగానికి పాక్ సైన్యం వెనుకాడబోదు. తూర్పు పాకిస్తాన్ తమది కాకుండా పోయిందనే ఆగ్రహం వారికి ఇప్పటికీ చల్లారలేదు.
అందువల్ల, అటు ఇటుగా బాలాకోట్ నమూనా ప్రతిదాడులకే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాన్ని ముదరనివ్వకండంటూ ఇప్పటికే సూచనలు చేస్తున్న అమెరికా జోక్యాలు తెర వెనుక నుంచి ఎట్లుండవచ్చునన్నది మరో ప్రశ్న. అమెరికా మాటను కాదనే శక్తి భారత, పాకిస్తాన్‌లలో దేనికీ లేదన్నది ఒక చేదు నిజం. కశ్మీర్‌లో అంతర్గతంగా టెర్రరిజంపై, మిలిటెన్సీపై ఎటువంటి చర్యలైనా భారత భద్రతాదళాలు యథేచ్ఛగా తీసుకోగలవు. ఆ చర్యలు సుమారు 1990 నుంచి 35 సంవత్సరాలుగా తీసుకుంటున్నవే.అందువల్ల కలిగిన ఫలితాలేమిటన్నది వేరే ప్రశ్న.
నీటిని ఆపగలమా?
ప్రభుత్వం ఇప్పటికి ప్రకటించిన చర్యలలో నిజంగా తీవ్రమైనది సింధూ ఒప్పందాన్ని సస్పెండ్ చేయటం. 1960 నాటి ఆ ఒప్పందం పాకిస్తాన్‌కు కీలకమైనది. ఆ జలాలు ఆగినా, తగ్గినా వారి వ్యవ సాయం అల్లకల్లోలమవుతుంది. కనుకనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అది తమపై ‘యుద్ధ చర్య’ కాగలదంటూ తీవ్రమైన భాషను ఉపయోగించారు.
పాకిస్తాన్‌కు ‘ఒక్క చుక్క’ నీరు కూడా పోనివ్వమని భారత ప్రభుత్వ బాధ్యులు ప్రకటించనైతే ప్రకటించారు గానీ,పోకుండా ఆపటం నిజంగా సాధ్యమా? ప్రపంచబ్యాంకు ఆధ్వర్యాన జరిగిన ఈ అంతర్జాతీయ జలాల పంపిణీ ఒప్పందంలో ఐక్యరాజ్య సమితి పాత్ర ఉంది. బ్యాంకు పక్షాన ‘ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్’ (ఐబీఆర్‌డీ) సంతకం చేసింది.
ఏదైనా వివాదం తలెత్తితే మొదట ‘తటస్థ నిపుణుని’ దృష్టికి, తర్వాత ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్’ ముందుకు వెళ్లాలి. తిరిగి ఇందులోనూ రెండు దేశాల సార్వభౌమాధికారానికి ఏది వర్తిస్తుంది, ఏది వర్తించదనే మీమాంస ఉంది. లోగడ రెండుసార్లు వాస్తవంగా యుద్ధాలు జరిగి నపుడు కూడా ఇటువంటి సస్పెన్షన్లు జరగలేదు.
ఇదంతా సాంకేతిక పరమైన కోణం కాగా, నీరు అటు పోకుండా ఆపగల జలాశయ నిర్మా ణాలు అసలు ఇండియాకు లేనే లేవనీ, ఆ నిర్మాణాలకు అనేక చిక్కు లున్నాయనే ఆచరణపరమైన విషయాలను నిపుణులు ప్రస్తావిస్తు న్నారు. అనగా, ఈ చర్య ఎంత ప్రభావం చూపగలిగేది అయినా ఇప్పటికిప్పుడు జరిగేది కాదన్నమాట.
వాస్తవాధీన రేఖే పరిష్కారమా?
మనం విస్మరించేదేమంటే కశ్మీర్ తరహా అనేక భౌగోళిక, సరిహద్దు సమస్యలను బ్రిటిష్ వలస పాలకులు ప్రపంచమంతటా సృష్టించిపోయారు. భారత–చైనా, భారత–బంగ్లాదేశ్, పాలస్తీనా– ఇజ్రాయెల్ వంటివన్నీ అందుకు ఉదాహరణలు. తిరిగి వాటిని సొమ్ము చేసుకుంటూ పాశ్చాత్య దేశాలు ఇరుపక్షాలకూ ఆయుధాలను అమ్ముకుంటున్నాయి.
కశ్మీర్‌కు సంబంధించి ఒక వివేకవంతమైన పరిష్కార మార్గాన్ని మొదటిసారిగా కనుగొన్నది 1972లో అప్పటి ప్రధానులు ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత వారు సిమ్లాలో సమావేశమై, కశ్మీర్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ, లేదా లైనా ఆఫ్ కంట్రోల్)ను శాశ్వత సరిహద్దుగా గుర్తించుకున్నట్ల యితే అన్ని సమస్యలూ సమసిపోగలవని సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ, తమ రాజధానులకు తిరిగి వెళ్లి ప్రజాభిప్రాయా నికి జంకి వెనుకకు పోయారు. ఆచరణాత్మకంగా ఆలోచించినట్లయితే, అది మాత్రమే ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం కాగలదా?
ఇది భారత–పాకిస్తాన్ సమస్యల పరిష్కారం అయితే, ఇక మిగి లేది కశ్మీర్‌లో అంతర్గత సమస్యలు. మొదటిది తేలినపుడు రెండవది సగం మేర తేలుతుంది. తక్కినది అభివృద్ధి, ఉపాధి కల్పన, అవి నీతిని అదుపు చేయటం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలతో తప్పకుండా పరిష్కారమవుతుంది. ఈ మాట నేను 3 విడతలుగా 55 రోజుల పాటు కశ్మీర్ అన్ని ప్రాంతాలలో తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మాట్లా డిన మీదట అంటున్నది.
1947 నుంచి ఇంతవరకు గల కశ్మీర్ చరిత్ర నేపథ్యంలో అక్కడి ప్రస్తుత పరిస్థితులను, యుద్ధం ద్వారా ఏదైనా తేలగలదా అనే అవకాశాలను, మిలిటెన్సీ–టెర్రరిజాల హెచ్చు తగ్గుల క్రమాన్ని, ముఖ్యంగా 1987 నుంచి తీవ్రవాదం తలెత్తి సాగుతున్న కారణాలను పరిశీలించినపుడు, ఇటువంటి అభిప్రాయం ఏర్పడుతు న్నది. అందువల్ల రెండు దేశాలూ విజ్ఞతతో ఆలోచించి ఇందిరాగాంధీ–భుట్టోల స్ఫూర్తితో రాజీ మార్గానికి రావటం సమస్యను శాశ్వ తంగా పరిష్కరించి ఇరు దేశాలకు ఎనలేని మేలు చేయగలదు.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు