Indian government
-
ఖర్చు పెట్టించేందుకు ఇది చాలదు!
భారతదేశ మధ్య తరగతి బహుశా గడచిన మూడు దశాబ్దాల్లో ఇలాంటి బడ్జెట్ చూడ లేదు. ఆదాయ పన్నులో ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుందని మోదీ సర్కారుపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంత భారీ ఊరట లభిస్తుందని మాత్రం ఊహించలేదు. నగరాల్లో నెలకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఉన్నవారిని మాత్రమే మధ్య తరగతిగా పరిగణించాలని నేను గతంలో వాదించాను. అయితే, ఇలాంటి వాళ్లు దేశం మొత్తమ్మీద నాలుగైదు శాతం మాత్రమే ఉంటారు. ఇంత మొత్తం ఆర్జిస్తున్నవాళ్లు కూడా పన్నులు కట్టే పని లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఎందుకీ ఉపశమనం?ఫలితంగా ఈ స్థాయి ఆదాయమున్న వారి జేబుల్లోకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు అదనంగా వచ్చి చేరుతుంది. ఈ డబ్బును ఇంటికి కావాల్సిన వస్తువుల కొనుగోలుకు వాడుకోవచ్చు. లేదంటే దాచుకుని చిరకాలంగా ఆశపడుతున్న స్మార్ట్‌ఫోన్ నైనా సొంతం చేసుకోవచ్చు. మీ ఆదాయం నెలకు రెండు లక్షల రూపాయలనుకుంటే, మారిన పన్ను రేట్ల కారణంగా మీకు నెల నెలా రూ. 9,000 అదనంగా ఆదా అవుతుంది. దీన్ని రోజువారీ ఖర్చుల కోసం వాడు కోవచ్చు. ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు వెళ్లి భోంచేయొచ్చు. ఏడాదిలో రూ. 1.10 లక్షలు మిగులుతుంది. ఈ డబ్బుతో 55 అంగుళాల టీవీ, అత్యాధునిక వాషింగ్ మెషీన్ కొనుక్కోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే, పన్నుల మినహాయింపు పొందిన మధ్య తరగతి విరగబడి కొనుగోళ్లు చేస్తుందనీ, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమొస్తుందనీ మోదీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే జరిగితే దేశంలో, ముఖ్యంగా నగర మధ్యతరగతి వినియోగం తగ్గుతోందన్న ఫిర్యాదులకు ఫుల్స్టాప్ పడుతుంది. 2022–23లో దేశంలో దాదాపు 7 కోట్ల మంది ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించారని దాఖలైన ఆదాయ పన్ను రిటర్న్స్ చెబుతున్నాయి. వీరిలో దాదాపు రెండు కోట్ల మంది పన్నులు చెల్లించారు. ప్రస్తుతం వేతనాల్లో పెంపును పరిగణనలోకి తీసుకున్నా, పన్ను రేట్లలో వచ్చిన మార్పుల కారణంగా సుమారు 1.5 కోట్ల మంది పన్ను పరిధిలోంచి జారిపోతారు. అంటే, పన్ను చెల్లింపుదారుల సంఖ్య సుమారు 1.4–1.6 కోట్లకు పడిపోనుంది. వీరిలో ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వారూ ఉంటారు. ఇది మొత్తం మన శ్రామిక శక్తిలో కేవలం 4 శాతం మాత్రమే. ప్రభుత్వ అంచనా వేరే!పరిస్థితి ఇలా ఉంటే, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పన్ను రాబడుల లెక్కలు ఇంకోలా ఉన్నాయి. 2025 బడ్జెట్ అంచనాల ప్రకారం, ఆదాయపు పన్ను రూపంలో వచ్చే మొత్తం రూ.1.8 లక్షల కోట్లు ఎక్కువ కానుంది. ఇంకోలా చెప్పాలంటే ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం వచ్చిన దానికంటే రానున్న సంవత్సరం వచ్చే మొత్తం 14 శాతం ఎక్కువ. గతేడాది ప్రభుత్వ అంచనాలతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా పన్ను రేట్లలో మార్పుల వల్ల ప్రభుత్వానికి ఒక లక్ష కోట్ల రూపాయల నష్టం జరగడం లేదు. పాత రేట్లు, శ్లాబ్స్ కొనసాగి ఉంటే ప్రభుత్వం 22 శాతం వరకూ ఎక్కువ ఆదాయపు పన్నులు వసూలు చేసి ఉండేది. ఆదాయ పన్ను రాబడి పెరిగేందుకు ఒకే ఒక్క మార్గం... వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజల వ్యక్తిగత ఆదాయం బాగా పెరగడం! ఇలా జరిగే సూచనలైతే లేవు. నిజానికి కృత్రిమ మేధ, వేర్వేరు ఆటో మేషన్ పద్ధతుల ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల సంఖ్య తగ్గేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా జీతాలు కూడా స్తంభించిపోతాయి. తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తి గురించి ఆలోచిద్దాం. ఆదాయపు పన్ను కొత్త విధానాన్ని ఎంచుకుంటే ఇతడికి రూ.70 వేల వరకూ మిగులుతుంది. ఇంత మొత్తాన్ని వస్తు, సేవల కోసం ఖర్చు పెట్టగలడు. ఒకవేళ ఆదాయం పది శాతం తగ్గితే? అప్పుడు పన్ను మినహాయింపులు అక్కరకు రావు. వాస్తవికంగా ఖర్చు పెట్టడం ఇప్పటికంటే మరింత తక్కువైపోతుంది.ఇంకో పెద్ద ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఖర్చు చేయడం తగ్గించుకుంటోంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారనుంది. గత ఏడాది కంటే ఈసారి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 6.1 శాతం మాత్రమే ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇంకో 5 శాతమే అదనంగా ఖర్చు పెట్టాలని యోచిస్తోంది. ద్రవోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఈ పెంపుదల కేవలం 1.5 శాతమే అవుతుంది. పెట్టుబడులు తగ్గించుకుంటున్న ప్రభుత్వంరోడ్లు, హైవేలు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం గతంలో ఖర్చు పెట్టినదానికి ఇది పూర్తి భిన్నం. ఆ ఖర్చులో పెరుగుదల జీడీపీ పెంపునకు దారితీసింది. ఈసారి మూలధన వ్యయం గత ఏడాది కంటే కేవలం ఒకే ఒక్క శాతం ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణిస్తే అసలు మొత్తం ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి... ఈ ఏడాది మౌలిక వసతులపై పెట్టే ఖర్చు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే, మౌలిక వసతుల రంగానికి అనుబంధమైన స్టీల్,సిమెంట్, తారు, జేసీబీల్లాంటి భారీ యంత్రాలు, బ్యాంకులు కూడా డిమాండ్‌లో తగ్గుదల నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే ఆయా రంగాల్లో వేతనాల బిల్లులు తగ్గించుకునే ప్రయత్నం అంటే... వేత నాల్లో కోతలు లేదా ఉద్యోగాల కుదింపు జరుగుతుంది. ఇది మధ్య తరగతి వారి ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం ఈ ఏడాది కార్పొరేట్ కంపెనీల ద్వారా ఎక్కువ ఆదా యపు పన్ను ఆశించడం లేదని అంచనా కట్టింది. జీడీపీ విషయంలోనూ ఇంతే. వృద్ధి నామమాత్రమేనని ప్రభుత్వం భావిస్తోంది.పెట్టుబడులు పెరగకపోతే?ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తాను లక్ష్యించుకున్న కార్పొరేట్ పన్నులు కూడా పూర్తిగా వసూలు చేయలేకపోయింది. మొత్తం 10.2 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీల ద్వారా వస్తుందని ఆశిస్తే వసూలైంది రూ.9.8 లక్షల కోట్లు మాత్రమే. అదే సమయంలో ఆదాయపు పన్ను రాబడులను మాత్రం రూ.11.9 లక్షల కోట్ల నుంచి రూ.12.6 లక్షల కోట్లకు సవరించింది. అంటే ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల కంటే 28 శాతం ఎక్కువ ఆదా యపు పన్ను రూపంలో వసూలు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కార్పొరేట్ పన్నుల కంటే ఆదాయపు పన్నులు 33 శాతం ఎక్కువ వసూలు చేస్తామని చెబుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ బాగు పడుతోందనేందుకు ఏమాత్రం సూచిక కాదు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగం నుంచి ఎక్కువ పెట్టుబడుల్లేకుండా... కేవలం ఆదాయపు పన్ను రాయితీలతోనే వినియోగం పెరిగిపోతుందని ఆశించడంలో ఉన్న సమస్య ఇది. మధ్య తరగతి ప్రజల జేబుల్లో కొంత డబ్బు మిగిల్చితే, కొన్ని రకాల వస్తు సేవలకు తాత్కాలిక డిమాండ్ ఏర్పడవచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ఎదగకపోతే ఆ డిమాండ్ ఎక్కువ కాలం కొనసాగదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌పై మరింత పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగా కనిపించడం లేదు. వీరి ప్రాజెక్టుల్లో అధికం ప్రభుత్వ మౌలిక వసతుల కల్పనకు సంబంధించినవే. అవే తగ్గిపోతే, కార్పొరేట్ కంపెనీలు కూడా తమ పెట్టుబడులను కుదించుకుంటాయి. దీంతో పరిస్థితి మొదటికి వస్తుంది. ఆదాయపు పన్ను రిబేట్లు ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం సాయం చేయనివిగా మిగిలిపోతాయి!అనింద్యో చక్రవర్తి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, ఆర్థికాంశాల విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఎక్కువ ఉద్యోగాలు... తక్కువ పన్ను
భారత ఆర్థిక సవాళ్లను అధిగమించే మూడు ఐడియాలు⇒ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ‘ఎక్కువమందిని నియ మించండి... తక్కువ పన్ను చెల్లించండి’ అన్నది విధానం కావాలి.⇒ ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. నాణ్యమైన విద్యమీద పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు.⇒ నైపుణ్య శిక్షణ ద్వారా కోట్లమంది జీవితాలను మార్చవచ్చు. పాఠశాలల్లో మరీ ముఖ్యంగా పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేయాలి.భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడింది. మహ మ్మారి అనంతరం మనం చూసిన ఎకనామిక్ రికవరీ ఇక ముగిసినట్లే అనడానికి ఇది స్పష్టమైన సంకేతం. కోవిడ్ అనంతరం పరిస్థితి మెరుగుపడింది; వృద్ధి రేటు గణాంకాలు ఉత్తేజకరంగా నమోదు అయ్యాయని చాలా మంది సంబరపడ్డారు. నిజానికి ఇదో ‘కె – షేప్డ్’ రికవరీ అన్న వాస్తవాన్ని వారు విస్మరించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని తిరిగి కోలుకునే సమయంలో ఆ కోలుకోవటం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో వర్గంలో ఒక్కో రకంగా ఉంటుంది. ధనికులు మరింత ధనవంతులవుతారు. కానీ పేద ప్రజలు అలాగే ఉంటారు లేదంటే ఇంకా కుంగిపోతారు. ఆంగ్ల అక్షరం ‘కె’లో గీతల మాదిరిగానే ఈ రికవరీ ఉంటుంది.కొత్త కేంద్ర బడ్జెట్ రాబోతోంది. తన రాబడి పెంచుకోడానికి వీలుగా గత బడ్జెట్లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్ మీద పన్నులు పెంచింది. స్టాక్ మార్కెట్ జోరు మీద ఉండటంతో ఇన్వెస్టర్లు దీన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ప్రాపర్టీ విక్రయాల మీద క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధింపు విధానంలో చేసిన మార్పులపై వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఉద్యోగాలు లేవని, వేతనాలు తక్కువగా ఉన్నాయని పేద ప్రజలు విలవిల్లాడుతున్నారు. ధనికులు కూడా అధిక పన్నుల పట్ల గుర్రుగా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదొక సంకట స్థితి. వృద్ధిరేటు పెరగాలంటే పట్టణాల్లో వినియోగాన్ని పెంచాలి. అలాచేస్తే ఆహార ధరలు రెక్కలు విప్పుకుంటాయి. ద్రవ్యోల్బణం పేదలకు అశనిపాతం అవుతుంది. ప్రభుత్వానికి ఇది కత్తిమీద సాము. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ ఆనవాయితీకి భిన్నంగా ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. ‘ఇంక్రిమెంటల్ కంటిన్యూటీ’కి అవకాశం లేదు. అంటే అదనపు వ్యయాలు, అదనపు రాబడులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఇంక్రిమెంటల్ ప్రిన్సిపుల్ అంటే వ్యయం పెంచే ఏ నిర్ణయం అయినా అంత కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చాలి. ఈ దఫా నిర్ణయాలకు దీన్ని వర్తింప చేయడం కష్టం. కాబట్టి బడ్జెట్ నిర్ణయాలు జన జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేవిగా ఉండాలి. ఈ దిశగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మూడు ఐడియాలను ఇస్తాను. ఉద్యోగాలు కల్పిస్తే ప్రోత్సాహకాలుపారిశ్రామిక రంగం చేస్తున్న దీర్ఘకాలిక డిమాండుకు తలొగ్గి, 2019 బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించారు. కార్పొరేట్ సంస్థలు ఈ ప్రోత్సాహకంతో మిగిలే నిధులతో కొత్త పెట్టుబడులను పెంచుతాయన్నది దీని ఉద్దేశం. అయితే జరిగిందేమిటి? పరిశ్రమలు తమ పన్ను తగ్గింపు లాభాలను బయటకు తీయలేదు. కొత్త పెట్టుబడులు పెట్టలేదు. సిబ్బంది వేతనాలు పెంచలేదు. పెట్టుబడులు పెట్టకపోవడానికి డిమాండ్ లేదన్న సాకు చూపించాయి. రెండోదానికి అవి చెప్పకపోయినా కారణం మనకు తెలుసు. చవకగా మానవ వనరులు దొరుకుతున్నప్పుడు కంపెనీల వారు వేతనాలు ఎందుకు పెంచుతారు? ఎగువ మధ్యతరగతి ప్రజలు అప్పటికే 30 శాతం పన్ను చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ సంస్థల పన్నురేటు 25 శాతానికి తగ్గించటం అన్యాయం. ఈ సారి బడ్డెట్లో కంపెనీల గరిష్ట పన్నురేటు ఇంకా తగ్గించే సాహసం ఆర్థిక మంత్రి చేయలేరు. పేద ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే భయం ఉంటుంది. కార్పొరేట్ పన్ను రేట్లను అన్నిటికీ ఒకేమాదిరిగా కాకుండా వాటిలో మార్పులు చేర్పులు చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ఎక్కువ మందిని నియమించండి... తక్కువ పన్ను చెల్లించండి అన్నది విధానం కావాలి. వస్తూత్పత్తిని పెంచే విధంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నప్పుడు, అదే తరహాలో జాబ్ క్రియేషన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మాత్రం ఎందుకు ఉండకూడదు? విద్యానాణ్యతతోనే దేశ పురోభివృద్ధి నాణ్యమైన విద్యమీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు. దీన్ని ఓ డబ్బు సమస్యగా చూడకూడదు. విధానపరమైన సమస్య గానూ పరిగణించకూడదు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటిలోను విద్యానాణ్యత లోపించడం దేశ పురో భివృద్ధికి ఒక ప్రధాన అవరోధం. భారత్ సామర్థ్యం దిగువ స్థాయి ఉత్పత్తిలో కాకుండా సేవల రంగంలోనే ఉందని రఘురామ్ రాజన్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ముఖ్య అంశంగా భావించినట్లయితే, సేవల రంగాన్ని ప్రోత్సహించడానికి తానేం చేయగలదో ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం నాణ్యమైన విద్య అందించడమే. అయితే ఎలా? పేద పిల్లల కోసం బళ్లు పెట్టే ప్రైవేట్ విద్యా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందించటం ఇందుకు ఒక సులభ మార్గం. ప్రాథమిక పాఠశాల విద్యార్థి వాస్తవంగా ఎంత నేర్చుకుంటు న్నాడో తెలుసుకునేందుకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద పరీక్షను ప్రవేశపెట్టాలి. ఈ ఫలితాల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్ ఇవ్వాలి. దీనివల్ల తల్లిదండ్రులకు ఏ స్కూలు ఎంత మంచిదో తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే నాణ్యమైన బోధన మీద పెట్టుబడి పెట్టే పాఠశాలలకు ప్రోత్సా హకాలు ఇవ్వడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. నైపుణ్యాలపై పెట్టుబడి నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్) ద్వారా కోట్లమంది జీవితాలను సమూలంగా మార్చేసే వీలుంది. ఈ దిశగా భారత్ ప్రయత్నాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పాలి. పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేసినపుడు మాత్రమే ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయగలదు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాన్ని కేవలం 10 శాతం తగ్గిండం ద్వారా అపారమైన నిధులు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉద్యోగాలకు ఉపయోగపడే విద్య మీద పెట్టుబడి పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగా లను సృష్టించవచ్చు. వైద్య కళాశాలలతో పాటు కొత్త నర్సింగ్ కళా శాలలను విరివిగా పెట్టాలి. ఫార్మసిస్టులు, మెడికల్ టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో తయారయ్యే విధంగా విద్యాసంస్థలు ప్రారంభం కావాలి. తద్వారా దేశీయంగాను, అంతర్జాతీయంగాను వైద్యసిబ్బంది కొరతను భారత్ పూడ్చగలదు. మానవ వనరులపై పెట్టుబడితో – ప్లంబర్ల నుంచి డాక్టర్ల వరకు – ప్రపంచానికి పనికొచ్చే భారతీయ ఉద్యోగుల సంఖ్య విశేషంగా పెరుగుతుంది. వారి నుంచి దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా నిధులు ప్రవహిస్తాయి. దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గడానికి వీలవుతుంది. ఈ ఐడియాలతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయా? కావు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక ‘న్యూ డీల్’ కావాలి. (1929 నాటి మహా మాంద్యం నుంచి దేశాన్ని కాపాడేందుకు 1933–38 కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ న్యూడీల్ పేరిట శరపరంపరగా అనేక కార్యక్రమాలు, సంస్కరణలు చర్యలు చేపట్టారు.)శివమ్ విజ్ వ్యాసకర్త జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత(‘గల్ఫ్ న్యూస్’ సౌజన్యంతో) -
స్వదేశానికి గుడ్ బై
సాక్షి, అమరావతి: గడచిన రెండు దశాబ్దాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి. ఇలా వెళ్లిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కరోనా అనంతరం భారత పౌరసత్వం వదులుకుని స్వదేశానికి గుడ్ బై చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2011–2023 మధ్య పదమూడేళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్నారైలు భారత పౌరసత్వాన్ని వదులుకుని.. విదేశాల్లో పౌరసత్వం స్వీకరించారు. అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్నారైలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులకున్నట్టు పేర్కొంది.అమెరికాలో రెండో స్థానం వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరిస్తున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉంటున్నారు. 2022లో 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం స్వీకరించారు. వీరిలో మెక్సికన్లు 1.28 లక్షలు ఉండగా.. 65,960 మందితో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికాతో పాటు, కెనడా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లో స్థిరపడటానికి ఎక్కువ మంది ఎన్నారైలు మొగ్గు చూపుతున్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మంది విదేశాల్లోనే శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 4.5 మిలియన్ల మందికి ఓసీఐరాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం తీసుకున్న భారతీయులు ఇక్కడి పౌరసత్వం కోల్పోతారు. ఇలా పౌరసత్వం కోల్పోయిన వారు బంధువుల, స్నేహితుల కోసం భారత్‌కు రావాలంటే పాస్‌పోర్ట్ పొందాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్‌తో పనిలేకుండా భారత్‌కు వచ్చి వెళ్లే వారి కోసం 2006లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు(ఓసీఐ)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కార్డు పొందిన వారు వీసా లేకుండానే భారత్‌కు రాకపోకలు సాగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 4.5 మిలియన్లకు పైగా ఓసీఐ కలిగి ఉన్నారు. వీరిలో యూఎస్‌లో 16.8, యూకేలో 9.34, ఆస్ట్రేలియాలో 4.94 లక్షల మంది చొప్పున ఉన్నారు. -
సంబంధాల్లో సహనం అవసరం
షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పటి నుండీ... హింస, అశాంతితో బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. విస్తృత సరిహద్దు రీత్యా, అక్కడి పాలనా విధానాలు మన దేశ భద్రతపై కీలక ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో భారత్ పాత్ర ఉన్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలు హెచ్చు తగ్గులను చూస్తూ వచ్చాయి. ఇటీవల శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ లాంటి పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో భారత్ పాఠాలు నేర్చుకోవాలి. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో తోడ్పాటు అందించాలి. హసీనాకు ఏకపక్ష మద్దతివ్వడం వల్ల మన ఉద్దేశ్యాలపై అనుమానం ఏర్పడిందనీ, మన విధానాలను దిద్దుకోవాల్సిన అవసరం ఉందనీ అర్థం చేసుకోవాలి.షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఒక ప్రజా తిరుగుబాటుతో కూల్చివేసినప్పటి నుండీ, హింస, అశాంతితో బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. అక్కడి మైనా రిటీ హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సంఘటనల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం ‘మైనారిటీలతో సహా బంగ్లాదేశ్ పౌరులందరి భద్రతకు, రక్షణకు ప్రాథమిక బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే’ అని స్పష్టం చేసింది.బంగ్లాదేశ్ పరిణామాలను రెండు రకాలుగా చూడవచ్చు. మొదటిది, హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ ఉక్కు పాదాన్ని తొలగించిన తర్వాత... ఇస్లామిస్టులు, పాకిస్తాన్ కి చెందిన ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్ ్స (ఐఎస్ఐ) పట్టు సాధించారు. ఈ క్రమంలో హిందూ మైనారిటీలు హింసకు గురవుతున్న సందర్భంగా ఆ దేశం పాక్షిక అరాచక స్థితికి చేరుకుంటోంది. రెండవ పరిణామం ఏమంటే, గత దశాబ్ద కాలంగా నిజమైన ప్రజాస్వామ్యం లేని బంగ్లా దేశ్, తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో అడుగులేయడానికి ప్రయ త్నిస్తూ ఒక తాత్కాలిక దశ గుండా పయనిస్తోంది.సరిహద్దుల చుట్టూ?బంగ్లాదేశ్ బహుశా దక్షిణాసియాలో భారతదేశానికి అత్యంత పర్యవసానాలతో కూడిన పొరుగు దేశం. దాని సరిహద్దులను దాదాపు భారత్ పరివేష్టించి ఉంది. 4,367–కిలోమీటర్ల సరిహద్దులో, కేవలం 271 కిలోమీటర్లు మాత్రమే మయన్మార్‌తో ఉండగా, మిగిలిన 4,096 కిలోమీటర్లు భారతదేశంతో ఉంది. త్రిపుర, మిజోరాం, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో ఆ దేశం సరిహద్దులను కలిగి ఉంది. అందుకే ఈశాన్య ప్రాంతపు ఆర్థిక అభివృద్ధి, భద్రతకు ఇది కీలకం. బంగ్లాదేశ్ సరిహద్దు స్వభావాన్ని బట్టి చూస్తే, దానిని పూర్తిగా మూసివేయడం చాలా కష్టం. ఫలితంగా, ఆ దేశంలోని వివిధ ప్రభు త్వాల పాలనా విధానాలు మన దేశ భద్రతపై కీలక ప్రభావం చూపు తున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో భారత్ పాత్ర ఉన్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలు హెచ్చు తగ్గులను చూస్తూ వచ్చాయి. నియంతలైన జియావుర్ రెహ్మాన్, హెచ్ఎమ్ ఎర్షాద్ తమ నియంత్రణను కొనసాగించే ప్రయత్నంలో దేశంలో ఇస్లా మీకరణను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఈ ఎగుడు దిగుళ్లు తప్ప లేదు. పాకిస్తాన్ లాగే, జమాత్–ఎ–ఇస్లామీ కూడా బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ, ఈ ప్రక్రియలో అది గణనీయమైన పాత్ర పోషిస్తూనే పెరిగింది.భారత వ్యతిరేక గ్రూపులుఅయితే, బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది కేవలం భారతదేశానికి సంబంధించినది మాత్రమే కాదు... చైనా, మయన్మార్, ఆగ్నేయాసి యాతో సహా విస్తృత ప్రాంతంపై దీని ప్రభావం ఉంటోంది. దాని అతి పెద్ద ముస్లిం జనాభాలో పెరిగిపోతున్న సమూల మార్పువాదం (రాడి కలైజేషన్) విస్తృత ప్రపంచ పరిణామాలను కలిగి ఉంటుంది. జమాత్–ఎ–ఇస్లామీతో పాటు, హర్కత్–ఉల్–జిహాద్–అల్–ఇస్లామీ, జమాత్–ఉల్–ముజాహిదీన్ బంగ్లాదేశ్, అలాగే అల్–ఖైదా, ఇస్లామిక్ స్టేట్ల వంటి ఇతర రాడికల్ గ్రూపులు కూడా ఆ దేశంలో ఉన్నాయి. మదర్సా నాయకుల నెట్వర్క్ అయిన హెఫాజత్–ఎ–ఇస్లాం కూడా దేశంలో షరియా పాలనను కోరుకుంటూ, అక్కడ లౌకిక రాజకీయ స్థాపనను వ్యతిరేకిస్తోంది.బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ)తో జమాత్–ఎ–ఇస్లామీ పొత్తు పెద్ద సమస్యగా మారింది. తత్ఫలితంగా, 1991–96లోనూ 2001–06లోనూ ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్న పదవీకాలం అనేది... దాదాపుగా ఐఎస్ఐ, ఈశాన్య ప్రాంతంలో భారతదేశానికి వ్యతిరేకంగా క్రియాశీలంగా ఉన్న తిరుగుబాటు గ్రూపుల వర్గానికి విశృంఖల స్వేచ్ఛను ఇచ్చింది. 2009లో హసీనా ప్రభుత్వ స్థాపనతో భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధం స్థిరపడింది. మరీ ముఖ్యంగా, ఇది ఐఎస్ఐ లేదా వివిధ ఈశాన్య తిరుగుబాటు గ్రూపులు, బంగ్లాదేశ్ భూభాగాన్ని భారత వ్యతిరేక శక్తులకు ఉపయోగించడాన్ని తనిఖీ చేయడంలో సహాయపడింది. రెండు దేశాలను కలిపే భూ మార్గాలను తిరిగి తెరవడానికీ, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్ గుండా ప్రాంతీయ ట్రాఫిక్ కదలికను ప్రోత్సహించేందుకు మోటార్ వాహ నాల ఒప్పందంపై సంతకం చేయడానికీ ఈ పరిణామం దారి తీసింది.మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం పక్కనే బంగాళాఖాతం శిఖర ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్ స్థానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు, భారతదేశాన్ని నియంత్రించడం అనే తన పెద్ద విధానంలో భాగంగా చైనా తొలి నుంచి బంగ్లాదేశ్‌పై గణనీయమైన ఆసక్తిని పెంచుకుంది. ఇక్కడ చైనా ముఖ్యమైన పెట్టుబడులను కలిగి ఉంది. ఇక్కడి నుండి ఒక పైప్‌లైన్ మలక్కా జలసంధిని దాటవేస్తూ చైనాలోని యునాన్‌కు క్యుక్పియు నౌకాశ్రయం నుండి చమురును తీసుకు వెళుతుంది. బంగ్లాదేశ్‌లో వంతెనలు, రోడ్లు, పవర్ ప్లాంట్లను నిర్మించడంలో చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా దేశానికి అతిపెద్ద సైనిక సరఫరాదారుగా కూడా అవతరించింది.భారత్ చేయాల్సింది!పైన ఉదహరించిన అనేక కారణాల వల్ల, బంగ్లాదేశ్‌లోని వ్యవహా రాలను భారత్ చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. పరిస్థితి చాలా అస్థిరంగా ఉంది. అక్కడ పరిస్థితులు అదుపు తప్పవచ్చు కూడా. ఫలితంగా భారతదేశానికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. అక్కడి ప్రజా ఉద్యమంపై భారత వ్యతిరేక కథనాన్ని రుద్దేందుకు ఐఎస్ఐ ఓవర్‌టైమ్ పని చేసే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత జఠిలమైంది.ఇటీవల పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను విజయ వంతంగా నిర్వహించడం నుండి భారతదేశం పాఠాలు నేర్చుకోవాలి. ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా, భారత్ గణనీయంగా మంచిపేరు సాధించింది. దీనివల్ల అనూర కుమార దిస్సనాయకే ప్రభుత్వంలో ప్రయోజనాలను పొందు తున్నాం. అదేవిధంగా, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజూతో ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా, ఆయన ప్రచారం చేసిన ‘భారత్ వైదొలిగిపో’ వ్యూహాన్ని మట్టుబెట్టింది.నేపాల్లోనూ ఇలాంటి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. చైనాలో అధికార పర్యటనలో ఉన్న భారత వ్యతిరేక ప్రధాని కేపీ శర్మ ఓలీ, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద బీజింగ్‌తో తమ దేశం ఎలాంటి కొత్త రుణ ఒప్పందంపై సంతకం చేయదని ముందే స్పష్టం చేశారు. నిజానికి, నేపాలీలు తమ దేశంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పరిధిని తగ్గించే కొత్త ఒప్పందంపై చైనాతో సంతకం చేయాలనుకుంటున్నారు.బంగ్లాదేశ్‌తో కూడా భారతదేశం వ్యూహాత్మక సహన విధానాన్ని అనుసరించాలి. బంగ్లాదేశ్ పరివర్తనలో ఉన్న దేశం. అక్కడ ప్రజా స్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియకు న్యూఢిల్లీ మద్దతు ఇవ్వాలి.హిందువులపై దాడులను అతిగా చూసే ధోరణి నెలకొంది. ప్రారంభంలో కాస్త పెరిగిన తర్వాత, అటువంటి దాడులు ఇప్పుడు తగ్గాయి. మనం హసీనాకు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం వల్ల మన ఉద్దేశ్యాలపై అనుమానం ఏర్పడిందనీ, మన బంగ్లాదేశ్ విధానానికి దిద్దుబాటును అందించాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి.మనోజ్ జోషి వ్యాసకర్త ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’లో డిస్టింగ్విష్డ్ ఫెలో(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
'వందే భారత్' మేడిన్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో త్వరలోనే రైల్ కోచ్.. మేడ్ ఇన్ తెలంగాణ అన్న అక్షరాలు కనిపించబోతున్నాయి. దశాబ్దాలుగా కలగానే మిగిలిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ మరికొన్ని నెలల్లో కార్యరూపం దాల్చబోతోంది. దేశవ్యాప్తంగా దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లకు ఇక్కడి నుంచి హైస్పీడ్ బోగీలు సరఫరా కాబోతున్నాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరగటం, కేంద్రం కూడా భవిష్యత్తులో సాధారణ రైళ్ల స్థానంలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తుండటంతో కాజీపేటలో ఎక్కువగా వందేభారత్ రైల్ కోచ్‌లు తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు బడ్జెట్ ను కూడా పెంచింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తున్నది. రొబోటిక్ టెక్నాలజీ వినియోగం..: కాజీపేటలో ఏర్పాటుచేస్తున్న కోచ్ ఫ్యాక్టరీలో అత్యాధునిక రొబోటిక్ యంత్రాలు వాడాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని కోచ్ ఫ్యాక్టరీగా మార్చిన నేపథ్యంలో ఆ మేరకు నిర్మాణాల డిజైన్లను మార్చింది. వందేభారత్ రైళ్ల బోగీల తయారీకి వీలుగా జపాన్‌కు చెందిన టైకిషా ఇంజినీరింగ్ సంస్థ నుంచి ఆధునిక రొబోటిక్ యంత్రాలను దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే ఆ సంస్థకు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీని రూ.521 కోట్లతో ఏర్పాటుచేస్తామని గతంలో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆధునిక యంత్రాలు కొనుగోలు చేస్తుండటంతో బడ్జెట్‌ను మరో రూ.150 కోట్ల మేర పెంచుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా.. ఆలస్యానికి బ్రాండ్‌గా మారిన భారతీయ రైల్వేలను పరుగులు పెట్టించే పని మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా క్రమంగా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. వందేభారత్ రైళ్లు కూడా అందులో భాగమే. రైల్వేశాఖ సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల వినియోగాన్ని కూడా ఆపేసి పూర్తిగా ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే వినియోగించటం ప్రారంభించింది. క్రమంగా ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్ రైళ్లను కూడా తప్పించి వందేభారత్ రైళ్లనే తిప్పాలని నిర్ణయించింది. అన్ని కేటగిరీల్లో వాటినే వాడాలన్నది కేంద్రం యోచన. వందేభారత్ రైళ్లకు డిమాండ్ కూడా అమాంతం పెరిగింది. రైల్వేకు చెందిన ప్రధాన కోచ్ ఫ్యాక్టరీలైన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్‌ఫ్యాక్టరీ (ఐసీఎఫ్), కపుర్తలాలోని రైల్ కోచ్‌ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్)లలో ప్రస్తుతం సింహభాగం కోచ్‌ల ఉత్పత్తి జరుగుతోంది. త్వరలో లాతూరులోని మరాటా్వడా రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంఆర్సీఎఫ్)లో ఉత్పత్తి మొదలు కాబోతోంది. వీటితోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా కోచ్‌ల కోసం రైల్వేశాఖ ఆర్డర్ ఇస్తోంది. భవిష్యత్తు డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి జరగాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కాజీపేటలో కూడా అత్యాధునిక కోచ్‌ల తయారీని ప్రారంభిస్తున్నది. క్రమంగా ఉత్పత్తి పెంపు – పూర్తిస్థాయిలో నిర్మాణ వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు కాజీపేటలో తక్కువ పరిమాణంలో అయినా ఉత్పత్తిని ప్రారంభించాలన్నది కేంద్రం యోచన. ఇందులో భాగంగా తొలుత నెలకు 10 ఎల్‌హెచ్‌బీ, వందేభారత్ కోచ్‌లు తయారు చేసేలా ఏర్పాట్లు చేస్తారు. – తదుపరి ఐదారు నెలల్లో నెలకు 20 చొప్పున కోచ్‌లు తయారు చేసేలా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత డిమాండ్ ఆధారంగా సామరŠాధ్యన్ని మరింత పెంచుతారు. అందుకు తగ్గట్టు బడ్జెట్‌ను కేటాయిస్తారు. – యాద్గిర్లో తయారయ్యే చక్రాలను ఇక్కడికి పంపుతారు. మరో ప్రాంతంలో తయారైన విడి భాగాలను (కోచ్ దిగువ భాగం) ఇక్కడికి తీసుకొచ్చి పూర్తిస్థాయి బోగీగా రూపొందించి దానిపై షెల్ (కోచ్ బాడీ)ను బిగిస్తారు. – కోచ్‌లలో కావాల్సిన అమరికలను సిద్ధం చేసేందుకు కాంపోనెంట్ ఎరిక్షన్, ఫ్యాబ్రికేషన్ షెడ్లను నిర్మిస్తున్నారు. –తయారైన కోచ్‌లకు రంగులు వేయటం, వాటి పనితీరును తనిఖీ చేసేందుకు పెయింటింగ్ బూత్, టెస్ట్ షాప్‌లను ఏర్పాటుచేస్తున్నారు. – ఒక వందేభారత్ రైలు రేక్ తయారీకి రూ.125 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల రైలుకు రూ.80 కోట్లవుతుంది. ఐదు దశాబ్దాల కల కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ ఐదు దశాబ్దాలుగా ఉన్నది. 1982లో ఈ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అయింది. నాటి ప్రధాని ఇందిర హత్య, ఆ తర్వాత సిక్కులపై ఊచకోత.. కాంగ్రెస్‌పై సిక్కుల్లో ఆగ్రహం.. వారిని శాంతపరిచే చర్యల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటువాల్సి కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించారు. అప్పటి నుంచి ఫ్యాక్టరీ కోసం తెలంగాణలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 2009లో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కాజీపేటకు రైలు చక్రాల తయారీ యూనిట్ మంజూరైంది. అది కూడా ఆ తర్వాత రద్దయ్యి, మోదీ ప్రభుత్వం వచ్చాక పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌గా మారింది. భూ సమస్య కారణంగా దాని ఏర్పాటు పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. చివరకు గత ఏడాది ఫిబ్రవరిలో దాన్ని గూడ్సు రైలు వ్యాగన్ల తయారీ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పుడు దాన్ని కోచ్‌ల తయారీ కేంద్రంగా మళ్లీ అప్‌గ్రేడ్ చేశారు. మరో 35 ఎకరాల భూ సేకరణకాజీపేట ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం 160 ఎకరాల భూమిని మంజూరు చేసింది. అందులో 150 ఎకరాలు ఇప్పటికే రైల్వేకు అప్పగించింది. మిగతా భూమి త్వరలో అందజేయనుంది. మారిన డిజైన్ నేపథ్యంలో తాజాగా మరో 35 ఎకరాలు కూడా రైల్వే తీసుకోనున్నట్టు తెలిసింది. కాజీపేట స్టేషన్‌తో అనుసంధానిస్తూ కోచ్ తయారీ కేంద్రంలోకి ట్రాక్ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. 390 మీటర్ల పొడవైన షెడ్లుకాజీపేట ఫ్యాక్టరీలో తొలుత వ్యాగన్లు తయారుచేయాలని నిర్ణయించినందున అందుకు తగ్గట్టుగానే డిజైన్లు రూపొందించారు. తాజాగా ఆ డిజైన్లలో 50 శాతం వరకు మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం 30 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. 2026 మార్చి నాటికి పూర్తిగా యూనిట్ సిద్ధమై ఉత్పత్తి పనులు మొదలుపెట్టాలన్నది లక్ష్యం. ఇక్కడ భారీ షెల్ అసెంబ్లింగ్ షెడ్ నిర్మిస్తున్నారు. ఇందులో కోచ్‌ల బాడీలు సిద్ధమవుతాయి. వందే భారత్ రైలు దాదాపు 390 మీటర్ల పొడవుంటుంది. దానికి సరిపడే రీతిలో దీన్ని నిర్మిస్తున్నారు. 600 మంది ఉద్యోగులుకాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ప్రత్యక్ష్యంగా 600 మంది ఉద్యోగులు పనిచేస్తారు. పరోక్షంగా 8 వేల నుంచి పది వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. వేగంగా కోచ్‌లను సిద్ధం చేయాల్సిన నేపథ్యంలో ఇది అసెంబ్లింగ్ యూనిట్‌గా ఏర్పాటవుతోంది. కోచ్‌ల తయారీకి కావాల్సిన ముడి సరుకు పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. దీంతో ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా స్థానికంగా ప్రైవేటు సంస్థలు లాభపడతాయి. వాటిల్లో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రాబోతున్నారు. -
ఇందిరమ్మ ఇంటికి ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట.. పట్టణ ప్రాంతాల్లో అంతస్తులుగా నిర్మించే పేదల ఇంటికి లబ్ధిదారు వాటా ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ స్పష్టీకరణ.. కేంద్రం పెట్టే నిబంధనలు పాటిస్తేనే.. పేదల ఇళ్ల కోసం ఢిల్లీ నుంచి ఆర్థిక సాయం అందుతుంది. అంటే.. పట్టణ ప్రాంతాల్లో నిర్మించబోయే గృహ సముదాయాలకు లబ్ధిదారులు వాటా చెల్లించాలి. లేదా ఆ వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి నిధులు అందుతాయి. నిరుపేదలకు సొంతింటి వసతి కల్పించే ప్రభుత్వ పథకాల విషయంలో లబ్ధిదారుల వాటా అంశాన్ని కేంద్రం తాజాగా తెరపైకి తెచ్చింది. అయి తే వ్యక్తిగత (ఇండిపెండెంట్) ఇళ్లకు లబ్ధిదారుల వాటా లేకున్నా.. అంతస్తుల వారీగా నిర్మించే గృహ సముదాయాల విషయంలో లబ్ధిదారుల వాటా ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపట్టే పథకాలకు ఇది వర్తించకున్నా.. కేంద్ర ప్రభుత్వ చేయూతతో అమలు చేసే పథకాల్లో మాత్రం ఈ నిబంధనను అమలు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పేదలు వ్యక్తిగత ఇళ్లను నిర్మించుకునేందుకు సొంత జాగా ఉండటం కష్టమే. అందుకే అపార్ట్మెంట్ల తరహాలో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇస్తోంది. గతంలో వాంబే పథకం, ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లు, ఇటీవల డబుల్ బెడ్రూం ఇళ్లు అదే తరహాలో నిర్మితమయ్యాయి. కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ పథకం కింద కూడా ఇళ్ల సముదాయాలనే నిర్మించి ఇవ్వనుంది. ఈ తరహా ఇళ్లకు లబ్ధిదారుల వాటా చూపాలని కేంద్రం అడుగుతోంది. పైసా అవసరం లేదన్న రాష్ట్ర సర్కారు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కానీ కేంద్ర నిబంధన ప్రకారం.. యూనిట్ కాస్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం భరించే రూ.5 లక్షలకుతోడు లబ్ధిదారుల వాటాను కూడా చూపించాల్సి వస్తుంది. ఆ మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించడంగానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వమే భరించడంగానీ తప్పదని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక ఎక్కువ అంతస్తులుగా నిర్మించే ఇళ్లకు వ్యయం ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.ఏడు లక్షల నుంచి రూ.8 లక్షల చొప్పున ఖర్చయ్యాయి. ఈ క్రమంలో యూనిట్ కాస్ట్‌కు అదనంగా అయ్యే మొత్తాన్ని లబ్ధిదారు వాటాగా చూపే చాన్స్ ఉండనుంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల ప్రణాళిక ఏంటి? తొలుత ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్నవారికే మంజూరు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే హైదరాబాద్, ఇతర ప్రధాన పట్టణాల్లో సొంత జాగా ఉన్న పేదల సంఖ్య నామమాత్రమే. అలాంటప్పుడు పేదలకు ఇళ్లు ఎలాగనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ దిశగా ప్రభుత్వ ప్రణాళిక ఏమిటనే చర్చ జరుగుతోంది. -
కస్టడీ కాలం పెంచడం సబబేనా?
కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చట్టాలలో తెచ్చిన మార్పులు మంచివేనా? కొత్త చట్టాల వల్ల సమస్యలు తీరు తాయా? అనే ప్రశ్నలు న్యాయనిపుణులనే కాదు, సాధారణ పౌరులనూ వేధి స్తున్నాయి. అందుకే ఈ విషయాలపై లోతుగా పరిశోధించవలసిన అవసరం ఉంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ ఎస్ఎస్)లోని సెక్షన్ 187 కింద నిందితుల కస్టడీ కాలాన్ని పాత చట్టం అనుమతిస్తున్న దానికన్నా కొన్ని రెట్లు పెంచుతారు. అంటే నిందితులు ఎక్కువ కాలం కస్టడీలో ఉండాలి అని దర్యాప్తు అధికారి భావిస్తే కస్టడీ కాలం పెరుగుతుందని దీనర్థం. అంటే పోలీసులు నిందితుడి జీవితాన్ని సాధ్యమైనంత వరకు లాకప్‌కు పరిమితం చేయాలనుకుంటే చేయ వచ్చన్నమాట. మరో సమస్య ఏమంటే ఎక్కువ కాలం పోలీసు కస్టడీ తర్వాత... కోర్టు కస్టడీ మొద లవుతుంది. కోర్టు కస్టడీ అంటే పోలీసు కస్టడీ కన్నా గొప్పది, సహించగలిగినది అనుకోవలసిన పనిలేదు. లాకప్‌లో ఉంటే పోలీసులు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఆ తరువాత జైలు కస్టడీ ప్రారంభమయితే పోలీసు అధికారుల బదులు, జైలు అధికా రులు పెట్టే బాధలు కొనసాగుతాయి. దర్యాప్తు కోసం మొదట ఒక రోజన్నా పోలీసు కస్టడీలో ఉండి తీరాల్సిందే. అయితే కచ్చితంగా దర్యాప్తు 24 గంటల్లో పూర్తవ్వదు. లెక్కబెట్టి 24 గంటలు కాగానే ఇంటికి పంపిస్తారని దీనర్థం కాదు. అబద్ధపు ఆరోపణలను భరిస్తూ, అక్రమ నిర్బంధాన్ని అనుభవిస్తూ చట్ట వ్యతిరేకంగా పోలీస్‌లు అను కున్నంత కాలం లాకప్‌లో ఉండవల్సిందే. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం దర్యాప్తు సమయం లేక లాకప్‌లో ఉండే సమయం 40 రోజులు లేదా 60 రోజులకు పెరుగుతూ ఉంటుంది. అది గొప్ప సంస్క రణ అంటే... ఆలోచించాల్సిందే! చట్టం ప్రకారం 40 లేదా 60 రోజుల లాకప్ కస్టడీ తరువాత మరింత చట్ట వ్యతిరేక (అక్రమ) నిర్బంధం మొదలవుతుందన్న మాట. ఈ సంస్కరణ వల్ల పోలీసు అధికా రాలు విస్తారంగా పెరిగిపోయాయి. దీంతో అధికా రుల మధ్య నిందితుడు దిక్కులేని పక్షి అవుతాడు. దాని పర్యవసానం ఏమిటంటే మేజిస్ట్రేట్‌కి బెయిల్ ఇచ్చే అధికారం తగ్గిపోయింది. పోలీసులు నింది తుణ్ణి వదిలిపెట్టడం అనేది అతడి అదృష్టం తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చట్టం ప్రకారం కస్టడీకి ఎంతో కొంత పరిమితి ఉంటుంది. కాని, పోలీసుల అక్రమ కస్టడీలపై ఏ పరిమితీ ఉండదు. నిందితుల అదృష్టం, దేవుడి దయ! 15 రోజుల కస్టడీ మంచిదా కాదా అని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చర్చించింది. ఎట్టి పరిస్థితిలో 15 రోజులు కస్టడీ (లాకప్ లేదా జైల్ నిర్బంధం) దాట డానికి వీల్లేదని అనుపమ్ కులకర్ణీ వర్సెస్ సీబీఐ కేసుకు సంబంధించిన తీర్పులో అత్యున్నత న్యాయ స్థానం పేర్కొంది. ఇప్పుడు పార్లమెంట్‌లోని ఉభయ సభలు తెచ్చిన కొత్త నేర చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ తీర్పు ఇక ఎంతమాత్రం చెల్లనే రదు. ఇదన్నమాట సంస్కరణంటే. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులను ఎవ్వరూ చదవరు, అర్థం చేసుకోరు. పార్లమెంట్ సభ్యులు ఆ యా పార్టీల విప్ల ఆధారంగా చట్టసభల్లో ఓటింగ్‌లో పాల్గొని ఓటేస్తారు. ఇలా క్రిమినల్ చట్టాలు చేసుకుంటూ పోతే మరి పౌర హక్కుల మాటేమిటి? రాజ్యాంగానికి ఉన్న విలువెంత?బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 కింద అంత తీవ్రం కాని నేరాల పరిశోధనలో 40 రోజుల కస్టడీ సమయం ఉంటుంది. తీవ్రమైన నేరాల పరిశోధనకు 60 రోజుల సమయాన్ని ఇస్తున్నారు. 10 సంవత్స రాల జైలు శిక్ష విధించదగిన కేసులలో 40 రోజుల దర్యాప్తుకు అవకాశం ఇస్తారు. ఇంత కన్న తక్కువ శిక్షలు విధించే నేరాలకు ఇంతకు ముందు 15 రోజుల కస్టడీ ఉండేది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 167 కింద మొదటి కస్టడీ కాలం 15 రోజులతో మొదలయ్యేది. ప్రజాహిత స్నేహపూరిత సంస్కరణలంటే ఇవేనా? ఈ ప్రభుత్వం ప్రజల ప్రేమాభిమానాలను కోరుకునేదే అయితే... జనం లాకప్పులు, కోర్టు కస్టడీ కాలాన్ని పెంచడం ఎందుకు? ఇందులో సంస్కరణ ఏముంది? వికాస్ మిశ్రా వర్సెస్ సీబీఐ కేసులో అధికారులు లాకప్ లేదా కస్టడీ నిర్బంధ సమయం పెంచాలని కోరారు. లంచం ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ కస్టడీ పొడిగింపును కోరింది సీబీఐ. అప్పడికి ఏడురోజుల కస్టడీ పూర్తయింది. నిందితులు హాస్పిటల్‌కు రావలసి వచ్చింది. ఆ తరువాత బెయి ల్‌పై విడుదల చేశారు. సెంతల్ బాలాజీ కేసులో 15 రోజుల కస్టడీని విడి విడి భాగాలుగా మార్చుకోవచ్చు అని సుప్రీంకోర్టు వివరించింది. అప్పుడు ఈ లిటిగేషన్లు కొన సాగుతూ సుప్రీం కోర్టుదాకా పోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 40 నుంచి 60 రోజులు ఇచ్చే కస్టడీని మరింత దారుణంగా వాడుకుంటారనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల సుప్రీం కోర్టుదాకా లిటిగేషన్ నడుపుతూ ఉంటే 15, 40, 60 రోజులకు కస్టడీ పెంచుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఇదే రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రశ్నించాల్సి ఉంది.మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
వట్టి బెదిరింపులేనా?
ఇది కనివిని ఎరుగని కథ. వారంరోజుల్లోనే మన విమానాలకు శతాధికంగా బాంబు బెదిరింపు కాల్స్... వివిధ జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలను అర్ధంతరంగా దింపాల్సి రావడం, దారి మళ్ళించడం, చివరకు ఫైటర్ జెట్ల రక్షణ మధ్య తీసుకువెళ్ళాల్సి రావడం జరిగింది. ఈ–మెయిల్, సోషల్ మీడియా అజ్ఞాత పోస్టుల బెదిరింపులతో భారత వైమానిక రంగం ఉలిక్కిపడింది. ఏ బెదిరింపు వచ్చినా నిశితంగా పరీక్షించి, జాగ్రత్త చేపట్టాలన్నది నిబంధన కావడంతో విమానయాన పరిశ్రమపై తాజా బెదిరింపుల ప్రభావం అంతా ఇంతా కాదు. ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ సైతం ఎయిరిండియా విమానంపై దాడి చేస్తామనీ, నవంబర్ 1–19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించవద్దనీ హెచ్చరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పెరుగుతున్న భద్రతా సమస్యలపై విమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. బెదిరింపులకు పాల్పడినవారిపై తీవ్ర శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలనీ, దోషుల్ని విమానయానం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని భావిస్తున్నామనీ కేంద్ర మంత్రి మాట. భవిష్యత్తుకు పనికొచ్చే ఆ చర్యల మాటెలా ఉన్న వర్తమానంలో తక్షణ మార్గాంతరమేమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.2014 – ’17 మధ్య అంతా కలిపి 120 బాంబు బెదిరింపులే రాగా, ఇప్పుడు ఒక్కవారంలోనే 100కు పైగా బెదిరింపులు రావడం గమనార్హం. విమానాల దారి మళ్ళింపు, తక్షణ ల్యాండింగ్ వల్ల అయ్యే ఇంధన వృథా ఖర్చు, వగైరాలతో ప్రతి బెదిరింపు కాల్ వల్ల ఎయిర్‌లైన్స్‌కు రూ. 3 కోట్ల పైగా నష్టమట! ప్రయాణికుల్లో భయాందోళనల్ని పెంచడంతో పాటు ప్రయాణంలో ఆలస్యంతో కీలకమైన పనులు దెబ్బతినడం లాంటివి సరేసరి. రద్దీ ఎక్కువగా ఉండే పండగ సీజన్ కావడంతో కష్టం, నష్టం ఎక్కువ. ఒక్క వారంలోనే వంద బెదిరింపులు వచ్చాయంటే భద్రతా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీలు ఏం చేస్తున్నట్టు? ఇప్పటి వరకు ఒక మైనర్నీ, అతని తండ్రినీ మాత్రమే అరెస్ట్ చేసినట్టు వార్త. నింది తుల్ని వేగంగా కనిపెట్టి, కఠినచర్యలకు ఎందుకు దిగడం లేదు? అయితే ముష్కరులు, తీవ్రవాదులు వర్చ్యువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దాంతో, వారున్న లొకేషన్ కనిపెట్టలేని పరిస్థితి. ఈ సవాలును అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలి. నిజానికి, విమాన సర్వీసులకే కాదు... కొద్ది నెలలుగా రైల్వేలకూ ఈ బెడద తప్పడం లేదు. రైల్వే ట్రాకుల మీద రాళ్ళు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ నింపిన సీసాల లాంటివి దుండగులు పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఆ మధ్య అనేక చోట్ల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను లక్ష్యంగా చేసుకొని రాళ్ళు విసిరిన ఉదంతాలూ చూశాం. ఈ చర్యల వెనుక పెద్ద పన్నాగమే ఉందని విశ్లేషకుల మాట. దేశంలో విమానయాన రంగం వేగంగా దూసుకుపోతోంది. ఒక్క 2023లోనే 15.2 కోట్ల మంది దేశంలో విమానయానం చేశారు. అలాంటిది... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత వైమానిక రంగాన్నీ, రైల్వేలనూ గనక అప్రతిష్ఠ పాల్జేస్తే, ఆర్థిక నష్టంతో పాటు భూమి మీదైనా, ఆకాశంలోనైనా సురక్షితంగా ప్రయాణం చేయలేమనే భీతిని దేశ, విదేశీ ప్రయాణికుల్లో పెంచాలన్నది కుట్ర. భయం పెంచి, ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి విద్రోహ చర్యలను తక్షణం అరికట్టాలి. చిత్రమేమిటంటే, ఐరోపా గగనతలంలోనూ భారత విమానయాన సంస్థలకు బెదిరింపులు వస్తున్నాయి. భారత ప్రభుత్వం, గూఢచర్య వ్యవస్థలు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటే పెను ప్రమాదమే! భారత్‌కు తీరని నష్టం కలిగించడమే ధ్యేయంగా పెట్టుకొన్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ ఎయిరిండియా విమానాలను పేల్చేస్తామంటూ గత ఏడాది నవంబర్ లోనూ ఇలానే బెదిరింపులకు దిగాడు. అతను, అతని అనుచరుల ఆనుపానులు, దుశ్చర్యలు తెలిసినప్పటికీ అమెరికా గూఢచారి వ్యవస్థ ఎఫ్‌బీఐ లాంటివి కళ్ళు మూసుకొని, వారిని కాపాడుతూ వస్తుండడమే విషాదం. మరోపక్క దేశీయ విమానాల్లో సిక్కు ప్రయాణికులు కృపాణాలతో ప్రయాణించడాన్ని నిరోధించేందుకు సుప్రీమ్ కోర్టు సైతం నిరాకరించడంతో, పన్నూ లాంటి వారు దాన్ని అవకాశంగా తీసుకొంటే కష్టమే. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఒకటికి రెండు తీవ్రవాద బృందా లను కలుపుకొనిపోతే పెను ప్రమాదమే. దాదాపు పాతికేళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11న తీవ్ర వాదులు విమానాల హైజాక్‌తో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట భవనాల కూల్చి వేతతో సహా 3 వేల మంది మరణానికి కారణమైన ‘9/11’ ఘటనను విస్మరించలేం. ఈ పరిస్థితుల్లో ఈ ముష్కరమూకలకు పరోక్షంగా అండగా నిలుస్తున్న అమెరికా, కెనడాలకు పరిస్థితిని వివరించి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకొనే దిశగా భారత ప్రభుత్వం కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలి. మన ప్రయాణ వ్యవస్థలతో పాటు పౌరుల భద్రత అత్యంత ప్రధానమని తెలియజెప్పాలి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ, ఐరాస భద్రతా మండలినీ ఆశ్రయించాలి. అదే సమయంలో కొద్దివారాల పాటు టెక్నాలజీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే ముష్క రులు ‘9/11’ ఘటనకు పాల్పడగలిగారని మర్చిపోరాదు. సాంకేతికంగా ముష్కర చేష్టలకు వీలు కల్పించే ట్రాన్సీవర్స్ లాంటి సాంకేతిక సామగ్రిని ఆన్లైన్లో అమ్మడాన్ని తక్షణం నిషేధించడం అవసరమని నిపుణుల సూచన. అన్నిటి కన్నా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన మన విమాన, రైల్వే భద్రతా వ్యవస్థలను పునఃపరిశీలించి, సరికొత్త సవాళ్ళకు అనువుగా పటిష్ఠం చేయాలి. అత్యవసర పరిస్థితిలో అనుసరించాల్సిన ప్రామాణిక ఆచరణ విధానాలను (ఎస్ఓపీ) సిద్ధం చేయాలి. అదే సమయంలో అన్ని ఎయిర్‌లైన్స్, వివిధ దేశాల వైమానిక రంగాలు ఒక్కటై, సమాలోచనలు జరపాలి. పెరుగుతున్న ముప్పును పరస్పర సహకారం, సమన్వయంతో ఎలా ఎదుర్కోవాలో చూడాలి. -
ఆకాశంలో సగానికి అన్యాయమా!
దేశం మొత్తాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉదంతం తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ వైవాహిక బంధంలో జరిగే అత్యాచారం (మారిటల్ రేప్) గురించి ప్రస్తావించి దాన్ని నేరంగా గుర్తించాలని సిఫార్సు చేసినప్పుడు ‘మర్యాదస్తులు’ నొచ్చుకున్నారు. ఆ చర్య వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయదా... వారి పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చదా అని చాలామంది ప్రశ్నించారు. ఈ అంశంపై అంతకు చాన్నాళ్ల ముందే వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ మళ్లీ దాన్ని ఎజెండాలో తెచ్చింది. దాంపత్య జీవితంలో ఉండే లైంగిక సంబంధం పరస్పర అన్యోన్యత ఆధారంగా ఏర్పడుతుందనీ, దాన్ని కేవలం ‘సమ్మతి’ అనే పదంలో కుదించటం అసాధ్యమనీ అఫిడవిట్ అంటున్నది. గతంలోని భారత శిక్షాస్మృతి (ఐపీసీ) అయినా, దాని స్థానంలో అమల్లోకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అయినా దాంపత్య జీవితంలో జరిగే అత్యాచారానికి మినహాయింపునిచ్చాయి. అత్యాచారానికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపీసీ సెక్షన్ 375 నిర్దేశిస్తూ ఈ నేరానికి పాల్పడే భర్తకు మినహాయింపునిచ్చింది. బీఎన్ఎస్ఎస్లో ఈ సెక్షన్ 63గా మారింది. మినహాయింపు కూడా యధాతథంగా కొనసాగింది. భార్య వయస్సు 18 యేళ్లు దాటిన పక్షంలో భర్త జరిపే అత్యాచారానికి మినహాయింపు ఉంటుందని చట్టం చెబుతోంది. ఈ మినహాయింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తే మొత్తం వివాహ వ్యవస్థపైనే అది తీవ్ర ప్రభావం చూపగలదని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ హెచ్చరిస్తోంది. చట్టంలో ఉన్న మినహాయింపు అత్యాచారం చేయటానికి భర్తకిచ్చే లైసెన్సు కాదంటూనే ఆ అంశాన్ని చట్టంవైపుగా కాక సామాజిక కోణం నుంచి చూడాలని అభిప్రాయపడింది. సంబంధిత పక్షాలన్నిటితో, రాష్ట్రాలతో చర్చించాక చట్టసభ తీసుకోవాల్సిన నిర్ణయం గనుక న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని తెలిపింది. భార్య సమ్మతికి రక్షణ కల్పించేందుకు ఇప్పుడున్న చట్టాల్లో ఏర్పాట్లున్నాయనీ, గృహ హింస చట్టంవంటివి రక్షణగా నిలుస్తాయనీ చెప్పింది. నేరం ఒకటే అయినప్పుడు దాన్ని వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా ఎలా పరిగణిస్తారు? హత్య జరిగితే అది చోటుచేసుకున్న ప్రాంతాన్ని బట్టి దాన్ని హత్యాయత్నంగా అనుకోగలమా? పరిచితుడో, అపరిచితుడో మహిళపై అత్యాచారం చేస్తే దానికి శిక్ష ఉన్నప్పుడు... భర్త అదే పనిచేసినప్పుడు మినహాయింపు ఇవ్వటం ఏ రకంగా న్యాయం? 2022లో ఢిల్లీ హైకోర్టులో మారిటల్ రేప్‌పై పిటిషన్ దాఖలైనప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఒకరు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని అభిప్రాయపడితే, అది సరికాదని మరో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అనంతరం కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు రెండూ మారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించాల్సిందేనని తీర్పులు వెలువరించాయి. మన పౌరులైనా, విదేశీ పౌరులైనా చట్టం ముందు అందరూ సమానులనీ, అందరికీ సమానమైన రక్షణ లభిస్తుందనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. భర్త చేసే అత్యాచారం నేరంగా పరిగణించకూడదని మినహాయింపునివ్వటం వివాహ బంధంలోని మహిళకు ఈ అధికరణ వర్తించబోదని చెప్పటం కాదా? కానీ కేంద్రం అలా అనుకోవటం లేదు. ఇది పెళ్లయితే స్త్రీ తన హక్కును కోల్పోతుందని పరోక్షంగా చెప్పటం కాదా? మన దేశంలో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారన్న అఫిడవిట్ అభిప్రాయంతో విభేదించనవసరం లేదు. అలాగే వివాహ వ్యవస్థకుండే బహుముఖ పార్శా్వల్లో భార్యాభర్తల లైంగిక సంబంధం ఒకటి మాత్రమేనని చేసిన వాదననూ తప్పుబట్టనవసరం లేదు. కానీ సామాజిక విశ్వాసాలకూ, రాజ్యాంగ విలువలకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడినప్పుడు ఒక గణతంత్ర రాజ్యం రాజ్యాంగ విలువలకు మాత్రమే ప్రాధా న్యమివ్వాలి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అన్ని సమాజాల్లోనూ భిన్న ఆధిపత్య ధోరణులు అల్లుకుపోయి వుంటాయి. పితృస్వామిక సమాజాల్లో స్త్రీలపై ఆధిపత్యం సాధించటానికి పురుషుడి చేతిలో అత్యాచారం ఒక ఆయుధం. దీన్ని చాలా ముందుగా గుర్తించబట్టే సోవియెట్ యూనియన్ 1926లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 1950లో జెకోస్లోవేకియా, 1969లో పోలెండ్ ఈ మాదిరి చట్టాలు చేశాయి. ఇవన్నీ అప్పటికి సోషలిస్టు రాజ్యాలు. ప్రస్తుతం దాదాపు 150 దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయి. భార్య లైంగిక స్వయంప్రతిపత్తిని భర్త అయినా సరే దెబ్బతీయరాదనీ, అది నేరపూరిత చర్య అవుతుందనీ ఈ చట్టాలు భావిస్తున్నాయి. సకల ప్రజాస్వామ్య దేశాలకూ భారత్ తల్లిలాంటిదని చెప్పుకుంటున్న మనం మాత్రం మారిటల్ రేప్ విషయంలో ఇంకా తడబాటు ప్రదర్శించటం సబబేనా?దాంపత్య జీవనంలో భర్తలు సాగించే హింసను మన దగ్గర మహిళలు మౌనంగా భరిస్తున్నారు. భరించ శక్యం కాని స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బయటికొస్తున్నారు. భర్త లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని వారిలో అతి కొద్దిమంది మాత్రమే వెల్లడిస్తున్నారు. స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ డేటా ప్రకారం ముంబైలోని ధారవిలో ఈ సంస్థ ముందు 3,878 ఫిర్యాదులు దాఖలుకాగా అందులో 52.11 శాతం లైంగిక హింసకు సంబంధించినవే. 19.33 శాతంమంది తమ భర్త తమపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపారని ఆ సంస్థ అంటున్నది. భార్య అభీష్టాన్ని బేఖాతరు చేయటం నేరమన్న స్పృహ పురుషుడిలో కలగాలంటే మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించటం ఒక్కటే మార్గం. ఇందుకు భిన్నంగా ఆలోచించటం జనాభాలో సగానికి అన్యాయం చేయటమే. -
విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటి?
ఒకపక్క నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణ చేస్తామని చెబుతుంటే... మరో పక్క ఆ నష్టాలు అధికమయ్యే అనేక సమస్యలను ఎదుర్కొంటోంది విశాఖ ఉక్కు కర్మాగారం. ప్రస్తుతం ఉక్కు తయారీలో కీలక పాత్ర పోషించే ద్రవరూప ఖనిజం (స్టీల్ మెటల్ లిక్విడ్) ఉత్పత్తికి విఘాతం వాటిల్లింది. దీనికి ప్రధాన కారణం బొగ్గు కొరత. అలాగే నిధుల లేమి, ముడి ఖనిజం కొరత అగ్నికి ఆజ్యం తోడైనట్లు పరిణమించాయి. ఆంధ్రుల హక్కైన ‘విశాఖ ఉక్కు’కు ఈ సమస్యలన్నీ ఉరితాళ్లలా పరిణమించాయి.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ద్రవ ఉక్కు ఖనిజాన్ని ఉత్పత్తి చేయడంలో గోదావరి (బ్లాస్ట్ ఫర్నేస్–1), కృష్ణా (బ్లాస్ట్ ఫర్నేస్–2), అన్నపూర్ణ (బ్లాస్ట్ ఫర్నేస్–3) బ్లాస్ట్ ఫర్నేస్లది కీలక పాత్ర. అయితే వీటిలో రెండు మూలన పడ్డాయి. ఈ నెల 12న అన్నపూర్ణ (బీఎఫ్– 3) మూత పడింది. గోదావరి ఈ ఏడాది మార్చిలో ద్రవ ఖనిజ ఉత్పత్తిని ఆపేసింది. ఇక మిగిలింది కృష్ణా మాత్రమే. ఇందులోనూ ఒకటి రెండు రోజుల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రస్తుతం కృష్ణాకు అతి కొద్ది బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. అన్న పూర్ణ సామర్థ్యానికి తగినంత బొగ్గు అందుబాటులో లేనందునే మూత పడిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. రోజుకు మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల నుంచి 20 వేల టన్నుల ద్రవ ఉక్కు ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలంటే 14 వేల టన్నుల బొగ్గు అవసరం. ఈ లెక్కన 45 రోజులకు కావాల్సిన బొగ్గును ముందస్తుగానే సమకూర్చు కోవాలి. అంటే 6.3 లక్షల టన్నుల బొగ్గు నిల్వలను అందు బాటులో ఉంచాలి. కానీ ప్రస్తుతం 20 వేల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. దీని వినియోగం పూర్తయిన వెంటనే కృష్ణా బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ఉత్పత్తి ప్రక్రియను ఆపేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది. అన్నపూర్ణను మూసే స్తున్నట్లు కొద్ది రోజుల కిందటే అంతర్గతంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక మార్గదర్శకాలు, ముడి సరుకుల కొరతతో పాటు కీలకమైన బొగ్గు లభ్యత లేనందున నిర్ణయం తీసుకున్నాం అంటూ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ద్రవరూప ఉక్కు ఖనిజం ఉత్పత్తి కావాలంటే బ్లాస్ట్ ఫర్నేస్ నాజిల్ వరకు బొగ్గు నింపి మండించే ప్రక్రియను చేపట్టాలి. కానీ ఆ స్థాయిలో బొగ్గు లేనందున మూసేస్తున్నామంటున్నారు. అన్నపూర్ణ నుంచి ఉత్పత్తి 2012లో ప్రారంభమైంది. అనతి కాలంలో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి దీన్ని విస్తరించారు. 23 నెలల కిందట అంటే జనవరి 2022 నుంచి డిసెంబరు 2023 మధ్య కాలంలో ఈ బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి ఆగిపోయింది. కారణం ముడి సరుకు అందుబాటులో లేకపోవడం. మరోవైపు కరోనా ప్రభావం దీనికి తోడైంది. ఈ ఏడాది జనవరిలో సవాళ్లను అధిగమించి పని ప్రారంభించింది.ఇకపై సమస్యలేవీ లేవనుకుంటున్న తరు ణంలో బొగ్గు కొరత రూపేణా పూడ్చలేని అవరోధం రావడంతో ఉక్కు ఉత్పత్తితో పాటు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం సమస్యను గుర్తించి తగినంత ముడి బొగ్గును సర ఫరా చేయక పోతే ఉక్కు ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఆగి పోతుంది. ఇదే జరిగితే 1982లో ఉక్కు కర్మాగారం ఆవిర్భావం అనంతరం... మొట్ట మొదటి సారిగా విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి నిలిచే ప్రమాదం పొంచి ఉంది. ప్రైవేటీకరణలో వెనక్కితగ్గేదే లేదంటూ దేశరాజధానిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఓవైపు... అలా జరిగేదేమీ లేదంటూ స్థానిక కూటమి పాలకులు మరోవైపు భిన్న స్వరాలు వినిపిస్తున్న తతంగాన్ని ఆంధ్రులంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్లాంట్ నిర్వహణ విషయమై ఇక్కడి పాలకులు కేంద్రానికి నివేదిస్తారా, లేదా ఏవో హామీలతో కాల యాపన చేస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం.– తిరుమలరావు కరుకోల ‘ జర్నలిస్ట్, 98494 93833 -
సామాన్యులకు షాక్.. వంటనూనెలు ప్రియం
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వంట నూనెలు ప్రియం కానున్నాయి. ముడి పామాయిల్, సోయా బీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన (రిఫైన్డ్) పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5 నుంచి 32.5 శాతానికి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి సుంకంతోపాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెస్‌తోపాటు సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ అదనం. విదేశాల నుంచి తక్కువ ధరకు ముడి, శుద్ధి చేసిన నూనెల దిగుమతులతో భారత్‌లో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న కారణంగా దేశీయ రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ చర్యతో వంట నూనెల ధరలకు రెక్కలు రానున్నాయి. ఈ నేపథ్యంలో డిమాండ్ పడిపోయి విదేశాల నుంచి పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ‘సోయా, నూనెగింజల రైతులకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఆసరాగా నిలుస్తుంది. ఈ నూనె గింజలు గణనీయంగా ఉత్పత్తి అవుతున్నందున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులు భారీగా ప్రయోజనం పొందుతారు’ అని ఒక అధికారి తెలిపారు. ప్రపంచంలో వంట నూనెలను అత్య ధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. మొత్తం వినియోగంలో దిగుమతుల వాటా ఏకంగా 70 శాతం ఉంటోంది. పామాయిల్ వాటా 50 శాతంపైనే. ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్ నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా, సన్‌ఫ్లవర్ భారత్‌కు సరఫరా అవుతున్నాయి. కాగా, బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధర పరిమితిని తొలగిస్తూ వాణిజ్య, పరిశ్రమల శాఖ శనివారం ఒక ప్రకటన వెలువరించింది. అలాగే ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఉన్న సుంకాన్ని 20 శాతానికి తగ్గించింది. రిటైల్ మార్కెట్లో పెంచేసి విక్రయం విదేశాల నుంచి నూనెలు దిగుమతి అయిన తర్వాత రిఫైనరీలకు చేరుకుని అక్కడ శుద్ధి లేదా ప్యాకింగ్ పూర్తి అయి మార్కెట్లోకి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. పెరిగిన పన్నుల ప్రకారం కొత్త స్టాక్ మీద మాత్రమే ధరలను సవరించాల్సి ఉన్నా.. మార్కెట్లో నిల్వ ఉన్న నూనెలపై వర్తకులు అప్పుడే ధరలను పెంచి అమ్మడం ప్రారంభించారు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం గమనార్హం. రిటైల్‌లో రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ల ధరలు 10 శాతం నుంచి 15 శాతం దాకా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు మార్కెట్లో లీటర్ సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లను రూ.108 వరకు విక్రయించగా, శనివారం ఒక్కసారిగా రూ.124 కి చేరింది. అంటే ఒక్క ప్యాకెట్‌పై రూ.16 పెరిగింది. సూపర్మార్కెట్లు, దుకాణాల్లో పెరిగిన ధరలను చూసి వినియోగదారులు షాకయ్యారు. పామాయిల్ ధర మొన్నటి వరకు లీటర్‌కు రూ.95 ఉండగా, శనివారం మార్కెట్లో రూ.105కు అమ్మారు. అలాగే పల్లీ నూనె లీటర్‌కు రూ.155 ఉండగా, రూ.10 పెరిగి రూ.165కి చేరింది. స్థానికంగా తయారయ్యే సాధారణ పల్లీ నూనెలు లీటర్‌కు రూ.106 ఉండగా, శనివారం రూ.116కు అమ్మారు. -
కొత్తగా 400 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది అదనంగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం 4 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కాలేజీలకు అనుమతి ఇస్తూ ప్రిన్సిపాళ్లకు లేఖ రాసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 8 కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసింది. వాటిలో నాలుగింటికి గత నెలలో అనుమతులు రాగా, తాజాగా మిగిలిన నాలుగింటి అనుమతులపై స్పష్టత ఇచ్చింది. గత నెలలో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వీటిల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగినట్టు మంత్రి వెల్లడించారు. ముమ్మర ప్రయత్నాలు... ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు ప్రభుత్వం దరఖాస్తు చేసింది. జూన్‌లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమన్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో అవసరమైన నిధులను కొత్త సర్కార్ కేటాయించింది. ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లింది. ఈ అప్పీల్ తర్వాత ములుగు, నర్సంపేట, గద్వాల నారాయణపేట కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్ఎంసీ, మిగిలిన 4 కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. ఈ కాలేజీల అనుమతులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రెగ్యులర్‌గా పర్యవేక్షించారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు సిబ్బందిని నియమించారు. ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్లలో తొలుత ఆ 4 కాలేజీల్లోని ఖాళీలను నింపిన తర్వాతే, మిగిలిన కాలేజీల్లోకి స్టాఫ్‌ను బదిలీ చేశారు. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి ప్రమోషన్లు ఇప్పించారు. కాలేజీ, హాస్పిటల్లో ఉండాల్సిన లేబొరేటరీ, డయాగ్నస్టిక్స్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు. ఇలా ఎన్ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు సెకండ్ అప్పీల్ చేశారు. మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశాలతో వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీఎంఈ డాక్టర్ వాణి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్ఎంసీ అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ చేయాలని ఎన్ఎంసీని ఆదేశించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ఆయన కృషి ఫలితంగా కొత్తగా మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి. కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. -
ఖాతాలు ఇచ్చిన ధీమా
ప్రధాని నరేంద్ర మోదీ తన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 2014 ఆగస్ట్ 15న ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ పథక ప్రకటన చేశారు. ఈ పథకానికి ఇప్పుడు పదో వార్షికోత్సవం జరుపుకొంటున్నాం. ఆర్థిక వ్యవస్థకు వెలుపలే ఉండిపోయిన కోట్లాది మందిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చే ప్రతిష్ఠాత్మక, సవాలుతో కూడిన చర్యను అప్పటి కొత్త ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. అందులో అది అద్భుతమైన విజయం సాధించింది. 2024 ఆగస్టు 14 నాటికి 53.13 కోట్ల మంది జన్ ధన్ యోజన లబ్ధిదారులుగా ఉండగా, వారు జమచేసిన మొత్తం రూ.2.31 లక్షల కోట్లు అయింది. ఈ లబ్ధిదారుల్లో దాదాపు ముప్పై కోట్ల మంది మహిళలు ఉండటం గమనార్హం.అధికారం, హోదా, పలుకుబడి లేదా భౌతిక సంపద – ఏదైనా సరే, మనం వాటిని ఆశించి, సాధించే దిశగా బలంగా కృషి చేస్తే మన విజయంతో మనమే సంతోషిస్తాం. కానీ ఆ విజయానందం కొద్దికాలమే నిలుస్తుంది. తర్వాత మన మనసు మరోదానికి మారుతుంది. సాధించినది అప్పటికి ఒక ప్రమాణంగా మారిపోతుంది. ఇంకా అంతుచిక్కకుండా ఉన్నది మరో అన్వేషణకో లేదా అశాంతికో కారణం అవుతుంది. ఇది చాలామంది మనుషులకు వర్తిస్తుంది. ప్రజా విధానాల విషయంలోనూ ఇదే విధానాన్ని మనం అవలంబిస్తున్నాం. నిర్దిష్ట విధానాలు లేదా చర్యలు తీసుకోవాలని మనం గళమెత్తుతున్నాం. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక సమస్యను పరిష్కరిస్తే, ఇక ప్రమాణాల స్థాయి మరింతగా పెరుగుతుంది. దాంతో సాధించిన విజయానికి తగిన గుర్తింపు లేకపోవడమేగాక, వ్యతిరేక భావనతో దిగువ స్థాయిలో యథాతథ స్థితి కొనసాగుతోంది. పదో వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) అలాంటి అంశాల్లో ఒకటి.కోట్లాది మంది భారతీయులు ఆర్థిక వ్యవస్థకు వెలుపలే ఉండటం మీద చాలాకాలం మనం విచారం ప్రకటించాం. అందుకే వారిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చే ప్రతిష్ఠాత్మక, సవాలుతో కూడిన చర్యను 2014లో అప్పటి కొత్త ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. అందులో అది అద్భుత విజయం సాధించింది. 2024 ఆగస్టు 14 నాటికి 53.13 కోట్ల మంది జన్ ధన్ యోజన లబ్ధిదారులుగా ఉండగా, వారు జమచేసిన మొత్తం రూ.2.31 లక్షల కోట్లు అయింది. ఈ లబ్ధిదారుల్లో దాదాపు ముప్పై కోట్ల మంది మహిళలు ఉండటం గమనార్హం.ముందుకు జరిగిన అభివృద్ధి‘‘2008లో ఆర్థిక సమ్మిళిత్వం, అధికారిక గుర్తింపు రెండూ తక్కువ స్థాయిలో ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఓ దశాబ్దం క్రితం భారత్ అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంది. బ్యాంకు ఖాతాల గణాంకాలు, తలసరి జీడీపీతో సంబంధాల ఆధారంగా – భారత్ పూర్తి సాంప్రదాయక వృద్ధి ప్రక్రియలపైనే ఆధారపడి ఉంటే 80 శాతం మంది వయోజనులు బ్యాంకు ఖాతా సాధించడానికి 47 సంవ త్సరాలు పట్టేదన్నది ఒక స్థూల అంచనా’’ అని ‘బ్యాంక్ ఫర్ ఇంట ర్నేషనల్ సెటిల్మెంట్స్’ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు ‘డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాల రూపకల్పన: భారత్ నుంచి పాఠాలు’ (బీఐఎస్ పేపర్స్ నం.106, డిసెంబర్ 2019) శీర్షికతో ఉన్న ఒక పరిశోధనా పత్రం వెలువరించారు. ‘బ్యాంకింగ్‌లో లేనివారిని బ్యాంకులతో అనుసంధానించడం: 280 మిలియన్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఆర్థిక ప్రాప్యత గురించి ఏం చెప్తున్నాయి?’ పేరుతో సెప్టెంబర్ 2023లో మరో పరిశోధనా పత్రం వెలువడింది. దొంగతనాల ముప్పు ఉన్న ప్రాంతాల్లో జన్ దన్ యోజన ఖాతాల వినియోగం ఎక్కువగా ఉండడంతో, వారికి సంపా దనను కాపాడుకోవడంలో అవి దోహదపడ్డాయని ఈ పరిశోధన వెల్లడిస్తోంది. సాధారణంగా అధిక వడ్డీ రేట్లు వసూలు చేసే అనధికారిక వనరుల నుంచి రుణాలు తీసుకోవడాన్ని కూడా ఇది తగ్గించింది.కానీ ఇది తక్షణ తీర్పులిచ్చే లోకం. మినహాయింపుల స్థాయిని దాటి ఆ తీరే ఒక ప్రామాణికంగా మారింది. పీఎంజేడీవై ఖాతాలు ఎక్కువగా ‘జీరో బ్యాలెన్స్’ ఖాతాలేనంటూ కొందరు విమర్శకులు ఎత్తి చూపారు. వాస్తవం ఏమిటంటే, ఈ ఖాతాలన్నింటిలో మొత్తం రూ.2.31 లక్షల కోట్లు జమ అయ్యాయి. ఈ ఖాతాల వల్ల ఉప యోగం ఎంత అమూల్యమైనదో కోవిడ్ విపత్తు సమయంలో రుజువైంది. ప్రయోజనాలను నేరుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఖాతాలకు బదిలీ చేసింది. మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2020 నుంచి 2022 వరకు), దాదాపు 8.1 లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాల పరిణామం వల్ల కోవిడ్ విపత్తు కీలక సమయంలో నగదురహిత చెల్లింపులను ఇది సులభతరం చేసింది.సార్వత్రిక బ్యాంకింగ్‌ను సాధ్యం చేయడంతోపాటు, వినియో గదారు అనుమతితో ఆర్థిక సంస్థకు సమాచార బదిలీలను పీఎంజేడీవై సులభతరం చేసిందని తాజా పరిశోధన (‘రుణ ప్రాప్యతను సార్వత్రిక బ్యాంకింగ్ విస్తరిస్తుందా?’, ఆగస్టు 2024) వెల్లడిస్తోంది. మరీ ముఖ్యంగా పీఎంజేడీవై ఖాతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫిన్ టెక్ నేతృత్వంలో రుణ వృద్ధి పెరిగింది. చౌక, మెరుగైన ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న ప్రాంతాలలో ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ‘ఖాతా సంకలనం’ అన్నది సార్వత్రిక బ్యాంకింగ్ వ్యక్తీకరణ. ప్రజలు మరిన్ని ఆర్థిక ఉత్పత్తులు, సేవలు పొందడానికి ఇది వీలు కల్పిస్తుంది.మహిళలకు స్వావలంబనమహిళలకు సొంత ఖాతాలు, వాటిలో డబ్బులతో పీఎంజేడీవై వారికి సాధికారత కల్పించింది. ఈ ఆర్థిక స్వావలంబనను అంచనా వేయడం కష్టం. కానీ ఇది ముఖ్యమైనది. సాధారణంగా భారత మహిళలు ఎక్కువగా పొదుపు చేయడానికి ఇష్టపడతారు. క్రమంగా, అది కుటుంబాల ఆర్థిక భద్రతను, జాతీయ పొదుపు రేటును పెంచుతుంది. ఇంకా, అది దేశంలో మహిళా వ్యవస్థాపకతను పెంచుతుంది. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ద్వారా వెల్లువెత్తిన వ్యవస్థాపకతలో మహిళల భాగస్వామ్యం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియానూ; మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి స్టాండప్ ఇండియా పథకాన్నీ ప్రభుత్వం ప్రారంభించింది. పీఎం ముద్ర యోజన కింద 68 శాతం రుణాలను మహిళా పారిశ్రామిక వేత్తలకు మంజూరు చేయడం జరిగింది. స్టాండప్ ఇండియా పథకం కింద 2024 మే నాటికి లబ్ధిదారుల్లో 77.7 శాతం మంది మహిళలు ఉన్నారు. 2024 జూలై 30 నాటికి, ‘ఉద్యమ్’, ‘యూఏపీ’ పథకాలలో నమోదైన దేశంలోని మహిళల యాజమాన్యంలోని ‘ఎంఎస్ఎంఈ’ల (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ)ల సంఖ్య 1.85 కోట్లకు పైగా ఉంది. పీఎంజేడీవై ఖాతాలు మహిళలను సాధికారులను చేసి, స్వయం ఉపాధి/వ్యవస్థాపకతల్లో ప్రవేశించేలా వారికి దోహదపడ్డా యన్న భావన గణనీయమైనది. ఇది అధికారిక పరిశోధనకు అర్హమైనది.ఇక వ్యతిరేక భావనల సవాళ్లనూ పరిశీలిద్దాం. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఖాతాదారులకు లభించిన ప్రయోజనాల ఆధారాల నేపథ్యంలో వాటిని పరిశీలించడం అంత కష్టమేం కాదు. పీఎంజేడీవైని ప్రారంభించడంపై దూరదృష్టితో నిర్ణయం తీసుకుని, తక్కువ వ్యవధిలో దానిని విజయవంతంగా అమలు చేయలేకపోతే గనక గత దశాబ్దపు అభివృద్ధిలో భారత్ సాధించిన విజయాలు గణనీ యంగా తక్కువగా ఉండేవి.వి. అనంత నాగేశ్వరన్ వ్యాసకర్త ఆర్థికవేత్త;భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు -
విధాన పాపం... ప్రజలకు శాపం...
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలోని 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని మోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది. వాస్తవంలో పేరు గొప్ప... ఊరు దిబ్బ లాగా దేశ ప్రజల స్థితిగతులున్నాయి. ఒక పక్కన నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. మరో పక్కన నింగినంటే ద్రవ్యోల్బణం, అంతంత మాత్రపు ప్రజల కొనుగోలు శక్తిని మరింతగా దిగజారుస్తోంది. మోదీ ప్రభుత్వం దేశం మీద వరుసగా రుద్దిన పెద్ద నోట్ల రద్దు, అశాస్త్రీయమైన జీఎస్టీ అమలు, కోవిడ్ మహమ్మారి కాలంలో అనుసరించిన అవకతవక ఆర్థిక విధానాలే ఈ దుఃస్థితికి కారణం. ఫలితంగా లక్షలాది మంది చిన్న ఉత్పత్తిదారులు, వ్యాపారులు చితికిపోయి ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడింది.నేడు వెలువడుతోన్న అనేక ఆర్థిక సంబంధిత గణాంకాలు చితికిపోతోన్న ప్రజల వాస్తవ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఉదాహరణకు 2023 –24 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల రుణభారం, వారి మిగులు ఆదాయంలో (కనీస అవసరాల తాలూకు ఖర్చుల అనంతరం మిగిలే ఆదాయం) 52 శాతానికి చేరుకుంది. ఇది 2022–23లో 48 శాతంగా ఉంది. కాగా, 2019–20 ప్రాంతంలో ఇది 40 శాతమే. ఇక 2012 –13లో అయితే ఈ మిగులు ఆదాయంలో, కుటుంబాల రుణభారం కేవలం 32 శాతం. అంటే, గడిచిన సుమారు దశాబ్ద కాలంలో ప్రజల రుణభారం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా, కుటుంబాలు తమ ఆదాయాలలో అధిక భాగాన్ని అప్పులు తీర్చేందుకు వినియోగించవలసి వస్తోంది. ఈ కారణం వలన, కనీస అవసరాలకు పోను... ఆ పైన ఖర్చులు పెట్టగల స్థోమత దిగజారిపోయింది. ఈ స్థితిలోనే 2023–24కాలంలో, బ్యాంకుల రిటైల్ రుణాలు 27.5 శాతం మేరకు పెరగగా, ఈ రుణాలు తీసుకున్నవారు, ఆ రుణంలో వినియోగ ఖర్చులకు వాడే మొత్తం కేవలం 8.5 శాతం పెరిగింది. అంటే, కుటుంబీకులు తాము తీసుకున్న రుణం తాలూకు పూర్తి మొత్తాన్ని వినియోగానికి వాడు కోలేకపోతున్నారు. దీనికి కారణం, వారు ఇందులోంచి కొంత భాగాన్ని పాత అప్పులు తీర్చేందుకు వాడటం. ప్రజల ఈ ఆర్థిక దుఃస్థితి వలన 50 వేల రూపాయల లోపు రిటైల్ రుణ గ్రహీతలు వాటిని సరైన సమయంలో చెల్లించలేని పరిస్థితి పెరుగుతోంది. ఫలితంగానే క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాల తాలూకు బకాయిల మొత్తం 2018–19 లోని జీడీపీలో 3.6 శాతం నుంచి 2023–24 నాటికి 5.6 శాతానికి పెరిగిపోయింది. ఈ విధంగా రిటైల్ రుణాలలో మొండి బకాయిగా మారుతున్నవి 8.2 శాతానికి పెరిగాయి. ఈ క్రమంలోనే వ్యవసాయ రుణాలు మొండి బకాయిలుగా మారడం కూడా పెరిగిపోతోంది. ఈ పరిస్థితి తాలూకు ప్రభావం ఏమిటంటే, 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసి కంలో (ఏప్రిల్–జూన్ ) భారత కార్పొరేట్ల లాభాల పెరుగుదల, దాని ముందరి ఏడాది త్రైమాసికాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మార్కె ట్లో డిమాండ్ లేక ఈ కార్పొరేట్ల అమ్మకాల స్థాయి కూడా పడి పోయింది. మొత్తంగా ప్రస్తుతం మన దేశీయ మార్కెట్లో డిమాండ్ పతనం కావడం వల్ల, ప్రైవేట్ పెట్టుబడిదారులు కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టే పెట్టుబడులు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ పెట్టుబడుల స్థాయి 2009 సెప్టెంబర్ త్రైమాసికం నాటి అనంతరం కనిష్ఠ స్థాయిలో ఉంది. గణాంకాలను పరిశీలిస్తే, కొత్త ప్రాజెక్ట్‌లలో ప్రైవేట్ రంగం తాలూకు వాటా 2023–24 లోని చివరి త్రైమాసికం లోని 85.4 శాతం నుంచి, 2024–25 మొదటి త్రైమాసికంలోని 66.7 శాతానికి పడిపోయింది. మరి, ఈ ఆర్థిక పతనానికి కారణం ఏమిటి? ఇతరత్రా కారణాలు ఏవైనా... మోదీ ప్రభుత్వ విధానాల తాలూకు ప్రభావమే ప్రధానంగా ఈ దుఃస్థితికి కారణం. వరుస పరంపరగా మోదీ ప్రభుత్వం దేశం మీద రుద్దిన 1) పెద్ద నోట్ల రద్దు 2) అశాస్త్రీయమైన జీఎస్టీ అమలు 3) కోవిడ్ మహమ్మారి కాలంలో అనుసరించిన అవకతవక ఆర్థిక విధానాల వంటివి దీనికి కారణం. ఉదాహరణకు, పెద్ద నోట్ల రద్దు ప్రభావం వలన దేశంలోని లక్షలాది మంది చిన్న ఉత్పత్తిదారులు, వ్యాపారులు చితికిపోయారు. అసంఘటిత రంగంగా ఉండే వీరు తమ వ్యాపారాలను క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్ లైన్లో నిర్వహించుకోగల అవకాశం లేక వ్యాపారాల నుంచి వైదొలగిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే, తమ అమ్మకాలకు డెబిట్, క్రెడిట్ కార్డులను అంగీక రించగల పెద్ద రిటైల్ మార్టులు, మాల్స్ వ్యాపారాలు పెరిగాయి. చితికిపోయిన ఈ చిన్న ఉత్పత్తిదారుల వ్యాపారం పెద్ద కార్పొరేట్ సంస్థలకు బదలాయించబడింది. అదీ కథ. పెద్ద నోట్ల రద్దు అనేది అంతిమంగా కాకులను కొట్టి గద్దలకు వేసేదిగా పరిణమించింది.ఇక, జీఎస్టీ అమలు క్రమంలో కూడా లక్షలాది మంది చిన్న వ్యాపారస్థులు, ఉత్పత్తిదారులు చితికిపోయారు. అసంఘటిత రంగంలోని వీరంతా, బలవంతంగా జీఎస్టీ పరిధిలోకి లాగబడి, పెరిగి పోయిన ఖర్చులతో (అదనపు పన్నుల భారం వచ్చి పడింది కనుక) వ్యాపారాలు, ఉత్పత్తి చేయలేక చేతులు ఎత్తేశారు. ఈ విధంగా జీఎస్టీ అమలు దేశంలోని అసంఘటిత రంగానికి చావు దెబ్బ అయ్యింది. కోవిడ్ కాలంలో ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా, మరెన్నో లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చితికిపోయాయి. స్థూలంగా ఈ విధానాల అన్నిటి ఫలితంగా 2022–23 నాటికి దేశంలోని సరుకు ఉత్పత్తి రంగంలో ఉన్న, అసంఘటిత రంగ పరిశ్రమల సంఖ్య 9.3 శాతం తగ్గి, 17.82 మిలియన్లకు పరిమితమయ్యింది.దాంతో, ఈ పరిశ్రమలలో 15 శాతం మేర కార్మికులు ఉపాధిని కోల్పోయారు. సాధారణ స్థితిలో, ఈ అసంఘటిత సరుకు ఉత్పత్తి రంగ పరిశ్రమల సంఖ్య దేశంలో సాలీనా 2 మిలియన్ల చొప్పున పెరుగుతూ వచ్చింది. అవకతవక విధానాలు లేకుంటే ఈ అసంఘటిత రంగ సరుకు ఉత్పత్తి పరిశ్రమల సంఖ్య మరింతగా పెరిగి ఉండాలి. స్థూలంగా, మోదీ విధానాల ఫలితంగా సుమారు 10 మిలియన్ల మేర కొత్త సంస్థల ఆవిర్భావానికి ఆస్కారం లేకుండా పోయింది. దీనికిమించి, ఈ సంస్థలు ఒకొక్క దానిలో 2.5 నుంచి 3 ఉపాధి అవకాశాల కల్పనను మనం కోల్పోయాము. ఫలితంగా సుమారు 25–30 మిలియన్ల ఉపాధి అవకాశాల కల్పనకు మార్గం మూసుకుపోయింది. అంటే, ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగాన్ని... సంఘటిత రంగం దిశగా మళ్ళించే పేరిట, మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఈ విధానాలు తొలుత కొంత పెద్ద కార్పొరేట్లకు అనుకూలించినా, అంతిమంగా నేడు అవి కూర్చున్న కొమ్మను నరుక్కున్న తీరుగా, కార్పొరేట్ల లాభాలకు కూడా గండి కొడు తున్నాయి. ఈ క్రమంలోనే, మార్కెట్లో డిమాండ్ దిగజారిపోయి నేడు రిటైల్ రంగంలోని రిలయన్ ్స, టైటాన్, రేమాండ్ వంటి సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవ త్సరం కాలంలోనే సుమారుగా 26 వేల మందిని ఈ సంస్థలు ఇంటికి పంపాయి.మోదీ ప్రభుత్వ విధానాల ప్రతికూల ప్రభావాన్ని అర్థం చేసు కొనేందుకు ఒక చిన్న ఉదాహరణను చూద్దాం. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలకు ముందర ఎయిర్ కూలర్ల తయారీలో బ్రాండెడ్ సంస్థలతో పాటుగా, స్థానికంగా చవకగా తయారయ్యే కూలర్లు కూడా ఉండేవి. ధర తక్కువ ఉన్న ఈ కూలర్లకు భారీ మార్కెట్టే ఉండేది. కానీ, ఇవి తమ ఉత్పత్తికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కొరతలు, పెరిగిన పన్ను భారాల వల్ల మూసివేత బాట పట్టాయి. మార్కెట్ నుంచి వైదొలగిన ఈ లోకల్ సంస్థల అమ్మకాలు బ్రాండెడ్ కంపెనీలకు బదలాయించబడ్డాయి. ఫలితంగా తొలుత ఈ పెద్ద సంస్థల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. కానీ, చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బ తినడంతో దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగం వలన ప్రజల కొనుగోలు శక్తి, డిమాండ్ పతనమై అంతిమంగా అది పెద్ద సంస్థల అమ్మకాలూ... లాభాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకు తిన్న విధానాల కథ ఇది. లాభాల దురాపేక్ష తప్ప, దూరదృష్టి లేని కార్పొరేట్ల గుడ్డితనం నేడు మోదీ విధానాల రూపంలో దేశ ప్రజలకు అశనిపాతంగా మారుతోంది!డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
కశ్మీర్ ప్రజలు ఏమంటున్నారంటే...
‘జమ్మూ–కశ్మీర్’ విభిన్న జాతులు, మతాలు, భాషలు, నైసర్గిక స్వరూపాలు కలిగిన ప్రాంతాల సమాహారం. ఏదో ఒక కారణంగా కశ్మీర్ రోజూ వార్తల్లో ఉంటోంది. పార్టీలు, నాయకులు, మేధా వులు, జాతీయవాదులు ఏదో ఒక సంద ర్భంలో కశ్మీరు గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. దేశమంతా కశ్మీరు గురించి చర్చిస్తున్న విషయాల్నే కశ్మీరీలు మాట్లాడుకుంటున్నారా? అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు కశ్మీరీల మనసుల్లో ఏముంది? అని అన్వేషించడానికి ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. కశ్మీరు లోయ నుంచి జమ్మూ మైదాన ప్రాంతాల వరకు... ఎందరో సామాన్య కశ్మీరీలతో మాట్లాడి, వారి మనసులో ఏముందో పసిగట్టే ప్రయత్నం చేసింది.1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కశ్మీరులో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ఒక్కటే ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వేచ్ఛగా, న్యాయంగా జరిగిన ఎన్నిక అని కశ్మీరీలు అంటారు. అంతకు ముందు, ఆ తర్వాత జరిగిన ఎన్నిక లన్నీ ఢిల్లీ పాలకులకు అనుకూలంగా జరిగిన ఎన్నికలేనని వారు భావిస్తున్నారు. జమ్మూ– కశ్మీరులో ఏ మూలకు వెళ్లి ఎవ్వరితో మాట్లాడినా... చాలా సమస్యలపై వారికి ఏకాభిప్రాయం లేనప్ప టికీ, ఉమ్మడి అభిప్రాయం ఉన్నది ఒక విషయంలోనే: ఆ రెండు ప్రాంతాల్లోనూ ఎన్నికలు రావాలని బలంగా కోరుకుంటున్నారు. 2019 ఆగస్టు 5న ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదా తొలగిపోయింది. రాష్ట్రాన్ని కశ్మీర్, లద్దాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరగలేదు. 2023 డిసెంబరు 11న సుప్రీంకోర్టు, పూర్వ జమ్మూ– కశ్మీర్‌కి లభిస్తున్న స్వయంప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, ఈ సెప్టెంబర్ 30 నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ‘‘ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరిగినా... మహా అయితే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం లాంటిది ఏర్పడవచ్చు. అక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అలాంటి ప్రభుత్వం మాకొద్దు’’ అని శ్రీనాగ్లో ఒక వ్యాపారి చెప్పాడు. ఇంచుమించు ఇదే అభిప్రాయం చాలా చోట్ల వినపడింది. రాష్ట్ర హోదాపాలన విషయంలో ఢిల్లీ మోడల్ని, సామాన్య స్థానికులతో పాటు గతంలో బీజేపీకి ఓటేసిన వాళ్లే వ్యతిరేకి స్తున్నారు. బీజేపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న గుజ్జర్ సామాజిక వర్గం బీజేపీకి ఇప్పుడు దూరం జరిగింది. స్థానిక బీజేపీ నాయకులు కూడా జమ్మూ–కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ఢిల్లీ ప్రభుత్వం లాంటిది వద్దని చెప్తున్నారు. కశ్మీర్ విషయంలో తమది చరిత్రాత్మక నిర్ణయమని బీజేపీ దేశమంతా ప్రచారం చేసుకుంటోంది. కానీ, కశ్మీరులో స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అందుకే, లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్లో బీజేపీ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరి స్థితిపై కొంత అనిశ్చితి నెలకొంది. కశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో కొన్ని లోపాలు, వైఫల్యాలు ఉంటాయి. కానీ, అది మిలిటరీ సాయంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఎల్జీ పాలన కంటే ఏ విధంగా చూసినా మెరుగ్గానే ఉంటుందని ప్రజలు భావి స్తున్నారు. ‘‘ఎల్జీకి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఎన్నికలు లేకుండా వచ్చిన ఎల్జీ, అతని బ్యూరోక్రాట్ల బృందం నుంచి ప్రజాస్వామిక పరిపాలనను ఆశించలేం అని జమ్మూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య అంతరం పెరిగిపోయింది. మీడియాలో చూపించే వంతెనలు, అండర్ పాస్‌లను పక్కన పెడితే, స్థానిక ప్రాంతాలను కలిపే రోడ్లు అధ్వాన్నంగా తయార య్యాయి. కొత్త రోడ్లు వేయడం, రోడ్లను రిపేర్ చేయడం పూర్తిగా ఆపేశారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే, ఇప్పుడున్న దాని కన్నా 2019కి కంటే ముందే బాగుండేదని అనేక ఉదాహరణలు చెబుతున్నారు.జమ్మూ, శ్రీనగర్‌లు గవర్నమెంట్ ప్రకటనల్లో మాత్రమే పేరుకు స్మార్ట్ సిటీలనీ, తగిన మౌలిక వసతులు లేక తమ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయనీ స్థానిక వ్యాపారులు చెబుతు న్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారనీ, బయట నుంచి వచ్చిన వాళ్లే మద్యం వ్యాపారం చేస్తున్నారనీ, ముఖ్యమైన స్థానాలన్నింటీలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులే ఉంటున్నారనీ, ఇది తమకు న్యాయం చేయడం లేదనీ ప్రజలు ఏకాభిప్రాయంతో ఆరోపిస్తు న్నారు. ‘‘ఐఐఎం, ఐఐటీల్లో కూడా ముఖ్యమైన పదవుల్లో బయటి వాళ్లనే ఎందుకు నియమిస్తున్నారు? ఎందుకు అంత భయం?’’ అని అడ్వకేట్‌గా పనిచేస్తున్న షేక్ షకీల్ ప్రశ్నించారు. ‘‘మాకు ఉద్యోగాలు లేవు, పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టు బడులు రావాల్సిన అవసరం ఉంది. మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహుల కింద నేరం మోపుతున్నారు. గత 5 ఏళ్లుగా మేం ఎన్నుకోని ప్రభుత్వంలో ఉన్నాం’’ అనేది కశ్మీరీ యువత అభిప్రాయం. చలికాలంలో జమ్మూ, వేసవికాలంలో శ్రీనగర్ నుంచి జరిగే దర్బార్ పాలనకు 2019లో ఎన్డీయే ప్రభుత్వం చెక్ పెట్టింది. దీనికి అనవసర ఖర్చు అవుతోందనీ, ఇది కూడా చరిత్రాత్మక నిర్ణయ మనీ బీజేపీ ప్రచారం చేసుకుంది. కానీ, 5 ఏళ్ల తర్వాత చూస్తే దర్బార్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకోవడం గమనార్హం. ‘‘దర్బార్ ఉన్నప్పుడు అధికారులు, వాళ్ల కుటుంబాలు ఇక్కడే బస చేసేవి. వారు జమ్మూలో ఐదారు నెలలు పెట్టే ఖర్చే మాకు ఆదాయం అయ్యేది. కానీ, ఇప్పుడు ఆ దారులన్నీ మూసుకు పోయాయ’’ని జమ్మూ వ్యాపారి వికాస్ శర్మ చెప్పాడు. జనం కోరుతున్నట్టు దర్బార్‌ను పునరుద్ధరిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందనీ, అందుకే తాము అడిగినా నాయకత్వం పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ నాయకులు చెబుతున్నారు.35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జమ్మూ–కశ్మీరులో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నికలను బహిష్కరించిన ఈ ప్రాంతంలో, ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి తపిస్తున్న ప్రజల గాఢమైన కోరి కకు ఈ ఓటింగ్ శాతం అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని పునరిద్ధరించాలనీ, ‘దిగుమతి’ సర్కారు కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం రావాలనీ కోరుకుంటున్న కశ్మీరీల కల నెరవేరుతుందా, లేదా అనేది ఇంకో నెలన్నరలో తేలనుంది.జి. మురళీకృష్ణ వ్యాసకర్త పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థలో పరిశోధకులు -
జాతీయవాదమా? జాతీయోన్మాదమా?
ఇవాళ వ్యక్తులుగా పౌరులూ, సమాఖ్యలో భాగంగా ఉన్న రాష్ట్రాలూ తమ హక్కులను కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయవాదం పేరుతో జాతీయోన్మాదాన్ని పాలకులు ప్రేరేపిస్తున్నారు. భిన్నాభిప్రాయాలను దేశ వ్యతిరేకమైనవిగా ముద్ర వేస్తున్నారు.రాజకీయ వ్యతిరేకతను, పౌర సమాజంలో భిన్నాభిప్రాయాలను కలిగివుండి, పాలనను విమర్శించే ప్రతి ఒక్కరినీ ప్రస్తుత భారత పాలక వ్యవస్థ తరచుగా దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించింది. ఈ ద్వేషభావం... అసలు జాతీయవాదం అంటే ఏమిటి, నిజమైన జాతీయవాది ఎవరు అనే మౌలిక ప్రశ్నలను లేవనెత్తింది. జాతీయవాదం అనే పదం విభిన్న రాజకీయ తత్త్వశాస్త్రాల ద్వారా ప్రత్యేకంగా గుర్తించబడింది.జాతీయవాదంపై వలసవాద వ్యతిరేక దృక్పథం... కుల, మత, వర్గ, ప్రాంతీయ అనుబంధాలతో సంబంధం లేకుండా నిర్దిష్ట రాజకీయ భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలందరినీ తప్పనిసరిగా కలుపుతుంది. శక్తిమంతమైన వలస పాలకుల నుండి భార తదేశం విముక్తి పొందేందుకు అటువంటి జాతీయవాద దృక్పథం చాలా అవసరం. ఆ విధంగా, స్వాతంత్య్ర పోరాటంలో అందరినీ కలుపుకొని పోవడం వల్ల జాతీయవాదపు రాజ్యాంగ దార్శనికత అభివృద్ధి చెందింది. ఇతర సంకుచిత గుర్తింపుల కన్నా మిన్నగా అది పౌరుల ప్రాధాన్యాన్ని గుర్తిస్తుంది.మతం లేదా జాతి వంటి వివాదాస్పద పరిగణనలపై ఆధారపడిన జాతీయవాద విభజన దృక్పథం తన లోపలే ఒక శత్రువును కనుగొంటుంది. విభజించి పాలించే వలస రాజ్యాల ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకున్న బ్రిటిష్ వలసవాద వారసత్వపు కమ్యూనల్ అవార్డు చరిత్ర దృష్ట్యా, భారతదేశంలోని మతపరమైన మెజారిటీ శక్తులు ఇప్పుడు ముస్లింలను లోపలి శత్రువుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, మందిర్ వంటివి సార్వత్రిక ఎన్నికలలో అధికార పార్టీ విభజిత ఎన్నికల చర్చలో ఆధిపత్యం చలా యించాయి. కానీ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఇతర జీవనోపాధి సమస్యలు దాని పాలనను సవాలు చేశాయి.జాతీయవాదపు వలసవాద వ్యతిరేక దృక్పథంలోని మరొక కోణం ఏమిటంటే... వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకోవడమే! నిజానికి, భారత రాజ్యాంగం, దానిలోని అనేక నిబంధనలు, దేశ న్యాయశాస్త్రం అనేవి భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎల్లప్పుడూ ఆధునిక భారత జాతీయవాదపు కొనసాగుతున్న ఇతివృత్తంగా సమర్థించాయి. దేశం దైవపరిపాలనచే నడుస్తోందనే దృష్టి కోణం ఉద్దేశపూర్వకంగా దేశం, దాని ప్రజల సజాతీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం ద్వారా వైవిధ్యాన్ని అణిచివేస్తుంది. జాతీయతలోని అనేక ఉపజాతి విధేయతలు తప్పనిసరిగా పరస్పర విరుద్ధమైనవి కానప్పటికీ, వాస్తవానికి అవి పరి పూర్ణమైనవి అనే వాస్తవాన్ని గుర్తించడానికి ఇది నిరాకరిస్తుంది. ఉదాహరణకు, భాషాపరమైన గుర్తింపులు జాతీయ గుర్తింపుతో విభేదించాల్సిన అవసరం లేదు. స్వాతంత్య్ర పోరాటం భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పోరా టాన్ని హృదయపూర్వకంగా స్వీకరించింది, దాని చట్టబద్ధ మైన ప్రజాస్వామ్య స్వభావాన్ని గుర్తించింది. కానీ, భిన్న త్వానికి విరుద్ధమైన వారు విస్తృతమైన జాతీయ గుర్తింపు పేరుతో సమాజంపై ఏకరూప దృక్పథాన్ని రుద్దడానికి ప్రయ త్నిస్తారు. ఒక దేశం – ఒకే మార్కెట్, ఒక దేశం – ఒకటే భాష, ఒక దేశం – ఒకేసారి ఎన్నికలు, ఒక దేశం – ఒకటే పన్ను అలాంటి అసహన ప్రయత్నాలకు ఉదాహరణలు. ప్రస్తుత పాలక జాతీయవాద కథనం ప్రజల సామాజిక, ఆర్థిక శ్రేయస్సుతో కూడిన చిహ్నాలతో దేశం గురించిన నైరూప్య ఆలోచనను స్పృహతో ప్రోత్సహిస్తుంది. సాంఘిక, ఆర్థిక అసమానతలను సాధారణ మనిషికి హాని కలిగించేలా చేస్తుంది. కార్పొరేట్ సంపదలో పెరుగుదలను అసహజమైన అసమానతలపై జాతీయ గర్వకారణంగా చూపుతుంది. ఈ దృక్పథం అంతిమంగా కులం, వర్గం, అటువంటి ఆధిపత్య ధోరణులన్నింటినీ శాశ్వతంగా కొనసాగించే లక్ష్యానికే ఉపయోగపడుతుంది.జాతీయవాదానికి సంబంధించి పైన పేర్కొన్న వక్రీకృత దృక్పథం స్వభావం ఏమిటంటే, ప్రక్రియ దిద్దు బాటును ప్రభావితం చేసే లక్ష్యంతో వాస్తవికతపై విమర్శనాత్మక ప్రశంసలను నిరోధిస్తూనే, గతం లేదా వర్తమానాన్ని విమర్శారహితంగా కీర్తించడం! అటువంటి విమర్శనాత్మక దృక్పథాన్ని వృత్తిపరమైన నిరాశా వాదంగా కొట్టివేయడం జరుగుతుంది. కానీ, ఇది యథాతథ స్థితిని మాత్రమే ప్రోత్సహిస్తుంది. దేశ పురోగతిని అడ్డుకుంటుంది. నిరంకుశ జాతీయవాద ఉద్దేశ్యం స్వార్థ ప్రయోజనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. అందు వల్ల, భారతదేశ నాగరికత వారసత్వంగా ఉన్న వాదనా విధానం అణచివేయబడింది. దేశద్రోహం వంటి ప్రాచీన చట్టాల బలిపీఠం వద్ద వాక్ స్వాతంత్య్రాన్ని త్యాగం చేశారు. భిన్నాభిప్రాయాలను దేశ వ్యతిరేకమైనవిగా ముద్ర వేస్తారు. పౌర హక్కులు, స్వేచ్ఛ వంటివి జాతీయవాద ప్రాజెక్టుకు సహించరానివిగా చిత్రీకరించబడ్డాయి. నిజమైన జాతీయవాదం దాని సొంత గుర్తింపును మాత్రమే ప్రోత్సహిస్తుంది, ఆత్మగౌరవాన్ని వేడుక చేసు కుంటుంది. కానీ, జాతీయోన్మాదం బలవంతంగా, అసంకల్పితంగా అటువంటి స్వీయ అహంకారాన్ని దాని పౌరులపై మోపుతుంది. అటువంటి జాతీయోన్మాదాన్ని ప్రశ్నించే ఎవరైనా దేశం పట్ల అసంతృప్తిని ప్రదర్శించే వ్యక్తిగా పరిగణించబడతారు. నిజానికి అసమ్మతి అనేది ప్రజాస్వామ్యంలో ఓ అంతర్భాగం. కానీ, మెజారిటీ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించే సామాజిక, రాజకీయ శక్తులు చట్టబద్ధమైన జాతీయ గర్వాన్ని తగినంతగా ప్రకటించనప్పుడు జాతీయోన్మాదం విశ్వసనీయతను పొందుతుంది. ఆధునిక భారతీయ జాతీయవాదాన్ని ప్రజాస్వామ్యం, భాష, మతపరమైన బహుళత్వం, వైవిధ్యం, సమాఖ్యవాదం, లౌకికవాదం, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మొదలైన రాజ్యాంగ విలువలపై తిరుగులేని నిబద్ధతతో నిర్వచించాలి. అందువల్ల రాజ్యాంగ జాతీయవాదం ఆధునిక ప్రజాస్వామ్యాలలో అభివృద్ధి చెందిన పౌరసత్వ భావనపై కేంద్రీకృతమై ఉంది. దీనికి విరుద్ధంగా, విభజన గుర్తింపులపై ఆధారపడిన జాతీయవాదం... రాజ్యాంగవాదానికి వ్యతిరేక సిద్ధాంతం. అందువల్ల, మెజారిటీ గుర్తింపుపై ఆధారపడిన జాతీయవాద కథానాయకుడు రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణాన్ని ద్వేషిస్తాడు. అటువంటి మెజారిటీ జాతీయ వాదం అసంపూర్తిగా ఉన్న ప్రజాస్వామిక ప్రాజెక్టులో కొనసాగుతున్న సామాజిక దోష రేఖలను ఉపయోగించు కోవడం ద్వారా అభివృద్ధి చెందుతుంది.అంబేద్కర్ ‘రాజ్యాంగ నైతికత అనేది సహజమైన భావన కాదు, ఎవరికి వారు పెంపొందించుకోవాల్సినది’ అని గమనించారు. అందువల్ల, మెజారిటీ జాతీయవాదానికి వ్యతిరేకంగా పోరాటం కేవలం నైతిక లేదా నైతిక విమర్శ కాదు. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో నేటికీ కొనసాగుతున్న సామాజిక లోపాలను సరిదిద్దడానికి కఠిన ప్రయత్నం అవసరం. కొందరిని అతి శక్తిమంతుల్ని చేసే ఘనత వహించిన జాతీయవాదంపై తద్వారానే పోరాడ వచ్చు. కానీ జాతీయవాదపు లౌకిక, ఉదారవాద విమర్శ మెజారిటీ జాతీయవాద సాంస్కృతిక అంశాలపై దృష్టి పెడుతోంది. అసలు జాడ్యాన్ని విడిచిపెట్టి, దాని లక్షణాలపై మాత్రం ఇలాంటి పోరాటం చేస్తే, అది స్వీయ ఓటమినే మిగులుస్తుంది. దానికి బదులు అటువంటి వక్రీకృత జాతీయవాద ప్రపంచ దృక్పథానికి జవజీవాలను అందించే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోష రేఖలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగించడమే మార్గం. ప్రొ‘‘ కె నాగేశ్వర్ వ్యాసకర్త ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
ఏపీకి ఇచ్చింది రుణమే! గ్రాంట్ కాదు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రతిపాదించిన బడ్జెట్ విద్యారంగాన్నీ, వ్యవసాయాన్నీ పెద్దగా పట్టించుకోలేదు. నిరుద్యోగులకూ ఒరగబెట్టింది ఏమీ లేదు. అలాగే కేటాయింపుల్లో బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు దక్కిందీ అంతంతే! ఏపీ కొత్త రాజధానికి 15 వేల కోట్లు ఇస్తామంటున్నది ఋణమే తప్ప గ్రాంట్ కాదు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో కేటాయించినా ఉద్యో గాల కల్పనకు అది దోహదపడడం లేదన్నది ఇప్పటికే నిరూపి తమయ్యింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌కు ఒకరోజు ముందు ప్రకటించిన ఎకనమిక్ సర్వేతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపా దించిన వార్షిక బడ్జెట్‌కు చాలా అంశాల పరంగా ఎలాంటి లింక్ కని పించడం లేదు. 2047 కల్లా ‘వికసిత్ భారత్’ను సాకారం చేయాలని ప్రతి పాదించినా... దాన్ని ఎలా సాక్షాత్క రింప చేస్తారనే విషయంలో కచ్చి తమైన కార్యాచరణ, చర్యలు ప్రకటించలేదు. గతం నుంచి చూస్తే ఎకనమిక్ సర్వే ఆర్థిక రంగ పరిస్థి తులు, ప్రస్తుత స్థితిగా ఎత్తిచూపేదిగా ఉంటూ వస్తోంది. సాధా రణంగా దీనికి అనుగుణంగా బడ్జెట్లో ఆ యా రంగాలకు చేసే కేటాయింపులు, ఇతర అంశాలు ఆధారపడి ఉంటాయి.ప్రతిపాదిత బడ్జెట్లోని కీలకరంగాలు, ముఖ్యమైన అంశా లను పరిశీలించినా స్పష్టత కనిపించలేదు. ఉపాధి, నైపుణ్యా భివృద్ధి, ఎమ్మెస్ఎంఈలు, మధ్యతరగతి అనే వాటి గురించి ప్రధానంగా పేర్కొన్నారు. వీటిలో మొదటి మూడు అంశాలు ఒక దానికి ఒకటి లంకె కలిగినవి. ఐతే ఈ అంశాలను గురించి చెప్పాక కూడా ప్రభుత్వ ప్రాధాన్యాలు మారే అవకాశాలున్నాయి. అన్నింటికంటే కూడా అత్యధికంగా ఆందోళన కలిగించే అంశం ద్రవ్యోల్బణం. దాని గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. వ్యవసాయ రంగానికి పెద్దగా నిధులు పెంచింది ఏమీ లేదు. పాత విధానానికి కొనసాగింపును ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రతిబింబిస్తున్నాయి. ఆర్థిక సర్వే వ్యవసాయేతర రంగంలో కనీసం 75 లక్షల ఉద్యోగాలను కల్పించాలని చెప్పినా ఆ మేరకు బడ్జెట్లో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎమ్మెస్‌ఎంఈల కంటే దిగువ స్థాయిలో ఉండే అసంఘటిత రంగంలో 2016 నుంచి 2022–23 వరకు 54 లక్షల ఉద్యోగాలు పోయాయి. ప్రధానంగా... పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని ఒత్తిడితో అమలుచేయడం, కోవిడ్ పరిస్థితుల ప్రభావం దీనికి కారణాలు. దాదాపు 18 లక్షల యూనిట్లు మూతపడ్డాయి. దీనిని సరిచేసే చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. రెగ్యులేటరీ మెకానిజాన్ని రిలాక్స్ చేసి రుణాల కల్పన (క్రెడిట్ ఫెసిలిటీ) చేస్తామని చెబుతున్నారు. ఇది వాంఛ నీయమే. నైపుణ్యాల అభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్)తోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పడం తప్పుదారి పట్టించడమే అవుతుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నైపుణ్యాలకు మెరుగులు దిద్దడం అనేది విద్యారంగంతో లింకు కలదిగా గుర్తించాలి. పన్నెండో తరగతి దాకా నాణ్యతతో కూడిన విద్యా భ్యాసాన్ని అందించడంలో భాగంగా నైపుణ్యాల శిక్షణను కూడా అందజేయాలి. బడ్జెట్లో కొత్తగా తూర్పు (ఈస్ట్రన్ స్టేట్స్) రాష్ట్రాలు అని పేర్కొన్నారు. ఇది కొత్త ఆవిష్కరణగా భావించాలా? ఈ రాష్ట్రాల కింద పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒరిస్సాల గురించి చెప్పారు. అయినా వీటిలో కేవలం ఆంధ్రప్రదేశ్, బిహార్‌ల గురించి ప్రస్తావించారు. దేశంలో ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ పరిస్థితులతో ఈ రెండు రాష్ట్రాలకు రాజకీయంగా ప్రాధాన్యం పెరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాలు పెద్ద ఆర్థిక ప్యాకేజీని, ప్రత్యేక హోదా వంటివి కోరుకుంటుండగా వాటికి కంటితుడుపుగానే కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయా నికొస్తే... కొత్త రాజధాని కోసం రూ. 15 వేల కోట్లు రుణం (ప్రపంచబ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్‌ల ద్వారా ఇచ్చే అవకాశాలు) ఇప్పిస్తామన్నారు. రాజధానికి కేంద్రం బడ్జెట్ ద్వారా గ్రాంట్ రూపంలో కాకుండా రుణకల్పన వెసులుబాటు కల్పిస్తామనడం సరికాదు. ఈ రాష్ట్రాలకు పరిశ్రమల కల్పన, మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా అది జరగడం లేదు. ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాల వృద్ధికి రోడ్లు, బ్రిడ్జీలు వంటివి నిర్మిస్తున్నారు. అవి ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు ఉపయోగపడలేక పోతున్నాయి. ప్రైవేట్ కన్జమ్షన్ డిమాండ్‌ను పెంచలేకపోతే ప్రైవేట్ పెట్టుబడులు రావనేది లాజిక్. ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తే మాత్రం ఉపాధి కల్పన సరిగా లేక భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద బడ్జెట్ చెప్పుకోదగినంత గొప్పగా లేదనేది సత్యం.ప్రొ‘‘ డి. నర్సింహారెడ్డి వ్యాసకర్త పూర్వ డీన్, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ -
రైతులకు ‘అమృతం’ ఇవ్వడం మరిచిన కేంద్రం
రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం గురించి కేంద్ర ‘అమృత్ కాల్’ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావనా లేదు. వాతావరణ ప్రతికూల ప్రభావాల సవాళ్ల నేపథ్యంలో వ్యవసాయ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమని తెలిసినప్పటికీ, ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రకృతి వ్యవసాయం వైపు కోటి మంది రైతులను మళ్ళిస్తామని ఆర్థిక మంత్రి చెప్పినా దానికి జరిపిన కేటాయింపులు ఏ మూలకూ రావు.వ్యవసాయ అభివృద్ధి బాగా ఉన్నది, ఆహార ఉత్పత్తి పెరుగుతున్నది అని కేంద్రప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ, ఈ మధ్య కాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల గురించీ అటు ఆర్థిక సర్వేలోగానీ, ఇటు కేంద్ర బడ్జెట్లోగానీ ఎటువంటి ప్రస్తావనా చేయకపోగా, వారి సమస్య పరిష్కారానికి తగిన స్పందన కనబరచలేదు.భారత వ్యవసాయం మంచి పనితీరును కనబరిచిందనీ, అయితే భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతికూల ప్రభావాలు, పెరుగుతున్న పంట ఖర్చులు వంటి కొన్ని సవాళ్ల నేపథ్యంలో ఈ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమని జనవరి 31న పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24 ఆర్థిక సర్వే కూడా ఇంచుమించు ఇదే మాట చెప్పింది. అయినా 2024–25 సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు పాత బాటనే పట్టినాయి. ఎన్నికల నుంచి అధికార భారతీయ జనతా పార్టీ పాఠాలు నేర్చుకోలేదు. ప్రైవేటీకరణ, దిగుమతులు, విదేశీ విధానాల విషయాల్లో పాతబాటనే సాగుతోంది. మారుతున్న వాతావరణం వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పిన నివేదిక, ఆహార ఉత్పత్తి పెరిగింది అని చెబుతున్నది. ఈ వైరుద్ధ్యం మీద ఉన్నశంక తీర్చే ప్రయత్నం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వరదలు, అకాల వర్షాలు ఒక వైపు నష్టపరుస్తుంటే పంటల దిగుబడి ఎట్లా పెరుగుతున్నది? ప్రధానంగా, రైతుల ఆర్థిక పరిస్థితి మీద అంచనా మాత్రం చేయలేదు. బడ్జెట్ కేటాయింపులలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొత్త ఆలోచన విధానం ఏదీ కనపడటం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. అందులో మొట్టమొదటిది, వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కొనే విధంగా తయారు చేయటం. అయితే, ఎట్లా సాధిస్తారు? బడ్జెట్లో కేటాయింపులతో ఇది సాధ్యమయ్యే పని కాదు. ప్రకృతి వ్యవసాయానికి కోటి మంది రైతులను మారుస్తామని తన ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పినా వాస్తవానికి ఇది కొత్త పథకం కాదు. 2023–24లో దానికి ఇచ్చింది రూ.459 కోట్లు మాత్రమే. ఈసారి అది కూడా తగ్గించి రూ.365.64 కోట్లు ఇచ్చారు. 2023–24లో ప్రకృతి వ్యవసాయానికి సవరించిన బడ్జెట్ రూ.100 కోట్లు మాత్రమే. ప్రకృతి వ్యవసాయం కాకుండా పంటల దిగుబడిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఉపాయం ఏది?వ్యవసాయానికి ఒక కొత్త దారి అవసరమని పదే పదే ఆర్థిక సర్వేలు చెప్పినా, వ్యవసాయ బడ్జెట్లో ఆ దిశగా ఆలోచన చేయలేదు. వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించారు. 2022–23లో రూ.1,24,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ కేటాయింపులు 2023– 24లో రూ.1,15,531.79 కోట్లకు తగ్గాయి. ఇది 7 శాతం తగ్గింపు. 2024–25లో వ్యవసాయ పరిశోధనలకు పెద్ద పీట వేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించినా పరిశోధనలకు ఇచ్చినవి మొత్తం రూ.9,941 కోట్లు మాత్రమే. ప్రకటించిన స్థాయిలో కేటాయింపులు లేవు. 2022–23లో ఇదే పద్దుకు ఇచ్చినవి రూ. 8,513.62 కోట్లు. 2023–24లో ఇచ్చినవి రూ.9,504 కోట్లు. పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ.7,137 కోట్లు ఈసారి ఇచ్చారు. అంతకుముందు సంవత్సరాలలో వరుసగా కేటాయించింది రూ.6576.62 కోట్లు, రూ.5,956.70 కోట్లు. నిధులు పెరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద దృష్టి పెట్టలేదు. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి 13 శాతం కోత విధించింది. ఈసారి ఇచ్చింది కేవలం రూ.13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారినపడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకాన్ని ఇంకా విస్తృతం చేయాల్సి ఉండగా తగ్గించడం శోచనీయం.కొత్త ఉపాధి కల్పన పథకం ప్రవేశపెట్టి రూ.10 వేల కోట్లు బడ్జెట్ కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. నెలవారీ జీతం తీసుకునే యువతకు (సంవత్సరానికి రూ.లక్ష వరకు) కొంత భృతి చెల్లించే ఈ పథకం లక్ష్యం అంతుబట్టకుండా ఉన్నది. గ్రామీణ భారతంలో ఉన్న ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు చేయడం లేదు. ఈ పథకం కేవలం పారిశ్రామిక ఉత్పత్తి రంగాలకు రాయితీగా ఇస్తునట్టు కనబడుతున్నది. శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉద్యోగ రక్షణకు కాకుండా ఫ్యాక్టరీలలో ఉపాధికి ఈ రాయితీ ఇవ్వడం అంటే ఆ యా కంపెనీలకు ఇవ్వడమే! పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడిపోతున్నది. ఆహార ద్రవ్యోల్బణం వల్ల సరి అయిన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం. పర్యావరణానికి దోహదపడే చేతివృత్తుల ఉపాధికి ఈ పథకం ఇచ్చివుంటే బాగుండేది.వివిధ మార్గాల ద్వారా 2024–25లో కేంద్రం ఆశిస్తున్న ఆదాయం రూ. 46,80,115 కోట్లు. పోయిన సంవత్సరం మీద రాబోయే సంవత్సరంలో పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఆదాయం రూ.2,50,000 కోట్లు. కానీ పెరిగిన ఈ ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద పెట్టడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం మీద అప్పుల భారం పెరుగుతున్నది. 2022–23 నాటికే ఇది రూ.1,54,78,987 కోట్లకు చేరింది. మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులకు రూ. 11 లక్షల కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇది ఆశ్చర్యం కలిగించకమానదు. అభివృద్ధి అందరికీ కాకుండా కొందరికే పోతున్నది అని నివేదికలు చెబుతున్నప్పటికీ, అభివృద్ధి తీరులో మార్పులకు కేంద్ర ప్రభుత్వ సిద్ధంగా లేదు. వేల కోట్ల పెట్టుబడులతో నిర్మించే రోడ్లు, వంతెనలు వగైరా మౌలిక వసతులు నాసిరకం నిర్మాణం వల్ల, లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల కూలిపోతుంటే పరిస్థితిని సమీక్షించకుండా, సమస్య లోతులను గుర్తించకుండా పదే పదే ఈ రకమైన పెట్టుబడుల మీద ప్రజా ధనం వెచ్చించడం వృథా ప్రయాసే అవుతుంది.డా‘‘ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
బడ్జెట్ 3.0లోనైనా సంక్షేమం వికసించేనా?
మన దేశంలో బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతారు. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్ర వరి నెలలో మధ్యంతర బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశ పెట్టారు. అందుకే పూర్తి స్థాయిలో నేడు (జూలై 23న) 18వ లోక్ సభలో 2024–25 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేశారు. గత బడ్జెట్లు అన్నీ సంపన్నులకు లాభం చేకూర్చే విగానే ఉన్నాయనీ, ఈసారైనా కాస్త సామా న్యులకు ఊరట కలిగించేవిగా ఉండాలనీ జనం ఎదురుచూస్తున్నారు. భాగస్వామ్య పక్షాల వెన్ను దన్నుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ దూకుడు తగ్గించి సామాన్యుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందనీ, ఇవ్వాలనీ ప్రజలు ఆశిస్తున్నారు. కోవిడ్ కాలం నుండి పేదల బతుకుల్లో ఆశించిన మార్పులు లేవు. ఉపాధి కోల్పోయి కొను గోలు శక్తి లేక ఆకలి సైతం తీర్చుకోలేక విలవిలలాడుతున్న దుర్భర పరిస్థితులు ఉండడం బాధాకరం. ఇప్పటికీ వ్యవసాయం, చేనేత,లఘు పరిశ్రమలు వంటివి సంక్షోభంలో పడిపోగా కోట్లాదిమంది అర్ధాకలితో, పస్తులతో గడుపుతున్నారు. 125 దేశాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ ఆకలి సూచికలో 111వ స్థానంలో భారత్ ఉంది. దీన్ని బట్టి ఇక్కడ పేదరికం ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తు న్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఆహార ధాన్యాలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.పెరిగిన ఆహార ద్రవ్యోల్భణం తగ్గించేలా 3.0 బడ్జెట్లో చర్యలు ఉండాలి. గత ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పేద ప్రజలందరికీ గృహ నిర్మాణ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి. 2022–23 బడ్జెట్‌తో పోలిస్తే 2024–25 మధ్యంతర బడ్జెట్లో వ్యవ సాయ అనుబంధ కార్యకలాపాలకు వేల కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది సరికాదు. రైతన్నను ఆదుకోవడానికి తగిన కేటాయింపులు ఈసారన్నా జరగాలి. దేశ ప్రగతికి కీలక అవసరమైన విద్యపై గత బడ్జెట్లో ఆశించిన కేటాయింపులు లేవు. ప్రైవేటు విద్యను ప్రోత్సహించేలా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి నిధుల కేటాయింపు పెంచాలి.అలాగే ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించేలా బడ్జెట్ రూపొందించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రజారోగ్యంపై స్థూల జాతీయోత్పత్తిలో ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం 2.1 శాతం మాత్రమే మన దేశంలో ఖర్చు పెడుతున్నారు. ఈ బడ్జెట్లోనైనా 5 శాతం నిధులు ప్రజారోగ్యంపై కేటాయించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. స్టాండర్డ్ డిడక్షన్ కొత్త పన్ను విధానంలో 7 లక్షల నుండి 12 లక్షల వరకు పెంచాలి. అదేవిధంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలి. ‘బేటీ పఢావో బేటీ బచావో’ అనేది నినాదాలకు పరిమితం చేయకుండా మహిళా సాధికారత దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి. మహిళల పట్ల వేధింపులు లేకుండా ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిని కల్పించడానికి ఏకైక మార్గమైన ‘ఉపాధి హామీ పథకా’నికి ఎక్కువ నిధులు కేటాయించాలి. మొత్తం మీద ఈ బడ్జెట్ నిరుపేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెడతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.తండ సదానందం వ్యాసకర్త టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్మొబైల్: 99895 84665 -
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం కావాలి!
దేశీయ ఆర్థిక వ్యవస్థ 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండొచ్చు; అయితే బయటి ఎదురుగాలులు ఈ వృద్ధిని దెబ్బ తీయొచ్చు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టి పెట్టాలి. ప్రైవేట్ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా ముందుకు సాగాలి. ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశంలో ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భర స్థితిలో ఉంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనాలను పొందేలా చూసుకోవాలి. భారీస్థాయిలోని మన యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.భౌగోళిక రాజకీయ రంగంలో కొనసాగు తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రంలోని కొత్త ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ వివాదం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. దేశీయ ఆర్థిక వ్యవస్థ దాదాపు 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండవచ్చు. అయితే బాహ్య వాతా వరణపు స్థిరత్వాన్ని బట్టి ఇది మారవచ్చు. ప్రపంచ చమురు ధరలు తగ్గింపు స్థితిలోనే ఉంటాయనీ, ఎగుమతి వృద్ధిని ప్రభావితం చేసిన మాంద్యం పోకడల నుండి పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు బయటపడ తాయనీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశిస్తూ ఉండ వచ్చు. అంతర్జాతీయ సముద్ర మార్గాలను కలహాలు లేకుండా ఉంచడం కూడా వచ్చే పోయే వాణిజ్య ఖర్చులలో అనవసరమైన పెరుగుదలను నివారించడంలో కీలకం. స్పష్టంగా, బయటి ఎదురు గాలులు భారతదేశ వృద్ధి కథనాన్ని చెడగొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టి పెట్టడం అవసరం.మౌలిక వసతుల రంగంలో, గత కొన్నేళ్లుగా నమోదైన మూలధన వ్యయంలో విపరీతమైన పెరుగుదలను విధాన రూపకర్తలు కొన సాగించడం మంచిది. 2024–25 మధ్యంతర బడ్జెట్ మూలధన వ్యయంలో అంతకుముందు నమోదైన 30 శాతం పెరుగుదలను సుమారు 16.9 శాతానికి తగ్గించింది. దేశంలోని విస్తారమైన మౌలిక సదుపాయాల అంతరం కారణంగా మూలధన వ్యయంలో అధిక పెరుగుదల అవసరం. ఇది భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను వెంటనే సృష్టించలేకపోయినా, ఉపాధి కల్పనపై నిస్సందేహంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 2.11 లక్షల కోట్లను బదిలీ చేసిన వాస్తవం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ దిశలో కొనసాగడానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.ప్రభుత్వ రంగం కంటే వెనుకబడిన ప్రైవేట్ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా బడ్జెట్ ముందుకు సాగాలి. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు వంటి అమలులో ఉన్న విధానాలు తయారీకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఈ విధానాలను మరింత క్రమబద్ధీకరించాలి. 1991 ఆర్థిక సంస్కరణల కాలం నుండి నియంత్రణ వాతావరణం కచ్చితంగా చాలా ప్రగతి సాధించింది. కానీ గతంతో పోల్చడం అసందర్భం అవుతుంది. ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో ఇప్పుడు పోల్చుకోవలసి ఉంది. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు సరళమైన, సులభ మైన పెట్టుబడి విధానాలను అందిస్తున్నాయి. బహుళజాతి సంస్థలు అక్కడ స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఆకర్షణ. దీనికి విరుద్ధంగా భారతదేశం అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు.దేశీయ పెట్టుబడిదారులు అధిక మూలధనం, లాజిస్టిక్స్ ఖర్చు లతో పోరాడవలసి ఉంటుంది. అయినప్పటికీ, కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు సమృద్ధిగా లభించకపోవడం అనేది దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాన అడ్డంకిగా మిగిలిపోయింది. ఈ సమస్యలు ఇప్పుడు ఎక్కువగా రాష్ట్రాలు లేదా స్థానిక మునిసిపాలిటీల స్థాయిలో ఉన్నాయి. సులభతరమైన వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకురావడం తదుపరి తరం సంస్కరణల్లో భాగం కావాలి.మరో తరం సంస్కరణలు అవసరంఫిబ్రవరిలో 2024–25 మధ్యంతర బడ్జెట్‌తో విడుదల చేసిన ఆర్థిక ప్రకటనలో ఇది ఇప్పటికే పరిగణించబడుతుందనే సూచన కనిపిస్తోంది. ఇది మండలం, జిల్లా, గ్రామ స్థాయిలలో పాలనను మెరుగుపరచడం గురించి ప్రస్తావించింది. వృద్ధి, అభివృద్ధి ఆధారిత సంస్కరణల కోసం రాష్ట్రాలకు 75,000 కోట్ల రూపాయల రుణాన్ని కూడా అందించారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, భూసేకరణ వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించడమైనది.సంస్కరణలు చేపట్టేందుకు రుణాలు అందుబాటులో ఉన్నప్ప టికీ, అన్ని రాష్ట్రాలు సహకరించకపోవడమే ఈ ప్రణాళికలోని ఏకైక చిక్కు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు కట్టు బడి ఉండాల్సి ఉంటుంది, కానీ ఇతర రాష్ట్రాల నుంచి అదే స్పందన రాకపోవచ్చు. అందుకే తదుపరి తరం సంస్కరణలను ప్రారంభించే లక్ష్యం పాక్షికంగా మాత్రమే విజయవంతమవుతుంది. అదే సమయంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాలు, ఇప్పటికే నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు వారికి అండగా నిలుస్తున్నారు. ఉదాహరణకు, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసుకొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అవలంబించిన విధానాలను అధ్యయనం చేయాలి. ఇతర రాష్ట్రాల్లోనూ వీటిని పునరావృతం చేయాలి.ఈ సందర్భంలో, విద్య, నైపుణ్యాలకు చెందిన క్లిష్టమైన విభాగా నికి బడ్జెట్ కేటాయింపులు అవసరం. ప్రభుత్వ ఎజెండాలో ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉండాల్సి ఉండగా, అనేక రంగాలు నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. విద్య రకం, పరిశ్రమకు అవసరమైన నిర్దిష్ట నైపుణ్యాల మధ్య అసమతుల్యత కూడా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాలిక విధాన చికిత్సలను రూపొందించాలి. అయితే స్వల్పకాలంలో, రాబోయే బడ్జెట్లో నైపుణ్యం కలిగిన సంస్థలకు తగిన కేటాయింపులను అందించవచ్చు.అదనంగా, విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశం ఇది. కానీ ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భరమైన స్థితిలో ఉంది. ఇక్కడ కూడా, మన భారీస్థాయిలోని యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి బాగా సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.జీడీపీ, ఉపాధి కల్పనలకు సహకారం అందిస్తున్నందున ప్రయాణం, పర్యాటకం వంటి సేవలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా మరింత మద్దతు ఇవ్వాలి. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికీ, మెరుగైన ఆర్థిక ఎంపికలు అందుబాటులోకి రావడానికీ హోటళ్లకు మౌలిక సదుపాయాల స్థితిని ఆతిథ్య పరిశ్రమ కోరుతోంది. కోవిడ్ ప్రభావిత పతనం నుండి ఈ రంగం బలంగా పుంజుకుంటోంది. అయితే కొంత లక్ష్యితి మద్దతు ఉపాధి అవకాశాలను విస్తరిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం తక్షణ అవసరం. వాటిని ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహకాలతో పాటు, రైతులు రిటైల్ మార్కెట్లను ప్రత్యక్ష మార్గంలో అందుకోవడానికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఆదాయ మార్గాల కల్పనతో పాటు మౌలిక వసతుల కల్పనను తక్షణ ప్రాతిపదికన చేపట్టాలి. లేకుంటే రానున్న సంవత్సరాల్లో పట్టణ, గ్రామీణ అంతరం మరింత విస్తరిస్తూనే ఉంటుంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనా లను పొందగలిగేలా చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఆకాంక్షలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయని ఇటీవలి ఎన్నికలు తెలియజేశాయి.సంక్షేమ విధానాలకు స్వాగతమే. అయితే దీర్ఘకాలంలో అవి స్థిరమైన అభివృద్ధికి దారితీయాలి.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అభివృద్ధికి కొలమానం... సంపదా? సంతోషమా?
ఆత్మహత్యల్ని సామాజిక సమస్యగా పేర్కొంటూ దీని పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త గౌరవ్ కుమార్ బన్సాల్ వేసిన ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సామాన్యులతోపాటూ వైద్యశాస్త్ర నిపుణులు సహితం ఇప్పటికీ ఆత్మహత్యల్ని మానసిక సమస్యగా పరిగణిస్తుంటారు. భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మన సాధారణ అవగాహనలో ఒక గొప్ప ముందడుగు అనే భావించాలి. ప్రభుత్వాలు ఆర్థిక సూచికల్ని ప్రచారం చేసుకున్నంతగా ఆనంద సూచికల్ని ప్రచారం చేయవు. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వంటి ఆర్థిక సూచికల గణాంకాలను సేకరించడం సులువు. అవి ప్రజలకు కూడ సులువుగా అర్థమవుతాయి. ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి, భవిష్యత్తు మీద నమ్మకం వంటి సామాజిక సూచికల గణాంకాలు తీయడం అంత సులువు కాదు. మనుషులు తమ వ్యక్తిగత ఆందోళన, ఒత్తిడి, కుంగుబాట్లను ఇతరులతో పంచుకోరు.జనాభాలో మనదేశం ఇప్పుడు ప్రపంచంలో అగ్రస్థానంలో వుంది. మన తరువాత చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా, మెక్సికో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థల్లో 29 ట్రిలియన్ డాలర్లతో అమెరికాది అగ్రస్థానం. నాలుగు ట్రిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఇండియా ఉంది. త్వరలో మనం జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొంతకాలంగా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అది సాధ్యమూ కావచ్చు. ఈ సందర్భంగా గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు మరికొన్ని వున్నాయి. మనం జనాభాలో చైనాను అధిగమించవచ్చుగానీ చైనా ప్రజల జీవనస్థాయికి చేరుకోలేము. చైనా సాలీన తలసరి ఆదాయం 13 వేల డాలర్లు. అది అమెరికాలో 85 వేల డాలర్లు. మన దేశంలో 3 వేల డాలర్లకన్నా తక్కువ. జీడీపీలో మనం జర్మనీని అధిగమించవచ్చు గానీ, మన ప్రజల జీవనస్థాయి జర్మన్ల జీవన స్థాయిలో 20వ వంతు మాత్రమే వుంటుంది. ఇవి సగటు లెక్కలు మాత్రమే. వాస్తవానికి జనాభాలో 20 శాతం జీవనస్థాయి ఇంతకన్నా చాలా మెరుగ్గా వుంటుంది. 80 శాతం జీవనస్థాయి ఇంతకన్నా మరీ హీనంగా వుంటుంది. మన దేశంలో సంపదకు లోటు లేనప్పటికీ సంపద పంపిణి విధానంలో ఘోరమైన లోటు ఉన్నదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. జీడీపీ, తలసరి ఆదాయాలకు భిన్నమైన ప్రమాణాలు కూడా సమాజంలో ఉంటాయి. ఐక్య రాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్స’వాన్ని నిర్వహిస్తోంది. ఆ సందర్భంగా ప్రపంచ ఆనంద నివేదికను (వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్–డబ్ల్యూహెచ్ఆర్) పకటిస్తుంది. డబ్ల్యూహెచ్ఆర్ – 2024లో 143 దేశాల ర్యాంకులున్నాయి. గత ఏడు సంవత్సరాలుగా ఫిన్లాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. స్కాండినేవియన్ రాజ్యాలు, సంక్షేమ దేశాలుగా పేరొందిన నార్వే, స్వీడన్, డెన్మార్క్ తొలి పది సంతోష దేశాల్లో ఉన్నాయి. అఫ్గానిస్తాన్ అన్నింటికన్నా దిగువన వుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ జాబితాలో ఇండియా స్థానం ఎక్కడా? 143లో 126. శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్, నేపాల్ దేశాల ప్రజలు మనకన్నా సంతోషంగా ఉన్నారని ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. సంతోష సూచికలకు, ఆత్మహత్యలకు ఒక విలోమానుపాత సంబంధం ఉంటుంది. సంతోష సూచికలు మెరుగ్గా ఉంటే ఆత్మహత్యల రేటు తక్కువగా ఉంటుంది. సంతోష సూచికలు తక్కువగా ఉంటే ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటుంది. సంతోష సూచికలు తక్కువగావున్న కారణంగా భారతదేశంలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉందని నివేదికలు చెపుతున్నాయి. ఇండియా ఇప్పుడు ఆత్మహత్యల కేంద్రంగా మారిందని అనేకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2022లో దేశంలో 1 లక్షా 71 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జనాభాలో లక్ష మందికి సాలీనా 12.4 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇది ప్రపంచ రికార్డు. ఇవి అధికారిక గణాంకాలు మాత్రమే. మనుషులు వ్యక్తిగత మానసిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటారని అనిపించడం సహజం. కానీ, ఇది రూపం మాత్రమే; సారం వేరు. ఆత్మహత్యలకు అసలు కారణం ‘సమాజం సంక్షోభంలో పడడం’ అని తొలిసారిగా చెప్పినవాడు ఫ్రెంచ్ సమాజ శాస్త్రవేత్త ఎమిలే దుర్ఖేమ్ (1858–1917). ఆయన అభిప్రాయం ప్రకారం సమాజ మౌలిక స్వభావం సంఘీభావం. సమాజం తన మౌలిక స్వభావమైన సంఘీభావాన్ని కోల్పోయినపుడు అక్కడ మనుషులు బతకలేరు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా నగరాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకన్నా అభివృద్ధి చెందిన దేశాల్లో; నిరక్షరాస్యులకన్నా విద్యావంతుల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి.ప్రతి చారిత్రక దశలోనూ తిరిగితిరిగి ఒకే ప్రశ్న మన ముందుకు వచ్చి నిలబడుతుంది. అభివృద్ధికి కొలమానం ఏమిటి?– సంపదా? శాంతా? జీడీపీ పెరుగుదల రేటా? సంతోష సూచికలా? పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోనే ఒక అమానవీయ లక్షణం ఉందన్నాడు కార్ల్ మార్క్స్. కార్మికుడు తాను ఉత్పత్తి చేసిన సరుకుకు పరాయివాడైపోతాడు అన్నాడు. ఈ పరాయీకరణ ఫ్యాక్టరీ నుండి ఫ్యామిలీ లోనికి ప్రవేశించినపుడు మనిషి ఒంటరివాడయిపోతాడు. సంఘీభావానికి నోచుకోలేడు. ఓదార్చేవాడు కనుచూపు మేరలో కనిపించకపోతే మనిషి స్వచ్ఛందంగా లోకాన్ని వదిలేస్తాడు. మనం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి ముందే ఆత్మహత్యల నిలయంగా మారాము. అదీ విషాదం! డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు -
ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే!
కశ్మీర్ వేర్పాటు వాదుల తీవ్రవాద చర్యలను సమర్థిస్తూ, భారత సైన్యంపై విషం కక్కుతూ ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యలు 14 సంవత్సరాల క్రిందటివి. 2010 అక్టోబర్ 21న దేశ రాజధాని నగరం ఢిల్లీలో ‘ఆజాది ఓన్లీ ద వే’ అనే అంశంపై కశ్మీరీ వేర్పాటు వాదులు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కశ్మీర్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్, రచయిత్రి అరుంధతీ రాయ్ భారత సైన్యానికీ, భారత ప్రభుత్వానికీ వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్ర పరిధిని అతిక్రమించాయనే చెప్పాలి. దేశభద్రతపై ఆ వ్యాఖ్యలు చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సామాజిక కార్యకర్త సుశీల్ పండిట్ ఫిర్యాదు మేరకు ‘ఉపా’ కింద 2010 అక్టోబర్ 28న ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. లౌకికవాద ముసుగు వేసుకున్న కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు కశ్మీర్ వేర్పాటువాదుల వాదనలకు వ్యతిరేకంగా విచారణ చేస్తే... ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బ తింటుందో అనే భీతితో ఆ కేసును తొక్కి పట్టారు. వాస్తవంగా దేశ భద్రతతో ముడిపడిన ఈ విషయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచే కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించి ఉండాలి. 14 ఏళ్లు ఆ కేసుపై విచారణ జరగకుండా తాత్సారం చేయడం దేశాన్ని ప్రేమించే వాళ్లకు మాత్రమే ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశ భద్రత విషయంలో కఠిన వైఖరి అవలంబించే మోదీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఈ కేసును విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేయడానికి కారణాలనూ దేశ ప్రజలకు వివరించవలసిన బాధ్యత మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలదే! అనూహ్యంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ కేసు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దేశానికి వ్యతిరేకంగా, దేశ భద్రతకు సవాల్‌గా మారిన తీవ్రవాదులకు అనుకూలంగా గళం విప్పిన వాళ్ళ పని పట్టడానికి మూడోసారి అధికారంలో కూర్చున్న మోదీ∙ప్రభుత్వం చురుకుగా పని చేస్తుందని ముందస్తు సమాచారం ఇవ్వడంలో భాగంగానే ఈ ‘ఉపా’ కేసును తెరపైకి తెచ్చేలా కేంద్రం చేసిందా అనే అనుమానం దేశ ప్రజలకు కలగక మానదు.‘ఆజాదీ ఓన్లీ ద వే’ కాన్ఫరెన్స్‌లో అరుంధతీ రాయ్ మాట్లాడిన మాటలను, ఆమె ఉద్దేశాలను ఈ దేశ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఎవరిది? కశ్మీర్ స్వతంత్ర దేశమనీ, దాన్ని భారత ప్రభుత్వం దౌర్జన్యంగా ఆక్రమించిందనీ, కశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా బతికే హక్కు ఉందనీ, ఈ హక్కు కోసం భారత సైన్యంతో పోరాడే కశ్మీరు వేర్పాటు వాదులు తన సోదరులనీ, ఈ పోరాటంలో భారత సైన్యానికి ఎదురొడ్డి నిలవడం సమర్థనీయమనీ ఆమె చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలకు తెలియనీయకుండా కనుమరుగు చేసింది ఎవరు?స్వాతంత్య్రానంతరం 562 సంస్థానాలు భారతదేశంలో విలీనమైనట్లే జమ్మూ–కశ్మీర్ సంస్థానం రాజు ‘రాజా హరి సింగ్’ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని, జమ్మూ–కశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. నిజానికి పాకిస్తానే 1948లో కశ్మీర్లో మూడో వంతును ఆక్రమించింది. దాన్ని ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అని పిలుస్తున్నారు. అప్పటి నుంచి కశ్మీర్లో పాక్ వెన్నుదన్నుతో తీవ్రవాదులు చేసిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీల్చుతూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం ముక్కలు కావాలని ఎవరు కోరినా క్షమించరాని నేరమే అవుతుంది. – ఉల్లి బాలరంగయ్య, సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
‘ఒకే పన్ను’కు పెద్ద రంగాలే దన్ను
జీఎస్టీని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విధానాన్ని సులభతరం చేయడం వీటిల్లో కొన్ని చర్యలు మాత్రమే. అదే సమయంలో ఒకే పన్ను రేటు అన్న అసలు లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలోని అతి పెద్ద రంగాలైన పెట్రోలియం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి. ఒకే పన్ను అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పుడున్న పన్ను స్లాబ్‌లను తగ్గించి, దీర్ఘకాలంలో పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా హేతుబద్ధమైన దృష్టితో ఆలోచించి దేశ ఆర్థిక వృద్ధి కోసం జీఎస్టీ లక్ష్యానికి దన్నుగా నిలవాలి.దేశంలో ఏడేళ్ల క్రితం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తొలిసారి ప్రవేశపెట్టినప్పుడు దాని అమలుపై చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందేహాల నివృత్తి జరక్కుండానే జీఎస్టీ అమలుకు నిర్ణయం తీసుకోవడం దుందుడుకు చర్యగా కొందరు అభివర్ణించారు కూడా!అంతకు ఏడాది క్రితమే పెద్దనోట్ల రద్దు జరిగిందని, ఆ నష్టం నుంచి తేరుకోకముందే అరకొరగా జీఎస్టీని అమలు చేయడం సరికాదని వాదించారు. ఆర్థికవేత్తలు, పన్ను నిపుణులు చాలామంది జీఎస్టీ అమలు విఫలం కాక తప్పదన్న హెచ్చరికలూ జారీ చేశారు. అయితే అన్ని అభ్యంతరాలను తోసిరాజని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ముందడుగు వేయడం తెలివైన పనే అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే అనుమానాలు తీర్చడంలో, జీఎస్టీలో భాగస్వాములైన వారందరి అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వడంలో ఏళ్లు పూళ్లు అవడం ఖాయం. కానీ ఒక్క విషయమైతే ఇక్కడ చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను ఉండాలన్న జీఎస్టీ లక్ష్యం పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలనూ దీని పరిధిలోకి తీసుకు రాగలిగితేనే నెరవేరుతుంది.జీఎస్టీపై సాధికార కమిటీదేశవ్యాప్తంగా ఒకే పన్ను అన్న అంశంపై సుమారు 18 ఏళ్లు చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నులు, రాష్టాల పన్నుల స్థానంలో ఒకటే పన్ను ఉండాలన్నది 1999 నాటి వాజ్‌పేయి ప్రభుత్వ ఆలోచన. విజయ్ కేల్కర్ నివేదిక ఈ కొత్త పన్ను విధానాన్ని ప్రతిపాదించింది. తద్వారా పన్ను వసూళ్లు మెరుగవుతాయని, ఆర్థిక వ్యవస్థల ఏకీకరణ సాధ్యమవుతుందని అంచనా వేశారు. జీఎస్టీ అమల్లో ఉన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు బాగున్నట్లు అప్పటికే జరిగిన పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి కూడా. జీఎస్టీపై 2000లో ఆర్థిక మంత్రులతో కూడిన ఒక సాధికార కమిటీ ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అసిమ్‌దాస్ గుప్తా ఆ కమిటీకి నేతృత్వం వహించారు. ఇప్పటి జీఎస్టీ కౌన్సిల్ తొలి రూపం ఆ కమిటీనే. దాని సిఫారసులను అనుసరించి అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, ఆదాయ వ్యవహారాల్లో ఏకాభిప్రాయ సాధన సూత్రాలుగా జీఎస్టీ కౌన్సిల్ పని చేస్తుంది. చర్చోపచర్చల తరువాత ఈ కమిటీ జీఎస్టీ బిల్లు తొలి ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందుకు సుమారు ఇరవై ఏళ్లు పట్టింది. అప్పటికీ కొన్ని అభ్యంతరాలు ఉండగా... 2016 నాటికి గానీ స్థూలమైన ఏకాభిప్రాయం కుదరలేదు.మెరుగుపడిన పన్ను వసూళ్లు!ఒకే ఒక్క పన్ను అన్న లక్ష్యంతో మొదలైన జీఎస్టీలో సంక్లిష్టతలు వచ్చేందుకు ఒక కారణం... తమ ఆదాయం పడిపోతుందన్న రాష్ట్రాల బెంగ. ఫలితంగా... ఒకే పన్ను స్థానంలో పలు రకాల పన్ను రేట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రాల జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ, అంతర్రాష్ట్ర రవాణాపై సమీకృత జీఎస్టీ ఇలా పలు రకాల పన్నులు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా... ఐదు నుంచి 28 శాతం వరకూ నాలుగు విభాగాల పన్ను రేట్లను నిర్ధారించారు. అంతేకాదు... తమకు అత్యధిక ఆదాయాన్నిచ్చే పెట్రోలు, మద్యం జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండాలని రాష్ట్రాలు పట్టుబట్టాయి. జీఎస్టీ అమలు సమయంలో ఈ పన్ను ద్వారా తగినంత ఆదాయం వస్తుందా? అన్న అనుమానాలు రాష్ట్రాలకు ఉండేది. అయితే ఈ అనుమానాలు వట్టివేనని తేలిపోయింది. వాస్తవానికి పన్ను వసూళ్లు మునుపటి కంటే బాగా మెరుగయ్యాయి. జీఎస్టీ తాజా గణాంకాలను పరిశీలిస్తే గత జూన్ నెలలో వసూళ్లు 1.74 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. జీఎస్టీని ప్రవేశపెట్టిన తొలి ఏడాది ఈ మొత్తం నెలకు 90 వేల కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్రాల సొంత ఆదాయం కూడా జీఎస్టీ అమలు తరువాత పెరిగినట్లు ఆర్బీఐ జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. అంటే... రాష్ట్రాలు జీఎస్టీ విషయంలో ఏర్పాటు చేసిన కాంపెన్సేషన్ లేకుండా సొంత ఆదాయాలతోనే వ్యవహారాలు చక్కబెట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఈ కాంపెన్సేషన్ అనేది ముందు ఐదేళ్లు ఉంటుందని అనుకున్నారు కానీ... కోవిడ్ కారణంగా 2026 వరకూ పొడిగించారు. ఆదాయం ఇప్పటి మాదిరే పెరుగుతూ ఉంటే ఈ ఏర్పాటును రద్దు చేయవచ్చు.చిన్న వ్యాపారులకు మేలే జరిగింది!మొత్తమ్మీద జీఎస్టీ అమలులో కొన్ని ఆటుపోట్లు ఉన్నాయన్నది వాస్తవం. పద్ధతులను సులువు చేసే విషయంలో, మరీ ముఖ్యంగా రెడ్టేప్ను తగ్గించడంలో! అయితే ఇతర సమస్యలేవైనా వచ్చినా వాటి పరిష్కారం కోసం రాష్ట్రాలు తరచూ జీఎస్టీ కౌన్సిల్ రూపంలో సమావేశమవుతూండటం గమనార్హం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తేవడం ఎలా అనే సవాలును కంప్యూటర్ల సాయంతో అధిగమించారు. జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారులకు నష్టం జరుగుతుందని కొంతమంది భయపడ్డారు కానీ.. వాస్తవానికి జరిగింది మేలే. లక్షలాది చిన్న వ్యాపారులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైపోయారు.జీఎస్టీ పరిధిలోకి పెట్రోలుజీఎస్టీ అమలుతో సామాన్యులపై పన్ను భారం ఎక్కువ అవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు కానీ దీనికి కూడా సరైన హేతువు ఏదీ లేదని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. వినియోగమవుతున్న వస్తువుల్లో 60 శాతం వాటికి అతి తక్కువ పన్ను రేట్లు (సున్నా లేదంటే ఐదు శాతం) ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు కేవలం మూడు శాతం వస్తువులపై మాత్రమే 28 శాతం అత్యధిక పన్ను పడుతోంది. అయినా ఒక్క విషయాన్ని మాత్రం మనం అంగీకరించాల్సి ఉంటుంది. జీఎస్టీ పన్ను రేట్లను మరింతగా హేతుబద్ధీకరించాలి. ఒకే పన్ను రేటు అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పుడున్న పన్ను స్లాబ్‌లను తగ్గించి దీర్ఘకాలంలో పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు.ఇక రెండో అంశం. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంది. విద్యుత్తు, భూమి వంటి వాటిని కూడా చేర్చాలన్న వాదన ఉంది. తొలి దశలో భాగంగా వైమానిక ఇంధనం, సహజవాయువులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. పెట్రోలు, డీజిళ్లను కూడా చేర్చడం ఇప్పటికే ఆలస్యమైందని చెప్పాలి. రాష్ట్రాలకు సంబంధించి అతి పెద్ద ఆదాయ వనరుగా ఉండటం వల్ల మద్యం అమ్మకాలపై జీఎస్టీ అనేది కొంచెం సున్నితమైన అంశం అవుతుంది. అయితే నేడు కాకపోతే రేపు అయినా సరే... ఈ మార్పు అనివార్యం.అప్పిలేట్ ట్రిబ్యునల్ అవసరంజీఎస్టీ కౌన్సిల్ ఇటీవలి సమావేశాల్లో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మేలు చేసేలా కొన్ని నిర్ణయాలు జరిగాయి. జీఎస్టీకి ముందు కాలం నాటి వివాదాల విషయంలో కొంత వెసులుబాటు కల్పించారు. అదే సమయంలో జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరాన్ని కూడా కౌన్సిల్ గుర్తించింది. జీఎస్టీ అమలును మరింత సమర్ధంగా మార్చేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విధానాన్ని సులభతరం చేయడం వీటిల్లో కొన్ని చర్యలు మాత్రమే. అదే సమయంలో ఒకే పన్ను అన్న అసలు లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలోని అతిపెద్ద రంగాలైన పెట్రోలియం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా హేతుబద్ధమైన, దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించి దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా జీఎస్టీ లక్ష్యానికి దన్నుగా నిలవాలి.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త ఆర్థిక వ్యవహారాల సీనియర్ జర్నలిస్ట్ -
వేగంగా, క్షేమంగా పట్టాలెక్కితేనే...
ఈ నెలలో పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదం రైల్వేల పనితీరును మరోసారి వార్తల్లోకి తెచ్చింది. కాగ్ నివేదిక ప్రకారం, రైళ్లలో అత్యంత ప్రమాదాలకు కారణం అవుతున్నవి సిగ్నల్ వైఫల్యాలు, పట్టాల్లో బీటలు. భద్రతా ప్రమాణాలకు తోడు, నత్తనడక వేగం వల్ల రైల్వేలు తమ మార్కెట్ వాటాను కోల్పోయాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సగటు వేగం గంటకు 50 – 51 కిలోమీటర్ల మధ్యనే ఉండిపోయిందనీ, ‘మిషర్ రఫ్తార్’ ద్వారా సగటు వేగం 75 కిలోమీటర్లకు పెరిగిందన్నది ప్రచారమేననీ తేలింది. వందే భారత్ రైళ్లు వేగం కంటే హంగులకే ప్రసిద్ధి చెందాయి. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో రైల్వే వ్యవస్థ అన్ని విధాలుగా పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజల అవసరాలు తీరుతాయి.భారతీయ రైల్వే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ నెల 16న పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి వద్ద ఓ గూడ్సు బండి, ప్యాసెంజర్ రైలును ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించగా, సుమారు 40 మంది గాయపడ్డారు. 1995 నుంచి తీసుకుంటే దేశంలో కనీసం ఏడు భయంకరమైన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఐదింటిలో 200కు పైగా ప్రాణాలు పోయాయి. ఇంకోదాంట్లో 358 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ వద్ద 1995లో జరిగింది. ఏడాది క్రితం ఒడిశాలోని బాలాసోర్ వద్ద పలు రైళ్లు ఢీకొనడంతో 287 మంది చనిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఏడు ప్రమాదాల్లోనే విలువైన 1,600 ప్రాణాలు గాల్లో కలిసిపోవడం గమనార్హం. 140 కోట్ల జనాభా కలిగిన మనలాంటి దేశంలో రైల్వే వ్యవస్థ పటిష్టంగా ఉండాలనీ, రోడ్డు, వాయు మార్గాలతో పోటీపడేలా ఉన్నప్పుడే ప్రజల అవసరాలు తీర్చగలమనీ రైల్వే ప్లానర్స్ చెబుతారు. రైల్వే బోర్డు లేదా కేంద్ర ప్రభుత్వం రెండూ ఈ ప్రాథమ్యాన్ని కాదని అనలేదు. రైల్వే వేగం రెట్టింపు చేస్తామనీ, మరిన్ని రైల్వే లైన్లతోపాటు భద్రతను కూడా పెంచుతామనీ కేంద్రం తరచూ ప్రకటనలు చేస్తూనే ఉంటుంది. ప్రధానమైన రైల్వే రూట్లలో రద్దీ విపరీతమైన నేపథ్యంలో ఇది అవసరం కూడా. కాకపోతే ఈ మాటలు ఇప్పటివరకూ మాటలకే పరిమితం కావడం గమనార్హం. గూడ్స్, ప్యాసెంజర్ రవాణా రెండింటిలోనూ రైల్వేలు తమ మార్కెట్ వాటాను ఎప్పుడో కోల్పోయాయి. 2010–12 మధ్యకాలంలో ఈ రెండింటిలో వృద్ధి స్తంభించిపోయింది. రోడ్డు, వాయు మార్గాల వాటా ఏటా 6 నుంచి 12 శాతం వరకూ పెరిగాయి. 2014–15 నుంచి 2019 – 20 మధ్యలో ప్రయాణికుల సంఖ్య కిలోమీటర్‌కు 99,500 కోట్ల నుంచి కిలోమీటర్‌కు 91,400 కోట్లకు పడిపోవడం గమనార్హం. అదే గూడ్స్ రవాణా విషయానికి వస్తే, అది కిలోమీటర్‌కు 68,200 – 73,900 టన్నుల మధ్యే నిలిచిపోయింది. 2019–20 నుంచి ఇప్పటి వరకూ ఉన్న కాలంలో ప్యాసెంజర్, గూడ్స్ రవాణా గణాంకాలను రైల్వే శాఖ వెల్లడించలేదు.దేశంలో రవాణాలో రైల్వేది గుత్తాధిపత్యం అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం అది తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మార్కెట్ వాటా తగ్గుదల ఇప్పటిమాదిరే ఇంకో పదేళ్లు కొనసాగితే రైల్వేలు రెండో తరగతి రవాణా వ్యవస్థలుగా మారిపోతాయి. రైల్వే లైన్లు, వేగం, భద్రతా ప్రమాణాలు పెరగకపోవడాన్ని బట్టి చూస్తే భారతీయ రైల్వే ప్రస్థానం ఈ దిశగానే సాగుతోందని అనాలి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి విశాలమైన, జనాభా తక్కువ ఉన్న దేశాల్లో రైల్వేలు ఇప్పుడు ఇదే దశలో ఉన్నాయి. అయితే భారతదేశంలోని జనాభా సాంద్రత, ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న వైనాలను దృష్టిలో పెట్టుకుంటే రైల్వేల తిరోగమనం మంచిది కాదు.రైళ్లలో భద్రత అంశాన్ని విస్తృత దృష్టికోణంతో చూడాల్సి ఉంటుంది. గత రెండు దశాబ్దాల్లో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే రైల్వే బోర్డు ఒక దిశ, దిక్కూ లేకుండా పని చేస్తోంది. అకస్మాత్తుగా విధానాల మార్పులు జరిగిపోతుండటంతో విస్తరణ, వృద్ధికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. నత్తనడకన నడుస్తున్న రైళ్లను మరింత వేగంగా పరుగెత్తించడంలో బోర్డు ఘోరంగా విఫలమైంది. రైళ్ల రాకపోకలు దైవాధీనమన్న పరిస్థితి ఇప్పటికీ మారలేదు. భద్రతపై ఆందోళనలూ పెరిగిపోతున్నాయి. రైల్వేల భద్రత, వేగం, సమయపాలన విషయాల్లో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవలే రెండు ముఖ్యమైన నివేదికలు సమర్పించారు. 2014–19 మధ్యలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైల్వేల సగటు వేగంలో పెద్దగా మార్పుల్లేవనీ, గంటకు 50 – 51 కిలోమీటర్ల మధ్యనే ఉండిపోయిందనీ స్పష్టం చేసింది. ‘మిషర్ రఫ్తార్’ ద్వారా సగటు వేగం గంటకు 75 కిలోమీటర్లకు పెరిగిందన్న ప్రచారం వట్టిదేనని తేల్చింది. సరుకు రవాణా రైళ్ల విషయంలో రైల్వే బోర్డు చెప్పుకొంటున్నట్లుగా వేగం రెట్టింపు కాకపోగా, సగటు వేగం కొంత తగ్గినట్లు ఈ నివేదిక తెలిపింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, రైళ్లను గంటకు 110–130 కి.మీ. వేగం నుంచి, గంటకు 160 – 200 కి.మీ. వేగంతో పరుగెత్తించేందుకు కావాల్సిన టెక్నాలజీ, కోచుల తయారీ సామర్థ్యాలను భారత్ 20 ఏళ్ల క్రితమే సముపార్జించుకోవడం! కాగ్ విడుదల చేసిన రెండో నివేదిక ప్రమాదాలకు సంబంధించినది. ప్రమాదాల సంఖ్యలో కొంత తగ్గుదల ఉంది. మనుషుల కావలి లేని గేట్ల దగ్గర మనుషులను పెట్టడం దీనికి ముఖ్య కారణం. కానీ పట్టాలు తప్పిపోవడం, ఢీకొనడం వంటి వాటి విషయంలో పెద్దగా పురోగతి లేదు. సిగ్నల్ వైఫల్యాలు, రైల్ ఫ్రాక్చర్లు(పట్టాల్లో బీటలు) పెరిగిపోతూండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ రైల్వేల్లో అత్యంత భారీ ప్రమాదాలు ఈ రెండు కారణాలతోనే జరగడం గమనార్హం. బాలాసోర్‌లో గత ఏడాది సంభవించిన ప్రమాదానికి సిగ్నల్ వైఫల్యం కారణమన్నది తెలిసిన విషయమే. మొత్తమ్మీద కాగ్ నివేదికలు రెండింటి సారాంశం చూస్తే రైల్వేల్లోని వ్యవస్థల వైఫల్యానికి వేగం, సామర్థ్యం పెంపు వంటివి తోడయ్యాయి. ఫలితంగా భద్రత అంతంత మాత్రంగా మారిపోయింది. సమయపాలన అసాధ్యంగా మారింది. భారతీయ రైల్వేల్లో ప్రస్తుత నెట్వర్క్ తిరోగమన దిశలో ఉంటే... ఏటికేడాదీ భారీ ప్రాజెక్టుల ప్రకటన కొనసాగుతూనే ఉంది. వీటి ఆర్థిక వెసలుబాటు గురించి ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ప్రధాన బ్రాడ్‌గేజ్ లైన్‌తో అనుసంధానం కాకుండా ఉండే ‘స్టాండ్ అలోన్ బుల్లెట్ ట్రైన్లు’ వీటిల్లో ఒకటి. ఈ లైన్లు అన్నీ స్టాండర్డ్ గేజ్‌పై నిర్మించినవి. అలాగే సరుకు రవాణాకు ఉద్దేశించిన కారిడార్ పొడవాటి, బరువైన రైళ్ల కోసం సిద్ధం చేసినది. దేశంలో తొలి బుల్లెట్ రైలు నిర్మాణం 2017లో మొదలైంది. 2012లోనే సరుకు రవాణాకు ప్రత్యేకమైన కారిడార్ల నిర్మాణం మొదలైంది. ఇదిలా ఉంటే... గత మూడేళ్లలోనే దేశంలో సుమారు 50 జతల ‘సెమీ హై స్పీడ్’ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఇవి వేగం కంటే వాటి హంగులకే ఎక్కువ ప్రసిద్ధి చెందాయి. ఒక్క విషయమైతే స్పష్టం. రైల్వే బోర్డు తన ప్రాథమ్యాలను సమగ్రంగా సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని తలకెత్తుకుంటుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం.అలోక్ కుమార్ వర్మ వ్యాసకర్త రైల్వే విశ్రాంత చీఫ్ ఇంజినీర్ -
నిజ్జర్‌కు కెనడా నివాళి.. స్పందించిన భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించడంపై భారత ప్రభుత్వం శుక్రవారం(జూన్ 21) స్పందించింది. వేర్పాటువాదం, హింసను సమర్థించే చర్యలను వ్యతిరేకిస్తామని తెలిపింది. గతేడాది జూన్‌లో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా బయట నిజ్జర్‌ను కొందరు దుండగులు కాల్చి చంపారు.ఈ ఘటన వెనుక భారత ‘రా’ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య విభేదాలు ఏర్పడ్డాయి. ట్రూడో ఆరోపణలను అప్పట్లో భారత్ ఖండించింది. హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా ప్రభుత్వం ఆ దేశ పార్లమెంట్లో ఇటీవల నిజ్జర్‌కు నివాళులర్పించడం గమనార్హం. ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించడమే కాకుండా ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి మృతికి దేశ పార్లమెంట్లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం దీనికి తగిన కౌంటర్ కూడా ఇచ్చింది.ఎయిర్ ఇండియాా కనిష్క విమానాన్ని గాల్లో పేల్చివేసి ఈ జూన్ 23కు 39 సంవత్సరాలు పూర్తవుతుంది. ఖలిస్తానీ తీవ్రవాదులు పెట్టిన బాంబుకు ఆ విమానం ముక్కలు కావడంతో 329 మంది మృతి చెందారు. ఆ రోజున వాంకోవర్‌లో ఉన్న ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించనున్నట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
విత్తనాలకు.. సుస్థిర విధానం అవసరం!
మన దేశంలో వరిలో దాదాపు 3 లక్షల దేశీ రకం విత్తనాలు ఉండేవని వ్యవసాయ చరిత్ర చెబుతున్నది. అనేక పంటలకు వివిధ రకాల విత్తనాలను వృద్ధి చేసుకున్న ఘనత భారత సాంప్రదాయ వ్యవసాయానిది. హరిత విప్లవం ఒక విధానంగా వచ్చిన గత 60 ఏళ్లలో అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలను ప్రవేశపెట్టారు. ఏకపంట పద్ధతికి ప్రోత్సాహం రావడంతో, పంటల వైవిధ్యం తగ్గింది. రసాయనాలు వాడి తయారు చేసిన విత్తనాలు రసాయన వ్యవసాయంలోనే పని చేస్తాయి. కొన్ని కంపెనీల ఆధిపత్యంలో మార్కెట్లు ఉండటం వ్యవసాయ సుస్థిరతకు శ్రేయస్కరం కాదు. రైతులకు విత్తనాల మీద స్వావలంబన కొనసాగించే వ్యవస్థ అవసరం. ప్రభుత్వాలు సుస్థిర, గుత్తాధిపత్య రహిత విత్తన వ్యవస్థకు ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలి.ఆహార ఉత్పత్తి మొదలయ్యేది విత్తనాల నుంచే. దాదాపు ప్రతి పంటకు అనేక రకాల విత్తనాలు ఉన్నాయి. స్థానికంగా లభ్యమయ్యే ప్రత్యేక పర్యావరణ, వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పంటలో రైతులు వందల ఏండ్లుగా విత్తనాలను రూపొందిస్తున్నారు. మన దేశంలో వరిలో దాదాపు 3 లక్షల దేశీ రకం విత్తనాలు ఉండేవని వ్యవసాయ చరిత్ర చెబుతున్నది. వంకాయలో 3 వేలతో సహా అనేక పంటలకు వివిధ రకాల విత్తనాలను వందల యేండ్ల నుంచి వృద్ధి చేసుకున్న ఘనత భారత సాంప్రదాయ వ్యవసాయానిది. దేశవ్యాప్తంగా విత్తనాల చుట్టూ అనేక సంప్రదాయాలు, పండుగలు, గ్రామీణ కార్యక్రమాలు ఉండేవి. గ్రామీణులు, రైతులు, ప్రత్యేకంగా మహిళలు విత్తనాలను గుర్తించటంలో, దాచటంలో, శుద్ధి చేయడంలో గణనీయ జ్ఞానం, కౌశల్యం సంపాదించారు. 35,000 సంవత్సరాలకు పైగా, తరతరాలుగా రైతాంగం పరిశోధనల ఫలితంగా అనేక రకాల విత్తనాలు వృద్ధి అయినాయి. ఈ జానపద విత్తన రకాలు మానవాళికి సుమారు 2,500 పంటలు, 14 పశువుల రకాలకు సంబంధించి ఆశ్చర్యపరిచే స్థాయిలో 11.4 లక్షల రకాల పంటలు, 8,800 పశువుల జాతులను అందించాయి.హరిత విప్లవం ఒక విధానంగా వచ్చిన గత 60 ఏళ్లలో అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలు, ప్రధానంగా వరి, గోధుమలు, మక్కల(మొక్కజొన్న)లో ప్రవేశపెట్టారు. 1968–2019 మధ్య వివిధ సంస్థల ద్వారా 1200 వరి హైబ్రిడ్లు ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ఏకపంట పద్ధతికి ప్రోత్సాహం రావడంతో, పంటల వైవిధ్యం క్రమంగా తగ్గుతూ వచ్చి, ప్రమాదకర స్థాయికి చేరింది. హైబ్రిడ్ విత్తనాలను ప్రతి 3, 4 ఏళ్లకు మార్చాల్సి వస్తుంది. ఆధునిక వ్యవసాయం ల్యాబ్ విత్తనాలను ప్రవేశపెట్టి, సంప్రదాయ విత్తనాలను కనుమరుగు చేస్తున్నది. విత్తనాలు కంపెనీల గుప్పిట్లోకి పోయాయి. విత్తనాలు పోయినాయి అంటే మొత్తం ఆహార వ్యవస్థ ఈ కంపెనీల చేతులలోకి వెళ్లిపోవచ్చు. అట్లని కంపెనీల అధీనంలో, ఒక గొప్ప విత్తన వ్యవస్థ వచ్చిందా అంటే అదీ లేదు. రసాయనాలు వాడి తయారు చేసిన విత్తనాలు రసాయన వ్యవసాయంలోనే పని చేస్తాయి. సహజంగా విత్తనాలలో సహజీవన సూక్ష్మజీవులు ఉంటాయి. రసాయన చర్యకు లోనైన ఆధునిక విత్తనాలలో ఈ సూక్ష్మ జీవులు ఉండవు. జీవ ప్రక్రియలో ముఖ్య ఘట్టం విత్తనాలు. ఆ విత్తనాలు విషానికి, విష వ్యాపార సంస్కృతికి బలవుతున్నాయి. ప్రైవేటు కంపెనీల విత్తన వ్యాపారం మన దేశంలో 2002 నుంచి పుంజుకుని, ప్రతి యేడు పెరుగుతున్నది. దాదాపు రూ.25 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 75 శాతం విత్తన వ్యాపారం కేవలం మూడు బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యంలో ఉన్నది. అమెరికాలోనే పారిశ్రామిక వ్యవసాయానికి అనుగుణమైన విత్తన వ్యవస్థ పుట్టుకొచ్చింది.అమెరికా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ కంపెనీలకు మద్దతుగా తన వాణిజ్య, విదేశాంగ విధానం అమలు చేస్తుంది. మార్కెట్లో పోటీ తగ్గి కొన్ని కంపెనీల ఆధిపత్యంలో మార్కెట్లు ఉండడం వ్యవసాయ సుస్థిరతకు శ్రేయస్కరం కాదు. బీటీ పత్తి మినహా వేరే రకం పత్తి మార్కెట్లో లేకుండా ఈ ప్రైవేటు కంపెనీలు సిండికేట్ అయినాయి. ప్రభుత్వ సంస్థలలో విత్తన పరిశోధనలు జరగకుండా ప్రైవేటు విత్తన వ్యాపారం అడ్డు పడుతున్నది.అధిక దిగుబడి వంగడాలు, హైబ్రిడ్ విత్తనాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో 1968లో కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రాథమిక లక్ష్యం అప్పట్లో ప్రభుత్వ పరిశోధన సంస్థలు విత్తనాలను విడుదల చేసే పద్ధతిని నిర్దేశించిడం. తరువాత 2002లో ప్రైవేట్ కంపెనీలకు విత్తనాలను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినాక విత్తన చట్టం సవరించాలని భావించారు. 2003 నుంచి కొత్త విత్తన చట్టాన్ని రైతాంగం కోరుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కంపెనీలకు అనుకూల ముసాయిదాలతో 20 యేండ్ల కాలం దాటింది. కొన్ని రాష్ట్రాలు తమ పరిధిలో చట్టం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది. వ్యవసాయానికి విత్తన ఆవశ్యకత ఉన్నందున విత్తనాలను నిత్యావసర చట్టంలో చేర్చిన ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీలకు ఆదాయ పన్ను చట్టం నుంచి మినహాయింపు ఇచ్చింది. విత్తన ధరల మీద నియంత్రణ లేదు. ఉత్తుత్తగా ప్రతి సంవత్సరం పత్తి విత్తనాల ధర నిర్ణయిస్తారు. కొరత ఉందని రైతులను భయపెట్టి బ్లాకు మార్కెట్లో ధరను పదింతలు పెంచుతారు. రైతు మీద భారం మోపుతారు. ఎవరైనా రైతు సొంతంగా విత్తనాలు చేసి అమ్మితే వారి మీద 420 కేసులు పెట్టే శాసన వ్యవస్థ, నాణ్యత లేని విత్తనాల వల్ల వేల ఎకరాల పంట నష్టపోయినా ఆయా కంపెనీలకు తాఖీదులు కూడా ఇచ్చే ధైర్యం చేయలేదు.జన్యుమార్పిడి విత్తనాల వల్ల శ్రేష్ఠమైన సంప్రదాయ విత్తనాలు కనుమరుగు అవుతుంటే, కలుషితం అవుతుంటే పట్టించుకుని సంరక్షించే విత్తన సంస్థ లేకపోవడం దురదృష్టకరం. ప్రత్తి విత్తనాలలో శ్రేష్ఠమైన, దేశీ విత్తనాలు ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. అనేక పంటలలోనూ ఇదే పరిస్థితి. పసుపు, చెరుకు, గోధుమలు, జొన్నలు, కూరగాయలు, మక్కలలో దేశీ రకాలు కనుమరుగు అవుతున్నాయి. ప్రైవేటు కంపెనీలు అమ్ముతున్న కంకర లాంటి మక్క గింజల పంటను ఫ్యాక్టరీకి పంపించి, ప్రాసెస్ చేసి, పశువుల, కోళ్ళ దాణాగా మాత్రమే ఉపయోగించేందుకు వృద్ధి చేశారు. ఇప్పటి మక్క కంకులు నేరుగా ఇళ్లల్లో కాల్చుకుని, ఉడకపెట్టుకుని, ఒలుచుకుని తినే విధంగా లేవు. అటువంటి మక్క గింజలనే పక్కాగా వాడమనీ, తమ కంపెనీల దగ్గర కొనుక్కోమనీ వివిధ దేశాల మీద ఒత్తిడి తేవడం అమెరికా పని. ఇటీవల అటువంటి జన్యుమార్పిడి మక్కలు మాకు వద్దని మెక్సికో ప్రభుత్వం అమెరికా నుంచి మక్కల దిగుమతిని ఆపేసింది. ముక్కలకు మక్కాగా ప్రసిద్ధి చెందిన మెక్సికో తమ గింజలను, తమ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి అమెరికాను ధిక్కరించింది. వరి గింజలకు, వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మన దేశం మాత్రం విత్తన వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఒక్కడుగు కూడా వేయడం లేదు. రైతులే కేంద్రంగా విత్తన వ్యవస్థను పునరుద్ధరించే పనిని అనేక స్వచ్చంద సంస్థలు దేశ వ్యాప్తంగా చేస్తున్నాయి. సహకార విత్తన బ్యాంకులను (కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్) ఏర్పాటు చేసి రైతులు, ప్రత్యేకంగా మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. గత పదేళ్ళలో వరిలో, గోధుమలలో, చిరు ధాన్యాలలో, వివిధ కూరగాయలు, పండ్లలో తిరిగి దేశీ విత్తనాలను ఉపయోగించే వాతావరణం కల్పించటంలో అనేక సంస్థలు, వ్యక్తుల కృషి ఉన్నది. మన దేశంలో ఈ రెండు వ్యవస్థల (రైతు కేంద్రీకృత విత్తన వ్యవస్థ, లాభాపేక్షతో కొన్ని జన్యుమార్పిడి విత్తనాలను గుప్పిట్లో పెట్టుకున్న ప్రైవేటు వ్యవస్థ) మధ్య కనపడని సంఘర్షణ ఏర్పడింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రైవేటు విత్తన వ్యవస్థ వైపు మొగ్గు చూపుతూ, సబ్సిడీలు అందిస్తూ గుత్తాధిపత్యానికి ఊతం అందిస్తున్నాయి. రైతులకు విత్తనాల మీద స్వావలంబన కొనసాగించే వ్యవస్థ అవసరం. వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్నా, రసాయన రహిత పౌష్టిక ఆహారం అందాలన్నా, అందరికి కూడు, బట్ట అందాలన్నా విత్తన వ్యవస్థ లాభాపేక్ష లేని వ్యవస్థగా రూపుదిద్దాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర, గుత్తాధిపత్య రహిత విత్తన వ్యవస్థకు ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలి. గాలి, నేల, నీరు వంటివి సహజ పర్యావరణ వనరులు. విత్తనాలు కూడా సహజ వనరు. ఏ ఒక్కరి సొంతమో కారాదు. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
ఇక... జమ్మూ వంతు!
జమ్మూలో వరుస తీవ్రవాద దాడులు కలవరం సృష్టించగా, ఎట్టకేలకు సర్కార్ రంగంలోకి దిగింది. కేంద్ర హోమ్ మంత్రి సారథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అందులో తొలి అడుగు. పాక్ నుంచి తీవ్రవాదుల చొరబాటు యత్నాలను నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాల సంఖ్యను పెంచడం సరైన దిశలో సరైన చర్యగా చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాజౌరీ, పూంచ్ , రియాసీ, కఠువా, ఉధమ్‌పూర్, దోడా జిల్లాలు ఆరింటిలో ఆరు ప్రధాన తీవ్రవాద దాడులు జరిగాయి. సైనిక వర్గాల కథనం ప్రకారం విదేశీ తీవ్రవాదులు నలుగురైదుగురు చొప్పున బృందాలుగా ఏర్పడుతున్నారట. అలాంటి బృందాలు కనీసం అయిదు పీర్ పంజల్, చీనాబ్ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. జమ్మూలోని ఈ కొత్త తరహా తీవ్రవాద ధోరణి కశ్మీర్‌కూ వ్యాపించే ప్రమాదం పొంచివుంది. అందుకే, జమ్మూ కశ్మీర్‌పై స్వయంగా ప్రధాని గత వారం సమీక్షా సమావేశం నిర్వహిస్తే, తర్వాత మూడు రోజులకే హోమ్ మంత్రి సైతం సమీక్ష చేశారు. పరిస్థితి తీవ్రతకు ఇది దర్పణం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలోనే తాజా దాడులు యాదృచ్ఛికం అనుకోలేం. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు సజావుగా లేవనీ, 370వ అధికరణం రద్దు తర్వాత శాంతి నెలకొనలేదనీ వీలైనప్పుడల్లా ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు పని చేస్తూనే ఉన్నారు. తాజా తీవ్రవాద దాడులు అందులో భాగమే. ఇటీవల కొన్నేళ్ళుగా కశ్మీరీ తీవ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. 2022లో నిర్దేశిత వ్యక్తులే లక్ష్యంగా హత్యలు చేసే పద్ధతిని అనుసరిస్తే, గత ఏడాది నుంచి సాంప్రదాయిక విన్యాసాలు సాగిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పైచిలుకుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అలజడులు సృష్టించసాగారు. గతంలో కశ్మీర్ ప్రాంతంపై పంజా విసిరిన ముష్కర మూకలు ఇప్పుడు ప్రశాంతమైన జమ్ము ప్రాంతంపై గురి పెట్టాయి. దాంతో, భద్రతా దళాలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. గతాన్ని సింహావలోకనం చేసుకుంటే, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత దృష్టి అంతా కశ్మీర్‌పై నిలిచింది. అప్పటికి పదిహేనేళ్ళుగా జమ్మూలోని అధిక భాగంలో నిస్సైనికీకరణ సాగింది. ప్రశాంతత నెలకొంది. ఫలితంగా, విదేశీ తీవ్రవాదులు ఈసారి జమ్మూని తమకు వాటంగా చేసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా అడవులు ఈ విదేశీ చొరబాటుదారులకు కలిసొచ్చాయి. రాజౌరీ, పూంచ్∙జిల్లాల్లోని దట్టమైన అడవులు, సంక్లిష్టమైన కొండలు తీవ్రవాదుల కొత్త కేంద్రాలయ్యాయి. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, గుహల్లో దాక్కొని వారు తమ ఉనికి, బలం పెంచుకున్నారు. తాజాగా నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల దాడులు జరగడం, అందులోనూ రియాసీ జిల్లాలో జూన్ 9న యాత్రికుల బస్సుపై అమానుష దాడితో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ప్రభుత్వం హడావిడిగా క్షేత్రస్థాయి పరిస్థితులపై మళ్ళీ దృష్టి పెట్టింది. 2021 జనవరి నుంచే వాస్తవాధీన రేఖ వెంట జమ్మూలోకి చొరబడడానికి విదేశీ తీవ్రవాద బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పట్లో జమ్మూలోని అఖ్నూర్లో మన సైన్యం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ముగ్గురిని హతమార్చింది. అదే ఏడాది జూన్‌లో భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి ఘటనల నుంచి జమ్మూ ప్రాంత సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద కార్యకలపాలు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే 29 తీవ్రవాద హింసాత్మక ఘటనలు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారట. వారిలో తీవ్రవాద బాట పట్టిన స్థానికుల కన్నా విదేశీ తీవ్రవాదులే ఎక్కువ. ఇది తీవ్రమైన అంశం. ఒకప్పటి భారీ వ్యవస్థీకృత హింసాకాండ నుంచి ఇప్పుడు పొరుగునున్న శత్రువుల అండతో పరోక్ష యుద్ధంగా మారిన ఈ బెడదపై సత్వరమే కార్యాచరణ జరగాలి.నిజం చెప్పాలంటే, జమ్మూ కశ్మీర్, మణిపుర్లు రెండూ ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉన్నాయి. మోదీ 3.0 సర్కార్ ముందున్న ప్రధానమైన సవాళ్ళు ఇవి. ప్రభుత్వ పెద్దలు వీటిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. అందులోనూ ఈ జూన్ 29 నుంచి అమరనాథ్ యాత్ర మొదలు కానున్న వేళ జమ్మూలో భద్రత కీలకం. గతంలో సాంప్రదాయికంగా తీవ్రవాదులకు పెట్టనికోట అయిన కశ్మీర్ లోయలో ఆ పరిస్థితిని మార్చడంలో భద్రతాదళాలు విజయం సాధించాయి. నిరుడు ఏకంగా 2.11 కోట్ల మంది సందర్శకులతో కశ్మీర్లో పర్యాటకం తిరిగి పుంజుకొంది. మొన్న లోక్‌సభ ఎన్నికల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 35 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో 58.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తీవ్రవాదం పీచమణిచి సాధించిన అలాంటి విజయాలు జమ్మూలోనూ పునరావృతం కావాలని హోమ్ మంత్రి ఆదేశిస్తున్నది అందుకే. తీవ్రవాదులు ప్రధానంగా అంతర్జాల ఆధారిత వ్యవస్థల ఆధారంగా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. విదేశీ సిమ్ కార్డులతో, పాకిస్తానీ సర్వీస్ ప్రొవైడర్లతో సాగుతున్న ఈ వ్యవహారానికి సాంకేతికంగా అడ్డుకట్ట వేయాలి. ప్రజలు, పోలీసులు, స్థానిక రక్షణ దళ సభ్యులతో సహా అందరినీ కలుపుకొనిపోతూ దేశంలో చేరిన ఈ కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలని చూస్తున్న ఈ దుష్టశక్తుల పాచిక పారనివ్వరాదు. ప్రభుత్వం వెనక్కి తగ్గక సెప్టెంబర్‌లో జరగాల్సిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిరాటంకంగా జరిపించాలి. పాక్ పాలకులు పైకి మెత్తగా మాట్లాడుతున్నా, అక్కడి సైన్యాధ్యక్షుడు, సైనిక గూఢచారి వ్యవస్థ ఐఎస్ఐ చేసే కుటిల యత్నాలకు సర్వదా కాచుకొనే ఉండాలి. అప్రమత్తత, సత్వర సన్నద్ధతే దేశానికి శ్రీరామరక్ష. -
విభజన... అసమాన అంతరాలు పెంచడానికా?
రాష్ట్ర విభజన జరిగి జూన్ 2 నాటికి పదేళ్లు గడిచాయి. పాలకుల వైఫల్యం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల మధ్య ఏర్పడిన అసమాన అభివృద్ధి విధానాలు విభజన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. దశాబ్దా్దలుగా జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, అమరవీరుల త్యాగాల నెత్తుటి మరకలను పాలకులు తమ తిరోగమన విధానాలతో తుడిపేస్తున్నారు. ఈ పదేళ్ల కేంద్ర ప్రభుత్వ పోకడ భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి గండి కొట్టేలా వెళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చకుండా తన పబ్బం గడుపుకోవడం మీదనే కేంద్రం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చివరికి ఎగ్గొట్టారు. తెలంగాణకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తామని మొండిచేయి చూపించారు.ఇక, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పాక్షికంగానే అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ప్రేక్షక పాత్ర వహించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు, నిర్వహించాల్సిన బాధ్యతలను నిర్వహించలేదు. పదేళ్ల పాటు చేతులు దులుపుకునే ప్రయత్నమే జరిగింది. కృష్ణా, గోదావరీ నదీజలాల వ్యవహారంలో ఎటూ తేల్చకపోగా, కేంద్రమే స్వయంగా గొడవలు పెడుతోంది. విద్యుత్ బకాయిల చెల్లింపులు, ఉద్యోగుల విభజన లాంటి ముఖ్యమైన అంశాలను కూడా తేల్చలేదు. ద్రవ్యలోటు పూడ్చే విధంగా ఆర్థికంగా ఆదుకోవాల్సిన కేంద్రం అసలు తాను ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించకపోగా, సాగునీటి రంగానికి ఉపయోగపడే విధంగా ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఉపయోగించుకోవడమే తప్ప ఎనిమిది కోట్ల తెలుగు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. మలివిడత ఉద్యమంలో పాల్గొన్న వారెవరూ నాటి టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) పార్టీ అధికారంలో వుండగా ప్రాతినిధ్యంలోకి రాలేదు. చివరికి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ కుటుంబ కృషిగానే మలిచే ప్రయత్నం చేశారు. దీని ఫలితమే టీఆర్ఎస్ గడిచిన 10 ఏళ్ల పాలన ఏకఛత్రాధిపత్యంగా సాగడానికి కారణమైంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, దోపిడి, పీడనకు వ్యతిరేకంగా జరిగింది. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్నీ, స్వేచ్ఛనూ, ప్రశ్నించే గొంతులనూ అణచివేస్తూ కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారు. పార్లమెంటులో విభజన చట్టంపై చర్చ జరుతున్న సందర్భంలో ప్రతిపక్షం (బీజేపీ) నుండి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విభజన హామీగా రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. పోలవరం, ప్రాణహిత, చేవెళ్ళ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి పూర్తి చేయాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా ప్రధాన బాధ్యతలు చేపట్టి తను డిమాండ్ చేసిన ప్రత్యేక హోదాలు ఈ 10 ఏండ్లలో పట్టించుకోకుండా గాలికొదిలేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ నీటి యుద్ధం కొనసాగుతూనే వుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి నీటిని క్రమబద్ధీ్దకరించటం, రివర్ బోర్డు ఏర్పాటు, ద్రవ్యలోటు పూడ్చడం, ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు పంపడం, ఆంధ్రలో కలిపిన ఏడు తెలంగాణ గ్రామాల ఉమ్మడి సమస్యలు వంటివి పరిష్కారం కాలేదు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఎన్టీపీసీలో మిగిలివున్న 3 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి ముఖ్యమైన హామీలు అమలు జరుగలేదు. 9, 10 షెడ్యూల్లో వున్న 91 ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లలో 71 సంస్థలను విభజించినట్లు ప్రకటించి, నేటికీ ఉమ్మడిగానే కొసాగిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు పాలకుల విధానాల వల్ల ప్రాంతాలు, ప్రజల మధ్య ఏర్పడిన ఆర్థిక, సామాజిక అంతరాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ప్రజలకు దీర్ఘకాలిక అభివృద్ధికి ఉపకరించే భూమి, ఉపాధి, నీటి వనరులు, ఉద్యోగాలు, వేతనాలు వంటి అంశాలను పట్టించుకోలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా ప్రజల జీవితాల్లో అభివృద్ధి భూమిక ఏర్పడలేదు. భూములు పంచుతామన్న పాలకులు ఉన్న భూములను బినామీ పేర్లతో ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారారు. వ్యవసాయానికి ప్రోత్సాహం లేక చిన్న, మధ్యతరగతి రైతులు వ్యవసాయాన్ని వదులుకొని కార్పొరేట్ సంస్థల వద్ద అతితక్కువ వేతనాలకు వాచ్మెన్లుగా, గార్డెన్లలో పనిచేసే కూలీలుగా మారినారు.తెలంగాణ ఏర్పడితే ఈ పరిస్థితులు వస్తాయని ప్రజలు భావించలేదు. ఉద్యోగాలు వస్తాయనీ, ఉపాధి సౌకర్యాలు మెరుగుపడుతాయనీ, అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి అయితే స్థానికంగా ఉపాధి పొందుతామనీ భావించారు. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య తీవ్రమైన అంతరాలు పెరుగుతూనే వున్నాయి. ఇది సామాజిక దోపిడి, వివక్షకు దారితీసింది. దీని ఫలితమే బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెదించి, ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టంగట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన కొనసాగించవలసిన అవసరం వున్నది. రాష్ట్రంలో, దేశంలో అస్తిత్వ రాజకీయాల ప్రభావం పెరుగుతున్నది. ప్రజల ప్రధాన సమస్యలైన భూమి, కూలి, ఉద్యోగ సమస్యలను తీర్చాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సమర్థవంతంగా అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఏ ప్రయోజనాల కొరకైతే రాష్ట్రం ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు తగ్గించే విధంగా ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు తీసుకొని పరిపాలన సాగించాలి. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత అధికార పార్టీపై వుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆశించినట్టు ఇప్పటి నుంచైనా అధికారంలోకి వచ్చే, వచ్చిన పార్టీల ప్రభుత్వాలు, కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధి కనబరచాలి.జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు(నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) -
విభజన హామీలు ఎప్పుడు నెరవేరేను?
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ 2014లో రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా, హడావిడిగా, తెలంగాణ రాష్ట్రానికి అనుకూల ఫలితాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతికూల ఫలితాలను ఇచ్చే విధంగా ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రధాన లక్ష్యం రెండు రాష్ట్రాలు విడివిడిగా సర్వతోముఖాభివృద్ధి సాధించడం. మరి అది జరుగుతోందా?పునర్విభజన అనంతరం ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికపరమైన, సంస్థాగతమైన మద్దతు ఇవ్వవలసి ఉండగా, కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సరైన శ్రద్ధచూపకపోవడం వల్ల అనేక వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి.చట్టంలోని సెక్షన్ 93 లోని షెడ్యూల్ 13 ప్రకారం... 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. వాటిలో 4 ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేదు. 1. దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు 2. సమగ్రమైన ఉక్కు కర్మాగారం ఏర్పాటు, 3. గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్, పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటు, 4. విశాఖపట్టణంలోనూ, విజయవాడ–గుంటూరు–తెనాలి నగరాలలోనూ మెట్రోరైలు ఏర్పాటు చేయడం. ఇంకా మిగిలిన 4 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి.విశాఖపట్టణం–చెన్నె పారిశ్రామిక కారిడార్, ప్రస్తుతం ఉన్న విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త రైల్వేజోన్ ఏర్పాటు, కొత్తగా ఏర్పాటు చేయబడే రాజధానికి మంచి రోడ్డు, రైలు రవాణా సదుపాయాలను కల్పించడం వంటివి నెరవేర్చవలసి ఉంది. విశాఖపట్టణంలో క్రొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని వారి ప్రకటనలను బట్టి అర్థమవుతోంది.ఇది వరలో పునర్విభజన చట్టాలలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పన్నుల విషయంలో కొన్ని అసాధారణతలు చోటు చేసుకొన్నాయి. వాటిని సరిదిద్దడానికి చట్టంలో అవసరమైన సవరణలు చేయమని లేదా వాటివల్ల కలుగుతున్న నష్టం రూ. 3,820 కోట్లను మంజూరుచేయమని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయం ఇంకా కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. ఏపీలో పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన రాయితీలతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 94(1) సెక్షన్ క్రింద కేంద్రప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకం పూర్తవకపోవడం మరో ఇబ్బంది. పై విషయాలన్నింటినీ సూక్ష్మంగా పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వానికి పునర్విభజన చట్టం అమలుకు సంబంధించి, తన బాధ్యతలను నెరవేర్చే విషయంలో పూర్తి చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమౌతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానిలోని అనేక కార్పొరేషన్లు వాటి హక్కుల సాధన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వంపై కోర్టులో అనేక వ్యాజ్యాలు (కేసులు) వేశాయి. ఆ కేసులన్నింటిలోనూ, ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఒక్క తీర్పును కూడా అమలు పరచలేదు. తెలంగాణ రాష్ట్రం, శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తాగునీరు, సాగునీటి అవసరాలకు నిర్లక్ష్యం చేస్తూ జలవిద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తోంది. ఈ పరిస్థితులలో గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని 3, 4 ఆర్టికల్స్ ప్రకారం సమగ్రమైన సూచనలను ఇవ్వాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి సమస్యలను భవిష్యత్తులో కూడా ఎదుర్కొనే పరిస్థితిని నివారించాలని ఆశిద్దాం.కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ రిసోర్స్ పర్సన్ -
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతున్నారు. కోట్లాది కార్మికులకు పనిలేదు. ఉద్యోగాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. బీజేపీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. మతం మనిషికి తిండి పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాంటి పార్టీతో చంద్రబాబు అంటకాగు తున్నారు. దేశంలో తమ పేరు మీద సాగుభూమి లేనివారు ఎందరో! ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణా ళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే!18వ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు విడతలుగా జరుగుతున్నాయి. తిరిగి మళ్లీ మూడోసారి అధికారంలోనికి రావడానికి మోదీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఉత్తరప్రదేశ్ మీద అయితే వాళ్లు ఎక్కువ ఆధారపడి ఉన్నారో అక్కడ సామాజిక రాజకీయ చైతన్యం పెల్లుబికింది. ముఖ్యంగా ముస్లింలలో ఎంతో మార్పు రావడం వల్లే రాయబరేలీలో రాహుల్ గాంధీ నిలబడటానికి పూనుకున్నారు. మతోన్మాద దాడులు, మహిళా సాధికారతను పునాదులతో తొలిచే భావజాలం, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీ విధానాలు లౌకికవాదులను, ఓబీసీలను, దళితులను, స్త్రీలను ఆలో చింపజేస్తున్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు ద్వారా జమ్మూ కశ్మీర్ శాసనసభను రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టిన ఉదంతాన్ని ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గించి, జీఎస్టీ ద్వారా కేంద్రీకృత ఆర్థిక పెత్తనాన్ని పెంచి, రాష్ట్రాల ఉనికిని నామమాత్రం చేయా లని చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కలిగిన భాష, సంస్కృతి, విద్య, విద్యుత్, మానవ వనరులపై కూడా కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చేయాలనే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్యవంతంగా ఆలోచిస్తు న్నాయి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన పత్రికల మీద చేస్తున్న దాడి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా జరగలేదని జర్నలిస్టు మేధావులు వాపోతున్నారు.ఏప్రిల్ చివరి వారంలో వచ్చిన ‘గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్’ ప్రకారం, భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతు న్నారు. అత్యధిక స్త్రీలు రక్తలేమితో ఇబ్బంది పడుతున్నారు. కోట్లాది మంది కార్మికులకు పనిలేదు. భారతదేశం మొత్తం వలసలతో అన్నా ర్తులై పొట్ట చేత పట్టుకుని నగర శివారుల్లోని మురికివాడలలో జీవిస్తు న్నారు. నిజానికి పంజాబ్ రైతులు చేసిన రైతు ఉద్యమ ప్రభావం భారతదేశం మొత్తం మీద ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా హోరా హోరీ రైతు ఉద్యమాన్ని నడిపింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టా లను రద్దు చేయాలనే డిమాండ్‌పై రాజీలేని పోరాటం చేసింది.ముఖ్యంగా అడవుల నరికివేత వల్ల, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల దేశంలో తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుటెండల్లో ప్రజలు ఆహారం కోసం పని చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. మతం మనిషికి అన్నం పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా గ్రామాలలో మంచి నీళ్ళు దొరకడం లేదు. మద్యాన్ని అందించటంలో సఫలమైన ప్రభు త్వాలు, మంచినీళ్లు అందించడంలో విఫలమయ్యాయి.ఇకపోతే దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేస్తోంది. ఉద్యో గాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. కాగా ఎన్నికల నేపథ్యంలో నిరు ద్యోగం ప్రధాన అంశంగా చర్చకొస్తోంది. ప్రతిపక్ష నేతలు నిరుద్యోగ సమస్యపై నిలదీస్తుండగా అధికార బీజేపీ నేతలు సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలు, బీజేపీ మేనిఫెస్టో యువతకు భరోసా కల్పించలేదు. పైగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇకపోతే ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణాళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో కోట్లాది మందికి సాగుభూమి సెంటు కూడా లేదు. ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ఇంటి స్థలం లేదు. మంచినీళ్ల వసతి లేదు. చనిపోతే పాతిపెట్టడానికి శ్మశానం లేదు. దేశంలోని సుమారు 7 లక్షల గ్రామాల్లో అంటరానితనం కొనసాగు తూనే వుంది. భారతదేశంలో దళితులు ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం లేక పేదరికంలో, అస్పృశ్యతలో, అవిద్యలో మగ్గిపోతున్నారు. బీటెక్‌లు, ఎంటెక్‌లు, బీఏలు, ఎంఏలు చదివినా నిరుద్యోగు లుగా, ఉపాధి హామీ కూలీలుగా జీవిస్తున్నారు. ఈ రోజున దళిత వాడల్లో విద్యార్థులు, స్త్రీలు నిరాశా నిస్పృహలలో జీవిస్తున్నారు. వారి కుటుంబానికి తలా రెండెకరాల భూమి ఇవ్వటం ద్వారా ఆర్థిక సాధికారతను కల్గిస్తాం అని ఏ ప్రభుత్వమూ చెప్పటం లేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు అంబేడ్కర్ ఆలోచనకు భిన్నంగా ఉన్నాయి.భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే. ఇప్పుడు ఎన్నికల్లో ప్రకటించిన ఏ మేనిఫెస్టోలో కూడా భూమి పంపకం గురించి రాయక పోవటం, అస్పృశ్యతా నివా రణ ఒక ఎన్నికల ఎజెండాగా లేకపోవటం, కుల నిర్మూలన కార్యక్రమం ఎవరి లక్ష్యంగా లేకపోవటాన్ని దళిత మేధావులు, ఆలోచనాపరులు అర్థం చేసుకుంటున్నారు. రాజ్యాధికారమే వీటన్ని టికీ పరిష్కారం అని ఆలోచిస్తున్నారు. నిజానికి ప్రసిద్ధమైన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీల్లో, వైద్య విశ్వవిద్యాలయాల్లో, అన్ని కళా శాలల్లో దళిత విద్యార్థులు ఎంతో వివక్షకు గురి అవుతున్నారు.మోదీ ఇంత తిరోగమన చర్యలతో ముందుకు వెళ్తుంటే, నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమిలో చేరటం ఆయనకున్న దళిత వ్యతిరేకతనూ, హిందూ మతోన్మాద భావజాలాన్నీ, కులాధి పత్య వైఖరినీ, మైనారిటీల పట్ల ద్వేషాన్నీ తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకూ, మోదీకీ మధ్య భావజాలంలో, దళితులు, స్త్రీల పట్ల వ్యతిరేకతలో ఏ విధమైన తేడాలేదు అని అర్థం అవుతోంది. ముఖ్యంగా మోదీ యూనివర్సిటీల్లో జీవపరిణామ, మానవ పరిణామ చారిత్రక సిద్ధాంతాల బోధనకు భిన్నంగా మతవాద భావజాలాన్ని ప్రోత్సహించటం లౌకిక భావజాల వ్యాప్తికి గొడ్డలి పెట్టు అవుతుంది.ఇకపోతే అంబేడ్కర్ భావజాల ప్రచారంలో తమిళనాడు ముందుంది. తమిళనాడులోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభంలో అంబేడ్కర్ జీవిత పోరాటం గురించి ఐదు నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అక్కడి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదేశించారు. అంబేడ్కర్ ఆ రాజ్యాంగం ద్వారానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులు ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారని గ్రహించాలి.అంబేడ్కర్ రాజ్యాంగం భారతదేశ పునర్ నిర్మాణానికి ఆయువు పోసింది. ఏ దేశంలో స్త్రీ వ్యక్తిత్వంతో జీవిస్తుందో, ఏ దేశంలోకుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుందో, ఏ దేశంలో స్త్రీ ఉత్పత్తి శక్తి దేశ సౌభాగ్యానికి ఊపిరి పోస్తుందో ఆ దేశం ఆర్థిక సంపదవున్న ప్రపంచ పంక్తిలో నిలబడగలుగుతుంది. నిజానికి అంబేడ్కర్ అడుగు అడుగులో స్త్రీ సమానత్వం కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం, వారి విద్యాభ్యాసం కోసం, వారి సాధికారిత కోసం, వారి భావ చైతన్యం కోసం, వారి రాజకీయ హక్కుల కోసం పోరాడారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా రాజీనామా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హిందూ కోడ్ బిల్లును సాధించారు. ఈనాడు ప్రభుత్వాలు స్త్రీ సాధికారితను నిలబెట్టాలి అంటే నిరుద్యోగులయిన స్త్రీలకు ఉద్యోగ వసతి కల్పించాలి. విధవరాండ్రకు నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వ గలిగిన స్థాయికి రావాలి. ప్రతి దళిత స్త్రీకి రెండు ఎకరాల భూమి ఇచ్చి భారతదేశంలో వ్యవసాయ విస్తృతికి కృషి చేయాలి. ఇంటింటికీ మంచినీటి వసతి, విద్యుత్ వసతి కల్పించి, ఆరోగ్య సంరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించి స్త్రీ శారీరక మానసిక శక్తిని పెంచి దేశ సౌభాగ్యానికి బాటలు వేయాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ఇరాన్-ఇజ్రాయెల్ హై టెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లవద్దని భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్ 12) ఒక అడ్వైజరీ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణాన్నైనా దాడి చేయొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారత్ తన పౌరులను అలర్ట్ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్‌లో ఇప్పటికే ఉన్న భారతీయలు అక్కడున్న భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని కోరింది. రెండు దేశాల్లో ఉన్న భారత పౌరులు తమ భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతేనే బయట తిరగాలని సూచించింది. డజన్ల కొద్దీ క్రూయిజ్ మిసైళ్లు, వందల కొద్దీ డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయెల్‌పై విరుచుకుపడే అవకాశాలున్నాయని మీడియా కథనాలు వెలువడుతుండటం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది. ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆ దేశ ఆర్మీ టాప్ కమాండర్‌తో పాటు మొత్తం ఏడుగురు అధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేయక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని ఇప్పటికే ఇజ్రాయెల్‌లోని అమెరికన్ ఎంబసీ తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను కోరింది. ఇదీ చదవండి.. ఇజ్రాయెల్‌కు టెన్షన్.. ఇరాన్ సంచలన ప్రకటన -
కేజ్రీవాల్ అరెస్టు.. జర్మనీ ప్రకటనపై భారత్ నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందించిన తీరు పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది. ఈ మేరకు ఢిల్లీలోని జర్మనీ రాయబారిని పిలిచి ఆ దేశం చేసిన ప్రకటనపై విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ‘భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. న్యాయవ్యవస్థ స్వయంతప్రతిపత్తి, కనీస ప్రజాస్వామ్య సూత్రాలు ఇండియాకూ వర్తిస్తాయి. అందరిలానే నిష్పక్షపాత, న్యాయబద్ద విచారణకు కేజ్రీవాల్ అర్హుడు. అరెస్టు చేయకుండా కూడా అతడిని విచారించవచ్చు. దోషిగా తేలనంత వరకు నేరం చేయనట్లే భావించాలనే సూత్రం కేజ్రీవాల్‌కు కూడా వర్తిస్తుంది’అని జర్మనీ కేజ్రీవాల్ అరెస్టుపై వివాదాస్పద ప్రకటన చేసింది. ఇదే కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మార్చ్ 21న అరెస్టు చేసింది. కోర్టు కేజ్రీవాల్‌ను ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. దీనిపై ఆప్ నేతలు దేశంతో పాటు విదేశాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేశారు. 26న ప్రధాని మోదీ ఇంటిని కూడా ముట్టడిస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. ఇదీ చదవండి.. బీజేపీ ఖాతాల్లోకే లిక్కర్ సొమ్ము -
మరికొంతకాలం ‘ఈవీ’లకు ఊరట
సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ)ను కొనాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరుతో ఫేమ్–2 పథకం ముగుస్తున్న తరుణంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయించింది. మార్చి 31తో ఫేమ్–2 పూర్తవగానే ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం అమలులోకి వస్తుందని కేంద్ర పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం ఈ ఏడాది జూలై చివరి వరకూ అమలులో ఉండనుంది. దీని ప్రకారం కొత్తగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి టూ వీలర్లకు కిలోవాట్‌కు రూ. 10 వేలు చొప్పున గరిష్టంగా రూ. 25 వేలు, త్రీ వీలర్లకు రూ. 50 వేల వరకూ ప్రయోజనం చేకూరనుంది. విద్యుత్ వాహనాల కోసం కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్ఏఎంఈ) పథకాన్ని 2019లో తీసుకువచ్చింది. నిజానికి ఈవీలపై ప్రోత్సాహకాలను కేంద్రం తగ్గిస్తూ వస్తోంది. గతేడాది మే వరకూ 15 శాతం నుంచి 40 శాతం వరకూ సబ్సిడీ ఇచ్చేది. జూన్ తర్వాత వాహన ధరలో కేవలం 15 శాతం గానీ లేదా కిలోవాట్ హవర్ (కెడబ్ల్యూహెచ్)కు రూ. 10 వేలుగానీ ఏది తక్కువైతే అది మాత్రమే సబ్సిడీ ఇవ్వడం ప్రారంభించారు. రానున్న మూడేళ్లలో 1 మిలియన్ ఈవీ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోనున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని కూడా కేంద్రం తేల్చేసింది. ఆదర్శంగా ఏపీ ‘ఈవీ’ ప్రోత్సాహం మన రాష్ట్రం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధివిధానాలను రూపొందించింది. అవి దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాలకు ఏపీ అందిస్తున్న తోడ్పాటు భేష్ అని ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రౌండప్ 2023 నివేదిక కొనియాడింది. 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్ వెహికిల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకు తోడ్పాటునందిస్తున్న నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందని నివేదిక తెలిపింది. 2030 నాటికి మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాల్లో సగం విద్యుత్ వాహనాలే ఉండాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఏపీ చొరవను ఆదర్శంగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు సూచించాయి. ఈవీ ప్రమోషన్‌కు వివిధ విధానాల ద్వారా సహకరిస్తూ, ప్రోత్సాహకాలను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. కాగా ఏపీలో ప్రస్తుతం దాదాపు 65 వేల విద్యుత్ వాహనాలున్నాయి. భవిష్యత్తులో విద్యుత్ వాహనాల వినియోగం రాష్ట్రంలో భారీగా పెరగనుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అభిప్రాయపడింది. 2034 నాటికి దాదాపు 10.56 లక్షల వాహనాలు రాష్ట్ర రోడ్లపై తిరిగే అవకాశం ఉందని, వీటన్నిటి కోసం 677 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక (ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్)లో వెల్లడించింది. దీనికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో సుమారు 400 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలను కల్పిస్తోంది. లక్ష మంది ఉద్యోగులకు ఈవీలను వాయిదా పద్ధతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. -
అసంపూర్ణ చట్టం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), 2019కి జవసత్వాలు అందించే 39 పేజీల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర పాలనా యంత్రాంగం ఓటర్లను విభజించాలని చూస్తోందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న తరుణంలో లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందుగా చోటు చేసుకున్న ఈ పరిణామం వివాదాన్ని రేకెత్తించింది. కాగా, మరో ఎన్నికల హామీని తాను నెరవేర్చినట్లు బీజేపీ చెప్పుకొంది. పౌరసత్వాన్ని హరించడానికే సీఏఏని ఉపయోగిస్తారనే భయాలు కేవలం నిరాధారమైనవని తిప్పికొట్టింది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసాత్మక చర్యల కారణంగా పారిపోయి భారతదేశంలో అక్రమంగా లేదా అనధికారికంగా స్థిరపడిన ఆరు మతా లకు చెందిన మైనారిటీలకు పౌరసత్వం అందించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఈ ఆరు మత బృందాలు ఆ దేశాలకు చెందిన హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, జైనులు. ఆ దేశాలకు చెందిన ముస్లింలను సీఏఏ నుంచి మినహాయించారు. ఈ దేశాలకు చెందిన ముస్లింలను పై చట్టం నుంచి మినహాయించడానికి హేతువు ఏమిటంటే... ఆ మూడు దేశాలూ ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఇస్లామిక్ దేశాలు. కాబట్టి వారు తమతమ దేశాలలో తగు న్యాయం పొందగలరని ఇది సూచిస్తుంది. దరఖాస్తులను పర్యవేక్షించడానికి కేంద్ర అధికా రులతో కూడిన కమిటీలను రూపొందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియపై నియంత్రణను కలిగి ఉంది. పాత విధానంలో జిల్లా అధికారులే అభ్యర్థ నలను స్వీకరించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసు కోవడంలో నిరీక్షణ వ్యవధిని, సీఏఏ 11 నుండి ఐదు సంవత్సరాలకు తగ్గిస్తుంది. అయితే దరఖాస్తుదా రులు వారి మాతృభూమి నుండి అధికారిక పత్రాలను సమర్పించాలి. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నప్పటికీ, 2019– 20లో భారతదేశం అంతటా ఈ సవరణ చట్టంపై వీచిన తుపానుతో పోలిస్తే ఇవి పెద్దగా సద్దులేనివి గానే కనిపిస్తాయి. అయితే, రాబోయే కొద్ది వారాల్లో అభ్యంతరాలు పెరిగే అవకాశం ఉంది. ఈ అంశంలో మరొక పెద్ద సమస్య దాగి ఉంది. ముఖ్యంగా రాజ్యాంగబద్ధతను వ్యతిరేకిస్తున్న సీఏఏకి సంబంధించిన అనేక చట్టపరమైన సవాళ్లను సుప్రీంకోర్టు ఇంకా వినలేదు, తీర్పు ఇవ్వలేదు. ఇక్కడ కీలకమైన వాదన ఏమిటంటే, మతాన్ని పౌరసత్వానికి గుర్తుగా ప్రతిష్టించడం ద్వారా, రాజ్యాంగానికి చెందిన ప్రాథమిక స్వరూపాన్నే పౌరసత్వ సవరణ చట్టం ఉల్లంఘిస్తుందన్నదే. అదే సమయంలో భారత రాజ్యాంగం మతపరమైన వివక్షను నిషేధిస్తుంది. చట్టం ముందు ప్రజలందరికీ సమానత్వం, చట్టం ద్వారా సమాన రక్షణకు హామీ ఇస్తుంది. ఈ చట్టంపై తొలి సవాలు 2020లో వచ్చింది. సుప్రీంకోర్టు ఈ అభ్యంతరాలను ఇంకా వినలేదు. అయితే, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, గత ఏడాది డిసెంబర్లో పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 6ఏ చెల్లుబాటుకు సంబంధించిన మరో కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నిర్దిష్ట సవరణ 1985లో కుదిరిన అస్సాం ఒప్పందం నాటిది. ఇది బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలకు సంబంధించిన శాశ్వత సవాలుపై రాష్ట్రంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నించింది. చట్టవిరుద్ధంగా వచ్చిన వారిని భారతీయ పౌరులుగా గుర్తించడానికి ఇది ఒక యంత్రాంగాన్ని అందించింది. అస్సాంలో బంగ్లాదేశ్ వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడానికి 1971 మార్చి 25ని కటాఫ్ తేదీగా నిర్ణయించడమైంది. పౌరసత్వ సవరణ చట్టం భారతదేశం అంతటా ఒకే విధంగా వర్తించదు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ప్రత్యేక రాజ్యాంగ రక్షణ ఉన్న అస్సాం (తక్కువ జనాభాతో), త్రిపురలోని మూడు గిరిజన ప్రాబల్య ప్రాంతాలలో ఈ చట్టం అమలు కాదు. 2019లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)ని తీసుకురావడం ద్వారా అస్సాంలో పరిస్థితి క్లిష్టంగా మారింది. 19 లక్షల దరఖాస్తుదారులు దీనికి వెలుపలే ఉండిపోయారు. వీరిలో ఎక్కువమంది హిందువులు, స్థానిక సంఘాల సభ్యులే ఉన్నారు తప్పితే, ముస్లింలు కాదు. ఇది బీజేపీనీ, దాని మిత్ర పక్షాలనూ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి వారు ఈ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. అస్సాంలో అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలు కూడా సీఏఏని వ్యతిరేకించారు. మతం పౌరసత్వాన్ని నిర్ణయించకూడదని వాదించారు. సహాయాన్ని పొందవలసిన సామాజిక బృందాల జాబితా కూడా అసంపూర్ణంగా కనిపిస్తోంది. ఇందులో శ్రీలంకలోని తమిళ హిందువులు, క్రైస్తవులు వంటి సమూహాలు లేవు. వీరిలో 90,000 మందికి పైగా భారత్‌లో శరణార్థులుగా ఉన్నారు. మయన్మార్ నుండి వచ్చిన చిన్ క్రైస్తవులు కూడా జాబితాలో లేరు. వీరిలో 45,000 మందికి పైగా ఒక్క మిజోరంలోనే ఉన్నారు. ఒక మతానికి చెందినవారైనప్పటికీ, ఆ మతంలోని మైనారిటీ శాఖలపై వేధింపుల ప్రమాదం తగ్గదు. అయినా పాకిస్తాన్ లోని అహ్మదీయులు, అఫ్గానిస్తాన్‌లోని హజారాలు వంటి బలహీనమైన ముస్లిం సమూహాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం సీఏఏకి కనిపించలేదు. సంజయ్ హజారికా వ్యాసకర్త రచయిత, కాలమిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భారత ప్రభుత్వంపై మస్క్ కంపెనీ వ్యతిరేక స్వరం
తమ ప్లాట్‌ఫామ్‌లోని కొన్ని ఖాతాలు, పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తాం కానీ, వారి చర్యలతో ఏకీభవించబోమని ప్రకటించింది. అయితే కంపెనీ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ‘ఎక్స్’కు సంబంధించిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్లో ఈ మేరకు పోస్ట్‌లో వివరాలను కంపెనీ వెల్లడించింది. భారత ప్రభుత్వ చర్యలతో తాము ఏకీభవించడం లేదని, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ పోస్ట్‌లను తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. అయితే భారత ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది. "ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారత్‌లో మాత్రమే ఈ ఖాతాలు, పోస్ట్‌లను నిలిపివేస్తాం. అయినప్పటికీ మేము ఈ చర్యలతో విభేదిస్తున్నాం. ఈ పోస్ట్‌లకు భావప్రకటనా స్వేచ్ఛను కొనసాగిస్తున్నాం" అని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని ‘ఎక్స్’ తెలిపింది. ప్రభావిత యూజర్లకు కూడా ఈ చర్యల నోటీసును అందించినట్లు పేర్కొంది. గత ఏడాది జూన్‌లో నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ‘ఎక్స్’ వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు కంపెనీకి హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు సమర్థించిందని, దేశ చట్టాన్ని కంపెనీ తప్పక పాటించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. -
వెంకయ్యనాయుడు, చిరంజీవి ‘విభూషణులు’.. సీఎం జగన్, సీఎం రేవంత్ హర్షం
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి నెట్వర్క్: తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌కు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రమణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, సినీనటుడు విజయ్‌కాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతుప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్యారేలాల్ శర్మ తదితరులున్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయ్‌కాంత్ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. తెలంగాణ, ఏపీల నుంచి ఆరుగురికి.. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విఠలాచార్య, కెతావత్ సోమ్లాల్, ఎ.వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి.ఉమా మహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి ‘అన్సంగ్ హీరోస్’ పేరిట పురస్కారం దక్కింది. క్రీడారంగం నుంచి టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్ సహా ఏడుగురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను నాలుగేళ్ల విరామం అనంతరం బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు మంగళవారం ప్రకటించడం తెలిసిందే. పద్మ అవార్డుల వివరాలివీ.. పద్మ విభూషణ్ (ఐదుగురికి): వైజయంతిమాల బాలి (కళారంగం–తమిళనాడు), కొణిదెల చిరంజీవి (కళారంగం–ఆంధ్రప్రదేశ్), ఎం.వెంకయ్యనాయుడు (ప్రజావ్యవహారాలు–ఆంధ్రప్రదేశ్), బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ–బిహార్), పద్మా సుబ్రమణ్యం (కళారంగం–తమిళనాడు). పద్మభూషణ్ (17 మందికి): ఫాతిమా బీవీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–కేరళ), హోర్మూస్ జీ ఎన్.కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర), మిథున్ చక్రవర్తి (కళారంగం–పశ్చిమబెంగాల్), సీతారాం జిందాల్ (వర్తకం–పరిశ్రమలు–కర్నాటక), యంగ్ లియు (వర్తకం–పరిశ్రమలు–తైవాన్), అశ్విన్ బాలచంద్ మెహతా (వైద్యం–మహారాష్ట్ర), సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–పశి్చమ బెంగాల్), రాంనాయక్ (ప్రజా వ్యవహారాలు–మహారాష్ట్ర), తేజస్ మధుసూదన్ పటేల్ (వైద్యం–గుజరాత్), ఓలంచెరి రాజగోపాల్ (ప్రజా వ్యవహారాలు–కేరళ), దత్తాత్రేయ్ అంబాదాస్ మయలూ అలియాస్ రాజ్ దత్ (కళారంగం–మహారాష్ట్ర), తోగ్డన్ రింపోచే (ఆధ్యాత్మికత–లద్దాఖ్), ప్యారేలాల్ శర్మ (కళారంగం–మహారాష్ట్ర), చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (వైద్యం–బిహార్), ఉషా ఉతుప్ (కళారంగం–మహారాష్ట్ర), విజయ్‌కాంత్ (మరణానంతరం–కళారంగం–తమిళనాడు), కుందన్ వ్యాస్ (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర) – పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవీ పాశ్వాన్, శివన్ పాశ్వాన్ తదితరులున్నారు. బాధ్యతను పెంచింది ‘‘దేశం అమృత కాలం దిశగా అభివృద్ధి పథంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నా. ఇది నా బాధ్యతను మరింతగా పెంచింది. రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా’’ – ఎం.వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి సంస్కృతిని, కళలను చాటి చెప్పారు: రేవంత్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని.. సంస్కృతిని, కళలను దేశమంతటికీ చాటిచెప్పారని ప్రశంసించారు. తెలుగువారికి పద్మాలు గర్వకారణం: ఏపీ సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైనవారిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవిలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మ’ అవార్డులను దక్కించుకున్న వారిని అభినందించారు, వారు మనకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. తెలుగు వెలుగులకు శనార్తులు: బండి సంజయ్ పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వెలుగులకు తెలంగాణ శనార్తులు చెబుతోందని పేర్కొన్నారు. -
మెగాస్టార్.. ఇకపై పద్మ విభూషణ్ చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్‌కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినీ ప్రియులు, అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరును పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను కూడా సాధించారు. మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనకు దక్కిన అవార్డులపై ఓ లుక్కేద్దాం. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. -
కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న.. ప్రధాని మోదీ, సీఎం జగన్ హర్షం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్‌ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది. నేడు ఆయన వందో జయంతి. ఠాకూర్ శతాబ్ది జయంతి ఉత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం ఈ ప్రకటన వెలువరించడం విశేషం. జననాయకుడిగా అందరికీ చిరపరిచితుడైన ఠాకూర్ బిహార్‌లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికారు. భారతరత్న పొందిన వారిలో ఠాకూర్ 49వ వ్యక్తి. చివరిసారిగా 2019 ఏడాదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేసింది. బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తొలి కాంగ్రెసేతర సోషలిస్ట్ నేతగా చరిత్ర సృష్టించారు. బిహార్‌కు ఆయన రెండుసార్లు సీఎంగా సేవలందించారు. తొలిసారిగా సీఎంగా 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు పనిచేశారు. 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో డెప్యూటీ సీఎంగానూ చేశారు. ‘ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయానికి ప్రతిరూపం ఠాకూర్. అణగారిన వర్గాల తరఫున పోరాడి వారిలో మార్పు రావడానికి ఎంతగానో కృషిచేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని జీవన విధానంగా మార్చుకున్న మహానుభావుడు. ఈ పురస్కారం ఆయన చేసిన కృషికి మాత్రమే కాదు భావితరాలకు స్ఫూర్తిగా, గొప్ప ప్రేరణగా నిలుస్తుంది’ అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యార్థి దశలోనే స్వతంత్రపోరాటంలోకి.. ఠాకూర్ బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో కర్పూరిగ్రామ్‌లో 1924 జనవరి 24వ తేదీన జన్మించారు. ఈ గ్రామం పూర్వం బ్రిటిష్ ఇండియా పాలనలో బిహార్–ఒడిశా ప్రావిన్స్‌లో పితౌజియా పేరుతో పిలవబడేది. పితౌజియా గ్రామం పేరును ఈయన పేరిట కర్పూరిగ్రామ్‌గా మార్చారు. అతి సామాన్య నాయీ బ్రాహ్మణ రైతు కుటుంబంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు. ఠాకూర్‌కు చిన్నప్పటి నుంచి విప్లవభావాలు ఎక్కువే. కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేసి భారత స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఠాకూర్‌ను 1942, 1945లో అరెస్ట్‌చేసి జైలులో పడేసింది. స్వాతంత్య్రం సిద్ధించాక మొదట్లో గ్రామంలోని పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియాకు ప్రభావితులై రాజకీయాల్లో చేరారు. జయప్రకాశ్ నారాయణ్‌కు సన్నిహితంగా మెలిగేవారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయనతో కలసి పోరాటం చేశారు. జననాయకుడు బిహార్‌లో బీసీలకు 26 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మంగేరీ లాల్ కమిషన్ సిఫార్సులను 1978లో అమలుచేశారు. మండల్ కమిషన్‌కు ఈ సిఫార్సులే ప్రేరణగా నిలిచాయి. అత్యంత వెనుకబడిన కులాలు అనే భావనను తొలిసారిగా మంగేరీ కమిషనే తీసుకొచ్చింది. 1952లో తొలిసారిగా సోషలిస్ట్ పార్టీ తరఫున తేజ్‌పూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. తుదిశ్వాస విడిచేదాకా ఎమ్మెల్యేగానే కొనసాగారు. 1970లో బిహార్ రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధం అమలుచేసి అందరి మన్ననలు పొందారు. రాష్ట్రంలో ఓబీసీలు రాజకీయాల్లో కీలకంగా మారడం వెనక ఈయన పాత్ర ఉంది. జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లకు ఠాకూర్ రాజకీయ గురువు. 1988లో తుదిశ్వాస విడిచారు. ఈయన కుమారుడు ప్రస్తుతం రామ్‌నాథ్ ఠాకూర్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. అణగారిన వర్గాల పెన్నిధి: మోదీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘ పేద, అణగారిన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా అంకితభావంతో పనిచేశారు. సమాజంలోని వివక్ష, అసమానతలు పారద్రోలి వెనకబడిన వర్గాలకు అన్నింటి అవకాశాలు దక్కేందుకు జీవితాంతం కృషిచేశారు. ఆయన నాయకత్వ దార్శనికత భారత సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేసింది. ఈ పురస్కారం ఆయన కృషి మాత్రమేకాదు సమున్నతమైన సమసమాజ స్థాపన కోసం మనం చేసే ప్రయత్నాలకు చక్కని ప్రేరణ’’ అని మోదీ శ్లాఘించారు. సీఎం జగన్ హర్షం సామాజిక న్యాయం, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన సోషలిస్టు నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు ఆయన మరణానంతరం భారతరత్న ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
Goldy Brar: ఇక ఉగ్రవాదిగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్
ఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలన, తీవ్రవాద కార్యకలాపాల కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న గోల్డీ బ్రార్‌కు నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. గోల్డీ బ్రార్‌కు ఉగ్రవాద సంస్థలతోపాటు పలు హత్యలతో సంబంధం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 ప్రకారం గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. దేశంలోని పలువురు ప్రముఖులను హత్య చేసేందుకు కొన్ని హంతక ముఠాలకు డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తన అనుచరులతో పంజాబ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని గోల్డీ బ్రార్ ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. గోల్డీ బ్రార్ నేపథ్యం.. సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పంజాబ్‌లోని శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన లారెన్స్ బిష్ణోయ్‌తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్‌కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు!
ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీకి సంబంధించిన ఫేమ్ పథకం మూడో విడత (ఫేమ్ 3)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ సారి ఈ పథకాన్ని కింద ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం మొదటి విడతలో కేవలం ద్విచక్ర వాహనాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆయా వాహనాల ధరలపై అత్యధికంగా 40 శాతం సబ్సిడీ అందించేది. తర్వాత రెండో విడత (ఫేమ్ 2)లో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై సబ్సిడీని 15 శాతానికి తగ్గించింది. తాజా నివేదికల ప్రకారం.. మూడో విడతలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను చేర్చనుంది. ఇక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని తగ్గించి త్రిచక్రవాహనాలకు సబ్సిడీని పెంచే అవకాశం ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 3 పథకాన్ని ఇంకా రూపొందించనప్పటికీ ఇందుకోసం ఆయా పరిశ్రమల వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొత్త సబ్సిడీ విధానం వెల్లడైతే ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగుతుందా? -
ముడి చమురు ఉత్పత్తిపై ఇక జీరో విండ్‌ఫాల్ ట్యాక్స్
భారత ప్రభుత్వం ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్ పన్నును పూర్తిగా తొలగించింది. టన్నుకు రూ. 3,500 (42.56 డాలర్లు) ఉన్న పన్నును సున్నాకు తగ్గించింది. అంటే దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ఎలాంటి విండ్‌ఫాల్ పన్ను ఉండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. (వామ్మో రూ. 35 వేల కోట్లా.. బ్యాంకులు ఏం చేశాయో తెలుసా?) అలాగే డీజిల్‌పై గతంలో ఉన్న విండ్‌ఫాల్ పన్నును ప్రభుత్వం లీటరుకు రూపాయి నుంచి 50 పైసలకు తగ్గించింది. ఇక పెట్రోలియం, ఏటీఎఫ్‌పై ఎలాంటి విండ్‌ఫాల్ పన్ను లేదు. విండ్‌ఫాల్ టాక్స్ అనేది కొన్ని పరిశ్రమలు తమ సగటు ఆదాయం కంటే ఎక్కువ ఆర్జించినప్పుడు విధించే పన్ను. ఒక పరిశ్రమ ఊహించని విధంగా భారీ లాభాలను ఆర్జించినప్పుడు ప్రభుత్వానికి ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఇంధన ధరలు చమురు ఉత్పత్తిదారులకు అధిక లాభాలను తెచ్చిపెట్టడంతో గత ఏడాది జూలైలో ప్రభుత్వం ఈ పన్నును ప్రవేశపెట్టింది. (పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!) అప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా 2022 జూలైలో ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నులు టన్నుకు రూ. 23,250 నుంచి 2023 మార్చి 21 నాటికి టన్నుకు రూ. 3,500కి తగ్గాయి. ఇటీవల పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్) ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ చర్య కారణంగా ఏప్రిల్ 3న బ్రెంట్ ధర దాదాపు 6 శాతం పెరిగి బ్యారెల్‌కు 84.58 డాలర్లకు చేరుకుంది. -
బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి!
బంగారు నగలు కొనేవారికి ముఖ్యమైన వార్త ఇది. బంగారు ఆభరణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై హాల్‌మార్క్ లేని ఆభరణాలు విక్రయించేందుకు వీలు ఉండదు. బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలనే ఆలోచనను ప్రభుత్వం 18 నెలల క్రితమే బయటపెట్టింది. తాజాగా మార్చి 31 తర్వాత హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) లేని బంగారు ఆభరణాలను విక్రయించేందుకు అనుమతించబోమని వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నాలుగు అంకెలు, ఆరు అంకెలు ఇలా హాల్‌మార్కింగ్ విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ హాల్‌మార్కింగ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇది లేకుండా బంగారం లేదా బంగారు నగలు విక్రయించేందుకు వీలుందడదు. చదవండి: మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ వంట పాఠాలు హెచ్‌యూఐడీ అంటే ఏమిటంటే.. హెచ్‌యూఐడీ అంటే హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఇది ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఈ అంకెల్లో ఇంగ్లష్ అక్షరాలతో పాటు సంఖ్యలు కూడా ఉంటాయి. దీంతో మనం కొలుగోలు చేసిన బంగారం ప్రామాణికత, స్వచ్ఛత తెలుస్తుంది. హెచ్‌యూఐడీ కోడ్ ఉంటే నగల వ్యాపారులు వినియోగదారులను మోసం చేయలేరు. ప్రస్తుతం దేశంలో 1338 హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. -
Women Army Officers: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్‌లో...
ఆకాశంలో సగం కాదు... నింగి నేల నీరు దేనినైనా పూర్తిగా కమాండ్ చేస్తామంటోంది మహిళాలోకం కఠోరమైన శారీరక శ్రమ చేయాల్సిన కదనరంగాన్ని కూడా నడిపించడానికి ముందుకొచ్చింది.. దశాబ్దాలుగా ఎందరో మహిళా అధికారుల కల ఎట్టకేలకు నెరవేరింది. 100 మందికిపైగా మహిళలు పదోన్నతులు పొంది కల్నల్ స్థాయికి ఎదిగారు. భారత ఆర్మీలో చరిత్రాత్మక ముందడుగు పడింది. సియాచిన్ సహా వివిధ కమాండ్ యూనిట్లను మహిళలు కూడా ముందుండి నడిపించనున్నారు. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ బాధ్యతల్ని మొట్టమొదటి సారిగా మహిళలు కూడా నిర్వర్తించనున్నారు. రెజిమెంట్లు, బెటాలియన్లకు అధికార పదవుల్లో మహిళల నియామకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఈ నెల 9 నుంచి 22 వరకు జరిగింది. దాదాపుగా 108 మంది మహిళా అధికారులు కల్నల్‌గా పదోన్నతులు పొందారు. 1992 నుంచి 2006 బ్యాచ్‌కు చెందిన మహిళా అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. వీరంతా ఇంజనీర్స్, సిగ్నల్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ కోర్, ఆర్మీ సర్వీస్ కోర్, ఆర్మీ ఆర్డన్స్ కోర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్స్ వంటి విభాగాలకు అధికారులుగా సేవలందిస్తారు. భారత సాయుధ బలగాల్లో 1992 నుంచి మహిళా అధికారులు ఉన్నారు. అయితే వారంతా షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారులుగానే ఇన్నేళ్లుగా కొనసాగుతున్నారు. ఇంజనీర్లు, న్యాయవాదులు, వంటి అడ్మినిస్ట్రేటివ్ పాత్రలే పోషిస్తున్నారు. యుద్ధ క్షేత్రాల్లో గాయపడ్డ జవాన్లకి చికిత్స అందించే వైద్యులు, నర్సులుగా కూడా ఉన్నారు. 16–18 ఏళ్లు సర్వీసు ఉంటేనే కమాండర్ పదవికి అర్హత సాధిస్తారు. ఇప్పుడు కోర్ ఆఫ్ ఆర్టిలరీ, కంబాట్ సపోర్ట్ ఆర్మ్‌లలో మహిళా అధికారుల్ని నియమించనున్నారు. భారత వాయుసేన, నావికాదళంలో అన్ని విభాగాల్లో మహిళా అధికారులు ఉన్నారు. వారికి శాశ్వత కమిషన్లు కూడా ఉన్నాయి. యుద్ధ విమానాలను, యుద్ధ నౌకల్ని నడిపించే మహిళలూ ఉన్నారు. త్రివిధ బలగాల్లో అతి పెద్దదైన పదాతి దళంలో మాత్రమే మహిళల పట్ల ఇన్నాళ్లూ వివక్ష కొనసాగుతూ వచ్చింది. ఎందుకీ వివక్ష పురుషులతో పోలిస్తే మహిళల శారీరక దారుఢ్యంపైనున్న సందేహాలే ఇన్నాళ్లూ వారికి అవకాశాల్ని దూరం చేశాయి. మాతృత్వం, పిల్లల పోషణ, ప్రసూతి సెలవులు వంటివి మహిళలకు తప్పనిసరిగా ఇవ్వాలని, యుద్ధం ముంచుకొచ్చే నేపథ్యాల్లో అది సాధ్యం కాదనే వాదన వినిపించింది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. మహిళలకు ఎక్కడైనా పని చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి. భారత వాయుసేన, నావికాదళంతో పోలిస్తే ఆర్మీలో వివక్ష ఎక్కువగా ఉంది. యుద్ధభూమిలో నేరుగా మహిళలుంటే శత్రు దేశానికి చిక్కితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికీ పోరాట క్షేత్రాల్లో మహిళా కమాండర్లను నియమించడానికి భారత సైన్యం ఇంకా సిద్ధంగా లేదు. సుప్రీం తీర్పుతో నెరవేరిన కల భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, కమాండింగ్ పదవులు ఇవ్వాల్సిందేనని 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే విషయంతో సంబంధం లేకుండా అందరికీ శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఆర్మీలో మహిళలు పురోగతి సాధించడానికి, నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, పదోన్నతులకు మార్గం సుగమమైంది. యూనిట్‌ను కమాండ్ చేయడమంటే..? పదాతి దళంలో క్షేత్రస్థాయిలో సైనికులందరికీ నేరుగా ఆదేశాలు ఇస్తూ వారిని ముందుకు నడిపించే కీలక బాధ్యత. ఇప్పటివరకు పురుషులు మాత్రమే నిర్వహించిన ఈ బాధ్యతల్ని మహిళలు కూడా అందుకున్నారు. సైన్యంలో కల్నల్ పదవి మహిళకి లభిస్తే ఆమె కనుసన్నల్లోనే సైన్యం నడుస్తుంది. బ్రిగేడర్, మేజర్ జనరల్, లెఫ్ట్‌నెంట్ జనరల్ వంటి ఉన్నతాధికారులు నేరుగా సైనికులతో సంబంధాలను కొనసాగించరు. ఇలాంటి పదవుల్లోనే ఎన్నో సవాళ్లను మహిళలు ఎదర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మహిళల్లో నాయకత్వ సామర్థ్యం బయట ప్రపంచానికి తెలుస్తుంది. ‘‘సియాచిన్‌లో మొట్టమొదటి మహిళా అధికారిగా శివ చౌహాన్‌ను నియామకం మాలో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. స్త్రీ, పురుషులన్న భేదం లేకుండా ప్రతీ ఒక్కరికీ వారికి మాత్రమే సొంతమయ్యే సామర్థ్యాలుంటాయి. ఆర్మీలో మహిళలకు మంచి భవిష్యత్ ఉంది. శారీరక దారుఢ్యం ఉన్నవారు కూడా ఇన్నాళ్లూ వివక్ష కారణంగా పదవులకి దూరమయ్యారు. ఇక ఆ రోజులు పోయాయి’’ – దీక్షా ధామిన్, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి ‘‘ఆర్మీలోకి రావాలనుకునే మహిళల సంఖ్య ఇంకా పెరుగుతుంది. పోరాట క్షేత్రాలకు సంబంధించిన విభాగాల్లో కూడా మహిళా అధికారులు రావాలి. ఎందుకంటే మహిళలు ఎంతో చురుగ్గా, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో ఉంటారు’’ – దీప్‌నూర్ సహోతా, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీపై డాక్యుమెంటరీ దుమారం! రిషి సునాక్ స్పందన
న్యూఢిల్లీ/లండన్: భారత ప్రధాని నరేంద్ర మోదీపై.. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తీసిన ఓ డాక్యుమెంటరీ పెను దుమారాన్ని రేపుతోంది. ‘ఇండియా ది మోదీ క్వశ్చన్’ పేరుతో రెండు పార్ట్‌ల సిరీస్‌గా డాక్యుమెంటరినీ రూపొందించింది బీబీసీ. అయితే ఈ సిరీస్‌పై భారత ప్రభుత్వం, మరోవైపు ప్రవాస భారతీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంటరీ.. దానిని రూపొందించిన ఏజెన్సీకి ప్రతిబింబంగా ఉంది. అపఖ్యాతి పాలుజేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రచార భాగం అని మేము భావిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. పక్షపాతం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద మనస్తత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి చేష్టలను గౌరవించలేం అని బాగ్చీ పేర్కొన్నారు. ఈ సిరీస్‌ను ప్రసారం చేయడంలో ఎజెండా ఏమిటని బీబీసీని నిలదీశారు. బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ (BBC) మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002 అలర్లకు సంబంధించిన మోదీ పాత్ర అంటూ డాక్యుమెంటరీలో హైలైట్ చేసింది బీబీసీ. ఆ టైంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ విమర్శలు గుప్పించింది. మోదీ, భారతదేశంలోని ముస్లిం మైనారిటీల మధ్య ఉద్రిక్తతలను పరిశీలించడం, వెయ్యి మంది వరకు మరణించిన గుజరాత్ 2002 అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర గురించి వాదనలను పరిశీలించడం లాంటి ఉద్దేశాలను ప్రముఖంగా చూపించడంతో.. దుమారం మొదలైంది. భారత సంతతి మండిపాటు అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని బీబీసీని భారత ప్రభుత్వం దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. మరోవైపు భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనోభావాలను బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు. వలసవాద ఆలోచనా ధోరణిని ప్రతిబింబించే డాక్యుమెంటరీ అంటూ బీజేపీ శ్రేణులు సైతం మండిపడుతున్నాయి. రిషి సునాక్ స్పందన మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పార్లమెంట్లో స్పందించారు. పాక్ సంతతికి చెందిన ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ బ్రిటన్ పార్లమెంట్లో ఈ డాక్యుమెంటరీపై మాట్లాడుతూ.. మోదీపై విమర్శలు గుప్పించారు. అయితే.. హుస్సేన్‌కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి మద్ధతుగా స్పందించారు. ‘‘దీనిపై UK ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. దీర్ఘకాలంగా ఉన్న ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అలాగని ఎక్కడైనా హింసను సహించబోం.’’ అంటూ రిషి సునాక్ పాక్ సంతతి ఎంపీ నోరు మూయించారు. UK PM #RishiSunak dismisses Pak-origin #British MP's statement about #PMModi's leadership during 2002 Gujarat riot over BBC documentary#Pakistan #NewsUpdate #ModiGovt @PMModiNews @rishisunakmp1 @PMModiArmy #RIOT @PmModiFanClub1 @rishisunak_66 Video Credit: @kapilkumaron pic.twitter.com/uFhN8gOTMw — News9 (@News9Tweets) January 19, 2023 ఆ కామెంట్లపై అభ్యంతరాలు ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని, అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నలు తలెత్తుతోంది. పైగా అది ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని, దానిపైన ఇప్పుడు ఎందుకు స్పందించాలని, జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని బీబీసీ ఎలా ప్రసారం చేసిందని అభ్యంతరాలతో ఏకిపడేస్తున్నారు కొందరు. గుజరాత్ అల్లర్ల నేపథ్యం 2002 ఫిబ్రవరి నెలలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలులో కరసేవకులు ఉన్న బోగీకి గోద్రా రైల్వేస్టేషన్ లో నిప్పు పెట్టడంతో 59 మంది చనిపోయారు. ఈ ఘటనతో గుజరాత్ వ్యాప్తంగా హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తాయి. మూడు నెలల పాటు గుజరాత్ రాష్ట్రం అట్టుడికింది. ఈ ఘర్షణలో వెయ్యి మరణించారు. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారు. అయితే ఈ అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్ 2012లో ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్లలో ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పింది. కొంతమంది మాత్రం నరేంద్రమోదీ పాత్ర ఉందని తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడించింది. ఇక తీస్తా సెతల్వాడ్ అనే హక్కుల కార్యకర్త నరేంద్ర మోదీని తప్పుడు ఆరోపణలతో ఇరికించే ప్రయత్నం చేసినట్లు తేలింది. దీనికి కాంగ్రెస్ పార్టీ, దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కిందటి ఏడాది.. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గతంలో హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఆ హింసాకాండలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు అర్హత లేనిదిగా పేర్కొంది కూడా. -
సొంత ఓఎస్‌పై ప్రభుత్వ భారీ కసరత్తు: ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఖేల్ ఖతం?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ యూజర్లకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుందా? సొంతంగా ఒక దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించి, వినియోగదారులకు మరింత సురక్షితమైన అనుభవాన్ని అందించే ప్రాజెక్ట్‌పై పని చేస్తోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకొంది. ఇండ్ ఓఎస్ పేరుతో తీసుకురానుంది. ప్రభుత్వం, స్టార్టప్‌లు , విద్యాసంస్థల చొరవతో దీన్ని రూపొందిస్తోంది. ఎపుడు, ఎలా లాంచ్ చేస్తుందనే దానిపై స్పష్టతేదు. ఇది యూజర్లకు ఒక కొత్త భారతీయ OS సురక్షితమైన అనుభవాన్ని అందించడమే కాకుండా Google, Appleకి దీటుగా గట్టి పోటీ ఇస్తుందని అంచనా. కాగా ప్రస్తుతం, గూగుల్ ఆండ్రాయిడ్ 97 శాతం వాటాతో టాప్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా, ఐఫోన్కోసం రూపొందించిన ఆపిల్ ఐఓఎస్ వాటా పరిమితంగానే ఉంది. మరోవైపు నోకియా, శాంసంగ్, బ్లాక్‌బెర్రీ నోకియా, మైక్రోసాప్ట్ ,ఫైర్ఫాక్స్ లాంటి దిగ్గజాల ఆపరేటింగ్ సిస్టమ్స్ పెద్దగా ఆదరణకు నోచుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఇండ్‌ఓఎస్ ఆవిష్కారంపై భారీ అంచనాలే ఉన్నాయి. -
భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లపై పీసీబీ కొత్త చీఫ్ కీలక వాఖ్యలు
ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఎనలేని క్రేజ్ ఉంటుదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా చాలా ఏళ్ల నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. ఈ క్రమంలో భారత్-పాక్ జట్లు ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి ఈవెంట్లలో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి. అయితే ఇరు దేశాల అభిమానులు మాత్రం చిరకాల ప్రత్యర్ధిలు ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడితే చూడాలని భావిస్తున్నారు. ఇక 2012-13లో చివరగా ద్వైపాక్షిక సిరీస్‌లో పాక్‌తో భారత్ తలపడింది.కాగా భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణపై పీసీబీ కొత్త చీఫ్ నజామ్ సేథీ కీలక వాఖ్యలు చేశాడు. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో ఇరు దేశాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని నజామ్ సేథీ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా బోర్డు ప్యానెల్ మార్పుకు ముందు న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు పీసీబీ జట్టును ఎంపిక చేయడాన్ని అతడు తప్పు బట్టాడు. "ప్రస్తుతం పాక్ జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. అయితే ప్యానల్ మార్పుకు ముందు కివీస్ సిరీస్‌కు జట్టును ప్రకటించకుండా ఉంటే బాగుండేది. కానీ పాకిస్తాన్లో అన్ని ప్రధాన జట్లు పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. న్యూజిలాండ్ సిరీస్ మాకు చాలా ముఖ్యమైనది. దేశవాళీ క్రికెట్ నుంచి మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి జాతీయ జట్టులో అవకాశం కల్పిస్తాము" అని విలేకరుల సమావేశంలో సేథీ పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో వరుసగా సిరీస్‌లు ఓడిపోవడంతో రమీజ్ రజాను పీసీబీ చైర్మెన్ పదవి నుంచి పాక్ ప్రభుత్వం తొలిగించింది. ఈ క్రమంలో అతడి స్థానంలో సేథీ పీసీబీ కొత్త బాస్‌గా బాధ్యతలు చేపట్టాడు. చదవండి: IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..! -
భలే మంచి చౌక బేరము
సాక్షి, అమరావతి: సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను సాధించడం కోసం రూఫ్‌టాప్ సోలార్ యోజన స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మార్చి 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం కింద 3 కిలోవాట్ల రూఫ్‌టాప్‌కు దాదాపు రూ.43 వేల వరకూ సబ్సిడీ అందించనుంది. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌తో ఇంట్లో ఏసీ, ఫ్రిజ్, కూలర్, టీవీ, మోటార్, ఫ్యాన్ మొదలైన వాటిని నడపవచ్చు. దీని కోసం నెలనెలా ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిగులు విద్యుత్‌ను ఇంల్లో అద్దెకున్న వారికి, పొరుగింటి వారికి విక్రయించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. అదనపు చార్జీలతో పనిలేదు సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడానికి ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించవద్దని న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది. తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవాలనుకునే వినియోగదారులు నేషనల్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం ఏ కంపెనీకి అదనంగా ఎలాంటి చార్జీలు చెల్లించవద్దని, అలాగే మీటర్, టెస్టింగ్ కోసం సంబంధిత పంపిణీ సంస్థ నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించవద్దని గృహ విద్యుత్ వినియోగదారులకు సూచించింది. ఎవరైనా అదనపు రుసుము కోరితే ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాల్సిందిగా తెలిపింది. సబ్సిడీ మినహాయించి చెల్లిస్తే చాలు ఒక కిలోవాట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే 100 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఎన్ని కిలోవాట్లు పెట్టాలనుకుంటే అన్ని వందల చదరపు అడుగులు అవసరం. బెంచ్‌మార్క్ ధరలపై సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (సీఎఫ్ఏ) 3 కిలోవాట్ల వరకూ 40 శాతం, 3 కిలోవాట్లపైన 10 కిలోవాట్ల కంటే ఎక్కవ సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలపై 20 శాతం సబ్సిడీ లభిస్తుంది. గృహ విద్యుత్ వినియోగదారులు సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే 1 కిలోవాట్‌కు అయ్యే రూ.50 వేల ఖర్చులో రూ.18,800 సబ్సిడీ వస్తుంది. అదే 10 కిలోవాట్ల ప్లాంట్ అయితే రూ.4.40 లక్షల్లో రూ.1,06,600 సబ్సిడీ లభిస్తుంది. వీటికి తోడు దరఖాస్తు రుసుం 5 కిలోవాట్ల వరకూ రూ.1,000, ఆ పైన రూ.5 వేల చొప్పున చెల్లించాలి. మీటరింగ్ చార్జీలు అదనం. ఈ ధరలు చెల్లించిన వారికి సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ల రూపకల్పన, సరఫరా, ఏర్పాటు చేసి ఇవ్వడంతో పాటు బీమాతో సహా 5 ఏళ్ల వారంటీ లభిస్తుంది. ఈ మేరకు నగదును తగ్గించుకుని సంబంధిత ఏజెన్సీకి మిగతా ధర చెల్లిస్తే సరిపోతుంది. అయితే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అపార్ట్మెంట్లకు 20 శాతం మాత్రమే సీఎఫ్ఏ వస్తుంది. -
పాకిస్థాన్ ఓటీటీపై నిషేధం.. ఎందుకంటే?
పాకిస్థాన్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌కు చెందిన 'విడ్లీ టీవీ' అనే ఓటీటీ ఫ్లామ్ఫామ్ను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు మరో రెండు మొబైల్ అప్లికేషన్లు, నాలుగు సోషల్ మీడియా ఖాతాలు, స్మార్ట్ టీవీ యాప్‌లపై కూడా నిషేధం విధించింది. ఇటీవల విడ్లీ టీవీ ఓటీటీలో విడుదలైన 'సేవక్: ది కన్ఫెషన్స్' అనే వెబ్ సిరీస్‌లో భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు తెచ్చేలా కంటెంట్ ఉందని కేంద్రం వెల్లడించింది. ఓటీటీలో విడుదలైన మూడు ఎపిసోడ్లు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. వెబ్ సిరీస్‌లో ప్రసారమవుతున్న కంటెంట్ భారత చారిత్రక ఘటనలపై వ్యతిరేకతను పెంచేలా ఉందని.. పూర్తి అవాస్తవాలతో ప్రసారం చేస్తున్నారని భారత సీనియర్ అధికారి కంచన్ గుప్తా తన ట్విటర్లో వెల్లడించారు. IMPORTANT Ministry of Information & Broadcasting, using emergency powers under IT Rules 2021, has issued directions on 12 December 2022 for immediate blocking of the website, 2 mobile apps, 4 social media accounts, and one smart TV app of #Pakistan-based OTT Platform Vidly TV. n1 — Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) December 12, 2022 -
డేటా రక్షణకు ఢోకా లేనట్లేనా?!
వ్యక్తిగత డిజిటల్ సమాచార పరిరక్షణ బిల్లు తాజా ముసాయిదాతో మళ్లీ ముందుకొచ్చింది. 2019లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లుపై అనేక అభ్యంత రాలు వ్యక్తం అవడంతో అది ఆమోదానికి నోచుకోలేదు. ఈ క్రమంలో ఎనభైకి పైగా సవరణలు, పదికిపైగా కీలకమైన సూచనలలో కేంద్రం మరోసారి ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు–2022’ను సిద్ధం చేసి, ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేసింది. ఈ శీతాకాల సమావేశాలలోనే ప్రవేశపెట్ట దలచిన ఈ బిల్లుపై న్యాయ నిపుణులు అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్నింటిపై›ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారం, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవసరమైతే పౌరుల సమ్మతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవచ్చన్న క్లాజుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు’ తాజా ముసాయిదాలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. సరళమైన భాషను ఉపయోగించారు. మౌలిక సూత్రాలను దృష్టిలో ఉంచుకుని, చట్ట నియంత్రణలో ఉండే విధానా లకు రూపకల్పన చేశారు. అయితే, వ్యక్తిగత సమాచార పరిరక్షణ కోసం ఈ తాజా ముసాయిదాలో పేర్కొన్న కొన్ని అంశాలు లోప భూయిష్టంగా ఉండటం ఆందోళన కలిగించే విషయమే. మొత్తంగా చూస్తే ఈ ముసాయిదా బిల్లు దేశ ప్రజల సాంకేతిక భద్రతా చట్టాలను బలపరిచేదిగా నిలిచిపోతుంది. గత నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ డేటా పరిరక్షణ బిల్లు ముసాయిదాను ప్రజాక్షేత్రంలోకి విడుదల చేసి, అందులోని బాగోగులను చర్చకు పెట్టింది. గత నాలుగేళ్లుగా ఏకాభిప్రాయానికి నోచుకోక, ఇక ఇది ఎప్పటికైనా బిల్లు రూపంలోకి వస్తుందా అనే సందే హాల నడుమ తాజా విడతగా బయటికి వచ్చిన ముసాయిదాను ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. డేటా ప్రొటెక్షన్ చట్టంపై దశాబ్దకాలంగా చక్ర బంధంలో పరుగులు తీస్తున్న చిట్టెలుకలా పని చేస్తున్న నా వంటి వ్యక్తికి తొలిసారిగా ఈ తాజా ముసాయిదా సొరంగం చివర కనిపి స్తున్న కాంతి వంటి భావనను కలిగించింది. తాజా ముసాయిదా ఎంతో సులభగ్రాహ్యంగా ఉంది. సాధ్య మైనంతగా విస్తృత స్థాయిలో ప్రతి ఒక్కరికీ బిల్లును అర్థం చేయించేం దుకు ప్రయత్నం జరిగినట్లు అర్థమౌతోంది. ఇందులో పేర్కొన్న చట్ట నిబంధనలు ఎలా అన్వయమవుతాయో వివరించే ఉదాహరణలను తగినన్నిగా ఇవ్వడం భలే నచ్చింది. నిజానికి శాసన ముసాయిదాల రూపకల్పనలో ఇలా ఇవ్వడం అనేది ఒక మెళకువ. దురదృష్టవశాత్తూ ఆధునిక బిల్లు తయారీ సాధకులకు ఇది కొరుకుడు పడని విద్య. పౌరులతో ముడివడి ఉండే నియంత్రణలకు అధికారాన్నిచ్చే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం ఉద్దేశించిన చట్టంలోని సరళత కచ్చితంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. అయినప్పటికీ, ముసాయిదాలోని ఈ సరళతను నేను ఇష్టపడటం న్యాయవాదులలోని నా సోదరులు కొందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యాయవాదులు ఎప్పుడూ కూడా తమ చట్టాలు సరళత్వాన్ని కలిగి ఉండటం కంటే కూడా, సవివరమైనవిగా ఉండటాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. గతంలో నేను అనేకసార్లు చెప్పినట్లుగా... సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రించే బిల్లు తయారీ జరగడం ఇలాక్కాదు. చట్టంలో మనం ఎంత ఎక్కువగా వివరాలను కూరుతామో, సాంకేతిక పరిజ్ఞాన పురోగతిలోని కొత్త పరిణామాల వల్ల అది అంత ఎక్కువగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకు బదులుగా, సాంకే తికత నిర్దేశించే నిరంతర లక్ష్యాలకు అత్యంత ప్రభావవంతంగా ప్రతి స్పందించడానికి వీలు కల్పించే చురుకైననియంత్రణ చట్టాలను మాత్రం రూపొందిస్తే సరిపోతుంది. ఇక ఈ ముసాయిదా చట్టంలోని ఇతర అంశాలలో కొన్నింటిపైన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చట్టంలోని అనేక ముఖ్యమైన నిబంధనల వర్తింపు నుంచి ప్రభుత్వం తనను తాను మిన హాయించుకోవడం వాటిల్లో ఒకటి. అయితే ప్రపంచంలోని ప్రతి డేటా ప్రొటెక్షన్ చట్టంలోనూ ఈ రకమైన మినహాయింపు కనిపిస్తుంది. ఉదా: ఐరోపాలో అమలులో ఉన్న ‘జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్’ (జి.డి.పి.ఆర్.) చట్టం తన మేలిమి ప్రమాణాల రీత్యా తలమానిక మైనదిగా గుర్తింపు పొందుతోంది. వారి చట్టంలో జాతీయ భద్రత, దేశ రక్షణ, పౌరుల సంక్షేమం రీత్యా క్రిమినల్ నేర విచారణ, రహస్య ఛేదన వంటి హక్కు దావాల నుంచి ప్రభుత్వానికి కొన్ని స్పష్టమైన మినహా యింపులను ఇస్తున్నాయి. సరిగ్గా మన తాజా ముసాయిదాలోని సెక్షన్ 18 (1) ప్రసాదిస్తున్న మినహాయింపులు కూడా అటువంటివే. అయితే డేటా పరిరక్షణ చట్టంలోని కొన్ని నిబంధనల వర్తింపు నుండి ప్రభుత్వం మినహాయింపు తీసుకున్నంత మాత్రాన 2017 పుట్టస్వామి తీర్పును అనుసరించి తన రాజ్యాంగ బద్ధతలకు లేదా బాధ్యతలకు ప్రభుత్వం లోబడి ఉండబోదని అర్థం కాదు. బిల్లులోని నిర్దిష్ట మూలాంశం ఏమి చెప్పినప్పటికీ, ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యపై ఆ బద్ధతలు, బాధ్యతలు శిరస్సుపై ఖడ్గంలా వేలాడుతూనే ఉంటాయి. ప్రస్తుత బిల్లుకు జరుగుతూ వస్తున్న సవరణలతో పోల్చి చూసినప్పుడు తాజా ముసాయిదాలో పేర్కొన్న మినహాయింపులు నిరపాయకరమైనవేనని చెప్పాలి. చట్టానికి జరిగిన గత రెండు సవర ణలు చట్టంలోని కొన్ని సెక్షన్ల వర్తింపు నుంచి ప్రభుత్వ యంత్రాంగా లకు మొత్తంగా మినహాయింపును ఇవ్వాలన్న ప్రతిపాదనలు కలిగి ఉన్నాయి. తాజా ముసాయిదా కొంత తులనాత్మకంగా జరిగింది. దీనర్థం తాజా ముసాయిదాలో లోపాలు లేవని చెప్పడం కాదు. ఇందులో డేటా ప్రొటెక్షన్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకోవలసిన కొన్ని ప్రధానమైన పరిగణనలు లోపించాయి. నా ఉద్దేశంలో అవి ఏమిటంటే... మొదటిగా, డేటా పోర్టబిలిటీ హక్కు. దేశ జనాభాలోని వ్యక్తులకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ ఒకచోట నిల్వ ఉంచుతున్న ఈ యుగంలో, అలా నిల్వ ఉంచిన సమాచారం నుంచి వివరాలను సంగ్రహించి, బట్వాడా చేసుకునే హక్కును వ్యక్తులకు ఈ బిల్లులో కల్పించలేదు. డేటా పోర్టబిలిటీ హక్కు ఉంటే కనుక వ్యక్తులకు తమకు అవసరమైన వివరాలపై ఆధీనతను ఇవ్వడమే కాకుండా, కొద్ది మంది చేతుల్లోనే డేటా పోగుపడే ఏకీకరణను నిరోధించే సమర్థమైన చర్యగా కూడా పోర్టబిలిటీ ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా నియంత్రకులు పోర్టబిలిటీ హక్కును మరింత ప్రభావవంతంగా, అర్థవంతంగా చేయడానికి శ్రమిస్తున్నారు. భారతదేశమైతే తన శక్తిమంతమైన ‘టెక్నో–లీగల్’ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలతో, డేటా పోర్టబిలిటీ ఎలా చేయాలో ప్రపంచానికి చూపించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ముందైతే అటువంటి హక్కుకు చట్టంలో స్పష్టమైన నిర్వచనం ఉండాలి. నాకు కనుక మరొక సూచనకు అవకాశం ఉంటే దానిని నేను బిల్లులో వాడిన కొన్ని పదాలను అంతర్జాతీయ అనుసరణీయతలకు మరింత చేరువగా ఉండేలా నిబంధలను మార్పు చేయమని అడిగేం దుకు ఉపయోగించుకుంటాను. జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ డేటా సబ్జెక్టులను (గుర్తింపు వివరాలు కలిగి ఉన్న వ్యక్తులు) డేటా ప్రిన్సిపల్స్‌గా, డేటా కంట్రోలర్స్ని (వివరాలను నియంత్రించేవారు) డేటా విశ్వసనీయులుగా పునఃనామకరణ చేసిన ప్పటి నుంచీ... ఆ తర్వాతి వరస ముసాయిదాలు ప్రామాణికం కాని ప్రమాణాలను చట్టంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాయి. అందుకు ప్రస్తుత ముసాయిదా కూడా మినహాయింపేమీ కాదు. ప్రపంచంలోని మిగతా దేశాలు ‘డేటా ప్రొటెక్షన్ అథారిటీ’గా పిలిచే శాఖను మన దగ్గర ‘డేటా ప్రొటెక్షన్ బోర్డు’గా వ్యవహరిస్తున్నారు. ఇక గోప్యత చట్టాల్లో సమాచారాన్ని రాబట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించే చట్టబద్ధమైన అవసరం, సహేతుకమైన ప్రయోజనం వంటి మాటలు తాజా చట్టంలోనూ ఉన్నాయి. దీనివల్ల వ్యక్తుల సమ్మతి లేకుండానే (డీమ్డ్ కన్సెంట్) వారికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం, ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థలు పొందే వీలుంది. ఇది వ్యక్తిగత స్వయం ప్రతిపత్తిని మరింతగా దెబ్బతీస్తుందనే ఆందో ళన ఉన్నందువల్ల దీనిపై పూర్తి స్థాయి చర్చ జరగవలసిన అవసరం ఉంది. డీమ్డ్ కన్సెంట్ అనే పేరులో ఏముంది అని మీరడగవచ్చు. ఏమీ లేదు. ఆశించిన ప్రయోజనాలను ఆ నిబంధన నెరవేర్చుతున్నంత కాలం పేరులో ఏమీ లేదనే చెబుతాను. కానీ పైపై మాటలతో కూడిన నిబంధనలు... ఇప్పుడు మనం చూస్తున్న విధంగా నిరసనల నిప్పు తుపానును రాజేస్తాయి. అయితే అది మనం నివారించగలిన తుపానే! రాహుల్ మత్తన్ వ్యాసకర్త ‘ట్రైలీగల్’ సంస్థ భాగస్వామి (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
‘సాల్ట్’ పేరిట ఉద్యోగాల వల
సాక్షి, విజయవాడ ప్రతినిధి/సాక్షి, అమరావతి: ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు వసూలుచేసి బోర్డు తిప్పేసిన బాగోతమిది. కేంద్ర ప్రభుత్వం ‘సాల్ట్’ అనే పథకాన్ని ప్రవేశపెడుతోందనీ, దీనిపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను నియమిస్తున్నామంటూ బురిడీ కొట్టించి వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు దండుకుని మోసం చేసిన ఓ బోగస్ సంస్థ నిర్వాకమిది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఇద్దరు బాధితులు విజయవాడలోని సంస్థ నిర్వాహకులను నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. ‘ఆల్ఫాబెట్ వెంచర్’ పేరుతో.. విజయవాడ సూర్యారావుపేటలోని వేమూరి వారి వీధిలో ‘ఆల్ఫాబెట్ వెంచర్’ పేరుతో రెండేళ్ల క్రితం ఓ సంస్థ వెలిసింది. ఎడ్యుకేషనల్ బుక్స్ పబ్లికేషన్, డిజిటల్ అండ్ ఆబ్జెక్టివ్ బేస్డ్ లెర్నింగ్, పేపర్ అండ్ పేపర్ ప్రోడక్ట్స్, ప్రింటింగ్ అండ్ రీ ప్రొడక్షన్, మోషన్ పిక్చర్ ప్రొడక్షన్, రేడియో అండ్ టెలివిజన్, స్టాఫింగ్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, స్మార్ట్ లైటింగ్ సిస్టమ్, సీసీఎంఎస్–ఐఓటీ–కంప్యూటర్స్ అండ్ రిలేటెడ్ సేవల పేరుతో సంస్థను ఏర్పాటుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సర్వీసులను ఏజెన్సీలకు అప్పగిస్తాయని, ప్రభుత్వ కార్యకలాపాలను తమ సంస్థ ద్వారానే నిర్వహిస్తామని ఈ సంస్థ నిర్వాహకులు నిరుద్యోగులను నమ్మబలికారు. సంస్థ నెలకొల్పిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలుచేసే ‘సాల్ట్’ పథకానికి ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను నియమిస్తున్నామని మధ్యవర్తుల ద్వారా నిరుద్యోగులకు వల వేశారు. దీంతో విస్సన్నపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసి మానేసిన చిన్నం మృత్యుంజయ అనే వ్యక్తి ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులను ఆకర్షించాడు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు సాల్ట్ పథకంపై శిక్షణనిచ్చే కాంట్రాక్టును ‘ఆల్ఫాబెట్ వెంచర్’కు కేంద్ర ప్రభుత్వం అప్పగించిందనీ, ఇందుకుగానూ ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను ఆ సంస్థ నియమిస్తుందని, 20 రోజుల శిక్షణ తరువాత నెలకు రూ.40 వేలు జీతం వస్తుందని అతను అందరినీ నమ్మించాడు. ఉద్యోగానికి రూ.4 నుంచి రూ.6 లక్షలు వసూలు.. ఇక ఫీల్డ్ ఆఫీసర్, సూపర్వైజర్ ఉద్యోగానికి ఒకొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలుచేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా విజయవాడలోని ఆల్ఫాబెట్ సంస్థ ప్రతినిధులు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనే అనేకమంది నుంచి డబ్బులు వసూలుచేసినట్లు తెలుస్తోంది. చిన్నం మృత్యుంజయ ద్వారానే తమ నుంచి రూ. 8.20 లక్షలు వసూలు చేశారని ఇద్దరు బాధితులు చెబుతున్నారు. వీరిరువురూ ఎంఏ, పీహెచ్డీ చేసి విస్సన్నపేటలోని ప్రైవేటు పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు. తాము గత ఏడాది సెప్టెంబర్‌లో డబ్బులు చెల్లించి 20 రోజులు శిక్షణ తీసుకున్నామని, ఆ తరువాత సంస్థ నిర్వాహకులు జీతం ఇవ్వకుండా మొహం చాటేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలా బోగస్ సంస్థలు వెలిశాయని బాధితులు చెబుతున్నారు. జిల్లాకు ఓ పేరుతో రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లోనూ ఏర్పాటుచేసి వందలాది మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలుచేసినట్లు తెలుస్తోంది. ఏలూరులో ఆదిత్య మ్యాన్‌పవర్ సొల్యూషన్స్, కాకినాడలో మ్యాట్రిక్స్ మాన్పవర్ సొల్యూషన్, విశాఖపట్నంలో మరో పేరుతో సంస్థలను నెలకొల్పినట్లు బాధితుల కథనం. దీనిపై ఐసీడీఎస్ ఉద్యోగులను ఆరా తీస్తే.. తమ వద్ద అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని ఏజెన్సీకి అప్పజెప్పలేదని స్పష్టంచేశారు. ఉద్యోగాల పేరిట మోసపోవద్దు సమగ్రశిక్ష వొకేషనల్ ట్రైనర్ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దు. పాఠశాలల్లో వృత్తివిద్య కోర్సులు బోధించడానికి వొకేషనల్ ట్రైనింగ్ పార్టనర్స్, వొకేషనల్ ట్రైనర్లను నియమించుకుని పాఠశాలల్లో బోధిస్తారు. ఈ పోస్టులు పరిమిత కాలానికి మాత్రమే. కాబట్టి వీరి నియామకానికి సంబంధించి సమగ్రశిక్ష ఎటువంటి బాధ్యత వహించదు. ఇటువంటి వాటిపై ఫిర్యాదులను "vocational. apsamagra@gmail. com' కు మెయిల్ చేయాలి. – ఎస్. సురేష్‌కుమార్, సమగ్రశిక్షా రాష్ట్ర పథక సంచాలకుడు -
‘చిరు’ ప్రయత్నం చేయాల్సిందే!
కొన్ని సందర్భాలు ఆగి ఆలోచించుకోవడానికి ఉపకరిస్తాయి. గతాన్ని సింహావలోకనం చేసుకొమ్మం టాయి. భవిష్యత్ కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. ఐరాస ప్రకటించిన ‘అంతర్జాతీయ చిరుధాన్య సంవ త్సరం’ సరిగ్గా అలాంటి సందర్భమే. మన దేశం చొరవతో ఈ ప్రకటన రావడం సంతోషించదగ్గ విషయం. అదే సమయంలో చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచమే కాదు... ముందుగా మనమెక్కడ ఉన్నామో పర్యాలోచించుకోవాలి. ఆరోగ్య ‘సిరి’గా పేరు తెచ్చుకున్న విలువైన పోషకాహారానికి మనం నిజంగానే ఆచరణలో విలువ ఇస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. గత నాలుగైదు దశాబ్దాల్లో మన దేశంలో ఈ చిరుధాన్యాల ఉత్పత్తి 2.3 – 2.4 కోట్ల టన్నుల నుంచి 1.9– 2 కోట్ల టన్నులకు పడిపోయిందట. ఈ లెక్కలు కొత్త సంవత్సర కర్తవ్యానికి ఓ మేలుకొలుపు. జనవరి 1 నుంచి చిరుధాన్య వత్సరంగా ఉత్సవం జరుపుకొనేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. నిజానికి, 2018లోనే భారత సర్కార్ ఆ ఏడాదిని జాతీయ చిరుధాన్య వత్సరంగా తీర్మానించింది. చిరుధాన్యాలను ‘పోషక సంపన్న ఆహారధాన్యాలు’గా అధికారికంగా గుర్తించి, ‘పోషణ్ మిషన్ అభియాన్’లో చేర్చింది. ఆపైన 2023ను అంతర్జాతీయ చిరుధాన్య వత్సరమని ప్రకటించాల్సిందిగా ఐరాసకు ప్రతిపాదన పెట్టింది. మరో 72 దేశాలు మద్దతునిచ్చాయి. అలా ఈ పోషక ధాన్యాలను ప్రోత్సహించాలన్న మన చొరవ అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెచ్చుకుంది. చివరకు 2021 మార్చి 5న ఐరాస సర్వప్రతినిధి సభ చిరుధాన్య వత్సర ప్రకటన చేసింది. ప్రపంచ పటంపై చిరుధాన్యాలను మళ్ళీ తీసుకురావడానికి ఇది భారత్‌కు మంచి అవకాశం. ఈ పోషకధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్, ఆ ధాన్యాల ఉత్పత్తులకు సమర్థమైన మార్కెటింగ్ వసతులు కల్పించడానికి నడుం కట్టాల్సిన తరుణం. ఈ ‘సిరి’ సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ, భారత జాతీయ వ్యవసాయ సహాయక మార్కెటింగ్ సమాఖ్యలు అక్టోబర్ మొదట్లో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ సైతం ఆ మధ్య తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లోనూ ఈ పోషకధాన్యాల ఉత్పత్తితో రైతులకూ, వినియోగంతో ప్రజలకూ కలిగే లాభాలను ప్రస్తావించారు. ఇవన్నీ వినడానికి బాగున్నాయి. కానీ, ఆచరణలో ఇంకా వెనకబడే ఉన్నాం. దేశంలో దాదాపు 80 శాతం మెట్టభూములైనా, 20 శాతం మాగాణితో వచ్చే వరి, గోదుమల పైనే ఇప్పటికీ అర్థరహితమైన మోజు! అదనులో రెండు వర్షాలు కురిస్తే చాలు... ఆట్టే నీటి వసతి అవసరం లేకుండానే మంచి దిగుబడినిచ్చే చిరుధాన్యాలు నిజానికి మన శీతోష్ణాలకు తగినవి. వీటి లోనే పోషకాలు ఎక్కువ. అయినా చిరుధాన్యాల్లో పెద్ద గింజలైన జొన్న, సజ్జ, రాగులన్నా, చిన్న గింజలుండే కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, వరిగెల లాంటివన్నా అటు రైతులకూ, ఇటు వినియోగదారులకూ చిన్నచూపే. పండుగపూట పరమాన్నంలా వరి వండుకొని తినగలిగిన తాతల కాలం నుంచి ఇవాళ నీటిపారుదల ప్రాజెక్టులతో పుష్కలంగా వరి పండించగలగడం పురోగతే. ఆ మోజులో మన ఒంటికీ, వాతావరణానికీ సరిపోయే జొన్నలు, సజ్జల్ని వదిలేయడమే చేస్తున్న తప్పు. వరి, గోదుమల పంటకాలం 120 – 150 రోజులైతే, సిరి ధాన్యాలు 70–100 రోజుల్లోనే చేతికొ స్తాయి. నీటి వసతి ఆట్టే అవసరం లేని వర్షాధారిత మెట్టభూములు, కొండ ప్రాంతాల్లో ఈ ధాన్యాలను ప్రభుత్వం ప్రోత్సహించాలంటున్నది అందుకే. విదేశాంగ మంత్రి అన్నట్టు ‘కోవిడ్, యుద్ధ వాతావరణం, పర్యావరణ సమస్యలు’ అంతర్జాతీయ ఆహార భద్రతకు సవాలు విసురుతున్న వేళ చిరుధాన్యాల సాగు, వాడకం పట్ల అవగాహన పెంచడం పరిష్కారం. అలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గండం నుంచి గట్టెక్కించడానికీ ఈ ధాన్యాలే మందు. క్రీ.పూ. 3 వేల నాటి సింధునదీ పరివాహక ప్రజల కాలం నుంచి ఇవే తినేవాళ్ళం. ఇవాళ ప్రపంచంలో అనేక రకాలు ముందు మన దేశంలోవే. ఇప్పుడు మళ్ళీ ఆ పంటలకు ప్రభుత్వం ఆసరానివ్వాలి. ఈసరికే వాటిని పండిస్తున్న పశ్చిమ రాజస్థాన్, దక్షిణ కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్‌లలో రైతులకు ప్రోత్సాహకాలివ్వాలి. ఒక నిర్ణీత ప్రాంతాన్ని ఒక నిర్ణీత ధాన్యం సాగుకు కేంద్రంగా మలచడం లాంటివీ చేయవచ్చు. ఆ ప్రాంతీయుల ఆహారంలో ఆ ధాన్యాన్ని అంతర్భాగం చేయగలగాలి. అందుకు ముందుగా ప్రజలకు వీటి వినియోగాన్ని అలవాటు చేయాలి. ఇక, ఫలానా ధాన్యంతో ఫలానా రోగం పోతుందని స్వతంత్ర ఆహార శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయోగపూర్వకంగా ఏళ్ళకొద్దీ చెబుతున్నాయి. పరిశోధన లతో వాటిని నిరూపించే బాధ్యత ప్రభుత్వానిది. భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ లాంటివి ఆ పని తలకెత్తుకోవాలి. దాని సత్ఫలితాలు మరిందరిని సిరిధాన్యాల వైపు మళ్ళిస్తాయి. భూతాపం పెరిగిపోతున్న వేళ ఎండలు మండేకొద్దీ దిగుబడి పడిపోయే వరి కన్నా వేడిని తట్టు కొని దిగుబడినిచ్చే చిరుధాన్యాలకు ఓటేయడం వివేకం. ప్రపంచంలో సగం మంది పోషకాహారలోప పీడితులు గనక వారికీ ఈ ధాన్యాలే శ్రీరామరక్ష. ఈ వ్యావసాయిక జీవవైవిధ్యాన్ని కాపాడేలా కేంద్రం ‘మిల్లెట్ మిషన్’ ప్రకటించింది. కర్ణాటక, ఒరిస్సా లాంటివి అందులో దూసుకుపోతు న్నాయి. రేషన్ షాపుల్లో సిరిధాన్యాలను ఇవ్వడం మొదలు దేశంలోని 15 లక్షల స్కూళ్ళు, 14 లక్షల ప్రీస్కూల్ అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ధాన్యాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయగలిగితే భేష్. ఇలాంటి ప్రాథమిక ఆలోచనల్ని పటిష్ఠంగా అమలు చేస్తే– ఆహార భద్రతలో, పోషకా హార విలువల్లో బలమైన భారతావని సాధ్యం. చిరుధాన్య నామ సంవత్సరాలు సార్థకమయ్యేది అప్పుడే! -
జీ20 అఖిలపక్ష సమావేశానికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ 20) దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రపంచ జీడీపీలో 90 శాతం, వ్యాపారంలో 80 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల వాటా ఈ దేశాలదే. ఈ దేశాలు కలిసి పని చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించడమే ఈ సమావేశాల లక్ష్యం. -
అర్ష్‌దీప్ సింగ్ ఖలిస్తాని అంటూ పోస్టులు..వికిపీడియాకు కేంద్ర ఐటీ శాఖ నోటీసులు
-
వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్
ముంబై: పబ్జీ మొబైల్, టిక్‌టాక్, కామ్‌స్కానర్ సహా వందలాది చైనీస్ యాప్‌లను బ్లాక్ చేసిన కేంద్రం తాజాగా ప్రముఖ మీడియా ప్లేయర్ సాఫ్ట్వేర్, వీడియో స్ట్రీమింగ్ సర్వర్ వీఎల్సీ మీడియా ప్లేయర్‌ను కూడా బ్యాన్ చేసింది. ఇండియాలో వీఎల్సీ మీడియా ప్లేయర్ వెబ్సైట్, డౌన్లోడ్ లింక్‌ను కూడా బ్లాక్ చేసింది. మీడియా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే ఐటీ చట్టం కింద నిషేధించిన సందేశం కనిపిస్తోంది. అంటే ఇకపై దేశంలో ఎవరూ ఏ పని కోసం ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయలేరన్నమాట. ఇటీవల బీజీఎంఐ అనే పబ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్‌ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. తాజా నివేదికల ప్రకారం IT చట్టం, 2000 ప్రకారం వీడియోలాన్ ప్రాజెక్ట్ వీఎల్సీ మీడియా ప్లేయర్‌కు చెక్ చెప్పింది కేంద్రం. అయితే చైనా-మద్దతు గల హ్యాకింగ్ గ్రూప్ సికాడా సైబర్ దాడులకు ప్లాట్‌ఫారమ్ అయినందున VLC మీడియా ప్లేయర్ దేశంలో బ్లాక్ చేసినట్టు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలంగా సైబర్ దాడులు, హానికరమైన మాల్వేర్ లోడ్ కోసం సికాడా వీఎల్సీ మీడియా ప్లేయర్‌ని ఉపయోగిస్తోందని కొన్ని నెలల క్రితం భద్రతా నిపుణులు కనుగొన్నారు. VideoLAN ప్రాజెక్ట్ ద్వారా తయారైన వీఎల్సీ ప్లేయర్ భారతదేశంలో దాదాపు రెండు నెలల క్రితం కేంద్రం బ్లాక్ చేసింది. (Kia Seltos:కియా మరోసారి అదరగొట్టింది,సెల్టోస్ కొత్త రికార్డు) అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు కంపెనీ నుంచి,ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ గగన్‌దీప్ సప్రా అనే ట్విటర్ యూజర్లలో ఒకరు వీఎల్సీ వెబ్సైట్ స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేసారు, "ఐటి యాక్ట్, 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ప్రకారం వెబ్సైట్ బ్లాక్ చేయబడింది" అని చూపిస్తుంది. ప్యారిస్‌కు చెందిన వీడియోలాన్ సంస్థ వీఎల్సీ మీడియాని అభివృద్ధి చేసింది. (Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!) Anyone know why @NICMeity has banned VLC Downloads in India? @internetfreedom pic.twitter.com/lQubbyK0Yi — Gagandeep Sapra (@TheBigGeek) August 12, 2022 #blocked Videolan project’s website “https://t.co/rPDNPH4QeB” cannot be accessed due to an order issued by @GoI_MeitY. It is inaccessible for all the major ISPs in India including #ACT, #Airtel and V!. #WebsiteBlocking pic.twitter.com/LBKgycuTUo — sflc.in (@SFLCin) June 2, 2022 -
Nature Tricolor Photo: ప్రకృతి దిద్దిన మువ్వన్నెల జెండా
ప్రకృతి చిత్రవిచిత్రాలు చేస్తుంది. అందుకు నిదర్శనం ఈ చిత్రం. అస్తమయానికి ముందుగా సూర్యుడు పులుముకున్న సింధూరం. సముద్రపు అలల నురగల శ్వేతవర్ణం. సాగర తీరాన పరుచుకున్న పచ్చదనం. ఆకాశం, నీరు, నేల.. ప్రకృతి సమస్తం మువ్వన్నెల జెండాను ప్రతిబింబిస్తోంది కదా! ఈ చిత్రాన్ని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ప్రకృతి రూపొందించిన మన త్రివర్ణ పతాకం’అంటూ కామెంట్‌ను జత చేశారు. Our Pride, Our Tiranga! 🇮🇳 #AmritMahotsav #MomentsWithTiranga #HarGharTiranga Image Courtesy: @singhsanjeevku2 pic.twitter.com/pUdBNt8C03 — MyGovIndia (@mygovindia) July 10, 2022 -
ఆంగ్లేయులు దేశాన్ని పాలించక ముందు మన పోలీసు చరిత్ర మరోలా ఉండేది!
బ్రిటిష్ వారు 1861లో తెచ్చిన పోలీసు చట్టాన్ని ఆధారం చేసుకునే నేటికీ మనం పోలీసు వ్యవస్థను నడుపుతున్నాం. పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పోలీసుల పని తీరు మీద అప్పుడప్పుడు మార్గదర్శకాలు ఇవ్వడం మినహా పూర్తి స్థాయి సంస్కరణలను చేసే అవకాశం లేదు. నేషనల్ పోలీస్ కమిషన్ పోలీసు విధానాన్ని పరిశీలించి 1979–81 మధ్యలో ఎనిమిది నివేదికలైతే ఇచ్చింది. ఆ తర్వాత కూడా అనేక కమిషన్లు, కమిటీలు ఏర్పాటయ్యాయి. గోరే కమిటీ (1971–73), రెబీరో కమిటీ (1993), పద్మనాభయ్య కమిటీ (2000), నేషనల్ సెక్యూరిటీ మీద మంత్రుల బృందం ఇచ్చిన నివేదిక (2001), మలీమత్ కమిటీ (2001–2003) వాటిల్లో ప్రధానమైనవి. బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విమక్తి పొంది 75 ఏళ్లు అవుతున్నా దేశంలోని పోలీసు వ్యవస్థను సమూలంగా సంస్కరించుకోలేకపోయాం అన్నది నిజం. బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించక ముందు మన పోలీసు చరిత్ర మరో విధంగా ఉండేది. చాణక్యుడి అర్థశాస్త్రంలో పోలీసు నిఘా విభాగాలను వర్ణించిన తీరును గమనించినప్పుడు.. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలకు ముందే మన దగ్గర వ్యవస్థీకృత పోలీసు విధానం ఉండేదని అర్థమౌతుంది. ఆంగ్లేయుల పాలనలో భారతీయ స్వాతంత్య్ర పోరాటాన్ని, తిరుగుబాట్లను అణచి వేసేందుకే పోలీసు వ్యవస్థను వాడుకున్నారని, పోలీసుల్లో కర్కశత్వాన్ని ఉద్దేశపూర్వకంగానే పెంపొందించారని చెబుతారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సైతం పోలీసులపై ఆ ముద్ర ఇంకా మిగిలే ఉంది. దానిని పోగొట్టుకునే విధంగా రాగల 25 ఏళ్ల కాలంలో పోలీసు సంస్కరణలు తేవలసిన అవసరం అయితే ఉంది. -
CDS India: ఆచితూచి అడుగేయాలి!
ఎట్టకేలకు రథం కదిలింది. దేశ రక్షణలో కీలకమైన ‘ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ (సీడీఎస్) పదవిని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాగైతేనేం ఒక అడుగు ముందుకు వేసింది. దేశంలోని ఈ ఉన్నత సైనిక పదవిని చేపట్టేందుకు అవకాశాలను విస్తృతం చేస్తూ, సరికొత్త మార్గదర్శకాలను మంగళ వారం విడుదల చేసింది. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించిన ఆరు నెలల తర్వాతైనా కొత్త సీడీఎస్ కోసం సర్కారు శ్రద్ధ పెట్టడం హర్షణీయం. అయితే, త్రివిధ దళాలకూ, దళాధిపతులకూ మధ్య సమన్వయానికి ఉద్దేశించిన ఈ పదవికి పెట్టిన కొత్త నిబంధనలే కాస్తంత తికమక తెస్తున్నాయి. పదాతి, నౌకా, వైమానిక దళాలలో దేనికీ అధిపతిగా పదవిని చేపట్ట లేకపోయిన వారు సైతం తాజా నిబంధనలతో తమ సీనియర్లను దాటుకొని, ఆ పైన ఉండే సీడీఎస్ పగ్గాలు పట్టేందుకు వీలు చిక్కుతుంది. అదే ఇప్పుడు భిన్నాభిప్రాయాలకూ, చర్చకూ తావిస్తోంది. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి గత డిసెంబర్ 8న తమిళ నాడులో జరిగిన సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రావత్ సహా డజను మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఆ ఘటన తర్వాత నుంచి ఇన్నాళ్ళుగా మరో సీడీఎస్‌గా ఎవరినీ ప్రభుత్వం నియమించ లేదు. ఇప్పుడు కొత్త మార్గదర్శకాల ప్రకారం సర్వీసులో ఉన్న, లేదా రిటైరైన త్రివిధ దళాల ఛీఫ్‌లు, వారి వైస్ ఛీఫ్లలో ఎవరైనా సరే సీడీఎస్‌గా అర్హులే. కాకపోతే వారి వయస్సు 62 ఏళ్ళ లోపుండాలి. అలాగే, అవసరాన్ని బట్టి సీడీఎస్ పదవీ కాలాన్ని గరిష్ఠంగా 65 ఏళ్ళ వయసు వరకు పొడిగించవచ్చు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మార్పులు చేర్పులు ప్రకటించింది. అందుకు అవసరమైన రీతిలో ఆర్మీ, నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన మూడు వేర్వేరు చట్టాల కింద ఒకే రకమైన నోటిఫికేషన్లు జారీ చేసింది. త్రివిధ దళాధిపతులకు పెద్ద తలకాయగా, దళాలన్నీ సమన్వయంతో పనిచేసేలా చూడడం సీడీఎస్ బాధ్యత. సర్వసాధారణంగా త్రివిధ దళాల అధిపతులు మూడేళ్ళ వరకు, లేదంటే 62 ఏళ్ళ వయస్సు వరకే ఆ హోదాలో ఉంటారు. ఆర్మీ ఛీఫ్‌గా రిటైరైన రావత్ ఆపైన భారత తొలి సీడీఎస్‌గా ఉన్నత పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ రకంగా ఆయన ఆ పదవి చేపట్టేటప్పుడు, సర్వీసులో ఉన్న ఛీఫ్‌లు అందరి కన్నా వయసులోనూ, హోదాలోనూ పెద్ద. దాంతో, ఇబ్బంది లేకుండా పోయింది. కానీ, మారిన నిబంధనలతోనే తంటా. ఇప్పుడిక నాలుగు స్టార్లుండే త్రివిధ దళాధిపతులతో పాటు, వారి కన్నా దిగువ హోదాలోని మూడు స్టార్ల అధికారులు సైతం ఒకే ఉన్నత హోదాకు పోటీ పడతారన్న మాట. ఏ కారణం వల్లనైనా దళాధిపతి కాలేక, మూడు స్టార్ల హోదాకే పరిమిత మైనవారు సైతం ఏకంగా సీడీఎస్ పదవి చేపట్టే ఛాన్స్ ఉంది. అదే జరిగితే, త్రివిధ దళాధిపతులకు తమ దిగువ ఉద్యోగే దాదాపు బాస్. అందరూ సమానులే అనుకున్నా, ఎంతైనా సీడీఎస్ కొద్దిగా ఎక్కువ సమానం కాబట్టి, పరిస్థితి తేడాపాడాగా తయారవుతుంది. అప్పుడిక సర్వీసులోని నాలుగు స్టార్ల దళాధిపతులు ఆ నియమిత వ్యక్తికి నివేదించడం ఇబ్బందికరమే! నిజానికి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలు జాతీయ స్థాయిలో రకరకాల పేర్లతో సీడీఎస్‌ను పెట్టుకున్నాయి. పేర్లు వేరైనా, అన్నిచోట్లా విధులు దాదాపు ఒకటే. బ్రిటన్‌లో 1959లోనే ఈ నియామకం చేశారు. అయితే, ఈ సీనియర్ మోస్ట్ సైనిక హోదా మనకు కొత్త. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత భారత రక్షణ వ్యవస్థలోని లోటుపాట్ల అధ్యయనానికి ఆనాటి ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీ వేసింది. రక్షణ మంత్రికి ఏక కేంద్రక సైనిక సలహాదారుగా సీడీఎస్‌ను నియమిం చాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న ఆ సిఫార్సును మూడేళ్ళ క్రితం కేంద్రం అమలులోకి తెచ్చి, ఆర్మీ మాజీ ఛీఫ్ రావత్‌ను దేశ తొలి సీడీఎస్‌గా నియమించింది. రక్షణ శాఖలోని సైనికవ్యవహారాల విభాగాన్ని సీడీఎస్ నడుపుతారు. దశాబ్దాలుగా దేనికదిగా పని చేస్తున్న సైనిక దళాలను అనుసంధానించి, మెరుగైన సమన్వయంతో పురోగమించేలా చూస్తారు. త్రివిధ దళాలు కలసి శత్రువుపై పోరాడేలా కొత్త సైనిక కమాండ్ల ఏర్పాటు సంస్కరణలూ దీనిలో భాగమే! ఖండాంతర ప్రపంచ సవాళ్ళ సందర్భంగా అమెరికాలో సత్ఫలితాలిచ్చిన ఈ సీడీఎస్ విధానం మన సైన్యాన్ని కూడా మరింత కేంద్రీకృతంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దుతుందని రక్షణ నిపుణుల మాట. ఆ మాటకొస్తే పార్లమెంటరీ స్థాయీ సంఘమే ఒప్పుకున్న పదేళ్ళ క్రితం నాటి లోటుపాట్లతో పోలిస్తే, ఇప్పుడు మన సైనికదళాల సన్నద్ధత మెరుగైంది. సీడీఎస్ పదవీ సృష్టి సైతం కీలక మార్పే. అయితే, రావత్ మరణానంతరం కొత్త నియామకానికి ఇంత తాత్సారం చేయడం సరికాదు. ఫలితంగా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సైనిక సంస్కరణలు ముందుకు సాగలేదు. తీరా ఇప్పుడు కొత్త మార్గదర్శకాలతో సీడీఎస్ హోదాయే పలుచనయ్యే ప్రమాదం వచ్చి పడింది. అందుకే, సర్కారు అలక్ష్యం వీడి, ఆచితూచి అడుగేయాలి. త్వరితగతిన నియామకం ఎంత అవసరమో, దేశ రక్షణ, రక్షణ దళాల ప్రయోజనాలను కాపాడేలా పర్యాలోచించి, నిర్ణయించడమూ అంతే అవసరమని గ్రహించాలి. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న జాతీయ భద్రతా వ్యూహాన్ని సైతం తొందరగా తెర పైకి తేవాలి. ప్రశ్నార్థకమయ్యే సీడీఎస్ నియామకాలు జరిగితే, సైన్యాన్ని సదా సర్వసన్నద్ధంగా ఉంచే అసలు లక్ష్యం పక్కకు పోతుంది. రక్షణ దళాల మధ్య సమశ్రుతి తప్పుతుంది. మన పొరుగున చైనా, పాకిస్తాన్ లాంటి ప్రతికూల దేశాలు పొంచివున్నాయి. తస్మాత్ జాగ్రత్త! -
ఇక డ్రైవింగ్ ‘పరీక్ష’ లేదు!
సాక్షి, అమరావతి: ఇకపై లైసెన్సు కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో నిర్దేశిత శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ పొందితే చాలు.. రవాణా శాఖ కార్యాలయం డ్రైవింగ్ లైసెన్సును మంజూరు చేయనుంది. అదే సమయంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. లైసెన్సుల జారీ సులభతరం.. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి పరీక్ష పాస్ కావాలి. థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో అర్హత సాధించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చే విధానం ప్రకారం.. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్ కాపీతో పాటు అవసరమైన గుర్తింపు కార్డుల కాపీలు జతచేసి దరఖాస్తు చేస్తే రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్సు ఇస్తుంది. దీనివల్ల లైసెన్సుల కోసం నిరీక్షించే సమయం తగ్గుతుందని.. లైసెన్సుల జారీ విధానం సరళతరం, సులభతరం అవుతుందన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. నిబంధనలు కఠినతరం.. ఈ ప్రక్రియలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల పాత్ర కీలకం కానుండటంతో.. గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్‌ను మాత్రమే రవాణా శాఖ పరిగణనలోకి తీసుకోనుంది. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే.. ట్రాక్ కోసం కనీసం ఎకరా భూమి ఉండాలి. భారీ వాహనాల డ్రైవింగ్ స్కూల్‌కు అయితే కనీసం 2 ఎకరాల భూమి ఉండాలి. వాటిలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం టెస్టింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి. ► డ్రైవింగ్‌పై ప్రాథమికంగా అవగాహన కల్పించేందుకు స్టిమ్యూలేటర్ ఏర్పాటు చేయాలి. ► శిక్షకులు కనీసం ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ శిక్షణా కాలం కనీసం నాలుగు వారాల్లో 29 గంటల పాటు ఉండాలి. వాటిలో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 21 గంటల పాటు నిర్వహించాలి. ► భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కాలం ఆరు వారాల్లో కనీసం 38 గంటలు ఉండాలి. ఇందులో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 30 గంటలు నిర్వహించాలి. ► అన్ని అర్హతలు కలిగిన డ్రైవింగ్ స్కూల్‌కు ఐదేళ్ల పాటు గుర్తింపు ఇస్తారు. అనంతరం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. -
టెలీమెడిసిన్ సేవల్లో నంబర్‌వన్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: టెలీమెడిసిన్ సేవల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చడంలో, వాటి నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై ప్రశంసలు కురిపించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ వర్చువల్ విధానంలో శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజారోగ్యంపై సర్కార్ ప్రత్యేక దృష్టి ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ ఏడాది ఆఖరు నాటికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు లక్ష్యం నిర్దేశించింది. దీనికి ముందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘నాడు–నేడు’ కింద ఆరోగ్య ఉపకేంద్రాలను వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లుగా అభివృద్ధి చేసింది. అదేవిధంగా పీహెచ్‌సీల్లోనూ వసతుల కల్పన చేపట్టింది. పట్టణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేస్తూ పట్టణ ప్రాంతాల్లో 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రాష్ట్రంలో 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6,313 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు.. వంద శాతం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా రూపాంతరం చెందాయి. ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు కాకముందు వాటిలో కేవలం ప్రాథమిక వైద్యసేవలను మాత్రమే అందించేవారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మారాక పలు వ్యాధులకు ప్రాథమిక వ్యాధి నిర్ధారణతోపాటు వైద్య సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో 12 రకాల వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్సీ, యూపీహెచ్‌సీల్లో సమగ్ర మాతా–శిశు సంరక్షణ సేవలు, ప్రసూతి సేవలు, మానసిక వైద్యసేవలు, బీపీ, షుగర్, గుండె సంబంధిత, కంటి, చెవి, ముక్కు, గొంతు సంరక్షణ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ నుంచే 43.01 శాతం కన్సల్టేషన్లు కేంద్రం 2019 నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఈ–సంజీవని టెలీమెడిసిన్ సేవలను ప్రారంభించింది. ప్రారంభంలో టెలీమెడిసిన్ సేవలు అందించడం కోసం ఇంతకుముందున్న 13 జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం 13 హబ్‌లను ఏర్పాటు చేసింది. అనంతరం మరో 14 హబ్‌లతో ఈ సేవలు విస్తరించింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 27 హబ్‌లలో ప్రజలకు టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 3,30,36,214 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. వీటిలో 43.01 శాతం అంటే 1,42,11,879 మన రాష్ట్రం నుంచే ఉన్నాయి. 47 లక్షల కన్సల్టేషన్లతో కర్ణాటక రెండో స్థానంలో, 34 లక్షలతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా రోజుకు లక్ష కన్సల్టేషన్లు నమోదవుతుంటే అందులో 50 నుంచి 60 శాతం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఈ అంశంపై కేంద్రం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఆశా వర్కర్ల ద్వారా టెలీమెడిసిన్ సేవలపై అవగాహన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,145 పీహెచ్‌సీలతోపాటు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను టెలీమెడిసిన్ హబ్‌లకు అనుసంధానం చేశారు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రజలు ఇంటి నుంచే టెలీమెడిసిన్ సేవలు పొందేందుకు వీలుగా ఈ–సంజీవని (ఓపీడీ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. టెలీమెడిసిన్ సేవలను విస్తృతం చేయడంతోపాటు స్మార్ట్ ఫోన్ లేనివారు, వాడకం తెలియనివారు, వృద్ధులు, ఇతరులకు వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సంజీవని ఓపీడీ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచడం కోసం రాష్ట్రంలో 42 వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసింది. స్మార్ట్ ఫోన్లన్నింటినీ హబ్‌లకు అనుసంధానించారు. ఆశాల ద్వారా ప్రజలకు మరింతగా టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. -
స్పోర్ట్స్ కోచ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఖేలో ఇండియా కేంద్రాల్లో వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు 13 మంది కోచ్‌ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఏ, బీఎస్సీ, బీకాంతో పాటు సమాన విద్యార్హత, ఎన్ఎస్ఎన్ఐఎస్ డిప్లొమా, ఎన్ఐఎస్ సర్టిఫికెట్ కోర్సు, జాతీయ స్థాయి పతక విజేతలు, ప్రాతినిధ్యం వహించినవారు కూడా అర్హులన్నారు. నెలకు రూ.25 వేలు వేతనం ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులను విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయానికి లేదా kisce.ap@gmail. comకు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు www.sports. ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పథకంలో భాగంగా జిల్లాకు ఒక్కో క్రీడాంశం చొప్పున 13 ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేసిందన్నారు. -
Sakshi Cartoon: ..కాస్త ఓపిక పట్టు చాలు!
..కాస్త ఓపిక పట్టు చాలు! -
నా కుక్కపిల్ల లేకుండా ఉక్రెయిన్ విడిచి రాను!: భారతీయ విద్యార్థి
Please Help Indian Student Stranded With Pet Dog: యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి తన పెంపుడు కుక్క లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరించాడు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రేడియో ఎలక్ట్రానిక్స్‌లో చదువుతున్న రిషబ్ కౌశిక్ విమానంలో తనతోపాటు కుక్కపిల్ల కూడా వచ్చేలా అన్ని అర్హత పత్రాలను సంపాదించేందుకు ప్రయత్నించానని చెప్పాడు. మరిన్ని పత్రాల కోసం అధికారులను సంప్రదిస్తే వాళ్లు తనను కొట్టారని చెబుతున్నాడు. పైగా విమాన టికెట్టు అడుగుతున్నారని అన్నాడు. అయినా ఉక్రెయిన్ గగనతలం మూసివేసినపుడు తాను విమాన టిక్కెట్ ఎలా పొందగలను అని ప్రశ్నిస్తున్నాడు. కౌశిక్ ఢిల్లీలోని భారత ప్రభుత్వ యానిమల్ క్వారంటైన్ సర్టిఫికేషన్ సర్వీస్ (ఏక్యూసీఎస్)ని, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించానని కానీ ఎటువంటి ప్రయోజనం పొందలేకపోయానని చెప్పాడు. ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో ఒకరికి కాల్ చేస్తే వారు తనని దుర్భాషలాడారని చెబుతున్నాడు. గత ఫిబ్రవరిలో ఖార్కివ్‌లో తనకు 'మాలిబు' అనే రెస్క్యూ కుక్కపిల్ల లభించిందని చెప్పాడు. కౌశిక్ రాజధాని కైవ్‌లోని ఒక బంకర్లో దాక్కున్నానని బాంబుల మోత, తుపాకుల మోతతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నానని అన్నాడు. "మీకు వీలైతే, దయచేసి మాకు సహాయం చేయండి. కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా మాకు సహాయం చేయడం లేదు. నాకు ఎవరి నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు " అని అతను భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. (చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడి నాటి డ్యాన్సింగ్ వీడియో!) -
ఆపరేషన్ సుకూన్, రాహత్ బాటలో మరో సాహసం! వాట్ నెక్ట్స్ ?
యుద్ధ సమయాల్లో విదేశాల్లో చిక్కుకున్న మన వాళ్లను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలతో కలిసి ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించింది. నిమిషనిమిషానికి మారిపోయే పరిస్థితుల నడుమ లిప్త కాలంలో నిర్ణయాలు తీసుకుంటూ ఎందరి ప్రాణాలనో కాపాడింది. మరోసారి అలాంటి అవసరం ఏర్పడింది... 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం సమయంలో ఎయిర్‌లిఫ్ట్ చేయగా ఆ తర్వాత కాలంలో అనేక ఆపరేషన్లు చేపట్టింది. వీటిలో లెబనాన్ కోసం ఆపరేషన్ సుకూన్ యెమెన్‌లో చిక్కుకున్న వారి కోసం ఆపరేషన్ రాహత్లు ప్రత్యేకంగా నిలిచాయి. వీటిలో ఆపరేషన్ రాహత్‌లో త్రివిధ దళాలు పాల్గొన్నాయి. చాన్నాళ్ల తర్వాత ఉక్రయిన్ యుద్ధంతో మరోసారి విదేశాల్లో ఉన్న భారతీయులను కాపాడే అవసరం ఏర్పడింది. యెమెన్‌లో 5 వేల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థానిక కారణాలతో యెమెన్ దేశంపై 2015 మార్చి 27న సౌదీ అరేబియా దాడికి దిగింది. యెమెన్‌లో ఉన్న షైటే హోతీ రెబల్స్, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌ల మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఈ దాడి మొదలు కాకముందే యెమెన్ ప్రెసిడెంట్‌ని రెబల్స్ కూలదోశారు. దీంతో ఆ దేశంలో పౌర ప్రభుత్వం నామమాత్రం అయ్యింది. ఇదే సమయంలో అక్కడ 5 వేల మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు. నో ఫ్లైజోన్ యెమెన్ నో ఫ్లైజోన్‌గా ఉండటంతో అక్కడికి నేరుగా విమానాలు పంపే అవకాశం లేకపోయింది. దీంతో యెమెన్‌లో ఉన్న భారతీయులు ఆ దేశానికి చెందిన తీరప్రాంత నగరం ఎడెన్‌తో పాటు దానికి సమీపంలో ఉన్న ఎయిర్‌బేస్ నగరం సనాకు చేరుకోవాలని సూచించింది. పక్క దేశం నుంచి యెమెన్‌కి సమీపంలో ఉన్న ఆఫ్రికా ఖండ దేశం జిబోటీలో భారత రాయబార కార్యాలయం వెంటనే అప్రమత్తమైంది. యెమెన్ దేశంలో ఉన్న ఇండియన్లు రక్షించేందుకు సాయం చేయాల్సిందిగా జిబోటీ ప్రభుత్వానికి కోరింది. అక్కడ పర్మిషన్ రావడంతో ఇండియన్ ఆర్మీకి చెందిన సీ 17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు జిబోటికి చేరుకున్నాయి. నేవీ ఎంట్రీ యెమెన్‌లోని అడెన్ నగరం నుంచి జిబోటీ వరకు భారతీయులను తరలించడం కష్టంగా మారింది. వీటి మధ్యన అరేబియా సముద్రం ఉంది. దీంతో అడెన్ నుంచి జిబోటీ వరకు భారతీయులను తరలించేందుకు ఇండియన్ నేవికి చెందిన సుమిత్ర , ఎంబీ కరవత్తి, ఎంబీ కోరల్స్ నౌకలను పంపాలని నిర్ణయించారు. వీటిని ముంబై, లక్షద్వీప్ నుంచి యెమెన్‌కు వెళ్లాలంటూ ఆదేశించారు. వీటికి రక్షణ కల్పించేందుకు ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ తార్కాష్లు తోడుగా వచ్చాయి. మొత్తంగా నాలుగు రోజుల పాటు 2,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ నౌకలు ఎడెన్ సమీపంలోకి చేరుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్ అడ్వెంచర్ మరోవైపు సనా ఎయిర్‌బేస్‌లో కూడా కొందరు ఇండియన్లు ఉన్నారు. దీంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎంతో సాహసం చేసి.. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య రెబల్స్ ఆధీనంలో ఉన్న సనా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడున్న వారిని విమానంలో ఎక్కించుకుంది. అంతే వేగంగా వారిని సురక్షితంగా ఎడెన్‌కు చేర్చింది. దీంతో అక్కడి నుంచి సుమారు ఐదువేల మంది నౌకల ద్వారా జిబోటీ చేరుకున్నారు. వీరి వసతి కోసం జిబోటీలో ఉన్న అన్ని హోటళ్లు, రిసార్టులు బుక్ చేసింది భారత ప్రభుత్వం. అక్కడి నుంచి దశల వారీగా విమానాల ద్వారా ఇండియాకు సురక్షితంగా చేరుకున్నారు. ఒక్క ఇండియన్లనే కాదు ఈ ఆపరేషన్‌లో 4,640 మంది ఇండియన్లను రక్షించారు. అంతేకాదు భారత స్థాయిలో ఏర్పాటు చేసుకోలేని ఇతర దేశాలకు చెందిన పౌరులను కూడా మన త్రివిధ దళాలు కాపాడాయి. ఇలా 41 దేశాలకు చెందిన 960 మందిని కాపాడారు. ఇందులో బంగ్లా, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, ఇండోనేషియా, వంటి ఆసియా ఖండ దేశాలతో పాటు రష్యా, స్వీడన్, టర్కీ, ఇటలీ వంటి యూరప్ దేశాలు కెన్యా, ఉగాండ వంటి ఆఫ్రికన్ పౌరులు కూడా ఉన్నారు. అమెరికన్ పౌరులు కూడా ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు దక్కించుకున్నారు. ఉక్రెయిన్‌లో వేల మంది ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కూడా యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌లో 22 వేల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. ఇందులో చాలా మంది అక్కడ ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన విద్యార్థులు ఉన్నారు. ఉద్రికత్లు మొదలుకాగానే ఇండియా రావాలంటూ సూచించారు. చివరి నిమిషంలో విమానటిక్కెట్టు ధరలు పెరగడం, సరిపడ విమానాలు లేక చాలా మంది చిక్కుకుపోయారు. వీరి కోసం ఎయిరిండియా ఫ్లైట్లను కూడా ప్రభుత్వం పంపింది. ఫస్ట్ ఫేస్‌లో మూడు ఫ్లైట్లు అక్కడి నుంచి వచ్చిన తర్వాత.. ఉక్రయిన్‌లో నో ఫ్లై జోన్ ప్రకటించారు. దీంతో ఎయిర్ లిఫ్ట్‌కి అవకాశం లేకుండా పోయింది. రెడీగా ఉండండి ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కనీసం 15 వేల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. నో ఫ్లై జోన్‌గా ప్రకటించడంతో ప్రత్యామ్నయ ఏర్పాటు చేస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఏర్పాటు పూర్తి కాగానే నేరుగా, సోషల్ మీడియా ద్వారా సమాచారం చేరవేస్తామని భరోసా ఇచ్చింది. ఇందుకు తగ్గట్టుగా పాస్‌పోర్ట్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల వైపుకు రావాలంటూ సూచించింది. మరో ఆపరేషన్ ? కేంద్ర విదేశాంగ చేసిన తాజా సూచనతో మరోసారి ఆపరేషన్ రాహాత్, సుకున తరహాలో నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల సాయంతో తరలింపు చర్యలు చేపడుతుందా అనే చర్చ నడుస్తోంది. నౌక మార్గం ద్వారా తరలింపు చాలా వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారంగా ఉంది. ప్రపంచాన్ని చుట్టి సముద్ర మార్గంలో ఇండియా నుంచి ఉక్రెయిన్ రేవు పట్టణమైన ఒడిసాకి చేరుకోవాలంటే ఆఫ్రికా ఖండాన్ని పూర్తిగా చుట్టేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గిబ్రాల్టర్ జలసంధి గుండా యూరప్ సమీపంలోకి చేరుకుని మధ్యదర సముద్రంలోకి వెళ్లాలి. ఆ తర్వాత టర్కీ ఇస్తాంబుల్ మీదుగా నల్లసముద్రంలోకి ప్రవేశిస్తే తప్ప ఒడేసా చేరుకోలేము. ఈ నౌకా ప్రయాణానికే నెల రోజుల సమయం పట్టవచ్చు. పైగా దారి మధ్యలో దోపిడి దొంగల భయం.. అనేక దేశాలతో దౌత్యపరమైన చర్చలు చేపట్టాల్సి వస్తుంది. ఈ విధానంలో అనేక చిక్కులు ఉన్నాయి. యూరప్ దేశాల హెల్ప్‌తో ఇక ఉక్రెయిన్ ప్రస్తుతం యుద్ధ తీవ్రత తక్కువగా ఉందని భావిస్తున్న పశ్చిమ దిక్కున లెవివ్, లట్స్కే, ఉజోరాడ్, ఇజ్మాయిల్, చెర్నివిస్టీ వంటి నగరాలు ఉన్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నాయి. ఈ ఎయిర్‌పోర్టుల వరకు చేరుకున్న ఇండియన్లను.. అప్పటి పరిస్థితులను బట్టి వాయు మార్గంలో ముందుగా యూరప్‌లో ఏదైనా సిటీకి తరలించి అక్కడి నుంచి ఇండియాకు తీసుకురావచ్చు. ఇంకా నో ఫ్లై జోన్‌గా ఉంటే రోడ్డు మార్గం ద్వారా ఉక్రయిన్ సరిహద్దులో ఉన్న హంగేరీ, పోలాండ్, జర్మనీ తదితర దేశాలకు తీసుకువచ్చి అక్కడి నుంచి ఎయిర్‌లిఫ్ట్ చేపట్టే అవకాశం ఉంది. సవాల్ ఉక్రెయిన్ యూరప్, ఆసియా దేశాలకు ఇంచుమించు ల్యాండ్ లాక్డ్ స్టేట్‌గా ఉంది. సముద్ర మార్గం ఉన్నా అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు చేపట్టిన ఆపరేషన్లతో పోల్చితే ఉక్రయిన్ తరలింపు భారత ప్రభుత్వాని పెద్ద సవాల్‌గానే చెప్పుకోవచ్చు. త్రివిధ దళాలను ఉపయోగించడంతో పాటు అనేక దేశాలతో సమన్వయం చేయాల్సి ఉంది. ఈ ఆపరేషన్‌లో ప్రతీ పని కత్తి మీద సాము వంటిదే. తమ వారి కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం గత అనుభవాల దృష్ట్యా కలుగుతోంది. - తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి వెబ్ ప్రత్యేకం -
సుకన్య సమృద్ధి యోజనపై తపాలా శాఖ శ్రద్ధ
సాక్షి, అమరావతి: బాలికలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనపై రాష్ట్ర తపాలా శాఖ ప్రత్యేక ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టింది. బాలికా సాధికారత వారోత్సవాల పేరిట ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీ వరకు అన్ని తపాలా శాఖల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ అభినవ్ వాలియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్లలోపు వయసు గల బాలికల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చని, ఒక కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు బాలికల పేరిట ఖాతాలు నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఈ పథకం కింద గరిష్టంగా 7.6 శాతం వడ్డీ లభిస్తుందని, ఈ పథకంలో పెట్టే పెట్టుబడి మొత్తంపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. బాలికలకు 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ఉన్నత విద్య అవసరాల కోసం 50 శాతం, 21 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం డబ్బును వెనక్కి తీసుకోవచ్చని వివరించారు. ఏడాదిలో కనీసం రూ.250 నుంచి రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చన్నారు. మహిళల భవిష్యత్‌కు బలమైన ఆర్థిక పునాది కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
రాష్ట్రాలు ముందుకొచ్చినా.. కేంద్రం తగ్గేదేలే!
టెస్లా విషయంలో సోషల్‌మీడియా ద్వారా భారత ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్న ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ప్రయత్నాలు ఫలించడం లేదు. పైగా కేంద్రంతో సంబంధం లేకుండా తమ రాష్ట్రాలకు పెట్టుబడులకు రావాలంటూ టెస్లాకు పలు విజ్క్షప్తులు వెల్లువెత్తడం చూస్తున్నాం. అయినప్పటికీ ఈ విషయంలో కేంద్రం మాత్రం తగ్గట్లేదు. భారత్‌లో ఎంట్రీ ఇవ్వాలంటే.. ఈవీలపై దిగుమతి సుంకాలను తగ్గించాలన్నది టెస్లా డిమాండ్. కానీ, కేంద్రం మాత్రం అందుకు ససేమీరా అంటోంది. అంతేకాదు బడ్జెట్లో దిగుమతి సుంకాలపై ఏమైనా సడలింపులు ఉంటాయా? అని ఆశలు పెట్టుకుంది టెస్లా. అయితే అదీ నెరవేరలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్ వివేక్ జోహ్రీ. ‘ఇప్పటికే దేశీయంగా ఈవీల ఉత్పత్తి నడుస్తోంది. ఇప్పుడున్న టారిఫ్ వ్యవస్థతోనే పెట్టుబడులకు కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. విదేశీ బ్రాండ్స్ సైతం విక్రయాలు చేపడుతున్నాయి. అలాంటప్పుడు వాళ్లకు మాత్రమే సమస్య ఉందా?’’ అంటూ పరోక్షంగా టెస్లాను నిలదీశారు వివేక్. కావాలనుకుంటే పాక్షికంగా తయారు చేసిన వాహనాలను దిగుమతి చేసి.. దేశీయంగా అసెంబ్లింగ్ చేసి అమ్ముకోవడచ్చని, తద్వారా దిగుమతి సుంకం 15-30 శాతం మధ్య ఉంటుందనే విషయాన్ని ఆయన మరోసారి ఉధ్ఘాటించారు. దిగుమతి సుంకం సంగతి పక్కనపెడితే.. దేశీయంగా తయారీ యూనిట్, కంపెనీ భవిష్యత్ పెట్టుబడులపై ప్రణాళిక ఇవ్వనందునే.. టెస్లాకు మార్గం సుగమం కావట్లేదన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతి సుంకాన్ని పెనుభారంగా భావిస్తున్న టెస్లా.. మూడేళ్లుగా కొనసాగిస్తున్న ప్రయత్నాలపై ముందుకు వెళ్తుందా? లేదంటే ఇక్కడితోనే ఆగిపోతుందా? ఎలన్ మస్క్ తగ్గుతాడా? అనే దానిపై మరికొన్ని రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక భారత్‌లో విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న ఈవీలపై.. వాటి ధర 40వేల డాలర్లులోపు ఉంటే 60 శాతం, 40వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారు. సో.. ఈ లెక్కన టెస్లా గనుక విక్రయాలు మొదలుపెడితే(100 శాతం దిగుమతి సుంకంతో..) ధరలు భారీగా పెంచాల్సి ఉంటుంది. అప్పుడు బయ్యర్స్ ముందుకు రావడం కష్టమై.. భారత్ మార్కెట్ అట్టర్‌ఫ్లాప్ అవుతుంది. అందుకే ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాన్ని తగ్గించాలని టెస్లా కోరుతోందని టెస్లా కథనం. చదవండి: టెస్లా కార్లలో సమస్య! 8లక్షల కార్లు వెనక్కి -
రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని కేంద్రం పునరుద్ఘాటించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఎంపీలు విభజనకు సంబంధించిన అంశాలపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్తు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం బకాయి బిల్లుల డబ్బులను ఇంతవరకు చెల్లించకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. వడ్డీతో కలిపి సుమారు రూ.6 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సి ఉందన్నారు. కేటాయింపుల్లో తెలంగాణకు ఆ మేరకు తగ్గించి ఏపీకి ఇవ్వాలని ఎంపీ టీజీ వెంకటేశ్ కేంద్రాన్ని కోరారు. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి, సాగునీరు నిమిత్తం తెలంగాణ ఎక్కువ నీటిని వాడుకుంటోందని, తదుపరి కేటాయింపుల్లో ఆ మేరకు వాటా తగ్గించాలన్నారు. తాజా పరిస్థితులను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నిత్యానందరాయ్ తెలిపారు. నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌గా కేంద్రం పలుచోట్ల ప్రస్తావిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే హక్కు ఎవరిదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ కేంద్రానికి తెలిపిందని నిత్యానందరాయ్ చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును విరమించుకున్నట్లు తెలిíసిందన్నారు. ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని చెప్పారు. అయితే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంపై విభజన దుష్ప్రభావం తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన వేగవంతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. విభజన చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థలు, జాబితాలో లేని సంస్థల ఆస్తుల విలువ రూ.1.42 లక్షల కోట్లు అని తెలిపారు. చట్ట ప్రకారం ఆస్తుల విభజన ఇప్పటివరకు జరగకపోవడం వల్ల ఆ దుష్ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడుతోందన్నారు. పరస్పర అంగీకారంతోనే పరిష్కారం.. ఆస్తుల విభజనకు కేంద్రం నియమించిన కమిటీ 90 ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని సిఫార్సు చేసిందన్నారు. -
ఏపీ ప్రయోజనాలు విస్మరించిన కేంద్రం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను విస్మరించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర బడ్జెట్లో విస్మరించడం తీవ్ర నిరాశపరిచిందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల కోసం బడ్జెట్లో కనీసం ప్రస్తావించకపోవడం పట్ల ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్నారు. కానీ, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకపోవడం సమంజసం కాదని అన్నారు. కరోనా పరిస్థితులు, పరిమిత వనరులు, రుణాలపై ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి భారీగా నిధుల కేటాయింపు, రుణ సేకరణకు పరిమితులు పెంచి ఉంటే బాగుండేదని తెలిపారు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహద పడేదని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఎరువులు, ఆహార సబ్సిడీ తదితర వాటిలో రాష్ట్రాలకు కేంద్రం కోత విధించిందన్నారు. జలజీవన్ మిషన్, జాతీయ విద్యా మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ తదితర ప్రాజెక్టులకు నిధులు పెంచినప్పటికీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అవి ఏమాత్రం చాలవన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు మరిన్ని నిధుల అవసరం ఉందన్నారు. జాతీయ రహదారులకు నిధులు రెండింతలు చేయడం, రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసేందుకు పెట్టుబడి నిధులను రూ.లక్ష కోట్లకు పెంచడం హర్షణీయమన్నారు. రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్–మౌలిక సదుపాయాలు అనే ఏడు రంగాలను చోదక శక్తులు (గ్రోత్ ఇంజన్స్)గా చేసుకొని జాతీయ మాస్టర్ ప్లాన్ రూపొందించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కొరతను అధిగమించేలా తగినన్ని నిధులు కేటాయిస్తేæ జాతి నిర్మాణంలో రాష్ట్రాలు మరింత సమర్ధవంతమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు. అత్యవసర పరపతి హామీ పథకాన్ని 2023 మార్చి వరకు పొడిగించడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సహాయం కోసం పరపతి మొత్తాన్ని పెంచడం ఆర్థిక వృద్ధికి తోడ్పాటునిస్తుందన్నారు. రక్షణ, రక్షణ పరిశోధనకు అవసరమైన వాటిని దేశీయంగా సమకూర్చుకోవాలని నిర్ణయించడం ముదావహమని అన్నారు. రక్షణ రంగానికి గత బడ్జెట్లో కేటాయింపులు రూ. 13.89 లక్షల కోట్ల నుంచి రూ.15.23 లక్షల కోట్లకు పెంచడం, రైల్వేలకు కేటాయింపులు రూ. 2.04 లక్షల కోట్ల నుంచి 2.39 లక్షల కోట్లకు పెంచడం సానుకూల పరిణామమని చెప్పారు. కానీ వడ్డీ చెల్లింపుల కోసం కేటాయింపులు రూ. 8.14 లక్షల కోట్ల నుంచి రూ. 9.41 లక్షల కోట్లకు పెరగడం ఆందోళన కల్గిస్తోందని అన్నారు. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడంతో ఈ ఏడాది స్థూల పన్ను రాబడి రూ. 17.65 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 2020–21లో రూ. 197.46 లక్షల కోట్లుగా ఉన్న జీడీపీ 2021–22లో రూ. 232.18 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. జీడీపీలో ద్రవ్య లోటు 2020–21లో 9.21 శాతం ఉండగా, 2021–22లో 6.85 శాతానికి తగ్గిందని తెలిపారు. రెవెన్యూ లోటు 2020–21లో జీడీపీలో 7.34 శాతం ఉండగా, 2021–22లో 4.,69 శాతానికి తగ్గడం ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. -
విశిష్ట సేవలకు..రాష్ట్రపతి పోలీస్ పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి అమరావతి/నెట్వర్క్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విశిష్ట, ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు కేంద్రప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీటిలో ఏపీకి ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం, పలు రాష్ట్రపతి పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం లభించింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారికి కూడా పలు పతకాలు లభించాయి. పోలీసు ప్రతిభా పతకాలు 1. ఎస్.వి.రాజశేఖర్‌బాబు, డీఐజీ (లా అండ్ ఆర్డర్) 2. ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ తూర్పు గోదావరి జిల్లా 3. శ్రీరాంబాబు వాక, డీఎస్పీ, సీఐడీ, నెల్లూరు 4. విజయపాల్ కైలే, ఏసీపీ, ఈస్ట్ జోన్, విజయవాడ 5. విజయ్‌కుమార్ బుల, అసిస్టెంట్ కమాండెంట్, గ్రేహౌండ్స్, విశాఖపట్టణం 6. సుబ్రహ్మణ్యం కొలగాని, అదనపు డీసీపీ, విశాఖపట్టణం 7. శ్రీనివాసరావు చుండూరు, డీఎస్పీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్, గుంటూరు 8. వీరరాఘవరెడ్డి, డీఎస్పీ, అనంతపురం 9. రవీందర్‌రెడ్డి ఎర్రమోరుసు, డీఎస్పీ, కర్నూలు 10. కృష్ణారావు గొల్ల, ఎస్ఐ, సీసీఎస్, విజయవాడ 11. సత్తారు సింహాచలం, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ, కాకినాడ 12. నరేంద్రకుమార్ తుమాటి, ఏఎస్ఐ, గుంటూరు అర్బన్ 13. పేరూరు భాస్కర్, ఏఎస్ఐ, కడప 14. నాగశ్రీనివాస్, ఏఎస్ఐ, కొవ్వూరు రూరల్ 15. వీర ఆంజనేయులు సింగంశెట్టి, ఏఎస్ఐ, ఏసీబీ, విజయవాడ రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం భావనా సక్సేనా, రెసిడెంట్ కమిషనర్, ఏపీ భవన్, న్యూఢిల్లీ కేంద్ర జీఎస్టీ విభాగంలో.. 1. డబ్లు్య.డి.చంద్రశేఖర్, అదనపు సహాయ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ కార్యాలయం, విశాఖపట్నం 2. కర్రి వెంకటమోహన్, అదనపు సహాయ డైరెక్టర్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సీబీఐలో.. 1. సుబ్రహ్మణ్యం దేవేంద్రన్, అదనపు న్యాయసలహాదారు 2. కె.వి.జగన్నాథరెడ్డి, హెడ్ కానిస్టేబుల్, ఏసీబీ రైల్వే పోలీసుల్లో.. మస్తాన్‌వలి షేక్, ఏఎస్ఐ, ఆర్పీఎఫ్, తాడేపల్లి జైళ్లశాఖలో 1. అయినపర్తి సత్యనారాయణ, హెడ్ వార్డర్, ఆంధ్రప్రదేశ్ 2. పోచ వరుణారెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ 3. పెదపూడి శ్రీరామచంద్రరావు, డిప్యూటీ సూపరింటెండెంట్, విశాఖపట్నం కేంద్రకారాగారం 4. మహ్మద్ షఫీ ఉర్ రెహమాన్, డిప్యూటీ సూపరింటెండెంట్ 5. సముడు చంద్రమోహన్, హెడ్ వార్డర్ 6. హంసపాల్, సూపరింటెండెంట్, కృష్ణాజిల్లా జైలు జీవన్ రక్షాపథక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్–2021 1. జి.సంజయ్‌కుమార్ 2. టి.వెంకటసుబ్బయ్య 3. నిర్జోగి గణేశ్‌కుమార్ -
శెభాష్ దర్శనం మొగిలయ్య.. కిన్నెర కళాకారుడికి 'పద్మశ్రీ'
సాక్షి, హైదరాబాద్: 2022 సంవత్సరానికిగాను భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఎప్పటిలానే వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను కొంతమందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని పద్మ అవార్డులు వరించాయి. అందులో మొగిలయ్య ఒకరు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం.. తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డ్‌ని ప్రకటించింది. మొగిలయ్య 12 మెట్ల కిన్నెర వాయిస్తూ అంతరించిపోతున్న కళను బ్రతికిస్తూ.. కథలు చెప్పుకుంటూ తన జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రంలో మొగిలయ్య టైటిల్ సాంగ్ మొదట్లో కొంత బాగాన్ని పాడిన సంగతి తెలిసిందే. ఆ పాటతో ఆయన మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యారు. -
బీటింగ్ రిట్రీట్‌లో గాంధీకి ఇష్టమైన పాట తొలగింపు.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఈ నెల 29న నిర్వహించే బీటింగ్ రిట్రీట్‌లో ఈసారి గాంధీజీకి ఇష్టమైన ‘అబిడ్ విత్ మీ’ పాటని తొలగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ ఏడాది దేశీ ట్యూన్లను వాయిస్తే బాగుంటుందని సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ' ఈ పాట స్థానంలో ప్రముఖ దేశభక్తి గీతం ‘ఏ మేరే వతన్ కే లోగో’ను వాయించనున్నారు. 1962 ఇండో–చైనా యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ కవి ప్రదీప్ ఈ గీతాన్ని రాశారు. దేశ భద్రత, సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ ఈ గీతాన్ని ఆలపిస్తారు. యుద్ధాల్లో సాయం కాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కుతగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్ రిట్రీట్ను నిర్వహిస్తారు. (చదవండి: పొలిటికల్ ప్లేయర్: ప్రత్యర్థులతో ఫుట్‌బాల్ ఆడేయగలరు) 2020లోనే తొలగించాలనుకున్నా.. ‘అబిడ్ విత్ మీ’ని 1847లో స్కాటిష్ ఆంగ్లికన్ కవి హెన్రీ ఫాన్రిస్ లైట్ రాశారు. 1950 నుంచి బీటింగ్ రిట్రీట్ వేడుకలో దీన్ని వాయిస్తున్నారు. తాజాగా దీన్ని విరమిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. 2020లోనూ అబిడ్ విత్ మీ పాటను తొలగిం చాలని అనుకున్నా విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. తాజాగా అబిడ్ విత్ మీని బీటింగ్ రిట్రీట్ వేడుక నుంచి తొలగించడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వారసత్వాన్ని తుడిచేసే పనిలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని మండిపడింది. వలస పాలనను గుర్తు చేసే పాట కన్నా దేశీయులకు బాగా తెలిసిన పాటను చేర్చడం మేలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏ మేరే వతన్ లోగోతో పాటు 26 పాటనలు భారతీయ ఆర్మీ రిపబ్లిక్ డే పెరేడ్లో వాయించనుంది. (చదవండి: తన పేరు మార్పుపై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు) -
విద్యుత్ సంస్కరణల్లో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో నిర్దిష్ట సంస్కరణలను చేపట్టి, వాటిని కొనసాగించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందంటూ కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. వార్షిక ఆదాయ, వ్యయ నివేదికలను సకాలంలో ప్రచురించడం, టారిఫ్ పిటిషన్‌ను దాఖలు చేయడం, టారిఫ్ ఆర్డర్ల జారీ, యూనిట్ వారీగా సబ్సిడీ అకౌంటింగ్, ఇంధన ఖాతాల ప్రచురణ, కొత్త వినూత్న సాంకేతికతలను అనుసరించడం వంటి సంస్కరణలను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని కొనియాడింది. విద్యుత్‌రంగ కార్యకలాపాలను మరింత పటిష్టంగా, సమర్థంగా, స్థిరంగా మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వినియోగదారులందరికీ 24 గంటలూ నాణ్యమైన, నమ్మదగిన, చౌకవిద్యుత్‌ను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు కేంద్రానికి బాగా నచ్చాయి. ప్రగతిశీల రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని కేంద్రం తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 20 రాష్ట్రాలు 2020లో విద్యుత్‌రంగ సంస్కరణల అమలుకు, తద్వారా లబ్ధిపొందేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో నిర్దిష్ట సంస్కరణలను చేపట్టి, కొనసాగించాలనే షరతుపై అదనపు రుణాలు తీసుకునేందుకు ఆర్థికశాఖ గత ఏడాది జూన్‌లో ‘సంస్కరణ ఆధారిత, ఫలితం ఆధారిత పంపిణీరంగ పథకం’ ప్రారంభించింది. పథకం అమలుకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)ని నోడల్ ఏజెన్సీగా నియమించింది. గతేడాది 24 రాష్ట్రాలు ఈ పథకం ద్వారా రూ.13 వేల కోట్ల అదనపు రుణ పరిమితిని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ సంవత్సరం ఈ పరిమితిని రూ.80 వేల కోట్లకు పెంచింది. అదనపు రుణ పరిమితి సంబంధిత రాష్ట్ర స్థూల, రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో 0.5 శాతంగా కేంద్రం నిర్ణయించింది. -
మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించే దిశగా నిర్మాణాత్మక వైఖరి తీసుకున్నాం
న్యూఢిల్లీ: మారిటల్ రేప్‌ను క్రిమినల్ నేరంగా పరిగణించే దిశగా నిర్మాణాత్మకమైన వైఖరిని తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. క్రిమినల్ చట్టాలకు సమగ్రమైన సవరణలు చేయడానికి.. రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రధాన న్యాయమూర్తి, ఎంపీలు, ఇతరుల అభిప్రాయాలను కోరామని వెల్లడించింది. భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతగా కోరిక తీర్చుకుంటే దాన్ని మారిటల్ రేప్‌గా పిలుస్తారు. దంపతులైనా, సహజీవనం చేస్తున్నా.. మహిళ సమ్మతి లేకుండా, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా సంభోగం చేస్తే... పాశ్చాత్య దేశాల్లో నేరంగా పరిగణిస్తారు. రేప్‌గానే చూసి... సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. అయితే భారత సమాజంలో భిన్న మతాలు, సంస్కృతులు, ఆచారాలు, నిరక్షరాస్యత తదితరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాలు మారిటల్ రేప్‌ను నేరంగా చేయడం సాధ్యం కాదని కొన్నేళ్లుగా న్యాయస్థానాలకు చెబుతున్నాయి. మహిళల నుంచి గట్టిగా డిమాండ్లు వచ్చినపుడు కూడా ఇదే సమాధానాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చాయి. మారిటల్ రేప్‌ను నేరంగా ప్రకటించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ రాజీవ్ షక్దర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులు గురువారం విచారణకు రాగా... సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తాజా వైఖరి గురించి తన ముందు ప్రస్తావించారని, అయితే ఇది బెంచ్‌లోని తోటి సభ్యుడు జస్టిస్ సి.హరి శంకర్, ఈ కేసులోని ఇతర పక్షాల గైర్హాజరులో జరిగిందని జస్టిస్ రాజీవ్ షక్దర్ వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాది మోనికా అరోరా స్పందిస్తూ.. ‘క్రిమినల్ లాలో సమగ్ర మార్పులు చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో ఐపీసీలోని సెక్షన్ 375 (రేప్) కూడా ఉంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టుల సీజేలు, ఉభయసభల ఎంపీలు, ఇతరుల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించాం’ అని ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. చట్టంలో సమూల మార్పులంటే సమయం పడుతుందని, మారిటల్ రేప్ అంశాన్ని ప్రత్యేకంగా ఏమైనా పరిశీలిస్తున్నారేమో చెప్పాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రేప్ కేసులకు సంబంధించిన సెక్షన్ 375కి సంబంధించి మీరేమైనా సూచనలు చేస్తే మేము పరిగణనలోకి తీసుకొని ఆదేశాలిస్తామని తెలిపింది. పిటిషనర్లు కోరుతున్నారని మారిటల్ రేప్‌కు ప్రస్తుతమున్న మినహాయింపులను కొట్టివేయలేమని ఇదివరకే దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో హోంశాఖ తెలిపింది. సహజ న్యాయసూత్రాల ప్రకారం... భాగస్వామ్య పక్షాలందరి వాదనలు వినడం అవసరమని పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖకు తమ సలహాలు, సూచనలు చేసే స్వేచ్ఛ పిటిషన్‌దారులకు ఉందని పేర్కొంది. కొన్ని పరిస్థితుల్లో అది రేప్ కాదనడం సమస్యేనని ధర్మాసనం గతంలో మౌఖికంగా అభిప్రాయపడింది. ‘సెక్స్ వర్కర్ సమ్మతి లేకుండా బలవంతం చేస్తే (ఆమె ఏ దశలో నిరాకరించినా) అది రేప్ కిందకే వస్తుందని, ఎలాంటి మినహాయింపులుండవని చట్టం చెబుతోంది. మరి అర్ధాంగికి ఎందుకు నిరాకరించే హక్కు ఉండకూడదు? ఆమెను తక్కువగా చూడటం సబబేనా? అని జస్టిస్ షక్దర్ ప్రశ్నించారు. ఈ అంశంలో కోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీగా) నియమితులైన సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు.. భార్యాభర్తలు ఇద్దరూ సమానమేనని, అలాంటపుడు భర్త కోరిక.. భార్య నిరాకరణ కంటే ఎందుకు అధికమని ప్రశ్నించారు. మారిటల్ రేప్ నుంచి భర్తలకు మినహాయింపునివ్వడం నిర్హేతుకమని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది. -
రూ.12 వేల కోట్లతో ‘అమృత్’ ప్రతిపాదనలు!
సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లో తాగునీరు, భూగర్భ మురుగునీటి పారుదల వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకం రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మొదటి దశలో రూ.3,700 కోట్లతో 32 పట్టణాల్లో చేపట్టిన పనులు చివరి దశకు చేరాయి. రాష్ట్రంలో రెండోదశ అమలుకు ప్రతిపాదనలు పంపాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కోరింది. దీంతో రెండో దశకు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం రూ.12 వేల కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అమృత్ పథకంలో పనులకు నిధులను కేంద్ర ప్రభుత్వం ఆయా పట్టణాల జనాభాను బట్టి మంజూరు చేస్తుంది. పది లక్షల జనాభా దాటిన నగరాలకు ప్రతిపాదన వ్యయంలో 25 శాతం, లక్ష మందికి పైగా జనాభా ఉన్న పట్టణాలకు సుమారు 33 శాతం, లక్షలోపు జనాభా గల పట్టణాలకు 50 శాతం నిధులను అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
రాష్ట్రంలో ఇక బొగ్గు తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో అత్యధికంగా బొగ్గు నిల్వలున్న చింతలపూడి సెక్టార్–1, కృష్ణా జిల్లాలోని సోమవరం వెస్ట్ బ్లాక్‌లో తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కేంద్ర బొగ్గు గనుల శాఖ.. సెక్టార్–1, సోమవరం వెస్ట్ బ్లాక్‌లను వేలం వేసేందుకు వీలుగా బిడ్లను ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 99 బొగ్గు బ్లాక్‌ల వేలానికి బిడ్లు ఆహ్వానించగా వాటిలో ఏపీకి చెందిన ఈ రెండు ఉన్నాయి. విభజనతో ఏపీ కోల్పోయిన సింగరేణి బొగ్గు లోటును చింతలపూడి తీర్చనుంది. అత్యంత నాణ్యమైన బొగ్గు నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు సర్వేల్లో స్పష్టమైంది. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, కృష్ణా బేసిన్లో అపారమైన బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో బొగ్గు నిల్వల కోసం సుదీర్ఘకాలం సర్వేలు, పరిశోధనలు జరిగాయి. 1964 నుంచి 2006 వరకు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడితో పాటు.. జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, తడికలపూడి ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత 1996–2001 మధ్య కాలంలో ఖనిజాన్వేషణ సంస్థ సర్వే నిర్వహించి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో బొగ్గు నిల్వలున్నట్టు నిర్ధారించింది. తక్కువ లోతులో.. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 3,000 మిలియన్ టన్నుల నాణ్యమైన డీ, ఎఫ్ గ్రేడ్ బొగ్గు నిల్వలున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అది కూడా భూ ఉపరితలానికి 200 నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నట్టు తేల్చింది. చింతలపూడిలో 300 మిలియన్ టన్నులు, రాఘవాపురంలో 997 మిలియన్ టన్నులు, సోమవరంలో 746 మిలియన్ టన్నులున్నట్టు నిర్ధారించింది. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో పుష్కలంగా బొగ్గు నిల్వలున్నాయి. చింతలపూడి మండలం గురుభట్లగూడెం, రాఘవాపురం చుట్టు పక్కల గ్రామాల్లో 400 అడుగుల లోతు నుంచి 1,400 అడుగుల లోతులో సుమారు 1,000 అడుగుల మందంలో, వెంకటాపురం, నామవరం, సుబ్బారాయుడుగూడెం గ్రామాల్లో 70 అడుగుల లోతులో నాణ్యమైన బొగ్గు నిల్వలున్నాయి. చింతలపూడి సెక్టార్–1.. పట్టాయిగూడెం, నామవరం, వెంకటాద్రిగూడెం, లక్ష్మీనారాయణపురం తదితర గ్రామాల్లో సుమారు 12.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అలాగే సోమవరం వెస్ట్ కోల్ బ్లాక్.. చాట్రాయి మండలం సూర్యాపల్లి, చెక్కపల్లి, అక్కిరెడ్డిగూడెం, రమణక్కపేట పరిధిలో 15.11 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వేలానికి బ్లాక్‌లు ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశంలోని వివిధ బొగ్గు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా వేలం వేస్తోంది. దీని కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో కృష్ణా జిల్లా సోమవరం బ్లాక్‌ను కూడా వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. బిడ్లు దాఖలు కాకపోవడంతో సోమవరం బ్లాక్ కేటాయింపులు జరగలేదు. ఈ క్రమంలో మళ్లీ కేంద్ర బొగ్గు గనుల శాఖ ఈ నెల 16న దేశంలోని 99 బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో చింతలపూడి సెక్టార్–1తో పాటు సోమవరం వెస్ట్ బ్లాక్‌ను కూడా చేర్చింది. బొగ్గు మైనింగ్‌పై వచ్చే రెవెన్యూలో వాటా ఆధారంగా వేలం ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేస్తారు. -
14న ఢిల్లీకి ఏపీ అఖిలపక్షం
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల తుపాను, వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 14, 15 తేదీల్లో ఢిల్లీకి అఖిల పక్ష బృందం వెళ్లాలని ఆదివారం విజయవాడలో జరిగిన విపక్షాల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అపార నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించలేదని సమావేశం అభిప్రాయపడింది. సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించారు. ప్రముఖ రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. తుపాను వరదలతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చడానికి కేంద్రం తక్షణమే సాయం అందించాలని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య కోరారు. -
సాగు చట్టాల రద్దుకు మద్దతుగా.. వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీలు
సాక్షి నెట్వర్క్: కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను ఉపసంహరించడాన్ని స్వాగతిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించింది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ ర్యాలీలు జరిగాయి. విశాఖపట్నంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన జగదాంబ జంక్షన్ వరకు జైకిసాన్ నినాదంతో సాగింది. నెడ్ క్యాప్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం జాతీయ రహదారి నుంచి మహారాణి పార్లర్ కూడలి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అలాగే, అచ్యుతాపురం జంక్షన్లో డీసీసీబీ మాజీ చైర్మన్ ఉప్పలపాటి సుకుమారవర్మ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఇంకా చోడవరం, బుచ్చెయ్యపేట, పాడేరు, అరకు తదితర ప్రాంతాల్లోనూ ఈ ర్యాలీలు నిర్వహించారు. ప్రతిచోటా వ్యవసాయ చట్టాల రద్దు రైతుల విజయం అని నినాదాలు చేశారు. సాగు చట్టాలను కేంద్రం రద్దుచేయడంపై శ్రీకాకుళం జిల్లాలోని వైఎస్సార్సీపీ శ్రేణులూ జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాయి. రైతుల పోరాటాలకు వైఎస్సార్సీపీ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేశాయి. అలాగే, రైతన్నలకు సంఘీభావంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోట నుంచి గంట స్తంభం కూడలి వరకు సాగిన ర్యాలీలో మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు. తూర్పు గోదావరిలో.. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాయి. రామచంద్రపురంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కాకినాడ రూరల్‌లో ఎంపీ వంగ గీత, పి.గన్నవరంలో జెడ్పీ చైర్మన్ వేణుగోపాల్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. ఇక రైతులకు సంఘీభావంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, ద్వారకా తిరుమల, నిడదవోలులో ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జి. శ్రీనివాసనాయుడు పాల్గొని విజయం సాధించిన రైతులకు అభినందనలు తెలిపారు. వీరికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచి సీఎం జగన్ రైతుల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. కృష్ణా జిల్లాలో.. కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, నందిగామలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, జగ్గయ్యపేటలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నేతృత్వంలో ర్యాలీలు నిర్వహించారు. కైకలూరులో కూడా జరిగింది. గుంటూరుతో పాటు బాపట్ల, చిలకలూరిపేట, మంగళగిరి, పెదకూరపాడు, చెరుకుపల్లి, వినుకొండ, దాచేపల్లి, తెనాలి, తాడికొండలలో ఈ ర్యాలీలు నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, ముస్తఫా, బొల్లా బ్రహ్మనాయుడు, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. వెంకటాచలం, సూళ్లూరుపేట, గూడూరు, ఉదయగిరి బస్టాండ్ సెంటర్, వింజమూరు, కావలి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా కూడా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, మేయర్ బీవై రామయ్య, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, డాక్టర్ సుధాకర్‌తో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. -
ప్రతిభకే 'పద్మ' పురస్కారాలు
సాక్షి, నెల్లూరు: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారి ప్రతిభ, సేవల కొలమానంగానే కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెప్పారు. ఇటీవల సినీనటి కంగనాకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడంపై పలు రాజకీయపార్టీల నేతలు చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గతంలో కేంద్రం ఇచ్చే అత్యున్నత పురస్కారాలకు ఎంపిక రాజకీయ సిఫార్సుల మేరకు జరిగేదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఈ ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం జరిగిన స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వసంతోత్సవాల్లో ఆయన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖనే ఎన్నుకుని సేవలందించిన వెంకయ్యనాయుడిది గొప్ప వ్యక్తిత్వమని చెప్పారు. ఆస్తిలో సగభాగం కూతురికి ఇవ్వాలి: ఉప రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కుటుంబ ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు సగభాగం రావాలని, అప్పుడే సాధికారత ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ భారత సాధికారతే ధ్యేయంగా స్థాపించిన స్వర్ణభారత్ ట్రస్ట్ రెండు దశాబ్దాల సేవాప్రస్థానాన్ని పూర్తిచేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల నడవడిక విలువలతో ఉండాలని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి తులసి మొక్కలు నాటారు. స్వర్ణభారత్ ట్రస్ట్ రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్‌చక్రవర్తి, వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంపూర్ణ ‘సహకారం’తో స్వయం సమృద్ధి
సాక్షి, అమరావతి: సంఘ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా, పరస్పర సహకారమే లక్ష్యంగా, సంపూర్ణ సహకారాన్ని పొందడమే ఉద్దేశంగా సహకార సంఘాల వారోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్వయం సమృద్ధే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ ఇవి కొనసాగుతాయి. సహకార సంఘాల నుంచి సభ్యులు నగదును అప్పుగా తీసుకుని ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసుకుని.. సొంత కాళ్లపై నిలబడగలిగేలా చేసేందుకు ఈ వారోత్సవాలు తోడ్పడాలన్నది లక్ష్యం. గ్రామీణ యువత తమ సొంత సహకార సంఘాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా సహకార వ్యవస్థను పటిష్టం చేయొచ్చు. ఈ సంఘాల్లో ప్రజలు క్రియాశీల పాత్ర పోషించేలా చేసి, వారి పొదుపు మొత్తాలు ఏదో ఒక ఉత్పాదకతకు ఉపయోగపడేలా చేయడం కోసం ఈ సహకార ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. లక్ష్యం బాగానే ఉన్నా రానురాను ఈ సంఘాల సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకార ఉద్యమాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సహకార సంఘాల్లో మరింత మంది చేరేలా ప్రోత్సహించాలని సంకల్పించింది. సహకార వారోత్సవాల్లో భాగంగా.. సహకార సంఘాల ప్రయోజనాలు, వాటి పని తీరు మరింత మందికి చేరువయ్యేలా ప్రచారం చేస్తారు. తెలుసుకున్న సమాచారాన్ని సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు ఇతరులకు కూడా వివరిస్తుంటారు. సమాచార మార్పిడితో పాటు ఇతరులకు మనం ఎంతమేర ఉపయోగపడగలం అనే భావాన్ని ప్రోత్సహించడం చేస్తుంటారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువైనందున వాటిని కూడా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలకు సూచించింది. రాష్ట్రంలో పరిస్థితి.. రాష్ట్రంలో సహకార సంఘాలు చట్టపరమైన హోదా కలిగిన స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా ఉంటున్నాయి. వీటి అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించడం ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సహకార సంఘాల నియంత్రణకు రాష్ట్రంలో రెండు చట్టాలున్నాయి. ఒకటి.. 1964 చట్టాన్ని 2001లో సవరించారు. సహకార సూత్రాలకు అనుగుణంగా సహకార సంఘాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ నియంత్రణను కొంత వరకూ తగ్గించడమే దీని లక్ష్యం. రెండోది.. మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం.రాష్ట్రంలో సుమారు 67,268 సహకార సంఘాలున్నాయి. అవి.. వాటిలో రాష్ట్రస్థాయి సహకార సంఘాలు 10, కాగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు 13, ప్రాథమిక సహకార సంఘాలు 2,037, పాల సహకార సంఘాలు 90, మార్కెటింగ్ సహకార సంఘాలు 13, గిరిజన సహకార సంఘం 1, చేనేత సహకార సంఘాలు 470, చక్కెర మిల్లుల సహకార సంఘాలు 10, సేవా రంగ సహకార సంఘాలు 1414, ఇతరత్రా సంఘాలు 63,210 ఉన్నాయి. అయితే వీటిలో పలు సంఘాలు పనిచేయడం లేదని ఇటీవలి ఆడిట్ రిపోర్టులు తెలియజేస్తున్నాయి. పీఏసీఎస్‌లను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం నడుంకట్టింది. నాబార్డ్ సహకారంతో ఈ ప్రక్రియ సాగుతోంది. -
డీఆర్డీఏలకు కేంద్రం మంగళం!
సాక్షి, అమరావతి: పేదల సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు ఉద్దేశించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)కు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి డీఆర్‌డీఏల నిర్వహణకు నిధులు నిలిపివేస్తున్నట్లు రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో వీటిలో పనిచేస్తున్న సిబ్బంది సంకట స్థితిలో పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా, వేర్వేరుగా అమలు చేసే పలు సంక్షేమ పథకాలను జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకుంటూ అవి క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చూడటం వీటి బాధ్యత. 1999లో ఏర్పాటైన డీఆర్డీఏలు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఉన్నాయి. వీటిలో 230 మందికి పైగా సిబ్బంది కాంట్రాక్టు, తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల గ్రామీణ మహిళల పొదుపు సంఘాల కార్యక్రమాలతో పాటు పింఛన్ల పంపిణీ వంటి పథకాలను ఈ కార్యాలయాలు పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేసే డీఆర్‌డీఏల నిర్వహణ, సిబ్బంది జీతాల నిధులను కేంద్రమే ఇస్తోంది. ఈ నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ సంజయ్ అన్ని రాష్ట్రాలకు తాజాగా లేఖ రాశారు. దీంతో ఈ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఈ ఉద్యోగులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనే వివిధ విభాగాల్లో వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించడంతో పాటు అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని కోరుతూ ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. -
బైక్‌పై చిన్నారులతో వెళ్తున్నారా? అయితే, జాగ్రత్త!
న్యూఢిల్లీ: నాలుగేళ్లలోపు చిన్నారులు ప్రయాణించే మోటార్ బైక్ వేగం గంటకు 40 కిలోమీటర్లకు మించరాదని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో పాటు, 9 నెలల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారులైతే తప్పని సరిగా హెల్మెట్ ఉండేలా వాహనదారు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. దీంతోపాటు, వాహన చోదకుడు ఆ చిన్నారిని సేఫ్టీ పట్టీతో తన వీపునకు తగిలించుకోవాలని పేర్కొంది. దీనివల్ల, చిన్నారి మెడ, తలభాగాలకు పూర్తి రక్షణ కల్పించినట్లు అవుతుందని వివరించింది. దృఢమైన, తేలికపాటి, నీటిలో తడవని, అవసరానికి అనుగుణంగా సరి చేసుకోదగ్గ, కనీసం 30 కిలోల బరువును మోయగలిగే నైలాన్‌తో ఆ పట్టీ తయారయినదై ఉండాలని తెలిపింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలను రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ తెలిపింది. అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరింది. (చదవండి: రెండు రోజులు తర్వాత పుట్టింటికి .. బావిలో శవాలుగా తేలిన తల్లీ, కూతురు)